సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, October 30, 2009

"క్షీరాబ్ధి ద్వాదశి"


(కోటిపల్లి "సోమేశ్వరాలయం" ముందర ఉన్న తులసి చెట్టు ఇది. ఆ మధ్య
తూర్పు గోదావరి ప్రయాణం లో తీసిన ఫొటో.)

ఇవాళ క్షీరాబ్ది ద్వాదశి. ఈ రోజంటే నాకున్న ఇష్టం కొద్దీ లింక్ కూడా పెట్టకుండా, ఆగష్టు 31న రాసిన ఈ టపానే మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను.( అప్పుడు చూడనివాళ్ళ కోసం.)చిన్నప్పుడు తులసికోట ముందర కూర్చిని, బోలెడు దీపాలు పెట్టి, తులసి కోటలో కాయలు ఉన్నా ఉసిరి కొమ్మ పెట్టి అమ్మా చేసే "క్షీరాబ్ధి ద్వాదశి" పూజ అంటే నాకు చాలా ఇష్టంగా ఉండేది.పెళ్ళయ్యాకా నేను చేయటం మొదలెట్టాను...!క్షీరాబ్ధి ద్వాదశి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది.కానీ తెలియనివాళ్ళెవరైనా ఉంటే,వాళ్ళ కోసం--

కార్తీక మాసంలోని శుక్లపక్ష ద్వాదశిని "క్షీరాబ్ధి ద్వాదశి" అంటారు.పురాణ కధనం ప్రకారం--విష్ణువు చెప్పగా,దేవదానవులు పాలకడలిని (క్షీరాబ్ధిని) మధించిన రొజు ఇది.అందువల్ల ఈ పేరు వచ్చింది.అంతేకాక,"ఆషాఢ శుక్ల ఏకాదశి"నాడు యోగనిద్ర ఆరంభించే విష్ణువు "కార్తిక శుధ్ధ ఏకాదశి"నాడు తన నిద్రను ముగిస్తాడు.మరుసటి దినమైన "క్షీరాబ్ధి ద్వాదశి"నాడు శ్రీహరి లక్ష్మీసమేతుడై,బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వస్తాడు.అందువల్ల ఈ రోజుని "బృందావన ద్వాదశి"గా కూడా పిలుస్తారు.ఈ రొజు సాయంత్రం విష్ణుస్వరూపమైన ఉసిరి కొమ్మను,లక్ష్మీ స్వరూపమైన తులసి మొక్క పక్కన పెట్టి పూజ చేస్తారు.ఈ ప్రదేశాన్ని వీలైనన్ని దీపాలతో అలంకరిస్తారు కూడా.సంవత్సరంలో ఏ రోజైనా దీపారాధన చేయకపోతే వచ్చే దోషం,ఈనాడు దీపారాధన చేయటం వల్ల పరిహారమౌతుంది అంటారు.


ఇవాళ బోలెడు పనులు...ముందు వెళ్ళి సాయంత్రం పూజకు "ఉసిరి కొమ్మ" కొని తెచ్చుకోవాలి..ఊళ్ళో బానే దొరుకుతాయని చెప్పారు మరి...! వెంఠనే వ్యాఖ్యలు ప్రచురించకపొయినా, జవాబులు లేటు గా రాసినా ఏమీ అనుకోకండేం...!!

************ ************

వినయక చవితికి ఎక్కడెక్కడ నుంచో పత్రి, రకరకల పువ్వులు తెచ్చి పది,ఇరవై అని అమ్ముతూంటారు...పోనీలే ఇప్పుడే కదా వీళ్ళకి కాసిని డబ్బులు వచ్చేవి అని కొనేస్తూ ఉంటాం కూడా...అలానే ఇవాళ ఉసిరి కొమ్మ కోసం వెళ్తే,
ఉసిరి కాయలతో ఉన్న చిన్న కొమ్మ పదిహేను రూపాయలట ?! "ఔరా" అనుకున్నా కొనక తప్పదుగా. అవసరం మనది..!! చిన్నప్పటినుంచీ
ఫ్రీ గా పక్కింట్లోంచో ,ఎదురింట్లోంచో తెచ్చుకునే అలవాటు మరి....మా ఊళ్ళో అయితే పక్కింట్లోంచి మా దొడ్లోకి ఒరిగి ఆకులూ, కాయలూ అన్నీ మాకే ఇచ్చేదొక ఉసిరి చెట్టు...!!

Thursday, October 29, 2009

వంటొచ్చిన మగాడు ( Just for fun..)


(నేను రాస్తున్నది కేవలం వంటొచ్చిన వారి గురించి. వంట రాని వారితో మరో రకమైన తంటా....అది మరొక టపా లో..)

వంటొచ్చిన మగాడు ( Just for fun..)

"ఇవాళ ఎం వండుతున్నావు?" అని తానే అడుగుతాడు.
"అది కాదు ఇది వండు" అని సలహా ఇస్తాడు.

ఉప్పులు,కారాలూ తేడాలు బాగా కనిపెడతాడు.
ఒహ పట్టాన ఏదీ నచ్చదసలు...
"ఈసారి ఇలా చెయ్యి" అని సలహా ఇస్తాడు.

ఏ కూర ముక్కలు ఏ సైజులో తరగాలో కూడా అడిగి చెయ్యాల్సిందే...లేకపోతే ప్రపంచం లో ఇలా ఎవరన్నా తరుగుతారా అని లెక్చర్లు...

"ఈ కూర దేంట్లో చేసావు? ఇంతకు ముందు దాంట్లో ఏం పోపు వేసావు?" అని ఆరా తీయగల సమర్ధుడు.

"మా అమ్మమ్మ లేక బామ్మ లేక అమ్మ చేసినట్లు చెయ్యటం నేర్చుకోరాదా..." అని ఉచిత సలహా పారేస్తాడు.

వంటకంలో పడాల్సిన వస్తువులు అన్నీ ఉండాలంటాడు. ఒక్క వస్తువు తగ్గినా రాజీ పడడు.
పొరపాటున వంటింట్లోకు వచ్చాడా...."ఇదేమిటి అది లేదా..అప్పుడే వండెయ్యకు..." అని డ్రెస్సు మార్చుకుని బయటకు పరుగెడతాడు...

ఇక తానే వంట మొదలెడితే ....ఇక మిగిలిన వారంతా ప్రేక్షకులవ్వాల్సిందే...
ఆ తరువాత అడవిని పోలిన వంటిల్లు సర్దటానికి ఇల్లాలి పని అయ్యిందే..!

ఇక కోపం వస్తే "వంటొండను పొమ్మనే" అవకాశం ఇల్లాలికి ఉండనే ఉండదు....
తానే ఇంచక్కా ఇష్టమైనవన్నీ వండేసుకుని, తినేసి, "టేబుల్ మీద పెట్టా నీక్కూడా..." అని వెళ్పోయేంత ధీరుడు.

హొటలుకి పోదామంతే మాత్రం....ఏ హొటల్కెళ్ళాలో ఎంతకీ తేల్చడు.....
అక్కడ అది బాగోదు..ఇక్కడ ఇది బాగోదు...అని జడ్జిమెంట్లిస్తాడు...
ఏక్కడికీ వద్దులెమ్మని ఇల్లాలు వంటింట్లోకి దూరే వరకూ....

పండుగలు, పుట్టినరోజులూ గట్రా వస్తే మాత్రం ఇల్లాలికి బెంగే ఉండదు...నేనున్నానని వంటింట్లోకి చొరబడతాడి వంటొచ్చిన మగాడు...

ఏది ఏమైనా వంట రాని ఆడవారు వీరిని కట్టుకుంటే గొప్ప వంటగత్తెలవటం ఖాయం.... !!!

************ **************

(ఇదంతా మావారి గురించి అనుకుంటున్నారా ? అబ్బే ఆయన రెండో రకం....
నీళ్ళు కాచుకోవాలంటే స్టవ్ వెలిగించాలని చన్నీళ్ళే పొసుకునే రకం...:)
ఇదంతా నా ప్రియమైన అన్నయ్య గురించి....(చదివితే కొడతాడేమో...)
కానీ మా వదినమ్మని ఇబ్బంది పెట్టడసలు...
వాడు చేసిన వంటకు వంక పెట్టలేమసలు...
వాడి వంట ముందు దిగదుడుపే అందరూ.....)

Wednesday, October 28, 2009

ముత్యాల ముగ్గు


బాపూగారి అసంఖ్యాక అభిమానుల్లో మా నాన్న ఒకరు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చదువవ్వగానే బాపూను కలిసిన నాన్న ఆయన చెప్పిన మాట విని అక్కడే ఉండిపొతే ఈ సినిమా టైటిల్స్ లో తన పేరు ఉండిపోయేది కదా అని ఇప్పటికీ అనుకుంటూంటారు...!! అప్పట్లో ఈ సినిమా విడుదలైనప్పుడు బాపు గారిది,ఎమ్.వి.ఎల్ గారిది ఆటోగ్రాఫ్ మాత్రం సంపాదించుకున్నారు.(పాతవవటం వల్ల వాటికి ఫొటో తీసినా సరిగ్గా రాలేదు.)

తెలుగు సినిమా చరిత్రలో ఒక ట్రెండ్ సెట్టర్ "ముత్యాలముగ్గు"(1975). సినిమాలోని పాత్రలూ, డైలాగులూ, చిత్రీకరణ, పాటల సాహిత్యం,సంగీతం అన్నీ వేటికవే సాటి.ఇటువంటి గొప్ప సినిమా గురించి నా సొంత జ్ఞానంతో, అక్షరాలతో సమీక్ష రాయటం సాహసమే. ఒక సినిమా గురించి చాలా రకాలుగా రాయచ్చు.నేను కేవలం ఈ సినిమాకున్న ప్రత్యేకతలను మాత్రమే రాయదలిచాను. ఈ సినిమా తాలూకు నవలారూపాన్ని చిన్నప్పటినుంచీ చాలా సార్లు చదివాను. మొదటిసారి సినిమాను మాత్రం మేము టి.వి కొనుక్కున్న కొత్తలో, దూరదర్శన్ వాళ్ళు మధ్యాహ్నం వేసే ప్రాంతీయ భాషా చిత్రాల్లో చూసాను...

జీరో ఫిగర్ లేదా సన్నని ఆకృతి, హెవీ మేకప్, వీలయినన్ని తక్కువ దుస్తులు, గ్లామరస్ లుక్స్....ఇవి ఇవాల్టి ఆధునిక "హీరోయిన్" అర్హతలు, గుర్తులు కూడా. కానీ పెద్ద కళ్ళు, కళ్ళనిండా కాటుక, మేకప్ లేని సహజత్వం, ముద్దబంతి లాంటి రూపం, పొడుగాటి వాల్జెడ, "బాపురే" అనిపించేలాంటి తెలుగుదనం నిండిన అమ్మాయిలు ఆయన బొమ్మల్లాంటి మన బాపూ గారి హీరోయిన్లు. ప్రతి సినిమాలోనూ పాత్రకు తగ్గ రూపం, ఈ పాత్రకి ఈవిడే కరక్ట్ అనిపించేలాంటి ఆర్టిస్ట్ లు.

"అబ్బ...ఎంత పెద్ద కళ్ళు...." అని హీరో తో పాటూ మనమూ ప్రేమలో పడిపోతాము


ముత్యాలముగ్గు లో హీరోయిన్ తో.
"ముత్యమంత పసుపు ముఖమెంత ఛాయ
మత్తైదు కుంకుమ బతుకంత ఛాయ...."
"......తీరైన సంపద ఎవరింట నుండూ
దిన దినము ముగ్గున్న లోగిళ్ళ నుండు...."
".......ఇంటి ఇల్లాలికీ ఎంత సౌభాగ్యం
ఇంటిల్లిపాదికీ అంత వైభోగం......"
అని పాడుతున్నది సుశీల గారైనా నటించిన సంగీత పాత్రను చూసి 'భార్య అంటే ఇలా ఉండాలి' అనుకోని మగవారుండరంటే అతిశయోక్తి కాదేమో..! పనులు చేసుకుంటూనో, ముగ్గు పెట్టుకుంటూనో, ఇల్లు సర్దుకుంటునో ఈ పాటలోని ఆరుద్ర గారి సాహిత్యాన్ని పాడుకోని తెలుగు ఇల్లాలు కూడా ఉండదు.

ఈ సినిమా గురించి చెప్పాల్సిన విశేషాలు చాలా ఉండటం వల్ల కధ గురించి క్లుప్తంగా --
అపార్ధాలతో విడిపోయిన ఒక జంట చివరికి ఎలా కలిసారన్నది ఈ చిత్ర కధాంశం.
స్నేహితుని చెల్లెలి పెళ్ళికి వెళ్ళి, అనుకోని పరిస్థితుల్లో ఆమెను వివాహమాడి ఇంటికి తెస్తాడు శ్రీధర్. అమాయకత్వంతో పాటూ లోకజ్ఞానం కూడా మెండుగా ఉన్న పల్లెటూరి అమ్మాయి లక్ష్మి.పేదింటి పిల్లను కోడలిగా మొదట్లో అంగీకరించలేకపోయినా, ఆమె వల్ల పోయిన దేముడి నగలు దొరకటంతో కోడలు లక్ష్మి తన ఇంటి మహాలక్ష్మి అనే నమ్మకానికి వస్తారు శ్రీధర్ తండ్రి రాజా రామదాసుగారు. ఆయన బావమరిది సోమరాజుకు తన కూతురుని శ్రీధర్ కు కట్టబెట్టి రామదాసుగారి ఆస్తినంతా అనుభవించేయాలని దురాశ. శ్రీధర్ ఒక పేదపిల్లని పెళ్ళాడి రావటం, రామదాసుగారు ఆమెను అంగీకరించటం సహించలేక నూతన దంపతులను విడదియ్యాలని కుట్ర పన్ని ఒక కాంట్రాక్టరు సాయంతో వారిద్దరినీ విడదీస్తాడు. దురాశ దు:ఖానికి చేటు అన్నట్లుగా తాను చేసిన పనికి కూతురివల్ల, కాంట్రాక్టరు వల్ల సోమరాజు ఎన్ని అవమానాలకూ నిందలకూ గురయ్యాడు, తాను తీసిన గోతిలో కాంట్రాక్టరు ఎలా పడ్దాడు, శ్రీధర్,లక్ష్మిల కవల పిల్లలు తెలివిగా తల్లిదండ్రులను చివరికి ఎలా కలిపారు అన్నది మిగిలిన కధ.

