Thursday, July 30, 2009
World e-Book Fair..!!
This is a very good opportunity to download as many e-Books as you want. So, make good use of it.
After the completion of this fair, the same collection will be available for an annual membership fees of $8.95. So, interested people can grab the opportunity. .... :)
మౌనం...
భావాలకు,భావ వ్యక్తీకరణకు అర్ధం మాటలే అని నమ్మాను కొన్నాళ్ళు...
కానీ మౌనంలో అన్నిటినీ మించిన అర్ధం ఉందని,
మౌనాన్ని మించిన ఆయుధం లేదన్నది అనుభవం నేర్పిన పాఠం!!
"silence ia a great art of conversation..."అన్నారు కూడా!
మౌనం గురించి నా అలోచనలు ఇవి...
అక్షరాలకు అంతం
ఆలొచనల సొంతం
అంతులేని ఆశల శబ్దం
పెదవి దాటని మాటలకర్ధం
అలసిన మనసుకు సాంతం...మౌనం!!
కన్నీట తడిసిన చెక్కిలి రూపం
అలుపెరుగని అలజడులకు అంతం
రౌద్రంలో మిగిలిన ఆఖరి అస్త్రం
యుధ్ధాల మిగిలిన శకలాల భాష్యం
నిశ్శబ్దంలో నిలిచే ఒంటరి నేస్తం....మౌనం!!
సుతిమెత్తని కౌగిలికి
ఆరాటం నిండిన పెదవులకి
మాటలు మిగలని అలకలకి
మాటలు కరువైన మనసులకి
అన్నింటి చివరా మిగిలేది....మౌనం!!
Wednesday, July 29, 2009
శ్రావణమంగళవారం నైవేద్యాలు
1)పూర్ణం బూరలు...
2)పులగం (బియ్యం,పెసరపప్పులతొ చేసేది) ఫొటొలొకి రాలేదు.
౩)sprouted బొబ్బర్లు,పుదినా,మిర్చి,అల్లం కలిపి చేసిన వడలు.
4)బూరెల్లో పూర్ణం అయిపొయాకా మిగిలిన పిందిలో తొటకూర,మిర్చి కలిపి అదో రకం పకోడిల్లాగ వేసేసాను.
5)పులిహొర.
శెనగలను ఏమీ చెయ్యక్కర్లేదు.అవి నానబేట్టినవే..బత్తాయిలు colourfulగా ఉంటాయని add చేసా..అవి.. ఫొటోలోని నైవేద్యాల విశేషాలు.
నాకొచ్చిన వంటలతొ ఒక సెపరేటు బ్లాగు పెడదామా అనుకున్నా కానీ..ఒక్క బ్లాగు నడపటానికే సమయం ఉండటం లేదు.ఇంక రెండవ బ్లాగా..అనుకుని ఇంక ఒకటే కిచిడీ బ్లాగు ఉంచేద్దామని డిసైడయిపోయా..!
పుజ అయ్యి,ఇళ్ళు వెతుక్కుని,వాయనాలు ఇచ్చేసి వచ్చాం ముగ్గురం !!
హమ్మయ్య,ఓ పని అయిపొయింది.ఇంక ఏవన్నా పాటలు విందాం అని తిరుబడిగా పాత కేసట్లు అన్ని వెతికి "ABBA" బయటకు తీసా.
honey honey...
give me one more date....
ring ring... why dont you give me a call...
this park..and these houses..all streets i've walked...
అంటూ గుండ్రాల్లోకి వెళ్ళిపొయి వినేస్తున్న... ఇంతలో అన్నయ్య వచ్చడు."మల్లన్న పాటలు డౌన్లోడ్ చెసాను"వినమని పెట్టాడు.పెద్ద సౌండ్లో "excuse me Mr..మల్లన్న...అ..అ..ఆ...అ..అ..ఆ..."అంటూ పాట మొదలైంది.2,3 వినగానే అరె ఇవన్ని రొజూ ఫంలో వింటున్నానురా అన్నాను..
ఈలోగా అమ్మ వెనకాల నుంచి తిట్లు..శ్రావన మంగళవారం పుజ చెసుకుని అవేం పాటలే....అని!!
Monday, July 27, 2009
ఆషాఢం ఎండింగ్ కేక్..!!
మొన్నశనివారం ఒక బంధువులింట్లో పుట్టినరోజు పార్టీకి వెళ్ళాం.ఆ పుట్టినరోజు కుర్రాడికి కొత్తగా పెళ్ళి అయ్యింది.పెళ్ళైన నెల తిరక్కుండా ఆషాఢం వచ్చేసింది.నెళ్ళాళ్ళుగా ఊళ్ళోని షాపింగ్ కాంప్లెక్సుల్లోనే మొహాలు చూసుకుంటూ విరహాన్ని చవిచూసిన ఆ కొత్త దంపతులు సరదాగా కబుర్లు చెప్పుకుంటూంటే ముచ్చటేసింది..ఆ ఇంట్లోవాళ్ళు ఆ కుర్రాడి బర్త్ డే కేక్ తొ పాటూ మరొ కేక్ పక్కనే పెట్టారు. ఏమిటా అని దగ్గరికెళ్ళి చూస్తే...దాని మీద "ఆషాఢం ఎండింగ్" అని ఉంది.బర్త్ డే కేక్ కట్ చేసాకా,ఆ నవ దంపతులిద్దరి చేతా వాళ్ళింట్లోవాళ్ళు ఆ "ఆషాఢం ఎండింగ్ కేక్" ని కట్ చేయించారు.అందరూ సరదాగా వాళ్ళ వాళ్ళ ఆషాఢవిరహం గురించిన జోక్స్,కబుర్లు మొదలేట్టారు...
ఆ కుర్రాడు మొన్న ఆషాఢం పూర్తవ్వగానే అత్తారింటికి వెళ్లటం,వాళ్ల అత్తగారు ప్రేమగా వండిపెట్టిన వంటకాలను వర్ణించి చెప్పటం మొదలెట్టాడు.పురీలు-ఛోలే కూర,దొసెలు-మాంచి చెట్నీ,బాదం ఖీర్,బొబ్బట్లు..మొదలైన పేర్లు వినగానే నా నాలిక లోంచి తెలియకుండానే లాలాజలం ఊరిపొయింది.."కొత్తల్లుడినైనా కాకపొతిని ,బాదం ఖీరు తినగా.." అని పాడేసుకున్నాను...
ఆ యువ జంటని చూసి,వాళ్ల కబుర్లని విని నేను మైమరచిపోయిన ఒకానొక బలహీన క్షణంలో మా అమ్మయి నేను చూడకుండా 2,3 బాగా క్రీము నిండిన కేక్ ముక్కలు లాగించేసింది...
కట్ చేస్తే...రాత్రికి పాపకి కడుపునొప్పి,డోకులు...డాక్టర్ దగ్గరికి పరుగులు,నిద్ర లేని రెండు రాత్రులు..!!
(ఇలా నిద్రలేని రాత్రులు గడిపినప్పుడు తెలుస్తాయి మనకోసం అమ్మనాన్నలు ఎన్ని రాత్రింబవళ్ళు అవస్థలు పడ్డారో...అప్పుడు చెప్పాలనిపిస్తుంది ముగ్గురేసి పిల్లల్ని పెంచిన అమ్మలకి; 10,12 మంది పిల్లల్ని పెంచి పెద్దచెసిన అమ్మమ్మలకి,నానమ్మలకి హేట్స్ ఆఫ్...!!)
Saturday, July 25, 2009
rare photos...
Friday, July 24, 2009
శ్రావణ జ్ఞాపకాలు ...మార్పు
"చేతికి గాజులు వేసుకోవె..ఆడపిల్లవి అలా ఉంటే ఎలా?"
"సంకల్పం చెప్పుకుని,ఆచమనం చేసుకోవటం నేర్చుకో,కాస్త దేముడి దగ్గర దీపం పెట్టడం నేర్చుకోకపోతే ఎలా?"
"పేరంటానికి రమ్మంటే ఎందుకొ అంత బాధ?"
"మొహానికి ఆ నల్ల బొట్టేమిటి?కాస్త పెద్దది ఎర్రనిది పెట్టుకోరూ?"
"ఎంతసేపూ ఆ వి టి.వి,ఎం టి.వి,స్టార్ మూవీసు,హెచ్.బి.వో..ఇంకో చానల్ చూడనీవా మమ్మలని?"
"బట్టలు మడత పెడదామని లేదు,తోమిన గిన్నెలు సర్దుదామని లేదు,ఎంతసేపూ ఆ పుస్తకాలు పట్టుకుని లీనమైపోతుంది..ఉలుకూ పలుకూ లేకుండా!"
ఇలాంటి మందలింపులు,కసుర్లు మనం ఎప్పుడైనా లక్ష్య పెడితేగా?!
అలాటి నేను పెళ్లైన రెండు నెలలకే వచ్చిన శ్రావణం లో నొములు మొదలెట్టేసా.మడి చీరకట్టుకుని,కాళ్లకి పసుపు రాసుకుని,చేతినిండా గాజులు వేసుకుని బుధ్ధిగా పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించేసా.మా అన్నయ్య ఇంక నన్ను చూసి ఒకటే నవ్వు...అటునుంచి,ఇటునుంచీ నన్ను పరికించి,పరిశీలించి....బేక్ స్ట్రీట్ బోయిస్,బోయిజోన్,రిక్కి మార్టిన్ వినే నువ్వేనా?..గృ..గృ..గృహిణివైపొయావే అని ఆటపట్టించేసాడు.అద్దంలో నన్ను నేను చూసుకుంటే నాకే ఆశ్చర్యం.కానీ ఏదొ ఆనందం.సంతృప్తి.
ఊరు మారాక కూడా క్రమం తప్పకుండ దీపారాధన,సహస్రనామాలు,అమ్మ లాగ నవరాత్రుల్లొ తొమ్మిది రొజులూ పూజలు,ప్రసాదాలు చేయటం...అలవాటయిపోయాయి.
పెద్ద పండగలే కాక,సుబ్రహ్మణ్య షష్ఠి,కార్తిక పౌర్ణమి,క్షీరబ్ది ద్వాదశి,ముక్కోటి ఏకాదశి,రధ సప్తమి లాంటి పర్వదిన్నాల్లొ కూడా ఎలా పుజలు చేయాలి,ఏ స్తోత్రాలు చదువుకోవాలి అని ఫోన్లోనొ,మైల్ ద్వారానొ అమ్మని అడిగి తెలుసుకుని యధావిధిగా అవన్ని చేయటం నాకెంతో సంతృప్తి ని ఇచ్చేవి.అవన్ని మళ్ళి అమ్మకి,అత్తయ్యగారికీ ఉత్తరాల్లో రాసేదాన్ని..బాగుందమ్మా అని వాళ్ళు అంటే సంతోషం.ఉపవాసాలు,మడి ఆచారాలు,మూఢనమ్మకాలు నాకు లేవు.నమ్మకం కూడా లేదు.కానీ పర్వదినాల్లో నియమంగా యధావిధిగా పూజ చేయటం ఎందుకో మరి భలే ఇష్టం.ఏదో పరిపూర్ణత్వం పొందుతున్న భావన.
