వర్షంలో ఇంటికి నడిచి వస్తూంటే శ్రీకాంతశర్మగారి "తిరునాళ్ళకు తరలొచ్చే.." పాట గుర్తుకు వచ్చింది. ఎంతో అందమైన సరళ పదాలతో పాట చదువుతుంటేనే ఒక అందమైన చిత్రం కళ్లకు కనబడేలా రాయటం శర్మగారి ప్రత్యేకత. నాన్నకు మంచి మిత్రులుగా కన్నా ఒక కవిగానే నాకు ఆయన పట్ల చాలా అభిమానం. ఈ పాటలో శర్మగారు ఉరుములు మెరుపులతో వచ్చే వర్షాన్ని తిరునాళ్ళకు వెళ్ళే కన్నెపిల్లతో పోలుస్తూ రాసిన ఈ పాట చాలా బావుంటుంది.
ఈ పాటను ఇక్కడ వినచ్చు:
రచన: శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ
సంగీతం: శ్రీ విజయరాఘవరావు
పాడినది: శ్రీరంగం గోపాలరత్నం గారు
తిరునాళ్ళకు తరలొచ్చే కన్నెపిల్లలా(౨)
మెరుపులతో మెరిసింది వానకారు
నీలి మొయిలు వాలు జడకు చినుకే చేమంతి(౨)
కట్టుకున్న పచ్చదనం పట్టుపరికిణీ..
((తిరునాళ్లకు))
తెలివెన్నెల వేకువలో తానమాడి
అడవిదారి మలుపుల్లో అదరి చూసీ
కొండ తిరిగి కోన తిరిగి గుసగుసలాడి(౨)
తరగల మువ్వల గలగల నాట్యమాడి..
((తిరునాళ్లకు))
చిగురేసిన చిరుకొమ్మలు ఊగిఊగిపోతే
చిలిపిగ జడివాన వేళ చక్కిలిగిలి పెట్టి
పకపక పువ్వుల నవ్వుల నవ్విస్తూ వస్తూ(౨)
బాటవెంట సంబరాలు వంచి పంచిపెడుతూ..
((తిరునాళ్లకు))
కొంటెకుర్రకారు వెనక జంట నడక నడిచి
విరహంతో వేదనతో వారి మనసు కలచి
అంతలోన మంచి కలలు కనుల చిలకరించి
జరిగి జరిగి దౌదౌవ్వుల పిలిచి పిలిచి - నిలిచి..
((తిరునాళ్లకు))
ఈ పాటను పాడినది ప్రముఖ సంగీత విద్వాంసురాలు శ్రీరంగం గోపాలరత్నం గారు. సంగీతం సమకూర్చినది అప్పట్లో బొంబాయిలో ఫిలిం డివిజన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న మన తెలుగువారైన విజయరాఘవరావు గారు. ఈ పాట గురించిన చిన్న కథ శ్రీకాంతశర్మగారి మాటల్లో:
"సుప్రసిధ్ధ వేణు విద్వాంసులు ఏల్చూరి విజయరాఘవరావుగారు ఒక కచేరీ కోసం విజయవాడ వస్తున్నారని తెలిసీ, నన్ను పిలిచి ఒక పాట రాయించి బొంబాయిలో ఉన్న వారికి పంపారు మా డైరెక్టర్ శ్రీనివాసన్ గారు. దానికి బాణీ ఏర్పరిచి విజయరాఘవరావు గారు ఈ మాసపుపాట కార్యక్రమం కోసం విజయవాడలో మా స్టూడియో లోనే రికార్డ్ చేసారు. దీని కోసం ప్రత్యేకంగా గోపాలరత్నం గారిని హైదరాబాదు నుంచి పిలిపించి శ్రీనివాసన్ గారు పాడించారు. ఈపాట రాయటం మొదలు చివరి రికార్డింగ్ వరకూ నడిచిన అన్ని దశలనూ రికార్డ్ చేసిన శ్రీ ఎస్.బి.శ్రీరామ్మూర్తి అనే మా సహచర రేడియో ప్రయోక్త 'ఒక పాట పుట్టింది' అనే రేడియో డాక్యుమెంటరీ తయారు చేసారు. ఆ రోజుల్లో ఈ పాట రేడియో ద్వారా బాగా ప్రచారం పొందింది." ("పరిపరి పరిచయాలు" పుస్తకం నుండి).
