సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Showing posts with label సరదా కబుర్లు. Show all posts
Showing posts with label సరదా కబుర్లు. Show all posts

Monday, February 28, 2011

వంటరాని మగాడు (Just for fun..)


"వంటొచ్చిన మగాడు" అని మా అన్నయ్యను దృష్టిలో పెట్టుకుని చాలా కాలం క్రితం ఒక టపా రాసాను. ఆ తరువాత "వంటరాని మగాడు" అని రెండవ భాగం రాస్తానని అన్నాను కానీ అది రాయటం కుదరనేలేదు. కొందరు బ్లాగ్మిత్రులు రెండవభాగం ఏదని అడిగారు అప్పట్లో.. అయినా ఎందుకనో ఆ రెండవభాగం రాసే మూడ్ అప్పుడు పోయింది. ఇన్నాళ్ళకు మళ్ళీ ఆ రెండవ భాగం రాయాలని సంకల్పం కలిగింది. రెంటికీ లింక్ అయితే లేదు కానీ మొదటిది చదవనివారు అక్కడకు వెళ్ళి ఓ లుక్కేస్తే బాగుంటుందని అభిప్రాయం.
( http://trishnaventa.blogspot.com/2009/10/just-for-fun.html )
************
వంటరాని మగాడు:

వంటరాని మగవాళ్ళలో నాకు తెలిసినంతలో ముఖ్యంగా మూడు రకలవాళ్ళు ఉన్నారు. ఇంకా కూడా ఉంటారేమో నాకైతే తెలీదు..:))

1) కొందరికి వండటం రాదు కానీ వారు పెట్టినది తిని ఎంజాయ్ చెయ్యగలరు. వీరితో ఏ ఇబ్బందీ ఉండదు.

2)మరొకరకం వారు వండటం రాకపోయినా వంటలకు వంకలు పెడుతూ ఉంటారు వండిపెట్టేవారి ఒళ్ళుమండెలా. భోజనం తింటున్నంతసేపూ వారి సాధింపుల రికార్డ్ మోగుతూనే ఉంటుంది. ఆ వంకలన్నీ టేస్ట్ లు తెలియటం వల్ల కదా అని ఈ రకం వారితో కూడా కాస్తంత సర్దుకుపోవచ్చు అని నా అభిప్రాయం.

3)కానీ మూడో రకం వారున్నారే వారితోనే మహా కష్టం. వాళ్ళకు వండటమూ రాదు. తినటమూ రాదు. అసలు ఫలానాది తినాలన్న కోరికా ఉండదు. పదార్ధాల్లో ఉప్పు కారాలు ఎక్కువయ్యాయో, తక్కువయ్యాయో తెలియదు. ఏం వండాలో, ఎంత వండాలో, వండితే తింటారో తినరో కూడా తెలీని ఈ రకం వారితోనే అసలైన తంటాలన్నీ!!

ఇప్పుడు ఈ మూడు రకాలవాళ్లతో భార్యల సంభాషణలు ఎలాగుంటాయంటే : (ఇది ఎవరినీ నొప్పించటానికి కాదు...కేవలం సరదాకే అని మరొకసారి మనవి)

1) వండటం రాకపోయినా తినేవారు:


"ఇవాళ ఏం వండను?"
"ఏదో నీకు తోచినది వండు. ఏదైనా పరవాలేదు."

"ఆహా చారు అదిరింది. ఎంత బాగుందో"
"ఈ కూర కూడా సూపర్. అసలు నీ వంటే వంట. ఉండు ఈసారి మా బాస్ ను భోజనానికి పిలుస్తాను"

"ఏమిటీ ఊరు వెళ్తావా? మరి నా భోజనం? అసలే నాకు బయట తిండి పడదు. త్వరగా వచ్చేయ్..."
" ...?? మీకు వండి పెట్టడం కోసం నేను వచ్చేయాలా? అంటే మీకు మీ తిండిని గురించిన జాగ్రత్తే తప్ప నా మీద బెంగ ఉండదన్న మాట...."

******* ********** ********
2) వండటం రాకపోయినా తింటున్నంత సేపూ వంకలు పెట్టేవారు:

"ఏమండీ ఇవాళేం వండమంటారు?"
"గుత్తివంకాయ కూర , కొబ్బరి పచ్చడి చేసి, పప్పుపులుసు పెట్టు"

"ఏమిటిది? ఇదసలు గుత్తివంకాయ కూరేనా? అసలు మసాలా ఏది? ఏమేం వేసావిందులో..?
ఇది కొబ్బరి పచ్చడా? దీన్నిండా కొబ్బరి ముక్కలే కనబడుతున్నాయి. మెత్తగా గ్రైండ్ చెయ్యటం రాదా నీకు? మా అమ్మయితే రోట్లో కూడా ఎంత మెత్తగా రుబ్బేదనుకున్నావు"
(ఇలా ఎవరితోనన్నా కంపారిజన్ లు చేసినప్పుడు సదరు అమ్మగారికి రోకలి తెచ్చి అయ్యగారి నెత్తిన ఒక్కటిచ్చుకోవాలన్నంత కోపం వస్తుంది.)

"ఇది పప్పు పులుసా? చారా? తేడా ఏం కనబడటం లేదు. ఈ పోపేమిటి ఇలా మాడిపోయింది? మాడిపోయిన పోపుని చూస్తే నాకెంత ఒళ్ళుమంటో నీకు తెలుసుకదా? అయినా మాడిస్తే ఏమిటర్ధం?...."
"అయితే మీకు నచ్చేట్టు మీరే వండుకోండి. వండిన ప్రతిదానికీ వంక పెడితే నేను వండలేను.."
"నాకు వంటొస్తే నిన్నెందుకు చేసుకోవటం? హాయిగా నాక్కావాల్సిన పదార్ధం నేనే వండుకుని తినేవాడిని"
"అంటే కేవలం వండిపెట్టడానికే నన్ను చేసుకున్నారా..?"

****** ******* ******

3) వండటమూ రాదు. తినటమూ రాదు :

"ఏమండీ ఇవాళ ఏం వండను?"
" రోజూ ఎందుకలా అడుగుతావు? ఏదో ఒకటి వండు."
"ఇవాళ ఇది చెయ్యి అని అసలెప్పుడూ అడగరా?"
"ఏమో నాకు అలా అడగాలని అనిపించదు.."

**** ***** ******

"కూర బాగుందా?"
"బానే ఉంది."
"పప్పు?"
"బానే ఉంది"
"రాత్రికి మొన్న చేసిన కూర చెయ్యనా?"
"ఏ కూర? నాకు గుర్తులేదు.."

**** **** *****
"ఎందుకు కూర ఉంచేసారు? మొన్న తిన్నారు కదా?"
"ఆ రోజు నచ్చింది. ఇవాళ నచ్చలేదు. ఎప్పుడు వండినా తినితీరాలని రూల్ లేదుగా.."

"ఈ పచ్చడెందుకు వదిలేసారు?"
"నేనెప్పుడూ తినలేదిది"
"ఓసారి టేస్ట్ చేసి చూడచ్చు కదా నచ్చుతుందేమో..?"
"ఎప్పుడూ తినని కొత్త పదార్ధాలు నేను తినను"

**** ***** *****

"ఇది మీరు చిన్నప్పటినుంచీ బాగా తినే కూర అన్నరు కదా..వదిలేసారేం?"
"చూడటానికి బాలేదు"
"తింటే బాగుంటుందేమో...ట్రై చేయచ్చు కదా.."
"ఇదివరకూ చెప్పను నీకు చూడగానే బాగుంటే తప్ప నేను ఏదీ తిననని"
"మరి ఇక ఏం వండాలి నేను?"
"......."
"ఏరోజూ ఇది కావాలని అడగరు. కొత్త పదార్ధాలు తినరు. పాత పదార్ధాలు ఒకోసారి తింటారు. ఒకోసారి తినరు. మీతో వేగటం నావల్ల కాదు బాబూ.."
"చేసుకున్నాకా తప్పదు మరి...ఈ జన్మకిలాక్కానీ..."

********** ******** *********

విశ్లేషణ:వంట రాని మగవాళ్ళలో మొదటి కేటగిరీనే బెస్ట్. అవసరార్ధం తప్పదనో, నిజంగానే భార్య వంట నచ్చో మెచ్చుకుంటూ తినేస్తారు. ఎవర్నన్నా భోజనానికి పిలిచినా, పిలవకపోయినా భార్య వంట మెచ్చుకుంటారు.

ఇక రెండో రకం వారితో సర్దుకుపోవచ్చు. వంకలు పెడ్తున్నారని కోపం వచ్చినా ఫలానాది తినాలని ఉందనీ, ఫలానాది బాలేదనీ చెప్పటం వల్ల కాస్త తినటం పట్ల ఆసక్తి ఉందని గమనించొచ్చు. వంట వచ్చిన ఇల్లాలికి మనశ్శాంతి.

కానీ ఆ మూడో రకం వాళ్ళతో మాత్రం చాలా కష్టం.

ఏమైనా నా ఓటు మాత్రం వంటొచ్చిన మగవాళ్ళకే. వీరి తాలూకూ భార్యలు చాలా అదృష్టవంతులు అని నా అభిప్రాయం.(ఇక్కడ మా అన్నయ్యకూ జై...!!)అదేం లేదు.దూరపు కొండలు నునుపు.. అంటారా?

Sunday, February 27, 2011

మా వీధిలో "కూరల సంత"


"సంత" అంటే కొన్ని చిన్న చిన్న దుకాణాల సముదాయం...అంటే మార్కెట్ అనుకోవచ్చు. అన్నిరకాల వస్తువులు దొరికే సంతలు ఉంటాయి. మల్టీపర్పస్ అన్నమాట. అలా కాకుండా కొన్ని ప్రత్యేకమైన సంతలు కూడా ఉంటూంటాయి. అక్కడ దొరికే వస్తువుని బట్టి ఆ సంతకు ఆ పేరు ఉంటుంది. పూల సంత, పుస్తకాల సంత, కూరల సంత, పశువుల సంత...అలా అన్నమాట. పూర్వం పల్లెటూర్లలో, గ్రామాల్లో ఊరి చివరలో వారంలో ఒక రోజున, ఎక్కువగా ఆదివారాలు ఈ సంతలు ఏర్పాటు చేసేవారు. పట్టణాల్లో కూడా సంతలు పెడుతూంటారు. మా అత్త, నాన్న, నాన్నమ్మ మొదలైనవారు చెబితే వినటమే కానీ నేనెప్పుడూ ఏ సంతా చూడలేదు. ఈ మధ్యనే ఓ నెల నుంచీ మా వీధిలో కూరల సంత పెడుతున్నారు కొత్తగా.

