సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, August 18, 2009

తూర్పు గోదావరి ప్రయాణం


ఆకుపచ్చని తివాచీ పరిచినట్లున్న పచ్చని పంటపొలాలు
ఆ పంటపొలాలపై ఎగిరే తెల్లని కొంగలూ,రకరకాల పక్షులు
పక్కగా ప్రవహించే పిల్ల కాలువలూ...వికసించిన తామరలూ
పొలంపనులు చేస్తున్న పడతులు ...ఎరువులు పిచ్చికారీ చేస్తున్న రైతులూ...
వానజల్లుకి తడిసిన మట్టిలోంచి వచ్చే కమ్మటి సువాసన...
పరవళ్ళు తొక్కుతున్న తల్లి గోదారి...
చేపలు పట్టే జాలరులు...తెడ్డువేసే కుర్రపిల్లలూ...
బ్రిడ్జిమీది రైలూ....బ్రిడ్జి క్రింద పొడుగాటి నావలు...
ఇవీ మాకు స్వాగతం చెప్పిన తూర్పు గొదావరి జిల్లా అందాలు!!
...ఇలాంటి ప్రకృతి అందాలన్నింటినీ చూడగానే పులకించని మనసు ఉంటుందా..?

ఒక పెళ్ళి సందర్భంగా తూర్పు గోదావరి జిల్లాకు వెళ్ళిన మేము,అక్కడ కొన్ని ప్రదేశాలు చుట్టిరావాలని నిర్ణయించుకున్నాము. నాలుగు రోజుల్లో అన్నీ చూసేయాలి అన్న కోరిక కాస్త దురాశతో కూడినదే అయినా..ఎంతవరకైతే అంత అని బయల్దేరాము.దేశాంతరాలూ,దేశమూ తిరగటం కన్నా ముందర మన ఆంధ్ర రాష్ట్రాన్ని పూర్తిగా సందర్శించాలన్నది మా ప్రయాణాల జాబితాలో ప్రధానాంశం.అంతేకాక,మన దేశంలో ఉన్న అసంఖ్యాకమైన,ప్రసస్తమైన,ప్రసిధ్ధి గాంచిన ఆలయాలలో వీలైనన్ని గుళ్ళూ,గోపురాలూ చూడాలన్నది మా ఇద్దరి కోరికానూ!తు.గో.జీ లో పెళ్ళికి వెళ్ళడానికి నిర్ణయించుకోగానే, ఆ చుట్టు పక్కల చూడతగ్గ ఆలయాలను లిస్ట్ రాసుకుని,వాటిల్లో ఎన్ని కుదురుతాయో అంచనా వేసాము.

పెళ్లికీ,ఆలయాలకే కాక అటువైపు ఉన్న ఇరువైపుల బంధువర్గాలను కూడా నిరాశపర్చకూడదన్నది ముఖ్యమైన విషయం.అందరినీ సంతృప్తి పరచడమనే కత్తి మీద సాము చేస్తూ,కర్రవిరిగినా పాము చావకుండా అన్నట్లు..ఓపిక వీడినా ప్రయాణం కొనసాగిస్తూ;అనుకున్న ప్రదేశాలన్నీ వీక్షించి,అనుకున్న నాలుగు రోజుల ప్రయాణాన్నీ పూర్తిగా సద్వినియోగపరుచుకున్నాం. తు.గొ.జిలో మేము వెళ్ళిన,చూసిన ప్రదేశాల పేర్లు ఏమిటంటే--కాకినాడ,రాజమండ్రి,బిక్కవోలు,ద్వారపూడి,ద్రాక్షారామ,కోటిపల్లి,కొద్దిగా ముందరికి వెళ్ళి జిల్లా అంచు దాటగానే ఉన్న యానాంలో పెళ్ళి చూసుకుని...వెనుకకి కాకినాడ మళ్ళీ వచ్చి;ఇంకొంచెం ముందరికి, అంటే విశాఖ జిల్లా పొలిమేరలో ఉన్న యలమంచలి కూడా వెళ్ళి,అక్కడనుంచి దగ్గరలోని హరిపురానికి కూడా వెళ్ళి మళ్ళీ కాకినాడ వచ్చి రాత్రికి గౌతమీ ఎక్కి నిన్ననే ఇల్లు చేరాము..!