చాలా సినిమాలకు ఇతివృత్తాలు మన హిందూ పురాణాల నుంచే సేకరించబడ్డాయి. ఆ సినిమాలు బాగా ఆడాయి కూడా.అలాగే ఉత్తర రామాయణం ఆధారంగా ఈ సినిమా తీయబడిందని అంటారు. బాపు గారికి రాముడంటే ఎంత ఇష్టమో "సంపూర్ణ రామాయణం" "సీతా కల్యాణం" "అందాల రాముడు" మొదలైన సినిమాలు చూస్తే తెలుస్తుంది. ముత్యాల ముగ్గులో కూడా శ్రీరామ పట్టాభిషేకానంతర కధని ఒక సాంఘిక సినిమా రూపాన్నిచ్చి ఎంతో అందంగా మనకందించారు బాపూరమణలు. నారాయణరెడ్ది గారు రచించి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు పాడిన "శ్రీరామ జయ రామ సీతా రామ.." కూడా బాపుగారి రామ భక్తికి నిదర్శనమే !

ఈ సినిమాలో గుర్తుంచుకోదగ్గ "డవిలాగులు"

" యస్సారు గాదు. కళ్ళెట్టుకు సూడు. పైనేదో మర్డర్ జరిగినట్టు లేదూ ఆకాశంలో. సూరిఇడు నెత్తురుగడ్దలా లేడూ"

"ఆ ! మడిసనాక కస్సింత కలాపోసనుండాలయ్యా!! ఉట్టినే తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకీ తేడా ఏటుంటుంది."

"ఆ ముక్క, నే లెక్కెట్టే ముందు సెప్పాల. అసలు నే లెక్కే పెట్టనని నీ ఎదవ ఆలోచన. తప్పు కదూ! జాగర్త డిక్కీలో పెట్టించేస్తాను. "

"కన్నెపిల్ల మనసు అద్దంలా ఉంటుంది. అందులో తాళి కట్టేవాడి బొమ్మ పడగానే అది పటంగా మారిపోతుంది. "
(ఇది బాపూగారికి కూడా బాగా నచ్చిన డైలాగుట.)

"సిఫార్సులతో కాపురాలు చక్కబడవు. బతుకులు బాగుపడవు"

సినిమాకు సంబంధించి కొన్ని విశేషాలు, కబుర్లు

* పన్నెండున్నర లక్షలు ప్రొడక్షన్ కాస్ట్ పెట్టి తీసిన ఈ సినిమా మొదటి రిలీజు ఇరవై నాలుగోవారానికి రెండు కోట్లు వసూలు చేసిందిట.

* రొటీన్ గా వస్తున్న "విలన్" పాత్రకు కొత్త రూపాన్నిచ్చింది ఈ సినిమా. ఈ కొత్త తరహా విలన్ అసాధ్యుడు. అనుకున్నది సాధించే పనితనం ఉన్నవాడు, తన
పనివాడి నమ్మకద్రోహాన్ని కూడా పసిగట్టేంత తెలివైనవాడు, తాను చేసేది దుర్మార్గం అని ఒప్పుకోటానికి వెనుకాడని సాహసి. ఈ పాత్ర స్వర్గీయ రావు గోపాలరావు గారికి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఇప్పటికీ వారీ చిత్రంలో చెప్పిన డైలాగులను అనుకరిస్తున్నారు అంటే ఎంతటి ప్రాముఖ్యత సంపాదించుకున్నరో వేరే చెప్పనవసరం లేదు.

* "ముత్యాల ముగ్గు" లోని బంగళా షూటింగ్ శ్రీమతి ఇందిరా ధన్ రాజ్ గిర్ గారి అనుమతితో హైదరాబాద్ లోని జ్ఞాన్ బాగ్ ప్యాలెస్ లో జరిగింది. సినిమాలో చూపిన కొన్ని నగలు కూడా ఇందిరగారివేనని అంటారు.

* ప్రముఖ సినిమాటోగ్రాఫర్ "ఇషాన్ ఆర్య" ఫొటోగ్రఫీ ఈ చిత్రానికి హైలైట్. కొన్ని "కోకకోలా ఏడ్ ఫిల్మ్స్" చూసాకా బాపు గారికి ఈయనతో పని చేయాలనే ఆలోచన కలిగిందట.

*ఇక అవార్డుల విషయానికి వస్తే, 1975 లో ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రం అవార్డ్ గెలుచుకుంది. బెస్ట్ కలర్ ఫొటోగ్రఫీ కి ఆల్ ఇండియా అవార్డ్ ను కూడా సినిమాటోగ్రాఫర్ ఇషాన్ ఆర్య సంపాదించుకున్నారు. ఇవేకాక ఆంధ్రపదేశ్ ప్రభుత్వం ద్వారా మరెన్నో అవార్డులని కుదా ఈ చిత్రం సొంతం చేసుకుంది.

* బాపు రమణలు సంగీతప్రియులు. మధురమైన కె.వి.మహాదేవన్ సంగీతంతో పాటూ, నూతన దంపతుల సన్నిహిత దృశ్యాల చిత్రీకరణలో ప్రముఖ మేండొలీన్ విద్వాంసుడు Sri Sajjad Hussain గారి 16 నిమిషాల మేండొలిన్ బిట్ అందుకు సాక్షి .

* పేరుపెట్టేదాకా సినిమాను "ముత్యాల ముగ్గు" అని సరదాగా పిలిచేవారట. తర్వాతర్వాత అదే పేరు బాగుందని ఉంచేసారట.

* ఈ చిత్రంలో మాడా, ఆంజనేయస్వామి, పుజారిగారి కుటీరం, సంగీత చీరలు, హలం కట్టుకున్న సింపుల్ చీర, ముద్దొచ్చే కవల పిల్లలూ అన్ని సూపరే...ముఖ్యంగా అల్లు రామలింగయ్య గారు ఆఖరు సీను లో....చాలా బాగా చేస్తారు. ముత్యాలముగ్గు షూటింగు చివరిరోజుల్లో అల్లు రామలింగయ్య గారి కొడుకు ఏక్సిడెంట్ లో మరణించారట. వద్దంటున్నా ఆయన షూటింగుకి వచ్చి "బాధ మరచిపోవాలంటే – పని చేయడం ఒకటే మార్గం" అనేవారుట .

* స్వర్గీయ ఎన్.టి.ఆర్ గారికి ఎంతో ఇష్టమైన సినిమాట ఇది. డైలాగులు, సీన్లు తన చిన్ననాటిరోజులను గుర్తుకు తెస్తున్నాయని అనేవారట. స్కూలు పిల్లలకి వీడియో పాఠాలు తయారుచేసే ప్రోజక్ట్ బాపూరమణలకు అప్పజెప్పినప్పుడు ఇవి "ముత్యాలముగ్గు అంత బాగుండాలి" అనటం ఆ సినిమాకు పెద్ద ప్రశంసే మరి.

* ముళ్లపూడి వెంకటరమణగారి డైలాగులు ఈ చిత్రానికి ప్రాణాలు.


సినిమాలో గుర్తుండిపోయే విషయాలు:

తోటలో సంగీత జామకాయలు కోసి శ్రీధర్ కు కాకెంగిలి చేసి ఇచ్చే సీన్, శాంత శ్రీధర్ కు తేగ పెట్టేప్పుడు చెప్పే కబుర్లు, శ్రీధర్ ఫోటో పడేసుకుని వెళ్పోతే అది తీసుకుని లక్ష్మి ఆనందించే దృశ్యం, రాము ఆంజనేయస్వామితో మాట్లాడే మాటలు... గుర్తుండిపోతాయి.

సినిమాలో పాటలన్నీ బాగుంటాయి కానీ గుంటూరు శేషేంద్ర శర్మ గారు రాసిన ఏకైక సినిమా పాట "నిదురించే తోటలోకి...." , "ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురూ..." నాకిష్టమైనవి. అందరు నటులు తమ తమ పాత్రలకు ప్రాణం పోసారు. శ్రీధర్ నటన కంటే నాకు సంగీత నటనే ఎక్కువ నచ్చుతుంది. బహుశా కధలో ఆమెకు ఎక్కువ ప్రాధాన్యత ఉండటంవల్ల కావచ్చు. చిన్నప్పుడు ఈ సినిమా చూసి అంత ప్రేమించే భర్తకు భార్యపై నమ్మకం లేదేంటి? అది ప్రేమెలా అవుతుంది? అనుకునేదాన్ని. కానీ భార్యాభర్తల మధ్య అనుబంధానికి పునాది "నమ్మకం". అది లేని నాడు బంధాలు తెగిపోతాయి, కాపురాలు కూలిపోతాయి అనే సత్యాన్ని ఈ సినిమా తెలుపుతుంది అని పెద్దయ్యాకా అర్ధమైంది. సినిమా వచ్చి ముఫ్ఫైనాలుగేళ్ళు అయినా ఇంకా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అపురూపమైన చిత్రంగా మిగిలిపోవటానికి సినిమా అంతా నిండిఉన్న తెలుగుదనమే కారణం అనిపిస్తుంది నాకు.




ఇంత రాసినా ఇంకా ఏదో మిగిలిపోయింద నిపిస్తోంది... :)


Monday, October 26, 2009

గ్రీటింగ్స్...


గ్రీటింగ్స్ ... అంటే...
Greetings are wishes....wishes that convey our innermost feelings to the ot
her person. ఇది నా అభిప్రాయం. కొందరికి ఇదొక వృధా ఖర్చు. కానీ నాకు గ్రీటింగ్స్...అంటే పిచ్చి పిచ్చి..!! కాలేజీ రొజుల్లో మా ఊళ్ళో Prabodha, Options, Ashok book center, Archies, Pens n Pads...ఇవే పేరు మోసిన గ్రీటింగ్స్ దొరికే షాపులు. ఈ షాపులన్నీ నా అడ్డాలు. ఎప్పుడన్నా చేంజ్ లేదంటే మళ్ళీ వచ్చినప్పుడు ఇవ్వండి...అనేంత బాగా తెలుసు నేను ఆ షాపులవాళ్ళకి. సమయం దొరికినప్పుడల్లా స్నేహితులతోనో, ఒంటరిగానో వెళ్ళటం పదో ఎన్నో నచ్చినవి, కొత్త రకాలు కొని తెచ్చేసుకోవటం...B'days, New year, Occassions, just born, Bon voyage, Get well soon, just Hi.., GoodDay...అంటు ఎన్ని రకాల కార్డ్స్ ఉంటాయో అన్ని రకాలు నచ్చినవి కొనెయ్యటమే.

"ఎవరికి పంపిస్తావే..ఎందుకు ఇన్ని కొంటావు" అని అమ్మ కేకలేసేది...అవి మన చెవులకి వినబడితే కదా..! కొత్త చొక్కాల తాలూకూ అట్టపెట్టెలు సంపాదించి వాటిల్లో కేటిగొరీల ప్రకారం దాస్తూ ఉండేదాన్ని...అప్పుడు పెద్ద ఖరీదు ఉండేవి కాదు గ్రీటింగ్స్. ఏభై రుపాయల కార్డ్ అంటే చాలా ఖరీదైన కార్డ్. (ఇప్పుడు ఏభై రుపాయిలకు తుక్కులాంటి కార్డ్ కూడా రావట్లేదు.) ఇక స్నేహితులకూ, బంధువులకు ఉత్తరాలు కూడా బాగా రాసేదాన్ని. ప్రతి రోజూ పోస్ట్ మాన్ మా ఇంటికి రావాల్సిందే..ఎవరిదో ఒక లెటర్ తేవాల్సిందే. ఉత్తరాల గురించి నేను రాసిన ఒక పాత టపా "ఇక్కడ" చూడండి. అలా ఉత్తరాలతో పాటూ సందర్భానుసారంగా నేను తయారు చేసిన వాటితో పాటు ఈ కొన్న గ్రీటింగ్స్ కూడా పంపిస్తూ ఉండేదాన్ని...!!

ఇప్పుడు e-cards వచ్చేసాకా కొనటం పుర్తిగా తగ్గిపోయింది. పైగా అన్ని e-mails ఏ కదా. కానీ ఈగ్రీటింగ్స్ మాత్రం మైల్స్ తో నా బంధువులకీ,స్నేహితులందరికీ తప్పకుండా పంపిస్తూ ఉంటాను. అదొక సరదా. మనం ఎదుటి వ్యక్తికి ప్రాముఖ్యం ఇస్తున్నాము అని తెలపటానికి. మన గ్రీటింగ్స్ ద్వారా మరొక వ్యక్తికి ఆనందం కలిగిస్తున్నాము అనే సంతృప్తి కోసం. నాకు తిరిగి అందరూ పంపిస్తారా అంటే...ఖచ్చితంగా పంపించరు. కానీ ఎదుటి మనిషిలాగే మనమూ ఉంటే మనకీ వాళ్ళకీ తేడా ఏంముంటుంది అనేది నా అభిప్రాయం.

ఇక్కడొక చిన్న మధుర స్మృతి...నా పెళ్లైన కొత్తలో "వేలెంటైన్స్ డే" వచ్చింది. "నాకేమన్నా కావాలి" అనడిగాను మావారిని. "ఏం కావాలో చెప్పు" అన్నారు. "గ్రిటింగ్స్ కొనివ్వరా?" అనడిగాను. ఆశ్చర్యపోయారు. "ఏం అడుగుతావో అనుకుంటుంటే...కాయితం ముక్క కావాలంటావేమిటీ?" అన్నారు. "నాకు అదే బంగారమంత ఎక్కువ. అదే కావాలి." అన్నాను. "నేనెప్పుడూ గ్రీటింగ్స్ కొనలేదు. ఎవరికీ ఇవ్వలేదు. ఏ షాపులెక్కడ ఉంటాయో తెలీదు.." అన్నారు. ఈసారి నేనాశ్చర్యపోయాను..కొత్త కదా ఏమంటాం..అని ఊరుకున్నాను. మర్నాడు శనివారం. తనకు హాఫ్ డే ఉండేది (బొంబాయిలో). సాయంత్రమైనా మనిషి ఇంటికి రాలేదు. నాకేమో కంగారూ, భయం.
మనకి పిలవకుండానే పలికే కోపం కూడా వచ్చేసింది...ఇంతలో బెల్ మోగింది...

