సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, September 21, 2009

తృష్ణ సెంచరీ...!!

అరే.. సెంచరీ అయిపోయింది....
నాకు బొత్తిగా లెఖ్ఖలు రావనటానికి ఇంతకంటే ఋజువు ఏం కావాలి?
సిరిసిరిమువ్వగారికి సమాధానం రాస్తూ ఎందుకో నా "బ్లాగ్ ఆర్కైవ్" వైపు చూసా..అది "100" టపాలని అంకె చూపెట్టింది...2,3 సార్లు పోస్టులన్నీ లెఖ్ఖ వేసా..కరక్టే..100 అయిపోయాయి...!!
అది సంగతి...!!
నేను మే 28న అనాలోచితంగా,యాదృచ్చికంగా...ఈ బ్లాగ్ తెరిచాను.అంతకు ముందు బ్లాగుల గురించి ఏమీ తెలీదు.ఎప్పుడూ ఎవరివీ చదవలేదు కూడా....ఒక Gmail మొదలెడుతూంటే,"start your own blog"అని ఒక విండో ఓపెన్ అయ్యింది..i signed in and opened this, just like that..!

ఏదో పుస్తకంలో బ్లాగ్ ద్వారా తన భావాలను ఓ డైరీలో రాసుకున్నట్లే రాసే అమ్మాయి కధ చదివాను..అది మనసులో ఉండిపోయిందేమో..నేను కూడా బ్లాగ్ లో ఓ దైరీలోలాగే మనోభావాలు ప్రకటిస్తూ వచ్చాను.నాకు చాలామంది స్నేహితులు ఉన్నా, అందరికన్నా నాకు సన్నిహితమైంది నా డైరీ..ఎందుకంటే నా డైరీ పేజీలు నా భావాలను తనలో దాచుకుంటాయి,నా కోపాన్ని దాచుకుంటాయి,నా దు:ఖ్ఖాన్ని పేజీలు ఇముడ్చుకుంటాయి,నా ఆనందం అక్షరాల్లోకి మారే కొద్ది ఎక్కువౌతుంది...అందులో రాస్తే గానీ నా ఏ భావమూ సంపూర్ణం కాదు..అంత సన్నిహితం నాకు నా డైరీ..అలాంటిది బ్లాగ్ తెరిచాకా నా పర్సనల్ డైరీ ఇప్పటిదాకా తెరవనే లేదు.డైరీ కన్నా ఎక్కువైపోయింది నా బ్లాగ్ నాకు.ఇదే ఒక డైరీ అయిపోయింది.మనసులో నిక్షిప్తమై,ఏ ములనో పడిఉన్న నా ఆలోచనలకీ,మనోభావాలకీ ఓ చక్కని దారి కనిపించింది.అవన్నీ టపాల ద్వారా నన్నడక్కుండానే బయటకు రావటం మొదలేట్టాయి...ఇవిగో ఇలా "100" టపాలయ్యాయి...వాటిల్లో కొన్ని నా బొమ్మలూ,పైన్టింగ్స్ ఉన్నా అవి కూడా నాలోని కళాదృష్టికి ప్రతిబింబాలే కాబట్టి అవీ నా భావప్రకటనల్లో భాగాలే.

పాటలూ,సినిమాలూ,పుస్తకాలూ,కవితలూ అనే లోకంలో చాలా ఏళ్ళు...అదే జీవితమనుకుని పెరిగిన నాకు జీవితాన్ని జీవించటానికి కావాల్సినవి తెలివితేటలూ,సమయస్ఫూర్తి,సంపాదన...అనే సత్యం చాలా లేటుగా తెలిసింది....జీవితంలో ఏదీ సాధించలేకపోయాను అనే అసంతృప్తి మిగిలిపోయింది.అయితే నా కర్తవ్యాన్ని,బాధ్యతల్ని మాత్రం నేను వదిలేసింది లేదు.స్త్రీ గా నాకు లభించిన అన్ని పాత్రలకీ నా వంతు కర్తవ్యం నేను నిజాయితీగా నెరవేర్చాను.జీవితంలో ఎన్నో ఒడిదొడుకులూ, ఇబ్బందులూ, దెబ్బలూ...అందరికీ ఉండేవే.కాకపోతే నాలాటి సున్నితమనస్కులకు అవి మరింత వేదనను పెంచుతాయి,పాఠాల్ని నేర్పిస్తాయి.నన్ను నేను మర్చిపోయి జీవనప్రవాహంలో కొట్టుకు పోతున్న నాకు, ఈ బ్లాగ్ ఎంత ఆనందాన్నిచ్చిందో మాటల్లో చెప్పలేను.నది ఒడ్డున గిలగిలా కొట్టుకుంటున్న చేపని మళ్ళీ నీటిలో పడవేస్తే ఎలా ఉంటుందో..అదీ బ్లాగ్లోకంలో నా స్థితి.

బ్లాగ్ ద్వారా నా అభిప్రాయాలను వ్యక్తపరచటంతో పాటూ,నన్ను నేను మళ్ళీ కనుక్కున్నాను...నేనేమిటో మర్చిపోయిన నన్ను నేను మళ్ళీ గుర్తుచేసుకున్నాను...ఈ నెల 28కి ఈ బ్లాగ్ కు నాలుగు నెలలు.ముందుగా ఈ బ్లాగ్ వేదికను కనిపెట్టినవారికీ,బ్లాగ్ లో ప్రతి ఒక్కరూ తమ తమ అభిప్రాయాలను తెలియచేసుకోవటానికీ అవకాశం కల్పించిననవారికందరికీ శతకోటి వందనాలు.ఓపిగ్గా ఈ టపాలన్నింటినీ చదివి,వ్యాఖ్య లందించి ఆనందపరిచిన బ్లాగ్మిత్రులందరికీ,వ్యాఖ్యలు రాయకపోయినా అజ్ఞాతంగా చదివిన వారికి కుడా పేరు పేరునా ఈ టపా ముఖంగా ధన్యవాదాలు.

రాయకుండా ఉండలేకపోవటం నా బలహీనత,అవసరం కూడా...so,..మళ్ళీ మనసైతే...కొన్నాళ్ళలో తప్పక ప్రత్యక్షమౌతాను...అంతవరకూ మీ , నా "తృష్ణ"కి శెలవు..!!

Sunday, September 20, 2009

ఈ వారం వంట -- క్యాబేజీ పచ్చడి

మా ఇంట్లో అన్నంలోకి పప్పు,కూర,చారుతో పాటు రోజూ ఏదో ఒక పచ్చడి(పొద్దున్న పచ్చడి,రాత్రి అయితే పెరుగు పచ్చడి) చేసేది మా అమ్మ.ఎందుకంటే మా ఇంట్లో ఆవకాయలు గట్రా తినటం చాలా తక్కువ.అన్ని రకాల ఆకుకూరలతో,కూరలతోనూ పచ్చళ్ళు చేసేది.వాటిల్లో ఒకటి -- క్యాబేజీ పచ్చడి.

క్యాబేజీ లోని పోషకాలూ,ఉపయోగాలు:
* క్యాబేజీలో క్రొవ్వు,కొలెస్ట్రాల్ రెండూ తక్కువే.
* Dietary Fiber చాలా ఎక్కువ.ఇంకాదీనిలో Vitamin C, Vitamin K, Folate,
Potassium, Manganese, Vitamin A, omega 3 fatty acids,Thiamin,Vitamin B6,
Calcium,Iron and Magnesium మొదలైన పోషకాలు ఉన్నాయి.
* దీనిలోని పోషకాలు కొన్ని రకాల కేన్సర్లను నివారిస్తాయి.
* శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
* బరువు తగ్గటానికి కూడా క్యాబేజీ ఉపయోగపడుతుంది.
* పాలిచ్చే తల్లులు ఎక్కువగా తింటే పాలు పెరుగుతాయి.
* చలవ చేస్తుంది,బలకరం,రక్త వృధ్ధి కలిగిస్తుంది.
* పచ్చి క్యాబేజీని కోరేసి చపాతీ పిండిలో కలిపేసి చపాతీలు చేసుకుంటే బాగుంటుంది.