అమ్మానాన్నలవి ఉభయ గొదావరిజిల్లాలూ....నే పెరిగింది కృష్ణాజిల్లాలో.మూడు జిల్లాలూ ప్రియమయినవే అనిపిస్తాయి వెళ్ళినప్పుడల్లా!నేను అటువైపు చిన్నప్పటినుంచీ చాలాసార్లు వెళ్ళినా,ప్రస్తుతం చాలా ఏళ్ల తరువాత,అందులో పెళ్లయ్యాకా మావారితో,పాపతో ఇదే అటువైపు వెళ్లటం.అందువల్ల బంధువులను పలుకరించటం తప్పనిసరి అని నిర్ణయించుకున్నాము. పేరుకి వేరు వేరు ఊళ్ళు అయినా,దూరాన్ని బట్టి చూస్తే చాలా దగ్గరగా ఉండే చిన్న చిన్న ఊళ్ళూ,ఆ ప్రశాంత వాతావరణం,దారిలో కనువిందు చేసిన పంటపొలాలూ,సెలయేళ్ళూ....సిటీలో విసుగెత్తిన పరుగుపందెపు జివితానికి ఒక మంచి బ్రేక్.....!

షార్ట్ కట్ తోవలో వెళ్లాలని కారు అబ్బాయి పొలాల మధ్యనున్న మట్టి రోడ్డులో తీసుకువెళ్లాడు.పచ్చని పొలాల మధ్యన మెల్లగా కారు వెళ్తూంటే తెలియని హాయి....గుండెల నిండా ఆ చల్లని స్వచ్చమైన కలుషితం లేని గాలిని పిల్చుకున్నప్పుడు కలిగిన ఆనందం వర్ణించలేను!ఆరురూపాయలకి అద్భుతమైన సాంబారు ఇడ్లీ,పన్నెండు రూపాయలకి కమ్మటి ఉల్లి రవ్వ దోసా తిన్నాకా ఇంక సిటీకి వెనక్కి వెళ్ళాలా అనే బాధ మొదలైన క్షణాలు కూడా ఉన్నాయి..! ఇక ప్రయాణపు ఇక్కట్ల విషయానికి వస్తే __ అక్కడి చెమటనూ,జిడ్డుతో నిండిపోయే మా మొహాలనూ;సమయాభావంవల్ల చాలా మటుకూ టాక్సీలలోనే ప్రయాణించగా,అవసరార్ధం ప్రయాణించిన కొన్ని సమయానికి రాని బస్సులనూ,వాటిలోని రద్దీనీ మాత్రం భరించటం కష్టమే అయ్యింది.చిన్నప్పుడు ఎలా భరించామో మరి!(బహుశా అలవాటు తప్పటం వల్ల కావచ్చు..!!)

ఇవీ.. క్లుప్తంగా మా తూర్పు గోదావరి ప్రయాణం విశేషాలు.ఇంకా యానాం దగ్గర "మడ అడవులు","రాజమండ్రీ నుంచి భద్రాచలం బోటు ప్రయాణం","కోనసీమ",సముద్రమంచున వచ్చే ఊళ్లాన్నీ చూడాలనే కోరికలు మిగిలి ఉన్నాయి....మరోసారెప్పుడో ఆ ట్రిప్ ప్లాన్ చేయాలి!! మేము దర్శించిన కొన్ని ఆలయాల వివరాలూ,కొన్ని ఫొటోలూ రెండు,మూడు టపాల్లోకి విభజించాను...!బిక్కవోలు,ద్వారపూడి ఆలయ వివరాలు నా తదుపరి టపాలల్లో.....

(క్రింద ఉన్నవి రైలు లోంచి తీసిన కొన్ని ఫొటొలూ,రాజమండ్రీలో బొటులోంచి తీసిన గోదారి ఒడ్డు..)












18 comments:

రాధిక said...

మొదటి పారాగ్రాఫు అద్దిరిపోయిందండి.ద్వారపూడికి చాలా దగ్గర మా ఊరు.మీరెళితే నేనే వెళ్ళినంత సంబరమొచ్చేస్తుంది.మరిన్ని ఫొటోల కోసం ఎదురుచూస్తున్నా.

Padmarpita said...

