సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Showing posts with label కొన్ని జ్ఞాపకాలు. Show all posts
Showing posts with label కొన్ని జ్ఞాపకాలు. Show all posts

Tuesday, March 20, 2012

మార్నింగ్ స్కూల్


వేసవి ఎండలు ముదురుతున్న సమయంలో ప్రభుత్వ పాఠశాలలన్నింటికీ ఒంటిపూట బడి అని ప్రకటిస్తారు. ప్రైవేటు స్కూల్స్ వారు కూడా వారివారి వీలుని బట్టి ఓ వారం అటు ఇటులో మార్నింగ్ స్కూల్ ప్రకటన ఇస్తారు. రెండవ క్లాస్ చదువుతున్న మా పాపకు ఇవాళ్టి నుంచీ మార్నింగ్ స్కూల్. స్కూలు ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఉన్నా, పాపను త్వరగా లేపి, రోజూ కన్నా ఓ గంట ముందే తయారుచేయాల్సి ఉంటుంది.




నాకు చిన్నప్పటి నుండీ ఈ మార్నింగ్ స్కూల్ అంటే ఓ ప్రత్యేకమైన ఇష్టం. నా చిన్నప్పుడు ఏడవ తరగతి దాకా మేము చదివిన స్కూల్ ఇంటి దగ్గర్లోనే ఉండేది. పది, పదిహేను నిమిషాల నడక పెద్ద దూరం కాదప్పట్లో. నడచివెళ్ళేవాళ్ళం. ఐదో క్లాస్ దాగా అమ్మ మా బ్యాగ్గులు భుజాన వేసుకుని దిగపెట్టు, మళ్ళీ సాయంత్రం తీసుకువెళ్ళేది. ఈ మర్నింగ్ స్కూల్ టైం లో మాత్రం పొద్దున్న 8.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 వరకు ఉండేది స్కూల్. అప్పుడు మాత్రం మధ్యాన్నం ఎండగా ఉంటుందని ఎండుపూటలకీ మా కోసం రిక్షా మాట్లాడేది అమ్మ. పొద్దున్నే ఏడున్నరకే రిక్షా వచ్చేసేది. అదికూడా అందరిలా ఓ పదిమందితో ఇరుక్కుని కూర్చునేలా కాకుండా మేమిద్దరం, ఇంకో ఇద్దరూ కలిపి నలుగురం మాత్రమే ఉండేలా రిక్షా మాట్లాడేది అమ్మ. అలా ఇరుకు లేకుండా ఫ్రీగా కూచునేలా రిక్షాలో స్కూలుకి వెళ్లటం ఎంతో దర్జాగా అనిపించేది.




ఇక స్కూల్లో సాయంత్రం దాక ఉండక్కర్లేకుండా మధ్యాన్నమే ఇంటికి వచ్చేయటం మరీ ఇష్టంగా ఉండేది. చక్కగా త్వరగా హోంవర్క్ చేసేస్కుంటే బోలెడంత ఖాళీ సమయం. కావాల్సినంత సేపు ఆడుకోవచ్చు, పుస్తకాలు చదువుకోవచ్చు, బొమ్మలు వేసుకోవచ్చు. అందువల్ల ప్రతి ఏడూ ఎప్పుడు మార్నింగ్ స్కూల్స్ మొదలవుతాయా అని ఎదురుచూసేదాన్ని. 8th క్లాస్ లో కాస్త పెద్ద స్కూల్ కి మారాకా స్కూల్ బస్ ఉండేది. మాములు రోజుల్లోనే స్కూల్ బస్ 7.45 a.m కి వచ్చేసేది. ఇక మార్నింగ్ స్కూల్ అప్పుడు స్కూల్ ఎనిమిదికైనా బస్సు మరీ ఆరున్నరకే వచ్చేసేది. చాలా చోట్ల తిరగాలి కదా. అందుకని మరీ అంత త్వరగా తెమలటం కాస్త కష్టం గానే ఉండేది. అందుకని పెద్ద స్కూల్లో కంటే నాకు చిన్నప్పటి మార్నింగ్ స్కూల్ అంటే ఉన్న ప్రత్యేకమైన ఇష్టం అలానే ఉండిపోయింది.


అయితే, ఇప్పుడు మా పాప చదివే స్కూల్ ఇంటి దగ్గరే అవ్వటంతో తన మార్నింగ్ స్కూల్ అంటే కూడా నాకు భలే ఇష్టం. దీనివల్ల నాకు బోలెడు ఆనందాలు...
నేను హడావిడి పడి లంచ్ బాక్స్ ఇవ్వక్కర్లేదు,
రోజూలా లంచ్ బాక్స్ లోని గుప్పెడు మెతుకులు కాక పిల్ల ఇంటిపట్టున కాస్త కడుపునిండా అన్నం తింటుందని,
ఒంటిపూట స్కూలే కాబట్టి రోజూలా బండెడు పుస్తకాల బస్తా మోయక్కర్లేదు,
మరికాసేపు ఆడుకోవటానికి పిల్లకి కాస్త టైం దొరుకుతుంది...
నేను కూడా ఎక్కువ సమయం పాపతో గడపచ్చు..
ఇలా అన్నమాట. ఓ ఇరవై రోజులు ఇలా గడిపేస్తే ఇక వేసవి సెలవలే !!

Tuesday, December 6, 2011

భట్టుమావయ్యగారు


Linda Goodman పూనిన కాలేజీ రోజుల్లో ఇంటికొచ్చినవారందరినీ మీ sunsign ఇదేనా? అని అడగటం హాబిగా ఉండేది. అలా ఒకానొకరోజున భట్టు మావయ్యగారిని మీరు Sagittarius ఏనా? అనడగటం, ఆయన 'ఓసినీ...బానే చెప్పావే' ఆశ్చర్యపోవటం నాకింకా గుర్తే. అప్పటి నుంచీ ప్రతి ఏడూ నేనెక్కడ ఉన్నా డిసెంబర్ 6thన పొద్దున్నే భట్టుమావయ్యగారికి శుభాకాంక్షలు చెప్తూ ఫోన్ చెయ్యటం, 'నేను మర్చిపోయినా నువ్వు మర్చిపోవే..' అనే ఆయన పలకరింపు వినటం నాకు అలవాటైపోయింది. ఇవాళ పొద్దున్న ఒక విచిత్రం జరిగింది. ఎప్పుడూ మూడు నిమిషాల్లో టాక్ ముగించే భట్టుమావయ్యగారు ఇవాళ పన్నెండు నిమిషాలు మాట్టాడారు. ఆ కాసేపులో ఎన్ని విషయాలు చెప్పారో...చాలా ఆనందమైంది. రాబోయే తరానికి చెందిన ఆలోచనలు ఈనాడు చేయగల గొప్ప మేధావి భట్టుమావయ్యగారు. ఇవాళ ఎలాగోలా టైం కుదుర్చుకుని మావయ్యగారి గురించి బ్లాగ్లో రాయాలని అనుకున్నా...!

భట్టుమావయ్య గారు ఎవరు?
మా చిన్నప్పుడు "భాస్కరమ్మగారింట్లో" ఉండగా మా వాటాలోని రెండు గదులు అద్దెకిచ్చినప్పుడు, అందులో నాలుగైదేళ్ళు ఉన్నారు. అప్పటి నుంచీ నాకు భట్టుమావయ్యగారు తెలుసు. భట్టుమావయ్యగారి పూర్తి పేరు "పన్నాల సుబ్రహ్మణ్య భట్టు". ఒక్కమాటలో చెప్పాలంటే "బహుముఖప్రజ్ఞాశాలి". విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో అనౌన్సర్ గా రిటైరయ్యారు. అనౌన్సర్ గా రిటైరయి ప్రస్తుతం విజయవాడలో విశ్రాంతి జీవితం గడుపుతున్నారు భట్టుమావయ్యగారు. పరిస్థితులు మరోలా ఉండుంటే స్టేషన్ డైరెక్టర్ గా రిటైరవ్వాల్సినవారు. అయినా ఆ చింత ఏ కోశానాలేని విశాల దృక్పధం ఆయనది.

70s,80s లోని రేడియో శ్రోతలకు ఈయన భట్టుగారి పేరు సుపరిచితం. చాలా కొత్తకార్యక్రమాలకు ఈయన నాంది పలికారు. శ్రీరజనీకాంతరావుగారు బెజవాడ రేడియోస్టేషన్ డైరెక్టర్ గా ఉన్న సమయంలో, వ్యంగ్య రచనలు రాయటంలో దిట్ట అయిన భట్టుగారు "చెళుకులు" అనే రేడియో ప్రోగ్రాం ఒకటి చేసారు. ఉదయం ఏడున్నర ప్రాంతంలో వచ్చే ఈ కార్యక్రమం అప్పట్లో ఎంతో పేరు తెచ్చుకుంది. ధ్వని మాధ్యమంలో ఇలాంటి కార్టూన్ కార్యక్రమం రావటం అదే ప్రధమం. భట్టుగారు రేపు ఉదయం ఎవరి మీద చెళుకులు పేలుస్తారో అని ఊరంతా ఎదురుచూసేది. విజయవాడ నవోదయ పబ్లిషర్స్ వారీ చెళుకులకు పుస్తకరూపాన్ని కూడా అందించారు. మాగంటి వెబ్సైట్లో ఉన్న ఈ పుస్తకం తాలూకూ పిడిఎఫ్ లింక్:
http://www.maganti.org/air/chelukulu.pdf




తరువాత "అనుభవ దీపం" అనే ప్రతీక నాటకం(symbolic play) ఒకటి భట్టుగారు రాసి, ప్రొడ్యూస్ చేసారు. రేడియో చరిత్రలో ఇలాంటి కార్యక్రమం రావటం అదే ప్రధమం. ఈ కార్యక్రమంలోకి శ్రీమతి వి.బి.కనకదుర్గ, శ్రీరంగం గోపలరత్నం గార్లతో పాడించిన పాటలు చాలా బావుంటాయి. "నాదబంధం" అని సంగీత వాయిద్యాల మీద చేసిన కార్యక్రమానికీ, "మార్గ బంధం" అని రోడ్లు తమ స్వగతాలు చెప్పుకుంటున్నట్లుగా చేసిన కార్యక్రమానికీ సృజనాత్మక విభాగంలో జాతీయ పురస్కారాలు వచ్చాయి భట్టుగారికి. హాస్య వ్యంగ్య రచనల్లో దిట్ట భట్టుగారు. "వీరపాండ్య పెసర బొమ్మన్" అనే కధానికను రాసి తరువాత నాటకంగా కూడా తయారుచేసారు. "పెసరల్ ఇన్సైడ్" అని పెసరట్టు + సాఫ్ట్వేర్ నూ కలిపి ఒక వ్యంగ్య కథ పత్రికకు రాసారు. ఈ కథ "ఆహా... ఓహో !" (ఆధునిక హాస్య వ్యంగ్య రచనలు) అనే పుస్తకంలో ప్రచురితమైంది. రేడియోలో పండుగల రోజుల్లో "ప్రత్యేక జనరంజని" ప్రసారం అవుతూ ఉండేది. అలాగ ఒకసారి ఓ పత్రికలో "ఆవు జనరంజని" అని పేరడీ రచన చేసారు. అంటే ఒక ఆవు తాను ఏన్ని సినిమాల్లో ఉన్నదీ, ఏ ఏ పాటలు తన పేరు మీద ఉన్నాయో ఇంటర్వ్యూలో చెప్తున్నట్లుగా అన్నమాట.


నాకు తెలిసిన భట్టుమావయ్యగారు :



రేడియో స్నేహం కాక భట్టుమావయ్యగారితో మరో స్నేహం ఉండి మాకు. అది అమ్మావాళ్ళ పుట్టిల్లు రాజమండ్రి స్నేహం. మా పెద్దమ్మ భట్టుమావయ్యగారి చెల్లెల్లు స్కూల్లో క్లాస్మేట్స్. తర్వాత కాలేజీలో నాకు బాగా మిత్రురాలైన "జయ" పెద్దమ్మ ఫ్రెండ్ వాళ్ల అమ్మాయి, అంటే భట్టుగారి మేనకోడలు అని తెలుసుకుని మరీ సంబరపడిపోయా. జయ కూ నాకూ ఇరవైఏళ్ళుగా గాఢమైన స్నేహం.