ఈ మార్పు ప్రతి ఆడపిల్లలొ కలిగేదే.గొప్పేమి కాదు.కాని కొందరు బుధ్ధిమంతులైన అమ్మాయిలు పెళ్ళి కాని క్రితం కూడా పుజాపునస్కారాలు చేస్తారు.కాని నాలాటి వాళ్ళకు బుధ్ధి,మార్పు పెళ్ళి అయ్యాకే వస్తాయేమో మరి...!!
Thursday, July 23, 2009
ఉప్మా ప్రయోగం
నెయ్యి వేసి,పోపు వేసి,జీడిపప్పు వేసి,రవ్వ వేసి,కొద్దిగా వేగాకా నీళ్లు పోసి...మొత్తానికి తయారయ్యింది.చూడ్దానికి బానే ఉంది.పట్టుకెళ్ళి పెట్టాను. "కుంచమంత కూతురుంటే మంచం మేదే కూడు. అప్పుడే అమ్మాయికి వంట వచ్చేసింది ఇంకేమిటి" అంటూ వాళ్ళు ఉప్మా తినటం ప్రారంభించారు.నెమ్మదిగా వాళ్ళ మొహాల్లో మార్పులు కనబడ్డాయి."బానే ఉందాండి?" అని అడిగాను."ఆ బానే ఉంది,బానే ఉంది.." అంటు పూర్తి చేసారు.కాస్త కాఫీ కలిపి ఇచ్చాను.బాగుందని తాగేసి ఇంకో అరగంట ఉండి వెళ్ళిపొయారు.
సాయంత్రం అమ్మ వచ్చింది.నాన్న ఉత్సాహంగా సంగతంతా చెప్పరు.అమ్మ కంగారుగా వంటింట్లోకి పరిగెత్తింది.వెనకాల మేమూ..
అమ్మ అడిగింది "ఈ నీలం రంగు మూత ఉన్న సీసాలో దానితోనే ఉప్మా చేసావా? " అని అడిగింది.
అవునని తల ఊపాను."వాళ్ళేమన్నారు?" అంది.
"బానే ఉంది..బానే ఉంది.. అని తిన్నారే " అన్నాను విసుగ్గా.
"పాపం! "అంది అమ్మ.
"ఖాళీగా ఉందని ఆ సీసాలో నిన్ననే ఇడ్లీ రవ్వ పోసాను అంది" (పోయ్...అని వెనకాల పెద్ద ట్రంపెట్ సౌండు వినిపించింది మా అందరికీ!!)
ఆ తరువాత నుంచీ వంటింట్లో అన్ని సీసాలకి పేర్లు రాసి పెట్టడం మొదలెట్టింది మా అమ్మ.
(డిగ్రీ అయ్యేదాకా పెద్దగా పనులేమి చెయ్యకపోయినా ,ఆ తరువాత మాత్రం వంటింటి ప్రయోగాల్లో ఎక్సపర్ట్ నయిపొయా.పనుల్లో అమ్మకి కుడిచెయ్యి అయిపోయా...)
Wednesday, July 22, 2009
ఎగరేసిన గాలిపటాలు..
"స్నేహం" చిత్రంలోని ఈ పాట ప్రతి మనసులోని ఎన్నో చిన్ననాటి జ్ఞాపకాలని తట్టిలేపుతుంది...
పాడినది:పి.బి.శ్రినివాస్ గారు, స్వరపరచినది:కె.వి.మహదేవన్ గారు. క్రింద లింక్ లో ఈ పాట వినవచ్చు.
http://www.savefile.com/files/2160020
ఎగరేసిన గాలిపటాలు
దొంగాట దాగుడుమూతలూ
గట్టుమీద పిచ్చుక గూళ్ళు
కాలువలో కాగితం పడవలూ
గోళీలు గోటీబిళ్ళ ఓడిపోతే పెట్టిన డిల్ల
చిన్ననాటి ఆనవాళ్ళు స్నేహంలో మైలురాళ్ళు
పడగొట్టిన మావిడికాయ
పొట్లంలో ఉప్పూకారం
తీర్ధంలో కొన్న బూర
కాయ్ రాజా కయ్ (4)
దసరాలో పువ్వుల బాణం
దీపావళి బాణా సంచా
చిన్నప్పటి ఆనందాలు
చిగురించిన మందారాలు
నులివెచ్చని భోగిమంటా
మోగించిన గుడిలో గంటా
వడపప్పు పానకాలు
పంచుకున్న కొబ్బరి ముక్క
గొడమీద రాసిన రాతలు
వీడిపోవు వేసిన బొమ్మలు
చెరిగిపోని జ్ఞాపకాలు
చిత్త,స్వాతి వానజల్లు
చిన్ననాటి ఆనవాళ్ళు స్నేహంలో మైలిరాళ్ళు
చిన్నప్పటి ఆనందాలు చిగురించిన మందారాలు....!!
Tuesday, July 21, 2009
నేను-తాను...
నిన్నలొ ఉన్నది నేను
నేడులొ ఉన్నది తాను
తానెవరో తెలియదు నాకు
నేనెవరో తెలియదు తనకు
గడిచిపోయిన నిన్నలలో నిలిచిపోయిన నన్ను
పరిచయమే లేదంటూ పరిశీలిస్తుందా కన్ను
నువ్వెవరని ప్రశ్నిస్తూ నిలేస్తుంది నన్ను
ఆ శోధనలో నిరంతరం ముఖాముఖి మాకు
కలలలో నిదురలో కలతలో తానే నా తోడు
నేను లేని తానెవరని అచ్చెరువే నాకు
సంసార మధనమే నిరంతర ధ్యానం తనకు
తనతొ చెలిమికై ప్రయత్నమే ప్రతినిత్యం నాకు
నేనే నువ్వంటూ కవ్విస్తుంది నన్ను
నీ నేడే నేనంటూ తడుతుంది వెన్ను
ఒక్క క్షణం కళ్లలోకి సూటిగా చుసి
కనుపాపలో దాగిన రూపు తనదంటుంది
ఆ కొత్త రూపాన్ని నేనేనని నమ్మాలి
నాకై నా వెతుకులాటనికనైనా ఆపాలి
ఈ నిరంతర అన్వేషణకిక స్వస్తి పలకాలి
ఇదే నా అస్థిత్వమని మళ్ళి మళ్ళి నమ్మాలి !!
(నిరంతరం వివాహానంతరం ప్రతి స్త్రీలో జరిగే మధనమే ఇదని నా అభిప్రాయం...)
Monday, July 20, 2009
Saturday, July 18, 2009
బ్లాగానందం
"ఆనందమా.. ఆరాటమా.. ఆలోచనా.. ఏమిటొ
పొల్చుకొ హృదయమా.. ఎందుకీ అలజడి
దాహానిదా.. స్నేహానిదా.. ఈ సుచన ఏమిటో
తేల్చుకో నయనమా.. ఎవరిదీ తొలి తడి
పట్టుకో పట్టుకో చేయ్యిజారనివ్వక ఇకనైనా..
స్వప్నమే సత్యమై రెప్పదాటిపోయే సమయానా..
కంటికే దూరమై గుండేకే ఇంతగా చేరువైనా ....
...నిన్నలా మొన్నలా నేను లేను నేనులా నిజమేనా
ఇష్టమో కష్టమో ఇష్టమైన కష్టమో ఏమైనా ...."
... బ్లాగ్లోకం లోకి అడుగు పెట్టగానే నాకు రోజూ గుర్తు వచ్చే పాట ఇది...ఎందుకొ ఆ ట్యూన్ ,సాహిత్యం రెండూ నచ్చేసాయి నాకు...ప్రస్తుతానికి ఈ పాట నా బ్లాగుకి అంకితం !!(రేడియోలో అడుగుతూ ఉంటారు "ఎవరికి డేడికేట్ చేస్తున్నారు పాటని"...అని)ఒక పత్రికలొ చదివిన కధ ద్వారా నాకు బ్లాగులుంటాయని తెలిసింది.అప్పుడు కొంచెం ఆసక్తి కలిగింది...తరువాత ...."విత్తనాన్ని బురదలొ వేసినా అది మొలకెత్తి తీరుతుంది.దాని సహజ నైజం అది.అలానే కళాకారుడు ఎక్కడ ఉన్నా తన సహజ ప్రవృత్తిని మరువడు.అలా మరిస్తే ఆ మనిషి కళాకారుడే కాదు.." అని ఒక చర్చలొ నాతొ ఒకరు అన్న మాటలు ఈ బ్లాగుకి ప్రేరణ.ఇప్పటిదాకా చెయ్యని కొత్త పని ఏదొ చెయ్యలి...అని!
నేను బ్లాగు మొదలెట్టే ముందు ఎవరి బ్లాగులు చూడలేదు...అసలు ఎలా రాస్తారొ కూడా తెలిదు.ఒక మంచిరొజు చూసి బ్లాగు తెరిచేసా.ఎప్పుడో రాసిన 2,3 ఆర్టికల్స్ తొ.నేనేనీ రచయిత్రిని కాదు..అయినా ఒక వారం ఏవొ నాకు తొచిన రాతలు రాసుకున్నా..తరువాత ఒకరోజు కూడలిని,జల్లెడని చూసా..లంకె వేసా.కానీ దాంట్లో నే పొష్టు చేసిన టపాలు కనబడతాయని తెలీదు.10 రొజులనుంచీ రాని వ్యాఖ్యలు ఒక్కసారిగా ఎన్దుకు వస్తున్నాయో తెలిలేదు...ఎక్కడొ కొన్ని వేల బ్లాగుల లిస్టులొ ఉన్న నా బ్లాగుని చూసి జనం స్పందిస్తారా?అని అనుమానం వేసిన్ది...కూడలిలొకి వెళ్తే అసలు సంగతి తెలిసింది.నేనూ బ్లాగులు చూసి వ్యాఖ్యలు రాయటం మొదలెట్టా..!కొంత సాంకేతిక పరిజ్ఞానం లేక టపా పెట్టడానికే నానాతిప్పలూ పడి,ఈ మయసభని వదిలేద్దాం అనుకున్న రొజులు ఉన్నాయి..గ్రీక్ అన్డ్ లాటిన్ లా అనిపిన్చే ఈ బ్లాగు సిధ్ధాంతాలన్ని అర్ధంచేసుకోవటానికి అవస్థలు పడుతూనే ఉన్నా ఇంకా...
ఇక ఒక సందేహం వేధిస్తూ ఉన్డేది.అసలు నా బ్లాగుని ఎవరైనా చూస్తున్నారా?అని..చాలా బ్లాగుల్లో "విజిటర్స్" "లైవ్ ట్రాఫిక్" అని చూసి,ఇంకో వారనికి అదీ తెలుసుకుని నేనూ ఒక విజిటర్ కవున్టర్ పెట్టేసుకున్నా!దాని పుణ్యమా అని ఒక నెలలో నాలుగువేలపైనే అతిధులు వచ్చారు అని తెలిసింది...."ఆనందమా..ఆరాటమా.." అని ,"क्यो मुझे इतनी खुषी देदॆ के घबराता है दिल.." అనీ పాట పాడేసుకున్నాను.మళ్ళి సందేహం...ఇన్తమన్ది నిజంగా చూస్తూంటే మరి ఎందుకు ఎక్కువ వ్యాఖ్యలు రావు ? అని...
