సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, August 31, 2009

క్షీరాబ్ధి ద్వాదశి

నేను దాచుకున్న కొన్ని కధల్లో కోరుకొండ సత్యానంద్ గారు "క్షీరాబ్ధి ద్వాదశి" మీద రాసిన కధ ఒకటి.కధలు చదివే ఆసక్తి కలవారు చదువుకుందుకు వీలుగా పి.డి.ఎఫ్. ఫైల్ లింక్ ను ఇక్కడ పెడుతున్నాను.
http://www.mediafire.com/file/zyvzoi4zmmi/ksheerabdi%20dwaadasi.pdf

కొన్ని పర్వదినాలంటే నాకు చాలా ఇష్టం.కార్తీక పౌర్ణమి,మాఘపాదివారాలూ,ముక్కోటి ఏకాదశి,రధ సప్తమి,క్షీరాబ్ధి ద్వాదశి...ఇలాగ.చిన్నప్పుడు తులసికోట ముందర కూర్చిని,దాంట్లో ఉసిరి కొమ్మ పెట్టి అమ్మా చేసే "క్షీరాబ్ధి ద్వాదశి" పుజ అంటే నాకు చాలా ఇష్టంగా ఉండేది.పెళ్ళయ్యాకా నేను చేయటం మొదలెట్టాను...!క్షీరాబ్ధి ద్వాదశి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది.కానీ తెలియనివాళ్ళెవరైనా ఉంటే,వాళ్ళ కోసం--

కార్తీక మాసంలోని శుక్లపక్ష ద్వాదశిని "క్షీరాబ్ధి ద్వాదశి" అంటారు.పురాణ కధనం ప్రకారం__విష్ణువు చెప్పగా,దేవదానవులు పాలకడలిని (క్షీరాబ్ధిని) మధించిన రొజు ఇది.అందువల్ల ఈ పేరు వచ్చింది.అంతేకాక,ఆషాఢ శుక్ల ఏకాదశినాడు యోగనిద్ర ఆరంభించే విష్ణువు కార్తిక శుధ్ధ ఏకాదశినాడు తన నిద్రను ముగిస్తాడు.మరుసటి దినమైన "క్షీరాబ్ధి ద్వాదశి"నాడు శ్రీహరి లక్ష్మీసమేతుడై,బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వస్తాడు.అందువల్ల ఈ రోజుని "బృందావన ద్వాదశిగా కూడా పిలుస్తారు.ఈ రొజు సాయంత్రం విష్ణుస్వరూపమైన ఉసిరి కొమ్మను,లక్ష్మీ స్వరూపమైన తులసి మొక్క పక్కన పెట్టి పూజ చేస్తారు.ఈ ప్రదేశాన్ని వీలైనన్ని దీపాలతొ అలంకరిస్తారు కూడా.సంవత్సరంలో ఏ రొజైనా దీపారాధన చేయకపోతే వచ్చే దోషం,ఈనాడు దీపారాధన చేయటం వల్ల పరిహారమౌతుంది అంటారు.

Saturday, August 29, 2009

తేనె కన్నా తీయనిది..

(Hindu i Images లో తెలుగు తల్లి)

తెలుగు భాషా దినోత్సవవం సందర్భంగా ఇవాళ నాకు చాలా ఇష్టమైన ఈ పాట రాస్తున్నాను....చిన్నప్పుడు ఈపాటని స్కూల్లో మా మ్యూజిక్ టీచరు నేర్పించి మా చేత(మా స్కూల్ కోయిర్ గ్రూప్లో నెనొకత్తెని) ఒక సభలో పాడించారు.(ఆ సభ అయ్యి స్కూలువాళ్ళు మమ్మల్ని స్కూల్ బస్సులో ఇళ్ళకి చేర్చేసరికీ రాత్రి పదయ్యింది.ఇంట్లో కంగారు,అక్షంతలూ....అది వేరే కధ..!)ఆ పాట పాడుతూంటే ఇప్పటికీ నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి...ఒక అమర గీతం ఇది...
శంకరంబాడి సుందరాచారిగారు రచించిన ఈ గీతాన్ని మన రాష్ట్రప్రభుత్వం రాష్ట్రగీతంగా స్వీకరించింది.

మా తెలుగు తల్లికీ మల్లెపూదండ
మా కన్న తల్లికీ మంగళారతులు
కడుపులో బంగారు కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి

గలగలా గోదారి కదిలిపొతుంటేను
బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి

అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలిచి ఉండేదాక
రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతి భక్తి
తిమ్మరసు దీయుక్తి, కృష్ణరాయని కీర్తి

మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక
నీ ఆటలే ఆడుతాం, నీ పాటలే పాడుతాం
జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!


ఆత్రేయగారు రాసిన,ఇళయరాజాగారు స్వరపరిచిన మరొక తెలుగు వైభవ గీతం
"తేనె కన్నా తియనిది, తెలుగు భాష
దేశ భాశలందు లెస్స,తెలుగు భాష !"
ఈ పాత సాహిత్యం,ఆడియో క్రింది లింక్ లో__
http://www.teluguvaibhavam.com/2009/02/literature-aathreya-songs-tene-kanna.html

ఈ సందర్భంగా నే గమనించిన కొన్ని విషయాలు--
ఎందుకనో కొందరు తల్లిదండ్రులు నాలుగైదేళ్ల పిల్లలతో ఆంగ్లంలో మాట్లాడేస్తు ఉంటారు.."hey,dont go that way" "why are you doing like that" "sit there.dont move' 'talk in english' అని గదమాయిస్తు ఉంటారు.నేర్చుకోవాల్సినంత భాషనీ,పరిజ్ఞానాన్ని స్కూల్లో నేర్పనే నేర్పుతారు. ఇంట్లోనైనా మాతృభాషను నేర్పితే తప్పేమిటో అర్ధం కాదు.కొన్ని అంతర్జాతీయ సభల్లో,అంతర్జాతీయ సినిమా అవార్డ్ ఫంక్షన్స్ లో కొందరు ఆంగ్లేతరదేశస్తులు ఇంగ్లీషులో కాక, తమ తమ భాషల్లోనే ఉపన్యాసాలిస్తూంటారు.మరి మన తెలుగు వాళ్ళకు తెలుగువాళ్ళమని చెప్పుకోవటానికే నామోషీ.

ఇంకొందరు స్టైల్ గా "షివుడు"(శివుడు), "దేషం"(దేశం),"ఆష"(ఆశ),"అవకాషం"(అవకాశం) అని అవలీలగా పలికేస్తూంటారు.కొన్ని సినిమాపాటల్లో కూడా ఇలాగే పదాల్ని వాడేస్తూ,సరి చెయ్యకుండా మనవాళ్ళు అలానే రిలీజ్ చేసేస్తారు పాటల్ని.అనుకరించేవాళ్ళు అలానే నేర్చేసుకుని పాడేస్తు ఉంటారు కూడా.సొంతభాషపై అంత చిన్నచూపు ఎందుకో అర్ధం కాదు...!

మన దేశంలోని మిగతా రాష్ట్రాల వాళ్లకి తమతమ భాషలపై ఉన్న గౌరవం,ప్రేమ మన తెలుగు వాళ్ళకి లేవు.ఉన్నా అది చాలా తక్కువనేచెప్పాలి.అందుకే దేశంలో హిందీ తరువాత ఎక్కువగా మాట్లాడే భాష అయిఉండి కూడా అనామకంగానే మిగిలిపోతోంది మన తెలుగుభాష.ఉత్తర హిందూ ప్రాంతాలకి వెళ్తే, సౌత్ ఇండియా నుంచి అంటే, మదరాసీలా అనడుగుతారే తప్ప ’ఆంధ్రా నుంచి తెలుగువారమంటే’ వింత జాతీయులను చూసినట్లు చూస్తారు...!!

ఎన్.టి.ఆర్ గారి పుణ్యమా అని తెలుగు భాషకు జాతీయస్థాయిలో కాసింత గుర్తింపు వచ్చిందనే చెప్పాలి.ఇప్పుడు హైటెక్ సిటీ పుణ్యాన అది ఇంకాస్త పెరిగింది.కానీ కొన్ని విషయలు చూసినప్పుడు,విన్నప్పుడు మాత్రం...ఎప్పటికో మన భాషకు పూర్తి స్థాయి గుర్తింపు అనిపిస్తూ ఉంటుంది.మా మటుకుమేము మా ఉడుతా ప్రయత్నంగా, మా పాపకి నర్సరిలో ఉన్నప్పుడు "London bridge is falling down',"pussycat pussycat.."అని స్కూల్లో నేర్పిస్తూంటే...ముందు దానికి తెలుగు వారాలూ,మాసాలూ,అ,ఆలూ నేర్పాము ఇంట్లో!!

Friday, August 28, 2009

వర్షం వెలిసిన సాయంత్రం....

(నిన్నటి సాయంత్రపు ఊసులివి...)
ఇప్పుడే వాన వెలిసింది...చెట్ల చివర్ల నుంచి వర్షపు బొట్లు ఒక్కొక్కటే నేల రాలుతున్నాయి..మెల్లగా వీస్తున్న గాలికి కొమ్మలు చిన్నగా తలలూపుతు తమ హర్షాన్ని వ్యక్తపరుస్తున్నాయి..రామచిలుకలు ఇళ్లకు వెళ్ళాలా వద్దా అని యోచిస్తున్నట్లు కొమ్మ కొమ్మకీ అటు ఇటు ఎగురుతున్నాయి...వాన కురిసేప్పుడు ఒకరకమైన అందమైతే,వాన వెలిసాకా ప్రకృతిది మరో రకమైన అందం!వాన వెలిసిన తరువాత అలసట తీర్చుకుంటున్నట్లు నిశ్సబ్దంగా పలకరించే నిర్మలమైన ఆకాశం ఒక మౌన మునిలా గోచరిస్తుంది!!ఈ నిశ్శబ్దంలో నాలో ఎన్నో ఆలోచనలు...వంట్లో బాలేకపోతే ముసుగుతన్ని పడుకోక ఎందుకొచ్చిన రాతలూ?అని మనసు కసురుతున్నా "తిరిగే కాలూ,తిట్టే నొరూ.."అన్నట్టు..రాసే చేతికి విశ్రాంతి ఉండదు...మనసులో అలలై ఎగసే భావాలను కాగితం పైనో,నోట్ ప్యాడ్ పైనో రాయకపోతే తొచదు...

