సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Saturday, July 4, 2009

పాపిడీ!

మా అమ్మగారి పుట్టిల్లు రాజమండ్రీ..తాతయ్య మా చిన్నప్పుడే కాలం చేసారు.ఆయనకు 8మంది సంతానం.22మంది మనుమలం మేము.ప్రతి సంవత్సరం ఆయన ఆబ్దీకానికి తప్పనిసరిగా అందరం కలుసుకుంటూ ఉండేవాళ్ళం.ఆ వంకతో అయినా పిల్లలందరూ ఒకసారి మళ్ళీ సరదాగా కలుస్తారని మా పెద్దలందరూ మమ్మలను రాజమండ్రీ తీసుకెళ్ళేవారు.కనీసం 16మంది మనుమలమయినా తప్పకుండా జమయ్యేవాళ్ళాం.అందరి ఆటలు,అరుపులు,చంటిపిల్లల కేరింతలతో ఇల్లు మారుమోగుతూ ఉండేది.మా అందరినీ చూసి మా అమ్మమ్మ సంబరపడుతూ ఉండేది.మా ఆఖరు పిన్ని వచ్చేప్పుడు మా అందరు ఆడపిల్లలకి రిబ్బన్లు,రబ్బర్ బాండ్స్,అవి ఇవి తెచ్చి ఇస్తూ ఉండేది.అయితే మా అందరికీ అక్కడా ఇష్టమైనది ఇంకొకటి ఉండేది.మధ్యాహ్నం అయ్యేసరికి టంగ్,టంగ్ అని గంట కొట్టుకుంటూ వచ్చే "పాపిడీ బండి వాడు"!
అక్కడ ఉన్నన్ని రొజులూ మా పిన్ని మా అందరికీ రొజూ పాపిడీ కొనిపెట్టేది.మధ్యహ్న్నం అయ్యేసరికి అందరం అరుగుమీదకి చేరి ఎప్పుడు పాపిడీ బండివాడు వస్తాడా అని ఎదురు చూసేవాళ్ళం.అంత ఇష్టం మాకందరికీ పాపిడీ అంటే.ఇంక కాలేజీల్లోకి వచ్చాకా నెమ్మదిగా కలవటాలు తక్కువైపోయి 2,3ఏళ్ళకి ఒక సారి మాత్రమే వెళ్ళేవాళ్ళం.ఇప్పుడు అదీ లేదు..కుదిరినఫ్ఫుడు ఎవరి ఊరన్న వెళ్ళాటం తప్ప!!
పెళ్ళయ్యాక ఒకరొజు మా వీధిలో 'పాపిడీ' అన్న అరుపు విని నేను చాలా సరదా పడ్డాను.నాకు చాల ఇష్టం అన్నానని పాపం మా మరిది 'నేను తెస్తాను ఉండు వదినా' అని వీధిలోకి వెళ్ళి 5నిమిషాల తరువాత ఒక ఆకు దొన్నెలో చెక్కప్పచ్చుల లాటిదాని మీద పెరుగు,ఇంకా ఏదొ చట్నీ ఉన్న ఒక పదార్ధం తెచ్చాడు.ఇదేమిటి?అన్నను.ఇదే పాపిడీ! అన్నడు.(అది పాపిడీ చాట్ అని నాకు తరువాత తెలిసింది) నేను అన్న పాపిడీ ఇది కాదు వేరెది అని..పాపిడీ ని వర్ణించటానికి ప్రయత్నించాను.ఆఖరుకి మా అత్తగారు,మరిది 'ఒహో పాపిడీ అంటే పీచుమిఠాయా?" అన్నారు.'అబ్బే పీచుమిఠాయి అంటే ఎక్ష్జిబిషన్లో అమ్ముతారు,పెద్ద పుల్లకి గులాబీ రంగులో చుట్టబడిన వేరే పదార్ధం ' అన్నాను.అదేమిటి వీళ్లకి పాపిడీ కూడా తెలేదా?అని ఆశ్చర్యపోయాను.తరువాత మాటల్లో తెలిసింది వాళ్ళు పాపిడీ ని "పీచుమిఠాయి" అనే పిలుస్తారని;అక్కడి వాళ్ళకి 'పాపిడీ' అంటే "పాపిడీ చట్" అని, "సోన్ పాపిడీ" అంటేనే నాకు తెలిసిన "పాపిడీ" అని !!
ఇప్పటికీ ఎక్కడైనా పాపిడీ కనిపిస్తే వెంటనే కొనేస్తూ ఉంటాను!