రాసేది నచ్చలేదా?వ్యాఖ్య రాసే టైము లేదా?రాయటం ఇష్టం లేదా?నేనొక అనామిక బ్లాగర్ననా?బాగున్డకపోతే,నచ్చకపోతే సరే..కానీ బాగుంటే,రాసినది బాగుంది అని వ్యాఖ్యానిస్తే కొంచెం ఆసక్తి,ఆనందం పెరుగుతాయి కదా! సరే ఎవరి ఇష్టం వారిది.అని ఊరుకున్నా.
నెమ్మదిగా కొన్ని పేర్లు తెలిసి,మళ్ళి మళ్ళి వచ్చే కొందరు అతిధులు మిత్రులయ్యారు.నేనూ కొన్ని బ్లాగులు ఫాలొ అవ్వటం మొదలేట్టా...నేను లిస్టేమీ పెట్టుకోలేదు...నాకు దొరికిన సమయంలో వీలున్నప్పుడల్లా ఆయా బ్లాగుల వైపు తొంగి చూడటం, వ్యాఖ్య తప్పక రాయటం అలవాటయిపొయాయి నాకు.ఇప్పుడు "నేను సైతం ఒక బ్లాగర్ని" అనే నిజం నాకు చాలా ఉత్సాహాన్నీ,ఆనందాన్ని ఇస్తున్న విషయం.కొన్దరు ఆటపట్టించారు..."బాబోయ్ దీన్ని కదిలిస్తే "నా బ్లాగు..." అని మొదలెడుతుంది.ఆవు వ్యాసంలా ప్రతి టాపిక్కూ దాని బ్లాగు దగ్గరకు తీసుకు వచ్చేస్తోంది.... ఈట్ బ్లాగ్,డ్రింక్ బ్లాగ్,స్లీప్ బ్లాగ్..అయిపొయింది దిని పరిస్థితి" అని.
అయినా నాకేటి సిగ్గు...?నా లోకం నాది.ఎవరికీ అపకారం,మనస్తాపం,ఇబ్బంది కలిగించనంత వరకూ భయమే లేదు.నా బ్లాగులో వార్తావిశేషాలు,రాజకీయాలు నేను చర్చించదలుచుకోలేదు.వాటికి చాలామంది పండితులు,మేధావులూ ఉన్నారు.సిధ్ధాంతాలనీ,సూక్తులనీ వల్లించదలుచుకోలేదు.ఒక స్త్రీ మనసులో భావాలు ఎలా ఉంటాయో,జీవితంతో గడిచే మార్పులతో ఆలోచనలు ఎలా మారుతూ ఉంటాయో చెప్పాలి అనిపించింది.అవి కూడా కొన్ని రాసాను,కొన్నింకా రాయాలి...ఏదో ఆకు,పువ్వు,పాట,పద్యం...అని నా ఊసులేవో నేను రాసుకుంటాను...ఆసక్తి కలిగితే చదువుతారు...లేకపొతే లేదు...
అమ్మ అడిగింది "బ్లాగంటే..?" అని. "ఇప్పటిదాకా బీరువాలో దాచుకున్న డైరీలో రాసుకునే కొన్ని విషయాలని(అన్నింటిని కాదు) అన్దరికీ తెరిచి చూపెట్టాడం" అన్నాను. "ఎన్దుకలా..?" మళ్ళీ అడిగింది. నే చెప్పా..."నా ఆలోచనలూ,నాకున్న అభిరుచులు,నాకు తెలిసిన విషయాలూ అందరితో పంచుకోవాలని....చెప్పుకోవాలని...ఒక అనామకురాలిగా మట్టిలో కలిసిపోకూడదని ఒక కొరిక...!!" అన్నాను.
అమ్మ నవ్వింది!!
ఎన్నాళ్ళు రాస్తానొ తెలీదు కానీ నా భావాలని పంచుకోవటానికీ,వ్యక్తీకరించటానికీ ఇదో మంచి వేదిక ! ఈ నెలన్నర రోజులూ నాకు మరపురానివి.నాలాటి అభిరుచులు,ఆలోచనలూ ఉన్న మరికొన్దరిని కలిసి కబుర్లు చెప్పే అవకాశాన్ని,ఆనందాన్ని ఇచ్చిన ఈ బ్లాగ్లోకం అంటే నాకెన్తో ఇష్టం... నా బ్లాగుకి వచ్చి,వ్యాఖ్య రాసి ప్రొత్సహించి,నాకు బ్లాగానందాన్ని పెంచిన అందరికీ ఈ టపాముఖంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
Friday, July 17, 2009
ఆఖిలన్ -- "చిత్రసుందరి"
---------------------------------------------------
ఆఖిలన్ -- "చిత్ర సుందరి"
ప్రఖ్యాత తమిళ రచయిత ఆఖిలన్ గారు రాసిన "చిత్తిర పావై"(చిత్రంలోని సుందరి అని అర్ధం)1975లో ప్రతిష్ఠాత్మకమైన భారతీయ జ్ఞానపిఠ అవార్డుని అందుకుంది.ఆ నవలని తెలుగులొకి శ్రి మధురాంతకం రాజారాంగారు అనువదించారు "చిత్ర సుందరి" అని.అప్పటి సామాజిక పరిస్థితుల ఆధారంగా రాసిన ఈ నవల చాలా భారతీయ భాషలలోకి అనువదించబడింది.ఇక్కడ అఖిలన్ గారి గురించి కొంత చెప్పుకొవాలి...
... దాదాపు 45దాకా ఉన్న ఆయన రచనలు అన్ని భారతీయ భాషలలోకీ అనువదింపబడ్డాయి.కొన్నయితే జర్మన్,చైనిస్,రష్యన్,చెక్,పొలిష్ మొదలైన అనేక స్వదేశీ భాషలలోకి కూడా అనువదింపబడ్డాయి. ఏ మనిషయినా ఆలొచించటానికి కుడా వెనుకాడే కొన్ని యదార్ధాలు ఆయన రచనలలో కనిపిస్తాయి.అదే ఆయన ప్రత్యేకత.."రచయిత అనేవాడు పాఠకులు ఏది అడుగుతారొ అది రాయకూడదు...పాఠకులు ఏమి తెలుసుకోవాలో అది రాయాలి" అంటారు ఆఖిలన్.గాంధేయవాది అయిన ఆయన రచనల ప్రధానాంశం సమాజొధ్ధరణ.అఖిలన్ గారి గురించిన వివరాలు ఈ లింకులొ దొరుకుతాయి.http://en.wikipedia.org/wiki/అకిలన్
మధురాంతకం రాజారాం గారు తెలుగులోకి అనువదించిన ఈ నవల పేరు 'చిత్రసుందరి'. అప్పటి సమకాలీన సామాజిక పరిస్థితులపై రాసిన కధ ఇది.అణ్ణామలై అనే ఒక యువకుడు,చిత్రకారుడైన అతని జీవితం ఈ నవల ప్రధానంశం.ఈ నవల ముగింపు అప్పటి రొజుల్లొ కూడా ఎంతొ ఉత్తమమైనదిగా ప్రశంసలందుకుంది. ఈ నవలకు కధానాయకుడు,చిత్రకారుడు,సౌమ్యుడు, అయిన అణ్ణామలై; తన పిరికితనం వల్ల తనతొ పాటూ మరొ ఇద్దరు యువతుల జీవితాలు తలక్రిందులు చేసిన వ్యక్తిగా కాక, ఒక అమాయకుడైన చిత్రకారుడిగానే మన జ్ఞాపకాలలో మిగిలిపోతాడు. ఆదర్శప్రాయమైనది,ఆరాధింపతగినది అయిన స్త్రీత్వానికి సజీవ వ్యాఖ్యానంలాంటి అణ్ణామలై ఇష్టదేవత ఆనంది ఈ నవలానాయిక.తన తొందరపాటు,దూకుడు స్వభావం,అహంకారాల వల్ల భర్తకు,తనకు మన:శాంతిని పోగొట్టి,చివరికి తన జివితాన్నే కోల్పోయిన అభాగిని పాత్ర సుందరిది.ఇక దయా,దాక్షిణ్యం,సేవానిరతి,త్యాగశిలత మొదలైన దివ్యగుణాలకు కాణాచిగా ఒక ఆదర్శమహిళ పాత్ర శారదది.ఈ పాత్రలు,కధకి మౌనసాక్షి అయిన నాగమల్లి చెట్టు,ఆ పూలు మన స్మృతులలో చాలా కాలం వరకూ తిరగాడుతూనే ఉంటాయి.
ఈ నవలలోని కొన్ని గుర్తుంచుకోదగ్గ నిత్యసత్యాలైన కొన్ని వాక్యాలు.....
"ఒకానొక విలక్షణమైన దృశ్యాన్ని చూచినప్పుడు కవికి వర్ణించాలనిపిస్తూంది.చిత్రకారుడికి బొమ్మగీయాలనిపిస్తుంది. గాయకుడికి తన భావాన్ని పాట ద్వారా ప్రకటించాలనిపిస్తుంది."
"ఎక్కడొ ఒకచోట యాధృచ్చికంగా మనకు తారసిల్లిన కొందరు,మన జీవితంలో ఒక గణనీయమైన మార్పు రావటానికి కారణభూతులైపోవటం విచిత్రమే!నివిరుగప్పిన నిప్పులా మనలో దాగి ఉన్న ఒక విశెష గుణాన్ని వాళ్ళు మన చేత గుర్తింపచేస్తారు."
"ఒక వ్యక్తిని నిన్నటివరకూ పొగడ్తలతొ ముంచెత్తి,ఈ రొజు తిట్లదండకంతొ నోరు నొచ్చేటట్టుగా శపించి, రేపటినుంచీ అతడి పట్ల ఇంకొకరకంగా వ్యవహరిన్చటమనేది మానవ స్వభావంలోని ఒక సహజ దౌర్భల్యమేమో ననవచ్చు.."
"మనుషులు మనుషులుగానే ఉండాలి గానీ మనుషుల్లాగ ఉండకూడదు.మనుషుల్లాగ ఉండేవాళ్ళన్దరూ నకిలీ మనుషులే.."
"మనిషి అంతరంగాన్ని,ఆలోచనలని,ప్రవర్తనని అందంగా దిద్ది తీర్చేదే సాహిత్యం."
"మనిషి తనకెక్కడ లేని ఆధిక్యతనీ ఆపాదించుకుంటాడు.శ్మశానవాటిక ఆ ఆధిక్యతను వెక్కిరిస్తుంది.ధీరులు,భీరువులు,ధనికులు,నిర్ధనులు,యొగులు,భొగులు అందరూ ఇక్కడ పిడికెడు బూడిదగా మారిపొతారు."
"ఎవరికి చేతనైన సహాయాలు గనుక వారు యితరులకు చేయగలిగినట్లయితే ఈలొకమిన్ని కష్టాలకు,దు:ఖాలకు నిలయమై ఉండేది కాదేమో..."
ఇలాటి ఎన్నొ విలువైన సత్యాలని పొందుపర్చుకున్న ఈ నవల ప్రతి సాహిత్యాభిమానీ చదవతగినది.
