సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, July 6, 2011

భాస్కరమ్మగారి ఇల్లు








నివాసానికి గవర్నమెంట్ క్వార్టర్స్ ఇచ్చేదాకా పదిహేనేళ్ళ పాటు విజయవాడ సూర్యారావుపేటలోనే ఉన్నాం మేము. విజయటాకీస్ ఎదురుగుండా రోడ్డులో ఎడమవైపు ఉండేది భాస్కరమ్మగారి ఇల్లు. ఇప్పుడు భాస్కరమ్మగారు లేరు. ప్రస్తుతం ఆ ఇల్లు కూడా ఏవో కోర్టు తగాదాల్లో ఉందని విన్నాను. అన్నయ్య పుట్టక ముందు అమ్మావాళ్ళు దిగిన ఆ ఇంట్లో నాకు పన్నెండేళ్ళు వచ్చేదాకా ఉన్నాం. ఆ ఇంటితో పెనవేసుకునున్న ఎన్నో జ్ఞాపకాలు ఈనాటికీ తాజాగా మనసును ఉత్తేజపరుస్తూ ఉంటాయి. మేం ఉన్నప్పుడు లైట్ ఆరెంజ్ కలర్లో ఉండే ఆ డాబా ఇంట్లో వీధివైపు రెండు పెద్ద వాటాలు, వెనుక పెరటివైపు రెండు చిన్న వాటాలు ఉండేవి. పైన అంతా భాస్కరమ్మగారు ఒక్కరే ఉండేవారు. పిల్లలు దూరాల్లో ఉండేవారు. తెల్లటి పంచె ముసుగేసుకుని కట్టుకుని ఉండే ఒక ముసలి మామ్మగారు పొద్దుటే వచ్చి భాస్కరమ్మగారికి వంట చేసి సాయంత్రాలు వేళ్పోతూ ఉండేవారు. అంత పెద్ద ఇంట్లో ఆవిడ ఒక్కరు భయం లేకుండా ఎలా ఉంటారా అని నాకు ఆశ్చర్యం వేసేది.

మా వాటా వైపు పొడువాటి సందు ఉండేది. రెండు కొబ్బరి చెట్లు, ఒక పెద్ద రేక నందివర్ధనం చెట్టు ఉండేవి. నందివర్ధనం చెట్టు ఎక్కటానికి వీలుగా ఉండేది. రోజూ పొద్దున్నే నేనో తమ్ముడో చెట్టేక్కి గోడ మీద కూచుని సజ్జ నిండా పూలు అమ్మకి కోసి ఇచ్చేవాళ్లం. మిగతా మట్టి ప్రదేశంలో అమ్మ కనకాంబరాలు, డిసెంబర్ పూలు, ముళ్ళ గోరింట పూలు, మెట్ట తామర.. మొదలైన పూలమొక్కలు, ఆకుకూరలు మొదలైనవి పెంచేది. మా ఇంటి గోడకూ, ఎదురుగుండా ఇంటికి మధ్య నాలుగైదు అడుగుల ఖాళీ స్థలం ఉండేది. అక్కడ పిచ్చి మొక్కలు, బోలెడు ఆముదం మొక్కలు, బొప్పాయి మొక్కలు ఉండేవి. పిచ్చుకలు, గోరింకలూ, అప్పుడప్పుడు కోయిలలు వచ్చి ఆ చెట్లపై వాలుతూ ఉండేవి. ఆముదం మొక్కల వల్ల ఎప్పుడూ నల్లని గొంగళీ పురుగులే. కొన్ని ఇంటి గోడమూలల్లో గూళ్ళు కట్టేసుకుని ఉండేవి. అవి సీతాకొకచిలుకలు అవుతాయని నాన్న చెప్తే ఆశ్చర్యం వేసేది. గొంగళీలతో పాటూ వర్షాకాలంలో గుంపులు గుంపులుగా ఎర్రని రోకలిబండలు తిరుగుతు ఉండేవి. పుట్టలు పుట్టలుగా ఎన్ని పుట్టేసేవో అవి. ఇక వర్షం వస్తే వీధి గుమ్మం దాకా మా వాటా వైపంతా నీళ్ళతో నిండిపోయేది కాలువలాగ. ఇంక ఆ బురదనీళ్ల కాలవ నీండా మేంవేసిన కాయితం పడవలే ఉండేవి. మా ఇంట్లోని చిన్నగదిలో ఎత్తుగా ఒక కిటికీ ఉండేది. ఆ కిటికీ గూట్లోకి ఎక్కితే కాళ్లు తన్నిపెట్టుకుని కూర్చోటానికి కుదిరేది. వాన వస్తూంటే సన్న తుంపరలు మీద పడేలా ఆ కిటికీలో కూర్చుని ఏదైనా పుస్తకం చదువుకోవటం నాకు చాలా ఇష్టంగా ఉండేది.

