why 'వైశాలి' ? ఈ సినిమా చూస్తున్నంత సేపు ఇదే ప్రశ్న బుర్రను దొలిచేసింది...తమిళంలో "ఈరం"(అంటే 'తడి' అని అర్ధం) అని అంత మంచి పేరు పెట్టి, తెలుగులో "వైశాలి" పేరు ఎందుకు పెట్టారు ఈ సినిమాకి? అని. వేరే పేరు పెట్టి ఉంటే బావుండేది. అసలు పాత సినిమాల పేర్లు పెట్టిన కొత్త సినిమాలకీ, ఆ పేరున్న పాత సినిమాలకీ ఎటువంటి సంబంధం ఉండదు. పాత "వైశాలి" సినిమా కూడా డబ్బింగే కాబట్టి అది హిట్ అయినట్లు ఇదీ హిట్ అవుతుంది అనుకున్నారేమో. ప్రేక్షకులను ఆకర్షించటం కోసం అలా పెడతారేమో మరి.
ఈ మధ్యనే అనుకున్నా మంచి సస్పెన్స్ సినిమా వస్తే బావుంటుంది... అని. "వైశాలి" ట్రైలర్ ను "నూరుపాళ్ళ నాన్సెన్స్" సినిమా ఇంటర్వెల్లో చూసినప్పుడు ఇదేదో చూడతగ్గ సినిమా అనుకున్నా. శుక్రవారం రివ్యూలు చదివితే బావుందని వచ్చాయి. శంకర్ సినిమా కాబట్టి మినిమం గ్యారెంటీ ఉంటుందని ధైర్యం. అనుకున్న టైమ్ కి టికెట్లు దొరకలేదు. సరే ఇక ఆదివారానికి బుక్ చేసాం. మొదటి సినిమా అయినా బాగా తీసాడు దర్శకుడు. కథా, మాటలు, స్క్రీన్ ప్లే అన్నీ అతనే. కథ ఇలాంటిది కాకపోయినా ఇలా super natural element ప్రధానాంశం గా ఉన్న హిందీ సినిమా "saaya"(జాన్ అబ్రహం) గుర్తుకొచ్చింది. నీరు, సిగ్నల్స్ ఇవ్వటం లాంటివి అందులో కూడా ఉంటాయి. కాకపొతే ఆ సినిమా "dragonfly" అనే ఆంగ్ల చిత్రానికి కాపీ. ఇక శంకర్ సినిమాలలో ఎక్కువ శాతం కథలన్నీ అన్నీ అవినీతి, ప్రేమల చుట్టూ తిరుగుతాయి. ఆ పరిధి దాటి ఈ కథ వైవిధ్యంగా ఉందే అనుకున్నా. కానీ రెండేళ్ల క్రితం తమిళంలో తీసిన సినిమాను తెలుగులో డబ్ చేయటానికి ఎందుకు ఆలస్యం చేసారో మరి.
ఈ సిన్మాలో నాకు నచ్చిన పాయింట్లు:
* చాలా సన్నివేశాల్లో "వర్షం" ఉండటం.
* రెండవది ఒక సీన్.. కూరల బండి దగ్గర ఒకావిడ మరొకావిడకి చెప్పిన ఒక విషయం ఎలా మొత్తం అన్ని ఇళ్ళకీ స్ప్రెడ్ అవుతుంది అని చూపించటానికి అన్ని అపార్ట్మెంట్లనీ వరుసగా చూపిస్తూ ఫోన్లు రింగ్ అయినట్లు చూపిస్తారు. గాసిప్స్ ఎలా స్ప్రెడ్ అవుతాయి అనటానికి perfect example అనిపించింది.
* ఇంకా ఫోటోగ్రఫీ చాలా బావుంది. నీటిని ఎక్కువ చూపించటం వల్లనో ఏమో చాలా ఫ్రేమ్స్ లో బ్లూ షేడ్స్ ఎక్కువ కనబడ్డాయి. అది బావుంది.
* కథ గొప్పగా లేకపోయినా గ్రిప్పింగ్ నరేషన్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్.
* గ్రాఫిక్స్ కూడా బాగున్నాయి.