తలుపు తియ్యగానే ఎర్ర గులాబిల బొకేతో, గ్రీటింగ్స్ పట్టుకుని మావారు..! "ఢాం" అని పడిపో
యా..!! కానీ కొంచెం అలక వహిస్తూ అడిగాను "ఎందుకింత ఆలస్యం?" అని.." అందరిని దారి అడుగుతూ గ్రీటింగ్స్ షాపు వెతుక్కుని వెళ్ళి, కొని తెచ్చేసరికీ ఇంత సేపైంది" అన్నారు. అలసిపొయిన ఆయన మొహం అప్పుడు కనబడింది నాకు...నా కోసం ఇంత కష్టపడ్డారా....కోపమంతా ఎగిరిపోయింది...!! ఆ తర్వాత రెండు రోజులదాకా ఈయన బొకే తెస్తూండగా చూసిన మా వింగ్ లోని ఇరుగు పొరుగు ఆంటీలంతా నన్ను ఏడిపిస్తూనే ఉన్నారు..."క్యా బాత్ హై..?!" అంటూ...

అప్పటినుంచీ పాపం నాకోసం పుట్టినరోజులకీ, పెళ్ళిరోజులకీ మిగిలిన బహుమతులతో పాటూ గ్రీటింగ్స్ కొంటూనే ఉన్నారు మావారు....!!

Saturday, October 24, 2009

సహనం

పిల్లలు ఆడుతూ పాడుతూ ఉంటే ఎంత ఆనందిస్తామో..వాళ్ళు కొంచెం నలత పడితే అంత ఆందోళన చెందుతాము. మళ్ళీ తగ్గేదాకా ఆదుర్దా తప్పదు తల్లిదండ్రులకి...పాపకు రెండు, మూడు రోజుల నుంచీ బాలేదు. మోకాలు మీద చిన్న దెబ్బ తగిలి, అది పుండై, సెప్టిక్ అయ్యి నానా హంగామా...నడవలేదు, నెప్పి, ఏడుపు, గోల...నాల్రోజులుగా స్కూలుకు పంపలేదు కాబట్టి ఇంట్లో తినటానికి నేను ఎంచక్కా రెడిగా దొరికే "ఫాస్ట్ ఫుడ్" ని కూడా దానికి.

ఈపుటే కాస్త సర్దుకుంటోంది అని ధైర్యం వచ్చింది. పాప కోసం హాస్పటల్ కు వెళ్ళిన రెండు మూడుసార్లూ కొత్తగా చేరిన ఆ నర్సుని గమనించాను. "ఆమె"ను గురించే ఈ టపా..

జ్వరాల సీజన్ కాబట్టి హాస్పటల్ నిండా బోలెడు పిల్ల పేషంట్స్... కూర్చోవటానికి కూడా ఖాళీ లేదు..దాన్ని ఎత్తుకుని అరగంట నించునే సరికే నా నడుం లాగటం మొదలెట్టింది. ఆ నర్సుది డాక్టర్గారి గుమ్మం దగ్గర నిలబడి పేషంట్లను లోపలికి పంపే డ్యూటీ. పాతిక ముఫ్ఫై మధ్య వయసు.సన్నగా, పొడుగ్గా, కాటుక కళ్ళతో, చిరునవ్వుతో నన్ను ఇట్టే ఆకట్టుకుంది. ఆమె కూర్చునే కుర్చిలో కూడా పేషంట్లు ఉన్నారు. చిన్న చిన్న పాపలు, బాబులు...మొహాలు వేళ్ళాడేసినవాళ్ళు, జ్వరంతో మూలుగుతున్న వాళ్ళు, నిద్రోతున్న పసిపాపలూ...వాళ్ళ తాలూకూ ఆందోళిత తల్లులు,తండ్రులు.

నెంబరు తీసుకుని వెళ్ళేవారి మధ్యలో రిపోర్ట్ లు చూపించటానికి వచ్చే మరి కొందరు, అర్జంట్ గా వచ్చిన కేసులు...ఇలా రకరకాల వాళ్ళకు అందరికీ ఎంతో ఓపిగ్గా, చిరునవ్వుతో సమాధానాలు చెప్తోంది. "పంపిస్తానండీ..అదిగో వాళ్ళ తరువాత మీరు...వీళ్ళ తరువాత మీరు.." అంటోంది. ఆమె సహనానికి మనసులోనే జోహార్లర్పించాను.రెమ్డు రోజుల క్రితమ్ ఎలా ఉందొ, ఇప్పుడు అదే నవ్వు మొహం. చిన్నప్పటినుంచీ నేను చూసిన చాలా మంది నర్సులు చిరాకుగా, వచ్చిన పేషంట్స్ కి డిక్టేటర్స్ లాగ కసురుకోవటం, ఒక్క చిన్న చిరునవ్వు కూడా లేక చిందులేస్తూ ఉండటమే చూసాను. వాళ్ళ చిరాకులూ పరాకులూ వాళ్ళవి.నిజమే. కానీ వచ్చిన పేషంట్స్ ఎంత కంగారుగా ఉంటారు..అని వీళ్ళు ఆలోచించరా అనుకునేదాన్ని.

అలాంటిది మొదటిసారి అర్భకంగా ఉండీ, గంటలు గంటలు నిల్చుంటూ కూడా, ఓపిగ్గా సమాధానాలు చెప్తూ, అందరినీ గొడవ పడకుండా హేండిల్ చేస్తున్న ఆమె సహనానికి ఆశ్చర్యపడకుండా ఉండలేకపోయాను. Great job..!! అనుకున్నాను. కానీ అర్జెంట్ గా వచ్చిన ఒక కేసుని చూసి మాత్రం చెలించిపోయాను..చిన్న పాప..ఒక సంవత్సరం ఉంటుందేమో...జ్వరం వచ్చి ఫిట్స్ వచ్చాయిట. తల్లి సంగతి సరే, పాపని ఎత్తుకున్న తండ్రి కూడా ఏడుస్తున్నాడు..ఎవరయితేనేం పాపం అన్పించింది....నాకు చిన్నాప్పుడు పాప ICU లో ఉండటం అవీ గుర్తు వచ్చేసాయి..పుట్టిన పదిహేను రోజులదాకా దాని మొహమే చూడలేదు నేను...అసలు ఒళ్ళోకి పాప వస్తుందా అని ఏడుస్తు గడిపిన క్షణాలు...అబ్బ...ఆ నరకాన్ని తలుచుకోవటమే మనేసాను. ఈలోపూ ఆఫీసు నుంచి మావారు
డైరెక్ట్ గా హాస్పటల్ కు వచ్చేసారు. ఆయన్ను చూడగానే జారుతున్న గుండె కొంచెం ధైర్యం తెచ్చుకుంది.

మా నంబరు రావటంతో లోపలికి వెళ్ళాం. "తగ్గిపోతుంది పర్వాలేదు" అని డాక్టర్ ధైర్యం చెప్పాకా స్తిమితపడ్ద మనసుల్తో ఇల్లు చేరాం. ఇవాళ పొద్దున్నకి కాస్త ఎరుపు తగ్గి పుండు మానే స్టేజ్లో కనిపించింది. ఆ నర్సు "సహనాన్ని" గురించి చెప్పాలని నన్ను నేను కంట్రోల్ చేసుకోవటానికి నిన్నంతా మూసేసిన బ్లాగ్ తెరిచి ఈ టపా...!!

Thursday, October 22, 2009

నాగుల చవితి

కార్తికేతు సితే పూజ్యా:
చతుర్యార్ధం కార్త్యికేయక:
మహాచతుర్థీ సా ప్రోక్తో
సర్వపాపహరా శుభా !!

ఇవాళ "నాగులచవితి" . కార్థీక శుధ్ధ చవితి నాడు సుబ్రహ్మణ్యస్వామిని పూజిస్తే సకల పాపాలూ పోతాయంటారు పెద్దలు. ఈ రోజుని "మహా చతుర్థి" అని కూడా అంటారు. పుట్టకు పోయి ఆవుపాలు పోసి, పుట్ట మట్టిని ధరించి, సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి పూజించినవారి అభీష్టాలు నెరవేరతాయని శాస్త్రం. దీపావళి నాడు కాల్చగా మిగిల్చిన కొన్ని టపాకాయల్ని కూడా ఇవాళ పిల్లలతో కాల్పిస్తారు. కొందరికి పుట్టకు పోయే ఆనవాయితి ఉండదు. వారు తమ తమ గృహాల్లోనే సుబ్రహ్మణ్యుని విగ్రహంపై, లేదా గోధుమ పిండితో చేసిన నాగేంద్రునిపై పాలు పోస్తారు. మేము ఇంట్లోనే పాలు పోస్తాము. చిమ్మిలి, చలిమిడి నైవేద్యం చెసి పెడతాము.

చిన్నప్పుడు అడవి లాంటి మా క్వార్టర్స్ లో చాలా పాము పుట్టలు ఉండేవి. నాగులచవితి నాడు తెల్లారేసరికీ బిలబిలమని బోలెడు జనం...పూలు,పాలు,పళ్ళు,పసుపు,కుంకుమ మొదలైన పూజాద్రవ్యాలతో వచ్చేసేవారు. మామూలుగా అక్కడ ఒక క్వార్టర్స్ ఉందని ఎవరికన్నా తెలుసా అనుకునే మాకు, ఇంతమందికి ఇక్కడ పాము పుట్టలు ఉన్నట్లు ఎలా తెలుసా? అని ఆశ్చర్యం కలిగేది.

ఈ సందర్భంగా ఒక చిన్న సంఘటన...క్వార్టర్స్ లో ఉండగానే ఒకసారి ఎవరో చెప్తే, ఐదు వారాలు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసాను. ఐదు మంగళవారాలు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రి పళ్ళు మాత్రమే తినాలి. ఎర్రని పూలతో స్వామికి పూజ చేసి, గుడికి వెళ్ళి....etc..etc...చెయ్యాలి. మనం అత్యంత శ్రధ్ధగా పూజలు చేసేసాం. మొదటి మూడు వారాలూ ఏమీ కలేదు కానీ ఆఖరు రెండు వారాలూ కూడా సాయంత్రం అయ్యే సరికీ మా ఇంట్లోకి పాము వచ్చింది. నాలుగో వారం బోలెడు పుట్టలు ఉన్నాయి కదా అప్పుడప్పుడు వస్తాయి..అనుకున్నాం. కాని ఐదవ మంగళవారం మళ్ళీ ఇంకో పాము వచ్చింది. అబ్బా, నా పుజకి ఎంత శక్తో...అని నేను ఆనందించే లోపూ... మా అమ్మ చాలా భయపడిపోయి....కార్తికేయుణ్ణి పూజించు కానీ ఇంకెప్పుడూ ఈ ఉపవాసపుజ చెయ్యకే అమ్మా....అని గట్టిగా చెప్పేసింది..!

Wednesday, October 21, 2009

ఏమో...


ఏమో...మునుపెలా ఓర్చానో గాయాల్ని....

ఇంతే దు:ఖం అయి ఉంటుంది....
ఇవే కన్నీళ్ళయి ఉంటాయి...
ఇదే నిస్పృహ ఆవరించి ఉంటుంది...
ఏమో...మునుపెలా ఓర్చానో గాయాల్ని....

పగిలి ముక్కలైన మనసుని అతికాను
ఉదాసీనమైన మోములో నవ్వు చిందించాను
వెంట వస్తున్న నిరాశను సాగనంపాను
ఏమో ...మునుపెలా ఓర్చానో గాయాల్ని....

మంచితనాన్ని వాడుకున్న స్నేహపు వంచనలు దాటాను
వదలనంటూనే చేయి వీడిన నేస్తాలను వదిలాను
మాటల బాణాలతో మనసు తూట్లుచేసినా భరించాను
ఏమో..మునుపెలా ఓర్చానో గాయాల్ని....


ఈనాడిలా ఓడిపోయను...
కన్నీటిలో కరిగిపోయాను...
నిట్టూర్పులో ఆవిరయ్యాను...

చెయ్యని నేరానికి దోషినయ్యాను...
ఈనాడిలా ఓడిపోయను...
ఏమో..మునుపెలా ఓర్చానో గాయాల్ని....

Tuesday, October 20, 2009

గుంటూరు శేషేంద్ర శర్మ కవిత

"ఒక్క పువ్వు రంగును చూస్తూ శతాబ్దాలు బ్రతకగలను" అంటారు గుంటూరు శేషేంద్ర శర్మ. ఈయన కవిత్వాన్ని శ్రీ శ్రీ మొదలు విశ్వనాధ సత్యనారాయణ, పుట్టపర్తి నారాయణాచార్యులు దాకా ప్రశంసించారు. తిలక్ సాహిత్యంతో కూడా ఈయన సాహిత్యానికి సామీప్యం కనిపిస్తుంది. వీరిద్దరి కవితల్లో కనబడే భాషా సౌందర్యం ఇతర ఆధునిక కవుల్లో కొంత తక్కువనే చెప్పాలి. శేషేంద్ర శర్మ గారి కవిత్వంలో ప్రకృతి సౌందర్యంతో పాటూ తత్వాన్వేషణ కూడా మిళితమై ఉంటుంది. అందువల్ల మళ్ళి మళ్ళీ ఆ రచనలను చదవాలనే ఆసక్తి, చదివే కొద్ది కొత్త అర్ధాలూ కనబడుతూ ఉంటాయి నాకు.

ఇంతకన్నా గొప్పగా ఆయన కవిత్వాన్ని విశ్లేషించే కవితాశక్తి, అర్హత నాకు లేవు కానీ ఆయన కవిత్వం లోంచి కొన్ని వాక్యాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను...చదివి ఆస్వాదించండి...