కార్టూన్లు, హాస్య రచనలు, పత్రికలలో ఎన్నోవ్యాసాలు, నాటకాలు, వ్యంగ్య రచనలు ఎన్నో చేసిన భట్టుమావయ్యగారు సరదగా బోలెడు డిగ్రీలు కూడా సంపాదించారు. హిందీలో ఎం.ఏ, జర్నలిజం కోర్స్, ఫిల్మ్స్ కి రిలేటెడ్ డిప్లొమా(పేరు గుర్తులేదు)...మొదలైన కోర్సులు చేసారు. ఆయన చేయటమే కాక ఎంతో మందికి ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ చేసేవారు. ఆయన జేబులో ఎప్పుడూ ఏవో పేపర్ కట్టింగ్లు ఉంటూండేవి. "ఇవి మీ అబ్బాయికి ఇవ్వు" అనో, "ఇవి మీ అమ్మాయికి ఉపయోగపడతాయి ఇదిగో" అనో అవసరం ఉన్నవాళ్ల చేతుల్లో పెట్టేసి వెళ్పోతూ ఉండేవారు. తాను చేయటమే కాక ఎంతో మంది ప్రోగ్రాం అఫీసర్లకీ, రేడియో స్టాఫ్ కీ ప్రోగ్రాములు చేయటానికి కొత్త కొత్త ఐడియాలు చాలా ఇస్తూండేవారు.

ఆయనతో మాట్లాడిన ప్రతిసారీ ఈయనకు తెలీని విషయాలు ఉన్నాయా అని అశ్చర్యపోతూనే ఉంటాను. భట్టుగారితో పది నిమిషాలు మాట్లాడితే చాలు ఎవరికైనా రెండు విషయాలు ఇట్టే అర్ధమవుతాయి; ఆయనకు తెలియని విషయం ఏదీ లేదని, ఆయనతో మాట్లాడేప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలనీ. ఎందుకంటే వాటిలోని నిజాన్ని తట్టుకునే శక్తి అందరికీ ఉండదు మరి. అందువల్ల భట్టుగారు సూటిగా మాట్లాడే మాటల్లోని వ్యంగ్యాన్ని మంచి సలహాగా తీసుకుని, ఆయన మాటల్లో దాగున్న ఆప్యాయతని అర్ధం చేసుకున్నవారికన్నా వారి మాటల్ని అపార్ధం చేసుకున్నవారి సంఖ్యే అధికం ఇప్పటికీ...!!

భట్టుగారు మంచి రచయిత, విమర్శకుడు, సంగీతజ్ఞుడు, హాస్య-వ్యంగ్య రచయిత అని చాలామందికి తెలుసు. కానీ ఆయన నలభీములని బహు తక్కువ మందికి తెలుసు. నాకు తెలిసీ పెసరట్లు వేయటంలో ఆయన్ను మించిన స్పెషలిస్ట్ మరొకరుండరు. పెసలతో, పెసర పప్పుతో పాటు ఎన్ని రకాలుగా పెసరట్లు వేయవచ్చో చెప్పటం వెనుక ఆయన చేసిన ఎన్నో పరిశోధనలు ఉన్నాయి. మినపప్పు నానబెట్టి, రోట్లో స్వయంగా రుబ్బి, గారెలు ఆవడలు చేసి మిత్రులందరినీ ఆహ్వానీంచి మరీ జనాలతో తినిపించేవారు. మినపప్పు ఎంతసేపు నానితే గారెలు ఏ విధంగా వస్తాయో ఇట్టే చెప్పగలరు భట్టు గారు. ఒకసారి నాకు చేగోణీలు ఎలా చెయ్యాలో కూడా చెప్పారు.





భట్టుగారి పెసరట్ల ప్రతిభ గురించి ముళ్ళపూడి వెంకట రమణగారు "కోతికొమ్మచ్చి" పుస్తకంలో కూడా (30వ పేజి దగ్గర) ప్రస్తావించారు. ఓ పద్యం కూడా రాసారు ఇలా :
"పొట్టు పప్పు రుబ్బి మిర్చి గిర్చీ చేర్చి
భక్తి శ్రద్ధ కలిపి పోయునట్టి
భట్టుగారి అట్టు బహుగొప్ప హిట్టురా
విశ్వదాభిరామ వినుమ రమణ "
ఈ పద్యానికి బాపూ గారు వేసిన బొమ్మతో సహా ఉన్న లేమినేషన్ వీరింట్లో ఉంటుంది.

భట్టుమావయ్యగారి సతీమణి కృష్ణకుమారక్క(ముంజులూరు కృష్ణకుమారి). ప్రస్తుతం బెజవాడ రేడియో స్టేషన్లో 'అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్'. మావయ్యగారు, అక్క...ఇదేం వరస అని విన్నవాళ్లంతా అడిగేవారు. వారి పెళ్ళికి మునుపే కృష్ణక్క మాకు తెలియటం వల్ల తనను కృష్ణకుమారక్క అని పిలిచేవాళ్ళం. ఆ పిలుపు ఇప్పటికీ అలానే ఉండిపోయింది. తను అంత పెద్ద ఆఫీసరయినా నాకు మాత్రం ఎప్పటికీ తను చిన్నప్పటి కృష్ణకుమారక్క. ఆ దంపతులు ఇద్దరిపై నాకు చాలా ప్రత్యేక అభిమానం. వారిద్దరిని గురించిన ఓ బేతాళప్రశ్న మత్రం ఎప్పుడూ నన్ను దొలిస్తూఉంటుంది...కృష్ణకుమారక్క దొరికిన భట్టుమావయ్యగారు అదృష్టవంతులా? భట్టుమావయ్యగారు దొరికిన కృష్ణక్క అదృష్టవంతురాలా..? అని !!

హమ్మయ్య సాహసం చేసేసా ! నాకు తెలిసినది, తోచినదీ రాసేసాను. ఇప్పుడిక నాకు భట్టుమావయ్యగారు ఎన్ని మార్కులు వేస్తారో వేచి చూడాల్సిందే !

Thursday, August 18, 2011

బంతినారు



బంతి మొక్కలకీ, నాకూ అవినాభావ సంబంధం ఉందేమో అనిపిస్తుంది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ ప్రతి వర్షాకాలం జులై నెల చివరలోనో, ఆగష్టు మొదట్లోనో స్కూల్ నుంచి వచ్చేసరికి ఓ మగ్గు నీళ్ళలో పెట్టిఉంచిన రెండు మూడు "బంతినారు" కట్టలు దర్శనం ఇస్తూండేవి. ("బంతినారు" అంటే తెలియనివాళ్ళకు చిన్న వివరణ: బంతి పువ్వులు ఎండిపోయాకా వాటిని విడదీసి ఆ రేకులు మట్టిలో చల్లితే బంతి మొక్కలు వస్తాయి. మొక్కలు అమ్మేవాళ్ళు అలా బంతిమొక్కలు పెంచి, రెండంగుళాలు పెరిగాకా వాటిని తీసి కట్టగా కట్టి బజార్లో అమ్ముతారు. ఆ చిన్న చిన్న బంటి మొక్కలనే "బంతినారు" అంటారు. వాటిని ఒక క్రమంలో వేసుకుంటే మొక్కలు బాగా పెరిగి ఎక్కువ పువ్వులు పూస్తాయి.)


బాగా చిన్నప్పుడు అమ్మ నాటేసేది కానీ నాకు మొక్కలపై మమకారం పెరిగేకా ఆ బాధ్యత నేనే తీసుకునేదాన్ని. మగ్గులో బంతినారు చూడగానే గబగబ స్కూల్ డ్రెస్ మార్చేసుకుని, గునపం,బకెట్టులో నీళ్ళు తీసుకుని నాటడానికి బయల్దేరేదాన్ని. ఎంతెంత దూరంలో ఆ బుజ్జి బుజ్జి బంతి మొక్కలు పాతాలో అమ్మ చెప్తూంటే, ఆ ప్రకారం రెండు మూడు మొక్కలు కలిపి నాటేసేదాన్ని. రెండుమూడు మొక్కలు కలిపి ఎందుకంటే పొరపాటున ఒక మొక్క బ్రతక్కపోయినా రెండవది బ్రతుకుతుందన్నమాట. వాటికి చుట్టూ నీళ్ళు నిలవటానికి పళ్ళేంలాగ చేసి అన్నింటికీ నీళ్ళు పోసి మట్టిచేతులు కడిగేసుకోవాలన్నమాట. అప్పటికి తలలు వాల్చేసిన ఆ బుజ్జి మొక్కలు బ్రతుకుతాయో బ్రతకవొ అని నేను బెంగ పడుతుంటే, పొద్దున్నకి నిల్చుంటాయిలే అని అమ్మ ధైర్యం చెప్పేది. మర్నాడు పొద్దున్నే తలలు నిలబెట్టు నిలబడ్డ బంతి మొక్కలని చూస్తే భలే సంబరం వేసేది. అవి మొండి మొక్కలు. బ్రతకాలే గానీ ఇక చూసుకోవక్కర్లేదు. కాసిన్ని నీళ్ళు పోస్తే వాటి మానాన అవే పెరుగుతాయి.


ఒకోసారి పండగలకి గుమ్మానికి కట్టిన బంతి తోరణాలని జాగ్రత్తగా ఎండబెట్టి దాచేది అమ్మ. ఆగస్టు వస్తోందనగానే వాటిని మట్టిలో చల్లేసేది. నాలుగైదురోజుల్లోనే మొక్కలు వచ్చేసేవి. కాస్తంత పెరిగాకా, ఆ బంతినారు తీసేసి మళ్ళీ దూరం దూరంగా నాటేవాళ్ళం. కానీ ముద్ద పువ్వుల రెక్కలతో మొలిచిన మొక్కలకి రేక బంతిపువ్వులు పూసేవి ఒకోసారి. అందుకని విత్తనాలు వేసి మొలిపించినా, ఒక కట్ట అయినా బంతినారు కొనకుండా ఉండేది కాదు అమ్మ. అలా ఆగస్టులో వేసిన బంటి మొక్కలు సప్టెంబరు చివరికి పూలు పూసేసేవి. కొత్త సంవత్సరం వచ్చాకా మార్చి దాకా పూసేవి ఆ పూలు. ముద్ద బంతి రెండు మూడు రంగులు, రేక బంతి రెండు మూడు రంగులు, కారబ్బంతి(చిన్నగా తోపు రంగులో ఉంటాయే అవి) మొదలైనవి పెంచేవాళ్ళం మేము. నా పెళ్ళి అయ్యేదాకా ప్రతి ఆగష్టు నుంచి మార్చి దాకా క్రమం తప్పకుండా బంతి తోట ఉండేది మా ఇంటి ముందు. వాటి పక్కన రెండు మూడు రకాల చామంతులు. ఇవి కూడా ఈ అర్నెలలూ పూస్తాయి. ఈ మొక్కలన్నింటికీ కలిపి నేను గట్టి కర్రలు ఏరుకొచ్చి దడి కట్టేదాన్ని. అదో పెద్ద కార్యక్రమం. ఆ దడికి శంఖుతీగలను ప్రాకిస్తే స్ట్రాంగ్ గా గోడలా ఉండేది. తెలుపు, నీలం రంగుల్లో ఉన్న శంఖు పువ్వులు ఎంత బావుడేవో..

(పాత ఫోటోల్లో దొరికిన మా బంతి తోట)


మార్చి తరువాత బంతి మొక్కలు వాటంతట అవే ఎండిపోవటం మొదలు పెడతాయి. అప్పుడు వాటిని తీసేసి మళ్ళీ ఏవో వేరే మొక్కలు వేసుకునేవాళ్ళం. బంతి పువ్వులు పూసినన్నాళ్ళు ప్రతి బుధవారం అమ్మ వాటిని కోసి బంతి ఆకులే మధ్య మధ్య వేసి దండలు కట్టి అన్ని దేవుడు పటాలకూ వేసేది. అమ్మ చాలా బాగా మాలలు కడుతుంది .అదీ ఎడం చేత్తో. నాకు కుడి చేత్తో కూడా సరిగ్గా కట్టడం రాదు. నాకు రాని ఏకైక పని అది ఒక్కటే..:(( మొన్న శ్రావణ శుక్రవారం బోలెడు పువ్వులు కొనుక్కొచ్చి, ఏదో ఎమోషన్ లో మాల కడదామని తెగ ప్రయత్నించాను. నాలుగు పువ్వుకు కట్టగానే తయారైన వంకర టింకర మాల చూసి ముసిముసి నవ్వులు నవ్వుతున్న శ్రీవారిని చూసి ఇక కట్టడం ఆపేసా. ఆ తర్వాత ఏం జరిగిందో తెలివైనవాళ్ళకి అర్ధమైపోతుంది కదా..:))

పెళ్ళైయాకా మళ్ళీ బంతిమొక్కలు పెంచటం కుదరనేలేదు. అమ్మ కూడా మానేసింది వేసే చోటు లేక. ఇన్నేళ్ళ తరువాత బజార్లో మొన్నొకరోజు బంతినారు కనపడింది. మట్టినేల లేదు ఏం పెంచుతానులే అనుకున్నా కానీ మనసొప్పలేదు... ఒక్క కట్ట కొన్నాను. రెండు మూడు కుండీల్లో అవే వేసాను. అన్నీ నిలబడ్డాయి. ఇక పువ్వుల కోసం ఎదురుచూపులు...






