సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, July 14, 2011

షిరిడి - నాసిక్ - త్రయంబకం -1


మావి చాలా మటుకు అనుకోని ప్రయాణాలే. ఆ పైవాడి దయవలన పెద్ద ఇబ్బందులు లేకుండా ఇలాంటి అనుకోని ప్రయాణాలు గడుపుకొచ్చేస్తూ ఉంటాం. గత నాలుగురోజుల పాటు మేము చేసిన అనుకోని ప్రయాణం ఎన్నో మధురానుభూతులను మాకు అందించింది. వర్షాకాలం పచ్చదనం ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చింది. దినపత్రికలు, టివీ ఛానల్స్, ఫోన్లు, ఇంటర్నెట్ ఏవీ లేకపొతే ఎంతైనా హాయే అని మళ్ళీ అనిపించింది.


మొన్న గురువారం శిరిడి వెళ్దాలని అప్పటికప్పుడు అనుకున్నాం. ఇప్పుడు ఇలా రాయటానికి బాగుంది కానీ ఒక ఎడ్వంచర్ చేసామనే చెప్పాలి. ప్రయాణాల్లో తనకు ఇబ్బందని ప్రతీసారీ మా పాపను అమ్మ దగ్గర ఉంచేస్తాము. కానీ ఈసారి పాపను కూడా తీసుకువెళ్లాలని అనుకున్నాం. అనుకున్నట్లే రిజర్వేషన్ దొరకలేదు. శుక్రవారం సాయంత్రానికి వైటింగ్ లిస్ట్ లో ఉన్నా ఏమయితే ఆయిందని టికెట్స్ తీసేసుకున్నాం. శుక్రవారం పొద్దున్నకి వైటింగ్ లోంచి RACలోకి వచ్చి, రైలెక్కే టైమ్ కి కన్ఫర్మ్ అయిపోయాయి. హమ్మయ్య అనేసుకుని రైలెక్కేసాం. దారిలో వాన వెలిసిన తరువాత విరిసిన "వానవిల్లు" నా కెమేరాలో చిక్కింది. పాప కూడా మొదటిసారి నిజం రైన్బోను చూసి చాలా సరదా పడింది.





సారవంతమైన మహరాష్ట్రా నల్లమట్టి


రైలు శిరిడి దాకా వెళ్తుంది కానీ మేము దర్శనానికి త్వరగా వెళ్ళచ్చని శనివారం పొద్దున్నే నాగర్సోల్ లో ఏడింటికి దిగిపోయాం. అక్కడ నుంచి గంటలో శిరిడి చేరిపోయాం. ఊరు ఏడాదిన్నర క్రితం మేము వెళ్ళినప్పటికన్నా బాగా మారిపోయింది. ఎప్పుడు కట్టారో కానీ గుడీ గేట్లో "సాయి కాంప్లెక్స్" అని ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ! బోలెడు షాపులు హంగామా.





వీకెండ్ కదా ఎప్పటిలానే దర్శనానికి చాలా జనం ఉన్నారు. భక్తులు పెరిగే కొద్దీ భగవంతుడు మరీ దూరమైపోతున్నాడు అనిపించింది క్యూలూ జనాల్ని చూస్తే. తొమ్మిదిన్నరకి క్యూ లో అడుగుపెట్టాం. క్యూ త్వరగానే కదిలింది కానీ సరిగ్గా హారతి టైంకి లైన్ ఆపేసారు. అప్పటికి విగ్రహం ఎదురుగా ఉండే హాల్లోకి చేరుకున్నాం. అందర్నీ కూచోపెట్టేసారు. అంతవరకూ బానే ఉంది కానీ హారతి అవ్వగానే జనమంతా ఉన్మాదుల్లాగ తోసేసుకుంటూ దర్శనానికి ఎగబడ్డారు. ఎందుకో తొందర అర్ధం కాలేదు. హాలు దాకా చేరినవాళ్ళు దర్శనానికి వెళ్ళలేకపోతారా? ఎగబడి ఒకర్ని ఒకరు తోసుకోవటం వల్ల మరింత ఆలస్యం, తోపులాట, చికాకులు తప్ప భగవంతుడి దగ్గర ప్రశాంతత ఎక్కడుంటుంది? ఒకోసారి చదువుకున్నవాళ్ళు కూడా నిరక్ష్యరాసుల్లా ప్రవర్తిస్తారెందుకో..!


