సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, July 25, 2013

'తొవ్వ ముచ్చట్లు' - చిల్లోడి కొండప్ప




పొద్దుటి పేపరు ఇప్పుడు తిరగేస్తుంటే ఈ ఆసక్తికరమైన ఆర్టికల్ కనబడింది. జయధీర్ తిరుమలరావు గారు రాసిన "తొవ్వ ముచ్చట్లు" అనే పుస్తకం గురించిన వ్యాసం. అందులో అరకులోయ దగ్గరలో ఉన్న 'సొంపి' గ్రామానికి చెందిన "చిల్లోడి కొండప్ప" అనే గిరిజన వైద్యుడి గురించిన వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. వ్యాసం చాలా నచ్చింది నాకు. వీలైతే ఈ పుస్తకం కొనుక్కోవాలి.

ఎవరికైనా ఉపయోగపడుతుందని లేదా నాలా ఆసక్తి ఉన్నవాళ్ళు చదువుతారని ఇక్కడ లింక్ ఇస్తున్నాను..

ఇవాళ్టి ఆంధ్రజ్యోతి అనుబంధం నవ్య మొదటి పేజీ ఆర్టికల్:
http://epaper.andhrajyothy.com/PUBLICATIONS/AJ/AJYOTHI/2013/07/25/ArticleHtmls/25072013101022.shtml?Mode=1

తడిసిన జ్ఞాపకం..




ప్రియాతి ప్రియమైన నీకు...
ఇన్నేళ్ల తరువాత ఈ పిలుపేమిటి అని ఆశ్చర్యపోతున్నావా? మరి ఇలా తప్ప మరోలా మనం ఒకరినొకరం సంబోధించి ఎరుగుదుమా?! మనుషులం దూరం అయిపోయినా నువ్వు నా దగ్గరగానే ఉన్నావుగా ! ఇలా తప్ప మరోలా ఎలా పిలువను నిన్ను? ఎప్పుడన్నా నీకు నేను గుర్తుకు వస్తానేమో.. ఒక్కసారన్నా నీ ఉత్తరం వస్తుందేమో అని ఇన్నేళ్ళుగా ఎదురుచూస్తూనే ఉన్నాను.. నువ్వు రాయలేదని నేను ఊరుకోలేనుగా.. అందుకే ఇవాళన్నా నిన్ను పలకరిద్దామని మొదలెట్టాను...

కానీ..ఎక్కడ మొదలెట్టాలో తెలీట్లేదే...
సిటి బస్సులో మన మొదటి పరిచయం అయిన దగ్గర నుంచా?
ఆ పరిచయం చిగురులు తొడిగి అందమైన స్నేహంగా మారిన దగ్గరనుంచా?
కాలేజీ అయిన దగ్గర నుంచా?
నువ్వు యూనివర్సిటీకి వేరే ఊరెళ్ళిన దగ్గరనుంచా?
నీ పెళ్ళి అయిన దగ్గర నుంచా.. నా పెళ్ళి అయిన దగ్గర నుంచా?
సంసారంలో కొట్టుకుపోయి నన్ను నేను మర్చిపోయిన దగ్గర్నుంచా?
ఉద్యోగబాధ్యతల్లో పడి నువ్వు నన్ను మర్చిపోయిన దగ్గర్నుంచా?
ఎక్కడ్నుంచి మొదలెట్టాలో తెలీట్లేదు...


"గొప్ప స్నేహితురాలివి నువ్వు..." అన్న నీ మాటలు.. కడగళ్ల వాకిట్లో నే నిలబడినప్పుడల్లా నా చెవులకు వినబడి నాకు ఓదార్పునిస్తునే ఉంటాయి. రేడియోలోనో, సిస్టంలోనో ఏ స్నేహగీతమో వినబడినప్పుడల్లా నీ జ్ఞాపకం నన్ను తడుముతూనే ఉంటుంది. తను నాకు తోడుగా నిలబడ్డ ప్రతిసారీ... 'don't worry yaar..something best is in store for you' అన్న నీ మాటలు వినబడి కళ్ళు చెమ్మగిల్లుతాయి. చీర కట్టుకున్నప్పుడల్లా.. మొదటిసారి నువ్వు,నేను చీరలు కట్టుకుని కాలేజీలో అడుగుపెట్టి ఆపసోపాలు పడిన రోజు గుర్తుకొచ్చి నవ్వుకుంటాను. ఇప్పుడు గుల్జార్ పాటలు వింటూ మైమరిచే నేను.. అప్పట్లో గుల్జార్ గొప్పని నువ్వూ, జావేద్ అఖ్తర్ గొప్పని నేను చేసుకున్న వాదనలు తల్చుకుని నవ్వుకుంటాను :) వర్షం వచ్చినప్పుడు... నువ్వు, నేనూ ఒకే గొడుగులో కబుర్లు చెప్పుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిన మధురక్షణాలు తలుచుకుంటాను. "నిన్ను మర్చిపోయిన స్నేహితురాలిని అంతగా తలుచుకోవాలా..." అని తనన్నప్పుడల్లా... నువ్వు నాకెంత ప్రియమైనదావివో తనకు చెప్పలేక సతమతమౌతాను...



శలవులకు నువ్వు వచ్చినప్పుడు నీకిష్టమని జిలేబీ చేసి; అప్పటికి నేనింకా సంపాదించట్లేదని అమ్మను రిక్షాకు డబ్బులడగటానికి నామోషీ వేసి, మీ ఇంటికి నేను నడుచుకుంటూ వచ్చివెళ్ళినప్పుడు నీ కళ్లలో కనబడ్డ ఆనందం, గర్వం.. చెమ్మగిల్లిన నీ కళ్ళు.. నాకింకా జ్ఞాపకమే. మన స్నేహానికి శ్రీకారం చుట్టిన ఎన్.సి.సీ కేంప్ నుండి నువ్వు నాకు రాసిన మొదటి ఉత్తరం, ఆ తర్వాత కాలేజీలో కూడా క్లాసు జరుగుతుండగా మనం రోజూ రాసుకున్న కాగితపు కబుర్లు, ఫోన్ లో గంటల కొద్దీ పంచుకున్న ఊసులు, ఇచ్చిపుచ్చుకున్న గ్రీటింగ్స్, గిఫ్ట్స్, మార్చుకున్న అలవాట్లు గుర్తున్నాయా? నువ్వు ఎన్.సి.సీ కేంప్ లకు, డిబెట్లకు వెళ్ళినప్పుడు మిస్సయిన నోట్స్ లన్నీ నేను రాసిపెడుతుంటే క్లాసులో అంతా ఎంత కుళ్ళుకునేవారో.. నీకొచ్చిన ఫస్ట్ ప్రైజ్ లు,బహుమతులు చూసి నేనంత సంతోషపడేదాన్నో! మన సాన్నిహిత్యాన్ని చూసి కాలేజీలో ఉన్న నీ ఫ్యాన్స్ ఎంత అసూయపడేవారో గుర్తుందా? ఎవరితోనూ పంచుకోని సంగతులు, స్వవిషయాలూ నువ్వు నాతో చెప్పుకున్నప్పుడు నేనంటే ఎంత నమ్మకమో అని సంతృప్తిగా ఉండేది. నీతో కలిసి సినిమాలకు వెళ్లటం, మీ ఇంటికి రావటం ఎంతో థ్రిల్లింగ్ గా అనిపించేది నాకు. నీలాంటి టాపర్, బ్రిలియంట్ స్టూడెంట్ నా క్లోజ్ ఫ్రెండ్ కదా అని నేను గర్వంగా అంటుంటే, నువ్వేమో నీలాంటి నిజాయితీగల నమ్మకమైన స్నేహితురాలు దొరకటం నా అదృష్టం అనేదానివి..! యూనివర్సిటీ హాస్టల్లో చేరిన కొత్తల్లో "ఇక్కడందరూ అవసరాల కోసమే స్నేహం చేస్తారు. నిజాయితీగా ఏదీ ఆశించకుండా స్నేహం చేసేవారు ఒక్కరూ లేరు... యు ఆర్ మై గ్రేటేస్ట్ ఫ్రెండ్.. మై డియర్.. ఐ మిస్ యూ ఎ లాట్..." అని నువ్వు రాసిన వాక్యాలు నేను మర్చుపోలేదింకా.. ఆ ఉత్తరంతో నువ్వు పంపిన నీ బ్లాక్&వైట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో నా అడ్రస్ బుక్ లో ఇంకా అలానే ఉంది...


సరే గానీ, అసలు ఇప్పుడెందుకు ఈ సంగతులన్నీ గుర్తుకొచ్చాయని అడుగుతావా?  అలా అడిగితే ఏం చెప్పను? ప్రాణంలో ప్రాణంగా ప్రేమించిన స్నేహితురాలిని గుర్తుకుతెచ్చుకోవటానికి కారణాలు ఉంటాయా? తెలిసీ తెలియని వయసులో మనం పంచుకున్న మధురక్షణాలు, చెప్పుకున్న ఊసులు, చేసుకున్న వాగ్దానాలు, కలిసి పొందిన ఆనందాలు నా మనసులో ఇంకా సజీవమేననీ.. అవి మన మధ్య పెరిగిన దూరాన్ని నాకు కనబడనియ్యవని ఎవరికైనా ఎలా చెప్పను? ఇంత పిచ్చేమిటే నీకూ అని నవ్వుతారు కదా! ఒక్కసారి నీకు ఫోన్ చేసి ఎలా ఉన్నావే? అని అడగాలని, నిన్ను చూడాలనీ ఉందని నీకు ఎలా చెప్పను?


