సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, July 4, 2011

'మధుర గాయకి' శ్రీరంగం గోపాలరత్నం



చూడచక్కని రూపం, నుదుటన శ్రీ చూర్ణంతో కనబడే ఆమె మృదుభాషిణి. చరగని చిరునవ్వు ఆవిడ సొంతం. ఆవిడే నాటి సంగీత విద్వాంసురాలు, 'మధుర గాయకి' బిరుదాంకితురాలు శ్రీరంగం గోపాలరత్నం గారు. ఒక తెలుగు శాస్త్రీయ సంగీత విద్వాంసురాలిగా శ్రీరంగం గోపాలరత్నం గారు గుర్తుంచుకోదగ్గ గాయనీమణి. విజయవాడ స్టాఫార్టిస్ట్ గా పనిచేసి, తరువాత హైదరాబాద్ ప్రభుత్వ సంగీత కళాశల ప్రధానోపాధ్యాయినిగా, తెలుగు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ గా, టిటీడి ఆస్థానవిద్వాంసురాలిగా కూడా నియమితులయ్యారు. 'పద్మశ్రీ' గౌరవాన్ని పొందిన గోపాలరత్నంగారు శ్రీపాద పినాకపాణి గారి శిష్యురాలు. కర్నాటక శాస్త్రీయ సంగీత విద్వాంసురాలిగానే కాక లలిత సంగీత గాయనిగా కూడా అమె ఎంతో ప్రఖ్యాతి పొందారు. ఆమె గాత్రంలో వైవిధ్యంగా పలికే గమకాలు, పలికేప్పుడు భావానుగుణంగా ప్రత్యేకత సంతరించుకునే పదాలు అమె ప్రత్యేకతలు. శ్రీరంగం గారిది తంజావూరు బాణీ అని అంటూంటారు.

పలు సంగీత నాటికల్లో కూడా ఆమె నటించారు. సతీసక్కుబాయి నాటికలో సక్కుబాయి, మీరా నాటకంలో మీరా పాత్రలు ఆమెకు పేరు తెచ్చాయి. మీరా నాటకంలో శ్రీకాంతశర్మగరు రాసిన అన్ని మీరా పాటలు గోపాలరత్నం గారే పాడారు. "ఎవరు నాకు లేరు", "గిరిధర గొపాలుడు కాకెవరు", సఖియా నిదురన్నది లేదు" మొదలైనవి చాలా బావుంటాయి. బాలమురళిగారి రచన "కనిపించు నా గతము", ఆయనతో కలిసి పాడిన రజని గారి "మన ప్రేమ", కృష్ణశాస్త్రి గారి ""శివ శివయనరాదా", "గట్టుకాడ ఎవరో, సెట్టు నీడ ఎవరో" మొదలైన పాటలు ఎంతో ప్రశంసలు పొందాయి. మంచాల జగన్నాధరావుగారు ట్యూన్ చేసిన (ఆకాశవాణిలో ఉన్న) గోపాలరత్నం గారు బాలమురళి గారితో యుగళంగా కొన్ని, కొన్ని విడిగానూ(సోలోస్) కమ్మగా పాడిన "ఎంకి పాటలు" నాకైతే చాలా ఇష్టం. ముఖ్యంగా గోపాలరత్నం గారు పాడిన అన్నమాచార్య కీర్తనలు చాలా ప్రాచుర్యం పొందాయి. ఆసక్తి ఉన్నవారు క్రింద లింక్లో వాటిని ఇడౌలోడ్ చేసుకోవచ్చు:
http://www.yadlapati.com/sri-thallapaka-annamacharya-kirthans-by-srirangam-gopala-ratnam-devotional-mp3-songs/

పన్నాల సుబ్రహ్మణ్య భట్టుగారి "అనుభవ దీపం" రూపకానికి శ్రీకాంతశర్మ గారు "ఇంత వింత వెలుగంతా సుంత నాకు మిగెలేనా
" అని ఒక పాట రాసారు. ఆవిడ పాటల్లో నాకు బాగా నచ్చే "తిరునాళ్ళకు తరలొచ్చే"పాటను మొన్న టపాలో పెట్టాను కదా,  గోపాలరత్నంగారు మధురంగా మోహన రాగంలో పాడిన "ఎవ్వడెరుగును నీ ఎత్తులు" అన్న అన్నమాచార్య కీర్తన  క్రింద లింక్లో వినవచ్చు:

15 comments:

SHANKAR.S said...

ఎంకి పాటలతో ఈవిడకి నేను వీరాభిమాని అయిపోయానండీ. ఇంతటి గాయని గురించి బోలెడన్ని విశేషాలు పంచుకున్నందుకు మీకు థాంకులు.
ఈవిడ పాడిన కొన్ని ఎంకిపాటలు నా ఈ పోస్ట్ లో వినండి (తృష్ణ గారూ ఇది మీకు కాదు లెండి మీ బ్లాగు చూస్తున్న మిగిలిన బ్లాగ్మిత్రులకి. మీరు వినేసే ఉంటారుగా :) ) http://blogavadgeetha.blogspot.com/2010/08/blog-post_07.html

SRRao said...

