సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Saturday, July 23, 2011

షిరిడి - నాసిక్ - త్రయంబకం -3 (last part)



పై ఫోటో లోది గుడి వెనుక ఉన్న గోదావరి పాయ.ప్రస్తుతం ఇందులో నీళ్ళు లేవు.అక్కడ గుడి వెనుక వైపు ఒక పెద్ద పొగడ పూల చెట్టు ఉంది. భలే చక్కటి సువాసన వస్తుంది చెట్టు దగ్గరగా వెళ్తే. చిన్నప్పుడు పొగడపూలతో దండ కట్టడం గుర్తు వచ్చింది.
  
జ్యోతిర్లింగ దర్శనం అయ్యి బయటకు వచ్చాకా ఆదివారం రాత్రికి ఉన్న టికెట్ల స్టేటస్ కనుక్కుంటే కంఫర్మ్ అవ్వలేదని తెలిసింది. ఇక అవి కాన్సిల్ చేయించేసాం.శిరిడి వెనక్కు వెళ్ళిపోయి రాత్రికి ఏదైనా బస్సు ఎక్కేయాలని శ్రీవారి ఆలోచన. నాకేమో బ్రహ్మగిరి ఎక్కి గోడావరి జన్మస్థలాన్ని చూడాలని కోరిక. ఎలానూ టికెట్లు కాన్సిల్ చేయించాం కదా రేపటికి రైలుకు తికెట్లు కొనుక్కుందాం.గోదావరి ఒడ్డున పుట్టినదాన్ని, ఇంత దూరం వచ్చి గోదావరి జన్మస్థలం చూడకపోతే ఎలా?ఇవాళ ఇక్కడ,నాసిక్ చూసుకుని వెళ్దాం అని నేను జోరిగలా పోరేసాను.  నా పోరు పడలేక సరే అనేసారు తను.కానీ 750 మెట్లుట...పాపతో 'బ్రహ్మగిరి ' ఎక్కడం కుదరదు.వేరే దారేదన్నా ఉంటే వెళ్దాం అన్నారు. కనుక్కుంటే ఆటోలు వెళ్తాయని చెప్పారు.  ఒక ఆటోఅబ్బాయి కుదిరాడు వెంఠనే.గంటలో వెళ్ళొచ్చేయచ్చు అన్నాడు. అదృష్టవశాత్తూ  మేం ఆటో ఎక్కాకా వాన మొదలైంది. అదిగో అదే మీరు చేరాల్సిన కొండ అని దూరంగా ఒక కొండ చూపెట్టాడు.
బ్రహ్మగిరి కొండ
ఆటోకు రెండువైపులా తలుపులు ఉన్నాయి వాన పడకుండా. జోరుగా వర్షం కురుస్తుంటే జల్లులు ఆటో లోపలికి వస్తుంటే సగం సగం తడుస్తూ ఆటోలో కొండ మీదకు వెళ్ళటం ఒక ఆనందకరమైన అనుభవం. అప్పటికీ మా గొడుగును తెరిచి వానజల్లుకి అడ్డంగా పెట్టుకున్నాం కూడా. సగం దూరం వెళ్ళాకా ఇక వెళ్లదని ఆటో ఆపేసాడు.
కచ్చా రోడ్డు మీడ ఐదు నిమిషాలు నడిచాకా మెట్లదారి వచ్చింది. అక్కడ నుంచి ఓ ఏభై మెట్లు ఉంటాయి పైకి.మెట్ల దాకా వెళ్ళే కాలిబాట ఎంత బాగుందంటే చెప్పలేను. ఆ ప్రకృతి అందాలు చూసి తీరవలసిందే. అక్కడ ఓ పాడుబడ్డ ఇల్లు ఉంది.ఎవరుండేవారో అందులో..పక్కగా క్రిందుగా ఒక చిన్న కొలను ఉంది.లోపలి నీళ్ళు చాలా క్లియర్గా...ఎంత బాగుందో  కొలను. క్రిందకు దిగుదాం అనుకున్నాం కానీ మాతో వచ్చిన ఆటోవాలా పాకుడు ఉంటుంది మెట్ల మీద జారతారు..దిగవద్దన్నాడు. చాలా స్టీప్ గా ఉన్నసుమారు ఓ ఏభైమెట్లు ఎక్కాకా ఉండి గోదావరి నది జన్మస్థలం. ఎన్నాళ్ళ కోరికో...అసలు చూస్తానని అనుకోలేదు ఎప్పుడూ..!ఒక అలౌకిక ఆనందం...మనసులో ఉప్పొంగింది.చిన్నప్పటి నుండీ గోదావరి అంటే ఎంతో ప్రేమ.ఇవాళ ఈ జన్మస్థలాన్ని చూస్తూంటే ఏదో చెప్పలేని పులకింత.గోదావరి ఒడ్డున పుట్టినందుకేనేమో మరి..!!   
ఒక రాతిగోముఖం నుండి సన్నగా జారుతోంది నీరు.అదే గోదావరి జన్మస్థలంట.ఇలాంటిదే మరో ద్వారం ఉందిట మరో వైపు. కొండపై రెండు ద్వారాలన్నమాట గోదారికి.
ఈ గోముఖంలోంచే గోదావరి ప్రవహించేది..
 దారిలో రాళ్లపైనుండి జల్లులు జల్లులుగా నీరు పడుతూనే ఉంది. అక్కడ ఉన్న పూజారి మాతో చిన్నపాటి పూజ చేయించి దక్షిణా అడిగాడు. ఏదో నామకహా చేయించినా ఆ పూజ నాకు నచ్చింది.గోదారితల్లికి ఓ నమస్కారం.అంటే.కానీ పూజారి ఇంత ఇవ్వండీ అని ఫిక్స్డ్ దక్షిణ అడగటం నచ్చలేదు నాకు.. మరి వాళ్ళ భుక్తి వాళ్ళది అని సరెపెట్టుకోవాలంటే. మళ్ళీ తిరిగి అదే దారిలో కొండ క్రిండకి వచ్చేసాం.నాలుగేళ్ల క్రితం వరకూవరకూ ఈ రోడ్డుదారి ఉండేది కాదుట. అప్పుడూ పైకి ఎక్కలేనివాళ్ళు పల్లకీలాంటి ఉట్టె బుట్టలలో కూర్చుని మనుషులతో మొయ్యించుకుంటూ పైకి వెళ్ళేవారుట.క్రింద ఫోటోలో ఆ పల్లకీలాంటిది ..
కొండపైకి ఎక్కలేని మనుషులను తీసుకువెళ్ళేండుకు వాడే పల్లకీ బుట్ట

మేము పైకెళ్ళి దిగేదాకా వర్షం మొదలౌతూ,ఆగుతూ,పడుతూ మమ్మల్ని అల్లరిపెట్టింది. ఆటో అబ్బాయి కూడా మంచివాడు. మాతో పైకెక్కి దిగేదాకా తోడు వచ్చాడు. ఈ ట్రిప్ మొత్తానికి బ్రహ్మగిరి కొండ ఎక్కిదిగటం మా ఇద్దరికీ కూడా అందమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది.నే పోరకపోయి ఉంటే ఇంత ఆనందం మిస్సయ్యేవాళ్లం కదా అని నేను కాస్త ఫోజ్ కొట్టేసా.
కొండ దిగాకా షేరింగ్ వ్యాన్ లో నాసిక్ వెనక్కు వచ్చేశాము.అక్కడ వేరే ఏమి చూట్టం కుదరకపోయినా  "పంచవటి" చూడాలని,అక్కడ గోదావరిలో ఓ మునక వేయ్యాలని నా కోరిక.అరణ్యవాస సమయంలో శ్రీరాముడు ఈ ప్రాంతంలో కొంతకాలం ఉన్నాడుట. వనవాస సమయంలో కశ్యప మహర్షి ఆదేశానుసారం నాసిక్ లోని గోదావరీ తీరంలోనే దశరథుని శ్రార్ధ కర్మలు నిర్వహించాడనీ, అందుకే ఈ గొదావరీ తీరానికి అంత గౌరవం అనీ పెద్దలు చెబుతారు. ఈ పంచవటి ప్రాంతంలోనే రామకుండ్ ఘాట్ నిర్మాణం జరుగింది.గోదావరి లోతు మొదలయ్యేది కూడా నాసిక్ నుండే.
పంచవటిలో రామకుండ్ ఘాట్
పంచవటిలోని ఆ రామకుండ్ తీర్థంలో గోదావరీ స్నానం చేసాను.మా పాప కూడా  మారాం చేసి నాతో పాటూ నదీ స్నానం చేసింది. రామకుండ్ ఘాట్ ఎదురుగా కాస్త ఎత్తు మీద కపాలేశ్వర మండిరం ఉంది. మరోసారి శివ దర్శనం చేసేసుకున్నాం.అక్కడ పూజారికి బదులు ఒక ముసలావిడ,ఆవిడ కోడలు తీర్థ ప్రసాదాలు ఇవ్వటం ఆశ్చర్యాన్ని కలిగించింది. వాళ్ల మాటలవల్ల వాళ్ళు తెలుగువాళ్ళనీ,అత్తాకోడళ్ళనీ అర్ధమయ్యింది. ఉన్న సమయంలో ఈమాత్రమన్నా చూసామన్న తృప్తితో ఆదివారం రాత్రికల్లా శిరిడి తిరిగి వచ్చేసాము.
బడలిక వల్ల ఆదివారం రాత్రి ఇక బాబా దర్శనానికి నేను వెళ్ళలేకపోయాను. శ్రీవారు మాత్రం వెంఠవెంఠనే రెండు మంచి మంచి దర్శనాలు చేసుకుని రాత్రి హారతి అనంతరం వచ్చారు. ఇక నేను సోమవారం పొద్దున్నే లేచి ఆరింటికల్లా దర్శనం క్యూలోకి  వెళ్ళాను.ఆషాఢ ఏకాదశి అని ఆ రోజు కాస్త జనం ఉన్నరు..అయినా అరగంటలో బాబా ముందరికి చేరాను. ప్రత్యేకంగా బాబాను అలంకరించారు.పేద్ద బంగారు నెక్లేస్ వేసారు.కిరీటం పెట్టారు.నిశ్చల భక్తిని తప్ప ఈ అలంకారాలు బాబా ఎన్నడు కోరారనీ? అని నవ్వు వచ్చింది.  కుడివైపు లైనులో ఉండటం వల్ల విగ్రహం ముందర ఉండే స్థలంలోంచి బయటకు వెళ్ళే అవకాశం వచ్చింది. బాబాను చూసుకుంటూ వెనక్కు అడుగు వేసుకుంటూ వెళ్లటం వల్ల ఎక్కువ సేపు జరిగిన దర్సనం నాకు ఎంతో తృప్తినీ,ఆనందాన్ని ఇచ్చింది. ఆరున్నరకల్లా రూముకి చేరిన నన్ను చూసి తను,పాప ఆశ్చర్యపోయారు. మళ్ళీ అందరం కలిసి మరో దర్శనానికి వెళ్ళాం. అది కూడా చాలా బాగా జరిగింది.మొదటి రోజు సరిగ్గా దర్శనం జరగలేదని పడ్డ బాధను ఇవాళ తీర్చేసారు బాబా అనుకున్నాను.
సోమవారం రాత్రికి వైటింగ్ లిస్ట్ లో ఉన్నటికెట్లు కూడా సాయంత్రానికి కంఫర్మ్ అయిపోయాయి. ఆ విధంగా అనుకోని మా శిరిడి,త్రయంబకం ప్రయాణం సుఖాంతంగా మిగిసింది. కొద్దిపాటి ఇబ్బందులు ఎదురైనా అప్పుడప్పుడు ఇలాంటి అనుకోని ప్రయాణాలకు వెళ్తేనే జీవితంలో కరువైపోతోందనిపించే ఉత్సాహం మళ్ళీ మనసొంతమౌతూ ఉంటుంది అనిపించింది నాకు.
 
సర్వేజనా: సుఖినోభవంతు..!

***   ****   ***

బ్రహ్మగిరి అందాలు క్రింద లింక్ లో  చూడండి:



Thursday, July 21, 2011

షిరిడి - నాసిక్ - త్రయంబకం - 2




(బస్ లో కనబడ్డ పాప..బావుందని ఫోటో తీసా)

(శిరిడి - నాసిక్ - త్రయంబకం -1 )

శిరిడి - నాసిక్ - త్రయంబకం - 2 :

హఠాత్తుగా మంచి ఐడియా వచ్చింది..నా ఫోన్ లేకపోతేనేం, రూపాయి ఫోన్ చేయొచ్చు కదా..అని. పక్కనే ఉన్న పాకలాంటి బడ్డి కొట్లో ఉన్న ఫోన్ లో రూపాయి వేసి తనకి రింగ్ ఇచ్చాను. పలికారు.'ఎక్కడున్నారు?ఇంతసేపేమిటి?' అనడిగా ఆదుర్దాగా. 'పాప బట్టలు తడిసాయి కదా..ఇక్కడ బట్టల షాపులు ఉంటే దానికి బట్టలు కొంటున్నా.పదినిమిషాల్లో వస్తాను'అన్నారు. మనసు నెమ్మదించిండి. వెనక్కు వచ్చి నించున్నా. ఎదురుగుండా రోడ్డుకి అవతల త్రయంబకం వెళ్ళే వ్యానులు ఆగుతాయన్నారు ఇందాకా ఎవరో. ఇందాకా మేము దిగేసరికీ ఒక వ్యాను కూడా ఉంది కానీ డ్రైవర్ లేడు. నేను ఫోన్ చేసి వచ్చేసరికీ ఆ వ్యాన్ లేదు. వెళ్ళిపోయినట్లుంది. మళ్ళీ ఇంకో వ్యాన్ వస్తుందో రాదో..