ఇక కూరలమార్కెట్ కో, రిలయన్స్ కో వెళ్ళాల్సిన అవసరం లేకుండా ప్రతి శనివారం హాయిగా ఇంటి దగ్గరే తక్కువ రేట్లకు కూరలు కొనేసుకుంటున్నాను. అసలు మార్కెట్ కు వెళ్ళి కూరలు కొనటం అనేది నాకు చాలా ఇష్టమైన పనుల్లో ఒకటి. ఆకుపచ్చగా, తాజాగా ఉన్న కూరలను చూస్తూంటే ఉత్సాహం పెరిగిపోయి, చేతిలోని సంచీ నిండి, చెయ్యి ఆ బరువును మొయ్యలేకపోతోంది అన్న స్పృహ కలిగేదాకా కూరలు కొనేస్తునే ఉంటాను. ఒకటా రెండా? దాదాపు పధ్ధెనిమిది,ఇరవైఏళ్ల అలవాటు. పైగా నాకు కరివేపాకు కోసమో,కొత్తిమీర కోసమో అడుగడుక్కీ వీధిలోకి పరుగెట్టడం ఇష్టం ఉండదు. వారనికి సరిపడా కూరలతో పాటూ కర్వేపాకు, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయలు మొదలైన "కుక్కింగ్ ఏక్సెసరీస్" అన్నీ మర్చిపోకుండా తప్పనిసరిగా కొనేస్తాను. మా వీధిలోని సంత పుణ్యమా అని అన్నీ అందుబాటులోకి వచ్చేసరికీ అసలా కూరల్ని చూడగానే ఆనందతాండవమే. మొదటి రెండువారాలూ భారీజనాలను చూసి భయపడి నేను అటుకేసి వెళ్ళలేదు కానీ ప్రతి శనివారం "కూరల సంత" పెట్టడం చూసి రెండువారాల నుంచీ నేనూ కొనటం మొదలెట్టా.


సాయంత్రం ఆరుదాటితే జనం పెరిగిపోతారని గమనించి మూడూ నాలుగు మధ్యన వెళ్ళి తెచ్చేసుకుంటున్నాను. కూరలే కాక ఉసిరి కాయలు, చింతకాయలు, పండు మిర్చి, పెద్ద మిరపకాయలు మొదలైనవి కూడా ఉంటున్నాయి. క్రితం వారం పండు మిర్చి ఓ పావు కొని కొరివికారం, పెద్ద మిరపకాయలతో ఊరు మిరపకాయలు పెట్టాను. నిన్న ముద్దుగా బొద్దుగా ఉన్న చింతకాయలు కొన్నా. ఇంకా పచ్చడి పెట్టాలి. అప్పుడే తోటలోంచి కోసుకొచ్చినట్లు ఉన్న ఆకుకూరలు, తాజా కూరలు భలే ముచ్చటగా ఉన్నాయి. కూరలు అమ్మే ఒకమ్మాయి నన్ను గుర్తుపట్టి "అమ్మా నువ్వు మార్కెట్టుకు వస్తూంటావు కదా" అని అడిగింది. "ఎలా తెలుసు నేను?" అనడిగాను. మేము అక్కడివాళ్ళమే. జనాలు ఎక్కువరావట్లేదని ఇలా ఒకో వారం ఒకో వీధిలోకీ వచ్చి అమ్ముతున్నామమ్మా. ఇలా వస్తే మాకూ బేరాలు బాగా అవుతున్నాయి. నువ్వు వస్తూంటావు కదా నిన్ను గుర్తుపట్టా" అంది. "జనాల దగ్గరకు మీరు వెళ్లండి..."అన్న "మిష్టర్ పెళ్ళాం" సినిమాలో ఆమని డైలాగ్ గుర్తు వచ్చింది.

మధ్యాన్నం ఒంటిగంట నుంచీ రాత్రి తొమ్మిదింటిదాకా ఉంటున్నారు వీళ్ళంతా. ధరలన్నీ కూడా చాలా తక్కువగానే ఉంటున్నాయి. పావుకేజీలు కావలన్నా ఇస్తున్నారు. ముఖ్యంగా ఎవరి జాగాల్లో తుక్కు వారే క్లీన్ చేసుకుని తీసుకెళ్ళిపోవాలని రూల్ కూడా పెట్టడంవల్ల మర్నాడు పొద్దున్నే వీధంతా సంత మొహం ఎరుగనట్లు మామూలుగా కూడా ఉంటోంది. అది మరీ నచ్చేసింది నాకు. ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ కాలంలో ఇలాంటి సంతలు ఎంత అవసరమో అనిపించింది. కూరల మార్కెట్ రేట్లకు డబుల్ రేటు పెంచేసి అమ్మే వీధుల్లోని కూరల కొట్లువాళ్ళకీ, సూపర్ మార్కెట్ల వాళ్లకీ ఇలాంటి సంతలే తగిన సమాధానం.



Tuesday, December 28, 2010

"ళృ ...ళౄ"



గుణింతం గుర్తులు
 మధ్యనే నేను మా పాపతో పాటూ గుణింతం గుర్తులు నేర్చుకున్నాను. తలకట్టు, దీర్ఘము, గుడి, గుడి దీర్ఘము, కొమ్ము, కొమ్ము దీర్ఘము etc..etc.. అంతవరకూ బానే ఉంది. చిన్నప్పటివి ఎలానూ గుర్తులేవు. మళ్ళీ నేర్చేసుకోవటం అయ్యింది. అక్షరాలు కూడబలుక్కుని పేపర్లో హెడ్డింగులు, ఏదైనా కథల పుస్తకంలో వాక్యాలు చదివిస్తూంటే చక్కగా చదువుతోంది పాప. అది చూసి రెండు కాకులమూ("కాకి పిల్ల..." సామెత ప్రకారం) చాలా ఆనందిస్తున్నాం.


ఇక గుణింతాలు రాయటం, పలకటం నేర్చుకుంటున్నాం(నేనూ,పాప). దాదాపు అన్ని గుణింతాలు వచ్చేసాయి. "" నుంచి "" వరకూ, ఆఖరుకి "" "క్ష" గుణింతాలు కూడా పలకటం వచ్చేసాయి. కానీ ఒక్క గుణింతం మాత్రం నాకు పలకటం రావట్లేదు. అది కూడా మొత్తం కాదు. రెండే రెండు అక్షరాలు. అదీ "" గుణింతం. , ళా, ళి, ళీ, ళు, ళూ వరకూ వస్తోంది ఇకపై నాలిక పలకటం లేదు... "ళృ ...ళౄ" నేను పలికిన తీరు చూసి మా పాప పడీ పడీ నవ్వుతోంది...:(

మీకెవరికైనా పలకటం వస్తోందేమో కాస్త చెబుదురూ...

Monday, December 20, 2010

మౌనమే నా భాష


ప్రస్తుతానికి మౌనమే నా భాష. "మాటరాని మౌనమిది..." అని పాడుకుంటూ రెండు రోజులుగా కాలం వెళ్లబుచ్చుతున్నాను. కారణమేమనగా చలితిరిగింది కదా రెన్నాళ్ళ క్రితం గొంతు బొంగురుపోయింది. పోతే పోయిందని ఊరుకోక ఆదివారం శలవు దినం ఉంది కదా అని శనివారం కాసంత బయటకు తిరిగివచ్చేసరికీ కాస్తో కూస్తో బొంగురుగానైనా పలుకుతున్న గొంతు కాస్తా పూర్తిగా మూగబోయింది. ఆదివారం పొద్దుటి నుంచీ నో సౌండ్. దూరదర్షన్లో మధ్యాన్నం బధిరుల వార్తల్లో లాగ అన్నీ మూగ సైగలే. పిలవాలంటే చప్పట్లు...ఏదైనా చెప్పాలంటే పాప చదువుకునేందుకు కొన్న బోర్డ్ పై రాతలు. 'ఫోనులు చెయ్యద్దు నేను 'మాట్లాడలేను ' అని ఫ్రెండ్స్ కు ఎస్.ఎం.ఎస్ లు, మైల్స్ చేసేసాను. ఇదీ వరస.

'అబ్బ...ఎంత హాయిగా ఉందో రెండు రోజులు నేను ప్రశాంతంగా ఉండచ్చన్నమాట. రెండురోజుల్లో అదే వస్తుందిలే...' అన్న శ్రీవారి కులాసా వాక్యంతో అసలే నెప్పిగా ఉన్న గొంతు ఇంకొంచెం భగ్గున మండింది. నాకసలే ఒకటికి నాలుగు వాక్యాలు చెప్పటం అలవాటు. నోరు కట్టేసినట్లు ఉందనటానికి ఇంతకంటే గొప్ప ప్రాక్టికల్ ఎక్జాంపుల్ ఏముంటుంది? అనుకున్నాను. ఎప్పుడో స్కూల్లోనో, కాలెజీలోనో ఉన్నప్పుడు ఇంతలా గొంతు పోయింది. ఆ తరువాత మళ్ళీ ఇదే. ఎంతైనా ఇన్నాళ్ళూ నన్ను రక్షించిన "జలనేతి" ఎఫెక్ట్ తగ్గిపొతోందని గ్రహించాను. "జలనేతి" ఏమిటీ అంటే, "బీహార్ స్కూల్ ఆఫ్ యోగా" వాళ్ల దగ్గర నేను యోగా నేర్చుకున్నప్పుడు వాళ్ళు నేర్పించిన ఓ ప్రక్రియ "జలనేతి". తల పక్కకు వంచి, కొమ్ము జారీ లోంచి గోరువెచ్చని ఉప్పు నీరు ఒక నాస్ట్రిల్ లోంచి లోపలికి పోసి, ఇంకో నాస్ట్రిల్ లోంచి బయటకు వదిలే ప్రక్రియ. అందువల్ల కలిగే ప్రయోజనాలైతే కోకొల్లలు. చాలా రకాల తలనెప్పులు, ఆస్థ్మా, బ్రోంకైటిస్, సైనస్ ప్రాబ్లమ్స్, జలుబులు ఇంకా బోలెడు నయమవుతాయి. ముక్కు లోంచి శారీరంలోకి కనక్ట్ అయ్యే కొన్ని వేల నాడులు ఈ ప్రక్రియ ద్వారా శుభ్ర పడతాయి. కానీ ఇది ట్రైన్డ్ టీచర్ దగ్గరే నేర్చుకోవాలి. మొదటిసారి మేడం మాతో చేయించిన తరువాత పొందిన అనుభూతి చెప్పలేనిది. ఆ తరువాత ఆరునెలలు చాలా జాగ్రత్తగా రోజూ యోగా, జలనేతి అన్నీ మానకుండా చేసేదాన్ని. తర్వాత తర్వాత బధ్ధకం ఎక్కువై కొన్నాళ్ళు, కుదరక కొన్నాళ్ళు...అలా అలా గడిచిపోయింది.

చిన్నప్పుడు అస్తమానం జలుబు చేసేసేది. "మా ఆయనకు కోపం రానే రాదు. వస్తే సంవత్సరానికి రెండు సార్లే వస్తుంది. వచ్చినప్పుడలా ఆరునెలలు ఉంటుంది" అనే సామెత లాగ నాకు జలుబు సంవత్సరానికి రెండేసార్లు వచ్చి, వచ్చినప్పుడల్లా ఆరునెలలు ఉండేది. అలాంటిది అప్పట్లో ఆరు నెలలు చేసిన "జలనేతి" వల్ల దాదాపు తొమ్మిది,పదేళ్ళు దాకా ఏ ఇబ్బందీ లేకుండా హాయిగా ఉండగలిగాను. కొమ్ము జారీని పాడేయకుండా ఎక్కడికి వెళ్ళినా వెంటపెట్టుకుని వెళ్ళాను కానీ జలనేతి మాత్రం చెయ్యలేదు మళ్ళీ. ఈ మధ్యనే ఇక త్వర త్వరగా జలుబు వచ్చేస్తోంది. ఇక ఈసారి చలి ఎక్కువగా ఉండటం వల్ల సంపూర్ణంగా గొంతు మూగబోయింది.

