సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Showing posts with label పండుగలు పర్వదినాలు. Show all posts
Showing posts with label పండుగలు పర్వదినాలు. Show all posts

Wednesday, September 1, 2010

ఎమ్.ఎస్.శ్రీరాంగారి "శ్రీకృష్ణస్తుతి"


ఎమ్.ఎస్.శ్రీరాం గారు స్వరపరిచిన "శ్రీకృష్ణస్తుతి", "కృష్ణాష్టమి" సందర్భంగా ఈ టపాలో...

ఈమని శంకర శాస్త్రిగారి మేనల్లుడైన ఎమ్.ఎస్.శ్రీరాం గారు "పెళ్ళి రోజు", "మంచి రోజు" మొదలైన తెలుగు చిత్రాలు, "అనుమానం" మొదలైన డబ్బింగ్ చిత్రాలకు సంగీతం సమకూర్చారు.

ఈ కృష్ణస్తుతిని స్తుతించిన మహామహులు శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు గారు, శ్రీ ఎన్.సీ.వీ.జగన్నాధాచార్యులు గారు, వింజమూరి లక్ష్మిగారు, వి.బి.కనకదుర్గ గారు. ఎమ్.ఎస్.శ్రీరాం గారు స్వరపరిచిన ఈ కృష్ణస్తుతి, శివస్తుతి మొదలైనవి విజయవాడ రేడియోకేంద్రం నుండి ఎన్నోసార్లు ప్రసారమై ఎంతో ప్రజాదరణ పొందాయి.

మళ్ళీ మళ్ళీ వినాలనిపించే "శ్రీకృష్ణస్తుతి" ...



Get this widget | Track details | eSnips Social DNA

Monday, August 23, 2010

రాఖీ శుభాకాంక్షలు




రేపటి రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికీ మంచి భవిష్యత్తునూ,ఆయురారోగ్యాలనూ ఇవ్వమని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను!!


Tuesday, March 23, 2010

శ్రీరామనవమి జ్ఞాపకాలు...


"ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.."


నాన్నకు కృష్ణుడంటే ఇష్టం. ఇంట్లో అన్ని కృష్ణుడు పటాలూ,పెద్ద విగ్రహం...!నల్లనయ్య ఇష్టమైనా రాముడంటే నాకు ప్రత్యేక అభిమానం. అదీకాక అమ్మానాన్నల పేర్లు సీతారాములవటం కూడా ఒక కారణం. 'సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మాకు తండ్రి..." అని మేము పాడుతూ ఉంటాము.

శ్రీరామనవమికి అమ్మ చేసే వడపప్పు నాకు చాలా ఇష్టం. నానబెట్టిన పెసరపప్పులో కొబ్బరి కోరు,మావిడి కోరూ వెసి,చిన్న చిన్న పచ్చిమిర్చి ముక్కలు వేసి కాస్తంత ఆవాలు,ఇంగువ పొపు పెట్టి అమ్మ చేసే వడపప్పు ఇప్పటికీ నోరురిస్తుంది. ఇక పానకం సంగతి చెప్పక్కర్లేదు. తీపి ఇష్టం కాబట్టి చేసిన పెద్ద గిన్నెడు పానకం మధ్యాహ్న్నానికల్లా పూర్తయిపోయేది.

మా విజయవాడ బీసెంట్ రొడ్దులో పెద్ద పెద్ద కొబ్బరాకుల పందిరి వేసి సితారామ కల్యాణం చేసేవారు. ఒక సందు చివరలొ ఉన్న చిన్న రామాలయంలొ విగ్రహాలు ఎంత బాగుండేవో...

ఇక రేడియోలో పొద్దున్నే పదకొండింటికల్లా మొదలయ్యే భద్రాచల కల్యాణం తప్పక వినాల్సిందే...అందులోనూ "ఉషశ్రీ తాతగారి" గోంతులో వచ్చే వ్యాఖ్యానం వినితీరాలి. ఆయన గంభీరమైన గొంతుకు సాటి వేరే గొంతు ఇప్పటికీ లేదు.నాన్న రేడియోలోనే పని చేయటంవల్ల మాకు పరిచయమే కాక, మా నాన్నంటే ఉషశ్రీ తాతగారికి ప్రత్యేక అభిమానం ఉందేది. అమ్మని "అమ్మాయ్" అని పిలిచేవారు. మేము ఆయనను "తాతగారు" అని పిలిచేవాళ్ళం. ఎంతో మహోన్నతమైన వ్యక్తి ఆయన. రేడియో వినే వాళ్ళకు తెలవచ్చు ఆయన చెప్పిన "ధర్మ సందేహాలు" కార్యక్రమం ఎంత ప్రఖ్యాతి గాంచిందో..!

మేము క్వార్టర్స్ లోకి మారాకా అక్కడ ప్రతి ఏడు రామనవమికి పందిరి వేసి కల్యాణం చేసేవారు. సాయంత్రాలు పిల్లలందరం కార్యక్రమాలు...నేనూ ఒకటి రెండు సార్లు పాటలు పాడాను...

శ్రీరామనవమికి ప్రతిఏడు చిన్నపాటి చినుకు పడడం నా చిన్నప్పటినుంచీ చూస్తున్నా....రేపు కూడా మరి చిరుజల్లు పులకింపచేస్తుందని ఆశిస్తున్నాను..