Thursday, July 16, 2009
ఒక కాఫీ కధ:
ఇక టపా లోకి:
ఒక కాఫీ కధ:
అనగనగా ఒక అమ్మాయి.ఆ అమ్మాయికి పాల వాసన గిట్టదు.వాళ్ళ అమ్మ పాలు కలిపి ఇస్తే అమ్మ చూడకుండా మొక్కల్లో పారబోసేది.కొన్నాళ్ళకా విషయం గ్రహించి వాళ్ళమ్మ హార్లిక్స్ కొనడం మొదలెట్టింది.ఏడవతరగతి దాకా బాగానే గడిచింది.తరువాత వాళ్ళ మేనమామకి ఆ ఊరు బదిలీ అయ్యింది.వాళ్ళింటికి వెళ్ళినప్పుడల్లా పాలు ఇస్తే తాగేది కాదు ఆ అమ్మాయి.అందుకని వాళ్ళ అత్తయ్య పాలలో2,3 చుక్కలు కాఫీ డికాషన్ వేసి ఇచ్చేది.ఆ రుచి చాలా నచ్చేది ఆ అమ్మాయికి.అప్పుడే కాఫీ ఏమిటని వాళ్ళ అమ్మ,ఇంటికి వస్తే ఏదో ఒకటి తాగించకుండా ఎలా పంపటం అని వాళ్ళ అత్తయ్య ఆర్గ్యూ చేసుకుంటూ ఉండేవారు.ఇంట్లో కూడా అలా కాఫీ చుక్కలు వేసి ఇమ్మని ఆ అమ్మాయి రోజూ వాళ్ళమ్మతొ పేచీ పడేది.వాళ్ళింట్లో వాళ్ళ నాన్న ఒక్కరే కాఫీ తాగేది.మిగతావారు బోర్నవీటా తాగేవారు.ఆ పిల్ల పోరు పడలేక "కాలేజీలోకి వచ్చాకనే కాఫీ" అని తీర్పు ఇచ్చేసింది వాళ్ళమ్మ.అలా "కాఫీ" కోసం పదవతరగతి ఎప్పుడవుతుందా అని ఎదురు చూసింది ఆ అమ్మాయి.
ఇంటరు,కాఫి రెండూ మొదలయ్యాయి.డిగ్రీ అయ్యాకా నాన్నకు,తనకు తానే కాఫీ చేసేది ఆ అమ్మాయి.(వంటొచ్చిన వాళ్ళాతో ఇబ్బంది ఏమిటంటే,వాళ్ళకి ఎవరి వంటా నచ్చదు-కాఫీతో సహా..)పళ్ళు తోమగానే డికాషన్ తీసేయటం,పాలపేకెట్టు కాచిన వెంఠనే వేడి వేడి కాఫీ తాగేయటం...పొద్దున్నే ఆ కాఫీ తాగుతూ న్యూస్ పేపరు తిరగేయటం....ఆమె దినచర్యలో భాగాలు.ఇలా కొన్నేళ్ళు గడిచాకా ఆ అమ్మాయికి కాఫీ రుచి మార్చాలనిపించింది.బ్రూక్ బాన్డ్ పౌడర్ కన్నా మంచిదాని కోసం వెతకటం మొదలెట్టింది.ఒకచోట కాఫీ గింజలు మర ఆడి ఇవ్వటం చూసింది.ఇక అప్పటినుంచీ ప్రతినెలా అక్కడకు వెళ్ళి కాఫీగింజలు మరాడించి ఫ్రెష్ కాఫీ పౌడర్ తిసుకెళ్ళేది.మర ఆడేప్పుడు గింజలు,చికోరీ పాళ్ళు మార్చి ప్రయోగాలు కూడా చేసేది.
కొన్నాళ్ళకు ఆ అమ్మాయికి పెళ్ళయింది. బొంబాయి వెళ్ళింది.అక్కడ ఇంకో చిక్కు.వాళ్ళుండే ప్రాంతంలో కాఫీ పొడి ఆడే కొట్టు లేదు.కొన్నాళ్ళు పుట్టింటినుంచి తెచ్చుకుంది కాఫీపొడి.ఆ తరువాత "మాతుంగా" అనే ఒక చిన్న సైజు తమిళనాడు ప్రాంతంలో ఆమెకు ఒక కన్నడా కాఫీ కొట్టు దొరికింది.ఆ కాఫీ వాసన ఆ వీధి చివరి దాకా వస్తూంటే,గుండెలనిండా కాఫీ వాసన నింపుకుని అనిర్వచనీయమైన ఆనందంతో
కాఫీ పొడి కొనుక్కుని ఇల్లు చేరేది ఆ చిన్నది.అలా కొంత కాలం గడిచింది...
అకస్మాత్తుగా అనుకోని కొన్ని అవాంతరాల వల్ల, ఒకానొక నిముషంలో ఆ అమ్మాయి "చాలా ఇష్టమైన దాన్ని వదిలేస్తాను" అని దణ్ణం పెట్టేసుకుంది...చాలా ఇష్టమైనదేముంది "కాఫీ" తప్ప?...అంతే మరి ఆ అమ్మాయి కాఫీ మానేసింది.దణ్ణానికో,భక్తికో.... ఆ కారణం నెరవేరింది.!ఆ అమ్మాయి మరింక ఎప్పుడూ కాఫీ తాగలేదు....
కాఫీ వాసన వేసినప్పుడాల్లా మనసు చివుక్కుమంటుంది...41/2ఏళ్ళు అయ్యింది. ఆ అమ్మాయి ఇప్పటిదాకా మళ్ళీ కాఫీ తాగలేదు.కాఫీవాసన వచ్చినప్పుడు మాత్రం గుండెలనిండా ఆ గాలి పీల్చుకుని తృప్తి పడిపోతుంది..!! ఆ కాఫీ లోటుని మాత్రం రకరకాల టీ ల ( గ్రీన్ టీ,బ్లేక్ టీ,అల్లం టీ,అయ్స్ టీ, లెమన్ టీ,ఆరెంజ్ టీ,పుదీనా టీ,మసాలా టీ,గులాబీ టీ,డస్ట్ టీ,లీఫ్ టీ...etc ) ద్వారా భర్తీ చేసుకుంది.
ఈ కధ వల్ల నేను తెలుసుకున్న నీతి ఏమిటంటే....మనం చాలా అలవాట్లని (మంచివైనా,చెడ్డవైనా) మానుకోలేము అనుకుంటాము.కానీ దేనినైనా చేయగల శక్తి మనకు దేముడు ఇచ్చాడు.ఏ అలవాటు నైనా నేర్చుకునే,మానుకునే శక్తి మనలోనే ఉంది అని ....!
Tuesday, July 14, 2009
"విజిల్ వేయలేని జెర్రీ"
కార్టూన్లోని "విజిల్ వేయలేని జెర్రీ" పరిస్థితి నాది.నిన్నటి టపా చదివినవారికి తెలుస్తుంది సంగతి.
ఒక్కరోజుకే ఇలా ఉంటే నిజంగా తమ భావాలు పెదవి విప్పి చెప్పలేని మూగవాళ్ళ వ్యధ ఎటువంటిదొ ఇప్పుడు అర్ధం అయ్యింది నాకు.మనమెంత అదృష్టాంతులమో ఇలాటి చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పుడే తెలుస్తుందేమొ......
ఎలాగొ కస్టపడి ఈ నాలుగు వాక్యాలూ రాయగలిగా...ఒక 2గంటలు పట్టింది!!
Monday, July 13, 2009
ఒక బుధ్ధిలేని పని..
నిన్న రాత్రి బ్లాగు తెరిచి వ్యాఖ్యలకి సమాధానాలు రాస్తూంటే ఒక పొరపాటు జరిగింది.దాన్ని చిన్న పిల్లలు చేస్తే తెలీక చేసిన పొరపాటు అంటారు.నాలాటి పెద్దవాళ్ళు చేస్తే,బుధ్ధిలేని పని అనే అంటారు మరి.కొత్తపాళిగారి వ్యాఖ్య చదివి పొస్టులో సవరింపులు చేయబొయే ప్రయత్నంలో పక్కనే పెట్టుకున్న మజ్జిగ గ్లాసుని తన్నేసాను..నా కీ బొర్డు నిండా మజ్జిగ !!ఫలితం..నా కీబోర్డు మూగబోయింది.సగం బటన్లే పనిచేస్తున్నాయి..ఆరబెట్టడానికి,తుడవటానికీ చాలా ప్రయత్నాలు చేసాను కానీ బొత్తిగా మొరాయించుకుని బండెద్దులా మొండికేసేసింది కీబొర్డు...అందుకని అది బాగయ్యేదాకా
నా వాగుడికి పెట్టక తప్పదు కళ్ళెం
నే వహించక తప్పదు మౌనం !!
నే టపాలు రాయకపోతే తపించే నాధురాల్ని నేనొక్కత్తినే కాబట్టి....నాకోసం నేనే ఈ-మైలు సెంటరుకి వచ్చి మరీ ఈ పోస్టు పెట్టుకుంటున్నాను...ఒక పాఠం మాత్రం నేర్చుకున్నాను.ఇంకెప్పుడు తినే,తాగే వస్తువులు కంప్యుటర్ పక్కన పెట్టుకుని పని చెయ్యకుడదు అని!!
Sunday, July 12, 2009
FM నేస్తాలు !!
"వినండి వినాండి ఉల్లాసంగా ఉత్సాహంగా.."
"ఇది చాలా హాటు గురూ.."
"రైన్ బో తో మీ జీవితం రంగుల మయం..."
"....నంబర్ 1 రేడియో స్టేషన్..." అంటూ రేడియోనో ,మొబైల్ FMనో ఆన్ చెయ్యగానే వినిపించే కబుర్లు...మనసుని ఉత్తేజం చేస్తాయి.ఒకప్పుడు రేడియో అంటే "వివిధభారతి",ఏ ప్రాంతం అయితే ఆ "లోకల్ స్టెషన్" మాత్రమే.మొక్కుబడిగా,కట్టె కొట్టె తెచ్చే అన్నట్లుండే అనౌన్సుమెంట్లు...!!వాణిజ్య రంగం అబివృధ్ధి చెందాకా గత కొన్నేళ్ళుగా మనకి పరిచయమైనవి ఈ ఎఫ్.ఎం స్టేషన్లు.శ్రోతల అభిప్రాయాలను,సలహాలను,వారి భావాలను తమ కార్యక్రమాల్లో ఒక భాగం చేసుకుని అనునిత్యం అలుపులేకుండా అనర్గళంగా మాటలాడుతూనే ఉంటాయి ఈ FMలు.ఫుల్ స్టాప్ల్ లు,కామాలు లేకుండా నాన్ స్టాప్ గా మాటాడే నేర్పు,ఓర్పు ఆ రేడీయో జాకీలకి ఎలా వస్తాయా అని నాకు విస్మయం కలుగుతూ ఉంటుంది... కరంట్ అఫైర్స్,వింత వార్తలు,విశేషాలు, కొత్త పాటలు ,పాత పాటలు,భక్తిగీతాలతో నిండిన కార్యక్రమాలతో... సమయానుకూలంగా,కాలానుగుణంగా ముఖ్యంగా యువతని ఆకట్టుకునే విధంగా తయారయ్యాయి ఈ FMలులు.ఎక్కువ భాగం వీటిని వినేది కాలేజీలకు,ఆఫీసులకు వెళ్ళే జనం.బస్సుల్లో,లోకల్ ట్రైనుల్లో,ఆఫీసు కాబ్ లలో..వెళ్తూ వస్తూ,ఆఖరుకి రోడ్డు మీద నడుస్తూ కూడా జనాలు ఇవాళ FMలు వింటున్నారు.
