సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, November 18, 2009

ఓ అనువాదం





నీ రాకతో వసంతాన్ని
ఒంటరితనంలో ఆనందాన్ని
ఆనందంలో ఒక బంధాన్ని
తోడిచ్చిన ప్రకృతి
ఈ ఏకాంతపు సాయంత్రం
"మనం" మాత్రమే ఉన్న కలలని
చేసింది నా సొంతం....




Tuesday, November 17, 2009

తిలక్ గళంలో ఆయన "వెన్నెల"

పదహారేళ్ళ క్రితం ఒక జనవరి నెల పుస్తకమహోత్సవం లో కవితలు నచ్చి "అమృతం కురిసిన రాత్రి" మిగతా పుస్తకాలతో పాటూ కొనుక్కుని ఇంటికి తెచ్చాను. ఏం కొన్నావని చూసిన నాన్న "ఈ పుస్తకం ఎందుకు కొన్నావు?"
అని అడిగారు. "నచ్చింది...కొన్నాను..." అన్నా. "ఈ కవితలను నువ్వు అర్ధం చేసుకోగలవా?" అన్నరు. "ఊ..." అన్నాను. "ఈ తిలక్ ఎవరో తెలుసా?" అన్నారు. తల అడ్డంగా ఊపాను. "మూర్తి బాబయ్య మేనమామగారు. రామారావు అంకుల్ వాళ్ళ తమ్ముడు." అన్నారు. "ఈ పుస్తకం పాత ముద్రణ మనింట్లో ఉంది. ఎప్పుడైనా చూసావా?" అన్నారు... లేదన్నాను. దాంట్లోని ఒక కవితను తిలక్ గారు స్వయంగా చదివిన రికార్డింగ్ ఇంట్లో ఉంది వినమన్నారు.

అలా పరిచయమయ్యింది "అమృతం కురిసిన రాత్రి" నాకు. మూర్తి బాబయ్య గిటార్ వాయిస్తే,తిలక్ గారు పాడేవారట, లేకపోతే ఎవరిచేతైనా పాడించుకుంటూ వినేవారట. కొన్ని కవితలని మూర్తిబాబయ్య ట్యూన్ కట్టి పాడించారు. "గగనమొక రేకు కన్నుగవ సోకు..." పాట నేను నేర్చుకుని పాడేదాన్ని... (నాన్న చిరకాల స్నేహితుడు మూర్తిబాబయ్యే "గమ్యం" సినిమాకు సంగీతం చేసిన ఈ.ఎస్.మూర్తి.)

తిలక్ గారు స్వయంగా చదివిన "వెన్నెల" కవిత బ్లాగ్మిత్రుల కోసం.....



కార్తిక మాసపు రాత్రివేళ
కావాలనే మేలుకున్నాను
చల్లని తెల్లని వెన్నెల
అంతటా పడుతోంది
మెత్తని పుత్తడి వెన్నెల
భూమి ఒంటిని హత్తుకుంది
శిశువులాంటి వెన్నెల
నవ వధువులాంటి, మధువులాంటి వెన్నెల
శిశిరానికి చెలించే
పొరల పొరల వెన్నెల
శరద్రధుని సౌధానికి కట్టిన
తెరల తెరల వెన్నెల
ఎంత శాంతంగా,
హాయిగా, ఆప్యాయంగా ఉందీ !
చచ్చిపోయిన మా అమ్మ
తిరిగొచ్చినట్టుంది
స్వర్గంలో ఎవరో సంగీతం
పాడుతున్నట్టుంది.
ఎంత నీరవ నిర్మల సౌందర్యం
నన్నావరించుకుంది ?
ఏ చామీకర చషకంతో
నా పెదవుల కందిస్తున్నది ?
ఈ రాత్రి నిద్రిత సర్వధాత్రి మీద
ఎవరు ఈ తళుకు తళుకు
కలల పుప్పొడిని వెదజల్లారు !
ఎవరీ మెరిసే ముఖమల్
జంఖానా పరిచి వెళ్ళారు !
ఓహో ! చంద్రకిత ధాత్రి
ఓహో ! కోరకిత గాత్రి
ఓహో ! శరధ్రాత్రి !
వ్యధలతో బాధ్యతలతో
భయాలతో మహితమైన
నా మనస్సుకిప్పుడూరట కలుగుతోంది.
ఈ వెన్నెల నా మనస్సులోకి
జారుతోంది
నా గుండెల పగుళ్ళనుండి కారుతోంది
నా అంతరాంతర రంగస్థల
ఏకాకి నటుడినైన నన్ను
తన మైత్రీ మధుర భావంతో
క్రమ్ముకుంటోంది
నా లోపలి లోపలి గుప్త
వీణా తంత్రీ నివహాన్ని
వేపధు మృదు లాంగుళుల
తాకి పలికిస్తోంది.
నన్ను బతికిస్తోంది
నా బతుక్కి అందాన్ని
అర్ధాన్నీ ఆశనీ
రచిస్తోంది
నా రచన తానైపోయింది
వెన్నెల వంటి నా ఉద్రేకానికి
తెలుగు భాష శరద్వియ
ద్విహార వనమై నడిచిపోయింది
చలి చలిగా సరదాగా ఉంది వెన్నెల
చెలి తొలిరాత్రి సిగ్గులా ఉంది
విరిసిన చేమంతిపువ్వులా ఉంది
పడకగదిలో వెలిగించిన
అగరొత్తుల వాసనలా ఉంది
పడగిప్పిన పాములు తిరిగే
పండిన మొగలి వనంలాగుంది
పన్నీరు జల్లినట్టు ఉంది
విరహిణి కన్నీరులా ఉంది
విరజాజుల తావితో కలిసి
గమ్మత్తుగా ఉంది
విచిత్రమైన మోహమణి
కవాటాలను తెరుస్తోంది
యౌవన వనంలోని కేళీ సరస్సులా ఉంది
దవుదవ్వుల పడుచు పిల్లలు
పకపక నవ్వినట్టుంది
దాపరికంలేని కొండజాతి
నాతి వలపులాగుంది
ఇది సృష్టి సౌందర్యానుభూతికి టీక
ఇది తరుణ శృంగార
జీవన హేలకు ప్రతీక
చిందెను తెల్లని చల్లని వెన్నెల
చలిరాత్రుల మౌనపు
గానపు తెన్నుల
జారెను తోటల
కొబ్బరి మొవ్వుల
ఇంటిముందు బోగన్ విల్లా పువ్వుల
ధనికుల కిటికీ పరదా చిరుసందుల
సురతాలస నిద్రిత సతి కపోలమ్ముల
జారిన జార్జెత్ చీర జిలుగుటంచుల
చిందెను తెల్లని చల్లని వెన్నెల
చలిరాత్రుల మౌనపు గానపు తెన్నుల
నిరుపేదల కలలో
కదలిన తీయని ఊహల
ఊరిపక్క కాలువ అద్దపు రొమ్ముల
ఊరి బయట కాలీకాలని
చితి కీలల
ఆడవిలో వికసించిన ఒంటరి పువ్వుల
చిందెను తెల్లని చల్లని వెన్నెల
చలిరాత్రుల మౌనపు గానపు తెన్నుల
(1965)

(ఇది పుస్తకంలోని కవిత. తిలక్ గారు చదివిన దాంట్లో కొన్ని మార్పులు ఉన్నాయి.)

ఈ పుస్తకంలో "అమృతం కురిసిన రాత్రి", "నువ్వు లేవు నీ పాట ఉంది", "నేను కాని నేను" నాకు బాగా నచ్చే కవితలు.

Monday, November 16, 2009

నాలోన శివుడు కలడు..."

(Siva temple in coimbatore)
ఈ చివరి కార్తిక సొమవారం పరమ శివుణ్ణి ఇలా స్మరిస్తూ...
******

'పూర్తిగా తెలిసే వరకూ ఏ వ్యక్తి మీదా ఒక స్థిరమైన అభిప్రాయాన్ని ఏర్పరుచుకోకూడదు’ అన్నది నేను తెలుసుకున్న కొన్ని జీవిత సత్యాల్లో ఒకటి. ఒక మనిషిని మనం మొదట ఏ దృష్టితో చూస్తామో అదే అభిప్రాయం మనకి ఆ మనిషి గురించి ఇంకా బాగా తెలిసేవరకూ ఉండిపోతుంది. మెల్లగా, పూర్తిగా ఆ వ్యక్తి తెలిసాకా, మనకు గతంలో కలిగిన అభిప్రాయానికీ, కొత్తగా ఏర్పడిన అభిప్రాయానికీ ఎంత తేడా ఉందో తెలిసాకా ఆశ్చర్యం వేస్తుంది. అలా నాకు గతంలో ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోయి ఒక వ్యక్తంటే అమితమైన అభిమానం ఏర్పడిపోయింది. అది "తనికెళ్ళ భరణి" గారు. ఆయనను సినిమాల్లో నెగటివ్ పాత్రల్లో చూసి చూసి చిన్నప్పుడు అంత మంచి అభిప్రాయం ఉండేది కాదు..

"హాసం" మాస పత్రిక మొదలైయ్యాకా దాంట్లో ఆయన రాసిన వ్యాసాలు చదివాకా నాకు ఆయనంటే చాలా గౌరవం ఏర్పడిపోయింది. ఇంత మంచి రచయిత ఉన్నాడా ఈ వ్యక్తిలో అని ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత మిగతా రచనలు కుడా కొన్ని చదివాను. తర్వాత ఆయన ఒక డైలాగ్ రైటర్,నాటక రచయిత,కధా రచయిత అని కూడా తెలుసుకున్నాను. దాదాపు పదేళ్ల క్రితం ఇంకో కొత్త విషయం తెలుసుకున్నాను...ఆయన గొప్ప శివ భక్తుడని. ఆయన స్వయంగా రచించి, స్వరపరిచి, పాడిన "నాలోన శివుడు కలడు" అనే ఆల్బమ్ విన్నాకా. ఇది నాకు చాలా ఇష్టమైన భక్తి గీతాల ఆల్బమ్. మొత్తం ఐదు పాటలూ శివ తత్వాన్నీ, భరణి గారికున్న శివ భక్తినీ తెలుపుతాయి. అన్ని పాటలకూ ముందుమాట సామవేదం షణ్ముఖశర్మగారు చెప్తారు. అందులో నాకు బాగా నచ్చే మూడు పాటలు ఇక్కడ వినటానికి...మొదటి పాట మొత్తం సాహిత్యం కూడా....
--------------



నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకమ్ములేలగలడు
కోరితే సొకమ్ముబాపగలడు...((నాలోన))

నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు గంగపైకెత్తగలడు
పాపులను తుంగలో తొక్కగలడు((నాలోన))

నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు కొండపై ఉండగలడు
వరమిచ్చి గుండెలో పండగలడు((నాలోన))

నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు
ఒద్దంటే రెంటినీ మూయగలడు((నాలోన))

నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు సగము పంచీయగలడు
తిక్కతో అసలు తుంచేయగలడు((నాలోన))

నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు మనలోన కలవగలడు
దయతోటి తనలోన కలపగలడు((నాలోన))

నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు
నాటకాలాడగలడు తెరదించి మూటగట్టేయగలడు(౩)

************

2) "హమ్మయ్య దొరికావా అర్ధానారీశ్వరుడా
విడి విడిగా వెతికాను ఒకచోటే కలిసారా..
అమ్మేమో విల్లంటా అయ్యేమో అమ్మంటా
గురి చూసి కొట్టేది మన కర్మ ఫలమంటా.."



************

3)"నువ్వైనా చెప్పవమ్మ సాంబ శివునికీ
నువ్వే కనువిప్పవమ్మ సాంబ శివునికి.." పాటలో

"బుసకొట్టే పాములేరా మీ కోరికలు
అట్టలు కట్టిన జడలే పాతకమ్ములు"

"కడకు వల్లకాడేగద మీ నివాసమూ
కపాలమే గదా కడకు మీ విలాసమూ.."
వాక్యాలు జీవన తత్వాన్ని ఎంతో సులభంగా తెలియపరుస్తాయి.





*************

4)"ఈ జన్మకింతేరా మల్లనా
ఇంకో జన్మ నాకీయి మల్లనా..""
పాటలో "జానకి"గారి గళంలో పలికే ఆర్ధ్రతను విన్నాకా కళ్లలోకి నీరు ఉబికి వస్తుంది...

5)"ఓ శివా నా శివా బజ్జోరా మా శివా
ముడు కన్నులు మూసి బజ్జోర మా శివా..."
పాటలో "సుశీల" గారి జోల వింటూంటే మనకూ నిద్దుర వచ్చేస్తుంది...

భక్తిగితాలపై ఆసక్తి ఉన్న ప్రతివారు కొనుక్కోవలసిన కేసెట్ ఇది. ఇప్పుడు సి.డి కూడా వచ్చిందేమో తెలీదు మరి.
*********************************************************

ఇక రేపు తెల్లవారు ఝాములో పెట్టే "పోలి స్వర్గం" దీపాలతో ఈ కార్తీకానికి "హర హర మహాదేవ.."

Sunday, November 15, 2009

కూరల మార్కెట్...

(ఇది రెండు రోజుల క్రితం మార్కెట్కు వెళ్ళినప్పుడు రాసినది...అప్పుడు పెట్టలేకపోయాను..ద్వితీయ విఘ్నం కాకుండా ఇవాళ పెట్టేస్తున్నా..:) )


చల్లని సాయంత్రం...ఆహ్లాదకరమైన వాతావరణం...బస్ ఎక్కాలనుకుని మళ్ళీ ఎక్కే ప్రయత్నం మానుకున్నాను. నడిచి వెళ్ళాలని అనిపించింది. కూరల కోసం రిలయన్స్...చౌపాల్ మొదలైన వాటికి వెళ్ళటానికి విసుగనిపించినప్పుడల్లా నేను దగ్గరలోని మార్కెట్ కు వెళ్తూంటాను. కొద్దిగా దుమ్ముని, బురదని భరించగలిగితే మార్కెట్టే కూరలకి బెస్ట్ నాకైతే. ఇయర్ ఫోన్స్ తీసి చెవులకు తగిలించుకున్నాను. అలా పాటలు వింటూ ఎంత దూరమైనా నడిచేయటం నాకు చాలా ఇష్టం...అలానే వింటూ బయల్దేరాను. ఆర్.జే ఏదో జోకేసారు. భలే నవ్వు వచ్చింది....రోడ్దు మీద నవ్వుకుంటు వెళ్తూన్న నాకే అనుమానం వచ్చింది...ఒక్కర్తి రోడ్డు మీద నవ్వుకుంటా వెళ్తోంది..పిచ్చిదనుకుంటారేమో...అనిపిమ్చి బలవంతాన నవ్వు ఆపుకున్నా... చెవిలో "గల గల పారుతున్న గోదారిలా..." మొదలైంది...ఆలోచనలూ పరిగెట్టడం మొదలేట్టాయి...