తృష్ణ గారూ !
మధుర గాయని గురించి చెప్పారు. బావుంది. మీరిచ్చిన లింకుల నుంచి పాటలు దింపుకున్నాను. ధన్యవాదాలు.

కొత్త పాళీ said...

చాలా సంతోషం. మంచి విషయాలు చెప్పారు. ఆ తరం తెలుగు గాయనీ గాయకుల్ని తలుచుకున్నప్పుడల్లా నాకు పుట్టెడూ దిగులు పుడుతుంది. గోపాలరత్నంగారు విద్వత్తులో ఎమ్మెస్, పట్టమ్మాళ్ ఇత్యాదులకేమీ తగ్గినవారు కాదు. ఇక ఆ కంఠంలో మాధుర్యం చెప్పనలవి గాదు. కానీ మన రాష్ట్రంలో ఎవరికీ తెలియకుండా ఉండిపోయారు.

జయ said...

వీటన్నింటితో పాటు "ఓయి తుమ్మెదా, ఇంత మాయ జేతువా" అనే లలిత గీతం కూడా చాలా బాగుంటుంది తృష్ణా. ఈ పాటలన్నీ వింటూ ఉంటే ఏదో కొత్త లోకం కనిపిస్తూ ఉంటుంది. చాలా మంచి విషయాలు చెప్పారు.

Anonymous said...

చాలా బాగుంది.
ఆవిడ పాడిన "సకలం హే సఖి" (సింధు-భైరవి) విన్నారా?
Out of this world!
శారద

సుజాత వేల్పూరి said...

చాలా థాంక్స్ తృష్ణా, ఆమె స్వరం నాక్కూడా ఎంతో ప్రీతి పాత్రం! ముఖ్యం గా శివ శివ యనరాదా పాట, మీరా భజనలు! అది విన్న తర్వాత ఒక రోజు వీధి గదిలో కూచుని "తల్లి నన్ను వీడిపోయె, తండ్రి నాకు దూరమాయె, బంధు హితులు నేడేలో పరిహసించి పోయినారు, ఎవరు నాకు లేరు" అని పాడుతుంటే అమ్మ వచ్చి "అందరం బతికే ఉన్నాంగా, అంత చక్కని పాటెందుకు పాడుతున్నట్టో" అని మండిపడి, అది మీరా భజన అని తెలుసుకుని స్థిమిత పడింది.

అలాగే సఖియా నిదురన్నది లేదు కూడా నా ఫేవరిట్. వేదవతీ ప్రభాకర్ పాడిన మీరా భజన్స్ కంటే నాకు శ్రీరంగం గోపాల రత్నం గారివి మంచి "ఫీల్" తో పాడినట్టు అనిపిస్తుంది.

ఆమె గొంతులో ఎవరూ పట్టుకోలేని(నేనొక్కదాన్నే పట్టుకున్నానని నా ఫీలింగ్) ఒక సన్నని లాలిత్యపు తీగ ఉంటుంది.

జయగారు చెప్పిన "ఓయి తుమ్మెదా" పాట కూడా ఎంతో బాగుంటుంది.

"ఇందిరా నామమిందరికీ, కుందనపు ముద్ద ఓ గోవిందా" అని ఆమె పాడుతుంతే చేతిలో పని వదిలేసిరే రేడియో దగ్గర కూచుందామనిపిస్తుంది.

కాస్త, ఆ మీరా భజన్లు ఉంటే బ్లాగులో పెట్టండి, దింపుకుంటాం!

Indira said...

thank u so much thrishna!Tirunallaku......pata vini sri rangam gari mood loki velli poyanu.annamacharyula keertanalunna cassete kosam vediki i could not get it.ivvala meeru ichhina link lo my daughter downloaded all the songs.but we could'nt get Tirunallaku in the link given.Indira namamu keertana link unte please give me.

తృష్ణ said...

@శంకర్.ఎస్: లింక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. సోరీ, నేను మర్చిపోయానండి..:(
ధన్యవాదాలు.


@SRrao:అటువంటి గొప్ప విద్వాంసురాలిని తలవటం కూడా అదృష్టమేనండి.ధన్యవాదాలు.

తృష్ణ said...

@కొత్తపాళీ: మీరన్నది నిజం. తెలుగువారవటం వల్ల రావాల్సిన కీర్తినీ, గౌరవాన్ని పొందలేకపోయిన కళాకారురులెందరో..!
ధన్యవాదాలు.

@జయ: ఆ పాటా తెలుసండి. బావుంటుంది.
ధన్యవాదాలు.

తృష్ణ said...

@sbmurali2007:టపాలో నేనిచ్చిన అన్నమాచార్య కీర్తనల్లో ఉందండీ అది...
ధన్యవాదాలు.

@సుజాత: "ఎవరు నాకు లేరు.." పాట నేనూ చాలాసార్లు ఎవరూ వినకుండా పాడేసుకుంటూ ఉండేదాన్నండి...:)
మీరా వి వీలు చూసుకుని పెడతానండి.
ధన్యవాదాలు.

@ఇందిర: వీలైతే పెడతానండి..ధన్యవాదాలు.

Sujata M said...

ఇది చదివి, వేంకటేశ్వర వైభవం సినిమా లో ఆవిడ పాటలు - చూసాను మళ్ళీ. థాంక్స్ అండీ.

Sreenivas Paruchuri said...

బాగుంది. రత్నంగారు పాడిన రేడియో సంగీతంతో నాకు బానే పరిచయముంది (సక్కుబాయి, మీరా నాటికలు, పైన పేర్కొన్న లలితగీతాలు నా దగ్గరున్నాయి.) కానీ, శాస్త్రీయ సంగీతంతో మంచి పరిచయమున్న నా మిత్రుడొకతను గోపాలరత్నంగారు చేసినంత బాగా శ్రుతిభేదం మరెవ్వరూ చేయరు, విని చూడమని ఆవిడ పాడిన ఒక 15-20 లైవ్ కచేరీలు పంపాదు. అప్పటినుండి ఆవిడంటే మరింత అభిమానం, గౌరవం పెరిగి పోయాయి.

మంచాల గారు స్వరపరచిన ఎంకిపాటలు వినే నండూరి వారు రెండవసారి ఆయన పాటలకు ముందుమాట రాసినప్పుటు "రేడియొ వారు వింత వింత పోకడలతో నా పాటలను వినిపించుచున్నారు" అని రాసారు :-) అవే పాటలు విన్న ఇద్దరు పెద్దలు - లలిత సంగీతంలో దిగ్గజాలు - కొంచెం వ్యంగ్యంగా "ఎంకి వచ్చి వీణ కూడా వాయిస్తుంది కదండీ" అన్నారు. I have mixed feelings about Manchala's compositions, but nothing against MBK and SG's voices. In fact, I was the first to upload the complete 90 min enki paaTalu in May, 2005.
http://www.oldtelugusongs.com/may2005/index.html
సొంతడబ్బాలా ధ్వనిస్తే క్షంతవ్యుణ్ణి! But, people hardly acknowledge their sources these days. Umm.

మీరు ఆవిడ, బాలమురళిగార్లు పాడిన తిరుప్పావై ప్రస్తావించలేదు. ఒక అయిదేళ్ళ క్రితం వరకు నాకు నెలకో మైలు వచ్చేది, తిరుప్పావై రికార్డిందు దొరుకుతుందా అని. ఇపుడు చాలా తేలిగ్గా నెట్‌లో దొరుకుతున్నాయి. తిరుప్పావై కి తెలుగు అనువాదం సరిగా లేదని అనేవాళ్ళున్నారు కానీ, రత్నంగారి గొంతుని తప్పుపట్టేవాళు వుండరనుకుంటాను.

అన్నమయ్య కీర్తనలు బాగా ప్రజాదరణ పొందడానికి కారణం అవి అప్పట్లో ఎల్.పి పైన విడుదల కావడమే. దానితో ప్రతి రికార్డింగు షాపులోను లభ్యమయ్యేవి. ట్.టి.డి వాళ్ళు మరొక సంకలనం కూడా ఆవిడతో చేసిన గుర్తు.

మరొకసారి నా డబ్బా కొట్టుకోవడానికి మీరనుమతిస్తే, "తిరునాళ్ళకు తరలొచ్చే పాటను మార్చ్, 2005 లో వినిపించడం జరిగింది - మీ నాన్నగారు శ్రీకాంతశర్మగారిపైన వ్యాసాన్ని highlight చేస్తూ:
http://groups.yahoo.com/group/racchabanda/message/12393

రత్నంగారి గురించి ఇంకా చాలా చెప్పవలసివుంది కానీ, ఇప్పటికే చాలా రాసేసాను. సెలవు.

Regards,
Sreenivas

తృష్ణ said...

శ్రీనివాస్ గారూ, నిజమే రత్నం గారి గురించి చాలా రాయచ్చండీ.. వ్యాఖ్య రాసినందుకు ధన్యవాదాలు. తిరుప్పావై గురింఛి మర్చిపోయానండి. ఈ సంగతినీ, నాన్నగారి వ్యాసం గురించీ లింక్ ఇచ్చినందుకు థాంక్స్ అండీ.

A Homemaker's Utopia said...

మంచి గాయని గురించి పరిచయం చేశారు.Nice to know about her.థాంక్స్ అండీ..:-)

తృష్ణ said...

thanks nagini gaaru.