సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, December 30, 2009

షిర్డీ ప్రయాణం


బాబా పిలుపు వస్తేనే షిరిడీ వెళ్ళే అవకాశం, వీలు కలుగుతుందని భక్తుల నమ్మకం. బాబా కృప వల్ల ఆ పిలుపు మాకు మళ్ళీ మరోసారి వచ్చింది. నేను "అవసరం" అనుకున్న ప్రతిసారీ భగవంతుడు ఏదో ఒక భగవత్ రూపంలో దర్శనభాగ్యం కల్పిస్తూ నాకు తగినంత శక్తిని, పరిస్థితులను అవగాహన చేసుకునే బుధ్ధినీ ప్రసాదిస్తూ వస్తున్నాడు. ఇది నా జీవితంలో చాలాసార్లు అనుభవపూర్వకంగా నేను గమనించిన సత్యం. మనం మర్చిపోయినా మనల్ని భగవంతుడు ఎప్పుడూ ఒంటరిని చేయడు అని నమ్మేలా చేస్తాడు ఆ అంతర్యామి. "ఫుట్ ప్రింట్స్" కధలో కష్టకాలంలో నా ఒక్కడి అడుగుజాడలే ఉన్నాయేమని ఒక భక్తుడు ప్రశ్నిస్తే, ఆ కష్టకాలంలో నిన్నెత్తుకు మోసిను అడుగుజాడలు నావి....నీవి కావు" అని దేవుడు చెప్తాడు అలాగన్నమాట.

సరే ప్రయాణం కబుర్లలోకి వచ్చేస్తే, "షిర్డీ వెళ్దామని" అయ్యవారిని అడిగాను. "గుడ్ ఐడియా" అన్నారు. అప్పటికప్పుడు తత్కాల్ లో టికెట్స్ బుక్ చేసుకున్నాము. క్రిస్మస్ శెలవులు కదా జనముంటారని రూమ్ కోసం దగ్గర ఉన్న విజిటింగ్ కార్డ్స్ లోని హోటల్స్ కొన్నింటికి ఫోన్లు చేసారాయన. "ఐదో తారీఖు దాకా ఎక్కడా రూమ్స్ ఖాళీ లేవు సార్.." అన్నారుట వాళ్ళంతా. బొంబాయి నుంచి పాప చిన్నప్పుడు ఓసారిలాగే వెళ్ళి రూమ్ దొరక్క కాస్త ఇబ్బంది పడ్డాం చలిలో. చలికాలం, పాత అనుభవం రీత్యా రెండురోజుల ప్రయాణం కోసం పాపని ఇబ్బంది పెట్టడానికి మా మనసొప్పలేదు. అమ్మానాన్నల వద్ద పాపను దింపి బయల్దేరాము. అమ్మావాళ్ళ కొత్త ఇల్లు దానికి బాగా నచ్చేయటం వల్ల, అమ్మమ్మతాతయ్యల వద్ద అలవాటు ఉండటం వల్ల పాప పెద్దగా పేచి పెట్టలేదు. జాగ్రత్తలు చెప్తూంటే మాత్రం రెండురోజులకు అన్ని చెప్తావేమిటే? అని ఎదురు ప్రశ్న వేసింది.

