సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, March 28, 2011

విశ్వనటచక్రవర్తి


తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగ్గ గొప్పనటుల్లో ఒకరు శ్రీ ఎస్.వి.రంగారావు గారు. సామర్ల వెంకట రంగారావు. నాకెంతో నచ్చే అభిమాననటుల్లో ఒకరు. గంభీరమైన కంఠం, చక్కని ఒడ్డు పొడుగు, శాంతవదనం, అద్భుతమైన నటన అన్నీ ఆయన పట్ల మన అభిమానాన్ని పెంచేస్తాయి. రచయిత సంజయ్ కిషోర్ గారి మాటల్లో "రంగారావు గారు ధరించని పాత్ర లేదు. అభినయించని రసము లేదు. హాస్య, శృంగార, రౌద్ర, భీభత్స, భయానక, అద్భుత, శాంత , కరుణ రసాలన్నింటిని మనకు చూపించారు". కీచకుడు, రావణుడు,కంసుడు, మాంత్రికుడు మొదలైన పాత్రలైనా, సాంఘిక పాత్రలైనా.. వేసిన ప్రతి పాత్రలో ఒదిగిపోయిన మహా నటుడు ఆయన.


ఇరవై రెండేళ్ళ వయసులో అరవై అయిదేళ్ల వృధ్ధుని పాత్ర ధరించి విమర్శకులను సైతం ఆశ్చర్యపరిచేసారుట రంగారావుగారు. నాటకాలలో నటించేప్పుడూ శ్రీ ఆదినారాయణారావు, శ్రీమతి అంజలీదేవి, శ్రీ రేలంగి వంటి వారి పరిచయ ప్రోత్సాహాలందాయి రంగారవుగారికి. ఇంగ్లీషులో కూడా మంచి ప్రవేశం ఉండటంతో షేక్స్పియర్ నాటకాలలోని ఎన్నో పాత్రలలో ఆయన నటించటం జరిగింది. వైవిధ్యమైన మానవ మనస్థత్వాలకు ప్రతీకలైన అటువంటి పాత్రలలో నటించటం వల్లనే ఎన్నో రకల హావభావాలను, మనస్థత్వాలనూ ఆయన అవగాహన చేస్కున్నారు.


మద్రాసులో స్కూలు చదువు, విశాఖలో ఇంటరు, కాకినాడలో బిఎస్సి పూర్తయ్యాకా ఎమ్మెస్సీ లో చేరాలనుకున్నారు రంగారవుగారు. ఒక నాటకంలో ఆయన విగ్రహం,ఒడ్డు పొడుగు అన్నీ చూసి ఒక ఫైర్ ఆఫీసరు గారు, ఫైర్ ఆఫీసర్ ఉద్యోగానికి అప్లై చేయాల్సిండిగా ఆయనకు సలహా ఇచ్చారు. అప్లై చేసాకా మద్రాసులో ఫైర్ ఆఫీసర్ శిక్షణ పొంది, బందర్లోనూ, విజయనగరం లోనూ, మరికొన్ని ప్రాంతాల్లోనూ పహైర్ ఆఫీసర్ గా ఉద్యోగనిర్వహణ చేసారు రంగారావుగారు. తీరుబడి ఎక్కువ ఉండటంతో నాటకాలను మాత్రం వదలలేదు ఆయన. ఒక బంధువు సహయంతో 1947లో "వరూధిని" అనే సినిమాకు కధానాయకుడిగా నటించారు. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆ తరువాత కొన్ని చిన్న పాటి వేషాలు వేసాకా "షావుకారు" సినిమాలో "సున్నపు రంగడి" పాత్ర లభించింది రంగారావుగారికి. ఆ తరువాత వచ్చిన "పాతాళభైరవి"లోని మాంత్రికుడి పాత్ర తో పెద్ద నటుల జాబితాలో చేరిపోయారు రంగారావు. హిందీలో కూడా ఆ పాత్రను వారే పోషించారు. తన పాత్రకు హిందీ డబ్బింగ్ తానే చెప్పుకుని హిందీ ప్రేక్షకులకూ చేరువయి మరికొన్ని హిందీ చిత్రాల్లో కూడా వేసారు. ఆ క్రమం లోనే కన్నడ, మళయాళ చిత్రాలో కూడా నటించారు ఆయన.


