సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Sunday, June 26, 2011

కాశీభట్ల వేణుగోపాల్ గారి 'తపన'


1999 తానా - స్వాతి నవలల పోటీలో లక్షరూపాయిల బహుమతి పొందిన సృజనాత్మక నవల "తపన". కాశీభట్ల వేణుగోపాల్ గారి రెండవ నవల. ఇప్పటిదాకా నేను ఇలాంటి పుస్తకం చదవలేదు. ముఖ్యంగా తెలుగులో. చాలా రోజుల తరువాత పనులు చేస్కుంటూ, బస్సులో వెళ్తూ, అన్నంతింటూ, కూచుని, పడుకుని...ఒక్కరోజులోనే చదవటం పూర్తి చేసాను. చివరికెలా ముగిస్తారో చూడాలని ఆసక్తి....రచయిత వాడిన రూపకాలంకారాలపై మక్కువ...రచనలోని ఓ మనసు ఆవిష్కరిస్తున్న స్వేచ్ఛపై విభ్రాంతి...రచనలోని నైరూప్య చిత్రణల పట్ల ఆశ్చర్యం...Stream of conciousness technique(చైతన్య స్రవంతి పధ్ధతి) ని వాడిన విధనం...మధ్య మధ్య surrealistic touch(కూడా ఉందనే అనిపించింది)...అన్నీ...అన్నీ నన్ను అలా చదివేలా చేసాయి. ఒక్కమాటలో చెప్పలంటే ఇలాటి ఒక ప్రయోగాత్మక నవల తెలుగులో వచ్చినట్లు నాకయితే తెలీదు.


ఈ పుస్తకం గురించి జయప్రభగారి మాటలు...(నవలలో ఒన్ని ఒన్ని ఒన్ని)
* ఈ నవల్లో సుఖాన్నీ...శాంతినీ చూపించే హామీలేం లేవు. మగతకి, మెలకువకీ మధ్య మనిషిలో కల్లోల కథనం తప్ప !!"
* " 'తపన' నన్ను చిరాకు పెట్టింది. భయపెట్టింది. బాధపెట్టింది. విభ్రమ పెట్టింది. నా మనసుని కలత పెట్టింది."
* "మంచి నవలను ఎంచి మరీ అందించిన డాక్టర్ జంపాలని ఎంతైనా అభినందించవలసిందే.తపన నవల చదివిన వెంఠనే అత్యుత్కంఠతతో 'నేనూ-చీకటి' చదివేదాకా మరి నేను ఆగలేకపోయాను."


ఈ పుస్తకం మధ్యలో ఆపి మళ్ళీ తెరిచేదాకా మనసు నిలవదు. ఆ అక్షరాల్లోని శక్తి, వాటిల్లో కనబడే abstract picture అలాంటిది. వేణుగోపాల్ గారి భాష కాస్త ఇబ్బందిపెట్టిందనే చెప్పాలి. తెలుగులో ఇంగ్లీషు చదవటం మహా చిరాకైన పని. ఒకోచోట చదువుతున్నది తెలుగే అయినా మళ్ళి మళ్ళీ రెండు మూడుసార్లు చదివితే కానీ అర్ధం కాలేదు. ఒకోసారి తెలుగు తెలుగే అయినా కూడా అర్ధం కాదన్నమాట..అనుకున్నా! రచయిత తెలిపే భావం లోని లోతు అటువంటిది. ఇక చాలామార్లు కనబడే నాన్వెజ్, మందు కబుర్లయితే చదవటానికి ఇబ్బంది కలిగించాయి. ఆ రెంటిపై నాకున్న ఏహ్యభావం అలాంటిది. కానీ అవన్నీ ఒక మనిషి తాలూకూ చీకటి కోణాలను, కనబడని మనిషి లోపలి మనిషి తాలూకూ అనావిష్కృత పార్శ్వాలను చూపెట్టడానికి రచయిత చేసిన ప్రయత్నాలు కావచ్చు అనిపించింది. ఇంత స్వేచ్ఛగా, అవలీలగా, సులువుగా మనిషిలోని వ్యతిరేక అంతర్భగాన్ని(negative part) ఆవిష్కరించటమనేది తేలికైన పనేమీ కాదు.

నవల వెనుకవైపు అచ్చైన నవల గురించిన "మో"(వెగుంట మోహనప్రసాద్ గారి) కవిత:




నవలలోని కొన్ని వాక్యాలు:



"యే జ్ఞాపకమూ శాంతినివ్వదు. ఎప్పటి ఆనందాలో అన్నీ గాయాలై చురుక్కుమంటాయి. వాడిపోయిన మల్లెపూల పరిమళాంలా గతం హింసిస్తుంది. నిన్నటి వెన్నెల ఈరోజు తాజగా లేదేమని పిచ్చి ప్రశ్న మొలుస్తుంది. బొమ్మజెముడులాగ...!"

