సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Sunday, June 28, 2009

అమ్మదొంగా! నిన్ను చూడకుంటే నాకు బెంగ..

లలితసంగీతం మీద ఇష్టం ఉన్నవాళ్ళకు ఈ పాట తప్పకుండా తెలుస్తుంది.పాలగుమ్మి విశ్వనాధంగారు రాసి,సంగీతం సమకూర్చిన ఈ పాటని వేదవతీప్రభాకర్ గారు పాడారు.దూరదర్శన్ లో నా చిన్నప్పుడు ప్రసారం చేసినప్పుడు రికార్డ్ చేసుకున్న పాట ఇది.
తమ కూతురు గురించి ప్రతి తల్లీతండ్రి అనుకునే మాటలివి...నాకు చాలా ఇష్టమైన , చిన్నప్పుడు పాటలు పాడేప్పుడు నేను ఎక్కువగా పాడిన పాట ఇది.
పాట సాహిత్యం ఇక్కడ రాస్తున్నాను.వేదవతీప్రభాకర్ గారు పాడిన పాట లింక్ ఈ పోస్ట్ తో పెడుతున్నాను.

http://savefile.com/files/2140436
---------------------------------------
అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ(2)

కొంగట్టుకు తిరుగుతూ ఏవొ ప్రశ్నలడుగుతూ
నా కొంగట్టుకు తిరుగుతూ ఏవొ ప్రశ్నలడుగుతూ
కలకలమని నవ్వుతూ కాలం గడిపే
నిన్ను చూడకుంటే నాకు బెంగ
అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ

కధ చెప్పే దాకా కంట నిదురరాక
కధ చెప్పేదాకా నీవు నిదురపోక
కధ చెప్పేదాకా నన్ను కదలనీక
మాట తొచనీక మూతిముడిచి చూసేవు
అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ

ఎపుడో ఒక అయ్య నిన్నెగరేసుకు పోతే
నిలువలేక నా మనసు నీవైపే లాగితే
గువ్వ ఎగిరిపోయినా గూడు నిదురపోవునా
గువ్వ ఎగిరిపోయినా గూడు నిదురపోవునా
అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ

నవ్వితే నీకళ్ళు ముత్యాలు రాలు
ఆ నవ్వే నిను వీడక ఉంటే అది చాలు
నవ్వితే నీకళ్ళు ముత్యాలు రాలు
ఆ నవ్వే నిను వీడక ఉంటే పదివేలు
కలతలు కష్టాలు నీదరికి రాక
కలకాలం నీ బ్రతుకు కలలదారి నడవాలి
అమ్మదొంగా నిన్ను చూడకుంటే... నాకు బెంగ !!

13 comments:

సిరిసిరిమువ్వ said...

నాకు చాలా ఇష్టమయిన పాట. నా స్నేహితురాలు ఒకామె చాలా మధురంగా పాడేది ఈ పాటని. ఆ రోజుల్ని పాటవినిపించినందుకు మళ్లీ గుర్తుచేసినందుకు ధన్యవాదాలు.

తృష్ణ said...

లలితసంగీతం,దూరదర్శన్లో చిన్నప్పుడువచ్చిన పాట అంటే ఎవరికైన తెలుసో తెలిదొ అనుకున్ననండి...తెలుసని రాసారు.ఆనందం కలిగింది.

మాలా కుమార్ said...

ఈ పాట ఎక్కడ దొరుకుతుందా అని వెతుకుతున్నాను.లింక్ కూడా ఇచ్చినందుకు థాంక్స్.

Sujata M said...

Good Song.

అయ్యో ! లలిత సంగీతం తెలుసండీ. ద్వారం లక్ష్మి గారు పాడిన పాటలు కూడా గుర్తు. మీకు శ్రమ అనుకోక పోతే చిన్న సందేహం. శ్రీమతి వేదవతీ ప్రభాకర్, శ్రీమతి చాయాదేవి, శ్రీ బాల మురళీ కృష్ణ గార్లు గానం చేసిన 'కృష్ణ భజనలు' ఎక్కడ దొరుకుతాయి ? మ్యూసిక్ షాపుల్లో మాత్రం లేవు. నేను 6 సం.. లు గా వెతుకుతున్నాను. Thanks.

తృష్ణ said...

