సరిగ్గా ఒక సంవత్సరం క్రితం మే నెల్లో సాక్షి (ఆదివారం పుస్తకం)లో అచ్చయిన ఖదీర్ బాబు గారి కథ "రాత్రిపూట" చదివి చాలా నచ్చేసి, బ్లాగ్ లో రాసాను. అప్పటికి ఆయన పుస్తకాల్లో నేను చదివినది "మన్ చాహే గీత్ " ఒక్కటే. ఆ టపా కోసం ఖదీర్ బాబుగారి గురించి చేసిన గూగులింగ్ లో "దర్గామిట్ట కతలు" మొదలైన ఇతర పుస్తకాల గురించి తెలిసింది. తరువాత పేపరు లో ధారావాహికగా పడిన వారి "బాలీవుడ్ క్లాసిక్స్" కూడా పుస్తకరూపంలో వచ్చింది. అయితే నాకు ఎంత వెతికినా ఆయన పుస్తకాలు కొంటానికి దొరకలేదు. ఇటీవలి పుస్తకాల ఎగ్జిబిషన్ లో అనుకుంటా "దర్గామిట్ట కతలు" పుస్తకం దొరికింది. కొన్న ఇన్నాళ్ళకి నిన్న రాత్రి చదవటం పూర్తయ్యింది. ఇప్పటికి రాయటానికి కుదిరింది.
ఈ కథలు చదువుతూంటే రెండు పుస్తకాలు నాకు గుర్తుకొచ్చాయి. రహమతుల్లా గారి కథలపుస్తకం "బా", డా.సోమరాజు సుశీల గారి "ఇల్లేరమ్మ కతలు". "బా" కథల్లోని ఆర్తి, ఆవేదన; ఇల్లేరమ్మ కతల్లోని చలాకీతనం, సంతోషం కలిపితే "దర్గామిట్ట కతలు" అవుతాయి. నామిని గారి రచనా శైలి ని అనుకరించారా అనిపించింది కూడా. కానీ "కతల వెనుక కత" లో ఖదీర్ బాబు గారు చెప్పినదాని బట్టి చూస్తే నామినిగారి అనుగ్రహం వల్లనో, వారి "పచ్చనాకు సాక్షిగా" బాగా చదవటం వల్లనో ఆయన శైలిని అనుకరించి ఉండవచ్చు అనిపించింది. ఏ పుస్తకమైనా, అందులో ఎవరు ఎవరిని అనుకరించినా నాకు తప్పనిపించదు. ఎందుకంటే చదవతగ్గ పుస్తకాల్లో చూడవలసినది అనుకరణలను కాదు...రచయిత చెప్పదలచుకున్న అంశాన్ని అన్నది నా అభిప్రాయం. ఇక ఈ పుస్తకం చదుతున్నంత సేపు నేను లోనైన భావోద్వేగాలను మాటల్లో చెప్పలేను అనిపిస్తోంది. ఎందుకంటే ఇవి కేవలం కథలు కావు...ఒక జీవితకాలం గుర్తుండిపోయే మధురమైన బాల్యపు స్మృతులు. నాకు నా చిన్నతనాన్ని, ఆ మధురానుభూతులనూ మళ్ళీ గుర్తుచేసిన నవరసభరితమైన అనుభవాల గుళికలు.
ఈ కథల్లో ఖదీర్ బాబు గారు "అమ్మ" గురించి, "నాన్న" గురించి రాసిన ప్రతి ఘట్టంలోనూ తన తల్లిదండ్రులతో ఆయనకున్న అప్యాయతానురాగాలు కనిపిస్తాయి. "ప్రెతొక్కడూ వాళ్ళమ్మ గురించి, వాళ్ల నాన్న గురించి, చిన్నప్పుడు గురించి రాయాలబ్బా. అట్టా రాస్తేనే మనకు తెలియని జీవితాలు బయట పడతాయి. ఆ జీవితాల్లోని బ్యూటీ తెలుస్తుంది" అన్న నామినిగారి మాటలు, "బాధపడాలి, నలగాలి జీవిత రధచక్రాల క్రింద...కలం లోంచి నెత్తురు ఒలకాలంటే అక్షరాలా? పాండిత్యమా?...కాదు... సంవత్సరాల మూగ వేదన " అన్న చలం గారి మాటలు గుర్తుకొస్తాయి ఈ కథలు చదువుతూంటే. అసలు ఏ కథ గురించి ముందు రాయాలో అర్ధం కావట్లేదు. ముళ్ళపూడివారి ముందుమాటలో లాగ "మచ్చుకి నాలుక్కధలని మెచ్చుకుంటే మిగతా ఇరవయ్యీ...కోప్పడవు; నవ్వుతాయి". అన్ని కథలలో ఒకటో రెండో తప్ప ఏవీ బోరుకొట్టించవు. తెలుగు ప్రాంతాల్లో నివసించే ముస్లిం కుటుంబాల జీవితాలను, నెల గడపటానికి ఆర్ధికంగా ఇబ్బందులు పడే సాధారణ మనిషి జీవితాన్ని, బాల్యపు అమాయకత్వాన్ని, చిన్నతనపు మధుర స్మృతులను, సున్నితమైన మానవ సంబంధాలనూ అన్నింటినీ స్పృశిస్తాయి ఈ దర్గామిట్ట కతలు.