మొబైలు రేడియోలు వచ్చిన కొత్తల్లో, నాకు రోడ్ల మీద జనాలు యియర్ ఫొనెలు పెట్టుకుని అంతంత సేపు ఏమి వింటున్నారో తెలిసేది కాదు.ఆఫీసు పనుల మీద ఫోను మాట్లాడుకుంటున్నారేమో అనుకునేదాన్ని.కానీ కొన్నాళ్ళ తరువాత అప్పలసామిలా ఉన్నవాడు కూడా యియర్ ఫోను పెట్టుకుంటూంటే డౌటు వచ్చి ఆరా తేస్తే.....అందరూ వినేది FMలని అని తెలిసింది.అప్పుడింక నేను కూడ ఒక FM రేడియో + యియర్ ఫోను ఉన్న మొబైలు ఒకటి కొనేసుకుని బయటకు వెళ్తే అవి పెట్టేసుకుని పోసుకొట్టడం మొదలెట్టాను. ఇప్పుడు రోడ్డెక్కుతే చాలు నా యియర్ ఫోను,రేడియో ఆన్ అయిపోతాయి.ముఖ్యంగా ట్రాఫిక్ జాంలలో మంచి కాలక్షేపం ఇవి.ఒంటరిగా ఉన్న బ్రహ్మచరులకు,హాస్టల్ పిల్లలకు నేస్తాలు ఈ FMలే.
పెళ్లయిన కొత్తల్లో మేము బొంబాయిలో ఉన్నప్పుడు మా చుట్టుపక్కల ఒక్క తెలుగు మొహమైనా ఉండేది కాదు.గుజరాతీ,మరాఠి,కొంకిణీ,తుళు భాషలవాళ్ళు ఉండేవారు మా వింగ్ లో.అందువల్ల + కాస్త హిందీ భాష రావటం వల్లా నా కాలక్షేపమంతా FMలతోనే ఉండేది.కొన్నాళ్ళకి అన్ని FMలలోని జాకీల పేర్లు,గొంతులు,మాట్లాడే తీరు అన్నీ కంఠతా వచ్చేసాయి."జీతూ రాజ్" "అనురాగ్" నా ఫేవరేట్లయిపోయారు.ఒక్కరోజు వాళ్ళు రాకపోతే వీళ్ళేమయిపోయారబ్బా అని బెంగపడిపోయేదాన్ని!
పాత తరాలవాళ్లకి,మామూలు MWరేడియో వినే అలవాటు ఉన్నవాళ్లకీ కొందరికి ఈ FMలు నచ్చవు."వీళ్ల వాగుడు వీళ్ళూను.చిరాకు" అని కొందరు విసుక్కోవటం నాకు తెలుసు.కానీ నామటుకు నాకు అవి ఒంటరితనాన్ని దూరం చేసే నేస్తాలు.చికాకుల్ని,ఆవేశాలని తగ్గించే టానిక్కులు.ఏదో ఒక చానల్ పెట్టుకుని పని చేసేసుకుంటూ ఉంటే అసలు అలుపు తెలియదు,బుర్ర పాడుచేసుకునే ఆలోచనలూ రావు.బస్సు ఎక్కి హాయిగా యియర్ ఫోనులు తగిలించేసుకుంటే ప్రాయాణం చేసినట్లుండదు.వాకింగ్ కి వెళ్ళేప్పుడు అయితే అసలు ఎంత దూరమైనా అలా వెళ్పోతాను ఆ పాటలు,కబుర్లూ వింటు..!మనతోపాటూ ఎవరో కబుర్లు చెబుతూ మనకు తోడు ఉన్న భావన ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.
FMల కన్నా ముందు "WorldSpace Satellite Radio" వచ్చింది.బాగానే పాపులర్ అయ్యింది.కానీ అది ఖర్చుతో కూడుకున్నది అవటం వలన అంతగా జనాలను ఆకర్షించలేకపోయింది.5,6రకాలFM చానల్స్ వచ్చాకా ఆ రేడియో జోరు కాస్త తగ్గిందనే చెప్పాలి.కాని అది ఇంట్లో ఉంటే నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది.దగ్గర దగ్గర 42 చానల్స్ తో ఏ రకం ఇష్టమైన వాళ్లకి ఆ రకం అందులో దొరుకుతుంది.అన్ని భాషల చానల్సే కాక,కర్నాటిక్,హిందుస్తానీ,రాక్,పాప్,జాజ్..ఇలా రకరకాల సంగితాలు మాత్రమే వచ్చే చానల్స్,వెల్ నెస్,న్యుస్,స్పిరిట్యుఅల్ ఇలా రకరకాల టపిక్ రిలేటెడ్ చానల్స్ దీంట్లో ఉంటాయి. http://www.worldspace.in/ అనే వెబ్సైటుకి వెళితే ఈ రేడియో తాలూకు వివరాలు ఉంటాయి.
Saturday, July 11, 2009
మధుర స్మృతులు--కొన్ని పూతీగెలు!!
రాధామనోహరాలు:
వీటి పేరు ఇలాగనే విన్నాను నేను.చిన్నప్పుడు మేం అద్దెకుండే ఇంటిదొడ్లో బోలెడు ఖాళీస్థలం,మొక్కలు,పెద్ద పెద్ద వృక్షాలు ఉండేవి.ఇంటి గుమ్మానికి ఎడమపక్కన ఉండేది ఈ రాధామనొహరాలు తీగ.తెలుపు,లేత గులాబీ,ముదురు గులాబీ రంగుల్లో గుత్తులు గుత్తులుగా పూసేదిఆ తీగ.ఒకే తీగకి అన్ని రకాల రంగులు ఎలా సాధ్యమో అర్ధమవ్వదు నాకిప్పటికీ..రాత్రి అయ్యేప్పటికీ గేటు దగ్గర ప్రదేశమంతా మనోహరమైన సువాసనతొ నిండిపొయేది.ఆ వాసన కోసం కాసేపు గుమ్మం గట్టుమీద కుర్చుండిపోయేదాన్ని.ఆ పువ్వులన్నీ కోసి ,ఒక దాంట్లోకి ఒక పువ్వు గుచ్చి హారంలా చేసి ఆడుకునేవాళ్ళం చిన్నప్పుడు.రాత్రిపూట పూలు కోయద్దని మా అమ్మ కేకలేస్తూ ఉండేది.అనుకోకుండా మొన్న ఓ ఇంటి గోడ మీంచి తొంగి చూస్తున్నాయి ఈ పులు.వెంఠనే మొబైలుతో ఫొటొ తిసాం.రాత్రి కావటంవల్ల క్లియర్ గా లేదు ఫొటో.
రేక మాలతి:
ఇది చిన్నప్పుడు రాజమండ్రీ లో మా తాతగారి ఇంట్లో ఉండేది.తాతగారి ఇల్లు ఎత్తుమీద 10,15పెద్దపెద్ద మెట్లు ఎక్కాకా ఉండేది.పెద్ద ఇనుపచువ్వల గేటు తీసిన తరువాత మెట్లు మొదలు, పైన ఉన్న ముఖద్వారం దాకా పందిరి మీద పాకించిన ఆ రేకమాలతి అంటే నాకు భలే ఇష్టం ఉండేది. ఆ పూలపరిమళం ఇంకా జ్ఞాపకం నాకు...వర్షం కురిసిన రాత్రి బయటకు వచ్చి నిలుచుంటే మెట్ల నిండా రాలిన ఆ తెల్లనిపూలు,ఆ పరిమళం,ఆ మట్టి వాసన...మళ్ళీ పొద్దున్నే లేవగానే రాలిన కొత్త పాత పూలతో మెట్లన్నీ నిండిపోయి ఉండేవి....ఏళ్ళు గడిచినా ఇంకా నిన్ననే తాతగారింటికి వెళ్ళినట్లుంటుంది....మళ్ళీ ఎక్కడా ఆ రేకమాలతి తీగను,ఆ పూలను చూడలేదు.
గిన్నె మాలతి:
ఈ తీగ కాకినాడలొ మా నానమ్మగారి ఇంట్లో ఉండేది.దీన్ని కూడ వీధిగేటు మొదలుకుని ఇంటిగుమ్మం వరకూ ఇనుపపందెరపై పాకించారు.చిన్నగిన్నె ఆకారంలో ఉండే ఈ పువ్వులు క్రీమ్ కలర్ లో గుత్తులు గుత్తులుగా ఉంటాయి.సువాసన తక్కువే అయినా చూడటానికి అందంగా ఉంటాయి ఈ పూలు.ఇది కూడా అరుదుగా కనిపించే పూతీగే!
సన్నజాజి:
ఖాళీ ప్రదేశం ఉన్న ప్రతి ఇంట్లోనూ ఈ తీగ కనిపిస్తూనే ఉంటుంది.చాలా మందికి మల్లెపూలు ఇష్టం ఉంటాయి,నాకయితే ఎప్పుడూ సన్నజాజిపూలే ప్రాణం.అప్పుడే విచ్చుతూ ఉన్నప్పుడు వచ్చే ఆ పూల పరిమళాన్ని వర్ణించటానికి నాకు అక్షరాలు రావు...ఎందుకో బయట వేటిని ఎక్కువ అమ్మరు..ఈ పూలపందిరి మా చిన్నప్పుడు ఇంట్లో(రాధామనోహరాలున్న ఇంట్లో) ఉండేది.తరువాత గవర్నమెంటు క్వార్టర్ లోకి మారాకా అక్కడ నే పెంచిన తోటలో సన్నజాజి తీగెని కూడా పెంచాను.ఇప్పటికీ అక్కడ నే డాబా మీదకి పాకించిన ఆ తీగ ఉంది.కాకినాడాలో మా నానమ్మ ఇంటికి వెళ్తే అక్కడా ఉండేది.అక్కడ నాదే రాజ్యం కాబట్టి ఉన్నన్నాళ్ళూ నాకే పువ్వులన్నీ.ఆకుపచ్చ సంపెంగ,సింహాచలం సంపెంగ,జాజిపూలు,ఎరుపు,పసుపు కనకాంబరాలు,15 రకాల మందారాలు, అరటి, జామ, పారిజాతాలు, పనస,దబ్బ చెట్లతో మా మామ్మయ్య(నానమ్మని అలా పిలిచేవాళ్ళం) ఒక పెద్ద తోట పెంచుతూ ఉండేది.అక్కడ ఉన్నన్నాళ్ళు నాకా దొడ్లోనే మాకాం...ఆ రోజులే వేరు...
విరజాజి:
ఇది కూడా ఒక సాధారణ పూతీగే.మా చిన్నప్పటి ఇంట్లో ఉండేది.క్రింద 5,6వాటాలు అద్దెకు ఇచ్చి పైన మొత్తం ఇంట్లో ఒక్క ముసలావిడ ఉండేది.మల్లె,జాజి,విరజాజి,పారిజాతాలు... ఎన్ని పూలమొక్కలు ఉన్నా ఎవరిని మొక్క మీద చెయ్యి వేయనిచ్చేది కాదు ఆవిడ.ముసలావిడ చూడకుండా అందరం ఎప్పుడో ఓ పూట ఆ పూలని కోసేసుకుంటూ ఉండే వాళ్ళం.అదో గొప్ప సాహసం చిన్నప్పుడు.మాల కట్టడం రానప్పుడు ఈ పూలతో మాల కాట్టాలని తెగ ప్రయత్నించేదాన్ని.చిన్న కాడ ఉన్డటం వల్ల రెండు ముడులు వెయ్యగానే ముందర కట్టిన దండంతా ఊడిపోయేది.వీటి పరిమాళం కూడా అమోఘం.