కాసేపటికి వానలో గొడుగు పట్టుకుని తను వచ్చారు. ఇదెక్కడిది? అన్నాను.'కొంటే వస్తుంది ' అన్నారు నవ్వుతూ. నా భయం, కోపం అంతా మాయమైపోయాయి.ఇప్పుడీ వర్షంలో త్రయంబకం వెళ్ళగలమా? అన్నాను దిగులుగా. 'ఏదో మార్గం దొరుకుతుదిలే.కంగారెందుకు ' అన్నారు తను. ఈలోపూ 'త్రయంబక్ త్రయంబక్..' అంటూ ఒక మనిషీ పిలుస్తూ మా వైపు వచ్చాడు. వ్యానా అని మేము అడిగే లోపూ ఒకాయన వచ్చి మేము ఆరుగురం ఉన్నాం పడతామా? అన్నాడు. రండి రండి అని అతను రోడ్డుకి అవతలవైపు ఉన్న వ్యాను వైపు నడిచాడు. అందరం వ్యాను ఎక్కేసాం. అప్పుడే టాక్సీలో శిరిడి నుంచి వచ్చారుట వాళ్ళు. ఇదివరకు త్రయంబకం వెళ్ళాం అంటూ వివరాలు చెప్పాడు ఆయన. కొంచెం ఇరుగ్గా ఉన్నా..ఏదో ఒకటి వెళ్ళటానికి దొరికిందన్న ఆనందం మాకు కలిగింది. ఆ మసక వెలుతురు లోనే ఎదురుగా కూర్చుని మాట్లాడుతున్న ఆంటీ మొహం చూశాను.ఎంత బాగుందో ఆవిడ. అచ్చం 'సినీనటి గీత ' లాగ. మళ్ళీ మళ్ళీ చూస్తే బాగోదని ఇంక చూడలేదు కానీ..నాకే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది ఆ ఆంటీని. రాత్రి పదిన్నరకు త్రయంబకం చేరాము. నాసిక్ లో స్టే చెయ్యకుండా రాత్రికి త్రయంబకం చేరిపోతే, పొద్దునే దైవ దర్శనం సులువౌతుందని మా ఉద్దేశం.


కానీ అదేం చిత్రమో అన్ని హోటల్స్ లోనూ రూములు నిండిపోయాయిట.ఎక్కడా రూంస్ లేవన్నారు. కొందరు బయట రోడ్డు మీదే వ్యానుల్లో,జీపుల్లో కాలక్షేపం చేసేస్తున్నారు.అక్కడ ఎప్పుడూ అంతేనో, మరి వీకెండ్ అవటం వల్ల రద్దీనో తెలీలేదు. ఆఖరికి ఒక రూం దొరికింది. వేణ్ణీళ్ళు ఉండవన్నాడు. తలదాచుకోవటానికి ఏదో ఒకటి అని తీసేసుకున్నాం. కానీ లోపలికి వెళ్ళి గది చూస్తే భయమేసింది. అమ్మో ఈ గదిలో ఉండాలా అన్నంతా భయంకరంగా ఉంది. కానీ తప్పదు మరో ఆప్షన్ లేదు.'అమ్మా,రేపొద్దున్న నేనిక్కడ నీళ్ళు పోసుకోను" అని వెంఠనే పాప చెప్పేసింది. నాసిక్ లో కొన్న తిఫిన్ తినేసి అలిసిపోయి ఉన్నామేమో మరో మాట లేకుండా నిద్రోయాం. నిద్ర సుఖమెరగదని ఇందుకే అన్నారేమో అని పొద్దుట లేచాకా అనిపించింది.

మెలుకువ రాగానే టైం చూస్తే ఐదయ్యింది. బయట ఎటువంటి సందడి వినబడటం లేదు. త్వరగా తెమిలి వెళ్తే దర్శనం అయిపోతుంది.మళ్ళీ జనాలు ఎక్కువైతే లేటౌతుంది అని తనని లేపాను. హర హర మహాదేవ అని ఆ చన్నీళ్ళే ఎలాగో పోసేసుకుని తయారైపోయి బయటపడ్డాం. బయటకు వస్తునే ఎదురుగుండా ఉన్న సుందరదృశ్యం చూసేసరికీ నాకు అమితోత్సాహం వచ్చేసింది. తెలతెలవాతోంది..ఎదురుగా కొండలు.. వాటిపై తెల్లని మబ్బులు...అత్యంత రమణీయంగా ఉందా దృశ్యం.

బయల్దేరిన ఉద్దేశానికి అర్ధం దొరికినట్లయింది.రకరకాల చికాకులతో విసిగిపోయి ఎక్కడికో అక్కడికి వెళ్దాం అంతే! అనుకుని బయల్దేరాం. శిరిడి లో అప్పటికప్పుడూ ఈ నాసిక్ ప్రయాణం చెయ్యాలనిపించటం దైవికమేనేమో.


చేతిలో ఉన్నది డిజిటల్ కెమేరా. ఇంక కనబడ్డ చెట్టూ చేమాకూ ఫోటోలు తీస్తూ, చల్లని వాతావారణాన్ని ఆస్వాదిస్తూ నడవటం మొదలెట్టా. దూరంగా ఒక కొండ మీద నుంచి జారుతున్న జలపాతం కనబడింది. నా జూం సరిపోవట్లా..అయినా ఫోటొ తీసేసా.

ఇక త్రయంబకేశ్వరాలయం దగ్గరికి వచ్చేసరికీ వర్షం మొదలైంది. నాసిక్ లో శ్రీవారు కొన్న గొడుగు చాలా ఉపయోగపడింది. గుడీ పురాతన కట్టడం.. గుమ్మంలోంచి లోపలికి తొంగి చూసేసరికీ మతి పోయింది..అంత అందంగా కనబడింది ఆలయం.అందమైన, పరిశుభ్రమైన పరిసరాలు,వాతావరణం నన్నెంతో ముగ్ధురాలిని చేసాయి. ఇదివరకెక్కడా ఫోటొల్లో కుడా చూడలేదు నేను. క్యూ తక్కువగా ఉంది..క్యూలో నాన్నొక విషయం ఆశ్చర్యపెట్టింది. కొన్ని జంటల్లో సాంప్రదాయబధ్ధంగా తెల్లటి పంచె,చొక్కా లేకుండా కండువాలతో మగవారు, తెల్లటి చీరల్లో ఆడవాళ్ళు ఉన్నారు. ఇంకా ఇలా పాటించేవారున్నారా అనిపించింది. తమిళ్నాడులో గుళ్ళలో ఎక్కువగా ఇలా చూశా .

దర్శనానికి త్వరగానే వెళ్లగలిగాము. గుడి మండిరంలోకి అడుగు పెట్టేసరికీ మనసు ప్రశాంతంగా మారిపోయింది. వేదమంత్రాలు చదువుతూన్న బ్రాహ్మలు, ఏవో పూజలు చేసుకుంటున్న కొందరు అక్కడ లోపల కూర్చుని ఉన్నారు. విశాలంగా ఉన్న గర్బగుడి, ఎత్తుగా ఉన్న గోపురం,వినబడుతున్న వేదమంత్రాలు ఏదో పవిత్రభావాన్ని కలగజేసాయి. ఇక లోపల ఉన్న జ్యోతిర్లింగం పైన అమర్చబడిన అద్దంలో మాత్రమే కనబడుతోంది. శివలింగం ఉండాల్సిన ప్రదేశంలో నీరు కనబడింది. ఆ నీటిలోన మూడు చిన్న చిన్న లింగాకారాలు కనబడ్డాయి. "లింగం" కనబడటంలేదేమి అనడిగాము. ఇక్కడ లింగం ఉండదు. అవి బ్రహ్మ ,విష్ణు,మహేశ్వర స్వరూపాలు. ఇదే ఇక్కడి జ్యోతిర్లింగ విశేషం అని చెప్పారు ఒకాయన. దర్శనం అయ్యాకా మండపంలో కూర్చోనిస్తున్నారు. వెళ్ళండి వెళ్లండి అని బయటకు తోసేయ్యకపోవటం నాకు బాగా నచ్చింది.

నందీశ్వరుడుది మందిరం బయటనే పెద్ద విగ్రహం ఉంది.మందిరం లోపల మన గుడులలో నందీశ్వరుడు ఉండే ప్రదేశంలో తాబేలు బొమ్మ ఉండటం చాలా ఉత్తరాది గుళ్ళలో చూశాము. ఇక్కడా అలానే పేద్ద పాలరాతి తాబేలు బొమ్మ ఉంది. దర్శనానంతరం ప్రశాంతత నిండిన మనసుతో అక్కడే ఓ పక్కగా కూర్చున్నాము. వినబడుతున్న ఈశ్వర స్తుతి,వేద మంత్ర పఠనం ఎంతో హాయినిస్తుండగా కళ్ళు మూసుకున్నాను. ఆ భగవద్సన్నిధిలో విన్నవించాలనిపించినదంతా విన్నవించేసా మౌనంగా.. ఇక చెప్పాల్సినది ఏదీ లేదనిపించింది.కళ్ళు తెరిచేసరికీ ఒక అలౌకిక ఆనందంతో మనసంతా నిండిపోయింది. మనసులో భారమంతా దిగిపోయిన భావన..నెమ్మదిగా లేచి గుడి బయటకు వచ్చాను. మళ్ళీ సన్నని వర్షం మొదలైంది. ఈసారి గొడుగులో నిలబడాలనిపించలేదు..ఆ జల్లు నన్నూ,నా మనసును ఉత్తేజపరుస్తున్న భావన..పవిత్రమైన ఆ ప్రదేశంలో ఏదో మహిమ తప్పక ఉందనిపించింది.



*** *** ****
(నాసిక్ లో చూసినవి చివరి భాగంలో..)

Saturday, July 16, 2011

నా బ్లాగ్ చదివే బ్లాగ్మిత్రులకు:

శిరిడి,నాసిక్ ప్రయాణం సిరీస్ చదువుతున్న బ్లాగ్మిత్రులకు:

జ్వర తీవ్రత ఎక్కువ ఉండటం వల్ల తదుపరి భాగం రాయలేకపొతున్నాను. జ్వరం తగ్గాకా తరువాతి భాగం రాస్తానని మనవి.

Thursday, July 14, 2011

షిరిడి - నాసిక్ - త్రయంబకం -1


మావి చాలా మటుకు అనుకోని ప్రయాణాలే. ఆ పైవాడి దయవలన పెద్ద ఇబ్బందులు లేకుండా ఇలాంటి అనుకోని ప్రయాణాలు గడుపుకొచ్చేస్తూ ఉంటాం. గత నాలుగురోజుల పాటు మేము చేసిన అనుకోని ప్రయాణం ఎన్నో మధురానుభూతులను మాకు అందించింది. వర్షాకాలం పచ్చదనం ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చింది. దినపత్రికలు, టివీ ఛానల్స్, ఫోన్లు, ఇంటర్నెట్ ఏవీ లేకపొతే ఎంతైనా హాయే అని మళ్ళీ అనిపించింది.


మొన్న గురువారం శిరిడి వెళ్దాలని అప్పటికప్పుడు అనుకున్నాం. ఇప్పుడు ఇలా రాయటానికి బాగుంది కానీ ఒక ఎడ్వంచర్ చేసామనే చెప్పాలి. ప్రయాణాల్లో తనకు ఇబ్బందని ప్రతీసారీ మా పాపను అమ్మ దగ్గర ఉంచేస్తాము. కానీ ఈసారి పాపను కూడా తీసుకువెళ్లాలని అనుకున్నాం. అనుకున్నట్లే రిజర్వేషన్ దొరకలేదు. శుక్రవారం సాయంత్రానికి వైటింగ్ లిస్ట్ లో ఉన్నా ఏమయితే ఆయిందని టికెట్స్ తీసేసుకున్నాం. శుక్రవారం పొద్దున్నకి వైటింగ్ లోంచి RACలోకి వచ్చి, రైలెక్కే టైమ్ కి కన్ఫర్మ్ అయిపోయాయి. హమ్మయ్య అనేసుకుని రైలెక్కేసాం. దారిలో వాన వెలిసిన తరువాత విరిసిన "వానవిల్లు" నా కెమేరాలో చిక్కింది. పాప కూడా మొదటిసారి నిజం రైన్బోను చూసి చాలా సరదా పడింది.





సారవంతమైన మహరాష్ట్రా నల్లమట్టి


రైలు శిరిడి దాకా వెళ్తుంది కానీ మేము దర్శనానికి త్వరగా వెళ్ళచ్చని శనివారం పొద్దున్నే నాగర్సోల్ లో ఏడింటికి దిగిపోయాం. అక్కడ నుంచి గంటలో శిరిడి చేరిపోయాం. ఊరు ఏడాదిన్నర క్రితం మేము వెళ్ళినప్పటికన్నా బాగా మారిపోయింది. ఎప్పుడు కట్టారో కానీ గుడీ గేట్లో "సాయి కాంప్లెక్స్" అని ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ! బోలెడు షాపులు హంగామా.





వీకెండ్ కదా ఎప్పటిలానే దర్శనానికి చాలా జనం ఉన్నారు. భక్తులు పెరిగే కొద్దీ భగవంతుడు మరీ దూరమైపోతున్నాడు అనిపించింది క్యూలూ జనాల్ని చూస్తే. తొమ్మిదిన్నరకి క్యూ లో అడుగుపెట్టాం. క్యూ త్వరగానే కదిలింది కానీ సరిగ్గా హారతి టైంకి లైన్ ఆపేసారు. అప్పటికి విగ్రహం ఎదురుగా ఉండే హాల్లోకి చేరుకున్నాం. అందర్నీ కూచోపెట్టేసారు. అంతవరకూ బానే ఉంది కానీ హారతి అవ్వగానే జనమంతా ఉన్మాదుల్లాగ తోసేసుకుంటూ దర్శనానికి ఎగబడ్డారు. ఎందుకో తొందర అర్ధం కాలేదు. హాలు దాకా చేరినవాళ్ళు దర్శనానికి వెళ్ళలేకపోతారా? ఎగబడి ఒకర్ని ఒకరు తోసుకోవటం వల్ల మరింత ఆలస్యం, తోపులాట, చికాకులు తప్ప భగవంతుడి దగ్గర ప్రశాంతత ఎక్కడుంటుంది? ఒకోసారి చదువుకున్నవాళ్ళు కూడా నిరక్ష్యరాసుల్లా ప్రవర్తిస్తారెందుకో..!