క్యాబేజీ పచ్చడికి కావల్సిన పదార్ధాలు:
1) సన్నగా తరిగిన పావు కిలో క్యబేజీ.
2) చిన్న నిమ్మకాయంత చింతపండును కొద్దిగా నీళ్ళలో నానబెట్టుకుని ఉంచుకోవాలి.
3) తగినంత ఉప్పు.
4) 2,3 చెంచాల నూనె.
5)చిటికెడు పసుపు
పోపుకు:
ఆవాలు(1/2 tsp),మినపప్పు(1 tsp),జీలకర్ర(1/2 tsp),
ఇంగువ(a pinch),ఎండు మిర్చి--1, పచ్చి మిర్చి--1

చేసే విధానం:
* ముందు 1చెంచా నూనెలో పోపు వేయించుకోవాలి.అది పక్కకు పెట్టుకుని అదే మూకుడులో
* 2 టీ స్పూన్ల నూనెలో సన్నగా తరిగిన క్యాబేజీని పచ్చివాసన పొయేంతవరకు కొద్దిగా వేయించాలి.
* అది చల్లారాకా, నానబెట్టిన చింతపండు,ఉప్పు,మిర్చి,పోపుతో వేయించిన ఎండు మిర్చి,పచ్చిమిర్చి,చిటికెడు పసుపు వేసి మరీ ముద్దలా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి.(ఐడెంటిటీ లేకుండా పేస్ట్ లా అయిపొతే నాకయితే నచ్చదు.)
Tips:
* పచ్చడిలో కారం వేయటం కన్నా పోపుతో పాటూ వేయించిన మిరపకాయలయితే రుచి బాగుంటుంది.
* మిర్చి ఎవరు తినే కారానికి సరిపడా వాళ్ళు వేసుకోగలరు. నేను తక్కువ వాడతాను కాబట్టి రెండే రాసాను.
* గ్రైండ్ చేసిన పచ్చడిలో పోపు ఆఖరులో కలుపుకుంటే బాగుంటుంది.కొందరు పచ్చడితో పాటూ గ్రైన్డ్ చేసేస్తారు.
కానీ వేగిన మినప్పప్పు పోపు, పచ్చడి గ్రైండ్ చేసాకా కలుపుకుంటేనే బాగుంటుంది.Freshness ఉంటుంది.

ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే....!!
క్యేబేజికూర ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ పచ్చడి బాగుందని తినేస్తారు.(చాలా మందిపై ప్రయోగించాను :) )

******************************
(నా బ్లాగ్ రెగులర్ రీడర్స్ కి: ఇది నా 99వ పోస్ట్.సెంచరీ కోసం ఓ వారం ఎదురు చూడాల్సిందే మరి...శెలవు !!)

Saturday, September 19, 2009

శరన్నవరాత్రులు

"సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధికే
శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే"


ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుంచీ శరదృతువు ప్రారంభం కావడం ఈ ఆశ్వయుజమాస విశేషం.ఈ రోజు అంటే "ఆశ్వయుజ శుధ్ధ పాడ్యమి" నుండి తొమ్మిది రాత్రులు ఆదిశక్తిని పూజించటం శుభప్రదం. ఈ నవరాత్రులలోనూ శక్తి స్వరుపిణిని-- దుర్గ,మహాలక్ష్మి,లలిత,సరస్వతి,గాయిత్రి,అన్నపూర్ణ,బాలాత్రిపురసుందరి,శ్రీరాజరాజేశ్వరి,మహిషాసుర మర్దిని మొదలైన రూపాలలో ఆరాధిస్తారు.వెన్నెలను "శారద" అని కూడా అంటారు.శారదకాంతులతో విరాజిల్లే దేవి కాబట్టి ఆదిశక్తిని "శారద" అని స్తుతిస్తాము.అందువల్ల ఆశ్వియుజ శుధ్ధ పాడ్యమి నుంచీ ఆ మాతను పుజించే తొమ్మిది రాత్రులను "శరన్నవరాత్రులు" అనీ,"శారదరాత్రులు" అనీ పిలస్తాము.సాంప్రదాయమున్నవారు ఈ తొమ్మిది రోజులూ కలశాన్ని స్థాపించి దేవిని నియమంగా పూజిస్తారు.దశమి రోజున ఉద్వాసన చేస్తారు.

తొమ్మిది రోజులలో మూలా నక్షత్రం రోజున "సరస్వతీ దేవి"ని ఆరాధిస్తారు.తొమ్మిది రోజులు పూజ చేయలేనివారు ఈ రోజు నుండీ నవమి దాకా ముడు రోజులూ పూజ చేస్తారు.శక్తి స్వరూపిణి అయిన దేవి ఆశ్వయుజ శుధ్ధ అష్టమి నాడు అవతరించినందువల్ల ఆ రోజు "దుర్గాష్టమి" గా ప్రసిధ్ధి చెందింది.నవరాత్రులలో అతి ముఖ్యమైనది "మహానవమి".దసరా పూజలకి ఇదే ప్రధానమైన రోజు.ఆశ్వయుజ శుధ్ధ నవమి నాడు జగన్మాత "మహిషాసురుడు" అనే రాక్షసుని సంహరించి లోకోపకారము చేసినందువల్ల ఈ నవమి "మహా నవమి" అయ్యింది.ఈ నవరాత్రులూ దేవిని ఆరాధించి ఏ పనైనా మొదలుపెడితే తప్పక విజయం లభిస్తుందని భారతీయుల నమ్మకం.

శ్రీరాముడు ఈ మాసమున ఆ దేవిని పుజించిన తరువాతే లంకకు వెళ్లి రావణుణ్ణి వధించాడని రామాయణంలో చెబుతారు.
అలానే భారతంలో, అజ్ఞాతవాస సమయంలో దుర్యోధనాదులతో యుధ్ధము చేయటానికి అర్జునుడు,పాండవులు ఆయుధాలుంచిన శమీ వృక్షానికి ప్రదక్షిణ చేసి,గాండీవమును తీసుకుని కౌరవులందరినీ తానొక్కడే జయించి,విరాటుని గోవులను నగరానికి మరలుస్తాడు.అర్జునుడికి "విజయం" దశమి రోజున కలిగినందువల్ల
ఆశ్వయుజ శుధ్ధ దశమికి "విజయదశమి" పేరు వచ్చిందని చెబుతారు.ఎక్కడో చదివిన గుర్తు--ఈ రోజున నక్షత్రాలు కనబడిన వేళ "విజయ ముహుర్తం" అని,ఈ ముహుర్తంలో తలపెట్టిన పనులు,ప్రయాణాలూ తప్పక విజయవంతమౌతాయనీ నమ్మకం ఉందట.
శరన్నవరాత్రులకు సంబంధించి నాకు తెలిసిన కొద్దిపాటి విశేషాలు ఇవి.

పండుగలలో "వినాయకచవితి" తరువాత నాకు చాలా ఇష్టమైనవి ఈ "నవరాత్రులు".కలశం పెట్టే ఆనవాయితీ లేకపోయినా ,మా అమ్మ తొమ్మిదిరోజులూ పూజ చేసి నైవేద్యాలు చేసేది.బెజవాడలో ఉండటం వల్ల కనకదుర్గ అమ్మవారి అలంకరణలు తెలుసుకుని ఆ ప్రకారం ఆయా అవతారాలను పూజించేది అమ్మ.పెళ్లయ్యాకా నేను కూడా అలానే నవరాత్రులూ దేవీ పూజ చేసి,నైవేద్యాలు చెయ్యటం మొదలుపెట్టాను.ఈ పుజలు చేసి ఏదో భోగభాగ్యాలు పొందెయ్యాలని కాదు...ఇలా చేయటం వల్ల నాకు ఎంతో మన:శ్శాంతి లభిస్తుంది.పెళ్లైన మొదటి ఏడాది నవరాత్రులు బొంబాయిలో చేసుకున్నాను.మా ఇంటి దగ్గర "మహిషాసురమర్దిని" ఆలయం ఉండేది.ఆయన ఆఫీసు నుంచి వచ్చాకా రాత్రి 9,9.30కి గుడికి వెళ్ళేవాళ్ళం.అప్పుడు ఆఖరు హారతి ఇస్తూ ఉండేవారు...చూడటానికి కన్నుల పండుగ్గా ఉండేది.అదే First and best celebrated festivalగా నా స్మృతుల్లో ఉండిపోయింది.ఇవాళ కుడా పొద్దున్నే మొదటిరోజు పూజాకార్యక్రమాలు ముగించి, అన్నం పరమాన్నం నైవేద్యం పెట్టాను..!!

Friday, September 18, 2009

నాన్నతో ఒక సాయంత్రం


నిన్న పొద్దున్నే పర్మిషన్ తీసేసుకున్నా.."ఇవాల్టితో పాప పరీక్షలయిపోతాయి.అట్నుంచటే అమ్మావాళ్ళింటికి వెళ్పోతానని..".శెలవలున్నా,మళ్ళీ పదిరోజులదాకా కుదరదు మరి.(రేపటి నుంచీ శరన్నవరాత్రులు కదా..నేను బిజీ)డ్రెస్స్ స్కూల్కి పట్టుకుపోయి,పాపకి అక్కడే డ్రెస్ మార్చేసి,బస్సెక్కేసా!ఇంటికి వెళ్ళగానే పాపకి అన్నం పెట్టే పంచవర్షప్రణాలిక పూర్తి చేసి, మెల్లగా కంప్యుటర్ దగ్గరికెళ్ళి బ్లాగు తెరిచా..."మాయ కంప్యూటర్ మళ్ళి తెరిచావా.. ఉన్న కాసేపు కబుర్లు చెప్పవే.."అని అమ్మ కేక..!లాభం లేదని సిస్టం ఆఫ్ చేసేసా.