ఇంతసేపూ కూర్చుని రాసిన ఈ ఉత్తరం నీకు పోస్ట్ చేసాకా, నీ జవాబు రాకపోతే?? అందుకే ఇన్నేళ్ళుగా నీకు రాసి కూడా పోస్ట్ చెయ్యని ఉత్తరాల్లాగ, ఈ ఉత్తరాన్ని కూడా నీకు పోస్ట్ చెయ్యకుండానే దాచేస్తున్నా...



Wednesday, July 17, 2013

రెండు కొత్త సినిమాలు



విడిగా రాయటం కుదరట్లేదని ఈమధ్యన చూసిన రెండు సినిమాల గురించి ఒకే టపాలో రాసేస్తున్నా..

1. Lootera - a beautiful painting !

నిజంగా ఒక అందమైన చిత్రం ఇది. ప్రతి ఫ్రేమ్ ఒక అందమైన పైంటింగ్ లాగ ఉంది. ఫోటోగ్రఫీ అద్భుతం. 1950s ప్రాంతానికి సంబంధించిన ఒక బెంగాలి జమిందారు, అతని కూమార్తె తాలుకూ కథ "లుటేరా". ఆ కథకు తోడుగా, ప్రఖ్యాత ఆంగ్ల కథకుడు ఓ.హెన్రీ కథానిక "The Last Leaf" కధను ఈ సినిమా రెండవ భాగంలో వాడుకున్నారు. 


ఈనాటి ఫాస్ట్ ఫార్వార్డ్ కాలంలో ఇలాంటి స్లో సినిమాను తీసినందుకు దర్శకుడి ధైర్యాన్ని మెచ్చుకోవాలి. విక్రమాదిత్య మోత్వానికి తన రెండవ సినిమా కూడా అవార్డుల వర్షం కురిపించేస్తుంది అనిపించింది. అసలు చిత్రం షూటింగ్ కి చాలా ఆటంకాలు ఏర్పడ్డాయిట. షూటింగ్ కాన్సిల్ అయి, బోల్డు డబ్బు వృధాపోయిందిట. అయినా మళ్ళీ మంచు ప్రాంతపు లొకేషన్ సెట్టింగ్స్ వేసి మరీ పూర్తిచేసారుట సినిమాను. 


కథాంశం పాత తరానికి చెందినది కాబట్టి నాయికా నాయకుల వస్త్రధారణ కూడా ఆ కాలానికి తగ్గట్టుగా వాడారు. నాయిక "పాఖీ" పాత్రను 'సోనాక్షి సిన్హా' గుర్తుండిపోయేలా, సమర్థవంతంగా పోషించింది. అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అనచ్చు. అసలీ కాలంలో కనబడుతున్న తాటాకుబొమ్మల్లాంటి వీరోవిన్నుల్ని చూసి చూసి కళ్ళు కూడా సన్నబడిపోయాయేమో, తెరపై నిండుగా, బొద్దుగా, ముద్దుగా, సిన్మా మొత్తం చీరకట్టులో కనబడ్డ ముద్దుగుమ్మ నిజంగా మనసుని దోచేసింది. ఆమె ముక్కు మాత్రం కాస్త చెక్కేసినట్లు ఉంది గానీ పిల్ల అందంగానే ఉంది. నాయకుడు పాత్ర కాస్త నెగెటివ్ షేడ్ ఉన్నది కాబట్టి 'రన్వీర్ సింగ్' మొహం సరిగ్గా సరిపోయింది అతని పాత్రకి. 


పరమ స్లో టేకింగ్! కొన్ని సీన్స్ లో నాకే బోర్ కొట్టింది ఇంకా కెమేరా కదపడేంటి? ఏం చెప్తాడు ఇంకా? అని. (ముఖ్యంగా కొలను దగ్గర వాళ్ళిద్దరూ మాట్లాడుకునే సీన్ లో.) కొత్త సినిమాల్లోని హడావుడి డైలాగులతో, షాట్స్ తో, ఫైటింగులతో, సీన్ లో అంతమంది ఎందుకున్నారో కూడా తెలియని గుంపు బంధుత్వాలతో, లేనిపోని ఆర్భాటాలతో విసిగిపోయి ఉన్నామేమో చిత్రం లోని స్లో టేకింగ్ ని, అతితక్కువ పాత్రల్ని కూడా ఎంజాయ్ చేసాము మేము. స్టేజ్ ఫిఫ్టీస్ లోది కదా అందుకని టెకింగ్ కూడా అప్పటి సినిమాల మాదిరిగా తీసారేమో అనుకున్నా. 


సంగీత దర్శకుడు 'అమిత్ త్రివేది', పాటల రచయిత 'అమితాబ్ భట్టాచార్య' ల కాంబినేషన్ బాగా కుదిరినట్లుంది. వీరిద్దరి జోడీలో వచ్చిన పాటలన్ని బాగుంటున్నాయి. నేపథ్య సంగీతం కూడా సన్నివేశాలకు తగినట్లుగా ఉంది. 'SAWAAR LOON' పాట నాకు బాగా నచ్చింది. ఈ పాట గురించి ఈ టపాలో చూడవచ్చు: http://samgeetapriyaa.blogspot.in/2013/07/sawaar-loon.html


ఈ 'మన్నర్జియా' పాట కూడా బాగుంది..

అసలు ట్రాజడీల జోలికి వెళ్ళని నేను ఒక రొమాంటిక్ ట్రాజెడిని మొదటిసారి ఎంజాయ్ చేసాను. బహుశా హీరో చెడ్డవాడు కాదు, ఆమెను మోసం చెయ్యలేదు నిజంగానే ఆమెను ప్రేమించాడు అన్న సాటిస్ఫాక్షన్ వల్లనేమో! ఇంత మంచి సినిమాను నాకు చెప్పకుండానే టికెట్లు బుక్ చేసేసి చూపించినందుకు 'తుమ్ పర్ లగాయీ మేరీ సారీ షికాయెతే మాఫ్' అనేసా శ్రీవారితో :-) 

ఈ సినిమా ట్రైలర్:


2. సాహసం - విఠలాచార్య రంగుల సినిమా 



ఈమధ్యన చూసిన రెండవ సినిమా గోపీచంద్ నటించిన "సాహసం". ఈ సినిమా కోసం నేనైతే ఎదురుచూసాననే చెప్పాలి. చిన్నప్పుడు "ట్రెజర్ ఐలాండ్" చదివిన రోజుల్నుండీ నాకు ఎడ్వంచర్స్ అంటే మహా ఇష్టం. హీరో గోపీచంద్ + ఇలాంటి థీం అనగానే బాగుంటుందేమో అని ఆశ. పైగా ఈ దర్శకుడు గతంలో తీసిన సినిమాలు కూడా నా ఆశను నిలబెట్టి ఉంచాయి. నేను ఇలా ఎక్కువగా ఆశ పడిపోవటం వల్ల కాస్త నిరుత్సాహపడ్డాను కానీ మొత్తమ్మీద సినిమా బాగుంది. 


మన 'జానపద బ్రహ్మ' విఠలాచార్య సినిమాలు చూసినప్పుడల్లా.. అసలు ఈయనకు ఇప్పటి టెక్నాలజీ, గ్రాఫిక్స్ అందుబాటులో ఉండి ఉంటే స్పీల్బర్గ్ ను మించిన అద్భుతాలు సృష్టించేవాడు కదా అనుకుంటూ ఉంటాను. ఇంకా, ఇప్పుడెవరూ ఇలాంటి సినిమాలు తియ్యరేమని దిగులుపడుతుండేదాన్ని. ఇన్నాళ్లకి ఆ సరదా తీరింది. ఈ సినిమా రెండవ భాగంలో గుడి లోపల సీన్లు చాలా బాగా వచ్చాయి. మళ్ళీ విఠలాచర్య సినిమా చూసినంత ఆనందం కలిగింది. ఆ తలుపులు, పాత నిర్మాణాలూ, సెట్టింగ్స్ అంతా కూడా అద్భుతంగా వచ్చాయి. 


'శ్రీ' చాలా రోజులకు సంగీతాన్ని అందించారు బాగుంటాయి పాటలు అనుకున్నా కానీ పాటలు పెద్ద గొప్పగా లేవు. అసలు ఆ పాటలు కూడా ఏదో పేట్టాలి కాబట్టి పెట్టినట్లు ఉన్నాయి. అవి లేకపోయినా బాగుండేది సినిమా. అయితే 'నేపథ్యసంగీతం' మాత్రం చాలా బాగా చేసారు. సన్నివేశాలకు ప్రాణం పోసేది నేపథ్యసంగీతమే మరి! 


ఈ సినిమాలో వీరోవిన్ను ని మొదటిసారి కాస్త భరించగలిగాననిపించింది. వెకిలి కామిడీ ట్రాక్ లేకపోవటం హాయి నిచ్చింది. పెద్ద సెక్యూరిటి ఆఫీసర్ గా అలీని పెట్టడం బాగుంది కానీ అంత పెద్ద ఆఫీసర్ అని చెప్తూ అలా పిరికివాడిగా చూపించటం నచ్చలేదు నాకు. 


సినిమా అయ్యాకా ఒక దిగులు మొదలైంది.. ఇది బాగుంది కదా అని ఇలాంటివే మరో పాతిక సినిమాలు వచ్చేస్తాయేమో అని !!