"పెళ్ళి చేసి చూడు" సినిమా తమిళ రీ-మేక్ విజయం సాధించటంతో కొన్ని తమిళ ప్రేక్షకులకు కూడా చేరువయ్యారు ఆయన. తెలుగు,తమిళ సినిమాల్లో ఎంతో ప్రఖ్యాతిని పొందారు. ఆయన కదలికలు, హావభావ ప్రకటన, డైలాగ్ చెప్పే విధానమ్, గంభీరమైన గొంతు ఆయనను ఒక అరుదైన నటుడిగా నిలబెట్టాయి. "మాయాబజార్" సినిమాను ఆయన నటన కోసమే చూసినవారు కోకొల్లలు. "మాయాబజార్" లో ఘటోత్కచుడు, "భక్త ప్రహ్లాద" లో హిరణ్య కశిపుడు పాత్ర, "శ్రీ కృష్ణలీలలు" "యశోధ కృష్ణ" లో కంసుడు, "పాండవ వనవాసం"లో దుర్యోధనుడు, "నర్తనశాల" లో కీచకుడు, "మోహినీ భస్మాసుర" లో సొగసైన ఆయన నాట్యం, "హరిశ్చంద్ర"లో హరిశ్చంద్ర మొదలైన పౌరాణిక పాత్రలన్నింటిలో ఆయన నటన నభూతో న భవిష్యతి. ఆ అభినయంలోని స్పష్టత, ఉచ్ఛారణలో వైవిధ్యము మరెవరికీ సాధ్యం కాదేమో. సాంఘిక చిత్రాల విషయానికి వస్తే "బంగారు పాప" ,""లక్ష్మీ నివాసం", "షావుకారు", కత్తుల రత్తయ్య", "తాతా మనవడు", "తోడి కోడళ్ళు", "గుండమ్మ కథ" మొదలైన ఎన్నో చిత్రాల్లో ఆయన నటన అద్భుతం. మరో మాట ఉండదు. ఆయన నటనను ఎంత పొగిడినా సూర్యుని ముందు దివిటీయే అంటారు రచయిత ఈ పుస్తకంలో.

(ఈ క్రింది ఫోటోలో కుడివైపు చివరలో గాయని జానకి గారు) "నమ్మినబంటు" చిత్రం స్పెయిన్ లోని శాన్సెబాస్టియన్ పిల్మ్ ఫెస్టివల్ కు పంపబడింది. మిగిలిన యూనిట్ తో బాటూ రంగారావు గారు కూడా వెళ్ళారు. అక్కడనుంచి జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ మొదలైన దేశాలలో పర్యటించారు వారు. తరువాత జకర్తా ఆఫ్రో ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో "నర్తనశాల" బృందం పాల్గొంది. ఆ చిత్రానికి గానూ అక్కడ "ఉత్తమ నటుడిగా" అవార్డ్ ను అంతవరకూ మరే భారతీయ నటుడికీ అందనిది. ఆంధ్రులకు ఆ గర్వాన్ని అందించిన ఘనత రంగారావు గారిదే.

ఇక స్వదేశంలో ఎన్నో ఊళ్ళలో రంగారావుగారికి ఘన సన్మానలు జరిగాయి. "విశ్వనట చక్రవర్తి", "నటసార్వభౌమ", "నటశేఖర", "నట సింహ" మొదలైన బిరుదులు ఆయన అందుకున్నారు. నర్తనశాలకూ, మరిన్ని తమిళ చిత్రాలలో నటనకు గానూ రాష్ట్రపతి పతకాలు కూడా లభించాయి. రంగారావుగారు దర్శకత్వం వహించిన "చదరంగం" చిత్రానికి 1967లో ఉత్తమ చిత్రంగా ద్వితీయ నంది, "బాంధవ్యాలు" చిత్రానికి 1968లో ప్రధమ నంది లభించాయి. ఇటువంటి ఉత్తమ నటుడికి భారత ప్రభుత్వం పద్మశ్రీనో, పద్మ విభూషణ్ నో ఇవ్వక పోవటం ప్రశ్నర్ధకం అంటారు రచయిత.


