

అద్గదీ "BoBo" కధ. యువన్ శంకర్ రాజా, హారిస్ జైరాజ్, మిక్కీ జె మేయర్ తదితరుల తరువాత దిగుమతి అయిన ఈ తమిళ "శశి" మరో ప్రోమిసింగ్ కంపోజర్ అని నాకనిపిస్తోంది. మరి ఎంతవరకు రాణిస్తాడు అన్నది వేచి చూడాల్సిందే...!!






వృత్తిపరంగా డాక్టర్.
ప్రవృత్తి పరంగా కవయిత్రి.
స్వభావరీత్యా స్నేహశీలి.
ఒక మంచి మిత్రురాలు.
డా.వైదేహీ శశిధర్ గారితోనూ, వారి కవితలతో నాకు చాలా కొద్దిపాటి పరిచయం...తిలక్ గళంలో ఆయన కవిత పోస్ట్ పెట్టినప్పుడు పరిచయమయ్యారు. రెండు మూడు వాక్యాలు రాసినా వాటిల్లో ఎంతో ఆత్మీయత, అభిమానం దాగిఉంటాయి. కొన్ని పరిచయాలు ఇచ్చే మనోబలం మాటల్లో చెప్పలేనిది.
కవిత్వాన్ని విశ్లేషించేంత భాష నాకు రాదు కానీ వైదేహిగారి కవితలు చదివినప్పుడల్లా అవి నా మనసుని తాకుతాయి, వాటిల్లోని దగ్గరితనం మనసు మూలల్లో దాగున్న ఎన్నో భావాలను తట్టిలేపుతాయి.వైదేహిగారు కవితా సంకలనం "నిద్రిత నగరం" గురించి ఇక్కడ చూడవచ్చు.
కౌముది ఆగష్టు సంచిక లో ప్రచురితమైన వైదేహిగారి కవిత "మిత్రచ్ఛేదం" నాకు బాగా నచ్చింది. వారి అనుమతితో అది ఇక్కడ రాస్తున్నాను..
"మిత్రచ్ఛేదం"
పూర్తిగా ఆలపించకుండానే
అర్ధంతరంగా ఆపేసిన రాగాలు
కొన్ని పరిచయాలు.
అభిమానంతోనో అతిశయంతోనో
ఎప్పటికీ పూర్తి చేయని
జుగల్బందీలు కొన్ని స్నేహాలు.
అసహనంతోనో అపనమ్మకంతోనో
మధ్యలోనే ముగించిన రహదారి ప్రయాణాలు
మరికొన్ని పరిచయాలు.
మొత్తంగా రేకులు విడవకముందే
తన పరిమళంతో
జ్ఞాపకాలను వెలుగించే స్నేహపుష్పాలని
అహాల పోరాటం వల్లో అమాయకమైన అజ్ఞానంతోటో
కొనగోటితో చటుక్కున త్రుంచేసే
వేన వేల హస్తాలు !!
***
వైదేహిగారి కవితల్లో నాకు నచ్చిన మరో కవిత "నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య "
వైదేహిగారు రాసిన మరిన్ని కవితలు ఇక్కడ చూడవచ్చు.
అనుమతినిచ్చిన వైదేహిగారికి ధన్యవాదాలతో...
తృష్ణ.








విశ్వకవి రవీంద్రుని(1861–1941) గురించి ప్రత్యేకించిన పరిచయం అవసరం లేనేలేదు. దాదాపు అన్నిసాహితీ విభాగాల్లోనూ అందవేసిన చెయ్యి ఆయనది. ఒక సంపూర్ణ కళాకారుడాయన. కవిగా, కథకునిగా, వ్యాస రచయితగా, నవలా రచయితగా, నాటక రచయితగా, సంగీతకారునిగా, గాయకునిగా, చిత్రకారునిగా ఎన్నో అవతారాలెత్తారు. కానీ అన్నింటిలోకీ ముఖ్యంగా ఆయన ఒక కవిగానే మనకు ఎక్కువ కనిపిస్తారు. ఏభైకు పైగా ఉన్న గేయ సంపుటిలు, అందులోని రెండువేలకు పైచిలుకు గేయాలు, 1913లో ఆయన సాహిత్యానికి అందిన "నోబుల్ పురస్కారం" అందుకు నిదర్శనం.
ఇక లిటిరేచర్ స్టూడెంట్ గా డిగ్రీలోనూ, పిజీలోనూ కూడా ఆయన రచనలు కొన్నయినా చదివే అవకాశం లభించటం, దాదాపు పదిహేనేళ్ళ క్రితం మా కలకత్తా ప్రయాణంలో "శాంతినికేతన్" ను చూడటం నా అదృష్టంగా భావిస్తాను నేను. ఆ ప్రయాణంలో కలకత్తాలో మాకు HMVవాళ్ళ రవీంద్రుని సొంత వాయిస్ తో రికార్డ్ చేయబడిన ఆయన కవితలూ,పాటలూ ఉన్న కేసెట్ ఒకటి దొరికింది. అందులో ని ఒక పాటనూ, ఒక రెసిటేషన్ నూ ఇక్కడ పెడుతున్నాను.
(young Tagore)
Tagore's recitations and one song in his own voice:
ఆయన పర్సనాలిటీని, ఫోటోలను చూసి ఆయన గొంతుక చాలా గంభీరంగా ఉంటుండని అనుకునేదాన్ని... కానీ విన్నాకా ఓహో ఇదా ఆయన గొంతుక అనిపించింది. పైగా ఇది ఆయనకు కాస్త వయసు పైబడిన తరువాత చేసిన రికార్డింగా నాకు తోచింది. రవీంద్రుడు స్వయంగా రాసి, స్వరపరిచి "రవీంద్ర సంగీతం"గా ప్రఖ్యాత గాంచిన కొన్ని గీతాల గురించి నా తరువాతి టపాలో....
కొన్ని "శాంతినికేతన్" ఫొటోలు...