'SAWAAR LOON'





ఇటీవల విడుదలైన "లుటేరా" సినిమాలో 'SAWAAR LOON' పాట నాకు బాగా నచ్చింది. గాయని మోనాలి ఠాకుర్ కూడా బాగా పాడింది. సంగీత దర్శకుడు అమిత్ త్రివేది, పాటల రచయిత అమితాబ్ భట్టాచార్య ల కాంబినేషన్ బాగా కుదిరినట్లుంది. వీరిద్దరి జోడీలో వచ్చిన పాటలన్ని బాగుంటున్నాయి. క్రింద లింక్ లో ఆ పాట చూడచ్చు: 

 

 SAWAAR LOON పాట విన్నప్పుడల్లా ఏదో పాత పాట అనిపించేది. ఈ  పాట పల్లవి + ఇంటర్ల్యూడ్స్ చివర్న వచ్చే 'టింగ్..టి..టింగ్..టి..టింగ్' అనే బెల్స్ దేవనంద్ పాట "మై జిందగి కా సాథ్ నిభాతా చలా గయా" పాటలో ఉంటాయి..అలాంటివి. ఆలోచించగా.. చించగా.. చివరికి అసలు మూలం ఏమిటో తట్టింది.. ఈపాట "పరఖ్" సినిమాలోని "మిలా హై కిసీ కా ఝుంకా" పాటని గుర్తు చేసింది..కాపీ అనను కానీ inspiration అయి ఉండచ్చు.  మీకూ అనిపించిందేమో చెప్పండి... 





Monday, July 15, 2013

ఇద్దరికి నివాళి..




గతవారంలో మరణించిన ఇద్దరు ప్రముఖులకు నివాళి ఈ టపా. 

మొదటివారు భారతీయ సినిమా చరిత్రలో చెప్పుకోదగ్గ గొప్ప 'విలన్' పాత్రధారుల్లో ఒకరు "ప్రాణ్". ఏ విలన్ పాత్ర చేసినా అందులో ఒదిగిపోయి, అతి భయంకరమైన కౄరుడిగా, నీచమైన జీవిగా, అసహ్యం కలిగేలా నటించగలగడం అతని టాలెంట్. స్టైలిష్ గా ఒక సిగరెట్ కాల్చినా, కళ్ళల్లోనే క్రౌర్యాన్ని చూపించినా, విషపు నవ్వు నవ్వినా ప్రాణ్ లాగ ఇంకెవరూ నటించలేరనిపిస్తుంది. అసలు మంచివాడిలా, అతిమంచివాడిలా, దేశోధ్దారకుడిలా నటించటం కన్నా ఇలా చెడ్డవాడిలా, అందరూ అసహ్యించుకునేలా నటించగలగటమే నిజమైన ప్రతిభ అని నా ఉద్దేశం. అసలలాంటి నెగెటివ్ రోల్స్ చేసి చేసి antagonist పాత్రధారుల్లో ఉండే చెడంతా(అంటే వాళ్ల సహజమైన nature లో ఉండే చెడంతా) బయటకు వెళ్పోయి వాళ్ళు ప్యూరిఫైడ్ అయిపోతారని చదివిన గుర్తు. అలా అయినా కాకపోయినా వ్యక్తిగా ప్రాణ్ చాలా మంచి వ్యక్తి అని విన్నాను నేను. 2002 లో జీటీవిలో "Jeena Isi Ka Naam Hai " అని ఫారూఖ్ షేక్ హోస్ట్ చేసిన ఒక షో వచ్చేది. అందులో ఓసారి ప్రాణ్ గురించి కూడా షో చేసారు. ఆ షో ద్వారానే అనుకుంటా నాకు ప్రాణ్ గురించి ఎక్కువగా తెలిసింది. ఇలాంటి షోలు, ఇంటర్వ్యూస్ చెయ్యకపోతే ఎప్పటికీ విలాన్ పాత్రధారులంతా నిజంగా దుర్మార్గులనో, నీచమైనవాళ్లనో అభిప్రాయం మన మనసుల్లో ఉండిపోతుంది.  

ప్రాణ్ నటించిన సినిమాల్లోని కొన్ని గుర్తుండిపోయే పాత్రల్ని గురించిన ఆర్టికల్ ఒకటి రీడిఫ్ లో వచ్చింది.. ఆసక్తి ఉన్నవాళ్ళు ఆ ఆర్టికల్ క్రింద లింక్ లో చదవచ్చు: 
http://www.rediff.com/movies/slide-show/slide-show-1-the-most-memorable-roles-of-pran/20130713.htm 

ఆయనకు చాలా ఆలస్యంగా అందించారని సినీపరిశ్రమలో కొందరు ఆవేదన వ్యక్తపరిచారు కానీ బ్రతికుండగా ఇచ్చారు కదా అని నేనైతే ఆనందించాను. మే నెలలో ప్రాణ్ ఇంట్లో ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందించినప్పటి వీడియో క్లిప్పింగ్:

 

 ****    ****    ****

 నా రెండవ నివాళి.. "బోస్ కార్పొరేషన్" ఫౌండర్ అమర్ బోస్  గారికి. ఒక భారతీయ పేరుకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఘనత అయనది. జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోవాలనుకునేవారు, ఏదన్నా ప్రత్యేకంగా సాధించాలి అనుకునేవారు ఇలాంటి ప్రఖ్యాత వ్యక్తుల నుండి స్ఫూర్తి పొందాలి అనుకుంటుంటాను నేను.

ఆయన మరణవార్త, ఆయన వ్యక్తిత్వానికి గురించిన కొన్ని వివరాల తాలుకు ఆర్టికల్ క్రింద లింక్ లో:
http://www.rediff.com/money/report/tech-acoustics-pioneer-and-founder-of-bose-corporation-dies-at-83/20130713.htm 

 బోస్ గారి గురించిన చిన్న వీడియో క్లిప్పింగ్ ఇక్కడ: 





Thursday, July 4, 2013

“జల్తే హై జిస్కే లియే”


సామాజిక సమస్యలపై సినిమాలు తీయడంలో నిపుణుడైన “బిమల్ రాయ్” దర్శకత్వంలో వచ్చిన సినిమా “సుజాత(1959)”. అంటరానితనం ప్రబలంగా ఉన్న అప్పటి రోజుల్లో, అది నేరమని చెప్తూ, ఆ జాడ్యాన్ని విమర్శిస్తూ, ‘అంటరానితనం’ ముఖ్య నేపథ్యంగా తీసిన చిత్రమిది. సుబోధ్ ఘోష్ అనే ప్రముఖ బెంగాలి రచయిత రచించిన కథ ఆధారంగా ఈ చిత్రం తయారైంది. సుబోధ్ రాసిన మరెన్నో కథలు హిందీ, బెంగాలీ సినిమాలుగా రూపొందాయి. 1959లో మూడవ జాతీయ ఉత్తమ చిత్రంగా ఎన్నికవటంతో పాటుగా, నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ లను కూడా ఈ చిత్రం సంపాదించుకుంది. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా ప్రదర్శింపబడింది.


ఈ సినిమాలో  “జల్తే హై జిస్కే లియే” అనే ‘ఫోన్ పాట’ నాకు చాలా ఇష్టం. అధీర్ ప్రేమను అంగీకరించి ఇంటికి వచ్చిన వెంఠనే తల్లి తనకు ఒక హరిజనుడితో వివాహాన్ని కుదిర్చిందని తెలిసి సుజాత బాధపడే సమయంలో అధీర్ ఈ ప్రేమగీతాన్ని ఆమెకు ఫోన్ లో వినిపిస్తాడు. కన్నీరు నిండిన కళ్ళతో, బాధతో అధీర్ ఉత్సాహంగా పాడే ఈ పాటను మౌనంగా వింటుంది సుజాత. అప్పటి సినిమాల్లో ‘ఫోన్ లో పాట’ ఒక ప్రయోగమే అయ్యుంటుంది.





పాట వాక్యార్థం వాకిలి పత్రికలో చూడండి:
http://vaakili.com/patrika/?p=3295


Monday, July 1, 2013

అవసరమా?




సందర్భానుసారం రంగులు మారే నైజాలే అందరివీ..
సంజాయిషీలు అవసరమా?

అడగటానికి చాలానే ఉంటాయి ప్రశ్నలన్నీ..
అన్నింటికీ జవాబులు అవసరమా?

జీవనసమరంలో విసిగివేసారిన ప్రాణాలే అన్నీ..
కారణాన్వేషణ అవసరమా?

విరిగిపోయినా, అతుకులతో నడిచిపోయేవే మనసులన్నీ..
అతకడం అవసరమా?

తెంచుకుంటే తెగిపోయేంత అల్పంకావీ బంధాలన్నీ.. 
ముడేసుకోవటం అవసరమా?

ఎప్పటికైనా అపార్థాలను మిగిల్చేవే మాటలన్నీ.. 
మాటలు అవసరమా?



Sunday, June 30, 2013

లోపాలున్నా, మనసుని తాకిన 'Raanjhanaa'





సినీభాషలో ఏ లోపాలు లేని వాడే హీరో. ఈ రోజుల్లోని సినిమా కథల్లో లోపాలున్న హీరోలయితే అస్సలు కనబడరు. అందరూ హీమేన్లే. మరి, తనలో లోపాలున్నా సినిమా చూసిన చాలాసేపటి వరకూ.. ఇంకా అతని గురించే ఆలోచించేలా చెయ్యగలిగాడు ఈ "Raanjhanaa". ఈ చిత్రం విడుదలైన వారంలోనే ప్రపంచవ్యాప్తంగా మంచి లాభాలు గడించిందని వినికిడి.


