సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Tuesday, March 15, 2011
ఏళ్ళు మారినా రైళ్ళలో ఇదే ఇబ్బంది !
రైళ్ళతో నా అనుబంధం చాలా ఎక్కువనే చెప్పాలి. దాదాపు ఇరవైఏళ్ళపాటు పొద్దున్నే లేచి విజయవాడలో సర్కార్ ఎక్స్ ప్రెస్ ఎక్కి మధ్యాహ్ననికి కాకినాడ చేరేవాళ్ళం. వెళ్ళేప్పుడు ఇదే రైలు. తిరిగివచ్చేప్పుడూ అదే రైలు. మధ్యాహ్నం ఎక్కితే రాత్రికి చేరేవాళ్ళం. రత్నాచల్ వచ్చాకా దానికి మారిపోయాం. కానీ దానిలో ఓ నాలుగైదేళ్ళకన్నా ఎక్కువ ప్రయాణించలేదు. ఎక్కువ సర్కారే మా ఆస్థాన రైలు. రెండు మూడు నెలలకోసారి తప్పక ప్రయాణాం ఉండేది. మరి మా అన్నయ్య అక్కడే ఉండేవాడు కనుక కాలేజీకొచ్చేదాకా ఏ శలవులొచ్చినా మాకు తెలిసినది కాకినాడ ప్రయాణమే . కాలేజీలోకి వచ్చాకా పెద్దమ్మావాళ్ళ ఊరు భీమవరం, పిన్నీ వాళ్ళ ఊరు నర్సాపురం అనీ శలవుల్లో బంధువుల ఇళ్ళకు వెళ్ళటానికి పర్మిషన్ దొరికేది. ఆ ఊళ్ళకి ఆయా పాసింజర్లు ఎక్కేవాళ్లం. చాలా చిన్న దూరాలకు బస్సు తప్ప ఎప్పుడూ రైళ్ళే ఎక్కేవాళ్ళం.
ఇంతకూ సర్కార్ ఎక్స్ ప్రెస్ లో మాది సిట్టింగ్ జర్నీ అయినా రిజర్వేషన్ ఉండేది. వారం ముందో, శలవు దినాలైతే ఇంకా ముందో రిజర్వేషన్ చేయించేసేవారు నాన్న. వెళ్ళేప్పుడు తక్కువ సామాను ఉన్నా వచ్చేప్పుడు మాత్రం చాలా సామాను ఉండేది. విజయవాడ, కాకినాడ రెండూ స్టార్టింగ్ స్టేషన్సే కాబట్టి రద్ది ఉండేది కాదు. ఎక్కటానికీ దిగటానికీ వీలుగానే ఉండేది. ఎప్పుడూ కూడా మధ్యలో మాత్రం విపరీతమైన రద్దీ ఉండేది. డైలీ అప్ అండ్ డౌన్ చేసే ఉద్యోగస్తులూ, కాలేజీ పిల్లలతో కిటకిటలాడుతూ ఉండేది రైలంతా. రాజమండ్రి అమ్మావాళ్ల ఊరవటంతో అక్కడ ఎవరో ఒకళ్ళు, భీమవరంలో పెద్దమ్మావాళ్ళు స్టేషన్కు వచ్చేవారు. వాళ్ళు ఎక్కి కాసేపు కూర్చునేవాళ్ళు. ఒకోసారి అలా కుదిరేది కాదు జనం వల్ల. బయట నించునే మాట్లాడేసి వెళ్పోయేవారు. అసలు రిజర్వేషన్ కంపార్ట్మెంట్లలోకి మామూలు జనం ఎందుకు ఎక్కుతారో , ఎందుకు ఎక్కనిస్తారో ఇప్పటికీ నాకు అర్ధం కాని ప్రశ్న. డైలీ ట్రావెల్ చేసేవాళ్లకి వేరే కంపార్ట్మెంట్లు ఇవ్వచ్చు కదా? రిజర్వేషన్ దాంట్లో కి ఎందుకు ఎక్కనివ్వాలి? పైగా ఎక్కి ఊరుకోరు కూచోనిమ్మని గొడవ పెడతారు. జరగకపోతే తిట్టుకోవటం. క్యూల్లో నించుని రిజర్వేషన్ చేసుకుని మేము ఎక్కితే, అప్పటికప్పుడు రిజర్వ్డ్ బోగీలోకి రాజాలా ఎక్కేసి సీట్ల కోసం దెబ్బలాడటం ఏమిటో అర్ధమయ్యేది కాదు నాకు చిన్నప్పుడు.
