Monday, January 24, 2011
క్షమ
"क्रॊध कॆ बोझ को मन पे उठाये काहे चेल्ता है प्राणी
क्षमा जो शत्रु को भी कर दे, वहि मुक्त है...वहि ग्यानी"
bhootnath సినిమాలో జావేద్ అఖ్తర్ "समय का पैय्या चेलता है.." పాటలోని మొదటి రెండు వాక్యాలూ..ఇవి.
"మనసులో కోపమనే బరువును ఎందుకు మోస్తూంటాడు ప్రాణి
శత్రువును సైతం క్షమించినప్పుడే ముక్తి....అతడే జ్ఞాని.." -- అని అర్ధం !!
మొదటి రెండు వాక్యలూ అయ్యాకా bhootnath సినిమాలో "సమయ్ కా పైయ్యా చెల్తా హై" అనే పాట మొదలౌతుంది. ఆ సినిమాలో నాకు బాగా నచ్చిన పోయింట్ ఇది. శత్రువును సైతం క్షమించగలగటానికి ఎంతో ధీరత్వం ఉండాలి. ఉదాత్తత ఉండాలి. మనల్ని బాగా బాధపెట్టినవాళ్లనీ, సూటిపోటి మాటలతో మనసుని గాయపరచిన వాళ్ళనీ, తమ చేతలతో మనసుని ముక్కలు చేసిన వాళ్ళనీ మనం క్షమించగలమా? చాలా కష్టం..! కానీ ఈ పాటలోని వాక్యాలు విన్నాకా అనిపించింది...నిజమే, ఎందుకు మనం ఇతరులపై కోపాన్నీ, బాధనీ, దు:ఖాన్నీ మోసుకుంటూ బ్రతుకుతాం? వాళ్ల పాపానికి వాళ్ళని వదిలేసి మన మనసులని ఎందుకు తేలిక చేసుకోమూ...అని. లేకపోతే మనం కూడా అమితాబ్ పాత్ర మాదిరి చనిపోయాకా భూతంగా మారిపొతామేమో....ఈ లెఖ్ఖన ప్రపంచంలో ఎన్ని కోట్ల,బిలియన్ల భూతాలు తిరగాడుతూ ఉన్నాయో..అనిపించింది కూడా!!
(పై వాక్యాలు "భూత్ నాథ్" సినిమా చూశాకా నేను గతంలో రాసిన టపాలోనివి.)
***********************
జీవితంలో చాలా కష్టమైన పని, ప్రశాంతత నిచ్చేపని "క్షమించటమే" అని అనుభవపూర్వకంగా అర్ధమయ్యాకా ఈ వాక్యాలను మళ్ళీ రాయాలని అనిపించింది.
ఇంతకు మించి రాసేదేమీ లేదు.
రంగనాయకమ్మగారి “చదువుకున్న కమల”
పెళ్ళి నాటికి ఇరవై సంవత్సరాలు నిండిన “కమల” విద్యావంతురాలు. తనకంటూ ఒక ప్రత్యేకతను ఆపాదించికున్న విజ్ఞానవంతురాలైన గృహిణి. అత్తవారింట్లో ఆదర్శ గృహిణిగా తాన్ను తను తీర్చిదిద్దుకోవాలని తహ తహలాడిన స్త్రీ. సమాజంలోనూ, వ్యక్తుల్లోనూ అభివృధ్ధిని కాంక్షించే అభ్యుదయవాది. పెళ్ళైన ఏడేళ్ళలో ముగ్గురు పిల్లల తల్లి అయి, వైవాహిక జీవితంలోని ముఖ్య ఘట్టాలన్నీ దాదాపు గడపివేసిన అనుభవజ్ఞురాలు. రంగనాయకమ్మగారి “చదువుకున్న కమల” నవలా నాయిక.
“చిన్నవాళ్ళని పెద్దవాళ్ళు మూర్ఖంగా ప్రేమించినా, పెద్దవాళ్ళని చిన్నవాళ్ళు గుడ్డిగా ఆరాధించినా ఫలితం ఒకటే – అశాంతి ! మనస్పర్థ !” అన్న నేపధ్యంతో 1966లో జ్యోతి మాసపత్రికలో సీరియల్ గా వచ్చిన నవల రంగనాయకమ్మగారి “చదువుకున్న కమల”. నేను 1996లో కొనే సమయానికి ఆరు పున:ముద్రణలు పూర్తి చేసుకుంది.
మూర్తిని ప్రేమించి వివాహమాడిన కమల ఎన్నో కలలతో అత్తవారింట్లో అడుగుపెడుతుంది. ఇంటిని అందంగా తీర్చిదిద్దాలనీ, భర్తకు తన చేతులతో వండివడ్డించాలనీ ఆశ పడుతుంది. కానీ పద్ధతీ తీరూ లేని అత్తవారిల్లు, మర్యాదా మన్ననా తెలియని ఇంట్లో మనుషులు, చాలా సందర్భాల్లో మూర్ఖంగా ప్రవర్తించే అత్తగారు, ఇంట్లో ఏమి జరిగినా, కారణమెవరో తెలిసినా స్పందించని భర్త, కమలను ఎంతో నిరాశకు,ఆవేదనకూ గురిచేస్తారు. దుర్మార్గురాలు కాకపోయినా కోడలిపై అధికారం చెలాయించటం జన్మ హక్కుగా భావించే సగటు అత్తగారు శేషమ్మ. పనిపాటలు తెలిసి, ఇంటిని అందంగా తీర్చిదిద్దగల నేర్పు ఉన్న కమలపై తన అత్తగారి పెద్దరికాన్ని అన్నివిధాలుగా చెలాయిస్తుంది శేషమ్మ. ఆమె చేసే మూర్ఖపు పనులు అత్తాకోడళ్ళ మధ్య సర్వసాధారణమైన మనస్పర్ధలకు తావునిస్తాయి. తర్కానికీ, న్యాయానికీ చోటులేని నిర్ణయాలు చేయటం ఆ అత్తగారి హక్కు. వాటికి తప్పనిసరిగా తలవంచటం మాత్రమే ఆ కోడలు చాలా ఏళ్లపాటు చేయాల్సివచ్చిన అనివార్యకార్యం. కొన్నేళ్ళపాటు ఎదురులేని సంసారసార్వభౌమత్వం వహించాకా కొత్తగా కోడలు వచ్చి కొత్త సవరణలు చేయటం సహించలేకపోవటం అత్తగారనబడే పాత్రకున్న జన్మహక్క మరి.
ఇంటిని అందంగా తయారుచేయాలన్న కోరికను భర్త సలహాపై తమ గదిమటుకే పరిమితం చేసుకోక తప్పదు కమలకు. పొందికగా తయారైన తమ గదిని చూసి విస్మయం చెందుతాడు ఆమె భర్త. గది నచ్చినా, మెచ్చని సుగుణం సొంతమైన అత్తగారు మెల్లగా సణుక్కోవటం వినబడుతుంది ఆమెకు. గౌరవం పొందాల్సిన మామగారి ధోరణి చిరాకునూ, జుగుప్సనూ కలిగిస్తాయి కమలకు. సర్ది పెట్టిన తమ పక్క మీద మధ్యాహ్నాలు నిద్రపోవటం మొదలెట్టిన మామగారి అలవాటుని ఇంట్లో అందరితో ఒప్పించి మాన్పించి "ఎంతైనా గడుసుది" అన్న కొత్త బిరుదు పొందుతుంది కమల.
భార్యాభర్తలకు ఏకాంతానికీ, మురిపాలకూ అడ్డంపడుతూ తలదూరుస్తు ఉండే తల్లి మూర్తి దృష్టిలో అమాయకురాలు. అతని దృష్టిలో భార్య బుర్రకి ఆలోచనలెక్కువ. ఆడంబరాలకూ, సంబరాలకూ ఆర్భాటం చేయటం, కొడుకు సంపాదనను దుబారా చేయటం, అవసరం ఉన్నా లేకపోయినా బంధువులను ఆహ్వానించి అతిథిసత్కారాలు చేయటం, కొడుకుతో అప్పు చేయించైనా ఆదపాదడపా కూతురుకి ఆర్ధిక సహాయం అందించటం శేషమ్మకు అలవాటు. అందుకు భర్త చేసే సమర్థన భార్యాభర్తల ఘర్షణను పెంచటానికి తప్ప మరెందుకు ఉపయోగపడదు. బిడ్డ కష్టార్జితంతో వేడుక చేసుకు ఆనందించే ఆ తల్లిదండ్రుల అనురాగాన్ని ఏ కోణంలోంచీ సమర్ధించలేకపోతుంది కమల. అనుమతి లేకుండా తన ఉత్తరాలను చదివే ఆడపడుచును, తల్లి అండతో వచ్చినప్పుడల్లా ఇల్లు దోచుకుపోయే ఆమె తీరు కమలను ఆందోళపరుస్తాయి.