బ్లాగ్మిత్రులందరికీ శ్రీరామనవమి సందర్భంగా రాములవారి ఆశీస్సులు లభించాలని మనసారా ప్రార్ధిస్తున్నాను.

Tuesday, March 16, 2010

అందరికీ శుభాకాంక్షలు...



ఉగాది అంటే మన నూతన సంవత్సరం...
ఈ రోజున ప్రతి తెలుగు ఇంటా వెల్లివిరుస్తుంది ఉత్సాహం...
ఆ ఉత్సాహం కావాలి నవోదయానికి స్వాగతం...
అది తేవాలి ప్రతి మనసుకూ చిరునవ్వుల శుభోదయం...!!


బ్లాగ్మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు !!

Tuesday, January 12, 2010

సంక్రాంతి...ముగ్గులు...


స్కూల్లో ఉన్నన్నాళ్ళూ ప్రతి "సంక్రాంతి"కీ నానమ్మా వాళ్ళ ఊరు వెళ్ళేవాళ్ళం. ప్రతి ఏడూ భోగి రోజున చీకటిఉదయనే రిక్షాలో ఇంటికి వెళ్తూంటే, చల్లని చలిలో్ దారి పొడుగునా వెచ్చని భోగిమంటలు...ప్రతి ఇంటి ముందూ మట్టినేల మీద తెల్లని, రంగురంగుల ముగ్గులతో నిండిన లోగిళ్ళు...
నలుగుపిండి స్నానాలూ, పట్టు పరికిణీలూ,
వంటింట్లోంచి పిండివంటల ఘుమఘుమలూ,
బొమ్మల కొలువులూ, భోగిపళ్ళ పేరంటాలూ,
గొబ్బెమ్మలూ...వాటిపై ముద్దబంతి పూలూ,
గంగిరెద్దులాటలూ , సన్నాయి మేళాలూ,

డుడు బసవన్నలు, హరిదాసు గానాలూ,
....ఆ స్మృతుల మధురిమలే అంబరాన్నంటే సంబరాలు...!!
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని జ్ఞాపకాలో..ఎన్ని నిట్టూర్పులో...ఎన్ని సరదాలో...ఇప్పుడే చిలికిన వెన్నలా తెల్లగా,మెత్తగా,కరిగిపోయే జ్ఞాపకాలు...అపురూపాలు.

సంక్రాంతి అనగానే నాకు నచ్చిన, గుర్తొచ్చే "సింధూరం" సినిమాలో పాట....




ఆ పాట తాలూకూ యూట్యూబ్ లింక్:
http://www.youtube.com/watch?v=Zj-S2_gYfVo

ఇక సంక్రాంతి అనగానే మొదట గుర్తు వచ్చేవి నాకెంతో ఇష్టమైన "ముగ్గులు". ఇంకా చెప్పాలంటే ముగ్గులంతే పిచ్చి. ధనుర్మాసం ఆరంభమౌతూనే నెలపట్టి ఇంటి ముందర ముగ్గులేయటం మొదలుపెట్టేవాళ్ళం. నానమ్మ, అత్త, పెద్దమ్మా, పిన్నిలు, అమ్మా....ఇంట్లో అందరు ముగ్గుల స్పెషలిస్టులే. మా అత్త పేరు వీధిలో ఎవరికీ తెలియదు. ఆవిడని అందరూ "ముగ్గులత్తయ్యగారు" అనే పిలుస్తారు ఇప్పటికీ.

మా అమ్మ దగ్గర నేను నేర్చుకున్న ఒక ముగ్గు టెక్నిక్ "వెడల్పు పోత ముగ్గు". మామూలుగా సన్నని గీతలా కాక బొటనవేలూ,చూపుడువేలూ,మధ్యవేలు కలిపి మూడు వేళ్ళతో వేసే ముగ్గును "వెడల్పు పోత ముగ్గు" అంటారు.మా అమ్మ వాళ్ళ అత్తగారి దగ్గర నెర్చుకుంది.నేను అమ్మ చూసి నేర్చుకున్నా..క్రింద మట్టి నేలపై ఉన్న ముగ్గులన్ని ఆ విధంగా వేసినవే. ఎప్పుడో వేసినవి....ఇదివరకూ మొదట్లో ఎప్పుడో ప్రచురించిన కొన్ని "ముగ్గులు"...








బ్లాగ్మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

Monday, December 28, 2009

ముక్కోటి ఏకాదశి

ఇవాళ "వైకుంఠ ఏకాదశి". దీనినే "ముక్కోటి ఏకాదశి" అని కూడా అంటారు. విష్ణు ద్వారాలు తెరుచుకుంటాయి అంటారు. ఉత్తరాయణానికి ముందుగా వచ్చే ఏకాదశి ఇది.ఈ రోజున విష్ణు పూజ,ఉపవాసం విశేష ఫలాన్ని ఇస్తాయని పెద్దలు చెబుతారు.ఏకాదశి ముందు రోజు ఒంటి పూట భోజనం చేసి , ఏకాదశినాడు ఉపవసిస్తూ ఉంటారు కొందరు.తిరిగి ద్వాదశినాడు విష్ణువుకు నైవేద్యం పెట్టి సహస్రనామ పారాయణా చేస్తారు. ఇది ఎంతో మహిమాన్వితమైన ఏకాదశి అని పురాణాలలో చెప్పబడింది.ఉపవాసం చేయను కానీ విష్ణు సహస్రనామాలు చదువుకుని నైవేద్యం పెడుతూంటాను నేను.