Wednesday, August 3, 2011

"నేనెందుకు రాస్తున్నాను.." శ్రీ వేగుంట మోహన్ ప్రసాద్ గారి రేడియో ప్రసంగం....కొన్ని జ్ఞాపకాలు !


"మో" ఎవరు అని అడిగే ఎవరన్నా రేడియోలో ప్రసారమైన ఈ ప్రసంగం వినవలసిందే...
"నేనెందుకు రాస్తున్నాను.." అని 28 -11 -89 లో (అంటే సుమారు 22 సంవత్సరాల క్రితం) ప్రసారమైన మోహన్ ప్రసాద్ గారిది ఒక రేడియో ప్రసంగం ఉంది. అది కేసెట్లో రికార్డ్ చేసాం ప్రసారమైనప్పుడు. చాలా సార్లు వింటూ ఉండేవాళ్ళం. ఎంతో బాగా మాట్లాడారు మోహన్ ప్రసాద్ గారు ఇందులో. క్రిందన ఇస్తున్నాను. నాన్న ద్వారా తెలిసిన ఆయనపై అభిమానంతో ఈ ఆడియో లింక్ ఇక్కడ పెడుతున్నాను..


Get this widget | Track details | eSnips Social DNA

కొన్నేళ్ళ తర్వాత మళ్ళి ఇవాళ ఈ కార్యక్రమం వింటుంటే కాలం ఎలా పరుగులు తీస్తుందో కదా అనిపించింది...ఒకనాడిలా వీరిని గురించిన దుర్వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదు..! మొన్న వారికి తనికెళ్ళ భరణి సాహితీ అవార్డ్ వచ్చినప్పుడు కూడా నాన్న అనుకున్నారు వెళ్లి కలవాలి అని..ఇంతలోనే ఈ దిగ్భ్రమ వార్తా !

*** *** ***

పొద్దున్నే టివిలో స్క్రోలింగ్ లో ఒక వారట చూసి వెంతనే నాన్నకి ఫోన్ చేశా..ఇది నిజమేనా? అని..
నిజమేనన్నారు... ఎంతో దిగులు వేసింది..
ఏవో జ్ఞాపకాలు అలా ముసిరాయి..

ఆకాశవాణి వార్షిక పోటీలకు రేడియో వాళ్ళు చేసిన ప్రతి అవార్డ్ ప్రోగ్రాం ఢిల్లీ కి వెళ్ళే ముందు వాటిని అక్కడి జడ్జస్ చదవటానికి వీలుగా తెలుగుతో పాటుగా హిందీ లోకీ, ఇంగ్లీషు భాషల్లో కీ మొత్తం కార్యక్రమాన్ని అక్షర రూపంలో ట్రాన్స్లేట్ చేసి , వాటికి ఓ పుస్తకం గా బైండ్ చేసి కార్యక్రమంతో పాటుగా పంపేవారు. అలా నాన్న చేసిన కొన్ని కార్యక్రమాలను ఇంగ్లీషు లోకి అనువదించారు ఆధునిక తెలుగు కవులలో 'మో' గా ప్రసిధ్ధి చెందిన శ్రీ వేగుంట మోహన్ ప్రసాద్ గారు. వారు నాకు మొదట తెలిసింది నేను ఇంటర్ చదువుతున్న రోజుల్లో. వారు నాకు మొదట తెలిసింది నేను ఇంటర్ చదువుతున్న రోజుల్లో. అప్పుడు ఆయన విజయవాడ సిద్దార్ధా కాలేజిలో ఇంగ్లీషు లెక్చరర్ గా చేసేవారు. మొదట వారు అనువదించినది 'నేను కాని నేను' అనే కార్యక్రమాన్ని. అది మోహన్ ప్రసాద్ గారికి చాలా నచ్చింది. నాన్న కలవటానికి వెళ్ళినప్పుడు లోపలి తీసుకువెళ్ళి ఎంతో అభిమానంగా మాట్లాడారుట. ' ఇలా ఇంటి లోపలి చాలా తక్కువమందిని అనుమతిస్తాను..' అన్నారని నాన్న సంతోషంగా చెప్పటం నాకింకా గుర్తు.

రేడియో కార్యక్రమాలను అనువదించేప్పుడు సాధారణంగా తెలుగు స్క్రిప్ట్ చదివి ఆంగ్లంలోకి రాసేస్తుంటారు. కానీ మోహన్ ప్రసాద్ గారు ప్రోగ్రాం కేసెట్ అడిగి , వినీ ఆంగ్లంలోకి అనువాదం చేసేవారుట. ఢిల్లీలో జడ్జీలు కూడా ఎవరు అనువాదం చేసారు అని అడిగి, చాలా బావుందని మెచ్చుకునేవారుట . ఈ అనువాదాల కారణంగా నాన్నకు అపురూపమైన వారి స్నేహం లభించింది. అప్పుడప్పుడు కలిసినప్పుడు కబుర్లు మాతో చెప్పేవారు. అలా 'మో' గారిని ఎప్పుడూ కలవకపోయినా నాన్న ద్వారా తెలుసు. అప్పుడప్పుడు మోహనప్రసాద్ గారివి కొత్త పుస్తకాలు ప్రచురణ జరిగినప్పుడు నాన్నకు ఒక కాపీ పంపేవారు. క్రింద ఫోటోలోది అలా వారు పంపిన పుస్తకంలోని వారి సంతకం..




శ్రీ వేగుంట మోహన్ ప్రసద్ గారి గురించి రచయిత్రి చంద్రలత గారు పుస్తకం.నెట్ లో రాసిన వ్యాసం ఇక్కడ చూడవచ్చు.

Tuesday, August 2, 2011

బుక్ మార్క్స్ & గ్రీటింగ్స్


చాలా రోజుల క్రితం greetings గురించి, కొన్ని హాబీల గురించి టపాలు రాసాను. నిన్న బజ్లో మళ్ళీ గ్రీటింగ్స్ గురించి కబుర్లు వచ్చేసరికీ నాకు పాత గ్రీటింగ్స్ అన్నీ చూసుకోవాలనిపించింది. తీరా వాటిని చూశాకా ఫోటోస్ తీసి దాచుకుందాం పాడయిపోకుండా ఉంటాయి అనిపించింది. ఇక ఫోటొలు తీసాకా..టపాలో పెట్టేద్దాము బ్లాగులో దాచుకున్నట్లుంటాయి అనిపించింది..:) గ్రీటింగ్స్ అంటే సరదా ఉన్నవాళ్ళు ఓసారి అన్నీ చూసేసి నాలాగే ఆనందించేయండి.


క్రింద ఉన్నవి రకరకాల బుక్ మార్క్స్. అప్పట్లో పుస్తకాలు బాగా చదివేదాన్ని కాబట్టి బాగా వాడేదాన్ని. ఏ కొత్త రకం వచ్చినా కొనేయటం ఒక సరదా.





ఇవీ కొన్ని లెటర్ పాడ్ సెట్స్ ,

హేండ్ మేడ పేపర్ తో చేసిన ఈ సెట్ వాడకుండా దాచుకున్నా..



గ్రీటింగ్స్ తయారుచేయటానికి రంగురంగుల హేండ్ మేడ్ పేపర్స్ . (చాలా కాలం న్యూ ఇయర్ కి, పుట్టినరోజులకు మిత్రులకు బంధువులకు గ్రీటింగ్స్ తయారు చేసి పంపేదాన్ని..)


కాలేజీ రోజుల్లో కొత్త గ్రీటింగ్ కార్డులు వస్తే ఇవ్వటానికెవరూ లేకపొయినా తలో రకం కొనేసేదాన్ని. అప్పట్లో బుల్లి బుల్లి గ్రీటింగ్ కార్డులు వచ్చాయి. ఏ షాప్ లో దొరికితే అక్కడ దొరికినన్ని రకాలు కలక్ట్ చేయటం ఒక హాబీ. క్రింద ఫోటోలోవి ఆ బుల్లి బుల్లి కార్డల కలక్షన్..





















ఇవీ గిఫ్ట్ల మీద బెస్ట్ విషెస్ రాసే కార్డ్లు..








"ప్రబోధా బుక్ సెంటర్లో" ఇన్స్పిరేషనల్ మెసేజెస్ ఉన్న బుక్స్ దొరికేవి . మంచి మంచి సీనరీలు ఉండి కొటేషన్స్ కూడా బావుండేది ఈ బుక్స్ లో.. క్రింద ఉన్నవి ఆ పుస్తకాలు..







ఇంక నా కలక్షన్లోని పెద్ద గ్రీటింగ్స్ పెట్టటంలేదు..వాటితో ఒక చిన్న సైజు కొట్టు పెట్టచ్చేమో ..:))







Wednesday, July 6, 2011

భాస్కరమ్మగారి ఇల్లు








నివాసానికి గవర్నమెంట్ క్వార్టర్స్ ఇచ్చేదాకా పదిహేనేళ్ళ పాటు విజయవాడ సూర్యారావుపేటలోనే ఉన్నాం మేము. విజయటాకీస్ ఎదురుగుండా రోడ్డులో ఎడమవైపు ఉండేది భాస్కరమ్మగారి ఇల్లు. ఇప్పుడు భాస్కరమ్మగారు లేరు. ప్రస్తుతం ఆ ఇల్లు కూడా ఏవో కోర్టు తగాదాల్లో ఉందని విన్నాను. అన్నయ్య పుట్టక ముందు అమ్మావాళ్ళు దిగిన ఆ ఇంట్లో నాకు పన్నెండేళ్ళు వచ్చేదాకా ఉన్నాం. ఆ ఇంటితో పెనవేసుకునున్న ఎన్నో జ్ఞాపకాలు ఈనాటికీ తాజాగా మనసును ఉత్తేజపరుస్తూ ఉంటాయి. మేం ఉన్నప్పుడు లైట్ ఆరెంజ్ కలర్లో ఉండే ఆ డాబా ఇంట్లో వీధివైపు రెండు పెద్ద వాటాలు, వెనుక పెరటివైపు రెండు చిన్న వాటాలు ఉండేవి. పైన అంతా భాస్కరమ్మగారు ఒక్కరే ఉండేవారు. పిల్లలు దూరాల్లో ఉండేవారు. తెల్లటి పంచె ముసుగేసుకుని కట్టుకుని ఉండే ఒక ముసలి మామ్మగారు పొద్దుటే వచ్చి భాస్కరమ్మగారికి వంట చేసి సాయంత్రాలు వేళ్పోతూ ఉండేవారు. అంత పెద్ద ఇంట్లో ఆవిడ ఒక్కరు భయం లేకుండా ఎలా ఉంటారా అని నాకు ఆశ్చర్యం వేసేది.