పది గంటలకు మొదలై రాత్రి ఎనిమిదింటిదాకా నడిచిన ఈ పాట తాలూకు సుదీర్ఘమైన రికార్డింగ్ ను నలభై ఐదు నిమిషాల "ఒక పాట పుట్టింది" అనే కార్యక్రమంగా రూపొందించారు నాన్న. సామన్య శ్రోతకు కూడా ఒకపాట తయారీ ఎలా ఉంటుందో సులువుగా అర్ధమయ్యేలా రుపొందించిన ఈ కార్యక్రమం చాలా మన్ననలు పొందింది. ఆ రికార్డింగ్ ను బొంబాయిలో ఉన్న విజయరాఘవరావు పంపిస్తే, విని "out of a labourious process of 10hrs recording, i wonder how you could produce this programme..' అని ఆనందాన్ని వ్యక్తపరుస్తూ రెండు పేజీల ఉత్తరం . అది అవార్డులు రావటం కన్నా గొప్ప ప్రశంస అని నాన్న అనుకుంటూ ఉంటారు.
12 comments:
పాట బాగుంది. నాకు శ్రీరంగం గోపాలరత్నం గారి పాటలన్నీ ఇష్టం. చాలా బాగుంది.
హహ్హహ..తాన్ సేన్ మేఘ్ మల్హర్ రాగం ఆలపిస్తే వర్షం కురిసేది అని విన్నాను. ఇప్పుడే మీ పోస్ట్ చూస్తూ పాట ప్లే చేస్తున్నాను. యాదృచ్చికంగా అదే టైం లో ఇక్కడ వర్షం ప్రారంభం అయింది. భలే చిత్రంగా అనిపించింది. శ్రీకాంత శర్మ గారి సాహిత్యం, గోపాలరత్నం గారి గాత్రం ఒకదానితో ఒకటి పోటీ పడ్డట్టు ఉంది. మంచి పాట పరిచయం చేసినందుకు మీకు వీరతాళ్ళు.
తృష్ణ గారు.. మీరు మా రామం గారి అమ్మాయి అని తెలిసినప్పటి నుండి..ఆనందం .. గంతులేస్తుంది. రామం గారి గొంతు వింటూ.. రేడియో.. వినడం అలవాటు చేసుకున్న వాళ్ళం. వారికి ..నా నమస్కారములు...తెలుపండి. మీకు అభినందనలు. పాట పరిచయం...చేసిన విధం..అభినందనీయం.మీ నుండి ఇలాటి పోస్ట్ లు మరిన్ని ఆశిస్తూ.. వనజ. .
Can you mail me the audio of this song. If yes thank you.
ahmisaran@gmail.com
@జయ: మీకూ గోపాలరత్నం గారు ఇష్టమా? వెరీ నైస్...ధన్యవాదాలు.
@శంకర్: మీకూ వాన పడిందా? ఈ పాట వింటూంటే చాలా ఉత్సాహంగా ఉంటుందండి. సంగీతం,సాహిత్యం,గాత్రం మూడూ ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయా అన్నట్లుంటాయి.
ధన్యవాదాలు.
@వనజ వనమాలి: ఓహ్..నాన్న మీకు తెలుసా? చాలా సంతోషం.
ధన్యవాదాలు.