ఇంటి వెనుక వైపు చాలా పెద్ద పెరడు ఉండేది. అందులో ఓ పక్కగా పెద్ద సపోటా వృక్షం, దానికి చుట్టుకుని గురువింద గింజల తీగ ఉండేవి. ఎరుపు నలుపుల్లో ఉండే గురువింద గింజలు కోసుకుని దాచటం నా ముఖ్యమైన పనుల జాబితాలో ఉండేది. పెరటిలో సపోటా చెట్టునానుకుని డా.జంధ్యాల శంకర్ గారి ఇల్లు ఉండేది. అప్పుడప్పుడు పేరంటాలకు పిలిచేవాళ్ళు వాళ్ళు. వాళ్ళింట్లో పొడుగ్గా రెండు యూకలిప్టస్ చెట్లు ఉండేవి. ఒకటో రెండో ఆకులు అందుకుని వాసన చూస్తే భలేగా ఉండేది. (ఆ తర్వాత డా.శంకర్ గారు విజయవాడ మేయర్ గా కూడా చేసారు) మా వెనుక పెరడులో ఇంకా పారిజాతం, కర్వేపాకు, గోరింటాకు, రెండు మూడు గులాబీ చెట్లు ఉండేవి. అవికాక ఒక పక్క విరజాజి పందిరి, మరో పక్క సన్నజాజి పందిరి, వాటి మధ్యన రెండు మూడు మల్లె పొదలు(కోలవి, గుండ్రంటివి ఇలా మల్లెల్లో రకాలన్నమాట), ఒక కాగడా మల్లె పొద కూడా ఉండేవి. ఇవి కాక అద్దెకున్నవాళ్ళు పెంచుకునే మొక్కలు. ఇలాగ వెనుకవైపు పెరడులోకి వెళ్ళాడానికి చాలా ఆసక్తికరమైన సంగతులన్నీ ఉండేవి. అమ్మ ఎప్పుడు బయటకు వదులుతుందా అని మా వరండాలోని కటకటాలతలుపులు పట్టుకుని జైల్లో ఖైదీల్లాగ ఎదురు చూసేవాళ్ళం. అమ్మ తాళం తియ్యగానే పరుగున వెనుకవైపుకు వెళ్పోయి చీకటి పడేదాకా అక్కడే అడుకుంటూ గడిపేవాళ్లం.

పొరపాటున ఎవరి చెయ్యైనా చెట్ల మీద, పువ్వుల మీదా పడిందో పై నుండి ఎప్పుడు చూసేదో భాస్కరమ్మగారు ఒక్క కేక పెట్టేది..ఎవరదీ అని..! అన్ని పూలు పూసినా ఒక్క పువ్వు కూడా మా ఎవ్వరికీ ఇచ్చేది కాదు ఆవిడ. పొద్దుటే ఆవిడ పనిమనిషి వచ్చి అన్ని పువ్వులు కోసుకుని వెళ్ళిపోయేది. దేవుడికి పెట్టుకునేదో ఏమో...! నేను కొత్తిమీర వేస్తే మాత్రం కాస్త కొత్తిమీర కోసివ్వవే అని జబర్దస్తీ గా కోసేసుకునేది. నాకు ఒళ్ళు మండిపోయేది. పువ్వులు కోసుకోనివ్వకపోయినా నేనైతే ఎప్పుడూ ఆ చెట్ల చుట్టూ తిరుగుతూ ఉండేదాన్ని. ఆ పచ్చదనం నన్నెంతో ముగ్ధురాలిని చేసేది. మొక్కలన్నింటి మధ్యనా ఉండే మెత్తటి ఆకుపచ్చటి గడ్డి మొక్కలు కూడా నాకు అందంగా కనబడిపోయేవి. అలా మొక్కలతో నా సావాసం ఊహ తెలిసినప్పటి నుండీ ఏర్పడిపోయింది.