ఇక రూమ్ గురించి...ఏదో ఒక దిక్కు బాబానే చూపిస్తారులే అని బయల్దేరాం. ట్రైన్లో నిద్రకుపక్రమిస్తూండగా ఒక ఎస్.ఎమ్.ఎస్ వచ్చింది నాకు. "నేనూ,తను ఈ ట్రైన్లోనే ఉన్నాం. మీరే బోగీలో ఉన్నారూ?" అని...మా కజిన్ నుంచి. వెంఠనే ఫోన్ చేసాం. యాదృచ్ఛికంగా నాన్నతో మాట్లాడిన వేరొక కజిన్ మేము షిర్డీ వెళ్తున్నట్లు తెలిసి, ట్రైన్లో ఉన్న వీడికి ఫోన్ చేసాడుట..."అక్కావాళ్ళు మీరున్న రైల్లోనే ఉన్నారని..". ఇంతకూ ట్రైన్లో ఉన్న తమ్ముడు చెప్పిన విషయం ఏమిటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు షిర్డీ వెళ్ళాలని నెల ముందే టికెట్లు బుక్ చేసుకున్నారట. మా బాబయ్య నెల ముందుగానే రూమ్ బుక్ చేసి ఉంచాడుట. మా ఆశ్చర్యానికి అంతు లేదు...అనుకోకుండా మా కజిన్ నాన్నకు ఫొన్ చేయటం, మా ప్రయాణం గురించి తెలవటం...అంతా మాయనిపించింది. మా కోసం బాబాగారు నెల ముందే రూమ్ రెడి చేసేసారన్నమాట...!!

నాగర్సోల్ లో దిగుదాం అనుకుని ఫోన్ అలారం సెట్ చేసుకున్నాం ఇద్దరు జంటలమూ. ఇక్కడ ఈ కజిన్ గురించి కొంచెం చెప్పాలి. వాడు మా పిన్ని కొడుకు. బొంబాయిలో మేము బోరీవల్లీ వెస్ట్ లో ఉండేప్పుడు వాడు బోరీవల్లీ-ఈస్ట్ లో ఉండేవాడు. వీక్ ఎండ్స్ కలిసి గడిపేవాళ్ళం. తనని వదలలేక వదలలేక నేను డెలివెరీకు వెళ్తూ "నీళ్ళు కాచుకోవటానికి కూడా బధ్ధకించి చన్నీళ్ళు పోసుకునే మనిషి....కాస్త జాగ్రత్తగా చూసుకోమని" వాడికి అప్పగించాను మావారిని...! నా కన్నీళ్ళు చూసి వాడు చలించిపోయి సిన్సియర్గా నేను మళ్ళీ వెళ్ళేంత వరకూ "బావగారికి" తన వీకెండ్స్ అన్నీ ధారపోసాడు. ఎంతగా అంటే ఆ ఏరియాలోని హోటల్స్ అన్నింటిలోని మెనూకార్డులూ బట్టీ వచ్చేంతగా. నాతో ఒక్క సినిమాకూ రాని మనిషి బావమరిదితో వారానికో సినిమా చూసేంతగా...నేను కుళ్ళుకుని దెబ్బలాడేంతగా...అదంతా వేరే కధ..!! ఇంతకూ ఈ బావాబావమరుదులది ఆనాటి మైత్రీ బంధం అన్నమాట.

పొద్దున్నే నూతన దంపతులు, మేము నాగర్సోల్ లో దిగాం. స్వెట్టర్, స్కార్ఫ్, కట్టుకున్నా చలి వణికిస్తోంది. మనకు రైల్లో చలికే జలుబుగారు నేనున్నానని వెతుక్కుని వచ్చేసారు. ముక్కులు దిబ్బడేసి గాలి పిల్చుకోవటమే కష్టమైంది. ఒక టాక్సీ మాట్లాడుకుని షిరిడీ చేరాం. రూమ్ ఖాళీ అవక కొంచెం ఆలస్యమైంది. త్వరగా తయారయి దగ్గర ఉన్న బిస్కెట్లు తలో నాలుగు లాగించి, ఉదయం పదిన్నరకల్లా దర్శనం లైన్లో దూరాం. విపరీతమైన జనం. రోడ్డు చివరిదాకా క్యూ ఉంది. తిరుపతిలో తప్ప ఇదివరకెన్నడు ఇంత జనాన్ని శిరిడీ లో చూడలేదు. రద్దీ టైమ్లో వెళ్ళకపోవటంవల్ల కావచ్చు లేదా జనాల్లో భక్తి పెరిగి ఉండవచ్చు. అనుకున్నాం.

