సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, August 6, 2009

ఫస్ట్ ఫ్రెండ్

ఒక మనిషి గురించి మనకు బాగా తెలిసేది వాళ్ళతో మనం కొన్నాళ్ళైనా సహజీవనం చేసినప్పుడే అన్నది నా అభిప్రాయం.ఇంటి బయటి స్నేహాలు పటిష్టమైనవే అయినా,ఆ స్నేహితుల గురించి మనకు బాగా తెలుసనుకున్నా;కొన్నాళ్ళు,కనీసం ఒక వారమైనా ఆ స్నేహితులతో కలిసి ఉంటే అప్పుడు తెలుస్తుంది వాళ్ళెంత అపరిచితులో మనకు ! అలా కలిసి ఒక చోట ఉండటం వల్ల ఒక వ్యక్తిని గురించి పూర్తి అవగాహన మనకు ఏర్పడుతుంది. ఎందుకంటే కొందరి భావాలూ,ఆలోచనలూ,అభిప్రాయాలూ గొప్పగా ఉన్నా వారి జీవన విధానం,అలవాట్లూ,పాటించే శుభ్రతా ఇవన్ని చిరాకుని తెప్పించేలా ఉంటాయి.వాటిని చూసాకా కొందరితో అసలు స్నేహాన్ని కొనసాగించటం కష్టంగా ఉంటుంది.ఇది కేవలం నా స్వీయానుభవం+అభిప్రాయం మాత్రమే.

ఇంతకీ అసలు విషయంలోకి వస్తే;అలా నేనేమిటో తెలిసిన, నాతో 18ఏళ్ళు కలిసి పెరిగిన నా "ఫస్ట్ ఫ్రెండ్" నా తమ్ముడి గురించి కొన్ని కబుర్లు...!అన్నయ్య మా నానమ్మ దగ్గర పెరిగాడు.కలిసి పెరగలేక పోయిన అన్నయ్యతో ఒకరకమైన బంధమైతే,కలిసి పెరిగిన తమ్ముడితో మరో రకమైన అనుబంధం నాది. అన్నయ్య ఒక ఏడు పెద్ద,తమ్ముడు 2ఏళ్లు చిన్న.అందరూ పేరు పెట్టి పిలిస్తే వాడూ నన్ను పేరు పెట్టి పిలిచేవాడు.'అక్కా ' అని ఎప్పుడు పిలవలేదు వాడు నన్ను..!చిన్నప్పటి ఆటలూ,పరుగులూ,గాలిపటాలూ,గోడలు దూకిన రోజులూ,బాణాలతో ఆడుకున్నరోజులూ,పంచుకున్న ఆలోచనలతో పాటూ భీకరమైన దెబ్బలాటలు,చేయి చేసుకున్న సందర్భాలూ కూడా మా జ్ఞాపకాలలో భాగాలే!!ఇప్పుడు నవ్వు తెప్పించినా, అప్పుడు మాత్రం శత్రువుల్లా పోట్లాడుకునేవాళ్లం.పెరుగులోని మీగడ దగ్గరా,ఇష్టమైన కూరల దగ్గరా,ప్రిజ్ లోని ఐస్ క్రీం దగ్గరా జరిగినవి చిన్న చిన్న కోట్లాటలే కానీ; టి.వీలో చానల్స్ దగ్గరా,టేప్ రికార్డర్ లో పాటల సౌండ్ల దగ్గరా,ముఖ్యంగా రాత్రి పూట లైట్ దగ్గరా జరిగేవి యుధ్ధాలు ! ఏదోఒక పుస్తకం పట్టుకుని చదువుతూ నిద్రోవటం నా అలవాటు.లైటు ఆపేసి చీకట్లో పడుకోవటం వాడి అలవాటు.వేరే గదిలోకి వెళ్లమని వాడు,మంచం మీదే పడుకునే చదవాలని నేను...రోజూ ఇదే దబ్బలాట.ఇలాంటి చిలిపి తగాదాలెన్నో...!