ముగ్గురు కూచోవాల్సిన సీట్లలో మినిమం ఏడుగురు ఇరుక్కుని కూర్చునేవారు. మాకు రిజర్వేషన్ ఉంది మొర్రో అన్నా వినిపించుకోకుండా జరగండి జరగండి అని డిమాండ్ చేసి కూర్చునేసేవారు జనాలు. పోనీ కూర్చుని ఊరుకుంటారా అంటే అదీ లేదు. మన చేతిలోని పుస్తకమో పేపరో, విక్లీనో కబ్జా చేసేసి మళ్ళీ ఇస్తారో ఇవ్వరో అని భయపడేట్టు చేయటం. లేకపోతే అది అలా అలా చేతులు మారుతూ పోయి మనం దిగే టైంకి ఎక్కడికి చేరిందో కూడా తెలీని పరిస్థితి వచ్చేది.వచ్చినా రూపురేఖలు కోల్పోయి వెనక్కు వచ్చేది. ఇక కంపార్ట్మెంట్ అయితే జనాలకు డస్ట్ బిన్ తో సమానం. కూర్చున్నచోటే వేరుశనగ తొక్కలు, నలిపేసిన కాయితం ముక్కలు, సీట్ల మీద అడ్డమైన రాతలు ఒకటేమిటి ? ఎక్కేప్పుడు అప్పుడే బీరువాలోంచి తీసిన ఇస్త్రీ చొక్కాలాగ నీట్ గా ఉన్న కంపార్ట్మెంట్ దిగే సమయానికి డస్ట్ బిన్లా మారిపోయేది. ఇక రైల్లో టాయిలెట్స్ అయితే డోకొక్కటే తక్కువ. గంతలు గంటలు వెళ్లకుండా ఉండలేము వెళ్ళి డోక్కోకుండా బయటకు రాలేము. నాకు తెలిసి ఓ ఇరవై పాతికేళ్లపాటు అంత భీభత్సంగా ఉండేది సర్కార్ ఎక్స్ ప్రెస్.
ఆ తరువాత "రత్నాచల్" చాలా నయం అనే చెప్పాలి. ఇక విజయవాడ వదిలాకా డే టైం జర్నీ చేయాల్సిన అవసరం రాలేదు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నైట్ జర్నీలే. పడుకోవటం పొద్దున్నే లేవటం. దానితో ఈ డే జర్నీలు ప్రస్తుతం ఎలా ఉన్నయో తెలీదు నాకు. మళ్ళీ దాదాపు పదేళ్ల తరువాత మొన్న ఒక పెళ్ళికి వెళ్లటానికి sitting జర్నీ చేయాల్సివచ్చింది. వెళ్ళేప్పుడు వచ్చేప్పుడూ కూడా. రిజర్వేషన్ వారం ముందే చేసారు తను. ఇక ఆరేళ్ళు నిండాయి కాబట్టి పాపకు కూడా టికెట్ కొన్నారు. వెళ్ళేప్పుడు రైల్లో బానే వెళ్ళిపోయాం. సీటింగ్ బాగుంది. ఆ రైలు అదే ఎక్కటం నేను. వచ్చేప్పుడు మాత్రం మళ్ళీ ఓసారి ఇరవై, పదేళ్ళ వెనుకటి ప్రయాణాలు గుర్తుకు వచ్చింది. రైలుపై అవే రాతలు, బోగీల్లో నానా తుక్కూ, రిజర్వేషన్ లేకుండా ఎక్కేసే జనం. జరగమన్నామని తిట్టుకోవటాలు, కంపుకొట్టే చెత్త టాయిలెట్లు.