వారాంతంలో "షిరిడీ యాత్ర" చేసి వచ్చాము.ఆ చలికి విపరీతమైన జలుబు, కాస్త జ్వరం వచ్చేసాయి.అందుమూలంగా "షిరిడీ యాత్ర" కబుర్లను ఓపిక వచ్చాకా ఒకటి రెండు రోజుల్లో వీలుని బట్టి రాసి మిత్రులందరితో పంచుకోవాలని ఆశ...

Monday, November 2, 2009

ఇవాళ..

ఈ రోజు గురించి నేను పెద్దగా రాసేందుకేమీ లేదు..అందరికీ తెలిసినదే.. కాని నేను ఇవాల్టి సంగతులని, నా ఇవాల్టి అనుభవాలను పంచుకోవాలని... ఇది రాస్తున్నాను..

ఎప్పటిలానే పొద్దున్నే శివాలయానికి వెళ్ళి చక్కగా ఆవునెయ్యిలో నానబెట్టి ఉంచిన వత్తులన్నీ పెద్ద ప్రమిదలో వెలిగించేసి...చంద్రశేఖరాయ నమ: ఓం..అని పాడేసుకున్నాను..! ఈసారి మారేడు,బిల్వ వృక్షాలు రెండు కలిపి ఉన్న చోట పెట్టాను దీపం.

కానీ గుడిలో ఓ పధ్ధతి లేకుండా ఎక్కడ పడితే అక్కడ జనాలు దీపాలు,ముగ్గులూ,పువ్వులూ...తొక్కేవాళ్లూ,తోసేవాళ్ళూ,తుడిచేసేవాళ్ళూ...ఏమిటో మనసు చిన్నబోయింది. మన ఇల్లయితే ఇలా చేస్తామా అనిపించింది. ఇదంతా శుభ్రం చేసుకునే సరికీ గిడివాళ్ళకి ఎంత సమయం పడుతుందో అనిపించింది. కొంచెమన్నా పరిశుభ్రత పాటించరేమిటో మరి..


కానీ ఈ కార్తీకంలో మొదటినుంచీ చెయ్యాలనుకుని చెయ్యలేకపొయిన ఒక పని ఇవాళ చేసాను..చక్కగా పుస్తకం పట్టుకెళ్ళి జనాలు ఎక్కువ లేని ప్రదేశం చూసుకుని, కూర్చుని..శివుడి మీద ఉన్న స్తోత్రాలు,అస్టోత్తరాలూ అన్ని వరస పెట్తి ప్రశాంతంగా చదివేసుకున్నాను..
అక్కడ మావారు లేరు కానీ ఉంటే 'ఓ పనైపోయింది హమ్మయ్యా అనుకున్నావా?' అని ఏడిపించేవారు. ఎందుకంటే మన భక్తి పారవశ్యం ఎంతపాటిదో ఆయనకు తెలుసును.
నిజం చెప్పాలంటే అసలు గుడికి వెళ్తే ఒహ దణ్ణం పెట్టుకుని వచ్చేయటం తప్ప ఏమి తెలిదు నాకు. ఇవాళ ఈ మాత్రం భక్తి నాలో ఉందంటే కారణం ఆయనే...!

ఇంతకీ మనకి ఉపవాసాలు అవీ పెద్దగా నమ్మకం లేదు..చిన్నప్పుడు అమ్మతో కొద్ది సార్లు ఉన్న గుర్తు అంతే..ఈసారి అమ్మ,వదిన,అటు మరదలు,ఇటు మరదలు..అందరూ ఉపవాసం ఉండేస్తున్నామనే సరికి నాకు కొంచెం ఆవేసం వచ్చేసింది...'ఆవేశం ఏనాటిదో..ఉపవాసం ఆనాటిది.." అని ట్యూన్ కట్టేసాను.

కాబట్టి మనమీవేళ ఉపవాసం...ఉండలేకపోవటం లేదు కానీ ఎప్పుడూ ఉండను కాబట్టి విన్నవాళ్ళందరికీ హాచ్చర్యం..!
(ఆయన వింటే ఢామ్మని పడిపోతారు...ఇంకా చెప్పలే పాపం)

"రేపు సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని ముత్తైదు భోజనం నీకే పెట్టుకుంటాను ఊండిపోవే" అంది అమ్మ.ఇవాళ ఉండటానికి నిన్న రాత్రే "అయ్యగారి పర్మిషన్" తీసేసుకున్నాను .
కాబట్టి అమ్మకి సరేనని మాటిచ్చేసాం ! అదీ సంగతి..
అమ్మావాళ్ళింట్లో ఉండటంవల్ల ఇవాళ పెడదామనుకున్న పాటలు అవీ ఏమీ పెట్టలేకపోతున్నాను...

నాగేంద్రహారాయ త్రిలోచనాయ
భస్మాంగరాగాయ మహేశ్వరాయ
నిత్యాయ సుధ్ధాయ దిగంబరాయ
తస్మై మకారాయ నమ:శ్శివాయ

Friday, October 30, 2009

"క్షీరాబ్ధి ద్వాదశి"


(కోటిపల్లి "సోమేశ్వరాలయం" ముందర ఉన్న తులసి చెట్టు ఇది. ఆ మధ్య
తూర్పు గోదావరి ప్రయాణం లో తీసిన ఫొటో.)