హారతి తర్వాత జరిగిన తోపులాటలో నా ప్రయేమం లేకుండానే నేను ఎక్కడికో తోయబడ్డాను. తనూ,పాప ఎక్కడున్నారో తెలీలేదు. దర్శనం అయ్యాకా ఎంతసేపు నిలబడ్డా తనూ,పాప బయటకు రాలేదు. నాకు కంగారు మొదలైంది. ఈలోపు అవతలివైపు నుంచి శ్రీవారు,అమ్మాయి కనబడ్డారు. వాళ్ళు కుడివైపు క్యూలోకి తోయడి,వేరే గుమ్మంలోంచి బయతకు వచ్చారుట. వాళ్లకు దర్శనం బాగా అయ్యిందన్నారు. ఇక నాకు బాధ మొదలైంది. అనుమతి లేనిదే రాలేమంటారు. ఈ వచ్చాకా ఈ తోపులాట దర్శనం ఏమిటి బాబా..అని ప్రశ్నించటం మొదలెట్టాను. రెండు రోజుల తరువాత నా వేదన తీరింది..అదే బాబా సమాధానం అనుకున్నా. చివరిరోజు ప్రయాణంలో దాని గురించి..!


ఆదివారం రాత్రికి రైలు టికెట్స్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ఈలోపు శనివారం సాయంత్రం దగ్గరలో మరెక్కడికైనా వెళ్ళివద్దాం అని చూస్తే "నాసిక్" అక్కడికి రెండు గంటలే అని చెప్పారు. త్రయంబకం అక్కడ నుంచి మరో అరగంటేట. గోదావరి జన్మించిన ప్రదేశానికి వెళ్ళాల్సిందే అని నేను...సరే 'పద'మనుకుని బస్సెక్కేసాము. బస్సుని ఆటోలా తోలుకుంటూ బస్సు డ్రైవరు ఎనిమిదిన్నరకు నాసిక్ లో దించాడు. అంతకు ముందు ఎప్పుడూ మాకు నాసిక్ గురించి తెలీదు. అసలంత దూరం వెళ్తామని అనుకోలేదు కూడా. ఇంతలో భోరున వర్షం మొదలైంది. పిల్లకు ఆకలౌతుంది టిఫిన్ తెస్తాను, వచ్చాకా ఎలా వెళ్ళాలో చూద్దాం అని వెళ్ళారు శ్రీవారు. ఆ చీకట్లో ఓ బస్సు షెల్టర్ క్రింద పాపతో నిలబడ్డా. అరగంటైంది మనిషి రాలేదు. నాకు మళ్ళీ కంగారు మొదలైంది. నా ఫోనుంది కదా నీదెందుకు అన్నారని నా ఫోన్ కూడా తేలేదు. అసలే పొద్దుటి తోపులాట, ఇప్పుడిలా చీకట్లో..భయం...! ఎందుకు బయల్దేరామా..తనింకా రాలేదేంటి.. అని బుర్రలో రకరకాల ఆలోచనలు...


(మిగిలింది రేపు..)

Wednesday, July 6, 2011

భాస్కరమ్మగారి ఇల్లు








నివాసానికి గవర్నమెంట్ క్వార్టర్స్ ఇచ్చేదాకా పదిహేనేళ్ళ పాటు విజయవాడ సూర్యారావుపేటలోనే ఉన్నాం మేము. విజయటాకీస్ ఎదురుగుండా రోడ్డులో ఎడమవైపు ఉండేది భాస్కరమ్మగారి ఇల్లు. ఇప్పుడు భాస్కరమ్మగారు లేరు. ప్రస్తుతం ఆ ఇల్లు కూడా ఏవో కోర్టు తగాదాల్లో ఉందని విన్నాను. అన్నయ్య పుట్టక ముందు అమ్మావాళ్ళు దిగిన ఆ ఇంట్లో నాకు పన్నెండేళ్ళు వచ్చేదాకా ఉన్నాం. ఆ ఇంటితో పెనవేసుకునున్న ఎన్నో జ్ఞాపకాలు ఈనాటికీ తాజాగా మనసును ఉత్తేజపరుస్తూ ఉంటాయి. మేం ఉన్నప్పుడు లైట్ ఆరెంజ్ కలర్లో ఉండే ఆ డాబా ఇంట్లో వీధివైపు రెండు పెద్ద వాటాలు, వెనుక పెరటివైపు రెండు చిన్న వాటాలు ఉండేవి. పైన అంతా భాస్కరమ్మగారు ఒక్కరే ఉండేవారు. పిల్లలు దూరాల్లో ఉండేవారు. తెల్లటి పంచె ముసుగేసుకుని కట్టుకుని ఉండే ఒక ముసలి మామ్మగారు పొద్దుటే వచ్చి భాస్కరమ్మగారికి వంట చేసి సాయంత్రాలు వేళ్పోతూ ఉండేవారు. అంత పెద్ద ఇంట్లో ఆవిడ ఒక్కరు భయం లేకుండా ఎలా ఉంటారా అని నాకు ఆశ్చర్యం వేసేది.

మా వాటా వైపు పొడువాటి సందు ఉండేది. రెండు కొబ్బరి చెట్లు, ఒక పెద్ద రేక నందివర్ధనం చెట్టు ఉండేవి. నందివర్ధనం చెట్టు ఎక్కటానికి వీలుగా ఉండేది. రోజూ పొద్దున్నే నేనో తమ్ముడో చెట్టేక్కి గోడ మీద కూచుని సజ్జ నిండా పూలు అమ్మకి కోసి ఇచ్చేవాళ్లం. మిగతా మట్టి ప్రదేశంలో అమ్మ కనకాంబరాలు, డిసెంబర్ పూలు, ముళ్ళ గోరింట పూలు, మెట్ట తామర.. మొదలైన పూలమొక్కలు, ఆకుకూరలు మొదలైనవి పెంచేది. మా ఇంటి గోడకూ, ఎదురుగుండా ఇంటికి మధ్య నాలుగైదు అడుగుల ఖాళీ స్థలం ఉండేది. అక్కడ పిచ్చి మొక్కలు, బోలెడు ఆముదం మొక్కలు, బొప్పాయి మొక్కలు ఉండేవి. పిచ్చుకలు, గోరింకలూ, అప్పుడప్పుడు కోయిలలు వచ్చి ఆ చెట్లపై వాలుతూ ఉండేవి. ఆముదం మొక్కల వల్ల ఎప్పుడూ నల్లని గొంగళీ పురుగులే. కొన్ని ఇంటి గోడమూలల్లో గూళ్ళు కట్టేసుకుని ఉండేవి. అవి సీతాకొకచిలుకలు అవుతాయని నాన్న చెప్తే ఆశ్చర్యం వేసేది. గొంగళీలతో పాటూ వర్షాకాలంలో గుంపులు గుంపులుగా ఎర్రని రోకలిబండలు తిరుగుతు ఉండేవి. పుట్టలు పుట్టలుగా ఎన్ని పుట్టేసేవో అవి. ఇక వర్షం వస్తే వీధి గుమ్మం దాకా మా వాటా వైపంతా నీళ్ళతో నిండిపోయేది కాలువలాగ. ఇంక ఆ బురదనీళ్ల కాలవ నీండా మేంవేసిన కాయితం పడవలే ఉండేవి. మా ఇంట్లోని చిన్నగదిలో ఎత్తుగా ఒక కిటికీ ఉండేది. ఆ కిటికీ గూట్లోకి ఎక్కితే కాళ్లు తన్నిపెట్టుకుని కూర్చోటానికి కుదిరేది. వాన వస్తూంటే సన్న తుంపరలు మీద పడేలా ఆ కిటికీలో కూర్చుని ఏదైనా పుస్తకం చదువుకోవటం నాకు చాలా ఇష్టంగా ఉండేది.

ఇంటి వెనుక వైపు చాలా పెద్ద పెరడు ఉండేది. అందులో ఓ పక్కగా పెద్ద సపోటా వృక్షం, దానికి చుట్టుకుని గురువింద గింజల తీగ ఉండేవి. ఎరుపు నలుపుల్లో ఉండే గురువింద గింజలు కోసుకుని దాచటం నా ముఖ్యమైన పనుల జాబితాలో ఉండేది. పెరటిలో సపోటా చెట్టునానుకుని డా.జంధ్యాల శంకర్ గారి ఇల్లు ఉండేది. అప్పుడప్పుడు పేరంటాలకు పిలిచేవాళ్ళు వాళ్ళు. వాళ్ళింట్లో పొడుగ్గా రెండు యూకలిప్టస్ చెట్లు ఉండేవి. ఒకటో రెండో ఆకులు అందుకుని వాసన చూస్తే భలేగా ఉండేది. (ఆ తర్వాత డా.శంకర్ గారు విజయవాడ మేయర్ గా కూడా చేసారు) మా వెనుక పెరడులో ఇంకా పారిజాతం, కర్వేపాకు, గోరింటాకు, రెండు మూడు గులాబీ చెట్లు ఉండేవి. అవికాక ఒక పక్క విరజాజి పందిరి, మరో పక్క సన్నజాజి పందిరి, వాటి మధ్యన రెండు మూడు మల్లె పొదలు(కోలవి, గుండ్రంటివి ఇలా మల్లెల్లో రకాలన్నమాట), ఒక కాగడా మల్లె పొద కూడా ఉండేవి. ఇవి కాక అద్దెకున్నవాళ్ళు పెంచుకునే మొక్కలు. ఇలాగ వెనుకవైపు పెరడులోకి వెళ్ళాడానికి చాలా ఆసక్తికరమైన సంగతులన్నీ ఉండేవి. అమ్మ ఎప్పుడు బయటకు వదులుతుందా అని మా వరండాలోని కటకటాలతలుపులు పట్టుకుని జైల్లో ఖైదీల్లాగ ఎదురు చూసేవాళ్ళం. అమ్మ తాళం తియ్యగానే పరుగున వెనుకవైపుకు వెళ్పోయి చీకటి పడేదాకా అక్కడే అడుకుంటూ గడిపేవాళ్లం.

పొరపాటున ఎవరి చెయ్యైనా చెట్ల మీద, పువ్వుల మీదా పడిందో పై నుండి ఎప్పుడు చూసేదో భాస్కరమ్మగారు ఒక్క కేక పెట్టేది..ఎవరదీ అని..! అన్ని పూలు పూసినా ఒక్క పువ్వు కూడా మా ఎవ్వరికీ ఇచ్చేది కాదు ఆవిడ. పొద్దుటే ఆవిడ పనిమనిషి వచ్చి అన్ని పువ్వులు కోసుకుని వెళ్ళిపోయేది. దేవుడికి పెట్టుకునేదో ఏమో...! నేను కొత్తిమీర వేస్తే మాత్రం కాస్త కొత్తిమీర కోసివ్వవే అని జబర్దస్తీ గా కోసేసుకునేది. నాకు ఒళ్ళు మండిపోయేది. పువ్వులు కోసుకోనివ్వకపోయినా నేనైతే ఎప్పుడూ ఆ చెట్ల చుట్టూ తిరుగుతూ ఉండేదాన్ని. ఆ పచ్చదనం నన్నెంతో ముగ్ధురాలిని చేసేది. మొక్కలన్నింటి మధ్యనా ఉండే మెత్తటి ఆకుపచ్చటి గడ్డి మొక్కలు కూడా నాకు అందంగా కనబడిపోయేవి. అలా మొక్కలతో నా సావాసం ఊహ తెలిసినప్పటి నుండీ ఏర్పడిపోయింది.






వీధివైపు ఉన్న రెండిటిలో ఒక వాటాలో మేము ఉండేవాళ్ళం. రెండోదాన్లో ఒక డాక్టర్ గారు ఉండేవారు. అవివాహితుడైన ఆయనతో ఆయన చెల్లెలు, ఆవిడ ముగ్గురు పిల్లలు ఉండేవారు. వారితో నామమాత్రపు పరిచయమే తప్ప మిగిలిన సంగతులు ఎక్కువ ఎవరికీ తెలియవు. మా వాటాలో వరండా, చిన్నగది, వంటిల్లు, హాలు,బెడ్రూము ఉండేవి. ఇంకా ఓ రెండు గదులు ఉంటే, అవి మాకు అనవసరం అని అద్దెకు ఇచ్చారు నాన్న. దాన్లో కొన్నేళ్ళు భట్టుమావయ్యగారు(పన్నాల సుబ్రహ్మణ్యభట్టుగారు) ఉన్నారు. తరువాత మేమున్నన్నాళ్ళు సూరిసేన్ మావయ్యగారు, వాళ్ళ తమ్ముడు శంకర్ గారు ఉండేవారు. ఇద్దరూ పెళ్ళిళ్ళు చేసుకోలేదెందుకో మరి. సూరిసేన్ మావయ్యగారికీ నాకూ భలే స్నేహం ఉండేది. ఆయన రేడియోలో క్రికెట్ కామెంటరీ వింటూంటే కావాలని కదిలిస్తూ, ఆయనతో ఆడుతూ..కబుర్లు చెప్తూ ఎప్పుడూ వాళ్ల రూంలోనే ఎక్కువ ఉండేదాన్ని. వీళ్ల రూంకే తరచూ సాయంత్రాలు ఉషశ్రీతాతగారు పలు మిత్రులను కలవటానికి వస్తూండేవారు.

మా వాటాసందు చివరగా చిన్న వీధి గుమ్మం ఉండేది. గుమ్మానికి పక్కగా రాధామనోహరలు తీగ అల్లుకుని ఉండేది. రాత్రయ్యేసరికీ లేత గులాబి,తెలుపు రంగుల్లో గుత్తులు గుత్తులుగా రాధామనోహరాలు విచ్చేవి. ఆ పరిమళం ఇంకా తలపుల్లో నన్ను పలకరిస్తూ ఉంటుంది. ఒకే తీగకు రెండు రంగుల్లో పులెలా పూస్తాయీ అని ఇప్పటికీ సందేహమే నాకు. సాయంత్రం ఆ పూలు విచ్చే సమయానికీ, పొద్దున్నే లేవగానే కాసేపు ఆ వీధి గుమ్మంలో కూచోపోతే నాకు తోచేది కాదు. పొద్దున్నే వీధి తుడిచేవాళ్ళు, అటువెళ్ళే బళ్లవాళ్ళు అందరూ ఓ చిరునవ్వుతో పలకరించేసేవారు. నిర్మలా కాన్వెంటు స్కూలు బస్సు మా ఇంటి ఎదురుగా ఆగేది. సూరిబాబుమావయ్యగారి పిల్లలు ఆ బస్సు ఎక్కటానికి రోజూ వచ్చి అక్కడ నిలబడేవారు. ఇప్పుడు వాళ్ళు సంగీత విద్వాంసులు "మల్లది బ్రదర్స్" గా మంచి పేరు తెచ్చుకున్నారు.