బనారస్ లో ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడు కుందన్. ఎనిమిదేళ్ల వయసులో నమాజ్ చేస్తున్న "జోయా" ను మొదటిసారి చూసినప్పటి నుండీ ఆమె అంటే పిచ్చి ప్రేమ కలుగుతుంది అతనికి. ఇలా స్కూలు పిల్లల మధ్యన ప్రేమ చూపించే పిల్లలను పాడుచేస్తున్నారు అనుకునే లోపూ స్కూలు వయసులోనే ఆమెను ఒప్పించటానికి బ్లేడ్ తో తన చెయ్యి కోసేసుకుంటాడు కుందన్. స్కూల్ డ్రస్సులో ఉన్న జోయా అతని ప్రేమను అంగీకరిస్తుంది కానీ నేను ఇంకా బాగా తిట్టుకున్నా. ఇదేం సినిమా బాబోయ్.. ఇలాంటివి సినిమాల్లో చూపించి అగ్నికి అజ్యం పోస్తున్నారే.. అని! 


తర్వాత ఇంట్లోవాళ్ళు జోయాను వేరే ఊరు పంపించి చదివిస్తారు. ఓ ఎనిమిదేళ్ల తరువాత జోయా మళ్ళీ బనారస్ వస్తుంది. అప్పటికి ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చదువుతూ ఉంటుంది. ఆమె లేకపోయినా జోయా తలపుల్లోనే గడుపుతూ, ఆమె ఇంటి చూట్టూ తిరుగుతూ ఇంట్లోవాళ్లని మచ్చిక చేసుకుంటాడు కుందన్. జోయా కోసమే ఎదురుచూసే అతనికి ఆమె తనని గుర్తుపట్టకపోవటం పెద్ద షాక్. మెల్లగా ఆమెతో మళ్ళీ స్నేహం కలిపి మనసులో మాట చెప్తాడు మళ్ళీ. చిన్నతనాన్ని మర్చిపొమ్మనీ, తాను యూనివర్సిటీలో వేరే మనిషిని ప్రేమిస్తున్నాననీ, అతను లేకుండా బ్రతకలేననీ చెప్తుండి జోయా. ఇది ఇంకా పెద్ద షాక్ కుందన్ కి.


వేదనతో మరోసారి ఆత్మహత్యాయత్నం చేసుకుని, అసలు జోయానింక కలవనని చెప్పినా, నెమ్మదిగా తేరుకుని, జోయా తండ్రిని ఆమె ప్రేమికుడితో పెళ్ళీకి ఒప్పిస్తాడు కుందన్. తనని చిన్నప్పటి నుండీ ఇష్టపడే బిందియాను పెళ్ళాడతానని ఇంట్లో ఒప్పుకుంటాడు. సరిగ్గా పెళ్ళి జరిగే సమయానికి జోయా ప్రేమికుడు ముస్లిం కాదని, హిందువే నని తెలిసి, పట్టరానికోపంతో జోయా ఇంటికి వెళ్ళి, న్యూస్పేపర్లోని ఋజువు చూపించి ఆ పెళ్ళి ఆగిపోవటానికి కారకుడౌతాడు. ఈలోపూ జోయా ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుందని, ఆమె బంధువులు కొట్టిన దెబ్బలకి జస్జీత్(ఆమె ప్రేమికుడు) కూడా తీవ్రంగా గాయపడ్డాడని తెల్సుకుంటాడు. జస్జీత్ ను వెతికి హాస్పటల్లో చేరుస్తాడు. ఈ హడావుడిలో తన పెళ్ళి సంగతి మర్చిపోతాడు. ఇంటికి వెళ్ళేసరికీ కోపంతో ఉన్న తండ్రి కుందన్ ను గెంటివేస్తాడు. 


జోయా దగ్గరకు వెళ్ళి ఆమె తనను అసహ్యించుకుంటున్నా, ఆగిపోయిన పెళ్ళి జరిపించాలనే ఉద్దేశంతో జస్జీత్ ఇంటికి తీసుకువెళ్తాడు ఆమెను. కానీ అక్కడ జస్జీత్ మరణం గురించి తెలుసుకుని అపరాధభావంతో కుమిలిపోతాడు. ఎక్కడెక్కడో తిరిగి తిరిగి చివరకు గంగా తీరంలో కూచుని ఉండగా ఒకాయన ఓ మాట చెప్తాడు కుందన్ కి.. "ప్రపంచంలో ఏ పుణ్యస్థలానికీ హత్యానేరాన్ని క్షమింపగలిగే శక్తి లేదు. ఇక్కడ గంగ ఒడ్డున ముక్తి కోసం కూచోవటం కాదు..వెళ్ళు.. వెళ్ళి ఏది చెయ్యాలో అది చెయ్యి." అని! అప్పుడు మళ్ళీ జోయాను వెతుక్కుంటూ వెళ్తాడు. ఆమె తనను క్షమించాలనే ఏకైన లక్ష్యంతో ఆమె అసహ్యాన్ని భరిస్తూ అక్కడే ఓ టీ కొట్టులో పనిచేస్తుంటాడు. విద్యార్థి నాయకుడిగా జస్జీత్ స్థాపించిన రాజకీయ పార్టీ తరఫున జోయా పనిచేస్తూంటే, తానూ ఆ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవటం మొదలుపెడతాడు. 


ఇక్కడ్నుంచీ ప్రేమకథ హటాత్తుగా రాజకీయ కథనంగా మారిపోతుంది. కొన్ని సంఘటనల కారణంగా పార్టిలో కుందన్ ప్రముఖమైన వ్యక్తిగా మారిపోతాడు. జోయా ఇది సహించలేకపోతుంది. జస్జీత్ మరణానికి కారకుడిని నాయకుడిని చేసేస్తున్నారా? అని మిత్రులతోనూ, జస్జీత్ స్థానంలో కూచుని నన్ను దక్కించుకుందామనుకుంటున్నావా? అని కుందన్ తోనూ దెబ్బలాడుతుంది. ఆ ఆవేశంలోనే విద్యార్థుల పార్టీని తమవైపు తిప్పుకోవాలనుకుంటున్న సి.ఎం. మాటలను విని కుందన్ ప్రాణాలకి హాని తలపెడుతుంది.


కుందన్ ఏమౌతాడు? జోయా అతడిని క్షమిస్తుందా? అతడి ప్రేమలో స్వచ్ఛతను అర్థం చేసుకోగలుగుతుందా? ఈ కథ ఎలా ముగుస్తుంది? మొదలైన ప్రశ్నలకు సమాధానం కావాలంటే "Raanjhanaa" చూడాలి మరి. ఈ కథకు ఈ ముగింపు సబబేనా? అన్న ప్రశ్న కలిగినా నచ్చకపోవటం మాత్రం జరగలేదు. 

హిందీ జగ్రత్తగా నేర్చుకుని తనకు తానే డబ్బింగ్ చెప్పుకున్న ధనుష్, 'కుందన్' పాత్రకు సరైన న్యాయం చేసాడు. impressive work! ఇదివరకూ ఇతని సినిమాలేం చూడలేదు నేను. ఇక జోయా గా నటనకు ఆస్కారం ఉన్న మంచి పాత్ర చేసింది సోనమ్ కపూర్. చిలిపితనం, మంకుపట్టు, అహంకారం, వయసుతో పెరిగే పరిణితి.. అన్నిరకాల భావాలనూ జోయాగా చక్కగా చూపెట్టింది ఈ అమ్మాయి. చిత్రం చివరిభాగంలో సోనమ్ నటన ఆకట్టుకుంటుంది. చిన్న పాత్రే అయినా జస్జీత్ గా అభయ్ డియోల్ అలరిస్తాడు.


కొన్ని డైలాగ్స్ చాలా బాగున్నాయి. రెహ్మాన్ పాటల కన్నా సీన్స్ కి సరిపడా ఇమోషన్స్ ప్రేక్షకుల్లో కూడా కలిగేలా చేసిన నేపథ్యసంగీతం చాలా బాగుంది. మొత్తమ్మీద తీసిపారేయాల్సిన సినిమా మాత్రం కాదు. కథలో, పాత్రల్లో ఏ లోపాలున్నా, మనసుని తాకే ఒక విభిన్నమైన ప్రేమకథగా మాత్రం గుర్తుండిపోతుంది. అప్పుడెప్పుడో చూసిన "Gangster" ఇలానే చాలా కాలం మనసుని కదిలించివేసింది!!

movie trailer:

 

Friday, June 28, 2013

వరంగల్ ప్రయాణం - భద్రకాళి ఆలయం


హనుమకొండలో ఉన్న వెయ్యి స్థంభాల గుడి నుండి వరంగల్ లోని భద్రకాళి ఆలయానికి ఆటోలో పావుగంటలో చేరిపోయాం. సూర్యుడు అస్తమించే సమయం. పొద్దున్నుండీ విసిగించిన ఎండ తగ్గుమొహం పట్టింది. కొండల వల్లనేమో ఈ ప్రాంతం చాలా వేడిగా ఉంది వేసవిలాగ. వెయ్యి స్థంభాల గుడి శిధిలాలను చూసి భారమైన మనసుతో అన్యమనస్కంగా ఉన్నాను. గుడి రెండో వైపు గేటు వద్ద మేమెక్కిన ఆటో ఆగింది. ఆ ఎంట్రన్స్ లో కుడివైపు గోడమీద నవదుర్గలు, చివర్లో గుడిలోని భద్రకాళి అమ్మవారి చిత్రాలు చాలా అందంగా పెయింట్ చేసి ఉన్నాయి. 