కూరల కోసం మార్కెట్ కు ఎప్పటినుంచీ వెళ్తున్నానో గుర్తు వచ్చింది...12,13 ఏళ్ళ నుంచీ వెళ్తున్నాను. నా ఫ్రెండ్ గుర్తుకు వచ్చింది. మధ్యలో ఈ ప్రెండేమిటి? అంటే...డిగ్రీలో ఉన్నప్పుడు నా క్లోజ్ ప్రెండ్ ఒకమ్మాయి ఇల్లు విజయవాడ సత్యనారాయణపురం మార్కెట్ వెనక సందులో ఉండేది. మొదట్లో వాళ్ళింటికి వెళ్ళేప్పుడు అమ్మ కూరలు తెమ్మంటే "తేను ఫో" అనేదాన్ని. ఒకసారి నేను వెళ్ళినప్పుడు తను "కూరలు తేవాలి వస్తావా?" అంది..."కూరలు నువ్వు తెస్తావా?" అన్నాను నేను ఆశ్చర్యంగా.."అవును..అమ్మకి కుదరకపోతే నేను వెళ్తాను.." అంది. అంతే...ఆ రోజు మొదలు ఈ రోజు దాకా నాకు కూరలు తేవటం చాలా ఫేవరేట్ పని అయిపోయింది. అమ్మ అడగకుండానే "అమ్మా!కూరలు కావాలా?" అని అడిగేదాన్ని. కాలగమనంలో నా ఫ్రెండ్ నాకు నెమ్మదిగా దూరమైపోయింది...అయినా ఈ "కూరలు కొనటం" అనే ఇష్టం మాత్రం ఇలాగే ఉండిపోయింది...!

ఆ ప్రెండ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం...మా ఇద్దరి మధ్యన రహస్యాలు, చెప్పుకోని విషయాలు ఉండేవే కాదు...అర్ధరాత్రి అపరాత్రి లేదు...ఎప్పుడు ఏది గుర్తు వస్తే అది ఒకరితో ఒకరం చెప్పేసుకోవాల్సిందే. మా ఇద్దరి నాన్నలూ ఫోను బిల్లులు గురించి బెంగలు పెట్టుకున్న రోజులింకా గుర్తు నాకు.. 10,12 ఏళ్ళ గాఢ స్నేహం తరువాత చెప్పుకోదగ్గ కారణాలు లేకపోయినా జీవనగమనంలో మారే ప్రాధాన్యతలూ, యాంత్రిక జీవన విధానం మా దూరానికి కారణం అయ్యాయి...కొన్ని స్నేహాలు అంతేనేమో...వాళ్ళని blame చెయ్యాలనిపించదు....she's still is a part of my heart...! తను గుర్తొస్తే నాకీ ఆతిఫ్ పాట గుర్తు వస్తుంది..""तेरे बिन में यु कैसे जिया...कैसे जिया तेरे बिन..लेकर याद तेरी राते मेरी कटी..."

సరే, ఇంతకీ మార్కెట్ వచ్చేసి ఆలోచనలు కట్ అయ్యాయి...fm లోంచి ఇయర్ ఫోన్స్ లో "ओ सथिरॆ तेरॆ बिना भी क्या जीना.." పాట మొదలైంది...ఆహా ! అనుకున్నా...అలా వింటూనే కూరలు కొనటం మొదలెట్టాను. ఏమిటో ఈ రేట్లు...సింధుభైరవిలో భైరవి డైలాగ్ గుర్తు వచ్చింది "వంకాయలా గుర్రాలా?" అంటుంది. అలాగ వంకాయ ధర కాకపోయినా మిగిలిన వాటి ధరలలో పెరుగుదలే కానీ తరుగుదల కనిపించట్లేదు. చివరిగా ఆకుకూరలతో కొనటం పూర్తి చేసాను...

చెవిలో ఇదివరకెప్పుడూ వినని కొత్త పాటొకటి మొదలైంది...చిల్లర లెఖ్ఖ వేసుకునే హడావుడిలో పాట తాలుకూ వివరం వినలేదు. "రింగ రింగా రింగ రింగా..." అని వస్తోంది పాట. ఏదో మాస్ పాటలాగుంది. ఏదన్నా కొత్త సినిమాలోదేమో...సరదాగా అనిపించింది. సగమే విన్నాను మరి..మొత్తం ఎలా ఉంటుందో..ఇంటికెళ్ళగానే గూగులమ్మనడగాలి అనుకున్నా. కూరల బరువుతో బస్సెక్కటం వీలు కాదు కాబట్టి ఆటో పిలిచి ఎక్కి కూర్చున్నా...

ఇంకేంటి..? ఆటో ఇంటికీ....నేను లిఫ్ట్ లోకీ...!! అంతే...

Saturday, November 14, 2009

ఒక మంచి పిల్లల పాట....

>(నా బ్లాగ్ రెగులర్ రిడర్స్ కోసం: కొద్దిపాటి అస్వస్థత తరువాత ఇవాళ మళ్ళీ బ్లాగ్లోకం లోకి....ఇంకా పూర్తిగా కోలుకోలేకపోయినా మిత్రులను మిస్సవుతున్న కారణంగా...ఈ రాక...)



బాలల దినోత్సవం సందర్భంగా ఇవాళ నాకు సాహిత్యపరంగా,సంగీతపరంగా నాకు చాలా చాలా నచ్చే ఈ పిల్లల పాట ...సినీ సంగీత దర్శకులు ఎం.బి.శ్రీనివాసన్ గారు రేడియో కోసం ఈ పాటకు సంగీతాన్ని అందించారు. మంచి అర్ధంతో కూడిన ఈ అందమైన పాట ఇంకా ప్రాచుర్యం పొందాలని నా ఆశ...

రచన:దాశరధి
సంగీతం:ఎం.బి.శ్రీనివాసన్
పాడినది:వాణీజయరాం బృందం.



పిల్లల్లారా పాపల్లారా
రేపటి భారత పౌరుల్లారా
పెద్దలకే ఒక దారిని చూపే పిల్లల్లారా...పిల్లల్లారా

మీ కన్నుల్లో పున్నమి జాబిలి ఉన్నాడూ
ఉన్నడూ....పొంచున్నాడూ
మీ మనసుల్లో దేముడు కొలువై ఉన్నాడూ
ఉన్నాడూ..అతడున్నాడూ
భారతమాతకు ముద్దుల బిడ్డలు మీరేలే
మీరేలే...మీరేలే..
అమ్మకు మీపై అంతే లేని ప్రేమేలే...
ప్రేమేలే.. ((పిల్లల్లారా))

ఉత్తరాన గల మంచుకొండకు దక్షిణాన గల సముద్రానికీ
ఐకమత్యమూ సాధించే అందమైన ఓ బాలల్లారా
ఆశాజ్యోతులు మీరేలే...((ఉత్తరాన))
కులాల మతాల గుద్దులాటలు
మరిపించేది మీరేలే...మరిపించేది మీరేలే
భాషావేష బేధాలన్ని పారద్రోలేది మీరేలే
రూపుమాపేది మీరేలే ((పిల్లల్లారా))

భారతదేశం ఒకటే ఇల్లు భారతమాతకు మీరే కళ్ళు
మీరే కళ్ళు...
జాతిపతాకం పైకెగరేసి జాతిగౌరవం కాపాడండి
జాతిగౌరవం కాపాడండి(2)
బడిలో బయట అంతా కలిసి భారతీయిలై మెలగండీ
భారతీయిలై మెలగండీ(2)
కన్యకుమారికి కాశ్మీరానికి అన్యోన్యతను పెంచండీ(2)
వీడని బంధం వేయండీ....((పిల్లలారా...))

Saturday, November 7, 2009

స్నేహం..


" సృష్టి లో తీయనిది స్నేహమేనోయి.."
"స్నేహానికన్న మిన్న లోకాన లేదురా.."
"నిజమైన స్నేహితుడు భగవంతుడు ఇచ్చిన వరం..."

"A friend in need is a friend indeed"
"A Friend is one..who comes in when the whole world has goneout.."
"A true friend is a gift of God.."

స్నేహమనగానే ఇలా ఎన్నో నిర్వచనాలు. మనల్ని మనకు కొత్తగా పరిచయం చేసేవారు, మన తప్పులని సరిదిద్దేవారూ, మనలోని మంచి గుణాలను మనకు చూపెట్టేవారు, అంధకారంలో కొట్టుకు పోతూంటే వెలుగు చూపెట్టే నిజమైన స్నేహితులు చాలా అరుదుగా దొరుకుతారు. స్నేహమైనా ప్రేమైనా నాదొకటే సూత్రం-- ఒక వ్యక్తిలోని సద్గుణాలను మాత్రమే ఇష్టపడటం కాదు. ఒక వ్యక్తిని ఆ వ్యక్తిలో మనకు నచ్చని లోపాలతో పాటూ ఇష్టపడాలి. ప్రేమించాలి. అప్పుడే ఏ బంధమైనా గట్టిగా నిలిచేది. నేను నా స్నేహితులను అలానే ప్రేమించాను. ఇవాళ నాకు మిగిలిన స్నేహితులు కూడా నన్ను అలా స్వీకరించినవారే.

జీవితంలో రకరకాల మజిలీలను దాటాకా ఇవాళ్టికీ నా పక్కన నిలబడినవారే నా నిజమైన మిత్రులు. వెనుదిరిగి చూస్తే దారిలో నిలిచిపోయిన వారు, మధ్యలో వీడిపోయినవారూ ఎందరో...! ఆ ఋణం అంతవరకేనన్నమాట అనుకుంటూ ఉంటాను. "ఇది కధ కాదు" చిత్రంలో ఆత్రేయగారన్నారు...

"వెళ్తారు వెళ్లేటివాళ్ళు,
చెప్పేసెయ్ తుది విడుకోలు
ఉంటారు ఋణమున్నవాళ్ళు
వింటారు నీ గుండె రొదలు..." అని.

ఈ సొదంతా ఎందుకంటే...ఇప్పుడే నా క్లోజ్ ఫ్రెండ్ "మధవి" ఫోన్ చేసింది. ఆ ఆనందంలో తన గురించి చెప్పాలనిపించి ఈ టపా...!అందరికీ గొప్ప స్నేహితులు కొందరు ఉంటారు. నాకూ కొద్దిపాటి మంచి మిత్రులు ఉన్నారు. వాళ్లలో మాధవి ఒకర్తి. తనిప్పుడు బొంబాయిలో ఒక బాంక్ లో మేనేజర్. మాధవి తో నా స్నేహం వింతగా జరిగింది. తను నా స్కూల్ ఫ్రెండ్. నేను 8th క్లాస్ లో స్కూల్ మారాను. తను, నేనూ వెరే వేరే సెక్షన్స్. ఆ ఏడు పరిచయమే ఉండేది. 9th క్లాస్ లో మేమిద్దరం ఒకే సెక్షన్లో పడ్దాం. నా లెఖ్ఖల పరిజ్ఞానానికి మా మేథ్స్ సార్ గారు కొంచెం భయపడి, అమ్మా ఇవాళ నుంచీ నువ్వు మాధవి పక్కన కూర్చోమని నా ప్లేస్ మార్చేసారు. మధవీ లెఖ్ఖల్లో ఫస్ట్. సార్ బోర్డ్ మిద చెప్తూంటే అది వెనక నుంచి చెప్పేస్తూ ఉండేది. ఆయన వెనక్కు తిరిగి, "నువ్వు చెప్తావా? నన్ను చెప్పనిస్తావా? " అనేవారు. ఆపేసేది. మళ్ళీ మర్నాడు అదే తంతు. సార్ ఫేవొరేట్ స్టూడెంట్ తను. ఈ లెఖ్ఖలనెవడు కనుక్కున్నాడురా బాబు? అనే టైపు నేను...! మొత్తానికి పక్కన కూర్చోవటం వల్ల కాస్త బానే నేర్చుకున్నాను. అలా మా స్నేహం మొదలైంది.

మా ఇద్దరికీ ఉన్న కామన్ ఇంట్రెస్ట్ "హిందీ పాటలు". ఇద్దరం తెగ పాడేసుకునేవాళ్ళం. నేను బాగా పాడేదాన్నవటo వల్ల తనకీ నాపట్ల ఆసక్తి పెరిగింది. కానీ నాకు కొంచం కోపం ఎక్కువే. కాస్త తిక్క, ఆలోచన తక్కువ, దూకుడు ఎక్కువ. ఒకరోజు నాకు తనమీద ఎందుకో కోపం వచ్చింది. ఆ రోజంతా నేను అసలు తనతో మాట్లాడలేదు. సాయంత్రం స్కూల్ బస్ ఎక్కటానికి వెళ్పోతూంటే నా వెనకే వచ్చి నా చెయ్యి పట్తుకుని ఆపింది..."నా మీద కోపం ఉంటే నన్ను తిట్టు...కానీ నాతో మాట్లాడటం మానద్దు..." అనేసి వెళ్పోయింది. నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి..ఎందుకో దీనికి నేనంటే అంత అభిమానం అని పొంగిపోయాను. ఆ రోజు మొదలు నేనెప్పుడూ తనతో దెబ్బలాడలేదు.

మేం కలిసి చదివుకున్నది రెండు సంవత్సరాలే. ట్రాంస్ఫర్ అయి వాళ్ళు గుంటూరు వెళ్పోయారు. ఇంటర్, డిగ్రీ అక్కడే చేసింది. అప్పుడప్పుడు విజయవాడ వచ్చేది తనే. ఉత్తరాలు రాసుకునేవాళ్ళం చాలా ఏళ్ళు...డిగ్రి అవ్వగానే BSRB రాసింది. బ్రిలియంట్ బ్రైన్ కదా మొదటి ఎటెంప్ట్ లోనే జాబ్ వచ్చేసింది. తర్వాత పి.ఓస్ కి రాస్తే మొత్తం 5,6 బ్యాంకుల్లో ఒకేసారి వచ్చాయి పోస్ట్లు. ఎక్కడ ఏ ఊళ్ళో ఉన్నా ఫోన్లు చేసేది..."నేను ఉద్యోగం చేస్తున్నాను కదే,నేనే చేస్తాను" అనేది. మా ఇరవై రెండేళ్ళ స్నేహం లో నా ప్రతి పుట్టినరోజుకి తన ఫొన్ వస్తుంది. ఒకసారి మద్రాస్ లో ట్రైనింగ్లో ఉంది. నా పుట్టినరోజుకి రాత్రి 9.30 ఫోన్ చేసింది. పొద్దున్నుంచీ కుదరలేదే అని. ఆ మధ్య తనని బ్యాంక్ వాళ్ళు రెండేళ్ళు లండన్ పంపించారు. అప్పుడు కూడా తను నెలకోసారైనా ఫోన్ చేసి మాట్లాడేది. మళ్ళీ మేము బొంబాయిలో ఉన్నప్పుడు అనుకోకుండా ట్రాంస్ఫర్ మీద అక్కడకు వచ్చారు వాళ్ళు. మళ్లీ చాలా ఏళ్ళకు కలిసున్నాం కొన్నాళ్ళు. ఇప్పుడు మేం వచ్చేసినా తను అక్కడే.