ఒకప్పుడు 300పేజీల పుస్తకాన్నయినా ఒక్కపూటలో,ఇంకా మాట్లాడితే 3,4 గంటల్లో పూర్తి చెయ్యగల నేను,గత నెల రోజులుగా 170పేజీల పుస్తకాన్నిపూర్తి చెయ్యలేకపోవటం నాకే ఆశ్చర్యం.చూసే సినిమాకో,చదివే పుస్తకానికో మధ్యలో ఆటంకం వస్తే ఇల్లెగిరిరేలా నే చేసిన హాహాకారాలు,పెట్టిన పెడ బొబ్బలు చిన్ననాటి ముచ్చట్లుగా మిగిలిన జ్ఞాపకాలే! ఇప్పుడలాటి హా హాకారాలన్నీ గుండె గొంతుకలోనే నిలిచిపోతాయి...బాధ్యతతొ కూడిన పెద్దరికం మాట్లాడనివ్వదు మరి.అప్పుడు చివుక్కుమన్న అమ్మ మనసు ఇప్పుడు కనిపిస్తుంది..!కూరలు తరిగేప్పుడు వేలు కోసుకున్నా,పరధ్యానంలో వేడి కుక్కర్ తగిలి చేయి కాలినా,ఒళ్ళు వెచ్చబడినా అమ్మానాన్నల ఓదార్పుకై మనసు పరుగులు తీస్తుంది...ఇప్పుడు ఓదార్పు లేక కాదు,అమ్మానాన్నలు ప్రేమతో "అయ్యో" అంటే సగం తగ్గిపోయే నెప్పి గుర్తుకువస్తుంది!!కాలం పరుగులో వయసనే బంధనం శరీరానికే గానీ మనసుకు కాదు కదా.బాధ్యత,విధి నిర్వహణ లాంటి ఎన్ని బరువులు అది మోసినా,భార్యగా,కోడలిగా,తల్లిగా ఎన్ని కొత్త పదవుల్లో చేరినా...మనసులో ఎక్కడో మూలన దాగిఉన్న పసిమనసు ఇంకా "పుట్టింటికే పరుగులు" తీస్తూ ఉంటుంది సీతారామయ్యగారి మనవరాలు సినిమాలో పాటలాగ!!

ఇలా అలవాట్లలో మార్పులు,పనుల్లో తగ్గిన జోరు,ఆవేశంలో స్మరణకొచ్చే ఆలోచన,ఆలోచనల్లో వచ్చిన నెమ్మదితనం,వాదన స్థానంలో మౌనం...ఇవన్నీ పెళ్ళి తెచ్చిన మార్పులు అనటం కన్నా వయసు తెచ్చిన పెద్దరికపు లక్షణాలు అని మనసు తెలియచేస్తూ ఉంటుంది.కానీ కొన్ని విషయాల పట్ల మాత్రం విముఖత,అనాసక్తి రెండూ ఖచ్చితంగా ఏర్పడిపోయాయి.చిన్నతనపు అల్లరులూ,కేరింతల స్థానంలో ఏదో తెలియని నిశ్శబ్దం..!మనతో కలిసి నిన్నటివరకూ తిరిగిన దగ్గరి మనుషులు హఠాత్తుగా దూరమైనప్పుడు అర్ధమైన జీవనతత్వం. చివరికి మిగిలేదేమీ లేదని అర్ధమైనందువల్ల కలిగిన నిర్వేదం..!!

అన్ని భావాలకూ అతీతమైన నిర్లిప్తత..అది.

ఏమిటిది...ఎక్కడో మొదలై ఎక్కడికో వెళ్పోతున్నాయి ఆలోచనలు.....ఇలా పొంతనలేని గజిబిజి ఆలోచనలతో బుర్ర వేడేక్కినప్పుడు ఎప్పుడు చేసే పనే ఇప్పుడూ చేసాను....
మీడియ ప్లేయర్లో పాట పెట్టేసాను....
"మేంబో మామియా....ప్రేమ ఒక మాయ...
సునామి లాగ దాహమొచ్చినాది,వేగమొచ్చినాది...".
ఇలాటి హుషారైన పాటలు నాలుగు వింటే అంతుపట్టని ఆలోచనలన్నీ...ఢమాల్!!
తుక్కునంతా రీసైకిల్ బిన్లో పడేసినట్లు...కంప్యూటర్ లో రిఫ్రెష్ కొట్టినట్లు.....!!


Wednesday, August 26, 2009

Bhootnath



"क्रॊध कॆ बोझ को मन पे उठाये काहे चेल्ता है प्राणी

क्शमा जो श्त्रु को भी कर दे,वहि मुक्त है...वहि ग्यानी"
bhootnath సినిమాలో జావేద్ అఖ్తర్ "समय का पैय्या चेलता है.." పాటలోని మొదటి రెండు వాక్యాలూ..ఇవి.
"మనసులో కోపమనే బరువును ఎందుకు మోస్తూంటాడు ప్రాణి
శత్రువును సైతం క్షమించినప్పుడే ముక్తి....అదే జ్ఞానం(...అతడే జ్ఞాని..)"-- అని అర్ధం !!

ఆ మధ్యెప్పుడో "Outsourced " అనే సినిమా సగం నుంచీ చూసాకా మళ్ళీ చాలా రొజులకి టి.వీ.పెట్టి 4,5రోజుల క్రితం ఇంకో సినిమా కేబుల్ టి.వీలో ఆఖరు సగం చూశా..!అదే "bhoothnath".రెండు నిమిషాలు చూడగానే,కధ వేరే మార్చిన ఆంగ్లచిత్రం "Casper"కు భారతీకరణ అననుకున్నా.కానీ నెట్లో వివరాలు పరిశీలించాకా కధ Oscar wilde రాసిన short-story "the Canterville Ghost"కు adaptation అని తెలిసింది. చూసిన గంట ఆట బాగుంది.మొదటి సినిమా అయినా వివేక్ శర్మ కధను చిత్రీకరించిన విధానం బాగుంది.మరి నే చూడని మొదటి భాగం ఎలా ఉందో,బాక్సాఫీసు రిపోర్ట్ అవీ తెలీదు.పెద్దగా ఆడలేదని విన్న గుర్తు.

కొడుకు నిరాదరణకు గురైన ఒక తండ్రి చనిపోయి,తన ఇంట్లోనే భూతమైతిరుగుతూ, ఆ ఇంట్లో ఎవరు అద్దెకు దిగినా భయపెట్టి పారిపోయేలా చేస్తూ ఉంటాడు..ఆ ఇంట్లో దిగిన ఒక కుటుంబంలోని పిల్లవాడు మాత్రం ధైర్యంగా, అతనితో మచ్చిక చేసుకుని దగ్గరౌతాడు.ఆ పిల్లవాడి తల్లిదండ్రులు ఆ భూతానికి ముక్తిని కలిగించే ప్రయత్నం చేస్తారు.ఆ భూతం తాలూకు కుమారుడు వచ్చి శ్రార్ధకర్మలో పాల్గొని తండ్రిని క్షమాపణలు చెప్పుకోవటంతో ఆ తండ్రి ఆత్మకు విముక్తి కలిగి పుణ్యలోకాలకు వెళ్ళిపోతాడు.ఇది క్లుప్తంగా సినిమా కధ.

ఆ శ్రార్ధకార్యక్రమాలు జరగబోతున్నాయి అని పిల్లవాడు భూతానికి చెప్పినప్పుడు,భూతం పాత్ర పోషించిన అమితాబ్ ఆ పిల్లవానికి జీవితంలో కొన్ని సూత్రాలు పాటించవలసిందిగా చెప్తాడు."అబధ్ధాలు చెప్పకూడదు,ఇతరులని,తల్లిదండ్రుల్నీ బాధ పెట్టకూడదు......ముఖ్యంగా మనల్ని బాధపెట్టిన వాళ్ళని క్షమించటం నేర్చుకోవాలి"అని చెప్తాడు.అప్పుడు ఆ పిల్లవాడు అడుగుతాడు "మరి నువ్వెందుకు నీ కొడుకుని క్షమించలేదు..?" అని.ఆ సీన్ నాకు చాలా నచ్చింది.అప్పుడు వస్తుంది నేను పైన రాసిన పాట.మొదటి రెండు వాక్యలూ అయ్యాకా "సమయ్ కా పైయ్యా చెల్తా హై" అని పాట మొదలౌతుంది.

సినిమాలో నాకు బాగా నచ్చిన పోయింట్ ఇది.శత్రువును సైతం క్షమించగలగటానికి ఎంతో ధీరత్వం ఉండాలి.ఉదాత్తత ఉండాలి.మనల్ని బాగా బాధపెట్టినవాళ్లనీ,సూటిపోటి మాటలతో మనసుని గాయపరచిన వాళ్ళనీ,తమ చేతలతో మనసుని ముక్కలు చేసిన వాళ్ళనీ మనం క్షమించగలమా?చాలా కష్టం..!కానీ ఈ పాటలోని వాక్యాలు విన్నాకా అనిపించింది...నిజమే,ఎందుకు మనం ఇతరులపై కోపాన్నీ,బాధనీ,దు:ఖాన్నీ మోసుకుంటూ బ్రతుకుతాం?వాళ్ల పాపానికి వాళ్ళని వదిలెసి మన మనసులని ఎందుకు తేలిక చేసుకోమూ...అని. లేకపోతే మనం కూడా అమితాబ్ మాదిరి చనిపోయాకా భూతంగా మారిపొతామేమో....ఈ లెఖ్ఖన ప్రపంచంలో ఎన్ని కోట్ల,బిలియన్ల భూతాలు తిరగాడుతూ ఉన్నాయో..అనిపించింది కూడా!!

పాత్రల విషయానికి వస్తే,"బంకు" పాత్రలో పిల్లవాడు Aman Siddiqui మనసుని దోస్తాడు."భూత్నాథ్"పాత్రలో అమితాబ్ బచ్చన్ నటనకు తిరుగు లేదు.ఆ హావభావ ప్రదర్శన,కామిడీని పండించటం అన్నీ సూపర్.ఒక అసాధారణ నటుడిగా ఉన్నతమైన స్థానంలో ఉండే అమితబ్ "క్యారెక్టర్ ఆర్టిస్టు" పాత్రలు వేయటం వరకు ఒప్పుకోగాలను ,కానీ ఇలా ఒక బేల తండ్రి పాత్రలో కొడుకుని ప్రాధేయపడటం నేను సహించలేని విషయం.అలాంటి పాత్రలు కూడా వేసి ప్రేక్షకులను మెప్పించటం అమితాబ్ గొప్పతనమైనా,అతడిని అలా ఇతరులను ప్రాధేయపడే పాత్రల్లో చూడలేకపోవటానికి నాకతని మీదున్న అభిమానామే కారణం."baagbaan" లో కూడా నిరాదరణకు గురయ్యే తండ్రి పాత్రలో అమితాబ్ ను అస్సలు చూడలేక పోయాను.
ఈ సినిమాలో ఇతర పాత్రల్లో జూహీ చావ్లా,షారుఖ్ ఖాన్,ప్రియాన్షు చెటర్జీ,రాజ్ పాల్ యాదవ్ నటించారు.

