సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, September 17, 2010

పెంకుటిల్లు


శీర్షికను బట్టే ఏ పుస్తకాన్నైనా చదవాలనే అభిలాష కలుగుతుంది. రచయిత సమర్ధత కూడా శీర్షికను ఎన్నుకోవటంలోనే ఉంటుంది. "పెంకుటిల్లు" చదివాకా, నవలకు ఇదే సరైన పేరు అనిపిస్తుంది. ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారి "పరిపరి పరిచయాలు" పుస్తకం చదువుతుంటే, అందులో 'అలనాటి ఆంధ్రాశరత్' అంటూ వారి మిత్రులైన "కొమ్మూరి వేణుగోపాలరావు" గారి గురించి రాసిన వ్యాసం చదివాను. వృత్తిరీత్యా డాక్టరైన వేణుగోపాలరావుగారి నవల గురించిన కబుర్లు, ఆయనతో తనకు గల స్నేహం, ఇతర రచనల గురించి శర్మగారు అందులో రాసారు. వ్యాసంలోని కొమ్మూరిగారు రచించిన నవలల పేర్లు చూసి, అందులో నేను చదివినది "హౌస్ సర్జన్" ఒక్కటే అనుకున్నాను. మెడిసిన్ చదివే రోజుల్లో, అంటే 17,18ఏళ్ళ వయసులోనే "పెంకుటిల్లు" అనే నవల రాసారనీ, అది ఎంతో కీర్తిని ఆర్జించిపెట్టిందని చదివాకా ఆ నవలపై ఆసక్తి కలిగింది. అంత చిన్న వయసులో ఆయన ఏ సబ్జక్ట్ పై రాసారో.... ఆ పుస్తకం కొనుక్కోవాలి అనుకున్నా.

మొన్నొక రోజు ఇంట్లో చదవటానికి కొన్ని పుస్తకాలు తీస్తూంటే "పెంకుటిల్లు" కనబడింది. ఆశ్చర్యపోయా. నేనెప్పుడు కొన్నానో కూడా గుర్తులేదు...సంతకం కూడా లేదు.(పుస్తకం కొనగానే ఫస్ట్ పేజీలో సంతకం, కొన్న తారీఖు రాయటం నాకు అలవాటు) ఓహో, పేరు ఆసక్తికరంగా ఉందని కొని ఉంటాను అనుకున్నాను. మొత్తం చదివేసాను. చదివి రెండువారాలు అవుతోంది. నవల గురించి రాయటానికి ఇప్పటికి కుదిరింది. టినేజ్ లో ప్రేమా, కలలు అంటూ కాక ఇటువంటి బరువు కధాంశాన్ని ఎన్నుకోవటం ప్రశంసనీయం.


అంత చిన్న వయసులో మనుషుల మనస్థత్వాలు, మనోభావాలు అంత క్షుణ్ణంగా వ్యక్తం చేయటం నిజంగా రచయిత గొప్పతనమే. కధలో పాత్రలైన చిదంబరం, శారదాంబ, రాధ, నారాయణ, ప్రకాశరావు, శకుంతల, వాసు, సుగుణ...మొదలైనవారి పాత్రల చిత్రీకరణ, వారి వారి మానసిక విశ్లేషణ, కధలో చూపెట్టిన దిగువ మధ్యతరగతి(lower middle class) జీవనవిధానం, కధను నడిపించిన తీరూ ఆకట్టుకుంటాయి. కథ చదువుతున్నంతసేపూ ఒక విశాలప్రదేశంలో ఓ పెంకుటిల్లు, ఆ పరిసరలు ఉన్న చిత్రం మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటాయి. కథలోని వాస్తవికత హృదయాన్ని ద్రవింపజేస్తుంది.

కథ లోకి వస్తే, అనగనగా ఒక పెంకుటిల్లు. ఆ ఇంట్లో చిదంబరం, శారదాంబ అనే దిగువ మధ్యతరగతి దంపతులు. నారాయణ, ప్రకాశరావు, అన్నపూర్ణ, రాధ, వాసు, ఛాయ వారి సంతానం. ఆ ఇంటిలోని వ్యక్తుల జీవితాలలో జరిగిన సంఘటనలు, వారి జీవితాలలో వచ్చిన సమస్యలు, వాటివల్ల ఆయా వ్యక్తుల్లో వచ్చిన మార్పులు ఏమిటీ అన్నది కథ. చిదంబరానికి పేకాటే ప్రాణం. ఆర్ధిక ఇబ్బందులు అతడి బాధ్యతారహిత ప్రవర్తనను ఏమీ మర్చలేకపోతాయి. కధనంలో శారదాంబ పాత్ర ఎక్కువ లేక పోయినా పిల్లలకోసం, ఆ ఇంటి క్షేమం కోసం ఆమె పడే తపన అడుగడుగునా కనబడుతుంది. పెద్దకొడుకైన నారాయణ ఉన్నత వ్యక్తిత్వం, కుటుంబాన్ని నడపటం కోసం పాటుపడే అతని నిస్వార్ధతత్వం ముగ్ధుల్ని చేస్తుంది. అనుకూలవతి అయిన అతని భార్య సుగుణ, ప్రకాశరావును ప్రేమించి పెళ్ళాడే శకుంతల, ఆదర్శవంతమైన కోడళ్ళు అనిపించుకుంటారు.


