సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, April 7, 2011

మూర్తిబాబయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు


ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న మూర్తిబాబయ్యకు నా బ్లాగ్ముఖంగా పుట్టినరోజు శుభాకాంక్షలు. కొన్ని చిత్రాలకు నేపథ్య సంగీతాన్ని, "మాయదారి కుటుంబం", "గమ్యం" మొదలైన చిత్రాలకి సంగీతాన్ని అందించిన ".ఎస్. మూర్తి"గారిని మేము ఆప్యాయంగా "మూర్తిబాబయ్య" అని పిలుచుకుంటాం.

కవి శ్రీ బాల గంగాధరతిలక్ గారి మేనల్లుడు తను. నాన్నకు చిరకాల మిత్రుడు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో యువవాణి విభాగం మొదలుపెట్టిన కొత్తలో నాన్న, మూర్తిబాబయ్య మరికొందరు మిత్రులు కలిసి "అపరంజి ఆర్ట్స్ అసోసియేషన్" పేరుతో ఎన్నో కార్యక్రమలు నిర్వహించారు. కార్యక్రమాలకు పాటలు రాసి, బాణీ కట్టి, గిటార్ వాయిస్తూ వాటిని తనే పాడేవాడు మూర్తిబాబయ్య.

గాయకుడు, గిటారిస్ట్, రచయిత, కంపోజర్ అయిన తను కథలు. కవితలు కూడా రాసేవాడు. గాయకుడు బాలు దగ్గర కొన్నేళ్ళు పనిచేసిన తరువాత సంగీతదర్శకుడు "ఎస్..రాజ్ కుమార్" వద్ద చాలా ఏళ్ళు కంపోజింగ్ గిటారిస్ట్ గా ఉన్నాడు మూర్తి బాబయ్య. ప్రస్తుతం హైదరాబాద్ లో స్థిరపడ్డారు. మల్టీ టాలెంటెడ్ అనిపించే మూర్తిబాబయ్య పలు కారణాలవల్ల తెర వెనుకనే ఉండిపోయాడు. సరైన అవకాశాలు వచ్చి ఉంటే తప్పకుండా ఎంతో పేరు వచ్చిఉండేదని నాకెప్పుడు అనిపిస్తూ ఉంటుంది. తను సుమారు అరవై దాకా రాసిన సినిమా పాటల్లో ఎన్నో పాపులర్ అయ్యాయి. వాటిలో నిన్నే ప్రేమిస్తా" సినిమాలో "ప్రేమా ఎందుకనీ", "సూర్యవంశం" సినిమాలో "కిలకిల నవ్వుల" పాటల సాహిత్యాలు బాగా ఇష్టం నాకు. తను రాసిన పాటల్లో కొన్నింటిని లింక్ లో మీరు వినవచ్చు: http://www.raaga.com/channels/telugu/lyricist/ES._Murthy.html


చాలా ఏళ్ళ క్రితం అంటే పాప్ సాంగ్స్, ప్రైవేట్ ఆల్బంస్ జనాలలో పాపులర్ కాని రోజుల్లో తను చేసిన "చిలిపి ఊహలు" అనే ప్రైవేట్ ఆల్బం నాకు బాగా ఇష్టమైనది. అందులోని ఎనిమిది పాటలు తనే రాసాడు. కేసెట్ కు సంగీతాన్ని బి.ఆర్.సురేష్ గారు అందించారు. పాటలు వీలైతే నా "సంగీతప్రియ" బ్లాగ్ ద్వారా వినిపించాలని నా కోరిక. ప్రైవేట్ ఆల్బంస్ కు ఎంతో ఆదరణ ఉన్న రోజుల్లో "సీడీ" రూపంలో ఆల్బం ను మళ్ళీ రిలీజ్ చెయ్యమని నేను కోరుతూ ఉంటాను.

మూర్తిబాబయ్యవాళ్ల అమ్మాయి "నిషి"(నిశాంతి) కూడా మధ్యనే తన మొదటి చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. "LBW"(Life before Wedding) అనే చిత్రంలో ఒక హీరోయిన్ పాత్ర ధరించింది. బొంబాయిలో 'ఫిల్మ్ డైరెక్షన్లో' కోర్సు పూర్తి చేసిన నిషికి సినిమా డైరెక్షన్ పట్ల ఎక్కువ మక్కువ. నాగేష్ కుకునూర్, ప్రకాష్ కోవెలమూడి వద్దా, మరికొందరి వద్దా అసిస్టెంట్ గా కూడా పని చేసింది. తను ఎన్నుకున్న ఫీల్డ్ లో నిషీ ఎన్నో విజయాల్ని చూడాలని ఆకాంక్షిస్తున్నాను.

మధ్యనే cinegoer.com అనే వెబ్సైట్ వారు మూర్తిబాబయ్యను ఇంటర్వ్యూ చేసారు. ఇంటర్వ్యూలో తన కెరీర్, రాసిన పాటల వివరాలు మొదలైనవాటి గురించి చెప్పాడు మూర్తిబాబయ్య. ఇంటర్వ్యూ తాలూకు యూట్యూబ్ లింక్స్ క్రింద ఉన్నాయి. ఆసక్తి గలవారు చూడవచ్చు.
Part-1)
http://www.youtube.com/watch?v=fjPuiMWpV8s&feature=player_embedded

Part-2)
http://www.youtube.com/watch?v=h3JCNaXs-Jc&feature=fvwrel

Part-3)
http://www.youtube.com/watch?v=BUPyF_5tYP4&feature=relmfu

Wednesday, April 6, 2011

సినీనటి 'సుజాత' జ్ఞాపకాలుగా ఈ రెండు పాటలు




ఇవాళ సాయంత్రం తెలిసిన నటి సుజాత మరణవార్త తరువాత తృష్ణ బ్లాగ్ లో ఆమె జ్ఞాపకార్థం తోచిన నాలుగుమాటలు రాసాను.(http://trishnaventa.blogspot.com/2011/04/blog-post_06.html )


ఆమె చిత్రాల్లోని పాటల్లో నాకు బాగా నచ్చిన రెండు పాటలు ఇక్కడ..


చిత్రం:గుప్పెడు మనసు
పాట: నేనా పాడానా పాట



చిత్రం:గోరింటాకు
పాట: కొమ్మ కొమ్మకో సన్నాయి



నాకిష్టమైన నటీమణుల్లో ఒకరు...సుజాత !



ఒక మంచి నవ్వు...కల్మషరహితమైన స్వచ్ఛమైన నవ్వు, సదాసీదా రూపం, ఆర్భాటం హంగులు లేని ప్రవర్తన, నటించే ప్రతి పాత్రలో లీనమైనట్లుండే సహజ నటన, ముఖ్యంగా మొహంలో అనితరసాధ్యమైన హావభావాలు..."సుజాత" అనగానే ఇవీ నాకు గుర్తుకొచ్చేవి. నాకు బాగా నచ్చే అతికొద్దిమంది నటీమణుల్లో ఒకరు సుజాత. అంత స్వచ్ఛమైన చిరునవ్వు కానీ అమాయకమైన నవ్వు చాలా అరుదుగా సినిమాల్లో కనిపిస్తుంది. సుజాత నటనలో నాకు బాగా నచ్చేది ఆ నవ్వే. ఆ తర్వాత భావగర్భితమైన ఆవిడ ముఖ కవళికలు. అవి ఎంత అనుభవపూర్వకంగా ఉంటాయంటే చెప్పలేను. పాత్రల్లో జీవించారు అని కొద్దిమంది నటననే చెప్పుకోగలం. అలాంటి కొద్దిమందిలో సుజాత ఒకరు.


సుజాత నటించిన ఏ సినిమా రిలీజైనా మా ఇంట్లో అందరం వెళ్ళేవాళ్ళం. నాకు హాల్లో చూసిన సినిమాల్లో బాగా గుర్తున్నవి గోరింటాకు, బంగారు కానుక, గుప్పెడు మనసు, ఏడంతస్తుల మేడ, సర్కస్ రాముడు. కొత్తవాటిల్లో కూడా తల్లి పాత్రలు అవీ చేసారీవిడ. వాటిల్లో గుర్తున్నవి సూత్రధారులు, చంటి, పెళ్ళి, మాధవయ్యగారి మనవడు, బాబా, శ్రీరామదాసు మొదలైనవి. సుజాత కమల్ హాసన్ తో ఎక్కువ సినిమాలు చేసారని విన్న గుర్తు.


ఇప్పుడంటే తెలుగు నటులే తెలుగు పలకలేక, తమ డబ్బింగ్ తాము చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు కానీ మాతృభాష మళయాళం అయినా సరే తెలుగు నేర్చుకుని తనకు తానే డబ్బింగ్ చెప్పుకునేవారు సుజాత. ముద్దు ముద్దుగా ఆవిడ పలికే కొన్ని తెలుగు మాటలు, డైలాగులు మళ్ళీ మళ్ళీ వినాలనిపించేవి. "బంగారు కానుక"(ఏ.ఎ.ఆర్,సుజాత, శ్రీదేవి) అనే సినిమా సంక్షిప్త శబ్ద చిత్రం డైలాగులు ఎందుకనో రికార్డ్ చేసారు ఇంట్లో. చిన్నప్పుడు చాలా సార్లు ఆ డైలాగులు వింటూ ఉండేదాన్ని. అందులో సుజాత అనే "తప్పమ్మా!" అనే మాట భలే గమ్మత్తుగా ఉండేది.


ఇందాకా టివీలో ఆవిడ మరణవార్త నన్నెంతో దిగ్భ్రాంతికి గురిచేసింది. వెంఠనే టివీ ఆపేసా. ఇక రాబోయే సంతాపాలు వినే శక్తి లేక. మొన్న రమణ గారు, నిన్న నూతన్ ప్రసాద్..ఇవాళ ఈవిడ..! దేవుడు ఇలా మంచివాళ్ళందర్నీ ఒకేసారి దగ్గరకు తీసుకెళ్ళిపోతున్నాడేమిటీ అనిపించింది. ఏదేమైనా మరణం అనివార్యం. సత్యం. సినీపరిశ్రమ ఒక ఉత్తమ నటిని కోల్పోయింది. ఆవిడ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాను.