ఈ నాలుగు రకాల పూతీగెలూ నా గతస్మృతులలో మధురమైన జ్ఞాపకాలలో భాగాలు...!!
Friday, July 10, 2009
సినిమా సరదా...
సినిమాలు అందరూ చూస్తారు.అదేంగొప్ప కాదు.కానీ ఎంపిక చేసుకుని సినిమాలు చూడటం అనేది నాకు అమ్మానాన్నలు నేర్పారు. సినిమాలు చూసే అలవాటు ఎలా అయ్యిందంటే....
బెజవాడలో మా ఇంటి దగ్గర "విజయ టాకీస్" అనే సినిమా హాలు ఉండేది. అందులో అన్నీ పాత తెలుగు సినిమాలు వచ్చేవి.మా అమ్మ అవన్ని మా పిల్లలకు చూపించేది.చిక్కడు దొరకడు,గండికోట రహస్యం,పాతాళభైరవి లాంటి జానపదాలు,సీతారామ కల్యాణం,లవకుశ,భీష్మ,శ్రీకృష్ణపాండవీయం,లాంటి పౌరాణికాలు,భక్త ప్రహ్లాద,భక్త రామదాసు, త్యాగయ్య,మహాకవి కాళిదాసు..లాంటి భక్తి చిత్రాలు, మూగ మనసులు,లక్ష్మీ నివాసం, దేవదాసు, ఆరాధన, బాటసారి,మంచి మనసులు,డాక్టర్ చక్రవర్తి లాంటి సామాజిక చిత్రాలు మొదలైనవన్నీ చూపించేది.పాత తెలుగు సినిమాలను,వాటి విలువలను మాకు తెలియచెయ్యాలని అమ్మ తాపత్రయపడేది.
నాన్న Madras film institute student కావటం వల్ల ఆయన ఆ ఇంట్రస్ట్ తో మాకు అన్ని భాషల సినిమాలూ చూపించేవారు.ఫిల్మ్ డివిజన్ వాళ్లు అంతర్జాతీయ చిత్రాలను తెచ్చి ప్రదర్శిస్తూ ఉండేవారు.Russian,German,Italian,Chinese ఇలా వాళ్ళు తెచ్చిన వివిధ దేశాల చిత్రాలను కొన్నింటిని చూపించేవారు నాన్న. బందర్ రోడ్డు చివరికి వెళ్తే "లీలా మహల్" అని ఇంకో హాలు ఉండేది.దానిలో అన్నీ ఇంగ్లీషు సినిమాలు వచ్చేవి. నాన్న మమ్మలను వాటికి తీసుకువెళ్ళేవారు.The Sound of music,speilberg తీసిన అన్ని సినిమాలు,walt Disney productionsవాళ్లవి,Laurel Hardy వి,Charlie chaplin వి, Jungle book,Sidney poitierది "A patch of blue",BenHar,Ten commandments,20,000 Leagues under the sea,For a fewdollers more , Speed,Absolute power, matrix.... ఇలా "A"సర్టిఫికేట్ సినిమాలు తప్పించి ఆ హాల్లొ కొచ్చిన ఎన్నొ మంచి మంచి సినిమాలు చూపించేవారు నాన్న.అందరం కలిసి అయితే తెలుగు,హిందీ సినిమాలు చూసేవాళ్ళం.తెలుగులో అయితే బాలచందర్,విశ్వనాథ్,బాపు,వంశీ,మణిరత్నం,జంధ్యాల,కృష్ణవంశి....ఇలా కొందరు ఉత్తమదర్శకులు తీసిన సినిమాలే చూపించేవారు...అలా అలవాటయ్యింది మాకు సరైన ఎంపికతొ సినిమాలు చూడటం అనేది.ఒకప్పుడు దూరదర్శన్ లో ప్రాంతీయ భాషాచిత్రాలు,రాత్రిళ్ళు అప్పుడప్పుడు వేసే వివిధ భాషాచిత్రాలు మాత్రమే చూసేవాళ్లం.అలా చూసినవే Satyajit ray,shyam benegal,Guru dutt,Raj kapoor,kishore kumar,bimal roy,Hrishikesh mukharjee...మొదలైన హేమాహేమీల సినిమాలన్ని దురదర్శన్ వాళ్ళు వేస్తే చూసినవే.తరువాత కేబుల్ టి.వి.పుణ్యమా అని వందల కొద్దీ చానల్స్ లో నానారకాల సినిమాలూ..!!వి.సి.డి ల తరువాత సి.డి లు,డి.వి.డీలు....అనేకం ఇవాళ్టిరొజున. ఇప్పుడు వద్దంటే సినిమా...!!
."ఏదో ఒకటి చూసాం అని కాకుండా,ఆ సినిమా చూడటం వల్ల ఏదన్నా ప్రయోజనం ఉందా?అని ప్రశ్నించుకుని ఏ సినిమా అన్నా చూడాలి " అంటారు నాన్న.ఇప్పుడు మాకు మేమై సినిమాలు చూస్తున్నా నాన్న చెప్పిన సుత్రాన్ని ఎన్నడూ మరవలేదు మేము.
Thursday, July 9, 2009
రెండు మంచి సాహిత్యాలు--నవ్వు వచ్చిందంటే...మౌనమె నీ భాష
పాట url + సాహిత్యం :
http://www.youtube.com/watch?v=_fhR8g_oj6g
మౌనమె నీ భాష ఓ మూగ మనసా ఓ మూగ మనసా
మౌనమె నీ భాష ఓ మూగ మనసా ఓ మూగ మనసా
నది నిండా నీళ్ళు ఉన్నా మనకెంత ప్రాప్తమన్నా(2)
Wednesday, July 8, 2009
అమ్మతనం
తనకు తెలిసిన విజ్ఞానాన్ని,ప్రపంచాన్ని బిడ్దకు తెలియచెయ్యాలని తపన పడుతుంది. ఆ పిల్లలు పెరిగి పెద్దయి సక్రమమైన మార్గంలోకి వెళితే తన జివితానికి సార్ధకత కలిగిందని పులకిస్తుంది మాతృహృదయం.ఆ సార్ధకతని నేనూ పొందాలని తాపత్రయపడే సగటు తల్లిని నేను.నేలపై పాకే పసిపాపను చూసి ఇది ఎప్పుడు నడుస్తుందొ..అనుకున్నాను.నడిచింది.పాపాయి బుడి బుడి నడకలను చూసి..ఇది ఎప్పుడు పలుకుతుందో అనుకున్నాను..ఇంకొన్నాళ్లకి పలికింది.."హృదయం ఎక్కడ ఉన్నది..అమ్మ చుట్టూనే తిరుగుతున్నదీ.." అని సొంత కవిత్వం కూడా పాడింది!! ఇప్పుడు పలకపై "అ,ఆ లు " దిద్దుతోంది...నిన్న రాత్రి "ఆ నుంచి అం అ:" వరకూ తప్పుల్లేకుండా రాసింది...ఏమిటో ఆనందం..."తెలియని ఆనందం.."అని పాడాలనిపించింది. ఈ భావాలు ప్రతి తల్లి మనసులో పొంగేవే...ప్రతి తల్లిని సంతొషపరిచేవే...కానీ ఏదన్నా సరే మనదాకా వచ్చి మనం అనుభవిస్తేనే ఆ భావం మనకు పూర్తిగా అవగతమయ్యేది,అర్ధమయ్యేది...అనిపించింది.
అందుకేనేమో అన్నారు అమ్మతనంలో కమ్మతనం వర్ణనాతీతం అని!!
Tuesday, July 7, 2009
మొక్కజొన్న పొత్తులు
వర్షాలు ఇంకా కురవట్లేదు కానీ మొక్కజొన్నపొత్తులు వచ్చేసాయి.
చిటపటచినుకులు పడుతూంటే,రోడ్డు చివర చెట్టు క్రింద బొగ్గులపై కాల్చిన లేత మొక్కజొన్న పొత్తులు... తినను అనేవారు ఉంటారా?(పళ్ళలో ఇరుక్కుంటాయి అని తిననివారుంటారేమో చెప్పలేం.)
నాకు మాత్రం ఇంట్లో గాస్ స్టౌ మీద కాల్చుకున్న వాటికన్నా బయట బొగ్గులపై కాలిన మొక్కజొన్నల రుచే ఇష్టం.మా ఇంట్లో (గాస్ స్టౌ కాకుండా)చిన్నప్పుడు రెండు చిన్న ఇనప కుంపటులు ఉండేవి.మా అమ్మ వాటిమీద ఉల్లిపాయలు,మొక్కజొన్నలు కాల్చి పెడుతూ ఉండేది.వాటి రుచే వేరు.మొక్కజొన్నలని ఉడకపెట్టి కూడా కొన్ని చోట్ల అమ్ముతూ ఉంటారు.తిరుపతి కొండ మెట్లదారిలో వెళ్ళేప్పుడు ఎక్కువగా కనిపిస్తాయి అవి.మొక్కజొన్నలతో తయారు చేసే వంటల్లోకి వెళ్తే వాటితో --వడలు,సూప్ లు,రకరకాల కూరలూ వండుకోవచ్చు.మొక్కజొన్నల్లో రకాల్లోకి, వెళితే--'బేబీ కర్న్ ' అయితే పచ్చివే తినేయచ్చు.చపాతీల్లోకి బేబీకార్న్ మసాల,బేబికార్న్ చాట్ మొదలైనవి వండుకుంటే భలే ఉంటుంది.అప్పుడప్పుడు మాత్రమే దొరికే "స్వీట్ కార్న్" తొ కూడ చాలా రకాల సూప్ లు,కర్రీలు,కట్లెట్ లు చెసుకోవచ్చు.మేము బొంబాయిలో ఉండేప్పుడు ప్రతి లోకల్ ట్రయిన్ స్టేషన్ ప్రవేశద్వారం దగ్గరా అన్నికాలాల్లోను "స్వీట్ కార్న్" దొరికేది.డెలివరీకి అమ్మావాళ్ళింట్లో ఉన్నప్పుడు బొంబాయి నుంచి మావారి ద్వారా కొరియర్లో "స్వీట్ కార్న్" తెప్పించుకుని మరీ తిన్నాను!!
మొన్న శనివారం నేను,మా పాప బస్సు దిగగానే ఎదురుగుండా కనిపించిన మొక్కజొన్నల బండి మీదకి దృష్టి పోయింది.అన్ని కండెలూ అయిపోయి ఇంక 5,6మాత్రమే మిగిలాయి ఆ బండి మీద.పరుగునవెళ్ళి ఒక లేతది కాల్చి ఇవ్వవయ్యా అని అడిగాను.మాడ్చకుండా కాల్పించుకుని ,చాలా లేతగా ఉన్న ఆ మొక్కజొన్నని తినడానికి నేను,పాప ఇద్దరం పోటీ పడిపోయాం...రోడ్డు మీద వింతగా చూసే జనాల్ని కూడా పట్టించుకోకుండా !!