ఈ వైపున ముందర శిరిడీబాబాగారి గుడి ఉంది. లోనికివెళ్ళి బాబా దర్శనం చేసుకున్నాం. విశాలంగా బాగా కట్టారు గుడి. బయటకు వచ్చి అమ్మవారి గుడివైపు వెళ్తుంటే ఎడమ పక్కన పూలకొట్ల వెనకాల ఏదో నది కనబడింది. ఏమిటని అడిగితే అది "భద్రకాళి చెరువు" అని చెప్పారు. నిశ్చలమైన నీళ్ళు, పైన గుంపులు గుంపులుగా తెల్లని మబ్బులు, ఇంటికెళ్పోతున్న సూర్యుడు, దూరంగా కొండలు.. ఆ దృశ్యం ఎంత మనోహరంగా ఉందో చెప్పలేను! గబగబా నాలుగు ఫోటోలు తీసేసాను.



కాస్త ముందుకి వెళ్ళగానే దూరంగా నదిలో మనుషులు కనబడ్డారు. బోటింగేమో అనుకున్నా. కానీ కాదు.. వాళ్లంతా పేద పేద్ద ధర్మోకోల్ ముక్కల మీద నిశ్శబ్దంగా కూచుని చేపలు పడుతున్న జాలరివాళ్ళు. అప్పుడప్పుడు ఓయ్.. అన్న పిలుపులూ, చిన్నచిన్న మాటలూ వినబడుతున్నాయి. అవి కూడా వినటానికి చాలా బాగున్నాయి. ఎంతో మహిమాన్వితమైన ప్రదేశమేమో చెప్పలేనంత ప్రశాంతంగా మారిపోయింది మనసు.

దూరంగా అక్కడక్కడ కనిపించేది ధర్మోకోల్ మీద మనుషులు


ఇక ఈ గుడి కథ చెప్తాను. ఓసారి ఏదో పుస్తకంలో చదివాను గణేష్ రావు గారనే ఆయన కర్నాటక నుండి ఇక్కడకు వచ్చి గుడి పక్కనే చిన్న గదిలో ఉండిపోయి, శిధిలావస్థలో ఉన్న ఈ గుడిని బాగు చేసి, మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకునేలా చేసారని. రెండేళ్ల క్రితమెప్పుడో ఆయన కాలంచేసేదాకా ఆయనే గుడి ధర్మకర్త అని. ఆయన ఎంత కష్టపడ్డారో, ఆయన ఎంతటి గొప్ప భక్తులో అదంతా రాసుకొచ్చారు. (ఎక్కడ చదివానో గుర్తురాట్లే.) so, అప్పటినుండీ ఈ గుడి చూడాలని. అసలు ఈ గుడికి వెయ్యేళ్ల చరిత్ర ఉందిట. కాకతీయుల కాలం కంటే ముందే చాళుక్యుల పాలనలో నిర్మాణం జరిగిందిట. కాకతీయుల కాలంలో మళ్ళీ వైభవంగా పూజలందుకొందిట "భద్రేశ్వరి". వాళ్ళే ఇప్పుడున్న చెరువు కూడా తవ్వించారుట. అయితే కాకతియ సామ్రాజ్య పతనం తర్వాత మళ్ళీ ప్రాభవాన్ని కోల్పోయిందిట గుడి. మళ్ళీ 1950లో గణేష్ రావు గారు పునరుధ్ధరించారు.అప్పటిదాకా అమ్మవారి విగ్రహం భయానకంగా బయటకు వేళ్లాడే నాలుకతో ఉండేదట. అప్పుడు ఆ నాలుకపై బీజాక్షరాలు రాసి భీకరమైన ముఖాన్ని ప్రసన్నంగా మార్చారుట. గుడిలో చండీ యంత్రం ప్రతిష్ఠించి, ప్రతి ఏడూ శరన్నవరాత్రులు అవి జరుపటం మొదలుపెట్టారుట. ఈ అభివృధ్ధికి దేవాదాయ ధర్మాదాయ శాఖవారు కూడా తగినంత సహాయం అందించారుట.


అసలు కాకతీయులు శివారాధకులు. అయినా అమ్మవారిని కూడా వివిధరూపాల్లో పూజించేవారుట. ఈ సంగతి కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని గురించి తెలిపే "ప్రతాపరుద్ర చరిత్రము", "సిధ్ధేస్వర చ్రిత్రము", "ప్రతాపరుద్రీయమ్" అనే గ్రంధాలలో తెలుపబడిందిట. కాకతీయ శిల్పాలలో చాలాచోట్ల దుర్గ, మహిషాసురమర్దిని విగ్రహాలు కనబడతాయి. రామప్ప గుడి వద్ద ఎక్స్కవేషన్స్ లో దొరికినదని పెట్టిన ఒక మహిషాసురమర్దిని విగ్రహం చూసాం. ఇదే అది..


ఈ భద్రకాళి అమ్మవారి మహిమ తాలుకూ కథ ఒకటి విన్నాం. ప్రతాపరుద్రుని కాలంలో ఒక విద్వాంసుడు కొలువుకి వచ్చి తనని వాదనలో ఓడించమని అడిగాడుట. చివర్లో అతను "ఇవాళ ఏకాదశి,రేపు అమావస్య. కాదంటారా?" అన్నాడట. ఔనంటే ఆ పండితుడి మాట నెగ్గుతుంది. కాదని అంటే ఓడిపోతారు. అప్పుడు ఏదైతే అయ్యిందని రేపు "పౌర్ణమి" అన్నారుట. ఆ రాత్రికి ప్రతాపరుద్రుడి కొలువులోని విద్వాంసుడు భద్రకాళి ఆలయానికి వెళ్ళి దేవిని స్తుతించాడుట. తల్లి ప్రసన్నమై అతని మాటలు నిజం చేస్తానని మాట ఇచ్చిందిట. మర్నాడు రాత్రి పౌర్ణమి లాగ వెలిగిన చంద్రుడ్ని చూసి ఆ వచ్చిన పండితుడు ఇది దైవశక్తి అని ఓటమి ఒప్పుకుని  వెళ్పోయాడుట. ఆ రోజుల్లో దైవభక్తి కూడా అంత స్వచ్ఛంగా, పవర్ఫుల్ గా ఉండేది మరి! అప్పట్లో ఈ గుడి వద్ద చాలామంది ఋషులు వాళ్ళు తపస్సు చేసుకునేవారుట కూడా. భద్రకాళి చెరువుకి పక్కగా ఒక కొండ ఉండేదిట. అక్కడ ఒక గణేషుడి విగ్రహం ఉండేదిట. కాలంతరంలో కొండతో పాటుగా అది కూడా అంతరించిపోయిందిట. గుడి ఎదురుగా చిన్న కొండ మీద ఉన్న శివపార్వతుల విగ్రహాలు కూడా ప్రాచీనమైనవే అంటారు. వాటి అందం పాడుచేస్తూ తెల్లరంగు వేసారు ఎందుకో..!



గుడిలో అమ్మవారి విగ్రహం తొమ్మిదడుగుల పొడుగు, తొమ్మిదడుగుల వెడల్పుతో కన్నుల పండుగగా ఉంది. ఎక్కువ జనం లేనందువల్ల సావకాసమైన, ప్రశాంతమైన దర్శనభాగ్యం కలిగింది. గుడి ప్రాంగణంలో ఆదిశంకరాచార్యుల విగ్రహం, శిష్యులతో ఉన్న విగ్రహాలు బాగున్నాయి.




మరి ఆ తర్వాత, పొద్దున్నుంచీ తిరిగినతిరుగుడికి అలసిసొలసి, పొద్దున్నుంచీ తిండిలేక కడుపులో ఏనుగులు పరిగెడుతుంటే ఊళ్ళో ఉన్న మా పిన్నీవాళ్ళింటికి వెళ్పోయాం. రాత్రి లక్కీగా ఏ.సి. బస్ దొరికింది. హాయిగా బజ్జుని ఇల్లు చేరేసరికీ అర్ధరాత్రి ఒంటిగంట అయ్యింది. ఇదింకా నయం అంతకు ముందు సాగర్ వెళ్ళినప్పుడైతే అర్ధరాత్రి రెండున్నర! బండి మీదైనా అంత రాత్రి వెళ్లాలంటే నాకేమో భయం!! ఆ కథేమిటో మళ్ళీ వారం చెప్తానేం.... Happy weekend :-)

(అంటే "నాగర్జునసాగర్" ట్రిప్ కబుర్లన్న మాట.)



Thursday, June 27, 2013

వరంగల్ ప్రయాణం - వెయ్యిస్థంభాల గుడి




రామప్ప గుడి తర్వాత నేను అమితంగా చూడాలని ఉత్సాహపడినది ఈ వెయ్యిస్థంభాల గుడిని. 'హనుమకొండ' వచ్చాకా బస్సు డ్రైవరు ఓ చోట బస్సు ఆపి "ఆ కనబడేదే వెయ్యిస్థంభాల గుడి దిగండి.." అన్నాడు. మళ్ళీ ఏ ఆటో ఎక్కాలో, ఎన్ని మైళ్ళు నడవాలో అని భయపడుతున్న నాకు ఎదురుగా గుడి కనబడేసరికీ సంతోషం కలిగింది. ఇలా రోడ్డు మీదకే ఉందే గుడి అని ఆశ్చర్యం కలిగింది. 


