సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, August 4, 2009

రైలు ప్రయాణం

మన జీవన పయనంతో పొల్చదగ్గ మరో ప్రయనం "రైలుప్రయాణం". మజిలీలూ,కలయికలూ,వీడ్కోలూ,చిన్న చిన్న సరదాలతో నిండినది రైలు ప్రయాణం.రైలు ఎక్కి దిగేంతవరకూ ప్రతి ప్రయాణంలొనూ ఎన్నో అనుభూతులూ,అనుభవాలూ.ఎక్కేవారు, దిగేవారూ,మనతో చివరి దాకా ప్రయాణం చేసే వారు,మధ్యలొ వచ్చిపోయే అమ్ముకునేవారు,బిచ్చగాళ్లు....ఒకరేమిటి..అన్నిరకాల మనుషులు మనకు రైళ్ళలో కనిపిస్తు ఉంటారు.
రకరకల మనస్తత్వాలని చదవటం ఇష్టమైన వాళ్ళకి రైలు ప్రయాణం బాగా నచ్చుతుంది.కొన్ని గంటల పాటు మాత్రమే కలిసి ఉన్నా కొందరు మనుషుల వ్యక్తిత్వం,అలోచనలూ చాలా వరకూ అర్ధమైపోతూ ఉంటాయి.

రైళ్లలొ ప్రయాణించేప్పుడు ఏర్పడిన కొన్ని స్నేహాలు జీవితాంతం నిలిచిపోతాయి.కొన్ని పెళ్ళిసంబంధాలు కూడా రైళ్లలో పరిచయాల వల్ల కుదురుతూంటాయి.కొందరు బంధువుల,స్నేహితుల తాలుకు మనుషులు కుడా పరిచయమౌతూ ఉంటారు."ఓహో,మీరు ఫలానా వాళ్ల తాలూకానా..." అని పలకరించుకునే సందర్భాలు వస్తూ ఉంటాయి.రొజూ అప్ అండ్ డౌన్ చేసే ఉద్యొగస్తులు,కాలేజిలకి పక్క ఊళ్లోకి వెళ్లే కుర్రపిల్లలూ,రైల్లోనే ఆటలు మొదలెట్టే పేకాటరాయుళ్లూ...express రైళ్లలో కన్నా పాసింజెరు రైళ్లలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అలా రకరకాల వ్యక్తులను ఒకే రొజులో కలవటం నాకు భలే సంబరంగా ఉంటుంది రైలు ఎక్కినప్పుడల్లా.

ఇక కిటికీ సీటు గురించి చెప్పాలంటే ...బోలేడు కధ అవుతుంది.చిన్నప్పుడు,ఎప్పుడు పక్కన కుర్చున్నవాళ్ళు దిగిపోతారా? అని ఎదురుచూడటం,ఆ సీటు కోసం అన్నదమ్ములతో/అక్కచెల్లెళ్ళతొ దెబ్బలాటం చెయ్యనివారు ఉండరని నా నమ్మకం.రైలు కిటికీలోంచి ప్రకృతి దృశ్యాలు తిలకించటం,మనతొ పాటు వస్తున్న సూర్యుణ్ణో,చంద్రుణ్ణో గమనిస్తు ఉండటం,మనల్ని దాటి వెళ్పోతున్న ఊళ్లని,చెట్లని,మనుషులని చూస్తు గడపటం....ఇవన్ని ఎనలేని ఆనందాన్ని అందిస్తాయి.చేసేది దూరప్రయాణం అయితే పగులు గడిచి రాత్రి అవ్వగానే (కిటికీ లోంచి ఇంకేమీ కనిపించవు కాబట్టి)ఓ పుస్తకాన్ని పట్టుకుని కూర్చుంటే ప్రపంచాన్నే మర్చిపోవచ్చు.అలా రైల్లో పుస్తకం చదవటం నాకు చాలా ఇష్టమైన సంగతి.