Monday, July 6, 2009
శ్రీమతి రావు బాల సరస్వతీదేవి గారి "బంగారు పాపాయి"
శ్రీమతి రావు బాల సరస్వతీదేవి గారి కంఠం తెలుగు లలిత సంగీతప్రియులందరికీ సుపరిచితం.తెలుగు సినిమాలలో మొదటి నేపధ్యగాయణీమణులలోఈమె ఒకరు.తీయదనం,మాధుర్యం నిండిన ఆమె స్వరం ఎందరికో ప్రీతిపాత్రం.ఆమె పాడిన లలితగీతాలలో ఒక పాటను ఇవాళ ఈ టపాలోపరిచయం చేస్తున్నాను.
ఈ పాటను ప్రముఖ వైణికులు,అప్పటి హైదరాబాద్ రేడియోస్టేషన్ లో మ్యుజిక్ ప్రొడుసర్ గా పనిచేసిన మంచాల జగన్నాధరావు గారు రచించారు.సంగితం సమకూర్చినవారు సాలూరి హనుమంతరావుగారు.ఈయన సాలూరి రాజేస్వరరావుగారి సోదరులు. పాడినది:రావు బాల సరస్వతీ దేవి గారు. సాహిత్యం+ పాట లింక్
బంగారు పాపాయి బహుమతులు పొందాలి(2)
పాపాయి చదవాలి మా మంచి చదువు(2)
పలుసీమలకు పోయి తెలివి గల పాపాయి
కళలన్నిచూపించి ఘనకీర్తి తేవాలి
ఘన కీర్తి తేవాలి (2)
బంగారు పాపాయి బహుమతులు పొందాలి
పాపాయి చదవాలి మా మంచి చదువు
మా పాప పలికితే మధువులే కురియాలి
పాపాయి పాడితే పాములే ఆడాలి
మా పాప పలికితే మధువులే కురియాలి
పాపాయి పాడితే పాములే ఆడాలి
ఏ దేశమేజాతి ఎవరింటిదీ పాప
ఎవ్వరీ పాప అని ఎల్లరడగాలి
పాపాయి చదవాలి మా మంచి చదువు(2)
బంగారు పాపాయి బహుమతులు పొందాలి
పాపాయి చదవాలి మా మంచి చదువు(2)
తెనుగు దేశము నాది తెనుగు పాపను నేను(2)
అని పాప జగమంత చాటి వెలిగించాలి
మా నోములపుడు మాబాగ ఫలియించాలి(2)
బంగారు పాపాయి బహుమతులు పొందాలి
పాపాయి చదవాలి మా మంచి చదువు
***********************************
(ఈ లలిత గీతం కావాలని మాలా కుమార్ గారు ఆడిగారు. క్యాసెట్ వెతికి ఇవాళ mp3 లోకి మార్చి ఈ పోస్టులో పెడ్తున్నాను.ఒక పాట కావాలంటే ...అది ఎక్కడ దొరుకుతుందో అని దాని కోసం వెతకటం...చివరకు ఆ పాట దొరికితే ఎంత ఆనందంగా ఉంటుందో నాకు స్వీయానుభవం.నా వల్ల ఒకరి చిరకాల కోరిక తీరే అవకాశం కలిగితే అంత కన్నా కావలసినదేముంటుంది?మాలాకుమార్ గారు,ఇదిగో పాట.)
Saturday, July 4, 2009
పాపిడీ!
అక్కడ ఉన్నన్ని రొజులూ మా పిన్ని మా అందరికీ రొజూ పాపిడీ కొనిపెట్టేది.మధ్యహ్న్నం అయ్యేసరికి అందరం అరుగుమీదకి చేరి ఎప్పుడు పాపిడీ బండివాడు వస్తాడా అని ఎదురు చూసేవాళ్ళం.అంత ఇష్టం మాకందరికీ పాపిడీ అంటే.ఇంక కాలేజీల్లోకి వచ్చాకా నెమ్మదిగా కలవటాలు తక్కువైపోయి 2,3ఏళ్ళకి ఒక సారి మాత్రమే వెళ్ళేవాళ్ళం.ఇప్పుడు అదీ లేదు..కుదిరినఫ్ఫుడు ఎవరి ఊరన్న వెళ్ళాటం తప్ప!!
పెళ్ళయ్యాక ఒకరొజు మా వీధిలో 'పాపిడీ' అన్న అరుపు విని నేను చాలా సరదా పడ్డాను.నాకు చాల ఇష్టం అన్నానని పాపం మా మరిది 'నేను తెస్తాను ఉండు వదినా' అని వీధిలోకి వెళ్ళి 5నిమిషాల తరువాత ఒక ఆకు దొన్నెలో చెక్కప్పచ్చుల లాటిదాని మీద పెరుగు,ఇంకా ఏదొ చట్నీ ఉన్న ఒక పదార్ధం తెచ్చాడు.ఇదేమిటి?అన్నను.ఇదే పాపిడీ! అన్నడు.(అది పాపిడీ చాట్ అని నాకు తరువాత తెలిసింది) నేను అన్న పాపిడీ ఇది కాదు వేరెది అని..పాపిడీ ని వర్ణించటానికి ప్రయత్నించాను.ఆఖరుకి మా అత్తగారు,మరిది 'ఒహో పాపిడీ అంటే పీచుమిఠాయా?" అన్నారు.'అబ్బే పీచుమిఠాయి అంటే ఎక్ష్జిబిషన్లో అమ్ముతారు,పెద్ద పుల్లకి గులాబీ రంగులో చుట్టబడిన వేరే పదార్ధం ' అన్నాను.అదేమిటి వీళ్లకి పాపిడీ కూడా తెలేదా?అని ఆశ్చర్యపోయాను.తరువాత మాటల్లో తెలిసింది వాళ్ళు పాపిడీ ని "పీచుమిఠాయి" అనే పిలుస్తారని;అక్కడి వాళ్ళకి 'పాపిడీ' అంటే "పాపిడీ చట్" అని, "సోన్ పాపిడీ" అంటేనే నాకు తెలిసిన "పాపిడీ" అని !!
ఇప్పటికీ ఎక్కడైనా పాపిడీ కనిపిస్తే వెంటనే కొనేస్తూ ఉంటాను!
Friday, July 3, 2009
కొన్ని మరపురాని గీతాలు(హింది)వాటి విశేషాలు
ఏ భాషలో అయినా మంచి పాటలు కొన్ని వేలల్లో,వందల్లో ఉంటాయి.కానీ బాగా నచ్చి మళ్ళి మళ్ళి వినాలనిపించే పాటలు కొన్ని ఉంటాయి.నాకు ఇష్టమైన కొన్ని హిందీ పాటలని,వాటి వివరాలని రాయాలనిపించింది.వాటి లింకులని కూడా ఇక్కడ ఇస్తున్నాను--
వినీ,చూసేఅభిరుచి ఉన్నవారికోసం.
1) jalte hai jiske liye --sujata(1959)
lyrics:majrooh sultanpuri
music:jaidev,S.D.burman
singer:talat mehmood
http://www.youtube.com/watch?v=zuS4k378hKY
ఆంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ ఆ ఇతివృత్తంతొ సాగే సినిమా ఇది.సుజాతకి ఫొనులో తన ప్రేమని తెలుపుతూ హీరో పాడే పాట ఇది.ఈ సినిమాలో నూతన్ నటన అద్భుతం.
2)kAli ghaTa chAye mora jiya ghabraye --sujata(1959)
lyrics:majrooh sultanpuri
music: jaidev,S.D.burman
singer:asha bhonsle
http://www.youtube.com/watch?v=yoITCd-XpjU
ఇందాకటి సినిమాలోదే ఈ పాట కూడా.యుక్త వయస్కురాలైన ఒక యువతి మనసులొ ఎలాంటి ఆశలూ,కొరికలు ఉంటాయో తెలిపే పాట ఇది.జాతి,మత బేధాలు ఏవైనా ప్రతి యువతి మనసు,ఆమెలో చలరేగే భావాలు ఒకలాగే ఉంటాయి అని తెలిపే కధ ఇది.
3)kuch dil ne kaha --anupama(1966)
lyrics:kaifi azmi
singer:lata
music:hemant kumar
http://www.youtube.com/watch?v=fUhvq8jk5mA
ఈ సినిమాలో హీరొయిన్ ఎక్కువ మాట్లాడదు.ఈ పాట వచ్చే దాకా మాటలు వచ్చని కూడా తెలీదు.మొదటిసారి ఆ అమ్మయి పాడటం విన్న హీరో చాల ఆశ్చర్యపోతాడు.ఒక నిరుపేద కుటుంబానికి చెందిన కవి,ఒక సున్నిత మనస్కురాలైన డబ్బున్న అమ్మయి మధ్య మొదలైన మూగ ప్రేమ ఎల విజయవంతమైందొ తెలిపే కధ ఈ చిత్రానికి ఇతివృత్తం.బిమల్ రాయ్ గారి ఉత్తమ చిత్రాలలో ఇది ఒకటి.
4)dil dhoodhta hai -- mausam(1975)
lyrics:gulzar
singers:bhupender,Lata
music:madan mohan http://www.youtube.com/watch?v=3zmWyZvcnuw
తన పాత ప్రేమికురాలిని వెతుక్కుంటూ వెళ్ళిన ఒక వ్యక్తికి వేశ్యగా మారిన అతని కూతురు కనిపిస్తుంది.ఇద్దరి మధ్య జరిగే కధ ఈ సినిమా ఇతివృత్తం.తల్లిగా,కూతురుగా షర్మిలా టాగోర్ నటన కొన్ని సందర్భాల్లో కంట తడి పెట్టిస్తుంది.సంజీవ్ కుమార్ నటన ఈ సినిమాకి హైలైట్.
A.J.cronin రాసిన "The JuDas Tree" నవల లోని "weather" అనే కధ ఈ చిత్రానికి ఆధారం.
రాజ్ కపూర్ ఆణిముత్యాల్లో anAri చిత్రం ఒకటి.దిగువ రెండు పాటలూ కూడ చాలా అర్ధవంతమైనవి.సంగీతపరంగా మంచి ప్రఖ్యాతి గాంచిన చిత్రం ఇది.
5)kisi ki muskuraahatom pe --anAri(1959)
lyrics:hasrat jaipuri,shailendra
singer:mukesh
Composers: Shankar-Jaikishan
http://www.youtube.com/watch?v=awelkdyDTBc
6)sab kuch seekha hamne --anAri
composers:shankar-jaikisan
singer:mukesh
lyrics:hasrat jaipuri,shailendra
http://www.youtube.com/watch?v=JxUdjlkClkY
7)aajaare pardesi
lyrics: Shailendra
music: Salil chaoudhury
singer: Lata
http://www.youtube.com/watch?v=Has4jMsKmQA
గిరిజన యువతికి,పాట్నవాసం అబ్బాయికి మధ్య ప్రేమ; పునర్జన్మ,ప్రతీకారం ఇతివృత్తం ఈ సినిమాది.
ఈ సినిమాలొ కూడా అన్ని పాటలూ చాలా ప్రసిధ్ధి చెందినవే.