రామప్ప గుడిలా కాక ఇది పూర్తిగా నల్ల రాతిబండలతో చెక్కబడింది. కానీ నిర్మాణం, గోడలపై పువ్వులు, శిల్పాలూ అన్ని అచ్చం రామప్ప గుడిలో మాదిరిగానే ఉన్నాయి. అక్కడ రాసి ఉన్న బోర్డులను బట్టి రామప్ప గుడి నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ గుడి కట్టి ఉంటారు. శిల్పులు కూడా వాళ్ళే అయి ఉంటారు. లేదా అది కట్టే సమయంలోనే ఇది కూడా మొదలెట్టి ఉంటారు. ఎందుకంటే ఈ గుడి ఏకంగా డెభ్భైఏళ్ళు కట్టారని విన్నాను. వివరాలడగటానికి ఇక్కడ మాకు గైడ్ ఎవరూ దొరకలేదు కూడా. కానీ ఈ గుడి బాగా శిధిలమైపోయింది. రామప్ప గుడికి కాస్త బాగానే మరమత్తులు జరిగినట్లున్నాయి కానీ ఈ గుడి దుస్థితి(ఇలానే అనాలనిపించింది) చూస్తే చాలా విచారం కలిగింది :(

అత్యంత వైభవమైన చరిత్ర గల ఈ వెయ్యి స్థంభాల గుడి గురించి, కీర్తి ప్రతిష్టల గురించీ విని ఎంతో గొప్పగా ఊహించుకున్నాను నేను. నెట్లో బ్రౌజింగ్ చేసి ఫోటోలు అవీ చూసేస్తే ఉత్సాహం తగ్గిపోతుందని అలా కూడా చెయ్యలేదు. అందువల్ల వెలవెలబోతున్న గుడిని చూసి చాలా విచారపడ్డాను. ఈ గుడి ముఖ్యంగా శివుడు, సూర్యభగవానుడు, విష్ణువు ఈ ముగ్గురి ఆలయాలు కలిపిన త్రికూటాలయముట. నాలుగో వైపున రామప్ప గుడిలో ఉన్నలాంటి పెద్ద నందీశ్వరుడు అదే రూపంలో, అదే దిక్కులో ఉంటాడు. మొత్తం అలంకారం, మువ్వలు, గొలుసులూ అన్నీ సేమ్ సమ్ అన్నమాట :)





ఆకాశంలో చందమామ కనిపిస్తున్నాడా?


ఇది కూడా శిధిలంగానే ఉంది :(

త్రికూటాలయాల మధ్యలో రంగ మంటపం, పై కప్పులో ఉన్న శిల్పాలు, డిజైన్, చుట్టూరా ఉన్న నాలుగు స్థంభాలు, వాటిపై ఉన్న నగిషీ మొత్తం కూడా రామప్ప గుడిలో లాంటిదే. ఈ గుడి ఎక్కువ సార్లు ఓరుగల్లుని ఆక్రమించిన సుల్తానుల దాడికి గురైనదని విన్నాను. బహుశా రామప్ప గుడి బాగా లోపలికి ఉండటం వల్ల మరీ ఇంతగా దాడికి లోనవలేదేమో! కానీ ఎంత పగులగొట్టినా మిగతా గుళ్ళు గోపురాలు లాగ పూర్తిగా మాత్రం ధ్వంసం అవ్వలేదు ఇది. చాలా పకడ్బందీగా, ఎంతో శ్రమతో కట్టినట్లు తెలుస్తోంది చూస్తుంటే. 


గుడి ముందర ఇరువైపులా ఉండవలసిన గజాలలో ఒకటే ఉంది.అది కూడా శిధిలమైపోయి ఉంది. రెండో వైపు ఏదో త్రవ్వకాల్లో దొరికిన నందీశ్వరుణ్ణి పెట్టినట్లుగా నాకు తోచింది. అంత గొప్ప నిర్మాణం చేసినవారు ఒక వైపు గజాన్ని, మరో వైపు నందిని పెట్టరు గదా.





గుడి ఆవరణలో ఉన్న పేధ్ధ రావి చెట్టు చాలా బాగుంది. నాకెందుకో చెట్లన్నింటిలోకీ రావిచెట్టు ఇష్టం. 




గుడికి కనక్ట్ అవుతు నందీశ్వరుడి వెనకాల ఒక అద్భుతమైన నాట్య మంటపం ఉండేదట. లెఖ్ఖకు చెప్పే వెయ్యి స్థంభాలు ఆ మంటపంలోని నూరుకు పైగా ఉన్న స్థంభాలతో పూర్తి అవుతాయిట. కానీ అది బాగా శిధిమైపోయిందని అక్కడో గోడ కట్టేసి పునర్నిర్మాణం జరుపుతున్నారు. మొత్తం చూడడానికి అది ఎప్పటికి పూర్తి అవుతుందో! అసలు ఎప్పటికన్నా పూర్తి చేస్తారో లేదో తెలీదు. ఎందుకంటే కాకతీయుల భవన నిర్మాణం తాలూకూ టెక్నాలజీ చాలా గట్టిది, క్లిష్టమైనది. రామప్ప గుడిలో చూశాం కదా. అలాగనే ఇదీ ఉంది కాబట్టి ఇక్కడా సేమ్ టెక్నాలజీ వాడి ఉంటారు... తడి ఇసుక, దానిపై పీఠం మొదలైనవి. అలా చెయ్యగలరో లేదో.. అలాకాక మళ్ళీ మరోలా అంటే మనవాళ్ళు ఎలా కడతారో ఏమో!! నేనా గోడవారగా వెళ్ళి గోడ వెనుకకి చెయ్యి బయటకు పెట్టి ఓ రెండు ఫోటోలు తీసాను. "ఫోటోల సంగతి దేవుడెరుగు అంత ఎత్తు మీంచి కాలు జారితే..." అని ఇంటాయన కంగారుపెట్టకపోతే ఇంకొన్ని ఫోతోలు తీద్దును. ఇంటికొచ్చాకా ఆ ఫోటోలు చూస్తే ఆ నాట్య మంటపం ఇంకా ఎంత అద్భుతంగా ఉండేదో అనిపించింది. ఇలా వచ్చాయి ఆ ఫోటోలు..

Place under reconstruction

place under reconstruction

ఇంకా గుడి చుట్టూరా అక్కడక్కడా శివలింగాలు ఉన్నాయి. 




 ఓ పక్కగా శిధిలాలు, ఇంకా తలుపులు వేసేసిన ఏవో శిధిలాలు ఉన్నాయి. గుహలో ఏమో అవి..



తీర్థప్రసాదలు తీసుకుని ఓ గట్టు మీద కాసేపు కూచుని, మేం అనుకున్న చివరి మజిలీ వరంగల్ లోని భద్రకాళి ఆలయానికి బయల్దేరాం..

(రేపు 'భద్రకాళి ఆలయం' గురించి..)



Wednesday, June 26, 2013

వరంగల్ ప్రయాణం - రామప్ప గుడి





ఈ వేసవిలో ఏ ప్రయాణాలు కుదరలేదు. ఇక శెలవులు అయిపోతుంటే రెండు షార్ట్ ట్రిప్స్ కు వెళ్ళాము. అందులో ఒకటి వరంగల్ జిల్లా ప్రయాణం. ఈ చిన్న ప్రయాణంలో మూడు చారిత్రాత్మక ప్రదేశాలను మాత్రమే చూడగలిగాము. వరంగల్ కు సుమారు తొంభై కిలోమీటర్ల దూరంలో పాలంపేట గ్రామంలో ఉన్న రామప్ప గుడి, హనుమకొండలో గల వేయిస్థంభాల గుడి, వరంగల్ లో ఉన్న భద్రకాళి ఆలయం.


రామప్ప గుడి ప్రయాణం:

గొప్ప శిల్పకళా నైపుణ్యం, ఎంతో చారిత్రాత్మక ప్రాముఖ్యత ఉన్న ఈ గుడి చూడాలన్నది నా చిరకాల కోరిక. చిన్నప్పటి నుండీ ఎన్నోసార్లు పేపర్లలో, పుస్తకాలలో ఈ గుడి గురించిన వివరాలు, నిర్మాణ విశేషాలూ చదివి నా ఆసక్తి పెరుగుతూ వచ్చింది. వరంగల్లో పిన్నీవాళ్ళు మూడేళ్ళుగా ఉంటున్నారు. బాబయ్యకు ట్రాన్స్ఫర్ అయిపోయిందని, మేం వెళ్పోయేలోపన్నా రమ్మని పిన్ని ఎప్పటినుండో అడుగుతోంది. పుణ్యం, పురుషార్థం రెండూ కల్సివస్తాయని, ఇన్నాళ్లకైనా రామప్ప గుడి చూపించమని మావారిని బయల్దేరదీసాను. పొద్దున్నే ఏడున్నరకి రైలెక్కితే పదిన్నరకి వరంగల్లో దింపింది. "రైల్లో ఉన్నాం.. వస్తున్నాం, చూడాల్సినవన్ని చూసేసి వస్తాము.. మా కోసం ఏమీ వడద్దని.. " రైల్లోంచే పిన్నికి ఫోన్ చేసాను.

