మూడవరోజు పొద్దున్నే మేము వెళ్లవలసిన కొందరు పెళ్ళివారితో అమ్మ వచ్చింది.యానాం వెళ్ళే కారులో అమ్మతో పాటూ పాపని పంపేసాము.మాతో తిరిగి తిరిగి అలసిపోయిన దాన్ని ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక.హమ్మయ్యా!అనుకున్నాం.కాకినాడ నుంచి ఒక స్పెషల్ రైలు కోటిపల్లి దాకా ఉన్నదట.మూడే బోగీలతో ముచ్చటగా ఉన్న ఆ బుల్లి రైలు ఎక్కాం ఇద్దరం.తొమ్మిదిన్నరకి ఎక్కితే పదకొండింటికి "ద్రాక్షారామ" చేరాం.ఈ బుల్లిరైలు ప్రయాణాన్ని ఎంత ఎంజోయ్ చేసామంటే చెప్పలేను.మా ఎదురుగా ఒక స్కూలు పాప కూర్చుంది.మైత్రి !చక్కగా నవ్వుతూ కబుర్లు చెప్పింది.సార్ధక నామధేయం.ఆ మంచి,మర్యదా..సంస్కారం పెంపకం వల్లే కదా అబ్బుతాయి అనుకున్నాం.
"ద్రాక్షారామ" చేరాం.ఇది "ద్రాక్షారామం" అనుకునేవాళ్లం.కానీ ఇక్కడ అన్ని చోట్లా "ద్రాక్షారామ" అనే రాసి ఉంది.పాతబడిన చిన్న స్టేషన్.చుట్టూరా పొలాలూ,ఖాళీ స్థలాలూ..అక్కడక్కడ ఇద్దరుముగ్గురు మనుషులు..."ఎటెళ్ళాలి?"అని అడిగితే ఓ దారి చూపించి.."అటు" అన్నాడొకడు.ఆ నిశ్శబ్ద ప్రకృతిని ఆస్వాదిస్తూ పొలం గట్లమ్మట ఉన్న సన్నని కాలిబాటలో ఓ మైలు దూరం వెళ్ళాకా ఊరు వచ్చింది.ఇంకో మైలు దూరం వెళ్ళాకా మెయిన్ రోడ్దు వచ్చింది.అక్కడ ఓ షేర్ ఆటొ ఎక్కి ద్రాక్షారామ చేరాం.గుడి మూసే వేళవుతోందని త్వరగా లోనికి వెళ్ళాం.ఈ గుడి విశాలంగా అందంగా ఉంటుంది.పంచారామాల్లో అమరావతిలో అమరేశ్వరుడినీ,సామర్లకోటలో కుమారరామ-భీమేశ్వరుడినీ,భీమవరంలో సొమేశ్వరుడునీ, ద్రాక్షారం లోని ఈ భీమేశ్వరుడినీ చూసే సౌభాగ్యం చిన్నప్పుడే లభించింది.ఇక పాలకొల్లులోని రామలింగేశ్వరుడిని దర్శించుకోవాలి. ఈ ద్రాక్షారామ భీమేశ్వరాయల చరిత్రని,ఆలయపు ఫొటోలనూ ఈ క్రింద చూడచ్చు.
(ఇది ఆలయంలోని కోనేరు)
అదయ్యాకా "కోటిపల్లి" అక్కడికి 15నిమిషాలే అని తెలుసుకుని అక్కడికి బయల్దేరాం.."జోర్సై పార్సై...కోటిపల్లి రేవుకై..."అని పాడుకుంటూ...!మధ్యాహ్న్నం వేళైనా చల్లని గాలితొ గోదారమ్మ స్వాగతం పలికింది.గుడి చూసి మళ్ళి సాయంత్రానికి యానాం వెళ్ళాల్సి ఉండటంతో ఇంక పడవలో ఆ రేవు దాటే ప్రయత్నం విరమించుకున్నాం.కోటిపల్లి రేవు దాటిటే ముక్తేశ్వరం వస్తూంది.అక్కడ ముక్తేశ్వరాలయం ఉంది.అసలీ ప్రదేశం పేరు "కోటిఫలి"ట.అది కాలక్రమంలో "కోటిపల్లి" అయిపోయిందట."కోటిఫలి సొమేశ్వరాలయం" ఇక్కడ చూడవచ్చు...తరువాత రేవు ఫొటోలు..