వీధివైపు ఉన్న రెండిటిలో ఒక వాటాలో మేము ఉండేవాళ్ళం. రెండోదాన్లో ఒక డాక్టర్ గారు ఉండేవారు. అవివాహితుడైన ఆయనతో ఆయన చెల్లెలు, ఆవిడ ముగ్గురు పిల్లలు ఉండేవారు. వారితో నామమాత్రపు పరిచయమే తప్ప మిగిలిన సంగతులు ఎక్కువ ఎవరికీ తెలియవు. మా వాటాలో వరండా, చిన్నగది, వంటిల్లు, హాలు,బెడ్రూము ఉండేవి. ఇంకా ఓ రెండు గదులు ఉంటే, అవి మాకు అనవసరం అని అద్దెకు ఇచ్చారు నాన్న. దాన్లో కొన్నేళ్ళు భట్టుమావయ్యగారు(పన్నాల సుబ్రహ్మణ్యభట్టుగారు) ఉన్నారు. తరువాత మేమున్నన్నాళ్ళు సూరిసేన్ మావయ్యగారు, వాళ్ళ తమ్ముడు శంకర్ గారు ఉండేవారు. ఇద్దరూ పెళ్ళిళ్ళు చేసుకోలేదెందుకో మరి. సూరిసేన్ మావయ్యగారికీ నాకూ భలే స్నేహం ఉండేది. ఆయన రేడియోలో క్రికెట్ కామెంటరీ వింటూంటే కావాలని కదిలిస్తూ, ఆయనతో ఆడుతూ..కబుర్లు చెప్తూ ఎప్పుడూ వాళ్ల రూంలోనే ఎక్కువ ఉండేదాన్ని. వీళ్ల రూంకే తరచూ సాయంత్రాలు ఉషశ్రీతాతగారు పలు మిత్రులను కలవటానికి వస్తూండేవారు.

మా వాటాసందు చివరగా చిన్న వీధి గుమ్మం ఉండేది. గుమ్మానికి పక్కగా రాధామనోహరలు తీగ అల్లుకుని ఉండేది. రాత్రయ్యేసరికీ లేత గులాబి,తెలుపు రంగుల్లో గుత్తులు గుత్తులుగా రాధామనోహరాలు విచ్చేవి. ఆ పరిమళం ఇంకా తలపుల్లో నన్ను పలకరిస్తూ ఉంటుంది. ఒకే తీగకు రెండు రంగుల్లో పులెలా పూస్తాయీ అని ఇప్పటికీ సందేహమే నాకు. సాయంత్రం ఆ పూలు విచ్చే సమయానికీ, పొద్దున్నే లేవగానే కాసేపు ఆ వీధి గుమ్మంలో కూచోపోతే నాకు తోచేది కాదు. పొద్దున్నే వీధి తుడిచేవాళ్ళు, అటువెళ్ళే బళ్లవాళ్ళు అందరూ ఓ చిరునవ్వుతో పలకరించేసేవారు. నిర్మలా కాన్వెంటు స్కూలు బస్సు మా ఇంటి ఎదురుగా ఆగేది. సూరిబాబుమావయ్యగారి పిల్లలు ఆ బస్సు ఎక్కటానికి రోజూ వచ్చి అక్కడ నిలబడేవారు. ఇప్పుడు వాళ్ళు సంగీత విద్వాంసులు "మల్లది బ్రదర్స్" గా మంచి పేరు తెచ్చుకున్నారు.

