సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, November 19, 2009

విశాలనేత్రాలు

పిలకా గణపతి శాస్త్రిగారు సంస్కృతం,తెలుగు, ఆంగ్లం, హిందీ భాషలలో పండితులు. కధకులు.నవలా రచయిత. అనువాదకులు. పత్రికా సంపాదకులు. ఆయన రచించిన "విశాల నేత్రాలు" ఆంధ్రపత్రికలో 1965,66ప్రాంతాల్లో బాపూగారి మనోహర చిత్రాలతో ధారావాహికంగా వెలువడింది. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ నవలా బహుమతి లభించింది. చారిత్రాత్మక నవలను "లైఫ్ ఆఫ్ రామానుజ" అనే ఆంగ్ల గ్రంధం, మరికొన్ని సంస్కృత,ఆంగ్ల గ్రంధాలను పరిశీలించి రచించినట్లు "ముందు మాట"లో గణపతి శాస్త్రిగారు చెప్తారు. నాకెంతో ప్రియమైన నవలల్లో ఇది ఒకటి.

నవల కధాంశం మనిషి జీవితంలోని మూడు ప్రధానాంశాల చుట్టూ తిరగాడుతుంది...ప్రేమ, భక్తి, ఆధ్యాత్మికత. ప్రేమలోంచి భక్తిమార్గంలోకి, ఆపై ఆధ్యాత్మికంగా పయనంగా సాగే రంగనాయకుని జీవితకధ నాకెందుకనో అత్యంత సన్నిహితమైపోయింది. నవలలో నాయికా నాయకులు సరళ స్వభావులైన హేమసుందరీ రంగనాయకులు. లోకం దృష్టిలో సచ్చరిత్రులు కాకపోయినా, వారిద్దరికీ ఒకరిపై ఒకరికి గల తీవ్ర పరస్పరానురాగమే వారిద్దరికీ రామానుజులచే అనాయాసంగా అష్టాక్షరి మంత్రోపదేశం పొందే అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. "లివ్ఇన్ రెలేషన్ షిప్స్" అంటూ మెట్రో నగరాల్లో, పట్టణాల్లో కుర్రకారు మోజు చూపుతున్న వివాహ వ్యతిరేక స్వేచ్ఛాజీవన విధానాన్ని ఎప్పుడో 1965 ప్రాంతంలోనే "పిలకా గణపతి శాస్త్రి గారు "విశాల నేత్రాలు" నవలలో ప్రధానాంశంగా స్పృశించారా అనిపిస్తుంది..

క్రీస్తుశకం 11 శతాబ్ది ఉత్తరార్ధంలో, దక్షిణ భారతంలో, ద్రవిడదేశంలో కాంచీరాజ్యం న్యాయమైన ప్రజాపాలనలో ప్రసిధ్ధి కెక్కింది. రాజ్యం లోని నిచుళానగరం నవలికకు పూర్వరంగం. నిచుళానగరంలో శృంగారమంజరి సౌధం తెలియనివారుండరు. ఆమె వద్ద అక్కచెల్లెళ్ళలా పెరిగిన మాణిక్యవల్లి, హేమసుందరి ఆమె కన్న కుమార్తెలు కాదు. వారిద్దరిని ఆమె చిన్నతనం నుంచీ పెంచి పెద్ద చేస్తుంది. వారిద్దరికీ కాంచీరాజ్యంలో ప్రసిధ్ధికెక్కిన నృత్యాచార్యుల వద్ద నృత్యం, వీణా వేణు మృదంగాలలో, గాత్ర సంగీతాలలో చక్కని నైపుణ్యాన్ని నేర్పిస్తుంది. అయితే ఇద్దరిలోనూ ఇంచుమించుగా ఇరవై నిండిన హేమసుందరి అందంలో మిన్న. పైడిబొమ్మ లాంటి హేమసుందరిని ఎవరైనా ఒక మహారాజు ఒద్దికలో ఉంచాలని, వందల కొద్దీ సువర్ణ నాణాలు గుమ్మరింపించుకోవాలని శృంగారమంజరి ఉవ్విళ్ళూరుతుంది.

అయితే కధనం ప్రకారం ఒక ఏడాది క్రితం హేమసుందరికి, రంగనాయకునికి గోపాలస్వామి కల్యాణమహోత్సవంలో పరిచయం కలుగుతుంది. కర్ణాభరణాలవరకూ విస్తరించిన హేమసుందరి విశాల విలోచన యుగళికి దాసుడౌతాడు రంగనాయకుడు. పై వారిద్దరికీ ఒకరిఎడలొకరికి ప్రగాఢమైన అనురక్తి ఏర్పడుతుంది. రంగనాయకుడు నిచుళాపురం పొలిమెరలో నివసిస్తున్న వెంకటనాయకుని కనిష్ఠపుత్రుడు. తండ్రి చిన్న భూస్వామి.పెద్దగా ఆస్థిపాస్తులు ఏవీ లేనివాడు. అతని అన్నలిద్దరూ తండ్రితో పాటే వ్యవసాయం చేసుకుంటూంటారు. సాముగారడీలో ఆరితేరిన రంగనాయకుడు ఇరవై ఐదో ఏడు కూడా నిండని యువకుడు. కండలు తిరిగిన బలిష్థ దేహంతో, విశాలమైన నుదురు,కొనలు తిరిగిన కనుదోయితో, చక్కటి శరిరచ్ఛాయతో ఎంతటి నెరజాణనయినా ఇట్టే ఆకర్షించగల రూపమాతనిది. పొద్దస్తమానం సాముగారడీలే ఆతని ఆరాధ్యదైవాలు.