"ఎక్కడ పేరులేని పక్షి కొమ్మల్లో కూర్చున్న మాత్రాన
పరిసరాలు పద్యాలుగా మారుతాయో
ఎక్కడ ఎర్ర యూకలిప్టస్ చెట్టు
సంధ్యలో స్నానం చేసి ఆకుల కొసల్లో
ఎర్రపూల బిందువులు వ్రేలాడుతూండగా
ముందుకు వస్తుందో
ఎక్కడ ముద్దుగా ఇంటి మీదికి ఒరిగిన
జాబిల్లి ముద్ద చేతి కందుతాడనిపిస్తుందో

అక్కడికి, ఆ కల లోయల్లోకి
పోదాం పదమంటుంది ఆత్మ
నగ్న వృక్షాల బారినించి తప్పించుకుని
శాంతి యాత్ర చేద్దాం పదమంటుంది.."
__(శాంతియాత్ర : మండే సూర్యుడు)

+++++++++++++++++++++++++

"తుఫాను" కవితలో ఆయనంటారు...
"ఏమోయ్ తుఫాను ఎక్కడికి పోతున్నావ్
నీ ముఖం ఎంత ప్రశాంతమైన అచ్చాదన నీకు
ఉన్నది ఒక్క గుండె
వంద గాయాలకు చోటేక్కడుంది నీలో..."

+++++++++++++++++++++++++

ప్రేమను గురించి ఉపమానాలు పేనుతూంటే
గుండెని కోకిల తన్నుకుపోయింది
గజల్ని గురించి రాద్దామని కూర్చుంటే
రాత్రి కవిత్వంలో తడిసిపోయింది..

+++++++++++++++++++++

మనసు ఇచ్చిన గాయాలను మమత కొనుక్కున్నది
బ్రతుకు సంతలో చివరకు బాటసారి అయినది..

+++++++++++++++++++

"చిన్న నక్షత్రం చేత్తో పట్టుకుని
అంతరాత్మ సందుల్లో ఒక రహస్యాన్ని
తవ్వుతున్నాను
ఎన్నో కోట్ల రాత్రుల పొరల క్రింద
బయటపడింది
మనిషి కోల్పోయిన మొహం
వెయ్యి కిరణాలతో..."

+++++++++++++++++++


"వేళ్ళు కాళ్ళై నడిచే చెట్టు మనిషి
చెట్టుగా ఉంటే ఏడాదికొక వసంతమన్నా దక్కేది
మనిషినై
అన్ని వసంతాలూ కోల్పోయాను.."

+++++++++++++++++++++++++

"...భూమిలో ఉన్న చిన్నారి గింజ
మెడ బయటకు పెట్టి
మొదట వచ్చిన రెండాకుల్ని
చేతులుగా జోడించింది
కృతజ్ఞతతో "

+++++++++++++++

ఒక్కటే :

రాళ్ళెన్ని ఉన్నా దూరాన్ని కొలిచే రాయి ఒక్కటే
పక్షులెన్ని ఉన్నా ఒంటరితనాన్ని
తనమీద వేసుకుని
దిక్కులతో చూపులు కలిపే పక్షి ఒక్కటే

దిక్కులెన్ని ఉన్నా
చూపులతో మాట్లాడే దిక్కు ఒక్కటే
మాటలెన్ని ఉన్నా పొందిందీ లేదు
పోగొట్టుకున్నదీ లేదు
ఈ వెలుగు చీకట్ల సంగమంలో
అని చెప్పే మాట
ఒక్కటే

జీవితం అంతా అరిగిపోగా
చివ్వరి రేణువులా మిగిలి ఉన్న
నా ఉనికి అంతా
ఒక్క జ్ఞాపకం
ఒక్కటే
+++++++++++++++++

శేషేంద్ర శర్మ గారు రాసిన ఒకే ఒక సినిమా పాట "ముత్యాల ముగ్గు " చిత్రంలో ఉంది...
సంగీతం:కె.వి .మహదేవన్
పాడినది: పి.సుశీల

నిదురించే తో్టలోకి పాట ఒకటి వచ్చింది
కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది

రమ్యంగా కుటీరానా రంగవల్లులల్లిందీ
దీనురాలి గూటిలోన దీపంలా వెలిగిందీ
శూన్యమైన వేణువులో ఒక స్వరమ్ కలిపి నిలిపిందీ
ఆకురాలు అడవికి ఒక ఆమని దయచేసింది

విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో
ఆశల అడుగులు వినబడీ అంతలో పోయాయి
కొమ్మల్లో పక్షుల్లారా గగనంలో మబ్బుల్లారా
నది దోచుకుపోతున్న నావను ఆపండి
రేవు బావురుమంటోందని
నావకు చెప్పండి..నావకు చెప్పండి..



Monday, October 19, 2009

యాస్మిన్

బంధుత్వం, సన్నిహితమైన స్నేహం లేకపోయినా కొందరు వ్యక్తులు మన జీవితాల్లో ఎంతో విలువను ఆపాదించుకుని స్మృతుల లోతుల్లో, జ్ఞాపకాల దొంతరలో ప్రియమైన వ్యక్తులుగా మనకు గుర్తుండిపోతారు. నా జీవితంలో అటువంటి కొందరు వ్యక్తుల్లో ఒకరు "యాస్మిన్".

పెద్ద పెద్ద చెట్లతో, అడవిలా అనిపించేది ఆ ప్రదేశం. దాన్ని బాగు చేసి ప్రభుత్వం క్వార్టర్స్ నిర్మించింది. బాబోయ్ అడవిలాగుంది..అనేవాళ్ళందరూ....కాని నాకు చాలా నచ్చేవి... ఆ పెద్ద పెద్ద చెట్లు, పొద్దున్నే పలకరించే రకరకాల పక్షులు, మేము పెంచిన తోట...అన్నీను. ఇంటర్, డిగ్రి, పిజీ.... చదివే రోజుల్లో మేము క్వార్టర్స్ లో ఉండేవాళ్ళం. మేము రెండో అంతస్తులో ఉంటే, రోడ్డుకు మరో పక్క ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ లో "యాస్మిన్" వాళ్ళు ఉండేవారు. వాళ్ల ఇంటి చుట్టూ ఒక కంచె కట్టుకుని బోలెడు మొక్కలు అవీ పెంచేవారు. అవి చూసి సరదాపడి; నేనూ, మా మొదటి ఫ్లోర్లో ఉన్న నా ప్రాణ స్నేహితురాలూ ఇద్దరం క్రింది వాటావాళ్ళ అనుమతి తీసుకుని చెరొక "గార్డెన్" పెంచటం మొదలుపెట్టాము. మా మా పేర్లతో ఆ గార్డెన్లకి బోర్డులు కూడా తగిలించాము. ఆ తోట పెంపకానికి, మరిన్ని మొక్కల కోసం, మేము "యాస్మిన్" ను పరిచయం చేసుకున్నాము. వాళ్ళ దొడ్లోంచి కొన్ని మొక్కలు సంపాదించాము. గులాబీ, చామంతీ, బంతి, కనకాంబరం మొదలైన పూల చేట్లతో పాటూ బెండ, కాకర, గోంగూర, వంగ, పాలకూర, కొత్తిమీర, చుక్క కూర...మొదలైనవన్నీ కూడా పెంచేవాళ్ళం. నేను సంక్రాంతికి ముగ్గులు పెడుటూంటే వచ్చి చూసి వెళ్తూండేది తను.


ఒకరిళ్ళకు ఒకరం ఎప్పుడూ వెళ్ళలేదు. కేవలం రోడ్డు స్నేహమే...! అప్పుడప్పుడు కనబడినప్పుడల్లా నేను యాస్మిన్ తో మాట్లాడుతూ ఉండేదాన్ని. ఒక అర కిలోమీటరు రోడ్దు అయ్యాకా మైన్ గేట్ ఉండేది. మా ఇద్దరి ఇళ్ళ మధ్యన ఉన్న రోడ్దు మీదే మేము కబుర్లు చెప్పుకునేవాళ్ళం. యాస్మిన్ నా కన్నా రెండు,మూడేళ్ళు పెద్దది. బంధువులం కాదు, సమ వయసు కాదు, ఒకే చదువు కాదు, ప్రాణ స్నేహితులం కూడా కాదు...అయినా రోడ్దు మీద కనబడితే మాత్రం ఏమిటో అలా గంటల తరబడి...నిజమే..గంటల తరబడి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. నన్ను చాలా మంది చాలా పేర్లతో పిలిచేవారు...కాని తను మాత్రం ఆప్యాయంగా, అభిమానంగా ఎవ్వరూ పిలవని ఒక పేరుతో నన్ను పిలిచేది. నేనెప్పుడూ అలా పిలవమని అడగలేదు...!

రోడ్దు మీద అటుగా వెళ్ళేవాళ్ళు మమ్మల్ని పలకరించి, దాటి వెళ్పోయి...పని అయ్యాకా తిరిగి వచ్చేప్పుడు ఇంకా అక్కడ నిలబడి మాట్లాడుకుంటున్న మమ్మల్ని చూసి నవ్వేవారు...వాళ్ళ గుమ్మం లో నిలబడ్డ వాళ్ళ అమ్మగారు ఎప్పుడు వస్తుందా అన్నట్లూ చూస్తూ ఉండేవారు....ఇక పైనుంచి మా అమ్మ కూడా పిలుస్తూ ఉండేది...ఆ(... వస్తున్నా.. అనేవాళ్ళం కానీ మా కబుర్లు తెమిలేవి కావు....ఇక రెండు మూడు సార్లు పిలిచాకా ఇయిష్టంగానే ఇళ్ళకు వెళ్ళేవాళ్ళం.అంత సేపు ఏం మాట్లాడుకుంటారే? అనేది అమ్మ. ఏవో..అలా ఒక దాన్లోంచి ఒకదాన్లోకి...చదువులు,సినిమాలు,కాలేజీ కబుర్లు...అలా ఏవో..పిచ్చాపాటి...! ఏమిటో ఆ బంధం మరి..కొందరి వ్యక్తులు అలా ఆత్మీయులైపోతారు.ఆ అనుబంధం, స్నేహం ఏర్పడ్ద వ్యక్తులకి తప్ప మిగిలిన వాళ్ళకు అది అర్ధం కాదు...! కొన్ని బంధాలంతే.

నేను డిగ్రీ ఫైనల్లో ఉండగా ట్రాన్స్ఫర్ మీద వాళ్ళు వేరే ఊరు వెళ్పోయారు.ఆ తరువాత ఎప్పుడూ కలవలేదు. ఇప్పుడెక్కడున్నారో కూడా తెలీదు...జ్ఞాపకాల దొంతరలో మాత్రం ప్రియమైన వ్యక్తిగా గుర్తుండిపోయింది...!!

Saturday, October 17, 2009

దీపముల వరుసే "దీపావళి "


దీపముల వరుసే "దీపావళి ". నరకసురుని సంహారంతో ప్రజలు ఆనందంతో చేసుకున్న పండుగ ఇది.ముందు ఐదు రొజులు చేసుకోవాల్సిన ఈ పండుగ శాస్త్రియ పధ్ధతి...

శాస్త్రీయంగా దీపావళిని అయిదు రోజులు చేసుకోవాలి.ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి అమావాస్య, గోవర్ధన పూజ, భగినీ హస్త భోజనం. ఉత్తరాదిన ఐదు రొజులూ జరుపుకుంటారు.


ధనత్రయోదశి:దీనిని "ధన్ తెరస్" అని కూడా అంటారు. మహాభారతంలో ధర్మరాజుకు అతడు పోగొట్టుకున్న రాజ్యలక్ష్మిని మరలా సంపాదించుకునేందుకు ఉపాయం చెప్తూ కృష్ణుడు బలి చక్రవర్తి కధ చెప్పి, ధర్మరాజును కూడా అలా లక్ష్మీ పూజలూ,దీపారాధనలూ చేయమంటాడు. బలి చక్రవర్తి కధ ఏమిటంటే :
వామనరూపంలో వచ్చినది విష్ణువు అని తెలిసి కూడా దానమిచ్చాడని, వామనుడు బలిని కోరిక కోరుకోమంటాడు. అప్పుడు బలి చక్రవర్తి ఆశ్వయుజ బహుళ త్రయోదశి నుంచీ అమావాస్య వరకూ మూడురోజులూ ప్రజలందరూ దీపారాధనలు చేసుకుని,అందువల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందేలాగ అనుగ్రహించమని కోరుకుంటాడు. అప్పటి నుంచీ మూడు రోజులూ లక్ష్మీపూజ చేసుకోవటం మొదలైంది.

ఈ రోజున ఆవునేతితో దీపం వెలిగించి శ్రీ సూక్తం చదువుకుంటే ఆర్ధికపరమైన ఇబ్బందులు ఉండవని అంటారు.

నరక చతుర్దశి:
నువ్వుల నూనె తలపై పెట్టుకుని తలంటు పోసుకోవాలి. కొందరు 'ఉత్తరేణి'ఆకులను కుడా తలపై పెట్టుకుని తలంటు పోసుకుంటారు.నరకాసురుడు మరణించిన రోజు ఇది.
ఈ రోజున మినపగారెలు తింటే మంచిదని అంటారు.

దీపావళి అమావాస్య:
ఈ రోజున సాయంత్రం దివిటీలు కొట్టడం ఒక సంప్రదాయం.(కారణం
ఇక్కడ ఈ టపాలో..)
మట్టి ప్రమిదలలో నువ్వులనూనెతో దీపాలు వెలిగించి, పూజా మందిరంలో,సింహద్వారానికి ఇరువైపులా,తులసి కోటవద్ద, వీధి గుమ్మం వద్ద ఉంచాలి. దీపాలకు నమస్కరించి,తరువాత టపాసులు కాల్చాలి.

గోవర్ధన పుజ:
ఈ రోజున గోపూజ చేస్తే ఎంతో పుణ్యమని అంటారు.

భగినీహస్తభోజనం:
ఆ రోజున అన్నదమ్ములు అక్కాచెల్లెళ్ళ ఇళ్ళకు వెళ్ళి భోజనం చేసి, వారికి కానుకలు ఇస్తారు. దీన్నే మనవారు "అన్నాచెల్లెళ్ళ భోజనాలు" అంటారు.