Monday, April 4, 2011

ఉగాది శుభాకాంక్షలు


మరొక ఉదయం
మరొక రేపు
మరొక చిరునవ్వు
మరొక చైత్రం
మరొక సంవత్సరం...మళ్ళీ మొదలు !!

బ్లాగ్మిత్రులందరికీ..

Saturday, April 2, 2011

ధమాకా all around !!

ధమాకా all around !!

ఆటగాళ్ళ కళ్ళలో.. ఆనందభాష్పాలు...

బయటంతా ...టపాసులు...హంగామా..

ఇంట్లో జనాల సంబరాలు...
"It is the proudest moment of my life" అంటున్నాడు సచిన్...
బావుంది.

ఒప్పుకుంటాను.. నేను క్రికెట్ ఎంజాయ్ చెయ్యలేను. చూడను.
ఇవాళ మేచ్ కూడా చూసినది ఆఖరి పది నిమిషాలే.

కానీ నా చుట్టూరా ఉన్న మనుషుల ఆనందాన్ని చూసి సంబరపడతాను.
మనుషుల మొహాలలో ఆనందం నన్నెంతో ఉత్సాహపెడుతుంది..

భారత్ క్రికెట్ టీం కు అభినందనలు.

Wednesday, March 30, 2011

ధక్ ధక్...ధక్ ధక్

ధక్ ధక్...ధక్ ధక్.. అంటున్నాయి క్రికెట్ అభిమానుల గుండెలు !
బయట వాతావరణంతో పాటే మనుషులూ వేడిగా కనిపిస్తున్నారు...టెన్షన్ తో.
బయట ట్రాఫిక్ సర్దుమణిగిపోయింది.
రోడ్లన్నీ ఖాళీ ఖాళీగా ఉన్నాయి.
మొహాలీ స్టేడియం అంతా తళుకు తారలతో, హేమాహేమీలతో నిండిపోయింది.
అయితే నాకేం బాధ? మనకూ ఆట నాగలోకంతో సమానం కదా. ఎందుకంటే మనం క్రికెట్ చూట్టం మానేసి చాలా ఏళ్లైంది. (నా క్రికెట్ కథ ఆ మధ్యన ఐపిఎల్ టైంలో రాసిన టపా చూసినవాళ్ళెవరికైనా గుర్తుండే ఉండాలి.)
కథ అంతటితో ముగియలేదు. నా చూట్టూరా ఎంతో మంది క్రికెట్ అభిమానులున్నారు..:)
world cup మొదలైన దగ్గర నుంచీ నిన్న రాత్రి శ్రీలంక నెగ్గేవరకూ..." ఫోర్...అబ్బా ఔట్...సిక్సర్...గుడ్ షాట్..." అనే అరుపులతో చెవులు హోరెత్తిపోతున్నాయ్ !
వద్దనుకున్నా స్కోరు,హోరు చెవిన పడుతూనే ఉన్నాయి. ఇక ఎందుకైనా మంచిదని, నాకూ క్రికెట్ తెలుసు అని పాత స్మృతులు నెమరేసుకుంటూ ఓ కన్ను అటు వేసే ఉంచుతున్నా..!

*** *** ***
మొన్నటికి మొన్న ఆటోలో మేము ఆట గురించి మాట్లాడుకుంటూంటే ఆటోడ్రైవర్ కూడా మాట కలిపేసి మొత్తం టీములన్నీ ఎలా ఆడుతున్నారో ఓ చిన్న సమ్మరీ కూడా చెప్పేసాడు . " చూసావా అదీ స్పిరిట్ అంటే...ఈయన కూడా ఎంత బాగా ఫాలో అవుతున్నారో చూడు.." అని శ్రీవారంటే, "ఈ స్పిరిట్, ఎటేంటివ్ నెస్, యూనిటీ మిగిలిన అన్ని విషయాలలో కూడా ఉంటే బాగుండేది" అన్నాను నేను.

*** *** ***
టివీ ఛానల్స్ వాళ్ళకు మరో కొబ్బరికాయ దొరికింది. అన్నీటిలోనూ డిస్కషన్స్..కొన్నింటిలో జ్యోతిష్యులతో సైతం ప్రెడిక్షన్స్. ఇక గెలిస్తే మన ఇండియన్ టీమంత వారు లేరని ఎత్తేయటానికీ...ఓడితే, ఛీ.. వీళ్ళేప్పుడూ ఇంతే! అని తిట్టేసుకోవటానికీ మనం ఎప్పుడూ రెడీనే...

ఒక వేళ ఓడిపోతే... ఆటేమౌతుందోనన్న టెన్షన్ తో హర్ట్ ప్రాబ్లం వచ్చిన వీరాభిమానులకోసమో లేక స్టేడియంలో తొక్కిసలాటలో దెబ్బలు తగిలించుకున్న జనాలకోసమో క్రికెట్ టీంతో ఓదార్పు యత్ర చేయిస్తే బాగుంటుందేమో కదా..

గెలిస్తే...ఏ గొడవా లేదు. (పాకిస్తాన్ ఓడిపోయింది కాబట్టి ఫైనల్స్ లో మనం గెలవకపోయినా పర్లేదు అనేకునేవాళ్ళు  బోల్డుమంది. )

సో,  ఆ సంగతి తేలేదాకా... క్రికెట్ అభిమానుల గుండెలు..
ధక్ ధక్...ధక్ ధక్ !!

Monday, March 28, 2011

విశ్వనటచక్రవర్తి


తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగ్గ గొప్పనటుల్లో ఒకరు శ్రీ ఎస్.వి.రంగారావు గారు. సామర్ల వెంకట రంగారావు. నాకెంతో నచ్చే అభిమాననటుల్లో ఒకరు. గంభీరమైన కంఠం, చక్కని ఒడ్డు పొడుగు, శాంతవదనం, అద్భుతమైన నటన అన్నీ ఆయన పట్ల మన అభిమానాన్ని పెంచేస్తాయి. రచయిత సంజయ్ కిషోర్ గారి మాటల్లో "రంగారావు గారు ధరించని పాత్ర లేదు. అభినయించని రసము లేదు. హాస్య, శృంగార, రౌద్ర, భీభత్స, భయానక, అద్భుత, శాంత , కరుణ రసాలన్నింటిని మనకు చూపించారు". కీచకుడు, రావణుడు,కంసుడు, మాంత్రికుడు మొదలైన పాత్రలైనా, సాంఘిక పాత్రలైనా.. వేసిన ప్రతి పాత్రలో ఒదిగిపోయిన మహా నటుడు ఆయన.


ఇరవై రెండేళ్ళ వయసులో అరవై అయిదేళ్ల వృధ్ధుని పాత్ర ధరించి విమర్శకులను సైతం ఆశ్చర్యపరిచేసారుట రంగారావుగారు. నాటకాలలో నటించేప్పుడూ శ్రీ ఆదినారాయణారావు, శ్రీమతి అంజలీదేవి, శ్రీ రేలంగి వంటి వారి పరిచయ ప్రోత్సాహాలందాయి రంగారవుగారికి. ఇంగ్లీషులో కూడా మంచి ప్రవేశం ఉండటంతో షేక్స్పియర్ నాటకాలలోని ఎన్నో పాత్రలలో ఆయన నటించటం జరిగింది. వైవిధ్యమైన మానవ మనస్థత్వాలకు ప్రతీకలైన అటువంటి పాత్రలలో నటించటం వల్లనే ఎన్నో రకల హావభావాలను, మనస్థత్వాలనూ ఆయన అవగాహన చేస్కున్నారు.


మద్రాసులో స్కూలు చదువు, విశాఖలో ఇంటరు, కాకినాడలో బిఎస్సి పూర్తయ్యాకా ఎమ్మెస్సీ లో చేరాలనుకున్నారు రంగారవుగారు. ఒక నాటకంలో ఆయన విగ్రహం,ఒడ్డు పొడుగు అన్నీ చూసి ఒక ఫైర్ ఆఫీసరు గారు, ఫైర్ ఆఫీసర్ ఉద్యోగానికి అప్లై చేయాల్సిండిగా ఆయనకు సలహా ఇచ్చారు. అప్లై చేసాకా మద్రాసులో ఫైర్ ఆఫీసర్ శిక్షణ పొంది, బందర్లోనూ, విజయనగరం లోనూ, మరికొన్ని ప్రాంతాల్లోనూ పహైర్ ఆఫీసర్ గా ఉద్యోగనిర్వహణ చేసారు రంగారావుగారు. తీరుబడి ఎక్కువ ఉండటంతో నాటకాలను మాత్రం వదలలేదు ఆయన. ఒక బంధువు సహయంతో 1947లో "వరూధిని" అనే సినిమాకు కధానాయకుడిగా నటించారు. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆ తరువాత కొన్ని చిన్న పాటి వేషాలు వేసాకా "షావుకారు" సినిమాలో "సున్నపు రంగడి" పాత్ర లభించింది రంగారావుగారికి. ఆ తరువాత వచ్చిన "పాతాళభైరవి"లోని మాంత్రికుడి పాత్ర తో పెద్ద నటుల జాబితాలో చేరిపోయారు రంగారావు. హిందీలో కూడా ఆ పాత్రను వారే పోషించారు. తన పాత్రకు హిందీ డబ్బింగ్ తానే చెప్పుకుని హిందీ ప్రేక్షకులకూ చేరువయి మరికొన్ని హిందీ చిత్రాల్లో కూడా వేసారు. ఆ క్రమం లోనే కన్నడ, మళయాళ చిత్రాలో కూడా నటించారు ఆయన.


