సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, July 17, 2009

ఆఖిలన్ -- "చిత్రసుందరి"

మా నాన్నగారింట్లో ఉన్న అన్నిరకాల పుస్తకాల్లో ఉన్న అతికొద్ది నవలల్లొ--నేను మళ్ళి మళ్ళి చదివిన పుస్తకాల్లో ఇది ఒకటి.నా దగ్గర ఉన్నది విజయవాడ కమలా పబ్లిషింగ్ హౌస్ వాళ్ళ మొదటి ముద్రణ(1983)-కాపి.ఆ తరువాతి ముద్రణ వివరాలు నాకు తెలుయవు మరి.
---------------------------------------------------
ఆఖిలన్ -- "చిత్ర సుందరి"

ప్రఖ్యాత తమిళ రచయిత ఆఖిలన్ గారు రాసిన "చిత్తిర పావై"(చిత్రంలోని సుందరి అని అర్ధం)1975లో ప్రతిష్ఠాత్మకమైన భారతీయ జ్ఞానపిఠ అవార్డుని అందుకుంది.ఆ నవలని తెలుగులొకి శ్రి మధురాంతకం రాజారాంగారు అనువదించారు "చిత్ర సుందరి" అని.అప్పటి సామాజిక పరిస్థితుల ఆధారంగా రాసిన ఈ నవల చాలా భారతీయ భాషలలోకి అనువదించబడింది.ఇక్కడ అఖిలన్ గారి గురించి కొంత చెప్పుకొవాలి...
... దాదాపు 45దాకా ఉన్న ఆయన రచనలు అన్ని భారతీయ భాషలలోకీ అనువదింపబడ్డాయి.కొన్నయితే జర్మన్,చైనిస్,రష్యన్,చెక్,పొలిష్ మొదలైన అనేక స్వదేశీ భాషలలోకి కూడా అనువదింపబడ్డాయి. ఏ మనిషయినా ఆలొచించటానికి కుడా వెనుకాడే కొన్ని యదార్ధాలు ఆయన రచనలలో కనిపిస్తాయి.అదే ఆయన ప్రత్యేకత.."రచయిత అనేవాడు పాఠకులు ఏది అడుగుతారొ అది రాయకూడదు...పాఠకులు ఏమి తెలుసుకోవాలో అది రాయాలి" అంటారు ఆఖిలన్.గాంధేయవాది అయిన ఆయన రచనల ప్రధానాంశం సమాజొధ్ధరణ.అఖిలన్ గారి గురించిన వివరాలు ఈ లింకులొ దొరుకుతాయి.http://en.wikipedia.org/wiki/అకిలన్

మధురాంతకం రాజారాం గారు తెలుగులోకి అనువదించిన ఈ నవల పేరు 'చిత్రసుందరి'. అప్పటి సమకాలీన సామాజిక పరిస్థితులపై రాసిన కధ ఇది.అణ్ణామలై అనే ఒక యువకుడు,చిత్రకారుడైన అతని జీవితం ఈ నవల ప్రధానంశం.ఈ నవల ముగింపు అప్పటి రొజుల్లొ కూడా ఎంతొ ఉత్తమమైనదిగా ప్రశంసలందుకుంది. ఈ నవలకు కధానాయకుడు,చిత్రకారుడు,సౌమ్యుడు, అయిన అణ్ణామలై; తన పిరికితనం వల్ల తనతొ పాటూ మరొ ఇద్దరు యువతుల జీవితాలు తలక్రిందులు చేసిన వ్యక్తిగా కాక, ఒక అమాయకుడైన చిత్రకారుడిగానే మన జ్ఞాపకాలలో మిగిలిపోతాడు. ఆదర్శప్రాయమైనది,ఆరాధింపతగినది అయిన స్త్రీత్వానికి సజీవ వ్యాఖ్యానంలాంటి అణ్ణామలై ఇష్టదేవత ఆనంది ఈ నవలానాయిక.తన తొందరపాటు,దూకుడు స్వభావం,అహంకారాల వల్ల భర్తకు,తనకు మన:శాంతిని పోగొట్టి,చివరికి తన జివితాన్నే కోల్పోయిన అభాగిని పాత్ర సుందరిది.ఇక దయా,దాక్షిణ్యం,సేవానిరతి,త్యాగశిలత మొదలైన దివ్యగుణాలకు కాణాచిగా ఒక ఆదర్శమహిళ పాత్ర శారదది.ఈ పాత్రలు,కధకి మౌనసాక్షి అయిన నాగమల్లి చెట్టు,ఆ పూలు మన స్మృతులలో చాలా కాలం వరకూ తిరగాడుతూనే ఉంటాయి.
ఈ నవలలోని కొన్ని గుర్తుంచుకోదగ్గ నిత్యసత్యాలైన కొన్ని వాక్యాలు.....
"ఒకానొక విలక్షణమైన దృశ్యాన్ని చూచినప్పుడు కవికి వర్ణించాలనిపిస్తూంది.చిత్రకారుడికి బొమ్మగీయాలనిపిస్తుంది. గాయకుడికి తన భావాన్ని పాట ద్వారా ప్రకటించాలనిపిస్తుంది."