అరుదైన ఎన్నో మంచి ఫోటోలతో, ఆ మహా నటుడి జీవిత విశేషాలతో ఎంతో చక్కగా రచింపబడినది "విశ్వనట చక్రవర్తి". ఈ వంద పేజీల పుస్తకం చివరలో ఆయన నటించిన సినీగీతాలు కూడా అచ్చువేసారు. రంగారావు గారికి సంబంధించిన వివరాలను సేకరించటానికి మూడేళ్లు పట్టిందనీ, వారి బంధుమిత్రులందరినీ కలిసి వివరలు, ఫోటోలు సేకరించినట్లు, సినీ అభిమానులందరూ అందరూ తేలికగా చదువుకోవటనికి వీలుగా చిన్న పుస్తకన్నే అచ్చువేసినట్లు గా రచయిత తనమాటలో చెప్తారు.


ఎస్.వీ.ఆర్ కు ముళ్ళపూడివారు వేసిన అక్షర మాల:

క్లిష్టమైన పాత్రలో చతురంగారావు
దుష్టపాత్రలో క్రూరంగారావు
హడలగొట్టే భయంకరంగారావు
హాయిగొలిపే టింగురంగారావు
రొమాన్సు లో (చేయిస్తే) పూలరంగారావు
అక్షరాలా 'మధు' రంగారావు
నిర్మాతల కొంగు బంగారావు
స్వభావానికి ఉంగా రంగారావు
కథ నిర్బలం అయితే హావభావాలు పాత్రపరంగారావు
కళ్ళక్కట్టినట్టు కనబడేది ఉత్తి యశ్వీరంగారావు
ఆయన శైలి ఠీవీ అన్యులకు సులభంగారావు
ఒకోసారి డైలాగుల్లో మాత్రం యమకంగారంగారావు


ఈ పుస్తక ప్రచురణకు సినీనటి జయలలిత సహకారం అందించారుట. 1998 లో మొదటి ప్రచురణ పొందిన ఈ పుస్తకం అన్ని విశాలాంధ్ర బ్రాంచీలలోనూ, నవోదయా లోనూ దొరుకుతుంది.

16 comments:

SHANKAR.S said...

మంచి పుస్తకం పరిచయం చేశారు.

యస్వీ రంగారావు గారు కాకినాడ యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ సభ్యులు.
ఇంత స్థాయి నటుడు లేక చాలా తెలుగు సినిమాలు రీమేక్ చేయబడకుండా ఆగిపోయాయి. ఉదాహరణకి పాతాళ భైరవి తీస్తే ఈ నేపాళ మాంత్రికుడికి సాటి వచ్చే నటుడు ప్రస్తుతం దేశం లో ఉన్నాడా?

యశోదకృష్ణ said...

yashodakrishna lo menallullani andarini okesari champesaaka chelleli vaipu chudaleka daani jeerninchukoleka aayana pettina expression simply superb. i love his acting and bold head.

చదువరి said...

మెలోడ్రామా ఏమాత్రం ఉండని, అతి ఎంతమాత్రం కనబడని సహజమైన నటన ఆయనది. ఎస్వీయారును కొట్టగల నటుడు మనకు లేరు. మిస్సమ్మలోను, పెళ్ళి చేసి చూడులో అనుకుంటా దూపాటి వియ్యన్న అనే కామెడీ పాత్రలోనూ ఎంతలా నచ్చేస్తాడో, నేపాళ మాంత్రికుడి పాత్ర చేసి అంతలా భయపెట్టేస్తాడు. తల పక్కకు పెట్టి కనుకొసల నుంచి చూసే చూపును మర్చిపోగలమా? పాండవవనవాసం అనుకుంటా.. పాండవులు మొత్తాన్నీ ధిక్, బానిసలు అంటూ ఈసడించడం చూసి, ’అయ్యో మన పాండవుల్ని దుర్యోధనుడు ఇట్టా అనేసాడే’ అని మనసు కష్టపెట్టుకున్నది గుర్తే నాకు.

నట చక్రవర్తే అతడు! బిరుదు ఇంత చక్కగా అమరిన నటుడు మరొకరున్నారా!!

పరిచయాలు, సిఫారసులూ అక్కర్లేని నటుడాయన. ఇక పద్మ పురస్కారాలు రాకపోవడంలో ఆశ్చర్యమేముంది లెండి. అన్నట్టు ముళ్ళపూడి రమణ రాసిన స్కెచ్చి ఉందాండీ ఆ పుస్తకంలో? అది గొప్ప పురస్కారమాయనకు.