తన సిక్స్త్ సెన్స్ ఎలా ఎలర్ట్ చేస్తుందో గానీ నాకు ముడ్ బాగోలేనప్పుడు తన ఫొన్ తప్పక వస్తూంటుంది. చాలా సమయాల్లో నాలో ఎంతో ధైర్యాన్ని నింపింది తను. రెండునెలల క్రితం చాలా రోజులయ్యింది ఫొనుల్లేవని నేనే చేసాను. పాపకి బాలేదు నువ్వు కంగారు పడతావని చెప్పలేదే..అంది. అంత కంగారులో కూడా నేను ఎక్కడ టెంషన్ పడతాననో అని ఆలోచించిందది. ఇందాకా ఫొన్ చేసి చాలా రోజులయ్యిందని బోల్డు సేపు మాట్లాడింది. బొంబాయి లాంటి హడావుడి ఊళ్ళో, లోకల్ ట్రైన్స్ లో తిరుగుతూ, ఉద్యోగం టెంషన్స్ తో, ఇద్దరు పిల్లలతో బిజీ గా ఉన్నా సరే... లోకల్ ట్రైన్స్ లో ఉన్నప్పుడు, ఇంటికి వెళ్ళేప్పుడూ నన్ను పలకరిస్తూ ఉంటుంది. మనసుంటే మార్గం ఉంటుందనటానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి అనిపిస్తుంది నాకు. True friend అంటే తనే కదా మరి.

మన సద్గుణాలనే కాదు, మనలోని లోపాలను కూడా భరించేవారే నిజమైన స్నేహితులు. నా మిత్రులు నాలోని సద్గుణాలను నాకు చూపారు. నాకు తెలియని ప్రత్యేకతలను నాలో చూసారు...నాకు చూపెట్టారు. ఇవాల్టికీ నన్ను వదలకుండా గట్టిగా పట్టుకునే ఉన్నారు. అందుకే వారంతా నా నిజమైన మిత్రులు ...! నాకున్న ఇలాంటి మంచి స్నేహితులు ఇంకొందరి గురించి మరోసారి ఎప్పుడన్నా...

Friday, November 6, 2009

కాశీ యాత్ర

నేను ఏడవ తరగతిలో ఉన్నప్పుడు మేము ఢిల్లీ, ఆగ్రా, హరిద్వార్, ఋషీకేష్, మధుర(శ్రీకృష్ణుని జన్మస్థలం) మొదలైన ప్రదేశాలకు వెళ్ళాం. అప్పుడు హరిద్వార్ దగ్గర మొదటిసారి గంగా స్నానం చేసాను. ఎంత ఆనందంగా పవిత్రంగా అనిపించిందో చెప్పలేను...ఇన్నేళ్ళైనా ఇప్పటికీ నా జ్ఞాపకాల్లో ఆనాటి అనుభూతి నూతనంగానే ఉంది.
మళ్ళీ పది నెలల క్రితం మేము కాశీ, గయ మొదలైన ప్రదేశాలకు వెళ్లినప్పుడు కాశీలో రెండవసారి గంగా స్నానం చేసాను. ఆనందం వేసింది కానీ చిన్నప్పుడు హరిద్వార్ లో ఆ మొదటిసారి పొందిన భావనే గొప్పగా తోచింది నాకు...ఎందుకనో మరి...!!

ఆ రోజు కాశీనాధునికి నా చేతులతో పాలాభిషేకం చేసాను, పువ్వులు వేసాను...విచిత్రంగా నాకు ఏమీ కోరుకోవాలనిపించలేదప్పుడు...అప్రయత్నంగా "ఆదిభిక్షువు వాడినేమి కోరేదీ.." పాట గుర్తుకొచ్చింది.
ఆ రోజు శుక్రవారం. విశాలాక్షి అమ్మవారి గుడి ఖాళీగా ఉంది మేం వెళ్ళినప్పుడు. ఎందుకో మరి మేం అడగకుండానే రండి కూర్చోండి అని కుంకుమపూజ చేయించి, కుంకుమ,గాజులూ ఇచ్చారు ఆ పూజారి. ఎంతైనా "ఇస్త్రీ "ని కదా..చాలా ఫీలయిపొయి ఆనందించేసాను.

అప్పుడు కాశీలో, గయలో తీసిన కొన్ని ఫోటోలు...

తెడ్డుపడవలో కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకోవటానికి వెళ్తూ ఒడ్దున కనబడిన వాటికి తీసిన ఫోటోలు ఇవి
"గంగా ఆయీ కహా సే..." అనే ఆర్.డి.బర్మన్ పాట గుర్తుకు వచ్చింది పడవలో వెళ్తూంటే...









ఇవి "గయ" లో ఒక గుడిలో తీసిన ఫొటోలు..



కార్తీకం లో మీతో కాశీ యాత్ర చేయించేసాను చూసారా... :)

Thursday, November 5, 2009

Main,meri patni aur woh


కమిడియన్స్ ను హీరోలుగా పెట్టి తీసిన చాలా సినిమాలు ఉన్నాయి. వాటిల్లో నాకు తరచూ గుర్తు వచ్చేది "main,meri patni aur woh". నాకు నచ్చే కొందరు హాస్యనటుల్లో "రాజ్ పాల్ యాదవ్" ఒకరు. చాలా విలక్షణమైన నటుడు. హాస్యాని కానీ, దు:ఖాన్ని కానీ సమంగా అభినయించగల సమర్ధత ఉన్న నటుడు. డైరెక్టర్ చందన్ అరోరా తన స్నేహితుడు రాజ్ పాల్ యాదవ్ తో "Mein madhuri dixit banna chahti hoon"(2003) తీసిన తరువాత మళ్ళీ అతనినే హిరోగా పెట్టి తీసిన సినిమా "main,meri patni aur woh"(2005). పెద్దగా పబ్లిసిటీ లేకుండా రిలీజ్ అవ్వడం ములానో ఏమో ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలక్షన్లను తేలేకపోయింది. కానీ హాస్యం, భావోద్వేగాల మేలు కలయికైన ఈ సినిమా నా మనసుకు ఎంత హత్తుకుపొయిందంటే, సుమారు నాలుగేళ్ళ క్రితం టి.విలో చూసిన ఈ చిత్ర సన్నివేశాలు నాకింకా గుర్తున్నాయి.

మిథిలేష్ లక్నో యూనివర్సిటీ లో లైబ్రేరియన్. పెళ్ళి చేసుకునే ఉద్దేశం లేని వాడు. తల్లి,మేనమామ ల బలవంతం మీద ఒక పెళ్ళి చూపులకి వెళ్తాడు. పిల్ల నచ్చలేదని చెప్పాలనుకున్న అతడు వీణను మొదటి చూపులోనే ప్రేమించేస్తాడు. మాటల్లో వారిద్దరి సాహిత్యపు అభిరుచులు కలిసినట్లు గమనించి ఆనందపడిపోతాడు. కానీ, తాను ఆశించిన సభ్యత, సంస్కారం, అందం, ఉన్నత విద్య లతో పాటూ తన కన్నా రెండంగుళాలు పొడుగున్న వీణకి తను తగనేమో అని అభిప్రాయపడతాడు. అనుకోని విధంగా అమ్మాయి ఇష్టపడుతోంది అని తెలిసి పెళ్ళికి ఒప్పేసుకుంటాడు.

ఎంతో అన్యోన్యంగా సంసారం మొదలుపెడతారు వారిద్దరూ. వీణ అతడిని ఎంతగానో ప్రేమిస్తుంది. కానీ రోజులు గడిచేకొద్దీ మిథిలేష్ లో అతడి తాను పొట్టి అని, అందంలో భార్యకు సరిపడననే న్యూనతా భావం ఎక్కువైపోతుంది. పాలవాడు, కూరలబండి వాడు, రిక్షావాడు మొదలుకుని తన స్నేహితుడు సలిమ్ ఇంటికి వచ్చినా అనుమానపడటం మొదలెడతాడు. భార్యతో అతనికి రాఖీ కట్టించి ఊపిరి పీల్చుకోవాలని తహతహలాడిపోతాడు. ఇలాటి సమయంలో ఆకాష్ వారి పొరుగింట్లోకి, జీవితంలోకి ప్రవేశిస్తాడు.

ఆకాష్- వీణలు కాలేజీ స్నేహితులు. సమఉజ్జీలు. ఇద్దరూ కబుర్లలో పడితే లోకాన్ని మర్చిపొయేంత సన్నిహిత మిత్రులు. వారిద్దరి మధ్య తనొక పానకంలో పుడకలాగ ఫీలవటం మొదలుపెడతాడు. కొన్నాళ్ళకి వారిద్దరి స్వచ్చమైన స్నేహాన్ని అనుమానించి తనలో తానే కుమిలిపోతాడు. భర్తను ఎంతగానో ప్రేమించిన వీణ అది తెలిసి అతడిని వదిలి వెళ్ళిపోతుంది. అపార్ధాలు ఎలా తొలగుతాయి, తిరిగి వారిద్దరూ ఎలా కలుస్తారు అన్నది క్లైమాక్స్. సినిమా రెండవ భాగంలో కధనం కొంత స్లో అయినట్లు కనిపిస్తుంది. కొద్దిపాటి లోపాలున్నా, మొత్తం మీద నాకయితే సినిమా బాగా నచ్చింది.ప్రేమతో పాటూ భార్యా భర్తల మధ్య ఉండాల్సింది ఒకరిపై ఒకరికి "నమ్మకం" అన్న సూత్రాన్ని మరోసారి నిరూపిస్తుంది ఈ సినిమా.

పెళ్ళి చూపుల సన్నివేశం,అక్కడ వారిద్దరి డైలాగ్స్, తరువాత ఆకాష్ వీణలు కలిసినప్పుడు వాళ్ళిద్దరి జ్ఞాపకాల కబుర్లూ, సినిమా చివరలో రాజ్పాల్ యాదవ్ అద్భుతమైన నటన, వీణకు అతనికీ మధ్యన జరిగే సంభాషణా ఇవన్నీ చిత్రంలో నాకు బాగా నచ్చిన సన్నివేశాలు.మిథిలేష్ భార్య గా నటించిన రితుపర్ణ సేన్ గుప్తా కుడా చాలా బాగా నటించింది.ఈ చిత్రానికి సంగీతం, సాహిత్యం రెండిటినీ సంజయ్ జైపుర్ వాలే అందించారు.ఈ సినిమాలో మోహిత్ చౌహాన్ పాడిన ఒక పాట నాకు ఇష్టమైన పాటలలో ఒకటి. వారం రోజులనుంచీ ఈ పాట గుర్తుకొచ్చి, ఈ సినిమా గురించి రాయాలని...ఇవాల్టికి అయ్యింది..

---------------
అది ఓపెన్ అవ్వకపొతే Url
http://www.youtube.com/watch?v=VwPrqspu6IE
పాట:
गुंचा कोई मेरॆ नाम कर दिया(२)
साकी ने फिर सॆ मेरा जाम भर दिया(२)
गुंचा कोई ...

तुम जैसा कोई नही इस जहान मे(२)
सुभा को तेरी जुल्फ नॆ शाम कर दिया(२)
साकी ने फिर सॆ मेरा जाम भर दिया(२)
गुंचा कोई ...

मेह्फिल मेइ बार बार इधर दॆखा किया(२)
आखॊ के जंजीरॊ कॊ मेरॆ नाम कर दिया(२)
साकी ने फिर सॆ मेरा जाम भर दिया(२)
गुंचा कोइ...

हॊश बॆखबर सॆ हुऎ उन्कॆ बगैर(२)
वो जॊ हुम् से केह् ना सकॆ दिल नॆ केह दिया(२)
साकी ने फिर सॆ मेरा जाम भर दिया(२)
गुंचा कोइ...
गुंचा कोई मेरॆ नाम कर दिया(२)
साकी ने फिर सॆ मेरा जाम भर दिया(२)
गुंचा कोई ...

(హిందీ తెలియనివాళ్ళకి--"गुंचा" అంటే మొగ్గ అని ఉర్దూ అర్ధం. లిటిరల్ గా ఒక పువ్వు తాలుకు మొగ్గ అని కాదు కానీ విరిసేది, అందమైనది అని అర్ధం వస్తుంది. ఒక కొల్లొక్వియల్ పదం ఇది.)
--------------------

(movie చూసి నాలుగేళ్ల పైన అవటం వల్ల ఈ సినిమా సంబంధిత విషయాలు నేను ఏమైనా మర్చిపోయి ఉండచ్చు.)

Tuesday, November 3, 2009

ఈ పాట గుర్తుందా..?

కొందరు సినీ నటులంటే మనకు ప్రత్యేకమైన ఆసక్తి లేకపొయినా సరే, మనకి ఇష్టమైన వాళ్ళకి ఆ నటుడు/నటి ఇష్టమైతే అప్రయత్నంగా మనమూ వాళ్ళ సినిమాలన్ని చూసేస్తూ ఉంటాము..! మా అన్నయ్యకి చాలా ఇష్టమైన నటుడు "కమల్ హసన్". కమల్ ప్రతి సినిమా వాడు చూడటమే కాకుండా మేమంతా అవి చూసేలా చేయటం వాడికి చిన్నప్పటి నుంచీ అలవాటు. కొన్ని సినిమాలు పాపం వాడు అడగకపోయినా రాగానే మేమే చూసేసేవాళ్ళం. అలా చూసిన ఒక సినిమా "గుణ". సినిమా పెద్దగా ఆడలేదు కానీ ఈ పాట బాగా హిట్ అయ్యింది. (తమిళ్ లో కూడా) ఇళయరాజా సంగీతంతో పాటూ డబ్బింగ్ అయినా సరే పాట సాహిత్యం కూడా బాగా కుదిరింది. కొన్ని డబ్బింగ్ పాటలు సంగీతం బాగున్నా సాహిత్యాన్ని వినలేము...బాబోయ్..అనాలనిపిస్తుంది..

కాలేజి రోజులూ...ఈ పాట.. పొద్దున్నుంచీ గుర్తువస్తున్నాయి... క్లాసులో "లీజర్ పీరియడ్" వస్తే నాతో ఈ పాట అడిగి అడిగి పాడించుకునే వారు మావాళ్ళంతా...నేనేం గొప్ప సింగర్ ను కాదు కానీ బానే పాడతాను. (అదే...ఒకప్పుడు పాడేదాన్ని..!) మా క్లాస్ లో చాలా బాగే పాడే అమ్మాయి ఉండేది...తను ఎన్ని పాడినా, మళ్ళీ నన్ను పిలిచి "గుణ" లో ఈ పాట నేనే బాగా పాడతానని నాతో పాడించుకునేవారు. ఈ పాటది ఒక చిత్రమైన సన్నివేశం....పాట మధ్యలో డైలాగులు కూడా బాగుంటాయి...

ఇదిగో ఆ పాట ఇదే...




అది ఓపెన్ అవ్వని వాళ్ళ కోసం URL
http://www.youtube.com/watch?v=mO59WJTqGro

పాడినది: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ
రచన: వెన్నెలకంటి
సంగీతం: ఇళయరాజా
కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే
ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే
ఊహలన్నీ పాటలే కనుల తొటలో
తొలి కలల కవితలే మాట మాటలో
ఓహో..కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే...