సుజాతగారు,కృష్ణగీతాలు గురించి తప్పకుండా కనుక్కుంటాను.
అరుదుగా దొరకే పాటలు దొరికితే ఎంత సంబరంగా ఉంటుందో నాలాటి పాటల పిచ్చివాళ్ళకి బాగా తెలుసు.వేదవతీ ప్రభాకర్ గారి "జోజో ముకుందా" తెలుసా మీకు?ఆ పాటలు కూడా బాగుంటాయి.కృష్ణుని మీద అన్నారని చెప్తున్నాను--చిత్ర పాడిన "కృష్ణ ప్రియ" "కృష్ణ దర్శనం" రెండు ఆల్బం లు కూడా బాగుంటాయి.మీ దగ్గర ఉండి ఉంటాయిలెండి.

తృష్ణ said...

మాలకుమార్ గారు,అది ఎప్పుడో నా చిన్నప్పుడు టి.వి.లో వస్తే టేప్ రికర్డర్లొ రికర్డ్ చేసుకున్న పాట. ఎవరైనా డౌన్ లోడ్ చేసుకుంటారని నా దగ్గర ఉన్న పాటకి లింక్ క్రియేట్ చేసానండి.నిన్న దాని గురించి 2గంటలు నెట్ తో కుస్తీ పట్టి ఆఖరుకి సాధించాను.నా కష్టం ఫలించినందుకు ఆనందంగా ఉంది.
ధన్యవాదాలు.

సుజాత వేల్పూరి said...

తృష్ణ గారు,
ఈ పాటను వేదవతి గారికంటే ముందు బి.వరహాలు అనే ఆలిండియా ఏ గ్రేడ్ గాయని విజయవాడ రేడియో కోసం పాడారండీ!విన్నారా మీరు? ఆమె గొంతులో ఆ పాట నాకు ఇంకా బాగా నచ్చుతుంది. వేదవతి గారు కూడా బాగానే పాడారు.


సుజాతా,
నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ లో "శ్రీనివాస్ ఆడియో"అని ఒక షాపు ఉంది. షాపు యజమాని పేరు వీరేశ లింగం గారు. ఆయన దగ్గర ఎప్పటివో పాత ఆడియోలు అన్నీ దొరుకుతాయి. V.A.K. రంగారావు ప్రసంగాల దగ్గర్నుంచీ అన్నీ దొరుకుతాయి. అక్కడ ప్రయత్నించండి. సంగీత సాగర్ లో ట్రై చేసారా? వేదవతీ ప్రభాకర్ పాడినవి మీరా భజన్స్! అవి ఆలిండియా రేడియో (విజయవాడ)వాళ్ల దగ్గర ఉన్నాయి.

లక్ష్మి said...

I've been singing the same song for my daughter and she loves it too :)

Thanks for the lyrics and link.... good show

తృష్ణ said...

thanks లక్ష్మిగారు,మీది విజయవాడా?నేను 28ఏళ్ళు ఉన్న ఊరు...ఈ గాలీ,ఈ నేలా...పాట వింటే నాకు గుర్తు వచ్చే ఊరు!!

తృష్ణ said...

సుజాతగారు,నాకు వరహాలుగారి పాటలు తెలుసు.మా నాన్నగారి దగ్గర ఆవిడ పాటలు ఉన్నాయి.ఆవిడ వాయిస్ చాలా బాగుంటుంది.

Anonymous said...

మీ పొస్ట్ చాలా బాగుంది. చాలా రొజుల తరువాత ఈ పాట విన్నాను. నాకు మా ఆవిడకి కూడా నచ్చింది.

కారిటి ఉన్న పాట ఈక్రింది లింక్ లో దొరుకుతుంది.

http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/june2009/lalithageetam.html

తృష్ణ said...

మీ బ్లాగు పేరు "కుముధ"?నాకు పాత "వనిత"మగజీన్ లో ఒక నవలలో కేరక్టర్ గుర్తువచ్చిందండీ.ఆ హీరోయిన్ పేరు "కుముద".మీ బ్లాగు బాగుంది.తీరుబడిగా చదవాలి.లింక్ కు థాంక్సండీ.

మరువం ఉష said...

తృష్ణ, ఈ పాట, "అమ్మదొంగా! నిన్ను చూడకుంటే నాకు బెంగ" వినాలనిపించి, వింటూ, విన్నాక అలా వెదుకుతూ మీ టపా చూడటం సంభవించింది. మీకు మరికొన్ని పాటలు ఇక్కడ దొరుకుతాయి. నాకు "తబ్బిబ్బయింది నా మనసు.." అక్కడే దొరికింది. http://surasa.net/music/lalita-gitalu/