చిన్నప్పుడు 2,3 ఏళ్ళకొకసారి మేము కొన్ని దూర ప్రయాణాలు చేసే వాళ్ళం.అలా కొత్త ప్రదేశాలవైపు వెళ్ళినప్పుడు, వచ్చిన ప్రతి ఊరి పేరూ,దారిలో చూసిన వింతలూ మొదలైనవి ఓ చిన్న పుస్తకం పెట్టుకుని రాసుకుంటూ ఉండేదాన్ని.మేము కలకత్తా వైపు వెళ్ళినప్ఫుడు రాసుకున్న ఓ చిన్న పుస్తకం నాకు మొన్న ఏవో సర్దుతూంటే దొరికింది.12ఏళ్ల క్రిందటి ఆ విశేషాలు మళ్ళి ఇన్నాళ్ళకి చదువుతూంటే భలే సంతొషం కలిగింది...నిజంగా ఇవన్నీ చూసామా అనిపించింది ఆ పేర్లు,కబుర్లు చదువుతూంటే!
కాబట్టి ఒకవేళ ఎవరికైనా అలాంటి అలవాటు లేకపోతే;దూర ప్రయాణాలకి వెళ్ళేప్పుడు చిన్న నోట్ ప్యాడ్ లో అలా నోట్ చేసుకోండి.మళ్ళీ కొన్నేళ్ల తరువాత అది చదివితే ఆ ఆనందం మీకే అర్ధం అవుతుంది..!!


రైలు ప్రయాణం ప్రధానాంశంగా తీసిన సినిమాలు,నవలలు,కధలు చాలానే ఉన్నాయి.యద్దనపుడిగారి "గిరిజా కల్యాణం"నవలలో కధ ఒక రైలు ప్రయాణంలో జరిగిన పరిచయంతొనే మొదలౌతుంది.Circar Express,Burning train,Mumbai Express,తూర్పు వెళ్ళే రైలు మొదలైన సినిమాలకి రైలు ప్రయాణమే ఇతివృత్తం.కొత్తతరం సినిమాల్లో ప్రేమలేఖ, మిస్టర్ & మిస్సెస్.అయ్యర్,సఖి,జయం,వెంకీ,వర్షం,స్వరాభిషేకం,DilwaalE Dulhaniyaa lEjaayEngE మొదలైన సినిమాల్లోని కధలని "రైలు ప్రయాణాలే" కీలకమైన మలుపు తిప్పుతాయి. (ప్రస్తుతానికి ఈ పేర్లే గుర్తు వస్తున్నాయి.ఎవరికైనా ఇంకా తెలిస్తే చెప్పగలరు.)

(రైల్లో వెళ్ళేప్పుడు తీసిన కొన్ని ఫొటోలను క్రింద చూడండి...)

16 comments:

మురళి said...

నోట్ చేసుకోవడం..మంచి సూచన.. రైలు ప్రయాణం నేపధ్యంగా వచ్చిన కథలు, నవలలు, సినిమాల గురించి ప్రస్తావిస్తారనుకున్నా.. అసలు రైలు ప్రయాణం గురించి ఓ గ్రంధమే రాయొచ్చేమో..

తృష్ణ said...

థాంక్స్ అండి.మీరిచ్చిన సూచన బాగుంది.ఆఖరులో 3,4వాక్యాలు కలిపాను.ప్రస్తుతానికి అవే గుర్తు వచ్చాయండి.వేరే ఏమన్నా తెలిసినవుంటే తెలుపగలరు.ధన్యవాదాలు.

S said...

Good one! Nice pics.

తృష్ణ said...

@S:thankyou.

Bhãskar Rãmarãju said...

:):) మీ స్పూర్తితో నేనూ ఓ పోష్టు రాస్తా నా రైలు ప్రయాణాలమీద...కొన్ని వేల కిలోమీటర్ల ప్రయాణాలు..

తృష్ణ said...

@bhaskar ramaraju:we will wait eagerly to read...

కొత్త పాళీ said...

