ఈ మెట్టు మొత్తానికి ఎక్కేసాను. మధ్య మధ్య ఆగిపోతూ ...పడుతూ..లేస్తూ..వగరుస్తూ...ఒకోసారి నెమ్మదిగా పాకుతూ.. మొత్తానికి ఇలా మూడొండలవ టపా పూర్తి చేస్తున్నాను. రెండో మూడో టపాలు తీసేసాకా, కొన్ని డ్రాఫ్ట్ లోకి తోసేసాకా, మరికొన్ని నా ఇతర బ్లాగ్విభజన్లోకి వెళ్పోయాకా ఇదిగో ఇప్పటికి మూడొందలకి చేరాను. మొదట్లో ఉన్న మామూలు స్పీడ్లో వెళ్లి ఉంటే కనీసం ఐదొందలు దాకా చేరేదాన్ని. కానీ నిజ జీవితం లాగే ఈ బ్లాగ్ జీవనం కూడా ఒక roller coaster రైడ్ లాంటిదే. కాబట్టి సీదాగా ప్రయాణం సాగించలేకపోయాను. ఈ మెట్టును చేరటం సులభమైతే కాలేదు. మొదట్లో కొన్ని బ్లాగుల్లో లకారం పైనే ఉన్న విజిటర్స్ నంబర్ చూసి అమ్మో అనుకునేదాన్ని. అలాంటిది క్రితం నెల్లోనే నా అతిధుల జాబితా కూడా లక్ష దాటింది. నామటుకు నాకు అది చాలా ఆనందకరమైన విషయం. ఎక్కువ వ్యాఖ్యలు రావటం వేరు, ఎక్కువమంది బ్లాగును చదవటం వేరు.
దాదాపు ఏడాది పూర్తయ్యేవరకూ వ్యాఖ్యలు వ్యాఖ్యలు అని కలవరించేదాన్ని. ఇప్పుడు కూడా ఎక్కువ వ్యాఖ్యలు వస్తే ఆ రోజంతా సంబరమే. ఎందుకంటే ఏ రచయితకయినా చదివేవారి స్పందనే ఎక్కువ ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇంకా బాగా రాయాలన్న ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. కాబట్టి వ్యాఖ్యలు తగ్గిపోయినప్పుడు కృంగిపోయేదాన్ని. ప్రముఖ బ్లాగర్లు ఏం రాసినా ఆహా ఓహో అంటారు, సామాన్య బ్లాగర్ మంచి విషయాలు రాసినా ఒక్క వ్యాఖ్యా రాయరు అని తిట్టుకునేదాన్ని. కాబట్టి నాకున్న సమయంలో నేను కొత్త బ్లాగ్ ఏదైనా చదివితే మాత్రం నచ్చిన చోట తప్పక వ్యాఖ్య రాస్తూంటాను. కానీ మెల్లగా నాకు అర్ధమైన సంగతి ఏంటంటే నా బ్లాగ్లో వ్యాఖ్యల కన్నా రీడర్స్ సంఖ్య పెరుగుతోందని. ఒకప్పుడు వందమంది మాత్రమే చదివే ఈ బ్లాగ్ ను రోజుకు మూడొందలు తక్కువ కాకుండా చదువుతున్నారు. అది నాకు విజయమనే చెప్పాలి.
వ్యాఖ్యలు రాయకపోయినా రెగులర్గా నా బ్లాగ్ చదివే నా మిత్రులు, బంధువులు ఎంతో మంది ఉన్నారని ఈ మధ్యనే తెలిసింది. "పొద్దుటే ఆఫీసుకి రాగానే ఇవాళేం రాసావో అని చూడటం అలవాటయిపోయింది...నువ్వు రాయటం మానేస్తే మళ్ళీ ఎప్పుడు రాస్తావు అని చూస్తుంటాను..." అని కొందరు ఇటీవలే చెప్పటం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. మరి అప్పుడప్పుడు వ్యాఖ్య రాయచ్చుకదా అంటే "ఆఫీసులో ఉంటాకదా కుదరదు..ఒకోసారి బధ్ధకం" అని సమాధానం. ఇలా నాతో చెప్పకపోయినా చదివేవాళ్లు ఇంకా ఉన్నారన్న ఆలోచన రాయాలన్న సంకల్పాన్ని దృఢం చేస్తుంది.
