సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Tuesday, December 1, 2009
బంధుత్వాలు
(వీరిలో మా పాపా లేదు..దొరికినవాళ్ళకు తీసాము మళ్లీ వాళ్ల మూడ్ మారకుండా...)
"పుణ్యం కొద్దీ పురుషుడు....దానం కొద్దీ బిడ్డలు...."అంటారు.
మన స్వభావాన్ని బట్టి, ఎంపికను బట్టీ "మిత్రులు" ఏర్పడతారు.
మరి మన రక్త సంబంధం ద్వారా మనకు దగ్గరయ్యే బంధువులు....
బంధువులు "భగవంతుడు ఇచ్చిన మిత్రులు" అని నా అభిప్రాయం. వారే స్నేహితులు, సన్నిహితులు అయితే...అంతకు మించిన అదృష్టం ఏముంటుంది? పైన రెండు వాక్యాల తాలూకు అదృష్టాలతో పాటూ భగవంతుడు నాకా అదృష్టాన్నికూడా ఇచ్చాడు. మా బంధువులందరం ఎంతో కలివిడిగా, సన్నిహితంగా ఉంటాము. కజిన్స్ అందరం సొంత అక్క చెల్లెళ్ళలాగ...సొంత అన్నదమ్ములలాగ...!
పెళ్ళిళ్ళకీ, స్పెషల్ అకేషన్స్ కీ అందరం కలుస్తూ..సరదాగా గడిపేస్తాము. మా నాన్నకు ఒక్కరే అక్క. ఇంకెవరూ చుట్టాలు లేరు...ఆవిడను మా రెండవ మేనమామకు ఇచ్చారు. వాళ్ళ పెళ్ళి సమయానికి అమ్మకు ఒక ఏడాదిట. మిగతావాళ్ళంతా చిన్న చిన్న పిల్లలుట. చిన్నన్నయ్య,చిన్నవదినా అంటూ ఎంతో కలసిపోయారు వాళ్ళంతా. కాబట్టి నాకు రెండు వైపుల నుంచీ ఒకే బంధువులు. అందరం ఒక గూటికి చెందినవాళ్ళమే.
తాతగారి సంతానం నలుగురు అబ్బాయిలు,నలుగురు అమ్మాయిలు. చిన్నప్పుడు అందరం తలో ఊళ్ళో ఉండేవాళ్ళం. కానీ సంవత్సరానికి ఓసారైనా తాతగారి ఆబ్దీకానికి అందరం కలిసేవాళ్ళం. అప్పట్లో తాతగారిల్లంతా మా పిల్లల కేరింతలతో, అల్లర్లతొ దద్దరిల్లుతూ ఉండేది. కాస్త పెద్దయ్యాక శెలవుల్లో పిన్నిలు, పెద్దమ్మల ఊళ్ళు వెళ్ళాలంటే అదో పెద్ద ప్రోసెస్. నాన్న కొంచెం స్త్రిక్ట్. ఎక్కడికీ పంపేవారు కాదు. స్నేహితుల ఇళ్ళకు వెళ్ళినా టైం ప్రకారం వెళ్ళి, చెప్పిన టైం కు వచ్చేయాలి. కాస్త లేటైతే నాకోసం బయల్దేరిపోయేవారు. ఓసారేమైందంటే...అమ్మో అది వేరే కధ...(ఇంకో టపాలో..)
ఈ కధలోకి వచ్చేస్తే, శెలవుల్లో ఊళ్ళు వెళ్ళటానికి ముందు అమ్మని కాకాపట్టాలి. ఆ తరువాత కూడా నాన్న ఒప్పుకునేవారు కాదు. అప్పుడు పిన్ని చేతో, పెద్దమ్మ చేతో మాట్లాడించేవాళ్ళం...వాళ్ళు అడిగితే మొహమాటానికి ఇంక అయిష్టంగా ఒప్పేసుకునేవారు..! గ్రీన్ సిగ్నల్ రాగానే ఇక నన్ను ఆ ఊరు తీసుకెళ్ళే మనిషి కోసం వెతుకులాట. ముందుగానే బట్టలు సర్దుకుని రెడీగా ఉన్న నేను, బాబయ్యో, అన్నయ్యో ఎవరో ఒకరు దొరికితే వాళ్ళతో వెళ్పోయేదాన్ని..నర్సాపురం, భీమవరం, విశాఖపట్నం, కాకినాడ, జగ్గయ్యపేట...ఇలా ప్రతి ఏడాదీ శెలవుల్లో బానే వెళ్ళేదాన్ని ఊళ్ళు. కొన్నిసార్లు అమ్మావాళ్ళు కూడా వచ్చేవారు.