ఇంత మంచి అందాలని కళ్ళకి కట్టినట్టు చెప్పాక కాళ్ళురుకుంటాయా చెప్పండి... ఈరోజు రాత్రి మేము కూడా ఒక పెళ్ళికి అటే పయనము..చూచేస్తానుగా నేనూ ఆందాలని!:)

సృజన said...

పోయిన వారమే వెళ్ళొచ్చాను... మీరు చెప్పినంత అందంగా నేను వ్యక్త పరచలేను కాని ఆస్వాదించానండి!!

Anonymous said...

అదేవిటండీ వస్తున్నట్టు ఒక్క ముక్కైనా చెప్పారుకాదు! ఇక్కడ మూడో ఫొటో ,5 వ నంబరు జతీయ రహదారి కదా. రాజమండ్రికీ ,కాకినాడకీ మధ్యలో హైవేను ఆనుకునేవుంది మాఊరు . చూసారా కొంచెంలో మిస్స్ అయ్యాము .

మురళి said...

బాగుందండీ టపా.. గోదారి గురించి ఒక్క ముక్కలో తెల్చేయడమొక్కటే లోటు.. ఆ లోటు ని పూరిస్తూ ఓ టపా రాస్తే బాగుంటుంది.. అప్పుడెప్పుడో రాశాను అనకండి.. :-) :-) ఇప్పటి తాజా అనుభూతులతో రాయండి..

తృష్ణ said...

@రాధిక:అలాగాండి..ద్వారపుడి గుడి గురించి..మరిన్ని మిగతా ఫొటోలను నా తదుపరి 3,4టపాలలో చూడగలరు.

@పద్మర్పిత: తప్పక చూసి ఆనందాన్ని నాకులానే మనసు నిండా నింపుకుని రండి...

@సృజన:నాకన్న ముందరే వెళ్లివచ్చేసారన్న మాట!బగుందండి..శ్రావణమాసం పెళ్లిళ్ళ వల్ల అందరం ఓ వారం అటు ఇటుగా అటువైపు వెళ్లి వస్తునట్లున్నాము..!

@లలిత:మీరన్నట్లు అది రాజమండ్రీ వెళ్తూంటే బస్సులోంచి హై వే కి తీసిన ఫొటోనే!అయితే మా నెక్స్ట్ ట్రిప్లో మీ ఇంట్లోనె హాల్ట్ వేసేయమంటారా..?!

తృష్ణ said...

@ మురళి:మన గోదారి గురించి ఒక్క ముక్కలో అస్సలు చెప్పలేము కదా..అందుకే కదండి మొత్తం ట్రిప్ అంతా 3,4 టపాల్లో రాస్తానని ...రాజమండ్రీ,కోటిపల్లి రేవు ఫోటోలతో ప్రత్యేకంగా మరొ టపా ఉంది లెండి తొందర్లో...ఎటొచ్చీ యానాంలోనే పెళ్లి హడావుడిలో గోదారికి ఫొటోలు తియ్యటానికి వీలులేకపోయిందండి...అదొక్కటే లోటు ప్రయాణంలో మిగిలిపోయింది.

Hima bindu said...

మా కోనసీమ మిత్రులతో విభేదిస్తాను కాని ఏమాటకామాటే చెప్పుకోవాలి ఆ అందాలు వెటీకీ సాటిరావు .నాకు ఆ ప్రదేశాలు చాల ఇష్టం.

Arun said...

Just install Add-Telugu widget button on your blog. Then u can easily submit your pages to all top Telugu Social bookmarking sites.

Telugu Social bookmarking sites gives more visitors and great traffic to your blog.

Click here for Install Add-Telugu widget

తృష్ణ said...

@చిన్ని: మీది కోనసీమాండీ?ఆ అందాలు కూడా అద్భుతమని మా దగ్గరి బంధువులు చాలా మంది చెబుతూ ఉంతారండి..అటువైపు వెళ్ళాలండి ఈసారి.

@Ram:
బటన్ ఏడ్ చేసానండి.thankyou very much.

Praveen Mandangi said...

