సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Saturday, November 21, 2009

విశాలనేత్రాలు - 3




(ఈ నవల మొదటి భాగం, రెండవ భాగం తరువాత ఇది ఆఖరి భాగం....)


రామానుజుని ప్రధాన శిష్యులైన గోవిందయతి, యజ్ఞమూర్తి, అనంత సూరి ,దాశరధి మొదలైన ప్రముఖులందరు వ్యాకరణ,వేదాంత, చతుర్వేదాలలో విద్వాంసులు. వారెవరికీ రంగనాయకుని మీద సదభిప్రాయం ఉండదు. సామాన్య రైతు కుమారుడు, ఒక వెలయాలిని వెంటబెట్టుకుని శ్రీరంగం వచ్చి నివసిస్తూ, మద్యపానం,సాముగారడీలు తప్ప భక్తిశ్రధ్ధలేమాత్రం కానరాని అతని పట్ల ఆచార్యులకేందుకంత అనుగ్రహ వాత్సల్యాలో వీరెవరికీ అంతుపట్టదు. శ్రీరంగేశుని దేవాలయానికి వెళ్ళేప్పుడు "దాశరధి" భుజం మీద ఆనించే యతీశ్వరుని చెయ్యి రాను రానూ రంగనాయకుని భుజం మీదకు తిరిగేంతటి పరమాత్మీయ దృష్టిని చూసి శిష్యులందరూ తప్పనిసరిగా అతన్ని గౌరవించడం మొదలుపెడతారు.


ఒకరోజు దేవాలయంలో రామానుజ శిష్యులు పఠిస్తున్న ద్రవిడ వేదపారాయణ దేవాలయం నలుమూలలా మారుమ్రోగుతున్న వేళ తన్మయంతో పులకించిన రంగనాయకుని నోటి వెంట అప్రయత్నంగా ద్రవిడ వేదపాశురం వెలువడుతుంది. అమృతగళం కాకపోయినా ఆ గొంతులో పలికిన మాధుర్య భక్తిభావాలందరినీ ఆశ్చర్యపరుస్తాయి. పారవశ్యంలో అతడు రామానుజుని "సుదీర్ఘ విశాల విలోచనాల దర్శన భాగ్యం" ప్రసాదించమని అడుగుతాడు. మరునిముషమే రామానుజుని గొంతులో పలికిన ద్రావిడ వేద పాశురాల పరంపర, అ వెంఠనే అర్చకుల శ్రీసూక్త పురుషసూక్తాలతో దేవాలయం ప్రతిద్వనిస్తుంది. "అటు చూడమన్న" రామానుజుని నిర్దేశంతో రంగనాధుని నేత్ర యుగళిని దర్శించిన రంగనాయకునికి అపూర్వానుభూతితో అతిలోక విశాలమైన స్వామివారి రమణీయ విలోచన యుగళి కనబడుతుంది. తన్మయత్వంలో మూర్చపోతాడతను. స్వామివారి దివ్యనేత్రాల సందర్శన భాగ్యంతో తన జన్మ ధన్యమైందని భావిస్తాడు. అంతటి తాదాత్మ్యంలో కూడా హేమ ఈ దర్శనభాగ్యానికి నొచుకోలేదని వాపోతాడు.



ఆనాటినుంచీ అతని జీవితమే మారిపోతుంది. మద్యపానం, మైత్రీ సంబంధాలు అన్ని క్రమక్రమంగా సడలిపోతాయి. సంపాదనంతా వైష్ణవ మఠానికి ధారపోస్తున్న అతడిని చూసి హేమసుందరి కలవరపడుతుంది. ఆమెలో మార్పు, పూర్వాశ్రమంలో రామానుజుని భార్య తంజమాంబ వృత్తాంతం, రంగనాయకుని రాకపోకలవల్ల రామానుజుమఠంలో మొదలైయ్యే ఘర్షణలూ,మఠంలోకి అడుగిడనివ్వకుండా హేమారంగనాయకులకు జరిగే అవమానం.....ఏం జరిగినా వీడని రామానుజుని నిశ్చింత , యజ్ఞమూర్తి, దాశరధి ల అంతర్మధనం...ఇవన్నీ నవలలో ఎవరికి వారు చదివి ఆనందించి, అవగాహన చేసుకోవలసిన విషయాలు.