8)tujh se nArAz nahi zindagi -- mAsoom(1983)
lyrics:gulzar
singer:lata
music:S.D.burman
http://www.youtube.com/watch?v=yzKeB5zUAZc
ఆనందంగా సాగిపొతున్న జీవితంలో తన భర్తకు ఇదివరకే ఒక స్త్త్రీ తో సంబంధం ఉందని తెలిసిన ఒక భార్య మనసులో జరిగిన సంఘర్షణ,చివరికి ఆమె తన భర్తని ఎలా క్షమిస్తుంది అనేది ఈ చిత్ర కధాంశం.ఈ సినిమాలొ చిన్న పిల్లవాడు బాగా చేస్తాడు.ఈ పాటకు మేల్,ఫీమేల్ రెండు వెర్షన్లు ఉన్నాయి.
9)akhiyonke jharokonse -- title song(1978)
lyrics:Ravindra jain
singer:hemalata
music:Ravindra jain
http://www.youtube.com/watch?v=KqpIIaCJggY
జన్మత: అంధుడైన రవీంద్ర జైన్ గారు ఈ సినిమాకి సంగీతం సమకూర్చటంతో పాటూ
ఎన్నో దృశ్యవర్నాలున్న ఈ పాటని రాయటం ఈ పాట యొక్క విశేషం. ఇది మనసుని కదిల్చివేసే ఒక ట్రాజిక్ లవ్ స్టోరీ.ఈ సినిమానే తెలుగులో కొద్ది మార్పులతో "మంచు పల్లకీ" అని తీసారు.తెలుగు సినిమాలో పెట్టిన పాట "మేఘమా దేహమా" కూడా చాలా బాగుంటుంది.జానకిగారు అద్భుతంగా పాడిన పాటల్లో ఇది ఒకటి.
10)katra katra milta hai -- ijaazat
lyrics:gulzar
music:R.D.burman
singer:asha bhonsle
http://www.youtube.com/watch?v=HngdE4MiL2U
ఒక ఫొటోగ్రాఫర్ కధ ఇది.పెళ్ళి జరిగిన తరువాత కూడా గతం తాలూకు జ్నాపకాల నుంచి బయటకు రాలేక పోతాడు
కధానాయకుడు.ఫలితంగా భార్యని,ప్రియురాలిని ఇద్దరిని దూరం చేసుకుంటాడు.ఈ సినిమాలో ఆశభొంశ్లే పాడిన ఇంకో రెండు పాటలు కూడా బాగుంటాయి.
11) tu pyar ka sagar hai -- seema(1955)
lyrics:shailendra
music:shankar-jaikishan
singer:manna dey
http://www.youtube.com/watch?v=5QM8ohMGneY
బల్రాజ్ సహానీ నడుపుతూన్న ఒక అనాధశరణాలయం లోకి కధానాయిక చేరుతుంది.వారిద్దరి మధ్య కొద్దిపాటి ఘర్షణల తరువాత ప్రేమ చిగురిస్తుంది.కొన్ని విపత్కర పరిస్థితులలో నాయిక ఆయనకు తోడుగా నిలుస్తుంది.మనసుల్లో దాచుకున్న ప్రేమను తెలుపుకుని,వారిద్దరూ ఎలా దగ్గరౌతారు అన్నది కధాంశం.
నూతన్,బల్రాజ్ సహానీ ఇద్దరూ పోటీపడి నటించారా అనిపిస్తుంది ఈ సినిమా చూస్తే.
12)itni shakti hame dEna dAtA -- ankush(1986)
lyrics:English transliterated
music:kuldeep singh
singers: pushpa pagdhare&sushma sreashtha
http://www.youtube.com/watch?v=-w_P5Pr6eEQ
ఆకతాయిగా తిరిగే నలుగురు కుర్రాళ్ళని ,వాళ్లకి ఒక లక్ష్యం ఏర్పడేలా ఎలా ఒక అమ్మాయి ఎలా మారుస్తుంది?ఆ అమ్మయికి అన్యయం జరిగినప్పుడు ఆ కుర్రాళ్ళు ఎలా న్యాయం కోసం పోరాడారు అన్నది ఈ చిత్రం కధ.
13)jab koi baat bigaD jAyE -- jurm(1990)
lyrics:Indeever
singers:kumar sanu,sadhana sargam&chorus
music:rajesh roshan
http://www.youtube.com/watch?v=71pgeKnfA14
చిత్ర కధ గుర్తు లేదు.
14)zindagi jab bhi -- umrAo jaan(1981)
lyrics:shahryar
music:khayyam
singer:talat aziz
http://www.youtube.com/watch?v=Q_aH7NcQUf0
ఈ సినిమా కధ కూడా గుర్తు లేదు.కాకపోతే రేఖకు పేరు తెచ్చిన గొప్ప పాత్రల్లొ ఇది కూడా ఒకటి అని గుర్తు.సినిమాలో "దిల్ చీజ్ క్య హై","జుస్తుజూ జిస్కి థి" లాంటి మిగిలిన పాటలు కూడా ప్రాచుర్యం పొందినవే.
15)tere bina zindagi se koi -- Andhi(1975)
lyrics:gulzar
singer:lata &kishore kumar
music:R.D.burman
http://www.youtube.com/watch?v=Nt4QQMj6-mg
ఒక రాజకీయనాయకుని కుమార్తె ప్రేమ వివాహం అనంతరం కొన్ని కారణాలవల్ల రాజకీయాల్లొకి ప్రవేశిస్తుంది.ఆ మలుపు భార్యాభర్తల జీవితాల్లో పూడ్చలేని దూరాన్ని పెంచుతుంది.నడివయసు దాటాక ఒక సందర్భంలొ ఇద్దరూ మళ్ళీ కలుసుకుంటారు.ఆ నేపధ్యంలో ఫ్లాషుబాక్ లతొ సినిమా నడుస్తుంది.ఈ సినిమా కధ తర్కేష్వరి సిన్హా(ఒక ఫిమేల్ పొలిటీషియన్,కేబినేట్ మినిస్టర్),ఇందిరా గాంధి ఇద్దరి జీవితాల ఆధారంతో తయారైంది .సినిమాలో మిగతా పాటలన్నీ కూడా బాగుంటాయి.
16)do Ankhen barah hAth -- do aankhen barah haath(1957)
lyrics:bhatar vyas
singer:lata
music: vasant desai
http://www.youtube.com/watch?v=dTp38xGAZqU
"ఓపెన్ ప్రిజన్" పరిశోధనల ఆధారంతో,గాంధీయ సిధ్ధాంతాలతొ తయారైన చిత్రం ఇది.ఒక జైలర్ కొందరు ఖైదీలని జైలుకి దూరంగా తీసుకువెళ్ళి వాళ్ళలో గొప్ప మార్పుని ఎలా తీసుకువచ్చాడన్నది ఈ చిత్ర కధాంశం.చాలా గొప్ప సినిమా.శాంతారామ్ చిత్రాలన్నింటిలో నాకు నచ్చిన సినిమా ఇది.ఈ చిత్రానికి బెర్లిన్ ఫిమ్ ఫెస్టివల్లో "సిల్వర్ బేర్" మరియు "గోల్డెన్ గ్లొబ్ అవార్డ్" కూడా వచ్చాయి.
(నోట్:పాటల మీద ఉన్న మక్కువ కొద్దీ ఈ వివరాలన్నీ రాయటం జరిగింది.ఈ సినిమాలన్ని చాలా ఏళ్ళ క్రితం చూసినవి.వివరాల్లో ఏవైనా తప్పులు,పొరపాట్లు ఉంటే మన్నించగలరు.)
Thursday, July 2, 2009
సింగీతంగారి "క రాజు కధలు"
ఇక్కడ సింగీతం గారి గురించి కొంత చెప్పాలి.అప్పటిదాకా నాకు ఆయన ఒక ప్రఖ్యాత దర్శకునిగానే తెలుసు.ఈ కధలు చదివాకా ఆయన ఎంతటి గొప్ప రచయితో,ఆలోచనాపరులో అర్ధం అయ్యింది. ఆయన గురించి అప్పుడు మరిన్ని వివరాలు తెలుసుకున్నాను.
సుమారు 60చిత్రాలకు పైగా ఆయన దర్శకత్వం వహించారు.తెలుగు,కన్నడ,తమిళ్,మళయాళ,హిందీ,ఇంగ్లీషు భాషా చిత్రాలెన్నింట్లికొ ఆయన దర్శకత్వం వహించారు.రాష్ట్రపతి పతకాలు,నందీ అవార్డులు,ఎల్.వి.ప్రసాద్ అవార్డ్ వంటి ప్రతిస్ఠాత్మక అవార్డ్లెన్నొ అందుకున్నారు.
ప్రయొగాత్మక చిత్రాలకి ఆయన నాంది పలికారు.మయూరి,పుష్పక విమానం,విచిత్ర సోదరులు,మిఖేల్ మదన కామ రాజు,ఆదిత్య 369, భైరవ డ్వీపం, బృందవనం..మొదలైన సినిమాలతొ ఆయన ఒక కొత్త ట్రెండ్ ని సృష్టించారు.అసలు డైలాగులే లేకుండా ఆయన తీసిన 'పుష్పక విమానం" నాకెంతొ ఇష్టమైన సినిమాలలొ ఒకటి.
1954లొ కె.వి.రెడ్డిగారి దగ్గర దొంగరాముడు,మాయాబజార్ వంటి చిత్రాలకి ఆయన సహాయ దర్శకులుగా పనిచేసారు.దర్శకేతర విభాగాల్లో కూడా ఆయన పనితనం చూపించారు.మొదట్లో కధలు,నాటకాలూ రాసి ఎన్నొ బహుమతులు అందుకున్నారు.భైరవద్వీపం చిత్రంలొ"విరిసినది వసంతగానం" అన్న పాటని ఆయనే రాసారు.కన్నడంలో కొన్ని సినిమాలకు సంగీతం కూడా చేసారు.కన్నడ జర్నలిస్టుల ఆసొసియెషన్ సింగీతం గారి మీద ఒక ప్రత్యేక పుస్తకాన్ని అచ్చువేసిందంటే అది ఆయన ప్రతిభకు నిదర్శనమే కదా.కొందరు గొప్ప దర్శకులు బొత్తిగా అర్ధంపర్ధం లేని కొన్ని ఫ్లాపు సినిమాలు ఎందుకు తీస్తారో తెలియదు.అలాంటి కొన్ని ఫ్లాపు సినిమాలు తీసినా కానీ;నిరంతరం ప్రేక్షకులకి ఒక కొత్తదనాన్ని అందించాలనే తపన ఉన్న గొప్ప దర్శకులు శ్రినివాసరావుగారు.
క్రిందటేడు "ఘటొత్కచ్" అని పలు భాషల్లో యేనిమాషన్ చిత్రాన్ని తీసి, తెలుగువారు కూడా యేనిమాషన్లు తీయగలరు అని నిరూపించిన ప్రతిభాశాలి ఆయన.కధనంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఆ సినిమా తప్పకుండా ఆడి ఉండేది!
ఏవో సర్దుతూంటే కనిపించిన పుస్తకం పట్టుకుని ఇంత పెద్ద పోస్టు రాసేసాను.ఆ పుస్తకం + ఆ రచయిత మీద ఉన్న అభిమానం అలాంటిది.ఓపిగ్గా చదివినవారికి ధన్యవాదాలు.బ్లాగు పుణ్యమా అని మరొసారి ఆ కధలని నేనూ చదువుకుంటాను!!