మా వాటా వైపు పొడువాటి సందు ఉండేది. రెండు కొబ్బరి చెట్లు, ఒక పెద్ద రేక నందివర్ధనం చెట్టు ఉండేవి. నందివర్ధనం చెట్టు ఎక్కటానికి వీలుగా ఉండేది. రోజూ పొద్దున్నే నేనో తమ్ముడో చెట్టేక్కి గోడ మీద కూచుని సజ్జ నిండా పూలు అమ్మకి కోసి ఇచ్చేవాళ్లం. మిగతా మట్టి ప్రదేశంలో అమ్మ కనకాంబరాలు, డిసెంబర్ పూలు, ముళ్ళ గోరింట పూలు, మెట్ట తామర.. మొదలైన పూలమొక్కలు, ఆకుకూరలు మొదలైనవి పెంచేది. మా ఇంటి గోడకూ, ఎదురుగుండా ఇంటికి మధ్య నాలుగైదు అడుగుల ఖాళీ స్థలం ఉండేది. అక్కడ పిచ్చి మొక్కలు, బోలెడు ఆముదం మొక్కలు, బొప్పాయి మొక్కలు ఉండేవి. పిచ్చుకలు, గోరింకలూ, అప్పుడప్పుడు కోయిలలు వచ్చి ఆ చెట్లపై వాలుతూ ఉండేవి. ఆముదం మొక్కల వల్ల ఎప్పుడూ నల్లని గొంగళీ పురుగులే. కొన్ని ఇంటి గోడమూలల్లో గూళ్ళు కట్టేసుకుని ఉండేవి. అవి సీతాకొకచిలుకలు అవుతాయని నాన్న చెప్తే ఆశ్చర్యం వేసేది. గొంగళీలతో పాటూ వర్షాకాలంలో గుంపులు గుంపులుగా ఎర్రని రోకలిబండలు తిరుగుతు ఉండేవి. పుట్టలు పుట్టలుగా ఎన్ని పుట్టేసేవో అవి. ఇక వర్షం వస్తే వీధి గుమ్మం దాకా మా వాటా వైపంతా నీళ్ళతో నిండిపోయేది కాలువలాగ. ఇంక ఆ బురదనీళ్ల కాలవ నీండా మేంవేసిన కాయితం పడవలే ఉండేవి. మా ఇంట్లోని చిన్నగదిలో ఎత్తుగా ఒక కిటికీ ఉండేది. ఆ కిటికీ గూట్లోకి ఎక్కితే కాళ్లు తన్నిపెట్టుకుని కూర్చోటానికి కుదిరేది. వాన వస్తూంటే సన్న తుంపరలు మీద పడేలా ఆ కిటికీలో కూర్చుని ఏదైనా పుస్తకం చదువుకోవటం నాకు చాలా ఇష్టంగా ఉండేది.

ఇంటి వెనుక వైపు చాలా పెద్ద పెరడు ఉండేది. అందులో ఓ పక్కగా పెద్ద సపోటా వృక్షం, దానికి చుట్టుకుని గురువింద గింజల తీగ ఉండేవి. ఎరుపు నలుపుల్లో ఉండే గురువింద గింజలు కోసుకుని దాచటం నా ముఖ్యమైన పనుల జాబితాలో ఉండేది. పెరటిలో సపోటా చెట్టునానుకుని డా.జంధ్యాల శంకర్ గారి ఇల్లు ఉండేది. అప్పుడప్పుడు పేరంటాలకు పిలిచేవాళ్ళు వాళ్ళు. వాళ్ళింట్లో పొడుగ్గా రెండు యూకలిప్టస్ చెట్లు ఉండేవి. ఒకటో రెండో ఆకులు అందుకుని వాసన చూస్తే భలేగా ఉండేది. (ఆ తర్వాత డా.శంకర్ గారు విజయవాడ మేయర్ గా కూడా చేసారు) మా వెనుక పెరడులో ఇంకా పారిజాతం, కర్వేపాకు, గోరింటాకు, రెండు మూడు గులాబీ చెట్లు ఉండేవి. అవికాక ఒక పక్క విరజాజి పందిరి, మరో పక్క సన్నజాజి పందిరి, వాటి మధ్యన రెండు మూడు మల్లె పొదలు(కోలవి, గుండ్రంటివి ఇలా మల్లెల్లో రకాలన్నమాట), ఒక కాగడా మల్లె పొద కూడా ఉండేవి. ఇవి కాక అద్దెకున్నవాళ్ళు పెంచుకునే మొక్కలు. ఇలాగ వెనుకవైపు పెరడులోకి వెళ్ళాడానికి చాలా ఆసక్తికరమైన సంగతులన్నీ ఉండేవి. అమ్మ ఎప్పుడు బయటకు వదులుతుందా అని మా వరండాలోని కటకటాలతలుపులు పట్టుకుని జైల్లో ఖైదీల్లాగ ఎదురు చూసేవాళ్ళం. అమ్మ తాళం తియ్యగానే పరుగున వెనుకవైపుకు వెళ్పోయి చీకటి పడేదాకా అక్కడే అడుకుంటూ గడిపేవాళ్లం.

పొరపాటున ఎవరి చెయ్యైనా చెట్ల మీద, పువ్వుల మీదా పడిందో పై నుండి ఎప్పుడు చూసేదో భాస్కరమ్మగారు ఒక్క కేక పెట్టేది..ఎవరదీ అని..! అన్ని పూలు పూసినా ఒక్క పువ్వు కూడా మా ఎవ్వరికీ ఇచ్చేది కాదు ఆవిడ. పొద్దుటే ఆవిడ పనిమనిషి వచ్చి అన్ని పువ్వులు కోసుకుని వెళ్ళిపోయేది. దేవుడికి పెట్టుకునేదో ఏమో...! నేను కొత్తిమీర వేస్తే మాత్రం కాస్త కొత్తిమీర కోసివ్వవే అని జబర్దస్తీ గా కోసేసుకునేది. నాకు ఒళ్ళు మండిపోయేది. పువ్వులు కోసుకోనివ్వకపోయినా నేనైతే ఎప్పుడూ ఆ చెట్ల చుట్టూ తిరుగుతూ ఉండేదాన్ని. ఆ పచ్చదనం నన్నెంతో ముగ్ధురాలిని చేసేది. మొక్కలన్నింటి మధ్యనా ఉండే మెత్తటి ఆకుపచ్చటి గడ్డి మొక్కలు కూడా నాకు అందంగా కనబడిపోయేవి. అలా మొక్కలతో నా సావాసం ఊహ తెలిసినప్పటి నుండీ ఏర్పడిపోయింది.






వీధివైపు ఉన్న రెండిటిలో ఒక వాటాలో మేము ఉండేవాళ్ళం. రెండోదాన్లో ఒక డాక్టర్ గారు ఉండేవారు. అవివాహితుడైన ఆయనతో ఆయన చెల్లెలు, ఆవిడ ముగ్గురు పిల్లలు ఉండేవారు. వారితో నామమాత్రపు పరిచయమే తప్ప మిగిలిన సంగతులు ఎక్కువ ఎవరికీ తెలియవు. మా వాటాలో వరండా, చిన్నగది, వంటిల్లు, హాలు,బెడ్రూము ఉండేవి. ఇంకా ఓ రెండు గదులు ఉంటే, అవి మాకు అనవసరం అని అద్దెకు ఇచ్చారు నాన్న. దాన్లో కొన్నేళ్ళు భట్టుమావయ్యగారు(పన్నాల సుబ్రహ్మణ్యభట్టుగారు) ఉన్నారు. తరువాత మేమున్నన్నాళ్ళు సూరిసేన్ మావయ్యగారు, వాళ్ళ తమ్ముడు శంకర్ గారు ఉండేవారు. ఇద్దరూ పెళ్ళిళ్ళు చేసుకోలేదెందుకో మరి. సూరిసేన్ మావయ్యగారికీ నాకూ భలే స్నేహం ఉండేది. ఆయన రేడియోలో క్రికెట్ కామెంటరీ వింటూంటే కావాలని కదిలిస్తూ, ఆయనతో ఆడుతూ..కబుర్లు చెప్తూ ఎప్పుడూ వాళ్ల రూంలోనే ఎక్కువ ఉండేదాన్ని. వీళ్ల రూంకే తరచూ సాయంత్రాలు ఉషశ్రీతాతగారు పలు మిత్రులను కలవటానికి వస్తూండేవారు.

మా వాటాసందు చివరగా చిన్న వీధి గుమ్మం ఉండేది. గుమ్మానికి పక్కగా రాధామనోహరలు తీగ అల్లుకుని ఉండేది. రాత్రయ్యేసరికీ లేత గులాబి,తెలుపు రంగుల్లో గుత్తులు గుత్తులుగా రాధామనోహరాలు విచ్చేవి. ఆ పరిమళం ఇంకా తలపుల్లో నన్ను పలకరిస్తూ ఉంటుంది. ఒకే తీగకు రెండు రంగుల్లో పులెలా పూస్తాయీ అని ఇప్పటికీ సందేహమే నాకు. సాయంత్రం ఆ పూలు విచ్చే సమయానికీ, పొద్దున్నే లేవగానే కాసేపు ఆ వీధి గుమ్మంలో కూచోపోతే నాకు తోచేది కాదు. పొద్దున్నే వీధి తుడిచేవాళ్ళు, అటువెళ్ళే బళ్లవాళ్ళు అందరూ ఓ చిరునవ్వుతో పలకరించేసేవారు. నిర్మలా కాన్వెంటు స్కూలు బస్సు మా ఇంటి ఎదురుగా ఆగేది. సూరిబాబుమావయ్యగారి పిల్లలు ఆ బస్సు ఎక్కటానికి రోజూ వచ్చి అక్కడ నిలబడేవారు. ఇప్పుడు వాళ్ళు సంగీత విద్వాంసులు "మల్లది బ్రదర్స్" గా మంచి పేరు తెచ్చుకున్నారు.

మా వెనుకవైపు రెండువాటాల్లో ఒకదాన్లో తాతగారు, అమ్మమ్మగారు, శ్రీనుమావయ్య, నాగమణక్క ఉండేవారు. తాతగారు నాకూ, మా తమ్ముడికీ కొబ్బరి ఆకులతో, తాటాకులతో బుట్టలు అవీ అల్లి ఇస్తూండేవారు. కొత్త కొత్త కబుర్లు ఎన్నో చెప్పేవారో. వాళ్ళబ్బాయి శ్రీనుమావయ్య మృదంగం నేర్చుకునేవాడు. రోజూ పొద్దుట సాయంత్రం సాధన చేస్తూండేవాడు. మేము కిటికీ ఎక్కి అబ్బురంగా చూస్తూండేవాళ్లం. నాగమణక్క కాలేజీలో చదువుతూ ఉండేది. అమ్మమ్మగారికి వినబడేది కాదు. చెవికి మిషన్ పెట్టుకునేవారు. కాలేజీ నుంచి రాగానే ఆ రోజు జరిగిన విశేషాలన్నీ గట్టిగా అమ్మమ్మగారికి చెబుతూ ఉండేది అక్క. అన్ని వాటాలవాళ్ళకీ వినబడేవి ఆ కబుర్లు. ఇక వెనుకవైపు మరోవాటాలో ఇంకో తాతగారు, అమ్మమ్మగారు వారి ఆరుగురు సంతానం ఉండేవారు. తాతగారికి నేనంటే వల్లమాలిన అభిమానం. ఆఫీసు నుండి రాగానే ఎంత రాత్రయినా నన్ను తీసుకురమ్మని బొజ్జపై పడుకోబెట్టుకుని బోలెడు కబుర్లు చెప్పేవారు. తెలుగు తిథులు,నెలలు, పద్యాలు,పాటలూ ఎన్నో నేర్పించేవారు. నా ఊహ తెలిసేసరికీ ఇరువైపుల తాతగార్లు లేకపోవటంతో ఈ తాతగారు బాగా దగ్గరైపోయారు. అమ్మ కూడా పిన్నిగారు,బాబయ్యగారు అని పిలిచేది వాళ్ళిద్దరినీ. ఎంతో అభిమానంగా ఉండేవాళ్ళం రెండు కుటుంబాలవాళ్ళమూ. కొన్నేళ్ళకు సొంత ఇల్లు కట్టుకుని వాళ్ళు వెళ్పోయారు వాళ్ళు. ఊళ్ళు మారినా, దూరాలు పెరిగినా ఇప్పటికీ ఆ అనుబంధం అలానే ఉంది. మా పాప పుట్టాకా తాతగారికి విజయవాడ తీసుకువెళ్ళి చూపించి వచ్చాను. తాతగారు కాలం చేసి ఏడాదిన్నర అయిపోతోంది అప్పుడే !!