20 comments:

MIRCHY VARMA OKA MANCHI PILLODU said...

చాలా బాగుంది తృష్ణ..... గారు,
నాకు పాపిడి తిన్న రొజులు జ్ఞాపకము చేశారు.

Anonymous said...

నా బెల్లం మిఠాయి గొడవలాగ ఉంది , మీ పాపిడి వ్యవహారం. ఒక్కసారి తణుకు లో దొరికే " పాపిడీ" తినండి. నోట్లో కరిగిపోతుంది. ఇప్పటికీ వీలున్నప్పుడల్లా కొంటూంటాము.

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

మేము మాఊళ్ళో దాన్ని డిల్లీపాక్ అంటాం.. తెల్లగా, పీచులాగా, డబ్బాలో పెట్టుంటారూ. ఆది డబ్బులకే కాక పాత ఇనుపవస్తువులకు కూడా ఇచ్చేవాడు. నేను, మాఫ్రెండ్ కలిసి ఒకసారి పక్కింట్‌లో ఉన్న ఇనపవస్తువులు( ఒంటిపూటబడి సమయంలో) ఎత్తుకొచ్చి ఇచ్చేశాం.

తృష్ణ said...

mirchi varmagAru,thanks for the visit.

తృష్ణ said...

harephala gAru,తణుకు వెళ్తే తప్పక మీరు చెప్పినట్లూ పాపిడీ కొనుక్కుంటానండీ.

తృష్ణ said...

చైతన్యా,మరి మీ పక్కింటివాళ్ళు తరువాత దెబ్బలాడలేదా?లేక మీరు యెత్తుకుపోయినట్లు తెలియదా?

మురళి said...

మేము దీన్ని సోన్ పాపిడి అని అనేవాళ్ళం.. మా బాధ పడలేక ఓసారి వంటాయాన్ని పెట్టి చేయించారు.. బాగున్నాయండి పాపిడి కబుర్లు.. నేనేదో ఆభరణం అనుకున్నా చదవకముందు..

కొత్త పాళీ said...

పాప్డీ సోన్ పాప్డీ .. యం యం.
నిజమే, కొన్ని ఊళ్ళల్లో పాప్డీ అంటే పాప్డీ చాట్ మాత్రమే అని తెలిసి వారి అజ్ఞానానికి చాలా బాధ వేసింది.
మళ్ళీ ఉత్తరాహులు చేసే సోన్ పాప్డీ రుచిలోనూ టెక్స్చర్లోనూ వేరేగా ఉంటుంది. మనవేపు చేసినట్టు సన్నటి పూసగా ఉండదు.

శ్రీనివాస్ పప్పు said...

పాపిడి వేరు,పీచు మిఠాయి వేరు.పాపిడి(సోంపాపిడి అని కూడా అంటారు)అంటే కొంచం పుల్లలు పుల్లలుగా ఉంటుంది,
ఇకపోతే పీచు మిఠాయి అంటే ఓ పుల్లకి బూజు చుట్టినట్టూ చుట్టీ ఇస్తాడు కొంచం గులాబిరంగులో ఉంటుంది.
రెండూ తీపి పదార్ధాలే.దేని రుచి దానిదే,ఏదయిన సూపరే...
ఇంతకీ మీరు ఏది తిన్నట్టుట....

తృష్ణ said...

మురళిగారు,చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఒకడు వచ్చి పాపిడీ చేస్తున్నా పక్కింట్లొ అని మా నాలుగు వాటాల వాళ్లదగ్గరా డబ్బులు తీసుకుని ఉడాఇంచాడు.సాయంత్రందాకా చూసి పక్కింట్లోకి వెళ్ళి అడిగితే ఎవరూ రాలేదన్నారు..:))
("పాపిడి పిందె" అని పాపిట్లో పెట్టుకునే ఆభరణం ఉంది నిజమే.)


కొత్తపాళీగారు,అవునండీ మన సన్న పాపిడీ రుచే వేరు.

శ్రీనివాస్ గారూ,పీచుమిఠాయి వేరే గులాబీరంగుది.తెలుసు.అది నేను ప్రతిసంవత్సరం వచ్చే ఎక్ష్జిబిషన్ లోనే తినేదాన్ని.నేను రాసింది లేత పసుపు రంగులో ఉండే సన్నని పాపిడీ గురించేనండీ.

Anonymous said...

హల్దీ రాం వాళ్ళ సోన్ పాపిడి తినండి చాలా బాగుంటుంది.