కానీ మనకి ఖాళీగా ఉండటం రాదే..వంటింట్లో ప్రయోగాలుచేద్దామంటే అమ్మ ఒప్పుకోదు 'ఉన్న కాసేపూ..' డైలాగు వదుల్తుంది!!"సినిమాకు వస్తారా ఎవరన్నా?"..అడిగా..మేము రామన్నరు ఎవరూ."బజారు పనులున్నాయి వెళ్దామా?" "రాము..రాము" అన్నారు.ఇక ఆఖరి అస్త్రం "నాన్నా,విశాలాంధ్రకు వస్తావా..".ఐదు నిమిషాల్లో నాన్న రెడీ."అమ్మో మళ్ళీ పుస్తకాలు కొనేస్తారే బాబూ.."అంది అమ్మ.ఇంట్లో మరి రెండు బీరువాల పుస్తకాలు....

నాన్నతో సమయం గడిపి చాలా రొజులయ్యింది..!నాన్నంటే నాకు చాలా ఇష్టం.ఆయన విజ్ఞానానికి ఆయనంటే గౌరవం.ఎవరి నాన్నలు వాళ్ళకి గొప్ప.అలానే నాకునూ.ఏ విషయం గురించి అడిగినా చెప్పేస్తారు.ఆయన ఒక ఎన్సైక్లొపీడియా అనిపిస్తుంది నాకు.ఒక్క క్రీడా సంబంధిత విషయాలే ఆయనకు తెలియవు.బస్సులో ఆయన ఎక్కలేరని ఆటోలో బయల్దేరాం. ఆయన మిత్రుల కబుర్లు,ఆఫీసు కబుర్లు..సినిమాలూ,పాటలూ,కొత్త సింగర్లూ...అవీ ఇవీ చెప్పుకుంటూ..!నాన్న గురించి ఎక్కడ మొదలెట్టి ఎక్కడ ఆపాలో తెలీదు నాకు.జీవితమంతా వృత్తికే అంకితం చేసారు.వృత్తి పట్ల ప్రేమ ఉండటంతో చేస్తున్న దాంట్లో కావల్సినంత సంతృప్తినే పోగేసుకున్నారు.ధనార్జన ఆలోచనే లేదాయనకు.(నాన్న గురించి ప్రత్యేకం వేరే టపా రాయాలి.ప్రస్తుతానికింతే..)

చిన్న చిన్న మిగిలిన పనులు పుర్తి చేసుకుని షాపుకి చేరాం.పాత పరిచయాలవల్ల షాపువాళ్లకాయన పరిచయమే..!ఒక బీరువాడు పుస్తకాలు సేకరించాకా నేను పుస్తకాలు కొనటం మానేసాను..నా తదనంతరం పిల్లలకి ఈ అభిరుచి లేకపోతే ఇవన్నీ ఏం చేస్తారు..అన్న ఆలోచనవల్ల..!!మళ్ళీ నిన్నే చాలా రోజులకు పుస్తకాలు కొనటం.ఇద్దరం (అసంతృప్తిగా) ఒక సహస్రం బిల్లు చేసి బయటపడ్డాం.షాపులో నాన్న సంతకం పెడుతుంటే అన్నా..ఎన్నిరోజులయ్యిందో నీ సంతకం చూసి..అని!చిన్నప్పుడు నాన్న సంతకాన్ని కాపీ చెయ్యాలని ప్రయత్నించేవాళ్ళం కానీ వచ్చేది కాదు..!

ఎప్పుడొచ్చినా ఏదో హడావుడి..మాట్లాడటం కుదరదు..నిన్ననే చాలారోజులకి నాన్నతో అలా సాయంత్రం గడపటం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది..చిన్ననాటి రోజుల్ని గుర్తు చేసింది..ఒక్కో రోజున అర్ధరాత్రి ఒకటి,రెండింటి వరకు జిడ్డు కృష్ణమూర్తిగారి గురించో,గుంటూరు శేషేంద్ర శర్మగారి గురించో..కిషోర్ కుమార్ గురించో,సలీల్ చౌదరి గురించో....ఏవో డిస్కషన్లు,కబుర్లూ చెప్పుకుంటూ గడిపిన రోజులు ఉన్నాయి..!!రకరకాల కారణాల వల్ల నాన్నే నా "ఐడియల్ మేన్" మరి.

Wednesday, September 16, 2009

ఎందుకిలా..

..ఎందుకిలా..
ఎందుకిలా అని చాలా సార్లు ఆలోచిస్తాను కాని సమాధానం దొరకదు..
ఇదేమి న్యాయం అని అడగకోడదంటారు...
కొన్ని సార్లు నిజాలు చెప్పకూడదంటారు...
ఒక వేలు మనవైపు చూపితే,తమ మూడు వేళ్ళు తమనే చూపుతాయని తెలిసినా
భూతద్దంలోంచి మన తప్పులెంచుతూంటారు...
ఎవరి తప్పువు వారికెందుకు కనబడవు?
ఇతరుల విషయాల్లో జోక్యాలెందుకు?

ఈటెల్లాంటి మాటలు వల్ల కలిగే బాధ ఎలాటిదో తెలిసి కూడా మాటలు విసురుతూ ఉంటారు...
విరిగిన మనసుని మళ్ళీ మళ్ళీ ముక్కలు చేస్తూనే ఉంటారు...
పొందిన సాయాన్నీ మరుస్తూనే ఉంటారు...
మంచితనాన్ని వాడుకుంటూనే ఉంటారు...
నమ్మకాన్ని విరిచేస్తూనే ఉంటారు...
ఎవరి పని వారెందుకు చేసుకోరు?
ఎవరిష్టం వారిదని ఎందుకు వదిలెయ్యరు?
ఎవరి దారినవారెందుకు పోరు?

ఎందుకిలా అని చాలా సార్లు ఆలోచిస్తాను కాని సమాధానం దొరకదు...
ఎందుకిలా...

Monday, September 14, 2009

దంపుడు బియ్యం

ఆరోగ్య సూత్రాలు పాటించటంలో నేను కొంచెం చాదస్తురాలిననే చెప్పాలి.ఆరోగ్య సూత్రాలు ఎక్కడ కనిపించినా చదివి పాటించేస్తూ ఉంటాను.దాదాపు సంవత్సరంన్నర క్రితం యధాలాపంగా కొన్ని ఆరోగ్యపరమైన వెబ్సైట్లను చదువుతూంటే నాకు దంపుడు బియ్యం(brown rice)గురించి తెలిసింది.రాత్రులు చపాతీలు తినటం మాకు బొంబాయిలో అయిన అలవాటు.దంపుడు బియ్యం ఉపయోగాలు తెల్సుకున్నాకా ,పొద్దున్నపూటలు "వైట్ రైస్" బదులు "దంపుడు బియ్యం" తినటం మొదలుపెట్టాము.ఇంట్లో మిగిలినవారు వైట్ రైస్ తిన్నా,మావారి సహకారం వల్ల మేమిద్దరం మాత్రం ఉదయం దంపుడు బియ్యమే తింటాము.బరువు తగ్గటానికి ఇది చాల ఉపయోగపడుతుంది.రుచి కొంచెం చప్పగా ఉండటంవల్ల మొదట్లో ఇబ్బంది పడ్డా ఇప్పుడు అలవాటైపోయింది.కాకపోతే వారానికి ఒకరోజు "వైట్ రైస్" వండుతాను.దంపుడు బియ్యం గురించిన నేను తెల్సుకున్న కొన్ని వివరాలను ఇక్కడ తెలుపుతున్నాను.ఇది వారానికి నాలుగు రోజులు తినగలిగినా మంచిదే.

దంపుడు బియ్యం అంటే:
ధాన్యాన్ని పొట్టు తిసి,పొలిష్ చేసి వైట్ రైస్ గా మారుస్తారు.ఆ ప్రోసెస్ లో దానిలోని పోషకాలన్నీ చాలావరకూ నశించిపోతాయి.బియ్యాన్ని పోలిష్ చే్సే ప్రక్రియలో విటమిన్ B3లోన 67%,విటమిన్ B1లో 80%,విటమిన్ B6లో 90%,60% ఐరన్,సగం manganese,సగం phosphorus, మొత్తం డైటెరీ ఫైబర్ ,మిగతా అన్ని అవసరమైన "ఫాట్టీ ఆసిడ్స్" నశించిపోతాయి.వైట్ రైస్ లో విటమిన్ B1, B3, ఐరన్ ఉన్నా , పైన పేర్కొన్న nutrients అన్నీ పొలిష్,మిల్లింగ్ ప్రక్రియ వల్ల పోతాయి.