ట్రాన్ఫర్ మీద ఒక మావయ్య విజయవాడ వచ్చాకా ఇక అందరూ మా ఊరే వచ్చేవారు. అమ్మమ్మను చూడటానికి. అందరం ఒకచోట కలిసి నవ్వులూ, కేరింతలూ, కబుర్లూ...ఆ సందడే వేరుగా ఉండేది. కానీ రాను రానూ చదువులూ, ఉద్యోగాలతో రాకపోకలు బాగా తగ్గిపోయాయి. అందరం కలిసి మూడు నాలుగేళ్ళు దాటిపోవటం మొదలైంది. కుటుంబంలోని ప్రతి పెళ్ళికీ తప్పక కలిసే కజిన్స్ అందరం పెళ్ళిళ్ళయ్యాకా అసలు కలవటమే తక్కువైపోయింది...!! ఉత్తరప్రత్యుత్తరాలు, ఫోనులూ ద్వారా అందరి విశేషాలు అందరికీ తెలుస్తున్నా, కళ్ళరా చూసుకుని కబుర్లాడే అపురూప క్షణాల కోసం అందరం తపించిపోయే పరిస్థితికి వచ్చాం. కాంటాక్ట్ లో ఉండటానికి కజిన్స్ అందరమూ యాహూ గ్రూప్స్ లో ఒక గ్రూప్ తయారుచేసుకుని గ్రూప్ మైల్స్ ద్వారా అప్పుడప్పుడు కబుర్లాడుతూ ఉంటాం.
ఇప్పుడు అనుకోకుండా అమ్మావాళ్ళు ముగ్గురు అప్పచెళ్ళెళ్ళూ, ఒక మవయ్యా ఒకే ఊళ్ళో స్థిరపడ్డారు. ఏడుగురం కజిన్స్ కూడా ప్రస్తుతానికి ఇక్కడికే చేరాం. కానీ విచిత్రం ఏమిటంటే ఒకే ఊళ్ళోని అందరం ఒకచోట కలిసి రెండేళ్ళు అవుతోంది...దూరాలూ, ఉద్యోగాలూ, సమయాభావాలు...భవబంధాలూ...అన్నీ కారణాలే..హలో అంటే హలో అని ఫోనుల్లో మాట్లాడుకోటానికి కూడా నెలలు పడుతోంది. ఈ లోపూ మా పదహారుమంది మనుమలలో పెళ్ళిళ్ళైన వారికి మొత్తం కలిపి ఇరవై పైగా పిల్లలు... వాళ్ళూ పెరిగి పెద్దయిపోతున్నారు. వాళ్ళు పెద్దయ్యాకా "అమ్మమ్మ చెల్లి కూతురు కొడుకుట.." అనుకునే పరిస్థితి వాళ్లకు రాకూడదని మా ప్రయత్నం. మా బంధుత్వాలను, సన్నిహితాలనూ పిల్లలకు కూడా పంచాలని మా ప్రయత్నం. అందుకే ఇక ఏమాత్రం వీలు దొరికినా ఈ మధ్యన కలిసి పిల్లలకు పిల్లలకూ స్నేహాలు పెంచుతున్నాము.
ఇప్పుడు ఈ పిల్లలంతా మమ్మల్ని "కార్తీక్ అమ్మ", "సంకల్ప్ అమ్మమ్మ", "సంజన తాతగారు" అంటూ గుర్తిస్తుంటే మేమంతా చాలా ఆనందిస్తున్నాము. ఈ బంధుత్వపు స్నేహాలను ఇలాగే మరిన్ని తరాలకు అందివ్వాలని ఆశిస్తున్నాం. మొన్న వీకెండ్ జరిగిన రెండు గృహప్రవేశాలలో మళ్ళీ అనుకోకుండా అందరం కలవటం...మా మా పిల్లలంతా సరదాగా ఆడుకోవటం మనసులకు ఎంతో ఆహ్లాదాన్ని, ఉత్సాహాన్ని కలిగించాయి. ఇక మాకు "నేటి కలయికలే రేపటి పిల్లల బంధుత్వాలకు పునాదులు" అనే నమ్మకం కుదిరింది.