క్యూలో కొన్నిసార్లు నడిచే పనే లేకపోయింది. గుంపుతో పాటుగా మా ప్రేమేయం లేకుండా ముందుకు నెట్టబడిపోయాం...అలానే జోగుతూ, నడుస్తూ, నుంచుని నుంచుని కాళ్ళు నెప్పులు పెడుతూంటే మధ్యాహ్న హారతి టైంకు లోపల క్యూల్లోకి చేరాం. సి.సి.టివీల్లో బాబాను దర్శించుకుంటూ హారతి పాడేసుకున్నాం. శెలవుల టైంలో రాకూడదు బాబోయ్..అనుకున్నాం. ఫ్రీగా విగ్రహానికే ఫొటోలు తీసుకున్న రోజులు ఉన్నాయి మరి. "ఎందుకండీ...ఇలా ఇంతసేపు క్యూలో నిలబెట్టేస్తున్నారు బాబాగారు?" అని అడిగాను తనను.."నీ సహనాన్ని పరీక్షించాలని.." అన్నారు ఠక్కున తను. కాబోలు...అనిపించింది.

ఎట్టకేలకు దాదాపు మధ్యాహ్నం రెండింటికి బాబాగారి విగ్రహం ముందుకు చేరాం. విచిత్రంగా కాళ్ల నెప్పులు,చిరాకు, విసుగు అన్ని మాయమైపోయాయి. అవ్యక్తానందంతో మనసంతా నిండిపోయింది. హుండిలో దక్షిణ వేసేసి, అందరి పేరునా సర్వేజనా సుఖినోభవంతు అనేసుకుని, ఆ నిశ్చలవదనాన్నిచూస్తూ ఆ ప్రశాంత క్షణాలను మనసారా ఆస్వాదించాను. విచిత్రంగా ఎవ్వరూ వెళ్ళు వెళ్ళుమని తొయ్యలేదు. కావాల్సినంత తృప్తిగా దర్శనం చేసుకున్నాం. పొద్దున్న గేటు బయట కొన్న నాలుగు గులాబీలూ బాబాను చెరే టైంకు ఒక్క గులాబీగా మారాయి.(తోపులాటలో మిగతావి రేకులు ఊడిపొయాయి..) ఆ ఒక్క గులాబినే సమాధిపై విసిరాను. అక్కడ వేసిఉన్న దండలోని రెండు గులాబీలు నా చేతికి చిక్కాయి. అవి తీసుకుని సంతృప్తిగా బయటకు నడిచాను.

ఆ ప్రాంగణంలోనే ఓ చెట్టు క్రింద కాసేపు కూర్చుని దర్శనం తాలుకూ "డివైన్ వైబ్రేషన్స్"ను మళ్ళీ మనసంతా నింపుకున్నాను. విభూతి తీసుకుని, కొన్ని కేలండర్స్ కొన్నాం. భోజనం చేసి చావడి,ద్వారకామాయి కూడా చూసి వచ్చాం. అదివరకు నేనేమైనా కొనుక్కునేదాన్ని. ఇప్పుడిక ఏది చూసినా పాపకు కొందామనే దృష్టే. నేనేం కొనుక్కుంటాను..అనే నిర్లిప్తత..! మా కజిన్ వాళ్లది రాత్రి 9.30 రైలు. మాది 7.30 రైలు. ఇక ఐదున్నరకే మేము నాగర్సోల్ బయల్దేరాం. లక్కీగా బస్సు దొరికింది. ఏడింటికల్లా స్టేషన్లో బెంచీ మీద కూర్చున్నాం ఇద్దరం. నా జలుబు బాగా ఎక్కువైపొయింది. జ్వరమొచ్చినట్లు కూడా ఉంది. ఈ రష్ లో, చలిలో పాపను తీసుకురాపోవటమే మంచిదైంది అనుకున్నాం.

