సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Saturday, December 18, 2010
ఏమండీ...నువ్వు
"ఏమండీ.." "ఏమండీ.."
ఇదేం పదం బాబూ?
ఎవరుకనిపెట్టారో?
ప్చ్..!
వాళ్ళనీ...
అసలూ ఎవరో పక్కింటివాళ్ళనో, పరిచయంలేనివాళ్ళనో, రోడ్డు మీడ వెళ్ళేవాళ్ళనో పిలిచినట్టు జీవితభాగస్వామిని "ఏమండీ" అని పిలవటమా? నాన్సెన్స్. నువ్వు కాబట్టి పిలుస్తున్నావు. నేనస్సలు పిలవను. నేను చక్కగా పేరు పెట్టో, నువ్వు అనో పిలుచుకుంటా....
హు...హు..హు..! ఇవన్నీ పెళ్ళికి ముందు పలికిన ప్రగల్భాలు. అమ్మ దగ్గర పేల్చిన ఉత్తుత్తి తూటాలు. అమ్మకు నాన్న వరసకు "బావ" అవుతారు. పదవ తరగతి అవ్వగానే పెళ్ళి చేసేసారు. అందరితో పాటుగా అమ్మ కూడా ’బావా బావ” అంటూంటే అత్తారింట్లో "అదేంటమ్మా, ఇప్పుడిక బావా అనకూడదు. భర్తని "ఏమండీ" అనాలి..." అని క్లాస్ ఇచ్చేసారుట. పాపం అమ్మ "బావా..నువ్వు.." అనే స్వాతంత్ర్యం పోగొట్టేసుకుని "ఏమండీ..మీరు.." అనే మొహమాటపు పిలుపుల్లోకి దిగిపోయింది. ఇప్పుడైనా పిలవచ్చు కదమ్మా అంటే..అలవాటైపోయిందే. అంటుంది. "నువ్వు" అనే పిలుపులోని దగ్గరతనం "మీరు" అనే పిలుపులో ఎప్పటికైనా వస్తుందా? రాదంటే రాదు. ఎంత దగ్గరైనా "మీరు" అనే పిలుపు మాత్రం ఎదుటి మనిషిని అల్లంత దూరాన్నే నిలబెట్టేస్తుంది. ఆ గీత దాటి మరింత దగ్గరకు వెళ్ళాలన్నా ఈ పదం అస్సలు వెళ్ళనివ్వదు. నాకయితే అది అచ్చం ఓ మొహమాటపు పిలుపులానే అనిపిస్తుంది. బాగా సన్నిహితమైతే తప్ప నేనెవరినీ "నువ్వు" అనను. పేపర్ అబ్బాయినీ, ఆటో డ్రైవర్నూ కూడా "మీరు" అని పిలవటం నేను నాన్న దగ్గర నేర్చుకున్నా.
పూర్వకాలం కొద్దిగా అలుసిస్తే నెత్తినెక్కే భర్యలు ఉండేవారేమో అందుకని భార్యలను అదుపులో ఉంచుకోవాలనో, తమ గౌరవాన్ని ఎక్కువ చేసుకోవాలనో ఇలాంటి పిలుపుని నిర్ణయించి ఉంటారు అని నా అభిప్పిరాయం. లేకపోతే ఎప్పుడైనా ఎవరైనా దగ్గరి స్నేహితులను "ఏమండీ...మీరు" అని పిలుస్తారా? మరి భర్త అంటే స్నేహితుడే కదా. జీవితాంతం మిగిలిన అందరి కంటే భార్యకు దగ్గరగా, అనుక్షణం వెంటే ఉండే భర్త అందరికంటే ఎక్కువ సన్నిహితుడైన మిత్రుడే కదా. మరి అలాంటి మిత్రుడిని "ఏమండీ" అని ఎందుకు పిలవాలి? అసలా పిలుపుతో ఇద్దరి మధ్యన ఏర్పడిన లేక ఏర్పడబోయిన సన్నిహిత అనుబంధం కాస్తైనా దూరం అయిపోతుంది అని నా భావన. మగవాళ్ళు మాత్రం భార్యలను "ఏమే" "ఒసేయ్" "రావే" "పోవే" అని పిలవచ్చా? ఇదెక్కడి న్యాయం? అంటే ఇప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నవాళ్ళ గురించి నేనేం మాట్టడటం లేదన్నమాట. కొందరు "ఒరే" అని కూడా పిలుస్తున్నారు ఇప్పుడు. అది పూర్తిగా వేరే టాపిక్.