చాక్ పీసుల మీద బొమ్మలు చెక్కటం,మంచి మంచి బొమ్మలు వేయటం వాడికి వెన్నతో పెట్టిన విద్య.నేనూ ,అన్నయ్యా సీజనల్ ఆర్టిస్ట్ టైప్ అయితే,వాడు ఎవెర్ గ్రీన్ ఆర్టిస్ట్.క్రికెట్ గురించి నాకు నేర్పింది వాడే.మా ఇద్దరికీ ఉన్న కామన్ ఇన్టరెస్ట్ సినిమాలూ,ఆనిమేషన్స్.చాలా విషయాల మీద మా అభిప్రాయాలు కూడా ఒకేలా ఉంటాయి.కలిసి పెరగటం వల్ల మా ఇద్దరి మధ్యా స్నేహబంధం గట్టిగానే మిగిలిపోయింది.ఇంటర్ తరువాత చదువు నిమిత్తం వాడు దూరం వెళ్పోయినా ఉత్తరాలూ,ఆ తరువాత ఈ-మైల్స్ ద్వారా మేము దగ్గరగానే ఉండేవాళ్లం.నా పెళ్ళి కుదిరినప్పుడు వాడు అమెరికాలో ఉన్నాడు. "so,i'll miss my first girl friend.."అని రాసాడు.(నేను ఉమెన్స్ కాలేజీలోనూ,వాడు జెన్ట్స్ కాలేజీ లొనూ చదవటంవల్ల నా boy friend వాడూ,వాడి girl friend నేనూ!)చిన్నప్పుడు దెబ్బలాడుకుంటూంటే అమ్మ అస్తమానం అనేది "ఇప్పుడు తెలియదు మీకు,రేపొద్దున్న దూరాలు వెళ్పోయాకా కావాలనుకున్నా కలవలేరు..దెబ్బలాడుకోకండి...."అని!! ఆ సంగతి మాకూ మేము దూరాలు వెళ్పోయాకే అర్ధమైంది...అప్పుడిక చిన్ననాటి రోజులు రమ్మంటే వస్తాయా..?

jO jeetA wohi sikanda అనే హిందీ సినిమాలో చిన్ననాటి అన్నదమ్ముల మధ్య పాట ఒకటి ఉంటుంది."रूटः के हम्सॆ कभी जब चलॆ जावॊगॆ तुम....ऎ न सोचा था कभी इत्नॆ याद आवॊगॆ तुम..."అని.ఆ పాట విన్నప్పుడల్లా నాకు మా చిన్నతనమే జ్ఞాపకం వస్తుంది.ఆ పాట link ఇక్కడ పెడ్తున్నాను.
http://www.youtube.com/watch?v=Lrm01yKFjmE



(మరీ సొంత డబ్బాలా ఉంటుందని నిన్న రాయలేదు..కానీ, అన్నయ్య గురించి రాసి నా గురించి రాయలేదని కొద్దిగా అలిగిన మా తమ్ముడి అలక తీర్చే ప్రయత్నమే ఈ టపా..!)

16 comments:

శేఖర్ పెద్దగోపు said...

>>"so,i'll miss my first girl friend.."అని రాసాడు
:))
మీరు రాసిన హిందీ లిరిక్స్ అర్ధం ఆ పక్కనే రాసుంటే జహిజంది అంతగారాని నాలాంటి వారికి తెలిసేదండీ.
హాయిగా ఉన్నాయి మీ జ్ఞాపకాలు.

కొత్త పాళీ said...

:)

తృష్ణ said...

@sekhar peddagopu:"నన్నొదిలి నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు...ఇంతగా గుర్తొస్తావని ఎన్నడూ అనుకొలేదు..."అనే అర్ధంతో పాట సాగుతుందండి.ధన్యవాదాలు.

@kottapali: :) ధన్యవాదాలు.

మరువం ఉష said...

దాదాపుగా ఇవే అనుభవాలు. తమ్ముడు బదులు అన్నయ్య అంతే, అన్ని దశలు దాటేసి ఇపుడు ఈ దూరాల్లో మాటలకి మిగిలాం అంతే అచ్చంగా మీ అమ్మ గారన్నట్లు.

తృష్ణ said...

@usha:sometimes..only time will make us realise what we've lost...but its nice to quarrel with someone dear as brothers...its great fun!!
Thankyou for the visit..

మురళి said...

బాగున్నాయండి మీ తమ్ముడి కబుర్లు... అప్పుడు కొట్టుకోబట్టే ఇప్పుడు జ్ఞాపకాలు మిగిలాయి.. అప్పుడు బుద్ధిగా ఉండి ఉంటే ఇప్పుడు చెప్పుకోడానికి ఏం ఉండేవి చెప్పండి?

భావన said...

అలిగే తమ్ముడు ను వూరడించే ప్రయత్నమంటూనే మీరు మా బాల్యపు తగాదాలను, జీవిత గమనం లో తప్పని దూరాలను గుర్తు చేసేరు. మీకు మీ తమ్ముడికి కూడా ధన్యవాదాలు..

Bhãskar Rãmarãju said...

మీ తమ్ముడికే నావోటు..అదే స్థానంలో నేనున్నా అంతే అలుగుతా. హమ్మా!! తమ్ముడంటే అంత అలుసా!! అన్నగురించిరాసినోళ్ళు తమ్ముడిమీద రాయకపోతే!!!! ఎలా?? అసలు ఏమనుకుంటున్నారు మీరు...ఓల్ ఆంధ్రా తమ్ముళ్ళ సంఘం కి మీ గురించి చెప్పనా?

రాధిక said...