పిల్లలు పుట్టాకా జరిగే సంఘటనలూ, పరిస్థితులు కమలను మరీ కలవరపెడతాయి. పిల్లలకు ఇష్టమైన పేరు పెట్టడానికి కూడా పేచీలు, మగపిల్లవాడికి చిన్నప్పుడే ఆడపిల్లను లోకువచేయటం నేర్పిస్తున్న అత్తమామల ప్రవర్తన ఆమెకు చాలా బాధను కలగజేస్తాయి. ఇంకా ఇంకా పెరుగుతున్న సమస్యలు, చికాకుల వల్ల భార్యాభర్తల మధ్యన పెరుగుతున్న దూరం ఎంతవరకూ వెళ్ళింది? వాళ్ళ కథ ఎలా ముగింపుకి వచ్చింది? అన్నది మిగిలిన కథ. ఒక మామూలు మధ్యతరగతి జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే చక్కని కథనంతో "చదువుకున్న కమల" ప్రతి చదువుకున్న అమ్మాయి ఆలోచనలను ప్రతిబింబింపచేస్తుంది.
ఈ నవల అరుణా పబ్లిషింగ్ హౌస్,విజయవాడ ద్వారా ప్రచురింపబడింది. (వారి ఫో.నం.0866-431181)
.... ----- ...... ----- ..... ------
"వనితామాలిక"లో ప్రచురితం : ఇక్కడ చదవచ్చు..
Saturday, January 22, 2011
"యాహూ హోం పేజ్" లో తళుక్కుమన్న "Deol ladies"
పై ఫోటో లో ఉన్నది ప్రఖ్యాత హిందీ నటి హేమమాలిని, ఆమె కుమార్తెలు ఈషా, అహానా. "Namaste India" అనే Indo-American Association for Arts and Entertainment తాలూకూ లాంచ్ ప్రోగ్రాంలో నృత్యం చేస్తున్న ఫోటోలు ఇవి.
"యాహూ హోం పేజ్" లో "Deol ladies" పేరుతో కనబడ్డ ఈ ఫోటోలు నాకు చాలా ఆనందాన్ని కలిగించాయి. వెంఠనే కాపీ చేస్కున్నాను. 62ఏళ్ళ ఈ అందమైన నటికి నృత్యం పట్ల ఉన్న passion,dedication నాకు ఆమె పట్ల గౌరవాన్ని పెంచుతాయి. కుమార్తెల కన్నా ఈమే ఎక్కువ అందంగా ఉందే అనిపిస్తుంది. పెరిగే వయసుతో పోటీపడే సౌందర్యం ఆమెది.
చిన్నప్పుడూ టివీలో "నూపుర్" అని హేమమాలిని డైరెక్ట్ చేసిన సీరియల్ వచ్చేది. విడువకుండా చూసేవాళ్ళం. హేమమాలిని, కబీర్ బేడీ ముఖ్య పాత్రలు పోషించారు ఈ సీరియల్లో. ఎంతో ఇష్టంతో భరతనాట్యం నేర్చుకుని, నృత్యానికే జీవితం అంకితం చేయాలనుకునే మహిళ జీవిత కథ అది. గుల్జార్ రచించారు. కుమార్తెలతో పాటూ ఉన్న పై ఫోటోలను పొద్దున్నే యాహూ లో చూడగానే ముచ్చట వేసి ఈ టపా రాయాలనిపించింది. ఆమె తన కుమార్తెలు కూడా ఆ కళను నేర్పటం భరతనాట్యం పట్ల ఆమెకు ఉన్న ప్రేమను, అంకితభావాన్ని తెలుపుతాయి. ఆమె సంకల్పమే కాక వారు కళను నేర్చుకోవటం, అది వారికి అబ్బటం కూడా అదృష్టమే.
Wednesday, January 19, 2011
వెన్నెల్లో వాకింగ్...
భోజనమయ్యాకా పది నిమిషాలు వాకింగ్ చేద్దామని బయటకు వచ్చా...లైట్ వెయ్యకుండానే సందంతా పరుచుకున్న తెల్లని వెన్నెల రారమ్మని పిలిచింది. చెవుల్లో ఇయర్ ఫోన్స్ తగిలించుకుని నడవటం మొదలెట్టాను. మెట్ల మీద కూడా వెన్నెలే. చిన్నప్పుడు నేర్చుకున్న లలితగీతం ఒకటి గుర్తుకొచ్చింది. అందులో "వెన్నెలలో వెండి మెట్ల దారురలో రావా...ఈ పుల బాటసారి మదిని వసంతమై పోవా.." అనే వాక్యం గుర్తుకొచ్చింది ఈ మెట్ల మీద పరుచుకున్న వెన్నెలను చూడగానే. ఇలాంటి వెన్నెల నిండిన మెట్లను చూసే రాసి ఉంటారు రచయిత అనుకున్నా. చలి తగ్గిపోయింది అప్పుడే. స్వెట్టర్ అవసరం అనిపించలేదు.
ఎఫ్.ఎమ్ ఛానల్స్ తిప్పుతూ నడుస్తున్నా. "వయ్యారి గోదారమ్మా..." మొదలైంది.. బాలు నవ్వుతో. ఆహా...అనుకున్నా.
"వయ్యారి గోదారమ్మ ఒళ్ళంతా ఎందుకమ్మా కలవరం?
కడలి ఒడిలో కలిసిపొతే కల వరం ! "
వేటూరిగారి మాట విరుపులో కూడా విరహమే.
"నవ్వేటి నక్షత్రాలు మువ్వల్ని ముద్దాడంగా
మువ్వగోపాలుని రాధిక
ఆకాశవీణ గీతాలలోనా
ఆలాపనై నే కరిగిపొనా..."
వేటూరి గారి కలం లోంచి ఒలికిన ఆణిముత్యాల్లో ఇదీ ఒకటి. ఏం సాహిత్యం రాసారో కదా అనుకున్నా. కొన్ని పాటలు అదివరకు చాలా సార్లు విన్నవే అయినా , చాలారోజుల తరువాత మరోసారి విన్నప్పుడు కొత్తగా అనిపిస్తాయి. పాట అయిపోయింది. వెంఠనే మరొ వేటూరి గీతం మొదలైంది. ఇది ఇంకా బాగుంటుంది..
సా...నిసరి సా..నీ....మొదలైంది. "అన్వేషణ"లో "కీరవాణి " పాట..
"ఈ పూలలో అందమై ఈ గాలిలో గంధమై
నా తోటలో చైత్రమై ఈ బాటనే నడచిరా.."
...నీ కన్నూలా నీలమై నీ నవ్వులా వెన్నెలై
సంపెంగలా గాలినై తారాడనా నీడనై.."
ఏం రాసారు...తిరుగుందా ఈ సాహిత్యానికి? కొత్త సినిమాల్లో ఇలాంటి పాటలేవీ? ఈ సాహిత్యం ఒక ఎత్తైతే, వీటికి ఇళయరాజా సంగీతం మరో ఎత్తు. రెండు పాటలకీ అద్భుతమైన సంగీతాన్ని అందించి ఇన్నాళ్ళ తరువాత కూడా వింటూంటే మైమరచిపోయేలా చేయటం ఆయనకే సొంతం. అప్పటి గోల్డెన్ ఇరా లో ఆయన అందించిన బాణీలన్నీ ఇలాంటివే. అతి చెత్త మూడ్ లో ఉన్నా కూడా స్టార్టింగ్ హమ్మింగో, ట్యూనో వినగానే అప్రయత్నంగా గొంతు కలిపేస్తాం పల్లవితో..! అలాంటి ట్యూన్స్ ఇళయరాజావి.
ఆలోచనలు నడుస్తూండగానే మరో రెండు పాటలు అయిపోయాయి. పది నిమిషాలనుకున్న నడక కాస్తా అరగంట దాటింది. ఇక ఈపూటకు చాల్లెమ్మని ఇంట్లోకి వచ్చేసా. వస్తూనే నా వెన్నెల్లో వాకింగ్ నీ, ఆలోచనల్ని ఇలా టపాయించేసా...
Wednesday, January 12, 2011
గాలిపటాలు
ఊరినిండా అడుగడుగునా అమ్మకానికి పెట్టిన గాలిపటాలను చూస్తూంటే "స్నేహం" సినిమాలోని "ఎగరేసిన గాలిపటాలు"పాట గుర్తుకు వచ్చింది.ఆ పాటలోని కొన్ని వాక్యాలు...
"ఎగరేసిన గాలిపటాలు...
దసరాలో పువ్వుల బాణం..
దీపావళి బాణా సంచా..
నులివెచ్చని భోగిమంటా..