మాట్లాడాలి అనుకున్నవి మాట్లాడలేకపోతున్నప్పుడు ఎంత బాధగా ఉంటుందో నిజంగా. చప్పట్లు కొట్టి ఇంట్లో వాళ్లను పిలవటం, పాప బోర్డ్ మీద వాక్యాలు రాసి ఇదీ అని చెప్పటం...నన్ను చూసి నేనే నవ్వుకుంటున్నాను. రెండు రోజులకే ఇలా ఉంటే నిజంగా ఎప్పటికీ మాట్లాడలేని వాళ్ళ పరిస్థితి ఏమిటీ? అనిపించింది. ఏదన్నా లేనప్పుడే కదా దాని అసలైన విలువ తెలిసేది.

Sunday, December 19, 2010

"గుర్రు"


శ్రీమహా విష్ణువు ఎప్పుడూ గుర్రు పెట్టిన దాఖలాలు లేవు. లేకపోతే ట్వెంన్టీఫోర్ అవర్సూ లక్ష్మీదేవికి ఎంత డిస్టర్బెన్స్...!! "గుర్రు". ఎవరుపెట్టారో కానీ భలే పేరు పెట్టారు. "గుర్రు"కు ఇంతకన్నా మంచి పేరు దొరకదేమో.

చిన్నప్పుడూ ఓ రోజు మేం స్కూల్ నుంచి వచ్చేసరికీ హాల్లో ఓ బేగ్ ఉంది. ఎవరో చుట్టాలు వచ్చారని చాలా సంబరపడుతూ అమ్మని అడిగాం ఎవరొచ్చారమ్మా అని. ’బొజ్జతాత’ వచ్చారు అండి అమ్మ. "బాబోయ్" అన్నాం వెంఠనే. తప్పు అలా అనకూడదు అని అమ్మ మందలించింది. బొజ్జతాత అనే ఆయన మా తాతయ్యకు వరసకు తమ్ముడు అవుతారు. పేద్ద బొజ్జ ఉండేదని బంధువుల్లో ఆ పేరు ఖాయం అయ్యిందాయనకు. ఈయన రెండు విషయాలకు ఫేమస్. ఆయనకు రెండడుగుల దూరానికి వెళ్ళగానే విపరీతమైన సిగరెట్టు కంపు. రాత్రికి ఆయన ఏ ఇంట్లో బస చేస్తే వాళ్ళకి నిద్ర ఉండదు. అంత భయంకరమైన గుర్రు పెట్టేవారాయన(పాపం ఇప్పుడు లేరు). మా ఇంట్లో కానీ బంధువుల్లో కానీ ఎవరికీ సిగరెట్ అలవాటు లేకపోవటం వల్ల నాకు ఆ వాసనకు అస్సలు పడదు. ఇక రాత్రి పూటలు చీమ చిటుక్కుమన్నా మెలుకువ వచ్చేసే నిద్ర నాది. మెలుకువ వస్తే ఓ పట్టాన ఇక ఆ పూట నిద్ర అయినట్లే.

ఎవరన్నా వస్తే హాల్లో నవారు మంచం వేసి పక్క వేసే డ్యూటీ నాది. బొజ్జతాతగారికి పక్క వేసేంతలో ఆయన వచ్చేసారు. ఏమ్మా బాగున్నావా? అని దగ్గరగా వచ్చి బుగ్గలు లాగారు. కంపు కంపు...! ఎలాగో తప్పించుకుని లోపలికి పరిగెట్టా. ఇక రాత్రికి భయంకరమైన గుర్రు...పాపం ఆయనను మాత్రం ఏం అంటాం. ఎవరి అలవాట్లు వారివి. మనకు గిట్టకపోతే మన ప్రోబ్లం. రెండు రోజులూ ఉండి, వచ్చిన పని అయ్యాకా మా ఆతిధ్యాన్ని మెచ్చుకుంటూ వెళ్పోయారాయన.

కొన్నాళ్ళ తరువాత ఓ రోజు స్కూల్ నుంచి రాగానే అమ్మ మమ్మల్ని కూర్చోపెట్టి టేప్రికార్డర్లో ఓ కేసెట్ పెట్టి ఇదేమిటో కనుక్కోండే అంది. చెప్పుకోవాలని చాలా ప్రయత్నించాం కానీ చెప్పలేకపోయాం. తగ్గుతోంది హెచ్చుతోంది...ఒక విచిత్రమైన సౌండ్ అది. మావల్ల కాదు కానీ అదేమిటో చెప్పమ్మా అన్నాం. "కొన్ని రోజులుగా మీ నాన్న గుర్రు పెడుతున్నారు. చెప్తే నమ్మటం లేదు. నేనేమిటి గుర్రేమిటి అని. అందుకని గుర్రు పెడుతూంటే రికార్డ్ చేసాను" అంది. నాన్న గుర్రు పెడుతున్నారా? ఆశ్చర్యపడీపోయాం. గుర్రు అంటే ఎవరో పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు మాత్రమే పెడతారని మా అభిప్రాయం. అదిమొదలు క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరన్నా వస్తే ఇదేమిటో చెప్పుకోండి అని ఆ కేసెట్ వినిపించేవాళ్ళాం. అప్పటి నుంచీ మా ఇంట్లో కూడా గుర్రు మొదలైంది.


అత్తగారింట్లో మొదటి రోజు మధ్యలో మెలుకువ వచ్చింది. కొత్త కదా అనుకునేలోపూ పక్కనుంచి గుర్రు వినబడింది. అమ్మో ఈయన గుర్రు పెడతారా...అనుకునే లోపూ మరో రెండూ మూడూ గుర్రు సౌండ్లు వినిపించాయి. బాబోయ్ వీళ్ళింట్లో అందరూ గురక పెడతారన్న మాట...అనుకున్నా. మిగతావాళ్ళ సంగతి సరే ఏం చెయ్యలేం. పక్కనున్న పతిదేవుడి సంగతి ఏమిటో అనుకున్నా. కొన్నాళ్ళకు సౌండ్ తీవ్రమైనప్పుడల్లా కాస్త కదిపితే (టేప్ రికార్డర్ సౌండ్ తగ్గించినట్లు)మళ్ళీ సౌండ్ తగ్గుతుంది అని తెలుసుకున్నా. ఇక ఆ సిస్టం ఫాలో అవటం మొదలెట్టా. కాస్త రిలీఫ్. కానీ అప్పుడప్పుడూ ఆఫీస్ వర్క్లోడ్ ఎక్కువ ఉన్నప్పుడూ ఈ గుర్రు సౌండ్ మరీ పెరిగిపోతుంది. నాకు మెలుకువ వచ్చేసి ఇక నిద్ర పట్టనంత. మధ్యలో సౌండ్ తగ్గించటానికి కదిపినా అయ్యగారి నిద్రకు ఏం ఆటంకం కలగదు. పిలిస్తే వస్తుంది నిద్రాదేవి ఆయన దగ్గరకు. శలవురోజు మధ్యాహ్నం అయినా సరే ఓ కునుకు పట్టిందంటే "గుర్రు" లేకుండా నిద్ర అవ్వదు.

ఆమధ్యన ఓసారి మధ్యాహ్నం అమ్మావాళ్ళింటికి వెళ్లా. అన్నయ్య నిద్రపోతున్నాడు. ఎక్కడనుంచో పెద్ద గుర్రు వినిపిస్తోంది. ఎవరూ?పక్కింట్లోంచా? అన్నా. "ఇంకెవరూ మీ అన్నయ్యే..." అంది వదిన. "పాపం వదిన" అనుకున్నా మనసులో. రాత్రి మెలుకువ వచ్చేసింది. పక్కన అమ్మ నాన్న కన్నా పెద్ద గుర్రుపెడుతోంది. ఇదేంటి నాన్నా అనడిగా పొద్దున్నే. 'ఈమధ్యనే అప్పుడప్పుడూ పెడుతోందే. అలసట ఎక్కువైపోయీ...' అన్నారు.

Thursday, December 16, 2010

ధనుర్మాస ప్రారంభం - మొదటి ముగ్గు !!






ఇవాళ నుంచీ ధనుర్మాసం మొదలు. ముగ్గులు మొదలు. కానీ ఇదేమిటి మొదటి ముగ్గు అని మూడు ముగ్గుల ఫోటోలు పెట్టాను? చిన్నది తులశమ్మ దగ్గర ఎలాగో ఫిక్స్ అయిపోయింది. ఇక పెద్ద ముగ్గులు రెంటిలో ఏ ముగ్గు పెడదామా అని ఆలోచిస్తున్నానన్నమాట. అందుకని మూడూ పెట్టేసాను...:) నాకు మామూలు ముగ్గుల కన్నా మెలికల ముగ్గులు బాగా ఇష్టం. ఎక్కువగా అవే వేస్తాను.

ముగ్గులు గురించి అదివరకూ రెండు సార్లు( 1, 2) రాసేసాను. అందుకని ఇక రాయటం లేదు.

Tuesday, December 7, 2010

Women as explained by brilliant engineers

ఈ ఫొటోస్ నాకొక స్నేహితురాలు ఫార్వాడ్ చేసిన ఈమైల్లోనివి. చాలా రోజులనుంచీ బ్లాగ్ లో పెట్టాలని..ఇందు మూలంగా మహిళాబ్లాగర్లందరూ నామీద యుధ్ధం ప్రకటిస్తారేమో అని భయం వల్ల కూడా కొంత జాప్యం చేసాను...:) మహిళా మిత్రులందరూ ఈ ఫోటోలను సరదాగా తీసుకుని నవ్వుకోమని మనవి..!

మహిళలందరూ ఇలా ఉండరు. కానీ అరవై శాతం ఇలాగే ఉంటారు అని నిష్పక్షపాతంగా చెప్పగలను...:)
















Friday, November 26, 2010

"iam a Britannia girl"

ఇందాకా ఒక సూపర్ బజార్లో(కొత్తింటికి దగ్గరలో ఒక సూపర్ బజార్ దొరికేసింది నాకు) Britannia వాళ్ళ కొత్త బ్రాండ్ ఒకటి కనిపించింది. అంటే అది నేను చూసినది ఇప్పుడే. "Britannia NutriChoice Ragi Cookies". ఇలాగే Oat Cookies కూడా వచ్చాయిట గానీ షాపులో రాగి బిస్కెట్లే ఉన్నాయి కాబట్టి అవే కొన్నాను. ఆత్రంగా ఇంటికి వచ్చి ఒకటి కొరికాను...ప్చ్...నచ్చలేదు. మొదటిసారిగా ఒక Britannia బిస్కెట్ నాకు నచ్చలేదు. మొదటిసారి..! అంటే ఇక్కడ కొంచెం ప్లాష్ బ్యాక్ చెప్పాలి.