ఓ పిల్లాడు కీచైన్స్, పిల్లల ఆట వస్తువులూ అమ్ముతూ అటువచ్చాడు. ఔరంగాబాద్ నుంచి రోజూ వచ్చి అమ్ముకుపోతాడుట. వాడి స్పిరిట్ కు ముచ్చటేసి ఓ నాలుగైదు ఐటెమ్స్ కొనేసాం పాపకు. "సీజన్ టికెట్ కొనుక్కుంటావా?" అని అడిగాను. "బిన్ టికెట్.." అనుకుంటూ వెళ్పోయాడు వాడు. ఆదివారం ఇల్లు చేరి, మళ్ళీ పొలోమని 20kms దూరంలో ఉన్న అమ్మావాళ్ళింటికి వెళ్ళి పాపను తీసుకుని ఇల్లు చేరే సరికీ శరీరపుఇంజెన్లో బ్యాటరీ అంతా అయిపోయింది...! మళ్లీ బ్యాటరీ లోడయ్యాకా ఇదిగో ఇప్పటికి టపా రాయగలిగాను...!!

అదండీ..మా షిర్డీ ప్రయాణం కధ...లోకాస్సమస్తా సుఖినోభవంతు... !!!

22 comments:

భాస్కర రామిరెడ్డి said...

తృష్ణగారూ, సరదాగా మంచి టపా వ్రాసారు. మీరు ముంబాయి బోరివలి వెష్ట్ లో వున్నారా? మరి మా జుహి కనిపించిందా మీకు?

>>"ఫుట్ ప్రింట్స్" కధలో కష్టకాలంలో నా ఒక్కడి అడుగుజాడలే ఉన్నాయేమని ఒక భక్తుడు ప్రశ్నిస్తే, ఆ కష్టకాలంలో నిన్నెత్తుకు మోసిను అడుగుజాడలు నావి....నీవి కావు"
నాకు కూడా ఇష్టం ఈ కథ. ఓ కవిత కూడా వ్రాసుకున్నాను.

దేవుని సన్నిధికి మనం వెళ్ళాలనుకోవాలే కానీ మిగిలినవి ఆఖరి నిమిషంలో నైనా వాటంతటవే సమకూరుతాయి కదా !

Padmarpita said...

మీ షిరిడీ ప్రయాణం బాగుందండి.

kiranmayi said...

ఇప్పుడే బాబా కి హారతి చేద్దాం అనుకుని, కూడలి తెరిచా. మీ టపా కనిపించింది. మంచి టపా కి థాంక్స్అండి.

Truely said...

meeku baba anugraham vundi andi..meeru lucky

Aditya Madhav Nayani said...

మంచి టపా బాగుంది ..
నూతన సంవత్సర శుభాకంక్షలు..
నా కానుకగా ఈ టపా అందుకోండి:
http://creativekurrodu.blogspot.com/

sunita said...

మీ షిరిడీ ప్రయాణం బాగుందండి.మేమూ వెళ్ళాలి. ఎప్పటికి కుదురుతుందో? ఏమో?

వేణూశ్రీకాంత్ said...

షిరిడీ కబుర్లు బాగున్నాయ్. ఇలా అనుకోకుండా అన్నీ అమరినపుడు నిజంగా ఆశ్చర్యమనిపిస్తుంది. భగవంతుడు మరోసారి నీకు తోడుగా నేను నడుస్తూనే ఉన్నాను రా నువ్వే నా ఉనికిని గుర్తించడంలేదు అని గుర్తు చేసినట్లు అనిపిస్తుంది.

budugu said...

