సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, August 20, 2009

తూర్పు గోదావరి ప్రయాణం__ రెండవరోజు(రాజమండ్రీ,గోదావరి ఒడ్డు)

రాజమహేంద్రవరం (రాజమండ్రీ) గురించిన పైని ఫోటోలోని పాట తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో!
ప్రసిధ్ధి గాంచిన చారిత్రాత్మక నగరం.మా అమ్మ పుట్టిల్లూ,నేను పుట్టిన ఊరూ అయిన రాజమండ్రీ అంటే నాకు ఎంతో ఇష్టం.తాతగారు లాయరు చేసారు.ఎంతోమంది వస్తూ పోతూ ఉండే మా తాతగారి ఇల్లంటే కూడా నాకు మహా ప్రీతి.పెద్ద గేటు,15,20 మెట్లు,గేటు నుంచీ పైన ముఖ ద్వారం దాకా పందిరిపైన పాకించిన రేక మాలతి తీగ.... ఆ పైన ఎత్తు మీద ఇల్లూ.చుట్టూతా మొక్కలూ,ఓ పక్కగా నేలలోకి ఉన్న గోడౌన్ ఒకటి మమ్మల్ని(పిల్లల్ల్ని)విశేషంగా ఆకర్షిస్తూ ఉండేది.తాళాలు అడిగి ఆ గోడౌన్లోకి వెళ్ళి ఆడుకుంటూ ఉన్డే వాళ్ళం.ఇక పైన డాబా మీదకు వెళ్తే చుట్టూరా కొబ్బరి చెట్లు,పైకి పాకిన సన్నజాజి తీగ..రాత్రిపూట ఆ పూల వాసనతో నిండిన డాబా మీద పడుకుని కొబ్బరాకుల సందుల్లోంచి వెన్నెలను చూస్తూ....లోకం మరిచేదాన్ని...!!వర్షం పడిన మర్నాడు క్రిందకు వచ్చి గేటు దగ్గర మెట్ల మీద కూర్చుంటే,మెట్ల నిండా రాలిన రేకమాలతీ పూల పరిమళం అద్భుతంగా తోచేది...ఎన్తసేపైనా ఆ మెట్ల మీదే కూర్చుని ఉండాలన్పించేది.ఎప్పుడైన్నా అందరం కలసినప్పుడు తాతగారి ఎనమన్డుగురి సంతానం తాలూకూ పిల్లల సందడితో,కేరింతలతో ఇల్లంతా మారుమ్రోగుతూ ఉండేది.ఇప్పుడు ఆ ఇల్లూ లేదు..కానీ మావయ్యలు కట్టుకున్న నూతన గృహాలు అక్కడే పక్కపక్కనే ఉంటాయి.ఏళ్ళు గడిచినా మనసు పొరల్లోని ఆ జ్ఞాపకాలు మాత్రం తాజాగా నిన్ననే జరిగినట్లు ఉంటాయి...!

మా రెండవ రోజు ప్రయాణంలో పొద్దున్నే బస్సులో రాజమండ్రీ చేరాం.బంధువులందరినీ పలుకరించేసాకా సాయంత్రానికి గోదారి ఒడ్డుకి చేరాం.ఆరు నెలల క్రితం మేము చేసిన కాశీ ప్రయాణం,గంగా స్నానం గుర్తున్న మా పాప "అమ్మ,ఇప్పుడు ఇక్కడ స్నానం చేస్తామా?" అని అడిగింది!!చిన్నప్పుడు చాలాసార్లు చేసేసాంలే అని చెప్పా!తెడ్డు పడవ అయితే నాకు భయం అని మోటర్ బోటు ఎక్కాం.ఓ ఇరవై నిమిషాలు గోదావరిలో తిప్పాడు బోటు.వీలయినన్ని ఫోటోలే తియ్యాలో,గోదావరి అందాన్ని చూసి పరవశించాలో తెలీలేదు.పాతికేళ్ళు రైలులో అదే దారిలో వెళ్ళిన రెండు బ్రిడ్జిలూ,వాటి క్రింద నుంచి బోటు వెళ్తూంటే భలే సంబరం కలిగింది...!బాగున్నావా...అని పలుకరిస్తున్నట్లు కదిలే ఆ గోదారి తరగల్ని చూస్తే నాకు ఓ కవి గారు రాసిన వాక్యాలు గుర్తు వచ్చాయి....

"గోదావరి గోదావరి గోదావరి పాట
గుండె నుంచి ఉప్పొంగే పున్నమి సెలయేట
పరుగెత్తే తరగ చూడు పావురాయి రెక్క
తల ఎత్తిన నురుగు నవ్వు ఆడును సయ్యాట..."

