సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, March 28, 2011

మర్చిపోయా..


మైల్స్ చెక్ చేస్తూంటే ఇవాళ 28th అని గమనించా...ఎంత విచిత్రం? జీవితంలో మొదటిసారి నేను నా స్నేహితురాలి పుట్టినరోజు మర్చిపోయా. నిన్న27th న. ఏడెనిమిదేళ్ళ పాటు నా ప్రాణంలో ప్రాణం తను.తన పుట్టినరోజుకీ, తన పెళ్ళిరోజుకీ, ఫ్రెండ్షిప్ డేకీ ఎప్పుడు మర్చిపోకుండా గ్రీటింగ్స్ పంపుతాను. వారం క్రితం కూడా అనుకున్నా పోనీలే గ్రీటింగ్సే కదా మానేయటం ఎందుకు పంపిద్దామని.తను పలకరించినా పలకరించకపోయినా ఇన్నేళ్లలో ఎప్పుడు మర్చిపోలేదు. విడువకుండా ఎప్పటికప్పుడు పలకరిస్తూనే ఉన్నాను. నా ప్రయత్నలోపమేమీ లేదు అని నా అంతరాత్మకు నేను ధైర్యంగా చెప్పుకోగలగాలి కదా. తనూ రాసేది అప్పుడప్పుడు కుదిరినప్పుడు. టూర్స్ లో లేనప్పుడు..దేశంలో ఉన్నప్పుడు. చాలా పెద్ద ఉద్యోగభారం తనది మరి.


ఎందుకు తనని అనుకోవటం... ఈసారి తన పుట్టినరోజు మర్చిపోయి నేను కూడా పొరపాటు చేసాను కదా. ఏదన్నా మర్చిపోతే ఆ రోజంతా ఇవాళేదో ఉంది..ఉంది...అని గుర్తొస్తూ ఉంటుంది...అలాంటిది నిన్న అస్సలు గుర్తు రాలేదు. మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు ఆంటీని(వాళ్ళ అమ్మగారిని) చూడాలని ఎంత తహతహలాడానో..ఎన్నిసార్లు తనతో అన్నానో వాళ్ళింటికి వెళ్దాం వెళ్దాం అని. సమయాభావం వల్ల కుదరనే లేదు. నాకు ఆంటీ ఎంత ఇష్టమో.


అమ్మ అంటూనే ఉండేది "ఇప్పుడిలా ఊరేగుతున్నావు. రేపొద్దున్న పెళ్ళిళ్ళయి సంసారాలొచ్చాకా ఎవరికి వారేనే.." అని. అప్పుడు అమ్మ మీద బోలెడు కోపం వచ్చి దెబ్బలాడేసేదాన్ని. ఇప్పుడు గుర్తొస్తే నవ్వు వస్తోంది. కానీ.. బోలెడు మంది ఉన్నారు కదా జీవితాంతం కలిసుండే మిత్రులు. నాన్నకు కూడా ఉన్నారు. 45ఏళ్ల నాటి మిత్రులు. ఇప్పటికీ మాట్లాడతారు, వస్తారు. నాకూ ఉన్నారు ఎప్పటి స్నేహితులో.. రూప, మాధవీ, శారద, అపర్ణ, సుధ...అందరూ ఉద్యోగస్తులే. వీళ్ళెవరూ నన్ను వదిలెయ్యలేదే...నేను బధ్ధకించినా ఎప్పటికప్పుడు ఫోన్లు చేస్తూనే ఉంటారు. ఉద్యోగభారం వల్ల తనొక్కర్తే నెమ్మదిగా దూరమైపోయింది..


ఈ మధ్యన ఏదో కొత్త పాటలో విన్నా "నీతో స్నేహం నాకేంటి లాభం అనేంతలాగ మారింది లోకం... నువ్వూ మౌనం నేనూ మౌనం, మనసూ మనసూ మరింత దూరం.." అని. అలాగ లోకమే మారింది, తను కూడా మారింది. అంతే ! ఇక నేనే మారాలి.

sorry message రాద్దాం అనుకున్నా.. మళ్ళీ ఊరుకున్నా. కానీ.. ఇప్పుడే ఇక మనసాగలేదు. వెంఠనే లాగిన్ అయ్యి తనకి మైల్ రాసేసా. "సారీ మర్చిపోయాను. పు.రోజు బాగా జరిగిందని తలుస్తాను" అని.


ఎవరెలా మారినా నాకనవసరం. తను మారిపోయిందని నేనూ తనలానే ప్రవర్తిస్తే ఇక నాకూ తనకీ తేడా ఏం ఉంటుంది? నేనింతే. she is my friend for life. నా మనస్సాక్షికి నేను లోకువవ్వను. ఇప్పుడు హాయిగా ఉంది. ఆనందంగా ఉంది. ప్రశాంతంగా ఉంది.

7 comments:

SHANKAR.S said...

:)

'''నేస్తం... said...

naa frnd bday kuda 27th ney andi.. she s my best frnd

prabandhchowdary.pudota said...

so, finally you conveyed your regards..

గోదారి సుధీర said...

ఇచ్చి పుచ్చుకోడం ప్రతి పరిచయానికి అందాన్ని ఇచ్చి అనుబంధాన్ని పెంచుతుంది .మీరు సున్నిత మనస్కులు కాటం చేత పుచ్చుకునే ధోరణి గురించి ఆలోచించలేదు .కానీ ప్రతి ఓపికకి ఒక పరిమితి ఉంటుంది కదా ..ఇదీ అలాటిదే !బాధ పడకండి .

తృష్ణ said...

@శంకర్.ఎస్: ధన్యవాదాలు.

@కమల్: ఒహ్..నిజమా?
ధన్యవాదాలు.

@ప్రబంధ్ చౌదరి.పూదోట: అవునండీ..:)
ధన్యవాదాలు.

తృష్ణ said...

@గోదారి సుధీర: చాలా సార్లు అనుకుంటాను కానీ తెంచుకోవటం ఎంతసేపండి..? నిమిషం పట్టదు...ఏ బంధం అయినా నిలబెట్టుకోవటం లోనే పరమార్థం దాగి ఉన్నది. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయమేనండీ.
ధన్యవాదాలు.

Ennela said...

naakuu yee madhya visugochchindi...kaanee mallee mee laage feelayyi andarikee wishes pamputunnaa!