మేము 2002 నుంచి 2006 వరకు కోనసీమలో ఉన్నాం. అక్కడ గ్రామీణ ప్రాంతమైన రాజోలు డెల్టాలో మా అమ్మానాన్నలు బ్యాంక్ ఉద్యోగాలు చేసేవాళ్ళు. 2006 మాకు ట్రాన్స్ఫర్ అయ్యి శ్రీకాకుళం వచ్చేసాం. రాజోలులో మా ఇంటి వెనుకాలే కొబ్బరి తోట, కొబ్బరి తోట వెనుక గోదావరి ఉండేవి. రాజోలు చుట్టుపక్కల నేను తీసిన ఫోటోలు కూడా ఉన్నాయి. అవి అప్ లోడ్ చేస్తాను.

తృష్ణ said...

@praveen sarma:రాజోల్లో మా మావయ్యగారు ఉండేవారండి.అప్పుడు వెళ్లాము మేము.మీరూ ఫొటోలు పెట్టండి చూస్తాము.

Bhãskar Rãmarãju said...

కోనసీమ!! మరి వానల్లేవు, అదీ ఇదీ అంటున్నారు గందా!! పచ్చగనే ఉందిగా అంతా!!
ఓ ఆల్బంలా పెడితే బాగుండేది కదా??

శేఖర్ పెద్దగోపు said...

తృష్ణ గారు, నిజం చెప్పొద్దు..నాకు నిజంగా మీ అందరిమీద చాలా కుళ్ళుగా ఉందండీ. ఇంచుమించుగా మన బ్లాగ్మిత్రులందరూ గోదావరి పరిసర ప్రాంతాల వారే. ఏప్పుడూ ట్రైన్ లో రాజమండ్రి, గోదావరి చూడ్డం తప్పించి నేరుగా చూడలేదు నేను. ఏం చేస్తాం మాకు అక్కడ కనీసం బీరకాయ పీచు చుట్టరికం కూడా లేదాయే. శేఖర్ కమ్ముల గోదావరి చూసినప్పుడు మాత్రం ఇంతేసి కళ్ళేసుకుని స్వయంగా చూస్తున్నట్టు ఫీలయిపోయాను. మొదటి పేరా సూపర్బ్. ఒక్కొక్క లైను చదువుతూ 70MM లో ఊహించేసుకున్నానండీ.

పరిమళం said...

నేనూ మొన్నే వెళ్ళా ...ఐనా టైటిల్ చూడగానే మనసాగదుగా .....
మురళిగారి మాటే నాదీనూ ..మరిన్ని టపాలకోసం ఎదురుచూస్తూ .....
ఫోటోలు భలే ఉన్నాయండీ ..

Praveen Mandangi said...

ఫొటోలు తప్పకుండా అప్ లోడ్ చేస్తాను. రాజోలులో మేము వాడ్రేవు పాపయ్య పంతులు గారి ఇంటిలో అద్దెకి ఉండేవాళ్ళం. షూటింగ్ ల కోసం వచ్చే సినిమా వాళ్ళ కోసం అతను కట్టిన గెస్ట్ హౌస్ ఉంది. అయితే గెస్ట్ హౌస్ కి చాలా కాలం వరకు సినిమా వాళ్ళు రాకపోవడం వల్ల గెస్ట్ హౌస్ లోని ఒక పోర్షన్ ని మాకు, ఇంకో పోర్షన్ ని ONGC ఉద్యోగికి అద్దెకి ఇచ్చారు.

తృష్ణ said...

@భాస్కర్ రామరాజు:మా కెకేరాలో రిసొల్యూషన్ చాలా పెద్దది.తిసిన 300 పై చిలుకు ఫొటొలన్నీ రెసొల్యుషన్స్ తక్కించాలంటే చాలా టైం తిసుకుస్నేహితులకోసం నెట్లో అప్లోడ్ చేసాకా లింక్ పెట్టే ఆలోచన చేస్తానండీ.

తృష్ణ said...

@శేఖర్ పెద్దగోపు: అదేం మాటండి..ఇప్పుడు నేను మీ అక్కనైపోయాను కదా...ఈ సారి నే వెళ్ళినప్పుడు చెప్తాను..మతొ వచ్చేద్దురు..!!

@పరిమళం: వెళ్ళొచ్చారా భలే !నిన్న రాత్రి పద్మగారు కూడా వెళ్తున్నానని రాసారు.అయితే రోజూ నా బ్లాగ్ కి విచ్చేయండి..ఫోటోలే ఫొటొలు!!

@ప్రవీణ్ శర్మ: ok,we will wait for your photos.