తాతగారూవాళ్ళు ఖాళీ చేసాకా ఆ ఇంట్లోకి ఉషశ్రీగారి సహోదరులు పురాణపండ రంగనాథ్ గారు వచ్చారు. పిల్లలందరం కల్సి గోడలెక్కి దూకి..రకరకాల ఆటలు ఆడుకునేవాళ్ళం. శెలవుల్లో ఎండిన కొమ్మలు విరిచి బాణాలు చేసుకునేవాళ్ళం. రంగనాథ్ మావయ్యగారు అమ్మవారి ఉపాసకులు. దసరా పూజలు ఎంతబాగా చేసేవారో. విజయవాడలో ఉన్నన్నాళ్ళు ఎక్కడ ఉన్నా నవరాత్రుల్లో వాళ్ళింటికి వెళ్ళేవాళ్ళం. భాస్కరమ్మగారు "ఇల్లు బాగుచేయించాలి.." ఖాళీ చెయ్యమంటే అన్ని వాటాలవాళ్ళమూ ఒకేసారి ఆ ఇంట్లోంచి కదిలాము. అప్పటికి నాకు పన్నెండేళ్ళు. ప్రపంచం తెలీని బాల్యపు అమాయకత్వం, చలాకీతనం, అరమరికలు లేని స్నేహాలు, పచ్చదనంతో సావాసం...మరువలేనివి. ఆ రోజులు గుర్తుకు వస్తే...ఒక అద్భుతలోకంతో బాంధవ్యం అప్పటితో తెగిపోయింది అనిపిస్తూ ఉంటుంది నాకు. ఈ మధురస్మృతులన్నింటినీ ఒకచోట పోగేసి దాచుకోవాలన్న ఆలోచనే ఈ టపా.


Wednesday, May 4, 2011

మామ్మయ్య - ఊరగాయలు !


 
మా మామ్మయ్య(నాన్నమ్మ) పెట్టే ఊరగాయల గురించి చెప్పేముందు ఆవిడ పాకప్రావీణ్యం గురించి కొంచెం చెప్పాలి. ఆవిడ చేతిలో అద్భుతం ఉండేది. ఏది వండినా రుచి అమోఘమే. ఆవిడ అత్తారింట్లో ప్రతిరోజూ పాతిక మందికి తక్కువకాకుండా వండేదిట. అది కూడా మడి వంట. ఇక పండగలు తద్దినాలు వస్తే వంటింట్లోనే మకాం. ఆవిడ కొబ్బరి పచ్చడి రుబ్బుతూంటే రోట్లో ఉండగానే సగం పచ్చడి అయిపోయేదిట.(అలా తినేసేవారట అటుగా వచ్చినవాళ్ళు). పనసపొట్టు కూర లెఖ్ఖగా వండినా సరే సగం మంది తినేసరికీ అయిపోయేదిట.

ఆవిడ ఒంట్లో ఓపికున్నన్నాళ్ళు చేతనైనంతగా మాకు వండిపెట్టింది. వేసవిశెలవులకు వెళ్ళేసరికీ రేగొడియాలు, బంగాళాదుంప చిప్స్, సగ్గుబియ్యం వడియాలు,పిండి వడియాలు, జంతికలు,చెక్కలు,పంచదారపూరీలు మొదలైనవన్నీ మా కోసం రెడీగా ఉండేవి. రోజంతా మిల్లాడిస్తూ ఉండండి అని మా మావయ్య జోక్ చేసేవాడు. ఇదంతా మామ్మయ్య పాకప్రావీణ్యం గురించి చెప్పటానికే. ఇక వేసవిలో ఊరగాయల సంగతికొస్తే ఆ రకం పెట్టినా అన్నీ సమపాళ్ళలో కుదిరేవి. ఆవీడ పెట్టినన్ని ఊరగాయల రకాలన్నీ తినగలగటం మా పిల్లల అదృష్టం.


కాకినాడలో మా ఇంట్లోని వంటింట్లో ఓ మెష్ డోర్ ఉన్న గూడు ఉండేది. దాన్నిండా చిన్నవి, పెద్దవి రకరకల సైజుల్లో జాడీలు ఓ ముఫ్ఫై పైనే ఉండేవి. ఆ జాడీల ఆకారాలు కూడా రకరకాలుగా ముద్దుగా ఉండేవి. గుర్తు కోసం నేనో రెండు జాడిలు తెచ్చుకున్నాను కూడా. మాకు నెల నెలా సామర్లకోట నుండి పప్పు నూనె తెచ్చే ఆదినారాయణ ఊరగాయలు పెట్టే సమయానికి సైకిలు మీద ఫ్రెష్ పప్పు నూనెతో వచ్చేసేవాడు. మా పిన్నివాళ్ల అత్తగారు అయితే ఊరగాయలకు మావిడికాయలు చెట్టు నుండి దగ్గరుండి మరి కోయించుకునేవారు మొన్నమొన్నటిదాకా. పప్పునూనె కూడా గానుగలో దగ్గరుండి ఆడించుకునేవారు.


ఇక నాన్న ఆవకాయలకు ముక్కలు కొట్టేవారు. ఇంట్లోని మహిళలేమో మాగయకు తరిగగేసేవారు. అటు వెళ్లాలని ఉత్సాహంగా ఉన్నా రానిచ్చేవారు కాదు. మాగయ ముక్కలు తరగటానికి చిల్లు పెట్టిన ఒక ఆల్చిప్ప ఉండేది. దాంతో మావిడికాయను చెక్కితే మాగాయకు ముక్కలు వచ్చేవి.(ఇప్పటి పీలర్ లాగన్నమాట). పెరట్లోనేమో పనమ్మాయి లక్ష్మి తాలూకూ కొందరు ఆడవాళ్ళు వచ్చి కారం కొట్టేవారు. ఆ రోకళ్ళ చప్పుడు భలేగా ఉండేది. అటువైపు అసలు వెళ్లనిచ్చేవారు కాదు ఘాటుకి తుమ్ములు వస్తాయని. వెల్లుల్లిపాయలు కూడా వాళ్ళే వొలుచుకునేవారు.



ఇక మా మామ్మయ్య పెట్టే ఆవకాయ రకాలు ఏమిటంటే:

1) వెల్లుల్లి ఆవకాయ
2)ఉత్తి ఆవకాయ (వెల్లుల్లి తిననివాళ్ళ కోసం)
3)పులిహార ఆవకాయ (కావాల్సినప్పుడల్లా కాస్తంత తీసుకుని పులిహోర పోపు పెట్టుకుంటారు)
4)అల్లం ఆవకాయ (దీంట్లో అవపిండి ఉండదు)
4)పచ్చావకాయ (పచ్చ మెరపకాయలతో పెడతారు)
5)పెసర ఆవకాయ (దీంట్లో అవపిండి బదులు పెసరపిండి వాడతారు)
6)బెల్లం ఆవకాయ
7)సన్న ఆవాల ఆవకాయ (ప్రత్యేకం సన్న ఆవపిండితో పెడతారు.ఘాటు ఎక్కువగా ఉంటుంది)
8)శనగల ఆవకాయ (ఎండిన శనగలు వెస్తారు. కొన్నాళ్ళకు అవి ఊరి తినటానికి బావుంటాయి)
9)నువ్వుపిండి ఆవకాయ(దీంట్లోనూ అవపిండి బదులు నువ్వుపిండి వాడతారు)
10)మావిడి పిందెలతో అవకాయ (కేరళావాళ్ళు ఎక్కువ చేస్తారు దీన్ని)

మాగాయ రకాలు:
1)నూనె మాగాయ
2) తొక్కు మాగాయ
3) ఎండు మాగాయ
4)తురుము మాగాయ/ కోరు మాగాయ
5)ఉల్లిమాగాయ(వెల్లుల్లి తో)

ఇవి కాక మెంతిపిండి ఎక్కువ వేసి చేసే
* మెంతికాయ
* చెంప మెంతికాయ ఆవిడ స్పెషల్స్.


ప్రతి ఏడాదీ ఈ రకాలన్నీ చెయ్యకపోయినా ఒకో ఏడూ వీటిలో సగం పైనే కవర్ చేసేది మామ్మయ్య. నెమ్మది నెమ్మదిగా ఓపిక తరిగేకొద్దీ రకాలూ తగ్గి రెండు,మూడు రకాలు మాత్రమే పెట్టే స్టేజ్ కి వచ్చేసింది చివరిరోజుల్లో.


మా ఇంట్లో ఆవకాయ తినటం తక్కువవటం వల్ల అమ్మ ఎప్పుడు ఇన్ని రకాలు ప్రయత్నించలేదు. ఇప్పుడిక డాక్టర్లు ఊరగాయలు తినద్దంటున్నారని అసలు పెద్ద ఎత్తున ప్రయత్నాలే లేవు. ఏదో శాస్త్రానికి నాలుగైదు రకాలు పెడుతోంది మా పిల్లల కోసం. మేము కూడా డైట్ కంట్రోల్, ఆయిల్ ఫ్రీ ఫుడ్ అంటూ చాలావరకూ ఊరగాయలకు దూరంగా ఉండిపోతున్నాం. తిన్నా తినకపోయినా ఊరగాయ పెట్టాలనే సరదా కొద్దీ నేనే నాలుగైదు రకాలు కాస్త కాస్త చప్పున పెడ్తూ ఉంటాను.

Tuesday, March 1, 2011

జ్ఞాపకాల పూలు



పొద్దున్నే మెలుకువ వచ్చి లేచి కళ్ళు నులుముకుంటూ లైటు కనబడుతున్న వంటింటి వైపు వెళ్తే, అక్కడ రేడియో లోంచి వినబడుతున్న ప్రసార విశేషాలు, అప్పుడే తీసిన కాఫీ డికాషన్ తాలుకూ ఫ్రెష్ సువాసన, పొయ్యి మీద పెట్టడానికి రెడీగా ఉన్న ఇడ్లీ ప్లేట్లు, చెమట ఇంకటానికి మెడ చుట్టు చుట్టుకున్న పల్చటి తెల్లటి తువ్వాలుతో మామ్మయ్య దర్శనం అయ్యేది.(మా నాన్నమ్మను మేము "మామ్మయ్య" అని పిలిచేవాళ్లం). సెలవుల్లో ఊరు వెళ్లినన్నాళ్ళూ రోజూ అదే దృశ్యం. ఇంకా ముందర లేస్తే వంటింటి బదులు దొడ్లో లైటు, అక్కడ వారగా ఉండే సిమెంట్ గోలెం మందారాలు పుసిందా? అన్నట్లు గోలెం నిండుగా పరుచుకుని ఉన్న ఎర్రటి రేకమందారాలు(ముందు రోజు సాయంత్రమే ఎవరో ఒకరు మొగ్గలు కోసి అందులో వేసేవారు)...తులసి కోట దాటి తలుపు తీస్తే దొడ్లో ఏవో పనులు చేస్తూనో, మొక్కలకి నీళ్లు పోస్తూనో కనబడేది మామ్మయ్య. చీకట్లు తొలగుతూ తెల్లవారేవేళ అలా లేచి మామ్మయ్యను చూడటం ఒక అపురూపంగా తోచేది మాకు. ఆ దృశ్యం చూడటానికి వీలైనన్నిసార్లు పొద్దున్నే లేవటానికి ప్రయత్నించేవాళ్ళం నేనూ, మా తమ్ముడూ.

అదే వర్షాకాలమైతే దొడ్లో నూతి నిండా నీళ్ళు ఉండేవి. చేద వేయనక్కర్లేకుండా చెంబుతో ముంచితే నీళ్ళు అందేంత పైకి నీళ్ళు ఉండేవి. క్రితం రోజు సాయంకాలం మందార మొగ్గలు కోసి నూతిలో వెసేసేవారు. అప్పుడు పొద్దున్నే లేవగానే నూతి గోడల అంచుదాకా పైకి ఉన్న నీటిలో విచ్చుకున్న ఎర్రటి రేకమందారాలు ఎంత అందంగా ఉండేవో మాటల్లో చెప్పటం కష్టం. అప్పట్లో డిజిటల్ కెమేరాలు, మొబైల్ కెమేరాలు లేవు. లేకపోతే ఎన్ని ఫోటోలు తీసిఉందునో అనుకుంటూ ఉంటాను. దాదాపు పదమూడు రకాల మందారాలు పెంచేది మామ్మయ్య. అన్నీ పెద్ద పెద్ద వృక్షాలయి బోలెడు పూలు పూసేవి. పారిజాతాలు, కాసిని మల్లెలు, సంపెంగలు, నిత్యమల్లి, చామంతులు, దేవకాంచనాలు మొదలైన మిగిలిన పూలు కూడా పూసేవి. పాండ్స్ టాల్కం పౌడర్ ఏడ్ లో కనబడే ఫ్లవర్స్ లాగ ఉండేవి దేవకాంచనాలు. (అవి తెలుపు, లేవెండర్, గోధుమ రంగుల్లో ఉన్న చెట్లు చూసాను నేను. ఇంకా రంగులు ఉన్నాయేమో తెలీదు.) మా ఇంట్లోని దేవకాంచన వృక్షం తెల్లటి తెలుపు పులు పూసేవి. అందుకని మేము వాటిని "డ్రీమ్ ఫ్లవర్స్" అనేవాళ్లం. ఇక పనిమనిషి లక్ష్మి వస్తునే మిగిలిన పువ్వులన్నీ పూజకు కోసి తెచ్చాకా, అవి ఇంట్లోని నాలుగు వాటాలవాళ్లకు పంచబడేవి. సన్నజాజులు మాత్రం నేనక్కడ ఉన్నన్ని సాయంత్రాలు నా జడల్లోకే. మంచినీళ్లకు ఎవరొస్తేవాళ్ళు వాళ్ల వాటా తాలుకు పూలు పట్టుకెళ్ళేవారు. ఇంటివాళ్లం మనమే కదా అన్ని పూలూ మనమే వాడుకోవచ్చు కదా అనడిగేదాన్ని నేను. వాళ్ళూ దేవుడికి పెడితే మంచిదే కదా అనేది మామ్మయ్య. సాయంత్రాలు రెండ్రోజులకోసారి ఎరుపు, పసుపచ్చా రంగుల్లో పూసిన కనకాంబరాలు, దోడ్లో పెరిగిన మరువమో, ధవనమో కలిపి అమ్మ దండ కడితే రెండు జడలకీ వంతెనలాగ అటు నుంచి ఇటు వచ్చేలా నా జెడల్లో కట్టిన దండ పెట్టేది అమ్మ.