తండ్రి మరణంతో వ్యాకులపడిన శకుంతలను "సుఖంగా ఉన్నప్పుడు బ్రతకగలిగి, దు:ఖం వచ్చినప్పుడు బ్రతకలేకపోతే మానవుడు జన్మించటం ఎందుకు?" అని ఓదార్చే ప్రకాశరావు ధైర్యం, నిరాడంబర జీవనం, బాధను భరించే శక్తిలేక ఇంటి బాధ్యతల నుండి పారిపోవాలనుకునే అతని పిరికితనం, శకుంతలను అర్ధం చేసుకోలేని అమాయకత్వం, కులాంతర వివాహం చేసుకోవటానికి అతను చూపిన తెగువ...ఇవన్నీ అతడి వ్యక్తిత్వం లోని బలాన్నీ, బలహీనతల్నీ, మానసిక సంఘర్షణను చూపెడతాయి. పావలా కోసం, అర్ధరూపాయి కోసం(అరవైల్లో ఆ నాణేలకున్న విలువ ఎక్కువే మరి) చిన్నవాడైన వాసు పడే తపన, అతనికి జరిగిన ప్రమాదం కంటతడిపెట్టిస్తాయి.

నవలలో ప్రకాశరావు, శకుంతలల ప్రేమకధ ఎక్కువ భాగమే ఉంటుంది. శకుంతలలోని ఔదార్యం, కరుణ, ధైర్యం అబ్బురపరుస్తాయి. ప్రేమించానని వెంటబడి, విపత్కర పరిస్థితుల్లో రాధ చేయి పట్టుకోలేని ఆనందరావు లాంటి పిరికి ప్రేమికులు, శ్రీపతి లాంటి గోముఖ వ్యాఘ్రాలు వాస్తవానికి ప్రతీకలు. ఇక కథలో సంపూర్ణ స్త్రీగా కనబడే పాత్ర రాధ. అందం, అణుకువ, ఆలోచన, తెలివితేటలు, చక్కని వ్యక్తిత్వం అన్నీ ఉన్న రాధ పాత్ర మనల్ని ఆకర్షిస్తుంది. వయసు ప్రలోభాలకు లొంగని, దీనమైన కుటుంబ పరిస్థితుల వల్ల ఏమాత్రం దిగజారని ఆమె వ్యక్తిత్వం ఆ పాత్రను ఎంతో ఎత్తున నిలబెడతుంది. పెద్దన్నలోని నిస్వార్ధగుణాన్ని, చిన్నన్న లోని అభిమానాన్ని, వదినలిద్దరి మంచితనాన్ని అమె అర్ధం చేసుకుంటుంది. ప్రమాదానికి గురైన వాసుకు మనోబలాన్ని అందిస్తుంది. కుటుంబక్షేమం కోసం పరితపిస్తుంది.

అటువంటి రాధ పాత్రకు కథలో జరిగిన (రచయిత చేసిన) అన్యాయం మాత్రం నాకు మింగుడుపడలేదు. వాస్తవం అంత కఠినంగా ఉంటుందని చెప్పటానికా? ఆమెకు జరిగిన అన్యాయాన్ని తలుచుకుంటే హృదయం బరువెక్కిపోతుంది. ఆ ఒక్క విషయంలో తప్ప మిగిలిన అన్ని కోణాల్లోనూ అప్పట్లో చరిత్ర సృష్టించిన "పెంకుటిల్లు" గుర్తుంచుకోదగ్గ మంచి నవల అనిపించుకుంటుంది. కల్పనీకాలూ, మిథ్యాజగత్తులూ నిండినవి కాక యదార్ధానికి దగ్గరగా ఉండే కథలను మెచ్చే చదవరులకు ఈ నవల తప్పక నచ్చుతుందని నా అభిప్రాయం.

2 comments:

lakshmi sravanthi udali said...

chala baga rasaru ee post chadivina ventane naaku anipinchidi okkate nenu indialo enduku lenaa ani
undi unte ventane velli pustakam koni chadivesunde daanni
anta bagaa rasaru meeru
inta manchi pustakaanni parichayam chesinanduku chala thanks

తృష్ణ said...

@lakshmi sravanthi udali: Thank you very much.