చిన్ననాటి ఆనవాళ్ళు
స్నేహంలో మైలురాళ్ళు
చిన్నప్పటి ఆనందాలు
చిగురించిన మందారాలు...."
పి.బి.శ్రీనివాస్ పాడిన ఈ పాట ఎన్నో చిన్ననాటి జ్ఞాపకాలని తట్టిలేపుతుంది. నాకు గాలిపటాలంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు మా ఇంటిపక్కన ఉండే మా కన్నా పెద్ద పిల్లలు గాలిపటాలు ఎగరేస్తూంటే అదేదో 8th wonder లాగ చూసేవాళ్ళం. అసలు నలుపలకలుగా ఉన్న ఆ కాగితం అలా గాల్లో అంత ఎత్తుకి ఎలా వెళ్తుంది అని ఆశ్చర్యం కలిగేది. ఎగరేస్తు దూరంగా ఉన్న గాలిపటాలతో పోటీ పడటం, ఒకళ్ళని చూసి ఒకళ్ళు గాలిపటాలను ఇంకా ఇంకా ఎత్తుకు ఎగరేసుకోవటాలు, పడగొట్టడాలూ భలేగా ఉండేది. మధ్య మధ్య ఆ పిల్లలు దారం పట్టుకొమ్మని చెప్పి ఏదో పని మీద వెళ్ళివచ్చేవారు. మహాప్రసాదం లాగ ఆ దారన్ని అతి జాగ్రత్తగా పట్టుకుని, ఆ గాలిపటం దగ్గర్లో ఎగిరే మరే గాలిపటానికీ చిక్కకుండా వెళ్ళినవాళ్ళు వచ్చేదాకా కాసేపన్నా గాలిపటాన్ని ఎగరవేయటం గొప్ప థ్రిల్ గా ఉండేది. అలా కాసేపు గాలిపటాన్ని పట్టుకోవటం కోసం పెద్దపిల్లలందరూ గాలిపటం ఎగరేస్తున్నంత సేపూ అక్కడే నిలబడి చూస్తూ ఉండేవాళ్ళం..ఓ సారివ్వవా? అని అడుగుతూ...అదో మధురమైన జ్ఞాపకం.
గాలిపటం ఎగరేయటం నేర్పమంటే, "చిన్నపిల్లలు మీకు రాదు" అనేసేవారు వాళ్ళు. ఉక్రోషం వచ్చి నేనూ,మా తమ్ముడూ కలిసి గాలిపటం కొనుక్కొచ్చి మేడ మీదకి వెళ్ళి, ఒకళ్ళం దారాన్ని పట్టుకుంటే ఒకళ్ళం గాలిపటం పట్టుకుని దూరంగా పరిగెత్తుకువెళ్ళి దాన్ని ఎగరేయటానికి ప్రయత్నించేవాళ్ళం. కాస్త ఎగిరేది. క్రింద పడిపోయేది. కొన్ని కాస్త దూరం ఎగిరి ఏ చెట్టు కొమ్మకో చిక్కుకుని చిరిగిపోయేవి. అలా గాలిపటాన్ని ఎగరేయాలన్న కోరిక కోరికలాగే ఉండిపోయింది. అన్నయ్యకూ ,తమ్ముడికీ కూడా రాదు ఇప్పటికీ. పెళ్ళయ్యాకా మావారు, మా మరిది ఇద్దరూ గాలిపటాలు ఎగురవేయటంలో ఎక్స్పర్టులు అని తెలిసి చాలా సంతోషించాను. ఇంట్లో పాత సామానుల్లో గాలిపటాల దారాలు అవీ చూసి సంబరపడిపోయేదాన్ని. కానీ కొన్ని కారణాలవల్ల చాలా ఏళ్ళు గాలిపటాలు ఎగరేయటం మాకు కుదరనే లేదు. క్రితం ఏడు మా పాప వీధుల్లో అమ్ముతున్న గాలిపటాలను చూసి కావాలని మారాం చేసింది. కొనిపెట్టాం. వాళ్ళిద్దరూ మేడ మీదకు వెళ్ళి ఎగరేసుకుని వచ్చారు. కానీ ఏవో పనుల్లో ఉండి నాకు వెళ్ళి చూడటం కుదరనేలేదు. పనయ్యి నేను పైకి వెళ్దామని బయల్దేరేలోపూ వాళ్ళు క్రిందకు వచ్చేసారు.
ఈసారి మళ్ళీ పాప గాలిపటాలు కొనమని గొడవచేస్తూంటే ఈ చిన్నప్పటి ఊసులన్నీ గుర్తుకొచ్చాయి. ఈసారి ఏమైనాసరే గాలిపటాన్ని స్వయంగా ఎగరేయాలని పట్టుదలగా ఉంది. మరి ఏమౌతుందో చూడాలి..
ప్రతి ఏడూ గుజరాత్ లో ఇంటర్నేషనల్ కైట్స్ ఫెస్టివల్ జరుగుతుంది. ఈసారి కూడా 21st ఇంటర్నేషనల్ కైట్స్ ఫెస్టివల్ ఈ నెల తొమ్మిది నుండీ ఇవాళ్టివరకూ జరిగింది. గుజరాత్ అంతా టూరిస్ట్ లతో మహా సందడిగా ఉంటుంది ఈ సమయంలో. ఒక కైట్స్ ఫెస్టివల్ తాలూకూ క్లిప్పింగ్ చూడండి...రకరకాల గాలిపటాలు భలే అందంగా ఉన్నాయి ఈ వీడియోలో.
2010 లో జరిగిన 20th kites festival తాలూకూ వీడియో లింక్:
http://www.youtube.com/watch?v=6eWny8zBa8s&feature=fvw.
Tuesday, January 11, 2011
తనికెళ్ళ భరణి గారి "నక్షత్ర దర్శనమ్"
"నాకూ వీళ్ళంటే ఇష్టం...
నాకంటే వీళ్ళంటే మీకు కూడా ఇష్టమే....!
నా ఇష్టాన్ని ఇలా వ్యాసాలుగానూ...
కవితలుగానూ రాసుకున్నాను !
....వెల్లకిలా పడుకుని వినీలాకాశంకేసి చూస్తే వేల నక్షత్రాలు
కనిపిస్తున్నా గుప్పెడు కోసి...గుండెలకద్దుకుంటున్నా !"
అంటారు తనికెళ్ళ భరణిగారు ఈ పుస్తకంలో తన మాటగా. సినీ, సంగీత, సాహిత్య ప్రపంచాల్లో తళుక్కుమన్న కొందరు మహోన్నత వ్యక్తుల గురించిన భరణిగారి అభిప్రాయాలసారమే ఈ "నక్షత్ర దర్శనమ్". భరణిగారి రచనలకు ప్రత్యేక పరిచయాలవసరం లేదు. పుస్తకంలోని నాలుగు వాక్యాలు చదివితే చాలు. పుస్తకం మొత్తం చదివేదాకా వదలం. అంత మంచి భాష, భావమూ ఆయనది. ఈ పుస్తకంలోని కొందరు వ్యక్తుల గురించిన రాసిన వ్యాసాలు, కవితల్లోంచి కొన్ని వాక్యాలు చూడండి మీకే తెలుస్తుంది.
జేసుదాసు:
శంఖంలాంటి ఆయన గొంతు పూరించిన
ఓంకారం వింటూ
పరమశివుడే పరవశుడై ధ్యానం చేసుకుంటాడు
భగవద్గీత సారాన్ని
నరుడికీ నారాయణుడికీ
ఈయనే స్వయంగా భోదిస్తున్నట్లుంటుంది
చెంబై వైద్యనాథ్ భాగవతార్
ఆశీర్వాద బలం....భారతదేశం చేసుకున్న పుణ్యఫలం
ఆయన గళం !
బాలమురళి:
ద్వాపర యుగంలో
గొపికల్తో సరసాలాడ్తూ
బృందావనంలో
నల్లనయ్య మర్చిపోయిన
పిల్లనగ్రోవి బాలమురళి
ఆయన గానం
ఉషోదయాన వెలిగే
ముద్ద కర్పూరం
ఆయన తిల్లాన
అర్ధరాత్రి వేసే
అగరు ధూపం.
కృష్ణశాస్త్రి:
ఆయన రాసిన "జయజయజయ ప్రియభారత జనయిత్రి దివ్యధాత్రి " గురించి----
ఆ పాట భారతమాత పాదాలకి పూస్తే పారాణి అవుతుంది !
అరచేతులకు రాస్తే గోరింటాకులా పండుతుంది !
మెడకు పూస్తే మంచి గంధమౌతుంది !
కురులకి రాస్తే సంపెంగ నూనె అవుతుంది !
పెదాల అరుణిమతో కలసి తాంబూలమౌతుంది !!
జన్మనిచ్చిన భరతమాత ఋణం తీర్చుకున్నాడు కృష్ణ శాస్త్రి ఈ పాటతోటీ!