గుండెల్లో గాయమేమో చల్లంగ మానిపోయే
మాయ చేసే ఆ మాయే ప్రేమాయే
ఎంత గాయమైన గానీ నా మేనికేమిగాదు
పువ్వు సోకి నీ సోకు కందేనే
వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నదీ
నాదు శోకమోపలేక నీ గుండె బాధపడితే తాళనన్నదీ
మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదూ
అగ్ని కంటే స్వచ్చమైనదీ
మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా
ఉమాదేవిగా శివుని అర్ధభాగమై నాలోన నిలువుమా
శుభ లాలి లాలి జో లాలి లాలి జో
ఉమాదేవి లాలి జో లాలి లాలి జో
మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా
నా హృదయమా...

Monday, November 2, 2009

ఇవాళ..

ఈ రోజు గురించి నేను పెద్దగా రాసేందుకేమీ లేదు..అందరికీ తెలిసినదే.. కాని నేను ఇవాల్టి సంగతులని, నా ఇవాల్టి అనుభవాలను పంచుకోవాలని... ఇది రాస్తున్నాను..

ఎప్పటిలానే పొద్దున్నే శివాలయానికి వెళ్ళి చక్కగా ఆవునెయ్యిలో నానబెట్టి ఉంచిన వత్తులన్నీ పెద్ద ప్రమిదలో వెలిగించేసి...చంద్రశేఖరాయ నమ: ఓం..అని పాడేసుకున్నాను..! ఈసారి మారేడు,బిల్వ వృక్షాలు రెండు కలిపి ఉన్న చోట పెట్టాను దీపం.

కానీ గుడిలో ఓ పధ్ధతి లేకుండా ఎక్కడ పడితే అక్కడ జనాలు దీపాలు,ముగ్గులూ,పువ్వులూ...తొక్కేవాళ్లూ,తోసేవాళ్ళూ,తుడిచేసేవాళ్ళూ...ఏమిటో మనసు చిన్నబోయింది. మన ఇల్లయితే ఇలా చేస్తామా అనిపించింది. ఇదంతా శుభ్రం చేసుకునే సరికీ గిడివాళ్ళకి ఎంత సమయం పడుతుందో అనిపించింది. కొంచెమన్నా పరిశుభ్రత పాటించరేమిటో మరి..


కానీ ఈ కార్తీకంలో మొదటినుంచీ చెయ్యాలనుకుని చెయ్యలేకపొయిన ఒక పని ఇవాళ చేసాను..చక్కగా పుస్తకం పట్టుకెళ్ళి జనాలు ఎక్కువ లేని ప్రదేశం చూసుకుని, కూర్చుని..శివుడి మీద ఉన్న స్తోత్రాలు,అస్టోత్తరాలూ అన్ని వరస పెట్తి ప్రశాంతంగా చదివేసుకున్నాను..
అక్కడ మావారు లేరు కానీ ఉంటే 'ఓ పనైపోయింది హమ్మయ్యా అనుకున్నావా?' అని ఏడిపించేవారు. ఎందుకంటే మన భక్తి పారవశ్యం ఎంతపాటిదో ఆయనకు తెలుసును.
నిజం చెప్పాలంటే అసలు గుడికి వెళ్తే ఒహ దణ్ణం పెట్టుకుని వచ్చేయటం తప్ప ఏమి తెలిదు నాకు. ఇవాళ ఈ మాత్రం భక్తి నాలో ఉందంటే కారణం ఆయనే...!

ఇంతకీ మనకి ఉపవాసాలు అవీ పెద్దగా నమ్మకం లేదు..చిన్నప్పుడు అమ్మతో కొద్ది సార్లు ఉన్న గుర్తు అంతే..ఈసారి అమ్మ,వదిన,అటు మరదలు,ఇటు మరదలు..అందరూ ఉపవాసం ఉండేస్తున్నామనే సరికి నాకు కొంచెం ఆవేసం వచ్చేసింది...'ఆవేశం ఏనాటిదో..ఉపవాసం ఆనాటిది.." అని ట్యూన్ కట్టేసాను.

కాబట్టి మనమీవేళ ఉపవాసం...ఉండలేకపోవటం లేదు కానీ ఎప్పుడూ ఉండను కాబట్టి విన్నవాళ్ళందరికీ హాచ్చర్యం..!
(ఆయన వింటే ఢామ్మని పడిపోతారు...ఇంకా చెప్పలే పాపం)

"రేపు సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని ముత్తైదు భోజనం నీకే పెట్టుకుంటాను ఊండిపోవే" అంది అమ్మ.ఇవాళ ఉండటానికి నిన్న రాత్రే "అయ్యగారి పర్మిషన్" తీసేసుకున్నాను .
కాబట్టి అమ్మకి సరేనని మాటిచ్చేసాం ! అదీ సంగతి..
అమ్మావాళ్ళింట్లో ఉండటంవల్ల ఇవాళ పెడదామనుకున్న పాటలు అవీ ఏమీ పెట్టలేకపోతున్నాను...

నాగేంద్రహారాయ త్రిలోచనాయ
భస్మాంగరాగాయ మహేశ్వరాయ
నిత్యాయ సుధ్ధాయ దిగంబరాయ
తస్మై మకారాయ నమ:శ్శివాయ

బ్లాగ్వనంలో వనభోజనాలు...వంటకాలతో నేను రెడీ...

ఈ కార్తీక పౌర్ణమి రోజున భోజనాలకి ఈ మావిడి చెట్టు క్రింద కూర్చుందామా..?
జ్యోతి గారి ఆహ్వానంతో వనభోజనాలకు వంటకాలతో రెడీ... (కానీ ఇవాళ నేను ఉపవాసం..ఇవేమీ తినటానికి లేదు..)

నేను 2,3 రకాల వంటకాలను రాస్తున్నాను..


ముందుగా ఒక టిఫిన్ --
పావ్ భాజీ :(కావాల్సినవి)
ఒక నలుగురికైతే 10,12 పావ్ లు తెచ్చుకోవాలి.(బేకరీల్లో దొరుకుతాయి)
100gms నెయ్యి
2,3 చెంచాల నూనె.
సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర చల్లి, కూరలో పిండటానికి 2,3నిమ్మ చెక్కలు

కూర కొసం:
* ముందురోజు ఒక మీడియం గ్లాసుడు బఠాణీలు నానబెట్టుకుని ఉంచుకోవాలి.
* నానిన బఠాణీల తో పాటుగా చిన్న కాలీ ఫ్లవర్,ఒక పెద్ద బంగాళాదుంప,2 కేరెట్లు, ఇష్టం ఉంటే కొద్దిగా క్యాబేజీ తరిగినది...ఇవన్నీ కలిపి బాగా ఉడకపెట్టాలి. కుక్కర్ లో అయితే కొంచెం ఎక్కువ విజిల్స్ రానివ్వాలి.
* దింపాకా మొత్తం బాగా మేష్ చెయ్యాలి.(అంటే చిదిమెయాలి)
* 2 తొమాటోలు, 2 ఉల్లిపాయలు బాగా ముద్దగా గ్రైండ్ చేసి బాగా వేగనివ్వాలి.
* తరువాత 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరికొద్దిగా వేగాకా,బాగా మేష్ చెసి పెటుకున్న కూర ముక్కల ముద్దని దాంట్లో వేసి, ఒక 3 చెంచాల 'పావ్ భాజి మసాలా పౌడర్" వెయ్యాలి.
ఈ పౌడర్ అన్ని సూపర్ మార్కెట్లలోను దొరుకుతుంది. చివరగా ఒక చెంచా నెయ్యి వెయ్యాలి.
* తరువాత , పెనం పెట్టి పావ్ లని నెయ్యితో కాని బటర్తో కానీ మాడకుండా కాల్చాలి...బ్రెడ్ కాల్చుకున్నట్లే.

సర్వ్ చేసేప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర చల్లి, నిమ్మరసం పిండి..ఇవ్వాలి..

పైన ఫొటోలో లాగన్న మాట..:)

**********
ఇప్పుడు భోజనంలోకి ఒక చపాతీ కూర, కొత్తరకం దోసావకాయ.
పచ్చి బొప్పాయి కూర: (చూడటానికి క్యాబేజి కూరలా ఉన్న దీనిని అన్నంలోకి కూడా తినచ్చు.)
కావల్సినవి:

ఒక మీడియం సైజు బొప్పాయి తురుము.
1/2 కొబ్బరి చెక్క తురిముకోవాలి.

పొపుకి : ఆవాలు,మినప్పప్పు,సెనగ పప్పు, 2 పచ్చి మిర్చి, జిలకర్ర,కర్వేపాకు, కావాలంతే ఒక ఎండుమిర్చి, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు.


1)బొప్పాసి తొక్కు తీసేసి, తురిమేసి,కొద్దిగా నీరులో తగినంత ఉప్పువేసి ఒక్క పొంగు వచ్చేదాకా ఉడకబెట్టాలి.ముద్దగా అవ్వకుండా కొద్దిగా ఉడికినట్లు అనిపించగానే దింపేసుకోవాలి.

2)నీరు మిగిలి ఉంటే వడబోసేయాలి పుర్తిగా.

3)మూకుడులో పోపు వేసుకుని కొబ్బరి తురుము వేసుకుని, 2 నిమిషాలయ్యాకా ఉడికిన బొప్పాయి తురుము వేసి 3,4 నిమిషాలలో ఆపేసుకోవాలి.

ఇది చపాతీలలోకి చాలా బాగుంటుంది.
మావారు పూర్తిగా ఖాళీ చేసే ఏకైక కూర ఇది.కాబట్టి ఎక్కువ చేస్తూ ఉంటాను.


కొత్తరకం దోసావకాయ:

దోసావకాయ అంటే చాలామందికి ఎర్ర మిర్చి కారంతో చేసుకునేదే తెలుసు. పెళ్ళిళ్ళలో ఎక్కువ చేస్తూ ఉంటారు. అదికాక పచ్చి మిర్చితో చేసుకునేది మరొకటి ఉంది.

కావాల్సినవి:
ఒక మీడియం దొసకాయ ఇలా తరిగినది.

మేము కారం తక్కువ కాబట్టి ఆ దోసకాయకి నేను 8,9 పచ్చి మిర్చి తీసుకుంటాను.
అన్నీ పేస్ట్ చేసి ఉంచాలి.
దీనిలోకి 2,3 చెంచాల పచ్చి ఆవ పొడి వేసి,(మార్కెత్లో దొరుకుతుంది. లెకపోతే ఇంట్లో గ్రైండ్ చేసుకోవచ్చు.) 4,5 చెంచాల నూనె,తగినంత ఉప్పు వెసి బాగా కలపాలి.

ఈ ముద్దలోకి తరిగిన దోసకాయ ముక్కలు వేసి బాగా కలపాలి.


"ఆవ" వేడి చేస్తుంది కాబట్టి ఇది తిన్న రోజు మజ్జిగ ఎక్కువ తాగాలి.
ఇది నాకు చాలా ఇష్టమైన పదార్ధం.


**********
ఇవాళ స్పెషల్ వంటలు అన్నారు కాబట్టి నెయ్యి,నునె గట్రా బాగా వాడే పదార్ధాలు రాయటం అయ్యింది.
మిగిలిన రొజులు కట్టడిగా తిన్నా, నెలకి ఒక్కసారి తినచ్చు ఇలాగ...:) :)

నిన్న ఇవన్నీ చేసి మా అమ్మగారింట్లో అందరికీ పెట్టాను...బ్లాగ్ కోసం నేను చేసిన పదార్ధాలకి ఫొటోలు తీస్తూంటే
....ఓసినీ..ఇదేమిటి ఇవన్నీ మా కోసం కాదా చేసింది....నీ బ్లాగ్ కోసమా అని మా తమ్ముడు హాచ్చర్యపడి..కించిత్ అలక వహించాడు..!!


Sunday, November 1, 2009

" My lost world..."


వెన్నెలని, వర్షాన్ని, కృష్ణశాస్త్రి గారి రచనల్ని ప్రేమించని మనుషులుంటారా?
ఉండరు కాక ఉండరు..
నేను అంతే...వెన్నెలంటే ఎంతిష్టమో...కృష్ణశాస్త్రిగారు అంటే అంతే ఇష్టం..
వారి జన్మదినం సందర్భంగా మన "ఆంధ్రా షెల్లీ" కృష్ణశాస్త్రి గారిని స్మరిస్తూ..
నాకు చాలా ఇష్టమైన రెండు పాటల్లోని ఈ వాక్యాలు...

"....బ్రతుకంతా ఎదురు చూచు పట్టున రానే రావు..
ఎదురరయని వేళ వచ్చి ఇట్టే మాయమౌతావు..
దారి పొడుగునా తడిసిన పారిజాతములపై నడిచిన
నీ అడుగుల గురుతులే మిగిలినా చాలును...."

(మేఘసందేశం)
*******


"....నీవు వచ్చేవని నీ పిలుపే విని
నీవు వచ్చేవని నీ పిలుపే విని
నీవు వచ్చేవని నీ పిలుపే విని
కన్నుల నీరిడి కలయ చూచితిని
గడియ యేని ఇక విడిచి పోకుమా...
ఎగసిన హృదయము పగులనీకుమా..

ఎన్నినాళ్ళకీ బ్రతుకు పండెనో
ఎంత హాయి ఈ రేయి నిండెనో..."
(మల్లీశ్వరి )

********** *************

"రెండు రోజులు blog ముట్టుకోను" అన్నప్పుడే మావారు అదోరకంగా చూసారు...
ఆ చూపుకర్ధం ఇప్పుడర్ధమయ్యింది..:)

but i have strong reasons...asusual...

నాన్నకు కొంచెం బాలేదని చూద్దామని వచ్చాను...కానీ ఎప్పటిలానే ఈ ఇంట్లో ఉండిపొయిన నా ప్రపంచాన్ని పలకరిస్తూ..వెతుక్కుంటు..అవి ఇవి చూస్తుండగా... చాలా రోజుల్నుంచీ వెతుకుతున్నా నా రెండూ అట్టపెట్టెలు దొరికాయి..."My lost world.."!!

అదీ నా ఆనందానికి కారణం...ఆ పెట్టెల్లో నా ఒకప్పటి ప్రపంచం ఉంది..

కొనుక్కున్న గ్రీటింగ్స్..
రాసుకున్న పాటల డైరీలు...
తెలుగు,హిందీ..ఇంగ్లీష్..దేశభక్తి గీతాలు, గజల్స్, లలిత గీతాలు..ఎన్నో...

కలక్ట్ చేసుకున్న కొటేషన్స్ బుక్స్...
కొన్ని నోట్స్ లు...
ఇంకా కొన్ని కవితలు..డైరీలు...
ఏవేవో పేపర్ కట్టింగ్స్...
హిందు పేపర్ తాలుకూ కొన్ని ఆదివారపు ఫోలియో బుక్స్..
చూసిన ప్రతి సినిమా పేరూ..వివరం..
దాచుకున్న సినిమా టికెట్లు..వాటి వెనుక ఎవరితో వెళ్ళానో + ఆ సినిమా పేరు..