ఇక భాస్కరన్నగారు తన 400వ టపాలో రాసినట్లుగానే ఉంటుంది బ్లాగ్లోకంలో ఈక్వేషన్..
యు రీడ్ మై బ్లాగ్
ఐ రీడ్ యువర్ బ్లాగ్
యు కామెంట్
ఐ కామెంట్
యు నో రిప్లై
ఐ నో కామెంట్
యు నో రీడ్ మైన్
ఐ నో రీడ్ యువర్స్
ఖేల్ ఖతం
దుకాణ్ బంద్
(ఇది భాస్కరన్నగారు రాసిన ఈక్వేషనే)
నేనూ అలా చాలామంది రీడర్స్ ను దూరం చేసుకున్నాను. కామెంట్స్ తగ్గిపోయాయి. కానీ ఇంకా కొందరున్నారు. నేనెప్పుడూ వాళ్ల బ్లాగ్ జోలికన్నా వెళ్ళకపోయినా వ్యాఖ్యలు రాస్తారు. వీళ్ళు చాలా చాలా మంచివాళ్ళు. ఏమాటకామాటే.. నేనంత మంచిదాన్ని కాదు మరి. కొంచెం చెడ్డదాన్నే...:) కొత్తల్లో బ్లాగ్లోకం చాలా బాగుండేది. ఈమధ్యన పాతమిత్రులందరూ నెమ్మదిగా ఒక్కొక్కరే రాయటం మానేస్తున్నారు. ఎంతో దిగులుగా ఉంటుంది. ముఖ పరిచయం లేకపోయినా అల్లుకుపోయిన స్నేహాలను మరిచిపోవటం సాధ్యమా? అలాఅని రాస్తూ ఉండమని ఎంతమందినని అడిగేది? ఎవరి ఇబ్బందులు ఎలా ఉన్నాయో ఎవరికి ఎరుక? నాకూ కుదరటం లేదు. కానీ ఛీ పొమ్మన్నా చూరుపట్టుకుని వేళ్ళాడే దశమగ్రహం లాగ ఎన్ని అడ్డంకులొచ్చినా బ్లాగ్లోకపు చూరును వదలలేదు. ఎంతో ఇష్టమైన కాఫీని వదిలేసిన నాకు బ్లాగింగ్ వదిలేయటం కష్టమైన పని కాదు. ఇదొక వ్యసనమని కాదు.... ఒడిదొడుకుల జీవితానికి బ్లాగింగ్ ఒక ఆటవిడుపు అని.
ఇంకో కొత్త విషయం ఈ మధ్యన బోధపడింది. నా బ్లాగ్ నచ్చనివాళ్ళు, నా రాతల్ని చూసి నవ్వేవాళ్ళు కూడా ఉన్నారని. అవును మరి నాణానికి రెండో వైపు కూడా చూడాలికదా. నా బ్లాగ్ నచ్చనివారికీ, నా రాతలు వేళాకోళంగా అనిపించేవారికీ ఒక్కటే మాట చెప్తాను...దయచేసి నా బ్లాగ్ చదవకండి. నచ్చనివి చదవటం ఎందుకు? మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోవటం ఎందుకు? నా రాతలు నచ్చేవారే నా బ్లాగ్ చదువుతారు. నా సొంత బ్లాగ్లో నాకు తోచిన రాతలు రాసుకునే హక్కునీ, అవకాశాన్ని, నాకు తోచిన విషయాలు రాసుకునే స్వేచ్ఛనీ నాకు బ్లాగ్ స్పాట్ వాళ్లు ఇచ్చారు. నే రాసినది మరో పదిమంది చదవాలన్నది నా అభిలాష కాబట్టి అగ్రిగేటర్లలో నా బ్లాగ్ ఏడ్ చేసుకున్నాను. కాబట్టి నా రాతలు నచ్చనివాళ్ళు తమ అమూల్యమైన సమయాన్ని, మేధస్సునీ ఈ బ్లాగ్ చదవటానికి కాకుండా మరో మంచి పనికి వినియోగించుకోవలసినదని సవినయమైన మనవి.
