Monday, November 30, 2009
కొన్ని ఫోటోలు...
మా మరదలికి నేను పెట్టిన గోరింటకు...పండాకా కన్నా ఇలా పెట్టగానే చూసుకుంటే బాగుంటుంది నాకు...
Wednesday, November 25, 2009
ఈ పూలు ఏమిటో చెప్పుకోండి..?
ఈ పూలు ఏమిటో చెప్పుకోండి..?
నేనే చెప్పేస్తాను....ఇవి "కుంకుమ పూలు" (Saffron flowers). ఆ పువ్వు మధ్యలో కనిపిస్తున్నదే మనం వాడే కుంకుమపువ్వు. ఇప్పుడే దూరదర్షన్ లో "కశ్మీర్ నామా" అనే కార్యక్రమం వచ్చింది..దాంట్లో తెల్లని మంచు కురుస్తున్న రోడ్లు....ఇంకా కొన్ని ప్రదేశాలూ అవీ చూపించారు...సన్నగా, తెల్లగా చెట్లని కప్పేస్తూ కురుస్తున్న మంచు ఎంత బాగుందో...
ఇంకా ఇదిగో ఈ కుంకుమ పువ్వుల తోటలు , వాటిని కోయటం అవీ చూపించారు. వంటల్లోకి, పాలలో వాడటం తప్ప ఇంతవరకూ నాకూ తెలీదు ఈ పూలు ఇలా ఉంటాయి అని...ఆశ్చర్యంగా అసలు ఆకు అనేదే కనబడటం లేదు. మట్టి లోంచి ఆ పువ్వు ఒకటే కనిపిస్తోంది. నాకయితే పెద్ద వింతలా ఉంది...అన్దరికీ చూపిద్దామని ఇలా ఫోటో తీసాను కానీ..మన దూరదర్షన్ వాళ్ళ ప్రసారం క్లారిటీ ఇంత బాగుంది...వేరే ఏ చానల్ లోంచి ఫోటో తీసినా అద్భుతంగా వస్తుంది. DD క్వాలిటీ మాత్రం నా చిన్నప్పటి నుంఛీ ఒకలాగే ఉంది...!!
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
ఇది బ్లాగ్మిత్రుల కోసం:
రెండు శుభకార్యాల ఆహ్వానాల నిమిత్తం....నేను సైతం ఒక చిన్న విరామన్ని తీసుకుంటున్నాను...
ఓ నాలుగు రోజుల పాటు మీరంతా హాయిగా, స్వేచ్చగా, ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోండి...
మళ్ళీ సోమవారానికల్లా పెద్ద సుత్తితో నేను రెడీ అయిపోతాను కదా...
వెళ్ళిన చోట శ్రీలక్ష్మి లెవెల్లో "బ్లాగంటే...." అంటూ ఆహ్వానితులందరికీ బ్లాగ్లోక విశేషాలు చెప్పి
నా బ్లాగ్లోక వియోగభారాన్ని తగ్గించుకోటానికి ప్రయత్నిస్తాను...
అంత సమయం చిక్కకపోతే కనీసం నూతన్ ప్రసాద్ లాగ "మా బ్లాగులు మూడువేలు...."
అనయినా చెప్పే ప్రయత్నం చేసి బ్లాగులందు నా విశ్వాసాన్ని చాటి చెప్పుకుంటాను...
ఉండనేమో అని వ్యాఖ్య రాయటం మానేరు...
రోజంతా బయట పనులున్నా ఇవాళ్టికి ఇంట్లోనే....
రాత్రికి వచ్చిన వ్యాఖ్యలు ప్రచురించుకుని రేపొద్దున్న వెళ్తాను...
సోమవారం దాకా శెలవు మరి.....!!
ఇది చూసి శ్రీవారి వ్యాఖ్య :
"ఈ నాలుగురోజులూ హమ్మయ్యా అని హాయిగా,గట్టిగా ఊపిరి పీల్చుకుంటారు పాపం వాళ్ళంతా ..." :( :(
Tuesday, November 24, 2009
favourite flowers...
అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలలో రోడ్డు మీద....ఏదైనా సందులోకి అడుగుపెట్టగానే గుప్పని మత్తెక్కించే ఈ పూల పరిమళం ముక్కుపుటాల్లోంచి మనసులోకి జారుకుంటుంది...గుండెల నిండా ఈ వాసన పీల్చుకుని అబ్బా...అనుకోని వారుంటారా అనుకుంటూ ఉంటాము మేము. వాసన వచ్చిన మొదలు ఆసందులోనో..ఆ విధిచివరలోనో ఎక్కడో దాగున్న ఆ చెట్టు కోసం కళ్ళు వెతుకుతాయి...పొడుగాటి వృక్షాలు...వాటికి చిన్న చిన్న ముదురాకుపచ్చ ఆకులు...గుత్తులు గుత్తులుగా వేళ్ళాడుతున్న పొడుగు కాడలున్న తెల్లని పూలు....ఎన్నిసార్లు చూసినా కొత్తగానే అనిపించే అందం ఈ పువ్వులది.....
చిన్నప్పుడు మా తమ్ముడు, నేను ఈ పూలు ఎక్కద దొరికినా బోలెడు ఏరి తెచ్చేకునేవాళ్ళం...వాటిని నేను నీళ్ళు పోసిన పొడుగాటి గ్లాసులో వేసి ఫ్రిజ్ మీదో , టి.వి మీదో పెట్టేదాన్ని...రెండు మూడు రోజులు పాడవకుండా ఉండేవి అవి...నేనెక్కువ ఏరానంటే నేనెక్కువ ఏరానని గొప్ప చెప్పుకోవటం... అవన్నీ మధురస్మృతులు...
ఒకసారయితే రోడ్డు మీద ఎక్కడొ చిన్న చిన్న మొక్కలు చూసి తవ్వి తెచ్చి నాన్న,తమ్ముడూ వాటిని ఇంటి ముందు నాటారు. మేము ఆ ఊరు వదిలి వచ్చేసినా ఆ మొక్కలు ఇప్పుడు పెద్ద వృక్షాలయి వాటికి బోలెడు పువ్వులు పూస్తున్నాయిట...అవి పెద్దయ్యే సమయానికి అక్కడ లేమే అనుకుంటూ ఉంటాము...
Monday, November 23, 2009
నా స్వామి పుట్టినరోజు
"Be aware that your Kindness
maybe treated as your weakness
but still be Kind.
Be aware that your help to others
may go unheeded and unnoticed
but still be Helpful.
Be aware that your faith in God and Love for Humanity
manybe taken as Orthodoxy and foolishness
but still have faith in God.
Be aware that Good you do today
will be forgotten tomorrow
but still be Good.
Be aware that honesty and frankness
make you Vulnerable
but still be Frank.
Be aware that virtues and values of life
may mean little for people
but still be Virtuous."
--- Sri Satya Sai Baba.
చాలా ఏళ్ళ క్రితం ఒక పెద్ద చార్ట్ మీద స్వామి చెప్పిన ఈ కొటేషన్ రాసుకున్నాను. అక్షరాలను దిద్దిన రంగు వెలసిపోయినా ఇంకా ఇవాల్టికీ ఆ చార్ట్ నా తలుపుకు అంటించే ఉంది. రాసుకోవటమే కాదు ఇంకా పాటిస్తూనే ఉన్నాను.....అలా చేయటం వల్ల ఎన్ని బాధలు,కష్టాలు ఎదురైనా సరే. స్నేహాన్ని,మంచితనాన్ని, నిజాయితీని, నిష్కపటమైన భావ ప్రకటనని, భగవంతునిపై నమ్మకాన్ని వదిలిపెట్టలేదు. ఇది నాకు నా స్వామి ప్రసాదించిన జీవనపాఠం.
స్వామి గురించిన నా నమ్మకం నిన్నదో, మొన్నదో కాదు.....ఇంట్లో మా తాతగారి కాలం నుంచీ ఉన్నది. కాకపోతే ఊహ, ఆలోచన ఏర్పడ్డాకా నా అంతట నేను చేసిన కొంత సాధన వల్ల కలిగిన అవగాహన కొంత...నా దృష్టిలో నేను స్వామి పాదాల చెంత చోటు కోసం పరితపించే చిన్ని గడ్డిపువ్వును మాత్రమే ...!!