వృధ్ధ శిష్యులెవరికీ దక్కని "అష్టాక్షరీ మంత్రోపదేశం" చెయటానికి రామానుజులే స్వయంగా రంగనాయకుని ఇంత అడుగు పెట్టిన సన్నివేశం చదువుతూంటే పారవశ్యంతో కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఆ అనాయాస అష్టాక్షరీ మంత్రోపదేశానికి కారణం " హేమరంగనాయకుల పరస్పర తపన,ప్రేమానురాగాలు,మల్లవిద్యపై రంగనాయకునికి గల ఏకాగ్రత, వివాహితులు కాకపోయినా పుణ్యదంపతులవలే జీవించిన వైనం, ఒకరి తప్పిదాలనొకరు క్షమించుకున్న వారి అన్యోన్యత , ఎన్ని కష్టాలొచ్చినా సడలని వారి ప్రేమానుబంధం " అని యతీశ్వరుని ముఖత: విని యజ్ఞమూర్తి ఆశ్చర్యపోతాడు. పరమేశ్వర సాక్షాత్కారం భక్తి, జ్ఞాన,కర్మ యోగల ద్వారానే సాధ్యమన్న సత్యాన్ని మారుస్తూ, ప్రగాఢమైన మోహావేశాలు కూడా భగవంతుని సాక్షత్కారానికి పెద్ద మెట్టుగా తెలుపుతున్న రామానుజుని ప్రసంగాన్ని విని విడ్డూరపడినా సమర్ధించలేకపోతాడు.



యజ్ఞమూర్తి సంఘర్షణకు ఏం సమాధానం దొరుకుతుంది, మఠం మళ్ళీ పూర్వ వైభవాన్నెలా పొందింది, రంగనాయకుడు ఎలా వైష్ణవ పీఠాధిపతి అయ్యాడు, హేమాసుందరి రంగనాయకుల జీవితం మఠ పరిచర్యలకు ఎలా అంకితమైంది అన్న ప్రశ్నలకు నేను చెప్పగా మిగిలిన చాలా కొద్దిపాటి నవలా పఠనమే సమాధానం... !!

___________________________________________________________________
(మా పాపకు కొంచెం నలతగా ఉన్నందున పొద్దున్నే కుదరదేమో అని ఇప్పుడే ఈ టపా ప్రచురించేస్తున్నాను...)

20 comments:

భావన said...

చాలా బాగుంది తృష్ణా కధ. మీరు అంత వివరం గా చెప్పి ఆఖరి లో ఆధ్యాత్మికత భాగమ్ వదిలేసేరు పర్లేదు లే... ఎంతటి అదృష్టమో రంగనాయకులికి.అంటారు కదా శివ లోక ద్వార పాలకులేనా (సరి గా గుర్తు లేదు) శివుడికి దూరమ్ గా వుండవలసిన శాపమ్ వస్తే మంచి వారి గా ఇన్ని జన్మ లు చెడ్డ వాళ్ళు గా ఐతే తక్కువ జన్మ లు అంటే దేవుడికి దూరం గా బోలెడన్ని జన్మ లకంటే దూషిస్తూ ఆయన చేతి లోనే మరణం పొందే తక్కువ జన్మ లు కోరుకుని హిరణ్య కశుపుడి గా వరాహావతారం లో చంపబడిన రాక్షసులు గా ఇంకా అనేక జన్మ లలో రాక్షసు లు గా పుడతారు.. ఆ కధ గుర్తు వచ్చింది. మీకు తెలుసా ఆ కధ? తెలిస్తే ఎంచక్క గా వివరం గా చెప్పరు? నాకు సగం సగం గుర్తోస్తోంది. మీరు చెప్పే విధానం కూడా బాగుంది.

పరిమళం said...

హేమసుందరి ,రంగనాయకుల జీవితం చివరికి మఠ పరిచర్యలకు అంకితమైంది అన్న విషయం తెలిసింది హమ్మయ్య మనసు ప్రశాంతంగా ఉంది ...ఎక్కడున్నా , ఎలాఉన్నా ఇద్దరూ కలిసే ఉన్నారుగా !చక్కటి కధ చదివినట్టు లేదు విన్నట్టే ఉంది .
* తృష్ణ గారూ !ఇప్పుడు పాప ఆరోగ్యం ఎలా ఉందండీ.....

భావన said...

అయ్యో కింద చిన్న అక్షరాలతో వుంది చూడలేదండి కధ ఇంకో సారి చదువుదామని వచ్చి చూసేను ఇప్పుడే పాప కు ఎలా వుంది. ఏమయ్యింది జలుబా? పాప తొందర గా కోలుకోవాలని కోరుకుంటు..

మురళి said...

చాలా వివరంగా రాశారు..

