సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, December 16, 2010

ధనుర్మాస ప్రారంభం - మొదటి ముగ్గు !!






ఇవాళ నుంచీ ధనుర్మాసం మొదలు. ముగ్గులు మొదలు. కానీ ఇదేమిటి మొదటి ముగ్గు అని మూడు ముగ్గుల ఫోటోలు పెట్టాను? చిన్నది తులశమ్మ దగ్గర ఎలాగో ఫిక్స్ అయిపోయింది. ఇక పెద్ద ముగ్గులు రెంటిలో ఏ ముగ్గు పెడదామా అని ఆలోచిస్తున్నానన్నమాట. అందుకని మూడూ పెట్టేసాను...:) నాకు మామూలు ముగ్గుల కన్నా మెలికల ముగ్గులు బాగా ఇష్టం. ఎక్కువగా అవే వేస్తాను.

ముగ్గులు గురించి అదివరకూ రెండు సార్లు( 1, 2) రాసేసాను. అందుకని ఇక రాయటం లేదు.

9 comments:

ఆ.సౌమ్య said...

నాకు ముగ్గులు పెట్టడమంటే ఎంత ఇష్టమో...మా ఊర్లో నెలగంటు పెట్టిన దగ్గరనుండి సంక్రాంతి వెళ్ళేవరకు రోజూ పెద్ద పెద్ద ముగ్గులు పెట్టేదాన్ని ఇంటిముందర. దానికి ఎంత ప్రహసనమనుకున్నారు! మంచి ముగ్గు ఎంచుకోవాలి, అది నేర్చుకోవాలి. చుక్కలు బాగా రాకపోతే చెరుపుతూ ఉండాలి...ఓహ్ అందమైన రోజులు. మీ పోస్ట్ తో నాకవన్నీ మళ్ళీ గుర్తొచ్చాయి. Thank you!

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

బాగుందండీ, ముగ్గుల ముచ్చట. మా ఫ్లాట్స్ ల్లో ఇలాంటి ముచ్చట్లు తీరవుగా!
నాకూ మెలికల ముగ్గులంటేనే ఇష్టం.

నిషిగంధ said...

బావున్నాయి.. మీలా మెలికల ముగ్గులు వేసేవాళ్ళంటే నాకు భలే ఫాసినేషన్.. చుక్కల్తో చిలకలూ, తామరపువ్వులూ, దీపాల్లాంటివి తెగ కష్టపడి సృష్టించగలను కానీ ఈ మెలికల్ని సరిగ్గా కలపడం మాత్రం నా వల్ల కాదు.. :-)

తృష్ణ said...

ఆ.సౌమ్య: అవునండీ..ఈ సందడి హడావుడీ ముగ్గులు పెట్టేవాళ్ళకే బాగా అర్ధం అవుతుంది. ముగ్గు ఎంచుకోవటం, సాయంత్రమే పేపర్ మీద ప్రాక్టీసు చేయటం, పనుమనిషితో పేడ నీళ్ళు చల్లించటం, దోమలతో కుట్టించుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ముగ్గులు పెట్టడం, రాత్రయ్యాకా వీధిలో అందరూ ఏం ముగ్గులు పెట్టారో చూసి రావటం, మనదే అందరికన్నా బాగుండని మురిసిపోవటం, అండరూ బాగుండంటే పొంగిపోవటం....మరపురాని మధురమైన రోజులు...గుర్తు చేసినండుకు ధన్యవాదాలు.

తృష్ణ said...

@మందాకిని: మొన్నటి దాకా నాకూ ఆ ముచ్చట తీరలేదండి...చాలా ఏళ్ళ తరువాత ఇప్పుడే మళ్ళీ...ధన్యవాదాలు.

తృష్ణ said...

@నిషిగంధ: చిన్నప్పుడు అమ్మ అవలీలగా పెట్టేస్తూంటే చాలా అబ్బురంగా చూసేదాన్నండి. పెద్దయ్యాకా మెలికల ముగ్గుని కూడా వెల్డల్పు పోతతో వేయటం నేర్చుకున్నా.
ఇంకోటి చెప్పానా మీకు, ఎప్పుడన్నా చిరాగ్గా ఉన్నప్పుడు ఓ మెలికల ముగ్గు ఎదురుగా పెట్టుకుని పేపర్ మీద మళ్ళీ గీయటానికి ప్రయత్నించండి...ముగ్గు అయ్యే టైంకి చిరాకు ఎగిరిపోతుంది...:)
ధన్యవాదాలు.

ఆ.సౌమ్య said...

"పనుమనిషితో పేడ నీళ్ళు చల్లించటం, దోమలతో కుట్టించుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ముగ్గులు పెట్టడం, రాత్రయ్యాకా వీధిలో అందరూ ఏం ముగ్గులు పెట్టారో చూసి రావటం, మనదే అందరికన్నా బాగుండని మురిసిపోవటం, అండరూ బాగుండంటే పొంగిపోవటం"........అచ్చు ఇలాగే, ఇదే ప్రహసనం. నిజం ఆ ఆనందం అనుభవించినవాళ్ళకే తెలుస్తుంది. :)

సుజాత వేల్పూరి said...

నాకూ మెలికల ముగ్గులంటే చాలా ఇష్టమండీ! చాలా ఛాలెంజింగ్ గా ఉంటాయి. మెదడుకు పదును పెడుతూ! కష్టపడి నేర్చుకుని స్కూలు రోజుల్లో నేనూ చక్కగా వేసేదాన్ని!కానీ మరుసటి ఏడాదికి మళ్ళి ముగ్గులు వెదుక్కోడమే! ఒక తెల్ల కాయితాల నోట్ బుక్ పెట్టుకుని అందులో ముగ్గులు వేసి ఉంచుకోడం,మధ్యలో తప్పుగా వేసిన చోట చుక్కలు చెరుపుతూ, మళ్ళీ పేపర్లోకి చూస్తూ..ఏమిటో..1 భలే ఉండేవి ఆ రోజులు

మా అమ్మ చేతినిండా ముగ్గు తీసుకుని వేళ్ళ మధ్య నుంచి జారవిడుస్తూ ఎన్నెన్ని ముగ్గులు వేసేదో! ఎలా వేస్తోందో తెలిసే లోపుగా మెలికలు తిర్గుతూ ముగ్గు పూర్తయ్యేది.

అన్నట్లు ఈ సైట్ చూశారా? కేవలం ముగ్గుల కోసమే ఇది!

www.ikolam.com

తృష్ణ said...

@ఆ.సౌమ్య:..:)

@సుజాత: వావ్..భలే ఉందండి సైట్. థాంక్యూ.