ఇహలోక బంధాలన్నీ ఇహంలోనేనని....చిట్టచివరికి నేను చేరాల్సిన గమ్యం మరోకటుందని...అది చేరటానికి సాగించాల్సిన పయనం బోలెడని...ఆ మార్గం నాకు చూపే మార్గదర్శి నా స్వామి అని నేనెవరికి చెప్పాలి...??! కొందరి దృష్టిలో నా నమ్మకం గుడ్డిదే కావచ్చు. కానీ రాయిని సైతం భగవంతునిగా కొలిచే మన "పుణ్య భూమి"లో మనిషి గుర్తించాల్సింది మనం పూజిస్తున్నది దేనినని కాదు...అందులో ముఖ్యమైనది మనకు ఉండే " పూర్తి నమ్మకం" అని నా అభిప్రాయం.
అయితే అన్నివేళలా తోడుగా నాకు స్వామి ఉన్నారన్న సత్యాన్ని నేను ప్రాపంచిక బాధల్లో పడి మరచి, కలత చెందిన ప్రతిసారీ ఏదో రూపంలో వచ్చి "నేనున్నను" అని నా స్వామి నాకు గుర్తు చేస్తూ ఉంటారు. అలాంటి ఒక సంఘటన నాకు మొన్న జరిగింది...అనుకోకుండా మా ఇంటికి వచ్చిన బంధువొకరు "స్వామి డివోటీ" అవ్వటం...మేము బోలెడు స్వామి కబుర్లు చెప్పుకోవటం...నన్ను నేను తేలిక పరచుకోవటానికి, నేను మరుస్తున్న నా అసలైన ఆధ్యాత్మిక పయనాన్ని గుర్తుచేయటానికి ఎంతో ఉపయోగపడ్డాయి.
ఈ విషయంలో చర్చలూ, వాదనలు చేయదలుచుకోలేదు...అందుకే కామెంట్స్ మోడ్ తీసేసాను. ఇవాళ కేవలం నా స్వామికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకోవాలని...అంతే..!!
Saturday, November 21, 2009
విశాలనేత్రాలు - 3
(ఈ నవల మొదటి భాగం, రెండవ భాగం తరువాత ఇది ఆఖరి భాగం....)
రామానుజుని ప్రధాన శిష్యులైన గోవిందయతి, యజ్ఞమూర్తి, అనంత సూరి ,దాశరధి మొదలైన ప్రముఖులందరు వ్యాకరణ,వేదాంత, చతుర్వేదాలలో విద్వాంసులు. వారెవరికీ రంగనాయకుని మీద సదభిప్రాయం ఉండదు. సామాన్య రైతు కుమారుడు, ఒక వెలయాలిని వెంటబెట్టుకుని శ్రీరంగం వచ్చి నివసిస్తూ, మద్యపానం,సాముగారడీలు తప్ప భక్తిశ్రధ్ధలేమాత్రం కానరాని అతని పట్ల ఆచార్యులకేందుకంత అనుగ్రహ వాత్సల్యాలో వీరెవరికీ అంతుపట్టదు. శ్రీరంగేశుని దేవాలయానికి వెళ్ళేప్పుడు "దాశరధి" భుజం మీద ఆనించే యతీశ్వరుని చెయ్యి రాను రానూ రంగనాయకుని భుజం మీదకు తిరిగేంతటి పరమాత్మీయ దృష్టిని చూసి శిష్యులందరూ తప్పనిసరిగా అతన్ని గౌరవించడం మొదలుపెడతారు.
ఒకరోజు దేవాలయంలో రామానుజ శిష్యులు పఠిస్తున్న ద్రవిడ వేదపారాయణ దేవాలయం నలుమూలలా మారుమ్రోగుతున్న వేళ తన్మయంతో పులకించిన రంగనాయకుని నోటి వెంట అప్రయత్నంగా ద్రవిడ వేదపాశురం వెలువడుతుంది. అమృతగళం కాకపోయినా ఆ గొంతులో పలికిన మాధుర్య భక్తిభావాలందరినీ ఆశ్చర్యపరుస్తాయి. పారవశ్యంలో అతడు రామానుజుని "సుదీర్ఘ విశాల విలోచనాల దర్శన భాగ్యం" ప్రసాదించమని అడుగుతాడు. మరునిముషమే రామానుజుని గొంతులో పలికిన ద్రావిడ వేద పాశురాల పరంపర, అ వెంఠనే అర్చకుల శ్రీసూక్త పురుషసూక్తాలతో దేవాలయం ప్రతిద్వనిస్తుంది. "అటు చూడమన్న" రామానుజుని నిర్దేశంతో రంగనాధుని నేత్ర యుగళిని దర్శించిన రంగనాయకునికి అపూర్వానుభూతితో అతిలోక విశాలమైన స్వామివారి రమణీయ విలోచన యుగళి కనబడుతుంది. తన్మయత్వంలో మూర్చపోతాడతను. స్వామివారి దివ్యనేత్రాల సందర్శన భాగ్యంతో తన జన్మ ధన్యమైందని భావిస్తాడు. అంతటి తాదాత్మ్యంలో కూడా హేమ ఈ దర్శనభాగ్యానికి నొచుకోలేదని వాపోతాడు.
ఆనాటినుంచీ అతని జీవితమే మారిపోతుంది. మద్యపానం, మైత్రీ సంబంధాలు అన్ని క్రమక్రమంగా సడలిపోతాయి. సంపాదనంతా వైష్ణవ మఠానికి ధారపోస్తున్న అతడిని చూసి హేమసుందరి కలవరపడుతుంది. ఆమెలో మార్పు, పూర్వాశ్రమంలో రామానుజుని భార్య తంజమాంబ వృత్తాంతం, రంగనాయకుని రాకపోకలవల్ల రామానుజుమఠంలో మొదలైయ్యే ఘర్షణలూ,మఠంలోకి అడుగిడనివ్వకుండా హేమారంగనాయకులకు జరిగే అవమానం.....ఏం జరిగినా వీడని రామానుజుని నిశ్చింత , యజ్ఞమూర్తి, దాశరధి ల అంతర్మధనం...ఇవన్నీ నవలలో ఎవరికి వారు చదివి ఆనందించి, అవగాహన చేసుకోవలసిన విషయాలు.
వృధ్ధ శిష్యులెవరికీ దక్కని "అష్టాక్షరీ మంత్రోపదేశం" చెయటానికి రామానుజులే స్వయంగా రంగనాయకుని ఇంత అడుగు పెట్టిన సన్నివేశం చదువుతూంటే పారవశ్యంతో కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఆ అనాయాస అష్టాక్షరీ మంత్రోపదేశానికి కారణం " హేమరంగనాయకుల పరస్పర తపన,ప్రేమానురాగాలు,మల్లవిద్యపై రంగనాయకునికి గల ఏకాగ్రత, వివాహితులు కాకపోయినా పుణ్యదంపతులవలే జీవించిన వైనం, ఒకరి తప్పిదాలనొకరు క్షమించుకున్న వారి అన్యోన్యత , ఎన్ని కష్టాలొచ్చినా సడలని వారి ప్రేమానుబంధం " అని యతీశ్వరుని ముఖత: విని యజ్ఞమూర్తి ఆశ్చర్యపోతాడు. పరమేశ్వర సాక్షాత్కారం భక్తి, జ్ఞాన,కర్మ యోగల ద్వారానే సాధ్యమన్న సత్యాన్ని మారుస్తూ, ప్రగాఢమైన మోహావేశాలు కూడా భగవంతుని సాక్షత్కారానికి పెద్ద మెట్టుగా తెలుపుతున్న రామానుజుని ప్రసంగాన్ని విని విడ్డూరపడినా సమర్ధించలేకపోతాడు.
యజ్ఞమూర్తి సంఘర్షణకు ఏం సమాధానం దొరుకుతుంది, మఠం మళ్ళీ పూర్వ వైభవాన్నెలా పొందింది, రంగనాయకుడు ఎలా వైష్ణవ పీఠాధిపతి అయ్యాడు, హేమాసుందరి రంగనాయకుల జీవితం మఠ పరిచర్యలకు ఎలా అంకితమైంది అన్న ప్రశ్నలకు నేను చెప్పగా మిగిలిన చాలా కొద్దిపాటి నవలా పఠనమే సమాధానం... !!
___________________________________________________________________
(మా పాపకు కొంచెం నలతగా ఉన్నందున పొద్దున్నే కుదరదేమో అని ఇప్పుడే ఈ టపా ప్రచురించేస్తున్నాను...)
