సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, December 8, 2009

" ఆదివారం -- American Chopsuey "

అనగనగా ఒక ఆదివారం. పాపను తీసుకుని అమ్మనాన్నలను చూడటానికి వెళ్ళాను. ఇంతలో తన ఫోన్...వెళ్ళిన పని త్వరగా అయిపోయింది "లంచ్" కు వెళ్దామా? అని...ఎగిరి ఒక గంతు వేసి...పాపను అమ్మకు అప్పజెప్పి బయలుదేరాను. పాపను మాతో తీసుకువెళ్తే ఏమౌతుందో ఒకటి రెండు అనుభవాల తరువాత జ్ఞానోదయం(వీటి గురించి మరో పోస్ట్ లో) అవటం వల్ల ఎక్కడో అక్కడ పాపను ఉంచి లేక బజ్జోపెట్టో హోటల్కో, సెకెండ్ షోలకో వెళ్తూంటాం. అమ్మమ్మ ఇంట్లో ఉంది కాబట్టి పాప కూడా ఎక్కువ గొడవపెట్టలేదు. "ఈ డ్రెస్సు మీదకు ఈ చెప్పులు వేసుకోవే" అని సలహా కూడా ఇచ్చింది. బసెక్కి అయ్యవారు చెప్పిన చోటికి చేరాను.

ఆ రెస్టారెంట్ నాకు పెద్దగా నచ్చలేదు. ప్రసన్నంగా లేని నా మొహం చూసి ఆయన "ఏదో ఒక ఐటెం తినేసి ఇంకో దాంట్లోకి వెళ్దాంలే.." అన్నారు. ఒక ఆర్డర్ ఇచ్చేసి, కానిచ్చేసి బయటపడ్డాం. నాలుగడుగులు వెయ్యగానే ఒక "చైనీస్ రెస్టౌరెంట్" కనబడింది. నా కాళ్ళు,కళ్ళు అటు పోయాయి...తనకు అర్ధమైపోయింది. నాకు "అమెరికన్ చౌప్సీ" తినాలని బుధ్ధిపుట్టిందని. ఇక్కడ "అమెరికన్ చౌప్సీ" ని గురించి కొంత చెప్పాలి. పెళ్ళికాక ముందు మొదటిసారి మా అన్నయ్య ఇది తినిపించాడు. అది మొదలు నెలకోసారన్నా "ఆ టేస్ట్" నాలుకకు తగలకపోతే నా టేస్ట్ బడ్స్ ఆ "రుచి" కోసం తహతహలాడుతూ ఉంటాయి. రకరకాల రెస్టారెంట్స్ లో ఈ ఐటెం టేస్ట్ ఎలాఉంటుందో అని టెస్ట్ చేస్తూ ఉంటాను కానీ మొదటిసారి తిన్న చోటనే నాకు ఇది చాలా నచ్చుతుంది. ఇప్పటికీ వీలైనప్పుడల్లా అక్కడకే వెళ్తూంటాం.పెళ్ళయిన కొత్తల్లో "అమెరికన్ చౌప్సీ" కావాలని అడిగితే అదేదో "కొత్తరకం ఐస్క్రీం" అనుకున్నారు పాపం మావారు.

