సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, January 11, 2011

తనికెళ్ళ భరణి గారి "నక్షత్ర దర్శనమ్"


"నాకూ వీళ్ళంటే ఇష్టం...
నాకంటే వీళ్ళంటే మీకు కూడా ఇష్టమే....!
నా ఇష్టాన్ని ఇలా వ్యాసాలుగానూ...
కవితలుగానూ రాసుకున్నాను !
....వెల్లకిలా పడుకుని వినీలాకాశంకేసి చూస్తే వేల నక్షత్రాలు
కనిపిస్తున్నా గుప్పెడు కోసి...గుండెలకద్దుకుంటున్నా !"

అంటారు తనికెళ్ళ భరణిగారు ఈ పుస్తకంలో తన మాటగా. సినీ, సంగీత, సాహిత్య ప్రపంచాల్లో తళుక్కుమన్న కొందరు మహోన్నత వ్యక్తుల గురించిన భరణిగారి అభిప్రాయాలసారమే ఈ "నక్షత్ర దర్శనమ్". భరణిగారి రచనలకు ప్రత్యేక పరిచయాలవసరం లేదు. పుస్తకంలోని నాలుగు వాక్యాలు చదివితే చాలు. పుస్తకం మొత్తం చదివేదాకా వదలం. అంత మంచి భాష, భావమూ ఆయనది. ఈ పుస్తకంలోని కొందరు వ్యక్తుల గురించిన రాసిన వ్యాసాలు, కవితల్లోంచి కొన్ని వాక్యాలు చూడండి మీకే తెలుస్తుంది.

జేసుదాసు:
శంఖంలాంటి ఆయన గొంతు పూరించిన
ఓంకారం వింటూ
పరమశివుడే పరవశుడై ధ్యానం చేసుకుంటాడు
భగవద్గీత సారాన్ని
నరుడికీ నారాయణుడికీ
ఈయనే స్వయంగా భోదిస్తున్నట్లుంటుంది
చెంబై వైద్యనాథ్ భాగవతార్
ఆశీర్వాద బలం....భారతదేశం చేసుకున్న పుణ్యఫలం
ఆయన గళం !


బాలమురళి:
ద్వాపర యుగంలో
గొపికల్తో సరసాలాడ్తూ
బృందావనంలో
నల్లనయ్య మర్చిపోయిన
పిల్లనగ్రోవి బాలమురళి


ఆయన గానం
ఉషోదయాన వెలిగే
ముద్ద కర్పూరం
ఆయన తిల్లాన
అర్ధరాత్రి వేసే
అగరు ధూపం.


కృష్ణశాస్త్రి:
ఆయన రాసిన "జయజయజయ ప్రియభారత జనయిత్రి దివ్యధాత్రి " గురించి----
ఆ పాట భారతమాత పాదాలకి పూస్తే పారాణి అవుతుంది !
అరచేతులకు రాస్తే గోరింటాకులా పండుతుంది !
మెడకు పూస్తే మంచి గంధమౌతుంది !
కురులకి రాస్తే సంపెంగ నూనె అవుతుంది !
పెదాల అరుణిమతో కలసి తాంబూలమౌతుంది !!
జన్మనిచ్చిన భరతమాత ఋణం తీర్చుకున్నాడు కృష్ణ శాస్త్రి ఈ పాటతోటీ!


గురుదత్:
కన్నీరు పన్నీరు కలలతో కలిపి వెండితెర మీద బంగారు బొమ్మలు గీసిన "రవివర్మ" గురుదత్.
గురుదత్ వాడినవి రెండే రంగులు. నలుపు.. తెలుపు...!
నలుపుతో నవరసాలనీ ఆవిష్కరించాడు. తెలుపుతో ఆత్మానందాన్ని ప్రతిబింబింపజేసాడు.
ఘనీభవించిన శోకాన్ని పలకలు చేసి...సినీ యమునానదీ తీరాన నల్లని తాజ్మహల్ కట్టుకున్న విషాద షాజహాన్ - గురుదత్!


రేఖ:
ఆమె చూపు మార్మికంగా
నవ్వు నర్మగర్భంగానూ
మాట తాత్వికంగానూ
మనిషి సామన్యంగానూ ఉంటుంది
ఆమెని యావత్ భూగోళం ప్రేమించింది !


హరిప్రసాద్ చౌరాస్యా:
ఆయన వెదురు మీద
పెదవి ఆన్చి ఊదితే చాలు
అందులోంచి విచిత్రంగా
ఆకుపచ్చని సీతాకోకచిలుకలూ
పసుప్పచ్చని పావురాలూ
ఇంద్రధనుస్సులూ
చంద్రోదయాలూ..!!


బ్రహ్మానందం:
అరగుండు నుంచీ
సంపూర్ణంగా ఎదిగిన నటుడు
ఎక్కడ చిక్కాలో
ఎక్కడ చెక్కాలో...
ఎక్కడ మొక్కాలో..
ఎక్కడ నొక్కాలో తెలిసిన జ్ఞాని !


