సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, August 19, 2010

వైదేహిగారి కవిత


వృత్తిపరంగా డాక్టర్.
ప్రవృత్తి పరంగా కవయిత్రి.
స్వభావరీత్యా స్నేహశీలి.
ఒక మంచి మిత్రురాలు.

డా.వైదేహీ శశిధర్ గారితోనూ, వారి కవితలతో నాకు చాలా కొద్దిపాటి పరిచయం...తిలక్ గళంలో ఆయన కవిత పోస్ట్ పెట్టినప్పుడు పరిచయమయ్యారు. రెండు మూడు వాక్యాలు రాసినా వాటిల్లో ఎంతో ఆత్మీయత, అభిమానం దాగిఉంటాయి. కొన్ని పరిచయాలు ఇచ్చే మనోబలం మాటల్లో చెప్పలేనిది.


కవిత్వాన్ని విశ్లేషించేంత భాష నాకు రాదు కానీ వైదేహిగారి కవితలు చదివినప్పుడల్లా అవి నా మనసుని తాకుతాయి, వాటిల్లోని దగ్గరితనం మనసు మూలల్లో దాగున్న ఎన్నో భావాలను తట్టిలేపుతాయి.వైదేహిగారు కవితా సంకలనం "నిద్రిత నగరం" గురించి ఇక్కడ చూడవచ్చు.


కౌముది ఆగష్టు సంచిక లో ప్రచురితమైన వైదేహిగారి కవిత "మిత్రచ్ఛేదం" నాకు బాగా నచ్చింది. వారి అనుమతితో అది ఇక్కడ రాస్తున్నాను..

"మిత్రచ్ఛేదం"

పూర్తిగా ఆలపించకుండానే
అర్ధంతరంగా ఆపేసిన రాగాలు
కొన్ని పరిచయాలు.

అభిమానంతోనో అతిశయంతోనో
ఎప్పటికీ పూర్తి చేయని
జుగల్బందీలు కొన్ని స్నేహాలు.

అసహనంతోనో అపనమ్మకంతోనో
మధ్యలోనే ముగించిన రహదారి ప్రయాణాలు
మరికొన్ని పరిచయాలు.

మొత్తంగా రేకులు విడవకముందే
తన పరిమళంతో
జ్ఞాపకాలను వెలుగించే స్నేహపుష్పాలని
అహాల పోరాటం వల్లో అమాయకమైన అజ్ఞానంతోటో
కొనగోటితో చటుక్కున త్రుంచేసే
వేన వేల హస్తాలు !!

***

వైదేహిగారి కవితల్లో నాకు నచ్చిన మరో కవిత "నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య "
వైదేహిగారు రాసిన మరిన్ని కవితలు ఇక్కడ చూడవచ్చు.


అనుమతినిచ్చిన వైదేహిగారికి ధన్యవాదాలతో...
తృష్ణ.




7 comments:

నిషిగంధ said...

మంచి పరిచయం.. తిలక్ అనబోయి శరత్ అన్నట్టున్నారు.. ఏమైనా మీ ఈ టపాతో మళ్ళీ ఇంకోసారి ఆ గొంతు వినే భాగ్యం కలిగింది.. ధన్యవాదాలు :-)

వైదేహి కవితలు చదువుతుంటే నాకు పూలతోటలో తిరుగుతున్నట్టు ఉంటుంది.. కొన్ని అందంగా, ఇంకొన్ని అమాయకంగా, మరికొన్ని ఆహ్లాదంగా సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి.. అందమైన మాటలు పేర్చగలగడమే కాదు అత్యద్భుతమైన మనసున్న కవయిత్రి!

రాధిక(నాని ) said...

బాగుందండి

తృష్ణ said...

@నిషిగంధ : ఎన్నాళ్ళకెన్నాళ్ళకి....మీ వ్యాఖ్య చూసి చాలా సంతోషం కలిగిందండీ.
'పేరు' సరిచేసాను..:)
మీరు వైదేహి గారి గురించి రాసిన మాటలు అక్షరాలా నిజం. చూశారా నాకంత చక్కని భాష రాదు మరి.
మీ కవితలు కూడా నాకు అందమైన జలపాతాల్లాగ, పచ్చని ప్రకృతిలో విహరిస్తున్న అనుభూతినిస్తాయి. బ్లాగ్మిత్రులందరూ నాతో సమ్మతిస్తారు...:)

రాధిక(నాని) ధన్యవాదాలు.

Anonymous said...

బాగుంది పరిచయం. నాకు వైదేహితో వ్యక్తిగతంగా ఉన్న పరిచయం మూలంగానో, కవిత్వం అట్టే తెలియకపోవడంచేతో కొన్ని మిస్సయిపోతూంటాను. అంచేత మీరు చెప్పినదానికి డిటో అంటే సరిపోతుందనుకుంటాను.
మీకూ, వైదేహికీ అభినందనలు.

తృష్ణ said...

@tethulika: మీ వ్యాఖ్య చూసి చాలా సంతోషం కలిగిందండీ.thankyou verymuch for the visit.

Unknown said...

తృష్ణ గారూ ,
నా "మిత్రచ్ఛేదం" కవిత మీకు నచ్చినందుకు చాలా సంతోషం.ఆ కవితపై ఈ పోస్ట్ రాయటం కేవలం మీ సహృదయత.
ధన్యవాదాలు.
అభిప్రాయాలు తెలిపిన సాహితీ మిత్రులకు కృతజ్ఞతలు.

మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు!!!

వైదేహి శశిధర్

తృష్ణ said...

@vaidehi: you deserve this appreciation.. Thankyou verymuch for the visit.