హారతి తర్వాత జరిగిన తోపులాటలో నా ప్రయేమం లేకుండానే నేను ఎక్కడికో తోయబడ్డాను. తనూ,పాప ఎక్కడున్నారో తెలీలేదు. దర్శనం అయ్యాకా ఎంతసేపు నిలబడ్డా తనూ,పాప బయటకు రాలేదు. నాకు కంగారు మొదలైంది. ఈలోపు అవతలివైపు నుంచి శ్రీవారు,అమ్మాయి కనబడ్డారు. వాళ్ళు కుడివైపు క్యూలోకి తోయడి,వేరే గుమ్మంలోంచి బయతకు వచ్చారుట. వాళ్లకు దర్శనం బాగా అయ్యిందన్నారు. ఇక నాకు బాధ మొదలైంది. అనుమతి లేనిదే రాలేమంటారు. ఈ వచ్చాకా ఈ తోపులాట దర్శనం ఏమిటి బాబా..అని ప్రశ్నించటం మొదలెట్టాను. రెండు రోజుల తరువాత నా వేదన తీరింది..అదే బాబా సమాధానం అనుకున్నా. చివరిరోజు ప్రయాణంలో దాని గురించి..!


ఆదివారం రాత్రికి రైలు టికెట్స్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ఈలోపు శనివారం సాయంత్రం దగ్గరలో మరెక్కడికైనా వెళ్ళివద్దాం అని చూస్తే "నాసిక్" అక్కడికి రెండు గంటలే అని చెప్పారు. త్రయంబకం అక్కడ నుంచి మరో అరగంటేట. గోదావరి జన్మించిన ప్రదేశానికి వెళ్ళాల్సిందే అని నేను...సరే 'పద'మనుకుని బస్సెక్కేసాము. బస్సుని ఆటోలా తోలుకుంటూ బస్సు డ్రైవరు ఎనిమిదిన్నరకు నాసిక్ లో దించాడు. అంతకు ముందు ఎప్పుడూ మాకు నాసిక్ గురించి తెలీదు. అసలంత దూరం వెళ్తామని అనుకోలేదు కూడా. ఇంతలో భోరున వర్షం మొదలైంది. పిల్లకు ఆకలౌతుంది టిఫిన్ తెస్తాను, వచ్చాకా ఎలా వెళ్ళాలో చూద్దాం అని వెళ్ళారు శ్రీవారు. ఆ చీకట్లో ఓ బస్సు షెల్టర్ క్రింద పాపతో నిలబడ్డా. అరగంటైంది మనిషి రాలేదు. నాకు మళ్ళీ కంగారు మొదలైంది. నా ఫోనుంది కదా నీదెందుకు అన్నారని నా ఫోన్ కూడా తేలేదు. అసలే పొద్దుటి తోపులాట, ఇప్పుడిలా చీకట్లో..భయం...! ఎందుకు బయల్దేరామా..తనింకా రాలేదేంటి.. అని బుర్రలో రకరకాల ఆలోచనలు...


(మిగిలింది రేపు..)

14 comments:

SHANKAR.S said...

అన్నీ అనుకూలిస్తే ఈ సోమవారం వెళ్దాం అని ఆలోచన ఉందండీ. మనమనుకుంటే సరిపోతుందా ఆయన కూడా అనుకోవాలిగా.

"శుక్రవారం పొద్దున్నకి వైటింగ్ లోంచి RACలోకి వచ్చి, రైలెక్కే టైమ్ కి కన్ఫర్మ్ అయిపోయాయి."
వెళ్ళాలని రాసిపెట్టి ఉంటే ఆ సమయానికి అన్నీ అలాగే జరిగిపోతాయండీ. అదృష్టవంతులు.

తృష్ణ said...

@shankar.es:తప్పకుండా నాసిక్ + త్రయంబకం వెళ్ళి రండి...రాత్రికి త్రయంబకమ్ వెళ్పోతే పొద్దున్నే ఎక్కువ జనం లేకుండా దర్శనం అయిపోతుంది.
జోతిర్లింగ దర్శనం ఆనందం మాటల్లో చెప్పలేనిది. బ్రహ్మగిరి ఎక్కటానికి ఆటోలు ఉన్నాయి.750 మెట్లుట. పాపతో కష్టమని మేము ఆటోలోనే వెళ్ళామండి. రోడ్డు ఆగిపోయాకా దిగి ఓ ఏభై మెట్లు ఎక్కాలి అంతేనండీ. ఆటోవాడు ఐదొందలు నించీ నాలుగొందలు అడుగుతాడు. పైన మరో వైపు గుహలు కూడా ఉన్నాయి.మరి కాస్త పైకి ఎక్కగలిగితే అవి కూడా చూడొచ్చు. మేము ఎక్కలేకపోయాం. కొంచెం స్టిప్ గా ఉన్నాయి. అయినా వానలో ఆ క్లైమేట్ లో ప్రయాణం అద్భుతం. గొడుకు పట్టుకెళ్ళటం మరువకండి...:))

నైమిష్ said...