"శరోరంలో జరిగే రసాయన చర్యలకు ప్రతిచర్యలుగా మన జీవితం గడిచిపోతూంటుంది. ఈ భౌతిక రసాయన జీవితానికి అతీతంగా తీఅని దాహంతో నాలుక చాపుకుని ఓ నిస్పృహ ఎప్పుడూ తచ్చాడుతూ ఉంటుంది....ఆలోచన ఉన్న ప్రతి మనిషి వెనుక ఈ నిస్పృహ తప్పదని నా నమ్మకం..."

"ఓ మనిషి 'సంస్కారవంతుడూ' అంటే తనలో మొలిచిన ప్రతిభ్రష్ఠ ఆలోచనలన్నీ ఆచరణలో పెట్టనివాడు అని మాత్రమే. అంతేకాని వాడిలో భ్రష్ఠ ఆలోచనలు పుట్టవు అన్న గ్యారంటీ లేదు..."

"కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం నాకే పరిచయం లేని నా ప్రపంచపు అద్భుత నగరాల వీధుల్లో వసంతాలాడే, పువ్వులు చల్లే...పన్నీరు చిలికే...అపరిచిత ముఖ సహస్రాల్లో...ఎవర్దో తెలీని ఓ చిగురు దరహాసం మొలిచిన చైత్రముఖాన్ని వెదుకుతూ ఆ కేరింతల మధ్య ఆ అరుపుల్లో, అల్లర్లలో నా చెవికి మాత్రం వినిపించే నిట్టూర్పు కోసం...ఓ గాలి పిలుపు కోసం వెంపర్లాడుతున్న నేను.....తపిస్తూ నేను....."

"ఎందుకీ అసహనం? ఎన్ని అనుభవాల నాలుకల్తో నాకినా ఈ జీవితం రుచి తెలీటం లేదెందుకని? అదేనేమో...బహుశా నా తపనంతా !"

"మనిషి..మనిషికీ మధ్య గోడ ఎండుకు మొలుస్తుందో తెలీదు. లేచిన గోడెందుకు పడిపోతుందో తెలియదు. మనిషి నుంచి మనిషి ఎందుకు దాక్కుంటాడో తెలియదు..."

"జీవితం అన్ని పార్శ్వాల్లోనూ ఆనందాన్నే వెతకడమంత అవివేకం మరోటుండదేమో ! నిజం నిజం! ప్రతి ముఖమూ ప్రమోదమైతే, జీవితం అసలు ముఖాన్ని కోల్పోయి..డ్రామా కంపెనిల డప్పైపోతుంది....నేడే చూడండి నేడే చూడండనే బాకాల్తో...ప్రతిరోజూ ఆడే సరికొత్త డొక్కు నాటకం..."




"స్మృతి లోంచీ విస్మృతిలోకీ విస్మృతిలోంచీ చేతనలోకీ చేతనలోంచీ యాంత్రిక దుర్భరత్వంలోకీ దొళ్ళి దొళ్ళి మళ్ళీ ధనాలున పడిపోయా."



ఇలా రాసుకుపోతే ఎన్నున్నాయో...! అద్భుత రూపకాలంకారాలు....అస్పష్ట నైరూప్య చిత్రాలు...సృజనాత్మక భాషా ప్రయోగాలు...ఎన్నో చదవరులను అబ్బురపరుస్తాయి. తికమకపెడతాయి. కలవరపరుస్తాయి. చదివాకా చాలా సేపు ఆలోచింపజేస్తాయి. ముందుమాటలోని జంపాల చౌదరి గారి మాటల్లో "చాలా కాలంగా స్తబ్ధంగా ఉన్న తెలుగు నవలా కాసారంలో ఉన్నట్లుండి విరుచుకుపడుతున్న ఉత్తుంగతరంగాలు ఇతని నవలలు. ఈ చైతన్యం మిగతా రచయితలను కూడా కదిలిస్తుందని ఆశించటంలో అనౌచిత్యం లేదు." నేనీ పుస్తకం చదివిన మర్నాడే పుస్తకం.నెట్లో కాశీభట్ల వేణుగోపాల్ గారి మొదటి నవల 'నేనూ-చీకటి' గురించి సౌమ్యగారి పరిచయం కనబడటం నాకు విచిత్రంగా, సంతోషంగా అనిపించింది.




10 comments:

కొత్త పాళీ said...