Saturday, August 22, 2009

అవిఘ్నమస్తు

బ్లాగ్మిత్రులందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు.
ఈ పర్వదిన సందర్భంగా విఘ్నాలన్నీ తొలగించి,ఆ వినాయకుడు అందరి కోరికలనూ తీర్చి,అందరికీ క్షేమ,అభయ,ఆయురారోగ్యాలను అందించాలని ప్రార్ధిస్తున్నాను.

శ్రీ గణేశపంచరత్న స్తోత్రం చాలా చోట్ల ఆంగ్లంలో కనిపించింది.అది వాడటం ఇష్టం లేక సంస్కృతంలో ఉన్న లింక్ ను మాత్రం ఇక్కడ పెడుతున్నాను.
ఆ క్రిందనే యూ ట్యూబ్ లో చూడటానికీ,ఆడియో డన్లోడ్ చేసుకోవటానికీ కూడా లింక్ లను చూడగలరు

తూ.గో.ప్రయాణం__ఆఖరిమజిలీ(యలమంచలి)




యలమంచలి దగ్గర మా బంధువుల్లో ఒకరు వర్క్ చేస్తున్న అగ్రికల్చురల్ ఫార్మ్ ఉంది.గార్డెనింగ్ అంటే విపరీతమైన పిచ్చి ఉన్న నాకు ఆ ఫార్మ్ చూడాలని ఎన్నో ఏళ్ళ కోరిక. యానామ్ దాకా ఎలాగూ వెళ్తున్నాం ఇంకొంచెం ముందుకు,విశాఖ జిల్లా అంచులదాకా వెళ్ళి అది కూడా చూసేద్దాం అని మావారి చెవిలో జోరీగలా పోరేసా...సర్లెమ్మన్నారు.యానాం నుంచి బస్సులో యలమంచలి వెళ్దామని పొద్దున్నే లేచి బస్టాండ్ కు చేరాం.రెండు గంటలు కూర్చున్నా మాకావాల్సిన బస్సు రాలేదు.మేము వెళ్ళి మళ్ళీ గౌతమీ టైముకి కాకినాడ రావాలి.అక్కద ఉండే టైము తగ్గిపోతోందని కంగారు నాకు...ఆఖరుకు ఒక సహప్రయాణికుని సలహాపై ముందర కాకినాడ వెళ్ఫోయి అక్కద విశాఖ వెళ్ళే ఎక్సప్రెస్స్ బస్సు ఎక్కాం....అది అలా నెమ్మదిగా అన్నవరం దాటి...వెళ్లి వెళ్ళి...మేం ఆ ఊరు చేరే సరికీ మధ్యాహ్నం పన్నెండు..!!

పొద్దున్నే 4.30కి లేచిన మా కడుపుల్లో ఎలకలు పరిగేడుతూంటే ఆవురావురుమని పెట్టిన తిఫిన్ మాట్లాడకుండా లాగించేసాం.
భోజనాలు తర్వాత అనుకుని ఇంక అన్నాయ్యగారి ఫార్మ్కు బయల్దేరాము.చుట్టుపక్కల ఉన్న నలభై మందలాల్లో ఇరవై మండలాలవాళ్ళు వీళ్లదగ్గరే మొక్కలు కొనుక్కుంటారుట.మామిడి,అరటి,జామా,పనసా ఇలా చాలా రకాల పళ్ళ రకాలూ,టమోటా,వంగ,చిక్కుడు రకాలూ,బెన్డ వంటి కాయగూరలూ,రకరకాల పంటల గ్రాఫ్టింగు,హైబ్రిడ్ వెరైటీలూ వీళ్లు తయారు చేస్తారుట.అదంతా కొండ ప్రాంతం.బీడు భూమి...ఎక్కువ నీరు లేకున్నా,అదంతా సాగు చేసి పచ్చని తొటల్ని పెంచారు.చిన్నప్పుడు దూరదర్షన్లో కృషిదర్షన్,డిడి8 లో వ్యవసాయదారుల కార్యక్రమాలూ బాగా చూసే దాన్ని.నాకెందుకో సరదా..అప్పుడే నాకు ఈ గ్రాఫ్టింగు,హైబ్రీడైజేషన్...మొదలైన విషయాలపై అవగాహన వచ్చింది.చక్కగా ఓ చిన్న పొలం కొనుక్కుని అందులో ఓ గుడిశ వేసుకుని పొలం చేసుకుంటూ జీవితం గడిపెయాలని కలలు కూడా కనేదాన్ని...!!

ఫార్మ్ కబుర్లలోకి వచ్చేస్తే....తక్కువ నీరుతో ఎక్కువ దిగుబడి ఎలా సంపాదించాలి,నీరు లేకపోయినా రెండు,మూడు రకాల మొక్కలతో పంటని ఎలా పచ్చగా ఉంచాలి మొదలైనవి వాళ్ళు రైతులకు తెలియచెప్పే పరిశోధనాత్మక వివరాలు.పాషన్ తో,అంకితభావంతో 17,18 ఏళ్ల ఆయన అనుభవాలూ,పరిశోధనల వివరాలూ,వాళ్ళ ఏక్టివిటీస్ అన్నీ ఆయన చెప్తూంటే..చాలా ఆనందం కలిగింది.ఆ సంస్థ పరంగా ఆయన చేస్తూన్న కృషి అపూర్వం!!చేసే వృత్తి మన ప్రవృత్తికి సరిపడేదైతే,అందులో మనల్ని మనం మరిచేటంత అలౌకికానందం మనం పొందుతూంటే,మనం చేసే పని కొన్ని వందల మందికి ఉపయోగపడ్తూంటే,జీవనోపాధి కల్పిస్తూంటే.....జీవితానికి ఇంతకన్నా సార్ధకత ఉండదేమో అనిపించింది.

ఈ నాలుగురోజుల్లో,మనసు నిండా బోలేడు తియ్యని అనుభవాలూ,మరువలేని జ్నాపకాలూ నింపుకుని...సమయాభావం వల్ల బస్సు వదిలి,టాక్సీ ఎక్కి కాకినాడ సకాలంలో చేరి..మా రైలు ఎక్కాం!ఈసారి ముందుగానే సైడ్ లోయెర్లో తిష్థ వేసి,సీటు మార్పిడి చేసుకుని సుఖంగా నిద్రపోయాం పాపా,నేను!!
మొత్తానికి మా ప్రయాణం విశేషాలు పూర్తయ్యాయి....బాధని మనసులో దాచుకోగలం కానీ ఆనందాన్ని ఎవరితోనూ పంచుకోకుండా ఉండలేము....అన్న నా అభిప్రాయమే ఈ అయిదు టపాలకీ పునాది.

Friday, August 21, 2009

తూ. గో. ప్రయాణం__ మూడవరోజు(ద్రాక్షారామ,కోటిపల్లి,యానాం)

మూడవరోజు పొద్దున్నే మేము వెళ్లవలసిన కొందరు పెళ్ళివారితో అమ్మ వచ్చింది.యానాం వెళ్ళే కారులో అమ్మతో పాటూ పాపని పంపేసాము.మాతో తిరిగి తిరిగి అలసిపోయిన దాన్ని ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక.హమ్మయ్యా!అనుకున్నాం.కాకినాడ నుంచి ఒక స్పెషల్ రైలు కోటిపల్లి దాకా ఉన్నదట.మూడే బోగీలతో ముచ్చటగా ఉన్న ఆ బుల్లి రైలు ఎక్కాం ఇద్దరం.తొమ్మిదిన్నరకి ఎక్కితే పదకొండింటికి "ద్రాక్షారామ" చేరాం.ఈ బుల్లిరైలు ప్రయాణాన్ని ఎంత ఎంజోయ్ చేసామంటే చెప్పలేను.మా ఎదురుగా ఒక స్కూలు పాప కూర్చుంది.మైత్రి !చక్కగా నవ్వుతూ కబుర్లు చెప్పింది.సార్ధక నామధేయం.ఆ మంచి,మర్యదా..సంస్కారం పెంపకం వల్లే కదా అబ్బుతాయి అనుకున్నాం.

"ద్రాక్షారామ" చేరాం.ఇది "ద్రాక్షారామం" అనుకునేవాళ్లం.కానీ ఇక్కడ అన్ని చోట్లా "ద్రాక్షారామ" అనే రాసి ఉంది.పాతబడిన చిన్న స్టేషన్.చుట్టూరా పొలాలూ,ఖాళీ స్థలాలూ..అక్కడక్కడ ఇద్దరుముగ్గురు మనుషులు..."ఎటెళ్ళాలి?"అని అడిగితే ఓ దారి చూపించి.."అటు" అన్నాడొకడు.ఆ నిశ్శబ్ద ప్రకృతిని ఆస్వాదిస్తూ పొలం గట్లమ్మట ఉన్న సన్నని కాలిబాటలో ఓ మైలు దూరం వెళ్ళాకా ఊరు వచ్చింది.ఇంకో మైలు దూరం వెళ్ళాకా మెయిన్ రోడ్దు వచ్చింది.అక్కడ ఓ షేర్ ఆటొ ఎక్కి ద్రాక్షారామ చేరాం.గుడి మూసే వేళవుతోందని త్వరగా లోనికి వెళ్ళాం.ఈ గుడి విశాలంగా అందంగా ఉంటుంది.పంచారామాల్లో అమరావతిలో అమరేశ్వరుడినీ,సామర్లకోటలో కుమారరామ-భీమేశ్వరుడినీ,భీమవరంలో సొమేశ్వరుడునీ, ద్రాక్షారం లోని ఈ భీమేశ్వరుడినీ చూసే సౌభాగ్యం చిన్నప్పుడే లభించింది.ఇక పాలకొల్లులోని రామలింగేశ్వరుడిని దర్శించుకోవాలి. ఈ ద్రాక్షారామ భీమేశ్వరాయల చరిత్రని,ఆలయపు ఫొటోలనూ ఈ క్రింద చూడచ్చు.

(ఇది ఆలయంలోని కోనేరు)




అదయ్యాకా "కోటిపల్లి" అక్కడికి 15నిమిషాలే అని తెలుసుకుని అక్కడికి బయల్దేరాం.."జోర్సై పార్సై...కోటిపల్లి రేవుకై..."అని పాడుకుంటూ...!మధ్యాహ్న్నం వేళైనా చల్లని గాలితొ గోదారమ్మ స్వాగతం పలికింది.గుడి చూసి మళ్ళి సాయంత్రానికి యానాం వెళ్ళాల్సి ఉండటంతో ఇంక పడవలో ఆ రేవు దాటే ప్రయత్నం విరమించుకున్నాం.కోటిపల్లి రేవు దాటిటే ముక్తేశ్వరం వస్తూంది.అక్కడ ముక్తేశ్వరాలయం ఉంది.అసలీ ప్రదేశం పేరు "కోటిఫలి"ట.అది కాలక్రమంలో "కోటిపల్లి" అయిపోయిందట."కోటిఫలి సొమేశ్వరాలయం" ఇక్కడ చూడవచ్చు...తరువాత రేవు ఫొటోలు..