నా ప్రపంచాన్ని చూసి నాకే నవ్వు వచ్చింది..
ఎంత పిచ్చిదాన్ని...అసలు నా అంత పిచ్చివాళ్ళెవరైనా ఊంటారా అని సందేహం..

ఒకప్పుడు ఇదే జీవితం....
ఇప్పుడు ఇవి కేవలం నా జ్ఞాపకాలు...
వీటిని చూస్తే పెదాలపై ఒక చిరునవ్వు...అంతే!!

అవన్నీ చూసి ఏవో లంకె బిందెలు దొరికినంత ఆనందం...
ఆ ఆనందాన్ని మీతో పంచుకోవాలని ఈ ప్రయత్నం..
నా ఖజానాలోని కొద్ది భాగం మిత్రుల కోసం ఈ ఫొటోల రూపంలో...




ఇది కొటేషన్స్, గ్రీటింగ్ కార్డ్ మేటర్స్ రాసుకున్న డైరీలో పేజీ..

"సుమిత్రా నందన్ పంత్" కవిత్వానికి తయారు చేసుకున్న నోట్స్ తాలుకూ పేజీలు..

""మహాదేవి వర్మ" కవితకి తయారు చేసుకున్న నోట్స్ తాలుకూ పేజీలు..

Friday, October 30, 2009

"క్షీరాబ్ధి ద్వాదశి"


(కోటిపల్లి "సోమేశ్వరాలయం" ముందర ఉన్న తులసి చెట్టు ఇది. ఆ మధ్య
తూర్పు గోదావరి ప్రయాణం లో తీసిన ఫొటో.)

ఇవాళ క్షీరాబ్ది ద్వాదశి. ఈ రోజంటే నాకున్న ఇష్టం కొద్దీ లింక్ కూడా పెట్టకుండా, ఆగష్టు 31న రాసిన ఈ టపానే మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను.( అప్పుడు చూడనివాళ్ళ కోసం.)చిన్నప్పుడు తులసికోట ముందర కూర్చిని, బోలెడు దీపాలు పెట్టి, తులసి కోటలో కాయలు ఉన్నా ఉసిరి కొమ్మ పెట్టి అమ్మా చేసే "క్షీరాబ్ధి ద్వాదశి" పూజ అంటే నాకు చాలా ఇష్టంగా ఉండేది.పెళ్ళయ్యాకా నేను చేయటం మొదలెట్టాను...!క్షీరాబ్ధి ద్వాదశి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది.కానీ తెలియనివాళ్ళెవరైనా ఉంటే,వాళ్ళ కోసం--

కార్తీక మాసంలోని శుక్లపక్ష ద్వాదశిని "క్షీరాబ్ధి ద్వాదశి" అంటారు.పురాణ కధనం ప్రకారం--విష్ణువు చెప్పగా,దేవదానవులు పాలకడలిని (క్షీరాబ్ధిని) మధించిన రొజు ఇది.అందువల్ల ఈ పేరు వచ్చింది.అంతేకాక,"ఆషాఢ శుక్ల ఏకాదశి"నాడు యోగనిద్ర ఆరంభించే విష్ణువు "కార్తిక శుధ్ధ ఏకాదశి"నాడు తన నిద్రను ముగిస్తాడు.మరుసటి దినమైన "క్షీరాబ్ధి ద్వాదశి"నాడు శ్రీహరి లక్ష్మీసమేతుడై,బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వస్తాడు.అందువల్ల ఈ రోజుని "బృందావన ద్వాదశి"గా కూడా పిలుస్తారు.ఈ రొజు సాయంత్రం విష్ణుస్వరూపమైన ఉసిరి కొమ్మను,లక్ష్మీ స్వరూపమైన తులసి మొక్క పక్కన పెట్టి పూజ చేస్తారు.ఈ ప్రదేశాన్ని వీలైనన్ని దీపాలతో అలంకరిస్తారు కూడా.సంవత్సరంలో ఏ రోజైనా దీపారాధన చేయకపోతే వచ్చే దోషం,ఈనాడు దీపారాధన చేయటం వల్ల పరిహారమౌతుంది అంటారు.


ఇవాళ బోలెడు పనులు...ముందు వెళ్ళి సాయంత్రం పూజకు "ఉసిరి కొమ్మ" కొని తెచ్చుకోవాలి..ఊళ్ళో బానే దొరుకుతాయని చెప్పారు మరి...! వెంఠనే వ్యాఖ్యలు ప్రచురించకపొయినా, జవాబులు లేటు గా రాసినా ఏమీ అనుకోకండేం...!!

************ ************

వినయక చవితికి ఎక్కడెక్కడ నుంచో పత్రి, రకరకల పువ్వులు తెచ్చి పది,ఇరవై అని అమ్ముతూంటారు...పోనీలే ఇప్పుడే కదా వీళ్ళకి కాసిని డబ్బులు వచ్చేవి అని కొనేస్తూ ఉంటాం కూడా...అలానే ఇవాళ ఉసిరి కొమ్మ కోసం వెళ్తే,
ఉసిరి కాయలతో ఉన్న చిన్న కొమ్మ పదిహేను రూపాయలట ?! "ఔరా" అనుకున్నా కొనక తప్పదుగా. అవసరం మనది..!! చిన్నప్పటినుంచీ
ఫ్రీ గా పక్కింట్లోంచో ,ఎదురింట్లోంచో తెచ్చుకునే అలవాటు మరి....మా ఊళ్ళో అయితే పక్కింట్లోంచి మా దొడ్లోకి ఒరిగి ఆకులూ, కాయలూ అన్నీ మాకే ఇచ్చేదొక ఉసిరి చెట్టు...!!

Thursday, October 29, 2009

వంటొచ్చిన మగాడు ( Just for fun..)


(నేను రాస్తున్నది కేవలం వంటొచ్చిన వారి గురించి. వంట రాని వారితో మరో రకమైన తంటా....అది మరొక టపా లో..)

వంటొచ్చిన మగాడు ( Just for fun..)

"ఇవాళ ఎం వండుతున్నావు?" అని తానే అడుగుతాడు.
"అది కాదు ఇది వండు" అని సలహా ఇస్తాడు.

ఉప్పులు,కారాలూ తేడాలు బాగా కనిపెడతాడు.
ఒహ పట్టాన ఏదీ నచ్చదసలు...
"ఈసారి ఇలా చెయ్యి" అని సలహా ఇస్తాడు.

ఏ కూర ముక్కలు ఏ సైజులో తరగాలో కూడా అడిగి చెయ్యాల్సిందే...లేకపోతే ప్రపంచం లో ఇలా ఎవరన్నా తరుగుతారా అని లెక్చర్లు...

"ఈ కూర దేంట్లో చేసావు? ఇంతకు ముందు దాంట్లో ఏం పోపు వేసావు?" అని ఆరా తీయగల సమర్ధుడు.

"మా అమ్మమ్మ లేక బామ్మ లేక అమ్మ చేసినట్లు చెయ్యటం నేర్చుకోరాదా..." అని ఉచిత సలహా పారేస్తాడు.

వంటకంలో పడాల్సిన వస్తువులు అన్నీ ఉండాలంటాడు. ఒక్క వస్తువు తగ్గినా రాజీ పడడు.
పొరపాటున వంటింట్లోకు వచ్చాడా...."ఇదేమిటి అది లేదా..అప్పుడే వండెయ్యకు..." అని డ్రెస్సు మార్చుకుని బయటకు పరుగెడతాడు...

ఇక తానే వంట మొదలెడితే ....ఇక మిగిలిన వారంతా ప్రేక్షకులవ్వాల్సిందే...
ఆ తరువాత అడవిని పోలిన వంటిల్లు సర్దటానికి ఇల్లాలి పని అయ్యిందే..!

ఇక కోపం వస్తే "వంటొండను పొమ్మనే" అవకాశం ఇల్లాలికి ఉండనే ఉండదు....
తానే ఇంచక్కా ఇష్టమైనవన్నీ వండేసుకుని, తినేసి, "టేబుల్ మీద పెట్టా నీక్కూడా..." అని వెళ్పోయేంత ధీరుడు.

హొటలుకి పోదామంతే మాత్రం....ఏ హొటల్కెళ్ళాలో ఎంతకీ తేల్చడు.....
అక్కడ అది బాగోదు..ఇక్కడ ఇది బాగోదు...అని జడ్జిమెంట్లిస్తాడు...
ఏక్కడికీ వద్దులెమ్మని ఇల్లాలు వంటింట్లోకి దూరే వరకూ....

పండుగలు, పుట్టినరోజులూ గట్రా వస్తే మాత్రం ఇల్లాలికి బెంగే ఉండదు...నేనున్నానని వంటింట్లోకి చొరబడతాడి వంటొచ్చిన మగాడు...

ఏది ఏమైనా వంట రాని ఆడవారు వీరిని కట్టుకుంటే గొప్ప వంటగత్తెలవటం ఖాయం.... !!!

************ **************

(ఇదంతా మావారి గురించి అనుకుంటున్నారా ? అబ్బే ఆయన రెండో రకం....
నీళ్ళు కాచుకోవాలంటే స్టవ్ వెలిగించాలని చన్నీళ్ళే పొసుకునే రకం...:)
ఇదంతా నా ప్రియమైన అన్నయ్య గురించి....(చదివితే కొడతాడేమో...)
కానీ మా వదినమ్మని ఇబ్బంది పెట్టడసలు...
వాడు చేసిన వంటకు వంక పెట్టలేమసలు...
వాడి వంట ముందు దిగదుడుపే అందరూ.....)

Wednesday, October 28, 2009

ముత్యాల ముగ్గు


బాపూగారి అసంఖ్యాక అభిమానుల్లో మా నాన్న ఒకరు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చదువవ్వగానే బాపూను కలిసిన నాన్న ఆయన చెప్పిన మాట విని అక్కడే ఉండిపొతే ఈ సినిమా టైటిల్స్ లో తన పేరు ఉండిపోయేది కదా అని ఇప్పటికీ అనుకుంటూంటారు...!! అప్పట్లో ఈ సినిమా విడుదలైనప్పుడు బాపు గారిది,ఎమ్.వి.ఎల్ గారిది ఆటోగ్రాఫ్ మాత్రం సంపాదించుకున్నారు.(పాతవవటం వల్ల వాటికి ఫొటో తీసినా సరిగ్గా రాలేదు.)

తెలుగు సినిమా చరిత్రలో ఒక ట్రెండ్ సెట్టర్ "ముత్యాలముగ్గు"(1975). సినిమాలోని పాత్రలూ, డైలాగులూ, చిత్రీకరణ, పాటల సాహిత్యం,సంగీతం అన్నీ వేటికవే సాటి.ఇటువంటి గొప్ప సినిమా గురించి నా సొంత జ్ఞానంతో, అక్షరాలతో సమీక్ష రాయటం సాహసమే. ఒక సినిమా గురించి చాలా రకాలుగా రాయచ్చు.నేను కేవలం ఈ సినిమాకున్న ప్రత్యేకతలను మాత్రమే రాయదలిచాను. ఈ సినిమా తాలూకు నవలారూపాన్ని చిన్నప్పటినుంచీ చాలా సార్లు చదివాను. మొదటిసారి సినిమాను మాత్రం మేము టి.వి కొనుక్కున్న కొత్తలో, దూరదర్శన్ వాళ్ళు మధ్యాహ్నం వేసే ప్రాంతీయ భాషా చిత్రాల్లో చూసాను...

జీరో ఫిగర్ లేదా సన్నని ఆకృతి, హెవీ మేకప్, వీలయినన్ని తక్కువ దుస్తులు, గ్లామరస్ లుక్స్....ఇవి ఇవాల్టి ఆధునిక "హీరోయిన్" అర్హతలు, గుర్తులు కూడా. కానీ పెద్ద కళ్ళు, కళ్ళనిండా కాటుక, మేకప్ లేని సహజత్వం, ముద్దబంతి లాంటి రూపం, పొడుగాటి వాల్జెడ, "బాపురే" అనిపించేలాంటి తెలుగుదనం నిండిన అమ్మాయిలు ఆయన బొమ్మల్లాంటి మన బాపూ గారి హీరోయిన్లు. ప్రతి సినిమాలోనూ పాత్రకు తగ్గ రూపం, ఈ పాత్రకి ఈవిడే కరక్ట్ అనిపించేలాంటి ఆర్టిస్ట్ లు.

"అబ్బ...ఎంత పెద్ద కళ్ళు...." అని హీరో తో పాటూ మనమూ ప్రేమలో పడిపోతాము


ముత్యాలముగ్గు లో హీరోయిన్ తో.
"ముత్యమంత పసుపు ముఖమెంత ఛాయ
మత్తైదు కుంకుమ బతుకంత ఛాయ...."
"......తీరైన సంపద ఎవరింట నుండూ
దిన దినము ముగ్గున్న లోగిళ్ళ నుండు...."
".......ఇంటి ఇల్లాలికీ ఎంత సౌభాగ్యం
ఇంటిల్లిపాదికీ అంత వైభోగం......"
అని పాడుతున్నది సుశీల గారైనా నటించిన సంగీత పాత్రను చూసి 'భార్య అంటే ఇలా ఉండాలి' అనుకోని మగవారుండరంటే అతిశయోక్తి కాదేమో..! పనులు చేసుకుంటూనో, ముగ్గు పెట్టుకుంటూనో, ఇల్లు సర్దుకుంటునో ఈ పాటలోని ఆరుద్ర గారి సాహిత్యాన్ని పాడుకోని తెలుగు ఇల్లాలు కూడా ఉండదు.

ఈ సినిమా గురించి చెప్పాల్సిన విశేషాలు చాలా ఉండటం వల్ల కధ గురించి క్లుప్తంగా --
అపార్ధాలతో విడిపోయిన ఒక జంట చివరికి ఎలా కలిసారన్నది ఈ చిత్ర కధాంశం.
స్నేహితుని చెల్లెలి పెళ్ళికి వెళ్ళి, అనుకోని పరిస్థితుల్లో ఆమెను వివాహమాడి ఇంటికి తెస్తాడు శ్రీధర్. అమాయకత్వంతో పాటూ లోకజ్ఞానం కూడా మెండుగా ఉన్న పల్లెటూరి అమ్మాయి లక్ష్మి.పేదింటి పిల్లను కోడలిగా మొదట్లో అంగీకరించలేకపోయినా, ఆమె వల్ల పోయిన దేముడి నగలు దొరకటంతో కోడలు లక్ష్మి తన ఇంటి మహాలక్ష్మి అనే నమ్మకానికి వస్తారు శ్రీధర్ తండ్రి రాజా రామదాసుగారు. ఆయన బావమరిది సోమరాజుకు తన కూతురుని శ్రీధర్ కు కట్టబెట్టి రామదాసుగారి ఆస్తినంతా అనుభవించేయాలని దురాశ. శ్రీధర్ ఒక పేదపిల్లని పెళ్ళాడి రావటం, రామదాసుగారు ఆమెను అంగీకరించటం సహించలేక నూతన దంపతులను విడదియ్యాలని కుట్ర పన్ని ఒక కాంట్రాక్టరు సాయంతో వారిద్దరినీ విడదీస్తాడు. దురాశ దు:ఖానికి చేటు అన్నట్లుగా తాను చేసిన పనికి కూతురివల్ల, కాంట్రాక్టరు వల్ల సోమరాజు ఎన్ని అవమానాలకూ నిందలకూ గురయ్యాడు, తాను తీసిన గోతిలో కాంట్రాక్టరు ఎలా పడ్దాడు, శ్రీధర్,లక్ష్మిల కవల పిల్లలు తెలివిగా తల్లిదండ్రులను చివరికి ఎలా కలిపారు అన్నది మిగిలిన కధ.