మా వెనుకవైపు రెండువాటాల్లో ఒకదాన్లో తాతగారు, అమ్మమ్మగారు, శ్రీనుమావయ్య, నాగమణక్క ఉండేవారు. తాతగారు నాకూ, మా తమ్ముడికీ కొబ్బరి ఆకులతో, తాటాకులతో బుట్టలు అవీ అల్లి ఇస్తూండేవారు. కొత్త కొత్త కబుర్లు ఎన్నో చెప్పేవారో. వాళ్ళబ్బాయి శ్రీనుమావయ్య మృదంగం నేర్చుకునేవాడు. రోజూ పొద్దుట సాయంత్రం సాధన చేస్తూండేవాడు. మేము కిటికీ ఎక్కి అబ్బురంగా చూస్తూండేవాళ్లం. నాగమణక్క కాలేజీలో చదువుతూ ఉండేది. అమ్మమ్మగారికి వినబడేది కాదు. చెవికి మిషన్ పెట్టుకునేవారు. కాలేజీ నుంచి రాగానే ఆ రోజు జరిగిన విశేషాలన్నీ గట్టిగా అమ్మమ్మగారికి చెబుతూ ఉండేది అక్క. అన్ని వాటాలవాళ్ళకీ వినబడేవి ఆ కబుర్లు. ఇక వెనుకవైపు మరోవాటాలో ఇంకో తాతగారు, అమ్మమ్మగారు వారి ఆరుగురు సంతానం ఉండేవారు. తాతగారికి నేనంటే వల్లమాలిన అభిమానం. ఆఫీసు నుండి రాగానే ఎంత రాత్రయినా నన్ను తీసుకురమ్మని బొజ్జపై పడుకోబెట్టుకుని బోలెడు కబుర్లు చెప్పేవారు. తెలుగు తిథులు,నెలలు, పద్యాలు,పాటలూ ఎన్నో నేర్పించేవారు. నా ఊహ తెలిసేసరికీ ఇరువైపుల తాతగార్లు లేకపోవటంతో ఈ తాతగారు బాగా దగ్గరైపోయారు. అమ్మ కూడా పిన్నిగారు,బాబయ్యగారు అని పిలిచేది వాళ్ళిద్దరినీ. ఎంతో అభిమానంగా ఉండేవాళ్ళం రెండు కుటుంబాలవాళ్ళమూ. కొన్నేళ్ళకు సొంత ఇల్లు కట్టుకుని వాళ్ళు వెళ్పోయారు వాళ్ళు. ఊళ్ళు మారినా, దూరాలు పెరిగినా ఇప్పటికీ ఆ అనుబంధం అలానే ఉంది. మా పాప పుట్టాకా తాతగారికి విజయవాడ తీసుకువెళ్ళి చూపించి వచ్చాను. తాతగారు కాలం చేసి ఏడాదిన్నర అయిపోతోంది అప్పుడే !!

తాతగారూవాళ్ళు ఖాళీ చేసాకా ఆ ఇంట్లోకి ఉషశ్రీగారి సహోదరులు పురాణపండ రంగనాథ్ గారు వచ్చారు. పిల్లలందరం కల్సి గోడలెక్కి దూకి..రకరకాల ఆటలు ఆడుకునేవాళ్ళం. శెలవుల్లో ఎండిన కొమ్మలు విరిచి బాణాలు చేసుకునేవాళ్ళం. రంగనాథ్ మావయ్యగారు అమ్మవారి ఉపాసకులు. దసరా పూజలు ఎంతబాగా చేసేవారో. విజయవాడలో ఉన్నన్నాళ్ళు ఎక్కడ ఉన్నా నవరాత్రుల్లో వాళ్ళింటికి వెళ్ళేవాళ్ళం. భాస్కరమ్మగారు "ఇల్లు బాగుచేయించాలి.." ఖాళీ చెయ్యమంటే అన్ని వాటాలవాళ్ళమూ ఒకేసారి ఆ ఇంట్లోంచి కదిలాము. అప్పటికి నాకు పన్నెండేళ్ళు. ప్రపంచం తెలీని బాల్యపు అమాయకత్వం, చలాకీతనం, అరమరికలు లేని స్నేహాలు, పచ్చదనంతో సావాసం...మరువలేనివి. ఆ రోజులు గుర్తుకు వస్తే...ఒక అద్భుతలోకంతో బాంధవ్యం అప్పటితో తెగిపోయింది అనిపిస్తూ ఉంటుంది నాకు. ఈ మధురస్మృతులన్నింటినీ ఒకచోట పోగేసి దాచుకోవాలన్న ఆలోచనే ఈ టపా.


Tuesday, July 5, 2011

मिलेगी मिलेगी.. मंज़िल


కాలేజీ రోజుల్లో లక్కీ అలీ పాటలు ఎంత పాపులర్ అయ్యాయో... బేస్ వాయిస్ కాకపోవటం వల్ల మరీ ప్రఖ్యాతి రాలేదేమో అనిపిస్తుంది నాకు.హాస్య నటుడు మెహ్మూద్ కుమారుడైన ఇతను నటించిన "సుర్" సినిమాలో పాటలు చాలా బావుంటాయి.

"సునో" ఆల్బం లోని ఈ పాట,సాహిత్యం నాకు భలే నచ్చుతాయి..పాట మధ్య మధ్యలో వచ్చే ఆ గిటార్ భలే బావుంటుంది. ఇలాంటి హస్కీ వాయిసెస్ కూడా కొన్ని పాటలకు అందాన్ని ఇస్తాయి.


मिलेगी मिलेगी ..मंज़िल
चलके कही दूर
अ‍ॅये है चले जाने कॉ
अ‍ॅये है चले जायेंगे
दूर मजबूर..
मिलेगी मिलेगी

कैसी है ये दुनियां
प्यार का नम-ओ-निशा नहीं
नदा दुनियां वलें देखॊ
यहा पे कोई ईमान नहीं
अ‍ॅकेले ढूंढ्तॆ
सवेरा सवेरा
सवेरा सवेरा आयेगा चल के दो कदम
फ़ास्ले घट जायेंगे होसलॆं बढं जायेंगे
चल के दो कदम..
मिलेगी मिलेगी

चलतॆ दुनियां वलें सारे
राह मगर अंजान कही
मैं तो हूँ दीवना मेरी दीवान्गी बेनाम सही
अ‍ॅकेले ढूंढ्तॆ
मोहब्बत मोहब्बत
मोहब्बत मोहब्बत मिलॆगी चल के दो कदम
साथी से मिल जायेंगे
बहारॆं फिर खिल जायेंगे
चल के दो कदम..
मिलेगी मिलेगी

Monday, July 4, 2011

'మధుర గాయకి' శ్రీరంగం గోపాలరత్నం



చూడచక్కని రూపం, నుదుటన శ్రీ చూర్ణంతో కనబడే ఆమె మృదుభాషిణి. చరగని చిరునవ్వు ఆవిడ సొంతం. ఆవిడే నాటి సంగీత విద్వాంసురాలు, 'మధుర గాయకి' బిరుదాంకితురాలు శ్రీరంగం గోపాలరత్నం గారు. ఒక తెలుగు శాస్త్రీయ సంగీత విద్వాంసురాలిగా శ్రీరంగం గోపాలరత్నం గారు గుర్తుంచుకోదగ్గ గాయనీమణి. విజయవాడ స్టాఫార్టిస్ట్ గా పనిచేసి, తరువాత హైదరాబాద్ ప్రభుత్వ సంగీత కళాశల ప్రధానోపాధ్యాయినిగా, తెలుగు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ గా, టిటీడి ఆస్థానవిద్వాంసురాలిగా కూడా నియమితులయ్యారు. 'పద్మశ్రీ' గౌరవాన్ని పొందిన గోపాలరత్నంగారు శ్రీపాద పినాకపాణి గారి శిష్యురాలు. కర్నాటక శాస్త్రీయ సంగీత విద్వాంసురాలిగానే కాక లలిత సంగీత గాయనిగా కూడా అమె ఎంతో ప్రఖ్యాతి పొందారు. ఆమె గాత్రంలో వైవిధ్యంగా పలికే గమకాలు, పలికేప్పుడు భావానుగుణంగా ప్రత్యేకత సంతరించుకునే పదాలు అమె ప్రత్యేకతలు. శ్రీరంగం గారిది తంజావూరు బాణీ అని అంటూంటారు.

పలు సంగీత నాటికల్లో కూడా ఆమె నటించారు. సతీసక్కుబాయి నాటికలో సక్కుబాయి, మీరా నాటకంలో మీరా పాత్రలు ఆమెకు పేరు తెచ్చాయి. మీరా నాటకంలో శ్రీకాంతశర్మగరు రాసిన అన్ని మీరా పాటలు గోపాలరత్నం గారే పాడారు. "ఎవరు నాకు లేరు", "గిరిధర గొపాలుడు కాకెవరు", సఖియా నిదురన్నది లేదు" మొదలైనవి చాలా బావుంటాయి. బాలమురళిగారి రచన "కనిపించు నా గతము", ఆయనతో కలిసి పాడిన రజని గారి "మన ప్రేమ", కృష్ణశాస్త్రి గారి ""శివ శివయనరాదా", "గట్టుకాడ ఎవరో, సెట్టు నీడ ఎవరో" మొదలైన పాటలు ఎంతో ప్రశంసలు పొందాయి. మంచాల జగన్నాధరావుగారు ట్యూన్ చేసిన (ఆకాశవాణిలో ఉన్న) గోపాలరత్నం గారు బాలమురళి గారితో యుగళంగా కొన్ని, కొన్ని విడిగానూ(సోలోస్) కమ్మగా పాడిన "ఎంకి పాటలు" నాకైతే చాలా ఇష్టం. ముఖ్యంగా గోపాలరత్నం గారు పాడిన అన్నమాచార్య కీర్తనలు చాలా ప్రాచుర్యం పొందాయి. ఆసక్తి ఉన్నవారు క్రింద లింక్లో వాటిని ఇడౌలోడ్ చేసుకోవచ్చు:
http://www.yadlapati.com/sri-thallapaka-annamacharya-kirthans-by-srirangam-gopala-ratnam-devotional-mp3-songs/

పన్నాల సుబ్రహ్మణ్య భట్టుగారి "అనుభవ దీపం" రూపకానికి శ్రీకాంతశర్మ గారు "ఇంత వింత వెలుగంతా సుంత నాకు మిగెలేనా
" అని ఒక పాట రాసారు. ఆవిడ పాటల్లో నాకు బాగా నచ్చే "తిరునాళ్ళకు తరలొచ్చే"పాటను మొన్న టపాలో పెట్టాను కదా,  గోపాలరత్నంగారు మధురంగా మోహన రాగంలో పాడిన "ఎవ్వడెరుగును నీ ఎత్తులు" అన్న అన్నమాచార్య కీర్తన  క్రింద లింక్లో వినవచ్చు:

Sunday, July 3, 2011

ప్రియమణి ఇంటర్వ్యూ లింక్ :



"Attitude". ఒక మనిషిని ప్రపంచం చూసేది, కొలిచేదీ మనిషి ఒక్క యాటిట్యూడ్ తోనే అని అంతా అంటారు. తమ వైఖరిని బాగా చూపెట్టగలిగినవారు ముందుకు పోతారు. ఇవాళ "సాక్షి" న్యూస్ పేపర్ లో "రీఛార్జ్" పేరుతో నటి ప్రియమణి ఇంటర్వ్యూ ప్రచురించారు. ఇంటర్వ్యూ, కథారూపం "ఖదీర్" అని ఉంది. "దర్గామిట్ట కతలు" రచయిత ఖదీర్ బాబు అయ్యుంటారనుకున్నాను. చాలా బావుంది ఇంటర్వ్యూ.. ఒక కథ లాగ.
రాసే రచయితని బట్టి కూడా వ్యాసానికి ఒక కొత్త శక్తి వస్తుందేమో !

క్రింద లింక్స్ లో ఆ ఆర్టికల్ చదవచ్చు:
1) http://epaper.sakshi.com/apnews/Hyderabad-Main_Edition/03072011/details.aspx?id=954031&boxid=26356068&eddate=03/07/౨౦౧౧

2) http://epaper.sakshi.com/apnews/Hyderabad-Main_Edition/03072011/Details.aspx?id=954032&boxid=26372504

Friday, July 1, 2011

ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారి "తిరునాళ్ళకు తరలొచ్చే కన్నెపిల్లలా.."


వర్షంలో ఇంటికి నడిచి వస్తూంటే శ్రీకాంతశర్మగారి "తిరునాళ్ళకు తరలొచ్చే.." పాట గుర్తుకు వచ్చింది. ఎంతో అందమైన సరళ పదాలతో పాట చదువుతుంటేనే ఒక అందమైన చిత్రం కళ్లకు కనబడేలా రాయటం శర్మగారి ప్రత్యేకత. నాన్నకు మంచి మిత్రులుగా కన్నా ఒక కవిగానే నాకు ఆయన పట్ల చాలా అభిమానం. ఈ పాటలో శర్మగారు ఉరుములు మెరుపులతో వచ్చే వర్షాన్ని తిరునాళ్ళకు వెళ్ళే కన్నెపిల్లతో పోలుస్తూ రాసిన ఈ పాట చాలా బావుంటుంది.