"iam a complan girl" లాగ "iam a Britannia girl"(ఇప్పుడిక girl కాదు woman అనాలి కదా..!) ఇంకా చెప్పాలంటే "iam a biscuit lover". చాలా మంది ఆడపిల్లలకి చాక్లెట్స్, ముఖ్యంగా డైరీ మిల్క్ చాక్లెట్స్ గట్రా ఇష్టం ఉంటాయి. కానీ నాకు చిన్నప్పటి నుంచీ బిస్కెట్లు ఇష్టం. నేను డిగ్రీలోకి వచ్చినప్పటి నుంచీ నాకు సూపర్ బజార్ లో సరుకులు కొనే డ్యూటీ ఇవ్వబడింది. ఆ పని నాకు ఇవాల్టికీ ఎంతో ఇష్టమైన పని. అందువల్ల సూపర్ బజర్కు వెళ్ళినప్పుడల్లా కొత్త బ్రాండ్ బిస్కెట్లు ఏం వచ్చాయా అని చూస్తూ ఉండేదాన్ని. క్రీం బిస్కెట్లు పెద్దగా ఇష్టపడను కానీ మిగిలిన అన్ని రకాలూ ప్రయత్నించాను. అన్నింటినీ మించి నేను Britannia ఫ్యాన్ ని. "టింగ్ టింగ్ డి డింగ్...!!"(ఇది Britannia ఏడ్లోని మ్యూజిక్ అన్నమాట). నా చిన్నప్పుడు Britannia బిస్కెట్లు పన్నెండు రూపాయిలు ఉన్న పేక్ వచ్చేది. ఆ టేస్ట్ నాకు భలే ఇష్టం. ఎప్పుడూ అవే కొనుక్కునేదాన్ని. ఇదిగో ఇలా ఉండేవి అవి.





ఆ తరువాత ఫేవొరేట్ britannia good day. ఇలాచీgood day ఒక్కటి నచ్చేది కాదు నాకు. మిగిలిన రకాలన్నీ no one can eat just one అనుకుంటూ
సుభ్భరంగా లాగించేదాన్ని. కానీ కొన్నాళ్ళకు హెల్త్ కాన్షియస్ అయ్యాకా "ఆరోగ్యానికి మంచిది", "లో కొలెస్ట్రాల్" , "హై ఇన్ ఫైబర్" అని ఉన్న బిస్కెట్లన్నీ తినటం మొదలెట్టా.(తింటే మంచిదనిపించి). అన్ని రకాలూ ఎలా ఉంటాయో అని ట్రై చేస్తూ వచ్చాను. ప్రస్తుతం బ్రిటానియావాళ్ళు "న్యూట్రీ ఛాయిస్" పేరుతో ప్రవేశపెట్టిన అన్ని రకాల బ్రాండ్లూ ట్రై చేసా. "NutriChoice Cream Cracker", " NutriChoice Digestive ", "NutriChoice Nature Spice Cracker "మొదలైనవి. అయితే అన్నింటికన్నా నాకు నచ్చినవి "NutriChoice 5 Grain". వీటి ఇరవై రూపాయిల చిన్న పేక్ గానీ నలభై రూపాయిల పెద్ద పేక్ గానీ ఎప్పుడూ ఇంట్లో ఉంచుకుంటాను.




సరే ఇంతకీ మొదట్లో రాసిన Britannia Ragi Cookies దగ్గరకు వచ్చేస్తే అందులో ఆర్టిఫీషియల్ స్వీట్నర్ ఎక్కువ వాడారు. దానితో బిస్కెట్ టేస్ట్ కన్నా తీపి తేస్ట్ ఎక్కువ అయిపోయింది. పైగా ఖరీదు కూడా ఎక్కువే పెట్టారు. టేస్ట్ బాగుంటే 5 Grain బిస్కెట్స్ లాగ worthy అనుకోవచ్చు. కానీ నాకైతే నచ్చలే మరి. ఇక వీళ్ళ ఓట్స్ కుకీస్ కూడా కొని అవి ఎలాగున్నాయో చూడాలి మరి...ఎవరన్నా ఈపాటికి తిన్నవాళ్ళుంటే చెప్పినా సరే...!! ఈ పోస్ట్ రాస్తూంటే అ మధ్యన ఎప్పుడో వేణూ శ్రీకాంత్ గారు Britannia బిస్కెట్స్ గురించి రాసిన "
టపా" గుర్తు వచ్చింది. ("టపా" మీద నొక్కితే ఆ పోస్ట్ చూడగలరు.)


Wednesday, November 24, 2010

స్వాతంత్ర్య గృహం


హమ్మయ్య....ఇంక ఇవాళ అత్తయ్యగారి గదిలో ఉన్న పెట్టెలు కూడా సర్దేస్తే బట్టలు సర్దటం అయినట్లే. ఇంకా అసలైన పెద్ద పెట్టెలు, కొన్ని చిన్నాపాటి పెట్టెలు ఉన్నాయి. పెద్ద పెట్టెల్లోవన్నీ కేసెట్లు, పుస్తకాలు. చిన్నవాటిల్లో ఉత్తరాలు, గ్రీటింగ్స్, కుక్కరీ బుక్స్ గట్రా..! అదంతా నా సామానే. అసలు ఆ మాటలు వస్తే, ఇంటి సామానులో సగానికి పైగా అంతా నా సామానే. వాటిలో మూడొంతులు చెత్త అనీ, ప్రపంచంలో ఎక్కువ చెత్త పోగేసేవాళ్లకు ఏదైనా అవార్డ్ ఇవ్వల్సి వస్తే అది మొదట నాకే వస్తుందని మావారి ప్రగాఢ నమ్మకం కూడా. నా పెళ్ళై వచ్చేసాకా వాళ్ళ ఇల్లు సగం ఖాళీ అయిపోయిందని మా అమ్మ సంతోషించింది. ఈ సామానంతా ఎక్కడ సర్దుకుంటుంది? అని మా అత్తగారు కంగారు పడ్డారు. తర్వాత ఊరు మారినప్పుడు సగం సామాను అటక మీద పెట్టేసి వెళ్ళాము. మళ్ళీ వచ్చినా క్రిందకు దింపేందుకు చోటు లేక అలానే ఉంచాము సామాను ఇన్నాళ్ళూ. పెళ్ళైన ఇన్నాళ్ళకు ఇప్పుడే వాటికి మోక్షం వచ్చింది. ముఖ్యంగా నా సామానుకి...:)

ఇంతకీ నా సామానుకి మోక్షం ఒక "స్వాతంత్ర్య గృహం"లోకి మారినందువల్ల వచ్చినది. ఇది "ఇండిపెండెంట్ హౌస్" కు నేను పెట్టిన ముద్దు పేరు. అపార్ట్మెంట్ కల్చర్ పెరిగిపోయాకా విడిగా ఉండే ఇంటి పోర్షన్స్ లోకి అద్దెకు వెళ్ళటం తగ్గిందనే చెప్పాలి. ముఖ్యంగా సిటీల్లో మరీను. అన్ని విధాలుగా సౌకర్యంగా ఉండే అపార్ట్మంట్ల వైపే అందరూ ఆకర్షితులౌతూంటారు. చిన్నప్పుడు విజయవాడలో ఉండగా ఇలా సెపరేట్ గా ఉన్న పోర్షన్స్ లోకి అద్దెకు వెళ్ళేవాళ్ళం. కాలేజీ సమయానికి క్వార్టర్స్లోకి మారిపోవటంతో, అందులోనూ అది గ్రౌండ్ ఫ్లోర్ అవటంతో అది సొంత ఇంటి మాదిరిగానే ఉండేది. అయినా అప్పుడంతా అమ్మ చూసుకునేది కాబట్టి ఇల్లు మైన్టైన్ చేసే వివరాలు పెద్దగా తెలియవు. పెళ్ళి తరువాత అంతా అపార్ట్మెంట్లే. కాబట్టి గట్టిగా చెప్పాలంటే మొదటిసారిగా ఇప్పుడే ఒక ఇంటిదాన్నయ్యాను.

ఇప్పుడు ఈ ఇంటి మార్పువల్ల నేను తెలుసుకున్న కొన్ని విషయాలు సరదాగా చెబుదామని. అంటే చిన్నప్పుడు స్కుల్లో లాగ అపార్ట్మెంట్ కూ, ఇండిపెండెంట్ హౌస్ కు మధ్యన గల తేడాలూ, ఉపయోగాలూ, లాభాలూ నష్టాలూ వివరించబడతాయన్న మాట. అపార్ట్మెంట్ లలో అద్దె ఒక్కటే మనం ఇచ్చేది. మిగతావన్నీ మైన్టైనెన్స్ వాళ్ళు, వాచ్ మాన్ చూసుకుంటారు. గుమ్మం ముందర ఉండే కాసింత ప్లేసే మనది. ఆ పైన కారిడార్,మెట్లు అంతా వాచ్ మేన్ క్లీన్ చేస్తాడు. పండగలు పబ్బాలు వస్తే మనం బూజులు దులపక్కర్లేదు. రోజులో మంచినీళ్ళు ఎప్పుడు వచ్చినా వాచ్ మేన్ తెచ్చి లోపల పోస్తాడు. మనం లేకపోయినా మన రెండు బిందెలూ గుమ్మంలో పెటి వెళ్పోతాడు కాబట్టి, టేప్ ఎప్పుడు వస్తుందో కూడా మనకి తెలీదు. చెత్తను గుమ్మం బయట కవర్లో పెట్టేస్తే ఎప్పుడోఅప్పుడు చెత్తబ్బాయి వచ్చి తీసుకుపోతాడు. పేపరు,పాలు అన్నీ అందరికీ వేసేవాళ్ళే వచ్చి వేసిపోతారు. గ్రిల్ ఉంటుంది కాబట్టి బట్టలు రాత్రికి తియ్యకపోయినా నష్టం లేదు. రాత్రుళ్ళు క్రింద వాచ్మేన్ ఉంటాడు కాబట్టి సెక్యూరిటీకి ఢోకా లేదు. మైన్టైనెన్స్ కు ఫిక్స్ చేసిన మొత్తం అపార్ట్మెంట్ వాళ్ళకు ఇస్తే చాలు. అదీగాక మా అదృష్టం వల్ల ఇన్నాళ్ళు ఎక్కడకు మారినా అన్నీ కొత్త అపార్ట్మెంట్లు, పైన ఇళ్ళు అవటం వల్ల రిపేర్లూ, టేప్ లీకేజ్లూ గట్రా తెలియవు. హాయిగా దర్జాగా కొత్త ఇంటి అందాన్నీ ఆనందంగా అనుభవించేసాము.