ఇవాళ క్షీరాబ్ది ద్వాదశి. ఈ రోజంటే నాకున్న ఇష్టం కొద్దీ లింక్ కూడా పెట్టకుండా, ఆగష్టు 31న రాసిన ఈ టపానే మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను.( అప్పుడు చూడనివాళ్ళ కోసం.)చిన్నప్పుడు తులసికోట ముందర కూర్చిని, బోలెడు దీపాలు పెట్టి, తులసి కోటలో కాయలు ఉన్నా ఉసిరి కొమ్మ పెట్టి అమ్మా చేసే "క్షీరాబ్ధి ద్వాదశి" పూజ అంటే నాకు చాలా ఇష్టంగా ఉండేది.పెళ్ళయ్యాకా నేను చేయటం మొదలెట్టాను...!క్షీరాబ్ధి ద్వాదశి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది.కానీ తెలియనివాళ్ళెవరైనా ఉంటే,వాళ్ళ కోసం--

కార్తీక మాసంలోని శుక్లపక్ష ద్వాదశిని "క్షీరాబ్ధి ద్వాదశి" అంటారు.పురాణ కధనం ప్రకారం--విష్ణువు చెప్పగా,దేవదానవులు పాలకడలిని (క్షీరాబ్ధిని) మధించిన రొజు ఇది.అందువల్ల ఈ పేరు వచ్చింది.అంతేకాక,"ఆషాఢ శుక్ల ఏకాదశి"నాడు యోగనిద్ర ఆరంభించే విష్ణువు "కార్తిక శుధ్ధ ఏకాదశి"నాడు తన నిద్రను ముగిస్తాడు.మరుసటి దినమైన "క్షీరాబ్ధి ద్వాదశి"నాడు శ్రీహరి లక్ష్మీసమేతుడై,బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వస్తాడు.అందువల్ల ఈ రోజుని "బృందావన ద్వాదశి"గా కూడా పిలుస్తారు.ఈ రొజు సాయంత్రం విష్ణుస్వరూపమైన ఉసిరి కొమ్మను,లక్ష్మీ స్వరూపమైన తులసి మొక్క పక్కన పెట్టి పూజ చేస్తారు.ఈ ప్రదేశాన్ని వీలైనన్ని దీపాలతో అలంకరిస్తారు కూడా.సంవత్సరంలో ఏ రోజైనా దీపారాధన చేయకపోతే వచ్చే దోషం,ఈనాడు దీపారాధన చేయటం వల్ల పరిహారమౌతుంది అంటారు.


ఇవాళ బోలెడు పనులు...ముందు వెళ్ళి సాయంత్రం పూజకు "ఉసిరి కొమ్మ" కొని తెచ్చుకోవాలి..ఊళ్ళో బానే దొరుకుతాయని చెప్పారు మరి...! వెంఠనే వ్యాఖ్యలు ప్రచురించకపొయినా, జవాబులు లేటు గా రాసినా ఏమీ అనుకోకండేం...!!

************ ************

వినయక చవితికి ఎక్కడెక్కడ నుంచో పత్రి, రకరకల పువ్వులు తెచ్చి పది,ఇరవై అని అమ్ముతూంటారు...పోనీలే ఇప్పుడే కదా వీళ్ళకి కాసిని డబ్బులు వచ్చేవి అని కొనేస్తూ ఉంటాం కూడా...అలానే ఇవాళ ఉసిరి కొమ్మ కోసం వెళ్తే,
ఉసిరి కాయలతో ఉన్న చిన్న కొమ్మ పదిహేను రూపాయలట ?! "ఔరా" అనుకున్నా కొనక తప్పదుగా. అవసరం మనది..!! చిన్నప్పటినుంచీ
ఫ్రీ గా పక్కింట్లోంచో ,ఎదురింట్లోంచో తెచ్చుకునే అలవాటు మరి....మా ఊళ్ళో అయితే పక్కింట్లోంచి మా దొడ్లోకి ఒరిగి ఆకులూ, కాయలూ అన్నీ మాకే ఇచ్చేదొక ఉసిరి చెట్టు...!!

Thursday, October 22, 2009

నాగుల చవితి

కార్తికేతు సితే పూజ్యా:
చతుర్యార్ధం కార్త్యికేయక:
మహాచతుర్థీ సా ప్రోక్తో
సర్వపాపహరా శుభా !!

ఇవాళ "నాగులచవితి" . కార్థీక శుధ్ధ చవితి నాడు సుబ్రహ్మణ్యస్వామిని పూజిస్తే సకల పాపాలూ పోతాయంటారు పెద్దలు. ఈ రోజుని "మహా చతుర్థి" అని కూడా అంటారు. పుట్టకు పోయి ఆవుపాలు పోసి, పుట్ట మట్టిని ధరించి, సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి పూజించినవారి అభీష్టాలు నెరవేరతాయని శాస్త్రం. దీపావళి నాడు కాల్చగా మిగిల్చిన కొన్ని టపాకాయల్ని కూడా ఇవాళ పిల్లలతో కాల్పిస్తారు. కొందరికి పుట్టకు పోయే ఆనవాయితి ఉండదు. వారు తమ తమ గృహాల్లోనే సుబ్రహ్మణ్యుని విగ్రహంపై, లేదా గోధుమ పిండితో చేసిన నాగేంద్రునిపై పాలు పోస్తారు. మేము ఇంట్లోనే పాలు పోస్తాము. చిమ్మిలి, చలిమిడి నైవేద్యం చెసి పెడతాము.