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

చాలాబావుంది. కుదిరితే తప్పక చదవాలి

తృష్ణ said...

భావనగారూ, మీకు గుర్తు వచ్చినది వైకుంఠ ద్వారపాలకులైన జయవిజయుల కధ. సరిగ్గా ఇదే కధను రామానుజులు యజ్ఞమూర్తికి గుర్తుకు తెస్తారు నవలలో...(ఈ కధ మాకు మా తాతమ్మగారు చిన్నప్పుడు చెప్పేవారు..)
బ్రహ్మమానస పుత్రులు సనకసనందనులు ఒకసారి వైకుంఠానికి వెళ్ళినప్పుడు, ద్వారపాలకులైన జయవిజయులు ఎంత వేడుకున్నా వారిని లోనికి ప్రవేశించనివ్వరు. అప్పుడు వారు క్రోధంతో జయవిజయులను భూలోకంలో భీకరులై జన్మించమని శపిస్తారు. విష్ణు వియోగం క్షణకాలం కూడా సహించలేమని ప్రాధేయపడిన వారిపై సనకసనందులకిద్దరికీ జాలి కలిగి ,"సత్పురుషులై ఆరు జన్మలలో వైకుంఠ ద్వారం చేరుకుంటారా? లేక పరమ దుర్మార్గులై మూడు జన్మలలోనే చేరుకుంటారా? అని ప్రశ్నిస్తారు. మూడు జన్మలను కోరుకున్న జయవిజయులు హిరణ్యాక్ష-హిరణ్యకశిపులుగా, రావణ-కుంభకర్ణులుగా, శిశుపాల- దంతవకృలుగా మానవలోకంలో జన్మించి శాపవిమోచనం కలిగించుకుంటారు.

జయవిజయుల తపనలాగనే అనన్య సామాన్య మైన ఎడతెగని తపన వలన రంగనాయకునికి శ్రీరంగేశుని కృప కలిగి స్వామి సహజ దివ్య విశాల నేత్రాల సాక్షాత్కారం లభించిందని రామానుజులు చెబుతారు.

అదండీ కధ. బానే చెప్పానాండీ..?

పాప సంగతి: రాత్రంతా 4,5 సార్లు vomit చేసుకుందండీ...నిద్ర లేదు...కస్త కంగారు పడ్డాము...ఇప్పుడు కాస్త పర్వాలేదు..అందుకే బ్లాగ్ తెరిచా...:) thankyou verymuch..

తృష్ణ said...

@పరిమళం: ఏదన్నా నవల చదివేప్పుడు ముందు చివర పేజీ తీసి అది సుఖాంతమా? దు:ఖాంతమా? అని చూసి చదువుతటానండీ నేను...:) ఒకవేళ రంగనాయకుడు సన్యసించి హేమను వదిలివేసి ఉంటే నాకు అసలు ఈ కధ నచ్చేదే కాదేమోదండీ...

*పాప గురించి పైన భావన గారికి రాసానండి చూడండి...ఇప్పుడు పర్వాలేదు.. అడిగినందుకు చాలా థాంక్స్ అండీ.

తృష్ణ said...

@మురళి : వివరంగా రాసానన్నారు సరేనండీ...మరి బాగా రాసానో లేదో చెప్పనేలేదు...?!

@చైతన్య: దొరికితే తప్పక చదవవలసిన నవల ఇది..

తృష్ణ said...

భావన: చివర ఆధ్యాత్మిక భాగం వదిలేసానన్నరు మీరు...కధ మీద ఉన్న ప్రేమకొద్దీ చాలానే రాసేసినా....మరి ఎంతో కొంత వదలాలి కదండీ మీకు పుస్తకం దొరికాకా చదువుకోటానికి...

వేణూశ్రీకాంత్ said...

ఓ రెండు మూడు కూడా ప్రచురించారా, సూపరు.. మెదటి నుండి మళ్ళీ ప్రశాంతంగా చదివి కామెంటుతాను..

శ్రీలలిత said...

కథ బాగా తెలిసింది. అదేమిటో పెద్ద పెద్ద వారు వ్రాసే కథ లన్నింట్లో ప్రథాన పాత్ర లందరూ చివరికి ఆధ్యాత్మిక చింతన వైపే అడుగేస్తున్నట్టు అనిపిస్తోంది. మనలోని ఆధ్యాత్మికత అంత గొప్పదై వుండవచ్చు. బాగా వ్రాసారు. పాప కాస్త కోలుకుందా..

భావన said...