బోటు దిగాకా ఒడ్దున దగ్గర్లో ఉన్న మార్కండేయ స్వామి గుడికి వెళ్ళాం.అడుగు పెట్టగానే లోపల ఓ 50మంది వేద పండితులు వేదం చదువుతున్నారు...మావారింక కదలనంటూ అక్కడే కూర్చుండిపోయారు.అది అయ్యాకా దగ్గరలోని ఆంజనేయస్వామి గుడికి వెళ్ళాం.తరువాత "ఇస్కాన్"కు వెళ్ళాం కానీ ఆ రోజు "కృష్ణాష్టమి"కావటంతో విపరీతమైన జనం ఉన్నారు.బయట నుంచే చూసి,కాసిని ఫొటోలు తీసుకుని రాత్రికి తిరిగి కాకినాడ వచ్చేసాం.

(క్రింద ఉన్నవి రాజమండ్రిలో గోదావరి,ఇస్కాన్ దగ్గర తీసిన ఫోటోలు)




15 comments:

భావన said...

తృష్ణా నీకిది న్యాయమా ధర్మమా చెప్పు.. ఇలా మనసుకు గాలం వేసి లాక్కుని నీతో పాటు ఎక్కడెక్కడికో పరుగులెత్తించటం... మీ తాత గారి ఇల్లు గురించి చదువుతుంటే ఎందుకులే గుండె గొంతుక లోన కొట్లాదుతోంది అని నండూరి వారు అన్నప్పుడు ఇలానే వుండి వుంటుంది ఆయన ఫీలింగ్. మా తాత గారు నాన్న గారు కూడా లాయర్ లే. మా తాత గారి ఇల్లు అచ్చు అలానే వుండేది.. ఒక్క సారి నేను కూడా వాన వెలిసిన వుదయాన మాలతి రేకుల, రాధా మనోహరాల పరిమళాలతో కలిసి గింగిరాలు తిరిగేను.. గోదావరి నీళ్ళేమో ఎర్రెర్రన అందులో వానో వరదఓ వస్తే ఇంక ఎర్రనవుతాయనుకుంటానే.. ఇస్కాన్ పిక్చర్స్ బాగున్నాయి.

Anonymous said...

ఎన్నిసార్లు చూసిన తనివి తీరనిది, ఎప్పుడు కొత్తగా ఉండేది ఏదైనా వుందా అని అడిగితే మా గోదావరి అనే చెపుతాను నేను.

ఎ పని లేకపోయినా రాజమండ్రి నుంచి కొవ్వూరు రైలులో మీద, బైక్ మీద గోదావరి చూడడానికే తిరిగేవాడిని...

ఆ రోజులు అన్ని గుర్తు చేసారు.
ఫొటోస్ బాగున్నాయి అండి. కుదిరితే కొంచెం పెద్దవి పెట్టండి :)

మురళి said...

తెడ్డు పడవ అంటే భయమా? మీరు చాలా మిస్సవుతున్నారండీ.. బాగుంది టపా..

పరిమళం said...

రాజమండ్రి తో అనుబంధం ఎక్కువే ...మా ఊరు అక్కడికి చాలా దగ్గర ! పల్లె కాబట్టి ఏది కావాల్సినా షాపింగ్ రాజమండ్రిలోనే
మార్కండేయస్వామి గుడి , పుష్కరాల రేవుకు దగ్గర్లోని ఆంజనేయ స్వామి గుడి చాలాకాలంగా ఉన్నవే .ఇస్కాన్ మాత్రం ఈ మధ్య కట్టారు . చాలా బావుంది .మళ్ళీ మా కన్నయ్య దర్శనం చేయించారు చాలా థాంక్స్ ! కోటిలింగాలరేవు , కొవ్వూరు గోష్పాదాల రేవు చూశారా ?బొమ్మన లో షాపింగ్ మాటేమిటి :) :)

శ్రీలలిత said...

అలల గోదారి కలలు కనమంటె

కలలొ నీ రూపె కలత పెడుతుంటె

యేమని రాసేది ఈ లేఖ

నా మది తెలిపేటి ప్రేమలేఖ.

గోదావరిని తల్చుకుంటేనే కవిత్వం తన్నుకుంటూ వచ్చేస్తుంది.

తృష్ణ said...

భావన:మధురమైన బాల్యపు స్మృతులకన్నా విలువైనవి ఏమున్నాయండీ జీవితంలో...నాతొ పాటూ మీరూ అలా ఆ జ్ఞాపకాల్లోకి వెళ్ళారన్నమాట.ధన్యవాదాలు.

సెలయేరు:అక్కడక్కడే చాలాసార్లు తిరగ్గలిగిన మీరెంతో అదృష్టవంతులు.ధన్యవాదాలు.

తృష్ణ said...