Friday, November 20, 2009
విశాలనేత్రాలు - 2
(నిన్నటి తరువాయి...)
హేమసుందరి పరిచర్యలకు, ఆమెకు తనపైగల అసూయారహిత మక్కువకు, గాధానురాగానికి రంగనాయకుడు చలించిపోతాడు. ఆమె అడుగుజాడలలో నిలబడటానికి అర్హత ఉందా అన్న సంశయానికి వస్తాడు...శ్రీరంగనాధుని కరుణవల్లనే అటువంటి "సాధ్వీమణి" తనకు లభించిందని ఎంతో ఉప్పొంగిపోతాడు. ఇక ఆలసించకుండా తన మొక్కుబడి తీర్చుకోవాలని నిశ్చయించుకుంటాడు. కార్తీక పూర్ణిమ నాడు అన్నివిధాలా మంచి ముహుర్తం ఉందని తెలుసుకుని ఆరోజున ఉప్పొంగిన హృదయాలతో దేవాలయానికి బయలుదేరుతారు వారిరువురూ.
కార్తీక పూర్ణిమ నాడు ప్రొద్దుటే సరిగంచు ఉత్తరీయం, కుడి ముంజేతికి శ్రీరంగం మల్లయుధ్ధ ప్రవీణులు అతడిని మెచ్చుకుని బహుకరించిన పైడి కంకణం ధరించి; పుజా ద్రవ్యాలతో, పుష్పాలతో నిండిన బంగారు పళ్ళెంలో మొక్కుబడి అయిన పైడితిలకము, సువర్ణ విలోచన యుగళి పట్టుకుని, పూజాపుష్పాలు వాడకుండా లేత లేత తాటి మొవ్వుల ఆకులతో, శ్రీచందనం చేవకామతో తయారుచేయించిన పెద్ద గొడుగు ఎడమ చేతితో పట్టుకు నడక సాగిస్తాడు రంగనాయకుడు. గొడుగు అంచులకున్న మువ్వల సవ్వడితో హేమ కాలి అందెల ఘలఘలలు కలసిపోతాయి. హేమసుందరి ఆ రోజు లేత చిలకాకుపచ్చ మధుర పట్టు చీర,ఊదా రంగు రవిక, రకరకాల ఆభరణాలు ధరించి, సుదీర్ఘమైన శ్రీచూర్ణ తిలకానికి, చిన్నరి నెలవంక ఆకారంలో కుంకుమ రేఖ దిద్దుకుని, రంగనాయకుని అడుగుజాడల్లో ముందుకు సాగుతుంది.
ఈ దృశ్యమే పుస్తకం అట్టమీద ఉన్న బాపూబొమ్మ. నవలలో ఈ రెండు పేజీలలో వారిద్దరి గూర్చీ, శ్రీరంగనాధస్వామి ఆలయం తాలూకూ వర్ణన అద్భుతం. ఇంతకు మునుపు భక్తులెవ్వరు ఇవ్వని వారి వింత కానుకలను చూసి అర్చకుడు ఆశ్చర్యపడతాడు. హేమాంబ ధనుర్ధాసులన్న కొత్త పేర్లతో ,తండ్రి గోత్రంతో తమ ఇద్దరి పేరా స్వామికి సహస్రనామ పుజ చేయిస్తాడు రంగనాయకుడు. ఆ విధంగా ఆ క్షణాన స్వామివారి సన్నిధిలో తమ వివాహకార్యక్రమం పరిసమాప్తి అయ్యిందని రంగనాయకుడు సంతోషిస్తాడు. హేమ కనుదోయి కొలతలతో చేయించిన స్వామివారి కానుకలు చక్కగా అమరినందుకు వారిద్దరు ఎంతగానో సంతోషిస్తారు. ఇంటికి వెళుతూ అపూర్వ సౌందర్యంతో చూపరుల దృష్టినిట్టే ఆకట్టుకుంటూన్న ఆమె అందం ఎండపొడికి కందుతున్నదని గ్రహించి ఆమెకు గొడుకు అడ్డుపెట్టి నడక సాగిస్తాడు. జనాలు విడ్డూరంగా చూస్తున్నారని హేమ ఎంత వారించినా సిగ్గుపడని అతని అపారమైన ప్రేమ మీద మనకు హఠాత్తుగా ఎంతో గౌరవం ఏర్పడిపోతుంది.
సరిగ్గా అప్పుడే అయిదారుగురు కాషాయాంబరధారులైన యతీశ్వరులు వారికెదురౌతారు. వారిలో ఆజానుబాహుడైన ఒక యతీశ్వరునడు నిశ్చల విశాల నేత్రాలతో, చిరునవ్వుతో రంగనాయకుని పరిశీలిస్తూ కనబడతారు. రంగనాయకుని ఆడుగులు రెండు,మూడు నిముషాలు ఆగిపోతాయి. హేమ కళ్ళ కన్నా సివిశాలమైన, ఠీవి,రాజసం నిండిన ఆ సుదీర్ఘమూర్తి గంభీరదృష్టి అతడిని ఆశ్చర్యపరుస్తుంది. తమని దాటిపోయాకా కూడా వెనుదిరిగి తనను పరిశీలిస్తున్న ఆ నిశ్చల దృషిని అతను అవగాహన చేసుకోలేకపోతాడు. ఆ తర్వాత ఆయనే "శ్రీమద్రామానుజ యతీంద్రులు" అని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు. ఆ రోజు సాయంత్రం ఇంటికి చేరేసరికీ వీధి అరుగు మీద తనకోసం "శ్రీమద్రామానుజుల మఠం" నుంచి వారు తనను చూడాలంటున్నారని వచ్చిన ఒక బ్రాహ్మణ బ్రహ్మచారి చూసి మరింత కలవరపడిపోతాడు రంగనాయకుడు. అది అనుగ్రహమా, ఆగ్రహమా అనే సందిగ్ధంలో పడతాడు. రామానుజయతీంద్రుల మఠానికి వెళ్ళాలో వద్దోనని సందేహిస్తూనే మరొక రోజు గడిపిన అతడికి మర్నాడు ఇల్లు చేరేసరికీ మళ్ళీ అరుగు మీద "దాశరధి" ఎదురౌతాడు. ఇక తప్పనిసరిగా అతనితో మఠంలోకి అడుగు పెడతాడు రంగనాయకుడు.
అనేక సందేహాలతో మఠంలోకి అడుగుపెట్టిన రంగనాయకునికి "వచ్చావా నాయనా! ఇన్నాళ్లనుంచీ నీకోసమే ఎదురు చూస్తున్నాను !" అన్న రామానుజుని ఆప్యాయమైన పలకరింపు విడ్డూరంగా తోస్తుంది. ఆ తరువాత రంగనాధస్వామికి సమర్పించిన వింత కానుకల గురించి అడిగి..."ఆ అమ్మాయి నేత్రాలంత విశాలమైనవా?" అని ప్రశ్నిస్తారు. యతీశ్వరుల ఆసక్తికి ఆశ్చర్యపడిన అతను తాను అంతటి చక్కని కన్నులజంట ఎక్కడా చూడలేదనీ..హేమ తన ఇంట కాలుపెడితే ఆమె కన్నుల కొలతలతో స్వామికి మొక్కుబడి చెల్లించుకోవాలనీ అనుకున్నట్లు చెబుతాడు. అప్పుడు రామానుజులు "ఇంతకు ముందు నువ్వు కని విని ఎరుగనంతటి పెద్ద పెద్ద కన్నులున్నవి. చూపించనా?" అని అడుగుతారు. ఈ కొంటె ప్రశ్నకు నిర్ఘాంతపోయిన రంగనాయకుడు తనకా జన్మకు ఇంకేమీ అవసరం లేదనీ, వేరొకరివైపు కన్నెత్తి చూడదలచలేదనీ చెప్తాడు.
ఎంతటి ఆత్మీయులతోనైనా ఎనాడూ ప్రసంగించని మౌనమూర్తి ఈవేళ ఒక సామాన్య మల్లునితో చిరకాల మిత్రునితో మాట్లాడినట్లు సంభాషించటం ఆశ్రమవాసులందరికీ విచిత్రమనిపిస్తుంది. తరువాత నాలుగైదు రోజులకొకసారి, ఆ పై ప్రతిరోజూ రామానుజుని సందర్శించటం మొదలుపెడతాడు రంగనాయకుడు. ఈ రాకపోకలు హేమసుందరిలో అంతులేని ఆవేదనని రేపుతాయి. అటు రంగనాయకుని ఎడల ఆచార్యునికెక్కువౌతున్న మక్కువ మఠవాసులలోనూ అలజడి రేపుతుంది.