ముఖ్యంగా నా మనసుకు బాగా నచ్చిన కథల గురించి చెప్పాలంటే "నా పేరు పెట్టింది మీసాల సుబ్బారావు", "కసబ్ గల్లీలో సేమ్యాల ముగ్గు", "బులుగంటే బులుగా పలావెంకారెడ్డా", "నేను నేలలో మా అమ్మ బెంచిలోనూ", "ఇది మా నాయినిచ్చిన ఆస్తి", "మా అన్నేగాని చదివుంటే", "నేరేళ్ల మస్తాన్ సురేష్ నా దేవుడు", "పల్లెటూరి షాదీ జజ్జనక" మొదలైనవి నన్ను ఆకట్టేసుకున్నవి. ఇలా రాస్కుంటూ పోతే అన్ని కథల గురించీ రాయాల్సి వస్తుందేమో. ముఖ్యంగా "మా అమ్మ పూలయాపారం" కథ పూర్తయ్యేసరికీ నా కళ్ళలో నీటి చుక్క మెరిసింది. నన్ను ఏవో జ్ఞాపకాల్లోకి తీసుకుపోయింది. "है सब सॆ मधुर वॊ गीत जिन्हॆ हम दर्द कॆ सुर मॆ गातॆ हैं.."అని పాడినట్లుగా కొన్ని జ్ఞాపకాలు చేదైనవే అయినా గుర్తొస్తే మాత్రం మధురంగా ఉంటాయి.
మరి మీరూ ఈ పుస్తకం కొనేసుకుని కథలను చదివేసి మీ మీ బాల్య కౌమారాల్లోకి వెళ్పోయి అలా విహరించి రండి..
మరి మీరూ ఈ పుస్తకం కొనేసుకుని కథలను చదివేసి మీ మీ బాల్య కౌమారాల్లోకి వెళ్పోయి అలా విహరించి రండి..
8 comments:
అప్పట్లో ఆంధ్ర జ్యోతి వీక్లీ లో ఈ కధల సీరీస్ వచ్చేదండీ. కథల్లో నామిని అనుకరణ కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది.
@shankar.s:ఈ ముక్క రాయటం మర్చేపోయానండి..:)Thanks again. అయినా టపాలో రాసినట్లు నాదొకటే మాటండి, చదవతగ్గ పుస్తకాల్లో చూడవలసినది అనుకరణలను కాదు...రచయిత చెప్పదలచుకున్న అంశాన్ని అన్నది నా అభిప్రాయం. పుస్తకంలో కొన్ని కథలు చదివాకా నా కన్నుల్లో తడి, కొన్ని కథలు నన్ను నా చిన్నతనంలోకి తీసుకెళ్ళిన తీరూ ఈ టపాకు కారణభూతాలు.
ఈ పుస్తకం నా దగ్గరుంది. కానీ పోలేరమ్మబండ కధలు కోసం ఎంత ప్రయత్నించినా దొరకలేదండీ. ఈయన మీద నాకిదొక్కటే compalint. ఈయన పుస్తకాలు దొరకబుచ్చుకోవడం చాలా కష్టం.
నాకూ చాలా ఇష్టమైన కథలండీ ఖదీర్ బాబు గారి రెండు పుస్తకాలూనూ.. మీ పరిచయం చాలాబాగుంది. నామినిగారి పుస్తకాలకంటే ముందే చదవడం వలన శైలి అనుకరణ అన్న ఆలోచన కూడా రాలేదు నాకు అప్పట్లో చాలా నచ్చాయి. ఆరేళ్ళక్రితం గుంటూరు విశాలాంధ్రలో కొన్నట్లు గుర్తు నాకు ఈ రెండు పుస్తకాలు. తర్వాత ఎవరో జాతీయం చేసేశారు నాదగ్గరనుండి.
@ఇండియన్ మినర్వా: అవునండి.నాకూ దొరకలేదు. చాలా ఆలస్యంగా మీ బ్లాగ్ ఈ మధ్యనే చదివానండి. బావుంది.
@వేణూ శ్రీకాంత్: ఆరేళ్లక్రితమే చదువేసారా..? బావుంది. లేట్ గా అయినా మంచి పుస్తకం చదివినందుకు ఆనందంవేసింది నాకు.
మీరు ఇప్పటికైనా డిస్కవర్ చేసినందుకు సంతోషం :)
నేను ఎప్పుడో చాన్నాళ్ళ కిందట రాసుకున్న చిన్న రివ్యూ!
అవునండీ నేను చదివిన మొదటి పది తెలుగు పుస్తకాలలోనే ఉన్నాయి ఇవి. అప్పట్లో అదృష్టవశాత్తు దొరికాయి :-) తన గురించి ఏమీ తెలియకుండానే చదివాను.
రెండు నెలల క్రితం మా ఫ్రెండ్ కి పోలేరమ్మ బండ కధలు తీసుకోమంటే ఈ పుస్తకం తెచ్చాడు ..చాలా బాగుంది ..... మరీ ముఖ్యం గా ఒక కధ లో నాకు మూడు కోరికలంటూ ( జ్యామెట్రీ బాక్సు ఇంకా ఒక రెండు ) చెప్తుంటే అలా చిన్నప్పటికి తీసుకు వెళ్ళిపోతారు ......నేనూ మీ లాగే పోలేరమ్మ బండ కదల కోసం వెతికాను మొన్నటి దాకా......... కానీ ఈ మధ్యనే దొరికిందోచ్ హైదరాబాద్ లో.......
Post a Comment