పోయినేడు ఇలాగే బాబా దగ్గరికి వెళ్తే దర్శ్నం కూడా అవనీకుండా ముప్పుతిప్పలు పెట్టారు. తోసుకొని క్యూలో ఉందామంటే వెంట 85ఏళ్ళ తాతగారు. అకామడేషన్ దొరకలేదు. ఛ..ఏంటి బాబా ఇలా చేశారు అనుకున్నాను. వెనక్కొచ్చాక కూడా మనసులోంచి పోలేదీ విషయం. ఇదే విషయం ఒకసారి బాబాకు భక్తుడైన నా మిత్రుడితో చెపాను. I was refused at door steps అని డ్రమటిగ్గా :) రెండు వారాల్లో ఆ మిత్రుడితో షిర్డీ వెళ్ళే అవకాశం వచ్చింది. ఎక్కడిదో ఒక రికమండేషన్ సంపాదించి సంస్థాన్ వాళ్ళ వీ.ఐ.పి. అకామడేషను, సాయంత్రహారతికి ఎక్స్‌క్లూజివ్ లైనులో ప్రవేశం గట్రాలతో. ఏభై నిమిషాలు సమాధి ముందర నిలుచొని దర్శనం చేసుకున్నాను. నమ్మినంత వారికి నమ్మినంత మహదేవ! మీ బ్లాగుతో మళ్ళీ అన్నీ గుర్తొచ్చాయి. థాంక్సు.

మురళి said...

మొత్తానికి ప్రయాణం సుఖాంతం అన్నమాట.. బాగుందండీ..

వీరుభొట్ల వెంకట గణేష్ said...

మీ శిరిడీ ప్రయాణ విశేషాలు బాగున్నాయి.
___________________________
మనం మర్చిపోయినా మనల్ని భగవంతుడు ఎప్పుడూ ఒంటరిని చేయడు అని నమ్మేలా చేస్తాడు ఆ అంతర్యామి.
___________________________
మంచి మాట చెప్పారు.

టపాలో అక్కడక్కడా అక్షర దోషాలు ఉన్నాయి, గమనించగలరు.

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

మొత్తానికి యాత్ర శుభప్రదంగా జరిగింది. ప్రయాణాలంటే చిన్నచిన్న ఇబ్బందులు తప్పవుగా.

Unknown said...

పొద్దున్నే స్టేషన్ లో దిగినప్పటి ఆందోళన మొహం
మళ్ళి సాయంత్రానికి అదే స్టేషన్ బెంచ్ మీద కూర్చున్న ప్రశాంత వదనం
యి రెంటి మధ్య షిరిడి సాయుని దర్సనం
అదే ఆ తేడాకు నిదర్సనం

జయ said...

బాగుంది తృష్ణా మీ షిరిడీ అనుభవం. కష్టే ఫలే అన్నారు కదా! నా రీసెర్చ్ కోసం బాంబే లో ఉన్నప్పుడు అక్కడినుంచి ఒక సారి షిరిడీ వెళ్ళాను. అప్పుడు అసలు జనమే ఉండే వారు కాదు. ఎంతో ప్రశాంతంగా ఎంతో సేపు స్వామి ముందే ఉన్నాం. మళ్ళీ హైద్రాబాద్ నుంచి ఒక సారి వెళ్ళి నప్పుడు ఇదిగో ఇప్పుడు మీరు చెప్పిన లాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాం. ఎటువంటి పరిస్థితిలో అయినా ఆ షిరిడీ సాయి దర్శన తృప్తే వేరు. నాకూ కొంచెం విభూతి ఇవ్వొచ్చు కదా!

కొత్త పాళీ said...

nice

తృష్ణ said...

భాస్కర్ రామి రెడ్ది గారూ, జూహీ ఎప్పుడు కనబడ్లేదమ్డీ మరి..:)
ధన్యవాదాలు.

పద్మార్పితగారూ, ధన్యవాదాలు.

తృష్ణ said...

కిరణ్మయి గారూ, బాబాకు హారతి బాగా ఇచ్చినట్లు తలుస్తానండీ...ధన్యవాదాలు.

మేడీ గారూ,ధన్యవాదాలు. మీ బ్లాగ్ అప్పుడప్పుడు చూస్తానండీ..