అదే
ధాన్యాన్ని పై పొట్టు(హస్క) మాత్రమే తీసినదాన్ని "దంపుడు బియ్యం" (బ్రౌన్ రైస్ ) అంటారు.పై పొర మాత్రమే తీయటంవల్ల దానిలోని పోషకాలన్నీ అలానే ఉంటాయి.శరీరానికి కావాల్సిన 14% DV(daily value) ఫైబర్ ను అందించటంతో పాటూ,ఒక కప్పు దంపుడు బియ్యంలో 88% manganese,మరియు 27.3% DV ఉండే selenium,Magnesium అనబడే ఆరోగ్యకరమైన మినరల్స్ కూడా ఉంటాయి.
manganese శరిరంలోని నాడీ వ్యవస్థ శక్తిని పెంచుతుంది.అంతేకాక ఎంతో ఉపయోగకరమైన కొన్ని ఏంటీఆక్సిడెంట్లని తయారుచేయటంలో శరీరానికి ఉపయోగపడుతుంది.
selenium అనేది శరీరమెటబోలిజంకి ఉపయోగపడే చాల రకాలైన సిస్టంలకి మూలమైనది. కేన్సర్, గుండెపోటు, ఆస్థ్మా,ర్యూమెటోయిడ్ ఆర్థరైటిస్ మొదలైన జబ్బులను నిరోధించే శక్తిని శరిరానికి ఈ selenium అందిస్తుంది.
Magnesium కండరాలను,నరాలనూ రిలాక్సింగ్ కీ,ఎముకలను గట్టిపరచటానికీ,రక్త ప్రసరణ సాఫిగా సాగిపోవటానికీ ఉపయోగపడుతుంది.

ఇవే కాక దంపుడుబియ్యం తినటం వల్ల ఉన్న మరికొన్ని ఉపయోగాలు:

* బరువు తగ్గించుకోవటానికి ఉపయోగపడుతుంది.
* దంపుడు బియ్యం మన శరీరంలోని LDL (bad) cholesterol ను తగ్గిస్తుంది. అందుకే "రైస్ బ్రాన్ ఆయిల్" కూడా మిగతావాటికంటే మంచిది అంటారు.(ప్రస్తుతం నేను అదే వాడుతున్నాను.)cardiovascular healthకు ఈ నూనె చాలా మంచిదని శాస్త్రవేత్తల పరిశోధనలు తెలియ చేస్తున్నాయి.
* ఎక్కువ శాతం కొలెస్ట్రోల్, హై బ్లడ్ ప్రషర్ మొదలైన లక్షణాలున్న మెనోపాజ్ దశ దాటిన మహిళలకు దంపుడు బియ్యం తినటంవల్ల ఆరోగ్యం చాలా మెరుగు పడినట్లు సమాచారం.
* American Institute for Cancer Research (AICR) వారి ఒక రీసర్చ్ ప్రకారం whole grains లో antioxidants ను ఉత్పత్తి చేసే phytonutrients ఉంటాయి.అవి శరిరంలో cancer-fighting potential ను,రోగనిరోధక శక్తిని పెంచుతాయి.పరిశోధనల ప్రకారం గోధుమల్లో 77% , ఓట్స్ లో 75%, దంపుడు బియ్యంలో 56% anitioxident activity ఉంటుంది. whole grains లో fat, saturated fat, and cholesterol తక్కువశాతాల్లో ఉండటం వల్ల గుండె జబ్బులను,కొన్ని రకాల కేన్సర్లను నిరోధించే శక్తి వీటిల్లో ఉంది.
* దంపుడు బియ్యం తినేవారికి type 2 diabetes వచ్చే అవకాశాలు కూడా తక్కువ.

ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని చదివాకా ,రుచి కొంచెం చప్పగా ఉన్నా మేము మాత్రం రోజూ ఇదే తినాలని నిర్ణయించేసుకున్నాము.కాకపోతే సరైన దంపుడు బియ్యాన్ని సిటీల్లో వెతికి కొనుక్కోవాలి.కొన్ని సూపర్ మార్కెట్లలో బాగా పొట్టు తీసేసిన దంపుడు బియ్యాన్ని అమ్ముతూ ఉంటారు.అలాటిది తిన్నా ఒకటే,తినకపోయినా ఒకటే.హోల్ సేల్ షాపుల్లో మంచి రకం దొరికే అవకాశం ఉంది.మేము కొనటం మొదలెట్టినప్పుడు కేజీ ఇరవై రూపాయలు ఉండేది.ఇప్పుడు కేజీ నలభైకి చేరుకుంది..!అయినా ఆరోగ్యమే మహాభాగ్యం కదా మరి !!

Saturday, September 12, 2009

మెంతికూర సాంబారు

(ఫోటోలోని సాంబారు నేను చేసినది కాదు.అది మెంతికూర సాంబారు కుడా కాదు .)

ఈ వారం వంట -- మెంతికూర సాంబారు.
సాంబారు అందరూ చేసుకునేదే.కాని మెంతికూరతో సాంబారు చాలా బాగుంటుంది + ఆరోగ్యదాయకం.
మెంతికూరలో పోషకాలు:
1)దీనిలో potassium, calcium, iron వంటి మినరల్స్ ఉన్నాయి.
2)మెంతులు,మెంతికూర రెండూ శరీరానికి చలవ చేస్తాయి.
3)అరుగుదలను పెంచుతాయి.
4)రాత్రి పూట ఒక స్పూను మెంతులు మింగి పడుకుంటే,కాన్స్టిపేషన్ సమస్య ఉంటే;మెంతుల్లో ఎక్కువ శాతం ఫైబర్ ఉండటం వల్ల పొద్దుటికి సర్దుకుంటుంది.
5)పాలిచ్చే తల్లులకి పాలు పెంచుతాయి.
6)మధుమేహాన్ని అదుపు చేయటంలో కూడా ఉపయోగపడతాయి.
7)కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి.

సాంబారుకి కావాల్సిన పదార్ధాలు:
(ఇది ఐదారుగురికి సరిపోయే సామగ్రి)
* కందిపప్పు :3/4కప్పు
* సన్నగాతరిగిన మెంతికూర :1 కట్ట,చిన్న మెంతి అయితే 2 కట్టలు

(ఆకుకూర తరగకుండా రెండుమూడుసార్లు బాగా కడగాలి.తరిగాకా కడిగితే పొషకాలు ఉండవు.)
*సన్నగా పొడుగా తరిగిన పెద్ద ఉల్లిపాయ :1(చిన్నవి అయితే 2 )
*పచ్చిమెరప :2 or 3 (తినే కారాన్ని బట్టి)
*ఎండుమిర్చి :1
*చింతపండు పెద్ద నిమ్మకాయంత
*నెయ్యి 2 tsps
(చారులోకి,సాంబారులోకి పోపు నెయ్యితో వేసుకుంటే మంచి రుచి వస్తుంది)
*బెల్లం తరుగు 1 tsp (వద్దనుకుంటే ఇది మానేయచ్చు)
*సాంబారు పౌడర్ 2 1/2 tsps
* ఉప్పు 2 tsps(కావాలంటే తగ్గించుకోవచ్చు)
*ఆవాలు 1 tsp
*జీలకర్ర 1/2 tsp
*ఇంగువ 1/4 tsp
(*మెంతికూర వెయ్యని మామూలు సాంబారు పోపులో మెంతులు కూడా నేనైతే వేస్తాను)

మెంతికూర సాంబారు తయారీ :
1) రెండున్నర కప్పుల నీటితో పప్పుని చిటికేడు పసుపు(ఇలా వేయటం వల్ల పప్పుకి మంచి రంగు వస్తుంది,పసుపు ఆరోగ్యకరం కూడా) వేసి,ఒక గిన్నెలో మూత పెట్టి,కుక్కరులో ఉడికించుకుని,మెత్తగా పేస్టులా మాష్ చెసి పెట్టుకోవాలి.
2 ltrs ఉన్న బుల్లి కుక్కరులో అయితే డైరెక్ట్ గా పప్పు పెట్టేసుకోవచ్చు.
2)చింతపండుని 1 1/2 కప్పుల నీటిలో నానబెట్టి ,రసం తీసుకుని,వడబోసుకుని ఉంచుకోవాలి.
3)వెడల్పాటి kaDaiలో లేదా లోతున్న నాన్స్టిక్ పాన్ లో నెయ్యివెసి,ఆవాలూ,జీలకర్ర,ఇంగువ,ఎండు మిర్చి వేసి పోపు వేసుకోవాలి.
4)తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి 2,3 నిమిషాల తరువాత సన్నగా తరిగిన మెంతి ఆకు వేసి వేయించాలి.
5)మెంతికూర వేగాకా మంచి వాసన వస్తుంది.అప్పుడు స్టవ్ ఆపేసి,వేగినదంతా వేరే ప్లేట్లోకి తీసిపెట్టుకోవాలి.
అదే ముకుడులో చింతపండు రసం,ఉప్పు,బెల్లం తరుగు వేసి మరగనివ్వాలి.
6)చింతపండు రసం తాలూకూ పచ్చివాసన పోయాకా,మెత్తగా చేసి పెట్టుకున్న పప్పు,సాంబార్ పౌడర్ వేసి బాగా కలపాలి.(సాంబార్ పౌడర్ ముందుగా కాస్త అర కప్పు చన్నీళ్లలో కలుపుకుని అప్పుడు వేసుకుంటే పౌడర్ ఉండలు కట్టకుండా ఉంటుంది)
7)తరువాత ఇందాకా వేయించి ఉంచుకున్న మెంతి ఆకుని ,ఉల్లిపాయ ముక్కలని అందులో కలుపుకోవాలి.
8)తగినన్ని నీళ్ళు కలుపుకోవచ్చు అవసరాన్ని బట్టి.సాంబారు చిక్కబడినట్టు అనిపించాకా దింపేసుకోవటమే.