మా వెనుకవైపు రెండువాటాల్లో ఒకదాన్లో తాతగారు, అమ్మమ్మగారు, శ్రీనుమావయ్య, నాగమణక్క ఉండేవారు. తాతగారు నాకూ, మా తమ్ముడికీ కొబ్బరి ఆకులతో, తాటాకులతో బుట్టలు అవీ అల్లి ఇస్తూండేవారు. కొత్త కొత్త కబుర్లు ఎన్నో చెప్పేవారో. వాళ్ళబ్బాయి శ్రీనుమావయ్య మృదంగం నేర్చుకునేవాడు. రోజూ పొద్దుట సాయంత్రం సాధన చేస్తూండేవాడు. మేము కిటికీ ఎక్కి అబ్బురంగా చూస్తూండేవాళ్లం. నాగమణక్క కాలేజీలో చదువుతూ ఉండేది. అమ్మమ్మగారికి వినబడేది కాదు. చెవికి మిషన్ పెట్టుకునేవారు. కాలేజీ నుంచి రాగానే ఆ రోజు జరిగిన విశేషాలన్నీ గట్టిగా అమ్మమ్మగారికి చెబుతూ ఉండేది అక్క. అన్ని వాటాలవాళ్ళకీ వినబడేవి ఆ కబుర్లు. ఇక వెనుకవైపు మరోవాటాలో ఇంకో తాతగారు, అమ్మమ్మగారు వారి ఆరుగురు సంతానం ఉండేవారు. తాతగారికి నేనంటే వల్లమాలిన అభిమానం. ఆఫీసు నుండి రాగానే ఎంత రాత్రయినా నన్ను తీసుకురమ్మని బొజ్జపై పడుకోబెట్టుకుని బోలెడు కబుర్లు చెప్పేవారు. తెలుగు తిథులు,నెలలు, పద్యాలు,పాటలూ ఎన్నో నేర్పించేవారు. నా ఊహ తెలిసేసరికీ ఇరువైపుల తాతగార్లు లేకపోవటంతో ఈ తాతగారు బాగా దగ్గరైపోయారు. అమ్మ కూడా పిన్నిగారు,బాబయ్యగారు అని పిలిచేది వాళ్ళిద్దరినీ. ఎంతో అభిమానంగా ఉండేవాళ్ళం రెండు కుటుంబాలవాళ్ళమూ. కొన్నేళ్ళకు సొంత ఇల్లు కట్టుకుని వాళ్ళు వెళ్పోయారు వాళ్ళు. ఊళ్ళు మారినా, దూరాలు పెరిగినా ఇప్పటికీ ఆ అనుబంధం అలానే ఉంది. మా పాప పుట్టాకా తాతగారికి విజయవాడ తీసుకువెళ్ళి చూపించి వచ్చాను. తాతగారు కాలం చేసి ఏడాదిన్నర అయిపోతోంది అప్పుడే !!

తాతగారూవాళ్ళు ఖాళీ చేసాకా ఆ ఇంట్లోకి ఉషశ్రీగారి సహోదరులు పురాణపండ రంగనాథ్ గారు వచ్చారు. పిల్లలందరం కల్సి గోడలెక్కి దూకి..రకరకాల ఆటలు ఆడుకునేవాళ్ళం. శెలవుల్లో ఎండిన కొమ్మలు విరిచి బాణాలు చేసుకునేవాళ్ళం. రంగనాథ్ మావయ్యగారు అమ్మవారి ఉపాసకులు. దసరా పూజలు ఎంతబాగా చేసేవారో. విజయవాడలో ఉన్నన్నాళ్ళు ఎక్కడ ఉన్నా నవరాత్రుల్లో వాళ్ళింటికి వెళ్ళేవాళ్ళం. భాస్కరమ్మగారు "ఇల్లు బాగుచేయించాలి.." ఖాళీ చెయ్యమంటే అన్ని వాటాలవాళ్ళమూ ఒకేసారి ఆ ఇంట్లోంచి కదిలాము. అప్పటికి నాకు పన్నెండేళ్ళు. ప్రపంచం తెలీని బాల్యపు అమాయకత్వం, చలాకీతనం, అరమరికలు లేని స్నేహాలు, పచ్చదనంతో సావాసం...మరువలేనివి. ఆ రోజులు గుర్తుకు వస్తే...ఒక అద్భుతలోకంతో బాంధవ్యం అప్పటితో తెగిపోయింది అనిపిస్తూ ఉంటుంది నాకు. ఈ మధురస్మృతులన్నింటినీ ఒకచోట పోగేసి దాచుకోవాలన్న ఆలోచనే ఈ టపా.