ఈ రాకపోకలు రంగనాయకుని జీవితాన్ని ఎంత పెద్ద మలుపు తిప్పాయో....రేపు తెలుసుకుందాం...:) :)
Thursday, November 19, 2009
విశాలనేత్రాలు
ఈ నవల కధాంశం మనిషి జీవితంలోని మూడు ప్రధానాంశాల చుట్టూ తిరగాడుతుంది...ప్రేమ, భక్తి, ఆధ్యాత్మికత. ప్రేమలోంచి భక్తిమార్గంలోకి, ఆపై ఆధ్యాత్మికంగా పయనంగా సాగే రంగనాయకుని జీవితకధ నాకెందుకనో అత్యంత సన్నిహితమైపోయింది. నవలలో నాయికా నాయకులు సరళ స్వభావులైన హేమసుందరీ రంగనాయకులు. లోకం దృష్టిలో సచ్చరిత్రులు కాకపోయినా, వారిద్దరికీ ఒకరిపై ఒకరికి గల తీవ్ర పరస్పరానురాగమే వారిద్దరికీ రామానుజులచే అనాయాసంగా అష్టాక్షరి మంత్రోపదేశం పొందే అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. "లివ్ఇన్ రెలేషన్ షిప్స్" అంటూ మెట్రో నగరాల్లో, పట్టణాల్లో కుర్రకారు మోజు చూపుతున్న వివాహ వ్యతిరేక స్వేచ్ఛాజీవన విధానాన్ని ఎప్పుడో 1965 ప్రాంతంలోనే "పిలకా గణపతి శాస్త్రి గారు "విశాల నేత్రాలు" నవలలో ప్రధానాంశంగా స్పృశించారా అనిపిస్తుంది..
క్రీస్తుశకం 11వ శతాబ్ది ఉత్తరార్ధంలో, దక్షిణ భారతంలో, ద్రవిడదేశంలో కాంచీరాజ్యం న్యాయమైన ప్రజాపాలనలో ప్రసిధ్ధి కెక్కింది. ఆ రాజ్యం లోని నిచుళానగరం ఈ నవలికకు పూర్వరంగం. నిచుళానగరంలో శృంగారమంజరి సౌధం తెలియనివారుండరు. ఆమె వద్ద అక్కచెల్లెళ్ళలా పెరిగిన మాణిక్యవల్లి, హేమసుందరి ఆమె కన్న కుమార్తెలు కాదు. వారిద్దరిని ఆమె చిన్నతనం నుంచీ పెంచి పెద్ద చేస్తుంది. వారిద్దరికీ కాంచీరాజ్యంలో ప్రసిధ్ధికెక్కిన నృత్యాచార్యుల వద్ద నృత్యం, వీణా వేణు మృదంగాలలో, గాత్ర సంగీతాలలో చక్కని నైపుణ్యాన్ని నేర్పిస్తుంది. అయితే ఇద్దరిలోనూ ఇంచుమించుగా ఇరవై నిండిన హేమసుందరి అందంలో మిన్న. పైడిబొమ్మ లాంటి హేమసుందరిని ఎవరైనా ఒక మహారాజు ఒద్దికలో ఉంచాలని, వందల కొద్దీ సువర్ణ నాణాలు గుమ్మరింపించుకోవాలని శృంగారమంజరి ఉవ్విళ్ళూరుతుంది.
అయితే కధనం ప్రకారం ఒక ఏడాది క్రితం హేమసుందరికి, రంగనాయకునికి గోపాలస్వామి కల్యాణమహోత్సవంలో పరిచయం కలుగుతుంది. కర్ణాభరణాలవరకూ విస్తరించిన హేమసుందరి విశాల విలోచన యుగళికి దాసుడౌతాడు రంగనాయకుడు. ఆ పై వారిద్దరికీ ఒకరిఎడలొకరికి ప్రగాఢమైన అనురక్తి ఏర్పడుతుంది. రంగనాయకుడు నిచుళాపురం పొలిమెరలో నివసిస్తున్న వెంకటనాయకుని కనిష్ఠపుత్రుడు. తండ్రి చిన్న భూస్వామి.పెద్దగా ఆస్థిపాస్తులు ఏవీ లేనివాడు. అతని అన్నలిద్దరూ తండ్రితో పాటే వ్యవసాయం చేసుకుంటూంటారు. సాముగారడీలో ఆరితేరిన రంగనాయకుడు ఇరవై ఐదో ఏడు కూడా నిండని యువకుడు. కండలు తిరిగిన బలిష్థ దేహంతో, విశాలమైన నుదురు,కొనలు తిరిగిన కనుదోయితో, చక్కటి శరిరచ్ఛాయతో ఎంతటి నెరజాణనయినా ఇట్టే ఆకర్షించగల రూపమాతనిది. పొద్దస్తమానం సాముగారడీలే ఆతని ఆరాధ్యదైవాలు.
ఒకానొకరోజు రాత్రిపూట ఆమెను కలవటానికి శృంగారమంజరి భవంతిలోకి దొంగతనంగా అడుగుపెడతాడు. ఆ సుందరి విశాల నేత్రాల లోతులలో మునిగి బాహ్యప్రపంచాన్ని విస్మరిస్తాడు...మైమరపులో కావలివాళ్ల కంట పడతాడు. కానీ చాకచక్యంతో ఓ నలుగురు పరిచారకులకు దేహశుధ్ధి చేసి చీకట్లో తప్పించుకుంటాడు రంగనాయకుడు.ఆ గొడవ చిలికి చిలికి గాలివానై నగరమంతా పెద్ద దుమారాన్ని రేపుతుంది. రంగనాయకుని సాహసం ఆ నోటా ఆ నొటా హేమసుందరిని దక్కించుకోవాలనుకునే తిరుమలరెడ్డికీ, పట్టణ తలవరికీ తెలిసి, అది రంగనాయకుని ఇంట కూడా పొక్కి పెద్ద రభసగా మారుతుంది. అతను కావాలనుకునే సొత్తు దొరకదేమోనన్న ఉక్రోషం తిరుమలరెడ్డి అతనిపై హత్యాప్రయత్నం చేయించటానికి ఉసిగొల్పుతుంది. తండ్రి నిరాదరణ, తరువాత జరిగిన కొన్ని సంఘటనలు, అడుగడుగునా ఎదురౌతున్న ఆటంకాల నేపధ్యంలో ఆ ఊరినుంచి పారిపోవాలనే నిర్ణయానికి వస్తారు నాయికా,నాయకులు.
నిస్సహాయ స్థితిలో శ్రీరంగస్వామిని మనసారా స్మరించుకుని తన కోరిక నిర్విఘ్నంగా నెరవేరిన పక్షంలో స్వామివారికి "పైడి కనుదోయి, బంగారు తిలకము" కానుకలుగా సమర్పించుకోగలనని మొక్కుకుంటాడు రంగనాయకుడు. ఇద్దరూ కావేరితీరం దాటి శ్రీరంగనగరం చేరుకుంటారు. సుర్య కిరణాల తేజస్సులో తళతఅలాడుతున్న శ్రీరంగనాధుని దేవాలయ శిఖరాల కాంచన కలశాలు, ఏడు ప్రాకారాల్లోనూ ఏపుగా పెరిగిన ఉద్యానవనాలను చూసి రంగనాయకుని మనసు సంతోష పారవశ్యాలతో పులకరిస్తుంది. నగర మధ్యలో ఒక చిన్న భవంతి అద్దెకు తిసుకుని అందులో ప్రవేశిస్తారు వారు.
హేమాంబ,ధనుర్ధానులుగా పేర్లు మార్చుకుంటారు. వివాహపు ఏర్పాట్లు చేస్తున్న రంగనాయకుని సంకల్పాన్ని హేమసుందరి ప్రోత్సహించదు. వారకాంత వివాహానికి తగదని ఆమె నిశ్చల అభిప్రాయం. ఎంత గొడవ పడినా, మళ్లీ పాలునీళ్ళలా ఇట్టే కలసిపొయే ముచ్చటైన అన్యోన్యత వారిది.
