సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, September 11, 2009

గొల్లపూడి గారి "ఎలిజీలు"

ఎలిజీ:
ఇంగ్లీషు సాహిత్యంలోని కొన్ని పద్యరూపాల్లో(poetic forms) "Elegy" ఒకటి. ఒక వ్యక్తి మరణానంతరం ఆ వ్యక్తిని గుర్తుచేసుకుంటూ,అతని మరణానికి విచారిస్తూ రాసే పద్యాన్ని
"Elegy" అంటారు.

పుస్తకం గురించి:

కొందరు గొప్పవాళ్ళు,పరిచయస్తులు,పెద్దవాళ్ళూ ఒక్కొక్కరే దూరమైనప్పుడు రాస్తూ వచ్చిన కొన్ని ఆర్టికల్స్ ను ఓ మిత్రుని సహకారంతో "ఎలిజీలు" పేరుతో 1998లో పుస్తకరూపంలోకి తెచ్చి మనకందించారు గొల్లపూడి మారుతీరావుగారు.గొల్లపూడిగారి పుస్తకంలోని ముప్ఫైనాలుగు మంది చిరస్మరణీయుల్లో సగానికి పైగా మహనీయుల గూర్చి నాకు తెలియటం నా అదృష్టంగా భావిస్తాను.

పుస్తకంలో గొల్లపూడిగారు స్మరించిన వారి పేర్లూ,వివరాలూ ఆయన మాటల్లోనే...ఇక్కడ తెలుపుతున్నాను:
దేవులపల్లి కృష్ణశాస్త్రి: ప్రసిధ్ధ తెలుగు భావకవి.
చలం: సాంఘిక సంస్కరణను అభిలషించిన చైతన్యవంతమైన రచయిత.
దాశరధి: దేశాభిమానంగల మహాకవి,అభ్యుదయవాది.
జలసూత్రం రుక్మిణీనాధశాస్త్రి: చమత్కారం,నేర్పు,గడుసుతనంతో పేరడీలు చెప్పగల దిట్ట.
ఆచంట జానకీరామ్: ఆకాశవాణి కార్యక్రమ నిర్వాహకులు.
సోమంచి యజ్ఞన్నశాస్త్రి: కధకులు,నాటకకర్త.
పురిపండా అప్పలస్వామి: ప్రముఖ కవి."పులి పంజా" వీరి ప్రసిధ్ధ కవితాసంకలనం.
న్యాయపతి రాఘవరావు: "రేడియో అన్నయ్య"గా చిరపరిచితులు.హైదరాబాదులో వీరు ప్రారంభించిన "ఆంధ్ర బాలానంద సంఘం" నేడు ఎంతో మంది పిల్లలకు శిక్షణ ఇస్తోంది.
ఎస్.భావనారాయణ: గౌరి ప్రొడక్షన్ అధినేత.ఎన్నో జానపద చిత్రాలను,చక్కటి సాంఘిక చిత్రాలను అందించిన నిర్మాత.
కె.ఎస్.ప్రకాశరావు:దర్శకులు."రఘుపతి వెంకయ్య అవార్డ్" గ్రహీత.ప్రముఖ దర్శకులు కె.రాఘవేందర్రావుగారు వీరి కుమారులు.
ఆత్రేయ: సుకవి,మనసు కవిగా ప్రఖ్యాత గాంచిన "కిళాంబి వెంకట నరసింహాచార్యులు" ప్రముఖ సిని గేయ రచయిత.