అన్నట్టు శ్రీకృష్ణ సత్య సినిమా సమయంలో అనుకుంటాను.. ఆయన చనిపోయాడు. ఆ సినిమా ఇంటర్వల్లో ఆయన అంతిమ యాత్రను చూపించారు.

పుస్తకం గురించి, ఎస్వీయారు గురించీ చెప్పినందుకు నెనరులు.
...

శంకర్ గారూ, లేడు!

Anonymous said...

మహానటుడు, ఆయన ముందు ఎన్టీఆర్, ఎ.ఎన్.ఆర్‌లు సాటి రారు. పద్మవిభూషణ్‌కు మించిన అర్హతలున్న విలక్షణమైన నటుడు.
పండంటి కాపురంలో ఆ ఉదాత్తమైన నటన అమోఘం. ఎపుడో చిన్నప్పుడు చూశాను, ఏమీ తెలియని పసితనంలో బాధ/కష్టాలు అన్న భావాల రుచి చూపించిన ఘనత ఆయనదే.
ఎస్వీవోడు అంటే గుర్తొచ్చేది 'అడవుల్లో వున్నా, బోనులో వున్నా పులి పులేరా డోంగ్రే' అనే డైలాగ్. నర్తనశాలలో కీచకుడిగా .. ఓహ్.. పాండవ వనవాసం అనుకుంటా, ఎంటీఆర్ పెద్ద పద్యం చెబితే, విసిరే చీత్కారపు చూపు, ' పెద్దలగు కారణమున ఏదో బుద్ధి విశేషములు చూపితిరే కాని ... అని సభలో భీష్మ, ద్రోణులను తగ్గ మన్నట్టు చెప్పడం .. భక్త ప్రహ్లదలో 'కుమారా! ఏదీ నా అంకమున కూర్చుని ..' అభినయం మరువలేనివి.

Sreenivas Paruchuri said...

2004-2005 ప్రాంతంలో కొంత అదనపు సమాచారంతో సంజయ్ కిశోర్ మరల ఈ పుస్తకాన్ని ప్రచురించారు.

రంగారావుగారి మొదటి సినిమాకి రాసుకున్న కాంట్రాక్టు ఇక్కడ:
http://navatarangam.com/2008/10/actor-agreements/

SVR, రేలంగి, ఆదినారాయణరావు, అంజలి, వీరందరికి గురువు లాంటివాడైన గండికోట జగన్నాథం కళాకారులుగా తయారయిన కాకినాడలోని "Young Mens Happy Club" గురించి మరొకసారి.

Regards,
Sreenivas

తృష్ణ said...

@శంకర్.ఎస్: నిజం. అలాంటి వారికి సాటి అస్సలు లేరండి.
అసలీ రీమేక్ లు చెయ్యకపోవటమే నయం. ఎందుకనో ఈ రిమేక్లంటే నాకు నాకు ఇష్టం ఉండదండి. ఒరిజినల్ లో ఉన్న అందం రీమేక్ ఎంత బాగా చేసినా రాదండి.
ధన్యవాదాలు.

@గీత_యశస్వి: ఆయన ఎక్స్ ప్రెషన్స్.. సూపరండి అసలు. ఆ చూపు, డైలాగ్ డెలివరీ ఎంట బాగుంటాయనీ..!
ధన్యవాదాలు.

తృష్ణ said...

@చదువరి: "తల పక్కకు పెట్టి కనుకొసల నుంచి చూసే చూపును మర్చిపోగలమా?"
భలే గుర్తు చేసారండి..మీరన్నట్లు ఏ పరిచయాలూ అక్ఖర్లేని నటుడాయన. ఈ పుస్తకంలో రమణాగారిది లేదండి. అది వేరొక పుస్తకంలో చూసిన గుర్తు.
Thank you very much for the visit.

తృష్ణ said...

@Snkr : "బంగారు పాప"లో ఆయన నటన అద్భుతం. "లక్ష్మీ నివాసం" సినిమాలో ఆయన పాత్ర, 'ధనమేరా అన్నిటికీ మూలం' పాటలో నటన నాకు చాలా చాలా నచ్చుతాయండి నాకు. ఇక పౌరాణికాల సంగతి చెప్పఖర్లేదు.
ధన్యవాదాలు.