"పెళ్ళి చేసి చూడు" సినిమా తమిళ రీ-మేక్ విజయం సాధించటంతో కొన్ని తమిళ ప్రేక్షకులకు కూడా చేరువయ్యారు ఆయన. తెలుగు,తమిళ సినిమాల్లో ఎంతో ప్రఖ్యాతిని పొందారు. ఆయన కదలికలు, హావభావ ప్రకటన, డైలాగ్ చెప్పే విధానమ్, గంభీరమైన గొంతు ఆయనను ఒక అరుదైన నటుడిగా నిలబెట్టాయి. "మాయాబజార్" సినిమాను ఆయన నటన కోసమే చూసినవారు కోకొల్లలు. "మాయాబజార్" లో ఘటోత్కచుడు, "భక్త ప్రహ్లాద" లో హిరణ్య కశిపుడు పాత్ర, "శ్రీ కృష్ణలీలలు" "యశోధ కృష్ణ" లో కంసుడు, "పాండవ వనవాసం"లో దుర్యోధనుడు, "నర్తనశాల" లో కీచకుడు, "మోహినీ భస్మాసుర" లో సొగసైన ఆయన నాట్యం, "హరిశ్చంద్ర"లో హరిశ్చంద్ర మొదలైన పౌరాణిక పాత్రలన్నింటిలో ఆయన నటన నభూతో న భవిష్యతి. ఆ అభినయంలోని స్పష్టత, ఉచ్ఛారణలో వైవిధ్యము మరెవరికీ సాధ్యం కాదేమో. సాంఘిక చిత్రాల విషయానికి వస్తే "బంగారు పాప" ,""లక్ష్మీ నివాసం", "షావుకారు", కత్తుల రత్తయ్య", "తాతా మనవడు", "తోడి కోడళ్ళు", "గుండమ్మ కథ" మొదలైన ఎన్నో చిత్రాల్లో ఆయన నటన అద్భుతం. మరో మాట ఉండదు. ఆయన నటనను ఎంత పొగిడినా సూర్యుని ముందు దివిటీయే అంటారు రచయిత ఈ పుస్తకంలో.

(ఈ క్రింది ఫోటోలో కుడివైపు చివరలో గాయని జానకి గారు) "నమ్మినబంటు" చిత్రం స్పెయిన్ లోని శాన్సెబాస్టియన్ పిల్మ్ ఫెస్టివల్ కు పంపబడింది. మిగిలిన యూనిట్ తో బాటూ రంగారావు గారు కూడా వెళ్ళారు. అక్కడనుంచి జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ మొదలైన దేశాలలో పర్యటించారు వారు. తరువాత జకర్తా ఆఫ్రో ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో "నర్తనశాల" బృందం పాల్గొంది. ఆ చిత్రానికి గానూ అక్కడ "ఉత్తమ నటుడిగా" అవార్డ్ ను అంతవరకూ మరే భారతీయ నటుడికీ అందనిది. ఆంధ్రులకు ఆ గర్వాన్ని అందించిన ఘనత రంగారావు గారిదే.

ఇక స్వదేశంలో ఎన్నో ఊళ్ళలో రంగారావుగారికి ఘన సన్మానలు జరిగాయి. "విశ్వనట చక్రవర్తి", "నటసార్వభౌమ", "నటశేఖర", "నట సింహ" మొదలైన బిరుదులు ఆయన అందుకున్నారు. నర్తనశాలకూ, మరిన్ని తమిళ చిత్రాలలో నటనకు గానూ రాష్ట్రపతి పతకాలు కూడా లభించాయి. రంగారావుగారు దర్శకత్వం వహించిన "చదరంగం" చిత్రానికి 1967లో ఉత్తమ చిత్రంగా ద్వితీయ నంది, "బాంధవ్యాలు" చిత్రానికి 1968లో ప్రధమ నంది లభించాయి. ఇటువంటి ఉత్తమ నటుడికి భారత ప్రభుత్వం పద్మశ్రీనో, పద్మ విభూషణ్ నో ఇవ్వక పోవటం ప్రశ్నర్ధకం అంటారు రచయిత.


అరుదైన ఎన్నో మంచి ఫోటోలతో, ఆ మహా నటుడి జీవిత విశేషాలతో ఎంతో చక్కగా రచింపబడినది "విశ్వనట చక్రవర్తి". ఈ వంద పేజీల పుస్తకం చివరలో ఆయన నటించిన సినీగీతాలు కూడా అచ్చువేసారు. రంగారావు గారికి సంబంధించిన వివరాలను సేకరించటానికి మూడేళ్లు పట్టిందనీ, వారి బంధుమిత్రులందరినీ కలిసి వివరలు, ఫోటోలు సేకరించినట్లు, సినీ అభిమానులందరూ అందరూ తేలికగా చదువుకోవటనికి వీలుగా చిన్న పుస్తకన్నే అచ్చువేసినట్లు గా రచయిత తనమాటలో చెప్తారు.


ఎస్.వీ.ఆర్ కు ముళ్ళపూడివారు వేసిన అక్షర మాల:

క్లిష్టమైన పాత్రలో చతురంగారావు
దుష్టపాత్రలో క్రూరంగారావు
హడలగొట్టే భయంకరంగారావు
హాయిగొలిపే టింగురంగారావు
రొమాన్సు లో (చేయిస్తే) పూలరంగారావు
అక్షరాలా 'మధు' రంగారావు
నిర్మాతల కొంగు బంగారావు
స్వభావానికి ఉంగా రంగారావు
కథ నిర్బలం అయితే హావభావాలు పాత్రపరంగారావు
కళ్ళక్కట్టినట్టు కనబడేది ఉత్తి యశ్వీరంగారావు
ఆయన శైలి ఠీవీ అన్యులకు సులభంగారావు
ఒకోసారి డైలాగుల్లో మాత్రం యమకంగారంగారావు


ఈ పుస్తక ప్రచురణకు సినీనటి జయలలిత సహకారం అందించారుట. 1998 లో మొదటి ప్రచురణ పొందిన ఈ పుస్తకం అన్ని విశాలాంధ్ర బ్రాంచీలలోనూ, నవోదయా లోనూ దొరుకుతుంది.

మర్చిపోయా..


మైల్స్ చెక్ చేస్తూంటే ఇవాళ 28th అని గమనించా...ఎంత విచిత్రం? జీవితంలో మొదటిసారి నేను నా స్నేహితురాలి పుట్టినరోజు మర్చిపోయా. నిన్న27th న. ఏడెనిమిదేళ్ళ పాటు నా ప్రాణంలో ప్రాణం తను.తన పుట్టినరోజుకీ, తన పెళ్ళిరోజుకీ, ఫ్రెండ్షిప్ డేకీ ఎప్పుడు మర్చిపోకుండా గ్రీటింగ్స్ పంపుతాను. వారం క్రితం కూడా అనుకున్నా పోనీలే గ్రీటింగ్సే కదా మానేయటం ఎందుకు పంపిద్దామని.తను పలకరించినా పలకరించకపోయినా ఇన్నేళ్లలో ఎప్పుడు మర్చిపోలేదు. విడువకుండా ఎప్పటికప్పుడు పలకరిస్తూనే ఉన్నాను. నా ప్రయత్నలోపమేమీ లేదు అని నా అంతరాత్మకు నేను ధైర్యంగా చెప్పుకోగలగాలి కదా. తనూ రాసేది అప్పుడప్పుడు కుదిరినప్పుడు. టూర్స్ లో లేనప్పుడు..దేశంలో ఉన్నప్పుడు. చాలా పెద్ద ఉద్యోగభారం తనది మరి.


ఎందుకు తనని అనుకోవటం... ఈసారి తన పుట్టినరోజు మర్చిపోయి నేను కూడా పొరపాటు చేసాను కదా. ఏదన్నా మర్చిపోతే ఆ రోజంతా ఇవాళేదో ఉంది..ఉంది...అని గుర్తొస్తూ ఉంటుంది...అలాంటిది నిన్న అస్సలు గుర్తు రాలేదు. మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు ఆంటీని(వాళ్ళ అమ్మగారిని) చూడాలని ఎంత తహతహలాడానో..ఎన్నిసార్లు తనతో అన్నానో వాళ్ళింటికి వెళ్దాం వెళ్దాం అని. సమయాభావం వల్ల కుదరనే లేదు. నాకు ఆంటీ ఎంత ఇష్టమో.


అమ్మ అంటూనే ఉండేది "ఇప్పుడిలా ఊరేగుతున్నావు. రేపొద్దున్న పెళ్ళిళ్ళయి సంసారాలొచ్చాకా ఎవరికి వారేనే.." అని. అప్పుడు అమ్మ మీద బోలెడు కోపం వచ్చి దెబ్బలాడేసేదాన్ని. ఇప్పుడు గుర్తొస్తే నవ్వు వస్తోంది. కానీ.. బోలెడు మంది ఉన్నారు కదా జీవితాంతం కలిసుండే మిత్రులు. నాన్నకు కూడా ఉన్నారు. 45ఏళ్ల నాటి మిత్రులు. ఇప్పటికీ మాట్లాడతారు, వస్తారు. నాకూ ఉన్నారు ఎప్పటి స్నేహితులో.. రూప, మాధవీ, శారద, అపర్ణ, సుధ...అందరూ ఉద్యోగస్తులే. వీళ్ళెవరూ నన్ను వదిలెయ్యలేదే...నేను బధ్ధకించినా ఎప్పటికప్పుడు ఫోన్లు చేస్తూనే ఉంటారు. ఉద్యోగభారం వల్ల తనొక్కర్తే నెమ్మదిగా దూరమైపోయింది..


ఈ మధ్యన ఏదో కొత్త పాటలో విన్నా "నీతో స్నేహం నాకేంటి లాభం అనేంతలాగ మారింది లోకం... నువ్వూ మౌనం నేనూ మౌనం, మనసూ మనసూ మరింత దూరం.." అని. అలాగ లోకమే మారింది, తను కూడా మారింది. అంతే ! ఇక నేనే మారాలి.

sorry message రాద్దాం అనుకున్నా.. మళ్ళీ ఊరుకున్నా. కానీ.. ఇప్పుడే ఇక మనసాగలేదు. వెంఠనే లాగిన్ అయ్యి తనకి మైల్ రాసేసా. "సారీ మర్చిపోయాను. పు.రోజు బాగా జరిగిందని తలుస్తాను" అని.


