సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, July 28, 2011

స్ఫూర్తి

(looking at the brighter side)




మేం ఈ ఇంట్లోకి వచ్చి ఆర్నెల్లు దాటింది. వచ్చినప్పటినుంచీ ఆమెను గమనిస్తున్నాను. ఆమె మా ఇంటి ఎదురుగా చిన్న బడ్డి కొట్టు నడిపే ముసలమ్మ. వయసు ఖచ్చితంగా అరవైకి పైనే. పొద్దున్నే ఆరింటికల్లా కొట్టు తెరిచేస్తుంది. రాత్రి పది,పదిన్నర దాకా తెరిచే ఉంటుంది కొట్టు. మధ్యాన్నం ఓ రెండు గంటలు సేపు మూసేస్తుంది. మా చిన్నప్పుడు బడ్డీ కొట్టు అంటే ఏవో ఓ పది గాజు సీసాలతో పదిరకాల చాక్లెట్లు అమ్మే చిన్న కొట్టు. అంతే . కానీ ఇప్పుడు బడ్డీ కొట్లు కూడా మినీ పచారీ కొట్లు అయిపోయాయి. అర్ధరూపాయి కి రెండు చాక్లేట్ల దగ్గార నుంచీ సర్ఫు పౌడర్లు,బ్రెడ్,పావ్ ల వరకూ అందులో దొరకని వస్తువు ఉండట్లేదు. మా ఇంటెదురు ముసలమ్మ కూడా ఇవన్నీ అమ్ముతుంది. ఎవరు సాయానికి ఉండరు. ఒక్కర్తి ఉంటుంది రాత్రి పూటలు ఒక కిరోసిన్ దీపం పెట్టుకుని . ఆమెకు సాయం ఒక చిన్న ట్రాన్సిస్టర్. అటుగా వెళ్ళే వాళ్ళు సిగరెట్ల కోసం మో, మరేదైనా చిన్న వస్తువు కోసమో రాత్రిళ్ళు అక్కడ ఆగుతూ ఉంటారు. పాలు కూడా అమ్ముతుంది. ఒకరోజు పాలు ఉన్నాయా అంటే ఇంట్లోకి వెళ్లి ఫ్రిజ్లోంచి తెచ్చి ఇచ్చింది. షాంపు పేకెట్లు, చిన్న చిన్న సర్ఫ్ సేచేట్లు..ఇలా చాలా ఐటమ్స్ కనబడుతూ ఉంటాయి. ముసలమ్మా ఎంత కష్టంలో ఉందో ఇలా కష్టపడుతోంది అనుకునేదాన్ని .

పక్క సందులోనే వాళ్ళ ఇల్లు. కొన్నాళ్ళకు అదే ఆమె సొంత ఇల్లు అని తెలిసి మరింత ఆశ్చర్యపోయాను. డాబా ఇల్లే.అద్దెకు కూడా ఇచ్చిందిట. ఇంతే కాకా సాయంత్రాలు కొట్టు ముందర కుర్చుని ప్లాస్టిక్ బుట్టలు, చాపలు అల్లుతూ ఉంటుంది. ఆమె ఓపికకు నిజంగా అబ్బురం కలుగుతుంది. లేక కాదు ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒక సంపాదన చెయ్యాలి అనే ఆలోచన అన్నమాట ఆమెది .

*** **** ****
మా పక్క సందులో ఒక చిన్న టిఫిన్ సెంటర్. భార్యాభర్తలిద్దరూ ఇద్దరే నడుపుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఒక ముసలివాడు పని చేస్తూ ఉంటాడు. అతనికి అరవైఐదు పైనే ఉంటాయి. ముస్సలిగా కనబడుతు ఉంటాడు. అటుగా వీధిలో వెళ్తుంటే అక్కడ పని చేస్తూ కనిపిస్తాడు. కప్పులు,ప్లేట్లు కడుగుతాడు. అంట్లు తోముతాడు. వాకిలి చిమ్ముతాడు. ఆ చిన్నపాటి టిఫిన్ సెంటర్ కు అతడే సర్వరు,క్లినారు అన్నమాట. ఎండనక,వాననకా పని చేస్తూనే ఉంటాడు. మొన్నటి ఎండా కాలంలో మందుటెండలో బయట కుర్చుని అంట్లు తోముతున్న ఆ ముసలివాడిని చూస్తే బాధ కలిగేది. ఎంత అవసరం ఉంటే ఇలా కష్టపడతాడు అనుకునేవాళ్ళం మేము. ఇప్పుడేమో వానల్లో పని చేస్తున్నాడు. అమ్మో ఇది చెయ్యలేనేమో...ఇలా వెళ్ళలేనేమో.. అనుకున్నప్పుడల్లా ఈ ముసలతనే గుర్తు వస్తాడు నాకు. అంత వయసుమీరినవాడు కష్టపడగా లేనిది నేను చెయ్యలేనా అనుకుంటాను మళ్లీ.