27 comments:

SHANKAR.S said...

మొక్కలో.... మొక్కలు...బోలెడన్ని మొక్కలు. టపా అంతా వర్షాకాలపు తోటలా ఉంది. :)). అదిగో మీకు కోపం వస్తోంది...వస్తోంది....వచ్చేసింది....

"మిగతా మట్టి ప్రదేశంలో అమ్మ కనకాంబరాలు, డిసెంబర్ పూలు, ముళ్ళ గోరింట పూలు, మెట్ట తామర.. మొదలైన పూలమొక్కలు, ఆకుకూరలు మొదలైనవి పెంచేది."

ఇప్పుడర్ధమయిందండీ మీకు ఈ ఇష్టం ఎక్కడనుంచి వచ్చిందో. :))

"మా వాటా వైపంతా నీళ్ళతో నిండిపోయేది కాలువలాగ. ఇంక ఆ బురదనీళ్ల కాలవ నీండా మేంవేసిన కాయితం పడవలే ఉండేవి."

చిన్నప్పుడు మేము అద్దెకుండే వాటాలో కూడా ఇలాంటి సీనే. న్యూస్ పేపర్లు చింపి పే....ద్ద పడవలు చేసుకోవడం, కోటిపల్లి రేవులో లాంచీల్ని చూసిన స్ఫూర్తి తో ఆ కాగితం పడవల మీద స్కెచ్ పెన్ తో మా పేర్లు రాసుకుని మరీ వదలడం. ఒక్కసారి కళ్ళ ముందు రీలు తిరిగాయి.

"మా వెనుకవైపు రెండువాటాల్లో ఒకదాన్లో తాతగారు, అమ్మమ్మగారు, శ్రీనుమావయ్య, నాగమణక్క ఉండేవారు."

నిజమేనండీ అప్పట్లో పక్కింటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళని అత్తయ్యగారు, మావయ్య గారు అనీ ముసలివాళ్ళయితే తాతగారు, మామ్మగారు అనీ, ఆ ఇళ్ళలో పిల్లలు మనకన్నా పెద్దవాళ్ళు అయితే అన్నయ్య , అక్క అనీ ఇలా వరసలతోనే పిలిచే వాళ్ళం. ఇప్పుడు ఎవరైనా "ఆంటీ", "అంకుల్" అంతే. మెకానికల్ పిలుపులు.

మొత్తం మీద భాస్కరమ్మ గారి ఇల్లు కళ్ళముందు ఉంచారు.

నైమిష్ said...

త్రుష్ణ గారు మీ పొస్ట్ చూసి ఆ ఇంటి ఫోటో కూడా జత చేశారేమో అనుకుంటూ , పోస్టులో ఎక్కడా ఆ జాడ లేక పొయేసరికి నిరుత్సాహం వేసింది.. అయితే టపా మొత్తం చదివాక మీ ఇంటి ద్రుశ్యరూపం అలా కళ్ళ ముందు ఉంది..మీ ఙ్ఞాపక శక్తి కి hats off..ఎన్ని మొక్కలు ఎన్ని పూవులు ...ఎలా గుర్తు పేట్టుకోగలిగారు..నాకు "రోకటి బండలు" అంటే అర్థం కాలేదు..తూనీగలా??

Saahitya Abhimaani said...

అద్భుతంగా ఉన్నాయి మీ జ్ఞాపకాలు. ఇవ్వాళ అటువంటి ఇళ్ళూ లేవు, అటువంటి మనుషులూ లేరు.