చిన్నప్పుడు అడవి లాంటి మా క్వార్టర్స్ లో చాలా పాము పుట్టలు ఉండేవి. నాగులచవితి నాడు తెల్లారేసరికీ బిలబిలమని బోలెడు జనం...పూలు,పాలు,పళ్ళు,పసుపు,కుంకుమ మొదలైన పూజాద్రవ్యాలతో వచ్చేసేవారు. మామూలుగా అక్కడ ఒక క్వార్టర్స్ ఉందని ఎవరికన్నా తెలుసా అనుకునే మాకు, ఇంతమందికి ఇక్కడ పాము పుట్టలు ఉన్నట్లు ఎలా తెలుసా? అని ఆశ్చర్యం కలిగేది.

ఈ సందర్భంగా ఒక చిన్న సంఘటన...క్వార్టర్స్ లో ఉండగానే ఒకసారి ఎవరో చెప్తే, ఐదు వారాలు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసాను. ఐదు మంగళవారాలు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రి పళ్ళు మాత్రమే తినాలి. ఎర్రని పూలతో స్వామికి పూజ చేసి, గుడికి వెళ్ళి....etc..etc...చెయ్యాలి. మనం అత్యంత శ్రధ్ధగా పూజలు చేసేసాం. మొదటి మూడు వారాలూ ఏమీ కలేదు కానీ ఆఖరు రెండు వారాలూ కూడా సాయంత్రం అయ్యే సరికీ మా ఇంట్లోకి పాము వచ్చింది. నాలుగో వారం బోలెడు పుట్టలు ఉన్నాయి కదా అప్పుడప్పుడు వస్తాయి..అనుకున్నాం. కాని ఐదవ మంగళవారం మళ్ళీ ఇంకో పాము వచ్చింది. అబ్బా, నా పుజకి ఎంత శక్తో...అని నేను ఆనందించే లోపూ... మా అమ్మ చాలా భయపడిపోయి....కార్తికేయుణ్ణి పూజించు కానీ ఇంకెప్పుడూ ఈ ఉపవాసపుజ చెయ్యకే అమ్మా....అని గట్టిగా చెప్పేసింది..!

Saturday, October 17, 2009

దీపముల వరుసే "దీపావళి "


దీపముల వరుసే "దీపావళి ". నరకసురుని సంహారంతో ప్రజలు ఆనందంతో చేసుకున్న పండుగ ఇది.ముందు ఐదు రొజులు చేసుకోవాల్సిన ఈ పండుగ శాస్త్రియ పధ్ధతి...

శాస్త్రీయంగా దీపావళిని అయిదు రోజులు చేసుకోవాలి.ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి అమావాస్య, గోవర్ధన పూజ, భగినీ హస్త భోజనం. ఉత్తరాదిన ఐదు రొజులూ జరుపుకుంటారు.


ధనత్రయోదశి:దీనిని "ధన్ తెరస్" అని కూడా అంటారు. మహాభారతంలో ధర్మరాజుకు అతడు పోగొట్టుకున్న రాజ్యలక్ష్మిని మరలా సంపాదించుకునేందుకు ఉపాయం చెప్తూ కృష్ణుడు బలి చక్రవర్తి కధ చెప్పి, ధర్మరాజును కూడా అలా లక్ష్మీ పూజలూ,దీపారాధనలూ చేయమంటాడు. బలి చక్రవర్తి కధ ఏమిటంటే :
వామనరూపంలో వచ్చినది విష్ణువు అని తెలిసి కూడా దానమిచ్చాడని, వామనుడు బలిని కోరిక కోరుకోమంటాడు. అప్పుడు బలి చక్రవర్తి ఆశ్వయుజ బహుళ త్రయోదశి నుంచీ అమావాస్య వరకూ మూడురోజులూ ప్రజలందరూ దీపారాధనలు చేసుకుని,అందువల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందేలాగ అనుగ్రహించమని కోరుకుంటాడు. అప్పటి నుంచీ మూడు రోజులూ లక్ష్మీపూజ చేసుకోవటం మొదలైంది.

ఈ రోజున ఆవునేతితో దీపం వెలిగించి శ్రీ సూక్తం చదువుకుంటే ఆర్ధికపరమైన ఇబ్బందులు ఉండవని అంటారు.

నరక చతుర్దశి:
నువ్వుల నూనె తలపై పెట్టుకుని తలంటు పోసుకోవాలి. కొందరు 'ఉత్తరేణి'ఆకులను కుడా తలపై పెట్టుకుని తలంటు పోసుకుంటారు.నరకాసురుడు మరణించిన రోజు ఇది.
ఈ రోజున మినపగారెలు తింటే మంచిదని అంటారు.