"ఎక్కడొ ఒకచోట యాధృచ్చికంగా మనకు తారసిల్లిన కొందరు,మన జీవితంలో ఒక గణనీయమైన మార్పు రావటానికి కారణభూతులైపోవటం విచిత్రమే!నివిరుగప్పిన నిప్పులా మనలో దాగి ఉన్న ఒక విశెష గుణాన్ని వాళ్ళు మన చేత గుర్తింపచేస్తారు."

"ఒక వ్యక్తిని నిన్నటివరకూ పొగడ్తలతొ ముంచెత్తి,ఈ రొజు తిట్లదండకంతొ నోరు నొచ్చేటట్టుగా శపించి, రేపటినుంచీ అతడి పట్ల ఇంకొకరకంగా వ్యవహరిన్చటమనేది మానవ స్వభావంలోని ఒక సహజ దౌర్భల్యమేమో ననవచ్చు.."

"మనుషులు మనుషులుగానే ఉండాలి గానీ మనుషుల్లాగ ఉండకూడదు.మనుషుల్లాగ ఉండేవాళ్ళన్దరూ నకిలీ మనుషులే.."

"మనిషి అంతరంగాన్ని,ఆలోచనలని,ప్రవర్తనని అందంగా దిద్ది తీర్చేదే సాహిత్యం."

"మనిషి తనకెక్కడ లేని ఆధిక్యతనీ ఆపాదించుకుంటాడు.శ్మశానవాటిక ఆ ఆధిక్యతను వెక్కిరిస్తుంది.ధీరులు,భీరువులు,ధనికులు,నిర్ధనులు,యొగులు,భొగులు అందరూ ఇక్కడ పిడికెడు బూడిదగా మారిపొతారు."

"ఎవరికి చేతనైన సహాయాలు గనుక వారు యితరులకు చేయగలిగినట్లయితే ఈలొకమిన్ని కష్టాలకు,దు:ఖాలకు నిలయమై ఉండేది కాదేమో..."


ఇలాటి ఎన్నొ విలువైన సత్యాలని పొందుపర్చుకున్న ఈ నవల ప్రతి సాహిత్యాభిమానీ చదవతగినది.



7 comments:

Kathi Mahesh Kumar said...

మంచి నవలను పరిచయం చేసారు.
1983 నే ఆఖరి ముద్రణ. ఇప్పుడు ఈ పుస్తకం ముద్రణలో లేదు. నేను కష్టపడి ఒక కాపీ సంపాదించి పెట్టుకున్నాను. చాలా మంచి నవల. అనువాదం...అదుర్స్!

తృష్ణ said...

మహేష్ గారు,ముద్రణ వివరాలు తెలిపినందుకు ధన్యవాదాలు.

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

మంచి పుస్తకం. బాగావివరించారు

సృజన said...

మంచి టపా...మంచి మంచి మాటలతో!

తృష్ణ said...

చైతన్యా,సృజనగారు,

నవల దొరికితే చదవండి.బాగుంటుంది.ధన్యవాదాలు.

మురళి said...

నవల దొరికే మార్గం ఉంటే చెప్పండి..

తృష్ణ said...

@ మురళి: విశాలాంధ్రలో కనుక్కొవటం...లేకపొతే విజయవాడ లో అది పబ్లిష్ అయిన కమలా పబ్లిషింగ్ హౌస్ లోనో లేక నవోదయాలొనో ఎవరినయినా కనుక్కోమనటం !!ఆ మధ్యన ఏదొ బుక్ ఫెస్టివల్ లో చూసిన గుర్తు అయితే ఉంది మరి.
ధన్యవాదాలు.