"ఇంటి" కోసం మావారు తిరిగిన తిరుగుడు సంబంధాల వేటలో తిరిగిఉంటే ఈపాటికి నలుగురు అమ్మాయిలకు పెళ్ళిలైపోయి ఉండేవి అనిపించింది. మొత్తానికి ఒక ఇండిపెండెంట్ హౌస్ దొరికింది. చూడటానికి వెళ్ళినప్పుడు ఇంటి చూట్టూ పరుచుకున్న ఎండను చూసి, గుమ్మిడి వడియాలు రెండురోజుల్లో ఎండుతాయి, బట్టలు గంటలో ఆరతాయ్ మొదలైన శుభలక్షణాలు కనిపించి ఆ ఇంటికి మార్కులు వేసేసాను. ఓ కార్తీకమాసపు శుభముహుర్తాన ఇంట్లో చేరిపోయాం.ఇన్నాళ్ళకు గాలీ,వెలుతురు,ఆకాశం చూస్తున్నాం అని తెగ సంబర పడిపోయాను. చుట్టుతా మట్టి లేదు కాబట్టి దుమ్ము,ధూళి ఉండదు. నీళ్ళు, ఓపిక ఉండాలే కానీ కావాల్సినన్ని మొక్కలు కుండిల్లో పెంచేసుకోవచ్చు.. అనేసుకున్నా. ఓపిక లేకపోతే ఇంటివాళ్ళు వదిలేసిన పెద్ద పెద్ద సిమెంట్ కుండీలు మొక్కలు పదో పన్నేండో ఉండనే ఉన్నాయి. అయినా ఇంట్లో చేరిన రోజే బయట వచ్చిన సైకిలు మొక్కలబ్బాయి దగ్గర రెండు మొక్కలు కొనేసాను. నెలకోసారి వస్తాడుట. నా మొక్కల పిచ్చి ఇన్నాళ్ళకు చిగురులు తొడిగబొతోందని సరదాపడిపోయి వచ్చినప్పుడల్లా కనబడమని అతనికి చెప్పేసా.

ఇక దిగాకా నెమ్మదిగా ఓ వారానికి చాలా సంగతులు అవగాహనలోకి వచ్చాయి. ఇది "స్వాతంత్ర్య గృహం". అన్నింటికీ మనదే బాధ్యత. పైన పోర్షన్లో మరొకళ్ళు ఉన్నా క్రింద ఇంటివాళ్ళకు ఉన్నంత బాధ్యత వాళ్లకు ఉండదు. పొద్దున్నే వీధి గుమ్మంలో ముగ్గు పెట్టుకోవటం దగ్గర నుంచీ, రాత్రి గేటు వేసేదాకా పూర్తి స్థాయిలో శ్రధ్ధ వహించాలి. ఆరిన బట్టలు రేపు తీయచ్చులే అని బధ్ధకించకూడదు. ఎవడైనా గోడ దాటి వచ్చి ఎత్తుకెళ్లగలడు. ఇక కిటికీలన్నీ ముఖ్యంగా వంటింటి కిటికీ రాత్రిళ్ళు, ఇంట్లో లేనప్పుడూ జాగ్రత్తగా మూసేస్తూ ఉండాలి. ఎదురింటి గోడ మీద కనిపించిన పిల్లి ఇటుగా వచ్చే ప్రమాదం కనబడింది. మా ఇంటి వెనుక ఉన్న ఖాళీ ప్రదేశంలో చుట్టుతా ఉన్న అందరూ చెత్త పోసేస్తున్నారు. నేను సైతం అలా చెయ్యలేను కాబట్టి, అర్జెంట్గా వలపన్ని నాలుగురోజుల్లో ఆ వీధిలో చెత్త పట్టుకెళ్ళే అబ్బాయిని పట్టుకుని సిక్సర్ కొట్టినంత ఆనందపడిపోయాను. రాత్రి బయట పెట్టిన చెత్త కవరు పొద్దున్నే చిందరవందరవగానే అర్ధమైంది బయట పెట్టకూడదని(మూత ఉన్న డస్ట్బిన్ బయట పెడదామంటే అవి ఎలకలు కావు పందికొక్కులు ట). ఇక రోజూ పొద్దున్నే ఠంచనుగా ఐదున్నర ఆరు మధ్యలో వచ్చే చెత్తబ్బాయే నాకు "అలారం" అయ్యాడు. ఇక మిగిలిన దైనందిన సౌకర్యాలన్నీ కుదిరాయి. పాలు మాత్రం పక్క సందులోనే ఉండటంతో ఎవరో ఒకరం వెళ్ళి తెచ్చుకుంటున్నాము.

కాస్త పాత ఇల్లు కావటంతో బాత్రూమ్స్ లోపలే ఉన్నా వాటికి కాసిని పగుళ్ళు ఉండటంతో సన్నటి ఎర్రటి వానపాము టైప్ జీవులు, బొద్దింకలూ నన్నూ, పాపనూ భయ పెట్టాయి. ఇక పగలు పూట కూడా పాపకు బాత్ రూమ్ లోకి సాయానికి వెళ్లవలసివస్తోంది. అవి కాక వంటింట్లో ఎర్ర చీమలు, గదుల్లో అక్కడక్కడ బల్లులు, బయట మొక్కల కుండీల దగ్గర జెర్రిలు లాంటి చిన్నపాటి క్రీచర్స్ అన్నీ మేమూ మీతో నివసిస్తాము ఇక్కడ అని "హలో" చెప్పాయి. హిట్, లక్ష్మణ్ రేఖా, చీమల మందు గట్రా ఉన్నా ఎంతైనా జాగ్రత్తగా ఉండవలసిందే అని నిర్ణయించటం జరిగింది. ఇంట్లో వచ్చేవన్నీ మంచినేళ్ళేట ఉప్పు నీళ్ళ బాధ తగ్గింది. జుట్టు కాస్తైనా నిలిస్తుంది అన్న ఆనందం ఎక్కువ నిలవలేదు. మున్సిపల్ టాప్ టైమింగ్స్ ఇచ్చేవాడిష్టం. పొద్దున్నే గనుక నీళ్ళు రాకపోతే, ఎంత రెండు బిందెలే అయినా సంపులోకి దిగి పట్టడానికి అయ్యగారి సాయం కూడా ఉండదు అని అనుభవమైపోయింది. ఈ కొత్తల్లోనే రెండు రోజులు అయ్యగారి ఆఫీసుటూర్. ఇక చిన్నపాటి శబ్దాలకు కూడా ఉలిక్కిపడి లేవటం. పక్కనే హనుమాన్ చాలీసా,దండకం, స్వామి వీభూతి అన్నీ పెట్టుకుని కూడా బెదిరిపోవటం...ఇంత పిరికిదానివేమిటీ అని వెక్కిరింతలు కూడా అయ్యాయి.

ఇంటి సర్దుడు వల్ల మూడు దఫాలుగా సాగిన ఈ పోస్ట్ ఇప్పటికి ముగింపుకి వచ్చింది. రాస్తూంటే ముక్కు పుటాలు పనిచేసి పరిగెత్తుకు వెళ్ళటం వల్ల పొయ్యి మీద కూర మాడిపోయి ఇక ఈ టపాను ముగించాల్సిన సమయం వచ్చిందని తెలియజేసింది.

ఇలా చెప్పుకుంటూ పోతే ఇల్లు మారటం మీద ఓ పుస్తకమే రాసేయచ్చేమో. మొత్తమ్మీద తేలినదేమనగా సెపరేట్ ఇల్లైనా, అపార్ట్మెంట్ అయినా లభాలు, నష్టాలూ రెంటికీ ఉన్నాయి. ఇల్లు బాగున్నప్పుడు కొద్దిపాటి ఇబ్బందులు తప్పవు కాబట్టి సర్దుకుపోవాలి మరి. ఏదేమైనా కొత్త కొత్త అనుభవాలతో ఈ "స్వాతంత్ర్య గృహం" నాకొక విచిత్రమైన అనుభూతిని మాత్రం ఇస్తోంది.

Friday, November 19, 2010

చంద్రుడికవతల వైపు ...


ఎప్పుడైనా మా అన్నయ్య నాలుగైదు రోజులు ఫోన్ చెయ్యకపోతే నాన్న అడిగేవారు ఎక్కడున్నావురా ఫోనే లేదు? అని. అప్పుడు వాడు చెప్పేవాడు "నేను చంద్రుడికవతలవైపు ఉన్నాను..అక్కడ network ఉండదు.." అని. అలా నేనిప్పుడు చంద్రుడికవతలవైపు...ఉన్నా!!


ఫోన్ లేదు,నెట్ లేదు,కేబుల్ లేదు,మొబైల్ కూడా లేదు. పొద్దున్నే న్యూస్ పేపర్ కూడా లేదు. ప్రపంచంతో సంబంధమే లేదు. ఏడెనిమిదేళ్ల క్రితం మేము బొంబాయిలో ఉన్నప్పుడు అలా ఉండేది.మళ్ళీ ఇన్నాళ్ళకి ఇలా..ఇది కూడా బాగుంది. టివీ చానల్స్ గోల వినక్కర్లేదు.phonecalls కు సమాధానం చెప్పక్కర్లేదు. నెట్ లేదు కాబట్టి బ్లాగుల్లో ఏమౌతోందో ఇవాళ బ్లాగులు చూడలేదు అని బెంగ పడక్కర్లేదు. ఇవాళింకా టపా రాయలేదు అని కంగారు పడక్కర్లేదు..టపాలకి వ్యాఖ్యలు రాలేదని బాధపడక్కర్లేదు..!

ఆహా ఇలానే ఇంకొన్నాళ్ళు ఉందాం అనిపిస్తోంది. అందుకే అన్ని కనక్షన్లూ పెట్టించమని తనని తొందరపెట్టట్లేదు. ఒకోసారి ఇలా చంద్రుడికి అవతల వైపు కూడా ఉండిపోతే ఎంత బాగుంటుందీ... అనిపిస్తోంది. పక్క సందులో నెట్ సెంటర్ ఉంది.పాప స్కూల్కు వెళ్ళాకా వెళ్ళి చూసుకో అన్నారు నిన్న తను. కూరలకు వెళ్తూంటే మనసు పీకి కాళ్ళు ఇలా ఇటువైపు మళ్ళాయి. బ్లాగు తెరవగానే అమ్మో ఎన్నిరోజులైందో టపా రాసి అని చేతులు దురద పెట్టాయి...ఇదిగో ఇలా ఈ టపా తయారౌతోంది..

ఇంకొద్దిరోజులు ఇలా చంద్రుడికి అవతలవైపే ఉన్నాకా ఈ కొత్త జీవితపు విశేషాలతో మళ్ళీ కలుస్తానూ...

Wednesday, September 29, 2010

cartoons on CWGames


CWGames గురించి ఇప్పటికే రకరకాల జోక్స్, వ్యంగ్యాలు, కార్టూన్లు ప్రచారం లోకి వచ్చాయి. మొన్న రాత్రి రేడియోలో 11pmనేషనల్ న్యూస్ లో ఒక వార్త మరింత నవ్వు తెప్పించింది. ఒక విదేశీ వెయిట్ లిఫ్టర్ తనకు ఎలాట్ చేసిన గదిలోని మంచం మీద కూచోగానే అది విరిగిపోయిందట....!! బ్రిడ్జీలే కాదు మంచాలు కూడానా అని నవ్వుకున్నాం.

హిందూ న్యూస్ పేపర్లో "కార్టూన్ స్కేప్" అని పదవ పేజీలో వివిధ కార్టున్లు వేస్తూంటారు. వాటిల్లో CWGames కు సంబంధించిన కొన్ని కార్టూన్లు...సరదాకి...


20th Sep cartoonscape


24th sep. cartoonscape


27th Sep.cartoonscape

Thursday, September 23, 2010

శోధన...