దీపావళి అమావాస్య:
ఈ రోజున సాయంత్రం దివిటీలు కొట్టడం ఒక సంప్రదాయం.(కారణం
ఇక్కడ ఈ టపాలో..)
మట్టి ప్రమిదలలో నువ్వులనూనెతో దీపాలు వెలిగించి, పూజా మందిరంలో,సింహద్వారానికి ఇరువైపులా,తులసి కోటవద్ద, వీధి గుమ్మం వద్ద ఉంచాలి. దీపాలకు నమస్కరించి,తరువాత టపాసులు కాల్చాలి.

గోవర్ధన పుజ:
ఈ రోజున గోపూజ చేస్తే ఎంతో పుణ్యమని అంటారు.

భగినీహస్తభోజనం:
ఆ రోజున అన్నదమ్ములు అక్కాచెల్లెళ్ళ ఇళ్ళకు వెళ్ళి భోజనం చేసి, వారికి కానుకలు ఇస్తారు. దీన్నే మనవారు "అన్నాచెల్లెళ్ళ భోజనాలు" అంటారు.

ఇక కొన్ని పురాణాలలో,పురాణగాధలలో "దీపావళి" గురించిన ప్రస్తావన :

* విష్ణు పురాణం ప్రకారం వామనుడు బలి చక్రవర్తి ని పాతాళానికి త్రొక్కగానే తిరిగి ఇంద్రుడు దేవతలకు రాజైన సందర్భంలో వారు ఆనందోత్సాహాలతో స్వర్గం లో దీపావళి జరుపుకున్నారు.

* ఉత్తర భారతంలో శ్రీరాముడు వనవాసానంతరం, అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడైన వేళ ప్రజలు దీపావళి జరుపుకున్నారు.

* కురుక్షేత్ర మహాసంగ్రామంలో విజయుడైన ధర్మరాజు పట్టాభిషిక్తుడైన వేళ ప్రజలు పట్టణమంతా దీపాలు వెలిగించి కాంతులు విరజిమ్మారుట.

* పద్మ పురాణం ప్రకారం క్షీరసాగర మధనం సందర్భంలో లక్ష్మీదేవి ఉద్భవించినప్పుడు దీపాన్ని వెలిగించటం ఆచారమైందని, అదే దీపావళి అని తెలుపుతుంది.

* కాళికా పురాణం ప్రకారం రాక్షస సంహారానంతరం కాళికాదేవిని లక్ష్మి, జ్యోతి రూపములతో ఆరాధించటం జరిగింది. దుర్వాసుడి శాప కారణంగా రాజ్యాన్ని కోల్పోయిన ఇంద్రుడు, విష్ణువు చెప్పిన విధంగా "జ్యోతి"ని లక్ష్మిగా ఆరాధించారు దేవతలు. అదే దీపావళి.



"దీపం జ్యోతి: పరంబ్రహ్మా దిపం సర్వ తమోపహారం
దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మీ నమోస్తుతే"


(ఈ పండుగ గురించి నేను చదివిన , విన్న విశేషాలు చెప్పాలని ఈ టపా రాయటం జరిగింది. 'లా పాయింట్లు ' తీస్తే సమాధానం రాయబడదు.)

Saturday, September 19, 2009

శరన్నవరాత్రులు

"సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధికే
శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే"


ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుంచీ శరదృతువు ప్రారంభం కావడం ఈ ఆశ్వయుజమాస విశేషం.ఈ రోజు అంటే "ఆశ్వయుజ శుధ్ధ పాడ్యమి" నుండి తొమ్మిది రాత్రులు ఆదిశక్తిని పూజించటం శుభప్రదం. ఈ నవరాత్రులలోనూ శక్తి స్వరుపిణిని-- దుర్గ,మహాలక్ష్మి,లలిత,సరస్వతి,గాయిత్రి,అన్నపూర్ణ,బాలాత్రిపురసుందరి,శ్రీరాజరాజేశ్వరి,మహిషాసుర మర్దిని మొదలైన రూపాలలో ఆరాధిస్తారు.వెన్నెలను "శారద" అని కూడా అంటారు.శారదకాంతులతో విరాజిల్లే దేవి కాబట్టి ఆదిశక్తిని "శారద" అని స్తుతిస్తాము.అందువల్ల ఆశ్వియుజ శుధ్ధ పాడ్యమి నుంచీ ఆ మాతను పుజించే తొమ్మిది రాత్రులను "శరన్నవరాత్రులు" అనీ,"శారదరాత్రులు" అనీ పిలస్తాము.సాంప్రదాయమున్నవారు ఈ తొమ్మిది రోజులూ కలశాన్ని స్థాపించి దేవిని నియమంగా పూజిస్తారు.దశమి రోజున ఉద్వాసన చేస్తారు.

తొమ్మిది రోజులలో మూలా నక్షత్రం రోజున "సరస్వతీ దేవి"ని ఆరాధిస్తారు.తొమ్మిది రోజులు పూజ చేయలేనివారు ఈ రోజు నుండీ నవమి దాకా ముడు రోజులూ పూజ చేస్తారు.శక్తి స్వరూపిణి అయిన దేవి ఆశ్వయుజ శుధ్ధ అష్టమి నాడు అవతరించినందువల్ల ఆ రోజు "దుర్గాష్టమి" గా ప్రసిధ్ధి చెందింది.నవరాత్రులలో అతి ముఖ్యమైనది "మహానవమి".దసరా పూజలకి ఇదే ప్రధానమైన రోజు.ఆశ్వయుజ శుధ్ధ నవమి నాడు జగన్మాత "మహిషాసురుడు" అనే రాక్షసుని సంహరించి లోకోపకారము చేసినందువల్ల ఈ నవమి "మహా నవమి" అయ్యింది.ఈ నవరాత్రులూ దేవిని ఆరాధించి ఏ పనైనా మొదలుపెడితే తప్పక విజయం లభిస్తుందని భారతీయుల నమ్మకం.