ఇక ఆ "చైనీస్ రెస్టారెంట్" లోకి వెళ్దామని అడుగుపెట్టేసరికీ అది నిండుగా ఉంది. ఏదో పార్టీ జరుగుతోందనీ ఒక పది నిమిషాలు వైట్ చేయమని చెప్పాడు. బయట కుర్చీలు కూడా లేవు. చుర్రుమనే ఎండలో కబుర్లాడుతూ నించున్నాం...పదినిమిషాలు కాస్తా అరగంత అయ్యింది కానీ లోపల ఖాళీ అవ్వలేదు. మళ్ళీ అడిగాము...పది నిమిషాలు..అన్నడు వాడు. నాకింక కోపం వచ్చేసింది. ముందరే అరగంట లేక గంట అని చెప్పచ్చు కదా? బయట తిరిగి మరో గంటలో వస్తాం కాదా? ఎండలో ఇలా నించోపెట్టడం అన్యాయం కదా? అని. మళ్ళీ రోడెక్కాం. ఎక్కడికి వెళ్ళాలి? ఉత్తప్పుడు ప్రతిరోడ్డు చివరా ఏదో ఒక చైనీస్ రెస్టారెంట్ కనబడుతూనే ఉంటుంది. ఇప్పుడు కావాలంటే ఒక్కటీ కనబడట్లేదు...పోనీ ఏదన్నా టిఫిన్ చేసేసి వెళ్పోదామా? అన్నారు తను. "ఊహూ! ఇవాళ అమెరికన్ చౌప్సీ తినాల్సిందే" అన్నాను నేను. "ఎవడు కనిపెట్టాడో ఈ అమెరికన్ చౌప్సీ ని...." గొణుక్కున్నారు అయ్యగారు.

ఆదివారం కావటంతో రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఓ కిలోమీటర్ నడిచాకా బస్టాప్ వచ్చింది. ఎక్కి కూర్చున్నాం. సగం దూరం వెళ్ళాకా "దిగు దిగు" అని అర్జెంట్ గా బస్సులోంచి దింపేసారు. ఆ ఏరియాలో ఒక చైనీస్ రెస్టారెంట్ ఉందని తనకు గుర్తు వచ్చిందిట. అది వెతుక్కుంటూ ఓ అరగంట తిరిగాకా మొత్తానికి కనబడింది. హమ్మయ్య ! అనుకుని లోపలికి దూరాం. ఆర్డర్ ఇచ్చాం. పక్క రెండు టేబుల్స్ మీద కాలేజీకుర్రాళ్ళు. అప్పటికి టైం సాయంత్రo నాలుగైంది. "లంచ్ కని బయల్దేరి సాయంత్రం నాలుగింటికి అమెరికన్ చౌప్సీ తినే మొహాలూ మనమూనూ" అని జోకేసుకున్నాం. ఆవురావురని కడుపులో సింహాలు పరిగెడుతూంటే సర్వర్ తెచ్చిన చౌప్సీ అమృతంలాగ అనిపించింది. తినటం పూర్తయ్యిండి.పక్క టేబుల్ దగ్గరకు "నాన్ వెజ్ ఐటెమ్స్" వచ్చాయి. ఆ వాసన గిట్టని నాకు కడుపులో ఒక్కసారిగా తిప్పటం మొదలైంది. బిల్లు కట్టి బైటకు రమ్మని తనకు చెప్పి నేను బయటకు పరిగెత్తా...!


పాపను తీసుకుని రావటానికి వెనక్కు వెళ్ళి, దానికి కాస్తంత అన్నం అక్కడే పెట్టేసి మళ్ళీ ఇల్లు చేరే సరికీ ఆ రోజు తొమ్మిదయింది. "లేటయ్యిండిగా బయట తినేసి వెళ్దామా" అన్నారు తను. అప్రయత్నంగా "బాబోయ్ వద్దు.." అనేసాను. అప్పుడు రాత్రి అన్నం వండుకుని తిని పనులన్నీ అయ్యేసరికీ పదకొండు...ఎంత పని చేసింది "అమెరికన్ చౌప్సీ" అనుకున్నాం...!! ఉత్త పప్పయినా సరే... హాయిగా ఇంట్లో వండుకుని తిన్న సుఖమే సుఖం ఏంతైనా...అనిపించింది నూటొక్కోసారి...!
(అయినా మరో ఆదివారమో ఆపైవారమో "బయటకు" అనేసరికీ రెడీనే.....)


14 comments:

వీరుభొట్ల వెంకట గణేష్ said...

:-)

సృజన said...