చాలా సినిమాలకు ఇతివృత్తాలు మన హిందూ పురాణాల నుంచే సేకరించబడ్డాయి. ఆ సినిమాలు బాగా ఆడాయి కూడా.అలాగే ఉత్తర రామాయణం ఆధారంగా ఈ సినిమా తీయబడిందని అంటారు. బాపు గారికి రాముడంటే ఎంత ఇష్టమో "సంపూర్ణ రామాయణం" "సీతా కల్యాణం" "అందాల రాముడు" మొదలైన సినిమాలు చూస్తే తెలుస్తుంది. ముత్యాల ముగ్గులో కూడా శ్రీరామ పట్టాభిషేకానంతర కధని ఒక సాంఘిక సినిమా రూపాన్నిచ్చి ఎంతో అందంగా మనకందించారు బాపూరమణలు. నారాయణరెడ్ది గారు రచించి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు పాడిన "శ్రీరామ జయ రామ సీతా రామ.." కూడా బాపుగారి రామ భక్తికి నిదర్శనమే !

ఈ సినిమాలో గుర్తుంచుకోదగ్గ "డవిలాగులు"

" యస్సారు గాదు. కళ్ళెట్టుకు సూడు. పైనేదో మర్డర్ జరిగినట్టు లేదూ ఆకాశంలో. సూరిఇడు నెత్తురుగడ్దలా లేడూ"

"ఆ ! మడిసనాక కస్సింత కలాపోసనుండాలయ్యా!! ఉట్టినే తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకీ తేడా ఏటుంటుంది."

"ఆ ముక్క, నే లెక్కెట్టే ముందు సెప్పాల. అసలు నే లెక్కే పెట్టనని నీ ఎదవ ఆలోచన. తప్పు కదూ! జాగర్త డిక్కీలో పెట్టించేస్తాను. "

"కన్నెపిల్ల మనసు అద్దంలా ఉంటుంది. అందులో తాళి కట్టేవాడి బొమ్మ పడగానే అది పటంగా మారిపోతుంది. "
(ఇది బాపూగారికి కూడా బాగా నచ్చిన డైలాగుట.)

"సిఫార్సులతో కాపురాలు చక్కబడవు. బతుకులు బాగుపడవు"

సినిమాకు సంబంధించి కొన్ని విశేషాలు, కబుర్లు

* పన్నెండున్నర లక్షలు ప్రొడక్షన్ కాస్ట్ పెట్టి తీసిన ఈ సినిమా మొదటి రిలీజు ఇరవై నాలుగోవారానికి రెండు కోట్లు వసూలు చేసిందిట.

* రొటీన్ గా వస్తున్న "విలన్" పాత్రకు కొత్త రూపాన్నిచ్చింది ఈ సినిమా. ఈ కొత్త తరహా విలన్ అసాధ్యుడు. అనుకున్నది సాధించే పనితనం ఉన్నవాడు, తన
పనివాడి నమ్మకద్రోహాన్ని కూడా పసిగట్టేంత తెలివైనవాడు, తాను చేసేది దుర్మార్గం అని ఒప్పుకోటానికి వెనుకాడని సాహసి. ఈ పాత్ర స్వర్గీయ రావు గోపాలరావు గారికి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఇప్పటికీ వారీ చిత్రంలో చెప్పిన డైలాగులను అనుకరిస్తున్నారు అంటే ఎంతటి ప్రాముఖ్యత సంపాదించుకున్నరో వేరే చెప్పనవసరం లేదు.

* "ముత్యాల ముగ్గు" లోని బంగళా షూటింగ్ శ్రీమతి ఇందిరా ధన్ రాజ్ గిర్ గారి అనుమతితో హైదరాబాద్ లోని జ్ఞాన్ బాగ్ ప్యాలెస్ లో జరిగింది. సినిమాలో చూపిన కొన్ని నగలు కూడా ఇందిరగారివేనని అంటారు.

* ప్రముఖ సినిమాటోగ్రాఫర్ "ఇషాన్ ఆర్య" ఫొటోగ్రఫీ ఈ చిత్రానికి హైలైట్. కొన్ని "కోకకోలా ఏడ్ ఫిల్మ్స్" చూసాకా బాపు గారికి ఈయనతో పని చేయాలనే ఆలోచన కలిగిందట.

*ఇక అవార్డుల విషయానికి వస్తే, 1975 లో ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రం అవార్డ్ గెలుచుకుంది. బెస్ట్ కలర్ ఫొటోగ్రఫీ కి ఆల్ ఇండియా అవార్డ్ ను కూడా సినిమాటోగ్రాఫర్ ఇషాన్ ఆర్య సంపాదించుకున్నారు. ఇవేకాక ఆంధ్రపదేశ్ ప్రభుత్వం ద్వారా మరెన్నో అవార్డులని కుదా ఈ చిత్రం సొంతం చేసుకుంది.

* బాపు రమణలు సంగీతప్రియులు. మధురమైన కె.వి.మహాదేవన్ సంగీతంతో పాటూ, నూతన దంపతుల సన్నిహిత దృశ్యాల చిత్రీకరణలో ప్రముఖ మేండొలీన్ విద్వాంసుడు Sri Sajjad Hussain గారి 16 నిమిషాల మేండొలిన్ బిట్ అందుకు సాక్షి .

* పేరుపెట్టేదాకా సినిమాను "ముత్యాల ముగ్గు" అని సరదాగా పిలిచేవారట. తర్వాతర్వాత అదే పేరు బాగుందని ఉంచేసారట.

* ఈ చిత్రంలో మాడా, ఆంజనేయస్వామి, పుజారిగారి కుటీరం, సంగీత చీరలు, హలం కట్టుకున్న సింపుల్ చీర, ముద్దొచ్చే కవల పిల్లలూ అన్ని సూపరే...ముఖ్యంగా అల్లు రామలింగయ్య గారు ఆఖరు సీను లో....చాలా బాగా చేస్తారు. ముత్యాలముగ్గు షూటింగు చివరిరోజుల్లో అల్లు రామలింగయ్య గారి కొడుకు ఏక్సిడెంట్ లో మరణించారట. వద్దంటున్నా ఆయన షూటింగుకి వచ్చి "బాధ మరచిపోవాలంటే – పని చేయడం ఒకటే మార్గం" అనేవారుట .

* స్వర్గీయ ఎన్.టి.ఆర్ గారికి ఎంతో ఇష్టమైన సినిమాట ఇది. డైలాగులు, సీన్లు తన చిన్ననాటిరోజులను గుర్తుకు తెస్తున్నాయని అనేవారట. స్కూలు పిల్లలకి వీడియో పాఠాలు తయారుచేసే ప్రోజక్ట్ బాపూరమణలకు అప్పజెప్పినప్పుడు ఇవి "ముత్యాలముగ్గు అంత బాగుండాలి" అనటం ఆ సినిమాకు పెద్ద ప్రశంసే మరి.

* ముళ్లపూడి వెంకటరమణగారి డైలాగులు ఈ చిత్రానికి ప్రాణాలు.


సినిమాలో గుర్తుండిపోయే విషయాలు:

తోటలో సంగీత జామకాయలు కోసి శ్రీధర్ కు కాకెంగిలి చేసి ఇచ్చే సీన్, శాంత శ్రీధర్ కు తేగ పెట్టేప్పుడు చెప్పే కబుర్లు, శ్రీధర్ ఫోటో పడేసుకుని వెళ్పోతే అది తీసుకుని లక్ష్మి ఆనందించే దృశ్యం, రాము ఆంజనేయస్వామితో మాట్లాడే మాటలు... గుర్తుండిపోతాయి.

సినిమాలో పాటలన్నీ బాగుంటాయి కానీ గుంటూరు శేషేంద్ర శర్మ గారు రాసిన ఏకైక సినిమా పాట "నిదురించే తోటలోకి...." , "ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురూ..." నాకిష్టమైనవి. అందరు నటులు తమ తమ పాత్రలకు ప్రాణం పోసారు. శ్రీధర్ నటన కంటే నాకు సంగీత నటనే ఎక్కువ నచ్చుతుంది. బహుశా కధలో ఆమెకు ఎక్కువ ప్రాధాన్యత ఉండటంవల్ల కావచ్చు. చిన్నప్పుడు ఈ సినిమా చూసి అంత ప్రేమించే భర్తకు భార్యపై నమ్మకం లేదేంటి? అది ప్రేమెలా అవుతుంది? అనుకునేదాన్ని. కానీ భార్యాభర్తల మధ్య అనుబంధానికి పునాది "నమ్మకం". అది లేని నాడు బంధాలు తెగిపోతాయి, కాపురాలు కూలిపోతాయి అనే సత్యాన్ని ఈ సినిమా తెలుపుతుంది అని పెద్దయ్యాకా అర్ధమైంది. సినిమా వచ్చి ముఫ్ఫైనాలుగేళ్ళు అయినా ఇంకా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అపురూపమైన చిత్రంగా మిగిలిపోవటానికి సినిమా అంతా నిండిఉన్న తెలుగుదనమే కారణం అనిపిస్తుంది నాకు.




ఇంత రాసినా ఇంకా ఏదో మిగిలిపోయింద నిపిస్తోంది... :)


Monday, October 26, 2009

గ్రీటింగ్స్...


గ్రీటింగ్స్ ... అంటే...
Greetings are wishes....wishes that convey our innermost feelings to the ot
her person. ఇది నా అభిప్రాయం. కొందరికి ఇదొక వృధా ఖర్చు. కానీ నాకు గ్రీటింగ్స్...అంటే పిచ్చి పిచ్చి..!! కాలేజీ రొజుల్లో మా ఊళ్ళో Prabodha, Options, Ashok book center, Archies, Pens n Pads...ఇవే పేరు మోసిన గ్రీటింగ్స్ దొరికే షాపులు. ఈ షాపులన్నీ నా అడ్డాలు. ఎప్పుడన్నా చేంజ్ లేదంటే మళ్ళీ వచ్చినప్పుడు ఇవ్వండి...అనేంత బాగా తెలుసు నేను ఆ షాపులవాళ్ళకి. సమయం దొరికినప్పుడల్లా స్నేహితులతోనో, ఒంటరిగానో వెళ్ళటం పదో ఎన్నో నచ్చినవి, కొత్త రకాలు కొని తెచ్చేసుకోవటం...B'days, New year, Occassions, just born, Bon voyage, Get well soon, just Hi.., GoodDay...అంటు ఎన్ని రకాల కార్డ్స్ ఉంటాయో అన్ని రకాలు నచ్చినవి కొనెయ్యటమే.

"ఎవరికి పంపిస్తావే..ఎందుకు ఇన్ని కొంటావు" అని అమ్మ కేకలేసేది...అవి మన చెవులకి వినబడితే కదా..! కొత్త చొక్కాల తాలూకూ అట్టపెట్టెలు సంపాదించి వాటిల్లో కేటిగొరీల ప్రకారం దాస్తూ ఉండేదాన్ని...అప్పుడు పెద్ద ఖరీదు ఉండేవి కాదు గ్రీటింగ్స్. ఏభై రుపాయల కార్డ్ అంటే చాలా ఖరీదైన కార్డ్. (ఇప్పుడు ఏభై రుపాయిలకు తుక్కులాంటి కార్డ్ కూడా రావట్లేదు.) ఇక స్నేహితులకూ, బంధువులకు ఉత్తరాలు కూడా బాగా రాసేదాన్ని. ప్రతి రోజూ పోస్ట్ మాన్ మా ఇంటికి రావాల్సిందే..ఎవరిదో ఒక లెటర్ తేవాల్సిందే. ఉత్తరాల గురించి నేను రాసిన ఒక పాత టపా "ఇక్కడ" చూడండి. అలా ఉత్తరాలతో పాటూ సందర్భానుసారంగా నేను తయారు చేసిన వాటితో పాటు ఈ కొన్న గ్రీటింగ్స్ కూడా పంపిస్తూ ఉండేదాన్ని...!!

ఇప్పుడు e-cards వచ్చేసాకా కొనటం పుర్తిగా తగ్గిపోయింది. పైగా అన్ని e-mails ఏ కదా. కానీ ఈగ్రీటింగ్స్ మాత్రం మైల్స్ తో నా బంధువులకీ,స్నేహితులందరికీ తప్పకుండా పంపిస్తూ ఉంటాను. అదొక సరదా. మనం ఎదుటి వ్యక్తికి ప్రాముఖ్యం ఇస్తున్నాము అని తెలపటానికి. మన గ్రీటింగ్స్ ద్వారా మరొక వ్యక్తికి ఆనందం కలిగిస్తున్నాము అనే సంతృప్తి కోసం. నాకు తిరిగి అందరూ పంపిస్తారా అంటే...ఖచ్చితంగా పంపించరు. కానీ ఎదుటి మనిషిలాగే మనమూ ఉంటే మనకీ వాళ్ళకీ తేడా ఏంముంటుంది అనేది నా అభిప్రాయం.

ఇక్కడొక చిన్న మధుర స్మృతి...నా పెళ్లైన కొత్తలో "వేలెంటైన్స్ డే" వచ్చింది. "నాకేమన్నా కావాలి" అనడిగాను మావారిని. "ఏం కావాలో చెప్పు" అన్నారు. "గ్రిటింగ్స్ కొనివ్వరా?" అనడిగాను. ఆశ్చర్యపోయారు. "ఏం అడుగుతావో అనుకుంటుంటే...కాయితం ముక్క కావాలంటావేమిటీ?" అన్నారు. "నాకు అదే బంగారమంత ఎక్కువ. అదే కావాలి." అన్నాను. "నేనెప్పుడూ గ్రీటింగ్స్ కొనలేదు. ఎవరికీ ఇవ్వలేదు. ఏ షాపులెక్కడ ఉంటాయో తెలీదు.." అన్నారు. ఈసారి నేనాశ్చర్యపోయాను..కొత్త కదా ఏమంటాం..అని ఊరుకున్నాను. మర్నాడు శనివారం. తనకు హాఫ్ డే ఉండేది (బొంబాయిలో). సాయంత్రమైనా మనిషి ఇంటికి రాలేదు. నాకేమో కంగారూ, భయం.
మనకి పిలవకుండానే పలికే కోపం కూడా వచ్చేసింది...ఇంతలో బెల్ మోగింది...