ఇక కొన్ని పురాణాలలో,పురాణగాధలలో "దీపావళి" గురించిన ప్రస్తావన :

* విష్ణు పురాణం ప్రకారం వామనుడు బలి చక్రవర్తి ని పాతాళానికి త్రొక్కగానే తిరిగి ఇంద్రుడు దేవతలకు రాజైన సందర్భంలో వారు ఆనందోత్సాహాలతో స్వర్గం లో దీపావళి జరుపుకున్నారు.

* ఉత్తర భారతంలో శ్రీరాముడు వనవాసానంతరం, అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడైన వేళ ప్రజలు దీపావళి జరుపుకున్నారు.

* కురుక్షేత్ర మహాసంగ్రామంలో విజయుడైన ధర్మరాజు పట్టాభిషిక్తుడైన వేళ ప్రజలు పట్టణమంతా దీపాలు వెలిగించి కాంతులు విరజిమ్మారుట.

* పద్మ పురాణం ప్రకారం క్షీరసాగర మధనం సందర్భంలో లక్ష్మీదేవి ఉద్భవించినప్పుడు దీపాన్ని వెలిగించటం ఆచారమైందని, అదే దీపావళి అని తెలుపుతుంది.

* కాళికా పురాణం ప్రకారం రాక్షస సంహారానంతరం కాళికాదేవిని లక్ష్మి, జ్యోతి రూపములతో ఆరాధించటం జరిగింది. దుర్వాసుడి శాప కారణంగా రాజ్యాన్ని కోల్పోయిన ఇంద్రుడు, విష్ణువు చెప్పిన విధంగా "జ్యోతి"ని లక్ష్మిగా ఆరాధించారు దేవతలు. అదే దీపావళి.



"దీపం జ్యోతి: పరంబ్రహ్మా దిపం సర్వ తమోపహారం
దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మీ నమోస్తుతే"


(ఈ పండుగ గురించి నేను చదివిన , విన్న విశేషాలు చెప్పాలని ఈ టపా రాయటం జరిగింది. 'లా పాయింట్లు ' తీస్తే సమాధానం రాయబడదు.)

Friday, October 16, 2009

దీపావళి జ్ఞాపకాలూ..





"దీపం పరంజ్యోతి కళాది నమో నమో
దీప మంగళ జ్యోతి నమో నమో.."
(పరం జ్యోతి అయిన దీపానికి నమస్కారం. శుభములను ఇచ్చే దీపానికి నమస్కారం)

****** *****


మీకు తెలిసిన పండుగ గురించి వ్రాయుము...

అని స్కూల్ పరిక్షల్లో ప్రశ్న ఉండేది...
ఆ తెలిసిన పండుగ తాలుకూ సమాధానం ఎప్పుడూ ఒకటే ...."దీపావళి అంటే దీపముల పండుగ.నరక చతుర్దశి రోజున నరకాసురుడు అనే రాక్షసుణ్ణి హతమార్చి.......etc..etc..etc.."


**** *****

"దుబ్బు దుబ్బు దీపావళి..మళ్ళీ వ
చ్చే నాగులచవితి.."

అంటూ గోగు కాడలతో(గోంగూర కొమ్మలు) మా పిల్లలతో అమ్మ దివిటీలు కొట్టించేది

(ఇది ఎందుకంటే దీపావళినాడు పితృదేవతలు సాయంసంధ్య తరువాత దక్షణ దిక్కు నుంచి వచ్చి తమ సంతానాల గృహాలను సందర్శిస్తారట .వారికి దారి కనిపించటం కోసం దివిటీలు కొడతారుట. దీనిని
"ఉల్కా దానం" అని కూడా అంటారుట.)

దివిటీలు కొట్టిన తరువాత చేతులు కాళ్ళూ కడుక్కుని, తీపి తినాలి. మేం గులాబ్ జామ్ ( ప్రతి దీపావళికి స్టేండెర్డ్ స్వీట్ ) తినేసి...బుద్ధిగా దేముడి దగ్గర కూర్చుని అమ్మతో పాటే "కర్మ అనే ప్రమిదలో, భక్తి అనే తైలం పోసి, ధ్యానమనే వత్తి వేసి, జ్ఞానమనే జ్యోతిని వెలిగిస్తున్నాను." అని చెప్తూ దీపాలను వెలిగించేవాళ్ళం.పల్చటి బట్టని చిన్న చిన్న వత్తులుగా చేసి, నువ్వులనునెలో ముందురోజు నానబెట్టి, వాటితో ప్రమిదలు వెలిగించేది అమ్మ.


ఇక ఆ తరువాత -- వారం రోజుల నుంచో, రెండు రోజులనుంచో...టపాకాయలు ఎండ పెట్టినప్పుడల్లా ఎప్పుడెప్పుడని తొందర పడే మనసు ఆగేది కాదు...నేనూ ,తమ్ముడు సుబ్భరంగా కొన్నవన్నీ కాల్చేసే వాళ్లం. నాగులచవితికి, కార్తీక పౌర్ణమికి కొన్ని దాచేది అమ్మ. కనబడితే వాటినీ కానిచ్చేస్తామని.
******** *********

ఎప్పుడన్నా అన్నయ్య దగ్గరకు ఊరు వెళ్తే, అక్కడ మా తాతమ్మ(నాన్నగారి అమ్మమ్మ) మతాబాలూ,చిచ్చుబుడ్లు, తారా జువ్వలు తయారు చేసేది. అబ్బురంగా ఆ చేసే విధానాన్ని చూసేవాళ్ళం.
************

కాలేజీ స్టేజి కొచ్చాకా కొంచెం జోరు తగ్గింది...ధరలు పెరిగాయి అని అర్ధం చేసుకుని ఏవో శాస్త్రానికి కొన్ని కొనుక్కునేవాళ్లం. చదువుల పేరుతో పిల్లలం దూరమయ్యాకా ఇక నే ఒక్కదాన్నే ఇంట్లో...ఏం కాలుస్తాంలే అనే నిస్తేజం వచ్చేసింది ఇంక. పైగా పెరుగుతున్న టపాసుల ధరలను చూస్తూంటే నోట్ల కట్టలను కాల్చుతున్నట్లే అనిపించేది నాకు. అంతకన్నా ఏదన్నా అన్నదానానికో, సేవా కేంద్రానికో ఇస్తే ఆ డబ్బు ఉపయోగపడుతుంది కదా అనే అభిప్రాయం ఏర్పడింది.

ఇప్పుడిక అదే భావం బలపడిపోయింది. వందకి ఓ చిన్న పెట్టెడు టపాసులు వచ్చిన రోజు నుంచి... ఒక కాకరపువ్వొత్తుల పెట్టె వందకి చేరుకున్న రోజులు వచ్చాయి. మూడంకెలు పెడితే గానీ ఓ మాదిరి బణాసంచా కొనుగోలు అవ్వదు ఇవాళ్టి రొజున. అయినా జనాలు వేలకి వేలు పెట్టి కొంటూనే ఉన్నారు..శాస్త్రానికి కొన్ని కాల్చవచ్చు.కానీ సరదాలకీ, ఆర్భాటాలకీ, పోటిలకీ పోయి వేలు ఖర్చుపెట్టి
స్కై షాట్స్, ఇతర ఔట్లు కొనటం కాల్చటం ఎంతవరకూ సమంజసమో మరి...
****** *******

ప్రస్తుతానికి మా పాప చిన్నదే కాబట్టి దాని సరదా అగ్గిపెట్టెలు,తుపాకీ రీలులతో పూర్తవుతోంది. రేపొద్దున్న అది పెద్దయ్యాకా అది కావాలి,ఇది కావాలి అంటే ఇప్పుడు ఇన్ని అనుకుంటున్న నేనే కొనాల్సిరావచ్చు....కాని ఏదన్నా చెప్తే విని అర్ధం చేసుకునే తెలివి దానికి ఉంది కాబట్టి నా అభిప్రాయానికి గౌరవం ఇస్తుందనే నమ్మకం. అంటే అసలు తపాసులే కొననని కాదండోయ్..మితంగా కొంటానని
చెప్పటం.
***** *******

మనం ఒక్కరోజే చేసుకుంటాము కానీ శాస్త్రీయంగా దీపావళిని అయిదు రోజులు చేసుకోవాలి. ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి అమావాస్య, గోవర్ధన పూజ, భగినీ హస్త భోజనం. ఉత్తరాదిన ఐదు రొజులూ జరుపుకుంటారు.
**********

ఇక పెద్దయ్యాకా దీపావళి ఎందుకు చేసుకుంటాము,
పురాణాలలో ఈ పండుగ ప్రాముఖ్యత ఏమిటి అన్నది తెలిసింది...
పురాణాలలో దీపావళి గురించి రేపు...


బ్లాగ్మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు.

Wednesday, October 14, 2009

నవతరంగం లో...


నవతరంగం లో నా మొదటి ఆర్టికల్ ఇక్కడ చూడచ్చు... :)

లేడిస్ టైలర్ లో రాళ్ళపల్లి "రావుగోపాల్రావు పక్కన్నేను...శోభన్ బాబు పక్కన్నేను..." అంటూ ఉంటారు..అలాగ

"కూడలి" లో నేను...
జల్లెడ "స్త్రీ బ్లాగులలో" నేను...
మొన్న "పుస్తకం" లో నేను...
ఇవాళ "నవతరంగం"లో నేను...
రేపు..ఎల్లుండి..మరో చోట కూడా ఉండచ్చు...

ఎంతెంత దూరం తీరం రాదా...


కొత్త సినిమా పాటల్లో బాగున్నవి వేళ్ళపై లెఖ్ఖ పెట్టుకోవచ్చు....నాకు నచ్చిన కొత్త సంగీత దర్శకుల్లో "హారిస్ జయ్ రాజ్" ఒకరు."చెలి" సినిమాలో పాటలు మొత్తం మూడు భాషల్లోనూ(హిందీ,తమిళ్,తెలుగు) కొని దాచుకున్నాను అవి వచ్చిన కొత్తల్లో. కొత్త "ఘర్షణ"లో ఏ చిలిపి కళ్లలోన కలవో" పాట, "ఘజినీ"లో "హృదయం ఎక్కడున్నది" ;ఆ తరువాత "సైనికుడు" సినిమాలోని ఈ పాట నాకు బాగా నచ్చుతాయి.ఈ పాట ఎందుకో నిన్నటి నుంచీ నోట్లో నానుతోంది...నాని నాని చలేస్తుందేమో అని(పాటకి) ఇలా బయటకు తీసి బ్లాగ్ లో వదులుతున్నాను....(ఈ సినిమాలో "ఓరుగాల్లుకేపిల్లా " పాట కుడా బాగుంటుంది .)



A లింక్ ఓపెన్ అవ్వాపోతే ఇది :
http://www.youtube.com/watch?v=KNNmGFX_amU
సంగీతం: హారిస్ జయ్ రాజ్
పాడినది: బాలు,ఉన్ని కృష్ణన్,కవిత సుబ్రహ్మణ్యం
రాసినది: కులశేఖర్

ఎంతెంత దూరం తీరం రాదా, ఇంకెంత మౌనం దూరం కాదా
ఏ నాడు ఏకం కావు ఆ నింగి నేల, ఈ నాడు ఏకం ఐతే వింతేగా
ఏ రోజు ఏమౌతుందో ఈ ప్రేమ గాధ, నీ వైపు మళ్ళిందంటే మాయేగా

మాయేరా మాయేరా ప్రేమ అన్నదీ మాయే లేరా,
ఊరించే ఊహా లోకం లేరా
మాయేరా మాయేరా రంగురంగులు చూపేదేరా,
రంగంటూ లేనే లేదు లేరా llపll

ఊహల్లో ఊసుల్లో ఆ మాటే,ఓసోసి గొప్ప ఏముంది గనక,
తానంటూ నీ వెంటె వుందంటే
ఆ ఎండ కూడా వెండి వెన్నెలవదా
అవునా అదంత నిజమా,
ఏదేది ఓసారి కనపడదా
ఇలలో ఎందెందు చూసినా,
అందందునే వుంటుందిలే బహుశా

మాయేరా మాయేరా ప్రేమ ఎక్కడో లేదు లేరా
నీ చెంతే వుండే దూరం లేరా
హాయేలే హాయేలే ఎల్లలన్నవీ లేనే లేవే
ప్రేమిస్తే లోకం మొత్తం హాయే....

ప్రేమిస్తే ఎంతైనా వింతేలే,నువ్వెంత చెప్పు గుండేల్లో గుబులే
ఈడొస్తే ఏదైనా ఇంతేనా,ఇంతోటి తీపి ఏమున్నదైనా
సెలవా నా మాట వినవా,ఏనాడూ ప్రేమలో పడవా
నిజమ ఈ ప్రేమ వరమా,కల్లోనైన ఊహించని మహిమా
మాయేరా మాయేరా ప్రెమ అన్నది మాయే లేరా
ఇద్దరిలోనా ఇంద్రజాలం లేరా
హాయేలే హాయేలే ఎల్లలన్నవి లేనే లేవే
ప్రేమిస్తే లోకం మొత్తం హాయే....

ప్రేమిస్తే ఎంతైనా వింతేలే,నువ్వెంత చెప్పు గుండెల్లో గుబులే
ఈడొస్తే ఏదైనా ఇంతేనా,ఇంతోటి తీపి ఏమున్నదైనా
సెలవా నా మాట వినవా, ఏనాడూ ప్రేమలో పడవా
నిజమా ఈ ప్రేమ వరమా, కల్లోనైన ఊహించని మహిమా
మాయేరా మాయేరా ప్రేమ అన్నది మాయే లెరా

మాయేరా మాయేరా ప్రెమ అన్నది మాయే లెరా
ఇద్దరిలోనా ఇంద్రజాలం లేరా
హాయేలే హాయేలే ఎల్లలన్నవి లేనే లేవే
ప్రేమిస్తే లోకం మొత్తం హాయే....


Sunday, October 11, 2009

పుస్తకం లో నా మొదటి పుస్తక పరిచయం..