ఎవరెలా మారినా నాకనవసరం. తను మారిపోయిందని నేనూ తనలానే ప్రవర్తిస్తే ఇక నాకూ తనకీ తేడా ఏం ఉంటుంది? నేనింతే. she is my friend for life. నా మనస్సాక్షికి నేను లోకువవ్వను. ఇప్పుడు హాయిగా ఉంది. ఆనందంగా ఉంది. ప్రశాంతంగా ఉంది.

Sunday, March 27, 2011

నచ్చిన రచయితలు: కోడూరి కౌసల్యాదేవి

తెలుగు సరిగ్గా చదవటం రాని మా తమ్ముడు ఒకసారి హాస్టల్ నుంచి రాసిన ఓ ఉత్తరంలో అక్కడి లైబ్రరీలో తను ఏకబిగిన చదివిన తెలుగు నవల గురించి గొప్పగా రాసాడు. ఉలుకూ పలుకూ లేకుండా నేను పుస్తకాలు చదువుతూంటే నన్ను ఆటపట్టించే పిల్లాడు ఒక నవలనీ, అందులోనూ తెలుగు నవలనీ చదివాడా అని ఆశ్చర్యం వేసింది. పైగా చాలా బాగుంది, ఇదివరకు చదవకపోతే చదువు అని. మా పిన్ని ఇంట్లో ఉందంటే తెచ్చుకుని చదివానా పుస్తకం. అదే కోడూరి కౌసల్యాదేవి రాసిన "శంకుతీర్థం". ఆ తర్వాతెప్పుడో కొనుక్కున్నా. తెలుగు నవలా సాహిత్యంతో పరిచయమున్నవారిలో "కోడూరి కౌసల్యాదేవి" పేరు తెలియని పాత తరం పాఠకులు అరుదుగా కనిపిస్తారు. "కోడూరి" ఇంటిపేరు "అరికెపూడి" అయ్యాకా రచనలపై అరికెపూడి(కోడూరి) కౌసల్యాదేవి అని వచ్చేది. అయినా "కోడూరి" పేరుతోనే పిలవటం అలవాటు మా ఇంట్లో. కోడూరి గారి నవలల్లో ముఖ్యంగా కనబడేవి బలమైన స్త్రీ పాత్రలు, వ్యక్తులను అధిగమించి జీవితాల్ని మార్చివేసే విధి విలాసాలు. చిత్రమైన విధి మనుషుల జీవితాల్ని ఎక్కడ నుంచి ఎక్కడికి తీసుకెళ్లగలదు, ఎన్ని మలుపులు తిప్పగలదు అనే సత్యమే కోడూరి నవలల్లో అంతర్లీనంగా కనబడే నేపథ్యం.


కోడూరి కౌసల్యాదేవి నవలల్లో నేను చదివినవాటిల్లో మొదటిది "శాంతినికేతన్". నాకూ, మా సమస్తబంధువర్గానికీ ఫేవొరేట్ నవలల్లో ఒకటి. పత్రికలో సీరియల్ గా పడినప్పుడు కట్ చేసి బైండ్ చేయించింది అమ్మ. నేను మళ్ళి మళ్ళీ చదివే పుస్తకాల్లో ఇదీ ఒకటి. అసలీ నవల చదివాకే రవీంద్రుని శాంతినికేతన్ చూడాలని బలమైన కోరిక. నవలలో వర్ణించిన కలకత్తాలోని ప్రదేశాలు అవీ మేము కలకత్తా వెళ్ళినప్పుడు చూస్తూంటే ఒక అవ్యక్తానందం. దక్షిణేశ్వర్లో అయితే ఇక్కడే కదా 'రాజా' మొదటిసారి 'శాంతిని చూసింది అనుకుంటూ...చూసాను. ఈ కథను సినిమాగా తియ్యాలని అనుకున్నారుట కానీ ఎందువల్లో కుదరలేదు. అదే మంచిదయ్యింది అనిపిస్తుంది నాకు. వచ్చి ఉంటే పూర్తిగా ఖూనీ అయ్యుండేది. కథలోని పాత్రలకు సినిమాలో సరిపోయే హీరోయిన్, హీరో అప్పట్లో దొరికేవారేమో కానీ ఇప్పుడిక అసాధ్యం. అందులో ఐడియల్ మాన్ అనిపించే "రాజా" పాత్రకు ఇప్పుడు సరిపోయే హీరోలెవరూ లేరు. నాకు చాలా చాలా ఇష్టమైన పాత్ర. అసలలాటి ఉత్తమ వ్యక్తులు నవలల్లోనే ఎందుకు ఉంటారు అనుకునేదాన్ని.


ఈ కథను "టివీ సీరియల్ "గా చేసే సాహసం చేసారు. కానీ నవల బాగా నెమరేసేసుకున్న మా సమస్తబంధువర్గానికీ అది అస్సలు నచ్చలేదు. ఒకటి రెండు ఎపిసోడ్స్ తరువాత చూడటం మానేసాము. పూర్తిగా టివీలో వచ్చిందో లేదో తెలియదు. అసలు ఊహల్లో ఉన్న పాత్రలలో తెరపై మరో వ్యక్తులను చూడటానికి మనసు అంగీకరించదు ఎందువల్లో. నాయికానాయకులు "అలా మొదలైంది" సినిమాలోలాగ చివరిదాకా కలవలేరు పాపం. వారిద్దరు ఒకరికోసం ఒకరు అన్న సంగతి అర్ధమయ్యాకా కూడా పరిస్థితులు ఇద్దరినీ విడదీసేస్తాయి. ముఖ్యంగా శాంతి పాత్ర స్వభావంలో వచ్చే పరిపక్వత ఎంతో హృద్యంగా ఉంటుంది. శాంతిని కానీ, రాజాని కాని, పద్మ-శ్రీధర్ లను కానీ ప్రేమించకుండా మనం అసలు ఉండలేము. ఉమ్మడికుటుంబం లోని అనురాగాల్ని, మనుషుల్లోని ప్రేమతత్వాన్నీ ప్రతిబింబించే ఈ నవలలోని ప్రతి పాత్రా గుర్తుండిపోతుంది.


కోడూరి గారి నవలలు "చక్రభ్రమణం", "శంఖుతీర్థం", "ప్రేమ్ నగర్" మూడూ సినిమాలుగా వచ్చాయి. చాలా వరకు సినిమాలుగా మారిన నవలలన్నీ పుస్తకరూపంలోనే మనల్ని ఎక్కువగా అలరిస్తాయి. "చక్రభ్రమణం" "డాక్టర్ చక్రవర్తి" పేరుతో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. అన్యోన్యత, అనుబంధం, అనుమానాలు, అపార్ధాలు, స్నేహం మొదలైన విషయాల చుట్టు ఈ కథ తిరుగుతుంది. సినిమా కథలో కొన్ని మార్పులు చేసారు. ఈ సినిమాలోని "మనసున మనసై" "నీవు లేక వీణ" "పాడమని నన్నడగవలెనా" పాటలు ఎంత హిట్టో. ఎందుకో సినిమా కన్నా నవలే బాగుందని నాకనిపిస్తుంది.


"ప్రేమ్ నగర్" సినిమా కూడా హిట్టాయి ఏ.ఎన్.ఆర్ కి పేరు తెస్తే, రామానాయుడుగారికి కూడా ఎన్నో ఇబ్బందులు తీర్చింది. ఆయన కెరీర్ లో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పచ్చు. నవల విషాదాంతం. కథ రైట్స్ కొనుక్కుని ఇందులోనూ కొన్ని మార్పులు చేసారని అంటారు. సినిమా సుఖాంతమనుకుంటా. నేనీ సినిమా చూడలేదు. విషాదాంతం అని కొనుక్కోలేదు . "శంఖుతీర్థం" సినిమాను కృష్ణ, జయప్రదలతో విజయ నిర్మలగారు డైరెక్ట్ చేసారు. ఈ సినిమా కూడా నేను చూడలేదు. కాబట్టి ఎలా తీసారో తెలియదు. పెద్దగా ఆడలేదనుకుంటా. నవల మాత్రం చాలా బాగుంటుంది. చివరలో వరద రావటం అదీ మరీ సినిమాలాగ అనిపించినా మొదటినుంచీ పాత్రలు,కథనం అన్నీ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా వందన పాత్ర గుర్తుండిపోతుంది. ఓ కుటుంబం తాలూకూ జీవితం, అన్నాచెల్లెళ్ళ తాలూకు వారసులు, వారి చూట్టూ గ్రామీణ వాతావరణం, వారి జీవన విధానంతో నిండిన కథ ఇది. వల్లమాలిన స్వార్ధం ఎప్పుడూ మనిషి పతనానికే దారి తీస్తుంది్; నిస్వార్ధం మంచిని, మంచితనం విచక్షణను పెంచుతాయి అన్నది నవల మనకిచ్చే సందేశం. చదివిన చాలా రోజులవరకూ వెంటాడే శక్తివంతమైన కథ ఇది.


"చక్రభ్రమణం" నవల చాలా బావుంటుంది. కానీ కొంతవరకే నాకు నచ్చుతుంది. అత్యంత ప్రేమగా ఉండే ఓ భర్త ఎవరో రాసిన ఆకాశరామన్న ఉత్తరం వల్లో, మరో కారణం వల్లో భార్యను అనుమానించటం అనేది నాకు అస్సలు మింగుడుపడదు. నమ్మకం ఉన్న చోట అనుమానం రానే కూడదు. అనుమానం మొదలైతే అది ప్రేమే కాదన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. అందువల్ల ఆ నవల కొనుక్కోలేదు. మా పిన్ని కూడా ఇటీవలే నా దగ్గర లేని మరికొన్ని కోడూరి నవలలు కొన్నానని చెప్పింది. ఎలా ఉన్నాయో చదివాలి. ఆమధ్యన "నెమలికనులు", "శిలలు-శిల్పాలు", ఇంకా కోడూరి గారి "కథల పుస్తకం" కొన్నాను. "నెమలుకనులు" నవలలో నాయిక దీప తన ఆదర్శాలను వివాహం తరువాత కూడా ఎలా కాపాడుకోగలిగింది అన్నది ఆసక్తికరంగా రచించారు కౌసల్యాదేవి గారు.