ఈ పాటను ఇక్కడ వినచ్చు:






రచన: శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ
సంగీతం: శ్రీ విజయరాఘవరావు
పాడినది: శ్రీరంగం గోపాలరత్నం గారు

తిరునాళ్ళకు తరలొచ్చే కన్నెపిల్లలా(౨)
మెరుపులతో మెరిసింది వానకారు

నీలి మొయిలు వాలు జడకు చినుకే చేమంతి(౨)
కట్టుకున్న పచ్చదనం పట్టుపరికిణీ..
((తిరునాళ్లకు))


తెలివెన్నెల వేకువలో తానమాడి
అడవిదారి మలుపుల్లో అదరి చూసీ
కొండ తిరిగి కోన తిరిగి గుసగుసలాడి(౨)
తరగల మువ్వల గలగల నాట్యమాడి..
((తిరునాళ్లకు))


చిగురేసిన చిరుకొమ్మలు ఊగిఊగిపోతే
చిలిపిగ జడివాన వేళ చక్కిలిగిలి పెట్టి
పకపక పువ్వుల నవ్వుల నవ్విస్తూ వస్తూ(౨)
బాటవెంట సంబరాలు వంచి పంచిపెడుతూ..
((తిరునాళ్లకు))


కొంటెకుర్రకారు వెనక జంట నడక నడిచి
విరహంతో వేదనతో వారి మనసు కలచి
అంతలోన మంచి కలలు కనుల చిలకరించి
జరిగి జరిగి దౌదౌవ్వుల పిలిచి పిలిచి - నిలిచి..
((తిరునాళ్లకు))




ఈ పాటను పాడినది ప్రముఖ సంగీత విద్వాంసురాలు శ్రీరంగం గోపాలరత్నం గారు. సంగీతం సమకూర్చినది అప్పట్లో బొంబాయిలో ఫిలిం డివిజన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న మన తెలుగువారైన విజయరాఘవరావు గారు. ఈ పాట గురించిన చిన్న కథ శ్రీకాంతశర్మగారి మాటల్లో:
"సుప్రసిధ్ధ వేణు విద్వాంసులు ఏల్చూరి విజయరాఘవరావుగారు ఒక కచేరీ కోసం విజయవాడ వస్తున్నారని తెలిసీ, నన్ను పిలిచి ఒక పాట రాయించి బొంబాయిలో ఉన్న వారికి పంపారు మా డైరెక్టర్ శ్రీనివాసన్ గారు. దానికి బాణీ ఏర్పరిచి విజయరాఘవరావు గారు ఈ మాసపుపాట కార్యక్రమం కోసం విజయవాడలో మా స్టూడియో లోనే రికార్డ్ చేసారు. దీని కోసం ప్రత్యేకంగా గోపాలరత్నం గారిని హైదరాబాదు నుంచి పిలిపించి శ్రీనివాసన్ గారు పాడించారు. ఈపాట రాయటం మొదలు చివరి రికార్డింగ్ వరకూ నడిచిన అన్ని దశలనూ రికార్డ్ చేసిన శ్రీ ఎస్.బి.శ్రీరామ్మూర్తి అనే మా సహచర రేడియో ప్రయోక్త 'ఒక పాట పుట్టింది' అనే రేడియో డాక్యుమెంటరీ తయారు చేసారు. ఆ రోజుల్లో ఈ పాట రేడియో ద్వారా బాగా ప్రచారం పొందింది." ("పరిపరి పరిచయాలు" పుస్తకం నుండి).

పది గంటలకు మొదలై రాత్రి ఎనిమిదింటిదాకా నడిచిన ఈ పాట తాలూకు సుదీర్ఘమైన రికార్డింగ్ ను నలభై ఐదు నిమిషాల "ఒక పాట పుట్టింది" అనే కార్యక్రమంగా రూపొందించారు నాన్న. సామన్య శ్రోతకు కూడా ఒకపాట తయారీ ఎలా ఉంటుందో సులువుగా అర్ధమయ్యేలా రుపొందించిన ఈ కార్యక్రమం చాలా మన్ననలు పొందింది. ఆ రికార్డింగ్ ను బొంబాయిలో ఉన్న విజయరాఘవరావు పంపిస్తే, విని "out of a labourious process of 10hrs recording, i wonder how you could produce this programme..' అని ఆనందాన్ని వ్యక్తపరుస్తూ రెండు పేజీల ఉత్తరం . అది అవార్డులు రావటం కన్నా గొప్ప ప్రశంస అని నాన్న అనుకుంటూ ఉంటారు.

Wednesday, June 29, 2011

"మధుమాసం(2007)"



కొత్త తెలుగు సినిమాల్లో బాగా నచ్చేవాటిని వేళ్లపై లెఖ్ఖపెట్టచ్చు. అలా నాకిష్టమైన అతి తక్కువ సినిమాల్లో ఒకటి "మధుమాసం(2007)" చిత్రం. ఈ సినిమా థీమ్ నాకు బాగా నచ్చింది. ఆప్యాయానురాగాలే జీవితం అని నమ్మే ఒక ఎమోషనల్ అమ్మాయి, ఏ ఉద్వేగాలకీ పెద్దగా స్పందించని ఒక ప్రాక్టికల్ మైండెడ్ అబ్బాయి ని ప్రేమిస్తుంది. కొన్ని పరిస్థితుల కారణంగా సినిమా రెండవ భాగానికి వచ్చేసరికీ వారిద్దరూ తమ తమ స్వభావాలకు విరుధ్ధంగా మారిపోతారు. క్లైమాక్స్ పార్ట్ అస్సలు కన్విన్సింగ్ గా అనిపించదు కానీ అక్కడిదాకా నడిచిన ఆ మూడొంతులు సినిమా మాత్రం నాకు బాగా నచ్చేస్తుంది. స్నేహ, సుమంత్ ఇద్దరు కూడా బాగా నటించిన ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ శ్రీ ఈ.ఎస్.మూర్తి చేసారు. దర్శకుడు "చంద్ర సిధ్ధార్ధ" ఇంతకు ముందు తీసిన "అదీ సంగతి", "ఆ నలుగురు" కూడా బావుంటాయి. ఈ సినిమా బానే ఆడింది. కొన్ని ప్రేమ, పెళ్ళి, సంసారం మొదలైనవాటిపై అంతగా నమ్మకంలేని సంజయ్, హంస పెళ్ళి ప్రస్తావనను వద్దనటానికి ఏ కారణం కనబడక ఒప్పుకుంటాడు. కానీ ప్రేమ లేదన్న కారణంగా పెళ్ళి వద్దనుకున్న హంస అతనికి మూర్ఖంగా అనిపిస్తుంది. స్వేచ్ఛాపరురాలైన అతని స్నేహితురాలు మాయ(పార్వతీ మెల్టన్) తో పాటూ అనుకోకుండా ఒక హత్య కేసులో ఇరుక్కుంటాడు సంజయ్. అతని తల్లిదండ్రులు కూడా అతడిని అనుమానించి పోలీస్ స్టేషన్ కు వెళ్లటానికి నిరాకరిసారు. అర్ధరాత్రి పూట సంజయ్, మాయలకు ఒంటరిగా భోజనం తెచ్చిన హంసను చూసి ఆశ్చర్యపోతారు వారిద్దరూ. తనకు వారిపై ఎటువంటి అనుమానం లేదనీ చెప్పి వెళ్ళిన హంస పై మొదటిసారిగా అభిమానం ఏర్పడుతుంది సంజయ్ కు. సినిమాలో ఈ పోలీస్ స్టేషన్ సన్నివేశం నాకు బాగా నచ్చుతుంది. అది హంస నిర్మల వ్యక్తిత్వాన్ని చిత్రికరించటానికి ఉపయోగపడే బలమైన సన్నివేశం. ఆ రాత్రి తరువాత తనకు కనపడని హంసను కలవాలని సంజయ్ ఆమె కోసం ఎంతో వెతుకుతాడు. అది అతనిలోని మార్పుకు నిదర్శనం. కొన్ని చోట్ల అయితే వంద రోజులు కూడా ఆడింది.



సినిమాకు మూలం బలభద్రపాత్రుని రమణిగారు రాసిన నవల అని విన్నాను. మరి నవలలోనూ ఇదే కథ ఉండే, సినిమాకు ఏమన్నా మార్పులు చేసారో తెలియదు. హంసవాహిని(స్నేహ) ఒక మధ్యతరగతి అమ్మాయి. ఉద్యోగం చేస్తూ తండ్రిని పోషిస్తూ ఉంటుంది. తనను అమితంగా ప్రేమించే భర్త కావాలని నోములూ, పుజలూ చేసే సెంటిమెంట్లున్న అమ్మాయి. కొత్తగా మారిన ఇంటి ఓనర్గారి అబ్బాయి సంజయ్(సుమంత్) వ్యక్తిత్వం బాగ నచ్చుతుంది హంసకు. అతడి దగ్గర పెళ్ళి ప్రస్తావన తెస్తుంది. ఎంగేజ్మెంట్ రోజున సంజయ్ కు తన మీద ప్రేమలేదని, కేవలం స్వశక్తిని నమ్ముకున్న అందమైన అమ్మాయిగానే తనను పెళ్ళాడుతున్నానని సంజయ్ చెప్పటం హంసను బాగా కృంగదీస్తుంది. ప్రేమ లేని పెళ్ళి తనకు ఇష్టం లేదని పెళ్ళిని రద్దు చేసుకుంటుంది హంస. తరువాతి వరుస సన్నివేశాలు ఆమెకు తన తండ్రి, అన్నావదినల నిజస్వరూపాలు తెలుసుకునేలా చేస్తాయి. ప్రపంచంలో అన్ని బంధాలూ అవసరాల మీదే ఆధారపడి ఉంటాయి. మనుషుల మధ్యన ప్రేమాభిమానాలు అన్నీ వట్టి నాటకాలన్న అభిప్రాయానికి ఆమె చేరుకుంటుంది. ఇల్లు వదిలి హాస్టల్లో ఒంటరి జీవితం మొదలుపెడుతుంది.
 




ప్రేమ, పెళ్ళి, సంసారం మొదలైనవాటిపై అంతగా నమ్మకంలేని సంజయ్, హంస పెళ్ళి ప్రస్తావనను వద్దనటానికి ఏ కారణం కనబడక ఒప్పుకుంటాడు. కానీ ప్రేమ లేదన్న కారణంగా పెళ్ళి వద్దనుకున్న హంస అతనికి మూర్ఖంగా అనిపిస్తుంది. స్వేచ్ఛాపరురాలైన అతని స్నేహితురాలు మాయ(పార్వతీ మెల్టన్) తో పాటూ అనుకోకుండా ఒక హత్య కేసులో ఇరుక్కుంటాడు సంజయ్. అతని తల్లిదండ్రులు కూడా అతడిని అనుమానించి పోలీస్ స్టేషన్ కు వెళ్లటానికి నిరాకరిసారు. అర్ధరాత్రి పూట సంజయ్, మాయలకు ఒంటరిగా భోజనం తెచ్చిన హంసను చూసి ఆశ్చర్యపోతారు వారిద్దరూ. తనకు వారిపై ఎటువంటి అనుమానం లేదనీ చెప్పి వెళ్ళిన హంస పై మొదటిసారిగా అభిమానం ఏర్పడుతుంది సంజయ్ కు. సినిమాలో ఈ పోలీస్ స్టేషన్ సన్నివేశం నాకు బాగా నచ్చుతుంది. అది హంస నిర్మల వ్యక్తిత్వాన్ని చిత్రికరించటానికి ఉపయోగపడే బలమైన సన్నివేశం. ఆ రాత్రి తరువాత తనకు కనపడని హంసను కలవాలని సంజయ్ ఆమె కోసం ఎంతో వెతుకుతాడు. అది అతనిలోని మార్పుకు నిదర్శనం.



హంస ఎక్కడుందో కనుక్కొని కలిసిన సంజయ్ కు నిరాశే ఎదురౌతుంది. అతని ప్రేమను నమ్మలేనన్నీ, అతనిది కేవలం గెలవాలనే పట్టుదల మాత్రమే అనీ హంస అంటుంది. తనలోని మార్పునీ, హంస పట్ల అనురాగాన్ని ఎలా తెలపాలో తెలియక తికమక పడ్తాడు సంజయ్. చివరికి ఏమౌతుంది? హంస సంజయ్ ప్రేమను నమ్ముతుందా? అన్నది మిగిలిన కథ. ఇక్కడిదాకా సినిమా చాలా బావుంటుంది. ఇద్దరిలోనూ వచ్చిన ఈ మార్పు నాకు భలే నచ్చేసింది. రెండవ భాగం చాలా బావుంటుంది అని ఆశ పడ్డ నాకు చాలా నిరాశ కలిగింది. ఇక ఇక్కడ నుంచి జరిగే కథ కేవలం ఒక మామూలు సినిమా కథ లాగానే ఉంటుంది. ఏక్సిడెంట్, అంత పెద్ద సర్జరీ అయ్యాకా కూడా హంస బండి నడపటం...మొదలైనవన్నీ కృత్రిమంగా ఉంటాయి. అసలు ఏక్సిడెంట్ సీన్ పెట్టకుండా మరే విధంగానో ఆ అమ్మాయిలో మార్పు తెచ్చినట్లు ఎందుకు చూపించకూడదు? అన్నది నాకు మిగిలిపోయిన ప్రశ్న. చివరికి కృతిమంగా మిగిసినా, చిత్ర కధాంశం నాకు ఈ సినిమా పట్ల ఇష్టాన్ని మిగిల్చేసింది. ఈ దర్శకుడి తదుపరి చిత్రాల కోసం ఎదురుచూసేలా చేసింది ఈ సినిమా.

 

మాయ గా పార్వతి మెల్టన్ పాత్ర కథలో ముఖ్యమైనది. మిగిలిన ముఖ్య పాత్రల్లో గిరిబాబు, కవిత, చలపతిరావు, ఉత్తేజ్ తమ వంతు అబినయాన్ని సమర్ధవంతంగా పోషించారు. సిన్మాలో మణిశర్మ సంగీతం సమకూర్చిన బాణీలు బావుంటాయి. ఇతను మొలొడీస్ కూడా బాగా చేస్తాడు అనటానికి నిదర్శనమయ్యే పాటల్లో ఈ సినిమా పాటలూ ఉంటాయి. మొదటి పాట "ఓణీ మెరుపులు" పాట టేకింగ్ చాలా బావుంటుంది. "దేవదాసు కాన్నా", "వేలంటైన్" పాట లిరిక్స్ బావుంటాయి. "ఊహలే", "ప్రొమిస్ చేస్తు ఉన్నా"...కూడా వినటానికి బావుంటాయి. ముఖ్యంగా చివర్ పాటైన "వసంతం వాయిదాపడైనా రాదుగా" పాటకు వేటూరిగారు తనదైన శైలిలో రాసిన సాహిత్యం నాకు బాగా నచ్చుతుంది. "పొడి ఇసుక దారులలో..", "ముస్తాబు మీదా హస్తాక్షరాలే" లాంటి ప్రయోగాలు భలేగా ఉంటాయి. అలా వేటూరి మాత్రమే రాయగలరెమో..! ఈ పాటను రంజిత్,రీటా పాడారు. మేల్ వర్షన్ మరెవరైనా గంభీరమైన వాయిస్ అయితే పాట ఇంక బావుండేది అనిపిస్తుంది నాకు.