శ్రీరాముడు ఈ మాసమున ఆ దేవిని పుజించిన తరువాతే లంకకు వెళ్లి రావణుణ్ణి వధించాడని రామాయణంలో చెబుతారు.
అలానే భారతంలో, అజ్ఞాతవాస సమయంలో దుర్యోధనాదులతో యుధ్ధము చేయటానికి అర్జునుడు,పాండవులు ఆయుధాలుంచిన శమీ వృక్షానికి ప్రదక్షిణ చేసి,గాండీవమును తీసుకుని కౌరవులందరినీ తానొక్కడే జయించి,విరాటుని గోవులను నగరానికి మరలుస్తాడు.అర్జునుడికి "విజయం" దశమి రోజున కలిగినందువల్ల
ఆశ్వయుజ శుధ్ధ దశమికి "విజయదశమి" పేరు వచ్చిందని చెబుతారు.ఎక్కడో చదివిన గుర్తు--ఈ రోజున నక్షత్రాలు కనబడిన వేళ "విజయ ముహుర్తం" అని,ఈ ముహుర్తంలో తలపెట్టిన పనులు,ప్రయాణాలూ తప్పక విజయవంతమౌతాయనీ నమ్మకం ఉందట.
శరన్నవరాత్రులకు సంబంధించి నాకు తెలిసిన కొద్దిపాటి విశేషాలు ఇవి.

పండుగలలో "వినాయకచవితి" తరువాత నాకు చాలా ఇష్టమైనవి ఈ "నవరాత్రులు".కలశం పెట్టే ఆనవాయితీ లేకపోయినా ,మా అమ్మ తొమ్మిదిరోజులూ పూజ చేసి నైవేద్యాలు చేసేది.బెజవాడలో ఉండటం వల్ల కనకదుర్గ అమ్మవారి అలంకరణలు తెలుసుకుని ఆ ప్రకారం ఆయా అవతారాలను పూజించేది అమ్మ.పెళ్లయ్యాకా నేను కూడా అలానే నవరాత్రులూ దేవీ పూజ చేసి,నైవేద్యాలు చెయ్యటం మొదలుపెట్టాను.ఈ పుజలు చేసి ఏదో భోగభాగ్యాలు పొందెయ్యాలని కాదు...ఇలా చేయటం వల్ల నాకు ఎంతో మన:శ్శాంతి లభిస్తుంది.పెళ్లైన మొదటి ఏడాది నవరాత్రులు బొంబాయిలో చేసుకున్నాను.మా ఇంటి దగ్గర "మహిషాసురమర్దిని" ఆలయం ఉండేది.ఆయన ఆఫీసు నుంచి వచ్చాకా రాత్రి 9,9.30కి గుడికి వెళ్ళేవాళ్ళం.అప్పుడు ఆఖరు హారతి ఇస్తూ ఉండేవారు...చూడటానికి కన్నుల పండుగ్గా ఉండేది.అదే First and best celebrated festivalగా నా స్మృతుల్లో ఉండిపోయింది.ఇవాళ కుడా పొద్దున్నే మొదటిరోజు పూజాకార్యక్రమాలు ముగించి, అన్నం పరమాన్నం నైవేద్యం పెట్టాను..!!

Monday, August 31, 2009

క్షీరాబ్ధి ద్వాదశి

నేను దాచుకున్న కొన్ని కధల్లో కోరుకొండ సత్యానంద్ గారు "క్షీరాబ్ధి ద్వాదశి" మీద రాసిన కధ ఒకటి.కధలు చదివే ఆసక్తి కలవారు చదువుకుందుకు వీలుగా పి.డి.ఎఫ్. ఫైల్ లింక్ ను ఇక్కడ పెడుతున్నాను.
http://www.mediafire.com/file/zyvzoi4zmmi/ksheerabdi%20dwaadasi.pdf

కొన్ని పర్వదినాలంటే నాకు చాలా ఇష్టం.కార్తీక పౌర్ణమి,మాఘపాదివారాలూ,ముక్కోటి ఏకాదశి,రధ సప్తమి,క్షీరాబ్ధి ద్వాదశి...ఇలాగ.చిన్నప్పుడు తులసికోట ముందర కూర్చిని,దాంట్లో ఉసిరి కొమ్మ పెట్టి అమ్మా చేసే "క్షీరాబ్ధి ద్వాదశి" పుజ అంటే నాకు చాలా ఇష్టంగా ఉండేది.పెళ్ళయ్యాకా నేను చేయటం మొదలెట్టాను...!క్షీరాబ్ధి ద్వాదశి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది.కానీ తెలియనివాళ్ళెవరైనా ఉంటే,వాళ్ళ కోసం--