దాదాపు ఇరవై నెలల బ్లాగింగ్ అనుభవంలో చివరిగా నేను చేసుకున్న నిర్ణయం ఒక్కటే. రాయాలని తోచినన్నాళ్ళు, కుదిరినన్నాళ్ళు రాస్తాను. చదివేవాళ్ళు చదువుతారు. అంతే. వ్యాఖ్యలకై ఎదురుచూపులు, చింతించటాలు ఎప్పుడో పోయాయి. ఈ బ్లాగ్ ఒక సామాన్య మధ్యతరగతి స్త్రీ మనోభావాల సమాహరం. నిరంతరం ఘోషించే కెరటాల మాదిరి ఈ ఆలోచనలు విశ్రాంతి నెరుగవు. "బ్లాగనందం" అనే టపాలో చెప్పిన పాటనే ఇప్పుడు కూడా నా బ్లాగ్ కు డెడికేట్ చేస్తున్నాను..
"ఆనందమా.. ఆరాటమా.. ఆలోచనా.. ఏమిటో
పొల్చుకో హృదయమా.. ఎందుకీ అలజడి
దాహానిదా.. స్నేహానిదా.. ఈ సుచన ఏమిటో
తేల్చుకో నయనమా.. ఎవరిదీ తొలి తడి
పట్టుకో పట్టుకో చేయ్యిజారనివ్వక ఇకనైనా..
స్వప్నమే సత్యమై రెప్పదాటిపోయే సమయానా..
కంటికే దూరమై గుండేకే ఇంతగా చేరువైనా ....
...నిన్నలా మొన్నలా నేను లేను నేనులా నిజమేనా
ఇష్టమో కష్టమో ఇష్టమైన కష్టమో ఏమైనా ...."
మరోసారి.. మరోసారి.. మరోసారి.. నా బ్లాగ్ చదివే పాఠకులకూ, వ్యాఖ్యలు రాసి ప్రోత్సహించే అభిమానులకూ శతకోటి వందనాలు.
39 comments:
అభినందనలు త్రుష్ణ గారూ
congrats on reaching this milestone!Keep writing!
Congrats andi rastune vundandi vilainappudu baagaa rastaru miru :) nenu kudaa milaane anukuntanu eppudu. miru okappudu anukunnatlu annamaata....
తృష్ణ గారూ నా మనఃపూర్వక శుభాకాంక్షలు.
300th టపా అనే మైలు రాయి చేరినందుకు అభినందనలండి
-రామకృష్ణ
Congrats andi..
(maamooluga ayithe ee comment chese vadini kaadhu kaani ee post chadhivaka endhuko congrats cheppalanipinchidhandi..)
'లక్ష'ణంగా త్రిశతం పూర్తిచేసినందుకు అభినందనలు. నేను క్రమం తప్పక చదివి, కామెంటే బ్లాగులలో మీదీ ఒకటి. మీ వెయ్యో పోస్ట్ కి ఫస్ట్ కామెంట్ నేనే పెడతానని ముందుగానే రిజర్వ్ చేసేసుకుంటున్నాను.
మీ మిగిలిన రెండు బ్లాగులలో కూడా స్పీడు పెంచాలండీ. అలా అన్నానని మీ "రుచి" లో బంగాళా భౌ భౌ, అరటి పండు లంబ లంబ లాంటి ప్రయోగాలు చేయకండి. పొరపాటున స్వాతి అది ఫాలో అయిందంటే నా బ్లాగు అర్ధాంతరంగా ఆగిపోతుంది.
U wrote Exactly, what i'm facing now! I started to write a blog from last december. Initially i thought my friends would help me with their comments and follow-up but unfortunately most of them didn't. But, i didn't give up..and still i'm finding my own ways to success. Hope I will. I just say ur blog..it was so nicely arranged and managed. Love it!!! :)
మీ త్రిశతకాలకి త్రిశతాభినందనలు.
వ్యాఖ్యలు వస్తే ఉత్సాహంగా ఉంటుంది నిజమే..మనం బ్లాగు వ్రాసుకునేది మనకోసం కాబట్టి వ్యాఖ్యలు రాకపోయినా ఉత్సాహంగా వ్రాసుకుంటుండాలి.