ఈ పాటను ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు:

http://www.mediafire.com/?1ym2tm3yyyy


ఆంధ్రజ్యోతి ఆదివారం(26-6-11) అనుబంధంలో ప్రచురితమైన కథ: "కల్పన"



ఆంధ్రజ్యోతి ఆదివారం(26-6-11) అనుబంధంలో ప్రచురితమైన కథ పేరు "కల్పన". రచనసామాన్య. నాకు కథలో రచయిత స్పృశించిన సున్నితమైన అంశాలు నచ్చాయి. రచయిత అనుమతి తీసుకుని కథ పి.డి.ఎఫ్. ను టపాలో పెడుతున్నాను. అనుమతినిచ్చిన రచయిత్రి కి బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు. ఆసక్తి ఉన్నవారీ కథానికను క్రింది లింక్స్ లో చదవవచ్చు.

part -1

https://docs.google.com/viewer?a=v&pid=explorer&chrome=true&srcid=0B3wjxgMVVajQM2M5YWE0YTItOTYyOS00YzQ0LWIzN2EtZmVkMmNjMmQ5M2Ri&hl=en_US&authkey=CJmxqNoO


part - 2

https://docs.google.com/viewer?a=v&pid=explorer&chrome=true&srcid=0B3wjxgMVVajQZDViMjAzMmQtNGZjZS00OGE5LTk2NzYtYmRjNjljZGQ1MTE0&hl=en_US&authkey=CIOty9cH


part -3

https://docs.google.com/viewer?a=v&pid=explorer&chrome=true&srcid=0B3wjxgMVVajQYjJhZTFiZDEtZWQ0Ny00NmIzLWI1ZGItYzk2OTFhYWY3ZDJk&hl=en_US&authkey=CLiotbcP


part -4

https://docs.google.com/viewer?a=v&pid=explorer&chrome=true&srcid=0B3wjxgMVVajQMzE3Njg2ZmItM2VhNS00Mjg4LWJlMGEtZTIxM2VkZWU5ZjI0&hl=en_US&authkey=CKKFiW4



Sunday, June 26, 2011

కాశీభట్ల వేణుగోపాల్ గారి 'తపన'


1999 తానా - స్వాతి నవలల పోటీలో లక్షరూపాయిల బహుమతి పొందిన సృజనాత్మక నవల "తపన". కాశీభట్ల వేణుగోపాల్ గారి రెండవ నవల. ఇప్పటిదాకా నేను ఇలాంటి పుస్తకం చదవలేదు. ముఖ్యంగా తెలుగులో. చాలా రోజుల తరువాత పనులు చేస్కుంటూ, బస్సులో వెళ్తూ, అన్నంతింటూ, కూచుని, పడుకుని...ఒక్కరోజులోనే చదవటం పూర్తి చేసాను. చివరికెలా ముగిస్తారో చూడాలని ఆసక్తి....రచయిత వాడిన రూపకాలంకారాలపై మక్కువ...రచనలోని ఓ మనసు ఆవిష్కరిస్తున్న స్వేచ్ఛపై విభ్రాంతి...రచనలోని నైరూప్య చిత్రణల పట్ల ఆశ్చర్యం...Stream of conciousness technique(చైతన్య స్రవంతి పధ్ధతి) ని వాడిన విధనం...మధ్య మధ్య surrealistic touch(కూడా ఉందనే అనిపించింది)...అన్నీ...అన్నీ నన్ను అలా చదివేలా చేసాయి. ఒక్కమాటలో చెప్పలంటే ఇలాటి ఒక ప్రయోగాత్మక నవల తెలుగులో వచ్చినట్లు నాకయితే తెలీదు.


ఈ పుస్తకం గురించి జయప్రభగారి మాటలు...(నవలలో ఒన్ని ఒన్ని ఒన్ని)
* ఈ నవల్లో సుఖాన్నీ...శాంతినీ చూపించే హామీలేం లేవు. మగతకి, మెలకువకీ మధ్య మనిషిలో కల్లోల కథనం తప్ప !!"
* " 'తపన' నన్ను చిరాకు పెట్టింది. భయపెట్టింది. బాధపెట్టింది. విభ్రమ పెట్టింది. నా మనసుని కలత పెట్టింది."
* "మంచి నవలను ఎంచి మరీ అందించిన డాక్టర్ జంపాలని ఎంతైనా అభినందించవలసిందే.తపన నవల చదివిన వెంఠనే అత్యుత్కంఠతతో 'నేనూ-చీకటి' చదివేదాకా మరి నేను ఆగలేకపోయాను."


ఈ పుస్తకం మధ్యలో ఆపి మళ్ళీ తెరిచేదాకా మనసు నిలవదు. ఆ అక్షరాల్లోని శక్తి, వాటిల్లో కనబడే abstract picture అలాంటిది. వేణుగోపాల్ గారి భాష కాస్త ఇబ్బందిపెట్టిందనే చెప్పాలి. తెలుగులో ఇంగ్లీషు చదవటం మహా చిరాకైన పని. ఒకోచోట చదువుతున్నది తెలుగే అయినా మళ్ళి మళ్ళీ రెండు మూడుసార్లు చదివితే కానీ అర్ధం కాలేదు. ఒకోసారి తెలుగు తెలుగే అయినా కూడా అర్ధం కాదన్నమాట..అనుకున్నా! రచయిత తెలిపే భావం లోని లోతు అటువంటిది. ఇక చాలామార్లు కనబడే నాన్వెజ్, మందు కబుర్లయితే చదవటానికి ఇబ్బంది కలిగించాయి. ఆ రెంటిపై నాకున్న ఏహ్యభావం అలాంటిది. కానీ అవన్నీ ఒక మనిషి తాలూకూ చీకటి కోణాలను, కనబడని మనిషి లోపలి మనిషి తాలూకూ అనావిష్కృత పార్శ్వాలను చూపెట్టడానికి రచయిత చేసిన ప్రయత్నాలు కావచ్చు అనిపించింది. ఇంత స్వేచ్ఛగా, అవలీలగా, సులువుగా మనిషిలోని వ్యతిరేక అంతర్భగాన్ని(negative part) ఆవిష్కరించటమనేది తేలికైన పనేమీ కాదు.

నవల వెనుకవైపు అచ్చైన నవల గురించిన "మో"(వెగుంట మోహనప్రసాద్ గారి) కవిత:




నవలలోని కొన్ని వాక్యాలు:



"యే జ్ఞాపకమూ శాంతినివ్వదు. ఎప్పటి ఆనందాలో అన్నీ గాయాలై చురుక్కుమంటాయి. వాడిపోయిన మల్లెపూల పరిమళాంలా గతం హింసిస్తుంది. నిన్నటి వెన్నెల ఈరోజు తాజగా లేదేమని పిచ్చి ప్రశ్న మొలుస్తుంది. బొమ్మజెముడులాగ...!"

"శరోరంలో జరిగే రసాయన చర్యలకు ప్రతిచర్యలుగా మన జీవితం గడిచిపోతూంటుంది. ఈ భౌతిక రసాయన జీవితానికి అతీతంగా తీఅని దాహంతో నాలుక చాపుకుని ఓ నిస్పృహ ఎప్పుడూ తచ్చాడుతూ ఉంటుంది....ఆలోచన ఉన్న ప్రతి మనిషి వెనుక ఈ నిస్పృహ తప్పదని నా నమ్మకం..."

"ఓ మనిషి 'సంస్కారవంతుడూ' అంటే తనలో మొలిచిన ప్రతిభ్రష్ఠ ఆలోచనలన్నీ ఆచరణలో పెట్టనివాడు అని మాత్రమే. అంతేకాని వాడిలో భ్రష్ఠ ఆలోచనలు పుట్టవు అన్న గ్యారంటీ లేదు..."

"కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం నాకే పరిచయం లేని నా ప్రపంచపు అద్భుత నగరాల వీధుల్లో వసంతాలాడే, పువ్వులు చల్లే...పన్నీరు చిలికే...అపరిచిత ముఖ సహస్రాల్లో...ఎవర్దో తెలీని ఓ చిగురు దరహాసం మొలిచిన చైత్రముఖాన్ని వెదుకుతూ ఆ కేరింతల మధ్య ఆ అరుపుల్లో, అల్లర్లలో నా చెవికి మాత్రం వినిపించే నిట్టూర్పు కోసం...ఓ గాలి పిలుపు కోసం వెంపర్లాడుతున్న నేను.....తపిస్తూ నేను....."

"ఎందుకీ అసహనం? ఎన్ని అనుభవాల నాలుకల్తో నాకినా ఈ జీవితం రుచి తెలీటం లేదెందుకని? అదేనేమో...బహుశా నా తపనంతా !"

"మనిషి..మనిషికీ మధ్య గోడ ఎండుకు మొలుస్తుందో తెలీదు. లేచిన గోడెందుకు పడిపోతుందో తెలియదు. మనిషి నుంచి మనిషి ఎందుకు దాక్కుంటాడో తెలియదు..."

"జీవితం అన్ని పార్శ్వాల్లోనూ ఆనందాన్నే వెతకడమంత అవివేకం మరోటుండదేమో ! నిజం నిజం! ప్రతి ముఖమూ ప్రమోదమైతే, జీవితం అసలు ముఖాన్ని కోల్పోయి..డ్రామా కంపెనిల డప్పైపోతుంది....నేడే చూడండి నేడే చూడండనే బాకాల్తో...ప్రతిరోజూ ఆడే సరికొత్త డొక్కు నాటకం..."




"స్మృతి లోంచీ విస్మృతిలోకీ విస్మృతిలోంచీ చేతనలోకీ చేతనలోంచీ యాంత్రిక దుర్భరత్వంలోకీ దొళ్ళి దొళ్ళి మళ్ళీ ధనాలున పడిపోయా."



ఇలా రాసుకుపోతే ఎన్నున్నాయో...! అద్భుత రూపకాలంకారాలు....అస్పష్ట నైరూప్య చిత్రాలు...సృజనాత్మక భాషా ప్రయోగాలు...ఎన్నో చదవరులను అబ్బురపరుస్తాయి. తికమకపెడతాయి. కలవరపరుస్తాయి. చదివాకా చాలా సేపు ఆలోచింపజేస్తాయి. ముందుమాటలోని జంపాల చౌదరి గారి మాటల్లో "చాలా కాలంగా స్తబ్ధంగా ఉన్న తెలుగు నవలా కాసారంలో ఉన్నట్లుండి విరుచుకుపడుతున్న ఉత్తుంగతరంగాలు ఇతని నవలలు. ఈ చైతన్యం మిగతా రచయితలను కూడా కదిలిస్తుందని ఆశించటంలో అనౌచిత్యం లేదు." నేనీ పుస్తకం చదివిన మర్నాడే పుస్తకం.నెట్లో కాశీభట్ల వేణుగోపాల్ గారి మొదటి నవల 'నేనూ-చీకటి' గురించి సౌమ్యగారి పరిచయం కనబడటం నాకు విచిత్రంగా, సంతోషంగా అనిపించింది.




Saturday, June 25, 2011

ఎవరికెవరు ఈ లోకంలో

సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: వేటూరి
చిత్రం: సిరిసిరిమువ్వ

ముఖేశ్ పాడిన ఒక పాటలోని "ओरॆ ताल मिलॆ नदी के जल मॆं, नदी मिलॆ सागर मॆं, सागर मिलॆ कौन सि पानी कॊयी जानॆ ना" అనే వాక్యాలు ఈ పాటలోని చరణం ఒకేలా ఉంటాయి.

ఈ పాటని క్రింద లింక్ లో వినవచ్చు:

http://www.chimatamusic.com/playcmd.php?plist=4816


ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక
ఏదారెటు పోతుందో ఎవరినీ అడగక
ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక

వాన కురిసి కలిసేది వాగులో
వాగు వంక కలిసేది నదిలో
కదిలి కదిలి నదులన్నీ కలిసేది కడలిలో
కానీ ఆ కడలి కలిసేది ఎందులో...


Thursday, June 23, 2011

సత్యజిత్ రే సినిమాల కలక్షన్


భారత దేశం గర్వించదగ్గ దర్శకులలో ఒకరు సత్యజిత్ రే. ఆయన గురించి నాకు తెలిసినది చాలా తక్కువ తెలుసుకోవాల్సినది బోలెడు ఎక్కువ. తన సినిమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిని పొంది, సినిమారంగానికి తాను చేసిన సేవలకుభారత ప్రభుత్వం నుంచి 1985లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ నూ, 1992 లో Oscar award (for Lifetime achievement) ను అందుకున్నారు. అనారోగ్యంతో వెళ్లలేక మంచంపైన ఉన్న సత్యజిత్ రే కు ఆస్కార్ అవార్డ్ ను ఆయన అభిమాన నటీమణుల్లో ఒకరైన Audrey Hepburn (ఈవిడ నటించిన My fair lady సినిమా చాలా బావుంటుంది.) తీసుకువచ్చి కలకత్తాలో అందజేసారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన 'రే' కు ముఫ్ఫై రెండు నేషనల్ ఫిల్మ్ అవార్డు లతో పాటూ ఎన్నో ఇతర జాతీయ, అంతర్జాతీయ పురస్కార సత్కారాలు లభించాయి.

దూరదర్శన్ వారు నే స్కూల్లో ఉన్న రోజుల్లో కొందరు ప్రముఖ నటుల, దర్శకుల సినిమాలు లేట్ నైట్ వేసేవారు. అలాగ గురుదత్, కిషోర్ కుమార్, రాజ్ కపూర్, సత్యజిత్ రే, హౄషీకేశ్ ముఖర్జీ, బిమల్ రాయ్ మొదలైన వారి ఉత్తమ సినిమాలన్నీ చాలావరకు చూసే సదవకాశం ఇచ్చిన దూరదర్షన్ అంటే నాకు అభిమానం. సత్యజిత్ రే సినిమాలైన 'అపూ ట్రయాలజీ' మూడు సినిమాలు, దేవి, తీన్ కన్యా మొదలైనవి నాకు చూసిన గుర్తున్నాయి. ముఖ్యంగా "పథేర్ పాంచాలి" చాలా గుర్తు. ఆ సిన్మా గురించి నాన్న దగ్గర ఉన్న మేకింగ్ ఆఫ్ పథేర్ పాంచాలి పుస్తకం, నాన్న చెప్పిన కబుర్లు వినీ వినీ ఆ సినిమా చూడాలని చాలా కోరికగా ఉండేది. డిడీవాళ్ళు ఆ భాగ్యాన్ని కలిగించారు.