డాబా మీదకు వెళ్ళి, సన్షేడ్ మీదకు దిగి మరీ దొరికినన్ని సన్నజాజులు కోసుకు రావటం నా సాయంత్రపు దినచర్య. ఆల్రెడీ జళ్ళో కనకాంబరం దండ ఉంటే అవి రేప్పొద్దున్నకి ఫ్రిజ్ లో దాచేవాళ్ళు. తరువాత ఆకు సంపెంగ చెట్ల చుట్టూ తిరిగి వాసనబట్టి పువ్వులు ఎక్కడ ఉన్నాయో చూసి, ఇవాళ విడుస్తాయనిపించిన పూలు కోసి నీళ్లల్లో వేయటం ఓ పని. ఆ తర్వాత అన్నయ్యను నిచ్చెన వేయించి సింహాచలం సంపెంగ చెట్టు ఎక్కించి అందుబాటులో ఉన్న పూలన్నీ కోయించటం. "పువ్వుల కోసం నువ్వడగటం వాడెక్కటం బాగానే ఉంది" అని పెద్దవాళ్లు మందలించటం సరదాగా ఉండేది. ఆరు ఏడు అయ్యాక సాయంత్రమే కోసి నీటిలో వేసి మూత పెట్టిన ఆకు సంపెంగలు వంటింట్లోకి వెళ్తూనే గుప్పుమనేవి. రోజూ ఏడెనిమిది పూల దాకా పూసేవి ఆకుపచ్చ సంపెంగలు.

అలా శెలవులకు ఊరెళ్లినప్పుడల్లా నన్ను పలకరించే రకరకాల పూలన్నీ మామ్మయ్య ప్రేమగా పెంచినవే. తన చేత్తో వేస్తే ఏ మొక్క అయినా, కొమ్మ అయినా బ్రతికేది. పూల మొక్కలే కాక దబ్బకాయ, జామ, పనస, అరటి మొదలైన పెద్ద చెట్లు కూడా తన సంరక్షణలో పెరిగేవి. మామ్మయ్య పోయిన తరువాత తనను వీడి ఉండలేనట్లుగా తను పెంచిన దొడ్లోని చెట్లన్నీ చాలా వరకూ వాడి ఎండిపోయాయి. మామ్మయ్యకూ మొక్కలకీ ఉన్న ఆ అనుబంధం ఎంతో అపురూపమైనది..చిత్రమైనది. ఆ తోట, ఆ ఇల్లు, పూలు ఇప్పుడు లేకపోయినా తలచినప్పుడల్లా ఇప్పటికీ చుట్టుముట్టే ఈ జ్ఞాపకాల పూలన్నీ మనసులో పరిమళాలను వెదజల్లుతూనే ఉంటాయి.


Saturday, February 26, 2011

కుంపటి


"కుంపటి". నాకు భలే ఇష్టమైన వస్తువుల్లో ఒకటి. పైన ఫోటోలోది మొన్న అమ్మ దగ్గర నుంచి నేను తెచ్చుకున్న బుజ్జి కుంపటి.కుంపటి పై ఉన్న ఆ ట్రయాంగిల్ చట్రం గిన్నె నిలబడటానికి వాడేది. దీనితో నాకు బోలెడు జ్ఞాపకాలు ఉన్నాయి. మా ఇంట్లో పెద్దది, చిన్నది రెండు కుంపటిలు ఉండేవి. గ్యాస్ స్టౌ మీద వంట చేసినా కూడా కిరోసిన్ స్టవ్, బాయిలర్ స్నానానికి నీళ్ళు కాచేందుకు, కొన్ని పదార్ధాలు చేసేందుకు కుంపటి వాడేది అమ్మ. వంకాయ కాల్చి పచ్చడి చేయటానికీ, తేగలు కాల్చటానికీ, మొక్కజొన్నపొత్తులు కాల్చటానికీ వాడేది. దోసకాయ కూడా కుంపటి మీద కాల్చి పచ్చడి చేస్తారని విన్నాను. అరటికాయ కాల్చి పొడి కూర కూడా చేస్తారు. ఇలా రకరకాలుగా కుంపటి వాడుతూండేది అమ్మ.

మాఘమాసంలో గుండ్రని ఇత్తడిగిన్నెలో పాలు,బియ్యం వేసి కుంపటి మీద అమ్మ చేసే అన్నం పరమాన్నం ఎప్పుడు నైవేద్యం పెడుతుందా అని ఎదురు చూసేదాన్ని...త్వరగా తినేయటానికి. చిక్కుడు కాయలకు పుల్లలు గుచ్చి రథంలా తయారుచేసి, చిక్కుడాకుల మీద వండిన పరమాన్నం పెట్టి నైవేద్యం పెట్టాకా తినటానికి ఇచ్చేది...ఆ రుచే రుచి. గ్యాస్ స్టౌ మీద అన్నం పరమాన్నం చేసినా కుంపటి మీద అమ్మ వండిన ఆ రుచి రాదు. ఇంకా ఉల్లిపాయలు కాల్చి పెట్టేది కుంపటి మీద. గోంగూర పచ్చడి చేసుకుని, కుంపటి మీడ కాల్చిన ఉల్లిపాయలు నంచుకుని తింటే ఉంటుందీ...ఆహా ఏమి రుచీ అని పాడుకోవాల్సిందే.


ఏదైనా చేసే ముందు కుంపటి వెలిగించే డ్యూటీ నాకిచ్చేది అమ్మ. బొగ్గులు వేసి, కాస్తంత కిరసనాయిలు పోసి, కాగితం ముక్కలూ అవీ వేసి కుంపటి వెలిగించి, విసనకర్రతో బొగ్గులు మండేలా చేయటం ఎంత కష్టమైన పనో అసలు. అయినా సరదా కొద్దీ ఎప్పుడూ ఆ పని తమ్ముడికి ఇవ్వకుండా నేనే చేసేదాన్ని. మధ్యలో ఆరిపోతూ ఉండే బొగ్గుల్ని మళ్ళీ మండించటం కూడా ఓ పెద్ద పనే. చాలా రోజుల్నుంచీ అమ్మ దగ్గర నుంచి కుంపటి తెచ్చుకోవాలని. ఇన్నాళ్ళకు కుదిరింది. ఇనుము ఊరికే తీసుకోకూడదని కాస్తంత డబ్బులు ఇచ్చి, అటక పైకెక్కి వెతుక్కుని మరీ అమ్మ దగ్గర నుంచి (పెద్దది అమ్మకు ఉంచేసి)ఈ బుజ్జి కుంపటి తెచ్చుకున్నాను. "తాతా చూడు, బయటవాళ్ళకు ఇచ్చినట్లు అమ్మ అమ్మమ్మకు డబ్బులు ఇస్తోంది" అని మా అమ్మాయి నవ్వు. ప్రస్తుతం బొగ్గులు, కిరసనాయిలు సంపాదించే మార్గం చూడాలి. వీధి చివరి ఇస్త్రీ వాళ్ళని అడిగితే ఇస్తారేమో మరి.

"స్వర్ణకమలం"లో "ఇదేంటి సార్, మీ మొహం ఇలా కుంపట్లో కాలిన కుమ్మొంకాయలాగ అయిపోయింది" డైలాగ్, మొన్న మొన్నటి "అష్టాచెమ్మా" సినిమాలో తనికెళ్ళభరణిగారు స్వయంగా కుంపటిపై వంకాయ కాల్చి పచ్చడి చేసే సీన్ మర్చిపోగలమా? గ్యాస్ స్టౌ లు, కనీసం కిరసనాయిలు స్టౌ లు కూడా లేని పూర్వం మన అమ్మమ్మలు, బామ్మలూ మరి అద్భుతమైన వంటలన్నీ ఈ కుంపటి పైనే చేసేవారు. అంతటి ప్రశస్తమైన చరిత్ర కలిగిందీ కుంపటి. ఐదు నిమిషాల్లో కుక్కర్ కూత రాకపోతే గాభరా పడే మనం అసలు వాళ్ళు అలా ఎలా వండేవారా అని వండరవ్వక మానం. తల్చుకుంటే అమ్మో అనిపిస్తుంది. ఓర్పూ, సహనం అనేవి ఇలా నెమ్మదిగా కుంపటిపై వండటం వల్లనే వాళ్ళకి అలవడేవేమో అని నాకో అనుమానం. అసలు ఇప్పటికీ ప్రతీ ఇంట్లోనూ ఒక కుంపటి ఉండాలని నా అబిప్రాయం. ఏమంటారు?

Wednesday, January 12, 2011

గాలిపటాలు



ఊరినిండా అడుగడుగునా అమ్మకానికి పెట్టిన గాలిపటాలను చూస్తూంటే "స్నేహం" సినిమాలోని "ఎగరేసిన గాలిపటాలు"పాట గుర్తుకు వచ్చింది.ఆ పాటలోని కొన్ని వాక్యాలు...

"ఎగరేసిన గాలిపటాలు...
దసరాలో పువ్వుల బాణం..
దీపావళి బాణా సంచా..
నులివెచ్చని భోగిమంటా..

చిన్ననాటి ఆనవాళ్ళు
స్నేహంలో మైలురాళ్ళు
చిన్నప్పటి ఆనందాలు
చిగురించిన మందారాలు...."

పి.బి.శ్రీనివాస్ పాడిన ఈ పాట ఎన్నో చిన్ననాటి జ్ఞాపకాలని తట్టిలేపుతుంది. నాకు గాలిపటాలంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు మా ఇంటిపక్కన ఉండే మా కన్నా పెద్ద పిల్లలు గాలిపటాలు ఎగరేస్తూంటే అదేదో 8th wonder లాగ చూసేవాళ్ళం. అసలు నలుపలకలుగా ఉన్న ఆ కాగితం అలా గాల్లో అంత ఎత్తుకి ఎలా వెళ్తుంది అని ఆశ్చర్యం కలిగేది. ఎగరేస్తు దూరంగా ఉన్న గాలిపటాలతో పోటీ పడటం, ఒకళ్ళని చూసి ఒకళ్ళు గాలిపటాలను ఇంకా ఇంకా ఎత్తుకు ఎగరేసుకోవటాలు, పడగొట్టడాలూ భలేగా ఉండేది. మధ్య మధ్య ఆ పిల్లలు దారం పట్టుకొమ్మని చెప్పి ఏదో పని మీద వెళ్ళివచ్చేవారు. మహాప్రసాదం లాగ ఆ దారన్ని అతి జాగ్రత్తగా పట్టుకుని, ఆ గాలిపటం దగ్గర్లో ఎగిరే మరే గాలిపటానికీ చిక్కకుండా వెళ్ళినవాళ్ళు వచ్చేదాకా కాసేపన్నా గాలిపటాన్ని ఎగరవేయటం గొప్ప థ్రిల్ గా ఉండేది. అలా కాసేపు గాలిపటాన్ని పట్టుకోవటం కోసం పెద్దపిల్లలందరూ గాలిపటం ఎగరేస్తున్నంత సేపూ అక్కడే నిలబడి చూస్తూ ఉండేవాళ్ళం..ఓ సారివ్వవా? అని అడుగుతూ...అదో మధురమైన జ్ఞాపకం.