ఇది అన్నంలోకీ,చపాతిల్లోకీ కూడా బాగుంటుంది.


Friday, September 11, 2009

గొల్లపూడి గారి "ఎలిజీలు"

ఎలిజీ:
ఇంగ్లీషు సాహిత్యంలోని కొన్ని పద్యరూపాల్లో(poetic forms) "Elegy" ఒకటి. ఒక వ్యక్తి మరణానంతరం ఆ వ్యక్తిని గుర్తుచేసుకుంటూ,అతని మరణానికి విచారిస్తూ రాసే పద్యాన్ని
"Elegy" అంటారు.

పుస్తకం గురించి:

కొందరు గొప్పవాళ్ళు,పరిచయస్తులు,పెద్దవాళ్ళూ ఒక్కొక్కరే దూరమైనప్పుడు రాస్తూ వచ్చిన కొన్ని ఆర్టికల్స్ ను ఓ మిత్రుని సహకారంతో "ఎలిజీలు" పేరుతో 1998లో పుస్తకరూపంలోకి తెచ్చి మనకందించారు గొల్లపూడి మారుతీరావుగారు.గొల్లపూడిగారి పుస్తకంలోని ముప్ఫైనాలుగు మంది చిరస్మరణీయుల్లో సగానికి పైగా మహనీయుల గూర్చి నాకు తెలియటం నా అదృష్టంగా భావిస్తాను.

పుస్తకంలో గొల్లపూడిగారు స్మరించిన వారి పేర్లూ,వివరాలూ ఆయన మాటల్లోనే...ఇక్కడ తెలుపుతున్నాను:
దేవులపల్లి కృష్ణశాస్త్రి: ప్రసిధ్ధ తెలుగు భావకవి.
చలం: సాంఘిక సంస్కరణను అభిలషించిన చైతన్యవంతమైన రచయిత.
దాశరధి: దేశాభిమానంగల మహాకవి,అభ్యుదయవాది.
జలసూత్రం రుక్మిణీనాధశాస్త్రి: చమత్కారం,నేర్పు,గడుసుతనంతో పేరడీలు చెప్పగల దిట్ట.
ఆచంట జానకీరామ్: ఆకాశవాణి కార్యక్రమ నిర్వాహకులు.
సోమంచి యజ్ఞన్నశాస్త్రి: కధకులు,నాటకకర్త.
పురిపండా అప్పలస్వామి: ప్రముఖ కవి."పులి పంజా" వీరి ప్రసిధ్ధ కవితాసంకలనం.
న్యాయపతి రాఘవరావు: "రేడియో అన్నయ్య"గా చిరపరిచితులు.హైదరాబాదులో వీరు ప్రారంభించిన "ఆంధ్ర బాలానంద సంఘం" నేడు ఎంతో మంది పిల్లలకు శిక్షణ ఇస్తోంది.
ఎస్.భావనారాయణ: గౌరి ప్రొడక్షన్ అధినేత.ఎన్నో జానపద చిత్రాలను,చక్కటి సాంఘిక చిత్రాలను అందించిన నిర్మాత.
కె.ఎస్.ప్రకాశరావు:దర్శకులు."రఘుపతి వెంకయ్య అవార్డ్" గ్రహీత.ప్రముఖ దర్శకులు కె.రాఘవేందర్రావుగారు వీరి కుమారులు.
ఆత్రేయ: సుకవి,మనసు కవిగా ప్రఖ్యాత గాంచిన "కిళాంబి వెంకట నరసింహాచార్యులు" ప్రముఖ సిని గేయ రచయిత.

పురాణం శర్మ: "పురాణం సీత" పేరుతో ఈయన రాసిన "ఇల్లాలి ముచ్చట్లు" ఎందరో అభిమానులను సంపాదించుకున్నాయి09.వీరి కధ "నీలి" అంతర్జాతీయ కధల పోటీకి ఎన్నికైంది.
శ్రీ శ్రీ :ఇజాలకతతీతమైన నిజమైన మహా కవి."మహా ప్రస్థానం","ప్రభవ","చరమ రాత్రి కధలు" మొదలైన ఎన్నో రచనలు చేసారు.ఆత్రేయగారు రాసారని చాలామంది పొరబడే "డాక్టర్ చక్రవర్తి" సినిమాలోని "మనసున మనసై" పాట ఈయన రాసిందే!!
రావిశాస్త్రి: ప్రముఖ కధా,నవలా రచయిత.గొల్లపూడిగారి మాటల్లో "తెలుగు కధకి ప్లేన్ టికెట్టు కొనిపెట్టి దేశవదేశాలకూ పంపించారాయన"
కె.వి.గోపాలస్వామి: ఆంధ్రా యూనివర్సిటీ రిజిస్ట్రార్(1942-63),ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కి డైరెక్టర్ (1967-69),గొప్ప వక్త,రచయిత.
బుచ్చిబాబు:రాసినది ఒక్క నవలే అయినా తెలుగు నవలా సాహిత్యంలో ధృవతారగా నిలిచిపోయిన "చివరికి మిగిలేది" రచయిత.వీరు కధా రచయిత,వ్యాస రచయిత,నాటక కర్త కూడా.
టి.ఆర్.మహాలింగం : కలైమణి,పద్మశ్రీ లాంటి బిరుదులు పొందిన జగద్విఖ్యాత వేణుగాన విద్వాంసులు.
రావురి వెంకటసత్యనారాయణరావు: ప్రఖ్యాత రచయిత,పాత్రికేయులు.
గొల్లపూడి సుబ్బారావు: గొల్లపూడి మారుతీరావుగారి తండ్రిగారు.
ఇందిరా గాంధీ : పండిట్ జవహర్ లాల్ నెహ్రుగారి పుత్రిక.దేశరాజకియాలపై తన ప్రభావం చూపిన ఒకప్పటి మన దేశ మహిళా ప్రధాని.
స్థానం నరసింహారావు:ఆకాశవానణిలో నాటక విభాగానికి ప్రొడ్యుసర్ గా పనిచేసారు. స్త్రీ పాత్రల్లో నటించి,జీవించిన వీరు "పద్మశ్ర్రీ" అవార్డ్ గ్రహీత.
ఎన్.టి.రామారావు:ఎన్.టి.ఆర్ గా ప్రేక్షకుల మనసుల్లో నిలిచి;రాముడుగా,కృష్ణుడుగా పౌరాణిక పాత్రల్లో జివించిన అమరజివి."తెలుగు దేశం" పార్టీ స్థాపించి,ప్రజాభిమానంతో రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు.
ఉషశ్రీ :రేడియో ద్వారా "రామాయణం,మహాభారతం.."లాంటి గ్రంధాలకు బహుళ ప్రాచుర్యం కలిగించిన వ్యక్తి."ధర్మ సందేహాలు" శీర్షికతో శ్రోతల మనసుల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న సాహితీ స్రష్ఠ.ఆయన జీవించి ఉండగా ఆయనను "తాతగారు" అని పిలవగలగటం నా అదృష్టం.
సత్యజిత్ రే: "పద్మశ్రీ" , "పద్మవిభూషణ్" వంటి గౌరవసత్కారాలందుకున్న "రే" భారత దేశం గర్వించదగ్గ గొప్ప సినీదర్శకులు.

వీరిలో కొందరితో తన పరిచయాలనూ,స్నేహాన్నీ,ఆ వ్యక్తుల గొప్పతనాన్ని గురించీ ఎంతో చక్కగా విశదీకరించారు గొల్లపూడిగారు.ఈ పుస్తకంలో ఇంకా ఒకప్పటి మన దేశ ప్రధాని "రాజీవ్ గాంధీ", నాటకకర్త "కొర్రపాటి గంగాధరరావు",కూచిపూడి కళాకరులకు చేయుత నందించిన "బందా కనకలింగేశ్వరరావు",నాటక ప్రయోక్త "కె.వెంకటేశ్వరరావు", "గొల్లపూడి శ్రీనివాస్"(మారుతిరావు గారి కుమారుడు) ఈయన గురించి చదువుతూంటే కన్నీళ్ళాగవు..,నాటక కర్త "పినిశెట్టి", ప్రాచీన సాహిత్యానికీ,తెలుగు సాహిత్యానికీ విశిష్ఠ కృషి చేసిన "వావిళ్ల రామస్వామి శాస్త్రులు",బ్రిటిష్ రాణి "డయానా", మొదలైన వారి గురించి కూడా మనం తెలుసుకుంటాం.ఆఖరులో వారి పెంపుడు కుక్క "బెంజీ" మీద రాసిన "ఎలిజీ" వారి కుటుంబానికి ఆ కుక్కపిల్లపై ఎంత అభిమానం ఉన్నదో తెలియపరుస్తుంది.

నాకు నచ్చిన తెలుగు పుస్తకాల్లో ఈ "ఎలిజీలు" పుస్తకమొకటి.ప్రతి తెలుగువారి ఇంటా ఉండవలసిన పుస్తకం ఇదని నా అబిప్రాయం.ఈ పుస్తకం కాపీల కొరకు విశాలాంధ్ర,నవోదయా పబ్లిషర్స్ ను సంప్రదించవలసినదిగా పుస్తకంలో తెలిపారు.