*** *** ***



వీళ్లిద్దరిని చూస్తే నాకు విజయవాడలో మా క్వార్టర్స్ లో ఆకుకూరలు అమ్మటానికి వచ్చే ముసలమ్మా గుర్తుకు వస్తుంది. చర్మం మడతలు పడిపోయి , నడుం వంగిపోయిన ఒక ముసలమ్మా తలపై వెదురుబుట్ట నిండా ఆకుకూరలు పెట్టుకుని వాటిపై తడిబట్ట కప్పి తెచ్చేది. 'నానా కాస్త చెయ్యి వెయ్యమ్మా..' అంటే బుట్ట దింపేదాన్ని నేను. ఫ్రెష్గా లేకపోయినా ఏదో ఒకటి కొనకుండా అమ్మ పంపేది కాదు ఆ ముసలమ్మని. ఎందుకే బాలేకపోయినా కొంటావు అంటే..'అంత కష్టపడి ఎండనకా వాననకా అమ్ముకుంటోంది...ఏదో ఓకటి తీసుకుంటే ఆమెకీ తృప్తి..' అనేది అమ్మ. కొన్ని రోజులు కనబడేది కాదు.ఏమయ్యావు అనడిగితే 'పానం బాలేదమ్మా..' అనేది పాపం.

వయసుమీరాకా ఇంత కష్టం పడాలంటే నిజంగా మనం పడగలమా అనిపిస్తుంది ఆలోచిస్తే.. జీవనభృతి కోసమో,అవసరార్ధమో ఇలా అమ్ముకునేవాళ్ళు కొందరైతే, వయసు మీరినా ఏదో ఒక సంపాదన ఉండాలనుకునే మా ఎదురుగా ఉండే బడ్డీకొట్టు ముసలమ్మలు కొందరు. కారణం ఏదైనా మనం ఇలాంటి వాళ్ళ నుండి పొందాల్సిన స్ఫూర్తి ఎంతో ఉంది అనిపిస్తుంది నాకు.

11 comments:

SHANKAR.S said...

నిజంగానే వీళ్ళు మనకి స్ఫూర్తి ప్రదాతలండీ. ఆర్ధిక అవసరాల కోసం పనిచేసే వాళ్ళు కొందరైతే, ముసలితనం అంటే ఏ పనీ చేయకుండా కూర్చోవడం కాదని నిరూపించే వాళ్ళు, కష్టపడి పనిచేయడం లో ఆనందాన్ని ఆస్వాదించే వాళ్ళు మరికొందరు. శ్రీ శ్రీ గారి "కొంత మంది యువకులు పుట్టుకతో వృద్ధులు" అన్న పదాల్ని వీరి విషయంలో తిరగేసి చదువుకోవాలి.

జయ said...

అవును. ఏ వయసైనా ఓపికున్నంతకాలం పనిచేయటమే ధర్మం. అది ప్రతి ఒక్కరి బాధ్యత. ఇటువంటి వారిని చూసినప్పుడన్నా, చాతకనితనం, బద్దకం ఎగిరిపోవాలి. బాగుంది తృష్ణా.

ఆ.సౌమ్య said...

మంచి పోస్ట్...నిజమే ఇలాంటివాళ్లని చూస్తే మనకొచ్చిన కష్టాలు ఏపాటి అనిపిస్తుంటుంది.

గీతిక బి said...

మీ పోస్ట్‌లన్నిటిల్లోకెల్లా ఇది నాకు బాగా నచ్చింది.

బహుశ ఈ మధ్యన నాకూ ఇలాంటి ఆలోచనలే వస్తుండడం వల్లేమో..

Geetika.B

కృష్ణప్రియ said...

So true!

వనజ తాతినేని/VanajaTatineni said...

స్పూర్తికరం .

Hima bindu said...

వీరు నిజంగా స్ఫూర్తి కలిగిస్తారు .అలా వాళ్ళు కష్టపడుతుంటే చాలా భాధగా అనిపిస్తుంది .

వేణూశ్రీకాంత్ said...

చాలా స్ఫూర్తిదాయకమైన విషయాలు చెప్పారండి..

Anonymous said...

బ్రతుకు పోరాటం లో అలిసిపోకుండా, నిరాశ పడకుండా పోరాడే వాళ్ళెప్పుడూ మనకి స్ఫూర్తినిస్తూనే వుంటారు కదా?
మా వనస్థలిపురంలో ఒకావిడ గాజుల కొట్టు నడుపుతూవుండేది. మామూలు కథే! ఏ మాత్రం బాధ్యత తెలియని భర్తా, పిల్లలూ, సంసారం నడపాల్సిన పరిస్థితీ! వచ్చీ రాని తెలుగుతో అవస్థ పడుతూ వచ్చిన ఒక్క బేరాన్ని కూడా పోనివ్వకుండా ఆవిడ ఎంత కష్టపడేదో నాకింకా గుర్తు!
శారద

తృష్ణ said...

@ శంకర్,
@జయ,
@ఆ.సౌమ్య,

అవునండీ..నిజమే..ధన్యవాదాలు.

గీతిక.బి: టపా నచ్చినందుకు ధన్యవాదాలు.

తృష్ణ said...

@ కృష్ణప్రియ:
@వనజ వనమాలి:
@ వేణూ శ్రీకాంత్:

ధన్యవాదాలు.

@చిన్ని: నిజమేనండి..నిన్న కూడా ఆటుగా వెళ్తూ పనిచేస్కుంటున్న ఆ ముసలితాతను చూస్తే చాలా బాధ కలిగింది..

ధన్యవాదాలు.

@శారద: ఇలాంటి కొందరు వ్యక్తులు మనకెంత గుర్తుండిపోతారో కదండీ..
ధన్యవాదాలు.