గురుదత్:
కన్నీరు పన్నీరు కలలతో కలిపి వెండితెర మీద బంగారు బొమ్మలు గీసిన "రవివర్మ" గురుదత్.
గురుదత్ వాడినవి రెండే రంగులు. నలుపు.. తెలుపు...!
నలుపుతో నవరసాలనీ ఆవిష్కరించాడు. తెలుపుతో ఆత్మానందాన్ని ప్రతిబింబింపజేసాడు.
ఘనీభవించిన శోకాన్ని పలకలు చేసి...సినీ యమునానదీ తీరాన నల్లని తాజ్మహల్ కట్టుకున్న విషాద షాజహాన్ - గురుదత్!
రేఖ:
ఆమె చూపు మార్మికంగా
నవ్వు నర్మగర్భంగానూ
మాట తాత్వికంగానూ
మనిషి సామన్యంగానూ ఉంటుంది
ఆమెని యావత్ భూగోళం ప్రేమించింది !
హరిప్రసాద్ చౌరాస్యా:
ఆయన వెదురు మీద
పెదవి ఆన్చి ఊదితే చాలు
అందులోంచి విచిత్రంగా
ఆకుపచ్చని సీతాకోకచిలుకలూ
పసుప్పచ్చని పావురాలూ
ఇంద్రధనుస్సులూ
చంద్రోదయాలూ..!!
బ్రహ్మానందం:
అరగుండు నుంచీ
సంపూర్ణంగా ఎదిగిన నటుడు
ఎక్కడ చిక్కాలో
ఎక్కడ చెక్కాలో...
ఎక్కడ మొక్కాలో..
ఎక్కడ నొక్కాలో తెలిసిన జ్ఞాని !
జాకీర్ హుస్సేన్:
నక్షత్రాల్ని దోసిట్లో పట్టి
తాజ్మహల్ మీద
ధారగా పోస్తున్నట్టూ
కాశ్మీర్ లోయల్లో
ఊయలలూగుతున్నట్టూ...
ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మి:
ఆమె భజగోవింద శ్లోకాలు
ఆదిశంకరుల మెళ్ళో రుద్రాక్షమాలలు
ఆమె విష్ణు సహస్రం
ఏడుకొండలవాడికి క్షీరాభిషేకం
ఆమె మీరా భజన్లు
గిరిధర గోపాలుడికి వెన్నముద్దలు...
*** *** ***
ఇవన్నీ కొన్ని మీగడ తరకలు. అంతే. ఇంకా
ఎన్.టీ.ఆర్
ఏ.ఎన్.ఆర్
ఎస్వీఆర్
రేలంగి
రమణారెడ్డి
సావిత్రి
భానుమతి
శ్రీశ్రీ
చలం
జంధ్యాల
వేటూరి
ఆరుద్ర
సినారే
సుశీల
ఘంటశాల
బాలు
చిరంజీవి....
ఇంకా ఎందరో....!
వీరిని గురించి రాసిన మొత్తం కవితో, వ్యాసమో చదివితీరాల్సిందే. ఎన్నని కోట్ చెయ్యను..?!
వంద పేజీల ఈ పుస్తకం వెల వంద రూపాయిలు.
దొరికేది "నవోదయా"లోనూ... "విశాలాంధ్ర"లోనూ.
ఉండాల్సింది మన పుస్తకాల గూట్లో.
*** *** *** ***
(తెలియనివారి కోసం)
అదివరకూ నేను కొన్ని టపాల్లో రాసిన తనికెళ్ళ భరణిగారి రచనల లింక్స్:
నాలోన శివుడు కలడు
ఆటగదరా శివా !!
పరికిణీ
july10th/2010 hindu న్యూస్ పేపర్ లో వచ్చిన భరణిగారి interview లింక్:
Saturday, January 8, 2011
వ్యాపారమైన ఆటకు కురుస్తున్న కోట్లు !!
"బోడి చదువులు వేస్టు నీ బుర్రంతా భోంచేస్తూ...ఆడి చూడు క్రికెట్టు టెండుల్కర్ అయ్యేటట్టు.." అని పదకొండేళ్ళ క్రితం సిరివెన్నెలగారు రాసారు ఓ పాటలో. అప్పుడేమనుకుని రాసారో కానీ ఇప్పుడు నిజంగా అలాగే పాడాలనిపిస్తోంది కురుస్తున్న కాసులవర్షాన్ని చూస్తూంటే. ఇవాళ సెట్ మాక్స్ ఛానల్ లో వచ్చిన IPL,2011 auction చూస్తే పదిటీముల్లోనూ స్థానం సంపాదించుకున్న ప్రతి అంతర్జాతీయ ఆటగాడూ గత జన్మలో అంతో ఇంతో పుణ్యం చేసుకుని ఉంటారు ఇవాళీ రోజున కోట్లు సంపాదించుకుంటున్నారు... అనిపించకమానదు. మన దేశంలో ఎవరు ప్రవేశపెట్టారో గానీ పల్లెటూరిలో పిల్లలను సైతం చైతన్యవంతులను చెయ్యగల శక్తి, క్రేజ్ ఈ ఆటకు ఉంది. ఇది మన జాతీయక్రీడ కాకపోయినా పసిపిల్లలు సైతం "ఈట్ క్రికెట్, డ్రింక్ క్రికెట్,స్లీప్ క్రికెట్" అంటారు. శెలవు రోజుల్లో బేట్ బాల్ పట్టుకున్న పిల్లలు కనిపించని వీధులను వేళ్లతో లెఖ్ఖపెట్టచ్చు మన దేశంలో. ఆ ఒక్క విషయంలోనూ యావత్ దేశం సమైక్యంగా ఉంటుంది.ఇక నాలుగేళ్లక్రితం వరకూ ఏ దేశం ఆటగాళ్ళు ఆ దేశంలోనే. ఎవరి ఆట వాళ్ళదే. టోర్నమెంట్లు వస్తేనే కలిసేవి ఈ ఆటాడే దేశాలన్నీ. కానీ సరదాకు ఆడే ఆటలను కూడా వ్యాపారం చెయ్యగల మేధస్సు మానవుడిది.
ఈ ఆటతో ఇప్పటికే చాలా మంది చాలానే గడించారు. అయినా దాహం తీరలేదు. మానవుడి మేధస్సుకి అందని ఆలోచన లేదు కాబట్టి నాలుగేళ్ల క్రితం ఒక బుర్రలో ఈ ఆలోచన తళుక్కుమంది. అంతే..బిగ్ గేమ్ విత్ బిగ్ మనీ, బిగ్గర్ ఎంటర్టైన్మెంట్, బిగ్గెస్ట్ బిజినెస్ అయిపోయింది క్రికెట్. వేలు కాదు, లక్షలు కాదు కోట్లతో వ్యాపారం. వివిధ దేశాల ఆటగాళ్లకు నోట్లకట్టలు చూపెట్టారు. డబ్బుకు లోకం దాసోహం అయ్యింది. ఒక ఆటగాని కోసం ఇవాళ టివీలో కోట్లు గుమ్మరిస్తున్న వేలంపాట చూసి నేనైతే "ఔరా" అనేసాను. వేలంపాట ఎంత రక్తిగా సాగిందంటే...మాటల్లో చెప్పలేను. టీం మెంబర్స్ సెలక్ట్ అయ్యేదాకా టీవీ ఛానల్స్, న్యూస్ రిపోర్టర్లు, ఇన్ఫర్మేషన్ ఇచ్చే వెబ్సైట్లు ఉత్కంఠతతో ఊపిరిబిగపట్టారు. గుండ్రని టేబుళ్ల చూట్టూ కూర్చున్న వ్యక్తులు ఈ వేలంపాటలో కోట్లతో చేసిన వ్యాపారాన్ని చూస్తే కళ్ళు తిరిగాయి. $2.4million, $ 2.1million, $ 1.9million, $1.8million...ఇలా సాగాయి ఫైనల్ రేట్లు..!!
ఎందుకొచ్చిన చదువులు? ఉద్యోగాలూ? అనిపించింది. IPL లో పాల్గొనే టీమ్స్ తెచ్చుకున్న మొత్తం సొమ్ము, ఖర్చు పెట్టిన సొమ్ము, వాళ్ళ వద్ద మిగిలిన సొమ్ము తాలూకూ లెఖ్ఖలు కార్యక్రమం చివరలో స్క్రీన్ పై వేసారు. base price, sold price మధ్యలో వేలంపాటు పెరుగుదల నాకు "సంత"ను గుర్తుచేసాయి. కాకపోతే ఇది రాయల్ సంత, మోడ్రన్ సంత. అంతే తేడా. ఏ సంత అయితేనేం.. కోట్లెవరికి చేదు? క్రితం ఏడాది జరిగిన IPL రచ్చ తెలియందెవరికి? అప్పుడే మళ్ళీ బరి సిధ్ధమైపోయింది. అయినా నా పిచ్చిగానీ డబ్బుతో కొట్టుకుపోయే అపకీర్తి పరువును పోగొడితే మాత్రం పట్టించుకునేదెవరు? జనం ఎంత వెర్రివాళ్ళు కాకపోతే జనాల సెంటిమెంట్లతో ఇలా కొన్ని కోట్ల మిలియన్లడాలర్ల వ్యాపారం చెయ్యగలుగుతారు వీళ్ళు అనిపించింది.
