పార్ట్ టైం సంపాదనైనా,జీవితంలో మొదటి సంపాదన విలువ అపారం.ప్రపంచంలో సంతోషం అంతా మనదైనట్లు,అమౌంట్ తక్కువైనా ఓ లక్ష సంపాదించిన ఫీలింగ్.కాలేజీ రోజుల్లో చేతి ఖర్చులకి అమ్మనాన్నలని అడగకుండా కావాలనిపించినవి కొనుక్కోగలగటం మాటల్లో చెప్పలేని అనుభూతి.ఇంతకీ ఆ చిల్లర అవసరాలు ఏమిటీ అంటే--లెటర్ పాడ్స్,పెన్నులు,పుస్తకాలు,క్యాసెట్టులు,పైంటింగ్కి కలర్స్ గట్ర గట్ర..!ఇంతకీ నాకు దొరికిన చిరు సంపాదన ఏమిటి అంటే..విజయవాడ రేడియోస్టేషన్లో "యువవాణి" అని యువజనుల కార్యక్రమం ఉండేది.ఆ కార్యక్రమంలో 'రసవాహిని 'అనే శీర్షికలో ప్రోగ్రాం కి కాంట్రాక్ట్లు.ఏదొ ఒక విషయం మీద వ్యాఖ్యానం చెబుతూ ఆ విషయానికి సంబంధించిన పాటలు వెయ్యటం.అది కాకుండా హిందీ కవితలు రాసి వాటిని యువవాణిలో చదివే అవకాశం కూడా వచ్చింది.ఈ రెందు రకాల కాంట్రాక్టుల ద్వారా కాలేజీ రోజుల్లో కాస్తొ కూస్తో చిన్న సంపాదన ఉండేది.నాన్నగారికి పరిచయం ఉన్న ఆడియో ఏడ్ మేకెర్ ఒకాయన హిందీలో కొన్ని ఏడ్స్ నాతో చదివించుకునేవారు.అలా హిందీ ఏడ్స్ కి వాయిస్ ఇవ్వటం ద్వారా కొంత సంపాదన ఉండేది. ఆ సంపాదనంతా దాచుకుని ఒక "ఫిలిప్స్ టేప్ రికార్డర్" కొనుక్కున్నాను.నా అనందానికి అవధులు లేవు!!ఇంట్లో ఉంటే నా రికార్డర్ మోగుతూనే ఉండేది.ఎక్కువ వినద్దు పాడైపోతుంది అని ఇంక ఎవరూ అనేవారు కాదు.ఇప్పటికి నా టేప్ రికార్డర్ నాతొ భద్రంగా ఉంది.
విజయవాడలో "బుక్ ఫెస్టివల్" ఒకటి అప్పట్లో మొదలైంది.ఇప్పుడు అది మొదలెట్టి 17సంవత్సరాలైంది.మొదటి 12,13 సంవత్సరాలూ వదలకుండా వెళ్లాను.జనవరి మొదటివారంలో 10రోజులు జరుగుతుంది అది.వీలైనన్ని రోజులు వెళ్ళేదాన్ని."ఇంట్ళొ ఉన్న వందల పుస్తకాలు కాకుండా ప్రతి సంవత్సరం ఇంకా ఇంకా పుస్తకాలు కొనేస్తున్నారు.ఇప్పుడు మీ కూతురు కూడా తయారైంది.సర్దలేక చస్తున్నా.."అని మా అమ్మ విసుక్కుంటూ ఉండేది.పిజీ అయ్యాకా రేడియోలో హిందీ పాఠాలు కండక్ట్ చేసే కాంట్రాక్టులు కొన్ని వచ్చాయి.సంపాదన కాస్త పెరగటంతొ బుక్ ఫెస్టివల్లొ పుస్తకాలు,ఆడియో క్యాసెట్లు కొనటం అలమారు నింపటం.ఇదే పని!
ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే విద్యార్ధి దశలో మన అవసరాలకి మనం సంపాదించుకోవటంలో ఉన్న తృప్తి,ఆనందం అనుభవించే మనసులకే అర్ధం అవుతాయి!!
11 comments:
మొదటి సంపాదన గురించి మీరు చెప్పింది బాగుంది.
ఈ పొస్ట్ కి సంబందించింది కాకున్నా చిన్న కోరిక.
నాకు ఇష్త మైన పాటలన్నీ ఒక చోట పెట్టుకుందామని ,కమ్మటికలలు అనే బ్లాగ్ చెసుకున్నాను.
అందులో మీరిచ్చిన అమ్మదొంగా పాటని పబ్లిష్ చేసుకొవచ్చా?
అలాగే రావు బాలసరస్వతి పాడిన ,బంగారు పాపాయి బహుమతులు పొందాలి పాట మీదగ్గరేమైనా వుంటే ఇస్తారా?
ఆ పాట కోసం చాలా వెతుకుతున్నాను.
నిజమే తొలి సంపాదనలో ఉన్న ఆనందం అనుభవిస్తేనే కాని తెలియదు.ఒక్కసారి ఇవ్వాళే రాసిన ఈ పోస్ట్ కొక్క లుక్కేయండి.
http://pappusreenu.blogspot.com/2009/06/blog-post_30.html
మాలా కుమర్ గారు,తప్పకుండా పబ్లిష్ చేసుకోండి.బంగారుపాపాయి పాట మా నాన్నగారి దగ్గర ఉంది.ఒక వారంలో మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను త్ప్పకుండా..
శ్రీనివాస్ గారు, మీ విశ్వామిత్ర పేరు,మీ మొదటి టపా చూసి మీరు కోపం వచ్చినప్పుడే టపా రాస్తారేమో అనుకున్నానండి.ఇవాళ మీ టపా కూడలిలో చూసి నా టపాని విమర్శించారేమో అని చూసాను...బాగున్నాయండీ మీ మొదటి సంపాదన విశేషాలు.dhanyavAdAlu.
నా మొదటి సంపాదన వెనుక ఉన్న కొంచం చిత్రమైన కథ మళ్ళీ గుర్తొచ్చిందండీ... అన్నట్టు నాక్కూడా రేడియో తో ఓ చిన్న అనుబంధం ఉంది..చాలా ఏళ్ళ క్రితం ఓ చిన్న స్క్రిప్ట్ రాసి చదివాను, చాలా యాదృచ్చికంగా.. ఆ కాగితాలు ఎక్కడున్నాయో వెతకాలి... వాళ్ళిచ్చిన డబ్బులతో నేను కూడా పుస్తకాలే కొనుకున్నాను.. అవి మాత్రం ఉన్నాయి భద్రంగా... బాగుంది మీ టపా..
మొదటి సంపాదన అని చెప్పలేను గానీ, నేను ఏడవ తరగతి లో ఉన్నప్పుడు మంచి మార్కులు తెచ్చుకున్నందుకు స్కూల్లో కొంత మొత్తం ఇచ్చారు. దానితో అప్పుడే మార్కెట్ లోకి వస్తున్న ఒక చిన్న నీల్ కమల్ కుర్చీ కొనుక్కున్నాను. ఆ రోజు నా ఆనందానికి అవదులు లేవు. మీ మొదటి సంపాదన అనుభవాలు బావున్నాయి.
నిజమండీ శేఖర్ గారు.మొదటి సంపాదనలో ఉన్న ఆనందం మాటల్లో చెప్పలేనిది.మీ జ్ఞాపకం పంచుకున్నందుకు ధన్యవాదాలు.
మొదటి సంపాదనలో మాధుర్యాన్ని నేను చవిచూసానండి...
thanks srujanagaru.
బాగున్నాయండీ మీ మొదటి సంపాదన విశేషాలు.
వేణు గారు,ధన్యవాదాలు.
Post a Comment