తృష్ణ said...

@శ్రీనివాస్ పరుచూరి: నా దగ్గర ఉన్నది 2005 లోని రెందవ ఎడిషనేనండి. మీరిచ్చిన లింక్ చూశాను. అప్పట్లో అలా ఉండేవన్నమాట ఎగ్రిమెంట్లు. నవతరంగంలో, ఇప్పుడు ఇక్కడా పంచుకున్నందుకు ధన్యవాదాలు.
"Young Mens Happy Club" గురించి మీరెక్కడైనా రాస్తే తెలియచేయగలరు.

Thank you very much for the visit.

తృష్ణ said...

@శ్రీనివాస్ పరుచూరి: అన్నట్లు రజని గారి కొత్త పుస్తకం చూశాను. చాలా మంచి పని చేసారు..అభినందనలు.

తృష్ణ said...

@చదువరి: పుస్తకం మళ్ళీ చూస్తూంటే ముళ్ళపూడివారి అక్షరమాల కనబడిందండీ.somehow missed it..:) ఇక్కడ + టపాలో కూడా జత పరుస్తున్నాను. చెప్పినందుకు మరోసారి ధన్యవాదాలు.

ఎస్.వీ.ఆర్ కు ముళ్ళపూడివారు వేసిన అక్షర మాల:
క్లిష్టమైన పాత్రలో చతురంగారావు
దుష్టపాత్రలో క్రూరంగారావు
హడలగొట్టే భయంకరంగారావు
హాయిగొలిపే టింగురంగారావు
రొమాన్సు లో (చేయిస్తే) పూలరంగారావు
అక్షరాలా 'మధు' రంగారావు
నిర్మాతల కొంగు బంగారావు
స్వభావానికి ఉంగా రంగారావు
కథ నిర్బలం అయితే హావభావాలు పాత్రపరంగారావు
కళ్ళక్కట్టినట్టు కనబడేది ఉత్తి యశ్వీరంగారావు
ఆయన శైలి ఠీవీ అన్యులకు సులభంగారావు
ఒకోసారి డైలాగుల్లో మాత్రం యమకంగారంగారావు

కమల్ said...

యస్వీఆర్ గురించి వ్యాసం బాగుంది..! కాని కామెంట్స్‌లోనే కాస్త వేరుగ ఉన్నది ఉదాః "మహానటుడు, ఆయన ముందు ఎన్టీఆర్, ఎ.ఎన్.ఆర్‌లు సాటి రారు. పద్మవిభూషణ్‌కు మించిన అర్హతలున్న విలక్షణమైన నటుడు. " శంకర్ గారి కామెంట‌ని చూస్తే..! యస్వీఆర్ గురించి గొప్పగా చెప్పండి బాగుంటుంది కాని..మరొకరితో పోలిస్తేనే..అంత సబబు అనిపించదేమో..! అలా పోలిస్తే..యస్వీఆర్ గురించి కూడా మీరు చెబుతున్నంత గొప్పనటుడు కాదని చెప్పవచ్చు..!దానికి ఉదాహరణలు చాలానే చెప్పగలను..! కాని ఇప్పుడవన్ని అనవసరం అనుకొని ఉదహరించడం లేదు!అందునా ఇది సరైన వేదిక కాదు మరొకరి బ్లాగ్‌లో మాట్లాడుకోవడం బాగోదు కూడ. ఎప్పుడు ఒకరి ప్రతిభని..మరొకరి ప్రతిభతో పోల్చడం అంత సబబు కాదేమొ..అనుకుంటా..!

తృష్ణ said...

@కమల్: మీ అభిప్రాయం మీకున్నట్లే అది శంకర్ గారి అభిప్రాయం. అంతే. ఇదేం డిక్లరేషన్ కాదు కదండి. మీరు అన్నట్లు చర్చకు ఇది వేదిక కాదు కానీ అభిప్రాయాల్ని పంచుకునేందుకే కదా కామెంట్లు ఉన్నవి. మీ అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదాలు.

Anonymous said...