"శిలలు-శిల్పాలు" నవల చాలా నచ్చింది నాకు. ఒక పురుషుడు ఉన్నతుడుగా మారాలన్నా, అధముడు కావాలన్నా అది స్త్రీ చేతిలోనే ఉంటుంది. శిల్పి శిల్పాలను మలిచినట్లు పురుషుడి వ్యక్తిత్వాన్ని మలిచే శక్తి స్త్రీ పెంపకానికి ఉంది అనే నేపథ్యం ఈ నవలది.


కౌసల్యాదేవి కథల పుస్తకం సగమే చదివాను. ఇంకా కొన్ని కథలు చదవాల్సి ఉంది..:)

కోడూరి కౌసల్యాదేవి ఇతర రచనల జాబితా:

Saturday, March 26, 2011

పొద్దుటి వర్షం...వాకింగ్ కబుర్లు

(వర్షంలో తడిసిన మా గులాబి. )

ఇవాళ పొద్దున్నుంచీ వాతావరణం ఎంత బావుందో. మబ్బుల చాటున దాక్కుని సూరీడసలు బయటకు రానేలేదు. "వాకింగ్ నుంచి వచ్చావా లేదా? ఇక్కడ పెద్దవాన పడుతోంది...మీకూ పడుతోందా? ఇల్లు చేరావో లేదో.. తడుస్తున్నావేమో అని..." అంటూ అమ్మ ఫోన్ చేసింది కూడా. అప్పటికింకా మా ఇంటి దగ్గర వాన లేదు. ఈ వాతావరణంలో లాంగ్ రైడ్ కి వెళ్తే భలే ఉంటుంది అనుకుంటూండగానే పెద్ద పెట్టున వర్షం. ఎండాకాలంలో ఈ వానలేంటో. సుమారు రెండు మూడు వారాలక్రితం పొద్దున్నే ఇంతకంటే పేద్ద వాన చాలాసేపు పడింది. మావిడి పూత చాలావరకూ అప్పుడే రాలిపోయింది. ఈసారి రేట్లు ఆకాశానికి అంటుతాయి అనుకున్నాం. ఇక్కడింకా మావిడికాయ కనపడ్డంలేదు. మొన్న గుడివాడ పెళ్ళిలో పెళ్ళివారు కొత్తావకాయ కూడా తినిపించేసారు. ఎంత బావుందో...

కురుస్తున్న వర్షం..కనిపిస్తోందా?

వర్షంతో తడిసిన రోడ్డు..
*** *** ***


రోజూ వాకింక్ కు వెళ్తూ అనుకుంటాను ఈ వాతావరణం గురించి రాయాలి అని. దాదాపు కొన్ని నెలల తరువాత ఈ ఇల్లు మారాకా వాకింగ్ మొదలెట్టాను. అసలు మొదలుపెట్టింది పదిహేనేళ్ల క్రితమే. కానీ వరుసగా ఎప్పుడూ కొనసాగించలేదు. ఆర్నెల్లు నడిస్తే ఎనిమిది నెలలు అటకెక్కించేస్తూ ఉంటాను వాకింగ్ ని. కాస్త శరీరం కంట్రోల్లోకి వచ్చేసి, అందరూ మన వాకింగ్ ఎఫెక్ట్ ని గుర్తించేస్తూండేసరికీ బధ్ధకం వచ్చేస్తుంది. ప్రస్తుతం ఈ చుట్టుపక్కల వాతావరణం చాలా బాగుంది కాబట్టి ఈసారి ఎక్కువ రోజులే నడక కొనసాగవచ్చు.

రోజూ నే వాకింగ్ కి వెళ్ళే సమయానికి ఇంకా సూరీడు రాడు. వెనక్కి వచ్చే సమయానికి గుండ్రని లేత ఆరెంజ్ బంతిలా, పొడుగాటి వీధి చివ్వరికి, కుడి ఎడమల ఇళ్ళు కలుస్తున్నట్లుండే చోట, మధ్యనుంచి బొట్టులా పైకి వస్తూ ఉంటాడు. రోజూ అదే దృశ్యం. పొడుగాటి వీధి కూడా ప్రశాంతంగా విశాలమైన మంచి రోడ్డుతో(ఈకాలంలో గతుకులు లేని మంచి రోడ్లు చాలా అరుదుగా ఉన్నాయి కదా) నడవటానికి అనువుగా ఉంటుంది. పైగా ఇక్కడ అన్ని ఇళ్ళలో పెద్ద పెద్ద చెట్లు ఆకుపచ్చటి ఆనందాన్ని పంచుతూ ఉంటాయి. దారి పొడుగునా అన్ని అపార్ట్మెంట్ల ముందర, ఇళ్ళ ముందర ఫెన్సింగ్ ఉండి, అందులో మొక్కలు పెంచారు. ఇక సొంత ఇళ్ళ వాళ్ళైతే మరీ చూసే కళ్ళు కుళ్ళుకునేలా మొక్కలు పెంచేసుకున్నారు. అవును మరి. నేల మీద సొంత ఇల్లు.. ఇంటి పెరడులో కావాల్సినన్ని మొక్కలు పెంచుకునే అదృష్టం ఎంతమందికి ఉంటుంది? ఎంత పెద్ద సొంత అపార్ట్మెంట్ కొనుక్కున్నా ఇలాటి ఒక బుల్లి ఇల్లుకి సాటి రాదు కదా.

ఇక దారి పొడుగునా కనబడే ఇళ్ళలోని చెట్లు, మొక్కల గురించి అందరికీ చెప్పాలని ఎంత ఆరాటమో నాకు. ఒక ఇంట్లో ఆకు సంపెంగ చెట్టు. ఏమిటో రోజూ పూలు పండిపోయి కనిపిస్తాయి. వాళ్ళకు ఈ పూలు పెట్టుకుంటారని తెలీదో ఏమో. ఒక ఇంటి ముందర కాస్త జాగా ఉంచి, లాన్ అంచున, పొడుగ్గా సిమెంట్ తొట్టేలాగ కట్టేసారు. అందులో తెలుపు,లేవెండర్ కలర్స్ లో చిన్న చిన్న పూలు. అక్కడక్కడా ఎర్రవి కూడా. ఆ ఇల్లు భలే ఉంటుంది. వీధి చివరికి ఉండే మరో ఇల్లు నా ఫేవొరేట్ ఇల్లు. కానీ అందులో ఒక ఐస్క్రీమ్ తయారు చేసే కంపెనీ ఉంది ఇప్పుడు. చిన్న పెంకుటిల్లు ఓ పక్కగా ఉంటుంది. ఎల్ షేప్ లో పెరడు. చుట్టూ చిన్న పిట్టగోడ. దానికి అల్లుకుని ఉన్న ఆరెంజ్, లేవెండర్,యెల్లో కలర్స్లో పువ్వులున్న క్రీపర్స్. గోడ మీంచి లోపలి చెట్లన్నీ కనబడుతూ ఉంటాయి. అందులో ఐదు కొబ్బరి చెట్లు, ఒక బాదం చెట్టు, మావిడి, అరటి, నిమ్మ, వేప, కర్వేప చెట్లు, మల్లె పొదలు, గులాబీ వృక్షాలు(మొక్క కంటే చాలా పెద్దవి మరి), గేట్ కి అటు పక్కన సన్నజాజి పందిరి, ఇంకా ఏవో పూల క్రీపర్స్ ఉంటాయి. పెరట్లోనే ఓ పక్కకి రెండు మూడు గదులు ఉన్నాయి. షెడ్డుల్లాగ. ఎవరిదో.. అమ్మేసారో, అద్దెకు ఇచ్చారో తెలీదు కానీ భలే అందంగా ఉంటుంది. ఆ ఇల్లు చూడ్డం కోసమన్నా వాకింగ్ కి వెళ్ళాలనిపిస్తుంది.

మరో ఇంట్లో నేరేడు చెట్టు. ఇది నన్ను బోలెడు జ్ఞాపకాల్లోకి తీసుకుపోతుంది. రాజమండ్రిలో మా తాతగారి ఇంటి పక్కన ఇంట్లో ఉండేది ఒక పేద్ద నేరేడు చెట్టు. వెళ్ళినప్పుడల్లా మా పిల్లల పటాలమంతా ఆ కాయలు కొట్టే పనిమీదే ఉండేవాళ్ళం. ఆ ఇంటివాళ్ళు బయటకు రాగానే ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్ అయిపోయేవాళ్ళం. ఇక నే నడిచే దారి పొడుగునా నాలుగైదు పెద్ద పేద్ద వేప వృక్షాలు. వాటి నిండా వేప పూత. పక్కగా రాగానే కమ్మని పూల వాసన మనసంతా కమ్మేస్తుంది. గుండెల నిండా ఈ వాసన పీల్చుకుని మళ్ళీ నాలుగడుగులు వేసేసరికీ మరో వేప చెట్టు. అప్పుడప్పుడు కోయిల కూత కూడా పలకరిస్తూంటుంది. ఎలాగూ చెవిలో ఇయర్ ఫోన్స్ కమ్మని పాటలు వినిపిస్తూనే ఉంటాయి నడుస్తున్నంత సేపూ. ఇయర్ ఫోన్స్ చెవిలో ఉంటే ఎంత దూరమైనా అలుపు తెలియదు నాకు.