పరిమళం said...

రాజమండ్రి ప్రసాద్ చౌదరి గారి (ఫేమస్ స్కిన్ డాక్టర్ ) హాస్పటల్ పక్కనే పాపిడి చేసేవారు . మనం నెయ్యి ,జీడిపప్పు ,యాలకులూ ఇస్తే కేజీకి ఇంతని తీసుకొని స్పెషల్ పాపిడీ చేసి ఇచ్చేవారు. తలుచుకొంటేనే నోరూరుతుంది .వాడుకలో సోం పాపిడి అంటాం .మీ ముచ్చట్లతో మరోసారి గుర్తుచేశారు .

జ్యోతి said...

బాగు బాగు... నేను మీ జట్టు.. డబ్బాలలో ఉత్తరాదివారి పాప్డి నాకు నచ్చదు. బండి మీద గ్లాసు సీసాలో పెట్టి అమ్మేది కొని దాచుకుని కొంచం కొంచం తింటాను. మావారు,పిల్లలు ఒకటే నవ్వు. నవ్వితే నాకేటి అని నేను పట్టిచ్చుకోనంతే..నా చిన్నప్పుడైతే వేసవి సెలవుల్లో పాత పుస్తకాలు ఇచ్చి ఈ పాప్డీ తీసుకునేది.

శేఖర్ పెద్దగోపు said...

తృష్ణ గారు,
మా ఊళ్ళో సోంపాపిడి అనేవారు. ఖాళీ పారాచూట్ ఆయిల్ డబ్బాలు, కోల్గేట్ టిన్ డబ్బాలు గట్రా ఇచ్చి పాపిడి తీసుకునేవాళ్ళం. ఎంతో అపురూపంగా బొటన్ వేలు, చూపుడు వేలు మధ్యలోకి పాపిడి కొద్దికొద్దిగ్గా తీసుకుని చాలసేపు తినేవాళ్ళం. మా ఊళ్ళో ఒక దీర్ఘచతురస్త్రాకారపు గాజు డబ్బాలో పాపిడి వేసి, ఒక బండి మీద దాన్ని పెట్టి, బండి క్రింద గంట సెట్ చేసి, దానికి ఒక తాడు కట్టి అది లాగి టంగ్...టంగ్ అంటూ వచ్చేవాడు పాపిడి అమ్మేఆయన.
పాపిడి ప్రియులు ఎవరుండరు చెప్పండి?
బావుంది మీ టపా.

Padmarpita said...

పాపిడిలాగే తియ్యగా ఉంది మీ టపా!!

సృజన said...

మీ టపా చదివాను బాగుంది. ఇప్పుడు అర్జంటుగా పాపిడీ తినాలని కాని ఎలా అర్థరాత్రి కదా. రేపు తప్పకుండా తింటాను.

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

ఆరోజు ఎందుకో అలా చెశాను. మళ్లీ ఎప్పుడూ చెయ్యలేదు. వాళ్లకి నాపై అనుమానం రాదు. ఎందుకంటే నన్ను చూస్తే "స్వామివాళ్ల అబ్బాయా పాపం అలాటివి చెయ్యడులె "అని వాళ్లలో వాళ్లే అనుకొంటారు. హహహ

తృష్ణ said...

బొనగిరిగారు, హల్దిరాం వారి సొంపాపిడీ కూడా చాలాసార్లు తిన్నాను కానీ నాకు ఆ బండివాడి పాపిడీనే నచ్చుతుంది.

పరిమళాంగారు,ధన్యవాదాలు.రాజమండ్రీలో మీరు చెప్పిన చోట్లో ఇంకా పాపిడీ తయారు చేస్తారాండీ?

జ్యోతిగారూ,నిజంగా అంతేనండీ నేను కూడా నవ్వితే నవ్వనీ అని నా తిండిపని నే కానిచ్చేస్తాను.అది పాపిడీ అయినా సరే,పుల్ల కుల్ఫీ అయినా సరే.

తృష్ణ said...

శేఖర్ గారూ,అన్ని ఊళ్లలో పాపిడీ బండిలు అలానే ఉంటాయేమోనండీ.
ధన్యవాదాలు.
పద్మార్పితగారు,చైతన్యగారు,ధన్యవాదాలు.

తృష్ణ said...

సృజన గారూ,థాంక్స్ అండీ.అంత రాత్రిదాక మెలకువగా ఉన్నారా?నిద్రకు టైం సరిపొవద్దూ?ఒహో ఇవాళ ఆదివారం అనా?!