ఇక అసలు వచ్చిన పని..."పెళ్ళి"కి బయల్దేరాం.యానాం చేరే సరికీ సాయంత్రం అయ్యింది.పుణ్యక్షేత్రాలు దర్శించుకుని వచ్చాం కదా అని ఇంక పెళ్ళివారేమనలేదు పాపం.అక్కడ ఉన్న గోదారి ఒడ్డుకి పెళ్లయ్యాకా బాగా రాత్రి వెళ్ళాం. పెద్ద పెద్ద ఏనుగు బొమ్మలు మధ్యలో ఉన్న శివలింగానికి అభిషేకం చేస్తున్నట్లుగా విగ్రహాలను ప్రతిష్టించారు అక్కడ.ఎంతో చూడ ముచ్చటగా ఉన్న ఆ ఫవూంటెన్ని చూసి, ఆ జల్లులో తడవకుండా అక్కడ నుంచి రాలేము.కానీ బాగా చీకటి పడిపోయి ఫొటోలు తీసుకోలేకపోయాం.అదొక్కటే ప్రయాణంలో లోటుగా మిగిడిపోయింది.
(రేపు ఆఖరు మజిలీ...యలమంచలి;హరిపురం లో ఒక "అగ్రికల్చరల్ ఫార్మ్" కబుర్లు)
9 comments:
ద్రాక్షారామం ,కోటిపల్లి విశేషాలు ....చక్కగా వివరించారు .ఫోటోలు బావున్నాయి .
నాకు తెలిసి అది దక్షుని యొక్క ఆరామం..దక్షారామం.. కాలక్రమంలో దాక్షారామం.. మనవాళ్ళ నోళ్ళలో ద్రాక్షారం ఐపోయింది.. ద్రాక్షారామం అనే పేరుకి వేరే ఏదైనా చరిత్ర ఉందేమో తెలీదు.. ద్రాక్షారం పేరు విన్నప్పుడల్లా శ్రీరమణ గారి 'మిధునం' లో బుచ్చిలక్ష్మి డైలాగు 'ఆ ద్రాక్షారం సమ్మంధమే అయిఉంటేనా..' గుర్తుకొస్తుంది అప్రయత్నంగా.. కాకినాడ- కోటిపల్లి బుల్లి రైలు ప్రయాణం గురించి ఓసారెప్పుడో వంశీ ఓ వ్యాసం రాశారండి.. చదివితే వెంటనే ఆ రైలెక్కాలనిపిస్తుంది.. బాగుందండి మీ టపా.. మా చేత కూడా ప్రయాణం చేయించారు..
very nice narration. I will come back again. I have memories belong to those places in deed.
ఇంతకు కోటిపల్లి రేవు అంటే ఏ ఫొటో పైన? శివుడూ కనపడుతున్నదా? చాలా బాగున్నాయి ఫొటో లు. గోదవరి ఎంత అందం గా వుందో.. ఏమిటో ఎక్కెడెక్కడీ ప్రపంచ వింతలు అంటూ పరిగెడతాము పక్కనే వున్న సౌందర్యానికి కళ్ళు మూసుకు పోతాయి కదా. బాగున్నాయి తృష్ణ. ఇవి అన్ని మాతో ఇంత వివరం గా పంచుకుంటున్నందుకు థ్యాంక్స్.
హ్మ్!! మనవాళ్ళు ఒరిజినాల్టీని దూరంచేస్తారు. ఎందుకో అర్ధం కాదు. పైన ఉన్న శివుణ్ణి చూడండి. నాకు అలా రంగులు రంగులు ఉంటే ఎందుకో అంత నచ్చదు. అలానే దొరికినకాడికి సున్నం పుయ్యటం. మా ఊళ్ళో ఒకానొకప్పటి శాసనాలు చెక్కిన రాళ్ళకి అంచులు పోతున్నాయ్ అని చిమెంటేసేసి చక్కగా మొత్తం సున్నం పూసేసారు. అవి ఇప్పుడు చదవలేనివిగా తయ్యారయ్యాయి.
టూరిజం ముసుగులో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లేక సిమెంటు మిశ్రమాలతో చేసిన నిలువెత్తు రంగుబొమ్మలు మన నిజమైన కళాకృతులను మింగేస్తున్నాయ్.
@ పరిమళం:ధన్యవాదాలు.