రైలు దిగి అక్కడ గేట్లో ఉన్న గార్డ్ ని వెళ్లాల్సినవాటి వివరాలు అడిగాము. రామప్ప గుడి ఓ వంద కిలోమీటర్లు దూరంలో ఉంది. వెయ్యి స్థంభాల గుడి హనుమకొండలో ఉంది. భద్రకాళి ఆలయం ఇక్కడే ఉంది. ఈ రెండు దగ్గర దగ్గరే. కాబట్టి ముందు బస్సెక్కి రామప్ప గుడికి వెళ్పోండి. రైల్వేస్టేషన్ ఎదురుగా బస్టాండ్ ఉందని చెప్పాడు. అసలు హనుమకొండ నుండి త్వరగా వెళ్తారు. ట్రైన్ కన్నా బస్సులో హనుమకొండ వెళ్ళాల్సింది మీరు అన్నాడా గార్డ్. రైల్వే స్టేషన్ కు వెళ్ళే ముందు JBSలో ఆగి ఎంక్వైరీలో వరంగల్ బస్సులు ఇప్పుడు లేవు. హనుమకొండ బస్సు ఉంది కానీ హనుమకొండ నుండి వరంగల్ గంట ప్రయాణం అని చెప్పారు. అందుకని రైలెక్కేసాం.(వరంగల్, హనుమకొండ పక్కపక్కనే అని వెళ్లాకా కానీ తెలీలేదు మాకు.) 'అసలు ఇన్నాళ్ళుగా పిన్నీవాళ్ళు ఈ ఊళ్ళో ఉన్నారు కదా రైల్లో వచ్చేప్పుడన్నా అవన్నీ ఎక్కడెక్కడున్నాయో కనుక్కోవచ్చు కదా.. ఇవన్నీ వరంగల్లో ఉన్నాయి.. వరంగల్ వెళ్లాలి అనుకోవటమే గానీ  కనీసం నెట్లో అన్నా వెతకలేదు డిస్టెన్స్.. ఇప్పుడు ఎలా వెళ్లాలో, ఎప్పటికి చేరతామో..' అని నా సహజ ధోరణిలో తెగ కంగారు పడిపోయాను. సుపర్ కూల్ అయ్యగారేమో "కంగారెందుకు పడతావ్? ఏదో ఒక మార్గం దొరుకుతుంది..బస్సులు ఉంటాయిలే. కనుక్కుని వెళ్ళొద్దాం.." అని అభయమిచ్చారు. బస్టాండ్ కు వెళ్లామో లేదో 'ఏటూరినాగారం' బస్సొకటి బయల్దేరుతోంది. 'రామప్ప గుడి వైపే వెళ్తుంది. ఎక్కండి' అని చెప్తే.. అది ఎక్కేసాం. కండక్టరేమో "జంగాలపల్లి" అనే పల్లేటూరి దగ్గర బస్సు దిగి "పాలంపేట" వెళ్ళాలి మీరు. అక్కడ గుడి ఉంది. జంగాలపల్లి లో ఆటో గానీ షేరింగ్ జీప్ గాని ఎక్కాలి మీరు.. అని చెప్పాడు. మధ్యలో సుమారు ఓ గంటన్నరకి అంటే 11.45 కి జంగాలపల్లి లో మమ్మల్ని దించేసి బస్సు వెళ్పోయింది. అదో చిన్న పల్లెటూరి జంక్షన్. అటుగా వెళ్ళే షేరింగ్ ఆటోలో, షేరింగ్ జీప్ లో ఎక్కాలిట "పాలం పేట" వెళ్లడానికి.  బండి నిండే బయల్దేరరు కదా షేరింగ్ వాళ్ళు. పన్నెండింటికి ఒక జీప్ బయల్దేరింది. మధ్యలో "ములుగు" అనే పల్లెటూరు కూడా వచ్చింది. దారిలో ఇంకా ఇంకా జనం ఎక్కుతూనే ఉన్నారు. ఒక్క జీప్ లో పంచెలు,కర్రలు పట్టుకున్న 'ముసలి యువకుల'తో సహా(ముసలివాళ్లైనా భలే ఏక్టివ్ గా ఉన్నారు వాళ్ళంతా.అందుకే ముసలి యువకులు అన్నా!) మొత్తం ఇరవై మందిని కుక్కాడు డ్రైవరు. అంత ఇరుకులో, గతుకుల రోడ్డులో చిరాకుగా ఉండగా డ్రైవరు పెట్టిన "సౌందర్య లహరి.." అనే పాట విని చచ్చేంత నవ్వు వచ్చింది..:)


అరగంట తరువాత మధ్యాహ్నం12.30కి జీప్ ఓ చోట ఆపి అదిగో ఆ కనబడేదే "రామప్ప గుడి". ఈ దారి గుండా నడుచుకుపొండి.. తిరిగి వచ్చేప్పుడు వెనుకవైపు మరో దారి ఉంది. అటు రండి. అక్కడ బస్సులు దొరుకుతాయి మీకు. అదే అసలు దారి.. ఇది దగ్గరని ఇటు దింపాను" అనేసి  చెరో పది తీసుకుని వెళ్పోయాడు. జీప్ వెళ్పోయాకా ఆ సున్సాన్ ప్రదేశంలో మేం తప్ప ఎవ్వరూ లేరు! సన్నటి మట్టి రోడ్డూ, చుర్రని బోలెడు ఎండ, చుట్టూ పొలాలు.. కీచురాళ్లరొద, దూరంగా చెట్ల మధ్య నుండి సినిమా సెట్టింగా నిజమా అన్నట్టు కనబడుతున్న రామప్ప గుడి. ఏ కారులోనో వచ్చి ఉంటే సుఖంగా ప్రయాణం జరిగేది కానీ ఈ ఎడ్వంచరస్ ఎక్స్పీరియన్స్ దక్కేది కాదు కదా అనుకున్నాం. ఆంధ్రదేశంలో గొప్పగా చెప్పుకోదగ్గ ప్రఖ్యాత గుడి. ఇలా ఎక్కడో మూలన ఎవరికి పట్టనట్లు పడి ఉండేంటి? అనిపించింది. దగ్గరగా వెళ్ళే కొద్దీ గుడి వద్ద కొందరు మనుషులు కనబడ్డారు. 'హమ్మయ్య పర్వాలేదు' అని ధైర్యం వచ్చింది నాకు. గబగబా కెమేరా తీసి బ్యాట్రీలు వేసా.





ఎన్నో ఏళ్ళుగా చూడాలనుకుంటున్న చారిత్రాత్మక గుడి. దగ్గరగా చూస్తూంటే మనసు పరిపరివిధాల పోయింది.. ఏదో అనిర్వచనీయమైన ఆనందంతో గంతులు వేసింది. ఎంత అద్భుతంగా ఉందీ!! నలభైఏళ్ళపాటు కట్టారుట. ఎంతమంది శిల్పులు, ఎంతమంది కూలీలు అహోరాత్రాలూ శ్రమించి ఉంటారు? ఎన్ని వందల ఏనుగులు ఎన్ని వందల రాళ్లను మోసి ఉంటాయి? అక్కడ ఒక గైడ్ గుడి చరిత్ర చెప్తానంటే సరేనన్నాము. ఏ.పి.టూరిజం వాళ్ళు లోకల్ మనుషులు ఇద్దరికి ట్రైనింగ్ ఇచ్చి అక్కడ నియమించారుట. గైడ్ వల్లనే ఈ గుడి విజిట్ ని ఇంకా బాగా ఎంజాయ్ చేసాం అనిపించింది మాకు. మొన్న ఏప్రిల్ నెలకి ఈ గుడి కట్టి ఎనిమిది వందల ఏళ్ళు అయ్యిందట. అష్టమ శతాబ్ది ఉత్సవాలు జరిగాయిట. ఆ ఉత్సవ సంచిక అతనే అమ్ముతుంటే కొన్నాము. ముఫ్ఫై రూపాయిలకి ఎంతో విలువైన సమాచారాన్ని అందించిన ఆ పుస్తకం అపురూపంగా తోచింది నాకు. ఆలయ ప్రాంగణంలో సుమారు మూడు గంటలు ఎలా గడిచాయో తెలీకుండా గడిచిపోయాయి.






రామప్ప గుడి విశేషాలు:

ఎనిమిదివందల ఏళ్ల క్రితం కాకతీయ రాజైన "గణపతి దేవుని" సేనాని "రేచర్ల రుద్రయ్య" నిర్మించాడు ఈ గుడి, దీని పక్కనే ఒక చెరువును. గుడి ప్రధాన శిల్పి  కర్నాటక కు చెందిన "రామప్ప". అద్భుతమైన శిలా నైపుణ్యంతో నలభైఏళ్ల పాటు ఈ గుడిని నిర్మించాడు రామప్ప. మొదట "రుద్రేశ్వరాలయం" అని పిలవబడేది కానీ తర్వాతర్వాత రామప్ప పేరు మీద రామప్ప గుడి, రామప్ప కొలను అని పిలువబడ్డాయి. గుడి ఆవరణలో రేచర్ల రుద్రయ్య వేయించిన శిలాశాసనం ఉంది. కన్నడ,తెలుగు రెండు భాషల్లోనూ లిపి ఉందిట. ఇప్పుడు బాగా కనబట్టం లేదు కానీ మండపం ఉంది. ఆ శిలాశాసనం ప్రకారం శాలివాహన శకం 1135వ సంవత్సరం, శ్రీముఖ సంవత్సరం, చైత్ర మాసం, శుక్ల పక్షం, అష్తమి తిధి, పుష్యమీ నక్షత్రం, ఆదివారం(31-3-1213 క్రీ.శ) నాటికి గుడి నిర్మాణం పూర్తయ్యిందని ఉందిట.
రేచర్ల రుద్రయ్య వేయించిన శిలాశాసనం

గుడిలోని రుద్రుడు "రామలింగేశ్వరుడు"గా పిలువబడతాడు. దక్షిణ, ఉత్తర శిల్పకళా నైపుణ్యాలు రెంటిని కలిపి కట్టించారు ఈ గుడి. గుడిపై చెక్కిన శిల్పాలు కూడా వివిధ సంస్కృతులకీ, వాస్తు, నీతి, గణిత, శృంగార, భవన శాస్రాలకీ, చరిత్రకి అద్దం పట్టేలా ఉన్నాయి. శివ, విష్ణు తత్వాల ఏకత్వాన్ని ప్రతిబింబిస్తూ రుద్రాక్షలను వైష్ణవనామాల్లా చెక్కటం అద్భుతంగా తోచింది నాకు.