జాకీర్ హుస్సేన్:
నక్షత్రాల్ని దోసిట్లో పట్టి
తాజ్మహల్ మీద
ధారగా పోస్తున్నట్టూ
కాశ్మీర్ లోయల్లో
ఊయలలూగుతున్నట్టూ...


ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మి:
ఆమె భజగోవింద శ్లోకాలు
ఆదిశంకరుల మెళ్ళో రుద్రాక్షమాలలు
ఆమె విష్ణు సహస్రం
ఏడుకొండలవాడికి క్షీరాభిషేకం
ఆమె మీరా భజన్లు
గిరిధర గోపాలుడికి వెన్నముద్దలు...

*** *** ***

ఇవన్నీ కొన్ని మీగడ తరకలు. అంతే. ఇంకా

ఎన్.టీ.ఆర్
ఏ.ఎన్.ఆర్
ఎస్వీఆర్
రేలంగి
రమణారెడ్డి
సావిత్రి
భానుమతి
శ్రీశ్రీ
చలం
జంధ్యాల
వేటూరి
ఆరుద్ర
సినారే
సుశీల
ఘంటశాల
బాలు
చిరంజీవి....
ఇంకా ఎందరో....!
వీరిని గురించి రాసిన మొత్తం కవితో, వ్యాసమో చదివితీరాల్సిందే. ఎన్నని కోట్ చెయ్యను..?!
వంద పేజీల ఈ పుస్తకం వెల వంద రూపాయిలు.
దొరికేది "నవోదయా"లోనూ... "విశాలాంధ్ర"లోనూ.
ఉండాల్సింది మన పుస్తకాల గూట్లో.

*** *** *** ***

(తెలియనివారి కోసం)
అదివరకూ నేను కొన్ని టపాల్లో రాసిన తనికెళ్ళ భరణిగారి రచనల లింక్స్:

నాలోన శివుడు కలడు

ఆటగదరా శివా !!

పరికిణీ

july10th/2010 hindu న్యూస్ పేపర్ లో వచ్చిన భరణిగారి
interview లింక్:

7 comments:

SHANKAR.S said...

"ఆయన గానం
ఉషోదయాన వెలిగే
ముద్ద కర్పూరం
ఆయన తిల్లాన
అర్ధరాత్రి వేసే
అగరు ధూపం"

"ఆకుపచ్చని సీతాకోకచిలుకలూ
పసుప్పచ్చని పావురాలూ
ఇంద్రధనుస్సులూ
చంద్రోదయాలూ..!!"

"నక్షత్రాల్ని దోసిట్లో పట్టి
తాజ్మహల్ మీద
ధారగా పోస్తున్నట్టూ
కాశ్మీర్ లోయల్లో
ఊయలలూగుతున్నట్టూ..."

ఏం చెప్తాం...మాటల్లేవంతే. భరణి మాటల్లోనే ఆయన రాతల గురించి చెప్పాలంటే (ఆట కదరాకి పేరడీ పొగడ్త అనుకోండి :))

ఆటకదరా భరణి
ఆట కదా నీకు
అక్షరాల్లో అమృతపు
ఊట కదరా నీవు


ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారిది మాత్రం ఎందుకో తృప్తిగా అనిపించలేదు.

budugu said...

ee madhyE "naa manasu kOtiraa raa raama" ani oka aaDiyO album release chesaaru. kudirite parichayaM cheyandi.

తృష్ణ said...

@శంకర్.ఎస్: పోనీ మీరు రాయండి...:) (ఏమనుకోకండి..just kidding.)

నేను రాసినవి ప్రతీదాన్లోవీ నాలుగు వాక్యాలేనండీ. మొత్తం చదివితే మీకు నచ్చుతుందేమో..

పేరడీ బాగుందండీ.

@బుడుగు: ఒహ్, తెలీదండీ...దొరుకుతుందేమో ప్రయత్నిస్తాను.

రాధిక(నాని ) said...

బాగుందండి.

మనసు పలికే said...

తృష్ణ గారు, చాలా మంచి పుస్తకాన్ని పరిచయం చేసారు. ధన్యవాదాలు..:))

ఇందు said...

చిన్నిచిన్ని కవితల రూపంలో భలే చమత్కారంగా వ్రాస్తారే భరణిగారూ! హ్మ్! నేను ఈసారి కొనే లిస్టులో ఈ పుస్తకం చేరింది.మీరు చివరన వ్రాసిన...
'దొరికేది "నవోదయా"లోనూ... "విశాలాంధ్ర"లోనూ.ఉండాల్సింది మన పుస్తకాల గూట్లో.' నాకు బాగా నచ్చింది :)

వేణూశ్రీకాంత్ said...

తృష్ణ గారు పరిచయం చాలా బాగుందండి విడుదలైన దగ్గరనుండి అనుకుంటున్నాను చదవాలి అని ఇంకా కుదరలేదు.