:):)

భావన said...

’ అమెరికన్ చౌప్సీ’ నా ??? అదేమిటి అబ్బా? అమెరికా లో మాకు తెలియనిది మీకు అక్కడ దొరికేది?? అవును తృష్ణా అబ్బ బయటకు వెళ్ళి పొట్ట పాడు చేసుకునేది కంటే పప్పు ఆవకాయ తో తింటే నే వుత్తమం, పొట్టకు, పర్స్ కు కూడా.

వేణూశ్రీకాంత్ said...

హ హ అభిమానమంటే అదేనండీ మరి :-) ఒకటిరెండు సార్లు మెనుకార్డ్ లో చూశా కానీ ఎప్పుడూ ప్రయత్నించలేదు నేను, ఈ సారోమారు రుచిచూడాలి.

శేఖర్ పెద్దగోపు said...

>>>ఉత్త పప్పయినా సరే... హాయిగా ఇంట్లో వండుకుని తిన్న సుఖమే సుఖం ఏంతైనా...అనిపించింది నూటొక్కోసారి...! <<<<
:-):-)
ఆ చౌప్సీ ఎలా తయారు చేస్తారో ఈ సారి రెస్టారెంట్ కి వెళ్ళేటప్పుడు ఆరాతీయండి! ఇక్కడ మేం కూడా నూటొక్కో సారి చెయ్యికాల్చుకుంటాం...

మాలా కుమార్ said...

ఆ చౌప్సీ ఏమిటో అదెక్కడ దొరుకుతుందో కూడా చెప్పాల్సింది కదా . మేమూ వెళ్ళేవాళ్ళము కదా ?

Srujana Ramanujan said...

I too like Choupsy. :-) Some spelling mistakes crept in.

తృష్ణ said...

thankyou srujana. Its a typing mistake. I've corrected it.

గీతాచార్య said...

ఆమధ్యోసారి అనుకోకుండా ఆర్డరిచ్చి ఆ రుచికి ఫ్లాటయ్యాను. గుంటూరు నక్షత్రాలో చాలా టేస్టీగా ఉంటుంది.

బాగా వ్రాశారు. ఆశ ఇష్టం అలానే ఉంటాయి మరి

తృష్ణ said...

@గణేష్: thankoyou.

@సృజన: thankyou.

@భావన: :) తిని చూడండి...వదలరింక...!
thankyou.

తృష్ణ said...

@వేణూ: తప్పక రుచి చూడండి..స్వీట్ ఇష్తమైనవాళ్ళకి నచ్చుతుందిది.
thankyou.

@శేఖర్: ఆ ప్రయత్నాలు గూగులమ్మనడిగి తెలుసుకున్నాను...కాని ఇంట్లో నా ఒక్కదాని కోసం ఏం చేసుకోనూ...అని ప్రయత్నించలేదండీ..its not difficult but మీరూ చెయ్యి కాల్చుకోకండీ..

తృష్ణ said...

@మాలా కుమార్: అన్ని రెస్టారెంట్స్ లోనూ దొరుకుతుందండీ..ధన్యవాదాలు.

@గీతాచార్య: నాకయితే ఆ రుచి ముందర అన్నీ దిగదుడుపే..నాకెందుకో అది అంత ఇష్టం...
ఇప్పుడు గుంటూరు రమ్మంటారా? ...:)

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

పెళ్ళయితే ఇన్నికష్టాలా? ఈబెమ్మచారి బతుకే నయం. హాయిగా మాగీతిని పడుకున్నా ఆదివారం గడిచిపోద్ది

తృష్ణ said...

@చైతన్య: పెళ్ళంటే కష్టాలు సుఖాలు రెండూ కలిపి వస్తాయి...పెళ్ళయాకా మీ ఆవిడ అడిగినదేదైనా చేసి చూడు..అప్పుడు తెలుస్తుంది అందులోని ఆనందమేమిటో....:)