ఇక అసలు వచ్చిన పని..."పెళ్ళి"కి బయల్దేరాం.యానాం చేరే సరికీ సాయంత్రం అయ్యింది.పుణ్యక్షేత్రాలు దర్శించుకుని వచ్చాం కదా అని ఇంక పెళ్ళివారేమనలేదు పాపం.అక్కడ ఉన్న గోదారి ఒడ్డుకి పెళ్లయ్యాకా బాగా రాత్రి వెళ్ళాం. పెద్ద పెద్ద ఏనుగు బొమ్మలు మధ్యలో ఉన్న శివలింగానికి అభిషేకం చేస్తున్నట్లుగా విగ్రహాలను ప్రతిష్టించారు అక్కడ.ఎంతో చూడ ముచ్చటగా ఉన్న ఆ ఫవూంటెన్ని చూసి, ఆ జల్లులో తడవకుండా అక్కడ నుంచి రాలేము.కానీ బాగా చీకటి పడిపోయి ఫొటోలు తీసుకోలేకపోయాం.అదొక్కటే ప్రయాణంలో లోటుగా మిగిడిపోయింది.

(రేపు ఆఖరు మజిలీ...యలమంచలి;హరిపురం లో ఒక "అగ్రికల్చరల్ ఫార్మ్" కబుర్లు)

Thursday, August 20, 2009

తూర్పు గోదావరి ప్రయాణం__ రెండవరోజు(రాజమండ్రీ,గోదావరి ఒడ్డు)

రాజమహేంద్రవరం (రాజమండ్రీ) గురించిన పైని ఫోటోలోని పాట తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో!
ప్రసిధ్ధి గాంచిన చారిత్రాత్మక నగరం.మా అమ్మ పుట్టిల్లూ,నేను పుట్టిన ఊరూ అయిన రాజమండ్రీ అంటే నాకు ఎంతో ఇష్టం.తాతగారు లాయరు చేసారు.ఎంతోమంది వస్తూ పోతూ ఉండే మా తాతగారి ఇల్లంటే కూడా నాకు మహా ప్రీతి.పెద్ద గేటు,15,20 మెట్లు,గేటు నుంచీ పైన ముఖ ద్వారం దాకా పందిరిపైన పాకించిన రేక మాలతి తీగ.... ఆ పైన ఎత్తు మీద ఇల్లూ.చుట్టూతా మొక్కలూ,ఓ పక్కగా నేలలోకి ఉన్న గోడౌన్ ఒకటి మమ్మల్ని(పిల్లల్ల్ని)విశేషంగా ఆకర్షిస్తూ ఉండేది.తాళాలు అడిగి ఆ గోడౌన్లోకి వెళ్ళి ఆడుకుంటూ ఉన్డే వాళ్ళం.ఇక పైన డాబా మీదకు వెళ్తే చుట్టూరా కొబ్బరి చెట్లు,పైకి పాకిన సన్నజాజి తీగ..రాత్రిపూట ఆ పూల వాసనతో నిండిన డాబా మీద పడుకుని కొబ్బరాకుల సందుల్లోంచి వెన్నెలను చూస్తూ....లోకం మరిచేదాన్ని...!!వర్షం పడిన మర్నాడు క్రిందకు వచ్చి గేటు దగ్గర మెట్ల మీద కూర్చుంటే,మెట్ల నిండా రాలిన రేకమాలతీ పూల పరిమళం అద్భుతంగా తోచేది...ఎన్తసేపైనా ఆ మెట్ల మీదే కూర్చుని ఉండాలన్పించేది.ఎప్పుడైన్నా అందరం కలసినప్పుడు తాతగారి ఎనమన్డుగురి సంతానం తాలూకూ పిల్లల సందడితో,కేరింతలతో ఇల్లంతా మారుమ్రోగుతూ ఉండేది.ఇప్పుడు ఆ ఇల్లూ లేదు..కానీ మావయ్యలు కట్టుకున్న నూతన గృహాలు అక్కడే పక్కపక్కనే ఉంటాయి.ఏళ్ళు గడిచినా మనసు పొరల్లోని ఆ జ్ఞాపకాలు మాత్రం తాజాగా నిన్ననే జరిగినట్లు ఉంటాయి...!

మా రెండవ రోజు ప్రయాణంలో పొద్దున్నే బస్సులో రాజమండ్రీ చేరాం.బంధువులందరినీ పలుకరించేసాకా సాయంత్రానికి గోదారి ఒడ్డుకి చేరాం.ఆరు నెలల క్రితం మేము చేసిన కాశీ ప్రయాణం,గంగా స్నానం గుర్తున్న మా పాప "అమ్మ,ఇప్పుడు ఇక్కడ స్నానం చేస్తామా?" అని అడిగింది!!చిన్నప్పుడు చాలాసార్లు చేసేసాంలే అని చెప్పా!తెడ్డు పడవ అయితే నాకు భయం అని మోటర్ బోటు ఎక్కాం.ఓ ఇరవై నిమిషాలు గోదావరిలో తిప్పాడు బోటు.వీలయినన్ని ఫోటోలే తియ్యాలో,గోదావరి అందాన్ని చూసి పరవశించాలో తెలీలేదు.పాతికేళ్ళు రైలులో అదే దారిలో వెళ్ళిన రెండు బ్రిడ్జిలూ,వాటి క్రింద నుంచి బోటు వెళ్తూంటే భలే సంబరం కలిగింది...!బాగున్నావా...అని పలుకరిస్తున్నట్లు కదిలే ఆ గోదారి తరగల్ని చూస్తే నాకు ఓ కవి గారు రాసిన వాక్యాలు గుర్తు వచ్చాయి....

"గోదావరి గోదావరి గోదావరి పాట
గుండె నుంచి ఉప్పొంగే పున్నమి సెలయేట
పరుగెత్తే తరగ చూడు పావురాయి రెక్క
తల ఎత్తిన నురుగు నవ్వు ఆడును సయ్యాట..."

బోటు దిగాకా ఒడ్దున దగ్గర్లో ఉన్న మార్కండేయ స్వామి గుడికి వెళ్ళాం.అడుగు పెట్టగానే లోపల ఓ 50మంది వేద పండితులు వేదం చదువుతున్నారు...మావారింక కదలనంటూ అక్కడే కూర్చుండిపోయారు.అది అయ్యాకా దగ్గరలోని ఆంజనేయస్వామి గుడికి వెళ్ళాం.తరువాత "ఇస్కాన్"కు వెళ్ళాం కానీ ఆ రోజు "కృష్ణాష్టమి"కావటంతో విపరీతమైన జనం ఉన్నారు.బయట నుంచే చూసి,కాసిని ఫొటోలు తీసుకుని రాత్రికి తిరిగి కాకినాడ వచ్చేసాం.

(క్రింద ఉన్నవి రాజమండ్రిలో గోదావరి,ఇస్కాన్ దగ్గర తీసిన ఫోటోలు)




Wednesday, August 19, 2009

తూ.గో.ప్రయాణం _ మొదటిరోజు(కాకినాడ,బిక్కవోలు,ద్వారపూడి)

రాత్రి గౌతమీ ఎక్కాము.పాప,నేను ఇరుక్కుని పైన బెర్త్ మీద పడుకున్న మూలాన సరిగ్గా నిద్ర పట్టలేదు...మధ్యలో 3.30amకి మెలకువ వచ్చింది. క్రిందకు దిగి తలుపు దగ్గర నిలబడ్డాను.ఏదో స్టేషన్లో ఆగి ఉంది రైలు.పోర్టర్ వెళ్తూంటే అడిగాను ఏ ఊరని.."విజయవాడ" అన్నాడు.అప్పుడర్ధమైంది నాకు ఎందుకు మెలుకువ వచ్చిందో.నేను 28ఏళ్ళు ఉన్న ఊరది..నా ఊరు!!ఇక్కడ దిగిపోతే ..అనిపించింది ఒక్క క్షణం..రైలు కదిలే దాకా అక్కడే నిలబడ్డా..!ఇంక నిద్ర పట్టలేదు.
తెల్లారాకా గోదావరి బ్రిడ్జి మీంచి కొన్ని ఫొటోలు తీసాను..రైలు కాకినాడ వచ్చి ఆగింది.పాతికేళ్ళపాటు ప్రతి రెండు మూడూ నెలలకీ వెళ్ళిన ఊరది.స్టేషను రాగానే ప్రతిసారి రైలులోంచి అన్నయ్యనో,మావయ్యనో వెతికేవి మా కళ్ళు.నేను రాణీవాసం అనుభవించిన మా ఇల్లు కూడా ఉండేది ఒకప్పుడు.ఇప్పుడిక అక్కడ ఆ మనుషులూ లేరు,ఇల్లూ లేదు...బంధువులింట్లోదిగాం.రిక్షా మీద సరదాతో ఊళ్ళో అంతా రిక్షా ఎక్కి తిరిగాము.అదే రోజు బిక్కవోలు,ద్వారపూడి వెళ్ళాలనుకున్నము.బంధువులేర్పాటు చేసిన ఏ.సి.కారులో బయల్దేరాము.రైలులోని ఇరుకుసీటులో నిద్ర సరిగ్గా లేని పాప హాయిగా నిద్రోయింది కారులో.డ్రైవరు మంచి కుర్రాడు.నచ్చిన చోటల్లా ఫోటొలు తీసుకుంటానంటే కారు ఆపాడు పాపం.పచ్చని పొలాల మధ్య నుంచి కారు వెళ్తూంటే,బయటి వాతావరణానికి,స్వచ్చమైన గాలికీ మనసు పరవశించిపోయింది.

బిక్కవోలులో ఉన్నది "లక్ష్మీగణపతి స్వామివారి ఆలయం".విగ్రహం పెద్దగా ఏటవాలుగా వాలినట్లుంది.ఆకుపచ్చని కళ్ళు,నల్లని విగ్రహంతో వినాయకుడు చూడగానే ముచ్చటగా అనిపించాడు.అక్కడి విశేషం ఏమిటంటే,నిస్వార్ధమైన కోరిక ఏదైనా ఒకటి గణపతి చెవిన వేస్తే అది తప్పక తీరుతుందని నమ్మకమట! ఇక్కడ ఫోటోలు అనుమతించలేదు.బయట ఒక ఫొటో కొన్నాం కానీ ఇప్పుడిక స్కాన్ చేసే ఓపిక లేదు. ప్రశాంతత నిండిన మనసుతో అక్కడ నుంచి ద్వారపూడి బయల్దేరాం.