"ఒడిదొడుకుల జీవితానికి బ్లాగింగ్ ఒక ఆటవిడుపు"..అవును నిజం ఇది మనకొక మంచి అవుట్లెట్ కూడాను!
భాస్కరు గారు చెప్పింది చాలా వరకు కరెక్టు అయినా నా మట్టుకు నేను మాత్రం నాకు టపా నచ్చి వ్యాఖ్య వ్రాసే సమయం ఉంటే తప్పకుండా వ్రాస్తాను, వాళ్లు నా టపాలకి వ్యాఖ్యలు వ్రాస్తున్నారా లేదా అని చూడను. నేను కొంచం తరుచుగా వ్యాఖ్యలు వ్రాసే బ్లాగుల్లో మీది కూడా ఒకటి!
ఇలానే వ్రాస్తుండండి.
మిచ్చటగా మూడువందలు అయినందుకు అభినందనలు..
మీ బ్లాగు చదువుతుంటే The girl, next door లా అనిపిస్తారు ...
పెద్దపెద్ద వాళ్ళ గురించి మీ వ్రాతలు చదువుతున్నప్పుడు అబ్బ! వాళ్ళతో అంత సాన్నిహిత్యం ఉందా అని అబ్బురంగా అనిపిస్తుంది.. మీ పెరట్లో మొక్కలు, మీరు వేసే బొమ్మలు, మీరు ప్రయత్నించే క్రొత్త వంటలు, ఇవన్నీ అవడానికి ప్రపంచ వింతలేమీ కాకపోకపోయినా the way you portray them is really nice.. keep it up and expecting more and more.. :)
వామ్మో మూడొందలే! ఎంత ఓపిక, ఎంత ఓపిక! మూడేళ్ల బట్టీ మిడుకుతున్నా నూట యాభై కూడా రాయలేకపోయాను.
మొదట్లో మీకే కాదు ఎవరికైనా తమ టపా నలుగురూ చదవాలనీ, వ్యాఖ్యలు రాస్తే బాగుండనీ అనిపించడం సహజమే! బ్లాగు మీదే ఏకాగ్రత ఉండటమూ, సహజమే! తర్వాత తర్వాత ఈ బ్లాగు అనేది జీవితంలో ఒక బుల్లి భాగమే తప్ప దానికి పేద్ద ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదనీ తెలిసిపోతుంది.
ఇకపోతే బ్లాగు బాలేదని రాసే వ్యాఖ్యలని ఎందుకూ పట్టించుకోడం? శతకోటి అభిప్రాయాల్లో అదొకటి. బాగుందని వచ్చే అభిప్రాయాలతో ఆకాశానికెగిరిపోము కదా, ఇలాంటి వ్యాఖ్యలతో కుంగీ పోము! అలాంటపుడు ఆ వ్యాఖ్యలని చదివి ఊరుకోడమే!
మీరు ఈ మధ్య మరీ చెడ్డగా ఏమీ లేరే? అక్కడక్కడా మీ వ్యాఖ్యలు అడపా దడపా కనిపిస్తూనే ఉన్నాయే!
కొత్తల్లో బ్లాగ్లోకం చాలా బాగుండేది. .....వూ,సరే దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పోనిద్దురూ, ఏదో సరదాగా నాలుగు మాటలు వీలైతే రాసుకుంటాం! లేకపోతే లేదు. మీరన్నట్లు ఇదొక ఆటవిడుపు! దీనివల్ల మనకు అవార్డులు రావూ, డబ్బులంతకంటే రావు!
మీరు రాయడం ఆపినపుడల్లా "రాయండి! ఆపకండి" అని మీకు ఉత్తరాలు రాసేవాళ్లలో నేనుంటాను. అది తెలుసు గా! చాలు
మళ్ళీ అదే చెప్తున్నా! రాస్తూ ఉండండి! హాయిగా, ఇష్టంగా....రాయగలిగినన్నాళ్ళు! ఓపిక ఉన్నన్నాళ్ళు! ఇష్టమైనన్నాళ్ళు!
అన్నట్లు మూడొందల టపా కోసం అభినందనలు
i always read your blog and like ur posts very much.
If i saw the posts from u in jalleda or koodali, i even won't look the post heading also.
I will directly open the link and then look about the topic and all.
But never commented ,because as u said lazyness :(
But keep writing trushna garu
Congrats on your successful milestone
Congrats, Really Great!