ఇప్పుడు రిలయన్స్ వారు సత్యజిత్ రే దర్శకత్వం వహించిన తొమ్మిది సినిమాల కలక్షన్ ను డీవిడీల రూపంలో ఇటీవలే రిలీజ్ చేసారు. తన అభిమాన దర్శకుల్లో ఒకరైన సత్యజిత్ రే సినిమాలు రిలీజ్ అయితే కొనకుండా ఉంటారా? ప్రకటన వచ్చింది మొదలు ఎదురు చూసీ చూసీ వెతుక్కుంటూ వెళ్ళి కొనుక్కు తెచ్చుకున్నారు మా నాన్న. ఆ ఆల్బంలో అపూ ట్రయాలజీ మూడూ సినిమాలు లేవు . సత్యజిత్ రే తీసిన ముఫ్ఫై ఏడు సినిమాల్లోని తొమ్మిది అత్యుత్తమ సినిమాలను అందులో పొందుపరిచారు. అవి ఏవంటే :
Chaarulata(1964), Goopy Gyne Gagha Byne(1969), Joi Baba Felunath(1978), Kapurush O Mahapurush(1965), Mahanagar(1963), nayak(1966), Shakha proshakha(1990), Teen kanya (1961), Devi (1960)




దర్శక నిర్మాతగానే కాక మంచి రచయితగా కూడా సత్యజిత్ రే ఖ్యాతిని పొందారు. ఆయన రాసిన short stories కూడా దూరదర్షన్ లో సీరియల్ గా వచ్చాయి . వారి "అవర్ ఫిల్మ్స్ థైర్ ఫిల్మ్స్" పుస్తకాన్ని మన బ్లాగ్మిత్రులు సౌమ్యగారు తెలుగులోకి అనువదించటం, ఇటీవలే ఆ పుస్తకావిష్కరణ సభ జరగటం బ్లాగ్మిత్రులకు తెలిసున్న సంగతే. సత్యజిత్ రే గురించిన విశేషాలు తెలుగులో ఇక్కడ చూడవచ్చు.

ఇలానే ఈమధ్యన రవీంద్రనాథ్ టాగూర్ కథలతో తయారుకాబడ్డ ఆరుసినిమాలను విడుదల చేసారు. ఇదే విధంగా పేరుపొందిన మన తెలుగు సినీ దర్శకనిర్మాతల సినిమాలను కూడా సంపుటి రూపంలో ఎవరైనా విడుదల చేయకూడదా? అనిపించింది నాకు. విడివిడి సీడీల,డీవిడీల రూపంలో ఈ మధ్యన పాత సినిమాలు బాగానే రిలీజ్ అయ్యాయి. అలా కాక కొన్ని సినిమాలను కలిపి సెట్ లాగ (నటుడు రాజేంద్రప్రసాద్ గారి సినిమాల సెట్ విడుదలైనట్లుగా) ఆదుర్తి సుబ్బారావు , బి.ఎన్.రెడ్డి, పి.పుల్లయ్య , బాపు , సింగీతం మొదలైన సినీ ప్రముఖులవి, ఇప్పటివరకూ అందుబాటులో లేని సినిమాలను సెట్ లాగ విడుదల చేస్తే ఎంత బావుంటుందో అనిపించింది.

Wednesday, June 22, 2011

జుట్టు ఊడకుండా ఉండేందుకు ఒక మంచి powder తయరీ:

అరే పొరటున వేరే బ్లాగ్ అనుకుని వెళ్లిపోకండి...ఇది తృష్ణ బ్లాగే ! చాలా రోజుల్నుంచీ ఈ టిప్ రాయాలని అనుకుంటూ బధ్ధకిస్తున్నాను. నాకు తెలిసీ ఒత్తైన జుట్టు ఇష్టపడనివాళ్ళు అరుదుగా కనిపిస్తారు. కానీ స్ట్రెస్ వల్లనో, కొన్ని మందుల వాడకం వల్లనో, హార్మోన్ల లోపాల వల్లనో చాల మందికి జుట్టు రాలిపోవటం, జడలు సన్నబడటం జరుగుతూ ఉంటుంది. కొందరి శిరోజాలు ఎటువంటి పోషణా తీసుకోకపోయినా అస్సలు ఊడవు. అది వారి వారి అదృష్టం. కొందరికి ఎంత సేవ చేసినా ఊడే జుట్టు ఊడుతూనే ఉంటుంది.

నా జడ వేయటానికి మా అమ్మకు కష్టమయ్యేంత ఒత్తైన పొడువైన జడ ఉండేది నాకు. అలాంటిది ఒకసారి టైఫాయిడ్ వచ్చినప్పుడు నా జడ బాగా సన్నబడిపోయింది. అప్పుడు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లో ఒకావిడ ఒక విధానం చెప్పారు. చాలా ఏళ్ళు నేను ఆవిడ చెప్పిన పొడాలు అన్నీ కలిపి జుట్టుకు వాడాను. జుట్టు అస్సలు ఊడేది కాదు. పెళ్ళయ్యాకా కుదరక మానేసాను. సిజేరియన్లు, అనారోగ్యాలు కారణాంగా మళ్ళీ జడ సన్నబడిపోయింది. ఈమధ్యనే మళ్ళీ ఆంటీ చెప్పిన పొడాలన్నీ కొనుక్కుని జుట్టుకి పెట్టడం మొదలెట్టాను. జుట్టు ఊడటం బాగా తగ్గింది. కాబట్టి ఎవరైనా అవసరం ఉన్నవాళ్లకు ఉపయోగపడుతుంది కదా అని ఈ టపాలో రాస్తున్నాను. కొంచెమ్ శ్రమ అనిపించినా క్రింద రాసిన విధంగా చేస్తే కొత్తగా పెరగకపోయినా, జుట్టు ఊడటం మాత్రం బాగా తగ్గుతుంది. నేనీ విధానం చెప్పిన చాలా మంది మంచి ప్రయోజనం కనబడిందనే చెప్పారు.

ముందుగా క్రింద రాసిన పొడులన్నీ కొని ఒక డబ్బాలో కలిపి పెట్టుకోవాలి:
ఉసిరి పొడెం : అర కేజీ
షీకాయ పొడెం: అర కేజీ
కుంకుడు పొడెం: అర కేజీ
మెంటి పొడెం: వంద గ్రాములు
గోరింటాకు: వంద గ్రాములు
వేప పొడెం: ఏభై గ్రాములు

ముందుగా ముక్కుకి గుడ్డ కట్టుకుని ( ఈ పొడాలు కలిపేప్పుడు ఘాటుకి బాగా తుమ్ములు వస్తాయి)ఈ ఆరు పొడాలనీ బాగా కలిపి ఒక డబ్బాలో పెట్టుకోవాలి. ఆరునెలలు దాకా ఈ పొడెం వాడచ్చు.

ఎలా వాడాలంటే:
* రేపు తలంటు పోసుకుంటాం అనగా ముందురోజు రాత్రి స్ట్రాంగ్ గా ఒక గ్లాసుడు టీ డికాక్షన్ తీసుకుని ఉంచాలి. ( ఇందుకోసం తాజ్మహల్, రెడ్లేబుల్ టీ పొడాలు కాకుండా టీ అమ్మే షాపుల్లో దొరికే మామూలు(తక్కువ రేటు) టీ పొడెం కొని వాడతాను నేను.)

* ఒక ఇనుప మూకుడు (ఇంట్లో లేకపోతే కొనుక్కోవాలి) లో ముండుకా కలుపుకున్న పైన చెప్పిన పొడెం నాలుగైదు చెంచాలు (మన జుట్టుకి సరిపోయేంత) తీశుకుని ఈ తీసుకున్న టీ డికాక్షన్ వేసి బాగా కలిపి మూత పెట్టాలి.


* మర్నాడు పొద్దున్నే తలకు ఈ ముద్దను పట్టించుకుని ఓ గంట సేపు ఉంచాలి.

* ఈ పొడిలో షీకాయ అవీ ఉన్నాయి కాబట్టి, జుట్టు కడిగేసుకున్నాకా తలంటుకి షంపూ ఎక్కువ వాడాల్సిన అవసరం ఉండదు. అయితే పొడెం బాగా వదిలేలా కడిక్కోవాలి. ఎక్కువ నీళ్ళు పడతాయి.

* తలంటు పోసుకోవటం అయిపోయాకా చివరిగా ఒక నిమ్మ చెక్క రసం తీసుకుని ఉంచుకుని, దానిని ఒక మగ్గు నీటిలో కలిపి తలంతా తడిసేలా నీళ్ళు పోసుకోవాలి. అంటే "లాస్ట్ వాష" అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ నీటితో కడగకూడదు తలను. దీనివల్ల జుట్టుకు మెరుపు వస్తుంది. పొడెం వాడకపోయినా మామూలుగా తలంటు పోసుకున్నాకా చివరలో ఇలా చేయచ్చు. తర్వాత తువ్వాలుతో పిడప చుట్టేసుకోవాలి.

ఇలా క్రమం తప్పకుండా వారానికి ఓసారి చేస్తే తేడా మీకే తెలుస్తుంది. నిజ్జంగా జుట్టు అస్సలు ఊడదు. నేను మధ్యలో చాలా ఏళ్ళు వాడటం మానేసాను కానీ నాకు ఈ టిప్ చెప్పిన ఆవిడ వయసు ఇప్పుడు అరవై ఐదు పైనే. ఇప్పటికీ ఆవిడ ఓపిగ్గా ఇలానే చేస్తారు. ఆవిడ జుట్టు కూడా ఇంత ఒత్తుగా, పొడవుగా ఆరోగ్యంగా ఉంది.

Monday, June 20, 2011

"స్నేహం" చిత్రం నుంచి రెండు మధురగీతాలు



బాపు సినిమా "స్నేహం" అనగానే మనకి "నీవుంటే వేరే కనులెందుకు" పాట గుర్తుకు వస్తుంది. కానీ అందులోని మరో రెండు పాటలు కూడా చాలా బాగుంటాయి. ఈ రెండు పాటల గురించి "తృష్ణ" లో రాసాను. కానీ అక్కడి పాట audio లింక్స్ పనిచేయట్లేదు.అందుకని ఈ టపా ద్వారా మళ్ళీ ఈ మధురమైన పాటలను గుర్తుచేసుకుంటున్నాను. "నవ్వు వచ్చిండంటే కిలకిల" పాత నాకు చాలా ఇష్టమైన పాటల్లో ఒకటి.


చిత్రం: స్నేహం(1977)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర
పాడినది: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం



నవ్వు వచ్చిందంటే కిలకిల
ఏడుపొచ్చిందంటె వల వల
గోదారి పారింది గల గల
దానిమిద నీరెండమిల మిల(ప)


నది నిండా నీళ్ళు ఉన్నా మనకెంత ప్రాప్తమన్నా(2)
కడవైతే కడివెడు నీళ్ళే గరిటైతే గరిటెడు నీళ్ళే(2)
ఎవరెంత చేసుకుంటే(2)
అంతే కాదా దక్కేది (నవ్వు వచ్చిందంటే..)


ధర తక్కువ బంగారానికి ధాటి ఎక్కువ
నడమంత్రపు అధికారానికి గోతులెక్కువ
కొత్త మతం పుచ్చుకుంటే గుర్తులెక్కువ
చేతకానమ్మకే చేష్టలెక్కువ
చెల్లని రూపాయికే గీతలెక్కువ (నవ్వువచ్చిందంటే..)


తమసొమ్ము సొమవారం ఒంటిపొద్దులుంటారు
మందిసొమ్ము మంగళవారం ముప్పొద్దుల తింటారు
పరులకింత పెట్టినదే(2)
పరలోకానికి పెట్టుబడి


నవ్వు వచ్చిందంటే కిలకిల
ఏడుపొచ్చిందంటె వల వల
గోదారి పారింది గల గల
కధలెన్నో చెప్పింది ఇల ఇల...








*** **** ***




పి.బి.శ్రీనివాస్ గళంలోని ఈ రెండో పాట చిన్ననాటి జ్ఞాపకాలను ఎన్నింటినో తట్టి లేపుతుంది. ఈ పాటను కూడా వినేయండి మరి..





ఎగరేసిన గాలిపటాలు
దొంగాట దాగుడుమూతలూ
గట్టుమీద పిచ్చుక గూళ్ళు
కాలువలో కాగితం పడవలూ
గోళీలు గోటీబిళ్ళ ఓడిపోతే పెట్టిన డిల్ల
చిన్ననాటి ఆనవాళ్ళు స్నేహంలో మైలురాళ్ళు


పడగొట్టిన మావిడికాయ
పొట్లంలో ఉప్పూకారం
తీర్ధంలో కొన్న బూర
కాయ్ రాజా కయ్ (4)


దసరాలో పువ్వుల బాణం
దీపావళి బాణా సంచా
చిన్నప్పటి ఆనందాలు
చిగురించిన మందారాలు


నులివెచ్చని భోగిమంటా
మోగించిన గుడిలో గంటా
వడపప్పు పానకాలు
పంచుకున్న కొబ్బరి ముక్క


గొడమీద రాసిన రాతలు
వీడిపోవు వేసిన బొమ్మలు
చెరిగిపోని జ్ఞాపకాలు
చిత్త,స్వాతి వానజల్లు


చిన్ననాటి ఆనవాళ్ళు స్నేహంలో మైలురాళ్ళు
చిన్నప్పటి ఆనందాలు చిగురించిన మందారాలు....!!