మాది ఎరేంజ్డ్ మేరేజ్ అవటం వల్ల, నా పెళ్ళికి ముందు మావారితో పరిచయం గానీ, స్నేహం గానీ లేకపోవటం వల్ల పెళ్ళయ్యాకా ఏమని పిలవాలో తెలిసేది కాదు. "మీరు" "ఏమండి" అనటం నా భావాలకు విరుధ్ధం. "ఏయ్" ఓయ్" అని అవసరార్ధం ఎక్కడైనా అనాల్సి వచ్చేది...అవి కాస్తా మా అత్తగారి చెవిన పడనే పడ్డాయి. "ఏమిటమ్మా, మొగుణ్ణి పట్టుకుని ఏయ్..ఓయ్..అంటావేమిటీ? శుభ్రంగా ఏమండీ అని పిలువు" అని గీతోపదేశం చేసారు. ఏం చేస్తాం. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ కాబట్టి నేను సైతం ఆ పిలుపుకే అలవాటు పడ్డాను.కానీ మనసులో ఎక్కడో ఓ మూల బాధ. ఆ కొత్తల్లోనే ఓ రోజు సినిమాకు వెళ్ళాం. సినిమా అయ్యాకా నన్ను గేట్ దగ్గర ఉండమని తను బండి తెచ్చుకోవటానికి వెళ్ళారు. నేనో గేట్లోంచి బయటకు వచ్చాను. తనో గేట్లోంచి బయటకు వచ్చారు. కాసేపు వెతుకులాట సరిపోయింది. ముందు నాకు తను కనిపించారు. "ఏమండి..ఏమండి" అని ఆ జనంలో పిలుస్తూంటే అందరూ వెనక్కు తిరిగి చూస్తూంటే నాకే నవ్వు వచ్చింది. అప్పుడొచ్చింది భలే కోపం. భర్తను ఏమండీ అని పిలవమని రూలు పెట్టిన వాళ్ళానీ... అని బాగా తిట్టేసుకున్నాను. చివరికి ధైర్యం చేసి పేరు పెట్టి పిలిచేసా. అప్పుడు వెనక్కు తిరిగి చూసారు అయ్యగారు.
ఇక అప్పటినుంచీ నా రూలైతే మారిపోయింది. "మొగుణ్ణి పేరు పెట్టి పిలుస్తావా? హన్నా" అని అయ్యగారే ఓ క్లాస్ తీసుకుంటారు కాబట్టి తనను పేరు పెట్టి పిలవను కానీ దరిదాపుల్లో మూడో వ్యక్తి లేకపోతే మాత్రం "నువ్వు" అనే పిలుస్తాను. కాస్తలో కాస్త సేటిస్ఫాక్షన్ అన్నమాట. ఏమాటకామాటే చెప్పుకోవాలి. మా అన్నయ్య, తమ్ముడు మాత్రం పెళ్ళిళ్ళు కుదరగానే "పేరు పెట్టి పిలువు"..."నువ్వు" అను అని భార్యలకు ఫ్రీడం ఇచ్చేసారు. ఎంతైనా నాకు సహోదరులు కదా...:) భర్తకు ఇవ్వల్సిన గౌరవం ఎప్పుడూ ఇవ్వాలి. కాదనను కూడా. కానీ నా కంప్లైంట్ అంతా ఆ "ఏమండీ" అనే పిలుపు మీదే. ఎప్పటికైనా ఆ పిలుపులో మార్పుని తెచ్చే ఎమెండమెంట్ ఏమన్నా వస్తుందేమో అని చిన్న ఆశ.