కార్తీక మాసంలోని శుక్లపక్ష ద్వాదశిని "క్షీరాబ్ధి ద్వాదశి" అంటారు.పురాణ కధనం ప్రకారం__విష్ణువు చెప్పగా,దేవదానవులు పాలకడలిని (క్షీరాబ్ధిని) మధించిన రొజు ఇది.అందువల్ల ఈ పేరు వచ్చింది.అంతేకాక,ఆషాఢ శుక్ల ఏకాదశినాడు యోగనిద్ర ఆరంభించే విష్ణువు కార్తిక శుధ్ధ ఏకాదశినాడు తన నిద్రను ముగిస్తాడు.మరుసటి దినమైన "క్షీరాబ్ధి ద్వాదశి"నాడు శ్రీహరి లక్ష్మీసమేతుడై,బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వస్తాడు.అందువల్ల ఈ రోజుని "బృందావన ద్వాదశిగా కూడా పిలుస్తారు.ఈ రొజు సాయంత్రం విష్ణుస్వరూపమైన ఉసిరి కొమ్మను,లక్ష్మీ స్వరూపమైన తులసి మొక్క పక్కన పెట్టి పూజ చేస్తారు.ఈ ప్రదేశాన్ని వీలైనన్ని దీపాలతొ అలంకరిస్తారు కూడా.సంవత్సరంలో ఏ రొజైనా దీపారాధన చేయకపోతే వచ్చే దోషం,ఈనాడు దీపారాధన చేయటం వల్ల పరిహారమౌతుంది అంటారు.

Saturday, August 22, 2009

అవిఘ్నమస్తు

బ్లాగ్మిత్రులందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు.
ఈ పర్వదిన సందర్భంగా విఘ్నాలన్నీ తొలగించి,ఆ వినాయకుడు అందరి కోరికలనూ తీర్చి,అందరికీ క్షేమ,అభయ,ఆయురారోగ్యాలను అందించాలని ప్రార్ధిస్తున్నాను.

శ్రీ గణేశపంచరత్న స్తోత్రం చాలా చోట్ల ఆంగ్లంలో కనిపించింది.అది వాడటం ఇష్టం లేక సంస్కృతంలో ఉన్న లింక్ ను మాత్రం ఇక్కడ పెడుతున్నాను.
ఆ క్రిందనే యూ ట్యూబ్ లో చూడటానికీ,ఆడియో డన్లోడ్ చేసుకోవటానికీ కూడా లింక్ లను చూడగలరు

Wednesday, July 29, 2009

శ్రావణమంగళవారం నైవేద్యాలు

అమ్మావాళ్ళింట్లో పెండింగ్ ఉన్న నా నొముతో పాటూ ఇంకో ఇద్దరితో మంగళవారం నోము నోపించాల్సిన అవసరం వచ్చింది.పౌరోహిత్యం వహించి మొత్తం ముగ్గురం నొచేసుకున్నాం.చేతి దురద తీర్చుకునే అవకాశం కూడా వచ్చింది..ఉల్లాసంగా...ఉత్సాహంగా..మడి కట్టేసుకుని పైన ఫొటొలోని నైవేద్యాలు చేసేసాను.

1)పూర్ణం బూరలు...

2)పులగం (బియ్యం,పెసరపప్పులతొ చేసేది) ఫొటొలొకి రాలేదు.

౩)sprouted బొబ్బర్లు,పుదినా,మిర్చి,అల్లం కలిపి చేసిన వడలు.

4)బూరెల్లో పూర్ణం అయిపొయాకా మిగిలిన పిందిలో తొటకూర,మిర్చి కలిపి అదో రకం పకోడిల్లాగ వేసేసాను.

5)పులిహొర.

శెనగలను ఏమీ చెయ్యక్కర్లేదు.అవి నానబేట్టినవే..బత్తాయిలు colourfulగా ఉంటాయని add చేసా..అవి.. ఫొటోలోని నైవేద్యాల విశేషాలు.

నాకొచ్చిన వంటలతొ ఒక సెపరేటు బ్లాగు పెడదామా అనుకున్నా కానీ..ఒక్క బ్లాగు నడపటానికే సమయం ఉండటం లేదు.ఇంక రెండవ బ్లాగా..అనుకుని ఇంక ఒకటే కిచిడీ బ్లాగు ఉంచేద్దామని డిసైడయిపోయా..!
పుజ అయ్యి,ఇళ్ళు వెతుక్కుని,వాయనాలు ఇచ్చేసి వచ్చాం ముగ్గురం !!
హమ్మయ్య,ఓ పని అయిపొయింది.ఇంక ఏవన్నా పాటలు విందాం అని తిరుబడిగా పాత కేసట్లు అన్ని వెతికి "ABBA" బయటకు తీసా.

honey honey...

give me one more date....

ring ring... why dont you give me a call...

this park..and these houses..all streets i've walked...

అంటూ గుండ్రాల్లోకి వెళ్ళిపొయి వినేస్తున్న... ఇంతలో అన్నయ్య వచ్చడు."మల్లన్న పాటలు డౌన్లోడ్ చెసాను"వినమని పెట్టాడు.పెద్ద సౌండ్లో "excuse me Mr..మల్లన్న...అ..అ..ఆ...అ..అ..ఆ..."అంటూ పాట మొదలైంది.2,3 వినగానే అరె ఇవన్ని రొజూ ఫంలో వింటున్నానురా అన్నాను..

ఈలోగా అమ్మ వెనకాల నుంచి తిట్లు..శ్రావన మంగళవారం పుజ చెసుకుని అవేం పాటలే....అని!!