సేం టూ సేం నావీ ఇవే అనుభవాలు.కానీ రాత్రి మంచానికి గోడవైపు పడుకుంటానని గొడవపడేవాళ్ళం.నాకేమో మంచానికి రెండో వైపు అంటే క్రిందనుండి ఎమైనా వచ్చేస్తాయని భయం అయితే మా తమ్ముడు నాకు భయం లేదు కానీ నాకు గోడవైపే కావాలని గొడవపడేవాడు.ఎప్పుడూ వాడే గెలిచేవాడనుకోండి. నేను ఇలా రాసుకున్నా
"ఎన్ని అద్భుతాలు పంచుకున్నామో కదా మనమిద్దరం
అమ్మఒడి,ఆవకాయ పెరుగన్నం,పిడిగుద్దులు,తాతయ్య కుర్చి....

ఎంత దూరముంటే ఏమిటి మన మధ్య
పిల్లతెమ్మెరలా జ్ఞాపకాలు తాకిపోవడానికి ఆ దూరం ఏం భారంఅవుతుందని?

ఏక్షణమో నీపిలుపు వినిపిస్తుంది లీలగా
హఠాత్తుగా కళ్ళముందు నీ రూపం మెదులుతుంది
ఏ పార్కులోనో అన్నా చెళ్ళెళ్ళో,అక్కాతమ్ముళ్ళో నవ్వుతూ కనిపిస్తారు
మరుక్షణం నువ్వు నేను మన అరుగుమీద ఆడుతుంటాము

మరిన్ని జ్ఞాపకాలు చుట్టుముట్టేస్తాయి
తెలియకుండానే పెదవుల్ని చిరునవ్వులు పలకరిస్తాయి
గుండె బరువెక్కడం మాత్రం తెలుస్తూనే వుంటుంది"

రాధిక said...

ఆపై కామెంట్ నాదే..వేరే ఐడీతో పబ్లిష్ అయిపోయింది.

సుభద్ర said...

చాలా బాగున్నాయి మీ సరదాలు.
సొ౦తాడబ్బ అసలు కాదు.
మీరు మీ తమ్మడు అలిగే చాన్స్ ఇచ్చి ఉ౦డకుడదని నా అభిప్రాయ౦.

తృష్ణ said...

ఇప్పుడే ఒక పెళ్ళినుంచి వచ్చి,పాపని పడుకోబెట్టి,బ్లాగ్ తెరిచా...నేనెదురు చూసే వ్యాఖ్యలన్నీ లైనుకట్టి పలకరించాయి...అందరికీ ధన్యవాదాలు.

@ మురళి:నిజమేనండి..

@భావన:జ్ఞాపకాలే నిట్టూర్పు...జ్ఞాపకాలే ఓదార్పు..!

@భాస్కర్ రామరాజు:ఒప్పేసుకుంటున్నానండీ..తప్పు చేసాను.నీ గురించి రాసాను చూడరా అంటె.."నేనడిగాకనా?నాకొద్దు పొమ్మన్నాడు" మావాడు...వాడి అలకెలా తీర్చాలో...ఈసారి వెళ్ళినప్పుడు ఓ మంచి స్వీట్ చేసిపెట్టెస్తా!చిన్నప్పుడు వాడు శెలవులకి వస్తున్నాడంటే రకరకాల స్వీట్లు చేసి ఉంచేదాన్ని వాడికిష్టమని..

@రాధిక:అది మీ అబ్బాయా?బాగున్నాయి ఫొటోలు.(దిష్టి తీసేసుకోండి మరి..!)
మీ వ్యాఖ్య నాకొక ప్రశంస!చాలా బాగుంది మీ కవిత..మీదైన బాణిలో...

@సుభద్ర:ఆ మాట అన్నారు సంతొషం.
నిజమేనండి..రామరాజుగారు కూడా అదే రాసారు.అక్కడి సమాధానమే మీకూనూ.

Bhãskar Rãmarãju said...

>>ఈసారి వెళ్ళినప్పుడు ఓ మంచి స్వీట్ చేసిపెట్టెస్తా!
అయ్యోపాపం!! ఐపొయ్యాడన్నమాట.:):):)

తృష్ణ said...

@భాస్కర్ రామరాజు :"అరటి పండు లంబా లంబా" లేమీ చెయ్యను లెండి...కాస్తొ కూస్తో వంటతనం తెల్సిన వంటగత్తెనే కాబట్టి భయం లేదు :) :)

Anonymous said...

వంటకత్తె నా ...హ హ హ బావుంది.
పోస్ట్ బావుంది.

మీరు హింది పాటలు కోట్ చేస్తే మాత్రం నేనుఆగలేను. ఎక్కడున్నా వచ్చేస్తా.

విశ్వ ప్రేమికుడు said...

మా ఇంట్లో కూడా ఇలా గొడవలు పడుతూ ఉంటాం. త్వరలో మా చెల్లి కూడా పెళ్లి చేసుకుని వెళ్లిపోతుంది. అప్పుడు నేను దెబ్బలాడడానికి ఎవరూ ఉండరు. అప్పుడు బోర్ కదా...? కానీ ఈ జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ ఇలా తీపిగానే ఉంటాయి.

మంచి పోస్టు రాశారు :)