Subscribe to:
Post Comments (Atom)
17 comments:
ఐనా మీరు "ఏవండీ !" అని పిలిచినా .....మాకు ప్రతీ సారీ "వరెయ్!!" అన్నట్టుగానె వినపడుతుంది ...అదృష్టవంతులం ...
మేం....అవివాహితులం!!!(సరదాకి)
మా ఇద్దరికీ 'నువ్వు" అని ఎంచక్కా పేర్లతో పిల్చుకోడం అలవాటు. పెళ్ళికి ముందే మాకు పరిచయం ఉండటం వల్ల చనువు కూడా ఉంది! పెళ్ళైన కొత్తలో చుట్టాలుంటారు కదా అని 'మీరు, ఏవండీ" అని పిలవబోతే ఈయన ఎర్రగా చూసి అలా వీల్లేదన్నాడు. పైగా నేను మధ్య మధ్యలో మర్చిపోయి, "ఏవండీ, ఎక్కడున్నావు ఇంతసేపూ?మీ కోసం వెదుకుతున్నాను! ఇక్కడికి రా" ఇలా అదీ ఇదీ కలేసి కన్ ఫ్యూజ్ అయిపోతుండేదాన్ని! అది చూసి జాలిపడి మా అత్తగారు కూడా " మీ ఇద్దరి కంఫర్టు! హాయిగా ఇష్టమైనట్లు పిల్చుకోండి. ఏవండీ అనాలని రూల్లేదు" అని ఫ్రీడమ్ ఇచ్చేశారు. (అందుకే ఈవిడంటే నాకు చచ్చేంత ఇష్టం) మా అన్నయ్యలు మాత్రం వాళ్ళావిడలు నువ్వు అంటే గింజుకుంటారు. పాపం! యావండీ అనాల్సిందే!
నువ్వు అని పిల్చుకుంటేనే మానసికంగా సన్నిహితంగా అనిపిస్తుంది.
బావుంది మీ కోపం
మా అమ్మ, నాన్నగార్ని మిమ్మల్నే అని పిలుస్తుంది. వినీ వినీ నాకూ అదే పిలుపు అలవాటై ఏదైన చెప్పాలి అనుకున్నప్పుడు మా వారిని మిమ్మల్నే అని పిలిచేస్తాను.
ఇప్పటి జంటల్లొ ఆ ప్రొబ్లెం లేదు హ్యపీగా పేరు తో పిలిచేస్తారు నిజానికి అది సుఖం కూడా
నాకు కూడా ఏమండీ అంటే చిరాకే......హాయిగా పేర్లతో పిలుచుకుంటూ నువ్వు నువ్వు అనుకుంటే వచ్చే చనువు ఏమండీ లో ఉండదు అనిపిస్తుంది నాకు. ఈ కాలంలో పరిస్థితి చాలావరకు మారిందిలెండి. నువ్వు అని పిలుచుకుంటున్నారు అరేంజెడ్ మేరేజ్ అయినవాళ్ళు కూడా.
accham nenu kuda mee lage alochistanu . Nenu maa varitho cheppi chusanu , kaani laabham emi ledu .Naaku ishtam leni maa variki ishtam ayina yaavandi ane pilipinchukuntaru. Bhartani chanuvuga pilchukune adrushtam kosam inka eduruchustunna ...
Ayna sagam mandi magavallu bayata prapanchaniki istunna viluva bharya abhiprayaniki isthe chala bavuntundi kada
ఈనాటి వరకూ నేను ఏనాడూ 'ఏవండీ' అనలేదు. అంటే స్కిప్ చేసేస్తూ ఉంటానన్నమాట:) పాపం ఆయన కూడా ఎప్పుడూ గమనించలేదు.
good one :)
మా అత్తగారు , మా మామగారిని ఏమయ్యా అని పిలిచేవారు . మ పెళ్ళైన కొత్తలో మావారు పేరు పెట్టి పిలువు . మీరు అని అననవసరం లెదు అన్నారు . ఐనా నాకు ' ఏమండీ ' అని పిలవటమే ఇష్టం . అదే నచ్చుతుంది ఏందుకో తెలీదు :)
ఐనా పిలుపులో ఏంవుంది ? మనసులో అభిమానం దగ్గరితనం వుండాలి అని నా భావన .
madi love marriage.
nenu matram peru pette pilustanu.
pelli ayna kottallo maa ayana valla grandma ,nenu peru petti pilustunte ala kadu emandi ani pilavamandi.