/యస్వీఆర్ గురించి కూడా మీరు చెబుతున్నంత గొప్పనటుడు కాదని చెప్పవచ్చు..!/
కమల్ గారు, మరీ మొరటుగా ఎలా చెప్పేస్తున్నారో గాని,:P నామటుకూ, యస్వీవోడు, ఎంటీవోడు, ఏఎన్నారోళ్ళ కన్నా మంచి నటుడే. (అంటే వాళ్ళూ మంచినటులే అని కూడా). :)

"ఛీ! బానిసలు .. బానిసలకింత అహంభావమా!", అనే డైలాగ్‌ను అదే ఫోర్స్‌తో తక్కిన ఇద్దరితో హావభావాలతో చెప్పిస్తే ... :)) ఎవరు నెగ్గుతారు? - నిస్సందేహంగా యస్వీవోడే!
మీరు ఒప్పుకోవాలి, ప్లీజ్.. :) (ఒప్పుకుంటే తరవాతెపుడైనా మీరు చెప్పింది బేషరతుగా ఒప్పుకుంటా, సరేనా?)

కమల్ said...

@తృష్ణః
మీరన్నట్లు అభిప్రాయాలు పంచుకునేందుకే కామెంట్స్ సెక్షన్ వున్నది..నిజమే..!కానీ కామెంట్స్‌లలో స్టేట్‌మెంట్స్ ఇచ్చారు కదా అదీను మరొకరితో పోలుస్తూ..! ఆ విషయంలోనే నేను విభేదించాను..అది నా ఫిక్సడ్ అభిప్రాయం కాదండి, what's the truth అన్నదే చూడాలి..అంతే గాని అభిప్రాయాలు ఒక్కటే " సత్యం " కాదు కదా..?? మీరన్నట్లు డిక్లరేషన్ కాదు..!ఏది ఏమైనా మీ కామెంట్ సెక్షన్‌లో నా కామెంట్ ఆక్సెప్ట్ చేసినందుకు ధన్యవాదాలు.

కమల్ said...