పురాణం శర్మ: "పురాణం సీత" పేరుతో ఈయన రాసిన "ఇల్లాలి ముచ్చట్లు" ఎందరో అభిమానులను సంపాదించుకున్నాయి09.వీరి కధ "నీలి" అంతర్జాతీయ కధల పోటీకి ఎన్నికైంది.
శ్రీ శ్రీ :ఇజాలకతతీతమైన నిజమైన మహా కవి."మహా ప్రస్థానం","ప్రభవ","చరమ రాత్రి కధలు" మొదలైన ఎన్నో రచనలు చేసారు.ఆత్రేయగారు రాసారని చాలామంది పొరబడే "డాక్టర్ చక్రవర్తి" సినిమాలోని "మనసున మనసై" పాట ఈయన రాసిందే!!
రావిశాస్త్రి: ప్రముఖ కధా,నవలా రచయిత.గొల్లపూడిగారి మాటల్లో "తెలుగు కధకి ప్లేన్ టికెట్టు కొనిపెట్టి దేశవదేశాలకూ పంపించారాయన"
కె.వి.గోపాలస్వామి: ఆంధ్రా యూనివర్సిటీ రిజిస్ట్రార్(1942-63),ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కి డైరెక్టర్ (1967-69),గొప్ప వక్త,రచయిత.
బుచ్చిబాబు:రాసినది ఒక్క నవలే అయినా తెలుగు నవలా సాహిత్యంలో ధృవతారగా నిలిచిపోయిన "చివరికి మిగిలేది" రచయిత.వీరు కధా రచయిత,వ్యాస రచయిత,నాటక కర్త కూడా.
టి.ఆర్.మహాలింగం : కలైమణి,పద్మశ్రీ లాంటి బిరుదులు పొందిన జగద్విఖ్యాత వేణుగాన విద్వాంసులు.
రావురి వెంకటసత్యనారాయణరావు: ప్రఖ్యాత రచయిత,పాత్రికేయులు.
గొల్లపూడి సుబ్బారావు: గొల్లపూడి మారుతీరావుగారి తండ్రిగారు.
ఇందిరా గాంధీ : పండిట్ జవహర్ లాల్ నెహ్రుగారి పుత్రిక.దేశరాజకియాలపై తన ప్రభావం చూపిన ఒకప్పటి మన దేశ మహిళా ప్రధాని.
స్థానం నరసింహారావు:ఆకాశవానణిలో నాటక విభాగానికి ప్రొడ్యుసర్ గా పనిచేసారు. స్త్రీ పాత్రల్లో నటించి,జీవించిన వీరు "పద్మశ్ర్రీ" అవార్డ్ గ్రహీత.
ఎన్.టి.రామారావు:ఎన్.టి.ఆర్ గా ప్రేక్షకుల మనసుల్లో నిలిచి;రాముడుగా,కృష్ణుడుగా పౌరాణిక పాత్రల్లో జివించిన అమరజివి."తెలుగు దేశం" పార్టీ స్థాపించి,ప్రజాభిమానంతో రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు.
ఉషశ్రీ :రేడియో ద్వారా "రామాయణం,మహాభారతం.."లాంటి గ్రంధాలకు బహుళ ప్రాచుర్యం కలిగించిన వ్యక్తి."ధర్మ సందేహాలు" శీర్షికతో శ్రోతల మనసుల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న సాహితీ స్రష్ఠ.ఆయన జీవించి ఉండగా ఆయనను "తాతగారు" అని పిలవగలగటం నా అదృష్టం.
సత్యజిత్ రే: "పద్మశ్రీ" , "పద్మవిభూషణ్" వంటి గౌరవసత్కారాలందుకున్న "రే" భారత దేశం గర్వించదగ్గ గొప్ప సినీదర్శకులు.

వీరిలో కొందరితో తన పరిచయాలనూ,స్నేహాన్నీ,ఆ వ్యక్తుల గొప్పతనాన్ని గురించీ ఎంతో చక్కగా విశదీకరించారు గొల్లపూడిగారు.ఈ పుస్తకంలో ఇంకా ఒకప్పటి మన దేశ ప్రధాని "రాజీవ్ గాంధీ", నాటకకర్త "కొర్రపాటి గంగాధరరావు",కూచిపూడి కళాకరులకు చేయుత నందించిన "బందా కనకలింగేశ్వరరావు",నాటక ప్రయోక్త "కె.వెంకటేశ్వరరావు", "గొల్లపూడి శ్రీనివాస్"(మారుతిరావు గారి కుమారుడు) ఈయన గురించి చదువుతూంటే కన్నీళ్ళాగవు..,నాటక కర్త "పినిశెట్టి", ప్రాచీన సాహిత్యానికీ,తెలుగు సాహిత్యానికీ విశిష్ఠ కృషి చేసిన "వావిళ్ల రామస్వామి శాస్త్రులు",బ్రిటిష్ రాణి "డయానా", మొదలైన వారి గురించి కూడా మనం తెలుసుకుంటాం.ఆఖరులో వారి పెంపుడు కుక్క "బెంజీ" మీద రాసిన "ఎలిజీ" వారి కుటుంబానికి ఆ కుక్కపిల్లపై ఎంత అభిమానం ఉన్నదో తెలియపరుస్తుంది.