Naku evarino bayata auto vallani ,kuragayalu ammukone vallani pilichinatlu vuntundi ani cheppanu.
Anthe inka pilavamani kuda cheppaledu eppudu.
@సత్య: మీ ఒక్కరికే అలా వినబడుతుందేమోనండీ...:)
@సుజాత: ఎంచక్కా బాగుంది. అదృష్టవంతులు. ప్రస్తుతం నేనూ అదే కన్ఫ్యూజన్ లో "ఏమండీ, ఇలా ఇవ్వు..." అంటూ మాటాడేస్తు ఉంటాను.
@లత: విడిగా ఇద్దరు మాత్రమే ఉండేవాళ్ళు ఎలాగైన పిలిచేసుకుంటారండి చక్కగా. అఫ్కోర్స్, భర్తగారికి "నువ్వ"నే పిలుపు నచ్చితేనేలెండి.
@ఆ.సౌమ్య: అవునండి. చెప్పాకదా కొత్తజంటల సంగతే వేరు...:)
@లక్ష్మి: మీరు చెప్పినది అక్షరాలా నిజం అండి.
కానీ ఇది ఎవరికి వాళ్ళు అర్ధం చేసుకోవాల్సిన విషయం.
@జయ: అవునాండీ? ’jaya the great’ అని మరోసారి నిరూపించేసుకున్నారు..:)
@కొత్తపాళీ: ధన్యవాదాలు.
@మాలా కుమార్: మా నాన్నగారి నాన్నమ్మగారు కూడా వాళ్ళాయనను ఏమయ్యా, నువ్వు అని పిలిచేవారుట. చిన్నప్పటి నుంచీ పరిచయం ఉండటంవల్ల చనువుట.
మీరన్నది కూడా పాయింటే నండీ. పిలుపు ఎలా ఉన్నా మనసులో అభిమానం కూడా ఉండాలండోయ్...:)
@శ్రావ్య: అలా గట్టిగా, నిర్భయంగా చెప్పగలిగే ధైర్యం కూడా ఉండాలి కదండీ..:)
My God ఈ శ్రావ్య గారు ఏవరూ ? :) కామెంట్ చూసి కొంచెం కంగారు పడ్డా నేను :)
భలే చెప్పారు. నాకు కోపం వచ్చినప్పుడు పిలుస్తా తనని యావండీ అని...అది signal అనమాట నాకు కోపం వచ్చిందని...
మీరు రాసిన ప్రతి పదంతోను నేను ఏకీభవిస్తాను. నేను మా వారిని చక్కగా పేరు పెట్టె పిలుస్తాను. పెళ్ళయిన కొత్తలో మా అత్తగారు వాళ్ళు కాస్త ఇబ్బంది పడివుండవచ్చు.
I feel there are certain sensitive things in which you should not compromise for the sake of others. మొదట్లో ఒకసారి మా నాన్న గారు అమ్మతో అన్నారంట అలా పేరు పెట్టి పిలిస్తే బాగోదేమో అని. అప్పుడు అమ్మ అలంటి విషయాలలో మనం కల్పించుకోకూడదు అన్నారంట. మా చెల్లి వాళ్ళ అత్తగారు చెల్లితో ఇలా అన్నారంట "నువ్వు మీ ఆయనను ఎలా అన్న పిలుచుకో, కానీ నా ముందు మాత్రం పేరు పెట్టి పిలవకు". పాపం ఆవిడ US లో వాళ్లతో కొంత కాలం ఉండటానికి వెళ్లి , అన్ని రకాల పిలుపులకు అలవాటు పడిపోయారు.
Post a Comment