Indira said...

dear thrishna,manavajeevitam lo nijamga ati madhuramainadi balyame kada!koumudi magazine cover page meeda kiranprabha gari kavita lo tirgoste bagundunane aa rojulu,batukanta nato nadichoche nijamaina nestalu ani rasaru.enta bagundi!mee post chooste adi gurtukochindi.

Rao S Lakkaraju said...

వాల్తేరులో యునివర్సిటి కి వెళ్తూ విజయవాడ సూర్యారావు పేటలో అక్కయ్యా వాళ్ళ ఇంట్లో ఆగే వాణ్ని. ప్రతీ సంవత్సరం బంగినపల్లి మామిడిపళ్ళు మొదట అక్కడే రుచి చూడటం. పాత సంగతులు నెమరుకు వస్తున్నాయి. చక్కగా వ్రాశారు. థాంక్స ఫర్ ది పోస్ట్.

తృష్ణ said...

నైమిష్ గారూ, అప్పట్లో ఫొటోలు తక్కువేనండి. ఉన్న కాసినీ అమ్మావాళ్ళింట్లో ఉన్నాయి. అందుకని ఫోటొ పెట్టడం కుదరలేదండి.'రోకలిబండ' లంటే ఎర్రగా రెండంగుళాల పొడవుగా,బోల్డు కాళ్ళున్న పురుగులు. గొంగళీ పురుగు జాతే..:) కానీ అంత అసహ్యంగా ఉండవు. అవి పుట్టలు పుట్టలుగా పుట్టేస్తాయి.నాకు తెలిసీ వర్షాకాలంలో మట్టి,మొక్కలు మూడూ కలిపి ఉన్నచోట్ల ఎక్కువగా ఉంటాయి.

Saahitya Abhimaani said...

నాకు తెలిసి, వాటిని గాజుపురుగులు అంటారు అనుకుంటాను.

SHANKAR.S said...

నైమిష్ గారూ రోకలి బండ అంటే "MILLIPEDE"

కొత్త పాళీ said...

ఓహో, ఆ యిల్లేనా మీది. ఐతే మిమ్మల్ని చూశా. బహుశా నాలుగైదేళ్ళ పిల్లై ఉంటారప్పుడు :)
Just kidding.

చాలా బాగా రాశారు. ఏంటో మీకు విజయవాడ అంటే అంత అనుబంధం. నాకేమో అస్సలు కుంచెం కూడా లేదు, ప్చ్ :(

SD said...

మీకు కానీ చాడ రామ్మోహన రావు గారు తెలుసా? విజయవాడలోనే ఉండేవారు. మీరు చెప్పిన పేర్లూ, అవీ చూస్తూంటే మీరు వాళ్లకి చుట్టాలు కావొచ్చేమో అనిపించింది. వాళ్ళ పిల్లలిద్దరూ ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయ్యారు.

గోదారి సుధీర said...

mee gnaapakaalu baagunaayi trishna gaaru .

తృష్ణ said...

శివ గారు, గాజు పురుగులు కూడా ఇలాంటి పురుగులే కానీ అవి నల్లగా ఉండి చివర్లలో యెల్లో కలర్ ఉండి ఉంటాయి. రోకలిబందలకి వేరే పేరుండెమో తెలీదు కానీ అవి ఎర్రగా ఉంటాయి.

@DG:చాడ వారు భట్టుమావయ్యగారి చుట్టాలయి ఉంటారు.అప్పట్లో చాడ శ్యామల అని ఒక పాపని ఆయన రేడియో నాటకాలకీ వాటికీ తీసుకువచ్చిన గుర్తు. భట్టుగారుని మేము "మావయ్యగారు" అలా పిలిచేవాళ్లం. అప్పట్లో అంకుల్ పిలుపులు లేవు కదా.. మాకు బంధుత్వం లేదు. స్నేహమే..!

తృష్ణ said...

@శంకర్.ఎస్: అవునండి ఇప్పుడూ కూరలవాళ్ళకీ, పనివాళ్ళకీ కూడా మనం ఆంటీలం, అంకుళ్ళం ! అప్పట్లో ఉన్న ఆ పిలుపులలోని ఆప్యాయతలు ఇప్పుడు అరుదైపోయాయి.