ఇక కొన్ని సందు మొదలలో పిల్లలతో పాటూ స్కూల్ బస్ కోసం నిలబడే తల్లులు, పేపరు,పాల సైకిళ్ళవాళ్ళు, నాలానే వాకింగ్ కి వచ్చే చిన్నా పెద్దా...రోజూ చూస్తూంటాం కాబట్టి పలకరించకపోయిన పరిచయమైపొయిన పరిచయాలు ఇవన్నీ. హ్మ్...ఇలా చెప్పుకుంటూ పోతే రెండు టపాలు రాసినా నా వర్ణన అవ్వదు. కాబట్టి ఈ టపాని ఇంతటితో ఆపేస్తా. క్లుప్తంగా ఇవీ ఈ మధ్యన నేను ఆస్వాదిస్తున్న మార్నింగ్ వాక్ అందాలు..ఆనందాలు.

Friday, March 25, 2011

మరువం పూలు + పేరు తెలీని మొక్క ?


కదంబం లో ఒదిగే మరువం సువాసన మాత్రమే తెలుసిన్నాళ్ళూ. మరువానికి కూడా పూలు పూస్తాయని ఊహన్నా లేదేమిటో. అదివరకూ కూడా కొంత కాలం పెంచాను ఈ మొక్కను. కానీ పూలెప్పుడూ పూయలేదు. ఇదే మొదటిసారి నేను మరువం పూలు చూడటం. నాకులా ఇప్పటిదాకా చూడనివాళ్ళుంటే ఓసారి ఈ ఫోటోలు చూసేయండి.



**** ***** ****

ఈ క్రింది ఫోటోలోని మొక్కలు మా సందులో గోడవారగా మొలకెత్తాయి. ఏం మొక్కలో తెలీక పెరిగేదాకా ఉంచాను. ఇప్పుడు ఇలా తెల్లని పూలు పూస్తున్నాయి. ఆకులకు గానీ, పువ్వులకు గానీ ఏ వాసనా లేవు. వఠ్ఠి గడ్డి మొక్కలేమో కూడా. ఇవేం మొక్కలో ఎవరికన్నా తెలుసా?



Wednesday, March 23, 2011

బదులు తోచని ప్రశ్నల తాకిడి

పొద్దున్నే ఎఫ్.ఎం వింటూ పనులు చేస్కుంటూంటే ఒక వింత పాట వినిపించింది. ఈ మధ్యన పెద్ద పెద్ద పేరాగ్రాఫులను పాటలుగా మార్చేస్తున్నారు. అలానే ఉంది. కానీ సాహిత్యం చాలా బాగుంది. తీరుబడి అయ్యాకా నెట్లో వెతకటం మొదలెట్టా. కానీ వాక్యాలు మర్చిపోయా. చాలా సేపు వెతికి దొరక్కపోయే సరికీ ఒక ఐడియా వచ్చింది. కొత్త సినిమా పాటలు అని టైప్ చేసి వచ్చిన సినిమాల పాటలలిస్ట్ లు అన్నీ వెతకటం మొదలెట్టా. ఒకచోట హుర్రే...!! అనేసా.

పాట.. "Mr.Perfect" సినిమా లోదిట. సంగీతం - దేవీ శ్రీ ప్రసాద్. సాహిత్యం - సిరివెన్నెల. అదీ.. అందుకే అంత బాగుంది. ఏమైనా ఆయనకాయనే సాటి. కార్తీక్, మల్లికార్జున్ పాడారుట. చిన్నవయసులోనే ఎన్నో పాటలు పాడి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు కార్తీక్. మంచి పాటలు ఉన్నాయి అతని జాబితాలో.

ఇంతకీ నాకు అంత విపరీతంగా నచ్చేసిన పాట సాహిత్యం చూడండి...కష్టపడి మొత్తం రాసేసా...:)

ఎప్పటికీ తన గుప్పిట విప్పదు
ఎవ్వరికి తన గుట్టుని చెప్పదు
ఎందుకిలా ఎదురైనది పొడుపు కథా
తప్పుకునేందుకు దారినిఇవ్వదు
తప్పు అనేందుకు కారణముండదు
చిక్కులలో పడటం తనకేం సరదా

బదులు తోచని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా
అలలు ఆగని సంద్రములా మది మారితే ఎలా
నిన్నా మొన్నా నీ లోపలా
కలిగిందా ఏనాడైనా కల్లోలం ఇలా
ఈరోజేమైందని ఏదైనా అయ్యిందని
నీకైనా కాస్తైనా అనిపించిందా?
(ఎప్పటికీ..)

ఏదోలా చూస్తారే నిన్నో వింతలా
నిన్నే నీకు చూపుతారే పోల్చలేనంతగా
మునుపటిలా లేవంటూ కొందరు నిందిస్తూ ఉంటే
నిజమో కాదో స్పష్టంగా తేలేదెలా?
సంబరపడి నిను చూపిస్తూ
కొందరు అభినందిస్తూంటే
నవ్వాలో నిట్టుర్చాలో తెలిసేదెలా?
(బదులు తోచని)

నీతీరే మారింది నిన్నకీ నేటికీ
నీ దారే మళ్ళుతుందా కొత్త తీరానికీ
మార్పేదైనా వస్తుంటే
నువ్వది గుర్తించకముందే
ఎవరెవరో చెబుతూఉంటే నమ్మేదెలా?
వెళ్ళే మార్గం ముళ్ళుంటే ఆ సంగతి గమనించందే
తొందరపడి ముందడుగేసే వీల్లేదెలా?
(బదులు తోచని)

చదివితే ఏదో పాఠం తాలూకూ ఎస్సే ఆన్సర్ లా ఉండి కదా. పాట చరణాలు ఎలా ఉన్నా, నాకైతే మొదట్లో హమ్మింగ్ వాక్యాలు, పల్లవి చాలా నచ్చేసాయి. మ్యూజిక్ తో పాటూ వింటే బాగుంది. మీరూ వినేయండి మరి..

Tuesday, March 22, 2011

నీళ్లు



మూడురోజులనించీ నీళ్ళు రాలేదు. పైనవాళ్ల ఇంట్లో చుట్టాలు కూడా వచ్చారు. వాళ్ళు మోటారు వేసినప్పుడల్లా గుండెల్లో రైళ్ళు. ఉన్న ఒక్క బిందె నీళ్ళు ఇవాళ అయిపోతే ఎలాగో అని బెంగపడిపోయాను. అదృష్టం బాగుండి ఇవాళ పొద్దున్నే ఆరింటికే నీళ్ళు వచ్చాయి. ఆనందమే ఆనందం. గంగాళం, స్టీలు బకెట్టు, బిందెలు, చిన్నాపెద్దా గిన్నెలు అన్నీ నింపేసా. మొన్నటి దాకా అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం కాబట్టి ఈ ఇబ్బంది తెలీదు. నీళ్ళు రాకపోతే మేనేజ్మెంట్ వాళ్ళు టాంకర్ తెప్పించేవారు. అడిగిన డబ్బులు ఇస్తే సరిపోయేది. ఏ తలనెప్పి లేదు. తెలీదు. ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ అవటం వల్ల రోజు విడిచి రోజు నీళ్ళు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూపులే . అసలు ఓ టైమూ పాడూ లేదు. ఒకోసారి అవీ రావు. రెండ్రోజులకోసారి వస్తాయి. కాబట్టి వచ్చినప్పుడే ఎక్కువ పట్టేసి ఉంచుతాం. మళ్ళీ ఎల్లుండీ రాకపోతేనో...అనుకుని. ఇక వేసం కాలం ఎలా ఏడ్పిస్తాడో మరి.

బొంబాయిలో రోజు విడిచి రోజు ఇచ్చినా ఒక టైం ప్రకారం వదిలేవాడు నీళ్ళు. ఏమాటకామాటే చెప్పాలి వాళ్ల పధ్ధతుల్ని మెచ్చుకుని తీరాలి. అన్ని సిస్టమేటిక్ గా ఉంటాయి. ఆఖరికి బస్సులు కూడా అందరు లైన్లలోనే ఎక్కుతారు. ఇక్కడిలా పొలోమని తోసుకుపోరు. మేం ఉన్నన్నాళ్ళు ఏనాడూ నీళ్ళకు ఇబ్బంది పడలేదు. ఇక విజయవాడ సంగతి చెప్పనక్కర్లేదు. కృష్ణమ్మ ఉండగా నీళ్లకు ఇబ్బందేమిటీ? అసలు ఆ మాటే తెలీదు. మా పనమ్మాయి అంట్లు తోముతున్నంత సేపు పంపు వదిలేసి ఉంచేది రోజూ. నేను దాన్ని కేకలేస్తూ ఉండేదాన్ని. ఆఖరికి అది మాట వినట్లేదని ఆ నీళ్ళు వేస్టవకుండా మొక్కల్లోకి వెళ్ళేలా పంపు దగ్గర నుంచి ఒక చిన్న కాలవ కూడా నేనే తవ్వాను.

ఇక విజయవాడ వదిలేప్పుడు ఎంత తగ్గించినా నా మొక్కలు కూండిలు ఒక ఏభై అయ్యాయి. సామాన్ల లారీలో అవి పట్టలేదని కేవలం వాటి కోసం నాన్న ఒక వేరే లారీ కూడా మాట్లాడారు. అలా ఒక ఏభై మొక్కలు తెచ్చాను. ఇక్కడి నీళ్ళ బెడదతో కాసిని మొక్కలు, నే పెళ్లయివెళ్ళాకా అమ్మకి ఓపిక లేక కాస్త.. మొత్తానికి ఇప్పుడు ఒక్క మొక్క కూడా మిగల్లేదు. అద్దింట్లో ఉన్నన్నాళ్ళూ వాళ్ల ఇంటాయన వాడుకోవటానికి కూడా నీళ్ళు జగ్గులతో లెఖ్ఖ కట్టి ఇచ్చేవాడు. ఇక మొక్కలకేం పోస్తారు? ఇప్పుడిక సొంతిల్లు కాబట్టి ఓపిక ఉన్నమటుక్కు కాసిని మొక్కలు కొని పెంచితోంది అమ్మ. మొన్నటిదాకా మాకూ ఇల్లు పెద్దదైనా అపార్ట్మెంట్లో బాల్కనీ లేక ఏ మొక్కా పెంచలేకపోయా. ఇదిగో ఈ ఇల్లుకి మారాకానే మొక్కల సరదా తీర్చుకుంటున్నా. ఇక్కడా క్రింద మట్టి లేదు కనుక కుండీల్లోనే.