రెండునెలల తరువాత ఒకరోజు రంగనాయకుడు కావేరీ తీరంలో అంతర్మధనంలో మునిగి ఉండగా తిరుమలరెడ్డి బంటు సింహాచలం అతనిపై మరోమారు హత్యాయత్నం చేస్తాడు. తానను తాను రక్షించుకునే ప్రయత్నంలో అతడు కొట్టిన దెబ్బలకు ప్రాణాలు విడుస్తాడు సింహచలం. భయంతో మృతశరీరాన్ని కావేరిలో కలిపేసి ఇంటికి వెళ్తాడు రంగనాయకుడు. సింహాచలం కుటుంబానికి తగినంత ధనసాయాన్ని మాత్రం అందేలా చేస్తాడు కానీ పశ్చాత్తాపంతో కుమిలిపోతూ జబ్బుపడిన రంగనాయకునికి తన సాయశక్తులా అతనికి పరిచర్యలు చేసి మాములు మనిషిని చేస్తుంది హేమసుందరి.
ఇక్కడ నుండి కధ విచిత్రమైన మలుపు తిరుగుతుంది. నవల మీద ఉన్న ఇష్టం కొద్దీ ఈ కధను క్లుప్తంగా రాసే ప్రయత్నం నేను చెయ్యదలుచుకోలేదు.... రేపు తరువాయి భాగం...
Wednesday, November 18, 2009
Tuesday, November 17, 2009
తిలక్ గళంలో ఆయన "వెన్నెల"
అని అడిగారు. "నచ్చింది...కొన్నాను..." అన్నా. "ఈ కవితలను నువ్వు అర్ధం చేసుకోగలవా?" అన్నరు. "ఊ..." అన్నాను. "ఈ తిలక్ ఎవరో తెలుసా?" అన్నారు. తల అడ్డంగా ఊపాను. "మూర్తి బాబయ్య మేనమామగారు. రామారావు అంకుల్ వాళ్ళ తమ్ముడు." అన్నారు. "ఈ పుస్తకం పాత ముద్రణ మనింట్లో ఉంది. ఎప్పుడైనా చూసావా?" అన్నారు... లేదన్నాను. దాంట్లోని ఒక కవితను తిలక్ గారు స్వయంగా చదివిన రికార్డింగ్ ఇంట్లో ఉంది వినమన్నారు.
అలా పరిచయమయ్యింది "అమృతం కురిసిన రాత్రి" నాకు. మూర్తి బాబయ్య గిటార్ వాయిస్తే,తిలక్ గారు పాడేవారట, లేకపోతే ఎవరిచేతైనా పాడించుకుంటూ వినేవారట. కొన్ని కవితలని మూర్తిబాబయ్య ట్యూన్ కట్టి పాడించారు. "గగనమొక రేకు కన్నుగవ సోకు..." పాట నేను నేర్చుకుని పాడేదాన్ని... (నాన్న చిరకాల స్నేహితుడు మూర్తిబాబయ్యే "గమ్యం" సినిమాకు సంగీతం చేసిన ఈ.ఎస్.మూర్తి.)
తిలక్ గారు స్వయంగా చదివిన "వెన్నెల" కవిత బ్లాగ్మిత్రుల కోసం.....
కార్తిక మాసపు రాత్రివేళ
కావాలనే మేలుకున్నాను
చల్లని తెల్లని వెన్నెల
అంతటా పడుతోంది
మెత్తని పుత్తడి వెన్నెల
భూమి ఒంటిని హత్తుకుంది
శిశువులాంటి వెన్నెల
నవ వధువులాంటి, మధువులాంటి వెన్నెల
శిశిరానికి చెలించే
పొరల పొరల వెన్నెల
శరద్రధుని సౌధానికి కట్టిన
తెరల తెరల వెన్నెల
ఎంత శాంతంగా,
హాయిగా, ఆప్యాయంగా ఉందీ !
చచ్చిపోయిన మా అమ్మ
తిరిగొచ్చినట్టుంది
స్వర్గంలో ఎవరో సంగీతం
పాడుతున్నట్టుంది.
ఎంత నీరవ నిర్మల సౌందర్యం
నన్నావరించుకుంది ?
ఏ చామీకర చషకంతో
నా పెదవుల కందిస్తున్నది ?
ఈ రాత్రి నిద్రిత సర్వధాత్రి మీద
ఎవరు ఈ తళుకు తళుకు
కలల పుప్పొడిని వెదజల్లారు !
ఎవరీ మెరిసే ముఖమల్
జంఖానా పరిచి వెళ్ళారు !
ఓహో ! చంద్రకిత ధాత్రి
ఓహో ! కోరకిత గాత్రి
ఓహో ! శరధ్రాత్రి !
వ్యధలతో బాధ్యతలతో
భయాలతో మహితమైన
నా మనస్సుకిప్పుడూరట కలుగుతోంది.
ఈ వెన్నెల నా మనస్సులోకి
జారుతోంది
నా గుండెల పగుళ్ళనుండి కారుతోంది
నా అంతరాంతర రంగస్థల
ఏకాకి నటుడినైన నన్ను
తన మైత్రీ మధుర భావంతో
క్రమ్ముకుంటోంది
నా లోపలి లోపలి గుప్త
వీణా తంత్రీ నివహాన్ని
వేపధు మృదు లాంగుళుల
తాకి పలికిస్తోంది.
నన్ను బతికిస్తోంది
నా బతుక్కి అందాన్ని
అర్ధాన్నీ ఆశనీ
రచిస్తోంది
నా రచన తానైపోయింది
వెన్నెల వంటి నా ఉద్రేకానికి
తెలుగు భాష శరద్వియ
ద్విహార వనమై నడిచిపోయింది
చలి చలిగా సరదాగా ఉంది వెన్నెల
చెలి తొలిరాత్రి సిగ్గులా ఉంది
విరిసిన చేమంతిపువ్వులా ఉంది
పడకగదిలో వెలిగించిన
అగరొత్తుల వాసనలా ఉంది
పడగిప్పిన పాములు తిరిగే
పండిన మొగలి వనంలాగుంది
పన్నీరు జల్లినట్టు ఉంది
విరహిణి కన్నీరులా ఉంది
విరజాజుల తావితో కలిసి
గమ్మత్తుగా ఉంది
విచిత్రమైన మోహమణి
కవాటాలను తెరుస్తోంది
యౌవన వనంలోని కేళీ సరస్సులా ఉంది
దవుదవ్వుల పడుచు పిల్లలు
పకపక నవ్వినట్టుంది
దాపరికంలేని కొండజాతి
నాతి వలపులాగుంది
ఇది సృష్టి సౌందర్యానుభూతికి టీక
ఇది తరుణ శృంగార
జీవన హేలకు ప్రతీక
చిందెను తెల్లని చల్లని వెన్నెల
చలిరాత్రుల మౌనపు
గానపు తెన్నుల
జారెను తోటల
కొబ్బరి మొవ్వుల
ఇంటిముందు బోగన్ విల్లా పువ్వుల
ధనికుల కిటికీ పరదా చిరుసందుల
సురతాలస నిద్రిత సతి కపోలమ్ముల
జారిన జార్జెత్ చీర జిలుగుటంచుల
చిందెను తెల్లని చల్లని వెన్నెల
చలిరాత్రుల మౌనపు గానపు తెన్నుల
నిరుపేదల కలలో
కదలిన తీయని ఊహల
ఊరిపక్క కాలువ అద్దపు రొమ్ముల
ఊరి బయట కాలీకాలని
చితి కీలల
ఆడవిలో వికసించిన ఒంటరి పువ్వుల
చిందెను తెల్లని చల్లని వెన్నెల
చలిరాత్రుల మౌనపు గానపు తెన్నుల
(1965)
(ఇది పుస్తకంలోని కవిత. తిలక్ గారు చదివిన దాంట్లో కొన్ని మార్పులు ఉన్నాయి.)
ఈ పుస్తకంలో "అమృతం కురిసిన రాత్రి", "నువ్వు లేవు నీ పాట ఉంది", "నేను కాని నేను" నాకు బాగా నచ్చే కవితలు.
Monday, November 16, 2009
నాలోన శివుడు కలడు..."
ఈ చివరి కార్తిక సొమవారం పరమ శివుణ్ణి ఇలా స్మరిస్తూ...