తృష్ణ said...

ఆదిత్య మాధవ్ గారూ, ధన్యవాదాలు. మీక్కూడా నూతన సంవత్సర శుభాకంక్షలు..

సునీతగారూ, మీరూ త్వరలో వెళ్ళాలని కోరుకుంటున్నానండీ...ధన్యవాదాలు.

తృష్ణ said...

వేణూగారూ, మీరు చెప్పినది సత్యమండీ...ధన్యవాదాలు.

బుడుగుగారూ, బాగున్నాయండీ మీ ట్రిప్ విశేషాలు కూడా...ధన్యవాదాలు.

తృష్ణ said...

మురళిగారూ, అవునండీ...ప్రయణం బాగా జరిగింది...ధన్యవాదాలు.


ganeshగారూ, అర్ధరాత్రి రాసినందువల్ల , టైపింగ్ హడావుడి వెరసి అచ్చుతప్పులండి. కొన్ని సరి చేసాను..ధన్యవాదాలు.

తృష్ణ said...

చైతన్య: అవును మరి...ధన్యవాదాలు.

రవిగారూ, అవునండీ...ధన్యవాదాలు.

తృష్ణ said...

జయగారూ, విభూతి కావాలంటే మా ఇంటికి రండి మరి...:)
ధన్యవాదాలు.

కొత్తపాళీ: ధన్యవాదాలు.

prabandhchowdary.pudota said...

ఈ రోజు కాస్త ఖాళీ దోరికిన్దండి...చదువుతున్నా మీరు రాసినవన్నీ,కుదిరినంత వరకు....ఇంతకు ముందు కూడా చదివే వాడిని కానీ ఒక పద్ధతి ప్రకారం చదివే వాడిని కాదు..ఇప్పుడు పద్దతిగా ఫోల్డర్ ప్రకారం చదువుతున్నా.ప్రయాణాలు ఫోల్డర్ చదువుతుంటే....ఎందుకో బాబా తో, గోదారి జిల్లాలతో నా అనుభవం కూడా చెప్పాలనిపించింది..
నేను క్యాతోలిక్ ని..కానీ పెరిగేప్పుడు మా నాన్న అన్నీ గుడులు చూపించి అన్నీ ఒకటే రా అని నేర్పాడు..ఆ తర్వాత నాకు మతం మీద నమ్మకం పోయింది..దేవుడు మీద మాత్రమే నమ్మకముంది..కానీ 2008 లో రాహురీ అని షిర్ది దగ్గరలోనే వుండేది అక్కడకి ఇంటర్ యూనివర్సిటీ స్పోర్ట్స్ మీట్ కి వెళ్ళాం..అక్కడ నుండి, అదేంటో నండి చిత్రం గా షిర్డీ వెళ్ళాల్సివచ్చింది.వెళ్లాను.చూసాను.నచ్చింది.నాకూ బాగానే అనిపించింది. మళ్ళా అదోసారి గుర్తుకు వచ్చిందండి.
ఇక గోదారి జిల్లాలంటారా, నేను చదివింది,చదువుతున్నది చేపలు,రొయ్యల గురించి..కనుక తప్పకుండా ఆ జిల్లాల్లో గడపాల్సి వచ్చేది.తెగ తిరిగే వాడిని.మీరు చెప్పిన కొకనడ తోపాటు, ఉప్పాడ, తుని, అన్నవరం,కైకలూరు,భీమవరం,పాలకొల్లు,సామర్లకోట,రావులపాలెం,నర్సాపురం..ఆహా అన్నీ ఎమ్ వూర్లో అండి...పైగా చిన్నప్పుడు నేను పారిపోయిన గమ్యస్థానాలు కూడా ఇవే అవ్వడం..ఆహా ఎమ్ వూర్లండి..మళ్ళా గుర్తొచ్చాయ్ అండి.