సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Saturday, March 26, 2011

పొద్దుటి వర్షం...వాకింగ్ కబుర్లు

(వర్షంలో తడిసిన మా గులాబి. )

ఇవాళ పొద్దున్నుంచీ వాతావరణం ఎంత బావుందో. మబ్బుల చాటున దాక్కుని సూరీడసలు బయటకు రానేలేదు. "వాకింగ్ నుంచి వచ్చావా లేదా? ఇక్కడ పెద్దవాన పడుతోంది...మీకూ పడుతోందా? ఇల్లు చేరావో లేదో.. తడుస్తున్నావేమో అని..." అంటూ అమ్మ ఫోన్ చేసింది కూడా. అప్పటికింకా మా ఇంటి దగ్గర వాన లేదు. ఈ వాతావరణంలో లాంగ్ రైడ్ కి వెళ్తే భలే ఉంటుంది అనుకుంటూండగానే పెద్ద పెట్టున వర్షం. ఎండాకాలంలో ఈ వానలేంటో. సుమారు రెండు మూడు వారాలక్రితం పొద్దున్నే ఇంతకంటే పేద్ద వాన చాలాసేపు పడింది. మావిడి పూత చాలావరకూ అప్పుడే రాలిపోయింది. ఈసారి రేట్లు ఆకాశానికి అంటుతాయి అనుకున్నాం. ఇక్కడింకా మావిడికాయ కనపడ్డంలేదు. మొన్న గుడివాడ పెళ్ళిలో పెళ్ళివారు కొత్తావకాయ కూడా తినిపించేసారు. ఎంత బావుందో...

కురుస్తున్న వర్షం..కనిపిస్తోందా?

వర్షంతో తడిసిన రోడ్డు..
*** *** ***


రోజూ వాకింక్ కు వెళ్తూ అనుకుంటాను ఈ వాతావరణం గురించి రాయాలి అని. దాదాపు కొన్ని నెలల తరువాత ఈ ఇల్లు మారాకా వాకింగ్ మొదలెట్టాను. అసలు మొదలుపెట్టింది పదిహేనేళ్ల క్రితమే. కానీ వరుసగా ఎప్పుడూ కొనసాగించలేదు. ఆర్నెల్లు నడిస్తే ఎనిమిది నెలలు అటకెక్కించేస్తూ ఉంటాను వాకింగ్ ని. కాస్త శరీరం కంట్రోల్లోకి వచ్చేసి, అందరూ మన వాకింగ్ ఎఫెక్ట్ ని గుర్తించేస్తూండేసరికీ బధ్ధకం వచ్చేస్తుంది. ప్రస్తుతం ఈ చుట్టుపక్కల వాతావరణం చాలా బాగుంది కాబట్టి ఈసారి ఎక్కువ రోజులే నడక కొనసాగవచ్చు.

రోజూ నే వాకింగ్ కి వెళ్ళే సమయానికి ఇంకా సూరీడు రాడు. వెనక్కి వచ్చే సమయానికి గుండ్రని లేత ఆరెంజ్ బంతిలా, పొడుగాటి వీధి చివ్వరికి, కుడి ఎడమల ఇళ్ళు కలుస్తున్నట్లుండే చోట, మధ్యనుంచి బొట్టులా పైకి వస్తూ ఉంటాడు. రోజూ అదే దృశ్యం. పొడుగాటి వీధి కూడా ప్రశాంతంగా విశాలమైన మంచి రోడ్డుతో(ఈకాలంలో గతుకులు లేని మంచి రోడ్లు చాలా అరుదుగా ఉన్నాయి కదా) నడవటానికి అనువుగా ఉంటుంది. పైగా ఇక్కడ అన్ని ఇళ్ళలో పెద్ద పెద్ద చెట్లు ఆకుపచ్చటి ఆనందాన్ని పంచుతూ ఉంటాయి. దారి పొడుగునా అన్ని అపార్ట్మెంట్ల ముందర, ఇళ్ళ ముందర ఫెన్సింగ్ ఉండి, అందులో మొక్కలు పెంచారు. ఇక సొంత ఇళ్ళ వాళ్ళైతే మరీ చూసే కళ్ళు కుళ్ళుకునేలా మొక్కలు పెంచేసుకున్నారు. అవును మరి. నేల మీద సొంత ఇల్లు.. ఇంటి పెరడులో కావాల్సినన్ని మొక్కలు పెంచుకునే అదృష్టం ఎంతమందికి ఉంటుంది? ఎంత పెద్ద సొంత అపార్ట్మెంట్ కొనుక్కున్నా ఇలాటి ఒక బుల్లి ఇల్లుకి సాటి రాదు కదా.