******
'పూర్తిగా తెలిసే వరకూ ఏ వ్యక్తి మీదా ఒక స్థిరమైన అభిప్రాయాన్ని ఏర్పరుచుకోకూడదు’ అన్నది నేను తెలుసుకున్న కొన్ని జీవిత సత్యాల్లో ఒకటి. ఒక మనిషిని మనం మొదట ఏ దృష్టితో చూస్తామో అదే అభిప్రాయం మనకి ఆ మనిషి గురించి ఇంకా బాగా తెలిసేవరకూ ఉండిపోతుంది. మెల్లగా, పూర్తిగా ఆ వ్యక్తి తెలిసాకా, మనకు గతంలో కలిగిన అభిప్రాయానికీ, కొత్తగా ఏర్పడిన అభిప్రాయానికీ ఎంత తేడా ఉందో తెలిసాకా ఆశ్చర్యం వేస్తుంది. అలా నాకు గతంలో ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోయి ఒక వ్యక్తంటే అమితమైన అభిమానం ఏర్పడిపోయింది. అది "తనికెళ్ళ భరణి" గారు. ఆయనను సినిమాల్లో నెగటివ్ పాత్రల్లో చూసి చూసి చిన్నప్పుడు అంత మంచి అభిప్రాయం ఉండేది కాదు..
"హాసం" మాస పత్రిక మొదలైయ్యాకా దాంట్లో ఆయన రాసిన వ్యాసాలు చదివాకా నాకు ఆయనంటే చాలా గౌరవం ఏర్పడిపోయింది. ఇంత మంచి రచయిత ఉన్నాడా ఈ వ్యక్తిలో అని ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత మిగతా రచనలు కుడా కొన్ని చదివాను. తర్వాత ఆయన ఒక డైలాగ్ రైటర్,నాటక రచయిత,కధా రచయిత అని కూడా తెలుసుకున్నాను. దాదాపు పదేళ్ల క్రితం ఇంకో కొత్త విషయం తెలుసుకున్నాను...ఆయన గొప్ప శివ భక్తుడని. ఆయన స్వయంగా రచించి, స్వరపరిచి, పాడిన "నాలోన శివుడు కలడు" అనే ఆల్బమ్ విన్నాకా. ఇది నాకు చాలా ఇష్టమైన భక్తి గీతాల ఆల్బమ్. మొత్తం ఐదు పాటలూ శివ తత్వాన్నీ, భరణి గారికున్న శివ భక్తినీ తెలుపుతాయి. అన్ని పాటలకూ ముందుమాట సామవేదం షణ్ముఖశర్మగారు చెప్తారు. అందులో నాకు బాగా నచ్చే మూడు పాటలు ఇక్కడ వినటానికి...మొదటి పాట మొత్తం సాహిత్యం కూడా....
--------------
నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకమ్ములేలగలడు
కోరితే సొకమ్ముబాపగలడు...((నాలోన))
నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు గంగపైకెత్తగలడు
పాపులను తుంగలో తొక్కగలడు((నాలోన))
నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు కొండపై ఉండగలడు
వరమిచ్చి గుండెలో పండగలడు((నాలోన))
నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు
ఒద్దంటే రెంటినీ మూయగలడు((నాలోన))
నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు సగము పంచీయగలడు
తిక్కతో అసలు తుంచేయగలడు((నాలోన))
నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు మనలోన కలవగలడు
దయతోటి తనలోన కలపగలడు((నాలోన))
నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు
నాటకాలాడగలడు తెరదించి మూటగట్టేయగలడు(౩)
************
2) "హమ్మయ్య దొరికావా అర్ధానారీశ్వరుడా
విడి విడిగా వెతికాను ఒకచోటే కలిసారా..
అమ్మేమో విల్లంటా అయ్యేమో అమ్మంటా
గురి చూసి కొట్టేది మన కర్మ ఫలమంటా.."
************
3)"నువ్వైనా చెప్పవమ్మ సాంబ శివునికీ
నువ్వే కనువిప్పవమ్మ సాంబ శివునికి.." పాటలో
"బుసకొట్టే పాములేరా మీ కోరికలు
అట్టలు కట్టిన జడలే పాతకమ్ములు"
"కడకు వల్లకాడేగద మీ నివాసమూ
కపాలమే గదా కడకు మీ విలాసమూ.."
వాక్యాలు జీవన తత్వాన్ని ఎంతో సులభంగా తెలియపరుస్తాయి.
*************
4)"ఈ జన్మకింతేరా మల్లనా
ఇంకో జన్మ నాకీయి మల్లనా..""
పాటలో "జానకి"గారి గళంలో పలికే ఆర్ధ్రతను విన్నాకా కళ్లలోకి నీరు ఉబికి వస్తుంది...
5)"ఓ శివా నా శివా బజ్జోరా మా శివా
ముడు కన్నులు మూసి బజ్జోర మా శివా..."
పాటలో "సుశీల" గారి జోల వింటూంటే మనకూ నిద్దుర వచ్చేస్తుంది...
భక్తిగితాలపై ఆసక్తి ఉన్న ప్రతివారు కొనుక్కోవలసిన కేసెట్ ఇది. ఇప్పుడు సి.డి కూడా వచ్చిందేమో తెలీదు మరి.
*********************************************************
ఇక రేపు తెల్లవారు ఝాములో పెట్టే "పోలి స్వర్గం" దీపాలతో ఈ కార్తీకానికి "హర హర మహాదేవ.."
Sunday, November 15, 2009
కూరల మార్కెట్...
చల్లని సాయంత్రం...ఆహ్లాదకరమైన వాతావరణం...బస్ ఎక్కాలనుకుని మళ్ళీ ఎక్కే ప్రయత్నం మానుకున్నాను. నడిచి వెళ్ళాలని అనిపించింది. కూరల కోసం రిలయన్స్...చౌపాల్ మొదలైన వాటికి వెళ్ళటానికి విసుగనిపించినప్పుడల్లా నేను దగ్గరలోని మార్కెట్ కు వెళ్తూంటాను. కొద్దిగా దుమ్ముని, బురదని భరించగలిగితే మార్కెట్టే కూరలకి బెస్ట్ నాకైతే. ఇయర్ ఫోన్స్ తీసి చెవులకు తగిలించుకున్నాను. అలా పాటలు వింటూ ఎంత దూరమైనా నడిచేయటం నాకు చాలా ఇష్టం...అలానే వింటూ బయల్దేరాను. ఆర్.జే ఏదో జోకేసారు. భలే నవ్వు వచ్చింది....రోడ్దు మీద నవ్వుకుంటు వెళ్తూన్న నాకే అనుమానం వచ్చింది...ఒక్కర్తి రోడ్డు మీద నవ్వుకుంటా వెళ్తోంది..పిచ్చిదనుకుంటారేమో...అనిపిమ్చి బలవంతాన నవ్వు ఆపుకున్నా... చెవిలో "గల గల పారుతున్న గోదారిలా..." మొదలైంది...ఆలోచనలూ పరిగెట్టడం మొదలేట్టాయి...
కూరల కోసం మార్కెట్ కు ఎప్పటినుంచీ వెళ్తున్నానో గుర్తు వచ్చింది...12,13 ఏళ్ళ నుంచీ వెళ్తున్నాను. నా ఫ్రెండ్ గుర్తుకు వచ్చింది. మధ్యలో ఈ ప్రెండేమిటి? అంటే...డిగ్రీలో ఉన్నప్పుడు నా క్లోజ్ ప్రెండ్ ఒకమ్మాయి ఇల్లు విజయవాడ సత్యనారాయణపురం మార్కెట్ వెనక సందులో ఉండేది. మొదట్లో వాళ్ళింటికి వెళ్ళేప్పుడు అమ్మ కూరలు తెమ్మంటే "తేను ఫో" అనేదాన్ని. ఒకసారి నేను వెళ్ళినప్పుడు తను "కూరలు తేవాలి వస్తావా?" అంది..."కూరలు నువ్వు తెస్తావా?" అన్నాను నేను ఆశ్చర్యంగా.."అవును..అమ్మకి కుదరకపోతే నేను వెళ్తాను.." అంది. అంతే...ఆ రోజు మొదలు ఈ రోజు దాకా నాకు కూరలు తేవటం చాలా ఫేవరేట్ పని అయిపోయింది. అమ్మ అడగకుండానే "అమ్మా!కూరలు కావాలా?" అని అడిగేదాన్ని. కాలగమనంలో నా ఫ్రెండ్ నాకు నెమ్మదిగా దూరమైపోయింది...అయినా ఈ "కూరలు కొనటం" అనే ఇష్టం మాత్రం ఇలాగే ఉండిపోయింది...!