నేనూ ఒకప్పుడు విపరీతంగా క్రికెట్ చూసేదాన్ని. మా తమ్ముడు అంటించిన పిచ్చి అది. కాలేజీ రోజుల్లోని క్రేజీ హాబీల్లో ఒకటి. కానీ ఇప్పుడు మాత్రం చూడాలని అనిపించదు. ఒకసారి నాలుగైదు టోర్నమెంట్స్ వరుసగా ఓడిపోయారు మనవాళ్ళు, అప్పుడూ విపరీతంగా బాధపడిపోయాను. మనం రోజంతా పనులు మానుకుని, టివీకి కళ్ళప్పగించి చూస్తే వాళ్ళు ఓడిపోయి మనల్ని ఇంకా నిరాశపరచటం. మనమేమో ప్రపంచాన్ని కోల్పోయినట్లు రెండ్రోజులు దిగాలుపడిపోవటం. ఆడినవాళ్ళు, ఓడినవాళ్ళు బానే ఉంటారు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తాయి. జనాలు ఎత్తినప్పుడు గంతులేస్తారు. జనాలు తిట్టినప్పుడు చెవులు మూసుకుంటారు. ఓడినా గెలిచినా సంపాదన ఉంటుండి వాళ్లకి. మరి మనకీ? మాచ్ చూసిన టైమ్ వేస్టు, మనసుని దిగాలుపరుచుకుని మూడ్ పాడుచేసుకోవటం వల్ల ఓడిపోయారని బాధ, కోపం, ఉక్రోషం వల్ల మన ఎనర్జీ వేస్ట్. ఆ సమయంలో ఓ మంచి పుస్తకం చదువుకుంటే, ఓ మంచి పాటలు వింటే, ఉపయోగపడే పనులు చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. అప్పటినుంచీ ఇక క్రికెట్ చూడటం మానేసా. చూసినా లాస్ట్ ఓవర్ టైంకి టీవీ పెడితే ఫైనల్ రిజల్ట్ తెలిసిపోతుంది.
చూట్టూ చూస్తే వందకి తొంభై మంది ఆటపై ఇష్టం ఉన్నవాళ్ళే. మన దేశం ఆడకపోయినా, ఏ దేశం ఆడుతున్నా "క్రికెట్ క్రికెట్ కోసం చూడాలంటూ.." చూసేస్తాడు మా తమ్ముడు. ఇక మా ఇంట్లో అత్తగారి దగ్గర నుంచీ పనమ్మాయి దాకా అందరు ఈ ఆట చూసేవాళ్ళే. వయసుతోనూ, ఆటకు సంబంధించిన కనీస పరిజ్ఞానం పనిలేకూండా క్రికెట్ చూసేవాళ్ళు లక్షల్లోనే ఉన్నరు మన దేశంలో. "ఏమిటీ క్రికెట్ చూడవా?" అని నన్నొక వింత గ్రహాంతరవాసినో, వెర్రిబాగుల్దాన్నో చూసినట్టు చూసేవాళ్ళు కూడా ఉన్నారు. అయినా సరే నా నిర్ణయం నాదే. వాళ్ళు కోట్లు సంపాదించుకుంటే నాకేంటి? అంటాను నేను. ఓ పాట వింటేనో, పుస్తకం చదివితేనో, మంచి సినిమా చూస్తేనో కలిగే ఉల్లాసం, ఉత్సాహం నాకు ఆ ఆట చూస్తే రాదు మరి. "పుర్రెకో బుద్ధి..." అన్నారు అందుకే మరి.
IPL,2011 auction చరిత్ర, కబుర్లు, వివరాలు కావాలంటే ఈ లింక్ కు వెళ్లండి:
http://en.wikipedia.org/wiki/2011_Indian_Premier_League
----------------------------------------------
Note: ఈ టపాలోనివి కేవలం నా వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. క్రికెట్ ప్రేమికులని కించపరచటానికి ఎంతమాత్రం కాదని మనవి.
Thursday, January 6, 2011
తోటయ్య
పని మీద బయటకు వెళ్ళివస్తున్న నాకు మా సందు మొదట్లో సైకిల్ మీద భుజానికి కొబ్బరితాడుతోనో దేనితోనో తయారుచేసిన గుండ్రని బంధాలు రెండు తగిలించుకుని, నడుంకి కత్తి కట్టుకుని వెళ్తున్న ఒక వ్యక్తిని చూడగానే "తోటయ్య" గుర్తుకొచ్చాడు. కాకపోతే సైకిల్ అబ్బాయి సైకిల్కు కుండ కూడా వేళ్ళాడుతోంది. కాబట్టి ఇతను తాడిచెట్టో, ఈతచెట్టో ఎక్కి కల్లు తీసే మనిషై ఉంటాడు. మా తోటయ్య మత్రం కొబ్బరికాయలు తీసిపెట్టేవాడు. ఆ అవతారాన్ని పరికరాల్నీ చూడగానే నాకు "తోటయ్య" గుర్తుకొచ్చాడు. జీవితంలో అనుబంధం లేకపోయినా ఏళ్లతరబడి చూసిన కొందరు వ్యక్తులు అలా గుర్తుండిపోతారు.
కాకినాడలో మా ఇంటికి వెళ్ళినప్పుడల్లా నేను తరచూ చూస్తూండేదాన్ని తోటయ్యని. సన్నగా నల్లగా తలపాగాతో, పాతబడి నలిగి మాసిన తెల్ల పంచెతో ఓ పాత డొక్కు సైకిల్ మీద వస్తూండేవాడు. మేం వెళ్పోయే ముందు రోజు మా నాన్నమ్మ అతనికి కబురు పంపేది. "పాపగారూ, ఎప్పుడు వచ్చారు?" అని పలకరించేవాడు. అతను నవ్వగానే గారపట్టి అక్కడక్కడ ఊడిన పలువరస కనబడేది. కాస్త దగ్గరగా వెళ్తే చుట్ట కంపు కొట్టేది. మా దొడ్లో మూడు కొబ్బరు చెట్లు ఉండేవి. ఆ ఇల్లు అమ్మేదాకా మేం బయట కొబ్బరికాయలు కొని ఎరుగం. ఆ తరువాత చాలా రోజులు బయట కొట్లో కొబ్బరికాయ కొనటానికి మనసొప్పేది కాదు. ప్రతిసారీ మా సామానుతో పాటూ కొబ్బరికాయలతో నిండిన పెద్ద సంచీ కూడా మాతో ప్రయాణం చేసేది సర్కార్ ఎక్స్ ప్రెస్ లో.
ఇంతకీ తోటయ్య సందులోంచి దొడ్లోకి వస్తూనే వేషం వేసేసుకునేవాడు. చొక్కా తీసేసి, పంచె కాళ్లకూ, నడుంకీ బంధాలు తగిలించుకుని(కొబ్బరిపీచుతోనో దేనితోనో చేస్తారేమో మరి..వాటిని బంధాలని అనేవారు) చెట్టు ఎక్కటం మొదలెట్టేవాడు. పైన ఫోటోలో మనిషి కాళ్ళకి వేసుకున్నలాంటిదే ఇంకా మందంగా ఉన్నవి భుజాన తెచ్చుకుని, ఒకటి నడుముకీ, ఒకటి కాళ్ళకీ వేసుకుని కొబ్బరిచెట్టేక్కేవాడు మా తోటయ్య. స్పైడర్ మేన్ లాగ చెక చెకా చెట్లు ఎక్కుతున్న అతన్ని వింతగా చూసేవాళ్లం ఎక్కిన ప్రతిసారీ. "లోపలికి వెళ్లండి కాయలు మీద పడతాయి" అని నాన్నమ్మ కసురుతూంటే దొడ్డిగుమ్మం కటకటాలు దగ్గర నిలబడి చూస్తూండేవాళ్లం. పడిపోకుండా అలా ఎలా ఎక్కుతాడు? అని భలే ఆశ్చర్యం వేసేది. "ఇలా ఎక్కటం ఎక్కడ నేర్చుకున్నావు తోటయ్యా?" అని అడిగితే "భలేవారే పాపగారు" అని నవ్వేసేవాడు. మేం పెద్దయ్యాకా కూడా వెళ్ళినప్పుడల్లా కొబ్బరికాయలు దింపేవాడు తోటయ్య. పెద్దరికం మీదపడిన ఆనవాళ్ళు, ముడతలు బడిన చర్మం, మరింత సన్నబడిన శరీరం...ఎలా ఉన్నా ఎప్పుడూ అదే స్పీడ్, మార్పు లేని ఆ ఎక్కే పద్ధతి నన్ను అబ్బురపరిచేవి.