బాగుంది మీ తూరుపు వెళ్ళే రైలు. దక్షిణ మధయ్ రైల్వే వారు సర్కారు ఎక్సుప్రెస్సుని circar అని రాసేవాళ్ళు. నేను కాంపూర్లో చదివిన సమయంలో ప్రతి ప్రయాణంలోనూ ఒకరిద్దరు ఆప్తమిత్రుల్ని సంపాయించేసుకున్నాను, వాళ్ళని మళ్ళీ ఎప్పుడూ కలవక పోయినా.

భావన said...

మంచి ఐడియా... చూసిన ప్లేస్ ల గురించి అనిపించిన విషయాలు కలిసిన మనుష్యులతో సంభాషణ నోట్ చేసుకోవటము...
నిజమే రైలు ప్రయాణం లో కిటికి పక్కన కూర్చుని వెళి పోతున్న పరిసరాలను చూస్తు., కదిలిపోతున్న కాలం గురించో, కావాలనుకున్న జీవితం గురించో, కనుమరుగైన గతం గురించో ఆలోచిస్తూ ఒక మంచి పుస్తకం తో పాటు టీ ను నంజుకున్న రోజులను గుర్తు చేసేరు...

తృష్ణ said...

@కొత్తపాళీ:పేరు దిద్దేసాను మాష్టారుగారు :)(రాసేప్పుడు డౌటు వచ్చింది..)
సర్కారు ఎక్స్ ప్రెస్స్ తో మాకు 25ఏళ్ళ అనుబంధం!'రత్నాచల్ ' వచ్చాకా ఇంక దాన్ని వదిలేసాం..
dhanyavaadaalu.

@భావన:చాలా కాలానికి కనిపించిందండి మీ వ్యాఖ్య...ధన్యవాదాలు.

సుభద్ర said...

చాలా బాగు౦ది.ట్రయిన్ జర్ని మీద పుస్తకమె రాయొచ్చు.
మ౦చి పొస్ట్ చదివా అనే పీల్ తో కామె౦ట్ పెడుతున్న.

తృష్ణ said...

@subhadra:రాసేయండి పుస్తకం మరి..ధన్యవాదాలు.

జీడిపప్పు said...

ఇంతకు ముందు వేరే ఊర్లో ఉన్నపుడు రోజూ గంట సేపు ట్రైన్‌లో వెళ్ళే వాడిని. చివరి బోగీలో కాస్త ఖాళీగా ఉంటుంది, అక్కడ కిటికీ పక్కన కూర్చుని పల్లీలు, మురుకులు తింటూ.. కిటికీలోనుండి చూస్తూ.. పుస్తకం చదువుతూ.. కునుకు తీస్తూ...

thanks for reminding!

తృష్ణ said...

@జీడిపప్పు :కిటికీలోంచి చూస్తు ప్రయాణం చెయటం చాలా చక్కని అనుభూతి అండి..thankyou for the visit.

కొండముది సాయికిరణ్ కుమార్ said...

చాలా బాగుందండి. మా ముంబై లోకల్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వీలైతే, చదవండి.
http://amtaryaanam.blogspot.com/2009/02/blog-post.html

తృష్ణ said...

@కొండముది సాయికిరణ్ కుమార్:మేమూ మూడేళ్ళు బొంబాయిలో ఉన్నామండి. వెళ్ళిన ఆర్నెల్ల తరువాత ఒక్కదాన్నీ లోకల్స్ లో ప్రయాణించటం అలవాటు చేసుకున్నాను. కానీ లేడీస్ డబ్బాలో కన్నా జెనరల్ డబ్బాల్లోనే ప్రయాణం సులువు. స్టేషన్ ఎటు వస్తుందో ఎలా చెప్పగలుగుతారా అని మొదట్లో ఆశ్చర్యం వేసేది. ముంబయ్ లోకల్స్ గురించి చెప్పాలంటే ఓ పుస్తకమే రాయచ్చు.
Thanks for the visit.

రాజ్ కుమార్ said...

బాగుందండీ.. నాకిప్పుడు ఇంకో పోస్ట్ రాయాలని ఉంది చాలావి మిస్ చేశాను ;)