వీలున్న ప్రతివారు దర్శించవలసిన పుణ్య భూమి ఇది.కొన్ని ఆలయాల సముదాయమే ఈ ద్వారపూడి గుడి.
శ్రీ యస్.ఎల్.కనకరాజ్ అనే ఒకగురుస్వామిగారు ఈ దేవాలయాల సృష్టికర్త.అద్భుతమైన శిల్పాలూ,పెద్ద పెద్ద విగ్రహాలూ కన్నులవిందుగా కనపడుతూంటే భక్తితో పరవశించని మనసుండదేమో అనిపించింది. ముఖద్వారంలో పెద్ద నటరాజ విగ్రహంతో,హనుమ,వీరభద్ర విగ్రహాలతో,భూగర్భ జ్యోతిర్లింగాలతో శివాలయం;దుర్గాదేవి ఆలయం;ఆయ్యప్ప స్వామి గుడి;సాయినాధుని దివ్య మందిరం,ఆ వెనుకనే శ్రీరంగం లోని విగ్రహాన్ని పోలిన ఆనంతపద్మనాభస్వామి వారి అందమయిన విగ్రహం;పాప విమోచన ఆలయం;పంచముఖ ఆంజనేయాలయం;పెద్ద పెద్ద చూడ చక్కని శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి,మహానందీశ్వరుల విగ్రహాలూ ఇక్కడ వెలసిన,చూడవలసినా దేవుళ్ళు!!అన్నింటిలోకీ పంచముఖ ఆంజనేయాలయంలో చాలా పవిత్రమైన భావన, ప్రశాంతత నిండిన వైబ్రేషన్స్ అనుభూతి చెందాను నేను...!

మొదట్లో శివాలయానికి ఫొటోలు తీయటమవగానే బ్యాట్రీలు చార్జ్ అయిపొయి ఇక ఫోటోలు తీసే వీలు లేక పోయింది.
రెండవ బ్యాట్రీసెట్ మర్చిపోయాం హడావుడిలో.బయట అమ్ముతున్న ఫోటోల సెట్ కొన్నాం కానీ ఇందాకా రాసినట్లు ఇప్పుడు వాటిని స్కాన్ తీసే ఓపిక లేదు.కాబట్టి మొదటి రోజు ప్రయాణపు ఫొటోల్లో కొన్నింటిని ఇక్కడ పెడుతున్నాను.

(రేపు రాజమండ్రి...గోదావరి కబుర్లు..!!)






Tuesday, August 18, 2009

తూర్పు గోదావరి ప్రయాణం


ఆకుపచ్చని తివాచీ పరిచినట్లున్న పచ్చని పంటపొలాలు
ఆ పంటపొలాలపై ఎగిరే తెల్లని కొంగలూ,రకరకాల పక్షులు
పక్కగా ప్రవహించే పిల్ల కాలువలూ...వికసించిన తామరలూ
పొలంపనులు చేస్తున్న పడతులు ...ఎరువులు పిచ్చికారీ చేస్తున్న రైతులూ...
వానజల్లుకి తడిసిన మట్టిలోంచి వచ్చే కమ్మటి సువాసన...
పరవళ్ళు తొక్కుతున్న తల్లి గోదారి...
చేపలు పట్టే జాలరులు...తెడ్డువేసే కుర్రపిల్లలూ...
బ్రిడ్జిమీది రైలూ....బ్రిడ్జి క్రింద పొడుగాటి నావలు...
ఇవీ మాకు స్వాగతం చెప్పిన తూర్పు గొదావరి జిల్లా అందాలు!!
...ఇలాంటి ప్రకృతి అందాలన్నింటినీ చూడగానే పులకించని మనసు ఉంటుందా..?

ఒక పెళ్ళి సందర్భంగా తూర్పు గోదావరి జిల్లాకు వెళ్ళిన మేము,అక్కడ కొన్ని ప్రదేశాలు చుట్టిరావాలని నిర్ణయించుకున్నాము. నాలుగు రోజుల్లో అన్నీ చూసేయాలి అన్న కోరిక కాస్త దురాశతో కూడినదే అయినా..ఎంతవరకైతే అంత అని బయల్దేరాము.దేశాంతరాలూ,దేశమూ తిరగటం కన్నా ముందర మన ఆంధ్ర రాష్ట్రాన్ని పూర్తిగా సందర్శించాలన్నది మా ప్రయాణాల జాబితాలో ప్రధానాంశం.అంతేకాక,మన దేశంలో ఉన్న అసంఖ్యాకమైన,ప్రసస్తమైన,ప్రసిధ్ధి గాంచిన ఆలయాలలో వీలైనన్ని గుళ్ళూ,గోపురాలూ చూడాలన్నది మా ఇద్దరి కోరికానూ!తు.గో.జీ లో పెళ్ళికి వెళ్ళడానికి నిర్ణయించుకోగానే, ఆ చుట్టు పక్కల చూడతగ్గ ఆలయాలను లిస్ట్ రాసుకుని,వాటిల్లో ఎన్ని కుదురుతాయో అంచనా వేసాము.

పెళ్లికీ,ఆలయాలకే కాక అటువైపు ఉన్న ఇరువైపుల బంధువర్గాలను కూడా నిరాశపర్చకూడదన్నది ముఖ్యమైన విషయం.అందరినీ సంతృప్తి పరచడమనే కత్తి మీద సాము చేస్తూ,కర్రవిరిగినా పాము చావకుండా అన్నట్లు..ఓపిక వీడినా ప్రయాణం కొనసాగిస్తూ;అనుకున్న ప్రదేశాలన్నీ వీక్షించి,అనుకున్న నాలుగు రోజుల ప్రయాణాన్నీ పూర్తిగా సద్వినియోగపరుచుకున్నాం. తు.గొ.జిలో మేము వెళ్ళిన,చూసిన ప్రదేశాల పేర్లు ఏమిటంటే--కాకినాడ,రాజమండ్రి,బిక్కవోలు,ద్వారపూడి,ద్రాక్షారామ,కోటిపల్లి,కొద్దిగా ముందరికి వెళ్ళి జిల్లా అంచు దాటగానే ఉన్న యానాంలో పెళ్ళి చూసుకుని...వెనుకకి కాకినాడ మళ్ళీ వచ్చి;ఇంకొంచెం ముందరికి, అంటే విశాఖ జిల్లా పొలిమేరలో ఉన్న యలమంచలి కూడా వెళ్ళి,అక్కడనుంచి దగ్గరలోని హరిపురానికి కూడా వెళ్ళి మళ్ళీ కాకినాడ వచ్చి రాత్రికి గౌతమీ ఎక్కి నిన్ననే ఇల్లు చేరాము..!

అమ్మానాన్నలవి ఉభయ గొదావరిజిల్లాలూ....నే పెరిగింది కృష్ణాజిల్లాలో.మూడు జిల్లాలూ ప్రియమయినవే అనిపిస్తాయి వెళ్ళినప్పుడల్లా!నేను అటువైపు చిన్నప్పటినుంచీ చాలాసార్లు వెళ్ళినా,ప్రస్తుతం చాలా ఏళ్ల తరువాత,అందులో పెళ్లయ్యాకా మావారితో,పాపతో ఇదే అటువైపు వెళ్లటం.అందువల్ల బంధువులను పలుకరించటం తప్పనిసరి అని నిర్ణయించుకున్నాము. పేరుకి వేరు వేరు ఊళ్ళు అయినా,దూరాన్ని బట్టి చూస్తే చాలా దగ్గరగా ఉండే చిన్న చిన్న ఊళ్ళూ,ఆ ప్రశాంత వాతావరణం,దారిలో కనువిందు చేసిన పంటపొలాలూ,సెలయేళ్ళూ....సిటీలో విసుగెత్తిన పరుగుపందెపు జివితానికి ఒక మంచి బ్రేక్.....!

షార్ట్ కట్ తోవలో వెళ్లాలని కారు అబ్బాయి పొలాల మధ్యనున్న మట్టి రోడ్డులో తీసుకువెళ్లాడు.పచ్చని పొలాల మధ్యన మెల్లగా కారు వెళ్తూంటే తెలియని హాయి....గుండెల నిండా ఆ చల్లని స్వచ్చమైన కలుషితం లేని గాలిని పిల్చుకున్నప్పుడు కలిగిన ఆనందం వర్ణించలేను!ఆరురూపాయలకి అద్భుతమైన సాంబారు ఇడ్లీ,పన్నెండు రూపాయలకి కమ్మటి ఉల్లి రవ్వ దోసా తిన్నాకా ఇంక సిటీకి వెనక్కి వెళ్ళాలా అనే బాధ మొదలైన క్షణాలు కూడా ఉన్నాయి..! ఇక ప్రయాణపు ఇక్కట్ల విషయానికి వస్తే __ అక్కడి చెమటనూ,జిడ్డుతో నిండిపోయే మా మొహాలనూ;సమయాభావంవల్ల చాలా మటుకూ టాక్సీలలోనే ప్రయాణించగా,అవసరార్ధం ప్రయాణించిన కొన్ని సమయానికి రాని బస్సులనూ,వాటిలోని రద్దీనీ మాత్రం భరించటం కష్టమే అయ్యింది.చిన్నప్పుడు ఎలా భరించామో మరి!(బహుశా అలవాటు తప్పటం వల్ల కావచ్చు..!!)

ఇవీ.. క్లుప్తంగా మా తూర్పు గోదావరి ప్రయాణం విశేషాలు.ఇంకా యానాం దగ్గర "మడ అడవులు","రాజమండ్రీ నుంచి భద్రాచలం బోటు ప్రయాణం","కోనసీమ",సముద్రమంచున వచ్చే ఊళ్లాన్నీ చూడాలనే కోరికలు మిగిలి ఉన్నాయి....మరోసారెప్పుడో ఆ ట్రిప్ ప్లాన్ చేయాలి!! మేము దర్శించిన కొన్ని ఆలయాల వివరాలూ,కొన్ని ఫొటోలూ రెండు,మూడు టపాల్లోకి విభజించాను...!బిక్కవోలు,ద్వారపూడి ఆలయ వివరాలు నా తదుపరి టపాలల్లో.....

(క్రింద ఉన్నవి రైలు లోంచి తీసిన కొన్ని ఫొటొలూ,రాజమండ్రీలో బొటులోంచి తీసిన గోదారి ఒడ్డు..)