శివ, విష్ణు తత్వాల ఏకత్వo

గుడి నిర్మాణానికి వాడిన శిల ఎరుపు, నలుపు రంగుల మిశ్రితం. ఆ ప్రాంతం చుట్టూరా ఉన్న కొండల్లో ఈ రకం శిలలు కనబడతాయిట. శివలింగానికీ, స్థంభాలపై ఉన్న ప్రతిమలకీ, బయట ఉన్న నందీశ్వరుడికీ, గుడి మధ్య ఉన్న రంగమండపంలో ఉన్న నాలుగు స్థంభాలకీ నల్లటి శిలను వాడారు. ఎక్కడి నుండి తెచ్చారో! అసలు ఇప్పుడు కూడా నునుపుగా ఉన్న ఆ పాలిషింగ్ కు,  ఆ డిటైల్డ్ వర్క్ కు ఏ మషీన్లు లేని అప్పటి కాలంలో ఎంత సమయం పట్టిందో! పునాదుల్లో పది, పదిహేను అడుగుల లోతు తవ్వి, అది ఇసుకతో నింపి, దానిని తడిపి, అందిపైన పీఠము వేసి, మరో లేయర్ వేసి.. అలా కట్టారుట గుడి. గుడి పై భాగంలో వాడిన ఇటుకలు నీటిలో తేలగల తేలికైన ఇటుకలుట. ఆ గోపురం బరువుకి గుడి కృంగిపోకుండా అలాంటి ఇటుకలను వాడారుట. గుడి పక్కనే ఒక చిన్న సాంపిల్ గుడిలాంటిది ఉంది. ముందు అది కట్టి ఆ మోడల్ లో ఇది కట్టారు అని గైడ్ చెప్పాడు. మరో పక్క ఉండే రెండు ఆలయాలు ధ్వంసమయ్యాయిట. ఒకటి మాత్రం పునర్నిర్మిస్తున్నారు. ఆ గుడి తవ్వకాల్లోంచి వచ్చిన ఇసుక కుప్పలుగా పోసి ఉంది పక్కనే. ప్రధానాలయానికి మరో పక్క మరో చిన్న గుడి ఉంది. అది ప్రసాదాలు చేయటానికి వాడేవారుట.


స్థంభాలపై చెక్కిన ప్రతిమలు

ప్రసాదాలు చేయటానికి వాడేవారుట




కాకతీయుల పతనం తర్వాత ఐదువందల ఏళ్ల పాటు ఈ అద్భుతమైన కట్టడాన్ని ఎవ్వరూ పట్టించుకొనేలేదట. ఈలోపూ దోచుకునేవాళ్ళు దోచుకుని, పగులగొట్టేవారు పగులగట్టగా ఇప్పుడున్నది మిగిలిందిట. 1985 నుండీ టూరిజంవాళ్ళ పర్యవేక్షణలో ఉందిట. గుడి మూడు ద్వారాల వద్ద అటు ఇటు ఉన్న స్థంభాలపై చెక్కిన పన్నెండు నల్లటి శిల్పాలు అప్పటి మహిళల వస్త్రాలంకారాలనూ, శిల్పి  యొక్క కళానైపుణ్యాన్నీ చూపుతాయి. ఎలా చెక్కారో గానీ ఒక శిల్పంపై మెడలోని హారం తాలూకూ నీడ కూడా కనబడుతుంది. శివలింగానికి ఎదురుగా బయట ఉన్న మండపంలో ఉన్న నందీశ్వరుడు కాకతీయుల శిలానైపుణ్యానికి ప్రతీక అనవచ్చు. మువ్వలు, అలంకారం, నందీశ్వరుడి కళ్ళు అన్నీ కూడా ఎంత అందంగా ఉన్నాయో. శివాలయాల్లో అన్ని చోట్లా కనబడే నంది విగ్రహంలా కాక ఇది ప్రత్యేకంగా శివుడు పిలిస్తే లేవటానికి రెడీగా ఉన్నట్లుగా చెక్కారు. గర్భగుడి ద్వారం వద్ద పేరిణి నృత్యభంగిమల పక్కన ఒక కృష్ణవిగ్రహం ఉంది. కృష్ణుడి పక్క చెట్టు తడితే వేణువాదనలాంటి స్వరం వినిపిస్తుంది. కళ్ల నీళ్ళు వచ్చాయి అది వింటుంటే. ఇక గర్భగుడిలో శివలింగం మీద లైట్ లేకపోయినా కూడా సూర్యరశ్మి పడి వెలుతురు ఉన్నంత వరకూ లింగం కనబడుతూనే ఉంటుందిట. నిజంగా రామప్ప అనే కళాకారుడు, మహా శిల్పి ఉండి ఉంటే అంతటి అద్భుతసృష్టి చేసిన మహానుభావుడికి మొక్కాలనిపించింది. ఇటువంటి గుడికి ఎలాంటి ప్రచారం, ఆదరణ లేనందుకు బోలెడు దు:ఖం కలిగింది.



నంది మంటపం

అందులోని నందీశ్వరుడు

నమూనా గుడి


స్వరం వినబడ్డ కృష్ణవిగ్రహం ఇదే..


ఆలయం మధ్యలో ఒక రంగ మంటపం ఉంది. కాకతీయుల కాలంలో శివలింగం ముందర నాట్యానికి వాడేవారట ఆ మంటపాన్ని. గుండ్రంగా ఉన్న ఆ మంటపానికి నలువైపులా నాలుగు పెద్ద పెద్ద నల్లని స్థంభాలు, వాటిపై చెక్కిన అపురూపమైన శిల్పాలను ఎంత సేపు చూసినా తనివితీరలేదు. నిజమో కాదో తెలీదు కానీ ఈ నల్లరాతిచెక్కడాలను చూసే నారాయణ రెడ్డి గారు "ఈ నల్లని రాలలో" అనే పాట రాసారుట. గర్భగుడి ద్వారానికి ఇరువైపులా వివిధ నాట్యభంగిమల్లో చిత్రాలు చెక్కారు. అవన్నీ గణపతిదేవిని బావమరిది అయిన "జాయపసేనాని" రాసిన "నృత్యరత్నావళి" అనే నాట్యగ్రంధం ఆధారంగా చెక్కారుట. అవన్నీ కూడా మరుగున పడిన "పేరిణి శివతాండవ నృత్యం" తాలుకూ నాట్యభంగిమలుట. సైనికులు యుధ్ధానికి వెళ్ళేప్పుడు వారిని ఉత్తేజపరచటం కోసం కాకతీయులు ఈ నృత్యప్రదర్శన జరిపించేవారుట. ప్రముఖ నాట్యాచార్యులు కీ.శే. శ్రీ నటరాజ రామకృష్ణ గారు  ఈ గుడిలో ఈ నృత్యభంగిమలు చూసి, మూడేళ్ళు అక్కడ ఉండి వాటిపై పరిశోధన చేసి మరుగునపడిపోయిన ఈ "పేరిణీ శివతాండవనృత్యాన్ని" పునరుధ్ధరించారుట. ఏభై ఏళ్లకు పైన వీరి పరిశోధన, అధ్యయనం, పుస్తకరచన నడిచిందిట. పరిశోధనానంతరం 17-2-1985 శివరాత్రినాడు రామప్పగుడిలో రుద్రుడిని అభిషేకించి, పదివేల నూనెదీపాలు వెలిగించి, తన శిష్యబృందంతో శ్రీ నటరాజ రామకృష్ణ గారు అక్కడ పేరిణి శివతాండవ నృత్య ప్రదర్శన ఇప్పించారుట. ఆయన కష్టపడి చెసిన ప్రచారానికి జనాలు తండోపతండాలుగా వచ్చారుట ఆ నృత్యాన్ని చూడటానికి.

పేరిణి శివతాండవ నృత్యభంగిమలు

రంగమంటపం నలువైపులా   స్థంభాల్లో ఒకటి
గుడి ఆవరణలో గుట్టలుగా పడి ఉన్న విరిగిన శిలలు, శిధిలాల గుట్టలూ వదిలి అసలు వెనుదిరగాలనిపించలేదు. పోగొట్టుకున్న బొమ్మేదో ఇన్నేళ్లకు దొరికినట్లు, ఇక అసలు వదిలిపెట్టలేనట్లు అనిపించింది. అప్పటికే మూడున్నరవుతోంది. ఆకలి దంచేస్తోంది. రామప్ప చెరువు చూడలేదింక. అక్కడికి దగ్గర్లో లక్నవరంలో సస్పెన్షన్ బ్రిడ్జ్ కట్టారుట. అది బావుంటుందిట. ఈసారెప్పుడైనా మళ్ళి వస్తే అటు వెళ్లాలి. రామప్పగుడి రెండో వైపు ద్వారం నుండి రెండు కిలోమీటర్లు నడిస్తే మెయిన్ రోడ్డు వచ్చింది. రెండు కిరాణాకొట్లు, చిన్నచిన్న పాకలు తప్ప మనుష్య సంచారం లేదా రోడ్డుపై. అదృష్టవశాత్తు ఒక ఆటో దొరికితే వంద రూపాయలకి మాట్లాడుకుని మళ్ళీ జంగాలపల్లి చేరి, హనుమకొండ బస్సు ఎక్కాం. హనుమకొండ బస్సు ఎక్కితే "వెయ్యిస్థంభల గుడి" సులువుగా చేరచ్చు అని ఆటో అబ్బాయి చెప్పాడు. హనుమకొంద వెళ్తూంటే బస్సులో పట్టిన కలత నిద్రలో ఏవేవో కోట గోడలు, నృత్యాలూ, అస్పష్ట దృశ్యాలు కనబడుతూనే ఉన్నాయి..!

గుడి ఆవరణలో శిధిలాలు 
గుడి ఆవరణలో శిధిలాలు 


('వెయ్యిస్థంభాల గుడి' గురించి రేపు...)