@శివరాంమసాద్ కప్పగంతు: నిజమేనండి...ధన్యవాదాలు.

ఇందిర: అవునా..? బావుంది. మీరు లేఖినీ.ఆర్గ్ డౌన్లోడ్ చేస్కుని లేక ఆన్లైన్లో కూడా తెలుగులో రాయచ్చండి. గూల్గుల్లో లేఖిని అని టైప్ చేసినా పేజ్ వస్తుందండి.
ధన్యవాదాలు.

తృష్ణ said...

@Rao S lakkaraju:మీరూ గత స్మృతుల్లోకి వెళ్పోయారా...బావుంది. అవే కదండి మనల్ని రీఛార్జ్ చేసేవి...ధన్యవాదాలు.

@కొత్తపాళీ: ఆ...నిజంగానా?
ఏమిటోనండి మరే ఊరుతోనూ నాకు ఆ ఆత్మీయ అనుబంధం కలగదు. బహుశా ఎన్నో మధురస్మృతులు ఆ ఊరితో పెనవేసుకుని ఉండటం వల్ల కావచ్చు. అక్కడ పుట్టకపోయినా నా పుట్టిల్లు అదే అనిపిస్తుంది ఇప్పటికీ..
ధన్యవాదాలు.

తృష్ణ said...

@గోదారి సుధీర: టపా నచ్చినందుకు ధన్యవాదాలు. ఎన్నాళ్ళకి దొరికారూ..మీ టపాలు చాలా బావుంటున్నాయండీ...ఒక్కటి కూడా వదలకుండా చదువుతున్నా !! కానీ ఏదన్నా రాద్దామనిపించినా రాయలేకుండా చేతులు కట్టేసారు..:(( ఎలా మరి? కామెంట్ బాక్స్ ఎప్పుడు తెరుస్తారు? ఈ ఒక్క విషయంలోనే మీరు ఒక టపాలో రాసినట్లు మీరు "మంచిపిల్ల కాదు"..:)))

Sujata M said...

Waow! ఎంత నచ్చిందో ! చిన్నప్పుడు మా తాతగారిల్లు గుర్తొచ్చింది. మీ తోట లో మీ జ్ఞాపకాలు కళ్ళకు కట్టినట్టు వర్ణించారు. So, ప్రసిద్ధ - సుప్రసిద్ధుల మధ్య తిరిగి పెరిగారన్నమాట. మొక్కల మీద ప్రేమ కన్నా సంగీత ప్రియత్వం బాగా పట్టుబడినట్టుంది. No kidding.

ఆ.సౌమ్య said...

అద్భుతం తృష్ణ గారూ....పెరడు, పెరటిలో చెట్లు, కనకాంబరాలు, ముళ్ల గోరింట, డిసెంబరం పూలు, బొప్పాయి చెట్టు, నందివర్ధనం పూలు కోసి అమ్మకివ్వడం, వరండా, కకటాల తలుపు. కిటీకీ గూడు, రెండు రూములు...అవి అద్దెకు ఇవ్వడం, వీధి గుమ్మంలో కూర్చోవడం, ....ఆబ్బా మా ఇల్లు, మా చిన్నప్పటి వాతావరణం కళ్ళముందుకొచ్చేసిది....నన్ను గిరాగిరా తిప్పేసి గతంలో పడేసింది...నేను ఎక్కడికో వెళ్ళిపోయాను. thank you so much...నా మధుర స్మృతులు అన్నీ వెలుగులోకొచ్చాయి!

Indira said...

తృష్ణ గారు,లేఖిని ద్వారా రాస్తున్నాను.మీకు నా కృతజ్ఞతలు.

సుజాత వేల్పూరి said...

శివరామ ప్రసాద్ గారు చెప్పినట్టు ఆ మనుషులూ ఆ ఇళ్ళూ అసలు ఆ వాతావరణమే లేదిప్పుడు. ఇహపై రాదు కూడా!