'చిత్రం భళారే విచిత్రం' అని పాడాలనిపించింది.....
అసలేం జరిగిందంటే, ఇవాళ టపా రాసే మూడ్ లేక రాయలేదు.so, కొన్నికావాల్సిన ఫోటోలు వెతుకుదాం అని శోధన మొదలెట్టా. బ్లాగ్లో పెట్టే ఫోటోలు రాయల్టీ ఫ్రీ అయితే ఇబ్బంది ఉండదు అని ప్రత్యేకం అలాంటివాటి కోసం వెతకటం నా పనుల్లో ఒక పని. అవసరమైనప్పుడే కాక దొరికినప్పుడే దొరికినన్ని దాచుకోవటం కూడా ఒక అలవాటు. అలానే ఇందాకా ఒక ఫోటో కోసం నెట్లో వెతుకుతున్నా. ఒక ఫోటో లోంచి మరో ఫోటో లోకి వెళ్ళా, అక్కడ్నుంచి ఆ ఫోటో నన్నొక పికాసా వెబ్ ఆల్బమ్ లోకి తీసుకువెళ్ళింది. ఆ ఆల్బం తాలూకూ మనిషి ఇండియనో కాదో తెలీదు. పేరు కూడా హిందూవులా లేదు. అక్కడ కొన్ని పబ్లిక్ ఆల్బమ్స్ ఉన్నాయి. పబ్లిగ్గా పెట్టిన ఆల్బమ్స్ అన్నీ కొన్ని దేవాలయాలవి(ఇండియాలోవి కాదు),
చారిత్రాత్మక ప్రదేశాలవీ. ఎంతో శ్రధ్ధతో డీటైల్డ్ గా తీసినట్లు తెలుస్తున్నాయి. కొన్ని ఇతర దేశాలవీ ఉన్నాయి. అద్భుతమైన ఫోటోలు.

నాకసలే హిస్టరీ అంటే చాలా ఇష్టం. చారిత్రాత్మక కట్టడాలన్న, పూర్వీకుల, తరతరాల రాజుల తాలూకూ చరిత్రలు అన్నా మహా ఇష్టం. (డిగ్రీలో అన్నింటికన్నా హిస్టరీలోనే బోలెడు ఎక్కువ మార్కులు వచ్చాయి). మహానందపడిపోతూ ఫోటోలనీ చూసేసాను. ఇక ఆ ఆల్బమ్స్ లో ఒక ఆసక్తికరమైన ఆల్బం కనిపించింది. బహుశా అవి ఒక ఆధ్యాత్మిక మ్యూజియం తలూకూ ఫోటోలై ఉంటాయి అనిపించింది. మానవజాతి ఎలా ఆరంభమైంది, ఎలా పరిణితి చెందింది మొదలుకుని యోగా, కుండలిని, సైన్స్ కు సంబంధించిన చిత్రాలు రకరకాలు ఉన్నాయి. మధ్యలో అది ఏ భాషో తెలియదు కానీ నోట్స్ తాలూకూ పేజీలకు తీసిన కూడా ఉన్నాయి.

నాకా మనిషికి ఉన్న వైవిధ్యమైన ఆసక్తులు పట్ల మక్కువ కలిగింది. ఒక ప్రదేశం తలూకూ ఫోటోలు బాగున్నాయని ఆ పేరు పట్టుకెళ్ళి గూగుల్లో పెట్టా ఏ ప్రదేశమో తెలుసుకోవాలని. అది శ్రీలంక లోని ఒక చారిత్రాత్మక ప్రదేశం అని వచ్చింది. ఇక ఆ పేరు తాలుకు ’వికీ’లోకి వెళ్ళి వివరలు చదివా. ఆ తరువాత ఆ వ్యక్తి వివరాలు దొరికాయి. అతనొక జియోఫిజిసిస్ట్, రచయిత కూడా అని ఉంది. అదీ కధ. అక్కడితో నా పరిశోధన పూర్తి అయ్యింది. ఈ వెతుకులాటలో ఒక మంచి ఇంగ్లీషు బ్లాగు కూడా తగిలింది. ఏమి నా భాగ్యము అనుకున్నా.

ఒకోసారి అనుకోకుండా జరిగే చిన్న చిన్న సంఘటనలు ఏంతో ఉత్సాహాన్ని, ఆనందాన్ని ఇస్తాయి. తెలియని కొత్త విషయాలను తెలుసుకున్నప్పుడు, మనకు ఇష్టమైన సంగతులు మరొకచోట కనబడినప్పుడు కలిగే సంతోషాన్ని భావాలను మాటల్లో చెప్పటం కష్టం.

Wednesday, September 22, 2010

"మనసుగతి ఇంతే.." పాటకు పేరడీ !!


"మనసుగతి ఇంతే.." పాటకు పేరడీ సరదాగా రాద్దామనిపించింది...చదివి నవ్వుకోండి..!!

బ్లాగరు బ్రతుకింతే
బ్లాగు కథ ఇంతే
బ్లాగున్న మనిషికీ
తృప్తిలేదంతే

పోస్ట్ రాస్తే ఖూషీరాదు
వ్యాఖ్య కోసం ఆశపోదు
రాసే చేతికి అదుపులేదు
రాయకపోతే శాంతిలేదు

అంతా చదువుతారని తెలుసు
అయినా వ్యాఖ్య రాయరని తెలుసు
తెలిసీ చూసే ఎదురుచూపులో
తీయదనం బ్లాగరుకే తెలుసు

మరుజన్మ ఉన్నదోలేదో
ఈ బ్లాగులప్పుడేమౌతాయో
బ్లాగరు కథయే ఓ ప్రహసనం
బ్లాగరెలా వదుల్చుకుంటాడీ వ్యసనం

***** ****** *****

అసలు పాట ఇక్కడ వినండీ..


Thursday, August 26, 2010

పిల్లలకి ఒక మంచి వెబ్సైట్...




ఏడేనిమిదేళ్ళ లోపూ పిల్లలున్న వాళ్ళకీ... పిల్లల గేమ్స్ అడుకునే నాకులాంటి పెద్దపిల్లలకీ ఒక మంచి సంగతి..

మా పాప కోసం వెదుకుతూంటే ఇటీవలే నాకు దొరికిన ఒక మంచి వెబ్సైట్ ఇది. దీనిలో గేమ్స్, మిగిలిన ఎంటర్టైన్మెంట్ కాకుండా నాకు బాగా నచ్చినవి "Math Games". ఏడేనిమిదేళ్ళ లోపూ పిల్లలు సులువుగా Maths నేర్చుకోవటానికి వీలుగా ఉండేలా ఉన్నాయి ఈ గేమ్స్.

మీరూ ప్రయత్నించండి..

http://www.toytheater.com/




Monday, June 14, 2010

మావిడి రంగులు...colours of life !


కలర్స్ ఆఫ్ లైఫ్...అంటే ఇదే అనిపించేలా ఎంత బాగున్నాయో చూడండి ఈ మావిడి కొమ్మలు..!!
ఒకే చెట్టు ఆకులకు ఇన్ని రంగులు మనకి మళ్ళీ చెట్లలో నాకు చాలా ఇష్టమైన "రావి చెట్టు"లో కనిపిస్తాయి. ఒకే చెట్టుకు ఎన్నో రంగుల ఆకులు. రీడిఫ్ మైల్ లో ఎక్కడో ఈ ఫోటో కనిపించింది...వెంఠనే బ్లాగులో దూర్చేసా...:)

Thursday, May 20, 2010

వేసంశెలవులు - టీ్వీ ప్రభావం ...


"అమ్మా, మన టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా?" అడిగింది మా చిన్నారి. పేస్ట్ లో ఉప్పా? అడిగాను ఆశ్చర్యంగా. నా అజ్ఞానానికి జాలిపడుతూ "ఈసారి నీకు చూపిస్తాను ఆ "ఏడ్" టీవీలో వచ్చినప్పుడు" అంది సీరియస్ గా. శెలవులు కావటం వల్ల ఎక్కువగా అడ్డుకునే అవకాశం లేక వదిలేయటం వల్ల వాళ్ళ నాన్నమ్మతో పాటూ స్వేచ్ఛగా బుల్లితెర వీక్షించటానికి అలవాటుపడింది మా చిన్నది. నెల మొదట్లో సరుకులకు వెళ్ళినప్పుడు తోడు వచ్చింది. ఎప్పుడు వెళ్ళిందో, పేస్ట్ లు ఉన్న వైపు వెళ్ళి "కాల్గేట్ సాల్ట్" టూత్ పేస్ట్ తెచ్చేసుకుంది. "అమ్మా, నేను ఈ పేస్ట్ తోనే పళ్ళు తోముకుంటాను" అంది. పెళ్ళయేదాకా నాన్న కొనే "వీకో వజ్రదంతి", ఆ తరువాత అత్తారింట్లో వాడే "పెప్సొడెంట్" తప్ప వేరే పేస్ట్ ఎరగని నేను పిల్లదాని పంతానికి తలవంచక తప్పలేదు.

నేను సరుకులు కొనే హడావిడిలో పడ్డాను. ఈసారి మా చిన్నది "డెట్టాల్" సబ్బుతో తిరిగి వచ్చింది. "అమ్మా, నేనింకనించీ ఈ సబ్బుతోనే స్నానం చేస్తాను. ఈ సబ్బుతో రుద్దుకుంటే క్రిములు ఒంట్లో చేరవు తెలుసా?" అంది. "ఎవరు చెప్పారు?" అన్నాను అనుమానంగా చుట్టూ చూస్తూ... షాపులో ఎవరన్నా చెప్పారేమో అని. "టీ్వీ ఏడ్ లో చూశాను నేను" అంది. నేను "డవ్" తప్ప మరోటి వాడను. పాపకు 'జాన్సన్ బేబి సోప్' మానేసాకా ఇప్పటిదాకా దానికీ "డవ్" సోపే. ఇప్పుడు కొత్తగా దానికో కొత్త సబ్బు?! నాకు కాలేజీరోజులు గుర్తు వచ్చాయి...కాలేజీలో ఎవరో చెప్పారని ఇంట్లో అందరూ వాడే సబ్బు కాక "ఇవీటా"(అప్పట్లో కొన్నాళ్ళు వచ్చింది) కొనుక్కుని వాడతానని అమ్మని ఒప్పించటానికి నేను పడ్డ పాట్లు...

ఇంకా అదేదో నూనె వాడితే జుత్తు ఊడదనీ, హెడ్ అండ్ షోల్డర్స్ షాంపూతో తల రుద్దుకుంటే డేండ్రఫ్ పోతుండనీ, "డవ్" వాళ్ళు కొత్తగా ఏదో ఒంటికి రాసుకునే క్రీమ్ తయారు చేసారనీ...అవన్నీ నన్ను కొనుక్కోమనీ పేచీ మొదలెట్టింది. నీ పేస్ట్, సబ్బు కొన్నాను కదా నాకేమీ వద్దులే అనీ దాన్ని ఒప్పించేసరికీ షాపులోని సేల్స్ గార్ల్స్ నవ్వుకోవటం కనిపించింది...!