వచ్చేప్పుడూ రైల్లో మధ్యలో ఓ చోట ముగ్గురు ఎక్కారు. "రిజర్వేషన్ చేయించుకున్నాం. పాపకు ఇబ్బందిలేకుండా దానికీ టికెట్ కొన్నాము. మేం జరగము." అని చెప్పము. అయినా అక్కడే నిలబడి దిగేదాకా మరో నాలుగైదు సార్లయినా జరగమని, చోటిమ్మని అడిగారు. పాపని ఒళ్ళో కూచోపెట్టుకోమంటారు. వారం క్రితం రిజర్వ్ చేయించుకున్నాం మొర్రో అన్నా వినరే. పెళ్ళిలో ఆడి ఆడి అలసిపోయి పాప నిద్రోయింది చాలా సేపు. పడుకుని లేవటంలేదని "పిల్ల కాదు పిశాచం" అన్నాడు నించున్న వాడు పక్కనమ్మాయితో. నాకు వినబడింది, ఒళ్ళు మండిపోయింది. ఏం మాట్లాడుతున్నావు? సెన్స్ ఉందా? అని గట్టిగా అరిచేసాను రైల్లో.(వాడన్న మాటకు నాకు గౌరవమివ్వాలని కూడా అనిపించలేదు. ఏకవచనం వాడేసా) గొడవెందుకని తను ఆపేసారు. అటు తిరిగిపోయి నించున్నాడింకతను మొహం చెల్లక. ఓ పక్కన విపరీతమైన ఎండ భరించటం కాక మా సీట్లో మేము కూచుంటే కూడా ఇలా మాటలు పడాల్సిరావటం చాలా చికాకు తెప్పించింది. బస్సులో అయినా వెళ్దాం కానీ ఇంకెప్పుడూ సిట్టింగ్ జర్నీలొద్దు బాబోయ్ అని శ్రీవారితో మొరపెట్టుకున్నాను. ఏళ్ళు మారినా రైళ్ళలో ఇబ్బందులు, పరిస్థితులు ఇలానే ఉన్నాయే అని ఆశ్చర్యం,అసహ్యం కలిగాయి.
*************************
"రైలు ప్రయాణం "గురించి నేను రాసిన పాత టపా ఇక్కడ.
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
రైల్లో డే జర్నీ అంత నరకం ఇంకోటి ఉండదండీ. ఇంక ఉదయం, సాయంత్రం అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు రిజర్వేషన్ బోగీలో ఎక్కడం తమ జన్మ హక్కు అన్నట్టు ఫీలయిపోతారు. ఆ టైం లో వాళ్ళు రిజర్వేషన్ చేయించుకున్న దూర ప్రయాణం చేసే వాళ్ళని చూసి జనరల్ లో టికెట్ లెస్ ట్రావెల్ చేస్తున్నట్టు ఓ నిర్లక్ష్యమైన చూపొకటి పాడేస్తారు.
మొత్తం మీద ట్రైన్ జర్నీ ఎంజాయ్ చేసారన్నమాట :)
abbe, vaadu nenu kaadulendi..., naadi Tadepalli Gudem root..., Circar ekkanu. naadi koodaa Vijayawada - Rajahmundry roote...
@శంకర్.ఎస్: ఇంట్లోనే ఐదు నిమిషాలు కుదురుగా కూచోని పిలాని ఐదారు గంటలు ట్రైన్లో కంటోల్ చేయటం కత్తి మీడ సామే..ఆ విధంగా బాగా ఎంజాయ్ చేసానండి...:)
ధన్యవాదాలు.
@మిర్చిబజ్జి: సరేలెండి. మీరు కాదేమో...:)
ధన్యవాదాలు.
Post a Comment