ఒకటే చిన్న లోపం కనబడింది నాకు.. మనవాళ్ళకి సస్పెన్స్ క్రియేట్ చేయటం తెలుసు కానీ దాన్ని ఫాలో చేసి చివరిదాకా నిలబెట్టడం సరిగ్గా రాదు. చివరికి ఏం జరుగుతుందో మధ్యలోనే తెలిసిపోతే ఇంక సస్పెన్స్ మూవీస్ లో థ్రిల్ ఏం ఉంటుంది? అయినా కూడా ఇది చాలా చాలా బెటర్ మూవీ అనే చెప్పాలి.
నటీనటులు కూడా సరిగ్గా సరిపోయారు.తేజ సినిమా "ఒక V చిత్రం" సినిమాలో(comedy భలే ఉంటుంది.) ఈ 'ఆది' ని చూసి కొత్తవాడైనా బాగా చేసాడు అనుకున్నాం. తర్వాత మళ్ళీ ఇదే అతడిని చూడటం. పాత్రలో సరిపోయాడు. నటుడిగా పరిణితి కనబడింది. ఇతని మిగిలిన సినిమాలు నేను చూడలేదు. ఇక సింధు మీనన్ "చందమామ"లోనే కాజల్ తో పాటూ భలే నచ్చేసింది. అందులో బబ్లీ రోల్. చాలా ఏక్టివ్ గా, రిఫ్రెషింగా అనిపించింది. తనను కూడా మళ్ళీ ఇందులోనే చూశాను నేను. ఇందులో సాఫ్ట్ కేరెక్టర్. ఆ పాత్రపై జాలి కలుగుతుంది. తన తప్పు లేకుండా ఇంట అన్యాయమా అని సినిమా అయిపోయాకా కూడా ఆలోచిస్తూ ఉండిపోతాం కాసేపు..! 'శరణ్య' కు పెద్దగా రోల్ ఏమీ లేదు సినిమాలో. "విలేజ్ లో వినాయకుడు" సినిమాలోనే టాలెంట్ చూపించిన ఈ కేరళ కుట్టికి కూడా కాస్తంత ఎక్కువ ప్రాధాన్యత ఉంటే బాగుండేదేమో అనిపించింది.
సినిమాకి తమన్ చేసిన సంగీతంలో గుర్తుంచుకోదగ్గ పాటలేమీ లేవు. నేపథ్య సంగీతం మాత్రం ఎఫెక్టివ్ గా ఉంది. ఇతని పాటల్లో మెలడీ తక్కువ హోరు ఎక్కువ ఉంటుంది. ఇతను ప్రఖ్యాత తెలుగు నిర్మాత, దర్శకుడు ఘంటసాల బలరామయ్యగారి మనవడు అని "వికీ" చెప్పింది. సినిమా మొదటి భాగంలో flash back నూ, వర్తమానాన్ని జతపరుస్తూ ఏకకాలంలో చూపించే టెక్నిక్ ను చూస్తూంటే మణీరత్నం "సఖీ" సినిమా గుర్తొచ్చింది. రెండవ భాగం మధ్యలో కొంచెం బోర్ అనిపించింది. ఇంకా బాగా హేండిల్ చేయచ్చు కానీ మొత్తమ్మీద పర్వాలేదనిపించింది. ఏదేమైనా సినిమాలకు వెరైటీ సబ్జెక్ట్స్ ను ఎంచుకోవటంలో తెలుగు సినిమా వెనకబడిందనే చెప్పాలి. అంతేకాక ఇలాంటి వెరైటీ థీమ్స్ ను ఆదరించటం తమిళ ప్రేక్షకులను చూసి నేర్చుకోవాలి అని కూడా అనిపించింది.
కొసమెరుపు: కొద్ది కొద్దిగా పట్టిన కలత నిద్ర కాస్తా అర్ధరాత్రి పన్నెండింటికి వచ్చిన రాంగ్ కాల్ తో ఎగిరిపోయింది. రాత్రంతా సింధు గురించి ఆలోచనలు...పట్టీ పట్టని నిద్ర తో సరిపోయింది. super natural element ఉన్నా ఎటువంటి భయం లేని ఇలాంటి క్లీన్ సినిమా చూసినా నిద్ర పట్టలేట్టకపోతే..నీ మొహానికి సస్పెన్స్ సినిమాలెందుకే? అని పొద్దున్నే నవ్వుకున్నాను !!