Thursday, September 10, 2009

ఒకోసారి...


ఒకోసారి...
...గెలుపు కన్నా ఓటమే స్ఫూర్తినిస్తుంది
...ప్రశంస కన్నా విమర్శే ఉత్తేజాన్నిస్తుంది
...వెలుగు కన్నా చీకటే బాగుందనిపిస్తుంది

ఒకోసారి...
...పరిచయంలేని అపరిచితుల వద్దే మనసు విప్పాలనిపిస్తుంది
...సమాధానం కన్నా చిరునవ్వే చాలనిపిస్తుంది
...కళ్ళు మూసుకుని గుడ్దిగా నమ్మాలనిపిస్తుంది

ఒకోసారి...
...కొన్ని గతాలకు మరపే ముగింపనిపిస్తుంది
...నిట్టూర్పులో కన్నీరే తోడనిపిస్తుంది
...మనుషుల సాంగత్యం కన్నా ఒంటరితనాన్నే మనసు కోరుతుంది

ఒకోసారి...
...నిజం కన్నా అబధ్ధమే వినాలనిపిస్తుంది
...వేదనలో హాయికై వెతకాలనిపిస్తుంది
...మాటల కన్నా మౌనమే మేలనిపిస్తుంది...!!

Wednesday, September 9, 2009

आंखे तेरी..


Anwar (2007) చిత్రంలోని ఈ పాట వినటానికి బాగుండటమే కాక,చూడటానికొక దృశ్యకావ్యంలా ఉంటుంది.చిత్ర కధ కూడా చాలా హృద్యంగా ఉంటుంది.చదివి,విని, చూడాలి అనుకుని చూడలేకపోయిన సినిమా ఇది..!


సంగితం: Mithoon, Pankaj Awasthi
సాహిత్యం: Sayeed Quadri, Hasan Kamal
పాడినది: Roop Kumar Rathod

मौला मेरे मौला मेरे, मौला मेरे -4
आंखे तेरी कित् नी हसी
की इन्का आशिक मै बन् गया हूं
मुझकॊ बसालॆ इन्मे तु
इशक है...मौल मेरे-- 4

मुझसे ऎ हर घडी, मेरा दिल कहॆ
तुम्हि हो उसकी आर्जू
मुझ्से ऎ हर घडी,मेरा लब कहॆ
तॆरी ही हॊ सब गुफ़्तगू
बातॆ तेरि इतनी हसी,मै याद इनकॊ जब करता हूं
फूलॊ सी आयी खुशबू

रख लू चुपाकॆ मै कही तुझकॊ
साया भी तॆरा ना मै दूं..
रख लू बनाकॆ कही घर,मै तुझॆ
साथ तेरॆ,मै ही रहू
जुल्फॆ तेरी इतनी घनी
देख के इन्कॊ,यॆ सॊच ता हूं
सायॆ मेइन इन्कॆ मै जियू
इश्क है...मौल मेरे मौला मेरे..-4

मेरा दिल यही बोला,मॆरा दिल यही बॊला
यारा राज ये उस नॆ मुझ पर खॊला
कि है इश्क मोहब्बत,जिस्कॆ दिल मै
उसको पसंद करता है मौला..

ఈ పాట అర్ధాన్ని తెలుసుకోవాలనుకునే హిందీరాని వాళ్ళకోసం ఇది :
link for translated lyrics:
http://www.bollyfm.net/bollyfm/mid/1234/tid/6476/translyricsinfo.html

Tuesday, September 8, 2009

మనస్విని

ప్రముఖ తమిళ నవలారచయిత అఖిలన్ గారి గురించి,ఆయన రాసిన "చిత్తిరప్పావై" అనువాదం "చిత్రసుందరి" గురించి అదివరకొక టపా రాసాను.క్రింది లింక్ లో ఆ వివరాలు చూడగలరు.
http://trishnaventa.blogspot.com/2009/07/blog-post_17.html

అఖిలన్ గారు రాసిన మరొక నవల "స్నేహితి" గురించి ఈ టపా..ఈ నవలను కూడా మధురాంతకం రాజారాంగారు 1958లో "మనస్విని"గా అనువదించారు. ఒక ప్రముఖ వార పత్రికలో సీరియల్ గా ప్రచురితమైన ఈ నవల తెలుగు పాఠకుల ఆదరణకు పాత్రమైంది.1981లో "చిత్రసుందరి"తో పాటూ "మనస్విని" కూడా నవలా రూపం సంతరించుకుంది.

"స్నేహితి" అంటే స్నేహితురాలని అర్ధం.అఖిలన్ గారి శైలిలో,మొదలుపెట్టిన దగ్గరనుంచీ పూర్తయ్యేదాకా ఆపలేని ఆకట్టుకునే కధనంతో,జీవితం గురించిన మంచి సందేశంతో రాయబడిన ఒక అపురుపమైన నవల ఇది.ఎన్నిసార్లు చదివినా కొత్తగా తోచే ఈ నవలంటే నాకు చాలా ఇష్టం.ముఖ్యంగా కొన్ని విషయాలపై అఖిలన్ గారు తెలియపర్చిన అభిప్రాయాలు ఎవరికైనా బాగా నచ్చుతాయి.కిటికీ లోంచి లోకమన్న బూచిని చూపి భయపెట్టకుండా;సామాజిక స్పృహతోనే,తమ నవలలకు కట్టుబాట్లకు,సాంప్రదాయానికీ విరుధ్ధంగా ముగింపులను ఇవ్వగల ధైర్యం ఉన్న కొద్ది మంది రచయితలలో ఈయన ఒకరు.ఏభైలలోనే ఇంతటి మహోన్నతమైన ఆలొచనలతో రచనలు చేసారంటే సమాజంలో మార్పు కోసం ఆయన ఎంత తపన పడ్డారో అర్ధం అవుతుంది.

"మనస్విని" కధ:
రాజు "ఉషస్సు" పత్రిక సంపాదకుడు,కధా రచయిత.పేరుప్రఖ్యాతలున్న సహృదయుడు.ఒకానొక సందర్భంలో అతనికి సీతారామయ్య గారనే సంపన్న,వయొవృధ్ధునితో పరిచయమౌతుంది.మొదటి పరిచయంలొనే ఆయన పట్ల గౌరవభావం,ఆత్మీయత,స్నేహభావం ఏర్పడిపోతాయి.కానీ, మొదటిసారి వారి ఇంటికి వెళ్ళినప్పుడు బంగారుబొమ్మ లాంటి ఇరవైయ్యేళ్ల "లలిత" ఆయన భార్య అని తెలిసి అవాక్కవుతాడు.వాళ్ల వివాహం వెనుక గల కారణాలు,జరిగిన సంఘఠనలు తెలిసాకా వారిద్దరి విచిత్ర దాంపత్యాన్ని ,అన్యోన్య స్నేహాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. అయితే,సీతారామయ్యగారి మృదుభాషణ,హృదయాన్ని కదిలించే ఆదరణ,ప్రసన్నమైన ప్రవర్తన రాజును ఆయనవైపు ఆకర్షింపచేస్తాయి.కపటంలేని అమాయకత్వం,సిరిసంపదల వల్ల ఏమాత్రం తరగని ఆయన ఉన్నత సంస్కారం ముందర సహృదయుడైన రాజు తలవంచుతాడు.సమాజం అడ్దగిస్తున్నా;సాహిత్యాన్ని అభిమానించే ఆ విచిత్ర దంపతులను,వారి పెద్ద గ్రంధాలయాన్ని,కూర్చూంటే సేదతిర్చటానికి ఉన్న అందమైన వారి పూలతొటను,వారిద్దరి అభిమానాన్ని,ఆ ఇంటినీ వదులుకొలేకపోతాడు రాజు.

స్వార్ధభావానికి తావులేని సేవాశీలత;ఆడంబరాలు,అలంకారాలూ లేని నిరాడంబరత;పరాధీనమైన పరిస్థితుల్లో కూడా కొట్టొచ్చినట్లు కనిపించే లలిత హృదయసౌందర్యం,వారిదీ వీరిదీ అన్న వ్యత్యాసం లేకుండా అందమైన కవితలో,సంగీతంలో,శిల్పంలో పరవసించిపోయే లలిత కళారాధన చూచిన రాజు ఆమెను ప్రేమించకుండా ఉండలేకపోతాడు.కానీ కట్టుబాట్లు,సాంప్రదాయాల విలువ తెలిసిన మనిషిగా మనోభావాలను మనసులోనే దాచుకుంటాడు.అతని రచనలను, వ్యక్తిత్వాన్ని, నిరాడంబరతనూ,స్నేహాన్ని ఇష్టపడిన లలిత కూడా మౌనంగా అతడిని ఆరాధిస్తుంది.కాని ఇద్దరూ వారి వారి హద్దులను,పరిధులను దాటి అబిప్రాయాలను ఎన్నడూ వ్యక్తపరుచుకోరు.ఒక సాంఘిక మర్యాదకు కట్టుబడి తమ మూగ బాధను హృదయాల్లొనే దాచుకుంటారు వారిద్దరూ.అయితే, అసుయాపరులైన కొందరి కారణంగా,ప్రముఖుల జీవితాలను భూతద్దం లోంచి చూసే సమాజం చేయని నేరానికి రాజుకు కళంకాన్ని అంటకడుతుంది.మర్యాద పొందిన సమాజంలొనే అపహాస్యంపాలై ఒకానొక రోజున దిక్కతోచని దయనీయ స్థితిలో సముద్రపుటొడ్డున స్పృహ కోల్పోతాడు రాజు.