ఎన్ని మార్లు కాయలు ఉంటాయి? పనేం లేదు.వెళ్పో...అస్తమానూ వచ్చేస్తున్నాడు డబ్బులు వస్తాయి కదా అని ఒకోసారి నాన్నమ్మ విసుక్కునేది. అయినా వెళ్పోకుండా డొక్కలేమన్నా కొట్టాలేమో చూడండి...అనేవాడు. ఎండిన మట్టలు అవీ కొట్టించి, దొడ్లో ఇంకేమన్నా పని ఉంటే చేయించుకుని పాత చొక్కాలూ,పాంట్లూ, నాలుగు డబ్బులిచ్చి పంపేసేది నాన్నమ్మ. పోనీలే పాపం అని నేను తృప్తి పడేదాన్ని. ఖాళీ చేతులతో అతన్ని పంపటం నాకేకాదు నాన్నమ్మకీ నచ్చేది కాదు. వేసంకాలం శెలవుల్లో అయితే బొండాలు దింపి పెట్టేవాడు. చివర చివరలో చూపు సరిగ్గా ఆనేది కాదు. అయినా వచ్చేవాడు. కాయలు కోసేవాడు. అప్పటికే పెద్దవాడు.. తోటయ్య ఇప్పుడు ఈ భూమి మీద లేడేమో కూడా...! రోడ్డుపై ఇలా భుజాన బంధాలు తగిలించుకుని, నడుంకి కత్తి కట్టుకుని వెళ్ళే ఎవర్ని చూసినా తోటయ్యే గుర్తుకొస్తాడు...ఇవాళ్టిలాగే.
ఇలా కాకినాడతో అనుబంధం గుర్తుచేసే వ్యక్తుల గుర్తించి చెప్పాలంటే ఎందరో ఉన్నారు. సామర్లకోట నుంచి ప్రతి నెలా పప్పునూనె తెచ్చిపెట్టే అబ్బాయి, రోజూ సైకిల్ బండి మీద కూరలు తెచ్చి రోజూ దెబ్బలాడుతూనే కూరలు ఇచ్చివెళ్ళే కూరలబ్బాయి, ఆ ఇల్లు కొన్నప్పటినుంచీ, మేం పుట్టి పెరిగి పెళ్ళిళ్ళయి, మళ్ళీ ఆ ఇల్లు అమ్మేదాకా మా ఇంట్లో పని చేసిన పనమ్మాయి లక్ష్మి, ఏ కరంట్ రిపేరు పనులొచ్చినా వచ్చే ఆస్థాన కరంటబ్బాయి...ఎందరో..!!
ఈ క్రింద వీడియోలో కొబ్బరిచెట్టేక్కుతున్న మనిషిని చూడండి.
"ఎగిరిపోతే ఎంత బావుంటుందీ..." పాట మాతృక
ప్రేమించి చూడులో "అది ఒక ఇదిలే" పాట "Bésame Mucho" అనే Spanish song నుంచి ఇస్పైర్ అయ్యింది.
ఇద్దరు మిత్రులు లో "హలో హలో ఓ అమ్మాయి" పాట "Ya Mustafa", అనే famous Egyptian song నుంచి,
చిట్టి చెల్లెలు లో "ఈ రేయి తీయనిది" పాట "love is blue" song music నుంచీ,
ఆత్మీయులు సినిమాలో "మదిలో వీణలు మ్రోగే" పాట ముందరి ఆలాపన Cliff richards పాడిన "ever green trees" -నుంచి ఇన్స్పైర్ అయ్యింది.
ఇలా పాశ్చాత్య బాణీల నుంచే కాక కొన్ని హిందీ పాటల నుంచి తెలుగుకు, తెలుగు పాటల నుంచీ హిందీ పాటలకూ కూడా ఎగుమతి అయిన బాణీలు ఉన్నాయి. పాత పాటలు వింటూంటే మరెన్నో పాటలు గుర్తుకు వస్తూంటాయి. అలానే ఈ మధ్యన ఒక కొత్త తెలుగు పాటకు మాతృక కనుక్కున్నా నేను. క్లారినేట్ మీద వాయించిన సిని గీతాల కేసెట్ వింటూంటే ఈ పాట వచ్చింది. ఇదేదో తెలుసున్న పాటలా ఉందే అని మళ్ళీ వెనక్కి తిప్పి వినే సరికీ అసలు పాట గుర్తువచ్చింది. అదేమిటంతే "వేదం" చిత్రానికి కీరవాణి గారు స్వరపరిచిన "ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ..". ఈ పాట పల్లవి మటుక్కే ఇన్పైర్ అయ్యింది. మీరూ ఓ సారి వినేయండి ఇక్కడ:http://ww.smashits.com/music/artists/play/songs/9769/t-g-m-parvez-mehdi-toot-jaye-na-bharam/80755/RESHMI-SALWAR-KURTA-JALI-KA-INSTRUMENTAL.html
ఈ పాట "రేష్మీ సల్వార్ కుర్తా జాలీ కా.." అని "నయా దౌర్" సినిమా లోది. ఇక్కడ ఉన్న లింక్ ఆ పాటకు క్లారినేట్ మీద "మాష్టర్ ఇబ్రహిం" వాయించారు. ఈ పాట పల్లవి వినగానే మీకు "ఎగిరిపోతే.." పాట గురువచ్చేస్తుంది.
Wednesday, January 5, 2011
మణిరత్నం మొదటి చిత్రం
"పల్లవి అనుపల్లవి"...మణిరత్నం మొదటి చిత్రం. నాకిష్టమైన దర్శకుల్లో ఒకరు. ఈ దర్శకుడి చిత్రాలన్నీ దాదాపు చూసేసాను. ఒక్క "రావణుడ్నే" భయపడి చూడలేదు. చూడాలనిపించలేదు. ఎప్పుడో టివీలో చూసిన ఈ దర్శకుడి మొదటి చిత్రం నాకు నచ్చిన చిత్రాల్లో ఒకటి. ఈ చిత్రాన్ని గురించి నాకు నచ్చిన సినిమాకబుర్లు రాసుకునే బ్లాగ్ (http://maacinemapegi.blogspot.com/ )లో రాసాను. ఆ బ్లాగ్ తెలియనివాళ్ళు అక్కడ ఓ లుక్కేయండి... http://maacinemapegi.blogspot.com/2011/01/1983.html
పల్లవి అనుపల్లవి(1983) - మణిరత్నం మొదటి చిత్రం
కొన్నేళ్ళక్రితం అన్నయ్య కొత్తగా ఐడియా మొబైల్ కొనుకున్నప్పుడు ఫోన్ చేయండని నంబర్ చెప్పాడు. రింగ్ చెయ్యగానే ఐడియా మొబైల్ వాళ్ళ Ad theme music వినబడింది..."9..8...tararaa..." అంటూ విన్పించిన ఆ మ్యూజిక్ ఎక్కడో విన్నట్టు అనిపించింది. రెండు రోజులు బుర్ర బద్దలుచేసుకున్నాకా గుర్తువచ్చింది...అదీ మణిరత్నం మొదటి సినిమా "పల్లవి అనుపల్లవి" సినిమాలోని పాట తాలూకూ మ్యూజిక్ అని. వెంఠనే అన్నయ్యకు ఫోన్ చేసి చెప్పా. వాడు ఇళయరాజాకు ప్రరమ భక్తుడు. ఆ తరువాత తెలిసిన కథ ఏమిటంటే ఐడియా మొబైల్ ఏడ్స్ డైరెక్ట్ చేసిన బాలకృష్ణన్(చీనీ కం, పా దర్శకుడు)కూడా ఇళయరాజా అభిమానేట. ఇళయ్ అనుమతి తీసుకుని ఆ ఏడ్ లో ఆ ట్యూన్ వాడుకున్నారట. నాకు చాలా ఇష్టమైన పాటల్లో ఒకటైన ఆ పాట ఇదే --
"కనులు కనులు కలిసే సమయం
మనసు మనసు చేసే స్నేహం.."