Thursday, August 6, 2009

ఫస్ట్ ఫ్రెండ్

ఒక మనిషి గురించి మనకు బాగా తెలిసేది వాళ్ళతో మనం కొన్నాళ్ళైనా సహజీవనం చేసినప్పుడే అన్నది నా అభిప్రాయం.ఇంటి బయటి స్నేహాలు పటిష్టమైనవే అయినా,ఆ స్నేహితుల గురించి మనకు బాగా తెలుసనుకున్నా;కొన్నాళ్ళు,కనీసం ఒక వారమైనా ఆ స్నేహితులతో కలిసి ఉంటే అప్పుడు తెలుస్తుంది వాళ్ళెంత అపరిచితులో మనకు ! అలా కలిసి ఒక చోట ఉండటం వల్ల ఒక వ్యక్తిని గురించి పూర్తి అవగాహన మనకు ఏర్పడుతుంది. ఎందుకంటే కొందరి భావాలూ,ఆలోచనలూ,అభిప్రాయాలూ గొప్పగా ఉన్నా వారి జీవన విధానం,అలవాట్లూ,పాటించే శుభ్రతా ఇవన్ని చిరాకుని తెప్పించేలా ఉంటాయి.వాటిని చూసాకా కొందరితో అసలు స్నేహాన్ని కొనసాగించటం కష్టంగా ఉంటుంది.ఇది కేవలం నా స్వీయానుభవం+అభిప్రాయం మాత్రమే.

ఇంతకీ అసలు విషయంలోకి వస్తే;అలా నేనేమిటో తెలిసిన, నాతో 18ఏళ్ళు కలిసి పెరిగిన నా "ఫస్ట్ ఫ్రెండ్" నా తమ్ముడి గురించి కొన్ని కబుర్లు...!అన్నయ్య మా నానమ్మ దగ్గర పెరిగాడు.కలిసి పెరగలేక పోయిన అన్నయ్యతో ఒకరకమైన బంధమైతే,కలిసి పెరిగిన తమ్ముడితో మరో రకమైన అనుబంధం నాది. అన్నయ్య ఒక ఏడు పెద్ద,తమ్ముడు 2ఏళ్లు చిన్న.అందరూ పేరు పెట్టి పిలిస్తే వాడూ నన్ను పేరు పెట్టి పిలిచేవాడు.'అక్కా ' అని ఎప్పుడు పిలవలేదు వాడు నన్ను..!చిన్నప్పటి ఆటలూ,పరుగులూ,గాలిపటాలూ,గోడలు దూకిన రోజులూ,బాణాలతో ఆడుకున్నరోజులూ,పంచుకున్న ఆలోచనలతో పాటూ భీకరమైన దెబ్బలాటలు,చేయి చేసుకున్న సందర్భాలూ కూడా మా జ్ఞాపకాలలో భాగాలే!!ఇప్పుడు నవ్వు తెప్పించినా, అప్పుడు మాత్రం శత్రువుల్లా పోట్లాడుకునేవాళ్లం.పెరుగులోని మీగడ దగ్గరా,ఇష్టమైన కూరల దగ్గరా,ప్రిజ్ లోని ఐస్ క్రీం దగ్గరా జరిగినవి చిన్న చిన్న కోట్లాటలే కానీ; టి.వీలో చానల్స్ దగ్గరా,టేప్ రికార్డర్ లో పాటల సౌండ్ల దగ్గరా,ముఖ్యంగా రాత్రి పూట లైట్ దగ్గరా జరిగేవి యుధ్ధాలు ! ఏదోఒక పుస్తకం పట్టుకుని చదువుతూ నిద్రోవటం నా అలవాటు.లైటు ఆపేసి చీకట్లో పడుకోవటం వాడి అలవాటు.వేరే గదిలోకి వెళ్లమని వాడు,మంచం మీదే పడుకునే చదవాలని నేను...రోజూ ఇదే దబ్బలాట.ఇలాంటి చిలిపి తగాదాలెన్నో...!

చాక్ పీసుల మీద బొమ్మలు చెక్కటం,మంచి మంచి బొమ్మలు వేయటం వాడికి వెన్నతో పెట్టిన విద్య.నేనూ ,అన్నయ్యా సీజనల్ ఆర్టిస్ట్ టైప్ అయితే,వాడు ఎవెర్ గ్రీన్ ఆర్టిస్ట్.క్రికెట్ గురించి నాకు నేర్పింది వాడే.మా ఇద్దరికీ ఉన్న కామన్ ఇన్టరెస్ట్ సినిమాలూ,ఆనిమేషన్స్.చాలా విషయాల మీద మా అభిప్రాయాలు కూడా ఒకేలా ఉంటాయి.కలిసి పెరగటం వల్ల మా ఇద్దరి మధ్యా స్నేహబంధం గట్టిగానే మిగిలిపోయింది.ఇంటర్ తరువాత చదువు నిమిత్తం వాడు దూరం వెళ్పోయినా ఉత్తరాలూ,ఆ తరువాత ఈ-మైల్స్ ద్వారా మేము దగ్గరగానే ఉండేవాళ్లం.నా పెళ్ళి కుదిరినప్పుడు వాడు అమెరికాలో ఉన్నాడు. "so,i'll miss my first girl friend.."అని రాసాడు.(నేను ఉమెన్స్ కాలేజీలోనూ,వాడు జెన్ట్స్ కాలేజీ లొనూ చదవటంవల్ల నా boy friend వాడూ,వాడి girl friend నేనూ!)చిన్నప్పుడు దెబ్బలాడుకుంటూంటే అమ్మ అస్తమానం అనేది "ఇప్పుడు తెలియదు మీకు,రేపొద్దున్న దూరాలు వెళ్పోయాకా కావాలనుకున్నా కలవలేరు..దెబ్బలాడుకోకండి...."అని!! ఆ సంగతి మాకూ మేము దూరాలు వెళ్పోయాకే అర్ధమైంది...అప్పుడిక చిన్ననాటి రోజులు రమ్మంటే వస్తాయా..?

jO jeetA wohi sikanda అనే హిందీ సినిమాలో చిన్ననాటి అన్నదమ్ముల మధ్య పాట ఒకటి ఉంటుంది."रूटः के हम्सॆ कभी जब चलॆ जावॊगॆ तुम....ऎ न सोचा था कभी इत्नॆ याद आवॊगॆ तुम..."అని.ఆ పాట విన్నప్పుడల్లా నాకు మా చిన్నతనమే జ్ఞాపకం వస్తుంది.ఆ పాట link ఇక్కడ పెడ్తున్నాను.
http://www.youtube.com/watch?v=Lrm01yKFjmE



(మరీ సొంత డబ్బాలా ఉంటుందని నిన్న రాయలేదు..కానీ, అన్నయ్య గురించి రాసి నా గురించి రాయలేదని కొద్దిగా అలిగిన మా తమ్ముడి అలక తీర్చే ప్రయత్నమే ఈ టపా..!)

Tuesday, August 4, 2009

అన్నయ్య


రక్షా బంధనాన్ని పురస్కరించుకుని మా అన్నయ్యను గురించి నాలుగు వాక్యాలు చెప్పాలనిపించింది...

వేణువంటే అతనికి ప్రాణం
సంగీతం అతని ఊపిరి
నేర్వకపొయినా కృతి విని రాగాన్ని పట్టగల దిట్ట !
వంక పెట్టలేనంతగా వంటొచ్చిన నలుడు....
ఏలాటి చిత్రాన్నయినా అవలలీలగా వేయగల చిత్రకారుడు....
విద్య వల్ల ఇంజనీరైనా

వృత్తిపరంగా కొత్తబాటల వెంట పయనాన్ని నిర్దేశించుకున్న సాహసి..
ఏ కంప్యూటరు కోర్సులూ చేయకుండా
తానే స్వయంగా అన్ని రకాలూ పట్టుదలగా నేర్చిన విక్రమార్కుడు.
మౌస్ పట్టుకోవటం కూడా సరిగ్గా రాని నాకు....మెళుకువలు నేర్పి,
ఒక PPT వెనకాల నేపధ్యసంగీతం అందించగలిగేలా తయారు చేసిన గురువు.
నీతి,నిజాయితీలకి మారుపేరు.... కష్టాన్ని నమ్మిన శ్రామికుడు...!
భక్తిశ్రధ్ధలతనికనేకం...'ఓర్పు ' తన ఆయుధం !
అర్ధమయ్యీ అర్ధంకాని లోతైన అంతరంగమతనిది
ప్రేమానురాగాలు పంచే ఆ హృదయం చైతన్యవంతమైనది...
మా అందరి ప్రేమనూ మదినిండుగా నింపుకున్న మా "అన్నయ్య" అతడు!!


ఈ రాఖీ పండుగ సందర్భంగా ప్రతి అన్నకు,ప్రతి తమ్ముడికీ మంచి భవిష్యత్తునూ,ఆయురారోగ్యాలనూ ఇవ్వమని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను!!

రైలు ప్రయాణం

మన జీవన పయనంతో పొల్చదగ్గ మరో ప్రయనం "రైలుప్రయాణం". మజిలీలూ,కలయికలూ,వీడ్కోలూ,చిన్న చిన్న సరదాలతో నిండినది రైలు ప్రయాణం.రైలు ఎక్కి దిగేంతవరకూ ప్రతి ప్రయాణంలొనూ ఎన్నో అనుభూతులూ,అనుభవాలూ.ఎక్కేవారు, దిగేవారూ,మనతో చివరి దాకా ప్రయాణం చేసే వారు,మధ్యలొ వచ్చిపోయే అమ్ముకునేవారు,బిచ్చగాళ్లు....ఒకరేమిటి..అన్నిరకాల మనుషులు మనకు రైళ్ళలో కనిపిస్తు ఉంటారు.
రకరకల మనస్తత్వాలని చదవటం ఇష్టమైన వాళ్ళకి రైలు ప్రయాణం బాగా నచ్చుతుంది.కొన్ని గంటల పాటు మాత్రమే కలిసి ఉన్నా కొందరు మనుషుల వ్యక్తిత్వం,అలోచనలూ చాలా వరకూ అర్ధమైపోతూ ఉంటాయి.

రైళ్లలొ ప్రయాణించేప్పుడు ఏర్పడిన కొన్ని స్నేహాలు జీవితాంతం నిలిచిపోతాయి.కొన్ని పెళ్ళిసంబంధాలు కూడా రైళ్లలో పరిచయాల వల్ల కుదురుతూంటాయి.కొందరు బంధువుల,స్నేహితుల తాలుకు మనుషులు కుడా పరిచయమౌతూ ఉంటారు."ఓహో,మీరు ఫలానా వాళ్ల తాలూకానా..." అని పలకరించుకునే సందర్భాలు వస్తూ ఉంటాయి.రొజూ అప్ అండ్ డౌన్ చేసే ఉద్యొగస్తులు,కాలేజిలకి పక్క ఊళ్లోకి వెళ్లే కుర్రపిల్లలూ,రైల్లోనే ఆటలు మొదలెట్టే పేకాటరాయుళ్లూ...express రైళ్లలో కన్నా పాసింజెరు రైళ్లలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అలా రకరకాల వ్యక్తులను ఒకే రొజులో కలవటం నాకు భలే సంబరంగా ఉంటుంది రైలు ఎక్కినప్పుడల్లా.