వివాహమన్న పవిత్రమైన కట్టుబాటుకు వారిద్దరూ చూపిన గౌరవం,దాన్ని కాపాడటం కోసం వారు పడిన బాధ,చేస్తున్న త్యాగాన్ని,వారి నిగ్రహాన్ని చూసి చలించిపోయిన సీతారామయ్యగారు, వారిద్దరిని కలపాలనే నిర్ణయానికి వచ్చి,తన నిర్ణయానికి వారిని బధ్ధులని చేసి,ఆశీర్వదించడంతో కధ ముగుస్తుంది.మహోన్నతమైన ఆ పెద్దాయన సంస్కారానికి చేతులెత్తి దణ్ణం పెట్టాలనిపిస్తుంది.మనుషుల్లోని సున్నితమైన భావాలను ఎంతో లలితంగా చిత్రికరింపబడ్డాయి ఈ నవలలో. చదవటం అయిపొయాకా కూడా చాలా కాలం మన మనసు కధనం చుట్టూ పరిభ్రమిస్తుంది.కధలో "కాంతం" అనే మరో పాత్ర ద్వారా స్త్రీ సహజమైన మనోభావాలను,స్త్రీల స్వభావాన్ని ఎంతో చక్కగా వ్యక్తీకరిస్తారీ రచయిత.ఈ నవల గొప్పతనానికి మధురాంతకం గారి అద్భుత అనువాదం కూడా ఒక కారణమే.

నవలలో మనల్ను ఆలోచింపజేసే కొన్ని వాక్యాలు:
"కొన్ని ప్రేమగాధలలా సుఖాంతం కావటానికి ముందు ఎంత కన్నీరు ప్రవహించిందో,హృదయాలెంతగా వ్రక్కలైపొయాయొ,మనసుల్లో ఎంతటి దావాగ్ని చెలరేగిందో ఎవరాలొచిస్తారు?"

"వేదికలెక్కి మహిలాభ్యుదయం ఎంత అవసరమో నొక్కిచెప్పటం కన్నా ఒక మంచిపనిని సక్రమంగా నెరవేర్చటమం వల్ల దేశానికి ఎంతొ కొంత మేలు చేకూరుతుంది."

"సమ వయస్కులైన యువతీయువకులు సన్నిహితంగా ప్రవర్తించడమంటూ జరిగితే వాళ్ళీ దేశంలో భార్యాభర్తలైనా కావాలి లేదా అన్నా చెళ్ళెలైనా కావాలి.అంతకుమించి మరెలాంటి సంబంధాన్నీ లోకం హర్షించడంలేదు.స్త్రి పురుషులు పవిత్ర హృదయాలతో ఒకరినొకరు ఆత్మీయులు కావటానికి ఇవి తప్ప మార్గాంతరాలు లేనే లేవా?ప్రతిఫలాన్ని ఆపేక్షించని స్నేహసౌహార్ధాల మూలంగా స్త్రీపురుషులు సన్నిహితులు కావటానికి వీలులేదా?"

"లక్ష్యమని, త్యాగమనీ పెరు బెట్తి అబలల జీవితాన్ని బలిపెడితే గాని ముగింపుకురాని దు:ఖాంతమైన గాధల్ని వ్రాసి జీవితం పట్ల వాళ్లకున్న నమ్మకాన్ని నాశనం చేయకండి"
"లక్ష్యాలు.ఆదర్శాలు,యుగయుగాలకూ మార్పు చెందని షాషాణపంక్తులు గావు.కాలప్రవాహం వాటిని తనకు వీలైనట్టు మలచుకుని ఆవలికి వెళ్ళిపోతుంది.ఆదర్శమ్ కొరకు గాదు జీవితం,జీవితం కొరకే ఆదర్శం."

"మానవుడి స్వభావం మీద అతడి ఇష్టా ఇష్టాలతో ప్రసక్తి లేకుండా ప్రకృతి కొన్ని మార్పుల్ని సాధించగలుగుతుంది."

"రచయితలు తమకు మంచిదని తోచిందేదో రాస్తారు.నచ్చేవాళ్లకు నచ్చుతుంది,నచ్చనివాళ్ళ గురించి ఆలోచించక్కర్లేదు.అవి జీవితపు గొడవల్లో అలసి,సొలసి విసిగివేసారిపొయిన మానవుడికి ఇంత మనశ్శాంతి,ఇంత ఆనందం ఇవ్వగలిగితే చాలు"

Monday, September 7, 2009

అందమైన ఇండోర్ ప్లాంట్

గార్డెనింగ్ అభిరుచి ఉన్నా,లేకపొయినా ఇండోర్ ప్లాంట్స్ చాలా మంది పెట్టుకుంటూ ఉంటారు.డ్రాయింగ్ రూం లోనో,లివింగ్ రూం లోనో..పచ్చగా ఉన్న ఆకులను చూస్తే మనసు ఎంతో ఆహ్లాదపడుతుంది. చాలా సులభంగా పెరిగే ఒక ఇండోర్ క్రీపర్ గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను...

ఒక మంచి "చిలకడ దుంప"(స్వీట్ పొటాటో) తీసుకోవాలి.దానికి పైభాగంలో అడ్దంగా ఒక పుల్ల,కొంచెం బలంగా ఉండేది గుచ్చాలి.పైన నేను పెట్టిన ఫొటోలో లాగ.అది ఎందుకంటే మనం పెట్టే సీసాకు గానీ,ఫ్లవర్వేజ్ కు గానీ సపోర్ట్ గా ఉండేందుకు,లోపలికి జారిపొకుండా.పెట్టేది ఒక గాజు సీసా కానీ,ట్రాన్స్పరెంట్ బౌల్ గానీ అయితే మొక్క పెరిగే కొద్దీ దాంట్లో పెరిగే తెల్లని వేళ్లు మరింత అందంగా కనిపిస్తాయి.దాంట్లో పుల్లకు గుచ్చిన చిలకడ దుంప పెట్టి, నిండుగా నీళ్ళు పొయ్యాలి.రెండు రోజులకొకసారి నీరు నింపుకుంటూంటే చాలు(నీరు తగ్గుతూ కనిపిస్తుంది).

మధ్యలో నెలకొకసారి నీరంతా వంపేసి,మళ్ళీ తాజాగా నీరు నింపుకోవాలి.2,3నెలల పైనే పెరుగుతుంది ఈ క్రీపర్.బాగా గుబురుగా కావాలనుకుంటే రెండు దుంపలను వేసుకుంటే సరి.బాగా పైకి పెరిగిన కొమ్మలు కట్ చేసేసుకోవచ్చు.ఆకుపచ్చ,లేత ఆకుపచ్చ రంగుల్లో,కొత్త చిగురులతొ ఎంతో అందంగా ఉండే ఈ ఇండోర్ క్రీపర్ గురించి తెలిసాకా పెంచకుండా ఉండలేము.పైన ఉన్న ఫొటొలోది నేను మా ఫ్రిజ్ మీద పెట్టి పెంచుతున్నది....(మొబైల్తో తీసినందువల్ల ఫోటో క్లియర్ గా లేదు)
మరి మీరూ ప్రయత్నించండి..

Sunday, September 6, 2009

ఒక మంచి టిఫిన్:

వంటల పట్ల,కొత్త ప్రయోగాల పట్లా నాకు చాలా ఆసక్తి.నేను ప్రయత్నించిన కొన్ని ఆరోగ్యకరమైన వంటల రెసిపీలని ప్రతి వీకెండ్ లోనూ రాయాలని నిర్ణయించుకున్నాను. ఈ వారం ఒక మంచి హేవీ టిఫిన్ తో మొదలుపెడుతున్నాను:

బ్రేడ్ తో చేసే ఇది ఒక హెవీ టిఫిన్.హెవీ అంటే కూర ఉంటుంది కాబట్టి త్వరగా ఆకలి వెయ్యదు.దీని పేరు నాకు తెలీదు.మేము ముంబైలో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ నాకు చెప్పింది. ఆవడలు ఇష్టమైన వారికి ఇది నచ్చుతుంది.