Sunday, June 19, 2011

అప్పు చేసి పప్పు కూడు(1958)


చిన్నప్పుడెప్పుడో ఒక్కసారి చూసినా కొన్ని సినిమాలు నిన్ననే చూసామేమో అన్నట్లుగా బాగా గుర్తుండిపోతాయి. అలాంటి వాటిల్లో ఒకటి "అప్పు చేసి పప్పు కూడు". నాకు చాలా ఇష్టమైన సినిమాల్లో ఒకటైన ఈ సినిమా గురించిన వ్యాసం "చిత్రమాలిక"లో  ...

link:

http://chitram.maalika.com/%e0%b0%b5%e0%b0%bf%e0%b0%9c%e0%b0%af-%e0%b0%b8%e0%b1%8c%e0%b0%b0%e0%b0%ad%e0%b0%be%e0%b0%b2%e0%b1%81-%e0%b0%85%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b1%81-%e0%b0%9a%e0%b1%87%e0%b0%b8%e0%b0%bf-%e0%b0%aa/

Saturday, June 18, 2011

బాగా నచ్చేసిన కొత్త పాట



ఈ పాట మొదటిసారి మొన్న బస్సులో వెళ్తూంటే విన్నా. తెలుగేనా? అని ఆశ్చర్యపోయా. "వెలిగినది" "వాన" "ఎద" "అణువు" తప్ప మిగిలిన అక్షరాలు అస్సలు అర్ధం కాలేదు. ఖచ్చితంగా ఏదో డబ్బింగ్ సినిమాలో పాట అని అర్ధమైపోయింది. మళ్ళీ ఎఫ్.ఎంలో వచ్చినప్పుడు అక్షరాలు గుర్తుంచుకుని ఏ సినిమానో వెతుకుదాం అనుకున్నా. నిన్న బయటకు వెళ్తుంటే ఈ పాట మళ్ళీ మొదలైంది. ఈసారి మొదటి లైను బాగా గుర్తుపట్టుకుని నెట్లో వెతకాలి అనుకున్నా. ఆ రాగం ఏమిటో గానీ సాహిత్యం తికమకగా ఉన్నా పాట ఎంత నచ్చేసిందో. కొన్ని పాటలు అలా ఏవో లోకాల్లోకి తీసుకుపోతాయి. ఆ పాట వెనుక ఉన్న రాగం మహిమ అది. ఇలాంటిదేదైనా పాత పాట ఉందేమో అనిపిస్తోంది కానీ గుర్తురావట్లే.


ఇంటికొచ్చాకా ఓ టివీఛానల్ లో "నాన్న" సినిమా ఏడ్ వస్తోంది. ఇదే పాట. అరే ఇందాకటి పాట...ఇందులోదా అనుకున్నా. అయితే అసలు పాట వెతుకుదాం అని నెట్లో వెతికితే తమిళ్ పాట దొరికింది. ఇదివరకూ ఇలానే కొన్ని డబ్బింగ్ పాటల సాహిత్యం నచ్చక అర్ధం కాకపోయినా ఒరిజినల్ తమిళ్ పాటలనే రికార్డ్ చేయించుకున్నా. డ్యూయెట్, చెలి, మెరుపుకలలు మొదలైన సినిమాల్లోని ఒరిజినల్ తమిళ్ సాంగ్సే నాకు చాలా ఇష్టం. భాష అర్ధం కాకపోయినా అలా వింటూనే ఉండాలి అనిపిస్తాయి ఆ పాటలు.


ఇంతకీ ఈ కొత్త సినిమా "నాన్న" తమిళ్ సినిమా "Deiva Thirumagan"కు డబ్బింగ్. ఆ పేరుకు అర్ధం "holy Son of God" ట.("wiki" చెప్పింది). తమిళ్ లో apt titles పెట్టి తెలుగులో ఇలా సినిమాపేర్లు మార్చేస్తారెందుకో నాకు అస్సలు అర్ధం కాని ప్రశ్న. మొన్నటి "వైశాలి" కూడా అంతే. టైటిల్ సంగతి ఎలా ఉన్నా రెహ్మాన్ మేనల్లుడైన ప్రకాష్ కుమార్ సంగీతం బానే ఉన్నట్లుంది. గతంలో ఇతను స్వరాలందించిన "ఉల్లాసంగా ఉత్సాహంగా" సినిమాలో "ప్రియతమా.." పాట కూడా నాకు బాగా నచ్చేది. అప్పట్లో "చిక్బుక్ చిక్బుక్ రైలే.." అనీ, "వేసేయాలి కన్నమంట....దొంగ దొంగ" అనీ పాడింది ఇతనే అని అన్నయ్య చెప్పినప్పుడు బాణీలు కట్టేంత పెద్దయిపోయాడా అనిఆశ్చర్యపోయా.


తెలుగు కన్నా తమిళ్ లోనే నాకు బాగా నచ్చేసిన "విరిసినదొక వానవిల్.." అనే ఈ తెలుగు పాట తమిళ్ ఒరిజినల్ ను "సైంధవి" గొంతులో వినేయండి :

Thursday, June 16, 2011

ऎ हॊंसला कैसॆ झुकॆ

పాట: "ఏ హోస్లా కైసే ఝుకే .."
సంగీతం : Salim-Sulaiman
సినిమా : Dor (2006) (
http://navatarangam.com/2009/10/dor/)
సాహిత్యం:Mir Ali Hussain
పాడినది : Salim Merchant, Shafqat A. Ali Khan



ऎ हॊंसला कैसॆ झुकॆ
ऎ आर्जू कैसॆ रुकॆ
मंजिल मुष्किल तो क्या
बुंद्ला साहिल तो क्या
तन्हा यॆ दिल तो क्या
हॊ...ओ..

राह पे कंटॆ बिखरॆ अ‍गर,
ऊस् पॆ तॊ फिर भी चलना ही है,
शाम छुपालॆ सूरज मगर,
रात को एक दिन ढलना ही हैं

ऋत ये टल जयेगी,
हिम्मत रंग लायॆगी,
सुबहा फिर आयॆगी
हॊ...ओ..

होगी हमें तॊ रेह्मत अ‍दा,
धूप कटॆगी साये तले,
अ‍पनी ख़ुदा से हैं ये दुवां,
मंज़िल ळ्गाले हुमकॊ गले

ज़ुर्रत सोबार रहॆ,
ऊंचा इक्रार रहे,
ज़िंदा हर प्यार रहें
हॊ...ओ..

Tuesday, June 14, 2011

The Kalam Effect : my years with the president



మా మొదటి మేరేజ్ డే కి "వింగ్స్ ఆఫ్ ఫైర్" పుస్తకం, దానితో పాటూ ఇంగ్లీషులో ఉన్న సంక్షిప్త ఆడియో కేసెట్ కొరియర్లో పంపారు నాన్న. ఆడియో ఆంగ్లంలో చదివింది 'గిరీష్ కర్నాడ్ '. ఆ పుస్తకం నాకు బాగా నచ్చేసింది. అప్పుడే కలాం గురించి బాగా తెలిసింది. "The kalam Effect" పుస్తకం చదివుతూంటే కలాం పట్ల admiration ఇంకా పెరుగుతుంది. ఇలాంటి నేతలు ఒకరిద్దరున్నా దేశం ఉన్నతమార్గంలో పయనిస్తుంది కాదా అనిపిస్తుంది.

వివిధ హోదాల్లో ముఫ్ఫై ఐదేళ్ళ సుదీర్ఘ ఐ.ఏ.ఎస్. సర్వీసు అనంతరం "పీ.మ.Nair" గారిని 2002లో రాష్ట్రపతి అబ్దుల్ కలాం తన సెక్రటరీగా ఎన్నుకున్నారు. ఆయన tenure లో ఉన్న ఐదేళ్ళు (2002-2007) పి.ఎం.నాయిర్ 'కలాం ' వద్ద న్నివర్సరీ గా పనిచేసారు. ఆ ఐదేళ్ళు తాను ఎంత ఆనందించారో, ఎన్ని విషయాలు తెలుసుకున్నారో, కలాం ఎంతటి మహోన్నతమైన వ్యక్తో తెలియపరుస్తారు నాయిర్. మనకు తెలియని ఎన్నో సంగతులను చెప్తూనే, కలాం వ్యక్తిత్వాన్ని ఒక కొత్త కోణంలోనూ చూపెడతారు నాయిర్. ఆయనకు కలాం పైన గల అవ్యాజమైన అభిమానాన్ని ప్రతి వాక్యంలోనూ కనబడుతుంది. అయితే, ఒక సెక్రటరీగా మెచ్చుకుంటూ రాసినది కాదు. కేవలం ఒక అద్భుతమైన వ్యక్తి క్రింద పనిచేసిన ఆ ఐదేళ్ళ అనుభవాలనూ ఒక చోట పెట్టలనే నిజాయితీతో కూడిన ప్రయత్నం ఇది...అంటారు నాయిర్.

తనను సెక్రటరి గా రమ్మని కబురు చేసింది మొదలు తానా నిర్ణయాన్ని ఒప్పుకోవటానికి పడిన తర్జనభర్జనలు, రాష్ట్రపతి భవనంలో అడుగుపెట్టింది మొదలు ఎదురైన అనుభవాలు, కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో కలాం చూపిన సమయస్ఫూర్తి, తన మైల్స్ కు తానే స్వయంగా జవాబివ్వటం, కలాం స్వయంగా రాసుకున్న కొన్ని ముఖ్యమైన ప్రసంగాల ప్రస్తావన... మొదలైన విషయాలన్నీ ఎంతో ఆసక్తికరంగా వివరించారు నాయిర్. వందల కొద్దీ అతిధులనూ, విందులనూ ఒక్క చేత్తో మేనేజ్ చేయగల ఆయన ఎంతో అద్భుతమైన హోస్ట్ అనీ, ఖాళీ సమయాల్లో వీణా వాదనతో కలాం రిలాక్స్ అయ్యేవారని కూడా చెప్తారు నాయిర్. వీణ వాయిస్తున్న కలాం ఫోటో ఎంత బావుందో ఈ పుస్తకంలో. అందుకే పూర్తవ్వకుండానే పరిచయం చేసేయాలనిపించింది.

ఒక చిన్న సంఘటన : ఒకసారి ఒక ముఖ్య సంప్రదింపు కోసం, బెంగుళూరు నుంచి ఒకప్పటి సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ వెంకటాచలయ్య గారిని పిలిపించారుట. మీటింగ్ అయిపోయాకా ఆయనను కలవటానికి లోపలికి వెళ్ళిన నాయిర్ తో వెంకటాచలయ్యగారు ఇలా అన్నరుట.." Mr Nair, this was an experience of a lifetime. I was sitting so close to Dr.Kalam and i could feel palpable sensations of godliness and divinity reverberating in me. I was nervous. He is really God's own man."


A fine tribute to a great man, by another ! అంటారు నాయిర్.


"..and iam lucky enough to write about this special book.." అంటాను నేను.
పుస్తకం వివరాలు ఇక్కడ: ౧౮౭౩
" href="http://www.harpercollins.co.in/BookDetail.asp?Book_Code=http://www.harpercollins.co.in/BookDetail.asp?Book_Code=౧౮౭౩

Monday, June 13, 2011

ప్రముఖ నాట్యాచార్యులు స్వర్గీయ డా.నటరాజ రామకృష్ణ గారి రేడియో ఇంటర్వ్యూ


మరుగున పడిన రెండువేల ఏళ్ళ చరిత్ర గల "ఆంధ్ర నాట్యాన్ని", ఏడొందలఏళ్ళ చరిత్ర గల కాకతీయులనాటి వీరరస ప్రధానమైన "పేరిణి శివతాండవాన్ని" వెలికి తీసి, మళ్లీప్రచారంలోకి తీసుకువచ్చి తిరిగి జీవం పోసిన ఘనత ఇటీవలే స్వర్గస్తులైన ప్రముఖ నాట్యా చార్యులు డా. నటరాజ రామకృష్ణ గారిది. ఇవే కాక మరుగున పడిన మరిన్ని ప్రాచీన నృత్యరీతులను మళ్ళీ ప్రచారంలోకి తీసుకురావటానికి ఆయన చేసిన కృషి అపూర్వమైనది. నృత్యం పట్ల అత్యంత అంకితభావం ఉన్న అంత గొప్ప కళాకారులు తెలుగువారవ్వటం మనకు గర్వకారణం.

1983లో ఉగాది నాడు వారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి "ప్రత్యేక జనరంజని" కార్యక్రమాన్ని రూపొందించే సదవకాశం మా నాన్నగారికి వచ్చింది. క్రితంవారంలో డా.రామకృష్ణ గారి ఆకస్మిక మృతి పట్ల విచారపడుతూ, ఆనాటి ఇంటర్వ్యూ విశేషాలను మా నాన్నగారు తలుచుకున్నారు. "ఆ రికార్డింగ్ ఉంది. కేసెట్ అన్నయ్యతో పంపిస్తాను నీ బ్లాగ్లో పెట్టమని" చెప్పారు నాన్న. ఆయన కోరిక మేరకు ఈ ఇంటర్వ్యును ఈ టపాలో పెడుతున్నాను. ఆసక్తి గలవారు క్రింద ఉన్న రెండు లింక్స్ లోనూ ఆనాటి కార్యక్రమాన్ని వినవచ్చు.

ఈ కార్యక్రమంలో రామకృష్ణ గారిని ఇంటర్వ్యూ చేసినది మా నాన్నగారు శ్రీ ఎస్.బి.శ్రీరామ్మూర్తిగారు. అసలు నాట్యం లో ఏమేమి ప్రధానపాత్ర వహిస్తాయి, భారత దేశంలోని రకరకాల నాట్య రీతులు మొదలైన విశేషాలను గురించి రామకృష్ణ గారు ఈ ఇంటర్వ్యూ లో చెప్పారు.


కార్యక్రమం నిడివి తగ్గించటం కోసం మధ్యలో వేసిన పాటలు చాలావరకూ ఎడిట్ చేసాను. క్రింద ఉన్న లింక్స్ లోని రెండు భాగాల్లో ఈ కార్యక్రమాన్ని వినవచ్చు..

1983 ఉగాదినాటి "ప్రత్యేక జనరంజని" మొదటి భాగం,రెండవ భాగం:

 

Friday, June 10, 2011

బాపు 'బొమ్మల కొలువు' చిత్రాలు - 4 (చివరి భాగం)



ఈ టపాలో కొన్ని కథలు, నవలలకు బాపు వేసిన బ్లాక్ & వైట్ ఒరిజినల్ బొమ్మలు, డాన్స్ ఫార్మ్స్, అందమైన రమణులు మొదలైనవి సర్దేసాను.

















"అమ్మకు జేజేలు" అని పెట్టిన ఈ బొమ్మలు నాకు చాలా నచ్చాయి.


ఈ బొమ్మ చాలా నచ్చింది.




ఒమర్ ఖయ్యం రుబాయీల తెలుగు అనువాదానికి బాపు వేసిన కవర్ పిక్చర్ ఇది.




ఈ ఆఖరి టపాతో నేను తీసుకున్న ఫోటోలు చాలా వరకూ చూడనివాళ్ళ కోసం పెట్టాను. నా ప్రయత్నం కొందరికన్నా ఆనందాన్ని కలిగిస్తే నాకు సంతోషం.