గాలిపటం ఎగరేయటం నేర్పమంటే, "చిన్నపిల్లలు మీకు రాదు" అనేసేవారు వాళ్ళు. ఉక్రోషం వచ్చి నేనూ,మా తమ్ముడూ కలిసి గాలిపటం కొనుక్కొచ్చి మేడ మీదకి వెళ్ళి, ఒకళ్ళం దారాన్ని పట్టుకుంటే ఒకళ్ళం గాలిపటం పట్టుకుని దూరంగా పరిగెత్తుకువెళ్ళి దాన్ని ఎగరేయటానికి ప్రయత్నించేవాళ్ళం. కాస్త ఎగిరేది. క్రింద పడిపోయేది. కొన్ని కాస్త దూరం ఎగిరి ఏ చెట్టు కొమ్మకో చిక్కుకుని చిరిగిపోయేవి. అలా గాలిపటాన్ని ఎగరేయాలన్న కోరిక కోరికలాగే ఉండిపోయింది. అన్నయ్యకూ ,తమ్ముడికీ కూడా రాదు ఇప్పటికీ. పెళ్ళయ్యాకా మావారు, మా మరిది ఇద్దరూ గాలిపటాలు ఎగురవేయటంలో ఎక్స్పర్టులు అని తెలిసి చాలా సంతోషించాను. ఇంట్లో పాత సామానుల్లో గాలిపటాల దారాలు అవీ చూసి సంబరపడిపోయేదాన్ని. కానీ కొన్ని కారణాలవల్ల చాలా ఏళ్ళు గాలిపటాలు ఎగరేయటం మాకు కుదరనే లేదు. క్రితం ఏడు మా పాప వీధుల్లో అమ్ముతున్న గాలిపటాలను చూసి కావాలని మారాం చేసింది. కొనిపెట్టాం. వాళ్ళిద్దరూ మేడ మీదకు వెళ్ళి ఎగరేసుకుని వచ్చారు. కానీ ఏవో పనుల్లో ఉండి నాకు వెళ్ళి చూడటం కుదరనేలేదు. పనయ్యి నేను పైకి వెళ్దామని బయల్దేరేలోపూ వాళ్ళు క్రిందకు వచ్చేసారు.

ఈసారి మళ్ళీ పాప గాలిపటాలు కొనమని గొడవచేస్తూంటే ఈ చిన్నప్పటి ఊసులన్నీ గుర్తుకొచ్చాయి. ఈసారి ఏమైనాసరే గాలిపటాన్ని స్వయంగా ఎగరేయాలని పట్టుదలగా ఉంది. మరి ఏమౌతుందో చూడాలి..
ప్రతి ఏడూ గుజరాత్ లో ఇంటర్నేషనల్ కైట్స్ ఫెస్టివల్ జరుగుతుంది. ఈసారి కూడా 21st ఇంటర్నేషనల్ కైట్స్ ఫెస్టివల్ ఈ నెల తొమ్మిది నుండీ ఇవాళ్టివరకూ జరిగింది. గుజరాత్ అంతా టూరిస్ట్ లతో మహా సందడిగా ఉంటుంది ఈ సమయంలో. ఒక కైట్స్ ఫెస్టివల్ తాలూకూ క్లిప్పింగ్ చూడండి...రకరకాల గాలిపటాలు భలే అందంగా ఉన్నాయి ఈ వీడియోలో.



2010 లో జరిగిన 20th kites festival తాలూకూ వీడియో లింక్:
http://www.youtube.com/watch?v=6eWny8zBa8s&feature=fvw.


Thursday, January 6, 2011

తోటయ్య


పని మీద బయటకు వెళ్ళివస్తున్న నాకు మా సందు మొదట్లో సైకిల్ మీద భుజానికి కొబ్బరితాడుతోనో దేనితోనో తయారుచేసిన గుండ్రని బంధాలు రెండు తగిలించుకుని, నడుంకి కత్తి కట్టుకుని వెళ్తున్న ఒక వ్యక్తిని చూడగానే "తోటయ్య" గుర్తుకొచ్చాడు. కాకపోతే సైకిల్ అబ్బాయి సైకిల్కు కుండ కూడా వేళ్ళాడుతోంది. కాబట్టి ఇతను తాడిచెట్టో, ఈతచెట్టో ఎక్కి కల్లు తీసే మనిషై ఉంటాడు. మా తోటయ్య మత్రం కొబ్బరికాయలు తీసిపెట్టేవాడు. ఆ అవతారాన్ని పరికరాల్నీ చూడగానే నాకు "తోటయ్య" గుర్తుకొచ్చాడు. జీవితంలో అనుబంధం లేకపోయినా ఏళ్లతరబడి చూసిన కొందరు వ్యక్తులు అలా గుర్తుండిపోతారు.


కాకినాడలో మా ఇంటికి వెళ్ళినప్పుడల్లా నేను తరచూ చూస్తూండేదాన్ని తోటయ్యని. సన్నగా నల్లగా తలపాగాతో, పాతబడి నలిగి మాసిన తెల్ల పంచెతో ఓ పాత డొక్కు సైకిల్ మీద వస్తూండేవాడు. మేం వెళ్పోయే ముందు రోజు మా నాన్నమ్మ అతనికి కబురు పంపేది. "పాపగారూ, ఎప్పుడు వచ్చారు?" అని పలకరించేవాడు. అతను నవ్వగానే గారపట్టి అక్కడక్కడ ఊడిన పలువరస కనబడేది. కాస్త దగ్గరగా వెళ్తే చుట్ట కంపు కొట్టేది. మా దొడ్లో మూడు కొబ్బరు చెట్లు ఉండేవి. ఆ ఇల్లు అమ్మేదాకా మేం బయట కొబ్బరికాయలు కొని ఎరుగం. ఆ తరువాత చాలా రోజులు బయట కొట్లో కొబ్బరికాయ కొనటానికి మనసొప్పేది కాదు. ప్రతిసారీ మా సామానుతో పాటూ కొబ్బరికాయలతో నిండిన పెద్ద సంచీ కూడా మాతో ప్రయాణం చేసేది సర్కార్ ఎక్స్ ప్రెస్ లో.


ఇంతకీ తోటయ్య సందులోంచి దొడ్లోకి వస్తూనే వేషం వేసేసుకునేవాడు. చొక్కా తీసేసి, పంచె కాళ్లకూ, నడుంకీ బంధాలు తగిలించుకుని(కొబ్బరిపీచుతోనో దేనితోనో చేస్తారేమో మరి..వాటిని బంధాలని అనేవారు) చెట్టు ఎక్కటం మొదలెట్టేవాడు. పైన ఫోటోలో మనిషి కాళ్ళకి వేసుకున్నలాంటిదే ఇంకా మందంగా ఉన్నవి భుజాన తెచ్చుకుని, ఒకటి నడుముకీ, ఒకటి కాళ్ళకీ వేసుకుని కొబ్బరిచెట్టేక్కేవాడు మా తోటయ్య. స్పైడర్ మేన్ లాగ చెక చెకా చెట్లు ఎక్కుతున్న అతన్ని వింతగా చూసేవాళ్లం ఎక్కిన ప్రతిసారీ. "లోపలికి వెళ్లండి కాయలు మీద పడతాయి" అని నాన్నమ్మ కసురుతూంటే దొడ్డిగుమ్మం కటకటాలు దగ్గర నిలబడి చూస్తూండేవాళ్లం. పడిపోకుండా అలా ఎలా ఎక్కుతాడు? అని భలే ఆశ్చర్యం వేసేది. "ఇలా ఎక్కటం ఎక్కడ నేర్చుకున్నావు తోటయ్యా?" అని అడిగితే "భలేవారే పాపగారు" అని నవ్వేసేవాడు. మేం పెద్దయ్యాకా కూడా వెళ్ళినప్పుడల్లా కొబ్బరికాయలు దింపేవాడు తోటయ్య. పెద్దరికం మీదపడిన ఆనవాళ్ళు, ముడతలు బడిన చర్మం, మరింత సన్నబడిన శరీరం...ఎలా ఉన్నా ఎప్పుడూ అదే స్పీడ్, మార్పు లేని ఆ ఎక్కే పద్ధతి నన్ను అబ్బురపరిచేవి.


ఎన్ని మార్లు కాయలు ఉంటాయి? పనేం లేదు.వెళ్పో...అస్తమానూ వచ్చేస్తున్నాడు డబ్బులు వస్తాయి కదా అని ఒకోసారి నాన్నమ్మ విసుక్కునేది. అయినా వెళ్పోకుండా డొక్కలేమన్నా కొట్టాలేమో చూడండి...అనేవాడు. ఎండిన మట్టలు అవీ కొట్టించి, దొడ్లో ఇంకేమన్నా పని ఉంటే చేయించుకుని పాత చొక్కాలూ,పాంట్లూ, నాలుగు డబ్బులిచ్చి పంపేసేది నాన్నమ్మ. పోనీలే పాపం అని నేను తృప్తి పడేదాన్ని. ఖాళీ చేతులతో అతన్ని పంపటం నాకేకాదు నాన్నమ్మకీ నచ్చేది కాదు. వేసంకాలం శెలవుల్లో అయితే బొండాలు దింపి పెట్టేవాడు. చివర చివరలో చూపు సరిగ్గా ఆనేది కాదు. అయినా వచ్చేవాడు. కాయలు కోసేవాడు. అప్పటికే పెద్దవాడు.. తోటయ్య ఇప్పుడు ఈ భూమి మీద లేడేమో కూడా...! రోడ్డుపై ఇలా భుజాన బంధాలు తగిలించుకుని, నడుంకి కత్తి కట్టుకుని వెళ్ళే ఎవర్ని చూసినా తోటయ్యే గుర్తుకొస్తాడు...ఇవాళ్టిలాగే.


ఇలా కాకినాడతో అనుబంధం గుర్తుచేసే వ్యక్తుల గుర్తించి చెప్పాలంటే ఎందరో ఉన్నారు. సామర్లకోట నుంచి ప్రతి నెలా పప్పునూనె తెచ్చిపెట్టే అబ్బాయి, రోజూ సైకిల్ బండి మీద కూరలు తెచ్చి రోజూ దెబ్బలాడుతూనే కూరలు ఇచ్చివెళ్ళే కూరలబ్బాయి, ఆ ఇల్లు కొన్నప్పటినుంచీ, మేం పుట్టి పెరిగి పెళ్ళిళ్ళయి, మళ్ళీ ఆ ఇల్లు అమ్మేదాకా మా ఇంట్లో పని చేసిన పనమ్మాయి లక్ష్మి, ఏ కరంట్ రిపేరు పనులొచ్చినా వచ్చే ఆస్థాన కరంటబ్బాయి...ఎందరో..!!


ఈ క్రింద వీడియోలో కొబ్బరిచెట్టేక్కుతున్న మనిషిని చూడండి.

Saturday, December 25, 2010

"క్రిస్మస్ జ్ఞాపకాలు "


"క్రిస్మస్" ఈ పేరుతో నాకున్న అనుబంధం ఎన్నో జ్ఞాపకాలను తట్టి లేపుతుంది. నేను ఏడవతరగతి దాకా చదివినది ఒక క్రిస్టియన్ స్కూల్లో. కొందరు స్నేహితులు, టీచర్స్ క్రిస్టియన్స్ అవటంతో ప్రతి ఏటా ఎవరో ఒకరి క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో పాల్గొనే అవకాశం వస్తూ ఉండేది. ఆ తరువాత కాలేజీ కూడా విజయవాడలోని మారిస్టెల్లా, (నాకు చాలా ఇష్టమైన కాలేజీ) అవటంతో "క్రిస్మస్" బాగా ఆత్మీయమైన పండుగ అయిపోయింది నాకు.