300 tapalu rayatamante matalu kadu.
అభినందనలు త్రుష్ణగారు..త్వరలోనే మీ బ్లాగు చతుశ్శత , పంచశతాలను కూడా దాటాలని ఆశిస్తూ ...
తృష్ణ గారూ !
అభినందనలు. సహస్రానికి త్వరలోనే చేరాలని కోరుకుంటూ ...................
హమ్మ బాబోయ్.. మూడు వందలా:)) అభినందనలు తృష్ణ గారు. మీకు మీ ఓపికకి శతకోటి నమస్కారం:)))))
congrats. But off late, I observed the following trend in blogs.
The best way to get more comments is either to say "I completed xyz posts" or " i am closing my blog". This is a proven formula.
I don't mean to say that you posted this for comments.
తృష్ణ గారూ
అభినందనలు మరియూ శుభాకాంక్షలు. నాకు బ్లాగులు రాకపోయినా, నా రీడర్లో మీ బ్లాగుని కలుపుకుని అజ్ఞాత పాఠకుడిలా ఉండిపోవాల్సొస్తోంది.
మీ రచనలో పరిణితి, ఎంచుకునే విషయాల్లో పరిణితి సుస్పష్టంగా అనిపిస్తోంది.
మొదటినుండీ మీ బ్లాగుని అనుసరిస్తున్న వాడిగా పై మాట చెప్తున్నాను.
మూడువందల టపాలు రాయటం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. ఇదొక ముఖ్యమైన మైలురాయే బ్లాగ్ ప్రయాణంలో.
రానున్న కాలంలో ఇంకా ఇంకా పరిణితి ప్రదర్శిస్తూ చక్కని చిక్కని టపాలు అందించగలవని నా నమ్మకం.
మరోమారు శుభాభినంనలు మరియూ శుభాకాంక్షలు.
@ అజ్ఞాత:అజ్ఞాతగారూ, బ్లాగులో అజ్ఞాత కామెంట్లు నిషేధించినా ఇలా కూడా రాయచ్చన్నమాట. బావుందండి. నాకు వ్యాఖ్యలంటే ఇష్టమే. చాలా సార్లు రాసాను కూడా. మిగతావాళ్ల సంగతి నాకు తెలీదు కానీ ఎక్కువ వ్యాఖ్యల కోసం ఎలాంటి టపాలు రాయాలి అని ఆలోచించేంత "దీనమైన మనస్థితి" నాకైతే లేదండీ. అది మీకు గానీ మరెవరికైనా కానీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను సినిమాల గురించి రాసినా, పాటల గురించి రాసినా నాకు నచ్చినవే రాసాను తప్ప జనం ఏది మెచ్చి ఎక్కువ కామెంట్లు రాస్తారు అని ఎప్పుడూ ఆలోచించలేదు.
మూడొందలు టపాలు రాయటం తేలికైన పని కాదు. మీకు వీలైతే మూడొందల టపాలు రాసి, లేదా లక్ష పైగా హిట్లు మీ బ్లాగులో సంపాదించుకుని, సైలెంట్ గా ఉండగలరేమో అప్పుడు చెప్పండి. ధన్యవాదాలు.
తృష్ణ గారూ,
అభినందనలు అందుకోండి.. మీరిలాగే వందలు, వేలు రాసెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. :)
మీ సింహావలోకనం బాగుంది.. నిజమే! మన ఆలోచనలు, అభిరుచులు కలిసే మిత్రులు స్పందిస్తే చాలా సంతోషంగా ఉంటుంది.. అదే బ్లాగుల్లో వ్యాఖ్యల వల్ల మనందరికీ కలిగే ఆనందం.. :)
కానీ, సమయం లేకపోడం వల్లనో, కొన్నిసార్లు బద్ధకం వల్లనో కామెంట్స్ రాయకపోయినా, మీరన్నట్టు చదవడమే ఎక్కువ ముఖ్యం...
కాబట్టి, ఇందు మూలంగా తెలియజేయునది ఏమనగా.. వ్యాఖ్యలు రాసినా రాయకున్నా నాలాంటి వాళ్ళు ఎందరో మీ బ్లాగు వెనకాల ఉన్నారు కాబట్టి.. రాస్తూ ఉండండి.. :)
all the best trushna garu
అభినందనలు తృష్ణగారు... 300 టపాలు, లక్ష హిట్లూ రెండూ కూడా గుర్తించదగిన మైలురాళ్ళు..