1983లో కన్నడంలో మణిరత్నం మొదటిసారి దర్శకుడి పాత్ర వహించిన సినిమా "ಪಲ್ಲವಿ ಅನುಪಲ್ಲವಿ". రచన, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మణిరత్నమే. తరువాత ఈ సినిమాను తమిళంలోనూ, తెలుగులోనూ డబ్బింగ్ చేసారు. ఈ సినిమాకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఈ సినిమాలో హీరో. "వంశవృక్షం" తరువాత ఆయన నటించిన మరో ప్రాంతీయ భాషా చిత్రం. ప్రఖ్యాత దర్శకుడు "బాలూ మహేంద్ర" ఈ సినిమకు సినిమాటోగ్రాఫర్. కథ కూడా ఒక అసాధరణమైన కథ. ఈసినిమాకి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుంచి మణిరత్నం "బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డ్" అందుకున్నాడు. పాట గురించి ఇందాకా చెప్పేసాను. ఇక ఇళయరాజా అందించిన సంగీతం గురించి ఎంత చెప్పినా తనివితీరదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే అద్భుతం. ఈ మ్యూజిక్ వినండి మీకే తెలుస్తుంది..
ఈ సినిమా అందమంతా ఈ సంగీతం లోనే ఉంది. పాటలు ఒరిజినల్ వి బాగుంటాయి. తెలుగులో డబ్బింగ్ కాబట్టి అంత ప్రాముఖ్యాన్ని పొందలేకపోయాయేమో. ముఖ్యంగా నేపథ్యసంగీతం మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.
స్త్రీ మనసు లోతుల్ని మగవాడు ఎప్పటికీ సరిగ్గా అర్ధం చేసుకోలేడేమో అన్న పాయింట్ ని నిజం చేస్తుంది ఈ చిత్ర కథ. కథలో అనిల్ కపూర్, లక్ష్మి, కిరణ్ వైరలే(ఈమె సాగర్, అర్థ్, ప్రేమ్ రోగ్, సాథ్ సాథ్, నమ్కీన్, నరమ్ గరమ్ మొదలైన హిందీ సినిమాల్లో నటించారు) ముఖ్య ప్రాత్రలు. సినిమా కథలోకి వెళ్తే విజయ్,మధు ప్రేమికులు. ఉద్యోగరీత్యా వేరే ఊరు వెళ్ళిన విజయ్ కు అను పరిచయమౌతుంది. భర్త నుంచి విడిపోయి ఉంటున్న అనుకి ఒక ఏడేనిమిదేళ్ల కొడుకు ఉంటాడు. విజయ్ కీ, అను కొడుకు కూ మంచి స్నేహం ఏర్పడుతుంది. అదే స్నేహం అనూతో కూడా ఏర్పడుతుంది. అందమైన అనుబంధంగా మారుతుంది. కానీ అది చిన్న ఊరు కావటంతో ఊళ్ళో జనాలు వీరిద్దరి స్నేహాన్నీ అపార్ధం చేసుకుంటారు. ఒకానొక ఉత్తేజకరమైన పరిస్థితుల్లో ఊరందరి ముందూ ఆమె ఒప్పుకుంటే ఆమెను పెళ్ళి చేసుకుంటానంటాడు విజయ్.
అదే సమయంలో విజయ్ కోసం ఆ ఊరు వచ్చిన మధు ఆ మాటలు విని మనసు చెదిరి వెళ్పోతుంది. అలాంటి తెలివితక్కువ స్టేట్మెంట్ ఇచ్చినందుకు అనూ విజయ్ ను బాగా కోప్పడుతుంది. తన భర్తను ఇంకా ప్రేమిస్తున్నాన్నీ, విజయ్ లో ఒక మంచి స్నేహితుణ్ణి మాత్రమే చూసాననీ అనూ చెబుతుంది. వాళ్ల స్నేహం ముగిసిపోతుందా? విజయ్ మధుని మళ్లీ కలిసాడా? వారిద్దరు ప్రేమా ఏమౌతుంది? అను సంగతి ఏమైంది? అన్నది మిగిలిన కథ.
కథలో మనకు బాగా నచ్చేది అనూ పాత్ర అని వేరేచెప్పఖ్ఖర్లేదు. ఒక స్వచ్ఛమైన స్నేహాన్ని స్నేహంలా చూడలేని కథానాయకుడి కన్ఫ్యూజింగ్ స్టేట్ ఆఫ్ మైండ్ ను చూస్తే జాలి వేస్తుంది. అతని భావం అలా మారకుండా అనూని మంచి స్నేహితురాల్లా ఎందుకు చూడలేదూ? అనూ గొడవలో పడి తనకోసమే ఎదురుచూస్తున్న ప్రేమికురాలి సంగతి ఎలా మర్చిపోగలడు? అని అతనిపై కోపం వస్తుంది. అనిల్ కపూర్ నాకు బాగా ఇష్టమైన హీరోల్లో ఒకరు. కాబట్టి ఆయన నటన గురించి చెప్పేదేముంది? లక్ష్మి సహజ నటన ఎప్పటిలానే ప్రశంసలు అందుకుంటుంది. ప్రేమికురాలు పాత్రలో కిరణ్ వైరలే కూడా మంచి నటన కనబరుస్తారు సినిమాలో. లక్ష్మి కొడుకుగా వేసిన చిన్న పిల్లవాడు భలే ముద్దుగా ఉంటాడు.
చిన్నప్పుడెప్పుడో టివీలో వచ్చినప్పుడు చూసిన సినిమా. ఇంతకంటే గుర్తు లేదు. కానీ ఒక్కసారి చూసినందుకూ, మణిరత్నం మొదటి సినిమా అనీనూ నాకు బాగా గుర్తుండిపోయింది. చాలా రోజుల్నుంచీ ఈ సినిమ గురించి రాయాలని గుర్తున్నంతవరకూ రాసేసా..:) యూట్యూబ్లో లక్కీగా పాటలు దొరికాయి. సినిమా సీడీ అయినా డివీడీ అయినా దొరుకుతుందేమో కనొక్కోవాలి.
Tuesday, January 4, 2011
మరో మంచి ఇండోర్ ప్లాంట్ (నిన్నటి టపాలోని మొక్క గురించి)
నిన్న పెట్టిన "ఇదేం మొక్కో చెప్పుకోగలరా?" టపాకు ఆరు వ్యాఖ్యలు వచ్చాయి. రాసిన అందరికీ బోలెడు థాంక్స్ లు. అందులో ఇద్దరు(సూర్యుడు గారు, స్నేహ గారు) కరెక్ట్ గా రాసారు. అది potato మొక్క. పైన ఫోటోలో దుంప కనబడుతోంది చూడండీ...
మా చిన్నప్పుడు ఒకసారి ఓ బంగాళాదుంపకు బాగా మొలకలు వచ్చేసాయని మట్టిలో పాతిపెట్టాం. అది పెరిగి అందమైన మొక్కగా తయారైంది. బాగా పొడుకు అయిపోతే నాన్న నాలుగు పుల్లలతో చిన్నపాటి పందిరి కూడా కట్టారు వంగిపోకుండా. కొన్నాళ్ళకు మొక్క ఎండిపోయింది. తవ్వితే క్రిందన చిన్న చిన్నవి నాలుగైదు బంగాళాదుంపలు ఉన్నాయి. ఎంతో అపురూపంగా ఆ బుజ్జి బుజ్జి దుంపలను ఉడకపెట్టుకుని తిన్నాం. ఇది చిన్ననాటి ఊసు.
అలానే మొన్నొకరోజు ట్రేలోని ఓ బంగాళాదుంపకి బాగా మొలకలు వచ్చేసాయి. ఎందులో పాతుదాం అని ఆలోచిస్తూంటే, బీట తీసినా పడేయలేక దాచిఉంచిన ఒక 'అన్ బ్రేకబుల్ డిష్' కనపడింది. వెంఠనే మట్టివేసి potato పాతేసాను. చల్లదనం వల్ల ఓ వారానికి బాగా ఏపుగా పెరిగింది. మరో వారానికి ఇదిగో పైన ఫోటోలోలా అయ్యింది. ఇండోర్ ప్లాంట్ లాగ చక్కగా ఇంట్లో ఏదో ఓ చోట పెట్టుకుంటే ఎంతబాగుంటుందో కదా అని ఐడియా వచ్చింది. మీరూ వేసి చూడండి. చలికాలం కాబట్టి ఇప్పుడే బాగా పెరుగుతుంది. మొక్క పెరిగాకా ఇంట్లో పెట్టినా అప్పుడప్పుడు ఎండలో పెట్టడం మర్చిపోకండేం...:)
గతంలో ఒకసారి చిలకడ దుంపతో అందమైన ఇండోర్ ప్లాంట్ ఎలా తయారౌతుందో రాసాను. ఆ టపా తర్వాత నుంచీ రెగులర్గా మీ బ్లాగ్ చదువుతున్నాం అని కొందరు రాసారు కూడా.