@ మురళి: చిన్నప్పుడు ఒకసారి నర్సాపురం వెళ్ళినప్పుడు తెడ్డుపడవ ఎక్కాము.6,7మందిమి ఉండేసరికీ పడవ బాగా నెమ్మదిగా కదులుతోంది.ఇంతలో గాలీ,వానా మొదలైయ్యాయి.అందరు కెవ్వు కెవ్వున కేకలు...ఎలా వెనక్కు వచ్చి ఒడ్డు చేరామో మాకే తెలిదు.అప్పటి నుంచీ తెడ్డు పడవ అంటే భయం.కానీ ఆ మధ్యkaasi వెళ్ళినప్పుడు మాత్రం గంగానదిలో తెడ్డుపడవే ఎక్కాం.అది చాలా పెద్ద పడవ అవ్వటంతొ భయం వెయ్యలేదండి.

తృష్ణ said...

@పరిమళం:కోటిలింగాల రేవుకు వెళ్ళామండి.కొవ్వూరు అదివరకూ మా మామయ్య ఉండేప్పుడు వెళ్ళాము.ఇప్పుడిక వెళ్ళలేదండి.

@శ్రీలలిత: మీ కవిత బాగుందండి.ధన్యవాదాలు.

శేఖర్ పెద్దగోపు said...

"షడ్జమాం భవతి వేదం..
పంచమం భవతి నాదం..
శృతిశిఖరే..నిగమఝరే..స్వరలహరే.."
....
....

ఉప్పొంగెలే గోదావరీ..ఊరిందిలే చేలోవరి..

ఎప్పుడు రైల్లో గోదావరి బ్రిడ్జి వచ్చినా నాకు తెలీకుండానే పై పాట గుర్తొచ్చేయటం..పాడేసుకోవటం..
చక చకా జరిగిపోతాయి. ఇప్పుడు మీ అనుభూతుల టపా, ఫోటోలు చూసాక కూడా అలానే జరిగింది.

తృష్ణ said...

@ శేఖర్ పెద్దగోపు :ఏమనుకోపోతే చిన్న సవరణండి..అదీ.."ఉగిందిలే చేలో వరి" అండి.

"ఉప్పొంగెలె గొదావరీ
ఉగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరీ
మా సిమకే చీనాంబరీ
వెతలు తీర్చుమా దేవేరీ
వేదమంటి మా గోదారీ... "

అద్భుతమైన పాట..!!

శ్రీ said...

బాగుందండీ రెండవ రోజు గోదావరిలో.మార్కండేయులు గుడి ఎపుడూ వినలేదు.ఇది కూడా చూడాల్సిన లిస్టులో రాసుకుంటా.

యామజాల సుధాకర్ said...

నిన్న మీరు ఎప్పుడయితే రేపు రాజమండ్రి విశేషాలు రాస్తానన్నారో, అప్పుడే డిసైడ్ అయ్యా రేపు కూడలి లో మొట్టమొదలు చదవాల్సిన పోస్ట్ మీదేనని.
ఇవాళ్ల ఇలా కూడలిలో నుంచున్నా మీ పోస్ట్ ప్రత్యక్షం. చాలా ధన్యవాదములు, మా సొంత ఉరైన రాజమండ్రి గురించి చాలా టూకీగా మంచిగా వివరించారు.

మా ఇల్లు ఉరికి దూరమయినా వారానికి ఒక్కసారయినా పుష్కరాల రేవు, కోటి లింగాల రేవు చూడకపోతే ఏమిటో తోచేది కాదు. కుమారి టాకీస్ రోడ్ కి ఎదురుగా ఒక చిన్న సందు ఒకటి గోదావరి ఒడ్డు కి వెళ్లడానిక్ ఒకటి ఉంటుంది, అక్కడ చాలా పడవలు కట్టేసిఉంటాయి. రోడ్ మీద బజ్జీలు, మిక్ఛ్సర్ కట్టించుకొని ఆ పడవల మీద కూర్చుని తింటూ అలా సూర్యాస్తమయాన్ని, గోదవరిని చూస్తూ ఉంటే అస్సలు టైము తెలిసేదికాదు.

మీ ప్రయాణం ఫోటోలు అన్ని ఒరిజినల్ సైజువి కాస్త ఎక్కడైనా అప్లోడ్ చేసి నాకు మైల్ చేసి పణ్యం కట్టుగోగలరు vydeek@yahoo.com

Bhãskar Rãmarãju said...

వెన్నెల్లో గోదారి అందం అనే పాట!
మరి వెన్నెల్లో గోదారిని చూసారా?

anagha said...

beautiful view

తృష్ణ said...

@యామజాల సుధాకర్:i'll give the link in my last post.thankyou.

@భాస్కర్ రామరాజు:i know the song...but couldnt do that...leisure gaa okka godaavari kOsamE veLlinappuDu alaa cheyaalaMDi.

@anagha:thankyou.