ఈ నవల గురించి రాయడానికి ముందుకొచ్చారంటే మీరు సాహసవంతులే!
తానా పురస్కారం గెలిచిన కొత్తల్లో ఆంధ్రాలోనూ అమెరికాలోనూ చాలా సంచలనం రేపింది. చదివిన వారెవరైనా పూర్తిగా అభిమానించడమో, లేక పూర్తిగా ద్వేషించడమో తప్ప మధ్యే మార్గం లేదు.

ఈ నవలలో అతను కనబరిచిన శైలీ విన్యాసాలు, ప్రతిభ, మళ్ళి అతని రచనల్లో నాకు ఇంతవరకూ కనబళ్ళేదు. ఈ మధ్యన పాలపిట్ట మాసపత్రికలో కొత్త సీరియల్ మొదలైంది "నిషకం" అనే పేరిట. మొదటి సంచిక చదివాను. మళ్ళీ "తపన" పుడుతోంది.

Rajendra Devarapalli said...

ఈ నవల,నవలారచయిత రెండూ నాకు తెలీదు ఇప్పటివరకూ.అంటే నేను ఓ తెగచదివేస్తానని కాదు,కనీసం
తెలుసుకుంటాను.అలాంటిది పదేళ్ళపైబడ్ద ఈ నవల గురించి తెలీకపోవటం ఒకరకంగా నేనెక్కడున్నానో తెలుస్తుంది.
ఇక్కడ మీరు ఉదహరించిన వాక్యాలు వడ్డెర చండీదాస్ శైలీవిన్యాసాల్లా ఆనిపిస్తున్నాయి.మరిన్ని వివరాలు చెప్పగలరా?

తృష్ణ said...

@కొత్తపాళీ: కథా వస్తువు సంగతి పక్కన పెడితే రచనా శైలి, భాషా ప్రయోగాలూ నచ్చి చదవగానే రాయాలని రాసేసానండి. మీరలా అంటే నాకు భయమేస్తోంది..:) actually మాకు Literary criticism పేపర్లో stream of conciousness అనే narrative techniqueను బాగా వాడిన James joyce రాసిన 'Ulysess', Virginia woolf రాసిన 'To the lighthouse' ఉండేవి సిలబస్ లో. ఈ రచనాపధ్ధతినే 'ఇంటీరియర్ మొనోలాగ్' అని కూడా అంటారు. మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత ఆ narrative technique ఒక తెలుగు నవలలో కనబడేసరికీ చాలా ఆసక్తికరంగా అనిపించి మళ్ళీ పాత పుస్తకాలన్నీ మరోసారి తిరగేసాను. ఇక ఈ నవలను గురించిన మిగతా విషయాలేమీ నాకు తెలియవండీ.
వ్యాఖ్య కు ధన్యవాదాలు.

తృష్ణ said...

@రాజేంద్ర కుమార్ దేవరపల్లి: నాకు సాహిత్యం, నవలలతో పెద్దగా పరిచయమేమీ లేదండి. నాకు తెలిసినది చాల తక్కువ.నాకూ ఈ మధ్యనే ఈ పుస్తకం గురించి తెలిసింది.లిటిరేచర్ స్టూడెంట్ గా ఈ narrative technique గురించి అవగాహన ఉండటం వల్ల పుస్తకాన్ని ఆసక్తిగా చదవగలిగాను. వేణుగోపాల్ గారు కథలు కూడా రాసారని గూగులమ్మ తెలిపింది.దొరికితే చదవాలి. చండీదాస్ గారి "హిమజ్వాల" గురించి విన్నాను కానీ చదవలేదండి. అందువల్ల వారి శైలి నాకు తెలవదు.

ఇక ఈ పుస్తకం వాహినీ పబ్లికేషన్స్ వారిది. Hyd'vahini book trust'లో,విశాలాంధ్ర'లో,'నవోదయాలో'నూ కాపీలు దొరుకుతాయని పుస్తకంలో రాసారండి.
వ్యాఖ్యకు ధన్యవాదాలు.

రమణ said...

మంచి టపా. వేణుగోపాల్ గారి నవలల్లో కధనం అత్యద్బుతం. నేనూ-చీకటి ముందు మాటలో చెబుతారు. "అసలుసిసలైన ఆలోచనను ఏ భాషా పట్టుకోలేదు.ఆ ఆలోచన ఏ వ్యాకరణానికి లోబడి ఉండదు". మనసు లోతుల్లోని కల్లోలాన్ని, మన జీవితాల్లోని అసంగత్వాన్ని తన నవలల ద్వారా చెబుతారు. నేనూ-చీకటి లో ఒక చోట ఇలా ఉంటుంది. "ఎన్ని యుగాలు స్రవించినా ... ఎండిపోదీ కన్నీళ్ల ఊట. ఎంత వరదై పొంగినా.. తడవదీ బండ నాగరికత...". నాకు ఆయన ఏ రచన చదివినా ఈ లైన్ ఎప్పుడూ గుర్తుకు వస్తుంది. మనిషి స్వతహాగా ఏకాంతజీవి. బాధా జీవి. అద్వైత తాదాత్మ్యత అనేది అసంభవం.