ఇక కిటికీ సీటు గురించి చెప్పాలంటే ...బోలేడు కధ అవుతుంది.చిన్నప్పుడు,ఎప్పుడు పక్కన కుర్చున్నవాళ్ళు దిగిపోతారా? అని ఎదురుచూడటం,ఆ సీటు కోసం అన్నదమ్ములతో/అక్కచెల్లెళ్ళతొ దెబ్బలాటం చెయ్యనివారు ఉండరని నా నమ్మకం.రైలు కిటికీలోంచి ప్రకృతి దృశ్యాలు తిలకించటం,మనతొ పాటు వస్తున్న సూర్యుణ్ణో,చంద్రుణ్ణో గమనిస్తు ఉండటం,మనల్ని దాటి వెళ్పోతున్న ఊళ్లని,చెట్లని,మనుషులని చూస్తు గడపటం....ఇవన్ని ఎనలేని ఆనందాన్ని అందిస్తాయి.చేసేది దూరప్రయాణం అయితే పగులు గడిచి రాత్రి అవ్వగానే (కిటికీ లోంచి ఇంకేమీ కనిపించవు కాబట్టి)ఓ పుస్తకాన్ని పట్టుకుని కూర్చుంటే ప్రపంచాన్నే మర్చిపోవచ్చు.అలా రైల్లో పుస్తకం చదవటం నాకు చాలా ఇష్టమైన సంగతి.

చిన్నప్పుడు 2,3 ఏళ్ళకొకసారి మేము కొన్ని దూర ప్రయాణాలు చేసే వాళ్ళం.అలా కొత్త ప్రదేశాలవైపు వెళ్ళినప్పుడు, వచ్చిన ప్రతి ఊరి పేరూ,దారిలో చూసిన వింతలూ మొదలైనవి ఓ చిన్న పుస్తకం పెట్టుకుని రాసుకుంటూ ఉండేదాన్ని.మేము కలకత్తా వైపు వెళ్ళినప్ఫుడు రాసుకున్న ఓ చిన్న పుస్తకం నాకు మొన్న ఏవో సర్దుతూంటే దొరికింది.12ఏళ్ల క్రిందటి ఆ విశేషాలు మళ్ళి ఇన్నాళ్ళకి చదువుతూంటే భలే సంతొషం కలిగింది...నిజంగా ఇవన్నీ చూసామా అనిపించింది ఆ పేర్లు,కబుర్లు చదువుతూంటే!
కాబట్టి ఒకవేళ ఎవరికైనా అలాంటి అలవాటు లేకపోతే;దూర ప్రయాణాలకి వెళ్ళేప్పుడు చిన్న నోట్ ప్యాడ్ లో అలా నోట్ చేసుకోండి.మళ్ళీ కొన్నేళ్ల తరువాత అది చదివితే ఆ ఆనందం మీకే అర్ధం అవుతుంది..!!


రైలు ప్రయాణం ప్రధానాంశంగా తీసిన సినిమాలు,నవలలు,కధలు చాలానే ఉన్నాయి.యద్దనపుడిగారి "గిరిజా కల్యాణం"నవలలో కధ ఒక రైలు ప్రయాణంలో జరిగిన పరిచయంతొనే మొదలౌతుంది.Circar Express,Burning train,Mumbai Express,తూర్పు వెళ్ళే రైలు మొదలైన సినిమాలకి రైలు ప్రయాణమే ఇతివృత్తం.కొత్తతరం సినిమాల్లో ప్రేమలేఖ, మిస్టర్ & మిస్సెస్.అయ్యర్,సఖి,జయం,వెంకీ,వర్షం,స్వరాభిషేకం,DilwaalE Dulhaniyaa lEjaayEngE మొదలైన సినిమాల్లోని కధలని "రైలు ప్రయాణాలే" కీలకమైన మలుపు తిప్పుతాయి. (ప్రస్తుతానికి ఈ పేర్లే గుర్తు వస్తున్నాయి.ఎవరికైనా ఇంకా తెలిస్తే చెప్పగలరు.)

(రైల్లో వెళ్ళేప్పుడు తీసిన కొన్ని ఫొటోలను క్రింద చూడండి...)

Monday, August 3, 2009

గజల్స్---హరిహరన్ !!

(సాహిత్యం పట్ల,ఉర్దూ భాష పట్ల ఉన్న మక్కువ వల్లనేమో గజల్స్ అంటే నాకు ప్రాణం.నా పరిధికి తెలుసున్న కొన్ని గజల్స్,వాటి విశేషాలని ఈ టపాలో పొందుపరచాలని చేసిన ప్రయత్నంలో ఏవైనా తప్పులు,పొరపాట్లు ఉంటే అర్ధంచేసుకోగలరు.)

సాహిత్యపరంగా "గజల్" అంటే ""ప్రేమికతొ మాట్లాడటం" అని అర్ధం.ఉర్దూ పద్యరూపాల్లో ప్రముఖమైన ఈ "గజల్" ఉర్దూ సాహిత్యానికి ఆత్మ అనే చెప్పాలి. ప్రేమ యొక్క అందాన్ని,ఎడబాటులోని వేదనను,ఆ వేదనలొ దాగి ఉన్న తియ్యని బాధను వ్యక్తీకరించే పద్యరుపాన్ని ఉర్దులో "గజల్" అంటారు. ప్రేమ, ఎడబాటు గజల్స్ లోని ప్రధాన ఇతివృత్తాలు. వీటి సంగీతానికి హిందుస్తాని రాగాలు ఆధారం. హిందుస్తానీ లలితశాస్త్రీయ సంగితంలోని ఒక శైలిగా ఈ గజల్ ను పరిగణిస్తారు. సాధారణంగా 5 verses నుంచీ మొదలైయ్యే ఈ పద్యరూపం 25 verses దాకా రాస్తూ ఉంటారు. ఈ పద్యరూపం ఆఖరి verseలో ఎక్కువగా కవి యొక్క కలం పేరు ఉంటూంటుంది.
సాహిత్యాన్ని, సంగీతాన్నీ కలగలిపి ఒక గజల్ గాయకుడు/గాయని తన పాట ద్వారా శ్రొతలకు ఉన్నతస్థాయిలో, ఒక వైవిధ్యమైన సంగీత మాధ్యమాన్ని అందిస్తారు.పద్య సందేశంతో పాటూ, తమ హావభావాలతో గజల్ గాయకులు తమదైన ప్రత్యేక ముద్రను ఏర్పరుచుకుంటారు. చాలా మంది గజల్ గాయకులు పాటతో బాటుగా హార్మోనియమ్ ను కూడా వాయిస్తారు.ఇదీ క్లుప్తంగా గజల్ కధ.

గజల్ యొక్క పుట్టుపూర్వోత్తరాల్లోకి వెళ్తే ఆరవ శతాబ్దంలో ఇది జన్మించింది.ఇన్డో_పెర్సో_అరబిక్ నాగరికతకు సంబంధించిన పద్యరూపల్లో గజల్ ఒకటి.13వ శతాబ్దాన్తం లో అమీర్ ఖుస్రో(1253-1325) అనే సంగీతకరుడు దీనిని పరిచయం చేసాడు.బ్రజ్ భాషలో ఇతడు రాసిన రచనలు చాలా ప్రశంసలనందుకున్నాయి. సితార్,ఢోలక్ లాంటి వాయిద్యాలని, "కవ్వాలీ" ను కూడా ఇతడే పరిచయం చేసాడని కొందరంటారు.

ప్రైవేటు ఆల్బమ్స్ కాకుండా మన హిందీ సినిమాల్లో కూడా కొన్ని అద్భుతమైన గజల్స్ ఉన్నాయి. వాటిలో నాకిష్టమైన కొన్ని సినిమా గజల్స్:
1)"Arth" సినిమాలో అన్నీ గజల్సే. జగ్జీత్ సింగ్ స్వరపరిచి, పాడిన ఈ గజల్స్ ఎంతో వీనుల విందుగా ఉంటాయి. చిత్రా సింగ్ పాడిన "తూ నహీ తో జిందగీ మే ఔర్ క్యా రెహ్ జాయెగా..."తో సహా మొత్తం అన్ని గజల్స్ నచ్చే ఆల్బం ఇది.

2)Rahte The Kabhi - Mamta
Singer: Lata Mangeshkar / Music; Roshan / Lyric: Majrooh

3)Rang Aur Noor Ki Barat - Gazal
Singer; Mohd Rafi / Music; Madan Mohan / Lyric: Sahir

4)Dil Dhoondhata Hai - Mausam
Singer; Bhupinder / Music: Madan Mohan / Lyric: Gulzar

5)Zindagi Jab Bhi - Umrao Jan Ada
Singer: Talat Aziz / Music; Khaiyyaam / Lyric; Shahryar

6)Aaj Socha To Aansoo Bhar Aaye - Haste Zakham
Singer: Lata Mangeshkar / Music; Madan Mohan / Lyric: Kaifi Azmi

7)Chupke Chupke Raat Din - Nikaah
Singer: Ghulam Ali / Music: Ghulam Ali / Lyric: Hasrat Mohani

8)Hai Isi Mein Pyar Ki Aabroo - Anpadh
Singer: Lata Mangeshkar / Music: Madan Mohan / Lyric: Raja Mehdi Ali Khan