నాకు నచ్చిన తెలుగు పుస్తకాల్లో ఈ "ఎలిజీలు" పుస్తకమొకటి.ప్రతి తెలుగువారి ఇంటా ఉండవలసిన పుస్తకం ఇదని నా అబిప్రాయం.ఈ పుస్తకం కాపీల కొరకు విశాలాంధ్ర,నవోదయా పబ్లిషర్స్ ను సంప్రదించవలసినదిగా పుస్తకంలో తెలిపారు.

14 comments:

Anonymous said...

అంతా బాగానే ఉంది గానీ చాలా "అత్తుచప్పు"లున్నాయి పుస్తకం లో విశాలాంధ్ర వారికీ ఇదే మాట విన్నవించుకున్నాను.

జరుక్ శాస్త్రి చేసిన "మారుతిపూడి గొల్లారావు" , చివరి రోజుల్లో చలం ఆస్తికత్వం మరి చాలా మంది పెద్దల గురించి ఇది introductory notes గా చెప్పుకొనవచ్చు

తృష్ణ said...

@abhimatam :కావచ్చునండి.వివరాలు తెలిసిన పెద్దలకు తెలుస్తాయి అచ్చుతప్పులూ అవీనూ.....
చాలా మంది పెద్దల గురించిన వివరాలు ఉండబట్టే ఈ పుస్తకం అందరూ కొని దాచుకోవలసినదిగా నాకనిపిస్తుంది.
ధన్యవాదాలు.

మురళి said...

గొల్లపూడి 'సాయంకాలమైంది' నవల మిస్సవ్వకుండా చదవండి.. నాటకీయత కొంచం ఎక్కువగా ఉన్నప్పటికీ, ఊపిరి బిగపట్టి చదివించే కథనం ఈ పుస్తకం ప్రత్యేకత. 'ఎలీజీలు' పుస్తకంలో లాగే మీ టపాలోనూ ఇవాళ అప్పుతచ్చులు ఎక్కువగా కనిపించాయి.. హడావిడిగా రాసినట్టున్నారు.. ఒకసారి సరి చూడండి.. చక్కని పరిచయం..

తృష్ణ said...

@murali: i'll check.typing in telugu has become a big problem..!
i have to buy that novel now..thankyou for suggesting.

Bhãskar Rãmarãju said...

ఇంతకముందు మీకు ఈ లింకు ఇచ్చినట్టున్నా. మళ్ళీ ఇస్తున్నా
http://paatapaatalu.blogspot.com/2009/03/blog-post.html
మీరు గూగుల్ డాక్స్ లో ఒక పేజీ తెరిచి, హ్యాపీగా దాంట్లో టైప్ చేసేస్కోండి. ఒకసారి సరిచూస్కోండి అచ్చుతప్పులెమన్నా ఉన్నాయేమో. అప్పుడు కంట్రోల్ వి కంట్రోల్ సి - పబ్లిష్.
జస్ట్ పర్ ఫన్. ఈ మధ్యకాలంలో, కంప్యూటర్ వాడకం ఎక్కువై, పెన్ను పట్టుకోడం చాలామంది మర్చిపొయ్యారు. ఔనాకాదా? ఇలా చేసిచూడండి.
-------
ఓ పది ఠావుల తెల్లకాయితకాలు. ఓ పెద్ద సూది, ఓ నాలుగుమూరలు దారం, ఓ గట్టి పేపర్, ఓ కత్తెర తెచ్చుకోండి.
ఠావుల్ని మధ్యకి మడవండి.
గట్టి పేపర్ మధ్యకి మడవండి.
మడచిన ఠావుల్ని గట్టిపేపర్ మధ్యనపెట్టండి. సరిగ్గా సరిపోయిందోలేదో చూస్కోండి. ఎక్కువైతే అలా ఉంచేయండి, తక్కువైతే ఉజ్జాయింపుగా సరిపోను అట్టతెచ్చుకోండి.
సూదిలోకి దారం ఎక్కించేసి
మడిచన వారమ్మటే నాలుగు కుట్లేయండి.
ఎక్కువైన అట్టని కత్తిరిచ్చేయండి.
ఓ పీట ఆ కుట్టిన నోటుబొక్కుమీమ ఓవర్నైట్ పెట్తండి.
పొద్దునకల్లా ఓ ఘుమఘుమలాడె నోటుబొక్కు రెడీ.
బజారెళ్ళినప్పుడు *ప్రసాద్*[http://ramakantharao.blogspot.com/2009/02/blog-post_14.html] కలం కానీ కామ్లిన్ ఫౌన్టైన్ కలం కాని కొనండి, చెల్పార్క్ లేక ఇండియన్ ఇంక్ కొనండి ఓ బుడ్డి. కలంలో ఇంకుపోసేయండి.
తోచినప్పుడల్లా ఆ కలం తో ఒక్కోకాయతకాన్ని నింపండి.
ఉఫ్!!!!
ఉంటా

తృష్ణ said...