ఈ మధ్య బ్లాగ్లోకంలో సంచరించడం తగ్గించినందువల్ల నేను కూడా మీ బ్లాగ్ కు సైలెంట్ రీడర్ ను అయ్యాను. కానీ కామెంట్స్ రాయకపోయినా మీవి మరికొందరు మిత్రుల టపాలు మాత్రం ప్రతీదీ మిస్ అవ్వకుండా చదువుతాను. మీరిలాగే మీ బ్లాగ్ ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగించండి...
congrats!
తృష్ణా, మీకు నా హృదయపూర్వక అభినందనలు.
అభినందనలు త్రుష్ణగారు.
"ఈమధ్యన పాతమిత్రులందరూ నెమ్మదిగా ఒక్కొక్కరే రాయటం మానేస్తున్నారు. ఎంతో దిగులుగా ఉంటుంది. ముఖ పరిచయం లేకపోయినా అల్లుకుపోయిన స్నేహాలను మరిచిపోవటం సాధ్యమా? అలాఅని రాస్తూ ఉండమని ఎంతమందినని అడిగేది? ఎవరి ఇబ్బందులు ఎలా ఉన్నాయో ఎవరికి ఎరుక?" even i too have same feelings.
అమ్మో తృష్ణమ్మోవ్! గిట్ల మూడు నూర్ల లెక్క జెప్పి నన్ను పరేషాన్ జేసినవ్! నాకు నువ్వు సచిన్ కన్న మూడు పార్లు ఎక్కువ గొడుతున్నవ్!గదేందో నాకు ముప్పై జెయ్యనీకి యాస్టకొస్తాంది..నువ్వు మూడు నూర్లు జేసినవ్!నేను నీ బ్లాగ్ మీన 'నజర్ బెట్టిన. మీ కాకినాడల గవేవో కతల కతల కాజాలుంటయంట గదా!! గసొంటివి ఒక నాలుగైదు కిలోలు నజర్ దిప్పి నాకు పార్సల్ జేశెయ్ జల్దిన!
నా బాస గిట్ల సమజ్ గాకుంటె, శంకరున్నడిగి తెలుసుకో. కాజాలు యాద్ మర్వకు.
తృష్ణ గారూ, అభినందనలండీ..మీ టపాలు చాలా బాగుంటాయి. నేను మిస్ అవకుండా చదువుతా.భాస్కరన్న వ్రాసిన ఈక్వేషన్ బాగుంది కానీ, నేను లెక్కల్లో పూరు, అందుకే నచ్చిన వాటిని కామెంటుతా.
అభినందనలు! Well done!
శారద
@లత:
@సునీత:
@చెప్పాలంటే:
@ప్రణీత.స్వాతి:
mhsgreamspet(రామకృష్ణ గారూ):
అందరికీ ధన్యవాదాలు
@ప్రబంధ్ చౌదరి.పూదోట: అలా అనిపించినందుకు + రాసినందుకు.
ధన్యవాదాలు.
@శంకర్.ఎస్:అమ్మో వెయ్యా?? రాసినా రాయకపోయినా మీరన్నందుకు చాలా థాంక్స్ అండి. రెండు కాదండీ మిగిలిన మూడు బ్లాగులు...:(
మరి నే రాసిన వంటల్ని మీ స్వాతిగారు ప్రయోగాత్మకంగా "బంగాళా భౌ భౌ" గా మార్చేస్తే నా పూచీ కాదు...:)
ధన్యవాదాలు.
@ప్రదీప్: రాస్తూండండి. తప్పక మీరాశించే విజయం కనబడుతుంది. ధన్యవాదాలు.
@సిరిసిరిమువ్వ: మొదట్నుంచీ మీరందించిన ప్రోత్సాహం నేనెప్పుడూ మరువనండి. చాలా థాంక్స్ మీకు.
@మేధ: అమ్మో గాల్లో తేలిపోయి ఎక్కడికో వెళ్పోయానండి...త్వరగా దిగకపోతే ప్రమాదం..
very happy to see your comment. Thanks a lot.