9)Hotonse chulo tum mera geet amar kardo..
Singer:jagjit singh

10)seene mein jalan - Gaman - suresh wadkar

11)Tum ko dekhaa to ye khayaal aayaa - saath saath --jagjit&chitra singh

12)Hosh Walon Ko Khabar Kya - Sarfarosh - Jagjit Singh

13)yu hasraton ke daag mohobbat mein dho liye - adaalat -- lata

14)kisi nazar ko tera intezaar aaj bhi hai -- Aitbaar -Bhupinder&Asha Bhonsle


TVలో jagjit singh, talat aziz, peenaaz masaani, runa laila...ఇలా కొందరి లైవ్ కాన్సర్ట్స్ వచ్చినప్పుడు టేప్ రికార్డర్, వైర్లు పెట్టుకుని, అర్ధరాత్రి దాకా కూర్చుని నచ్చిన గజల్స్ అన్నీ రికార్డ్ చేసుకున్న కాలేజీ రోజులు...మరువలేనివి..!! రూనా లైలా పాడిన "रंजिशी सही दिल ही दुखानॆ के लियॆ आ....आ फिर मुझे तू छॊड्कॆ जानॆ के लियॆ आ...."చాల ఇష్టమైనది నాకు. ఈ గజల్ కు मेहदी हसन గారి వెర్షన్ కూడా ఉంది.ఇంకా...jagjit&chitra పాడినవి,గుల్జార్ గారు,జావేద్ అఖ్తర్ గారు రాసినవి కొన్ని,తలత్ అజీజ్ గారు పాడినవి కొన్ని..ఇలా కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ బాగుంటాయి.
hariharan:
గజల్ అనగానే మెహదీ హసన్, గులామ్ అలీ, జగ్జీత్ సింగ్, పీనాజ్ మసానీ, చందన్ దాస్,రూనా లైలా,హరిహరన్...అందరూ గుర్తు వస్తారు.గజల్ అనగానే నాకు మాత్రం ఒక్క హరిహరన్ గుర్తుకొస్తారు.ఆ గాత్రంలోని మధురిమ, ఉత్సాహం అపూర్వం. అది అమృత గానం. నేను కరిగి, లీనమైపోయే కొన్ని గాత్రాలలో ఇది ఒకటి. నేను ఆయన వీరాభిమానిని. నా దగ్గర ఆయనవి చాలా ఆల్బమ్ లు ఉన్నా, నాకు వాటిల్లో ఇష్టమైనవి రెండే రెండు.ఆయన స్వయంగా స్వరపరిచిన Horizon(1988), Kaash(2000). రెండిటిలో అన్ని గజల్సూ బాగుంటాయి.
Horizon లొ అన్నీ ఆయనే స్వరపరిచి,గానం చేసారు. ""आज भी है मॆरॆ कदमॊ के निशा आवारा...." నా ఆల్ టైమ్ ఫేవరేట్. ఆ ఘజల్ మొత్తం బాగా నేర్చుకుని, పాడాలని చిన్నప్పటి నుంచీ కోరిక...ఎప్పటికి తీరుతుందో..!ఆల్బంలో మిగిలిన గజల్స్:
** "हम् नॆ काटि है तेरे याद मे राते अक्सर...."
** "तुझे कसम है साक़िया...शराब ला.....शराब दे..."
** "बन नहि पाया जो मॆरा हम्सफ़र...केह ना उसॆ..."
** "क्या खबर थी..."

** "फूल के आस पास रहते है.."
** "सागर है मॆरा खाली..लादॆ शराब साकी...है रात ढल्नॆ वाली..लादॆ शराब साकी.."
ఈ పాటల్లోని ఇంటర్లూడ్స్ లో సంతూర్ ఎంత బాగా వాయిస్తారో..అన్నట్టు,నాకు సంతూర్ వాయిద్యమంటే చాలా ఇష్టం.. !!

ఇక Kaashలో ఆయన సంగీతం సమకూర్చి పాడిన గజల్స్ మనసును తాకుతాయి..ఈ ఆల్బమ్ కి 2000 లో స్క్రీన్ వీడియోకాన్ "బెస్ట్ నాన్_ఫిల్మ్ ఆల్బమ్" అవార్డు వచ్చింది.
** "काश ऐसा कोइ हुम्दुम हॊता...".
** "ये आयिनॆ सॆ अकॆलॆ मे जुस्त्जू क्या है...."
** "आन्धिया आती थी..."
** "अब कॆ बरस.."
** "झूम लॆ..." మొదలైనవి బాగుంటాయి.
తన స్నేహితుడైన Leslie Lewis తో కలిసి హరిహరన్ రిలిజ్ చెసిన Colonial Cousins అనే ఫ్యూజన్ ఆల్బం ఎన్త పొపులర్ అయ్యిందో అందరికీ తెలిసున్నదే.5,6 ప్రాంతీయభాషల్లో సినిమా పాటలు పాడిన హరిహరన్ తెలుగులో కూడా కొన్ని మంచి పాటలు పాడారు. (నేను ఇక్కడ కేవలం గజల్స్ గురిన్చి రాస్తున్నాను కాబట్టి ఆయన పాడిన తెలుగు సినిమా పాటల గురించి రాయటం లేదు). ఆయన గురించిన మరిన్ని వివరాలు,ఆయన పాడిన ఆల్బమ్స్, వాటి వివరాలూ ఆసక్తి ఉన్నవారు ఈ క్రింది వెబ్సైటులో చదవవచ్చు.
http://www.nilacharal.com/enter/celeb/hariharan.asp


Sunday, August 2, 2009

HAPPY FRIENDSHIP DAY..!!

నులివెచ్చని భానుని కిరణాలు...
పచ్చని ప్రకృతి..
తొలకరి వానజల్లు..
చల్లని వెన్నెల...
వికసించిన గులాబీ...
మంచులొ తడిసిన మల్లెపూవు...
బోసినవ్వుల పాపాయి....
అలుపెరుగని అలల అందాలు...
సముద్రతీరంలొని ఇసుకతిన్నెలు...
ఏరుకున్న గవ్వలు...
ఇవన్ని సృష్టిలోని చిన్న చిన్న ఆనందాలు...
వీటన్నింటినీ మించిన తియ్యనైన అనందం స్నేహం...

అలాటి తీయని స్నేహబంధాన్ని పంచుకునే ప్రతి ఒక్కరికీ ఈ రొజున నా అభినందన...


బ్లాగ్మిత్రులందరికీ HAPPY FRIENDSHIP DAY..!!

http://www.yahoo.americangreetings.com/ecards/display.pd?prodnum=3154006&path=40983



Saturday, August 1, 2009

ఆంటీ..!

నాకు నచ్చని కొన్ని పదాల్లో "అంటీ" ఒకటి.
నా చిన్నప్పటి వరకూ ఇరుగుపొరుగువాళ్ళని అత్తయ్యగారు,అక్క,వదిన,పిన్ని అని వరుసలు కలిపి పిలిచేవారు.రాను రానూ ఆ పిలుపులు పూర్తిగా తప్పిపొయాయి.ఆడవారందరికీ అన్వయించే ఒకే పదం అమలులొకి వచ్చేసింది..."ఆంటీ".ఇరుగుపొరుగు వాళ్ళే కాకుండా కూరలవాళ్లు,పాలవాళ్ళు అందరూ అదే పదం వాడటం మొదలెట్టారు..

బాగా చిన్నపిల్లలని పేరు పెట్టి పిలుస్తారు.స్కూల్,కాలేజీలకి వెళ్ళే పిల్లలని,పెళ్ళికానంత వరకూ "అక్క" అంటారు.ఇంక పెళ్ళి అయ్యిందో "ఆంటీ" నామకరణం జరిగిపొతుంది.అసలు పేరు తెలిస్తే, పేరు పెట్టో,ఏమండి అనో, పిలవచ్చు కదా? ఎందుకు ఆంటీ అని పిలవాలీ?అసలు నాకు తెలిసీ చాలామంది ఆడవాళ్ళ కి వయసు దగ్గర ఒకింత అభ్యంతరం ఉంటుంది.వెంటనే వయసు చెప్పటానికి ఇష్టపడరు.కొందరు ఎదుటి మనిషి వయసు సుమారుగా తమకన్నా చిన్నగా తెలుస్తున్నా సరే, అక్కగారు అనో,వదినగారూ అనో,పిన్నిగారూ అనో పిలిచేస్తు ఉంటారు.తమని తాము చిన్నగా అనుకుంటారొ ఏమో మరి.


మా నాన్నగారికంటే వయసులో పెద్దాయన ఒకసారి మా ఇంటికి వచ్చి మా అమ్మని "అక్కయ్యాగారు" అన్నరని మా అమ్మకి బోలేడు కోపం వచ్చేసింది.పెళ్లయ్యాకా మా ఇంటికి ఓసారి వంటకి వచ్చినావిడ మా అత్తగారిని "పిన్నిగారు" అన్నదని ఆవిడని మళ్ళి వంటకి రానివ్వలేదు మా అత్తగారు!!ఇంక నా సంగతికొస్తే..చిన్నప్పుడు రకరకాల పేర్లు,పెద్దయ్యాక "అక్క".అంతవరకూ బానే ఉండేది.నాకు పెళ్ళి అయ్యాకా, పెళ్ళికాని పక్కింటి అమ్మాయి కూడా నన్ను "ఆంటీ" అంటే ఒళ్ళు మండేది.వయసు చూడక్కర్లేదా?నాకు పెళ్ళి అయితే ఇంక ఆంటీ నా?అని మనసులో పీక్కునే దాన్ని.బయటకు ఎవరినీ ఏమీ అనలేము కదా...

ఒకసారి రైతు బజారుకి వెళ్తే అప్పటిదాకా "అక్కా" అనే కూరలవాడు "ఆంటీ ఈ కూర కొనండి,ఆ కూర కొనండి.."అనటం మొదలెట్టాడు.'నిన్నే పెళ్ళడతా 'లో 'పండు ' అంటే హీరోయిన్ కి ఎంత కోపం వస్తుందో...అంత కోపం వచ్చింది.నీ దగ్గర కూరలు కొనను.అని వచ్చేసా!!
ఆ తరువాత బొంబాయిలో మా పాలవాడు "అంటి..దూద్.." అని అరిచేవాడు."అబ్బాయీ నీ వయస్సెంత?" అన్నాను."30" అన్నడు."మరి నీ కళ్ళకి నేను ఆంటి లా ఎలా కనిపిస్తున్నను?అలా పిలిస్తే ఇంకనించీ నీ దగ్గర పాలు తీసుకోను!" అని ఖచ్చితంగా చెప్పేసా!! పాపం అప్పటి నుంచీ వాడు అలా పిలవటం మానేసాడు.కానీ పాలవాడు కాబట్టి అతడితో దెబ్బలాడగలిగాను.మిగిలిన అన్దరినీ ఏమంటాం...?తమ పిలుపుతో ఎదుటి వారిని ఏలాటి ఇబ్బందికి గురి చేస్తున్నాం అన్న విషయం ఎవరికి వారు అర్ధం చేసుకోవలసిందే కానీ ఒకరు చెప్తే వచ్చేది కాదు కదా..

మొన్న మా తమ్ముడు బండి తీసి బయటకు వెళ్తూంటే "అంకుల్ బాల్ ప్లీజ్,అంకుల్ బాల్ ప్లీజ్.."అని ఎవరో అంటూంటే ఎవరినో అనుకుని వాడు వెళ్పోతూంటే,మళ్ళీ అడిగారుట "అంకుల్ బాల్ ప్లీజ్.." అని.అప్పటికి గానీ అర్ధం కాలేదట వాడికి, పిలుస్తూన్నది వాడినే అని..!"నేను అంకుల్ అయిపోయానే.." అని వాడు బాధగా చెప్తూంటే,ఓహో ఈలాటి ఇబ్బందులు ఆడవాళ్ళకే కాక మగవారికీ ఉంటాయన్నమాట... అనుకున్నా అప్పుడు!!


కొసమెరుపు ఏమిటంటే,ఈ కొత్త పిలుపుకి నేను ఉడుక్కోవటం చూసి మావారు కూడా "ఆంటీ టీ ఇస్తావా...ఆంటీ వంటైందా...."అనటం మొదలెట్టారు...ఇప్పటికీ మానలేదు అంకుల్ !!