ఇక నీళ్ల వాడకం గురించి ఎన్ని తెల్సుకున్నాననీ? బట్టలుతికిన నీళ్ళు సందు కడగటానికి, ఆకు కూరలు, కూరలు కడిగిన నీరు మొక్కలకి పొయ్యటానికీ వాడతాను. వంటింట్లో సింక్ లో ఒక పెద్ద గిన్నె పెట్టుకుని చేతులు కడగటానికీ దానికీ దాన్నే వాడి, ఆ నీటిని మళ్ళీ మొక్కల్లో పోస్తాను.(అంటే జిడ్డు చేతులు కాదు. వంటింట్లో చాలా సార్లు చేతులు కడగటం ఒక అలవాటు నాకు..:)) ఇంకా పొద్దున్నే మొహం కడిగేప్పుడు చిన్నప్పుడైతే(పెద్దప్పుడు కూడా) బ్రష్ తో తోముతున్నంతసేపూ నీళ్ళు వదిలేసేదాన్ని. ఇప్పుడు ఒక మగ్ తో వాటర్ పెట్టుకుని వాటితో మొహం కడుగుతాను. అయిపోతే మళ్ళీ పట్టుకుంటా తప్ప టాప్ తిప్పి వదిలెయ్యను. పాపకు టబ్లో స్నానం చేయించి ఆ నీటిని బాత్రూమ్ కడగటానికి వాడతాను. ఇంకా చెప్పాలంటే జంధ్యాల సినిమాలో పిసినారి కోటా టైపులో నీళ్ళు వాడటం నేర్చుకున్నాను. రెండ్రోజులు ఉండటానికి వచ్చిన అమ్మానాన్న కూడా నా నీళ్ళ వాడకం చూసి మరీనూ... విడ్డూరం...ఓవర్ చేస్తున్నావ్..అంతొద్దు...అని వేళాకోళం మొదలెట్టారు. అయినా నే మారనుగా. మరి రెండు మూడు రోజులు నీళ్ళు రాకపోతే తెలుస్తుంది వాటి విలువ. ఏదైనా అంతే మరి. మనుషులైనా, వస్తువులైనా ఉన్నన్నాళ్ళు విలువ తెలీదు !!

నీళ్ల గురించి కరువు పడ్డప్పుడల్లా నాకు చిన్నప్పుడు డిడి లో ఓ మధ్యాహ్నం చూసిన ప్రాంతీయ భాషా చిత్రం "తన్నీర్ తన్నీర్" గుర్తొస్తుంది. సరిత ఎంత బాగా చేస్తుందో. బాలచందర్ డైరెక్టర్ ఈ మూవీకి. ఒక మారుమూల పల్లెలో ప్రజలు నీటి కోసం పడే తాపత్రయం, ఇబ్బందులు, ఓట్ల కోసం రాజకీయనాయకులు చేసే ప్రమాణాలూ...బావుంటుంది సినిమా. దీనినే "దాహం దాహం" అని తెలుగులో డబ్ చేసిన గుర్తు. ఇందాకా వెతికితే యూ ట్యూబ్ లో మూవీ లింక్స్ దొరికాయి. ఇష్టం ఉన్నవాళ్ళు చూడండి. చిన్నప్పుడెప్పుడో చూసింది కదా మళ్ళీ నేనూ చూస్తా.
మొదటిభాగం:

http://www.youtube.com/watch?v=XtDMmQHOGBs&feature=రెలతెద్

రెండవభాగం:

http://www.youtube.com/watch?v=Xqf6s_bFU8A&feature=రెలతెద్


ఎవరికైనా బ్రష్ చేసుకునేప్పుడు సింక్లో నీళ్ళు వదిలే అలవాటు ఉంటే మానేయండి మరి. నీళ్లను జాగ్రత్తగా వాడండి. ఆదా చేయండి. ఇంతకీ ఇవాళ తృష్ణ కన్ను నీళ్ళ మీద పడిందేంటబ్బా అనుకుంటున్నారా? ఇవాళ march 22nd - World water day !!


---------------
note: నే నిచ్చిన యూట్యూబ్ లింక్స్ లో "తన్నీర్ తన్నీర్" సినిమా కొంత భాగమే ఉంది.

Monday, March 21, 2011

Dr.Balamuralikrishna - Pandit Ajoy Chakraborthi గార్ల జుగల్బందీ VCD


ఈ VCD చూస్తే మిడిమిడి సంగీత జ్ఞానం ఉన్న నాకే ఇంత ఆనందం కలిగితే నిజంగా శాస్త్రీయ సంగీతజ్ఞానం బాగా ఉన్నవారికి ఎంత ఆనందం కలుగుతుందో కదా...అన్నది ఈ VCD చూడగానే నాకు కలిగిన భావన. ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు రిలీజ్ చేసిన ఈ VCDలో కర్ణాటక సంగీత విద్వాంసులు డా.బాలమురళీకృష్ణ + హిందుస్తానీ సంగీత విద్వాంసులు పండిట్ అజయ్ చక్రవర్తి గార్ల జుగల్బంది ఉంది. హైదరాబాద్ లోని Chowmahalla Palace లో జరిగిన live concert రికార్డింగ్ ఇది.

నెట్లో వెతికితే యూట్యూబ్లో వీరిద్దరి జుగల్బందీ లింక్స్ కొన్ని దొరికాయి. సంగీతప్రియులు చూసి, విని ఆనందించండి.

http://www.youtube.com/watch?v=HEG7rIxOhgE&feature=related
http://www.youtube.com/watch?v=ER-f3fE7t30&feature=related

http://www.youtube.com/watch?v=rKviFaBPacM&feature=related
http://www.youtube.com/watch?v=TdncV2kOp-c&feature=related




ఇద్దరూ పాడిన వాతాపిగణపతిం భజే మొదటిభాగం:



రెండవభాగం:


Sunday, March 20, 2011

దెబ్బకు ఠా...


నిన్న ఒకచోటకు వెళ్ళాం. అనివార్య కారణాలవల్ల అక్కడ్నుండి morning showకు వెళ్ళాలని నిర్ణయించటం అయ్యింది. అయితే ఏ సినిమా? ఏ హాలు? అని ఆలోచిస్తే మేం వెళ్ళిన చోటుకు దగ్గరలో ఉన్న రెండు మూడు హాల్స్ లో అని డిసైడైయ్యింది. మూడింటిలోనూ "దొంగల ముఠా" అని ఉంది. ఇదేం సినిమా? ఊరూ పేరూ వినలేదే? పబ్లిసిటీ ఏం ఇవ్వలేదా? ఎప్పుడు రిలీజైంది? అన్నాను పొరపాటున. 'ఏం తల్లి ఏ లోకంలో ఉన్నావు? ఐదురోజుల సినిమా, ఐదురోజుల సినిమా అని డప్పు మోగుతూంటే? పైగా నిన్ననే రిలీజ్..' అన్నారు. "విన్నాను కానీ అయిపోయిందనీ,రిలీజ్ కూడా అయ్యిందని తెలీదు.." అన్నా. అయినా నిన్నే రిలీజ్ అయితే టికెట్లేం దొరుకుతాయి? పైగా ఎలా ఉంటుందో తెలుసుకోకుండా వెళ్తే ఏమౌతుందో ఈ మధ్యన బాగా అర్ధం అయ్యాకా అంత సాహసం తగునా? అనిపించింది. కానీ మనసు పీకింది.. వద్దంటే మళ్ళీ ఎప్పటికి కుదురుతుందో.. ఏదో ఒకటి చూసేస్తే పోలా అనేస్కుని సరేననేసా. మనకో దుర్వ్యసనం ఉంది. తను నా కూడా వస్తే చాలు ఏ డొక్కు సినిమా అయినా చూసెయ్యబుధ్ధేస్తుంది. టిపికల్ భార్య మెంటాలిటీ. కాన్ట్ గెట్ డీవియేటెడ్ !

ఇరవై నిమిషాలు ఉంది సినిమా మొదలవటానికీ. ఎందుకైనా మంచిదని వెళ్ళినచోటే ఓసారి "దీప రివ్యూ" కోసం నెట్లో వెతికా. ఎవరీ దీప? అంటే ఫుల్ హైదరాబాద్.కామ్ లో రివ్యూలు రాస్తుందీవిడ. రివ్యులు చూసి వెళ్ళినా కొత్త సినిమాకి వెళ్ళి బుక్కయిపోతున్నామని గగ్గోలు పెడితే అన్నయ్య చెప్పాడీమధ్యనే. ఈ సైట్లో రివ్యూ చూడు. అదీ "దీప" రివ్యూ చూడు. ఆవిడ బాగా రాస్తే మనకీ నచ్చుతుంది. కనీసం రేటింగ్ అయినా సరిగ్గా వేస్తుంది. మన views తో match అవుతుందావిడ రివ్యూ అని. అప్పటి నుంచీ ఏదన్నా తెలీని సినిమాకు వెళ్ళే ముందు దీప ఎంత రేటింగ్ ఇచ్చింది అని చూసి మరీ వెళ్లటం అలవాటైపోయింది. ఇక అదివరకూలాగ నిరాశపడట్లేదు. నిన్న ఏం రాసిందో చదివే టైం లేదు కానీ రేటింగ్ 5.5 అని చూసి పర్వాలేదు అనుకుని బయల్దేరా.