తలుపు తియ్యగానే ఎర్ర గులాబిల బొకేతో, గ్రీటింగ్స్ పట్టుకుని మావారు..! "ఢాం" అని పడిపో
యా..!! కానీ కొంచెం అలక వహిస్తూ అడిగాను "ఎందుకింత ఆలస్యం?" అని.." అందరిని దారి అడుగుతూ గ్రీటింగ్స్ షాపు వెతుక్కుని వెళ్ళి, కొని తెచ్చేసరికీ ఇంత సేపైంది" అన్నారు. అలసిపొయిన ఆయన మొహం అప్పుడు కనబడింది నాకు...నా కోసం ఇంత కష్టపడ్డారా....కోపమంతా ఎగిరిపోయింది...!! ఆ తర్వాత రెండు రోజులదాకా ఈయన బొకే తెస్తూండగా చూసిన మా వింగ్ లోని ఇరుగు పొరుగు ఆంటీలంతా నన్ను ఏడిపిస్తూనే ఉన్నారు..."క్యా బాత్ హై..?!" అంటూ...

అప్పటినుంచీ పాపం నాకోసం పుట్టినరోజులకీ, పెళ్ళిరోజులకీ మిగిలిన బహుమతులతో పాటూ గ్రీటింగ్స్ కొంటూనే ఉన్నారు మావారు....!!

Saturday, October 24, 2009

సహనం

పిల్లలు ఆడుతూ పాడుతూ ఉంటే ఎంత ఆనందిస్తామో..వాళ్ళు కొంచెం నలత పడితే అంత ఆందోళన చెందుతాము. మళ్ళీ తగ్గేదాకా ఆదుర్దా తప్పదు తల్లిదండ్రులకి...పాపకు రెండు, మూడు రోజుల నుంచీ బాలేదు. మోకాలు మీద చిన్న దెబ్బ తగిలి, అది పుండై, సెప్టిక్ అయ్యి నానా హంగామా...నడవలేదు, నెప్పి, ఏడుపు, గోల...నాల్రోజులుగా స్కూలుకు పంపలేదు కాబట్టి ఇంట్లో తినటానికి నేను ఎంచక్కా రెడిగా దొరికే "ఫాస్ట్ ఫుడ్" ని కూడా దానికి.

ఈపుటే కాస్త సర్దుకుంటోంది అని ధైర్యం వచ్చింది. పాప కోసం హాస్పటల్ కు వెళ్ళిన రెండు మూడుసార్లూ కొత్తగా చేరిన ఆ నర్సుని గమనించాను. "ఆమె"ను గురించే ఈ టపా..

జ్వరాల సీజన్ కాబట్టి హాస్పటల్ నిండా బోలెడు పిల్ల పేషంట్స్... కూర్చోవటానికి కూడా ఖాళీ లేదు..దాన్ని ఎత్తుకుని అరగంట నించునే సరికే నా నడుం లాగటం మొదలెట్టింది. ఆ నర్సుది డాక్టర్గారి గుమ్మం దగ్గర నిలబడి పేషంట్లను లోపలికి పంపే డ్యూటీ. పాతిక ముఫ్ఫై మధ్య వయసు.సన్నగా, పొడుగ్గా, కాటుక కళ్ళతో, చిరునవ్వుతో నన్ను ఇట్టే ఆకట్టుకుంది. ఆమె కూర్చునే కుర్చిలో కూడా పేషంట్లు ఉన్నారు. చిన్న చిన్న పాపలు, బాబులు...మొహాలు వేళ్ళాడేసినవాళ్ళు, జ్వరంతో మూలుగుతున్న వాళ్ళు, నిద్రోతున్న పసిపాపలూ...వాళ్ళ తాలూకూ ఆందోళిత తల్లులు,తండ్రులు.

నెంబరు తీసుకుని వెళ్ళేవారి మధ్యలో రిపోర్ట్ లు చూపించటానికి వచ్చే మరి కొందరు, అర్జంట్ గా వచ్చిన కేసులు...ఇలా రకరకాల వాళ్ళకు అందరికీ ఎంతో ఓపిగ్గా, చిరునవ్వుతో సమాధానాలు చెప్తోంది. "పంపిస్తానండీ..అదిగో వాళ్ళ తరువాత మీరు...వీళ్ళ తరువాత మీరు.." అంటోంది. ఆమె సహనానికి మనసులోనే జోహార్లర్పించాను.రెమ్డు రోజుల క్రితమ్ ఎలా ఉందొ, ఇప్పుడు అదే నవ్వు మొహం. చిన్నప్పటినుంచీ నేను చూసిన చాలా మంది నర్సులు చిరాకుగా, వచ్చిన పేషంట్స్ కి డిక్టేటర్స్ లాగ కసురుకోవటం, ఒక్క చిన్న చిరునవ్వు కూడా లేక చిందులేస్తూ ఉండటమే చూసాను. వాళ్ళ చిరాకులూ పరాకులూ వాళ్ళవి.నిజమే. కానీ వచ్చిన పేషంట్స్ ఎంత కంగారుగా ఉంటారు..అని వీళ్ళు ఆలోచించరా అనుకునేదాన్ని.

అలాంటిది మొదటిసారి అర్భకంగా ఉండీ, గంటలు గంటలు నిల్చుంటూ కూడా, ఓపిగ్గా సమాధానాలు చెప్తూ, అందరినీ గొడవ పడకుండా హేండిల్ చేస్తున్న ఆమె సహనానికి ఆశ్చర్యపడకుండా ఉండలేకపోయాను. Great job..!! అనుకున్నాను. కానీ అర్జెంట్ గా వచ్చిన ఒక కేసుని చూసి మాత్రం చెలించిపోయాను..చిన్న పాప..ఒక సంవత్సరం ఉంటుందేమో...జ్వరం వచ్చి ఫిట్స్ వచ్చాయిట. తల్లి సంగతి సరే, పాపని ఎత్తుకున్న తండ్రి కూడా ఏడుస్తున్నాడు..ఎవరయితేనేం పాపం అన్పించింది....నాకు చిన్నాప్పుడు పాప ICU లో ఉండటం అవీ గుర్తు వచ్చేసాయి..పుట్టిన పదిహేను రోజులదాకా దాని మొహమే చూడలేదు నేను...అసలు ఒళ్ళోకి పాప వస్తుందా అని ఏడుస్తు గడిపిన క్షణాలు...అబ్బ...ఆ నరకాన్ని తలుచుకోవటమే మనేసాను. ఈలోపూ ఆఫీసు నుంచి మావారు
డైరెక్ట్ గా హాస్పటల్ కు వచ్చేసారు. ఆయన్ను చూడగానే జారుతున్న గుండె కొంచెం ధైర్యం తెచ్చుకుంది.

మా నంబరు రావటంతో లోపలికి వెళ్ళాం. "తగ్గిపోతుంది పర్వాలేదు" అని డాక్టర్ ధైర్యం చెప్పాకా స్తిమితపడ్ద మనసుల్తో ఇల్లు చేరాం. ఇవాళ పొద్దున్నకి కాస్త ఎరుపు తగ్గి పుండు మానే స్టేజ్లో కనిపించింది. ఆ నర్సు "సహనాన్ని" గురించి చెప్పాలని నన్ను నేను కంట్రోల్ చేసుకోవటానికి నిన్నంతా మూసేసిన బ్లాగ్ తెరిచి ఈ టపా...!!

Thursday, October 22, 2009

నాగుల చవితి

కార్తికేతు సితే పూజ్యా:
చతుర్యార్ధం కార్త్యికేయక:
మహాచతుర్థీ సా ప్రోక్తో
సర్వపాపహరా శుభా !!

ఇవాళ "నాగులచవితి" . కార్థీక శుధ్ధ చవితి నాడు సుబ్రహ్మణ్యస్వామిని పూజిస్తే సకల పాపాలూ పోతాయంటారు పెద్దలు. ఈ రోజుని "మహా చతుర్థి" అని కూడా అంటారు. పుట్టకు పోయి ఆవుపాలు పోసి, పుట్ట మట్టిని ధరించి, సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి పూజించినవారి అభీష్టాలు నెరవేరతాయని శాస్త్రం. దీపావళి నాడు కాల్చగా మిగిల్చిన కొన్ని టపాకాయల్ని కూడా ఇవాళ పిల్లలతో కాల్పిస్తారు. కొందరికి పుట్టకు పోయే ఆనవాయితి ఉండదు. వారు తమ తమ గృహాల్లోనే సుబ్రహ్మణ్యుని విగ్రహంపై, లేదా గోధుమ పిండితో చేసిన నాగేంద్రునిపై పాలు పోస్తారు. మేము ఇంట్లోనే పాలు పోస్తాము. చిమ్మిలి, చలిమిడి నైవేద్యం చెసి పెడతాము.

చిన్నప్పుడు అడవి లాంటి మా క్వార్టర్స్ లో చాలా పాము పుట్టలు ఉండేవి. నాగులచవితి నాడు తెల్లారేసరికీ బిలబిలమని బోలెడు జనం...పూలు,పాలు,పళ్ళు,పసుపు,కుంకుమ మొదలైన పూజాద్రవ్యాలతో వచ్చేసేవారు. మామూలుగా అక్కడ ఒక క్వార్టర్స్ ఉందని ఎవరికన్నా తెలుసా అనుకునే మాకు, ఇంతమందికి ఇక్కడ పాము పుట్టలు ఉన్నట్లు ఎలా తెలుసా? అని ఆశ్చర్యం కలిగేది.

ఈ సందర్భంగా ఒక చిన్న సంఘటన...క్వార్టర్స్ లో ఉండగానే ఒకసారి ఎవరో చెప్తే, ఐదు వారాలు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసాను. ఐదు మంగళవారాలు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రి పళ్ళు మాత్రమే తినాలి. ఎర్రని పూలతో స్వామికి పూజ చేసి, గుడికి వెళ్ళి....etc..etc...చెయ్యాలి. మనం అత్యంత శ్రధ్ధగా పూజలు చేసేసాం. మొదటి మూడు వారాలూ ఏమీ కలేదు కానీ ఆఖరు రెండు వారాలూ కూడా సాయంత్రం అయ్యే సరికీ మా ఇంట్లోకి పాము వచ్చింది. నాలుగో వారం బోలెడు పుట్టలు ఉన్నాయి కదా అప్పుడప్పుడు వస్తాయి..అనుకున్నాం. కాని ఐదవ మంగళవారం మళ్ళీ ఇంకో పాము వచ్చింది. అబ్బా, నా పుజకి ఎంత శక్తో...అని నేను ఆనందించే లోపూ... మా అమ్మ చాలా భయపడిపోయి....కార్తికేయుణ్ణి పూజించు కానీ ఇంకెప్పుడూ ఈ ఉపవాసపుజ చెయ్యకే అమ్మా....అని గట్టిగా చెప్పేసింది..!

Wednesday, October 21, 2009

ఏమో...


ఏమో...మునుపెలా ఓర్చానో గాయాల్ని....

ఇంతే దు:ఖం అయి ఉంటుంది....
ఇవే కన్నీళ్ళయి ఉంటాయి...
ఇదే నిస్పృహ ఆవరించి ఉంటుంది...
ఏమో...మునుపెలా ఓర్చానో గాయాల్ని....

పగిలి ముక్కలైన మనసుని అతికాను
ఉదాసీనమైన మోములో నవ్వు చిందించాను
వెంట వస్తున్న నిరాశను సాగనంపాను
ఏమో ...మునుపెలా ఓర్చానో గాయాల్ని....

మంచితనాన్ని వాడుకున్న స్నేహపు వంచనలు దాటాను
వదలనంటూనే చేయి వీడిన నేస్తాలను వదిలాను
మాటల బాణాలతో మనసు తూట్లుచేసినా భరించాను
ఏమో..మునుపెలా ఓర్చానో గాయాల్ని....


ఈనాడిలా ఓడిపోయను...
కన్నీటిలో కరిగిపోయాను...
నిట్టూర్పులో ఆవిరయ్యాను...

చెయ్యని నేరానికి దోషినయ్యాను...
ఈనాడిలా ఓడిపోయను...
ఏమో..మునుపెలా ఓర్చానో గాయాల్ని....

Tuesday, October 20, 2009

గుంటూరు శేషేంద్ర శర్మ కవిత

"ఒక్క పువ్వు రంగును చూస్తూ శతాబ్దాలు బ్రతకగలను" అంటారు గుంటూరు శేషేంద్ర శర్మ. ఈయన కవిత్వాన్ని శ్రీ శ్రీ మొదలు విశ్వనాధ సత్యనారాయణ, పుట్టపర్తి నారాయణాచార్యులు దాకా ప్రశంసించారు. తిలక్ సాహిత్యంతో కూడా ఈయన సాహిత్యానికి సామీప్యం కనిపిస్తుంది. వీరిద్దరి కవితల్లో కనబడే భాషా సౌందర్యం ఇతర ఆధునిక కవుల్లో కొంత తక్కువనే చెప్పాలి. శేషేంద్ర శర్మ గారి కవిత్వంలో ప్రకృతి సౌందర్యంతో పాటూ తత్వాన్వేషణ కూడా మిళితమై ఉంటుంది. అందువల్ల మళ్ళి మళ్ళీ ఆ రచనలను చదవాలనే ఆసక్తి, చదివే కొద్ది కొత్త అర్ధాలూ కనబడుతూ ఉంటాయి నాకు.

ఇంతకన్నా గొప్పగా ఆయన కవిత్వాన్ని విశ్లేషించే కవితాశక్తి, అర్హత నాకు లేవు కానీ ఆయన కవిత్వం లోంచి కొన్ని వాక్యాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను...చదివి ఆస్వాదించండి...

"ఎక్కడ పేరులేని పక్షి కొమ్మల్లో కూర్చున్న మాత్రాన
పరిసరాలు పద్యాలుగా మారుతాయో
ఎక్కడ ఎర్ర యూకలిప్టస్ చెట్టు
సంధ్యలో స్నానం చేసి ఆకుల కొసల్లో
ఎర్రపూల బిందువులు వ్రేలాడుతూండగా
ముందుకు వస్తుందో
ఎక్కడ ముద్దుగా ఇంటి మీదికి ఒరిగిన
జాబిల్లి ముద్ద చేతి కందుతాడనిపిస్తుందో

అక్కడికి, ఆ కల లోయల్లోకి
పోదాం పదమంటుంది ఆత్మ
నగ్న వృక్షాల బారినించి తప్పించుకుని
శాంతి యాత్ర చేద్దాం పదమంటుంది.."
__(శాంతియాత్ర : మండే సూర్యుడు)

+++++++++++++++++++++++++

"తుఫాను" కవితలో ఆయనంటారు...
"ఏమోయ్ తుఫాను ఎక్కడికి పోతున్నావ్
నీ ముఖం ఎంత ప్రశాంతమైన అచ్చాదన నీకు
ఉన్నది ఒక్క గుండె
వంద గాయాలకు చోటేక్కడుంది నీలో..."