ఒకానొకరోజు రాత్రిపూట ఆమెను కలవటానికి శృంగారమంజరి భవంతిలోకి దొంగతనంగా అడుగుపెడతాడు. సుందరి విశాల నేత్రాల లోతులలో మునిగి బాహ్యప్రపంచాన్ని విస్మరిస్తాడు...మైమరపులో కావలివాళ్ల కంట పడతాడు. కానీ చాకచక్యంతో నలుగురు పరిచారకులకు దేహశుధ్ధి చేసి చీకట్లో తప్పించుకుంటాడు రంగనాయకుడు. గొడవ చిలికి చిలికి గాలివానై నగరమంతా పెద్ద దుమారాన్ని రేపుతుంది. రంగనాయకుని సాహసం నోటా నొటా హేమసుందరిని దక్కించుకోవాలనుకునే తిరుమలరెడ్డికీ, పట్టణ తలవరికీ తెలిసి, అది రంగనాయకుని ఇంట కూడా పొక్కి పెద్ద రభసగా మారుతుంది. అతను కావాలనుకునే సొత్తు దొరకదేమోనన్న ఉక్రోషం తిరుమలరెడ్డి అతనిపై హత్యాప్రయత్నం చేయించటానికి ఉసిగొల్పుతుంది. తండ్రి నిరాదరణ, తరువాత జరిగిన కొన్ని సంఘటనలు, అడుగడుగునా ఎదురౌతున్న ఆటంకాల నేపధ్యంలో ఊరినుంచి పారిపోవాలనే నిర్ణయానికి వస్తారు నాయికా,నాయకులు.

నిస్సహాయ స్థితిలో శ్రీరంగస్వామిని మనసారా స్మరించుకుని తన కోరిక నిర్విఘ్నంగా నెరవేరిన పక్షంలో స్వామివారికి "పైడి కనుదోయి, బంగారు తిలకము" కానుకలుగా సమర్పించుకోగలనని మొక్కుకుంటాడు రంగనాయకుడు. ఇద్దరూ కావేరితీరం దాటి శ్రీరంగనగరం చేరుకుంటారు. సుర్య కిరణాల తేజస్సులో తళతఅలాడుతున్న శ్రీరంగనాధుని దేవాలయ శిఖరాల కాంచన కలశాలు, ఏడు ప్రాకారాల్లోనూ ఏపుగా పెరిగిన ఉద్యానవనాలను చూసి రంగనాయకుని మనసు సంతోష పారవశ్యాలతో పులకరిస్తుంది. నగర మధ్యలో ఒక చిన్న భవంతి అద్దెకు తిసుకుని అందులో ప్రవేశిస్తారు వారు.
హేమాంబ,ధనుర్ధానులుగా పేర్లు మార్చుకుంటారు. వివాహపు ఏర్పాట్లు చేస్తున్న రంగనాయకుని సంకల్పాన్ని హేమసుందరి ప్రోత్సహించదు. వారకాంత వివాహానికి తగదని ఆమె నిశ్చల అభిప్రాయం. ఎంత గొడవ పడినా, మళ్లీ పాలునీళ్ళలా ఇట్టే కలసిపొయే ముచ్చటైన అన్యోన్యత వారిది.

రెండునెలల తరువాత ఒకరోజు రంగనాయకుడు కావేరీ తీరంలో అంతర్మధనంలో మునిగి ఉండగా తిరుమలరెడ్డి బంటు సింహాచలం అతనిపై మరోమారు హత్యాయత్నం చేస్తాడు. తానను తాను రక్షించుకునే ప్రయత్నంలో అతడు కొట్టిన దెబ్బలకు ప్రాణాలు విడుస్తాడు సింహచలం. భయంతో మృతశరీరాన్ని కావేరిలో కలిపేసి ఇంటికి వెళ్తాడు రంగనాయకుడు. సింహాచలం కుటుంబానికి తగినంత ధనసాయాన్ని మాత్రం అందేలా చేస్తాడు కానీ పశ్చాత్తాపంతో కుమిలిపోతూ జబ్బుపడిన రంగనాయకునికి తన సాయశక్తులా అతనికి పరిచర్యలు చేసి మాములు మనిషిని చేస్తుంది హేమసుందరి.

ఇక్కడ నుండి కధ విచిత్రమైన మలుపు తిరుగుతుంది. నవల మీద ఉన్న ఇష్టం కొద్దీ కధను క్లుప్తంగా రాసే ప్రయత్నం నేను చెయ్యదలుచుకోలేదు.... రేపు తరువాయి భాగం...

14 comments:

భావన said...