ఆ ప్రెండ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం...మా ఇద్దరి మధ్యన రహస్యాలు, చెప్పుకోని విషయాలు ఉండేవే కాదు...అర్ధరాత్రి అపరాత్రి లేదు...ఎప్పుడు ఏది గుర్తు వస్తే అది ఒకరితో ఒకరం చెప్పేసుకోవాల్సిందే. మా ఇద్దరి నాన్నలూ ఫోను బిల్లులు గురించి బెంగలు పెట్టుకున్న రోజులింకా గుర్తు నాకు.. 10,12 ఏళ్ళ గాఢ స్నేహం తరువాత చెప్పుకోదగ్గ కారణాలు లేకపోయినా జీవనగమనంలో మారే ప్రాధాన్యతలూ, యాంత్రిక జీవన విధానం మా దూరానికి కారణం అయ్యాయి...కొన్ని స్నేహాలు అంతేనేమో...వాళ్ళని blame చెయ్యాలనిపించదు....she's still is a part of my heart...! తను గుర్తొస్తే నాకీ ఆతిఫ్ పాట గుర్తు వస్తుంది..""तेरे बिन में यु कैसे जिया...कैसे जिया तेरे बिन..लेकर याद तेरी राते मेरी कटी..."
సరే, ఇంతకీ మార్కెట్ వచ్చేసి ఆలోచనలు కట్ అయ్యాయి...fm లోంచి ఇయర్ ఫోన్స్ లో "ओ सथिरॆ तेरॆ बिना भी क्या जीना.." పాట మొదలైంది...ఆహా ! అనుకున్నా...అలా వింటూనే కూరలు కొనటం మొదలెట్టాను. ఏమిటో ఈ రేట్లు...సింధుభైరవిలో భైరవి డైలాగ్ గుర్తు వచ్చింది "వంకాయలా గుర్రాలా?" అంటుంది. అలాగ వంకాయ ధర కాకపోయినా మిగిలిన వాటి ధరలలో పెరుగుదలే కానీ తరుగుదల కనిపించట్లేదు. చివరిగా ఆకుకూరలతో కొనటం పూర్తి చేసాను...
చెవిలో ఇదివరకెప్పుడూ వినని కొత్త పాటొకటి మొదలైంది...చిల్లర లెఖ్ఖ వేసుకునే హడావుడిలో పాట తాలుకూ వివరం వినలేదు. "రింగ రింగా రింగ రింగా..." అని వస్తోంది పాట. ఏదో మాస్ పాటలాగుంది. ఏదన్నా కొత్త సినిమాలోదేమో...సరదాగా అనిపించింది. సగమే విన్నాను మరి..మొత్తం ఎలా ఉంటుందో..ఇంటికెళ్ళగానే గూగులమ్మనడగాలి అనుకున్నా. కూరల బరువుతో బస్సెక్కటం వీలు కాదు కాబట్టి ఆటో పిలిచి ఎక్కి కూర్చున్నా...
ఇంకేంటి..? ఆటో ఇంటికీ....నేను లిఫ్ట్ లోకీ...!! అంతే...
Saturday, November 14, 2009
ఒక మంచి పిల్లల పాట....
రచన:దాశరధి
సంగీతం:ఎం.బి.శ్రీనివాసన్
పాడినది:వాణీజయరాం బృందం.
పిల్లల్లారా పాపల్లారా
రేపటి భారత పౌరుల్లారా
పెద్దలకే ఒక దారిని చూపే పిల్లల్లారా...పిల్లల్లారా
మీ కన్నుల్లో పున్నమి జాబిలి ఉన్నాడూ
ఉన్నడూ....పొంచున్నాడూ
మీ మనసుల్లో దేముడు కొలువై ఉన్నాడూ
ఉన్నాడూ..అతడున్నాడూ
భారతమాతకు ముద్దుల బిడ్డలు మీరేలే
మీరేలే...మీరేలే..
అమ్మకు మీపై అంతే లేని ప్రేమేలే...
ప్రేమేలే.. ((పిల్లల్లారా))
ఉత్తరాన గల మంచుకొండకు దక్షిణాన గల సముద్రానికీ
ఐకమత్యమూ సాధించే అందమైన ఓ బాలల్లారా
ఆశాజ్యోతులు మీరేలే...((ఉత్తరాన))
కులాల మతాల గుద్దులాటలు
మరిపించేది మీరేలే...మరిపించేది మీరేలే
భాషావేష బేధాలన్ని పారద్రోలేది మీరేలే
రూపుమాపేది మీరేలే ((పిల్లల్లారా))
భారతదేశం ఒకటే ఇల్లు భారతమాతకు మీరే కళ్ళు
మీరే కళ్ళు...
జాతిపతాకం పైకెగరేసి జాతిగౌరవం కాపాడండి
జాతిగౌరవం కాపాడండి(2)
బడిలో బయట అంతా కలిసి భారతీయిలై మెలగండీ
భారతీయిలై మెలగండీ(2)
కన్యకుమారికి కాశ్మీరానికి అన్యోన్యతను పెంచండీ(2)
వీడని బంధం వేయండీ....((పిల్లలారా...))
Saturday, November 7, 2009
స్నేహం..
" సృష్టి లో తీయనిది స్నేహమేనోయి.."
"స్నేహానికన్న మిన్న లోకాన లేదురా.."
"నిజమైన స్నేహితుడు భగవంతుడు ఇచ్చిన వరం..."
"A friend in need is a friend indeed"
"A Friend is one..who comes in when the whole world has goneout.."
"A true friend is a gift of God.."
స్నేహమనగానే ఇలా ఎన్నో నిర్వచనాలు. మనల్ని మనకు కొత్తగా పరిచయం చేసేవారు, మన తప్పులని సరిదిద్దేవారూ, మనలోని మంచి గుణాలను మనకు చూపెట్టేవారు, అంధకారంలో కొట్టుకు పోతూంటే వెలుగు చూపెట్టే నిజమైన స్నేహితులు చాలా అరుదుగా దొరుకుతారు. స్నేహమైనా ప్రేమైనా నాదొకటే సూత్రం-- ఒక వ్యక్తిలోని సద్గుణాలను మాత్రమే ఇష్టపడటం కాదు. ఒక వ్యక్తిని ఆ వ్యక్తిలో మనకు నచ్చని లోపాలతో పాటూ ఇష్టపడాలి. ప్రేమించాలి. అప్పుడే ఏ బంధమైనా గట్టిగా నిలిచేది. నేను నా స్నేహితులను అలానే ప్రేమించాను. ఇవాళ నాకు మిగిలిన స్నేహితులు కూడా నన్ను అలా స్వీకరించినవారే.
జీవితంలో రకరకాల మజిలీలను దాటాకా ఇవాళ్టికీ నా పక్కన నిలబడినవారే నా నిజమైన మిత్రులు. వెనుదిరిగి చూస్తే దారిలో నిలిచిపోయిన వారు, మధ్యలో వీడిపోయినవారూ ఎందరో...! ఆ ఋణం అంతవరకేనన్నమాట అనుకుంటూ ఉంటాను. "ఇది కధ కాదు" చిత్రంలో ఆత్రేయగారన్నారు...
"వెళ్తారు వెళ్లేటివాళ్ళు,
చెప్పేసెయ్ తుది విడుకోలు
ఉంటారు ఋణమున్నవాళ్ళు
వింటారు నీ గుండె రొదలు..." అని.