కొన్ని రోజులు, కొంతమంది మనుషులు,చూస్తుండగానే జ్ఞాపకాలుగా మారిపోతారు. అప్పుడప్పుడూ ఇలా గుర్తొచ్చి గుండె లోతుల్లోంచి కాస్తంత దుఃఖాన్ని వెలికి తీస్తే, నిజంగానే మనసు తేలికపడుతుంది.

మరో పక్క మన పిల్లలు అలాంటి స్వచ్ఛతకు ఎంతో దూరంగా ఉన్నారని, ఎప్పటికీ ఇలాగే పెరుగుతారని తల్చుకుంటే తేలికపడిన మనసు మళ్ళీ భారమవుతుంది.

మొక్కలతో మీకున్న అనుబంధం లాంటిదే నాదీనూ! మా (అమ్మా వాళ్ళ)ఇంటినిండా మొక్కలే! ఆ ప్రేమ అమ్మే నేర్పించిందనుకుంటా...ఇప్పటికీ మొక్కలు నాటడం, గార్డెనింగ్ చేయడం అంటే మాత్రం పరిగెత్తుకు వెళ్తా!

మొక్కలు నాటాక అవి తేరుకుని నిలబడి తొలి చిగురుని చూపిస్తే మనసంతా నిండే సంతోషం ముందు ఏది నిలుస్తుంది?

సమీర said...

illaga relations mariyu illulu galavaaru mammalini invite cheyandi pls pls . maavarini pillalaki vandipettamani cheppi rekkalu kattukono akkadiki vachchi valtaanu.

తృష్ణ said...

@sujata: :)) పూర్వజన్మ సుకృతమేమోనండి..!
ధన్యవాదాలు.

@ఆ.సౌమ్య: అయితే మీ పరీక్షల టపా లాగే మధురస్మృతుల టపా కూడా రాసేయండి.
ధన్యవాదాలు.

@ఇందిర: హమ్మయ్య...బావుందండీ చదవటానికి..:) తెలుగులోకి వచ్చేసినందుకు అభినందనలు.

తృష్ణ said...

@సుజాత: బాగా చెప్పారు. అటువంటి ఆప్యాయతలు ఇప్పుడు కరువైపోయాయి. మన పిల్లలకు ఆ రుచి తెలియదేమో..:(
నాటిన మొక్క నిలబడి చిగురిస్తే... నిజంగా భలే ఉంటుంది కదండి..great feeling..!
Thank you.

వీరుభొట్ల వెంకట గణేష్ said...

నా చిన్నపుడు ఒక సారి సూర్యారావు పేట వచ్చినపుడు, మా నాన్నగారు, ఇది జంధ్యాల శంకర్ గారి ఇల్లు అని చూపించారు. ఈ పోస్ట్ చదివిన తరువాత, నా బాల్యపు జ్ఞాపకాలని, గాంధీనగర్లో మేము ఉన్న పాత ఇంటిని ఒక సారి గుర్తు తెచ్చుకున్నాను, థాంక్స్!!

lakshmi said...

mee vijayawaada inti gurinchi chadivuthunte aa intlo alage unnatlu ekkado oka chithram thayaraindi madi lo...........theera choosthe adi memu warangal lonu hyd lonu unna inti pradesallo ade rakamaina vathavaranam undadam oka kaaranamemo andi.chala thnks mee gnapakallo mammalni kooda olaladinchi maa gnapakaalloki thosinanduku. chala chakkati tapa thrushna garu.

కృష్ణప్రియ said...

ఇవ్వాళ్ల ఎందుకో అన్నీ మంచి అందమైన టపాలు చదువుతున్నా.. చాలా బాగుంది.

siva said...

మనసున మల్లెల మాలలూగెనే! ఛాలా రోజుల తర్వాత మళ్ళీ మీ మార్క్ టపా

తృష్ణ said...

@ గణేష్,
@ లక్ష్మి,
@ కృష్ణప్రియ,
@ శివ,

టపా నచ్చినందుకు మీ అందరికీ థాంక్స్ అండీ.