సస్పెన్స్ లో పెట్టారు..తర్వాత పొస్టు కోసం ఎదురుచూస్తూ..నాసిక్ త్రయంబకం గురించి కూడా వ్రాయండి..అక్కడ లోకల్ ఎకామిడేషన్ ఏమన్నా దొరుకుతాయా? r there ant gud restaurants around? Thanks Trushna gaaru..

prabandhchowdary.pudota said...

తృష్ణ గారు...సస్పెన్స్ లు క్రియేట్ చేస్తున్నారెంటండి......త్వరగా రాసేయ్యండెం.

హరే కృష్ణ said...

>>వర్షాకాలం పచ్చదనం ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చింది. దినపత్రికలు, టివీ ఛానల్స్, ఫోన్లు, ఇంటర్నెట్ ఏవీ లేకపొతే ఎంతైనా హాయే అని మళ్ళీ అనిపించింది.
ఇది చాలా కర్రెక్ట్..!


>>హారతి అవ్వగానే జనమంతా ఉన్మాదుల్లాగ తోసేసుకుంటూ దర్శనానికి ఎగబడ్డారు. ఎందుకో తొందర అర్ధం కాలేదు. హాలు దాకా చేరినవాళ్ళు దర్శనానికి వెళ్ళలేకపోతారా? ఎగబడి ఒకర్ని ఒకరు తోసుకోవటం వల్ల మరింత ఆలస్యం, తోపులాట, చికాకులు తప్ప భగవంతుడి దగ్గర ప్రశాంతత ఎక్కడుంటుంది? ఒకోసారి చదువుకున్నవాళ్ళు కూడా నిరక్ష్యరాసుల్లా ప్రవర్తిస్తారెందుకో..!
well said
షిరిడి to నాశిక్ రోడ్లే అంత దారుణం గా ఉంటాయి safety దృష్ట్యా :)

waiting for tomorrow's post

తృష్ణ said...

@నైమిష్: అసలు వాటి గురించే ముఖ్యంగా రాయాలనండి. రేపటి దాంట్లో రాస్తాను. త్రయంబకం లో ఉండటమైతే మంచివి ఉన్నాయి కానీ మాకయితే త్రయంబకంలో స్టే సరిగ్గా కుదరలేదండి.

@ప్రబంధ్ చౌదరి.పూదోట: పెద్ద సస్పెన్స్ ఏమీ లేదండి..ఏదో అలా ఆపాను..

తృష్ణ said...

@హరేకృష్ణ: రోడ్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమోనండి...ఇక ఆ వేన్లలో ప్రయాణం అయితే ఎత్తి కుదేసారు !బస్సే నయమేమో అనిపించిందండి.

Indira said...

hello thrishna garu!for the past 4,5 days, daily i was waiting for your post.so u went to shirdi!your travellog is very good.i remember,we went there 18 years back.it seems BABA in your photo calling me!eppatiki praptamo!waiting for your next post,Indira.

రవికిరణ్ పంచాగ్నుల said...

హ్మ్.. శ్రీమతి కూడా ఎప్పటినుంచో అంటోంది శిరిడీ వెళ్లాలని. మీరన్నట్టు మనం అనుకుంటే సరిపోదు కదా? ఆయన కూడా అనుకోవాలి కదా!.

ఎలాగూ మీ అనుభవాలు రాస్తున్నారు కదా.. మాకూ ఉపయోగపడుతుందిలెంది మీ "ట్రావెలాగ్" :)

విరిబోణి said...

you are lucky thrishna gaaru, enka naaku aa baba daggaraku velle adrustam kalagaledu :(

ఇందు said...

అయ్యబాబోయ్ సస్పెన్స్లో పెట్తేసారు! తరువాత ఏం జరిగింది?? అసలు నాసిక్ కి రాత్రిపూట వెళ్ళరట కదా! సాయంత్రానికి అక్కడికి బోలెడు కోతులు వచ్చేస్తాయని...అక్కడికి ఎవరూ వెళ్లరని ఎవరో చెబితే విన్నాను....మీరెలా వెళ్ళారు??? నెక్స్ట్ పార్ట్ రేపే వేసేయండీ..ప్లీజ్!

శ్రీ said...

తిరుమలలో కూడా ఇలాగే తోసుకుంటున్నారు. ఏమిటో ప్రజలు! మీకు జ్వరం తగ్గాక నిదానంగా మిగతా విశేషాలు రాయండి.

జ్యోతి said...

Get Well Soon Trishna.

-Mahek.

తృష్ణ said...

@ indira: Thanks for the concern..

@ రవికిరణ్, @ విరిబోణి: మీకు శిర్డీ వెళ్ళే అవకాశం త్వరలొ రావాలని కోరుకుంటున్నానండీ.ధన్యవాదాలు.

@ఇందు: సస్పెన్స్ ఏం లేదు.. అప్పటికే చాలా అయ్యిండని ఆపానంతే..థాంక్స్.

@sri, @mahek: thanks for the concern.