బాపు సినిమాల్లో బాగా ప్రజాదరణ చెందిన చిత్రాల కోవకు చెందుతుంది "మంత్రిగారి వియ్యంకుడు(1983)". చిరంజీవి విజయ చిత్రపరంపరలో ఓ మైలురాయిగా చెప్పుకోవచ్చు. "రుద్రవీణ", "చంటబ్బాయ్"ల తరువాత నాకు నచ్చే చిరంజీవి సినిమా ఇది. చెప్పదలుచుకున్న సందేశానికి హాస్యాన్ని జోడించి ప్రేక్షకులకు అందించటం బాపు సినిమాల్లోని ప్రత్యేకత. మానవ సంబంధాలనూ, స్నేహాలనూ డబ్బుతో వెలకట్టలేమన్నది ఈ చిత్రం ఇచ్చే సందేశం. పాత్రల వ్యక్తిత్వాలను కాస్తంత హాస్య రసంలో ముంచి దుష్టపాత్రలను కూడా మనం నవ్వుతూ చూసేలా చెయ్యగలిగారు బాపురమణలు.
ఇక చిత్రానికి ఇళయరాజా సమకూర్చిన సంగీతాన్ని గురించి పొగడటానికి మాటలు చాలవు. కెరీర్లో హై పీక్ లో ఉన్నప్పుడు చేసిన పాటలవటం వల్ల వినటానికి ఎంత బావుంటాయో అన్ని పాటలూ. ప్రతి పాటా మళ్ళీ మళ్ళీ వినాలనేలాగ ఉంటుంది. "ఏమనినే మరి పాడేదనో" పాట నాకు అన్నింటికన్నా ఇష్టం. ప్రతి పాటకూ కథకు అనువైన సాహిత్యాన్ని అందించారు వేటూరి. పాటల్లోని ఏ వాక్యమూ బాలేదని అనిపించదు. ఈ సినిమా వెరైటీ టైటిల్స్ ఓసారి చూసేయండి. టైటిల్స్ లో తులసి, సుధాకర్ ల జంటను కుదిర్చే సన్నివేశాలు భలే నవ్వు తెప్పిస్తాయి.
కథ చాలా మామూలుదే. స్వశక్తితో బాగా డబ్బు గడించిన కొబ్బరికాయల సుబ్బారాయుడనే(అల్లు రామలింగయ్య) వ్యక్తి ఎవరి సాయంతో పైకి వచ్చాడో మర్చిపోతాడు. తాను దాటి వచ్చిన పేదరికాన్నే అసహ్యించుకుంటాడు. తన డాక్టర్ కొడుకుని మంత్రిగారి అమ్మాయికి ఇచ్చి పెళ్ళి చేసి తాను "మంత్రిగారి వియ్యంకుడు" అయిపోవాలని ఆశ పడతాడు. ఆ ఆశలను వమ్ము చేస్తూ అతని కొడుకు శివ(శుభలేఖ సుధాకర్) నర్స్ సుశీల(తులసి)ని ప్రేమిస్తాడు. సుశీల తన పాత మిత్రుడు, గడ్డు కాలంలో సాయం చేసినవాడు అయిన రావులపాలెం రామభద్రయ్య(రావికొండలరావు) కుమార్తె అని తెలిసి కూడా సుశీల తల్లిదండ్రులను పిలిపించి అవమానిస్తాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేని సుశీల తల్లి అన్నపూర్ణమ్మ(నిర్మలమ్మ) సుబ్బారాయుడిని డబ్బు మదంతో విర్రవీగటం అనర్ధాలకు దారి తీస్తుందని హెచ్చరిస్తుంది.కాలేజీలో రామభద్రయ్య కుమారుడు బాబ్జీని(చిరంజీవి) అవమానించాలని ప్రయత్నించి తానే అవమానపడుతుంది సుబ్బారాయుడి కుమార్తె అనురాధ(పూర్ణిమా జయరాం). మెల్లగా జగడాలు ప్రణయాలుగా మారతాయి. అన్నపూర్ణమ్మను ఎన్నికలలో నిలబెడతాడు బాబ్జీ. చివరికీ అంతా కలిసి కొబ్బరికాయల సుబ్బారాయుడికి ఎలా బుధ్ధి చెప్పారు? రెండు జంటల పెళ్ళిళ్ళు అవుతాయా అన్నది మిగిలిన కథ.
బిచ్చగాడికి నోట్లు ఇస్తున్నట్లు అల్లురామలింగయ్య ఫోటో తీయించుకునే సీన్లో పూర్ణిమా జయరాం వచ్చి "వాడ్ని జైల్లో వేయించేయ్..ఉరి తీయించెయ్.." అంటే ఎవరని కూడా అడక్కుండా పోలీస్ అల్లుడైన రాళ్లపల్లితో అవే మాటలు చెప్పే సీన్ భలే ఉంటుంది. కాలేజీలో "ఆ కాయను బేన్ చేసారు కదా" అంటూ చిరంజీవి హీరోయిన్ ను ఏడిపిస్తూ చెప్పే డైలాగులు, చిరంజీవిని డిస్మిస్ చేయించినప్పుడు పాడే పాట హాస్యంగా ఉంటాయి. "పది లక్షల రూపాయిల కోసమే గోయిందా సకల పాపాలు చేసావు గోయిందా" అంటూ చివర్లో నూతన్ ప్రసాద్ పాడటం, రాళ్లపల్లి డైలగులు, అల్లు రామలింగయ్య నటన హాస్యరసాన్ని ప్రవహింపజేస్తాయి. "డబ్బు జేసి", "క్రిందపడ్డా పై చేయి నీదేనంటావు?" మొదలైనవి పక్కా రమణ మార్కు డైలాగులు.
నూతన్ ప్రసాద్, రాళ్లపల్లి ఇద్దరికీ కూడా మంచి పేరు తెచ్చిన చిత్రం ఇది. శ్రీలక్ష్మికి ఈ సినిమాలో పెద్దగా పాత్ర లేదు. కప్పల అప్పారావు పాత్రలో సత్యనారాయణది కూడా మితమైన పాత్రే. ఎక్కువగా మళయాళ, తమిళ చిత్రాలు, తెలుగులో బహుశా ఈ ఒకటే చిత్రం చేసిన కేరళకుట్టి పూర్ణిమా జయరాం ప్రఖ్యాత తమిళ దర్శక నిర్మాత, నటుడు, రచయిత భాగ్యరాజ్ ను వివాహం చేసుకున్నారు. వారి అబ్బాయి అమ్మాయి ఇద్దరూ సినీప్రపంచంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అప్పటికే ప్రఖ్యాత నటుడైపోయిన చిరంజీవి అభినయంలో స్టార్ మార్క్ స్టైలిష్ నటన ప్రతి ఫ్రేంలోనూ కనబడుతుంది. అయినా ఎక్కడా అతిగా కనబడదు. అది బాపూ దర్శకత్వ ప్రతిభ.
పాటలు:
అన్నిపాటలకూ సంగీతం ఇళయరాజా. సాహిత్యం వేటూరి. కొన్ని వీడియో లింక్స్ దొరికాయి చూసేయండి.
1) "మనసా శిరసా నీ నామము పాడేద ఈ వేళా"
పాడినది: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి.
పాట లో గిటార్ వాడిన తీరు అద్భుతం.
2) "మనకు దోస్తి ఒకటే ఆస్తిరా"
పాడినది: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట బాలు హిట్స్ లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చరణాలను పాడిన తీరు చాలా బావుంటుంది.
3) "ఛీ ఛీఫో పాపా "
పాడినది: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
4)"కొలువైనాడే ఊరికి కొరివైనాడే "
పాడినది: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
5) ఏమనినే పాడేదనో.."
జానకి,బాలు ఇద్దరూ ఈ పాటకు నూరుపాళ్ళు న్యాయం చేసారనిపిస్తుంది. అంత బావుంటుంది ఈ పాట.
6) "అమ్మ కదే బిజ్జి కదే నాపై కోపమా"
పాడినది : ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి.హీరోని మచ్చిక చేసుకునే నేపథ్యంలో వచ్చే ఈ పాటలో పూర్ణిమా జయరామ్ వేసుకున్న వైట్ కలర్ స్కర్ట్ చాలా బావుంది. పాటకు వంద డ్రస్సులు మార్చే సినిమాటిక్ పాటలా కాక ఒకే డ్రెస్ తో పాటంతా తీయటం ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది.
7) "సల సల నను కవ్వించనేల" పాట పాడినది : ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి.
రాళ్లపల్లి, నూతన్ ప్రసాద్ ల ప్రోత్సాహంతో రెండు జంటలు పాడుకునే ఈ పాట కూడా సరదా అయినదే.
నా మాట: తీరికవేళల్లో తాపీగా కూర్చుని హాయిగా నవ్వుకోవటానికి వీలున్న మంచి సినిమా.
No comments:
Post a Comment