అమ్మయ్య. చెప్పేరు. ఏదన్న కధ గుర్తు రాక పోతే ఇంక అదే మనసులో మెదులుతూ వుంటుంది. అంతులేని తపన, ప్రేమ దేవుడిని చేరుకోవటానికి దగ్గర మార్గాలు కదు. అవి వాటంతటికి అవి రావాలి కాని మనం కల్పించలేము కదా. :-( అవును లే ఏదో ఒకటి వదలాలి కదా పుస్తకం కోసం వెతకాలి అంటే.. నాకు ఆధ్యాత్మిక భాగం ఇష్టం కదా అందుకని అనుకున్నా లే. మీరన్నదే నిజం. పాప కు పిడియాలైట్ పట్టేరా? వాతావరణం మార్పు ఏమో.. చిన్నపిల్లలకు బాలేదంటే ఏమిటో కాలు చెయ్యి ఆడదు కదా.. థ్యాక్స్ తృష్ణా..:-)

తృష్ణ said...

వేణూగారూ, వీకెండ్ కదా...ప్రశంతంగా, నిదానంగా చదువుకోండి..:)

@శ్రీలలిత: ఎంత జీవితాన్ని జీవించినా మనిషిలో ఎప్పటికైనా మొదలవ్వాల్సినది ఈ ఆధ్యాత్మిక చింతనే కదాండీ...ఇది మొదలవ్వని, తెలుసుకోలేని జీవితమే వ్యర్ధం కదా..

పాపకు కొంచెం పర్వాలేదండీ...ధన్యవాదాలు..

తృష్ణ said...

భావన: నాకూ ఆధ్యాత్మిక ఆసక్తి కాస్త ఎక్కూవేనండీ...ఎలా చేరాం అన్నది ప్రశ్న కాదండి..భగవంతుని దగ్గరకు చేరామా లేదా అన్నది ప్రశ్న. దానికి ఒకో మనిషికీ ఒకో మార్గమ్..ఇదే సరైన దారి..ఇలా చేస్తేనే భగవంతుడు దొరుకుతాదు అని లేదు కదండి...ఇది చారిత్రాత్మకం...ఎప్పుడో జరిగిన కధ. రామానుజులంతటి ఆచార్యులు రంగనాయకుడంతటి సామాన్యునికి అంతటి ప్రాధాన్యత ఇచ్చారు అంటే అతనిలో తప్పక ఏదో గొప్ప విశేషం ఉండి ఉండాలి అన్నది నా అభిప్రాయం...ఈ మూడు రోజులూ నాతో పాటూ నా భావాల్ని పంచుకున్న మీకు ధన్యవాదాలు...చాలా సంతోషం కలిగిందండీ..

నిజమండీ...పిల్లలు ఆడుతూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో...కాస్త నలత పడితే అంత కలతగా ఉంటుండి...shez recovering..

కొత్త పాళీ said...

మీ సంక్షిప్త అక్షరచిత్రం చదూతుంటేనే ఎంతో మనోహరంగా ఉంది. ఈ పుస్తకం మళ్ళి దొరికితే బాగుణ్ణు.

తృష్ణ said...

@ Thankyou sir...

గీతాచార్య said...

Your post is a great tribute to en excellent novel. Thnks a lot for sharing your summary, and hats off to your patience while writing all these words

తృష్ణ said...

@geethacharya: Thank you very much.

వేణూశ్రీకాంత్ said...

మూడున్నరేళ్ళ తర్వాత తరంగ ప్రోగ్రాం పుణ్యమా అని ఈరోజు మొదటినుండి మళ్ళీ పూర్తిగా చదివాను తృష్ణ గారు. థాంక్స్ ఫర్ గివింగ్ దీస్ లింక్స్.

అప్పటి నా మనస్థితిలో ఏం చదివానో అసలేమీ గుర్తులేదు కానీ ఈ గ్యాప్ లో నేను ఈ నవల గురించి విన్న తర్వాత ఈరోజు చదివాక చాలా చాలా నచ్చింది, అర్జంట్ గా నవల సంపాదించి చదవాలనిపిస్తుంది. థాంక్స్ ఫర్ ద పోస్ట్.

తృష్ణ said...

@venu srikanth: thanks venu gaaru.అప్పట్లో ఈ నవల పునర్ముద్రణ అవుతుందని తెలీదండి. అందరికీ దొరకటం కష్టమని వివరంగా రాసాను. రాసిన ఏడాది తర్వాతేమో పుస్తక ప్రదర్శన ద్వారా వారి నవలలన్నీ అందుబాటులోకి వచ్చాయి.