సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Thursday, August 12, 2010
"అర్ధాంగి" (1955)
ఏ రకమైన సినిమా అయినా, చూస్తున్నంత సేపూ ఎంతో ప్రశాంతతని, హాయిని ఇస్తాయి మన పాత "బ్లాక్ అండ్ వైట్" చిత్రాలు. రంగులు లేక పోయినా ఎంతో గ్రేస్ ఉంటుంది ఆ చిత్రాల్లో. ఇక పాటల సంగతి చెప్పనక్కరలేదు. వెన్నెల్లో విహారమే. కొత్త పాటలూ, బాణీలూ కూడా బావుంటాయి కానీ అప్పటి సినిమాల, వాటిల్లోని పాటల తేరే వేరు. ప్రతి సినిమాలోనూ అంతర్లీనంగా ఒక సందేశం, దర్శకులు చెప్పదలుచుకున్న నీతి ఉండేవి. ఫలానా పాత్ర ధరించటం వల్ల "ఇది నేర్చుకున్నాను..." అని కొందరు నటులు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అటువంటి అలనాటి తరానికి చెందిన కొన్ని ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో ఒకటే "అర్ధాంగి". పి.పుల్లయ్య దర్శకత్వం వహించిన రాగిణివారి "అర్ధాంగి" 1955, జనవరి 26న రిలీజ్ అయ్యింది. ఈ చిత్ర కధకు బెంగాలీ నవల "స్వయంసిధ్ధ" ఆధారం. అర్ధాంగి లోని ’పద్మావతి’ పాత్రను సావిత్రిగారి నటజీవితంలో ఒక మరపురాయిగా చెప్పుకోవచ్చు. పట్టుదల, ధైర్యం, ఆత్మవిశ్వాసాలతో చీకటిగా మారబోయిన జీవితాన్ని వెలుగుబాటలోకి ఎలా నడిపించుకోవచ్చునో తెలుపుతుంది కధలోని పద్మావతి పాత్ర.
కధలోకి వెళ్తే, జమిందారు భుజంగరావు(గుమ్మడి)కు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు రాఘవేంద్రరావు(నాగేశ్వరరావు) చిన్నతనంలో తల్లి చనిపోతుంది. జమిందారు రెండవ భార్య రాజేశ్వరి(శాంతకుమారి).ఆమెకు తన కొడుకు నాగేందర్రావు(జగ్గయ్య) పైన మితిమీరిన వాత్సల్యం. ఆయమ్మ పెంపకంలో పెరిగిన పెద్ద కుమారుడు రఘు మతిస్థిమితం లేనివాడు కావటంతో జమిందారు ఆస్తిని పొగరుబోతు అయిన చిన్నకొడుకు నాగు కు అప్పగిస్తాడు. బాధ్యత నెత్తిన పడిన తరువాత కూడా అతడిలో మార్పు రాదు.
రామాపురం లో వ్యవహారాలు చక్కబెట్టడానికి వెళ్ళిన నాగు అక్కడి రైతు అయిన కోటయ్యపై దౌర్జన్యం చేస్తూండగా, మరో రైతు భూషయ్య కుమార్తె అయిన పద్మ అతడికి ఎదురుతిరిగి, అతడి అన్యాయాన్ని ప్రతిఘటిస్తుంది. జరిగింది విన్న జమిందారు నాగు ను దారిలోకి తేగల వ్యక్తిగా భావించి పద్మతో అతడి వివాహం నిర్ణయిస్తాడు. కానీ అందుకు రాజేశ్వరి అంగీకరించకపోవటం తో నాగుకు బదులుగా పద్మను పెద్ద కొడుకు రఘుకు ఇచ్చి వివాహం జరిపిస్తాడు.