“ఆంధ్రప్రభ” దినపత్రికను మా ఇంట్లో చాలా ఏళ్ళు తెప్పించారు. వార్తలే కాక వీక్లీ కాలమ్స్ , డైలీ సీరియల్స్, పిల్లలకు బొమ్మల సీరియల్స్ ఇలా చాలా ఉంటూండేవి పేపర్లో. కుప్పిలి పద్మగారి రచనలు కూడా ఆంధ్రప్రభలోనే మొదటిసారి చదివాను.ఇవి కాక 13-12-98 నుండి 16-7-99 వరకూ, అంటే మొత్తం ఎనిమిది నెలలపాటు, మేము ప్రతి శుక్రవారం పేపర్ కోసం ఎదురు చూసే వాళ్ళం. వాడ్రేవు వీరలక్ష్మిగారి “కాలమ్స్” కోసం ! ఆ పేపర్ కట్టింగ్స్ అన్నీ దాచేవాళ్ళం. 2001లో ఆ కాలమ్స్ అన్నీ ఒక పుస్తక రూపంలో అచ్చయ్యాయి.ఆ పుస్తకమే “ఆకులో ఆకునై….”

pustakam.net లో నా మొదటి పుస్తక పరిచయవ్యాసాన్ని   క్రింద లింక్ లో చదవచ్చు:

 http://pustakam.net/?p=2204


(పూర్ణిమగారు లింక్ పెట్టచ్చు అని చెప్పారు కానీ మొదటిసారి నా "పరిచయాన్ని" చదువుకునే ఆనందంలో...నా మట్టి బుర్రకి ఆ సంగతి అర్ధం కాలేదు...ఇప్పుడు మురళిగారు చెప్పాకా మళ్ళీ మైల్ చూస్తే..అర్ధం అయ్యింది..:)

పుస్తకాలు..అభిరుచులు...


మద్రాసు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో "డిప్లొమో ఇన్ ఫిల్మ్ టెక్నాలజీ(1965-68)" చదివారు నాన్న. 1968లో "INDIAN FILM MUSIC" మీదThesis సమర్పించి ఆ ఏటి "Best student Award" కుడా సంపాదించుకున్నారు.Student best film "The House" కధా రచయితగా AVM చెట్టియార్ గారి హస్తాలమీదుగా ప్రధమ బహుమతి అందుకున్నారు. మనమొకటి తలిస్తే,దైవమొకటి...అన్నట్లుగా నాన్న సినీ ఫిల్డ్ లోకి అడుగు పెట్టడం కుదరలేదు...కానీ తాను అడుగు పెట్టిన ఫీల్డ్ లో మాత్రం "The best" గా తనదంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. అడుగు పెట్టిన మాధ్యమం కోసం తన శక్తిని,మేధస్సుని,కష్టాన్ని ధారపోసారు...పది జాతీయ బహుమతులను అందుకున్నారు.ప్రసార మాధ్యమంలో తన డెసిగ్నేషన్లో అలా పది జాతియ బహుమతులు అందుకున్న ఏకైక వ్యక్తి నాన్న ఒక్కరే!!ఒక "ట్రెండ్ సెట్టర్"గా "ఉగాది తెలుగు పురస్కారాన్ని" కూడా అందుకున్నారు.

ఇప్పుడు నేను చెప్పబోయేది నాన్న గురించి కాదు...అది వేరే పెద్ద కధ.నాకు పుస్తకాలు,సంగీతం మొదలైన అభిరుచులు ఎలా వచ్చాయో,మా ఇంటి వాతావరణం ఎలా ఉండేదో చెప్పటానికి ఇదంతా రాసాను.మా ఇంట్లో ఉన్న ఇటువంటి వాతావరణం వల్ల, ఇంట్లో ఎప్పుడూ పుస్తకాలు, కేసెట్లు, సంగీతం, సినిమాలు ..ఇవే కబుర్లు.మాకింకో ప్రపంచం తెలియదు.ఇవే మా నేస్తాలు.నాన్న film institute లో ఉన్నప్పుడు కొనుక్కున్న పుస్తకాలు చాలా ఉండేవి మా ఇంట్లో..మేమెవరం ఇంట్లో లేనప్పుడు ఒకరోజు అనుకోకుండా ఒక అగ్ని ప్రమాదం జరిగి మొత్తం పుస్తకాల రేక్ మొత్తం తగలబడి పోయింది...అదృష్టవశాత్తు మా అమ్మ క్షేమంగా బయట పడింది.

ఆ తరువాత మళ్ళీ నెమ్మదిగా కొన్ని కొన్ని చప్పున కొన్నారు కానీ ఆ పోయిన పుస్తకాలు చాలా వరకు దొరకలేదు పాపం నాన్నకు.ఇప్పుడు మళ్ళీ కొన్ని వందల పుస్తకాలు పొగేసారు..!! అవన్నీ చదవటానికి నా జీవితకాలం సరిపొదు.అసలు నాన్న సంపాదించిన 3000 దాకా ఉన్న కేసట్లనే నేను ఇంతదాకా అన్నీ వినలేదు...తెలుగు, హిందీ, ఇంగ్లీషు, తమిళ్, instrumental, westren clasical, బీథోవెన్, వివాల్డి, కర్ణాటక్, హిందుస్తానీ.. ఇలా సంగీతంలో ఉన్న రకాలన్నీ మా నాన్న దగ్గర ఉన్నాయి.

ఇవే మా ఆస్తి...మేము ముగ్గురమూ అంటుంటాము..వీటి కోసమే మేము దెబ్బలాడుకుంటాము అని.మా అభిరుచులన్ని నాన్న నుంచి సంక్రమించినవే..తనకు తెలిసిన మంచి మంచి సినిమాలన్నీ, అన్ని భాషలవీ చూపించేవారు మాకు.ఇక ఇంట్లో ఉన్న రకరకాల పుస్తకాల వల్ల చదివే అలవాటు వచ్చింది నాకు.

నాకు చదవటం వచ్చాకా దొరికినవి, నాకు అర్ధమయ్యేవి చదువటం మొదలెట్టాను.చిన్నప్పుడు నవలలు చదువుతున్నాననీ మా అమ్మ అవన్నీ దాచేసేది.ఒక వయసు వచ్చేవరకు పిల్లలు ఆ పుస్తకాలు చదవకూడదు అని అమ్మ ఉద్దేశం. కానీ మనం ఆగిందెక్కడ..శెలవు రొజుల్లో అమ్మ నిద్రపోయినప్పుడు దాచిన చోట్లు కనిపెట్టి మరీ పుస్తకాలు చదవేసేదాన్ని.అందుకని వారపత్రికలు కొనటం ఆపేసింది.అయినా ఇంట్లో నవలలు తక్కువే.కృష్ణశాస్త్రి, చలం, శరత్ సాహిత్యం, శ్రీరమణ,బాపు-రమణల పుస్తకాలూ, తెలుగు భాష, సంస్కృతికి సంబంధించినవి, సినిమాలకు సంబంధించినవి, కొన్ని కవితా పుస్తకాలు..ఇలా కొన్ని సెలెక్టెడ్ పుస్తకాలు కొనేవారు నాన్న. కొన్ని సినిమా కధల పుస్తకాలు నవలల్లా ఉండేవి.సినిమాలు చూడకపోయినా ఆ పుస్తకాలు మళ్ళీ మళ్ళీ చదివేదాన్ని.బాగా డైలాగులతో సహా బట్టీ వచ్చేసేంతగా...!! ముత్యాల ముగ్గు, త్యాగయ్య, గోరంత దీపం, రాధా కల్యాణం, సీతాకోకచిలుక, శంకరాభరణం..మొదలైనవి.

ఇక శెలవుల్లో పిన్ని,పెద్దమ్మల ఇళ్ళకి వెళ్ళినప్పుడు కోడూరి కౌసల్య, యద్దనపూడి,యండమురి,మల్లాది మొదలైన వాళ్ళ రచనలు వాళ్ళిళ్ళలోనే చదివాను.కాలేజీలోకి వచ్చాకా నేనూ నా చిరు సంపాదనలవల్ల,విజయవాడ బుక్ ఫెస్టివల్స్ వల్ల నా సొంత మొదలైంది..నాన్నవి కాక నేనూ నాకిష్టమైన పాతల సేసెట్లు కొనటం మొదలుపెట్టాను...పెళ్లయాకా...అందరిలానే సంసారంలో మునిగిపోయాను..ఇప్పటిదాకా మళ్ళీ ఆ అభిరుచులకి బ్రేక్ పడింది...!మళ్ళీ ఇదిగో ఇన్నేళ్ల తరువాత ఈ బ్లాగ్ పుణ్యాన..నా ప్రియ నేస్తాలైన పుస్తకాలను మళ్ళీ తెరిచి చదవటం మొదలెట్టాను...!!

Friday, October 9, 2009

its cartoon time..!!


పొద్దున్నే స్కూలుకెళ్ళే ముందు అన్నం తింటూ, నేను దాని కోసం డౌన్లోడ్ చేసిన కార్టూన్లు చూడటం మా పాపకి అలవాటు.
(టి.వి. అలవాటు చెయ్యటం మాకు ఇష్టం లేక అలవాటు చెయ్యలేదు.)
ఇవాళ "chip n dale" చూస్తూ మా పాప అంది.."అమ్మా,నీ బ్లాగ్ లో popcorn కర్టూన్ పెట్టమ్మా..." అని.ఆశ్చర్యం,ఆనందం రెండూ కలిగాయి...బ్లాగ్ లో రొజూ ఏదో రాస్తానని దాని చిన్న బుర్రకి అర్ధం అవ్వటమే కాక,ఇది పెట్టు అని నాకు సలహా కూడా ఇస్తోంది...అబ్బా,నా కూతురు పెద్దదైపోతోంది అని సంబరం కలిగింది...
మా పాప కోరిక మీద ఈ కార్టున్ ....ఇది నాక్కూడా చాలా ఇష్టమైనది...


Thursday, October 8, 2009

గుండె ధైర్యం..

కొన్ని పరిస్థితులను, కొన్ని విషయాలను వినటానికే కాదు; కొన్ని సందర్భాల్లో "స్పందించటానికి" కూడా కొంత గుండెధైర్యం అవసరం.అది ఒక్క రోజులో రాదు...కాలాన్ని,పరిస్థితులను బట్టి మనిషిలో స్థిరత్వాన్ని ఏర్పర్చుకుంటుంది.ఇప్పుడది నాలో కొంతైనా ఉంది....దానికి సంబంధించి కొన్ని జ్ఞాపకాలు....

డిగ్రీ చదివే రోజుల్లో ఒక శెలవుదినాన నేను నా స్నేహితురాలి ఇంటికి వెళ్ళాను.తను బయటకు వెళ్తోంది.
."ఎక్కడికి?" అని అడగకూడదు కాబట్టి అడగలేదు."నాతో వస్తావా?" అంది.అలాగేనని తలఊపాను.
"మీ ఇంట్లో పాత బట్టలు ఏమైనా ఉన్నాయా?" అంది. "ఊ " అన్నా."పద మీ ఇంటికి" అంది.మళ్ళీ వెనక్కి మా ఇంటికి వెళ్ళాం. నా డ్రెస్సులు,అమ్మ చీరలు కొన్ని తీసుకుని బయల్దేరాం. "అక్కడ నువ్వేమీ ఫీలయిపోకూడదు.." ముందుగానే చెప్పింది. అర్ధం కాలేదు.

"నువ్వు గోరింటాకు బాగా పెడతావు కదా,అక్కడ అవసరం ఉంటుంది" అని 2,3 మెహందీ కోన్స్ కొంది దారిలో.
రిక్షా దిగి చూసాను.."నిర్మల్ హృదయ్ భవన్"(the house for mentally handicapped and physically handicapped) అని రాసి ఉంది.తను,వాళ్ళ ఫామిలీ అక్కడికి రెగులర్గా వెళ్తూంటారు.నాకు తెలుసు.లోపలికి వెళ్లగానే కొందరు పిల్లలు "అక్కా.." అని తనని చుట్టుముట్టారు."ఇదిగో మా ఫ్రెండ్ గోరింటాకు బాగా పెడుతుంది కావాల్సినవాళ్ళు పెట్టించుకోండి" అని వాళ్ళతో చెప్పి ,మేము తెచ్చినవి తీసుకుని తను లోపలికి వెళ్ళింది.వెళ్తూ వెళ్తూ, నా వైపు చూసి "నువ్వు పని అయ్యాకా ఇక్కడే ఉండు.లోపలికి రాకు".అంది.మళ్ళీ అర్ధం కాలేదు...

సరే,నా పనిలో నే పడ్డా.దొరికిన చేతులన్నింటికీ గోరింటాకు పెట్టడం నాకు చాలా ఇష్టమైన పని.తెచ్చిన మెహందీ కోన్లు అయిపోయాయి.పిల్లలంతా వెళ్ళిపోయారు.నా ఫ్రెండ్ ఇంకా లోపల్నుంచి రాలేదు.సందేహపడుతూనే తలుపు తెరుచుకుని లోపలికి వెళ్ళాను...నా గుండె ఆగిపొయింది కాసేపు... physically and mentally handicapped పిల్లలు బోలెడు మంది...నా స్నేహితురాలు ఒక చిన్న పిల్లవాడిని ఎత్తుకుని ఆడిస్తోంది..ఆ పిల్లవాడికి ముక్కు ఉండాల్సిన చోట పెద్ద కన్నంలా ఉంది...చుట్టూరా అలాంటి పిల్లలే...ఎవరు కన్న బిడ్డలో...చూడలేకపోయాను...!పరుగున బయటకు వచ్చి నించున్నా...

నా కళ్ళల్లో నీళ్ళు ఆగటం లేదు...ఐదు నిమిషాల్లో నా ఫ్రెండ్ వచ్చింది.."నేను రావద్దన్నాను కదా,ఎందుకు లోపలికి వచ్చావు?" అంది కన్నీళ్ళు నిండిన నా మొహంలోకి చూస్తూ....అప్పుడర్ధమైంది తను నాకు ఎందుకు రావద్దని చెప్పిందో..!ఆ సమయంలో నాకు తనొక కొత్త వ్యక్తిలాగా,తను ఒక పెద్ద శిఖరం మీద ఉన్నట్లూ,నేను పాతాళంలో ఉన్నట్లూ అనిపించింది.డబ్బు,బట్టలు లాంటి సహాయాలు అందరూ చేస్తారు...అదేమ్ గొప్ప కాదు...కానీ చూడటానికే భయం వేసే వాళ్ళ దగ్గరకు వెళ్ళి, ఆప్యాయంగా వాళ్లను అక్కున చేర్చుకున్న తన పెద్ద మనసుకు మనసులోనే జోహార్లు చెప్పాను...ఎందుకంటే నాకు ఆ సమయంలో మాటలు రాలేదు...

బయటకు వచ్చి నడుస్తున్నాము...నేను తల వంచుకుని ఆలోచనల్లో ములిగిపోయాను..."హలో మేడం..ఎక్కడికి వెళ్ళిపోయావు?వెనక్కు వచ్చేయ్...ఆ గేటుతోనే అది మర్చిపోవాలి" అంది.ఆ తరువాత నన్ను మౌనంగా వదలకుండా ఇంటికి వెళ్ళేదాకా ఏవో కబుర్లు చెప్తూనే ఉంది...!! ఆ రోజు నాకనిపించింది...నిజంగా నాకు గుండెధైర్యం లేదు..అని...!

కానీ ఆ తరువాత జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల నాకు కొంతైనా అది ఏర్పడిందనే అనుకుంటున్నాను.ఎందుకంటే 15ఏళ్ళ క్రితం మాకు అత్యంత సన్నిహితుడైన మా మేనమామ కేన్సర్ వ్యాధితో నరకయాతన అనుభవించటం కళ్ళార చూసాను.ఆయన కన్ను మూసినప్పుడు దగ్గరే ఉన్నాను...!పన్నెండేళ్ళ క్రితం మా నాన్నమ్మ చనిపోయినప్పుడు..కటకటాల గదిలో ఆవిడను పడుకోబెట్టినప్పుడు...తెల్లారి జనాలందరూ వచ్చేదాకా గడపకు ఒక పక్క అమ్మ,మరో పక్క నేను...రాత్రంతా మేమిద్దరమే...నిర్జీవమైన ఆవిడ శరీరం దగ్గర కుర్చునే ఉన్నాం!! అప్పుడు నాలో కించిత్తైనా భయం కలగలేదు...

రెండేళ్ళు అనారోగ్యంతో నానా యాతనా పడి, క్రితం ఏడు మా మామగారు కాలం చేసినప్పుడు....అంతక్రితం రెండు నెలలు బెడ్ రెస్ట్ లో ఉన్న నేను... నిలబడ్డాను...! మరి "పెద్ద కో్డలిని"...వయసు లేకపోయినా, బాధ్యత తెచ్చిన పెద్దరికం అది...అలా నాకెదురైన పరిస్థితులు నాలో కొంతైనా గుండె ధైర్యాన్ని తెచ్చాయి....ఎప్పుడైనా వెనక్కువాలి ఆలోచనల్లోకి వెళ్ళినప్పుడు...కాలం తెచ్చిన మార్పంటే ఇదేనేమో మరి అనిపిస్తూ ఉంటుంది...!!

Tuesday, October 6, 2009

చిరు సహాయం ఇచ్చిన సంతృప్తి.....!!

ఇల్లేది...పల్లేది...ఈ కుటుంబానికి దిక్కేది?
నీటిపాలైన సంసారానికి చుక్కానేది?

ఉన్నపళంగా నిరాశ్రయమైన పల్లెలెన్నో..?!
కుటుంబ సభ్యులను కోల్పోయిన కుటుంబాలెన్నో...?!
నీటిపాలైన గద్వాల్ చేనేత కార్మికుల భవిష్యత్తు బాగుపడేనా...?
నష్టపోయిన రైతులూ,వ్యాపరస్తులూ తిరిగి ఆ నష్టాన్ని భర్తీ చేసుకోగల్గుతారా..?
సహాయ కార్యక్రమాలూ,నిధులూ సక్రమంగా బాధితులకు అందుతున్నాయా...?
చీకటైన ఆ బ్రతుకులలో వెలుగు కాకపోయినా చిరు దీపమైనా వెలిగేనా...?

..ఇలా ఎన్నో..ఇంకెన్నో ప్రశ్నలు...ప్రశ్నలూ...
అంతుచిక్కని ఆలోచనలూ...టి.వి.లో శవాలు,కూలిపోయిన ఇళ్ళూ,నీట మునిగిన ఊళ్ళూ,పొలాలూ....
వై.యస్ గారితో పాటు ఐదుగురు మనుషులు దయనీయ స్థితిలో నిర్జీవులైపోతే ఎంతో బాధ పడ్డాం...మరి లక్షల జనాల జీవితాలు ఇవాళ తలక్రిందులైపోతే ఇంకెంత బాధ....ఒక మహా బాధ మనసుని దొలిచేస్తోంది..
మూడు రోజుల్నుంచీ మధ్యరాత్రి మెలుకువ వచ్చేస్తోంది...నిద్రే పట్టదు...
అయ్యో,ఆ వార్తల్లో కనిపించిన శవాలు ఎవరివో....ఎవరి బిడ్దో...ఎవరి తల్లో....ఎవరి అన్నో...

"భూమిపై పాపం పండిపోయినప్పుడు,భూమి భారం పెరిగిపోయినప్పుడూ
ఇలాంటి విపరీతాలు జరుగుతూంటాయి...
ప్రకృతి ప్రళయరూపం దాలుస్తూంటుంది" అని ఎక్కడో చదివిన గుర్తు..!
ఇది ఎవరి పాపం?ఎవరి శాపం?
పాపం ఎవరిదైనా ఇవాళ భరిస్తున్నది దీన అమాయక జనం...

భార్యలకూ,ప్రేమికురాళ్ళకూ కోట్లు,లక్షలు విలువ చేసే బహుమతులు అందజేసే వ్యాపారవేత్తలూ,ప్రముఖులూ,ధనవంతులూ ఇటువంటప్పుడు ఈ బాధితులకు

పెద్ద మొత్తాలలో సహాయం చెయ్యగలిగితే మానవత్వం నిలబడుతుందని నా అభిప్రాయం..!!
మరి నేను..?
వీరికి నేనేం చెయ్యగలను..?ఏదైనా చేయాలి...
చిన్నపిల్లని,సంసారన్నీ వదిలి ఆ ప్రాంతాలకు వెళ్ళి సహాయం చెయ్యలేను....
కానీ బాధ్యత గల పౌరురాలిగా చిరు సాయమైనా చేయాలి అనిపించింది...
ఒక సామాన్య మధ్యతరగతి గృహిణిగా పెద్ద సహాయాలేమీ చెయ్యలేను..
అయినా నాకు తోచిన చిన్న సాయం నేనూ చేసాను...

సహాయం నేరుగా బాధితులకు అందుతుంది అని నమ్మకం ఉన్న ఒక సేవా సంస్థకు నా దగ్గర ఉన్న కొంత డబ్బుని,కొన్ని కిలోల బియ్యాన్ని,మూడు సంచుల బట్టలను పట్టుకెళ్ళి ఇచ్చివచ్చాను.
ఇది చాలా చాలా చిన్న సహాయం...కాని ఇలాంటి చిన్న సహాయాలన్నీ కలసి ఒక "పెద్ద సహాయం" అవుతుంది అని నా నమ్మకం.
ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది....నేనూ నా వంతు బాధ్యత నేను నెరవేర్చాను అన్న సంతృప్తి నాకు కలిగింది.

ఇదంతా నేను ఏదో చేసేసాను అని చెప్పుకోవటం కోసం రాయటంలేదు...ఒకోసారి మనం చేసే చిన్న చిన్న పనులు కూడా మనసుకు ఎంతటి సంతృప్తిని,ఆనందాన్ని కలిగిస్తాయో చెప్పటం కోసం రాస్తున్నాను...నా ఉడుతా సహాయం వల్ల నాకు కలిగిన సంతృప్తిని,ఆనందాన్ని పంచుకోవటం కోసం రాస్తున్నాను..!!

Sunday, October 4, 2009

ఎంతో జన నష్టం ...
అంచనాలకందని ఆస్తి నష్టం...
గల్లంతైన జీవితాలూ...
హఠాత్తుగా మాయమైన చిరునవ్వులూ...
ఈ నేపధ్యంలో కులాసాగా టపాలు రాసేందుకు మనస్కరించటం లేదు...
నిన్న పోస్ట్ పెట్టినందుకే చాలా సిగ్గుగా ఉంది...
నిన్న పొద్దున్నే టి.వి.పెట్టి ఉంటే పోస్ట్ పెట్టకపోదును...
anyways, there wont be any posts in this blog till situation calmsdown...
and iam not activating comment mode for this post as this is only a note..!

Saturday, October 3, 2009

కొత్తసినిమా...తలనెప్పి..!!

అదివరలో...ఫస్ట్ డే ఫస్ట్ షో లు కొన్ని చూసాకా..టాక్ రాకుండా కొత్త సినిమాలు చూసి తల బొప్పి కట్టించుకోకూడదు అని ఒక నిర్ణయానికి వచ్చాను.కానీ ఒకోసారి విధి వక్రించడం వల్ల ఆ నిర్ణయన్ని మార్చుకుని కొత్త బొప్పెలు కట్టించుకోవటం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది.నిన్న శెలవు వల్ల ఇంట్లో శ్రీవారు ఎదురుగా ఉండేసరికీ కొత్త సినిమా చూడాలనే దుర్భుధ్ధి పుట్టింది.(మొగుడ్స్,పెళ్ళాంస్ ని వదిలి ముగ్గురం సినిమా చూసేద్దాం అని రెండు నెలల క్రితం అన్నదమ్ములతో కలిసి "అడివి"లోకి వెళ్ళొచ్చాకా అయినా బుధ్ధి రాలేదు..)"సినిమా" అన్న పదంలో ఉన్న మాయ అల్లాంటిది.

వచ్చిన తలనెప్పి వివరాలు:

తలనెప్పి 1)క్యూ లో నించునే రోజులు పోయాయి కాబట్టి,నెట్ లో శెలవురోజు కాబట్టి వెతికి వెతికి,సిట్లు ఖాళీ ఉన్న ఓ సినిమాకు టికెట్ బుక్ చెయ్యటం ఒక తలనెప్పి.

2) సినిమా అంటే ఓ లుక్ ఇచ్చే అయ్యవారిని ఒప్పించటం,కూర్చున్న రెండు గంటల్లోనూ 200సార్లు అసహనంగా కదిలే ఆయన మూమెంట్స్ గమనించుకుంటూ,చీకట్లో కూడా స్పష్టంగా కనిపించే ఆ తీవ్రమైన అసహనపు ఎక్ష్ప్రెషన్స్ గట్రా ఒక తలనెప్పి..! (అయినా,నా కోసం ఇంత భరిస్తున్నారనే ఆనందం లోపల్లోపల..)

3)సినిమాలకు పాపని తిసుకెళ్లకూడదు అనే నిర్ణయం మాకున్నందువల్ల,ముందు "అటు" వెళ్ళి పాపని దింపి,మళ్ళీ టైంకి సినిమా మొదలవ్వకుండా వెళ్ళడానికి;సినిమా మధ్యలో వచ్చిన ఫొన్ కాల్స్ వల్ల అది అయ్యాకా మళ్ళీ పాప కోసం "అటు" వెళ్ళడానికి మొత్తం 3ఆటోలు ఎక్కాల్సి వచ్చినందుకు బాధతో నిండిన తలనెప్పి...


4) ఇక ఇవన్నీ పక్కన పెట్టి కధలోకి వస్తే...ఎక్కువ ట్విస్ట్ లు పెట్టి ప్రేక్షకుడి ఆలోచనా శక్తిని పరీక్షించే ప్రయత్నాలు ఈ మధ్య కొత్త సినిమాలన్నింటిలో జరుగుతున్నాయి.మొదటి సన్నివేశాన్ని బట్టి క్లైమాక్స్ ఊహించుకునే స్థాయికి ప్రేక్షకుడు వచ్చేసాడని తెలుసుకున్న కధా రచయితలు,తమ చాకచక్యంతో జనాలు ఊహించలేని మార్పులను కధల్లోకి చొప్పిస్తున్నారు.ఓహో ఇలా కూడా జరగొచ్చన్నమాట అని మనం సర్దుకుపోయిన సందర్భాలూ,ఇష్టం వచ్చినట్లు కధను మార్చేస్తే చూస్తున్న ప్రేక్షకుడు ఏమవ్వాలి అనే కోపం వచ్చిన సందర్భాలు ఎక్కువే..!!

5)సినిమా అయ్యాకా పాప కోసం అమ్మావాళ్ళీంటికి ఒక్కర్తినీ ఆటోలో వెళ్తూంటే ,ఆటోఅతను సరిగ్గా తిసుకెళ్తాడా?పాటలెందుకు పాడతాడు?మొంచివాడో కాదో?రొడ్డు మీద సెలవు వల్ల ట్రాఫిక్ లేదు..బస్సెక్కాల్సిందేమో..?అని బోలెడు ప్రశ్నలూ.ఇల్లు దగ్గర పడేదాకా అదో తలనెప్పి..

6)అన్నింటిని మించి సినిమా కధో పెద్ద తలనెప్పి..ఇక నిన్నటి కధలోకి వస్తే,చాలా డౌట్లు..
అసలూ...ఒక ప్రేమికుడూ,ప్రేమికురాలూ ఉన్న మనిషికి మళ్ళీ ఎందుకు మరో వ్యక్తి పట్ల ఆసక్తి కలగాలి?అన్నది ప్రాధమిక ప్రశ్న.


కలిగిందే పో,అలా కలిగిన ఆసక్తిని ఇంకా ఇంకా పొడిగించి అది "ప్రేమే" అని చూట్టూ ఉన్నా పాత్రల ద్వారా పదే పదే చెప్పించి,మనల్ని నమ్మించే ప్రయత్నం కధకుడు ఎందుకు చెయ్యాలి?

నమ్మించారే పో,ఆ కొత్తగా పుట్టిన ప్రేమకి లాజిక్కులూ,కారణాలు ఉండవా?3 నెలలు ఒకే చొట పని చేస్తే,పక్కపక్కనే ఉంటే, పాత ప్రేమికులని మర్చిపోయి పక్కనే కనబడే వాళ్ళని ప్రేమించేసేంత బలహీనమైనదా వాళ్ళ ప్రేమ?