@శంకర్‌గారు.. మీరు ఏమి మాట్లాడుతున్నారో అర్థమవుతున్నదా..? యస్వీఆర్ లాగ యన్.టి.ఆర్, అక్కినేని ఎందుకు నటిస్తారు అండి..? అలా నటిస్తే అది నటన కాదు..మిమిక్రీ అవుతుంది. ధుర్యోధునిలాగ నటిస్తే అది నటన అవుతుంది అంతేగాని..! యస్వీ ఆర్ లాగ కాదు. యస్వీ ఆర్ చేసిన ప్రతి పాత్ర చూడండి అన్ని యస్వీ ఆర్ లాగే ఉంటాయి అంటే ఆ డైలాగ్స్. మాట విరుపు.. తల పక్కకు వంచి మాటల విరచడం..ఇవన్ని ధుర్యోధునిలోనూ వుంటాయి..కంసుడులోనూ ఉంటాయి, రావణాసురుడులోనూ ఉంటాయి.. అంటే ప్రతి పాత్ర యస్వీఆర్ లాగే ఉంటుంది..అంతె గాని పాత్ర కనపడదు. అప్పుడు గొప్ప నటుడు ఎలా అవుతాడు..? మెథడ్ యాక్టింగ్ మీద మీకు అవగాహనే ఉంటుందనుకుంటాను..!! అలాంటి మెథడ్ యాక్టింగ్‌లో యస్వీ ఆర్ ఎప్పుడు చేయలేదు.మెథడ్ యాక్టింగ్ అంటే ఏపాత్ర చేస్తున్నామో ఆ పాత్రలోకి పరకాయి ప్రవేశం చేయడమంటారు.. ఆ పాత్రలాగ ప్రవర్తించడం అంటారు అంతే గాని ప్రతిపాత్ర యస్వీఆర్ లాగ చేయడం కాదు..! బహుశ మీకు యస్వీఆర్ నటన నచ్చిఉండచ్చు ఆ మాటలు..విరవడం..అవన్ని సామాన్యజనాలకు చూట్టానికి బానే ఉంటాయి.అదొక్కటే కాదు కదా నటన అంటే..! పాత్రొచితంగా నటించడం నటనకు సరైన నిర్వచనం అవుతుంది అదెప్పుడూ చేయలేదు యస్వీఆర్ గారు. ఆయనెప్పుడూ సన్నివేశంలో నటించే సమయంలో తన చుట్టూ వున్న నటులను డామినేట్ చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారట.. దాని వలన తనలోని అహం ఆ పాత్రద్వార బయట పడుతున్నదే గాని.. అ పాత్ర కనపడేది కాదు. రిహాల్సల్స్ సమయంలో ఒకలాగ చేసి..టేకింగ్ సమయంలో తన తోటివారి నటులను డామినేట్ చేయడానికి మరోలా నటించేవారట..! అంటే అందరిలోనూ తనే డామినేట్‍౬గా ఉండాలనే స్వభావం వలన ఆ పాత్రను చెడగొట్టినట్లు కాదా..? అది ఎంతవరకు సబబు..? అంటే ఆ పాత్ర యెక్క స్వభావం మారిపోదా..అలా చేయడం వలన..!పాత్ర పరిధిని మించి తన మూర్తిత్వానికి, వ్యక్తిత్వానికి ప్రాధాన్యత యిచ్చుకొని విజృంభించడం అంత ఆరోగ్యప్రదమైనది కాదు. అందుకే ఆయన ఏ పాత్ర చేసినా ఆ పాత్ర ఏమిటో వెంటనే గుర్తు పట్టలేము..!అందుకు కారణం అన్ని పాత్రలు ఒకేలా ప్రవర్తిసాయి కాబట్టి. అదే యన్.టి.ఆర్ చూడండి.. రావణడిగా ఒకలాగ ఉంటుంది నటన అదే దుర్యోధుని పాత్రలో ఒకలాగ ఉంటుంది..అంటే..ఆయా పాత్రల స్వభావరిత్యా ఎలా ప్రవర్తిస్తాయో అలానే ఉంటుంది ఆయన నటన. అంతెందుకు ఇప్పటికీ దుర్యోధనడు అని అనగానే యన్.టి.ఆర్ పేరు ప్రస్తావిస్తారు..! అదే యస్వీఆర్ పేరు ఎక్కడా చెప్పుకోరు నాటకాల లోకంలో..! ఎందుకు అంటారు..! ఆ పాత్ర స్వభావం యన్.టి.ఆర్ పోషించడం వలన ప్రస్పటంగా కనపడేది..! యస్వీఆర్ ని అందరూ పొగుడుతారు గొప్పనటుడు అని..అంతే గాని పాత్రను గుర్తుంచుకోరు ఎవ్వరూ.యస్వీఆర్ మంచి నటుడు కాదని ఎవరనగలరు..? ప్రేక్షకుల చప్పట్లే ప్రధానంగా వుద్దేశించి నటించటం ఉత్తమ నటనా? లేక పాత్రపరంగా అవసరమైన సున్నితమైన భావప్రకటనతో ప్రేక్షక హృదయాలను స్పందింపచేయటం ఉత్తమ నటనా..? ఆయన సీన్‌లో వుంటే అందర్నీ తినేస్తాడు. శభాష్ అనిపించుకోవడం ఆయనకు చాలా ఇష్టం..వాటినే ఇంటలెక్చువల్ జిమ్మిక్స్ అంటారు. ఇతర పాత్రలపై దురాక్రమణ చేయడం " తినేయడం " గా గొప్పగా చెబుతున్నారు మీరు. అంతే కాదు ఆయనలో ఉన్న ఆ " తినేయడం " స్వభావం వలన చాలా పాత్రల్లో ఇమడలేకపోయారు..దానికో మంచి ఉదాహరణ ఉన్నది..అదీను ఎవరో కాదు మన రంగారావు గురించి అసలు ఏమి తెలియని రిచెర్డ్ ఆటెన్‌బరో దర్శకుడు ఇట్టే పట్టేశారు..యస్వీఆర్‌ని ఒక పాత్రలో ఇమడలేకపోవడం వలన.! ఇప్పటికే చాలా పెద్ద కామెంట్ అయ్యింది..ఇంతటితో ఆపేస్తాను..! చాలా పెద్ద కామెంట్ పెట్టి మీ బ్లాగ్‌ని మా వాదనకు ఉపయోగించుకున్నందుకు క్షమించండి తృష్ణ గారు.