ఐదు నిమిషాల్లో హాల్ చేరాం. టికెట్లు ఈజీగానే దొరికేసాయి. మా పక్కకి ఒక ముదుసలి జంట(ఇద్దరికీ 65ఏళ్ళు పైనే ఉంటాయి) వచ్చి కూర్చున్నారు. అమ్మో వీళ్ళకెంత ఓపికో ఈ ఎక్స్పరిమెంటల్ సినిమాకు వచ్చారు అని హాచ్చర్యపడిపోయేసాము. ఆ మధ్యన వర్మగారు "అడవి"లోకి తీసుకెళ్ళి భయపెట్టేసాకా మళ్ళీ వర్మ సినిమాలేం చూడలేదిక. సినిమా మొదలైంది. కెమేరా తెగ కదుల్తోంది. ఒక చోట నిలవట్లేదు. కుంచెం భయమేసే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వస్తోంది. కొంపతీసి ఇది దెయ్యాల సినిమా కాదుకదా అన్నా. అయితే దెయ్యాలు లేకపోతే అండర్ వరల్డ్. రెండే కదా ఈయన థీములు.

రవితేజ గెటప్ బానే ఉంది. హీరోలా కాకుండా ఇలా ఒక మర్యాదైన భర్త పాత్ర ఏదైనా వెయ్యచ్చు అనిపించింది. అదేమిటో చార్మీ అలా మాట్లాడుతోంది? నట్టుతోందా? భర్తని దెప్పుతోందా? అర్ధం కాలే. సరే ఇద్దరు ముగ్గురు పాత్రలు బయటకు వచ్చారు. నయం ఈ ఇద్దరితోనే సినిమా లాగించేస్తాడేమో అని భయపడ్డా. కానీ ఎంతసేపటికీ కథ ముందుకి జరగదే? తొసేవాళ్ళెవరూ లేకపోయారో ఏమో. మంచు లక్షిగారు జీన్సే వేసుకుని ఓ పైపుచ్చుకుని పైకి పాకుతున్నారు. సారీ ఎక్కుతున్నారు. ఆ తర్వాత కూడా కెమేరా ఛార్మీ జీన్స్ దాటి ముందుక్కానీ వెనక్కిగానీ వెళ్లటం లేదు. నాకు "క్షణ క్షణం"లో శ్రీదేవి జీన్స్ వేసుకుని పైకెక్కటం గుర్తు వచ్చింది. పాపం జీన్స్ కీ - డైరెక్టర్ కీ ఏదో అవినాభావసంబంధం ఉండి ఉంటుంది అనుకున్నా.

సినిమా సస్పెన్సా? కామిడీనా? డైరెక్టర్ ఇంటర్వెల్ దాకా డిసైడ్ చేసుకోలేకపోయాడు పాపం. ఇంటర్వెల్లో పక్కన కూర్చున్న తాతగారు బయటకు వెళ్ళివచ్చారు ఓపిగ్గా. మంచు లక్ష్మి ని చూస్తూంటే నాకు పాత సినిమాల్లోని విజయలలిత గుర్తుకు వస్తోంది. "అనగనగా.. " సినిమాలో కూడా ఆ నటన అదీ చూస్తూంటే విజయలలితే గుర్తు వచ్చింది. సరిగ్గా వాడుకోవాలి కానీ తెలుగు తెరకు ఒక మంచి కేరెక్టర్ ఆర్టిస్ట్ దొరికింది అనిపించింది నాకు. లేడి విలన్ గా ఎస్టాబ్లిష్ అవటం ఇష్టం లేకనేమో ఈ సినిమా కథ మధ్యలో అర్జెంట్గా పోలీస్ఆఫీసర్ అయిపోతుందీవిడ. ఏదో ఒకటి తెలుగు కాస్త సరిగ్గా పలికితే బాగుండు...ఆ డైలాగులు వింటూంటే రెండు మూడు రోజుల క్రితం ఏదో బ్లాగ్లో ఈవిడ తెలుగు ఏక్సెంట్ మీద చదివిన టపా గుర్తుకొచ్చింది.(తన పక్కన కూర్చుని, సినిమాహాల్లో కూడా బ్లాగు ని మర్చిపోని వీర బ్లాగర్ని..హా..హా..హా)

రెండవ భాగం సినిమాలో కాస్త కామెడీ కనబడింది. సినిమాను ఏ జానర్ లోకి తొయ్యాలో అప్పటికి డిసైడ్ అయ్యిందన్నమాట. బ్రహ్మాజీకి పాత్ర, డైలాగులు లేకపోయినా అతని మేనరిజం నాకు భలే నచ్చేసింది. ముగ్గురు దొంగలతో రవితేజ డైలాగులు చెప్తున్నప్పుడు, తలొకరి వైపూ చూసి తలాడించటం విసుగనిపించినా నవ్వు తెప్పించింది. బ్రహ్మానందానికి బొత్తిగా చెయ్యటానికి ఏం లేదు. ప్రకాష్ రాజ్ కూడా అనవసరమ్ అనిపించింది. కానీ కథనంలో బలం లేక ఈ నటులవాల్లనైనా చివర్దాకా చూడగలిగాం. కొత్త ఎక్స్పరిమెంట్ చెయ్యాలన్నా శ్రధ్ధ కథనం పట్ల కూడా ఉండి ఉంటే మంచి సినిమాగా మిగిలిపోయేదేమో. చివరలో ఆ పాట ఎందుకో తెలీలేదు. ప్రేక్షకుడిలో ఇంకా ఏ మాత్రమైనా సహనం మిగిలి ఉందా అని పరీక్షించడానికేమో.

ఇహ సినిమాకు వాడిన కెమేరా, లైటింగ్ గట్రాల గురించి చాలామంది చాలా చోట్ల రాసేసారు. గంటన్నర లో సినిమా అయిపోవటం మాత్రం తెగ నచ్చేసింది.ఇంతకీ సినిమా ఎలా ఉందీ అని మేం వెళ్ళమని తెలిసిన అందరూ అడగటమే. "అదే..సమాధానం ఏం చెప్పాలో అర్ధం కాకుండా ఉంది..."అని చెప్పా. ఇంతవరకూ డిసైడ్ చేస్కోలేకపోయా. అద్ది రాం గోపాల్ వర్మ టాలెంట్ అంటే. ఈ డెసిషన్ మేకింగ్ లో కాస్త మీరు హెల్ప్ చేయ్యరూ..?

Saturday, March 19, 2011

నిరీక్షణ..


నిరీక్షణకు అంతం ఉండదా?
అన్వేషణకు ఫలితం ఉందా?
చెప్పవూ...

చిరుగాలి సవ్వడికి తల ఊపే
ప్రతి పువ్వు కదలికకి
ఆకురాలు నిశ్శబ్దంలోకి
తొంగి తొంగి చూసాను..
దారి పొడుగునా..అడుగడుగునా
పరీక్షించి...ప్రతీక్షించి
వేచి వేచి చూసాను..
ఎక్కడా నీ పాదాల జాడే లేదు.
ఏ చోటా నీ ఆచూకీ దొరకనేలేదు.
ఏమయ్యావు నువ్వు?

క్రితం జన్మలో ఎప్పుడు విడిచావో
ఈ చేతిని...
ఇంతదాకా మళ్ళీ అందుకోనేలేదు..
ఎక్కడని వెతకేది నీ కోసం?
నిరంతరం అన్వేషిస్తూనే ఉన్నాను..

చినుకురాలినప్పుడు..
కమ్మని మట్టివాసన
గుండెనిండా నిండినప్పుడు..
దూరాన గుడిగంటలు
హృదయంలో ప్రతిధ్వనించినప్పుడు..
చల్లని వెన్నెల కిరణాలు
చెట్లమాటు నుంచి
నావైపు తొంగిచూసినప్పుడూ..
మధురమైన రాగానికి పరవశించి
నా గొంతు శృతికలిపినప్పుడూ..
ఎప్పుడూ..
నిన్ను తలుస్తూనే ఉన్నానూ.
కనుల కలలవాకిల్లో నీ రూపాన్ని
ఊహించ ప్రయత్నిస్తూనే ఉన్నాను.

ఈ నిరీక్షణకూ..ఈ అన్వేషణకూ అంతం ఎప్పుడు?
ఏ నాటికి నీ చేయి
నాకు తోడునిచ్చి అందుకునేది?
నిరీక్షణకు అంతం ఉండదా?
అన్వేషణకు ఫలితం ఉందా?
చెప్పవూ...

*** *** *** *** ***

పైన రాసినది ఇప్పుడు రాసినది కాదు...:) 12ఏళ్ళ క్రితం రాసిన ముచ్చట. ఆ తరువాత నాలుగేళ్ళకు మా పెళ్ళి అయ్యింది. అప్పుడిక గట్టిగా చేయిపట్టేసుకుని ఈ కవితను అంకితమిచ్చేసాను...:) "మేరేజస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్" అని బలంగా నమ్మే మనిషిని నేను. మధ్యాహ్నం "మాల గారి బ్లాగ్" లో పైన చిత్రాన్ని, ఆ తరువాత మాల గారి ఆహ్వానంపై ఈ రాజా రవివర్మగారి చిత్రానికి కవితలు రాసిన బ్లాగ్మిత్రుల ఇతర కవితలు చదివాకా వెంఠనే నాకు ఈ పాత కవిత గుర్తుకు వచ్చింది. మాల గారికి 'నేను రాస్తానని' పర్మిషన్ అడిగేసి, ఇంటికి వచ్చి పాత పుస్తకాలన్నీ తిరగేస్తే దొరికేసిది - కవిత రాసిన చిన్న స్పైరల్ నోట్ పాడ్. కానీ పనులన్నీ అయ్యేసరికీ ఇంత సమయమైంది. సరేలే ఇవాళ్టి వెన్నెల తోడుంది కదా అనేస్కుని టపా రాసేస్తున్నా.

పైన ఫోటో నాకు నెట్లో దొరికిన మరో ఇమేజ్.