@ మురళి: మీరు రాసినది కరక్టేనండి.దక్ష ప్రజాపతి యజ్ఞం చెసిన దక్షవాటిక,దక్షుని ఆరామం అయినందువల్ల ఈ గ్రామానికి "దక్షారామం" అని పేరు వచ్చింది. కాలక్రమాన దక్షారామం...దాక్షారామం...ద్రాక్షారామం...ద్రాక్షారం...అయ్యిందండి.
అవును "మిధునం"లో వారి డైలాగులు,వారి పాత్రలు ఎప్పుడు కళ్ళ ముందు మెదులుతునే ఉంటాయి..
నా టపాలకి మిరు కాస్త 4,5వాక్యాలు రాసిన మొదటి వ్యాఖ్య ఇదేనండి :)..ధన్యవాదాలు.
@ ఉష: ధన్యవాదాలు.మి పున:దర్శనానికి ఎదురుచూస్తూంటానండి..
@ భావన:రెండు,మూడూ ఫొటోలు పెట్టానండి.. ఆఖరులో ఉన్నది కోటిపల్లిదే..మరో రెండు పబ్లిష్ చేస్తున్న సమయంలో ఏదో పొరపాటు వల్ల ఎగిరిపోయాయి.ఇంక మళ్ళీ సరి చేసే సమయం లేక ఊరుకున్నానండి.
మన రాష్ట్రంలోనే ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ప్రాచుర్యం పొందకపోవడం వల్ల మరుగున పడిపోయాయండి.టూరిజం వాళ్ళీ విషయంలో ఏదైనా చేస్తే బాగుంటుంది మరి..!!
@ భాస్కర్ రామరాజు: అవునండి..రంగులు లేకపోయినా రాతి విగ్రహాల అందమే వేరు..పాత బ్లేక్ &వైట్ చిత్రాలు కూడా రంగులు లేకపోయినా ఎంతొ అందంగా అనిపిస్తాయి.
కాకినాడ దగ్గర 30చ.కి.మీ.విస్తీర్ణంగల యానాం 1954 దాకాభారత్ లో ఫ్రెంచ్ కాలనీగా ఉంది.నేడు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో భాగం.1954లో లో విమోచనం చెంది స్వతంత్రభారతావనిలో విలీనంచెందినా 1956 లో భాషా ప్రాతిపదికన తెలుగు రాష్ట్రంలో కలవలేదు.1948లో హైదరాబాద్ ను పోలీసు చర్యజరిపి ఇండియాలో కలిపారు.1949 లో అప్పటికి ఒక ఫ్రెంచి కాలనీ గా ఉన్న చంద్రనాగూర్, సమీపంలోని బెంగాల్ రాష్ట్రంలో విలీనం అయింది. కాకినాడ మునిసిపల్ కౌన్సిల్ కూడా యానాన్ని కలపాలని తీర్మానం చేసింది. 870కి.మీ దూరంలోని తమిళ పుదుచ్చేరి నుండి పాలన కష్టంగా ఉంది.పుదుచ్చేరికి యానాం ప్రజల ప్రయాణం ఆంధ్రలోని కాకినాడ నుండి జరుగుతుంది.దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని యానాంలో ఏర్పాటు చేయాలని యానాం కాంగ్రెస్ తీర్మానించింది.ఇండోర్ స్టేడియం,కళ్యాణమండపం,ధవళేశ్వరం-యానాం మంచినీటి ప్రాజెక్టులకు రాజశేఖరరెడ్డి పేరు పెడతామని పుదుచేరి రెవిన్యూ మంత్రి మల్లాడి కృష్ణారావు చెప్పారు. తెలుగుజాతి సమైఖ్యత,భాషాప్రయుక్తరాష్ట్ర ప్రధాన ఉద్దేశ్యం యానాం ఆంధ్రప్రదేశ్ లో కలిస్తే నెరవేరుతుంది.తెలుగుతల్లి బిడ్డలందరూ ఒకేరాష్ట్రంగా ఉంటారు.సమైక్యాంధ్ర కోసం ఇప్పుడు ఉద్యమాలు జరుగుతున్నాయి గనుక భౌగోళికంగా సామీప్యత, 100% తెలుగు ప్రజలున్న యానాం ను ఇప్పటికైనా తమిళ పుదుచ్చేరి నుండి విడదీసి సమైక్యాంధ్రలో కలపాలి.కలిస్తే బాగుంటుందని ఆశ.
Post a Comment