@ahmisaran: మీకు divshare నుండి లింక్ మైల్ పంపాను చూడండి. అది రాకపోతే.. లింక్ ఇస్తున్నాను.డౌన్లోడ్ చేసుకోండి:
http://www.divshare.com/download/15212633-b8d
ధన్యవాదాలు.
dear thrishna,just seen your post and thrilled.i like this song very much.pata gnapakalani tatti lepinattayyindi.Vanaja Vanamali garu cheppinattu,meeru Ramam gari ammayi avvadam it seems you r very femiliar to me.sangeetapriya and DSR gari Rasamanjari alternative weeks lo broadcast ayyevani gurtu.our friends were divided into 2 groups and ee programs gurinchi we used to argue.once Ramamgaru came to our Tenali ,i dont remember what the occasion was.i took his autograph.i remember he wrote IF WINTER COMES, CAN SPRING BE FAR BEHIND? Shelly or keats quote i think.convey my regards to him.thank you very much for this sweet song.indira.
@indira:షెల్లీదండి అది. నేను డల్ అయినప్పుడల్లా నాన్న నాకు చెప్తూంటారు. నాకూ చాలా ఆనందం కలిగింది ఇన్నేళ్ళకు కూడా మీకు గుర్తున్నందుకు. ఓబీ ప్రోగ్రామ్స్ కాంపీరింగ్ చేసేందుకు చాలా ఊళ్ళు వెళ్ళేవారు నాన్న. టివీల హడావుడిలేని ఆ రోజుల్లో మరి రేడియోదే ప్రభంజనం. నిన్న మరొకరు కూడా పాత మెమొరీస్ గుర్తు చేసుకుంటూ రాసారు. It's a nice feeling. Thanks a lot.
మిమ్మల్ని ఇక్కడే ఒకసారి అడిగాను :). 'ఒక పాట పుట్టింది' ఎప్పుడు వినిపిస్తారో చెప్పండి. :-)
Regards,
Sreenivas
@పరుచూరి శ్రీనివాస్: ఈ టపా రాస్తుంటే అదే గుర్తువచ్చిందండీ..అది నాన్నగారి దగ్గర నుండీ కేసెట్ తెచ్చుకుని ఎంపి 3 లోకి మార్చాలి.. కాస్తంత పని అని బధ్ధకిస్తున్నానండీ..వీలు చూసుకుని పెట్టడానికో లేక మీకు పంపటానికో ప్రయత్నిస్తానండీ.. !
ధన్యవాదాలు.
తృష్ణగారు, మీ బ్లాగు చూడగానే తిరువనంతపురం సంపద నాకే దోరికనట్లయింది. ధన్యవాదాలు. ఈరోజు పొద్దన్నే సఖియా నిదురన్నది నేనెరుగనే పాట పాడుకుంటూ మా అమ్మాయికి ఇలాంటి పాటలు కొన్ని నేర్పాలనుకుంటూ నెట్లో ఆడియో కోసం వెతుకలాడుతోంటే మీ బ్లాగు కనిపించింది. చదువుతోంటే ఆరోజులు గుర్తొచ్చాయి. గోపాలరత్నం, జగన్నాధాచార్యుల వారి అభిమానిని. వీరితో శర్మగారు కలిస్తే కొబ్బరినీళ్ళెందుకు పనికొస్తాయి. ఒకరోజు మా అమ్మ నాన్న ఓపాట పుట్టింది విని నాకు చెప్పితే వినలేక పోయానని ఇప్పటికీ బాధపడుతా. మీ బ్లాగులో దాని విశేషం చదివి ఇక్కటికైనా వినగలనని అనిపించగానే ఎలా అనిపించిందో వేరే చెప్పక్కర్లేదనుకుంటా. ఇంకా చాలా విశేషాలు ముచ్చటించాలని ఉంది... తర్వాత .. బహశః నా బ్లాగులో..
నమస్తే తృష్ణ గారు,
నా పేరు నాగమణి. మీరు రాసే ప్రతి పదం చాల అందంగా, ఆహ్లాదంగా వుంటుంది. పాట ఎలా పుట్టింది, పాట ని ఎలా రికార్డు చేసేవారు ఇదివరకు అనేది చాల కష్టమైన ప్రక్రియ. అది ఎలా చేశారు అనేది చాలా ఉత్సుకతో తెలుసుకోవాలని వుంది. మీరు మీ బ్లాగ్ లో పెట్టగలరా..
ధన్యవాదాలు,
నాగమణి పగడాల.
Post a Comment