ఈ సొదంతా ఎందుకంటే...ఇప్పుడే నా క్లోజ్ ఫ్రెండ్ "మధవి" ఫోన్ చేసింది. ఆ ఆనందంలో తన గురించి చెప్పాలనిపించి ఈ టపా...!అందరికీ గొప్ప స్నేహితులు కొందరు ఉంటారు. నాకూ కొద్దిపాటి మంచి మిత్రులు ఉన్నారు. వాళ్లలో మాధవి ఒకర్తి. తనిప్పుడు బొంబాయిలో ఒక బాంక్ లో మేనేజర్. మాధవి తో నా స్నేహం వింతగా జరిగింది. తను నా స్కూల్ ఫ్రెండ్. నేను 8th క్లాస్ లో స్కూల్ మారాను. తను, నేనూ వెరే వేరే సెక్షన్స్. ఆ ఏడు పరిచయమే ఉండేది. 9th క్లాస్ లో మేమిద్దరం ఒకే సెక్షన్లో పడ్దాం. నా లెఖ్ఖల పరిజ్ఞానానికి మా మేథ్స్ సార్ గారు కొంచెం భయపడి, అమ్మా ఇవాళ నుంచీ నువ్వు మాధవి పక్కన కూర్చోమని నా ప్లేస్ మార్చేసారు. మధవీ లెఖ్ఖల్లో ఫస్ట్. సార్ బోర్డ్ మిద చెప్తూంటే అది వెనక నుంచి చెప్పేస్తూ ఉండేది. ఆయన వెనక్కు తిరిగి, "నువ్వు చెప్తావా? నన్ను చెప్పనిస్తావా? " అనేవారు. ఆపేసేది. మళ్ళీ మర్నాడు అదే తంతు. సార్ ఫేవొరేట్ స్టూడెంట్ తను. ఈ లెఖ్ఖలనెవడు కనుక్కున్నాడురా బాబు? అనే టైపు నేను...! మొత్తానికి పక్కన కూర్చోవటం వల్ల కాస్త బానే నేర్చుకున్నాను. అలా మా స్నేహం మొదలైంది.
మా ఇద్దరికీ ఉన్న కామన్ ఇంట్రెస్ట్ "హిందీ పాటలు". ఇద్దరం తెగ పాడేసుకునేవాళ్ళం. నేను బాగా పాడేదాన్నవటo వల్ల తనకీ నాపట్ల ఆసక్తి పెరిగింది. కానీ నాకు కొంచం కోపం ఎక్కువే. కాస్త తిక్క, ఆలోచన తక్కువ, దూకుడు ఎక్కువ. ఒకరోజు నాకు తనమీద ఎందుకో కోపం వచ్చింది. ఆ రోజంతా నేను అసలు తనతో మాట్లాడలేదు. సాయంత్రం స్కూల్ బస్ ఎక్కటానికి వెళ్పోతూంటే నా వెనకే వచ్చి నా చెయ్యి పట్తుకుని ఆపింది..."నా మీద కోపం ఉంటే నన్ను తిట్టు...కానీ నాతో మాట్లాడటం మానద్దు..." అనేసి వెళ్పోయింది. నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి..ఎందుకో దీనికి నేనంటే అంత అభిమానం అని పొంగిపోయాను. ఆ రోజు మొదలు నేనెప్పుడూ తనతో దెబ్బలాడలేదు.
మేం కలిసి చదివుకున్నది రెండు సంవత్సరాలే. ట్రాంస్ఫర్ అయి వాళ్ళు గుంటూరు వెళ్పోయారు. ఇంటర్, డిగ్రీ అక్కడే చేసింది. అప్పుడప్పుడు విజయవాడ వచ్చేది తనే. ఉత్తరాలు రాసుకునేవాళ్ళం చాలా ఏళ్ళు...డిగ్రి అవ్వగానే BSRB రాసింది. బ్రిలియంట్ బ్రైన్ కదా మొదటి ఎటెంప్ట్ లోనే జాబ్ వచ్చేసింది. తర్వాత పి.ఓస్ కి రాస్తే మొత్తం 5,6 బ్యాంకుల్లో ఒకేసారి వచ్చాయి పోస్ట్లు. ఎక్కడ ఏ ఊళ్ళో ఉన్నా ఫోన్లు చేసేది..."నేను ఉద్యోగం చేస్తున్నాను కదే,నేనే చేస్తాను" అనేది. మా ఇరవై రెండేళ్ళ స్నేహం లో నా ప్రతి పుట్టినరోజుకి తన ఫొన్ వస్తుంది. ఒకసారి మద్రాస్ లో ట్రైనింగ్లో ఉంది. నా పుట్టినరోజుకి రాత్రి 9.30 ఫోన్ చేసింది. పొద్దున్నుంచీ కుదరలేదే అని. ఆ మధ్య తనని బ్యాంక్ వాళ్ళు రెండేళ్ళు లండన్ పంపించారు. అప్పుడు కూడా తను నెలకోసారైనా ఫోన్ చేసి మాట్లాడేది. మళ్ళీ మేము బొంబాయిలో ఉన్నప్పుడు అనుకోకుండా ట్రాంస్ఫర్ మీద అక్కడకు వచ్చారు వాళ్ళు. మళ్లీ చాలా ఏళ్ళకు కలిసున్నాం కొన్నాళ్ళు. ఇప్పుడు మేం వచ్చేసినా తను అక్కడే.
తన సిక్స్త్ సెన్స్ ఎలా ఎలర్ట్ చేస్తుందో గానీ నాకు ముడ్ బాగోలేనప్పుడు తన ఫొన్ తప్పక వస్తూంటుంది. చాలా సమయాల్లో నాలో ఎంతో ధైర్యాన్ని నింపింది తను. రెండునెలల క్రితం చాలా రోజులయ్యింది ఫొనుల్లేవని నేనే చేసాను. పాపకి బాలేదు నువ్వు కంగారు పడతావని చెప్పలేదే..అంది. అంత కంగారులో కూడా నేను ఎక్కడ టెంషన్ పడతాననో అని ఆలోచించిందది. ఇందాకా ఫొన్ చేసి చాలా రోజులయ్యిందని బోల్డు సేపు మాట్లాడింది. బొంబాయి లాంటి హడావుడి ఊళ్ళో, లోకల్ ట్రైన్స్ లో తిరుగుతూ, ఉద్యోగం టెంషన్స్ తో, ఇద్దరు పిల్లలతో బిజీ గా ఉన్నా సరే... లోకల్ ట్రైన్స్ లో ఉన్నప్పుడు, ఇంటికి వెళ్ళేప్పుడూ నన్ను పలకరిస్తూ ఉంటుంది. మనసుంటే మార్గం ఉంటుందనటానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి అనిపిస్తుంది నాకు. True friend అంటే తనే కదా మరి.
మన సద్గుణాలనే కాదు, మనలోని లోపాలను కూడా భరించేవారే నిజమైన స్నేహితులు. నా మిత్రులు నాలోని సద్గుణాలను నాకు చూపారు. నాకు తెలియని ప్రత్యేకతలను నాలో చూసారు...నాకు చూపెట్టారు. ఇవాల్టికీ నన్ను వదలకుండా గట్టిగా పట్టుకునే ఉన్నారు. అందుకే వారంతా నా నిజమైన మిత్రులు ...! నాకున్న ఇలాంటి మంచి స్నేహితులు ఇంకొందరి గురించి మరోసారి ఎప్పుడన్నా...
Friday, November 6, 2009
కాశీ యాత్ర
మళ్ళీ పది నెలల క్రితం మేము కాశీ, గయ మొదలైన ప్రదేశాలకు వెళ్లినప్పుడు కాశీలో రెండవసారి గంగా స్నానం చేసాను. ఆనందం వేసింది కానీ చిన్నప్పుడు హరిద్వార్ లో ఆ మొదటిసారి పొందిన భావనే గొప్పగా తోచింది నాకు...ఎందుకనో మరి...!!
ఆ రోజు కాశీనాధునికి నా చేతులతో పాలాభిషేకం చేసాను, పువ్వులు వేసాను...విచిత్రంగా నాకు ఏమీ కోరుకోవాలనిపించలేదప్పుడు...అప్రయత్నంగా "ఆదిభిక్షువు వాడినేమి కోరేదీ.." పాట గుర్తుకొచ్చింది.
ఆ రోజు శుక్రవారం. విశాలాక్షి అమ్మవారి గుడి ఖాళీగా ఉంది మేం వెళ్ళినప్పుడు. ఎందుకో మరి మేం అడగకుండానే రండి కూర్చోండి అని కుంకుమపూజ చేయించి, కుంకుమ,గాజులూ ఇచ్చారు ఆ పూజారి. ఎంతైనా "ఇస్త్రీ "ని కదా..చాలా ఫీలయిపొయి ఆనందించేసాను.
అప్పుడు కాశీలో, గయలో తీసిన కొన్ని ఫోటోలు...
తెడ్డుపడవలో కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకోవటానికి వెళ్తూ ఒడ్దున కనబడిన వాటికి తీసిన ఫోటోలు ఇవి
"గంగా ఆయీ కహా సే..." అనే ఆర్.డి.బర్మన్ పాట గుర్తుకు వచ్చింది పడవలో వెళ్తూంటే...
కార్తీకం లో మీతో కాశీ యాత్ర చేయించేసాను చూసారా... :)