Anonymous said...

tapana svAti mamtlIlO prachurimchinapuDu chadivAnu. A tarvAta eppuDO nEnU chIkaTI kUDA dAdApu adE TaimlO chadivAnu. adbhutamaina itivRttAlu, atyadbhutamaina Saili. chamDIdAs tarvAta chaitanya sravamtini amta amdamgA cheppimdi vENUyEnEmO ani nA vyaktigata abhiprayAm. chAlAmamdi ampaSayya navIn amTAru kAnI nAku ippaTikI navIn Saili aparipakvamgAnE anipistumdi. buchchibAbu, chamDIdAs tarvAta chaitanya sravamtini telugulO padunugA rAsimdi kASIbhaTla ani nA vyaktigata abhiprAyam. imka chamDIdAs amTE pichchE. bhAvajAlam, dRkpathAla rItyA chamDIdAs, kASIbhaTla iddaritOnU saripaDakapOyinA. nA prayAriTI viSwanAtha, chalam, chamDIdAs.

imka HimajWAla... A mamTala mamchu kattulatO gumDellO enni vamdala sArlu poDuchukunnA... komDala gumDelaku tala bAdukuni chachchipOvAlani gimjukunna gItAdEvi deyyam vadaladu...

pHaNIndra pi
ITIvI 2

తృష్ణ said...

@journodreams:
ఫణీంద్ర గారూ, మీ వ్యాఖ్యను తెలుగులోకి మార్చానండి:

తపన స్వాతి మంత్లీలో ప్రచురించినపుడు చదివాను. ఆ తర్వాత ఎప్పుడో నేనూ చీకటీ కూడా దాదాపు అదే టైంలో చదివాను. అద్భుతమైన ఇతివృత్తాలు, అత్యద్భుతమైన శైలి. చండీదాస్ తర్వాత చైతన్య స్రవంతిని అంత అందంగా చెప్పింది వేణూయేనేమో అని నా వ్యక్తిగత అభిప్రయాం. చాలామంది అంపశయ్య నవీన్ అంటారు కానీ నాకు ఇప్పటికీ నవీన్ శైలి అపరిపక్వంగానే అనిపిస్తుంది. బుచ్చిబాబు, చండీదాస్ తర్వాత చైతన్య స్రవంతిని తెలుగులో పదునుగా రాసింది కాశీభట్ల అని నా వ్యక్తిగత అభిప్రాయం. ఇంక చండీదాస్ అంటే పిచ్చే. భావజాలం, దృక్పథాల రీత్యా చండీదాస్, కాశీభట్ల ఇద్దరితోనూ సరిపడకపోయినా. నా ప్రయారిటీ విశ్వనాథ, చలం, చండీదాస్.

ఇంక హిమజ్వాల... ఆ మంటల మంచు కత్తులతో గుండెల్లో ఎన్ని వందల సార్లు పొడుచుకున్నా... కొండల గుండెలకు తల బాదుకుని చచ్చిపోవాలని గింజుకున్న గీతాదేవి దెయ్యం వదలదు...

ఫణీంద్ర పి
ఈటీవీ 2

తృష్ణ said...

ఫణీంద్ర గారూ,మీరు "కలం కలలు" బ్లాగరేనా? nice to see your comment. మీ వ్యాఖ్య చదివితే అర్జంట్ గా "హిమజ్వాల " కొనుక్కుని చదివెయ్యాలని ఉందండి...కొనాలి. ధన్యవాదాలు.

Anonymous said...

తృష్ణ గారూ... అసౌకర్యానికి క్షంతవ్యుడిని.

హిమ జ్వాల గురించి మాట్లాడాలంటే నాకు రోజులు చాలవు. 70లలోనే పాఠకులకు షాక్ థెరపీ చేసిన రచన అది.

కలం కలలు నావి కావండి. నేనింకా బ్లాగ్లోకంలో గ్రుడ్డు దశకి కూడా చేరుకోలేదు. వృత్తి రీత్యా జర్నలిస్టుని.

ఉన్నాయి, కొన్ని ఆలోచనలు... బ్లా-గుల తీర్చుకోడానికి. ఎప్పుడో.

ఫణీంద్ర పి
ఈటీవీ 2

తృష్ణ said...

ఫణీంద్ర గారూ, వివరణకు ధన్యవాదాలు. అయితే మీ నుంచి త్వరలో మంచి బ్లాగ్ కోసం ఎదురుచూస్తాము. Thanks for the visit.