@ భాస్కర్ రామరాజు: బాగుందండి..మీ పెన్నుల టపా.
కానీ మీకో విషయం చెప్పాలి..పెన్నులు,పుస్తకాల విషయంలో మీరు "తాతకు(అమ్మమ్మకు అనాలేమో..) దగ్గులు నేర్పుతున్నారు...చదువుకునేప్పుడు నోట్బుక్కులు కొన్నా సరే..ప్రతి ఏడూ తెల్లకాగితాలతో ఒక పుస్తకం కుట్టనిదే నాకు తోచేది కాదు.
ఇక పెన్నుల విషయానికి వస్తే,మా విజయవాడలో "పెన్ కార్నర్" అనే ఫేమస్ షాపు ఉంది.ఆ షాపుకి నేనూ,మా నాన్న రెగులర్ కష్టమర్లం ఆ ఊళ్ళో ఉన్నంతవరకూ..!అన్ని రకాల పెన్నులు,ఇంకులూ,కలర్లు,రెండు మూడు చెల్పార్క్ ఇంక్ బోటిల్స్ ఇవీ నా సరంజామా.ఇంకు పెన్నులో నేను ఎక్కువ వాడిన నా ఫేవరేట్ కలర్ "టర్కాయిష్ బ్లూ".ఇప్పటికీ నా పెన్ స్టాండ్ నిండా 20వైకి పైగా పెన్నులు ఉంటాయి...పుస్తకాల రేక్లో రకరకాల రంగుల కాయితాల పుస్తకాలు..రకరకాల సైజుల డైరీలు...రాసుకోటానికి.. !!
అది కధ!!

తృష్ణ said...

bhaskar gaaru,i'll also check the 'paatapatalu' post link.thankyou.

మరువం ఉష said...

మీరిచ్చిన ఈ పద్దులో నాకు 8 మంది తెలియరు. విన్నాన గుర్తులేదు. ఈ రాత్రికి నాన్నగారిని పరీక్షించి చూస్తాను. తప్పక చెప్పేస్తారు. నేను పొరబడనిది "మనసున మనసై" పాట ఈయన రాసిందే!!" శ్రీ శ్రీ గారు వ్రాసారు అన్న విషయంపై. అల్లగే దేవులపల్లి కృష్ణశాస్త్రి #1 గా వ్రాయటం ముదావహం. స్వజన పక్షపాతం [కవికులం ;) ]

తృష్ణ said...

@ఉష: ధన్యవాదలండి.ఆ లిస్ట్ పుస్తకంలో గొల్లపూడిగారు రాసిన ప్రకారమే అదే ఆర్డర్లో రాసానండి.."ఊర్వశీ ప్రియులు" అన్న టైటిల్ తో "శ్రీశ్రీ"గారి గురించిన ఎలిజీతోనే పుస్తకం ప్రారంభమౌతుంది..!

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

ఈమద్య ఆయన 'మారుతీయం'తో మనమద్యనే తచ్చరుడుతున్నారు. మరి చూసుంటారేమో.

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

" మర్చిపోవడానికి వాడు జ్ఞాపకంకాదు. నాజీవితం."
అతడు సినిమా డైలాగు గుర్తొచ్చింది అందులో ఒకపేరు చూడటంతోనే

తృష్ణ said...

చైతన్యా,
అవును తెలుసు.చూస్తుంటాను.

వాళ్ళబ్బాయి గురించి కదా..పుస్తకంలో కూడా లాస్ట్ లో వెన్నెలకంటిగారి రచన "చిరునవ్వుల వరమిస్తావా చితినుంచి లేచొస్తాను ,మరుజన్మకు కరుణిస్తావా ఈ క్షణమే మరణిస్తాను.." quote చేసారు..!

Purnima said...

Can I look forward to you contributing to pustakam.net? I hope you've heard about it!

తృష్ణ said...

@ purnima:my pleasure...నా రాతలకు ఆ అర్హత ఉందని మీరంటే..తప్పక రాసి పంపిస్తానండి. Thankyou verymuch..!!
pustakam.net నేను రెగులర్ గా చూస్తూంటానండి.