సరుకులు కొనటం అయ్యి హోమ్ డేలివెరీకి చెప్పేసి రోడ్డెక్కాం. సిటీ బస్సొకటి వెళ్తోంది..."అమ్మా, ఆ బస్సు మీద చూడు.."అంది పాప. "ఏముంది?" అన్నాను. ఆ బస్సు మీద నాన్నమ్మ రాత్రి చూసే సీరియల్స్ లో ఒకదాని బొమ్మలు ఉన్నాయి. ఇంకా చాలా బస్సుల మీద ఇదే సీరియల్ బొమ్మలున్నాయి తెలుసా? అంది. "ఓహో..." అన్నా నేను. దారి పొడుగునా నాకా సీరియల్ తాలూకూ కధ వినక తప్పలేదు. అమ్మో దీని శెలవులు ఎప్పుడు అయిపోతాయో అనిపించింది. మా పాప పుట్టని క్రితం ఎవరి ఇంటికన్నా వెళ్తే వాళ్ళ పిల్లలు టి.వీ.సీరియల్ టైటిల్ సాంగ్స్ పాడుతుంటే, ఆ తల్లిదండ్రులు మురిసిపోతూంటే తిట్టుకునేదాన్ని. ఇవాళ నన్నా తిట్లు వెక్కిరిస్తున్నట్లనిపిస్తోంది...

ఇక ఇలా కాదని, మా గదిలో టి.వీలో కార్టున్స్ పెట్టి చూపించటం మొదలుపెట్టాను. సీరియల్స్ చూడటం అయితే మానేసింది కానీ పోగో, కార్టూన్ నెట్వర్క్ చానల్స్కు అతుక్కుపోయింది. "పోగో" పిచ్చి అంత తేలికగా పోయేది కాదని అర్ధమైంది. కలరింగ్ బుక్స్, బొమ్మలూ,ఆటలూ...మొదలైన పక్కదారుల్ని పట్టించా కానీ "చోటా భీం", "హనుమాన్" కార్టూన్ల టైమ్ అవ్వగానే కీ ఇచ్చినట్లు టీవీ దగ్గరకు పరుగెత్తే పిల్లను ఎంతకని ఆపగలను? ఇక నా ఉక్రోషం మావారి వైపు తిరిగింది. ఆ కంప్యూటర్ బాగున్నంత కాలం పిల్ల టీవీ వైపు కన్నెత్తి చూడలేదు. కంప్యూటర్లో గేమ్స్, కౌంటింగ్ గేమ్స్, రైమ్స్ అంటూ ఏవో ఒకటి చూపిస్తే చూసేది.....అది బాగుచేయించండి...అంటూ పోరు పెట్టాను. (పనిలో పని నాక్కూడా బ్లాగ్కోవటానికి వీలుగా ఉంటుండని...) ఇక లాభంలేదనుకుని ఒక వారం రోజులు రకరకాల షాపులు తిరిగి, దొరకదనుకున్న "పార్ట్" ఎలాగో సంపాదించి మొత్తానికి మొన్ననే నా సిస్టం బాగుచేయించారు. నాలుగైదు నెలల విరామం తరువాత పనిచేస్తున్న నా సిస్టం ను చూసుకుని మురిసిపోయాను.

సిస్టం బాగయ్యాకా ఇప్పుడు టీవీ పిచ్చి కాస్త తగ్గింది కానీ పూర్తిగా మానలేదు. ఇక శెలవులు ఇంకో పదిహేను,ఇరవై రోజులుంటాయి...అంతదాకా తప్పదు అని సర్దిచెప్పుకుంటున్నాను. టీవీ ఎంత ప్రమాదకరమైన మాధ్యమమో, చిన్న పిల్లల్ని కూడా ఏ విధంగా ప్రభావితం చెయ్యగలదో అనుభవపూర్వకంగా అర్ధమైందిప్పుడు. కానీ దాని దుష్ప్రభావం పిల్లలపై పడకుండా ఎలా కాపాడుకోవటం అనేది ప్రస్తుతం నా బుర్రను దొలుస్తున్న ప్రశ్న.. కేబుల్ కనక్షన్ పీకించెయ్యటమో, టీవీని అమ్మేయటమో చెయ్యగలమా? పనవ్వగానేనో, ఆఫీసు నుంచి రాగానేనో మెకానికల్ గా టీవీ రిమోట్ పట్టుకునే మన చేతులు అంత పని చెయ్యగలవా??

ఆలోచిస్తుంటే, పిల్లల పదవ తరగతి అయ్యేదాకా టీవీ కొనకుండా, ఆ తరువాత కొన్నా, డిగ్రీలు అయ్యేదాకా కేబుల్ కనక్షన్ పెట్టుకోకుండా కాలక్షేపం చేసిన మా పిన్ని నాకు గుర్తు వచ్చింది.మనసులోనే పిన్నికి "హేట్సాఫ్" చెప్పేసాను.

Tuesday, May 11, 2010

Its cartoon time...

A personified meaning to real forgiveness is hidden in this cartoon..!!

Enjoy this hilariuos cartoon...





utube link:
http://www.youtube.com/watch?v=2r4IQwzfKQ4

Wednesday, March 31, 2010

సాక్షి ఆదివారం(28-3-10) పుస్తకం...

మా ఇంట్లో రోజూ వచ్చే దినపత్రికలు ఆంధ్ర జ్యోతి, టైమ్స్ ఆఫ్ ఇండియా,ఎకోనోమిక్ టైమ్స్. సాక్షి వచ్చిన కొత్తల్లో నా పోరు పడలేక కొన్నాళ్ళు "సాక్షి" తెప్పించినా తిరిగి ఆంధ్రజ్యోతి కే మారిపోయారు. కనీసం ఆదివారం సాక్షి పుస్తకం కొని తెండి అంటే మావారు ఎప్పుడు "మర్చిపోతారు" పాపం ... అలాంటిది మొన్న ఆదివారం అనుకోకుండా నామాట గుర్తుండి ఆదివారం "సాక్షి" కొనితెచ్చారు.

అదృష్టవశాత్తు అది వాళ్ళ రెండవ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక అవటంతో కొన్ని మంచి సంగతులు దానిలో ఉన్నాయి. కూడలి నేను రేగులర్గా చూడటం లేదు కాబట్టి ఎవరన్నా దీనిని గురించి రాసేసారేమో తెలియదు. తెలియనివాళ్ళు ఉంటే చదువుతారని ఈ టపాలో రాస్తున్నాను...

28వ తారీకు ఆదివారం ఈ-పేపర్ లింక్ ఇక్కడ చూడచ్చు.
ఇంతకీ అందులో ఉన్న తాయిలం ఏమిటంటే ....


"తప్పక చూడాల్సిన 100 సినిమాలు"

"తప్పక చదవాల్సిన 100 తెలుగు పుస్తకాలు"


"తప్పక వినాల్సిన 100 తెలుగు పాటలు"

జాబితాలోని సినిమాలు ఒక పది తప్ప మిగిలినవన్నీ చూసినవే,పాటలు దాదాపు అన్ని విన్నవే. చాలామటుకు నాదగ్గర ఉన్నవే. కానీ పుస్తకాలు మాత్రం పది పదిహేను మించి చదివినవి లేవు...మిగిలినవన్నీ చదవాల్సినవే..!!


ఆలస్యమెందుకు...ఇప్పటిదాకా ఈ ఆదివారం పుస్తకం చదవనివాళ్ళు ఉంటే తప్పక చదివి ఆనందించేయండి మరి ...

Monday, January 4, 2010

పందార...పందార...


బాసుందీ, జీడిపప్పు పాకం, పూతరేకులు, గవ్వలు, బొబ్బట్లు, కాకినాడ కాజాలు,గులాబ్ జాం, మడత కాజాలూ, కజ్జికాయలు, పంచదార పూరీలు, పేటా(బుడిది గుమ్మడితో చేసే స్వీట్), బొంబే హల్వా, సేమ్యా హల్వా, చక్రపొంగలి.....ముఖ్యంగా ఇవి...ఇంకా కొన్ని...ఇవన్నీ ఏమిటి? అంటే నాకిష్టమైన తీపి పదార్ధాలు ! ఇంకా వివరంగా చెప్పాలంటే అసలు "తియ్యగా" ఉంటే చాలు ఏవన్నా నోట్లోకి వెళ్పోయేవి ఒకప్పుడు...!

మేం అన్నిరకాలూ తినాలని మా అమ్మ అన్నింటిలో "పందార"(పంచదార కి కొల్లోక్వియల్ పదమన్నమాట) వేయటం మొదలెట్టింది. టమాటా, బీరకాయ, ఆనపకాయ, మొదలైన కూరల్లో, వాటి పచ్చళ్ళలో, ఆఖరుకి కొబ్బరి పచ్చడిలో కూడా పందారే..! ఉప్మా తింటే పైన పంచదార చల్లుకుని, పూరీలు తింటే, ఆఖరులో ఒక పూరీ పందార వేసుకుని తినకపోతే పూరీ తిన్న తృప్తే ఉండేది కాదు. చారులో, పులుసుల్లో కూడా పందారే. ఈ పదార్ధాలన్నీ పందార లేకుండా కూడా వండుకుంటారని అసలు తెలియనే తెలియదు. కాఫీలో,టీ లో కూడా మన పాళ్ళు ఎక్కువే. అలా పందార మా జీవితాల్లో ఒక భాగమైపోయింది.

కేనింగ్ సెంటర్(పదార్ధాలు మనం తీసుకువెళ్తే, జామ్లు అవీ మనతో చేయించే సెంటర్) కు వెళ్ళి మా కోసం పెద్ద హార్లిక్స్ సీసాడు(నే చాలా ఏళ్ళు తాగిన హెల్త్ డ్రింక్) మిక్స్డ్ ఫ్రూట్ జామ్, ఆపిల్ జామ్, ఇంకా రెమ్డు మూడు రకాల జూస్ లూ చేసి పట్టుకు వచ్చేది అమ్మ. ఇంక మజ్జిగలోకి,ఇడ్లీల్లోకి, దోశల్లోకి అన్నింటిలోకీ జామే..! సీసా అయిపోయేదాకా నేనూ, మా తమ్ముడూ పోటీలుపడి తినేసేవాళ్ళం. శెలవులకు మా తమ్ముడు వస్తే వాడున్న వారం,పది రోజులూ రొజుకో రకం స్వీట్ చేసేసేదాన్ని.నా పెళ్ళయాకా అల్లుడికి లడ్డూలూ, సున్నుండలూ ఇష్టం అని తెలిసి మా అమ్మ తిరుపతి లడ్డు సైజులో మిఠాయీ, సున్నుండలు చేయించింది సారెలోకి. నా సీమంతానికి పన్నెండు రకాల స్వీట్లు తెచ్చింది మా అమ్మ.