Subscribe to:
Post Comments (Atom)
11 comments:
చిన్నపుడు మా ఇంట్లో పిల్ల పీచూ మేకా మంది అందరూ కలిపి 30 మంది పైమాటే ....ఇంక బంధువులు వాళ్ళతో ఎంత సందడిగా ఉండేదో మా ఇల్లు .హూం ఏంటో ఆ రోజులు మళ్ళీ మళ్ళీ రావు కదా ,మరీ చెట్టుకొకళ్ళం పుట్టకోకళ్ళం లా వెళ్ళిపోయాం.అందరూ కలసి ఉండటానికి అస్సలు వీలు కావడం లేదు .ఫోన్ లలో మాట్లాడుకోవడం కూడా తక్కువైపోతుంది ఒక్కోసారి ఖర్చులు,టైమింగులు,దూరాభారాలు కుదరక .మీలా అప్పుడప్పుడయినా కలిసే వీలుంటే బాగుంటుంది పిల్లలకు ,పెద్దలకు .
బంధుత్వాలు ప్రేమానురాగాలని పెంచుతాయి. మంచి చెడుకు వారే. స్నేహానికీ వారే. చిన్నా పెద్దా కలిసినప్పటి సంబరాలు చెప్పనలవి కావు. ఎప్పుడూ బంధుత్వానికి దూరం కాకూడదు. మీ అనుభవాలు బాగున్నాయి తృష్ణ గారు.
తృష్ణ గారు మీ అనుభవాలు బాగున్నాయ్..
నేస్తం అక్క చెప్పినట్టు
ఇప్పుడు అందరు చెప్పుకునే దేమిటంటే
అప్పట్లో మా ఇంట్లో ఎంత మంది ఉండే వారో తెలుసా అని ఆశ్చర్యంగా !...
ఎందుకంటే ఇప్పుడు % కుటుంబాలు నలుగురు లేదా ఐదుగురు అంతే ...
WWWWW.THOLIADUGU.BLOGSPPOT.COM
బంధువులతో స్నేహితులలా కలిసిపోయి ఉండగలగడం అదృష్టమే తృష్ణ గారు... అప్పుడపుడూ అయినా కలవగలగడం బాగుంది.
@జయ: మీరన్నది నిజమండీ. ధన్యవాదాలు.
@నేస్తం: అప్పుడప్పుడన్నా కలవకపోతే బంధుత్వాలు దూరమైపోతాయండీ...పిల్లలకు ఎవరు ఎవరో
తెలీకుండా పోతుంది..
ధన్యవాదాలు.
@కార్తీక్: మీరన్నది నిజమే కానీ ఇంకా ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయండీ...
ప్రస్తుతం మాది ఉమ్మడి కుటుంబమేనండీ..
@వేణూ: అవునండీ మా అమ్మగారింట్లో అందరం అలానే ఉంటాము....ధన్యవాదాలు.
బాగున్నాయండీ కబుర్లు..
తనకార్యం లో మునిగి పోవడానికి
పసిపిల్లవాని కి తల్లి బొమ్మలిచ్చి నట్లు
పరమాత్మ మనకి బంధాలని, బంధువులని ఇస్తాడేమో...
బొమ్మలతో ఆడుకుంటూ, అమ్మని మరచి నట్లు,
బంధాలలో పడి ప్రమాత్మని మరవకూడదేమో..
ఇదే మాయేమో...(శ్రీ కృష్ణుని యోగమాయెమో)
స్నేహితులఓ స్నేహం,
బంధువులలో బంధం,
ప్రేమికులలో ప్రేమ,
వ్యక్తులలో వ్యక్తిత్వం, ఇవే కావలిసినవెమో...
స్నేహం లేని స్నేహితులు,
బంధం లేని బంధువులు,
ప్రేమ లేని ప్రేమికులు ,
వ్యక్తిత్వం లేని వ్యక్తులు ...ఇవే వదులుకోవలసినవేమో..
( ఇది కేవలం నా సత్యగత అభిప్రాయం మాత్రమే ...)
మా అమ్మతరపువాళ్లు, నాన్నతరపువాళ్లు అందరూ మాఊర్లోనో చుట్టూప్క్కల ఊళ్లలోనో ఉంటారు. ఒకరిద్దరుతప్ప. కాబట్టి వారానికొకసారి ఫోను, ఇంటికెళ్ళినప్పుడు ఒక్కోపూట ఒక్కొక్కరింట్లో భోజనాలు.
nice post. good capture of the joyful moments.
@murali,
@satya,
@chaitanya,
@usha,
ధన్యవాదాలు.
Post a Comment