కావల్సిన పదార్ధాలు:
1 బ్రెడ్ ప్యాకెట్ (సాండ్విచ్ బ్రెడ్ అయితే బాగుంటుంది)
4,5 (పెద్దవి) ఉడికించిన బంగాళదుంపలు
చిలికిన పెరుగు 1/2లీటర్ (కొద్దిగా నీరు కలుపుకోవచ్చు)
కొత్తిమీర సన్నగా తరిగినది-1చిన్న కట్ట
నూనె - పోపుకి తగినంత
పోపు దినుసులు:ఆవాలు,మినపప్పు,సెనగపప్పు,జీలకర్ర,చిటికెడు ఇంగువ,కర్వేపాకు 2 రొబ్బలు
కారం ఇష్టమైనవారు కూరలొనూ,పెరుగులొనూ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవచ్చు.

చేసే విధానం:
1)ఉడికించిన బంగాళదుంపలతో "పోపు కూర" చేసి పెట్టుకోవాలి.
2)బ్రేడ్ స్లైసులన్నీ ఏదన్న గుండ్రటి మూతతో రౌండుగా కట్ చేసుకోవాలి.
3)చిలికిన పెరుగులో పోపు వేసుకుని ,కొత్తిమీర చల్లి ఉంచాలి.(రైతా లాగ అన్నమాట)
4)ఒక గరిటెడు బంగాళాదుంపల కూరని ఒక్కో రౌండ్ స్లైసుకి అద్ది, దాన్ని తవా పైన కూర అడుగు వైపుకి వచ్చేలాగ 1నిమిషము ఫ్రై చేసి తీసేయాలి ఇలా...

5)ప్లేటులో పైన వైపు రౌండ్ బ్రేడ్ స్లైసు వచ్చేలాగ ఓ 4 అరేంజి చేసి,
వాటిపైన చిలికిన పెరుగు బ్రెడ్ ముక్కలను కవర్ చేసేలా వేసి,
పైన కొత్తిమీర చల్లుకోవాలి.ఇలా--

ఒక సంగతి:
బంగాళాదుంపలు తినకూడదన్నది ఒక అపోహ.మధుమేహం ఉన్నవారు తప్ప, మిగిలిన వాళ్ళందరూ తినదగిన పౌష్టికాహారం.ఉడికించిన వాటిల్లో కార్బోహైడ్రేట్స్,విటమిన్ బి,సీ,ఇంకా కొన్ని ప్రోటీన్లు ఉంటాయి. నూనెలో వేయించితేనే అది హానికరం.పప్పు దినుసుల్లో కన్నా ఎక్కువ తేమ బంగాళాదుంపల్లో ఉంటుంది,అందువల్ల పప్పుదినుసులలో కన్న తక్కువ కేలరీలు వీటిల్లో ఉంటాయి.ఉడికించిన బంగాళాదుంపముక్కలు, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని నిమ్మరసం,కొత్తిమీర చల్లుకుని సాయంత్రాలు టీ టైం లో తినచ్చు.
అయితే,తొక్కతీసి ఉడికించినా,తొక్క బ్రేక్ అయ్యేలా ఎక్కువ ఉడికించినా వీటిలోని పోషకాలన్నీ నశిస్తాయి..
ఈ సంగతి నేనొక పుస్తకంలో చదివి తెలుసుకున్నది.

Friday, September 4, 2009

నిశ్శబ్దంలో అంతరంగం ...

"నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము ...
పుట్టుటయు నిజము పోవుటయు నిజము నట్ట నడిమి పని నాటకము
ఎట్ట ఎదుట గలదీ ప్రపంచము కట్ట కటపటిదీ కైవల్యము .."


నిత్యశ్రీ గొంతులో అన్నమయ్యకృతి శ్రావ్యంగా వినిపిస్తోంది..

మొన్న పొద్దున్న మొదలు...నిన్న మద్యాహ్న్నం దాకా..
ఎంత ఉత్కంఠత..ఎంత ఆశ నిరాశల సమరం..
ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియని అసందిగ్ధ స్థితి..
మూడు గంటల సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలదన్నే మిస్టరీ తేలక ఇరవైనాలుగు గంటలు యావత్ రాష్ట్ర ప్రజానీకం టివీలకు అతుక్కు పోయారు..
రాత్రంతా 3,4 సార్లు టివి పెడుతునే ఉన్నా నేనూ కూడా..పట్టిన కాస్తంత కలత నిద్దురా 'రోజా సైరనుతో' వదిలిపోయాకా మళ్ళీ టివి ఆన్ లోకి..
ఆశతో ఎదురుచూసిన అందరికళ్లనూ కన్నీళ్ళతో నింపి..కనపడని తీరాలకు చేరిపోయారు "వై.యస్..."
ఇది నిజమా కలా అని కళ్ళునులుముకునే లోపూ చిరునవ్వుతో నిండుగా ఉన్న ఆయన ఫోటోలు దండలతో నిండిపోయాయి..
ఇంకా ఎక్కడనుంచైనా వస్తారేమో అని మరి కాసేపు ఎదురు చూసాను..కాని శకలాల్లోంచి వెలికితీసిన దేహాలను చూసాకా నమ్మక తప్పలేదు..


నేను ఆయన అభిమానిని కాదు..
రాజకీయాల పట్ల నాకు ఆసక్తి లేదు..
డిగ్రీలో పొలిటికల్ సైన్స్ బుక్స్ లో తప్ప ఎన్నడూ నేను రాజకియపరమైన వార్తలు చదివిందీ లెదు..
నాకు తెలిసింది ఒక్కటే..
ఒక ముఖ్యమంత్రి ఆచూకీ 24గంటలు రాష్ట్రంలో,దేశంలో ఎవరికీ అంతుచిక్కలేదు..
ఒక భర్త,ఒక తండ్రి జాడతెలీని అజ్ఞాతంలో ఉండిపొయారు..
రారాజులా వెలిగిన ఒక పార్టీ అధినేత దయనీయమైన పరిస్థితిలో,తనకే తెలియని చివరి క్షణాల్లో ప్రాణాలు విడిచారు...
శత్రువుకైనా ఇలాంటి మరణం రాకూడదు...may his soul rest in peace...అని మనసు పదే పదే దేవుడిని ప్రార్ధించింది..


రాజివ్ గాంధీ, మాధవరావ్ సింధియా, బాలయొగి, సౌందర్య..అందరు కళ్ల ముందు మెదిలారు...
జీవితంలో అత్యున్నత శిఖరాలనధిరొహించీ ,ఎందరో జనాల కన్నీళ్లు తుడిచి,మన్ననలు పొంది...ప్రేమను సంపాదించుకున్న వాళ్లందరికీ చివరికి మిగిలిందేమిటి....
కన్నవాళ్లకూ,ప్రేమించినవాళ్లకూ,సుఖాలకు దూరంగా, ఆ..చివరి క్షణాల్లో వారెంత వేదనకు,శరీర బాధకు గురైఉంటారు...
ఆలోచిస్తే ఉహకే అందని సన్నని బాధ గుండెల్లోంచి తన్నుకు వస్తుంది...
దీనికి కారణం?కర్మ ఫలమా?దురదృష్టమా?విధి శాపమా?
దేవుడు తప్ప ఈ ప్రశ్నలకు ఎవ్వరు సమాధానం చెప్పలేరు..!!


కానీ అర్ధమైంది మాత్రం ఒకటి ఉంది..
భగవంతుడు ప్రసాదించిన ఈ జీవితాన్ని వీలైనంత సద్వినియొగం చేసుకోవాలి..
మనుషుల పట్లో,ఎదురైన పరిస్థితుల పట్లో క్రోధంతో,బాధతో,నిరాశతో వృధా చేసుకోకూడదు..
వేదికలెక్కి ఉపన్యాసాలివ్వకపోయినా,
రచనావ్యాసంగాలు చెసి జనాల్లో మార్పు తెచ్చే ప్రయత్నాలు చెయ్యకపోయినా,
వేరేమీ చెయ్యకపొయినా.....
ఎదుటి మనిషిని బాధ పెట్టే పనులు ప్రయత్నపూర్వకంగా చెయ్యకపోవటమే,ధర్మంగా నిలవటమే నా కర్తవ్యం అని నాకనిపించింది...
భగవంతుడు ఇచ్చిన ఈ జీవితం ఎంతో అపురుపమైనది..అందమైనది..అద్భుతమైనదీ..
అందుకే దాన్ని ఆస్వాదించాలి..ప్రేమించాలి..ప్రతి క్షణం జీవించాలి..
I have to live everyday to the fullest as there is no tomorrow.. ..
ఇదే నా పుట్టినరోజు రిజొల్యుషన్ అనుకున్నాను..
...అరె నా పుట్టినరొజు వచ్చేసింది..నాకెంతో ఇష్టమైన రోజు..సంవత్సరమంతా నేను ఎదురు చూసే రోజు..!!

(ఘోరమైన వైరస్ వచ్చి 2,3రోజులుగా నిద్రోయిన నా కంప్యూటర్ ఈ సమయానికి బాగుపడటం కేవలం యాదృచ్చికం...నిన్న పొద్దున్నుంచీ రాయాలని కొట్టుకుపోతూంటే ఇప్పటికి కుదరటం...ఈ నిశ్శబ్ద సమయంలో ఓసారిలా ఆత్మావలోకనం చేసుకుందుకేనేమో...!)