బలే వుందే పుస్తకం నేనెప్పుడు వినను కూడా వినలేదు రేపటి కోసం ఎదురు చూస్తాను.

పరిమళం said...

మంచి మలుపులో కధని ఆపేశారు ...తరువాయి భాగం కోసం ఎదురు చూస్తున్నా ...అన్నట్టు ముగింపు రాయటం మానేయకండెం

శ్రీలలిత said...

చిన్నప్పుడు ఈ నవల గురించి విన్నాను. కాని చదవలేకపోయాను. మీరు కథ బాగా చెప్తున్నారు.

మురళి said...

భలే సరళంగా రాస్తున్నారు!! చాలా ఏళ్ళ క్రితం చదివిన పుస్తకం.. తర్వాత ఎవరో చదవడానికని పట్టుకెళ్ళి తిరిగి ఇవ్వలేదని జ్ఞాపకం.. 'విశాల నేత్రాలు' గురించి కొంచం పిడకల వేట.. సిని నటుడు కృష్ణంరాజు కి ఇది చాలా ఇష్టమైన నవల.. తనే హీరో, దర్శకుడు, నిర్మాత గా ఈ సినిమా తీయాలన్నది ఆయన చిరకాల కోరిక. నవల హక్కులు కూడా కొన్నారు.. (అందుకే ఇప్పుడు కొత్త ప్రింట్ దొరకడం లేదనుకుంటా..) అయితే సినిమా తీయలేకపోయారు. ఆ మధ్య ఎక్కడో ఇంటర్వ్యూ చదివాను.. కథకి కొన్ని మార్పులు చేసి ప్రభాస్ హీరో గా తీసేందుకు ప్రయత్నిస్తున్నారుట.. చూడాలి సినిమా ఎలా వస్తుందో..
@పరిమళం: ముగింపు తెలిసిపోతే మీకు పుస్తకం చదవాలనిపిస్తుందా అండి??

వేణూశ్రీకాంత్ said...

ఇలా మలుపుల్లో ఆపేస్తే ఎలాగండీ :-)

తృష్ణ said...

@భావన: ఒకప్పుడు చాలా పేరున్న పుస్తకంఅండీ...అయితే రేపు మీకోసం ఎదురుచూస్తా....:) :)

@పరిమళం: మొత్తం కాకయినా వీలైనంత రాయటానికే ప్రయత్నిస్తానండీ....రాయకపోతే నాకు తోచదు...రాస్తే "హన్నా" అంటారేమో అని భయం..:)

తృష్ణ said...

@శ్రీలలిత: థాంక్స్ అండీ...

@మురళి: కృష్ణంరాజు రైట్స్ కొన్న సంగతి తెలుసునండీ...కానీ అంతకన్నా బాగా ముందర "ఆదుర్తి సుబ్బారావు" గారు కృష్ణంరాజుతోనే ఆ సినిమా తీయాలని చాలా ప్రయత్నాలు చేసారు. ఎందువల్లో అది పూర్తవ్వలేదు. ఆ కోరికతోనే బహుశా మళ్ళీ తీయాలని ప్రయత్నమేమోనండీ...
బ్లాగులో ముగింపు చెప్పకపోవటం నాకూ నచ్చదండీ...ఎందుకంటే పుస్తకం కొందరికి దొరకచ్చు దొరకకపోవచ్చు...అప్పటిదాకా సస్పెన్స్ తో వేగటం కష్టం కదండీ... :)

తృష్ణ said...

@వేణూ: ఈ కధను కుదించటం నాకు ఇష్టం లేదండీ...కధలో ఉన్న పట్టు అటువంటిది...రేపు ఇటు వస్తారుగా...:)

భావన said...

మళ్ళోచ్చాము. కధేదమ్మా...

తృష్ణ said...

@ bhaaavan: net down...just now its working...wait for few minutes..n thankyou for the return...

అడ్డ గాడిద (The Ass) said...

Very nice write up. you seem to have great clarity in execution of words.

తృష్ణ said...

@ A :మీ పేరు ఇలానే రాస్తానండీ ఇక నుంచీ...ఎన్నిసార్లు చెప్పినా మీరు పేరు మార్చట్లేదు.... నా జవాబులు చూడరేమో మరి...:)

thankyouverymuch for appreciating...

Anwartheartist said...

మీరు బాగా వ్రాస్తారండి, నాకు బాగా వ్రాయడం రాక పొవడం వల్ల ఇంతకన్న ఎక్కువగా వ్రాయలేక పొతున్నా, గ్నానం నిండుగా వున్నది, అందుకే తొణకాల్సినంత తొణకడం లేదు మీరు, మీ గ్నానానికి నమస్కారం .

తృష్ణ said...

@అన్వర్: చాలా చాలా ధన్యవాదాలు.కాని నాకు తెలిసినది చాలా స్వల్పం అండీ.. నా భావాలను,నాకు తెలిసిన విషయాలను నలుగురితో పంచుకోవాలన్నదే నా తపన..అంతకు మించి మరో ఆలొచన నాకు లేదండీ...మరోసారి ధన్యవాదాలు.