యువతా ఇలానే ఉన్నారు అని చూపించే సెటైరా ఇది?

పోనీ ఏదో ఒకటి,ఈ రెండోదే నిజమైన ప్రేమేమో అని మనం నమ్మే ప్రయత్నంలో ఉండగా,కాదు కాదు మొదటిదే అసలైనది అని మనల్ని కంఫ్యుజ్ చేసేస్తాడు కధారచయిత.

అసలు కధలోకి మరో పెద్ద హీరో ఎందుకు?సమస్యను చెప్పుకోవటానికి ఆ పెద్ద హీరో ఎమన్నా "లవ్ గురూ"నా?తనది ప్రేమో ఆకర్షణో తానే అర్ధం చేసుకోలేని వ్యక్తికి ప్రేమ అవసరమా?

సరే అంతా అయ్యి, విమానం దిగగానే వాళ్ల వాళ్ళ ప్రేమికులు వచ్చి "ఎంత మిస్సయ్యానో" అని గట్టిగా కౌగిలించుకునే సరికీ,అప్పటిదాకా "ధక్ ధక్" అని కొట్టుకున్న వాళ్ళ వళ్ళ మనసులు రుట్ మారిపోయి పాత ప్రేమికుల వైపు వెళ్ళిపోతాయి..!

మరి అంతదాకా మనకు చూపించిన వేదన,బాధా,ప్రేమ,ఆరాటం అన్నీ తూచ్చా?(ప్రేక్షకులు వెర్రిమొహాలు అని ఎర్రాటి అక్షరాల్లో చూపించటం అన్నమాట.)వాళ్ళు రాసిన ఉత్తరాల్ని చింపేసి,"హ హా హా " అని హాయిగా మనసారా నవ్వేసుకుంటూంటే..జుట్టు పీక్కోవాలని అనిపించని వాడు ప్రేక్షకుడే కాదని నా అభిప్రాయం.

7)ఇక సినిమాలో పాటలు,సందర్భోచితమా కాదా అన్న సంగతి నే చెప్పకపొవటమే బెటర్..చెబితే అవి నచ్చిన వాళ్ళతో అదో తలనెప్పి...!

8)ఇంటికి వచ్చి "కధ చెబుతా..కధ చెబుతా" అని(మైఖేల్ మదన కామరాజులో పాట లాగ)ఎంత శ్రీలక్ష్మిలాగా ప్రయత్నాలు చేసినా ఎవరూ వినరేమిటో....!అయినా మొదలెట్టాను"ఇద్దరమ్మాయూ,ఇద్దరబాయిలూ,వాళ్ళలో ఒక అమ్మాయి,ఒక అబ్బాయి విమానం ఎక్కుతారు..."వద్దు బాబోయ్ ....ఆపవే బాబూ...అని అందరూ...కెవ్వున...కేక..!

9)అలా కధ నోట్లోంచి బయటకు రాక రాత్రంతా పెద్ద తలనెప్పి...!!

10)తలనెప్పిల్లో ఇన్ని రకాలా అని టపా చదివిన వారందరికీ కొత్త తలనెప్పి..!?!

(ఇంతకి సినిమా పేరేమిటో...అబ్బ ఆశ,దోశ..చెప్పేస్తాననే..)

Friday, October 2, 2009

అతడు నడిచిన దారిలో...


"అతడు నడిచిన దారిలో బ్రతుకు పూలు
ప్రజల కన్నుల తోటల పరిమళించి
ఆతడొరిగిన వెనువెంట పూతరాలి
మౌన హేమంతమను పొగమంచు మిగులు..."

(2004 ఆకాశవాణి వార్షిక పోటీల్లో జాతీయ బహుమతి పొందిన "నిశ్శభ్దం-గమ్యం" అనే శ్రీరామమూర్తి గారి సృజనాత్మక కార్యక్రమంలో ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు గాంధీగారిపై రాసిన వాక్యాలివి)
************* *************** **********************
ఇది ఒక ఆర్టిస్ట్ గాంధీ గారి బొమ్మఎలా వేసారో తెలుపుతున్న వీడియో...
speed painting Mahatma GANDHI by Martin Missfeldt








***************** *********************
" దొంగరాముడు"చిత్రంలో నాకు ఇష్టమైన గాంధీతాత పాట....






భలే తాత మన బాపూజీ, బాలల తాతా బాపూజీ
భలే తాత మన బాపూజీ, బాలల తాతా బాపూజీ
బోసినవ్వుల బాపూజీ, చిన్నీ పిలక బాపూజీ

కుల మత బేధం వలదన్నాడు, కలిసి బతికితే బలమన్నాడు,
మానవులంతా ఒకటన్నాడు,మనలో జీవం పోసాడు
భలే తాత మన బాపూజీ, బాలల తాతా బాపూజీ

నడుం బిగించి లేచాడు, అడుగూ ముందుకు వేశాడు
కదం తొక్కుతూ పదం పాడుతూ, దేశం దేశం కదిలింది
గజగజలాడెను సామ్రాజ్యం, మనకు లభించెను స్వరాజ్యం
మనకు లభించెను స్వరాజ్యం
భలే తాత మన బాపూజీ, బాలల తాతా బాపూజీ


సత్యాహింసలే శాంతి మార్గమని, జగతికి జ్యోతిని చూపించాడు
మానవ ధర్మం బోధించాడు,మానవ ధర్మం బోధించాడు
మహాత్ముడై ఇల వెలిశాడు
భలే తాత మన బాపూజీ, బాలల తాతా బాపూజీ 3

*********** ************* ************
"నర్సీ మెహతా" రాసిన బాపు కు ఇష్టమైన గుజరాతీ భజన్ "వైష్నవ జనతో.."
(నాక్కూడా చాలా ఇష్టమైన భజన్)
vaiShnavo janato--Narsi Mehta Bhajan in Lata Mangeshkar's voice





bhajan అర్ధం:
Vaishanav: A follower of Vaishnav school of Hinduism. Strict vegetarianism, ahimsa simplicity are the hallmarks of a true vaishnav. The Bhajan is in essence a "definition" of "vaishnav".

Vaishnav jan to tene kahiye je [One who is a vaishnav]
PeeD paraayi jaaNe re [Knows the pain of others]
Par-dukhkhe upkaar kare toye [Does good to others,
esp. to those ones who are in misery]
Man abhimaan na aaNe re [Does not let pride enter his mind]
Vaishnav... SakaL lok maan sahune vande [A Vaishnav, Tolerates and praises the the entire world]
Nindaa na kare keni re [Does not say bad things about anyone]
Vaach kaachh man nishchaL raakhe [Keeps his/her words, actions and thoughts pure]
Dhan-dhan janani teni re [O Vaishnav, your mother is blessed (dhanya-dhanya)]
Vaishnav... Sam-drishti ne trishna tyaagi [A Vaishnav sees everything equally, rejects greed and avarice]
Par-stree jene maat re [Considers some one else's wife/daughter as his mother]
Jivha thaki asatya na bole [The toungue may get tired, but will never speak lies]
Par-dhan nav jhaalee haath re [Does not even touch someone else's property]
Vaishnav... Moh-maaya vyaape nahi jene [A Vaishnav does not succumb to worldly attachments]
DriDh vairaagya jena man maan re [Who has devoted himself to stauch detachment to worldly pleasures]
Ram naam shoon taaLi laagi [Who has been edicted to the elixir coming by the name of Ram]
SakaL tirath tena tan maan re [For whom all the religious sites are in the mind]
Vaishnav... VaN-lobhi ne kapaT-rahit chhe [Who has no greed and deciet]
Kaam-krodh nivaarya re [Who has renounced lust of all types and anger]
BhaNe Narsaiyyo tenun darshan karta [The poet Narsi will like to see such a person]
KuL ekoter taarya re [By who's virtue, the entire family gets salvation]
Vaishnav...
(http://www.ramanuja.org/sv/bhakti/archives/all94/0016.html నుంచి)

ఇన్ని రాసాకా నాకు బాపు అంటే ఎంతిష్టమో వేరే చెప్పాలా...?!!

Thursday, October 1, 2009

ఋతురాగాలు

ఆ మధ్య ఒకరోజు వేణూ శ్రీకాంత్ గారి సైట్లో పాత టెలీసీరియల్ "ఋతురాగాలు" టైటిల్ సాంగ్ ఉన్న టపా ఒకటి చూడటం జరిగింది. "ప్రేమించే హృదయానికి.." పాట సాహిత్యం ఆయన అడిగారు.ఏళ్ళ తర్వాత ఆ కేసెట్ తీసి పాటలు విని చాలా ఆనందించాను.చాలా ఏళ్ళ తరువాత ఈ పాటలను మళ్ళీ గుర్తు చేసి ,విని ఆనందించే అవకాశం కల్పించిన వేణూ శ్రీకాంత్ గారికి, ఆయన టపాకు ధన్యవాదాలు.
************* ************* ***********

ఋతురాగాలు టైటిల్ సాంగ్:



చక్కగా ఇస్త్రీ చీరలూ,పట్టుచీరలూ కట్టుకుని,అంగుళం మందం మేకప్ వేసుకుని;
సుదీర్ఘంగా ఏడుస్తూ,నిట్టూరుస్తూ,వగరుస్తుండే ఆడవాళ్ళు...
ఎత్తులు,పైఎత్తులూ...కుట్రలూ,కుతంత్రాలూ...అత్తాకోడళ్ళ విబేధాలూ...పగలూ,ప్రతీకారాలూ...నిండిన
తెలుగు టి.వి సీరియల్స్ అంటే నాకు చాలా భయం.వాటికి మైలు దురం పారిపోతాను....!
అలాంటి నేను కూడా ఓ 4,5 సీరియల్స్ చూసిన రోజులు ఉన్నాయి."కస్తూరి",""మొత్తం చూసాను.
ఋతురాగాలు,పిన్ని(రాధిక కోసం) మాత్రం సగం చూసి ఆపేసాను,కధ ఇంకా సాగదిస్తూంటే భరించలేక.
ఇవన్నీ ఎప్పుడో 13,15ఏళ్ళ క్రితమని గుర్తు...

"ఋతురాగాలు" దురదర్శన్లో వచ్చేది.యద్దనపుడి గారి కధ వరకూ చూసి ఆ తరువాత రచయిత మారాకా విసుగు చెంది మానేసాను చూడటం.దీంట్లో టైటిల్ సాంగ్ కు,మిగిలిన పాటల సంగీతం నాకు చాలా ఇష్టం.
అప్పట్లో ఆ పాటల కేసెట్ కూడా అమ్మారు.ఆ పాటల కోసం అది కొనేస్కున్నాను కూడా.మొత్తం ఎనిమిది పాతలు బావుంటాయి.అందులో టైటిల్ సాంగ్ కాక,నాకు నచ్చిన మరో రెండు పాటలు + సాహిత్యం కూడా ఈ టపాలో పెడ్తున్నాను.

బంటి పాడిన "ప్రేమించే హృదయానికి.."

ప్రేమించే హృదయానికి ప్రణమిల్లవే మనసా ప్రణమిల్లవే ll2ll
వంచన ఎరుగని ఎడదకు వ్రంగి మొక్కవే

శిరసా వ్రంగి మొక్కవే ll2ll

మరుమల్లియ మనసులో మలినముండునా
ఎల కోయిల పలుకులో కల్లలుండునా
ఆ మల్లిక మనసుకు ఆ కోకిల పలుకుకు
ప్రణమిల్లవే మనసా ప్రణమిల్లవే llప్రేll

ఉదయభాను కిరణంలో జీవకాంతి ధార
విలయనీలి గగనంలో ఉజ్వల నవతార
ఆ వెలుతురు చినుకుకు,ఆ తారక మెరుపుకు
ప్రణమిల్లవే మనసా ప్రణమిల్లవే llప్రేll


*బాలు పాడిన "లోకం తీరే వేరే.."

లోకం తీరే వేరే ఓ కోయిలా,ఈ శోకం తీరే వేరే దారే లేదే
ఇల కల అంత మధురం కాదే
బంధనాలే అన్నీ బంధం లేదే,అనురాగం భాగం చేస్తే త్యాగం కాదే
విధి ఎదురీది కడచేరవే
వాస్తవం ఊహలకూ కడు దూరం,ఆశకు అవధుండదే..ఆ...
ఋతువుకు ఆగమనం నీ గానం,వ్యధలను మరపించవే...
లోకం లోకం తీరే వేరే ఓ కోయిలా,ఈ శోకం తీరే వేరే దారే లేదే....

మనసున రేగే భావాలన్నీ ఋతురాగాలే
ఆ భావంలోనే భాషలకందని రుపం ఉందే
రుపం చాటున మెదిలే భావం రాగం వేరే
ఆ రాగంలోనే స్వరములకందని భావం ఉందే
అలుపెరగని ఈ గుండెలో అలజడులే ఈ రాతలు
తలరాతలనే తలవంచే నీ తలపే ఇక మారాలే
ప్రేమే జీవితనౌక చుక్కానిలే
నీ నిండు మనసే నీకు తొడూ నీడే

దారే తప్పి దిక్కేతోచని ఓ ప్రాణమా
నిను ఓదార్చే నీ తొడే నేనని గమనించుమా
ఒకటే జాతికి చెందిన గువ్వలు నువ్వూ నేనూ
నీ జీవితగతిలో ముదమును పంచే తొడౌతానూ
స్నేహం నిండిన గుండెలో,రావే ఒంటరి కోయిలా
మన గాధలు వెరే అయినా,మన బాధలు ఒకటే కాదా
కాలం సాగిపోదే కలతలతోనే,గత చేదు ఆవేదనలే గతియించునే
ఇక ప్రతి ఋతువు వాసంతమే
లోకం తీరే వేరే ఓ కోయిలా,ఈ శోకం తీరే వేరే దారే లేదే
ఇల కల అంత మధురం
వాస్తవం ఊహలకూ కడు దూరం,ఆశకు అవధుండదే..ఆ...
ఋతువుకు ఆగమనం నీ గానం,వ్యధలను మరపించవే...