Monday, January 3, 2011
Sunday, January 2, 2011
మరో దశాబ్దపు మొదటిరోజు
రంగులు దిద్దుతున్న మా "ముగ్గుగుమ్మ" |
దశాబ్దపు మొదటిరోజు అయితే ఏమన్నా కొమ్ములుంటాయా? ఏమీ ఉండవు. అదీ ఒక మామూలు రోజే...it's just an other day...another day !! కానీ నేను మాత్రం bryan adams "Here I am - this is me" పాట గుర్తొచ్చి "It's a new day - it's a new plan ... It's a new world ... it's a new start ..." అని పాడుకున్నా !! ఎందుకంటే మనిషి ఆశాజీవి. నిన్న నిరాశను మిగిల్చినా రేపు బాగుంటుందేమోని అని ఆశ పడతాడు మనిషి. ఈ ఆశ లేకపోతే కొత్త ఉదయాలను చూడటం కష్టం. కొత్త కేలండర్లతో అలాంటి ఆశలు రేపేకొత్త సంవత్సరం అంటే నాకు ఇష్టం. మామూలుగానే గడచిపోవచ్చు..మరో ఏటికి ఇది just another year అయిపోవచ్చు. కానీ ప్రస్తుతానికి it's a new start.
చాలాసందర్భాల్లో నేను మారిపోయాననుకుంటూ ఉంటాను...కానీ మనిషిలో ఆలోచనకు మార్పు వస్తుంది కానీ బేసిక్ స్వభావం ఏదైతే ఉందో అది అరిచి గీపెట్టినా మారదు. గ్రీటీంగ్స్ తయారు చేసి పోస్ట్ చేసేరోజులు పోయాయి కాబట్టి ఎప్పటిలానే రెండ్రోజుల ముందరే (అందరికన్నా ముందు విషస్ చెప్పాలనే అజ్ఞానపు తాపత్రయం) మైల్ బాక్స్ లో ఉన్న ఎడ్రస్లన్నింటికీ న్యూ ఇయర్ గ్రీటింగ్స్ పంపించాను. ఎప్పటిలానే మావారూ నవ్వారు.."వీళ్ళలో సగం మంది కూడా తిరిగి జవాబివ్వారు. ఎందుకు పంపిస్తావు?" అని. ఒక విష్ పంపినందువల్ల తప్పేముంది? కొట్టరు కదా. "Be aware that your kindness may be treated as your weakness...but still be kind" అన్నరు స్వామి. నా అలవాటునాది. ఓపిక, వీలు ఉన్నన్నాళ్ళు పంపిస్తాను. అంతే.
కౌన్ట్ డౌన్ లెఖ్ఖపెట్టుకుంటూ టీవీ చానల్స్ తిప్పుతూ కూచునే రోజులు పోయి నాలుగైదేళ్ళు అయ్యింది. చిన్నప్పుడు, పెద్దయ్యాకా కూడా హడావుడి పడిపోయి ప్రోగ్రామ్స్ మొదలెయ్యేలోపూ బయట న్యూ ఇయర్ ముగ్గు పూర్తి చేసేసి, టివీ ముందుకి చేరిన రోజుల్ని, పన్నెండవ్వగానే లైన్స్ కలవవని ఓ అరగంట ముందుగానే స్నేహితులకీ, బంధువులకీ ఫోన్లు చేసిన క్షణాల్ని తలుచుకుంటే నవ్వు వస్తుంది ఇప్పుడు. ముగ్గు వెయ్యటం మాత్రం ఇప్పటికీ మానలేదు నేను. ఈసారి నా న్యూ ఇయర్ ముగ్గు వేస్తూండగానే మొదలయ్యింది. ఆ నిశ్శబ్దంలో నేనూ, చీకటిలో ఓపిగ్గా తోడు నించున్న తనూ ఇద్దరమే ఒకరికొకరం విషెస్ చెప్పుకున్నాం. పేచీపెట్టి రంగులు కొనిపించుకుని తానే రంగులు మా పాప వేస్తానని మరీ మరీ చెప్పటం వల్ల ముగ్గు మాత్రం వేసి ఊరుకున్నా. పొద్దున్నే లేచి రంగులు ప్లేట్లో పెట్టుకుని పాప ముగ్గుకి రంగులు దిద్దుతూంటే "ముగ్గు గుమ్మ" అనుకున్నా. నా వారసత్వాన్ని,అభిరుచుల్నీ అన్నివిధాలా కాపాడుతుంది అనిపించే నా బంగారాన్ని చూస్తే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
ఇక పొద్దున్నే పనులన్నీ అయ్యాకా నేను చేసిన మంచి పని ఏమిటంటే ఫోన్ నంబర్ల బుక్ దగ్గర పెట్టుకుని అందరు మిత్రులకీ ఫోన్లు చేయటం. ఇది గత కొన్నేళ్ళుగా నేను మానేసిన పని. కొందరి లైన్లు కలవలేదు. కొందరు పలికారు. నాతో ఇంగ్లీష్ ఎంఏ చదువుకున్న ఒక పాత స్నేహితురాలు లైన్ దొరికింది. ఇప్పుడు బొంబాయిలో ఉన్నారుట. ఇద్దరు అబ్బాయిలు. బోలెడు జ్ఞాపకాలు నెమరేసుకున్నాం. మళ్ళీ ఫోన్ చేస్తాలే అన్నా. "నువ్వు ఉత్తరాలు బాగా రాస్తావు. మళ్ళీ నీ ఉత్తరం చదవాలని ఉంది. ఈ ఎడ్రస్ కి ఉత్తరం రాయవే" అని పోస్టల్ ఎడ్రస్ ఇచ్చింది. దాదాపు మూడునాలుగేళ్ళ క్రితాం దాకా ఏ ఊరు మారినా తనకు లెటర్స్ రాస్తూనే ఉండేదాన్ని. లెటర్ పాడ్స్, స్టాంపులు, రంగురంగుల ఎన్వలాప్ కవర్లు... గత జన్మేమో అనిపిస్తాయి ఆ జ్ఞాపకాలు.
ఆ తరువాత మైల్ బాక్స్ తెరిచాను ఎవరన్నా జవాబులు రాసారేమో అని. కొందరు రాసారు. ఒక కాలేజీ మిత్రురాలు డిగ్రీ క్లాస్మేట్స్ కొందరు కలిసారనీ వివరాలు అవీ రాసింది. ఆశ్చర్యంగా కొన్ని పేర్లు నాకు గుర్తుకు రాలేదు. నాక్కూడా మరపు వచ్చేస్తోంది అని అర్ధమైంది. లేకపోతే నేను ఏదన్నా మర్చిపోవటమా? ఎంఏ ప్రెండ్ చెప్పిన కొన్ని వార్తలు, ఇప్పుడీ స్నేహితురాలు రాసిన కొన్ని విషయాలు చాలా బాధాకరమైనవి ఉన్నాయి. న్యూ ఇయర్ పూటా ఇలాంటి వార్తలేమిటీ అనుకున్నాను... కానీ నాకు ఒక సంగతి అర్ధమైంది. బహుశా దేవుడు నాకు పెద్ద గీత చూపిస్తున్నడేమో అని. పెద్ద గీత ముందు చిన్న గీత ఎప్పుడూ చిన్నదిగానే ఉంటుంది కదా. గతించిన కాలంలో నీపై రోకలి పోటు పడకుండా సుత్తి దెబ్బతో సరిపెట్టాను అని దేవుడు చెప్తున్నాడన్న మాట అనుకున్నాను.
విజయవాడలో పుస్తక ప్రదర్శన మొదలు. పధ్నాలుగేళ్ళు పాటు విడువకుండా వెళ్ళాను. వీలవదు కానీ ప్రతి ఒకటవ తారీఖున వెళ్ళాలని మనసు కొట్టుకుంటుంది. ఇంకా...బయట అమ్మొచ్చిన మొక్కలబ్బాయిని పిలిచేసి, నన్ను బయటకు పిలిచేసి నాతో చేమంతి మొక్కలు కొనిపించేసింది మా చిన్నారి.బయటకు వెళ్ళి వస్తూంటే దారిలో పండగకు ముగ్గు వెయ్యటానికి అని మరో ఐదారు రంగుల పేకెట్లు వాళ్ళ నాన్నతో కొనిపించేసుకుంది. మరోసారి పుత్రికోత్సాహం పెల్లుబికింది. మిగిలిన దినచర్య మామూలే.. కొత్త సంవత్సరం అని పొద్దుపోక మానుతుందా? వెలుతురు నిశీధిగా మారింది. రాత్రి గడిచి మరో ఉదయం ప్రారంభమైంది...ఎన్నో సత్యాలను కళ్ల ముందు ఉంచిన ఈ దశాబ్దపు మొదటి రోజు ఇలా గడిచింది.
మరొక ఉదయం
మరొక రేపు
మరొక చిరునవ్వు
మరొక వసంతం
మరొక హేమంతం
మరొక సంవత్సరం...మళ్ళీ మొదలు !!