ఇక దారి పొడుగునా కనబడే ఇళ్ళలోని చెట్లు, మొక్కల గురించి అందరికీ చెప్పాలని ఎంత ఆరాటమో నాకు. ఒక ఇంట్లో ఆకు సంపెంగ చెట్టు. ఏమిటో రోజూ పూలు పండిపోయి కనిపిస్తాయి. వాళ్ళకు ఈ పూలు పెట్టుకుంటారని తెలీదో ఏమో. ఒక ఇంటి ముందర కాస్త జాగా ఉంచి, లాన్ అంచున, పొడుగ్గా సిమెంట్ తొట్టేలాగ కట్టేసారు. అందులో తెలుపు,లేవెండర్ కలర్స్ లో చిన్న చిన్న పూలు. అక్కడక్కడా ఎర్రవి కూడా. ఆ ఇల్లు భలే ఉంటుంది. వీధి చివరికి ఉండే మరో ఇల్లు నా ఫేవొరేట్ ఇల్లు. కానీ అందులో ఒక ఐస్క్రీమ్ తయారు చేసే కంపెనీ ఉంది ఇప్పుడు. చిన్న పెంకుటిల్లు ఓ పక్కగా ఉంటుంది. ఎల్ షేప్ లో పెరడు. చుట్టూ చిన్న పిట్టగోడ. దానికి అల్లుకుని ఉన్న ఆరెంజ్, లేవెండర్,యెల్లో కలర్స్లో పువ్వులున్న క్రీపర్స్. గోడ మీంచి లోపలి చెట్లన్నీ కనబడుతూ ఉంటాయి. అందులో ఐదు కొబ్బరి చెట్లు, ఒక బాదం చెట్టు, మావిడి, అరటి, నిమ్మ, వేప, కర్వేప చెట్లు, మల్లె పొదలు, గులాబీ వృక్షాలు(మొక్క కంటే చాలా పెద్దవి మరి), గేట్ కి అటు పక్కన సన్నజాజి పందిరి, ఇంకా ఏవో పూల క్రీపర్స్ ఉంటాయి. పెరట్లోనే ఓ పక్కకి రెండు మూడు గదులు ఉన్నాయి. షెడ్డుల్లాగ. ఎవరిదో.. అమ్మేసారో, అద్దెకు ఇచ్చారో తెలీదు కానీ భలే అందంగా ఉంటుంది. ఆ ఇల్లు చూడ్డం కోసమన్నా వాకింగ్ కి వెళ్ళాలనిపిస్తుంది.

మరో ఇంట్లో నేరేడు చెట్టు. ఇది నన్ను బోలెడు జ్ఞాపకాల్లోకి తీసుకుపోతుంది. రాజమండ్రిలో మా తాతగారి ఇంటి పక్కన ఇంట్లో ఉండేది ఒక పేద్ద నేరేడు చెట్టు. వెళ్ళినప్పుడల్లా మా పిల్లల పటాలమంతా ఆ కాయలు కొట్టే పనిమీదే ఉండేవాళ్ళం. ఆ ఇంటివాళ్ళు బయటకు రాగానే ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్ అయిపోయేవాళ్ళం. ఇక నే నడిచే దారి పొడుగునా నాలుగైదు పెద్ద పేద్ద వేప వృక్షాలు. వాటి నిండా వేప పూత. పక్కగా రాగానే కమ్మని పూల వాసన మనసంతా కమ్మేస్తుంది. గుండెల నిండా ఈ వాసన పీల్చుకుని మళ్ళీ నాలుగడుగులు వేసేసరికీ మరో వేప చెట్టు. అప్పుడప్పుడు కోయిల కూత కూడా పలకరిస్తూంటుంది. ఎలాగూ చెవిలో ఇయర్ ఫోన్స్ కమ్మని పాటలు వినిపిస్తూనే ఉంటాయి నడుస్తున్నంత సేపూ. ఇయర్ ఫోన్స్ చెవిలో ఉంటే ఎంత దూరమైనా అలుపు తెలియదు నాకు.

ఇక కొన్ని సందు మొదలలో పిల్లలతో పాటూ స్కూల్ బస్ కోసం నిలబడే తల్లులు, పేపరు,పాల సైకిళ్ళవాళ్ళు, నాలానే వాకింగ్ కి వచ్చే చిన్నా పెద్దా...రోజూ చూస్తూంటాం కాబట్టి పలకరించకపోయిన పరిచయమైపొయిన పరిచయాలు ఇవన్నీ. హ్మ్...ఇలా చెప్పుకుంటూ పోతే రెండు టపాలు రాసినా నా వర్ణన అవ్వదు. కాబట్టి ఈ టపాని ఇంతటితో ఆపేస్తా. క్లుప్తంగా ఇవీ ఈ మధ్యన నేను ఆస్వాదిస్తున్న మార్నింగ్ వాక్ అందాలు..ఆనందాలు.

6 comments:

SHANKAR.S said...

మా కాలనీ కూడా ఇలానే ఉంటుందండీ.

నేనూ ఎప్పటినుంచో మార్నింగ్ వాక్ చేయాలనుకుంటున్నా. కాకపోతే అందరూ మార్నింగ్ వాక్ మొదలెట్టే సమయానికి నేను అప్పుడే సిస్టం కట్టేసి కోమా లోకి వెళ్తా.

పొద్దున్నే ఐదున్నర, ఆరు టైం లో చల్లగాలి, బ్యాక్ గ్రౌండ్ లో పక్షుల శబ్దాలు మాత్రం రోజూ మిస్సవను. అది చూసాకే నిద్రకుపక్రమిస్తా. మళ్ళీ పదింటికల్లా ఎవరో ఒకరు ఫోన్ చేయడం, మళ్ళీ వర్క్. ఒక్కోసారి ఏం జీవితం రా బాబూ అనిపిస్తుంది.

సిరిసిరిమువ్వ said...

నాకూ ఉదయపు నడకంటే ఎంతిష్టమో! ఈ మధ్యే ఓ టపా వ్రాసా వీలయితే చూడండి. ఈ ఉదయపు నడకని ఆస్వాదించటంలో మనకి చాలా పోలికలు ఉన్నాయి:)

Unknown said...

కొంప తీసి మీరు మా యింటి ముందు నుంచి వాకింగ్ కి వెళ్ళటం లేదు కదా?
వేప చెట్లు ఆ పూత వాసన అంటూ న్నారు ?నడక లో నా అనుభూతులు అని
నేనెప్పుడో రాసేసాగా.

జయ said...

నాకు సూర్యోదయం కాదు. చంద్రోదయమే అలవాటు. ఏం చేద్దాం. అప్పుడు కూడా ఎంతబాగుంటుందో. అవును,ఆరోజు వర్షం చాలా బాగుంది. మీ గులాబి ముద్దులొలుకుతూ చాలా ముద్దుగా ఉంది.

తృష్ణ said...

@శంకర్.ఎస్: ఇవేం టైములండీ బాబు? మా నాన్నగారు ఇలానే పాటించేవారు. ఇంట్లో కూడా ఆయనతో పాటే మేమూ అలానే ఉండేవాళ్ళం. ఇప్పుడు మాత్రం అన్నీ టైం ప్రకారమే. ప్రస్తుతం మా అన్నయ్య నాన్నవారసత్వాన్ని పాటిస్తున్నాడు. వయసు మీదపడ్డాకా కానీ ఆ ఎఫెక్ట్ తెలీదండీ. కాస్త టైం ఎడ్జస్ట్మెంట్లు పాటిస్తూ ఉండండి.
ధన్యవాదాలు.


@సిరిసిరిమువ్వ: చూసేసానండీ. మరో టపా కూడా..:) ధన్యవాదాలు.

తృష్ణ said...

@రవిగారు: ఏమో మరి..:)
ధన్యవాదాలు.

@జయ: మేము కొన్నాళ్ళు పొద్దున్న కుదరక నైట్ వాక్స్ చేసామండి. ఏదైతేనేం నడక ముఖ్యం అంతే. మీరు కొంచెం తరచుగా రాస్తూండాలి. మరీ తగ్గించేసారు...:(
ధన్యవాదాలు.