స్కూల్లో ఉండగా మా సందుకి రెండు సందుల అవతల ఒక క్రిస్టియన్ స్నేహితురాలి ఇల్లు ఉండేది. క్రిస్మస్ రోజు నాకు ప్రత్యేక ఆహ్వానం ఉండేది. నేను ఆ పార్టీ ఎప్పుడూ మిస్సయ్యేదాన్ని కాదు. ఎందుకంటే ఆ రోజున వాళ్ళ ఇంట్లో తయారయ్యే స్పెషల్ కేక్ అంటే నాకు చాలా ఇష్టం ఉండేది. స్వతహాగా స్వీట్స్ అంటే ఇష్టం ఉండటం వల్ల కేక్ అంటే కూడా భలే ఇష్టం ఉండేది నాకు. వాళ్ళింట్లో కేక్ తిని వచ్చి మా ఇంట్లో కేక్ ప్రయోగాలు చేసేదాన్ని. స్పాంజ్ కేక్, ఎగ్ లెస్ కేక్, ఫ్రూట్ కేక్ అంటూ రకరకల కేక్స్ ప్రయత్నించేదాన్ని. కాస్త వంటగత్తెనే కాబట్టి ప్రయోగాలు బానే వచ్చేవి కూడా. అమ్మ మాత్రం గిన్నెలు, ఇల్లూ వాకిలీ ఎగ్ కంపు అని గోలపెట్టేది.

ఇక మిత్రుల కోసం క్రిస్మస్ గ్రీటింగ్స్ స్వయంగా తయారు చేయటం ఒక సరదా. అదవ్వగానే న్యూ ఇయర్ కోసం. క్రిస్టియన్స్ న్యూ ఇయర్ కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎంతైనా స్వహస్తాలతో మిత్రులకు ఏదైనా చేసివ్వటం ఎంతో తృప్తిని ఇస్తుంది. నాన్న అయితే మేం సరదా పడుతున్నామని స్టార్ కూడా కొని తెచ్చేవారు. మేం అది ఇంటి ముందు పెట్టుకుంటే ఇంటివైపు వచ్చిన మిత్రులు మీరు క్రిస్టియన్సా? అని అడిగేవారు. కాదు సరదాకు పెట్టుకున్నాం అంటే వింతగా చూసేవారు. అవన్నీ కాక కాలేజీరోజుల్లో నాకు అందరికాన్నా దగ్గరైపోయిన నా ప్రియనేస్తం ఒకమ్మాయి చదువయ్యాకా ఒక క్రిస్టియన్ ను మేరేజ్ చేసుకుంది. నా కుటుంబం తరువాత నాకత్యంత సన్నిహితురాలు తనే. కానీ విచిత్రం ఏమిటంటే ప్రత్యేక కారణాలు లేకపోయినా జీవనయానంలో యాంత్రికమైపోయిన పరుగుపందాల్లో తను నాకు చాలా దూరంగా వెళ్లిపోయింది తను. అయినా ఇప్పటికీ తనకు క్రిస్మస్ గ్రీటింగ్స్ పంపిస్తూనే ఉంటాను. "where is the time to hate, when there is so little time to love" అన్న పాటలోని మాటలు నేను నమ్ముతాను. నాకు తను ఎప్పటికీ ప్రియమైన నేస్తమే. "our sweetest songs are those that tell saddest thoughts.." అని ప్రఖ్యాత ఆంగ్లకవి షెల్లీ అన్నట్లు బాధాకరమైనవైనా కొన్ని స్మృతులు ఎప్పటికీ మధురంగానే ఉంటాయి.


ఇక ఏ ఊళ్ళో ఎక్కడ ఉన్నా ప్రతిఏడూ మా ఇంట్లో మాకు పరిచయం ఉన్న క్రిస్టియన్ మిత్రులందరికీ ఫొన్లు చేసి క్రిస్మస్ గ్రీటింగ్స్ చెప్తూంటాం నాన్న, నేను. ఇంతే కాక ఈ రోజున నా మరో క్లోజ్ ఫ్రెండ్ "రూప" పుట్టినరోజు. తన గురించి నేను క్రిందటేడు రాసిన టపా "ఇక్కడ".ఇక ఇప్పుడు బ్లాగ్లోకంలోకి వచ్చాకా పరిచయమై అభిమానంతో ఆప్తుడైన తమ్ముడు చైతన్య పుట్టినరోజు కూడా ఇవాళే. ఇద్దరికీ బ్లాగ్ముఖంగా "పుట్టినరోజు శుభాకాంక్షలు".

Monday, December 6, 2010

బినాకా బొమ్మలు


నేను ఇల్లు సర్దుకుంటూంటే మా అమ్మాయికి ఒక డబ్బా దొరికింది. అమ్మా ఇవి బాగున్నాయి నాకిచ్చేయ్ అని గొడవ. దాని చేతిలోంచి అవి లాక్కుని దాచేసరికీ తల ప్రాణం తోక్కొచ్చింది. నాన్న పదిలంగా దాచుకున్నవి నేను జాతీయం చేసేసాను. ఇప్పుడు నా కూతురు నా నుంచి లాక్కోవాలని చూస్తోంది...ఇదే చిత్రం అంటే...:) అవే పైన ఫోటోలోని బినాకా బొమ్మలు. ఒకానొకప్పుడు "బినాకా టూత్ పేస్ట్" వచ్చేది కదా. ఆ టూత్ పేస్ట్ పెట్టే కొన్నప్పుడల్లా ఒక బొమ్మ ఇచ్చేవాడట. ప్రతి నెలా అట్టపెట్టె లో ఏ బొమ్మ ఉంటుందా అని ఆసక్తిగా ఆత్రంగా కేవలం ఆ బొమ్మల కోసమే ఆ టూత్ పేస్ట్ కొనేవారట నాన్న. ఇప్పటికీ రంగు తగ్గకుండా ఎంత బాగున్నాయో.


ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఈ చిన్న చిన్న బొమ్మలకు ముందు అయితే క్రింద ఫోటోలోలాగ గోడకో, అద్దానికీ, తలుపుకో అంటించుకునేలాగ కొన్ని బొమ్మలు ఇచ్చేవాడట. నాన్న అద్దానికి అంటించిన ఈ క్రింది లేడిపిల్ల బొమ్మను చూడండి..ఈ బొమ్మ వయసు సుమారు ముఫ్ఫై ఏళ్ళ పైమాటే.


ఇవికాక చిన్న చిన్న ప్లాస్టిక్ జంతువుల బొమ్మలు కూడా కొన్నాళ్ళు ఇచ్చారు బినాకావాళ్ళు. అవయితే పెద్ద పెట్టే నిండుగానే ఉన్నాయి. వాటితో ఏదో తయారు చేద్దామని దాచాను. ఇంతవరకూ చెయ్యనే లేదు. అవి అమ్మ దగ్గరే భద్రంగా ఉన్నాయి. "బినాకా" పేరును "సిబాకా" కూడా చేసారు కొన్నాళ్ళు. తరువాత ఆ పేస్ట్ రావటం మానేసింది.


అప్పటి రోజుల్లో సిలోన్ రేడియో స్టేషన్లో అమీన్ సయ్యానీ గొంతులో బినాకావాళ్ళు స్పాన్సార్ చేసిన టాప్ హిందీ పాటల కౌంట్ డౌన్ షో "బినాకా గీత్మాలా" వినని సంగీత ప్రేమికులు ఉండరు అనటం అతిశయోక్తి కాదు. నేను సిలోన్ స్టేషన్లో బినాక గీత్మాలా వినటం మొదలెట్టాకా ఒక డైరీలో ఆ పాటలు నోట్ చేసేదాన్ని కూడా. స్టేషన్ సరిగ్గా పలకకపోయినా ట్రాన్సిస్టర్ చెవికి ఆనించుకుని no.1 పాట ఏదవుతుందా అని చాలా ఉత్కంఠతతో ఎదురుచూసేదాన్ని...అదంతా ఓ జమానా...!!

Monday, September 27, 2010

ఆనాటి జ్ఞాపకాలు నా ఆనంద నిధులు...!!

చిన్ననాటి కబుర్లు ఎన్ని చెప్పుకున్నా తనివితీరదు. ఆనందాన్నిచ్చే మధురమైన జ్ఞాపకాలను తలుచుకున్న కొద్దీ మనసు పసిపాపలా మారిపోయి ఆ జ్ఞాపకాల దొంతరల్లో పరుగులు పెడుతుంది. జ్యోతిగారు "గుర్తుకొస్తున్నాయి.." అనే శీర్షికతో రాయమని అడిగినప్పుడు, చిన్నప్పటి జ్ఞాపకాల గురించి రాయాలని అనుకున్నా.. కానీ అన్నింటిలో వేటి గురించి రాయాలి...అని ఆలోచిస్తే దేన్నీ వదలాలనిపించలేదు. అందుకనే నా అందమైన జ్ఞాపకాల్లో ముఖ్యమైన కొన్నింటిని కలిపి ఇలా ఓ చోట పోగేసాను...

























గోదారిఒడ్డూ...జన్మనిచ్చిన రాజమండ్రీ...
తాతగారిల్లూ...పెద్ద గేటు
మెట్లమీదుగా రేకమాలతి పందిరి
జ్ఞాపకాల్లోనూ మత్తెక్కించే ఆ పూల పరిమళం
దొంగా పోలీస్ ఆటలు, పరుగులూ
పాపిడీ బండి, రిబ్బన్లబ్బాయ్...

విజయవాడ వీధులూ...సూర్యారావుపేట
భాస్కరమ్మగారిల్లు...పక్కింటి తాతగారూ...
పెరడు, మొక్కలు, పక్కింటి పిల్లలు
అడుకున్న ఆటలూ, గోడల మీద విన్యసాలు
చింతల్లేని చిన్నతనం...తిరిగిరాని అమాయకత్వం




















సర్కార్ ఎక్సప్రెస్...కాకినాడ ప్రయాణాలు
రామారావుపేట..శివాలయం ప్రదక్షిణాలు
తాతమ్మా,నానమ్మల కథలు కబుర్లు
అన్నయ్యతో షికార్లు...గాంధీపార్క్ సాయంత్రాలూ
దొడ్లో మొక్కలూ...సంపెంగిపువ్వులూ
సన్నజాజిమాలలు...గిన్నెమాలతి అందాలు
సొంత ఇల్లు అందం...మహారాణీ భోగం..
గేటు దగ్గరి నైట్ క్వీన్ పూల సుగంధం...


మన్ చాహేగీత్ పాటలూ...నాన్నతో ముచ్చట్లు
టేపులూ....రికార్డింగులూ...ఆకాశవాణి స్టూడియోలూ
నిర్వహించిన యువవాణి కార్యక్రమాలు...
చెప్పిన హిందీ పాఠాలూ...కవితలూ..
చిరు చిరు సంపాదనల విజయగర్వాలు




















మేరీస్టెల్లా, బాబాగుడి , ఐదవనెంబరు బస్ రూటు
ఆప్షన్స్, ప్రబోధా, ఆర్చీస్ గేలరీలు, గ్రీటింగు కలక్షన్లు
కాలేజీ స్నేహితులూ..చెప్పుకున్న ఊసులూ
పోస్ట్ మేన్ కోసం పడిగాపులూ...ఉత్తరాల పరంపర..
సినిమా సరదాలు...టికెట్ క్యూల్లో పడిగాపులు
తిరిగిన వీధులు...తిన్న ఐస్క్రీములు


నాన్న అవార్డులు...ఢిల్లీ ప్రయాణాలు
ఆయన సన్మానాలూ..పేపర్లో వార్తలు
నాన్న కూతురినన్న గర్వం
వెళ్ళిన ప్రతిచోటా మర్యాదల పర్వం





















పున్నమ్మతోట క్వార్టర్స్, డి-వన్ ఇల్లు 
పెంచిన పూదోటలూ, పండించిన కాయగూరలు
మెట్ల మీద కబుర్లూ, బేట్మెంటన్ ఆటలు..
న్యూ ఇయర్ సంబరాలు, సంక్రాంతి ముగ్గులూ
పిన్నల మన్ననలు, పెద్దల దివెనలూ
ఆనాటి జ్ఞాపకాలు నా ఆనంద నిధులు...!!



తలిచినప్పుడల్లా నిన్నటివా గత జన్మావా అనిపించే ఈ చిన్ననాటి స్మృతులు ఎన్నటికీ తరగని నా ఆనంద నిధులు. రాస్తున్నంత సేపూ మనసు ఈ జ్ఞాపకాల తరంగాల్లో ఉయ్యాలలూగింది. ఈ శీర్షికకు రాయటం ద్వారా నాకు లభించిన మధుర క్షణాల ఆనందానికి కారణమైన జ్యోతిగారికి కృతజ్ఞతలు. ఆలస్యమేమిటి...అందరూ ఓసారి అలా మీ మీ చిన్నతనంలోకి వెళ్ళి వచ్చి నాలా రిఫ్రెష్ అయిపోండి మరి...!!