@సుజాత: మరీ చెడ్డగా అయిపోయానని, ఈ మధ్యనే కాస్త మంచిగా మారుతున్నానండి. అందుకే కాస్త బాగానే కనిపిస్తున్నాను బ్లాగుల్లో...:) Thanks for the support and encouragement you have always given.
@sravya: నా టపాలు మెచ్చినందుకు ధన్యవాదాలు. నాకు నచ్చే బ్లాగులు నేనూ అలానే చదువుతానండీ.
@గిరీష్: Thanks a lot.
@నైమిష్: ధన్యవాదాలు.
@ఎస్.ఆర్.రావుగారు: అడుగడుగునా మీరందించిన ప్రోత్సాహం కూడా మరువలేనిది. ధన్యవాదాలు.
@మనసుపలికే: హ్మ్మ్....:) ధన్యవాదాలు.
@భాస్కర్ రామరాజు: ముందుగా చాలా సంతోషం. నా టపాలు చదువుతారని తెలిపినందుకు, పరిణితి ఉందని చెప్పినందుకు.ఈ మైలురాయిని దాటినవారికే ఈ దారెంత కష్టతరమైనదో తెలుస్తుందేమోనండి..
ధన్యవాదాలు.
@మధురవాణి:పొనీలెండి. అందరికీ వ్యాఖ్యలు రాసే తీరుబాటు ఉండద్దూ? చదువుతారని తెలిపారు.అదే పదివేలు. మీరు కూడా మంచి మంచి కథలు రాస్తు రాస్తు మంచి కథకురాలిగా పేరుతెచ్చుకోవాలని కోరుకుంటున్నాను.
ధన్యవాదాలు.
@గోదారి సుధీర: ధన్యవాదాలు.
@వేణూ శ్రీకాంత్: మీ వ్యాఖ్య చాలా సంతోషం కలిగించిందండి. ఎప్పుడు మళ్ళీ బ్లాగ్జీవనంలోకి వస్తున్నారు? ఎదురుచూస్తున్నాం అందరం. వచ్చేయండి..వచ్చేయండీ...
ధన్యవాదాలు.
@శివ: చాలా థాంక్స్ అండి.
@జయ: మీ స్నేహాన్ని, ప్రోత్సాహాన్ని నేను ప్రత్యేకంగా అభినందించాల్సిందేనండి...ధన్యవాదాలు.
@పద్మార్పిత: అవునండి. మిత్రులందరి సమక్షంలో ఒకప్పటి బ్లాగ్లోకం ఎంత ఆనందకరంగా ఉండేదో తలుచుకుంటే మనసంతా దిగులు నిండిపోతుందండి...!!
ధన్యవాదాలు.
ఎన్నెల: మీ భాషలోనే కాదు నేను లెఖ్ఖల్లో కూడా పూరే..!! మీ భాష తర్జుమా చెయ్యటానికి మా సీతయ్య ఉన్నారులెండి. పుట్టినాట్నుంచీ వారు ఈడ్నే పెరిగిండ్రు. గప్పుడప్పుడు గీ బాసలో మాట్టాడి నన్ను పరేషాన్ చేస్తూంటారు. ఒక్క ముక్క అర్ధమైతే ఒట్టు మొర్రో అని గోలపెడతా!!
Thanks a lot.
@శారద: ధన్యవాదాలు.
congratulations తృష్ణగారు,అన్నీ బావున్నయ్‌గాని
2009(156)->2010(116)-> 2011(30+??)
ఈ progression ఫాలో అవ్వకుండా పోస్టుల మీద పోస్టులు అచ్చేస్తారని ఆశిస్తున్నా :)
Congrats Trushna gaaru,
Regular gaa comment pettalekhapoyinaa nenu matram mee blog tappakunda chaduvuthuntaanu. enka marinni tapalu raayalani korukuntunnanu.
@నాగార్జున: మీరు మరి వ్యాఖ్యలు మీద వ్యాఖ్యలు రాయాలి..అప్పుడే మరి...:)
@విరిబోణి: తెలుసు తెలుసు...క్లాసెస్ జాయిన్ అయ్యారా?best wishes..ధన్యవాదాలు.
Post a Comment