+++++++++++++++++++++++++

ప్రేమను గురించి ఉపమానాలు పేనుతూంటే
గుండెని కోకిల తన్నుకుపోయింది
గజల్ని గురించి రాద్దామని కూర్చుంటే
రాత్రి కవిత్వంలో తడిసిపోయింది..

+++++++++++++++++++++

మనసు ఇచ్చిన గాయాలను మమత కొనుక్కున్నది
బ్రతుకు సంతలో చివరకు బాటసారి అయినది..

+++++++++++++++++++

"చిన్న నక్షత్రం చేత్తో పట్టుకుని
అంతరాత్మ సందుల్లో ఒక రహస్యాన్ని
తవ్వుతున్నాను
ఎన్నో కోట్ల రాత్రుల పొరల క్రింద
బయటపడింది
మనిషి కోల్పోయిన మొహం
వెయ్యి కిరణాలతో..."

+++++++++++++++++++


"వేళ్ళు కాళ్ళై నడిచే చెట్టు మనిషి
చెట్టుగా ఉంటే ఏడాదికొక వసంతమన్నా దక్కేది
మనిషినై
అన్ని వసంతాలూ కోల్పోయాను.."

+++++++++++++++++++++++++

"...భూమిలో ఉన్న చిన్నారి గింజ
మెడ బయటకు పెట్టి
మొదట వచ్చిన రెండాకుల్ని
చేతులుగా జోడించింది
కృతజ్ఞతతో "

+++++++++++++++

ఒక్కటే :

రాళ్ళెన్ని ఉన్నా దూరాన్ని కొలిచే రాయి ఒక్కటే
పక్షులెన్ని ఉన్నా ఒంటరితనాన్ని
తనమీద వేసుకుని
దిక్కులతో చూపులు కలిపే పక్షి ఒక్కటే

దిక్కులెన్ని ఉన్నా
చూపులతో మాట్లాడే దిక్కు ఒక్కటే
మాటలెన్ని ఉన్నా పొందిందీ లేదు
పోగొట్టుకున్నదీ లేదు
ఈ వెలుగు చీకట్ల సంగమంలో
అని చెప్పే మాట
ఒక్కటే

జీవితం అంతా అరిగిపోగా
చివ్వరి రేణువులా మిగిలి ఉన్న
నా ఉనికి అంతా
ఒక్క జ్ఞాపకం
ఒక్కటే
+++++++++++++++++

శేషేంద్ర శర్మ గారు రాసిన ఒకే ఒక సినిమా పాట "ముత్యాల ముగ్గు " చిత్రంలో ఉంది...
సంగీతం:కె.వి .మహదేవన్
పాడినది: పి.సుశీల

నిదురించే తో్టలోకి పాట ఒకటి వచ్చింది
కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది

రమ్యంగా కుటీరానా రంగవల్లులల్లిందీ
దీనురాలి గూటిలోన దీపంలా వెలిగిందీ
శూన్యమైన వేణువులో ఒక స్వరమ్ కలిపి నిలిపిందీ
ఆకురాలు అడవికి ఒక ఆమని దయచేసింది

విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో
ఆశల అడుగులు వినబడీ అంతలో పోయాయి
కొమ్మల్లో పక్షుల్లారా గగనంలో మబ్బుల్లారా
నది దోచుకుపోతున్న నావను ఆపండి
రేవు బావురుమంటోందని
నావకు చెప్పండి..నావకు చెప్పండి..



Monday, October 19, 2009

యాస్మిన్

బంధుత్వం, సన్నిహితమైన స్నేహం లేకపోయినా కొందరు వ్యక్తులు మన జీవితాల్లో ఎంతో విలువను ఆపాదించుకుని స్మృతుల లోతుల్లో, జ్ఞాపకాల దొంతరలో ప్రియమైన వ్యక్తులుగా మనకు గుర్తుండిపోతారు. నా జీవితంలో అటువంటి కొందరు వ్యక్తుల్లో ఒకరు "యాస్మిన్".

పెద్ద పెద్ద చెట్లతో, అడవిలా అనిపించేది ఆ ప్రదేశం. దాన్ని బాగు చేసి ప్రభుత్వం క్వార్టర్స్ నిర్మించింది. బాబోయ్ అడవిలాగుంది..అనేవాళ్ళందరూ....కాని నాకు చాలా నచ్చేవి... ఆ పెద్ద పెద్ద చెట్లు, పొద్దున్నే పలకరించే రకరకాల పక్షులు, మేము పెంచిన తోట...అన్నీను. ఇంటర్, డిగ్రి, పిజీ.... చదివే రోజుల్లో మేము క్వార్టర్స్ లో ఉండేవాళ్ళం. మేము రెండో అంతస్తులో ఉంటే, రోడ్డుకు మరో పక్క ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ లో "యాస్మిన్" వాళ్ళు ఉండేవారు. వాళ్ల ఇంటి చుట్టూ ఒక కంచె కట్టుకుని బోలెడు మొక్కలు అవీ పెంచేవారు. అవి చూసి సరదాపడి; నేనూ, మా మొదటి ఫ్లోర్లో ఉన్న నా ప్రాణ స్నేహితురాలూ ఇద్దరం క్రింది వాటావాళ్ళ అనుమతి తీసుకుని చెరొక "గార్డెన్" పెంచటం మొదలుపెట్టాము. మా మా పేర్లతో ఆ గార్డెన్లకి బోర్డులు కూడా తగిలించాము. ఆ తోట పెంపకానికి, మరిన్ని మొక్కల కోసం, మేము "యాస్మిన్" ను పరిచయం చేసుకున్నాము. వాళ్ళ దొడ్లోంచి కొన్ని మొక్కలు సంపాదించాము. గులాబీ, చామంతీ, బంతి, కనకాంబరం మొదలైన పూల చేట్లతో పాటూ బెండ, కాకర, గోంగూర, వంగ, పాలకూర, కొత్తిమీర, చుక్క కూర...మొదలైనవన్నీ కూడా పెంచేవాళ్ళం. నేను సంక్రాంతికి ముగ్గులు పెడుటూంటే వచ్చి చూసి వెళ్తూండేది తను.


ఒకరిళ్ళకు ఒకరం ఎప్పుడూ వెళ్ళలేదు. కేవలం రోడ్డు స్నేహమే...! అప్పుడప్పుడు కనబడినప్పుడల్లా నేను యాస్మిన్ తో మాట్లాడుతూ ఉండేదాన్ని. ఒక అర కిలోమీటరు రోడ్దు అయ్యాకా మైన్ గేట్ ఉండేది. మా ఇద్దరి ఇళ్ళ మధ్యన ఉన్న రోడ్దు మీదే మేము కబుర్లు చెప్పుకునేవాళ్ళం. యాస్మిన్ నా కన్నా రెండు,మూడేళ్ళు పెద్దది. బంధువులం కాదు, సమ వయసు కాదు, ఒకే చదువు కాదు, ప్రాణ స్నేహితులం కూడా కాదు...అయినా రోడ్దు మీద కనబడితే మాత్రం ఏమిటో అలా గంటల తరబడి...నిజమే..గంటల తరబడి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. నన్ను చాలా మంది చాలా పేర్లతో పిలిచేవారు...కాని తను మాత్రం ఆప్యాయంగా, అభిమానంగా ఎవ్వరూ పిలవని ఒక పేరుతో నన్ను పిలిచేది. నేనెప్పుడూ అలా పిలవమని అడగలేదు...!

రోడ్దు మీద అటుగా వెళ్ళేవాళ్ళు మమ్మల్ని పలకరించి, దాటి వెళ్పోయి...పని అయ్యాకా తిరిగి వచ్చేప్పుడు ఇంకా అక్కడ నిలబడి మాట్లాడుకుంటున్న మమ్మల్ని చూసి నవ్వేవారు...వాళ్ళ గుమ్మం లో నిలబడ్డ వాళ్ళ అమ్మగారు ఎప్పుడు వస్తుందా అన్నట్లూ చూస్తూ ఉండేవారు....ఇక పైనుంచి మా అమ్మ కూడా పిలుస్తూ ఉండేది...ఆ(... వస్తున్నా.. అనేవాళ్ళం కానీ మా కబుర్లు తెమిలేవి కావు....ఇక రెండు మూడు సార్లు పిలిచాకా ఇయిష్టంగానే ఇళ్ళకు వెళ్ళేవాళ్ళం.అంత సేపు ఏం మాట్లాడుకుంటారే? అనేది అమ్మ. ఏవో..అలా ఒక దాన్లోంచి ఒకదాన్లోకి...చదువులు,సినిమాలు,కాలేజీ కబుర్లు...అలా ఏవో..పిచ్చాపాటి...! ఏమిటో ఆ బంధం మరి..కొందరి వ్యక్తులు అలా ఆత్మీయులైపోతారు.ఆ అనుబంధం, స్నేహం ఏర్పడ్ద వ్యక్తులకి తప్ప మిగిలిన వాళ్ళకు అది అర్ధం కాదు...! కొన్ని బంధాలంతే.

నేను డిగ్రీ ఫైనల్లో ఉండగా ట్రాన్స్ఫర్ మీద వాళ్ళు వేరే ఊరు వెళ్పోయారు.ఆ తరువాత ఎప్పుడూ కలవలేదు. ఇప్పుడెక్కడున్నారో కూడా తెలీదు...జ్ఞాపకాల దొంతరలో మాత్రం ప్రియమైన వ్యక్తిగా గుర్తుండిపోయింది...!!

Saturday, October 17, 2009

దీపముల వరుసే "దీపావళి "


దీపముల వరుసే "దీపావళి ". నరకసురుని సంహారంతో ప్రజలు ఆనందంతో చేసుకున్న పండుగ ఇది.ముందు ఐదు రొజులు చేసుకోవాల్సిన ఈ పండుగ శాస్త్రియ పధ్ధతి...

శాస్త్రీయంగా దీపావళిని అయిదు రోజులు చేసుకోవాలి.ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి అమావాస్య, గోవర్ధన పూజ, భగినీ హస్త భోజనం. ఉత్తరాదిన ఐదు రొజులూ జరుపుకుంటారు.


ధనత్రయోదశి:దీనిని "ధన్ తెరస్" అని కూడా అంటారు. మహాభారతంలో ధర్మరాజుకు అతడు పోగొట్టుకున్న రాజ్యలక్ష్మిని మరలా సంపాదించుకునేందుకు ఉపాయం చెప్తూ కృష్ణుడు బలి చక్రవర్తి కధ చెప్పి, ధర్మరాజును కూడా అలా లక్ష్మీ పూజలూ,దీపారాధనలూ చేయమంటాడు. బలి చక్రవర్తి కధ ఏమిటంటే :
వామనరూపంలో వచ్చినది విష్ణువు అని తెలిసి కూడా దానమిచ్చాడని, వామనుడు బలిని కోరిక కోరుకోమంటాడు. అప్పుడు బలి చక్రవర్తి ఆశ్వయుజ బహుళ త్రయోదశి నుంచీ అమావాస్య వరకూ మూడురోజులూ ప్రజలందరూ దీపారాధనలు చేసుకుని,అందువల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందేలాగ అనుగ్రహించమని కోరుకుంటాడు. అప్పటి నుంచీ మూడు రోజులూ లక్ష్మీపూజ చేసుకోవటం మొదలైంది.

ఈ రోజున ఆవునేతితో దీపం వెలిగించి శ్రీ సూక్తం చదువుకుంటే ఆర్ధికపరమైన ఇబ్బందులు ఉండవని అంటారు.

నరక చతుర్దశి:
నువ్వుల నూనె తలపై పెట్టుకుని తలంటు పోసుకోవాలి. కొందరు 'ఉత్తరేణి'ఆకులను కుడా తలపై పెట్టుకుని తలంటు పోసుకుంటారు.నరకాసురుడు మరణించిన రోజు ఇది.
ఈ రోజున మినపగారెలు తింటే మంచిదని అంటారు.

దీపావళి అమావాస్య:
ఈ రోజున సాయంత్రం దివిటీలు కొట్టడం ఒక సంప్రదాయం.(కారణం
ఇక్కడ ఈ టపాలో..)
మట్టి ప్రమిదలలో నువ్వులనూనెతో దీపాలు వెలిగించి, పూజా మందిరంలో,సింహద్వారానికి ఇరువైపులా,తులసి కోటవద్ద, వీధి గుమ్మం వద్ద ఉంచాలి. దీపాలకు నమస్కరించి,తరువాత టపాసులు కాల్చాలి.

గోవర్ధన పుజ:
ఈ రోజున గోపూజ చేస్తే ఎంతో పుణ్యమని అంటారు.

భగినీహస్తభోజనం:
ఆ రోజున అన్నదమ్ములు అక్కాచెల్లెళ్ళ ఇళ్ళకు వెళ్ళి భోజనం చేసి, వారికి కానుకలు ఇస్తారు. దీన్నే మనవారు "అన్నాచెల్లెళ్ళ భోజనాలు" అంటారు.

ఇక కొన్ని పురాణాలలో,పురాణగాధలలో "దీపావళి" గురించిన ప్రస్తావన :

* విష్ణు పురాణం ప్రకారం వామనుడు బలి చక్రవర్తి ని పాతాళానికి త్రొక్కగానే తిరిగి ఇంద్రుడు దేవతలకు రాజైన సందర్భంలో వారు ఆనందోత్సాహాలతో స్వర్గం లో దీపావళి జరుపుకున్నారు.

* ఉత్తర భారతంలో శ్రీరాముడు వనవాసానంతరం, అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడైన వేళ ప్రజలు దీపావళి జరుపుకున్నారు.

* కురుక్షేత్ర మహాసంగ్రామంలో విజయుడైన ధర్మరాజు పట్టాభిషిక్తుడైన వేళ ప్రజలు పట్టణమంతా దీపాలు వెలిగించి కాంతులు విరజిమ్మారుట.

* పద్మ పురాణం ప్రకారం క్షీరసాగర మధనం సందర్భంలో లక్ష్మీదేవి ఉద్భవించినప్పుడు దీపాన్ని వెలిగించటం ఆచారమైందని, అదే దీపావళి అని తెలుపుతుంది.

* కాళికా పురాణం ప్రకారం రాక్షస సంహారానంతరం కాళికాదేవిని లక్ష్మి, జ్యోతి రూపములతో ఆరాధించటం జరిగింది. దుర్వాసుడి శాప కారణంగా రాజ్యాన్ని కోల్పోయిన ఇంద్రుడు, విష్ణువు చెప్పిన విధంగా "జ్యోతి"ని లక్ష్మిగా ఆరాధించారు దేవతలు. అదే దీపావళి.



"దీపం జ్యోతి: పరంబ్రహ్మా దిపం సర్వ తమోపహారం
దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మీ నమోస్తుతే"


(ఈ పండుగ గురించి నేను చదివిన , విన్న విశేషాలు చెప్పాలని ఈ టపా రాయటం జరిగింది. 'లా పాయింట్లు ' తీస్తే సమాధానం రాయబడదు.)