పెళ్ళిపీటల మీద భర్త నాగు కాదని, మతిస్థిమితం లేని జమిందారు పెద్దకొడుకు అని తెలుసుకున్న పద్మ నిర్ఘాంతపోతుంది. కానీ అర్ధాంగిగా తన కర్తవ్యాన్ని గుర్తించి భర్తలో మార్పు తేవటానికి ఎంతో కృషి చేస్తుంది. కానీ ఆమె సహనానికీ, పట్టుదలకూ పరీక్షగా అత్త రాజేశ్వరీ, మరిది నాగూ ఆమెను ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తారు. తన ధైర్యం, సహనం, ప్రేమానురాగాలతో పద్మ రఘును ఎలా మామూలు మనిషిని చేసింది; బాగుపడిన రఘు అధికరంలోకి రావటం సహించలేని రాజేశ్వరి, నాగూ భార్యాభర్తలను ఎటువంటి ఇబ్బందులకు గురిచేసారు; అధికార దాహంతో తప్పుదారి పట్టిన నాగును, అత్తగారు రాజేశ్వరి ఇద్దరిలోనూ తన మంచితనంతో పద్మ ఎలా మార్పును తెచ్చిందనేది మిగిలిన కధ. మొదట మతి స్థిమితం లేని భర్తగా, బాగయ్యాకా బాధ్యత గల భర్తగా, తండ్రి ఆస్తిని కాపాడే కొడుకుగా నాగేశ్వరరావు నటన మన్ననలనందుకుంది. ఇక పొగరుబోతుగా, నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో జగ్గయ్య, అన్నదమ్ముల మధ్య సయోధ్య కుదర్చాలని తాపత్రయపడే తండ్రి పాత్రలో గుమ్మడి, కొడుకుపై వల్లమాలిన ప్రేమతో అతడి పతనానికి పరోక్షంగా కారణమయ్యే తల్లి పాత్రలో శాంతకుమారి మెప్పిస్తారు.అందరినీ మించి టైటిల్ రోల్ లో భర్తను బాధించేవారి నుంచి రక్షించుకుంటూ, లాలనతో, అనురాగం తో అతడిలో మార్పు తెచ్చే సావిత్రి నటన మాత్రం అపూర్వం.
సినిమాలో సంగీతం, ఫొటోగ్రఫీ, సౌండ్ రికార్డింగ్, ఎడిటింగ్, డైలాగ్స్, దర్శకత్వమూ అన్నీ చిత్ర విజయానికి తోడ్పడ్డాయి. ఆరు పాటలు, రెండు నేపథ్య గీతాలూ ఉన్న ఈ చిత్రానికి సంగీతాన్ని అందించినది బి.ఎన్ ఆర్(భీమవరపు నరసింహారావు). వాటిలోని "వద్దురా కన్నయ్యా" , "ఎక్కడమ్మా చంద్రుడు" పాటలు రెండూ నాకు బాగా ఇష్టమైనవి. రెండూ కూడా జిక్కీ(పి.జి.కృష్ణవేణి) పాడినవే. సన్నివేశానికి అనుగుణమైన ఆత్రేయగారి సాహిత్యం ఉదాత్తమైన భావాలను కలిగిస్తుంది. తమిళంలో ఈ చిత్రాన్ని "పెన్నిన్ పెరుమై" పేరుతో నిర్మించారు పుల్లయ్యగారు.
పాటల కోసం వెతుకుతూంటే యూట్యూబ్లో సావిత్రిగారు విజయవాడ రేడియో స్టేషన్ వారి కొసం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ బిట్ ఒకటి దొరికింది. ఈ ఇంటర్వ్యూ బిట్ యూ ట్యూబ్ లోకి ఎవరు పెట్టారో తెలియదు కానీ, విజయవాడ రేడియో స్టేషన్లో జరిగిన సావిత్రిగారి ఇంటర్వ్యూ తాలూకు రికార్డింగ్, డబ్బింగ్ రెండూ మా నాన్నగారు చేసారు.
ఈ సినిమాలోని పాత్ర గురించి సావిత్రిగారు చెప్పిన మాటల తరువాత ఉన్న "వద్దురా కన్నయ్యా..." పాటను కూడా ఈ లింక్ లో చూడవచ్చు. కాపీ రాగంలో స్వరపరచబడిన ఈ పాటను జిక్కీ గారు ఎంత అలవోకగా పాడేసారో అనిపిస్తుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment