సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Showing posts with label కొన్ని జ్ఞాపకాలు. Show all posts
Showing posts with label కొన్ని జ్ఞాపకాలు. Show all posts

Monday, September 6, 2010

Jagjit Singh's "Sailaab" title song -- "Apni marji se.."


ఒకప్పుడు టివీ సీరియల్స్ "meaningful drama" అనిపించేవి. ఒక్క ఎపిసోడ్ కూడా మిస్సవ్వకుండా చూసేవాళ్ళం. ఫ్రెండ్స్ తో ఆ డైలాగ్స్, పాత్రలు, కథ గురించిన చర్చలకి అంతు ఉండేది కాదు. కొన్ని సీరియల్ డైలాగ్స్ అయితే పేపర్ మీద రాసుకుని దాచుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మేం చదువుకునే రోజుల్లోని హిందీ సీరియల్స్ గురించి. తెలుగులో బాలచందర్ వి రెండు సీరియల్స్, ఋతురాగాలు తప్ప ఇంకేమీ చూడతగ్గవి ఉండేవి కాదు. జీ టివీ లో బనేగీ అప్నీ బాత్, కషిష్, సైలాబ్, స్పర్ష్, మొదలైనవి ఎంతో బాగుండేవి. నెట్ లో ఏదో వెతుకుతూంటే "సైలాబ్" సీరియల్ టైటిల్ సాంగ్ దొరికింది.

ఈ పాట సాహిత్యం కోసం సీరియల్ మొదలైనప్పుడు, ఆఖరులో టైటిల్స్ అప్పుడు కాయితం పెట్టుకుని రాసుకుంటూ ఉండేదాన్ని. సీరియల్ లో డైలాగ్స్ అయితే అద్భుతంగా ఉండేవి. "రవిరాయ్" దర్శకత్వం వహించిన అన్ని సీరియల్స్ లోనూ డైలాగ్స్ అలానే ఉండేవి.

"సైలాబ్" తరువాత "రవిరాయ్" దర్శకత్వం వహించిన "స్పర్ష్" అనే సీరియల్ సోనీ లో వచ్చేది. చాలా బాగుండేది. కృష్ణ పాత్ర అయితే మా స్నేహితులందరికీ ఫేవొరేట్ అయిపోయింది. Mahesh thakur(anand), Mrinalkulkarni (krishna) మధ్యన జరిగే డైలాగ్స్ బాగున్నాయనిపించేవి రాసుకునేదాన్ని. ఇప్పటికీ దాచుకున్నాను....!



ఇంతకీ "సైలాబ్" సీరియల్ టైటిల్ సాంగ్ ను talat aziz స్వరపరచగా, Jagjit singh పాడారు. ఎంతో పాపులర్ అయ్యిందీ గజల్. ఇదిగో వినండి...



lyrics:

अपनी मर्जी सॆ कहाँ अपनी सफर की हमनॆ
रुख हवावॊं का जिधर है उधर की हमनॆ

पेहलॆ हर चीज थी अपनी मगर अब लगता है
अपनॆ ही घर में किसी दूसरॆ घर कॆ हम है

वक्त कॆ साथ मिट्टी का सफ़र सदियॊं सॆ
किसकॊ मालूम कहाँ कॆ है किधर कॆ हम है

चलतॆ रेहतॆ हैं कॆ चलना है मुसाफिर का नसीब
सॊचतॆ रेहतॆ हैं किस राह गुजर कॆ हम हैं



Sunday, September 5, 2010

సుల్తానా మిస్



ప్రతి టీచర్స్ డే కీ, ఏప్రిల్ 16 కీ నాకు గుర్తు వచ్చేది "
సుల్తానా మిస్". నా ఫేవొరేట్ టీచర్. మా 7th క్లాస్ మిస్. అన్ని సబ్జక్ట్స్ కూ ఆవిడే టీచర్. మేము స్కూల్లో అందరు టీచర్స్ నూ "మిస్" అనే పిలిచేవాళ్ళం. అందరూ మిస్సులే ఉండేవారు. (అంటే "సార్లు ఉండేవారు కాదు) నేను 7th క్లాస్ దాకా ఇంటికి దగ్గరగా ఉన్న ఒక క్రిష్టియన్ స్కూల్లో చదివాను. అక్కడ అంతదాకే ఉండేది. స్కూల్ పిల్లలందరికీ "సుల్తానా మిస్" అంటే భయమ్. చాలా స్ట్రిక్ట్, వెరీ డిసిప్లీన్డ్. చదువు విషయంలో ఏమాత్రం అలక్ష్యం సహించేవారు కాదు. అప్పట్లో ఫోటోలు తీసుకుని దాచుకోవాలి అనే తెలివితేటలు ఉండేవికాదు. గుర్తున్నంతమటుకు ఆవిడ సమానమైన ఎత్తులో, తెల్లగా, కాస్త ఎక్కువ బొద్దుగా, అందంగా ఉండేవారు. ఆవిడ మట్టెలకు మువ్వలు ఉండేవి. నడుస్తూంటే విచిత్రమైన శబ్దం వచ్చేది. ఆ మువ్వల సవ్వడి వినిపిస్తే ఆవిడ వచ్చేస్తున్నారని అర్ధం. పిల్లలందరూ గప్చుప్ అయిపోయేవారు. మా హెడ్మిస్ట్రెస్ కూడా సుల్తానా మిస్ కు చాలా అధికారాలు ఇచ్చేవారు.


మమ్మల్ని 6th క్లాస్ దాకా ఇంట్లోనే అమ్మ చదివించేది. 7th క్లాస్ కామన్ ఎగ్జామ్స్ ఉండేవి. అందుకని అప్పటి నుంచీ ట్యూషన్కు పంపించేది, మా 7th క్లాస్ మిస్ "సుల్తానా మిస్" దగ్గరకు. మేము బెజవాడలో సూర్యారావు పేటలో ఉండేవాళ్ళం. మిస్ ఇల్లు ఏలూర్ రోడ్డులో రామమందిరం ఎదురు సందులో ఉండేది. రిక్షాలు తెలియవు. అంత దూరం నడుచుకునే వెళ్ళేవాళ్ళం. 5.30-6pm నుంచీ 8.30-9pm దాకా ట్యూషనే. స్కూల్ నుంచి రాగానే ఏదో తినిపించేసి ట్యూషన్కు తోలేసేది అమ్మ. మాననిచ్చేది కాదు. 1st floorలో మిస్ వాళ్ళ ఇల్లు, ఆ పై మేడ మీద ట్యూషన్. మేడంతా పిల్లలతో నిండిపోయేది. వాళ్ళఇంట్లో మొత్తం ఐదుగురు సిస్టర్స్, తల్లి ఉండేవారు. ఇంకో అమ్మాయి, అబ్బాయి వేరే ఊళ్ళో ఉండేవారు. మిగిలిన వివరాలు మాకెవరికీ తెలియవు. ముగ్గురు సిస్టర్స్ మా స్కూల్లోనే చేసేవారు. మిగిలిన ఇద్దరూ మరో స్కూల్లో చేసేవారు. చాలా సాంప్రదాయమైన ముస్లిం ఫ్యామిలీ. మిస్ వాళ్ళ అమ్మగారు ట్యూషన్ పిల్లలందరినీ ఎంతో ప్రేమగా పలకరించేవారు. పరీక్షలుంటే అందరం లైన్లో వెళ్ళి ఆవిడ ఆశీర్వాదం తీసుకునేవాళ్ళం. అదో సామ్రాజ్యం. భయంతో పాటే ఆవిడంటే ఎంతో గౌరవం ఉండేది అందరికీ.

ఒకసారి ఏదో విషయంలో ఒక అమ్మాయి "ఉండు..మిస్ కు చెప్తాను నువ్విలా చేసావని" అని భయపెట్టింది. నాకు చాలా భయం వేసింది. ఎందుకనో మరి ధైర్యంగా ఆవిడ దగ్గరకు వెళ్ళి, "ఇలా జరిగిందండీ, తను మీతో చెప్తానని భయపెడుతోంది. మీఋ నన్ను కొడతారాండీ?" అని అడిగేసాను. ఆవిడ నవ్వేసి, "నిన్నెందుకు కొడతానురా...నీ గురించి నాకు బాగా తెలుసు...నువ్వు నా ఫేవొరేట్ స్టుడెంట్ వి" అంటూ దగ్గరగా తీసుకున్నారు. నాకు అదో అద్భుతం క్రింద తోచింది. స్కూలంతా భయపడే సుల్తానా మిస్ కు నేనంటే ఇష్టమా? ఆశ్చర్యం వేసింది. ఆనందం వేసింది. ఆ అభిమానాన్ని నేను చివరిదాకా కాపాడుకున్నాను.


పిల్లలందరమూ మంచి మార్కులు తెచ్చుకోవాలని సుల్తానా మిస్ శ్రమించేవారు. 7th క్లాస్ లో ఎగ్జామ్స్ ముందు రివిజన్ చేయించేవారు. పొద్దున్నే చదివితే బాగా గుర్తుంటాయి అని అందరూ పొద్దున్నే 4.30am లేచి చదవాలనీ, పేరెంట్స్ అందరూ పిల్లలు ఎన్నింటికి లేచారో,ఎంతదాకా చదివారో డైరీలో టైములు రాయమనేవారు. "నేను మీ ఇళ్ళకు వచ్చి చూడను. ఇది మీకోసమే. మీరు నన్ను మోసం చెయ్యాలని మీవాళ్ళతో తప్పు టైమింగ్స్ వేయించి తెస్తే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లే. నాకు ఒరిగేదేమీ లేదు." అని చెప్పారు. అందరం పొద్దున్నే లేచి చదివేవాళ్ళం. నాన్న అలారం పెట్టుకుని నన్ను లేపి చదువుతున్నానో, నిద్రోతున్నానో చెక్ చేస్తూ ఉండేవారు. ఆవిడ పుణ్యమా అని చదువు మీద ఆ శ్రధ్ధ ఇప్పటికీ ఉండిపోయింది నాకు. ఇంకా ఏదన్నా కోర్సు దొరికితే చదవటానికి నేనిప్పటికీ రెడీ.

పిల్లలకు చదువు పట్ల శ్రధ్ధ, ఆసక్తి కలిగించటమేకాక ఇతర విషయాల పట్ల కూడా అవగాహన ఉండేలాగ అన్ని కబుర్లూ మాతో చెప్తూ ఉండేవారు. ఏ స్టూడెంట్ ఏ సబ్జక్ట్ లో వీక్ గా ఉన్నాడో తెలుసుకుని అది బాగా అర్ధమయ్యేలా చెప్పి, ప్రత్యేక శ్రధ్ధ తీసుకుని చదివించేవారు. చాల అందంగా రాసేవారు. బహుశా నేను గుడ్ హేండ్ రైటింగ్ కూడా ఆవిడను చూసే నేర్చుకుని ఉంటాను. పిల్లలందరూ ఇంగ్లీష్ సరిగ్గా మట్లాడేలా నేర్పించేవారు. క్లాస్ లో ఒక బ్రైట్ స్టూడెంట్, ఒక వీక్ స్టూడెంట్, అలా ఆర్డర్లో కూర్చోపెట్టేవారు. తెలియనివి వెంఠనే తెలుస్తాయి, పక్కనున్నవాళ్ళను చూసి సగం నేర్చుకోవచ్చు అంటూండేవారు. పిల్లలందరూ ఆవిడ అనుకున్న ప్రకారం మార్కులు తెచ్చుకునేలా చూసేవారు. ఇంతకన్న బెస్ట్ టీచర్ ఉండరేమో అనిపించేది. స్కూల్ మారాకా కూడా నేను మరో రెండేళ్ళపాటు ఆవిడ దగ్గరకే ట్యూషన్కు వెళ్ళేదాన్ని. తరువాత ఇల్లు మారిపోయాకా దూరమైందని మానేసాను.

స్కూల్ వదిలి వెళ్ళిపోయిన ఐదారు బ్యాచ్ ల తాలుకూ పిల్లలు అందరూ మిస్ ను కలవటానికి వస్తూండేవారు. నేను కూడా ఇంటర్ అయ్యేదాకా కూడా ప్రతి ఏడూ ఏప్రిల్ 16 కి వెళ్ళి కలిసేదాన్ని. ఆ రోజు ఆవిడ పుట్టినరోజు. ఏమిటో నీకింకా గుర్తే అని నవ్వేవారు. "నా ఫేవొరేట్ స్టూడెంట్" అని అక్కడున్నపిల్లలందరికీ చెప్పేవారు. ఇంటర్లో "HSC" గ్రూప్ తీసుకున్నానంటే నేనూ లిటిరేచర్ స్టూడెంట్ నే అని సంతోషించారు. ఆ తరువాత స్కూల్ మారారనీ, ఊరు మారిపోయారని విన్నాను. ప్రయత్నించాను కానీ ఆచూకీ తెలియలేదు. గట్టిగా ప్రయత్నిస్తే దొరికేదేమో అనుకుంటూ ఉంటాను. ఇప్పుడెకడున్నారో తెలీదు. ఎక్కడున్నా ఆరోగ్యంగా, కుశలంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాను. అటువంటి డిసిప్లీన్డ్ వ్యక్తిని, మంచి డేడికేటెడ్ టిచర్నూ నేను చదువుకున్నంత కాలం మళ్ళీ ఎక్కడా చూడలేదు. ఆవిడను చూసి నేను చాల నేర్చుకున్నాను. ఇప్పటికీ ప్రతి టీచర్స్ డే కీ, ఏప్రిల్ 16 కీ ఆవిడను తలుచుకుంటూనే ఉంటాను.



Friday, June 4, 2010

పుట్టినరోజు "బాలు" ని rare photos..!!

తెలుగు సినీ గేయ ప్రపంచం లో ఒక యునీక్ సింగర్ గా బాలుగారు అధిరోహించిన శిఖరాలను బహుశా మరెవ్వరూ చేరుకోలేరు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆ మహానుభావుని తాలుకూ కొన్ని రేర్ ఫొటోస్ ను, కొన్ని జ్ఞాపకాలనూ ఈ టపాలో పంచుకుంటున్నాను.

1971లో నాన్నగారు ఆకాశవాణి హైదరాబాద్ స్టేషన్లో పని చేస్తున్నప్పుడు , 'సంబరాల రాంబాబు' సినిమా రిలీజ్ తరువాత మద్రాస్ నుంచి బాలుగారు వచ్చినప్పుడు జరిగిన ఒక ఇంటర్వ్యు ఫోటో ఇది. ఆకాశవాణి తరఫున ఇంటర్వ్యు చేస్తున్నది మా నాన్నగారు.


బాలుగారి పాటకు నలభై వసంతాలు పూర్తయినప్పుడు "నయనం" అనే మాసపత్రిక వారు 2007లో ఆయన గురించిన విశేషాలతో,ఆర్టికల్స్ తో ఒక ప్రత్యేక సంచిక వేసారు. గొల్లపూడి గారి "ఎలిజీలు" పుస్తకం ఆవిష్కరణ సభ + బాలు పాటకు నలభై వసంతాలు సందర్భంగా జరిగిన సన్మాన సభ తాలూకూ విశేషాలు ఆ పత్రిక లో ప్రచురించారు. అందులోనివే ఈ క్రింది ఫోటోస్ :










ఆ పుస్తకంలో ప్రచురించిన బాలుగారి బయోడేటా :

అప్పటి "ఆంధ్రప్రభ" దినపత్రిక ఎడిటర్ దీక్షితులు గారి ఆధ్వర్యం లో తెలుగు సినిమా చరిత్ర గురించిన రకరకాల విశేషాలతో ప్రచురించబడిన "మోహిని(రెండు భాగాలు)" అనే పుస్తకంలో ఎందరో ప్రముఖుల చేత ఎన్నో వ్యాసాలు రాయించారు. ఆ పుస్తకం లో బాలూ ఇంటర్వ్యూ కోసం, విజయవాడ ఆకాశవాణి వార్తా విభాగం లో పనిచేస్తున్న బాలు చిరకాల మిత్రులు ప్రసాద్ గారితో పాటూ, ఆ ఇంటర్వ్యూ రికార్డ్ చేయటానికి నాన్నగారు కూడా నెల్లూర్లోని బాలుగారి ఇంటికి వెళ్ళారు. రెండు గంటలపాటు జరిగిన ఆనాటి ఇష్టాగోష్ఠి, చెప్పుకున్న కబుర్లు మరపురానివని నాన్న చెప్తూంటారు.

అప్పుడే 'మా అమ్మాయి కోసం' అని నా పేరుతో ఒక ఆటోగ్రాఫ్ చేయించుకున్నారు. నా పేరు అడిగి ఒక జోక్ కూడా వేసారుట ఆయన. (ప్రస్తుతం ఆ లెటర్ కాని ,ఆటోగ్రాఫ్ కానీ దొరకలేదు టపాలో పెడదామంటే..) ఆ తరువాత కమల్ హాసన్ కు డబ్బింగ్ చెప్పటమే కాక బాలు సొంతంగా ప్రొడ్యూస్ చేసిన "మహానది" సినిమా చూశాకా, బాగా నచ్చేసి, నాన్న ఆయనకు ఒక లెటర్ రాసారు. దానికి ఆయన సమాధానం రాస్తూ చివరలో నా పేరు గుర్తుంచుకుని అమ్మాయికి ఆశీస్సులు అని కూడా రాసారు. అంతటి జ్ఞాపక శక్తి ఆయనది.


Tuesday, May 25, 2010

Western breeze...

పాశ్చాత్య సంగీతంతో నా పరిచయం చిన్ననాటిది. నాన్నగారి కేసెట్స్ ఖజానాలో తెలుగు,హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ మొదలైన భారతీయ భాషలతో పాటూ రకరకాల western Music cassettes కూడా ఉండేవి. Accordion, Electric guitar, Acoustic guitar, Piano, Saxophone, Trumpet మొదలైన western instrumental cassettes; Popular Western Film Themes ఉన్న కేసెట్లు; Vivladi, Mozart, Beethoven మొదలైన మహామహుల Concerts; ABBA, BoneyM, Shadows, Beatles, Ventures మొదలైన band albums; Pop, Jazz, Rock types, Cliff Richards, Connie Francis, Barbra Streisand, Michael jackson మొదలైనవారి individual albums ఉండేవి. అన్నిరకాల కేసెట్స్ తో పాటూ ఇవన్నీ కూడా వింటూ ఉండేవాళ్ళం మేం పిల్లలం.

అవన్నీ విన్న కొద్దీ ఎన్నో కొత్త విషయాలు తెలుస్తూ ఉండేవి. చాలా భారతీయ సినిమా పాటలపై western music impact లేదా వాటి inspiration ఉందన్నది అందరికీ తెలుసున్న విషయమే. కొత్త సినీ సంగీత దర్శకులే కాక, చాలా మంది పాత తెలుగు సినీసంగీత దర్శకులు కూడా western music నుంచి స్ఫూర్తి పొంది చక్కని తెలుగు పాటలు కంపోజ్ చేసారు అన్న సంగతి ఆ western music cassettes వింటూంటే తెలిసేది . western inspirations లోంచి కొన్ని పాటలుగానే కాక పల్లవులుగా, పాటల్లోని ఇంటర్లూడ్ మ్యూజిక్ లా కూడా వచ్చాయి. బహు కొద్ది ఉదాహరణలు చూడండి :

ప్రేమించి చూడులో "అది ఒక ఇదిలే" పాట "Bésame Mucho" అనే Spanish song నుంచి ఇస్పైర్ అయ్యింది.
ఇద్దరు మిత్రులు లో "హలో హలో ఓ అమ్మాయి" పాట "
Ya Mustafa", అనే famous Egyptian song నుంచి,

చిట్టి చెల్లెలు లో "ఈ రేయి తీయనిది" పాట "
love is blue" song music నుంచీ,

ఆత్మీయులు సినిమాలో "మదిలో వీణలు మ్రోగే" పాట ముందరి ఆలాపన Cliff richards పాడిన "ever green trees" -నుంచి ఇన్స్పైర్ అయ్యింది.

ఇలా మన పాత తెలుగు సినిమా పాటల్లో మారువేషాలు ధరించిన పాశ్చాత్య బాణీలు ఎన్నో ఉన్నాయి...అయితే అలనాటి తెలుగు సినీసంగీత దర్శకులు ఒరిజినల్ ట్యూన్స్ తయారు చెయ్యటం లో సిధ్ధహస్తులు కాబట్టి ఈ పాశ్చాత్య బాణీల నుంచి తగినంతవరకే ఇన్స్పిరేషన్ పొందేవారు.

ఇక మేము పెద్దయ్యాకా కాలేజీల్లోకి వచ్చాకా సొంత కలక్షన్స్ మొదలెట్టాము. అప్పుడిక అంతా Vchannel, Mtv పరిజ్ఞానమే. Spice girls, Back Street Boys, Boyzone, Savage Garden మొదలైన ప్రఖ్యాత bands తాలూకు పాటలూ, Celine Dion, Janet jackson, Mariah Carey, Marc Anthony, Ricky Martin, Enrique Iglesias
మొదలైనవారి single albums మా కాలేజీ రోజుల్లో బాగా పాపులర్. అవే వినేవాళ్ళం. కొనేవాళ్ళం. టివీలో చూసిన కొన్ని నచ్చిన పాటలు రికార్డ్ చేయించుకునేదాన్ని నేను. విజయవాడలో దొరకకపోతే నాన్న awards తీసుకోవటానికి ఢిల్లీ వెళ్ళినప్పుడు నా చాంతాడంత లిస్ట్ లు ఆయనకు ఇచ్చి వీలైనవి రికార్డ్ చేయించికురమ్మనేదాన్ని. పాపం ఆయన నాకోసం బజారంతా వెతికి మొత్తానికి దొరికినన్ని రికార్డ్ చేయించుకుని వచ్చేవారు.

మా కాలేజీ రోజుల్లో మంచి ఇంగ్లీష్ పాటలు ఉండేవి. అప్పుడు ఫాలో ఐనంత ఇప్పుడు వినట్లేదు కానీ అప్పటి పాటలు మాత్రం ఇతర భాషలతో పాటూ ఇప్పటికీ అస్తమానం మోగిస్తూనే ఉంటాను. Western classical అద్భుతంగా పాడే Barbra Streisand తరువాత నాకు బాగా నచ్చిన female voice "Celine dion"ది. Cliff Richards తరువాత నచ్చే male voice "Marc anthony" ది. ఆ రెండు గొంతులలో పలికే ఆర్తి, భావ ప్రకటన నాకు ఇష్టం.

నాకు బాగా ఇష్టమైన English Songs చాలా ఉన్నాయి కానీ వాటిల్లో బాగా ఇష్టమైన కొన్ని పాటలూ + వాటి సాహిత్యం ఉన్న లింక్స్ ఇక్కడ ఇస్తున్నాను.

============================
Love Is All
Artist: Marc Anthony
Lyrics:













--------------------
She's Always A Woman
Artist: Billy Joel
Lyrics:












------------------------
Rhythm Divine
Artist: Enrique iglesias
Songwriters: Barry, Paul M; Taylor, Mark P;
lyrics:











----------------------------------
Woman In Love
Artist: Barbra Streisand :
Lyrics:











--------------------
Tell him
Artist: Celine dion
Lyircs:












------------------

"Nothing's gonna change my love"
Artist:Glen Medeiros
Lyrics:













----------------------
Truly Madly Deeply
band:Savage Garden
lyrics:











---------------------

Be The Man
Artist: Celine Dion
Lyrics:











Tuesday, March 23, 2010

శ్రీరామనవమి జ్ఞాపకాలు...


"ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.."


నాన్నకు కృష్ణుడంటే ఇష్టం. ఇంట్లో అన్ని కృష్ణుడు పటాలూ,పెద్ద విగ్రహం...!నల్లనయ్య ఇష్టమైనా రాముడంటే నాకు ప్రత్యేక అభిమానం. అదీకాక అమ్మానాన్నల పేర్లు సీతారాములవటం కూడా ఒక కారణం. 'సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మాకు తండ్రి..." అని మేము పాడుతూ ఉంటాము.

శ్రీరామనవమికి అమ్మ చేసే వడపప్పు నాకు చాలా ఇష్టం. నానబెట్టిన పెసరపప్పులో కొబ్బరి కోరు,మావిడి కోరూ వెసి,చిన్న చిన్న పచ్చిమిర్చి ముక్కలు వేసి కాస్తంత ఆవాలు,ఇంగువ పొపు పెట్టి అమ్మ చేసే వడపప్పు ఇప్పటికీ నోరురిస్తుంది. ఇక పానకం సంగతి చెప్పక్కర్లేదు. తీపి ఇష్టం కాబట్టి చేసిన పెద్ద గిన్నెడు పానకం మధ్యాహ్న్నానికల్లా పూర్తయిపోయేది.

మా విజయవాడ బీసెంట్ రొడ్దులో పెద్ద పెద్ద కొబ్బరాకుల పందిరి వేసి సితారామ కల్యాణం చేసేవారు. ఒక సందు చివరలొ ఉన్న చిన్న రామాలయంలొ విగ్రహాలు ఎంత బాగుండేవో...

ఇక రేడియోలో పొద్దున్నే పదకొండింటికల్లా మొదలయ్యే భద్రాచల కల్యాణం తప్పక వినాల్సిందే...అందులోనూ "ఉషశ్రీ తాతగారి" గోంతులో వచ్చే వ్యాఖ్యానం వినితీరాలి. ఆయన గంభీరమైన గొంతుకు సాటి వేరే గొంతు ఇప్పటికీ లేదు.నాన్న రేడియోలోనే పని చేయటంవల్ల మాకు పరిచయమే కాక, మా నాన్నంటే ఉషశ్రీ తాతగారికి ప్రత్యేక అభిమానం ఉందేది. అమ్మని "అమ్మాయ్" అని పిలిచేవారు. మేము ఆయనను "తాతగారు" అని పిలిచేవాళ్ళం. ఎంతో మహోన్నతమైన వ్యక్తి ఆయన. రేడియో వినే వాళ్ళకు తెలవచ్చు ఆయన చెప్పిన "ధర్మ సందేహాలు" కార్యక్రమం ఎంత ప్రఖ్యాతి గాంచిందో..!

మేము క్వార్టర్స్ లోకి మారాకా అక్కడ ప్రతి ఏడు రామనవమికి పందిరి వేసి కల్యాణం చేసేవారు. సాయంత్రాలు పిల్లలందరం కార్యక్రమాలు...నేనూ ఒకటి రెండు సార్లు పాటలు పాడాను...

శ్రీరామనవమికి ప్రతిఏడు చిన్నపాటి చినుకు పడడం నా చిన్నప్పటినుంచీ చూస్తున్నా....రేపు కూడా మరి చిరుజల్లు పులకింపచేస్తుందని ఆశిస్తున్నాను..

బ్లాగ్మిత్రులందరికీ శ్రీరామనవమి సందర్భంగా రాములవారి ఆశీస్సులు లభించాలని మనసారా ప్రార్ధిస్తున్నాను.

Tuesday, March 2, 2010

పాత పత్రికలూ...మధుర స్మృతులు!

నేను ఊహ తెలిసేసరికీ ఇద్దరు తాతయ్యలనీ ఎరుగను. అందువల్ల నా పాపకు పెద్దల ముద్దుమురిపాలు వీలయినంత అందించాలనేది నా ఆశయం. మా మామగారు కూడా రెండేళ్ళ క్రితం కాలం చేయటంతో మా ఇంట్ళో దాని కాలక్షేపం ఒక్క "నానమ్మ"తోనే. పాపకు అమ్మమ్మ,తాతయ్యల ప్రేమను కూడా అందించాలనే కోరికతో ఈ ఊరు వచ్చినప్పటి నుంచీ స్కూలు సెలవులు ఉన్నప్పుడల్లా, వారం పదిరోజులకోసారైనా, ఓపిక ఉన్నా లేకపోయినా పాపను అమ్మావాళ్ళింటికి తీసుకువెళ్తూ ఉంటాను. కానీ ఈసారి దాదాపు నెల తరువాత ఇంటికి వచ్చాను. ఈసారి ఇంట్లోని పాత పుస్తకాలన్నీ ఓసారి చూడాలనిపించింది. ఎన్నిసార్లు వచ్చినా చదవటం అయిపోనన్ని పుస్తకాలు, వినటం అయిపోనన్ని కేసెట్లు మా ఇంట్లో. నా బాల్యం, సగం జీవితం ఈ పుస్తకాల మధ్యన, కేసెట్ల మధ్యనే గడిచిపోయింది. వాట్ని చూస్తే నా ప్రాణం లేచి వచ్చినట్లు, మళ్ళీ నాలో కొత్త జీవం ప్రవేశించినంత ఆనందం కలుగుతుంది. పాత పుస్తకాలంటే కధలూ,నవలలు...ఇతర పుస్తకాలూ కాదు. పాత పత్రికల తాలుకూ బైండింగ్స్.

మా చిన్నప్పుడు ఇంట్లో చాలా పత్రికలు తెప్పించేవారు. పూర్తి సినిమా కబుర్లతో ఉండే "విజయచిత్ర", "వనిత", "ఆంధ్ర సచిత్ర వార పత్రిక", "ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ", "రీడర్స్ డైజస్ట్", 'స్పేన్"...అప్పుడప్పుడు సితార మొదలైన పొడుగాటి సినీ పత్రికలు...ఇలా రకరకాల పత్రికలు ఇంట్లో ఉండేవి. మా పిల్లల కోసం "ట్వింకిల్","బాలజ్యోతి", బాలమిత్ర", "చందమామ","అమర చిత్ర కధలు" మొదలైనవి కూడా తెచ్చేవారు నాన్న. నాకు తెలుగు చదవటం బాగా వచ్చాకా అప్పట్లో పావలాకు అద్దెకు ఇచ్చే "పగడాల పడవ","రాకాసి లోయ" లాంటి చిన్న కధల బుల్లి పుస్తకాలూ, మిగతా పిల్లల పుస్తకాలతో పాటూ అవీ ఇవీ అని లేకుండా నవలలూ,పత్రికలు కూడా చదివేస్తున్నానని అమ్మ నన్ను కంట్రోల్ చేయటానికి చాలా జాగ్రత్తలు తీసుకునేది. కానీ అమ్మ మధ్యాహ్నం నిద్రోయినప్పుడూ, శెలవు దినాల్లోనూ అమ్మకు కనబడకుండా నా చదువు కొనసాగుతూ ఉండేది.


మా అప్పటి ఇంట్లో ఒక చిన్న గదిలో బాగా ఎత్తుమీద ఒక కిటికీ ఉండేది. దానికో బుల్లి అరుగు కూడా ఉండేది. అందులోకి ఎక్కి ఎవరికీ కనపడకుండా పత్రికలన్నీ చదివేస్తూ ఉండేదాన్ని. అది కనిపెట్టిన అమ్మ నా క్షేమాన్ని కాంక్షించి అసలు వార పత్రికలు కొనటమే మానేసింది. కానీ అప్పటిదాకా తెప్పించిన పత్రికల్లోని మంచి కధలనూ, సీరియల్స్ నూ, ఇతర విషయాలనూ కొన్నింటిని కట్టింగ్స్ చేసి జాగ్రత్తగా బైండింగ్ చేయించి దాచింది. పిల్లల పుస్తకాలన్నీ కూడా భద్రంగా దాచి బైండింగ్స్ చేయించింది అమ్మ. అవన్ని నా టెంత్ క్లాస్ అయ్యాకా శెలవుల్లో,నేను కాలేజీలోకి వచ్చాకా చదవనిచ్చేది. అప్పుడు మొదలు సమయం దొరికినప్పుడల్లా ఆ బైండింగ్స్ ను ఎన్నిసార్లు చదివానో...

ఇంతకీ ఆ బైండింగ్స్ లో ఏమున్నాయంటే పురాణం సీతగారి "ఇల్లాలి ముచ్చట్లు" , మాలతీ చందూర్ గారి "ప్రమదావనం" తాలూకూ కట్టింగ్స్ ఒక బైండ్; "వనిత"లోని కధలు, సీరియల్స్ ఒక బైండ్, "ఆంధ్ర సచిత్ర వార పత్రిక"లోని కొన్ని సీరియల్స్ ఒక బైండ్, "విజయచిత్ర" పత్రికల్లోని కట్టింగ్స్ సంవత్సరం వారీగా ఒక పదేళ్ళపైగా ఉన్న కొన్ని బైండ్స్, "ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ"లో ప్రచురించిన మంచి మంచి ఫొటొగ్రాఫ్స్ తో
ఒక బుక్కు, అన్నిరకాల పత్రికల్లోంచీ సేకరించిన కొన్ని మంచి కధలతో ఒక బైండ్, ఇవికాక మేం పిల్లలం ఇప్పటికీ నాకంటే నాకని దెబ్బలాడుకునే "చందమామా" "బాలజ్యోతి" "ట్వింకిల్" "అమర చిత్ర కధలు" మొదలైనవాటి బైండింగ్స్...ఇంక్లా పైంటింగ్స్, వంటా-వార్పూ, సలహాలు,సూచనలు....ఇలా రాసుకుపోతే రెండు టపాలకు సరిపోయేన్ని నిధి నిక్షేపాలను మా అమ్మ పదిలపరిచింది.

ఇవాళ పొద్దున్నే వాటిని తిరగేసి , చదవటానికి కొన్నింటిని తీసుకున్నా. ఇవన్నీ నేను ఇదివరలో చాలా సార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలనే ఉంటాయి. అంత మంచి కధలూ, విశేషాలూ అవన్నీ. ఇన్నాళ్ళ తరువాత వాటిని చూసాకా వాటి గురించి బ్లాగులో రాయాలని మనసైంది....ఈ టపా తయారైంది..!!

Tuesday, January 12, 2010

సంక్రాంతి...ముగ్గులు...


స్కూల్లో ఉన్నన్నాళ్ళూ ప్రతి "సంక్రాంతి"కీ నానమ్మా వాళ్ళ ఊరు వెళ్ళేవాళ్ళం. ప్రతి ఏడూ భోగి రోజున చీకటిఉదయనే రిక్షాలో ఇంటికి వెళ్తూంటే, చల్లని చలిలో్ దారి పొడుగునా వెచ్చని భోగిమంటలు...ప్రతి ఇంటి ముందూ మట్టినేల మీద తెల్లని, రంగురంగుల ముగ్గులతో నిండిన లోగిళ్ళు...
నలుగుపిండి స్నానాలూ, పట్టు పరికిణీలూ,
వంటింట్లోంచి పిండివంటల ఘుమఘుమలూ,
బొమ్మల కొలువులూ, భోగిపళ్ళ పేరంటాలూ,
గొబ్బెమ్మలూ...వాటిపై ముద్దబంతి పూలూ,
గంగిరెద్దులాటలూ , సన్నాయి మేళాలూ,

డుడు బసవన్నలు, హరిదాసు గానాలూ,
....ఆ స్మృతుల మధురిమలే అంబరాన్నంటే సంబరాలు...!!
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని జ్ఞాపకాలో..ఎన్ని నిట్టూర్పులో...ఎన్ని సరదాలో...ఇప్పుడే చిలికిన వెన్నలా తెల్లగా,మెత్తగా,కరిగిపోయే జ్ఞాపకాలు...అపురూపాలు.

సంక్రాంతి అనగానే నాకు నచ్చిన, గుర్తొచ్చే "సింధూరం" సినిమాలో పాట....




ఆ పాట తాలూకూ యూట్యూబ్ లింక్:
http://www.youtube.com/watch?v=Zj-S2_gYfVo

ఇక సంక్రాంతి అనగానే మొదట గుర్తు వచ్చేవి నాకెంతో ఇష్టమైన "ముగ్గులు". ఇంకా చెప్పాలంటే ముగ్గులంతే పిచ్చి. ధనుర్మాసం ఆరంభమౌతూనే నెలపట్టి ఇంటి ముందర ముగ్గులేయటం మొదలుపెట్టేవాళ్ళం. నానమ్మ, అత్త, పెద్దమ్మా, పిన్నిలు, అమ్మా....ఇంట్లో అందరు ముగ్గుల స్పెషలిస్టులే. మా అత్త పేరు వీధిలో ఎవరికీ తెలియదు. ఆవిడని అందరూ "ముగ్గులత్తయ్యగారు" అనే పిలుస్తారు ఇప్పటికీ.

మా అమ్మ దగ్గర నేను నేర్చుకున్న ఒక ముగ్గు టెక్నిక్ "వెడల్పు పోత ముగ్గు". మామూలుగా సన్నని గీతలా కాక బొటనవేలూ,చూపుడువేలూ,మధ్యవేలు కలిపి మూడు వేళ్ళతో వేసే ముగ్గును "వెడల్పు పోత ముగ్గు" అంటారు.మా అమ్మ వాళ్ళ అత్తగారి దగ్గర నెర్చుకుంది.నేను అమ్మ చూసి నేర్చుకున్నా..క్రింద మట్టి నేలపై ఉన్న ముగ్గులన్ని ఆ విధంగా వేసినవే. ఎప్పుడో వేసినవి....ఇదివరకూ మొదట్లో ఎప్పుడో ప్రచురించిన కొన్ని "ముగ్గులు"...








బ్లాగ్మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

Friday, December 25, 2009

నా రూప పుట్టినరోజు...


ఆ రోజు నా కింకా గుర్తు....నేను 10th క్లాస్ చదువుతున్నాను.మేము కొత్తగా కట్టిన క్వార్టర్స్ లో 2nd ఫ్లోర్లో దిగాం. పొద్దున్నే నేను మెట్లు దిగి స్కుల్కెళ్తున్నాను. 1st ఫ్లోర్ దగ్గర "నువ్వేక్లాస్" అడిగిందో అమ్మాయి. చెప్పాను. "నువ్వు..?" అడిగాను. "9th.." అంది. ఆ తర్వాత నుంచి తనకు అక్కలు లేరని అలాగే పిలుస్తానని నన్ను "అక్కా" అని పిలిచేది. డిసెంబర్లో తన పుట్టినరోజు వచ్చింది. ఏ సంవత్సరం? అంటే చెప్పింది..."అదేమిటి మనకి నాలుగు నెలలే తేడా..నన్ను అక్కా అని పిలవకు. పేరు పెట్టే పిలువు.." అన్నాను. "వద్దు.నాకిలాగే అలవాటైంది...అక్కా అనే పిలుస్తాను." అంది. తనే "రూప". నా ప్రాణ స్నేహితురాలు. ఇవాళ తన పుట్టిన రోజు.

"స్నేహం" టపాలో రాసిన స్కూల్ ఫ్రెండ్ మాధవి తరువాత నాకు దగ్గరైన స్నేహితురాలు. "కూరల మార్కెట్" టపా లో గుర్తు చేసుకున్న కాలేజీ ఫ్రెండ్ ఎంత సన్నిహితమో..అంతకన్నా ఎక్కువ సన్నిహితమైన స్నేహితురాలు. మేము Friends for life అంతే...! తన గురించి "యాస్మిన్" టపాలో కూడా రాసాను. తనే కాక వాళ్ళమ్మగారితో కూడా నాకు స్నేహమే. ఆంటీ కి నేనంటే చాలా ఇష్టం ఉండేది. ఇంట్లో ఏది చేసినా నాకు తెచ్చి ఇచ్చేవారు, లేదా తనతో పంపేవారు. నన్ను చూసి పనులు నేర్చుకొమ్మని రూపని కోప్పడుతూ ఉండేవారు. వాళ్ళ నాన్నగారు టెక్నికల్ సైడ్ కావటంతో ట్రాన్స్ఫర్స్ ఎక్కువ ఉండేవి వాళ్ళకు. ఎక్కువ భాగం నార్త్ ఇండియాలో తిరిగి వచ్చారు. తెలుగు మాట్లాడటం,రాయటం తప్ప చదవటం పెద్దగా రాదు తనకి. హిందీ,ఒరియా,బెంగాలీ,ఇంగ్లీష్,మరాఠీ ఐదు భాషలూ బాగా మాట్లాడేది. బాగా రాసేది కూడా. మాకిద్దరికీ "షటిల్ ఆడటం" చాలా ఇష్టం. మా క్వార్టర్స్ లో ఉన్న కోర్ట్ లో మేమిద్దరం రోజూ సాయంత్రాలు షటిల్ ఆడుకునేవాళ్ళం.

తన గురించి చెప్పాలంటే నేను మళ్ళీ అలాంటి స్నేహశీలిని మళ్ళీ నా జీవితంలో చూడలేదు. అందరికీ ఎక్కడో అక్కడ ఎవరో ఒకరితో చిన్నావైనా గొడవలు వస్తూంటాయి. నేనే నా మిగతా స్నేహితులతో చిలిపి తగాదాలకి పోయిన రోజులు ఉన్నాయి. కానీ రూప కి పరిచయమైన ప్రతి వ్యక్తీతో సత్సంబంధాలే. ఎక్కదికి వెళ్ళినా తోకల్లాగ బోలెడు మంది స్నేహితులను పోగేసుకునివచ్చేది. నేను అనేదాన్ని...వాళ్ళందరు తరువాత. ముందు నేనే....అని. "అయ్యో అక్కా....నాకెప్పటికీ నువ్వే ముందు..ఆ తర్వాతే అందరూ.." అందరూ అనేది. మా ఇద్దరికీ ఒక్కసారి కూడా ఏ మనస్పర్ర్ధ రాలేదు. ఇప్పటికీ అలానే ఉన్నాం. మూడేళ్ళ తరువాత వాళ్ళు శోలాపూర్ వెళ్పోయారు. అక్కడ తను ఇంజినీరింగ్ చేసింది. దూరపు బంధువుల్లో ఇంజినీర్ ఒకతను రూప గురించి, తన గుణాల గురించీ విని ఇష్టపడి కావాలని అడిగి పెళ్ళి చేసుకున్నాడు. భార్యను ప్రాణంలా చూసుకోవటం అంటే అతన్ని చూసి తెలుసుకోవాల్సిందే.

రూపా ,నేనూ ఇద్దరం ఒకేలాంటి వాళ్ళం. మా ఇష్టాలూ, అభిరుచులూ, అలవాట్లు, ఆసక్తులు అన్నీ ఒకటే. తనకి తెలుగు పుస్తకాలు చదవటం రాదు, తెలుగు పాత పాటలు,సినిమాలు తెలీవు అంతే. ఇద్దరం కలిసి గ్రీటింగ్స్, పైంటింగ్స్, వేసుకునేవాళ్ళం. తను ఆయిల్ పైంటింగ్స్ చాలా బాగా వేస్తుంది. ముగ్గులు,గోరింటాకులూ పెట్టేవాళ్ళం. నేను కవితలు రాసినా, కొత్తగా ఏదన్నా పాట నేర్చుకున్నా తనే మొదటి ప్రేక్షకురాలు. ఒకరి పుట్టిన రోజులకొకరం అర్ధరాత్రి పన్నేండు దాకా కూర్చుని గోరింటాకులు పెట్టి, విషెస్ చెప్పి నిద్రోయేవాళ్ళం. మా అడ్డా మా "మెట్లు". పైకి వెళ్ళేవళ్ళు వచ్చేవాళ్ళు అందరూ నవ్వుతూ,పలకరిస్తు వెళ్పోతూ ఉండేవాళ్ళు.మామటుకు మేము రోజూ కాసేపు ఆ మెట్ల మీద కూచుని కబుర్లు చెప్పుకుని కానీ ఇళ్ళకు కదిలేవాళ్ళం కాదు. పెళ్ళయ్యాకా తను జాబ్ చేసింది, Mtech దిస్టింక్షన్లో పాసయ్యింది. మళ్ళీ కొన్నాళ్ళు లెక్చరర్గా చేసింది. కానీ బాబు పుట్టాకా ఆ ముచ్చట్లు, ఆ చిన్ననాటి అల్లర్లు మిస్సవ్వకుడదు అనే ఒకే ఒక్క ఉద్దేశంతో జాబ్ మనేసింది. రాను రానూ ఉత్తరాలూ, మైల్స్ తగ్గిపోయినా, భర్తల ఉద్యోగాల రీత్యా మేం ఎంత దూరాల్లో ఉన్నా ఫోన్ల ద్వారా మేమెప్పుడూ కనెక్టెడే.

కష్ట సుఖాల్ని పంచుకోవటం, ఒకరికొకరం ధైర్యం చెప్పుకోవటం, ఎంత దూరంలో ఉన్నా టచ్ లో ఉండటం, ఒకరిపట్ల ఒకరికున్న అభిమానాల్ని నిలబెట్టుకోవటం, మాలాగే పెరుగుతున్న మా పిల్లల్ని చూసుకుని మురిసిపోవటం....ఇదే మేమిద్దరం. అర్ధరాత్రి నిద్ర డిస్టర్బ్ చేయటం ఎందుకని పొద్దున్నే చేసి "B'day విషేస్" చెప్పాను నా రూపకి. ".....15,16 ఏళ్ళ వయసు నుంచీ ఈ వయసుకి చేరాం..." అన్నాను...తను నవ్వింది....!!


(బ్లాగ్మిత్రులకి...పునద్దర్శనం మళ్ళీ సొమవారం..ప్రస్తుతం ఒక పుణ్య క్షేత్ర దర్శనార్ధం ప్రయాణం..)

Tuesday, December 1, 2009

బంధుత్వాలు


(వీరిలో మా పాపా లేదు..దొరికినవాళ్ళకు తీసాము మళ్లీ వాళ్ల మూడ్ మారకుండా...)

"పుణ్యం కొద్దీ పురుషుడు....దానం కొద్దీ బిడ్డలు...."అంటారు.
మన స్వభావాన్ని బట్టి, ఎంపికను బట్టీ "మిత్రులు" ఏర్పడతారు.
మరి మన రక్త సంబంధం ద్వారా మనకు దగ్గరయ్యే బంధువులు....
బంధువులు "భగవంతుడు ఇచ్చిన మిత్రులు" అని నా అభిప్రాయం. వారే స్నేహితులు, సన్నిహితులు అయితే...అంతకు మించిన అదృష్టం ఏముంటుంది? పైన రెండు వాక్యాల తాలూకు అదృష్టాలతో పాటూ భగవంతుడు నాకా అదృష్టాన్నికూడా ఇచ్చాడు. మా బంధువులందరం ఎంతో కలివిడిగా, సన్నిహితంగా ఉంటాము. కజిన్స్ అందరం సొంత అక్క చెల్లెళ్ళలాగ...సొంత అన్నదమ్ములలాగ...!


పెళ్ళిళ్ళకీ, స్పెషల్ అకేషన్స్ కీ అందరం కలుస్తూ..సరదాగా గడిపేస్తాము. మా నాన్నకు ఒక్కరే అక్క. ఇంకెవరూ చుట్టాలు లేరు...ఆవిడను మా రెండవ మేనమామకు ఇచ్చారు. వాళ్ళ పెళ్ళి సమయానికి అమ్మకు ఒక ఏడాదిట. మిగతావాళ్ళంతా చిన్న చిన్న పిల్లలుట. చిన్నన్నయ్య,చిన్నవదినా అంటూ ఎంతో కలసిపోయారు వాళ్ళంతా. కాబట్టి నాకు రెండు వైపుల నుంచీ ఒకే బంధువులు. అందరం ఒక గూటికి చెందినవాళ్ళమే.

తాతగారి సంతానం నలుగురు అబ్బాయిలు,నలుగురు అమ్మాయిలు. చిన్నప్పుడు అందరం తలో ఊళ్ళో ఉండేవాళ్ళం. కానీ సంవత్సరానికి ఓసారైనా తాతగారి ఆబ్దీకానికి అందరం కలిసేవాళ్ళం. అప్పట్లో తాతగారిల్లంతా మా పిల్లల కేరింతలతో, అల్లర్లతొ దద్దరిల్లుతూ ఉండేది. కాస్త పెద్దయ్యాక శెలవుల్లో పిన్నిలు, పెద్దమ్మల ఊళ్ళు వెళ్ళాలంటే అదో పెద్ద ప్రోసెస్. నాన్న కొంచెం స్త్రిక్ట్. ఎక్కడికీ పంపేవారు కాదు. స్నేహితుల ఇళ్ళకు వెళ్ళినా టైం ప్రకారం వెళ్ళి, చెప్పిన టైం కు వచ్చేయాలి. కాస్త లేటైతే నాకోసం బయల్దేరిపోయేవారు. ఓసారేమైందంటే...అమ్మో అది వేరే కధ...(ఇంకో టపాలో..)

ఈ కధలోకి వచ్చేస్తే, శెలవుల్లో ఊళ్ళు వెళ్ళటానికి ముందు అమ్మని కాకాపట్టాలి. ఆ తరువాత కూడా నాన్న ఒప్పుకునేవారు కాదు. అప్పుడు పిన్ని చేతో, పెద్దమ్మ చేతో మాట్లాడించేవాళ్ళం...వాళ్ళు అడిగితే మొహమాటానికి ఇంక అయిష్టంగా ఒప్పేసుకునేవారు..! గ్రీన్ సిగ్నల్ రాగానే ఇక నన్ను ఆ ఊరు తీసుకెళ్ళే మనిషి కోసం వెతుకులాట. ముందుగానే బట్టలు సర్దుకుని రెడీగా ఉన్న నేను, బాబయ్యో, అన్నయ్యో ఎవరో ఒకరు దొరికితే వాళ్ళతో వెళ్పోయేదాన్ని..నర్సాపురం, భీమవరం, విశాఖపట్నం, కాకినాడ, జగ్గయ్యపేట...ఇలా ప్రతి ఏడాదీ శెలవుల్లో బానే వెళ్ళేదాన్ని ఊళ్ళు. కొన్నిసార్లు అమ్మావాళ్ళు కూడా వచ్చేవారు.

ట్రాన్ఫర్ మీద ఒక మావయ్య విజయవాడ వచ్చాకా ఇక అందరూ మా ఊరే వచ్చేవారు. అమ్మమ్మను చూడటానికి. అందరం ఒకచోట కలిసి నవ్వులూ, కేరింతలూ, కబుర్లూ...ఆ సందడే వేరుగా ఉండేది. కానీ రాను రానూ చదువులూ, ఉద్యోగాలతో రాకపోకలు బాగా తగ్గిపోయాయి. అందరం కలిసి మూడు నాలుగేళ్ళు దాటిపోవటం మొదలైంది. కుటుంబంలోని ప్రతి పెళ్ళికీ తప్పక కలిసే కజిన్స్ అందరం పెళ్ళిళ్ళయ్యాకా అసలు కలవటమే తక్కువైపోయింది...!! ఉత్తరప్రత్యుత్తరాలు, ఫోనులూ ద్వారా అందరి విశేషాలు అందరికీ తెలుస్తున్నా, కళ్ళరా చూసుకుని కబుర్లాడే అపురూప క్షణాల కోసం అందరం తపించిపోయే పరిస్థితికి వచ్చాం. కాంటాక్ట్ లో ఉండటానికి కజిన్స్ అందరమూ యాహూ గ్రూప్స్ లో ఒక గ్రూప్ తయారుచేసుకుని గ్రూప్ మైల్స్ ద్వారా అప్పుడప్పుడు కబుర్లాడుతూ ఉంటాం.

ఇప్పుడు అనుకోకుండా అమ్మావాళ్ళు ముగ్గురు అప్పచెళ్ళెళ్ళూ, ఒక మవయ్యా ఒకే ఊళ్ళో స్థిరపడ్డారు. ఏడుగురం కజిన్స్ కూడా ప్రస్తుతానికి ఇక్కడికే చేరాం. కానీ విచిత్రం ఏమిటంటే ఒకే ఊళ్ళోని అందరం ఒకచోట కలిసి రెండేళ్ళు అవుతోంది...దూరాలూ, ఉద్యోగాలూ, సమయాభావాలు...భవబంధాలూ...అన్నీ కారణాలే..హలో అంటే హలో అని ఫోనుల్లో మాట్లాడుకోటానికి కూడా నెలలు పడుతోంది. ఈ లోపూ మా పదహారుమంది మనుమలలో పెళ్ళిళ్ళైన వారికి మొత్తం కలిపి ఇరవై పైగా పిల్లలు... వాళ్ళూ పెరిగి పెద్దయిపోతున్నారు. వాళ్ళు పెద్దయ్యాకా "అమ్మమ్మ చెల్లి కూతురు కొడుకుట.." అనుకునే పరిస్థితి వాళ్లకు రాకూడదని మా ప్రయత్నం. మా బంధుత్వాలను, సన్నిహితాలనూ పిల్లలకు కూడా పంచాలని మా ప్రయత్నం. అందుకే ఇక ఏమాత్రం వీలు దొరికినా ఈ మధ్యన కలిసి పిల్లలకు పిల్లలకూ స్నేహాలు పెంచుతున్నాము.

ఇప్పుడు ఈ పిల్లలంతా మమ్మల్ని "కార్తీక్ అమ్మ", "సంకల్ప్ అమ్మమ్మ", "సంజన తాతగారు" అంటూ గుర్తిస్తుంటే మేమంతా చాలా ఆనందిస్తున్నాము. ఈ బంధుత్వపు స్నేహాలను ఇలాగే మరిన్ని తరాలకు అందివ్వాలని ఆశిస్తున్నాం. మొన్న వీకెండ్ జరిగిన రెండు గృహప్రవేశాలలో మళ్ళీ అనుకోకుండా అందరం కలవటం...మా మా పిల్లలంతా సరదాగా ఆడుకోవటం మనసులకు ఎంతో ఆహ్లాదాన్ని, ఉత్సాహాన్ని కలిగించాయి. ఇక మాకు "నేటి కలయికలే రేపటి పిల్లల బంధుత్వాలకు పునాదులు" అనే నమ్మకం కుదిరింది.

Tuesday, November 24, 2009

favourite flowers...


అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలలో రోడ్డు మీద....ఏదైనా సందులోకి అడుగుపెట్టగానే గుప్పని మత్తెక్కించే ఈ పూల పరిమళం ముక్కుపుటాల్లోంచి మనసులోకి జారుకుంటుంది...గుండెల నిండా ఈ వాసన పీల్చుకుని అబ్బా...అనుకోని వారుంటారా అనుకుంటూ ఉంటాము మేము. వాసన వచ్చిన మొదలు ఆసందులోనో..ఆ విధిచివరలోనో ఎక్కడో దాగున్న ఆ చెట్టు కోసం కళ్ళు వెతుకుతాయి...పొడుగాటి వృక్షాలు...వాటికి చిన్న చిన్న ముదురాకుపచ్చ ఆకులు...గుత్తులు గుత్తులుగా వేళ్ళాడుతున్న పొడుగు కాడలున్న తెల్లని పూలు....ఎన్నిసార్లు చూసినా కొత్తగానే అనిపించే అందం ఈ పువ్వులది.....

ఇవి మా ఇంట్లో అందరికీ ఇష్టమైన పువ్వులు...ఫోటో తీసుకోవటానికి ఆ చెట్లు ఎక్కడ దొరుకుతాయా అని ఇన్నాళ్ళూ వెతుకుతున్నాను...నిన్న అనుకోకుండా ఒకచోట దొరికాయి...వెంఠనే కెమేరాలో బంధించేసాను..!! కాడ చాలా పొడుగ్గా ఉంటుందని వీటిని మేము "కాగడామల్లి" అంటాము. ఆ మధ్య చిన్నిగారు ఒక టపాలో వీటిని "పొన్నాయి పూలు" అంటారని రాసారు. పేరు ఏదైనా మత్తెక్కించే వీటి సువాసన మాత్రం అమోఘం...!!

చిన్నప్పుడు మా తమ్ముడు, నేను ఈ పూలు ఎక్కద దొరికినా బోలెడు ఏరి తెచ్చేకునేవాళ్ళం...వాటిని నేను నీళ్ళు పోసిన పొడుగాటి గ్లాసులో వేసి ఫ్రిజ్ మీదో , టి.వి మీదో పెట్టేదాన్ని...రెండు మూడు రోజులు పాడవకుండా ఉండేవి అవి...నేనెక్కువ ఏరానంటే నేనెక్కువ ఏరానని గొప్ప చెప్పుకోవటం... అవన్నీ మధురస్మృతులు...

ఒకసారయితే రోడ్డు మీద ఎక్కడొ చిన్న చిన్న మొక్కలు చూసి తవ్వి తెచ్చి నాన్న,తమ్ముడూ వాటిని ఇంటి ముందు నాటారు. మేము ఆ ఊరు వదిలి వచ్చేసినా ఆ మొక్కలు ఇప్పుడు పెద్ద వృక్షాలయి వాటికి బోలెడు పువ్వులు పూస్తున్నాయిట...అవి పెద్దయ్యే సమయానికి అక్కడ లేమే అనుకుంటూ ఉంటాము...

Sunday, November 15, 2009

కూరల మార్కెట్...

(ఇది రెండు రోజుల క్రితం మార్కెట్కు వెళ్ళినప్పుడు రాసినది...అప్పుడు పెట్టలేకపోయాను..ద్వితీయ విఘ్నం కాకుండా ఇవాళ పెట్టేస్తున్నా..:) )


చల్లని సాయంత్రం...ఆహ్లాదకరమైన వాతావరణం...బస్ ఎక్కాలనుకుని మళ్ళీ ఎక్కే ప్రయత్నం మానుకున్నాను. నడిచి వెళ్ళాలని అనిపించింది. కూరల కోసం రిలయన్స్...చౌపాల్ మొదలైన వాటికి వెళ్ళటానికి విసుగనిపించినప్పుడల్లా నేను దగ్గరలోని మార్కెట్ కు వెళ్తూంటాను. కొద్దిగా దుమ్ముని, బురదని భరించగలిగితే మార్కెట్టే కూరలకి బెస్ట్ నాకైతే. ఇయర్ ఫోన్స్ తీసి చెవులకు తగిలించుకున్నాను. అలా పాటలు వింటూ ఎంత దూరమైనా నడిచేయటం నాకు చాలా ఇష్టం...అలానే వింటూ బయల్దేరాను. ఆర్.జే ఏదో జోకేసారు. భలే నవ్వు వచ్చింది....రోడ్దు మీద నవ్వుకుంటు వెళ్తూన్న నాకే అనుమానం వచ్చింది...ఒక్కర్తి రోడ్డు మీద నవ్వుకుంటా వెళ్తోంది..పిచ్చిదనుకుంటారేమో...అనిపిమ్చి బలవంతాన నవ్వు ఆపుకున్నా... చెవిలో "గల గల పారుతున్న గోదారిలా..." మొదలైంది...ఆలోచనలూ పరిగెట్టడం మొదలేట్టాయి...

కూరల కోసం మార్కెట్ కు ఎప్పటినుంచీ వెళ్తున్నానో గుర్తు వచ్చింది...12,13 ఏళ్ళ నుంచీ వెళ్తున్నాను. నా ఫ్రెండ్ గుర్తుకు వచ్చింది. మధ్యలో ఈ ప్రెండేమిటి? అంటే...డిగ్రీలో ఉన్నప్పుడు నా క్లోజ్ ప్రెండ్ ఒకమ్మాయి ఇల్లు విజయవాడ సత్యనారాయణపురం మార్కెట్ వెనక సందులో ఉండేది. మొదట్లో వాళ్ళింటికి వెళ్ళేప్పుడు అమ్మ కూరలు తెమ్మంటే "తేను ఫో" అనేదాన్ని. ఒకసారి నేను వెళ్ళినప్పుడు తను "కూరలు తేవాలి వస్తావా?" అంది..."కూరలు నువ్వు తెస్తావా?" అన్నాను నేను ఆశ్చర్యంగా.."అవును..అమ్మకి కుదరకపోతే నేను వెళ్తాను.." అంది. అంతే...ఆ రోజు మొదలు ఈ రోజు దాకా నాకు కూరలు తేవటం చాలా ఫేవరేట్ పని అయిపోయింది. అమ్మ అడగకుండానే "అమ్మా!కూరలు కావాలా?" అని అడిగేదాన్ని. కాలగమనంలో నా ఫ్రెండ్ నాకు నెమ్మదిగా దూరమైపోయింది...అయినా ఈ "కూరలు కొనటం" అనే ఇష్టం మాత్రం ఇలాగే ఉండిపోయింది...!

ఆ ప్రెండ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం...మా ఇద్దరి మధ్యన రహస్యాలు, చెప్పుకోని విషయాలు ఉండేవే కాదు...అర్ధరాత్రి అపరాత్రి లేదు...ఎప్పుడు ఏది గుర్తు వస్తే అది ఒకరితో ఒకరం చెప్పేసుకోవాల్సిందే. మా ఇద్దరి నాన్నలూ ఫోను బిల్లులు గురించి బెంగలు పెట్టుకున్న రోజులింకా గుర్తు నాకు.. 10,12 ఏళ్ళ గాఢ స్నేహం తరువాత చెప్పుకోదగ్గ కారణాలు లేకపోయినా జీవనగమనంలో మారే ప్రాధాన్యతలూ, యాంత్రిక జీవన విధానం మా దూరానికి కారణం అయ్యాయి...కొన్ని స్నేహాలు అంతేనేమో...వాళ్ళని blame చెయ్యాలనిపించదు....she's still is a part of my heart...! తను గుర్తొస్తే నాకీ ఆతిఫ్ పాట గుర్తు వస్తుంది..""तेरे बिन में यु कैसे जिया...कैसे जिया तेरे बिन..लेकर याद तेरी राते मेरी कटी..."

సరే, ఇంతకీ మార్కెట్ వచ్చేసి ఆలోచనలు కట్ అయ్యాయి...fm లోంచి ఇయర్ ఫోన్స్ లో "ओ सथिरॆ तेरॆ बिना भी क्या जीना.." పాట మొదలైంది...ఆహా ! అనుకున్నా...అలా వింటూనే కూరలు కొనటం మొదలెట్టాను. ఏమిటో ఈ రేట్లు...సింధుభైరవిలో భైరవి డైలాగ్ గుర్తు వచ్చింది "వంకాయలా గుర్రాలా?" అంటుంది. అలాగ వంకాయ ధర కాకపోయినా మిగిలిన వాటి ధరలలో పెరుగుదలే కానీ తరుగుదల కనిపించట్లేదు. చివరిగా ఆకుకూరలతో కొనటం పూర్తి చేసాను...

చెవిలో ఇదివరకెప్పుడూ వినని కొత్త పాటొకటి మొదలైంది...చిల్లర లెఖ్ఖ వేసుకునే హడావుడిలో పాట తాలుకూ వివరం వినలేదు. "రింగ రింగా రింగ రింగా..." అని వస్తోంది పాట. ఏదో మాస్ పాటలాగుంది. ఏదన్నా కొత్త సినిమాలోదేమో...సరదాగా అనిపించింది. సగమే విన్నాను మరి..మొత్తం ఎలా ఉంటుందో..ఇంటికెళ్ళగానే గూగులమ్మనడగాలి అనుకున్నా. కూరల బరువుతో బస్సెక్కటం వీలు కాదు కాబట్టి ఆటో పిలిచి ఎక్కి కూర్చున్నా...

ఇంకేంటి..? ఆటో ఇంటికీ....నేను లిఫ్ట్ లోకీ...!! అంతే...

Saturday, November 7, 2009

స్నేహం..


" సృష్టి లో తీయనిది స్నేహమేనోయి.."
"స్నేహానికన్న మిన్న లోకాన లేదురా.."
"నిజమైన స్నేహితుడు భగవంతుడు ఇచ్చిన వరం..."

"A friend in need is a friend indeed"
"A Friend is one..who comes in when the whole world has goneout.."
"A true friend is a gift of God.."

స్నేహమనగానే ఇలా ఎన్నో నిర్వచనాలు. మనల్ని మనకు కొత్తగా పరిచయం చేసేవారు, మన తప్పులని సరిదిద్దేవారూ, మనలోని మంచి గుణాలను మనకు చూపెట్టేవారు, అంధకారంలో కొట్టుకు పోతూంటే వెలుగు చూపెట్టే నిజమైన స్నేహితులు చాలా అరుదుగా దొరుకుతారు. స్నేహమైనా ప్రేమైనా నాదొకటే సూత్రం-- ఒక వ్యక్తిలోని సద్గుణాలను మాత్రమే ఇష్టపడటం కాదు. ఒక వ్యక్తిని ఆ వ్యక్తిలో మనకు నచ్చని లోపాలతో పాటూ ఇష్టపడాలి. ప్రేమించాలి. అప్పుడే ఏ బంధమైనా గట్టిగా నిలిచేది. నేను నా స్నేహితులను అలానే ప్రేమించాను. ఇవాళ నాకు మిగిలిన స్నేహితులు కూడా నన్ను అలా స్వీకరించినవారే.

జీవితంలో రకరకాల మజిలీలను దాటాకా ఇవాళ్టికీ నా పక్కన నిలబడినవారే నా నిజమైన మిత్రులు. వెనుదిరిగి చూస్తే దారిలో నిలిచిపోయిన వారు, మధ్యలో వీడిపోయినవారూ ఎందరో...! ఆ ఋణం అంతవరకేనన్నమాట అనుకుంటూ ఉంటాను. "ఇది కధ కాదు" చిత్రంలో ఆత్రేయగారన్నారు...

"వెళ్తారు వెళ్లేటివాళ్ళు,
చెప్పేసెయ్ తుది విడుకోలు
ఉంటారు ఋణమున్నవాళ్ళు
వింటారు నీ గుండె రొదలు..." అని.

ఈ సొదంతా ఎందుకంటే...ఇప్పుడే నా క్లోజ్ ఫ్రెండ్ "మధవి" ఫోన్ చేసింది. ఆ ఆనందంలో తన గురించి చెప్పాలనిపించి ఈ టపా...!అందరికీ గొప్ప స్నేహితులు కొందరు ఉంటారు. నాకూ కొద్దిపాటి మంచి మిత్రులు ఉన్నారు. వాళ్లలో మాధవి ఒకర్తి. తనిప్పుడు బొంబాయిలో ఒక బాంక్ లో మేనేజర్. మాధవి తో నా స్నేహం వింతగా జరిగింది. తను నా స్కూల్ ఫ్రెండ్. నేను 8th క్లాస్ లో స్కూల్ మారాను. తను, నేనూ వెరే వేరే సెక్షన్స్. ఆ ఏడు పరిచయమే ఉండేది. 9th క్లాస్ లో మేమిద్దరం ఒకే సెక్షన్లో పడ్దాం. నా లెఖ్ఖల పరిజ్ఞానానికి మా మేథ్స్ సార్ గారు కొంచెం భయపడి, అమ్మా ఇవాళ నుంచీ నువ్వు మాధవి పక్కన కూర్చోమని నా ప్లేస్ మార్చేసారు. మధవీ లెఖ్ఖల్లో ఫస్ట్. సార్ బోర్డ్ మిద చెప్తూంటే అది వెనక నుంచి చెప్పేస్తూ ఉండేది. ఆయన వెనక్కు తిరిగి, "నువ్వు చెప్తావా? నన్ను చెప్పనిస్తావా? " అనేవారు. ఆపేసేది. మళ్ళీ మర్నాడు అదే తంతు. సార్ ఫేవొరేట్ స్టూడెంట్ తను. ఈ లెఖ్ఖలనెవడు కనుక్కున్నాడురా బాబు? అనే టైపు నేను...! మొత్తానికి పక్కన కూర్చోవటం వల్ల కాస్త బానే నేర్చుకున్నాను. అలా మా స్నేహం మొదలైంది.

మా ఇద్దరికీ ఉన్న కామన్ ఇంట్రెస్ట్ "హిందీ పాటలు". ఇద్దరం తెగ పాడేసుకునేవాళ్ళం. నేను బాగా పాడేదాన్నవటo వల్ల తనకీ నాపట్ల ఆసక్తి పెరిగింది. కానీ నాకు కొంచం కోపం ఎక్కువే. కాస్త తిక్క, ఆలోచన తక్కువ, దూకుడు ఎక్కువ. ఒకరోజు నాకు తనమీద ఎందుకో కోపం వచ్చింది. ఆ రోజంతా నేను అసలు తనతో మాట్లాడలేదు. సాయంత్రం స్కూల్ బస్ ఎక్కటానికి వెళ్పోతూంటే నా వెనకే వచ్చి నా చెయ్యి పట్తుకుని ఆపింది..."నా మీద కోపం ఉంటే నన్ను తిట్టు...కానీ నాతో మాట్లాడటం మానద్దు..." అనేసి వెళ్పోయింది. నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి..ఎందుకో దీనికి నేనంటే అంత అభిమానం అని పొంగిపోయాను. ఆ రోజు మొదలు నేనెప్పుడూ తనతో దెబ్బలాడలేదు.

మేం కలిసి చదివుకున్నది రెండు సంవత్సరాలే. ట్రాంస్ఫర్ అయి వాళ్ళు గుంటూరు వెళ్పోయారు. ఇంటర్, డిగ్రీ అక్కడే చేసింది. అప్పుడప్పుడు విజయవాడ వచ్చేది తనే. ఉత్తరాలు రాసుకునేవాళ్ళం చాలా ఏళ్ళు...డిగ్రి అవ్వగానే BSRB రాసింది. బ్రిలియంట్ బ్రైన్ కదా మొదటి ఎటెంప్ట్ లోనే జాబ్ వచ్చేసింది. తర్వాత పి.ఓస్ కి రాస్తే మొత్తం 5,6 బ్యాంకుల్లో ఒకేసారి వచ్చాయి పోస్ట్లు. ఎక్కడ ఏ ఊళ్ళో ఉన్నా ఫోన్లు చేసేది..."నేను ఉద్యోగం చేస్తున్నాను కదే,నేనే చేస్తాను" అనేది. మా ఇరవై రెండేళ్ళ స్నేహం లో నా ప్రతి పుట్టినరోజుకి తన ఫొన్ వస్తుంది. ఒకసారి మద్రాస్ లో ట్రైనింగ్లో ఉంది. నా పుట్టినరోజుకి రాత్రి 9.30 ఫోన్ చేసింది. పొద్దున్నుంచీ కుదరలేదే అని. ఆ మధ్య తనని బ్యాంక్ వాళ్ళు రెండేళ్ళు లండన్ పంపించారు. అప్పుడు కూడా తను నెలకోసారైనా ఫోన్ చేసి మాట్లాడేది. మళ్ళీ మేము బొంబాయిలో ఉన్నప్పుడు అనుకోకుండా ట్రాంస్ఫర్ మీద అక్కడకు వచ్చారు వాళ్ళు. మళ్లీ చాలా ఏళ్ళకు కలిసున్నాం కొన్నాళ్ళు. ఇప్పుడు మేం వచ్చేసినా తను అక్కడే.

తన సిక్స్త్ సెన్స్ ఎలా ఎలర్ట్ చేస్తుందో గానీ నాకు ముడ్ బాగోలేనప్పుడు తన ఫొన్ తప్పక వస్తూంటుంది. చాలా సమయాల్లో నాలో ఎంతో ధైర్యాన్ని నింపింది తను. రెండునెలల క్రితం చాలా రోజులయ్యింది ఫొనుల్లేవని నేనే చేసాను. పాపకి బాలేదు నువ్వు కంగారు పడతావని చెప్పలేదే..అంది. అంత కంగారులో కూడా నేను ఎక్కడ టెంషన్ పడతాననో అని ఆలోచించిందది. ఇందాకా ఫొన్ చేసి చాలా రోజులయ్యిందని బోల్డు సేపు మాట్లాడింది. బొంబాయి లాంటి హడావుడి ఊళ్ళో, లోకల్ ట్రైన్స్ లో తిరుగుతూ, ఉద్యోగం టెంషన్స్ తో, ఇద్దరు పిల్లలతో బిజీ గా ఉన్నా సరే... లోకల్ ట్రైన్స్ లో ఉన్నప్పుడు, ఇంటికి వెళ్ళేప్పుడూ నన్ను పలకరిస్తూ ఉంటుంది. మనసుంటే మార్గం ఉంటుందనటానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి అనిపిస్తుంది నాకు. True friend అంటే తనే కదా మరి.

మన సద్గుణాలనే కాదు, మనలోని లోపాలను కూడా భరించేవారే నిజమైన స్నేహితులు. నా మిత్రులు నాలోని సద్గుణాలను నాకు చూపారు. నాకు తెలియని ప్రత్యేకతలను నాలో చూసారు...నాకు చూపెట్టారు. ఇవాల్టికీ నన్ను వదలకుండా గట్టిగా పట్టుకునే ఉన్నారు. అందుకే వారంతా నా నిజమైన మిత్రులు ...! నాకున్న ఇలాంటి మంచి స్నేహితులు ఇంకొందరి గురించి మరోసారి ఎప్పుడన్నా...

Sunday, November 1, 2009

" My lost world..."


వెన్నెలని, వర్షాన్ని, కృష్ణశాస్త్రి గారి రచనల్ని ప్రేమించని మనుషులుంటారా?
ఉండరు కాక ఉండరు..
నేను అంతే...వెన్నెలంటే ఎంతిష్టమో...కృష్ణశాస్త్రిగారు అంటే అంతే ఇష్టం..
వారి జన్మదినం సందర్భంగా మన "ఆంధ్రా షెల్లీ" కృష్ణశాస్త్రి గారిని స్మరిస్తూ..
నాకు చాలా ఇష్టమైన రెండు పాటల్లోని ఈ వాక్యాలు...

"....బ్రతుకంతా ఎదురు చూచు పట్టున రానే రావు..
ఎదురరయని వేళ వచ్చి ఇట్టే మాయమౌతావు..
దారి పొడుగునా తడిసిన పారిజాతములపై నడిచిన
నీ అడుగుల గురుతులే మిగిలినా చాలును...."

(మేఘసందేశం)
*******


"....నీవు వచ్చేవని నీ పిలుపే విని
నీవు వచ్చేవని నీ పిలుపే విని
నీవు వచ్చేవని నీ పిలుపే విని
కన్నుల నీరిడి కలయ చూచితిని
గడియ యేని ఇక విడిచి పోకుమా...
ఎగసిన హృదయము పగులనీకుమా..

ఎన్నినాళ్ళకీ బ్రతుకు పండెనో
ఎంత హాయి ఈ రేయి నిండెనో..."
(మల్లీశ్వరి )

********** *************

"రెండు రోజులు blog ముట్టుకోను" అన్నప్పుడే మావారు అదోరకంగా చూసారు...
ఆ చూపుకర్ధం ఇప్పుడర్ధమయ్యింది..:)

but i have strong reasons...asusual...

నాన్నకు కొంచెం బాలేదని చూద్దామని వచ్చాను...కానీ ఎప్పటిలానే ఈ ఇంట్లో ఉండిపొయిన నా ప్రపంచాన్ని పలకరిస్తూ..వెతుక్కుంటు..అవి ఇవి చూస్తుండగా... చాలా రోజుల్నుంచీ వెతుకుతున్నా నా రెండూ అట్టపెట్టెలు దొరికాయి..."My lost world.."!!

అదీ నా ఆనందానికి కారణం...ఆ పెట్టెల్లో నా ఒకప్పటి ప్రపంచం ఉంది..

కొనుక్కున్న గ్రీటింగ్స్..
రాసుకున్న పాటల డైరీలు...
తెలుగు,హిందీ..ఇంగ్లీష్..దేశభక్తి గీతాలు, గజల్స్, లలిత గీతాలు..ఎన్నో...

కలక్ట్ చేసుకున్న కొటేషన్స్ బుక్స్...
కొన్ని నోట్స్ లు...
ఇంకా కొన్ని కవితలు..డైరీలు...
ఏవేవో పేపర్ కట్టింగ్స్...
హిందు పేపర్ తాలుకూ కొన్ని ఆదివారపు ఫోలియో బుక్స్..
చూసిన ప్రతి సినిమా పేరూ..వివరం..
దాచుకున్న సినిమా టికెట్లు..వాటి వెనుక ఎవరితో వెళ్ళానో + ఆ సినిమా పేరు..

నా ప్రపంచాన్ని చూసి నాకే నవ్వు వచ్చింది..
ఎంత పిచ్చిదాన్ని...అసలు నా అంత పిచ్చివాళ్ళెవరైనా ఊంటారా అని సందేహం..

ఒకప్పుడు ఇదే జీవితం....
ఇప్పుడు ఇవి కేవలం నా జ్ఞాపకాలు...
వీటిని చూస్తే పెదాలపై ఒక చిరునవ్వు...అంతే!!

అవన్నీ చూసి ఏవో లంకె బిందెలు దొరికినంత ఆనందం...
ఆ ఆనందాన్ని మీతో పంచుకోవాలని ఈ ప్రయత్నం..
నా ఖజానాలోని కొద్ది భాగం మిత్రుల కోసం ఈ ఫొటోల రూపంలో...




ఇది కొటేషన్స్, గ్రీటింగ్ కార్డ్ మేటర్స్ రాసుకున్న డైరీలో పేజీ..

"సుమిత్రా నందన్ పంత్" కవిత్వానికి తయారు చేసుకున్న నోట్స్ తాలుకూ పేజీలు..

""మహాదేవి వర్మ" కవితకి తయారు చేసుకున్న నోట్స్ తాలుకూ పేజీలు..

Monday, October 26, 2009

గ్రీటింగ్స్...


గ్రీటింగ్స్ ... అంటే...
Greetings are wishes....wishes that convey our innermost feelings to the ot
her person. ఇది నా అభిప్రాయం. కొందరికి ఇదొక వృధా ఖర్చు. కానీ నాకు గ్రీటింగ్స్...అంటే పిచ్చి పిచ్చి..!! కాలేజీ రొజుల్లో మా ఊళ్ళో Prabodha, Options, Ashok book center, Archies, Pens n Pads...ఇవే పేరు మోసిన గ్రీటింగ్స్ దొరికే షాపులు. ఈ షాపులన్నీ నా అడ్డాలు. ఎప్పుడన్నా చేంజ్ లేదంటే మళ్ళీ వచ్చినప్పుడు ఇవ్వండి...అనేంత బాగా తెలుసు నేను ఆ షాపులవాళ్ళకి. సమయం దొరికినప్పుడల్లా స్నేహితులతోనో, ఒంటరిగానో వెళ్ళటం పదో ఎన్నో నచ్చినవి, కొత్త రకాలు కొని తెచ్చేసుకోవటం...B'days, New year, Occassions, just born, Bon voyage, Get well soon, just Hi.., GoodDay...అంటు ఎన్ని రకాల కార్డ్స్ ఉంటాయో అన్ని రకాలు నచ్చినవి కొనెయ్యటమే.

"ఎవరికి పంపిస్తావే..ఎందుకు ఇన్ని కొంటావు" అని అమ్మ కేకలేసేది...అవి మన చెవులకి వినబడితే కదా..! కొత్త చొక్కాల తాలూకూ అట్టపెట్టెలు సంపాదించి వాటిల్లో కేటిగొరీల ప్రకారం దాస్తూ ఉండేదాన్ని...అప్పుడు పెద్ద ఖరీదు ఉండేవి కాదు గ్రీటింగ్స్. ఏభై రుపాయల కార్డ్ అంటే చాలా ఖరీదైన కార్డ్. (ఇప్పుడు ఏభై రుపాయిలకు తుక్కులాంటి కార్డ్ కూడా రావట్లేదు.) ఇక స్నేహితులకూ, బంధువులకు ఉత్తరాలు కూడా బాగా రాసేదాన్ని. ప్రతి రోజూ పోస్ట్ మాన్ మా ఇంటికి రావాల్సిందే..ఎవరిదో ఒక లెటర్ తేవాల్సిందే. ఉత్తరాల గురించి నేను రాసిన ఒక పాత టపా "ఇక్కడ" చూడండి. అలా ఉత్తరాలతో పాటూ సందర్భానుసారంగా నేను తయారు చేసిన వాటితో పాటు ఈ కొన్న గ్రీటింగ్స్ కూడా పంపిస్తూ ఉండేదాన్ని...!!

ఇప్పుడు e-cards వచ్చేసాకా కొనటం పుర్తిగా తగ్గిపోయింది. పైగా అన్ని e-mails ఏ కదా. కానీ ఈగ్రీటింగ్స్ మాత్రం మైల్స్ తో నా బంధువులకీ,స్నేహితులందరికీ తప్పకుండా పంపిస్తూ ఉంటాను. అదొక సరదా. మనం ఎదుటి వ్యక్తికి ప్రాముఖ్యం ఇస్తున్నాము అని తెలపటానికి. మన గ్రీటింగ్స్ ద్వారా మరొక వ్యక్తికి ఆనందం కలిగిస్తున్నాము అనే సంతృప్తి కోసం. నాకు తిరిగి అందరూ పంపిస్తారా అంటే...ఖచ్చితంగా పంపించరు. కానీ ఎదుటి మనిషిలాగే మనమూ ఉంటే మనకీ వాళ్ళకీ తేడా ఏంముంటుంది అనేది నా అభిప్రాయం.

ఇక్కడొక చిన్న మధుర స్మృతి...నా పెళ్లైన కొత్తలో "వేలెంటైన్స్ డే" వచ్చింది. "నాకేమన్నా కావాలి" అనడిగాను మావారిని. "ఏం కావాలో చెప్పు" అన్నారు. "గ్రిటింగ్స్ కొనివ్వరా?" అనడిగాను. ఆశ్చర్యపోయారు. "ఏం అడుగుతావో అనుకుంటుంటే...కాయితం ముక్క కావాలంటావేమిటీ?" అన్నారు. "నాకు అదే బంగారమంత ఎక్కువ. అదే కావాలి." అన్నాను. "నేనెప్పుడూ గ్రీటింగ్స్ కొనలేదు. ఎవరికీ ఇవ్వలేదు. ఏ షాపులెక్కడ ఉంటాయో తెలీదు.." అన్నారు. ఈసారి నేనాశ్చర్యపోయాను..కొత్త కదా ఏమంటాం..అని ఊరుకున్నాను. మర్నాడు శనివారం. తనకు హాఫ్ డే ఉండేది (బొంబాయిలో). సాయంత్రమైనా మనిషి ఇంటికి రాలేదు. నాకేమో కంగారూ, భయం.
మనకి పిలవకుండానే పలికే కోపం కూడా వచ్చేసింది...ఇంతలో బెల్ మోగింది...

తలుపు తియ్యగానే ఎర్ర గులాబిల బొకేతో, గ్రీటింగ్స్ పట్టుకుని మావారు..! "ఢాం" అని పడిపో
యా..!! కానీ కొంచెం అలక వహిస్తూ అడిగాను "ఎందుకింత ఆలస్యం?" అని.." అందరిని దారి అడుగుతూ గ్రీటింగ్స్ షాపు వెతుక్కుని వెళ్ళి, కొని తెచ్చేసరికీ ఇంత సేపైంది" అన్నారు. అలసిపొయిన ఆయన మొహం అప్పుడు కనబడింది నాకు...నా కోసం ఇంత కష్టపడ్డారా....కోపమంతా ఎగిరిపోయింది...!! ఆ తర్వాత రెండు రోజులదాకా ఈయన బొకే తెస్తూండగా చూసిన మా వింగ్ లోని ఇరుగు పొరుగు ఆంటీలంతా నన్ను ఏడిపిస్తూనే ఉన్నారు..."క్యా బాత్ హై..?!" అంటూ...

అప్పటినుంచీ పాపం నాకోసం పుట్టినరోజులకీ, పెళ్ళిరోజులకీ మిగిలిన బహుమతులతో పాటూ గ్రీటింగ్స్ కొంటూనే ఉన్నారు మావారు....!!

Friday, October 16, 2009

దీపావళి జ్ఞాపకాలూ..





"దీపం పరంజ్యోతి కళాది నమో నమో
దీప మంగళ జ్యోతి నమో నమో.."
(పరం జ్యోతి అయిన దీపానికి నమస్కారం. శుభములను ఇచ్చే దీపానికి నమస్కారం)

****** *****


మీకు తెలిసిన పండుగ గురించి వ్రాయుము...

అని స్కూల్ పరిక్షల్లో ప్రశ్న ఉండేది...
ఆ తెలిసిన పండుగ తాలుకూ సమాధానం ఎప్పుడూ ఒకటే ...."దీపావళి అంటే దీపముల పండుగ.నరక చతుర్దశి రోజున నరకాసురుడు అనే రాక్షసుణ్ణి హతమార్చి.......etc..etc..etc.."


**** *****

"దుబ్బు దుబ్బు దీపావళి..మళ్ళీ వ
చ్చే నాగులచవితి.."

అంటూ గోగు కాడలతో(గోంగూర కొమ్మలు) మా పిల్లలతో అమ్మ దివిటీలు కొట్టించేది

(ఇది ఎందుకంటే దీపావళినాడు పితృదేవతలు సాయంసంధ్య తరువాత దక్షణ దిక్కు నుంచి వచ్చి తమ సంతానాల గృహాలను సందర్శిస్తారట .వారికి దారి కనిపించటం కోసం దివిటీలు కొడతారుట. దీనిని
"ఉల్కా దానం" అని కూడా అంటారుట.)

దివిటీలు కొట్టిన తరువాత చేతులు కాళ్ళూ కడుక్కుని, తీపి తినాలి. మేం గులాబ్ జామ్ ( ప్రతి దీపావళికి స్టేండెర్డ్ స్వీట్ ) తినేసి...బుద్ధిగా దేముడి దగ్గర కూర్చుని అమ్మతో పాటే "కర్మ అనే ప్రమిదలో, భక్తి అనే తైలం పోసి, ధ్యానమనే వత్తి వేసి, జ్ఞానమనే జ్యోతిని వెలిగిస్తున్నాను." అని చెప్తూ దీపాలను వెలిగించేవాళ్ళం.పల్చటి బట్టని చిన్న చిన్న వత్తులుగా చేసి, నువ్వులనునెలో ముందురోజు నానబెట్టి, వాటితో ప్రమిదలు వెలిగించేది అమ్మ.


ఇక ఆ తరువాత -- వారం రోజుల నుంచో, రెండు రోజులనుంచో...టపాకాయలు ఎండ పెట్టినప్పుడల్లా ఎప్పుడెప్పుడని తొందర పడే మనసు ఆగేది కాదు...నేనూ ,తమ్ముడు సుబ్భరంగా కొన్నవన్నీ కాల్చేసే వాళ్లం. నాగులచవితికి, కార్తీక పౌర్ణమికి కొన్ని దాచేది అమ్మ. కనబడితే వాటినీ కానిచ్చేస్తామని.
******** *********

ఎప్పుడన్నా అన్నయ్య దగ్గరకు ఊరు వెళ్తే, అక్కడ మా తాతమ్మ(నాన్నగారి అమ్మమ్మ) మతాబాలూ,చిచ్చుబుడ్లు, తారా జువ్వలు తయారు చేసేది. అబ్బురంగా ఆ చేసే విధానాన్ని చూసేవాళ్ళం.
************

కాలేజీ స్టేజి కొచ్చాకా కొంచెం జోరు తగ్గింది...ధరలు పెరిగాయి అని అర్ధం చేసుకుని ఏవో శాస్త్రానికి కొన్ని కొనుక్కునేవాళ్లం. చదువుల పేరుతో పిల్లలం దూరమయ్యాకా ఇక నే ఒక్కదాన్నే ఇంట్లో...ఏం కాలుస్తాంలే అనే నిస్తేజం వచ్చేసింది ఇంక. పైగా పెరుగుతున్న టపాసుల ధరలను చూస్తూంటే నోట్ల కట్టలను కాల్చుతున్నట్లే అనిపించేది నాకు. అంతకన్నా ఏదన్నా అన్నదానానికో, సేవా కేంద్రానికో ఇస్తే ఆ డబ్బు ఉపయోగపడుతుంది కదా అనే అభిప్రాయం ఏర్పడింది.

ఇప్పుడిక అదే భావం బలపడిపోయింది. వందకి ఓ చిన్న పెట్టెడు టపాసులు వచ్చిన రోజు నుంచి... ఒక కాకరపువ్వొత్తుల పెట్టె వందకి చేరుకున్న రోజులు వచ్చాయి. మూడంకెలు పెడితే గానీ ఓ మాదిరి బణాసంచా కొనుగోలు అవ్వదు ఇవాళ్టి రొజున. అయినా జనాలు వేలకి వేలు పెట్టి కొంటూనే ఉన్నారు..శాస్త్రానికి కొన్ని కాల్చవచ్చు.కానీ సరదాలకీ, ఆర్భాటాలకీ, పోటిలకీ పోయి వేలు ఖర్చుపెట్టి
స్కై షాట్స్, ఇతర ఔట్లు కొనటం కాల్చటం ఎంతవరకూ సమంజసమో మరి...
****** *******

ప్రస్తుతానికి మా పాప చిన్నదే కాబట్టి దాని సరదా అగ్గిపెట్టెలు,తుపాకీ రీలులతో పూర్తవుతోంది. రేపొద్దున్న అది పెద్దయ్యాకా అది కావాలి,ఇది కావాలి అంటే ఇప్పుడు ఇన్ని అనుకుంటున్న నేనే కొనాల్సిరావచ్చు....కాని ఏదన్నా చెప్తే విని అర్ధం చేసుకునే తెలివి దానికి ఉంది కాబట్టి నా అభిప్రాయానికి గౌరవం ఇస్తుందనే నమ్మకం. అంటే అసలు తపాసులే కొననని కాదండోయ్..మితంగా కొంటానని
చెప్పటం.
***** *******

మనం ఒక్కరోజే చేసుకుంటాము కానీ శాస్త్రీయంగా దీపావళిని అయిదు రోజులు చేసుకోవాలి. ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి అమావాస్య, గోవర్ధన పూజ, భగినీ హస్త భోజనం. ఉత్తరాదిన ఐదు రొజులూ జరుపుకుంటారు.
**********

ఇక పెద్దయ్యాకా దీపావళి ఎందుకు చేసుకుంటాము,
పురాణాలలో ఈ పండుగ ప్రాముఖ్యత ఏమిటి అన్నది తెలిసింది...
పురాణాలలో దీపావళి గురించి రేపు...


బ్లాగ్మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు.

Sunday, October 11, 2009

పుస్తకాలు..అభిరుచులు...


మద్రాసు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో "డిప్లొమో ఇన్ ఫిల్మ్ టెక్నాలజీ(1965-68)" చదివారు నాన్న. 1968లో "INDIAN FILM MUSIC" మీదThesis సమర్పించి ఆ ఏటి "Best student Award" కుడా సంపాదించుకున్నారు.Student best film "The House" కధా రచయితగా AVM చెట్టియార్ గారి హస్తాలమీదుగా ప్రధమ బహుమతి అందుకున్నారు. మనమొకటి తలిస్తే,దైవమొకటి...అన్నట్లుగా నాన్న సినీ ఫిల్డ్ లోకి అడుగు పెట్టడం కుదరలేదు...కానీ తాను అడుగు పెట్టిన ఫీల్డ్ లో మాత్రం "The best" గా తనదంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. అడుగు పెట్టిన మాధ్యమం కోసం తన శక్తిని,మేధస్సుని,కష్టాన్ని ధారపోసారు...పది జాతీయ బహుమతులను అందుకున్నారు.ప్రసార మాధ్యమంలో తన డెసిగ్నేషన్లో అలా పది జాతియ బహుమతులు అందుకున్న ఏకైక వ్యక్తి నాన్న ఒక్కరే!!ఒక "ట్రెండ్ సెట్టర్"గా "ఉగాది తెలుగు పురస్కారాన్ని" కూడా అందుకున్నారు.

ఇప్పుడు నేను చెప్పబోయేది నాన్న గురించి కాదు...అది వేరే పెద్ద కధ.నాకు పుస్తకాలు,సంగీతం మొదలైన అభిరుచులు ఎలా వచ్చాయో,మా ఇంటి వాతావరణం ఎలా ఉండేదో చెప్పటానికి ఇదంతా రాసాను.మా ఇంట్లో ఉన్న ఇటువంటి వాతావరణం వల్ల, ఇంట్లో ఎప్పుడూ పుస్తకాలు, కేసెట్లు, సంగీతం, సినిమాలు ..ఇవే కబుర్లు.మాకింకో ప్రపంచం తెలియదు.ఇవే మా నేస్తాలు.నాన్న film institute లో ఉన్నప్పుడు కొనుక్కున్న పుస్తకాలు చాలా ఉండేవి మా ఇంట్లో..మేమెవరం ఇంట్లో లేనప్పుడు ఒకరోజు అనుకోకుండా ఒక అగ్ని ప్రమాదం జరిగి మొత్తం పుస్తకాల రేక్ మొత్తం తగలబడి పోయింది...అదృష్టవశాత్తు మా అమ్మ క్షేమంగా బయట పడింది.

ఆ తరువాత మళ్ళీ నెమ్మదిగా కొన్ని కొన్ని చప్పున కొన్నారు కానీ ఆ పోయిన పుస్తకాలు చాలా వరకు దొరకలేదు పాపం నాన్నకు.ఇప్పుడు మళ్ళీ కొన్ని వందల పుస్తకాలు పొగేసారు..!! అవన్నీ చదవటానికి నా జీవితకాలం సరిపొదు.అసలు నాన్న సంపాదించిన 3000 దాకా ఉన్న కేసట్లనే నేను ఇంతదాకా అన్నీ వినలేదు...తెలుగు, హిందీ, ఇంగ్లీషు, తమిళ్, instrumental, westren clasical, బీథోవెన్, వివాల్డి, కర్ణాటక్, హిందుస్తానీ.. ఇలా సంగీతంలో ఉన్న రకాలన్నీ మా నాన్న దగ్గర ఉన్నాయి.

ఇవే మా ఆస్తి...మేము ముగ్గురమూ అంటుంటాము..వీటి కోసమే మేము దెబ్బలాడుకుంటాము అని.మా అభిరుచులన్ని నాన్న నుంచి సంక్రమించినవే..తనకు తెలిసిన మంచి మంచి సినిమాలన్నీ, అన్ని భాషలవీ చూపించేవారు మాకు.ఇక ఇంట్లో ఉన్న రకరకాల పుస్తకాల వల్ల చదివే అలవాటు వచ్చింది నాకు.

నాకు చదవటం వచ్చాకా దొరికినవి, నాకు అర్ధమయ్యేవి చదువటం మొదలెట్టాను.చిన్నప్పుడు నవలలు చదువుతున్నాననీ మా అమ్మ అవన్నీ దాచేసేది.ఒక వయసు వచ్చేవరకు పిల్లలు ఆ పుస్తకాలు చదవకూడదు అని అమ్మ ఉద్దేశం. కానీ మనం ఆగిందెక్కడ..శెలవు రొజుల్లో అమ్మ నిద్రపోయినప్పుడు దాచిన చోట్లు కనిపెట్టి మరీ పుస్తకాలు చదవేసేదాన్ని.అందుకని వారపత్రికలు కొనటం ఆపేసింది.అయినా ఇంట్లో నవలలు తక్కువే.కృష్ణశాస్త్రి, చలం, శరత్ సాహిత్యం, శ్రీరమణ,బాపు-రమణల పుస్తకాలూ, తెలుగు భాష, సంస్కృతికి సంబంధించినవి, సినిమాలకు సంబంధించినవి, కొన్ని కవితా పుస్తకాలు..ఇలా కొన్ని సెలెక్టెడ్ పుస్తకాలు కొనేవారు నాన్న. కొన్ని సినిమా కధల పుస్తకాలు నవలల్లా ఉండేవి.సినిమాలు చూడకపోయినా ఆ పుస్తకాలు మళ్ళీ మళ్ళీ చదివేదాన్ని.బాగా డైలాగులతో సహా బట్టీ వచ్చేసేంతగా...!! ముత్యాల ముగ్గు, త్యాగయ్య, గోరంత దీపం, రాధా కల్యాణం, సీతాకోకచిలుక, శంకరాభరణం..మొదలైనవి.

ఇక శెలవుల్లో పిన్ని,పెద్దమ్మల ఇళ్ళకి వెళ్ళినప్పుడు కోడూరి కౌసల్య, యద్దనపూడి,యండమురి,మల్లాది మొదలైన వాళ్ళ రచనలు వాళ్ళిళ్ళలోనే చదివాను.కాలేజీలోకి వచ్చాకా నేనూ నా చిరు సంపాదనలవల్ల,విజయవాడ బుక్ ఫెస్టివల్స్ వల్ల నా సొంత మొదలైంది..నాన్నవి కాక నేనూ నాకిష్టమైన పాతల సేసెట్లు కొనటం మొదలుపెట్టాను...పెళ్లయాకా...అందరిలానే సంసారంలో మునిగిపోయాను..ఇప్పటిదాకా మళ్ళీ ఆ అభిరుచులకి బ్రేక్ పడింది...!మళ్ళీ ఇదిగో ఇన్నేళ్ల తరువాత ఈ బ్లాగ్ పుణ్యాన..నా ప్రియ నేస్తాలైన పుస్తకాలను మళ్ళీ తెరిచి చదవటం మొదలెట్టాను...!!

Thursday, October 8, 2009

గుండె ధైర్యం..

కొన్ని పరిస్థితులను, కొన్ని విషయాలను వినటానికే కాదు; కొన్ని సందర్భాల్లో "స్పందించటానికి" కూడా కొంత గుండెధైర్యం అవసరం.అది ఒక్క రోజులో రాదు...కాలాన్ని,పరిస్థితులను బట్టి మనిషిలో స్థిరత్వాన్ని ఏర్పర్చుకుంటుంది.ఇప్పుడది నాలో కొంతైనా ఉంది....దానికి సంబంధించి కొన్ని జ్ఞాపకాలు....

డిగ్రీ చదివే రోజుల్లో ఒక శెలవుదినాన నేను నా స్నేహితురాలి ఇంటికి వెళ్ళాను.తను బయటకు వెళ్తోంది.
."ఎక్కడికి?" అని అడగకూడదు కాబట్టి అడగలేదు."నాతో వస్తావా?" అంది.అలాగేనని తలఊపాను.
"మీ ఇంట్లో పాత బట్టలు ఏమైనా ఉన్నాయా?" అంది. "ఊ " అన్నా."పద మీ ఇంటికి" అంది.మళ్ళీ వెనక్కి మా ఇంటికి వెళ్ళాం. నా డ్రెస్సులు,అమ్మ చీరలు కొన్ని తీసుకుని బయల్దేరాం. "అక్కడ నువ్వేమీ ఫీలయిపోకూడదు.." ముందుగానే చెప్పింది. అర్ధం కాలేదు.

"నువ్వు గోరింటాకు బాగా పెడతావు కదా,అక్కడ అవసరం ఉంటుంది" అని 2,3 మెహందీ కోన్స్ కొంది దారిలో.
రిక్షా దిగి చూసాను.."నిర్మల్ హృదయ్ భవన్"(the house for mentally handicapped and physically handicapped) అని రాసి ఉంది.తను,వాళ్ళ ఫామిలీ అక్కడికి రెగులర్గా వెళ్తూంటారు.నాకు తెలుసు.లోపలికి వెళ్లగానే కొందరు పిల్లలు "అక్కా.." అని తనని చుట్టుముట్టారు."ఇదిగో మా ఫ్రెండ్ గోరింటాకు బాగా పెడుతుంది కావాల్సినవాళ్ళు పెట్టించుకోండి" అని వాళ్ళతో చెప్పి ,మేము తెచ్చినవి తీసుకుని తను లోపలికి వెళ్ళింది.వెళ్తూ వెళ్తూ, నా వైపు చూసి "నువ్వు పని అయ్యాకా ఇక్కడే ఉండు.లోపలికి రాకు".అంది.మళ్ళీ అర్ధం కాలేదు...

సరే,నా పనిలో నే పడ్డా.దొరికిన చేతులన్నింటికీ గోరింటాకు పెట్టడం నాకు చాలా ఇష్టమైన పని.తెచ్చిన మెహందీ కోన్లు అయిపోయాయి.పిల్లలంతా వెళ్ళిపోయారు.నా ఫ్రెండ్ ఇంకా లోపల్నుంచి రాలేదు.సందేహపడుతూనే తలుపు తెరుచుకుని లోపలికి వెళ్ళాను...నా గుండె ఆగిపొయింది కాసేపు... physically and mentally handicapped పిల్లలు బోలెడు మంది...నా స్నేహితురాలు ఒక చిన్న పిల్లవాడిని ఎత్తుకుని ఆడిస్తోంది..ఆ పిల్లవాడికి ముక్కు ఉండాల్సిన చోట పెద్ద కన్నంలా ఉంది...చుట్టూరా అలాంటి పిల్లలే...ఎవరు కన్న బిడ్డలో...చూడలేకపోయాను...!పరుగున బయటకు వచ్చి నించున్నా...

నా కళ్ళల్లో నీళ్ళు ఆగటం లేదు...ఐదు నిమిషాల్లో నా ఫ్రెండ్ వచ్చింది.."నేను రావద్దన్నాను కదా,ఎందుకు లోపలికి వచ్చావు?" అంది కన్నీళ్ళు నిండిన నా మొహంలోకి చూస్తూ....అప్పుడర్ధమైంది తను నాకు ఎందుకు రావద్దని చెప్పిందో..!ఆ సమయంలో నాకు తనొక కొత్త వ్యక్తిలాగా,తను ఒక పెద్ద శిఖరం మీద ఉన్నట్లూ,నేను పాతాళంలో ఉన్నట్లూ అనిపించింది.డబ్బు,బట్టలు లాంటి సహాయాలు అందరూ చేస్తారు...అదేమ్ గొప్ప కాదు...కానీ చూడటానికే భయం వేసే వాళ్ళ దగ్గరకు వెళ్ళి, ఆప్యాయంగా వాళ్లను అక్కున చేర్చుకున్న తన పెద్ద మనసుకు మనసులోనే జోహార్లు చెప్పాను...ఎందుకంటే నాకు ఆ సమయంలో మాటలు రాలేదు...

బయటకు వచ్చి నడుస్తున్నాము...నేను తల వంచుకుని ఆలోచనల్లో ములిగిపోయాను..."హలో మేడం..ఎక్కడికి వెళ్ళిపోయావు?వెనక్కు వచ్చేయ్...ఆ గేటుతోనే అది మర్చిపోవాలి" అంది.ఆ తరువాత నన్ను మౌనంగా వదలకుండా ఇంటికి వెళ్ళేదాకా ఏవో కబుర్లు చెప్తూనే ఉంది...!! ఆ రోజు నాకనిపించింది...నిజంగా నాకు గుండెధైర్యం లేదు..అని...!

కానీ ఆ తరువాత జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల నాకు కొంతైనా అది ఏర్పడిందనే అనుకుంటున్నాను.ఎందుకంటే 15ఏళ్ళ క్రితం మాకు అత్యంత సన్నిహితుడైన మా మేనమామ కేన్సర్ వ్యాధితో నరకయాతన అనుభవించటం కళ్ళార చూసాను.ఆయన కన్ను మూసినప్పుడు దగ్గరే ఉన్నాను...!పన్నెండేళ్ళ క్రితం మా నాన్నమ్మ చనిపోయినప్పుడు..కటకటాల గదిలో ఆవిడను పడుకోబెట్టినప్పుడు...తెల్లారి జనాలందరూ వచ్చేదాకా గడపకు ఒక పక్క అమ్మ,మరో పక్క నేను...రాత్రంతా మేమిద్దరమే...నిర్జీవమైన ఆవిడ శరీరం దగ్గర కుర్చునే ఉన్నాం!! అప్పుడు నాలో కించిత్తైనా భయం కలగలేదు...

రెండేళ్ళు అనారోగ్యంతో నానా యాతనా పడి, క్రితం ఏడు మా మామగారు కాలం చేసినప్పుడు....అంతక్రితం రెండు నెలలు బెడ్ రెస్ట్ లో ఉన్న నేను... నిలబడ్డాను...! మరి "పెద్ద కో్డలిని"...వయసు లేకపోయినా, బాధ్యత తెచ్చిన పెద్దరికం అది...అలా నాకెదురైన పరిస్థితులు నాలో కొంతైనా గుండె ధైర్యాన్ని తెచ్చాయి....ఎప్పుడైనా వెనక్కువాలి ఆలోచనల్లోకి వెళ్ళినప్పుడు...కాలం తెచ్చిన మార్పంటే ఇదేనేమో మరి అనిపిస్తూ ఉంటుంది...!!