ఆ విధంగా పందార తిని, తినీ పెరిగిన నేను అత్తారింట్లో వంటల స్పెషలిస్ట్ ననే ధీమాతో, అన్ని పనులు బాగా చేసేసి అందరి మన్ననలు పొందెయ్యాలనే "అజ్ఞానం"లో మొదటిసారి వంట చేసాను. అందరూ బావుందంటారనే మితిమీరిన ఆత్మవిశ్వాసంతో చూస్తున్నా...."ఈ కూరలో ఎన్ని పచ్చిమెరపకాయలు వేసావమ్మా?" అనడిగారు మామగారు."ఈ పచ్చడేమిటి తియ్యగా ఉంది?" అనడిగారు శ్రీవారు. "ఇది చారా పానకమా?" అనడిగాడు మరిది. "మేము చారులో,పచ్చడిలో పంచదార వేసుకుంటాము" అన్నాను ఎర్రబడిన మొహంతో..! ఆ మర్నాడు మా అత్తగారు దగ్గరుండి కూరలో ఐదారు పచ్చిమెరపకాయలూ, తీపి లేని చారు, పందార లేని పచ్చడి చేయించారు. నాకు విడిగా కాస్త కారం తక్కువగా కూర, పందార వేసిన పచ్చడి చేసుకున్నా...!ఆ తర్వాత కొన్నాళ్ళు అలా విడిగా తీసుకున్నాకా విసుగొచ్చి మానేసి, నేనూ "వాళ్ళ మెనూ"లో జాయినయిపోయా. నేను తీపి వేసుకోవటం మానేసాను. కాలక్రమంలో వాళ్ళూ కారం కాస్త తగ్గించారు. ఇప్పుడిక ఇంటికి వెళ్తే తియ్యకూరలు వండకు అని నేనే చెప్తాను అమ్మకి. "పెళ్ళయాకా ఇది మారిపోయింది" అంటారు అమ్మావాళ్ళిప్పుడు.

చిన్నప్పుడు ఎప్పుడైనా స్కూలు,కాలేజీ ఎగ్గొడదామంటే "జ్వరమన్నా రాదేమమ్మా...." అంటే అమ్మ తిట్టేది. అటువంటి రాయిలాంటి ఆరోగ్యం కాస్తా ఒక్క డెలివెరీ తో చిందర వందర అయిపోయింది. సిరియస్ వి కాకపోయినా ఏవేవో రకరకాల సమస్యలు. ఇక స్వీట్లు, ఫాటీ పదార్ధాలూ తినకూడదనే నిర్ణయానికి వచ్చాను. ఎప్పుడో సుగరు,బి.పీలూ వచ్చాకా మానేయటం కన్నా ముందుగానే మానేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవటం శ్రేయస్కరం అనిపించింది. పైగా ఇప్పుటినుంచీ మానేయటం వల్ల ముందు ముందు విపరీతమైన ఆరోగ్య సమస్యలు వచ్చినా, రక్తంలో కొవ్వు శాతం "మితంగా" ఉంటే ఆయా ఆరోగ్య సమస్యల వల్ల కలిగే దుష్ప్రభావాలు చాలా వరకూ తగ్గుతాయి అని నేను చేసిన నెట్ సర్వేతో నాకర్ధమైన విషయం. ఐదేళ్ళ నుంచీ టీ లో "పందార" కూడా వేసుకోవటం మానేసాను. ఏస్పర్టీమ్, సర్కోజ్ వంటి "ఆర్టిఫీషియల్ స్వీట్నర్లు" కాక ఒక "నేచురల్ స్వీట్నర్" గురించి తెలుసుకుని అది వాడటం మొదలెట్టాను. దాని గురించి తదుపరి టపాలో...

"ఏది జరిగినా మన మంచికే" అని నమ్మే మనిషిని నేను. తలెత్తిన ఆరోగ్య సమస్యలు "తీపి" మీద నాకున్న మోహాన్ని వదలగొట్టాయి. ఇప్పుడు ఐస్ క్రీం చూసినా, ఏదన్నా స్విట్ చూసినా తినాలనే ఏవ పూర్తిగా పోయింది. పెళ్ళిలలో, పండుగల్లో తప్ప "పందార" "స్విట్"ల జోలికే పోను.చేసి అందరికీ పెడతాను కానీ నేను మాత్రం తినను."దంపుడుబియ్యం" మంచిదని తెలుసుకుని అది కూడా తినటం మొదలుపెట్టాము ఇంట్లో."ఆరోగ్యమే మహాభాగ్యం" అనేసుకుని, ఇలా రకరకాల కారణాలతో నాకు చాలా ఇష్టమైన వాటి పట్ల నాకున్న మోహాన్ని పోగొడుతున్న భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటాను.

Tuesday, December 8, 2009

" ఆదివారం -- American Chopsuey "

అనగనగా ఒక ఆదివారం. పాపను తీసుకుని అమ్మనాన్నలను చూడటానికి వెళ్ళాను. ఇంతలో తన ఫోన్...వెళ్ళిన పని త్వరగా అయిపోయింది "లంచ్" కు వెళ్దామా? అని...ఎగిరి ఒక గంతు వేసి...పాపను అమ్మకు అప్పజెప్పి బయలుదేరాను. పాపను మాతో తీసుకువెళ్తే ఏమౌతుందో ఒకటి రెండు అనుభవాల తరువాత జ్ఞానోదయం(వీటి గురించి మరో పోస్ట్ లో) అవటం వల్ల ఎక్కడో అక్కడ పాపను ఉంచి లేక బజ్జోపెట్టో హోటల్కో, సెకెండ్ షోలకో వెళ్తూంటాం. అమ్మమ్మ ఇంట్లో ఉంది కాబట్టి పాప కూడా ఎక్కువ గొడవపెట్టలేదు. "ఈ డ్రెస్సు మీదకు ఈ చెప్పులు వేసుకోవే" అని సలహా కూడా ఇచ్చింది. బసెక్కి అయ్యవారు చెప్పిన చోటికి చేరాను.

ఆ రెస్టారెంట్ నాకు పెద్దగా నచ్చలేదు. ప్రసన్నంగా లేని నా మొహం చూసి ఆయన "ఏదో ఒక ఐటెం తినేసి ఇంకో దాంట్లోకి వెళ్దాంలే.." అన్నారు. ఒక ఆర్డర్ ఇచ్చేసి, కానిచ్చేసి బయటపడ్డాం. నాలుగడుగులు వెయ్యగానే ఒక "చైనీస్ రెస్టౌరెంట్" కనబడింది. నా కాళ్ళు,కళ్ళు అటు పోయాయి...తనకు అర్ధమైపోయింది. నాకు "అమెరికన్ చౌప్సీ" తినాలని బుధ్ధిపుట్టిందని. ఇక్కడ "అమెరికన్ చౌప్సీ" ని గురించి కొంత చెప్పాలి. పెళ్ళికాక ముందు మొదటిసారి మా అన్నయ్య ఇది తినిపించాడు. అది మొదలు నెలకోసారన్నా "ఆ టేస్ట్" నాలుకకు తగలకపోతే నా టేస్ట్ బడ్స్ ఆ "రుచి" కోసం తహతహలాడుతూ ఉంటాయి. రకరకాల రెస్టారెంట్స్ లో ఈ ఐటెం టేస్ట్ ఎలాఉంటుందో అని టెస్ట్ చేస్తూ ఉంటాను కానీ మొదటిసారి తిన్న చోటనే నాకు ఇది చాలా నచ్చుతుంది. ఇప్పటికీ వీలైనప్పుడల్లా అక్కడకే వెళ్తూంటాం.పెళ్ళయిన కొత్తల్లో "అమెరికన్ చౌప్సీ" కావాలని అడిగితే అదేదో "కొత్తరకం ఐస్క్రీం" అనుకున్నారు పాపం మావారు.

ఇక ఆ "చైనీస్ రెస్టారెంట్" లోకి వెళ్దామని అడుగుపెట్టేసరికీ అది నిండుగా ఉంది. ఏదో పార్టీ జరుగుతోందనీ ఒక పది నిమిషాలు వైట్ చేయమని చెప్పాడు. బయట కుర్చీలు కూడా లేవు. చుర్రుమనే ఎండలో కబుర్లాడుతూ నించున్నాం...పదినిమిషాలు కాస్తా అరగంత అయ్యింది కానీ లోపల ఖాళీ అవ్వలేదు. మళ్ళీ అడిగాము...పది నిమిషాలు..అన్నడు వాడు. నాకింక కోపం వచ్చేసింది. ముందరే అరగంట లేక గంట అని చెప్పచ్చు కదా? బయట తిరిగి మరో గంటలో వస్తాం కాదా? ఎండలో ఇలా నించోపెట్టడం అన్యాయం కదా? అని. మళ్ళీ రోడెక్కాం. ఎక్కడికి వెళ్ళాలి? ఉత్తప్పుడు ప్రతిరోడ్డు చివరా ఏదో ఒక చైనీస్ రెస్టారెంట్ కనబడుతూనే ఉంటుంది. ఇప్పుడు కావాలంటే ఒక్కటీ కనబడట్లేదు...పోనీ ఏదన్నా టిఫిన్ చేసేసి వెళ్పోదామా? అన్నారు తను. "ఊహూ! ఇవాళ అమెరికన్ చౌప్సీ తినాల్సిందే" అన్నాను నేను. "ఎవడు కనిపెట్టాడో ఈ అమెరికన్ చౌప్సీ ని...." గొణుక్కున్నారు అయ్యగారు.

ఆదివారం కావటంతో రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఓ కిలోమీటర్ నడిచాకా బస్టాప్ వచ్చింది. ఎక్కి కూర్చున్నాం. సగం దూరం వెళ్ళాకా "దిగు దిగు" అని అర్జెంట్ గా బస్సులోంచి దింపేసారు. ఆ ఏరియాలో ఒక చైనీస్ రెస్టారెంట్ ఉందని తనకు గుర్తు వచ్చిందిట. అది వెతుక్కుంటూ ఓ అరగంట తిరిగాకా మొత్తానికి కనబడింది. హమ్మయ్య ! అనుకుని లోపలికి దూరాం. ఆర్డర్ ఇచ్చాం. పక్క రెండు టేబుల్స్ మీద కాలేజీకుర్రాళ్ళు. అప్పటికి టైం సాయంత్రo నాలుగైంది. "లంచ్ కని బయల్దేరి సాయంత్రం నాలుగింటికి అమెరికన్ చౌప్సీ తినే మొహాలూ మనమూనూ" అని జోకేసుకున్నాం. ఆవురావురని కడుపులో సింహాలు పరిగెడుతూంటే సర్వర్ తెచ్చిన చౌప్సీ అమృతంలాగ అనిపించింది. తినటం పూర్తయ్యిండి.పక్క టేబుల్ దగ్గరకు "నాన్ వెజ్ ఐటెమ్స్" వచ్చాయి. ఆ వాసన గిట్టని నాకు కడుపులో ఒక్కసారిగా తిప్పటం మొదలైంది. బిల్లు కట్టి బైటకు రమ్మని తనకు చెప్పి నేను బయటకు పరిగెత్తా...!


పాపను తీసుకుని రావటానికి వెనక్కు వెళ్ళి, దానికి కాస్తంత అన్నం అక్కడే పెట్టేసి మళ్ళీ ఇల్లు చేరే సరికీ ఆ రోజు తొమ్మిదయింది. "లేటయ్యిండిగా బయట తినేసి వెళ్దామా" అన్నారు తను. అప్రయత్నంగా "బాబోయ్ వద్దు.." అనేసాను. అప్పుడు రాత్రి అన్నం వండుకుని తిని పనులన్నీ అయ్యేసరికీ పదకొండు...ఎంత పని చేసింది "అమెరికన్ చౌప్సీ" అనుకున్నాం...!! ఉత్త పప్పయినా సరే... హాయిగా ఇంట్లో వండుకుని తిన్న సుఖమే సుఖం ఏంతైనా...అనిపించింది నూటొక్కోసారి...!
(అయినా మరో ఆదివారమో ఆపైవారమో "బయటకు" అనేసరికీ రెడీనే.....)